Showing posts with label Mari chi.ka. Show all posts
Showing posts with label Mari chi.ka. Show all posts

Wednesday, February 8, 2017

అతనొస్తున్నాడు!- కౌముదిలోని- మరీ చిన్న కథ



'అతనొస్తున్నాడంట ఇవాళ!'
'ఇవాళా?!'
'అవును. మీ బాస్ ఫోన్ చేసాడు. నువ్వు రిఫ్రెషింగ్ రూంలో ఉన్నావని నేనే లిఫ్ట్ చేసా.. సెల్'
'…'
'నీ కివాళ ఆఫ్ కదా?'
'అవును. అందుకే ఆంటీకి ఆర్థోపెడిక్ అప్పాయింట్ మెంట్ తీసుకుంది. ఇప్పుడు కాకపోతే.. మళ్లా మూణ్నెల్లగానీ డేట్ దొరకదు కృష్ణా!'
'మరేం చేద్దామనుకుంటున్నావ్! పోనీ మేటర్ ఇది అని మీ బాస్ కి చెప్పేసెయ్! ఏమన్నా ప్రాబ్లమా?'
'తనకేం ప్రాబ్లం! నాకే కదా ప్రాబ్లం! రాక రాక వచ్చిన అవకాశం  ఇది. లూజ్ చేసుకోకూడదని మా గురూజీ గొడవ. రానంటే ఏమీ అనరు కానీ.. నాకే ఏదోలా ఉంది'
'నో ప్రాబ్లం రాణీ! పోనీ నేను వెళతాలే అమ్మతో డాక్టరు దగ్గరికి. నువ్వెళ్ళి పో! అంతలా ఫీలవాల్సిన అవసరం లేదు. అవతల వచ్చే పర్సన్ ఎంత ఇంపార్టెంటో.. అదీ చూసుకోవాలిగా.. ప్రొఫెషన్లో!'
'థేంక్యూ డార్లింగ్.. సిట్యుయేషన్ అర్థం చేసుకొన్నావు..  గ్రేట్!'
***
'అందరు వచ్చినట్లేనా! వాటెబౌట్ రమా?'
'తన కివాళ పెళ్లి చూపులున్నాయి సార్!'
'హ్మఁ! బ్యాడ్ లక్ టు హర్! అతి కష్టం మీద దొరికిందీ ఛాన్సు! మీకు తెలుసు. మళ్లీ రారు కనకనే ఇలాంటి వాళ్లు.. మిమ్మల్నందర్నీ ఇంతలా అలర్ట్ చేస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే  మీరంతా చాలా లకీ గైస్! మా రోజుల్లో ఒక్కడంటే ఒక్కడైనా ఇలాంటి వ్యక్తి తగల్లేదు మాకు. జస్ట్ ఎవరో చెబితే వినటమే! ఇంకెక్కడికో వెళ్లాలనుకున్న వ్యక్తి ఆఖరి  నిమిషంలో మనసు మార్చుకొని మన సంగతి తెలుసుకొని మరీ  వెతుక్కుంటూ  ఇక్కడకు రావడం నిజంగా నాకైతె ఇప్పటికీ ఒక మిరకల్లాగానే అనిపిస్తుంది'
'సార్! ఆ మెరికల్ మీలోనూ ఉంది.  ఆయనకా నమ్మకం కలిగించింది మీరు. మీ లాంటి వాళ్లు దొరకడం ఆయనకూ.. మాకూ.. ఇద్దరికీ లకీనే!'
'ఓకే.. ఓకే.. గైస్! వచ్చిన వాళ్లంతా పెంటనే ప్రిపేరయి పోండి! ఎక్కడా మన వైపునుంచి మిస్టేక్ ఉండ కూడదు. అమెరికా వెళ్లే మనిషి. ఇక్కడికి తిరిగొచ్చింతరువాత మళ్లీ మనల్నే  వెతుక్కుంటూ రావాలి. అదే మీ అందరికి ఇప్పుడు అసలు టెస్టు. మూవాన్ గైస్! సెల్ రింగవుతుంది. అతనొచ్చేస్తున్నాడు.'
***
'మ్యాడమ్!  నాకివాళ అప్పాయింట్మెంటుంది కదా! ఎందుకిలా అర్థాంతరంగా కేన్సిల్ చేసారు?'
'సారీ సార్! అనవాయిడబుల్ సర్కమస్టెన్సస్! అర్థం చేసుకోండి'
'ఏమర్థం చేసుకోవాలమ్మా! అవతల ఇంకెవరో పెద్దమనిషి వస్తున్నాడని.. ఎప్పడో ఇచ్చిన మా డేటుని సడెన్ గా ఇలా కేన్సిల్ చేస్తారా! ఇదేమన్నా బావుందా?'
'చెప్పాంగా! తప్పనప్పుడే కదా ఇలా చేస్తాం.  మిమ్మల్ని డిజ్ రెస్పేక్ట్ చెయ్యాలని మాకెందుకుంటుంది? అవతల వచ్చే వ్యక్తికి ఇబ్బంది ఉండకూడదనే మా కన్సర్న్.. మళ్లీ మరో డేటు తీసుకోండి. మరేం ఫరవాలేదు, ఇవన్నీ నిదానంగా చూసినా ప్రమాద ముండదు అని చెప్పమన్నారండి మిమ్మ్లని చూసే డాక్టరుగార్.'
ఫోన్ కట్ అయింది.
***
'ఎవరితోనే అంతలా గొడవ పడుతున్నావ్? ఇచ్చిన అప్పాయింట్ మెంటును కూడా కాదని.. హఠాత్తుగా వస్తున్న మనిషికి అంత ఇంపార్టెన్సిస్తున్నారు! ఎప్పుడూ లేంది.. ఈ చిన్నడాక్టర్లంతా ఇవాళ ఒకేసారి కనబడుతున్నారు ,,, అసుపత్రిలో! వచ్చే పేషేంట్ మరీ అంత ఇంపార్టెంటా?'
'వెరీ ఇంపార్టెంట్ తల్లీ! అందుకే కదా పొద్దుట్నుంచీ ఇంతలా హంగామా! ఆయన ఆ వాసన్   ఆసుపత్రి పేషెంటంట.. చాలా కాలం బట్టీ. కొత్తగా హెల్త్ కార్డు స్కీములొచ్చాయి కదా! అక్కడ ఉచితంగా వైద్యం దొరకదని తెలిసి మన దగ్గరుందని తెలిసి  వచ్చాడు. ఈ పేషెంటుది ఎడ్వాన్స్డ్ కేసు గ్లాకోమియా.
'అంటే చూపు మెల్ల మెల్లంగా తగ్గిపోతుందీ.. కొంత కాలాని కసలు చూపే పోతుందీ.. ఎన్నటికీ నయంకాని జబ్బు!అదేనా?'
'అవును.ఇప్పటికే ఎడం కన్ను పూర్తిగా పాడయిందతగాడికి. కుడి కంటిక్కూడా అంటుకుంది జబ్బు. ఇలాంటి కేసులు లక్షల్లో ఒకటి కానీ ఉండవంట. దొరక్క దొరక్క దొరికింది కదా! ఈ రేర్ కేసును  మన చిన్న డాక్టర్లందరికి పత్యక్షంగా   చూపించి ట్రీట్మెంటు ప్రాక్టీస్ చేయించాలని మన పెద్ద డాక్టరుగారి హడావుడి.' అంది రిసెప్షన్ కౌంటర్లో కూర్చున్న పిల్ల ఈ మధ్యనే  డ్యూటీలో చేరిన మరో పిల్లతో.
ఆ అమ్మాయి ఇంకా ఏదో అడగబోతుంటే వరండాలో సందడి మొదలయింది.
'నీ సందేహాలన్నీ ఆనక. ముందీ పేష్ంట్ కేస్ షీటు దగ్గర్రడీగా ఉంచుకో.. అతనొస్తున్నాడు' అని లేచింది రిసెప్షనిష్టు.
***

-కర్లపాలెం హనుమంతరావు

(కౌముది- అంతర్జాల మాసపత్రికలో ప్రచురితం)-

Friday, September 2, 2016

యత్ర నార్యస్తు పూజ్యంతే.. కౌముది మరీ చి.క (మరీ చిన్న కథ)


బోరబండ సెంటర్లో బస్సు దిగేసరికి సమయం రాత్రి ఎనిమిది గంటలు.
నమ్ముకొన్న బండి మొండికేసి..  షేరు ఆటో దొరక్క.. ఒంటరిగా ట్యాక్సీలో ప్రయాణమెందుకని.. కనిపించిన బస్సు ఎక్కేసింది పనిచేసే కాల్ సెంటరు జంక్షనులో స్వాతి.
వాన కురిసి వెలిసి రోడ్లంతా చిత్తడి చిత్తడి. సూదిగాడి భయమొకటి మొదలైనందువల్లనేమో దాదాపుగా దారంతా నిర్మానుష్యంగా ఉంది!
ల్లు చేరాలంటే ఇంకో రెండు కిలోమీటర్లు.. అరగంట. అడ్డదారిలోపోతే సగం సమయం.. దూరం ఆదా! కానీ తాగుబోతు వెధవలు పొద్దస్తమానం పేకాట్లాడుకొంటూ కాట్లాడుకుంటుంటారు   పోలేరమ్మ చెట్టు కింద చేరి!
రిస్కయినా అడ్డదారిలోనే తొందరగా ఇల్లు చేరిపోవాలని మలుపులోకి మళ్లింది  స్వాతి.
పోలేరమ్మ చెట్టు అల్లంత దూరంలో ఉందనగానే తగులుకొన్నాడెవరో  దొంగవెధవ!
చీకట్లో ఆకారం పోలిక పట్టడం కష్టంగానే ఉంది.
'హాయ్! స్వీటీ!'
స్వాతి బదులివ్వదలుచుకోలేదు.
'’స్వాతీ’ అంటేగాని  ‘హాయ్’  చెప్పవు కాబోలు!'
ఉలిక్కి పడింది స్వాతి. 'ఎవర్రా నువ్వు? నా పేరెలా తెలుసు?'
'పేరేనా! నువ్వు పనిచేసే కాల్ సెంటరు.. నీ ఇంటి అడ్రసుతో సహా ఇంకా చాలా వివరాలు తెలుసు  మ్యాడమ్ గారూ!’ దగ్గరికొస్తూ అన్నాడు ఆగంతకుడు.
‘గో అవే! నా దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది'
'ఇంకా..'
'కరాటే తెలుసు. అవసరమైతే పోలీస్టేషనుకైనా ఫోన్ చేసే తెగింపుంది మిస్టర్!’
‘గుడ్! ఫోన్ చెయ్యాలంటే.. ఫోనుండద్దా  మేడమ్ గారూ..!'
బ్యాగ్ తడుముకొంది స్వాతిఫోనేనా.. వేలెట్టూ మిస్సింగ్!  
ళ్ళెంబడి నీళ్ళొచ్చాయి స్వాతికి. కాళ్లబేరమొక్కటే ప్రస్తుతానికి దారి.
‘వంటిమీది బంగారం మొత్తం వలిచిచ్చేస్తా! ప్లీజ్! నన్నొదిలేయ్!'
'హ్హ.. హ్హ..హ్హ! వళ్లే బంగారంలాగుంది. ఈ బంగారం వదిలేస్తాడా ఏ పిచ్చాడైనా!’
'ఏం కావాలిరా స్కౌండ్రల్ నీకూ!’ భోరుమంది స్వాతి.
‘ఇదీ! .. అదీ.. రెండూనూ!’ స్వాతి హ్యాడుతో పాటు హ్యాండుబ్యాగూ బలవంతంగా పుచ్చుకొని ముందుకు నడిచాడా అగంతుకుడు.
ప్లీజ్! నీ చెల్లెల్లు లాంటిదాననుకోరాదా అన్నయ్యా!' చెయ్యి విడిపించుకొనే ప్రయత్నంలో ఆఖరి అస్త్రం ప్రయోగించింది స్వాతి.
' ఆ మాటాన్నావూ బాగుంది. అయితే అల్లరి చెయ్యద్దు. గమ్మున  నాతో రా! ఇంకో ఐదు నిమిషాల్లో మీ ఇల్లొచ్చేస్తుంది. భద్రంగా లోపలికి పో! ఇదిగో నీ బ్యాగు. సెల్లు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొన్న తరువాతే ఇంట్లోనుంచి ఓ రింగియ్యి! నీ సెల్లోనే నా నంబరు ఉంటుంది ఆచారి పేరుతో!’
ఒక్కక్షణం అవాక్కయినట్లు చూసి ఇంట్లోకి వెళ్లిపోయింది స్వాతి.
ఐదు నిమిషాల తరువాత ఆచారి నెంబరుకి కాల్ చేసి థేంక్స్.. అన్నయ్యా.. సారీ!' అంటున్నప్పుడు స్వాతి గొంతు పశ్చాత్తాపంతో  వణికింది.
'అన్నయ్యా అన్నావు కనక సలహా చెల్లమ్మా! అడ్డదారిని ఎప్పుడూ ఎంచుకోవద్దు. పోయేకాలం వచ్చిననవాళ్లను పోలేరమ్మతల్లైనా ఏం చెయ్యలేని రోజులు ప్రస్తుతం నడుస్తున్నవి. పోలేరమ్మ చెట్టుకింద తుంటరి వెధవలు నువ్వు వంటరిగా రావడం పసిగట్టారు.  వెంటాడే  ప్రోగ్రామ్ పెట్టారు. అమ్మవారి నైవేద్యం పెడుతూ సమయానికి నేనక్కడ ఉండబట్టి   సరిపోయింది. లేక పోతే! ఆడపిల్లను తోడేళ్ళకు  వదిలిపెట్టి అమ్మవారిని పూజిస్తే వచ్చే పుణ్యం ఏముంటుంది! మాటల వంకతో నీతో నడుస్తూ..  అదిలించో.. బెదిరించో.. నీ హ్యాండూ.. హ్యాండుబ్యాగూ పుచ్చుకుని నేను నీతో కలిసి నడవబట్టే   వెనకనుంచి వచ్చే తోడేళ్ళకు మగతోడుందనే బెదురు పుట్టింది’  న్నాడు ఆచారి.
***

 కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రిక సెప్టెంబరు, 2016 లోని 'మరీ చొ.క' గా ప్రచురితం)

Monday, August 1, 2016

పెళ్ళిచూపులుకాని పెళ్ళిచూపులు- మరీ చిన్న కథ

రామసుబ్బు చేసేది విప్రోలో పెద్ద ఉద్యోగమే అయినా బామ్మగీసే గీటు దాటేరకం బొత్తిగా కాదు. ఒక్క పెళ్ళి అనేమిటి! పెళ్ళిచూపులుకూడా శుద్ధసాంప్రదాయఫక్కీలో సాగితీరాలన్న బామ్మగారి ఆంక్ష. అందుకు ఒప్పుకున్న తరువాతే సుబ్బురామమ్మను చూసేందుకు రామసుబ్బు స్నేహితుడితోసహా తరలి వచ్చింది.
పాతకాలం మోడల్లో ఫలహారాలు సుష్టుగా లాగించిన తరువాత పిల్లను తెచ్చి చాపమీద కూర్చోపెట్టారు. మగపెళ్ళివారి తరుఫునుంచి ప్రశ్నలవర్షం ప్రారంభమయింది.
'సంగీతం వచ్చా?
'రామలాలీ మేఘ శ్యామలాలీ..'
'గొంతులు బాగున్నాయి సరే ఆమెతో పాటు ఆ పక్క జంటస్వరం ఎందుకు?'
'మొదట్నుంచీ మాకిద్దరికీ కలిసి పాడటమే అలవాటండీ!'
'సంగీతానిదేముందిలేండి! సంసారం చేసుకోవడానికి కావాల్సింది వంటా వార్పూవంటచేయడం వచ్చా.. రాదా.. మీ స్నేహితురాలికి?'
'వంకాయకూర బ్రహ్మాండంగా చేస్తుందండీ!'
'వంకాయకూర ఒక్కటేనా వచ్చు?!'
'కాలేజీకెళ్లి చదువులు సాగించడంచేత ఇంట్లో వంటచేసే తీరిక లేదండీ! కావాలంటే రెండునెల్లలో అన్నీ నేనే దగ్గరుండి నేర్పిస్తానండీ! నాకు అన్ని రకాల వంటలూ చేయడం వచ్చు'
'బాగుంది! రేపు మీ స్నేహితురాలికి ఒంట్లో ఓపికలేదు పొమ్మన్నా  మీరే ఆపద్ధర్మంగా ఆమెకు సాయం పట్టేటట్టున్నారే!  మరి మీరు ఏమీ చదువుకోవడం లేదా ఏమిటీ?'
'ఇద్దరం కలిసే చదువుకొన్నామండీ ఇంటరుదాకా! మెడిసన్లో నాకు సీటు వచ్చినప్పట్నుంచే విడివిడిగా వెళ్ళి చదువుకోవాల్సి వస్తోంది'
'సరే! కాస్త మీ స్నేహితురాలిని  అసుంటా నడిచి చూపించమనండి! లేకుంటే కాలో చెయ్యో వంకరుంటే ఎలా తెలిసేదీ!'
సుభద్ర పక్కనుండి సుబ్బరామమ్మచేత నడిపించింది.
కట్నకానుకలదాకా రాకుండానే  ఆ సంబంధం రద్దయిపోయిందని వేరే చెప్పాలా!
సడేలే! మరి ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ దేనికంటారా!
అక్కడే ఉందండీ అసలు ట్విస్టంతా. సంబంధం రద్ధయిందన్నానేగాని.. బాజాభంత్రీలు మోగలేదని అన్నానా!
ఈ పెళ్లిచూపులు అయిన రెండునెల్లకు భాజాభంత్రీలు మోగాయి.. రామసుబ్బు స్నేహితుడు సుబ్రహ్మణ్యం పెళ్లికొడుకైతే.. సుబ్బరామమ్మ స్నేహితురాలు సుభద్ర పెళ్ళికూతురు!
వాళ్ళిద్దరూ ఒకళ్లకొకళ్ళు తెగనచ్చేసుకొన్నారు రామసుబ్బు పెళ్ళిచూపుల్లో.
బామ్మగారి పనుపుమీద పెళ్లికూతుర్ని అడ్డమైన ప్రశ్నలు వేసినందుకు ఆనక సుబ్బరామమ్మకు సుబ్రహ్మణ్యం ప్రయివేటుగా సారీచెప్పడం సుభద్రకు తెగనచ్చేసిందిస్నేహితురాలికోసం పెళ్ళిచూపుల్లో సుభద్ర అన్నిరకాల మాటలు చిరునవ్వుతో ఎదుర్కోవడం సుబ్రహ్మణ్యానికీ బాగా నచ్చేసింది.
పెళ్ళిచూపులు కాని పెళ్ళిచూపుల్లో నిజమైన పెళ్లిచూపులు జరగడమే ఈ కథలో విశేషం
-కర్లపాలెం హనుమంతరావు
-***

Wednesday, June 1, 2016

అంత్యక్రియ- కౌముదిలోనా కథ



'నిన్నేమో మేమంతా చాలా కాలుక్యులేటేడ్ ఫెలోవని తెగ పొగుడుతుంటాం. నువ్వేమో ఈ చచ్చు పుచ్చు భూమిని ఇంత తగలేసి కొన్నావ్! అదీ ఆదరాబాదరాగా! అవతల అక్కడ హైదరాబాదులో బాబాయిని ఆసుపత్రికి వదిలేసి ఇప్పుడీ గత్తర పనులన్నీ ఎందుకో అర్థం కావడం లేదురా!' అని తగులుకొన్నాడు కుమారస్వామి అమ్మనబ్రోలు ల్యాండు రిజిస్ట్రేషనాఫీసునుంచి బైటికొచ్చీ రాగానే!
సమాధానంగా నవ్వి ఊరుకొన్నాడేగానీ.. పెదవి విప్పి ఒక్కముక్కన్నా బైటికి అనలేదు కమలాకరం. కొన్నభూమి దస్తావేజులను సేకరించుకొనే విషయం గురించి మాట్లాడుతున్నాడు అమ్మిన సుబ్బారాయుడితో ఒక పక్కకు తీసుకెళ్లి.
అమ్మనబ్రోలు భూములంటే ఎర్రమన్ను నేల. పొగాకు పండించీ పండించీ గుల్లబారిన భూమి. మరే పంటా పండేందుకు ప్రస్తుతానికైతే బొత్తిగా ఆస్కారం లేదు. గవర్నమెంటు పొగాకును అంతగా ప్రోత్సహించడం లేదుకూడా. వరస కరువు కాటకాలతో గిడసబారిని నేలను నమ్ముకోలేక అయినకాడికి అమ్మేసుకొని రైతులు తరలిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కమలాకరం వాస్తయినా సరిగ్గాలేని ఎత్తుమీది ఈ భూములను.. అందులోనూ నీటివసతి బొత్తిగా లేని సుబ్బారాయుడి మూడెకరాల కొండ్ర ఎకరా మూడులక్షలు రేటుకి కొనడమెందుకో ఎవరికీ అర్థం కాలేదు. రైతులు సుబ్బారాయుడికి పట్టిన అదృష్టానికి తెగ కుళ్ళుకొన్నారుకూడాను!

కమలాకరానికి అమ్మనబ్రోలుకి ఆట్టే సంబంధంలుకూడా ఏమీ లేవు. అతగాడు అక్కడ పుట్టిందీ లేదు. చదివిందీ లేదు. ఎప్పుడో ఒకసారి వేసవిసెలవులకని ఆ ఊరొచ్చి ఒక మూడు వారాలు ఉండిపోయాడు. అదీ ముళ్లమీదున్నట్లు.
కమలాకరం తండ్రి కాంతారావు బ్యాంకులో
పనిచేసిన రోజుల్లో  ఆ ఊర్లో ఒక మూడేళ్లపాటు కావురం ఉన్నాడు. అప్పుడైనా కుటుంబం హైదరాబాదులోనే!
ఆ మాత్ర్రం సంబంధానికే ఇంత రేటు పెట్టి ఇక్కడి భూములు కొనడానికి రావాలా కమలాకరం! అందునా మిత్రుడు కుమారస్వామి మొత్తుకొన్నట్లు ఆయన తండ్రి హైదరాబాదు అపోలోలో దాదాపు ఆఖరి గడియల్లో ఉన్నాడు! న్యూజిలాండునుంచి చెల్లెలు సుభద్ర రావడానికి కనీసం రెండు రోజులు తక్కువ పట్టదు. తండ్రిని వెంటిలేటరుమీద ఉంచి.. మిగతా పనులు భార్యకు పురమాయించి మరీ ఈ వ్యవహారంకోసం ఇంతదూరం ఇప్పుడు పరుగెత్తుకు రావడానికి పెద్ద కారణమేమైనా ఉందా?
కుమారస్వామిని కుమ్మరి పురుగులా తొలిచేస్తున్న ఈ సందేహానికి సమాధానం మర్నాటికిగానీ బైటపడలేదు,
అదీ అతగాడి భార్య సుగుణ కాల్ చేసి కంగారు పెట్టబట్టి! 'సుభద్రకూడా వచ్చేసిందండీ! అందరూ మిమ్మల్ని గురించే అడుగుతున్నారు రెండు రోజులబట్టీ! మీ నాన్నగారైతే ఒహటే కలవరింతలు.. అత్తయ్యగారికి సర్ది చెప్పలేక పోతున్నాను'
'వచ్చేస్తున్నా! వచ్చిన పని పూర్తయింది. రేప్పొద్దునకల్లా అక్కడుంటా.. సరా! అందాకా ఎలాగో మేనేజ్ చేయ్.. ప్లీజ్!' అని ఫోన్ పెట్టేసి కుమారస్వామితో సహా కొన్నపొలానికి బైలుదేరాడు కమలాకరం.
పొలంచుట్టూ దిట్టంగా కంచె ఉంది. పెద్దగేటుకి వేసిన తాళం తీసి.. నేరుగా ఓ మూల ఉన్న పెంకుటింటిలోకి స్వామిని తీసుకెళ్లాడు కమలాకరంలోపలి గోడలనిండా  సీతా..సీతా..’అని రామకోటిలా ఇంగ్లీషులో రాతలు.. అడుగడుగునా! జీడిపిక్కలతో రాసిన ఆ రాతల్లో సీత పేరుతో కలిసి కాంతారావుఅనిగాని లేక పోయుంటే కమలాకరానికి ఇప్పుడింత దూరం వచ్చి ఈ చచ్చుపుచ్చుభూముల్ని ఇంత ధరపెట్టి అర్జంటుగా కొనాల్సిన అవసరం తప్పుండేది!
'నువ్వేం చేస్తావో తెలీదురా! రేపు సాయంత్రానికల్లా ఈ  గుడిసె మొత్తాన్నీ   కూలదోసెయ్యాలి. మా నాన్నకు ఇక్కడే అంత్య క్రియలు! అదే మూడు రోజుల్నుంచి ఆయన కలవరింతలు! అమ్మకు చెల్లాయికి తెలిస్తే అల్లాడిపోతారు! పరువుకోసం పాకులాట్టం మాకు నేర్పిందీ ఈ  మహానుభావుడే కదా!' అన్నాడు కమలాకరం.
సీత ఎవర్రా?’ అని అడుగుదామనుకొని కమలాకరం కంట్లో నీళ్ళుచూసి ఆగిపోయాడు కుమారస్వామి 'డోంట్ వర్రీరా! నీ లాంటి కొడుకు ఉండటం మీ నాన్న చేసుకొన్న అదృష్టం' అని మిత్రుడి భుజం తట్టాడు అనునయంగా!

***
-కర్లపాలెం హనుమంతరావు 
(కౌముది అంఅర్జాల పత్రిక జూన్ 2016 సంచికలో మరీ చి.క గా ప్రచురితం)

Monday, May 2, 2016

పెరట్లో కచేరీ- కౌముది మరీ చిన్న కథ (మరీ చి.క)

వేటపాలెం పేరు చెవిన బడంగానే చెవిలో వినిపించే మధురస్మృతుల్లో వెంకట్రాముడి గానకచేరీ  ఒకటి.
తెల్లారుఝామున మొదలయ్యేది వాడి గానకచేరీ పెరట్లో! తోడి రాగాలు.. ఉదయరాగాల్లాంటి తేడాలేమీ తెలీని లేతవయసులో వాడి నాదస్వరం మా పిల్లలకు ప్రాణాలు తోడేసినట్లుండేది. దానికి తోడు కచేరీ పూర్తయేలోపు పక్కలమీదనుంచి లేచి పనుల్లో పడకపోతే మా అమ్మ ప్రాణాలు తోడేయడం అదనం.
వానరానీ.. వరదరానీ.. ఊరుమొత్తం దొంగలొచ్చి దోచుకుపోనీ.. వెంకట్రాముడి గానకచేరీ మాత్రం తొలిసంధ్యలో కనీసం ఒక గంటపాటైనా నిరాటంకంగా సాగాల్సిందే! వాడి నేపథ్యసంగీతంలోనే మా పిల్లలంతా కాలకృత్యాలు  పూర్తిచేసుకోవడం అప్పటి అలవాటు,
పై చదువులకని వెళ్లి మధ్య మధ్యలో తిరిగివచ్చినప్పుడు తెల్లారుఝామున వెంకట్రాముడి నాదస్వరం చెవినబడంగానే ప్రాణం లేచివచ్చినట్లనిపించేది.
అంతగా 'అడిక్ట్' అయిపోయామన్న మాట వెంకట్రాముడి సంగీత కచేరీకి.
కాబట్టే జీవితంలో అన్నిరకాల పోరాటాలు పూర్తిచేసి ఆఖరిదశలో మనశ్సాంతిగా బతుకు వెళ్లదీయాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ముందుగా గుర్తుకొచ్చింది మా ఊరు వేటపాలెం..  బ్రాహణవీధిలో  వర్ధనమ్మగారి పెంకుటిల్లు. దానివెనకాలే  వెంకట్రాముడులాంటి నాయీబ్రాహ్మణులుండే మంగల్లంప.
పిల్లల్ని ఒప్పించి మకాం మా ఊరికి మార్పించడానికి కొంత సమయం పట్టినా.. మొత్తానికి వర్ధనమ్మగారి ఇంటినే కొనడానికే  నిర్ణయమయింది.
కొనేముందు చూసిపోయేందుకని ఒకటికి రెండు సార్లు వచ్చినా.. వెంకట్రాముడి గురించి విచారించే వ్యవధానం లేకపొయింది.
చిన్ననాటి స్నేహితుడు గుడిశర్మకనిపించినప్పుడే ఆ విషయాలన్నీ మళీ చర్చకు వచ్చాయి.
'వెంకట్రాముడి కొడుకు మన ఆదినారాయణగారి మూడో మనమరాలిని లేపుకుపోయాడ్రా! అప్పట్లో అదంతా పెద్ద గోల. అందరూ వెంకట్రాముణ్ణే తప్పు పట్టారు. వెలేసారు. గుళ్లో కచేరీలే కాదు..  తలపనులక్కూడా వాడు ఇప్పుడు మనవాళ్ళెవరికి పనికిరావడం లేదువెంకట్రాముడిప్పుడు  మంచంమీద తీసుకుంటున్నాడు. ఇంకేం కచేరీలు నా బొంద! ఆ కథంతా ముగిసి ఏడాది పైనే ఐందింటూ చావు కబురు చల్లంగా చెప్పేసాడు.
కచేరీలు కాకుండా క్షురకర్మ చేయడంకూడా నాయీబ్రాహ్మణుల వృత్త్తుల్లో ఒక భాగమే. నాకిప్పుడు గుర్తుకొస్తోంది. మాఇంటి ముంగిట్లో కూర్చుని  తలపని చేస్తున్నప్పుడు మా నాన్నగారు  అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడొకసారి  వెంకట్రాముడు 'మా సాంబణ్ణి పెద్ద బడే గులాం సాహెబ్ మాదిరిగా సెయ్యాలయ్యా!.. అదీ నా కోరిక' అనడం.
వెంకట్రాముణ్ణి చూద్దామని శర్మతోసహా మంగల్లంపలోకి అడుగు పెట్టాను చాలా కాలం తరువాత.
గానకచేరీ నడిచిన గుడిసె అలాగే ఉంది. కానీ.. దాని ఆకారం  మాత్రం వెంకట్రాముడు అవతారంలాగే చీకిపోయి ఉంది.
కుక్కి నులకమంచంమీద మాసిన చిరిగిన దుప్పట్లో మూలుగుతూ పడున్న ఆకారాన్ని చూపించి 'ముసలాడు మన మడుసుల్లో లేడయ్యా!' అంది ఆయన పెళ్లాం నాగమ్మ కన్నీళ్ళు పెట్టుకొంటూ. చిన్నతనంలో ఆ తల్లి సంజెవేళ  దొడ్డిగోడమీదనుంచి మా పిల్లలకోసమని అందించిన వేడి వేడి ఉలవచారు రుచి  నాలిక్కి తగిలిందిప్పుడు.
నా మనసంతా ఎలాగోఅయిపోయింది..
'వైద్యం చేయించడంలా?' అనడిగితే ఊరు వెలేసిని మడిసిని వైద్దులు మాత్రం ఏం ఉద్దరిత్తారయ్యా! ల్లు గడవాడాలిగందా  ముందు! ఎన్నడూ లేంది  మాఇంటి ఆడపిల్లలు పక్కూళ్లకెళ్ళి మంగలి పనులు  నేర్సుకొంటున్నారిప్పుడు. పొట్ట నిండాలి గందా!' అని నిష్టూరమాడుతుంటే వినడానికే కష్టంగా అనిపించింది.

ఆ క్షణంలో నిర్ణయించుకొన్నాను. మా నూతన గృహప్రవేశానికి వెంకట్రాముడి మంగళవాయిద్యాలు పెట్టించాలని. సంభావనకింద వెంకట్రాముడి తల్లి చేతిలో వెయ్యి నూటపదహార్లు పెట్టి 'ఏం చేస్తావో పెద్దమ్మా! వచ్చే శ్రావణానికి మేం కొత్తింట్లోకి దిగుతున్నాం. ఆ శుభముహూర్తానికి వెంకట్రాముణ్ణి తయారు చెయ్యాలి. ఇహనుంచీ రోజూ ఉదయాన్నే కచేరీ సాగాలి పెరట్లో ఇదివరకట్లాగానే. ఇది బయానా మాత్రమే! మిగతా సొమ్మ వెంకట్రాముడితోనే మాట్లాడి ఖాయం చేసుకొంటా!' అని చెప్పి బైటికి వచ్చేసాను.
శర్మ సంతోషంగా నా భుజం తట్టడం నాకు ఆనందం అనిపించింది.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- మే 2016 సంచికలో ప్రచురితం)




Sunday, May 1, 2016

నాన్నలంతే!- కౌముదిలోని మరీ చి.క(మరీ చిన్న కథ)


నాన్నతో ఆరుబయలు పడుకొని ఉన్నాడు  బుడతడు వెన్నెల రాత్రి.
'నాన్నా! మనం పేదవాళ్లమా?' అనడిగాడు హఠాత్తుగా!
'కాదు కన్నా! అందరికన్నా ధవవంతులం! ఆకాశంలో కనిపిస్తోందే.. ఆ చందమామ మనదే! అందులోని నిధినిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు నాన్న. 'వాటిని తెచ్చుకోవచ్చుగా!  నాకు సైకిలు కొనివ్వచ్చుగా!  రోజూ పనికి పోవడమెందుకు?' చిన్నా ప్రశ్న.
'నువ్వింకా పెద్దాడివైన తరువాత నీకు రైలుబండి కొనివ్వాలని ఉందిరా! ఇప్పుడే తెచ్చుకొని సైకిలు కొనేస్తే రేపు రైలుబండికి తరుగు పడవా? నీకు రైలు కావాలా? సైకిలు కావాలా?' అని నాన్న ఎదురు ప్రశ్న. 'రైలే కావాలి. ఐతే రేపూ నేనూ నీతో పాటు పనికి వస్తా! డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు చిన్నా.
'పనికి చదువు కావాలి. అలాగే వద్దువుగాని.. ముందు బుద్ధిగా చదువుకోవాలి మరి!' అన్నాడు నాన్న.
చిన్నా బుద్ధిగా చదువుకొని తండ్రిలాగానే ఓ ఆఫీసులో పనికి వెళుతున్నాడు ఇప్పుడు. పెళ్లయి.. ఓ బాబుకి తండ్రికూడా అయాడు.

ఓ రోజు డాబామీద ఆరుబయలు పడుకొని ఉన్నప్పుడు.. అప్పుడూ వెన్నెలే! ఆ బాబు అడిగాడు'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా?'

ఆకాశంలోని చందమామలో తండ్రిముఖం కనిపించింది ఆ బాబు తండ్రికి ఇప్పుడు. కళ్ళు చెమ్మగిల్లాయి.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- మే సంచికలో ప్రచురితం)

Friday, April 1, 2016

తూటా- కౌముది మరీ చి.కగా ప్రచురితం

రాజా రావుబహద్దూరు రాజారావుగారికి ఉబ్బసం వ్యాధి. దగ్గు తెరలు తెరలుగా తన్నుకొస్తూ పక్కమీద ఒక్కక్షణంకూడా నిలవనీయడం లేదు. పక్కనే పక్కలోనే సహధర్మచారిణి  దేవికారాణి.. ముసుగు ఉంది! అయినా భర్త బాధలేవీ ఆ రాణిముసుగులో చలనం కలిగించలేకపోయాయి!
రాజావారే లేని ఓపిక తెచ్చుకొని లేచివెళ్ళి మందుబిళ్లమింగి కాసిన్ని మంచితీర్థం గొంతులో వంపుకొన్నారు. తరువాత  బాత్రూంకని బైలుదెరారు. కాలకృత్యం ముగించుకొని తిరిగివస్తూ యథాలాపంగా కిటికీగుండా బైటికి చూస్తే..  వాచ్ మెన్ వెంకట్రాముడి  పక్కా ఖాళీగా ఉంది!
పక్క గదిలోనుంచి పకపకలు.. గుస గుసలు! ఆడా మగా గొంతులు కలగలసి పోతూ.. ఉండి ఉండి నవ్వులు! అర్థరాత్రి ఆటలని  ఆ ముద్దులు..ముచ్చట్లే చెబుతున్నాయి!
పక్కమీదకొచ్చి ముసుగులో చూస్తే భార్యామణిగారూ లేరు!
పరువుకోసం అరవయ్యిల్లో ఇరవైయ్యేళ్ల పిల్లను మూడోపెళ్లి చేసుకొని పొరపాటు  చేసినట్లేననిపిస్తోంది రాజావారికి ఇప్పుడు.
తప్పును సరిదిద్దుకోవాలి.. సాధ్యమైనంత తొందరగా!’ గొణుక్కొంటూ గోడమీద వేలాడే తుపాకీ వంక చూసారు రావుబహుద్దూరు రాజారావుగారు.
ముక్కుతూ మూలుగుతూనే లేచి వెళ్ళి డ్రాయరు సొరుగు తాళంతీసారు!
***
మూడోరోజు వార్త
'రాజా రావుబహుద్దూరు రాజారావుగారింట్లో తూటా పేలి వాచమన్ వెంకట్రాముడి  దుర్మరణం. రెండురోజుల కిందట ఉదయం పూట రాజావారి  తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు భోగట్టా!'
-కర్లపాలెం హనుమంతరావు


***

డాక్టరు- యాక్టరు- కౌముది మరీ చి.కగా ప్రచురితం

నాకిద్దరు సంతానం. అమ్మాయి. అబ్బాయి. ఇద్దర్నీ డాక్టర్లు చేయాలని నా ఆశ.
పెద్దది ఎలాగో పొర్లుదండాలైనా పెట్టుకుంటూ వైద్యాలయం చేరుకొంది. కానీ చిన్నాడి కథే గుంటపూత.
డాక్టరవుతావా? యాక్టరవుతావా? అని ఎవరైనా అడిగితే.. తడబాటుకూడా ఉండదు.. 'యాక్తర్' అనేవాడు నత్తిగా మా వాడు.
ఆలోచనకు తగ్గట్లే బుద్ధులూనూ!
బడికి పంగనామం పెట్టినప్పుడు, సినిమా టిక్కెట్టుకి పైనలు నొక్కాల్సొచ్చినప్పుడు, పరీక్షలైపోయి ఫలితాలు వచ్చేటప్పుడు, స్నేహాల మిషతో అడ్డమైనవాళ్ళను కొంపమీదకు తెచ్చినప్పుడు.. వాడి నటనాకౌశలం చూసితీరాలి. ముందు కన్నతల్లిని.. ఆనక ఆమె కన్నీళ్లతో నన్నూ లొంగదీసుకోడం వెన్నతో పెట్టిన విద్య వాడికి.
వాడి ఖర్మానికి వాణ్ణి వదిలేసి చాలా కాలమే అయింది. రేపు పెళ్లయి పిల్లా జెల్లా పుట్టుకొస్తేకనీసం వాడి అక్కమాత్రం నెలకో పాతికవేలైనా గడించుకోకపోతే ఎలాగన్నది ఒక్కటే ప్రస్తుతం మా దిగులు.
మా ఆవిడకు ఒంట్లో బాగుండటం లేదు. చూపించడానికని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకు వెళ్లా. ముందే అప్పాయింటుమెంటు తీసుకొన్నా.. మా కన్నా ముందు ఇంకెంతమంది తీసుకొన్నారోగాని అప్పాయింటుమెంటు.. వెయిటింగు హాలు తిరుమల వెంకన్న దర్శనం గదులకన్నా రద్దీగా ఉన్నాయ్!
డాక్టర్లు వచ్చారో.. రాలేదో! అడుగుదామనుకుంటే తెల్లకోటుల్లో తిరిగేవాళ్ళలో ఎవరు వైద్యులో.. ఎవరు కాంపౌండర్లో.. కన్ఫ్యూజన్! పడిగాపులు పడలేక వేరే ఆసుపత్రుల చిరునామాలు సెల్ ఫోనుల్లో చూసుకొంటున్నారు చాలామంది రోగులు. అప్పుడు జరిగింది ఆ వింత.
అప్పటిదాకా కామ్గా కూర్చొన్న యువ జంట ఒకటి ఉన్నట్లుండి పెద్దగా అరుచుకోవడం మొదలు పెట్టింది. మాటలు చేతల్లోకి మారడం క్షణాల్లో జరిగిపోయింది! టీవీ సీరియలు కన్నా రసవత్తరంగా సాగుతోంది సీను.
అబార్షను కేసు. అమ్మాయికి ఇష్టం లేదు. అబ్బాయికి సంతానం ఇష్టం లేదు. ఇంటిపట్టునే గుట్టుగా తేల్చుకోవాల్సిన కాంప్లికేటెడ్ మేటరు గదా! ఆసుపత్రిదాకా వచ్చి ఇక్కడీ రచ్చెందుకో ఇప్పుడు!
మొత్తానికి ప్రేక్షకులందరికీ మంచి కాలక్షేపం. ముక్కుతూ మూలుగుతూ పడుకొన్న రోగులుకూడా నొప్పులన్నీ మర్చిపోయారు. లోపలి వాళ్ల సంగతి సరే సరి.. బైట జనంకూడా ఎగబడుతున్నారు! ఆసుపత్రివాళ్ళు టీవీ కట్టేసిన సంగతికూడా ఎవరూ పట్టించుకోలేదంటే.. పరిస్థితిలోని మార్పు అర్థం చేసుకోవచ్చు.
'డాక్టర్లు వచ్చారు' అని ఎవరో అరిచిందాకా టైమెంతయిందో ఎవరికీ పట్టలేదు.
క్షణాల్లో సీను మారిపోయింది.
అప్పటివరకు జుట్టూ జుట్టూ పట్టుకొని కొట్టేసుకొన్న ఆ అబ్బాయి.. అమ్మాయి.. ఇంచక్కా నవ్వుకొంటూ చెట్టాపట్టాలేసుకొని వెళ్లిపోయారు లోపలికి!
విసుగెత్తిన రోగుల్ని వినోదపరిచేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఆచరిస్తున్న లేటెస్టు టెక్నాలజీ! 'యాక్టింగు' ద్వారా ఎంటర్ టైన్ చేయడంకూడా ఒక ముఖ్యమైన టెక్నిక్కుట! రోగుల్ని పక్క ఆసుపత్రులకు వదిలేసుకోకుండా ఒడుపుగా నిలబెట్టుకోవడం, కొత్త రోగులను రాబట్టుకోవడం లక్ష్యంట!
 చాలా వైద్యాలయాలు అనుసరిస్తున్నాయి ఇలాంటి వ్యాపార సూత్రాలను' అని ఇంటి దగ్గర  మా డాక్టరమ్మాయి వివరించినప్పుడు నోరు వెళ్లబెట్టడం మా వంతయింది.
'డాక్టర్ని చేసి నా దుంప తెంపారు మీరు. ఇంచక్కా తమ్ముళ్లా నేను యాక్టర్నై ఉంటే  ఈ కార్పొరేట్ ఆసుపతులోనే కార్పెట్లు పరిపించుకొనే దాన్ని' అని నిష్టూరాలక్కూడా దిగింది మా డాక్టరుడాటరు.
తన తప్పేముందిలేండి! ఎం.డి పట్టా పుచ్చుకొని ఎంప్లాయిమెంటుకోసం  వెళ్ళినప్పుడు 'డాక్టర్లకు మా దగ్గర కొదవలేదు. మాక్కావాల్సిందిప్పుడు యాక్టర్లు. డాక్టర్లకు నెలకు పాతికవేలు మించి ఇవ్వలేం. యాక్టర్లకైతే రెట్టింపు ఇచ్చేందుకైనా రడీ' అన్నాడుట ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంటు. అదే ఆసుపత్రి తమకోసం పనిచెయ్యమని తమ్ముడిమీద తెగ వత్తిడి తెస్తున్నాయి.. తమరికి తెలుసో .. లేదో!’ అనికూడా వ్యంగ్యాలు పోయింది. వాడికి అంత టైం లేదని.. తన ట్రైనీసుని అవసరం వచ్చినప్పుడల్లా డిప్యూట్ చేస్తున్నాట్ట ఇప్పుడు!
ఇందాకటి అబార్షన్ కీచులాట కాన్సెప్టుకూడా మా వాడిదే అని అప్పుడు తెలిసింది మాకు.
మొత్తానికి మన డాక్టరు అమ్మాయికన్నా యాక్టరు అబ్బాయి పనే బాగుందన్న మాట! కలికాలం!' అని నోరు నొక్కుకుంది మా శ్రీమతి. అలా నొక్కుకోవాలన్న స్పృహైనా లేకుండా దిమ్మరబోవడం నా వంతైంది.
-కర్లపాలెం హనుమంతరావు
***



తిరగబడ్డ ‘సీతారాముడు ఉదయగిరి’- కౌముది పత్రిక ప్రచురితం

డోర్ బెల్ మోగింది.
తలుపు తీసింది కళ్యాణి. ఎదురుగా ఎవరూ లేరు! రంగుకాగితాల చుట్ట మాత్రం కనిపించింది గడపలో. విప్పి చూస్తే లోపలా ఏమీ లేదు. చిన్న నోట్ మినహా!
'విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే విత్ ఏ బ్యూటీఫుల్ బేబీ సూట్'
-యువర్స్
అప్పుడే పుట్టిన బిడ్డవంటిమీద ఏవీ ఉండవన్న అర్థంలో కాబోలు! ముందు కొద్దిగా నవ్వొచ్చింది. ఆనక కోపం ముంచుకొచ్చింది.
 ‘హూ ఈజ్ దిస్ యువర్స్?!’
ముక్కూమొగం తెలీని మనిషితో  పరాచికాలా! ఇది మొదటిసారి కాదు.
రెండు నెల్లకిందట..
సెల్లార్లో కారు స్టార్టుచేసి బైలుదేరే సమయానికి ఎదురుగా డ్యాష్ బోర్డు అద్దంమీద భయంకరంగా.. బల్లి!
పైప్రాణాలు పైనే పోయాయాక్షణంలో. బల్లంటే తనకింతప్పణ్ణుంచీ పరమ అలర్జీ!
వాచ్ మెన్ వచ్చి  రబ్బరుబల్లితో పాటు  ఒక చిన్ననోటూ తీసి చూపించాడు. 'ఏప్రియల్ ఫూల్!' అనిమాత్రం ఉందందులో.
అదీ  ఈ యువర్స్ నిర్వాకమే!
ఏప్రియల్ ఫూళ్ళు, పుట్టిన్రోజులు, ఫ్రెండ్షిప్ డేలు.. అన్నీ రాజుగాడితోపాటే  మటుమాయమై పోయాయి జీవితంలో!
పెద్ద పోలీసాఫీసరుకదా అని మరీ ఇష్టపడి చేసుకొంది సీతారాముణ్ణి. ‘సీతారాముడు ఉదయగిరి’ ఒక్కటే అప్పట్లో తనకు తెలిసిన తన ప్రాణం పేరు. ఆ ప్రాణ ప్రసాదమే రాజు.
విధి నిర్వహణలో భాగంగా సీతారాముడు బొక్కలో వేయించాడన్న కక్షతో మూడేళ్ల రాజును పొట్టన పెట్టుకున్నది మాఫియా గ్యాంగు.
ఆ కోపంలోఅనాలోచితంగా సీతారాముణ్ణీ దూరం చేసుకుంది తను.
రాజుగాడి పుట్టినరోజు ఆ రోజు.  సజ్జబూరెలంటే వాడికి చాలా ఇష్టం. స్వహస్తాలతో చేసి అనాథాశ్రమంలో ఇద్దామని ప్లానుసరుకులకోసం గంగారాముకి పోతే .. ముందే ఆర్డరిచ్చినట్లు అన్నీ సిద్ధంచేసిన పాకెట్ అందించారు దుకాణంవాళ్ళు! బిల్లూ ఆల్రెడీ పెయిడ్! పే చేసిందీ ఈ 'యువర్సే'!
అవన్నీ ఎలాగో భరించొచ్చుపెళ్లి రోజున మూడ్ అవుటాఫయి ఎవరికీ అందకుండా సాంఘీటెంపుల్లోకెళ్లి కూర్చుంటే.. అక్కడికీ వెదుక్కుంటూ వచ్చి వాలిందీ 'యువర్స్' బేవార్స్ పార్శిల్!
ఎలా కనిపెడతాడో  తన ఇష్టాఇష్టాలుసందర్బానికి తగ్గట్లు వచ్చేస్తాయి బహుమానాలు! బ్లూ కలర్ అంచున్న గుజరాతీవర్కుశారీ అంటే తనకు ప్రాణం. దాంతోపాటు పింకుకలర్ లోపలి డ్రాయరూ పాకెట్లో కనిపించేసరికి పిచ్చెత్తినట్లయింది కళ్యాణికి.
ఆగడాలు మరీ మితిమీరుతున్నాయి. తనమానానికి తాను ఏడుస్తూకూడా ఓ మూల కూర్చోకూడదా
'యువర్సు గాడెవడో తేల్చాల'ని  గుళ్లోనే డిసైడయింది కళ్యాణి.
'షి' టీముకి ఫిర్యాదూ చేసింది.
మూడురోజుల్లో మొత్తం విషయం బైటకొచ్చేసింది.
యువర్స్ ఒక మనిషి కాదుఆఫ్టర్ లైఫ్ సర్వీసుకి అంకితమైన సంస్థ!
తీరని కోర్కెలతో పోయేజీవికి  తదనంతర కోర్కెలు తీర్చేటందుకు సహకారం అందించే ఒక సేవా సంస్థ. కొంత డిపాజిట్.. కోరికల చిట్టాతో.. కాంట్రాక్టులోకి ఎంటరవడమే పోయేముందు ఆ జీవి చేయాల్సిన పని.
షీటీం ఇచ్చిన వివరాలతో యువర్స్ ను కాంటాక్టు చేసింది కళ్యాణి.
 'వివరాలేమీ  చెప్పేందుకు వీల్లేదు.. బిజినెస్ రూల్సు! ఇంకొక్క ప్యాకెట్టు! మా కాంట్రాక్టు కంప్లీటయిపోతుంది. సారీ మ్యాడమ్.. ఫర్ బాదరింగ్ యూ!' అంటూ  యువర్స్  చల్లటి సమాధానం.
రాబోయే ఆ చివరి ప్యాకెట్టుకోసం ఆ రోజునుంచి  కళ్యాణి ఎదురు చూడని క్షణం లేదు.
వేలంటైన్సు డే రోజున ఆ ముచ్చటా తీరింది.
'కల్లూ! నీకు నామీద కోపమెందుకో తెలీదు! నాకుమాత్రం నీమీదున్నదంతా కేవలం  ఆకాశం పట్టనంత ప్రేమే! బతికున్నంత కాలం ఎలాగైనా నిన్ను కన్విన్సు చేసుకోగలనన్న నమ్మకముండేది. గుండెలోతుల్లోకి దిగిన  తూటాతో నాకిప్పుడా అవకాశం లేకుండా పోయింది. నేరం చేసి ఉరిశిక్షబడ్డ ఖైదీక్కూడా చివరికోరిక తీర్చుకొనే అవకాశం ఇస్తుంది వ్యవస్థ. నాకూ ఆ అవకాశం ఇవ్వద్దాఒకరాజును పోగొట్టుకొన్నా మరోరాజును  సంపాదించుకోవచ్చుమగాళ్ళందరూ  సీతారాముళ్ళ మాదిరిగానే ఉండాలనీ లేదుగా! నీకు నచ్చిన మరో రాధాకృష్ణకోసమైనా నువ్వు అన్వేషణ ఆరంభించాలి.  పదేళ్లకిందట మొదటిసారి ఎన్కన్వెంక్షను సెంటర్లో పింకుకలర్ లోలుంగీలు కొంటున్నప్పటి కళ్యాణిలాగానే నిన్నెప్పుడూ పైనుంచీ చూడాలన్నది నా కోరిక. కాదనవని నా ఆశ 
-తిరగబడ్డ YOURS
(SRUOY- సీతారావుడు ఉదయగిరి ఓన్లీ ఫర్ యూ)
కళ్యాణి కళ్ళవెంట  ధారకట్టే నీళ్ళు! తుడుచుకొనే ప్రయత్నమేమీ ఆమె ఇప్పుడు చేయడంలేదు.
-కర్లపాలెం హనుమంతరావు

***
(కౌముది అంతర్జాల పత్రిక ఏప్రియల్ సంచిక మరీ చి.క లో ప్రచురితం)

Thursday, February 4, 2016

చేలాంచలము- చిన్నకథ- కౌముది మరీ చి.క కాలమ్ ప్రచురితం


అనగనగా ఓ అబ్బాయి. ఓ రోజున అతనికి ఓ అందమైన కల వచ్చింది.అందులోని సుందరాంగి చేతులుచాచి మరీ తనలోకి చేరమని ప్రాథేయపడింది.
'అప్పుడేనా! నాకింకా నిండా పదహారేళ్లైనా నిండలేదు. ఇది తరుణంకాదుఅని తిరస్కరించాడు అబ్బాయి.
అబ్బాయికి యవ్వనం వచ్చింది. ఓ రోజు కలలో మళ్లీ మునపటి స్వప్నసుందరే  ప్రత్యక్షమయి 'తరుణం వచ్చింది కదా! తరిద్దాము రారాదా!' అని సిగ్గువిడిచి మరీ బ్రతిమాలింది.
'వయస్సు వస్తే సరిపోతుందా! నా స్వంతకాళ్లమీద నేను నిలబడవద్దా! అప్పుడూ ఈ తరించడాలు.. తడిసిపోవడాలు!' అని అప్పటికి తప్పుకొన్నాడు అబ్బాయి.
అబ్బాయి సంపాదన పరుడైన వెంటనే మళ్లా కల్లో కనిపించి కాళ్ళావేళ్లాబడినంత పని చేసింది స్వప్నసుందరి.
'పిల్లా పీచూ సంగతి చూడాలి ముందు. ఆ తరువాతే ఈ గెంతులూ.. చిందులూ!' అని సుందరిని కర్కశంగా పక్కకు తోసాసాడు ఈసారి కూడా ఆ అబ్బాయి.
అబ్బాయిగారి చివరికూతురు పెళ్ళిచేసుకొని అత్తారింటికి తరలిపోయింది.
'ఇప్పుడైనా కనికరిస్తావా మహానుభావా!' అని అడిగింది స్వప్నసుందరి పట్టువదలకుండా మళ్లా కల్లోకొచ్చి.
'పట్టినంత కాలం ఓపిక పట్టావు. మనుమలు.. మనుమరాళ్లు పుట్టుకొచ్చే సమయం. వాళ్లతోకూడా కాస్త ముద్దూ ముచ్చట్లు తీర్చుకోనీయవోయి  సుందరీ!' అంటూ వచ్చినదారే చూపించాడు ఆ సుందరికి  బడుద్దాయి అబ్బాయి.
మనమలు.. మనమరాళ్లతో ముద్దుముచ్చట్లు ముగిసిపోయాయి. చేసే ఉద్యోగానికి విరమణ అయిపోయింది. కాలసినంత తీరిక. బోలెడంత సమయం. కూర్చొని కూర్చొని విసుగొచ్చిన అబ్బాయిగారికి అప్పుడు గుర్తుకొచ్చింది స్వప్నసుందరి.
కానీ.. స్వప్నసుందరిజాడే ఇప్పుడు  కానరావడం లేదు!
స్వప్నసుందరి దర్శనం కలగాలంటే ముందు నిద్రాసౌభ్యాగ్యం అబ్బాలి. బిపి.. షుగరు.. కాళ్లతీపులు.. అజీర్తి.. అతిమూత్రవ్యాధి.. మతిమరుపు రోగం.. నరాల బలహీనత! ఇన్ని ఇబ్బందులున్నవాడికి నిద్ర పట్టేది ఎలా! స్వప్నసుందరి సందర్శనం ఇహ తీరని కలా! అయినా.. అంతలా నరాల బలహీనతలున్న అబ్బాయిగారు  కలలరాణితో కలసి చేసేదిమాత్రం ఏముంది?
స్వప్నసుందరి మరే అబ్బాయి కలలోనో బిజీగా ఉండి ఉంటుంది.
ఆ పిల్లగాడన్నా తాను చేసిన పొరపాటు చేయకూడదని గొణుక్కున్నాడు    మగతనిద్రలోనే అబ్బాయిగారు!

***
-కర్లపాలెం హనుమంతరావు 
(కౌముది- ఫిబ్రవరి 2016- మరీ చి.క కాలమ్ లో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...