Sunday, June 7, 2015

హృదయతంత్రుల్ని మీటి భావమాధుర్యాన్ని పంచే విపంచి- కవి



హృదయతంత్రుల్ని మీటి భావమాధుర్యాన్ని పంచే
విపంచి- కవి
        

కొరకంచు వంటి లోకానుభవం, రస బంధురమైన హృదయ స్థానం, కన్ను కలిగి చరించే చిత్తం,   గంభీరమైన భావ ప్రకటన కవిత్వానికి అవసరమైన దినుసులు-
'కవిత్వతత్త్వ విచారము'లో  కట్టమంచి రామలింగారెడ్డి


హృదయ తంత్రుల్ని మీటి భావ మాధుర్యాన్ని పంచే విపంచి - కవి. మీన మేషాలు లెక్కించుకుంటూ, గుణ, సూత్ర బద్ధంగా, చెమటోడ్చి చేసే రచన భౌతికశాస్త్రం అవుతుందేమో కానీ కవిత్వం మాత్రం కాదు. కాలేదు. కృత్రిమత్వానికీ మూర్తిమత్వం ప్రసాదించే అసాధారణ ప్రజ్ఞ (భావనా శక్తి) కవికి ఉండే ప్రత్యేక లక్షణం. 
మానవులను మిగతా జీవరాశినుంచి విడదీసి ప్రత్యేక  జాతిగా నిలబెట్టే ప్రాకృతిక గుణాలు
1. ఆలోచనలు(Thinking) 2. భావాలు(Feeling) 3. సంకల్పాలు(Willing). 
భావాలను ఉత్తేజపరిచే గుణం  అధికంగా గల వ్యక్తికే కవిత్వ లక్షణాలు అలవడేది. కవిత్వం ఏ నిర్వచనానికీ అందని ఒక బ్రహ్మపదార్థం.  ఒకడు కేవలం  కవి మాత్రమే ఎందుకు కాకుండా ఉండ లేడో.. మరొకడు ఎంత ప్రయత్నించినా కవిగా ఎందుకు మారలేడో అంతుబట్టని వింత.  కవికి మాత్రమే ఉండవలసిన ప్రత్యేక లక్షణాలు ఏవో కవులనైజంలో ఉండి ఉండాలి.
ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే అది భౌతికశాస్త్ర సిద్ధాంతం అవుతుంది. కన్నది కన్నట్లుగా వ్యక్తీకరిస్తే అది కవిత్వ రసాయానికి చెందుతుంది. ఉన్నదానికీ, కన్నదానికీ మధ్య ఒక సన్నని  తెర ఎప్పుడూ కదలాడుతూ ఉంటుంది. తెరను తొలగించుకుని మరీ సత్యశోధనకు తాపత్రయపడే తత్వం శాస్త్రజ్ఞుడిదైతే.. తెరకు ఈవలి వైపునే నిలబడి కంటికి కనిపించే దృశ్యాన్ని కమనీయంగా వర్ణించే నైజం కవిది. కవికి సత్యాన్వేషికిలాగా   శుద్ధసత్యంతో నిమిత్తం లేదు. వాస్తవ నైజాన్ని గజం దూరం నుంచైనా సరే నిలబడి మనస్సనే సాధనంతో ఊహించే పని కవికి ఇష్టం. 
బుద్ధిజీవులకు కవులభాష చాలా సందర్భాల్లో అసంబద్ధంగా చికాకు పుట్టిస్తుండేది అందుకే. అయినా  కొన్ని సందర్భాల్లో ఆ కవిత్వమే  తార్కికులకూ సాంత్వన చేకూర్చే మంచి ఔషధం అవుతుంటుంది. అదే కవిత్వం విశేషం.
కవిత్వానికుండే మరో ప్రత్యేకమైన మంచి లక్షణం  చంచలత్వం.. దాని మూలకంగా సంతరించే తాజాదనం. ఒకే వస్తువును కొన్ని నిర్దేశిత సూత్రాలకు లోబడి పరీశీలించగలిగితే ఒకే వస్తువు లాగా నిర్థారించడం అసంభవం కాదు. కానీ  ఒకే వస్తువు కవులందరికీ ఒకే విధంగా కనిపించదు. మాట కొస్తే అదేవస్తువు అదేకవికీ అన్నివేళలా ఒకే రకంగా కూడా కనిపించదు. కాళిదాసునే  మేఘదూతం మళ్ళీ తిరగరాయమంటే సరిగ్గా అలాగే రాయగలడని భరోసా లేదు. చూసే సమయ సందర్భాలను బట్టి, ఆ సమయంలో  ఉండే రసస్థాయి ఆధారంగా  కవి వ్యక్తీకరణ ధోరణులు  మారుతుంటాయి. ఆటంబాంబు నిర్మాణసూత్రానికి మల్లే ఆడదాని ప్రేమభావనకి శుద్ధ నిత్యసత్య సూత్రం ఆవిష్కరించడం ఆమెను పుట్టించిన బ్రహ్మకైనా సాధ్యమవుతుందా? అటువంటి  అసాధ్యతలోనే కవిత్వపు అసలు తాజాదనపు సౌరభరహస్యం  దాగి ఉంది. గురజాడవారి మతం ప్రకారం ఆకులందున అణగి మణగి కూయడమే  కవిత్వపు భావనాశక్తి అసలు సిసలు సౌందర్యం.
భావనాశక్తి పలుమాయలు పన్నగల లీలా వినోదిని- అంటారు కట్టమంచి రామలింగారెడ్డిగారే 'కవిత్వతత్వవిచారము'లో మరో చోటనిజమే. కవి తన హృదయంలో అప్పటికి ఉప్పతిల్లిన భావాల అధారంగా చదువరిచేత రూపసందర్శనం చేయిస్తాడు. కవి సమకూర్చిన దూరదర్శినితోనే  చదువరికి వ్యోమసందర్శనం చేయక తప్పని పరిస్థితి. సందర్శనకు సత్యసంధతతో నిమిత్తం లేదు.  రసానుభూతి మాత్రమే అంతిమ లక్ష్యంఆంగ్లకవి టెన్నిసనులాంటి మహానుభావులైతే తమ అసమాన ప్రజ్ఞా పాటవాలతో నందిని పందిలాగాపందిని నందిలాగా సైతం చూపించ గల సమర్థులువిద్యుత్తరంగాల వేగంతో పాఠకుడి మనోయవనికమీద ఒక అత్యద్భుతమైన చలనచిత్రాన్ని ప్రదర్శించ గల గడసరులుమరుపురాని, అనిర్వచనీయమైన అనుభవాన్ని అందించడమే కవిత్వం అంతిమలక్ష్యం.
కాళిదాసులు,  భవభూతులు, పోతనలు, జాషువాలు, నాజర్లు, గద్దర్లు.. జనం నాలుకల మీద ఈనాటికీ  నాట్యం చేస్తూనే ఉన్నారంటే.. అలాంటి చిరంజీవత్వం కలగడానికి  కవిత్వానికి ఎంత ఉపజ్ఞత కావాలి! ఆ ఉపజ్ఞతను సృజించే కవి ఎంత సుకృతం చేసుకుని ఉండాలి!
వాల్మీకి లేనిదే రాముడు లేడు. వ్యాసులవారు  పూనుకోక బోయుంటే గీతాచార్యుడి ఆనవాలే మనకు దొరికి ఉండేది కాదు. తిక్కన అంత అద్భుతంగా కవిత్వరీకరించబట్టే పాంచాలి  లోకపరీక్షకు తట్టుకుని  గొప్ప సాథ్విగా  నిలిచింది. పెద్దనగారి బుద్ధికి ప్రవరాఖ్యుడు, సూరనగారి  సంగీత ప్రజ్ఞకి శుక్తిమతి, తెనాలి రామలింగ కవి చతురతకి సుగుణశర్మ పెద్దక్క.. ఇలా.. నాటి చేమకూర కవి విజయవిలాస కథానాయిక సుభద్ర నుంచీ ఇటీవలి  గురజాడవారి కన్యాశుల్కం తాలూకు  మధురవాణి వరకూ సహృదయుల మనసుల్లో శాశ్వతంగా గూడు కట్టుకుని ఉన్నారంటే.. ఆ పుణ్యమంతా  ఆయా కవుల ప్ర్జ్ఞజ్ఞా పాటవాలదే.   భూమి గుండ్రంగా ఉందన్న విశ్వాసం మరో సిద్దాంతం వచ్చి రద్దై పోవచ్చునేమో కానీ.. 'భూమిపుత్రిక సీత  రాముని
ఏకపత్నీ వ్రతానికి భూమిక' అన్న నమ్మకం ఎన్ని యుగాలు గడిచినా  జనం గుండెలనుండి చెదరిపోదు.
శాస్త్రవేత్తలకు ఉండే పరిమితులు  కవులకు  ఎందుకు ఉండవో.. కవులు భౌతిక సత్యాన్వేషకులకన్నా ఒక మెట్టు ఎప్పుడూ పైనే ఎందుకుంటారో ఈ ఒక్క ఉదాహరణ తరచి చూస్తే చాలు తేలిపోతుంది.   కాటికి సాగనంపిన పిదప.. ఫొటోచట్రాల్లో బిగించడంతో  కన్నవారి రుణం తీరిపోతున్నట్లు  నేటితరాలు భావిస్తున్న పిదప కాలంలో ఏ రక్తసంబంధమూ లేకపోయినా గుండెల్లో గుడులు కట్టించుకుని మరీ రాముళ్ళూ, కృష్ణుళ్ళూ, సీతలూ, సావిత్రులూ.. జనం నీరాజనాలు అందుకుంటున్నారంటే  ..  ఆ వైభవ ప్రాభవాల  వెనకున్నదంతా  ఆయా పాత్రల్ని సృష్టించిన  కవుల కలాలచలవే.
కవిగా పుట్టడం ఒక వరం. కొంచపడవలసిన అవసరం లేదు. వేలాదిమందిలో ఏ ఒకరికో గాని ఈ శారదాప్రసాదం లభించదు. ఆయాచితంగా లభించిన ఈ ఉపజ్ఞతావిశేషాన్ని మానవత్వపు విలువలు మరింత పెరిగే రీతిలో ఉపయోగించుకునే భాధ్యత మాత్రం కవులదేనని మరిచి పోరాదు*
కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు ఆధ్వర్యంలోని తెలుగు వెలుగు మాసపత్రికలో ప్రచురితం)




                                   

Saturday, June 6, 2015


అమరావతీ!.. అజరామరావతీ!
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి మందడం గ్రామంలోని సర్వే నెంబరు 135, 136లో  కోలాహలంగా భూమి పూజాకార్యక్రమాలు సాగాయ్! వేదపండితుల మంత్రాలతో మందడం  మార్మోగిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అపూర్వఘట్టం. తిలకించేందుకు  పెద్దసంఖ్యలో తరలివచ్చిన జనం. సతీసుత సమేతంగా చంద్రబాబు వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య నవరాజధాని అమరావతి నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంలో విశ్వవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరికీ శుభాభినందనలు!

నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి ఈ రోజు తొలి అడుగు పడినట్లే. కృష్ణానదీతీరాన విజయవాడ- గుంటూరుల నడుమ పాతఅమరావతికి చేయిచేరువులో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన శుభసంధర్భం ఇది.  ‘శుభ’ సందర్భమే!
నాలుగు శతాబ్దాలనాటి గొప్పనగరం భాగ్యనగరం.  రెండు దశాబ్దాలబట్టి ఒక నూతన ప్రగతికి నమూనాగా రూపుదిద్దుకొంటున్న అద్భుతనగరంకూడా. ఉమ్మడి రాష్రానికి రాజధాని అయిన కారణాన ఆంధ్రులూ అనివార్యంగా భాగ్యనగరి అభివృద్ధిలో భాగం పంచుకొన్నమాట వాస్తవం. వట్టి భాగస్వామ్యమేనా? భావనాత్మకమైన అనుబంధమూ ఆ బంధంలో ఉంది. అనేకానేక రాజకీయ, రాజకీయేతర కారణాలవల్ల ఆ పురావైభవాన్ని  సోదరులకు అప్పగించి నవ్యరాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పంతో ఆంధ్రుడు దక్షిణానికి తరలి వచ్చేసిన  సందర్భం. ఆంధ్రసోదరుడి ముందు ముందుగా నిలబడ్డ సవాళ్ళు రాజధాని, దాని నిర్మాణం. అనేకానేకమైన మునకల  పిదప కడకి  ఆ రాజధాని కృష్ణానదీతీరాన తేలింది. పాత అమరావతికి ఈవల అదే పేరుతో కొత్త నగరాన్ని నిర్మించుకోవాలనే సంకల్పం స్థిరపడింది.
వింధ్యకు దక్షిణానున్న దక్కను పీఠభూమి ప్రాంతానికి మొదటినుంచి మూడు ముఖ్యమైన రేవులు ఆయువులు. ఆగ్నేయాసియాతో వారసత్వంగా వస్తున్న వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలకవి జలసంబంధ బాంధవ్యాలు! దేశానికి  తూర్పుదిక్కున అత్యంత విశాల తీరప్రాంతం సహజసిద్ధంగాగల రాష్ట్రమూ ఒక్క ఆంధ్రదేశమే. పడమరనుంచి తూర్పుకి, తూర్పునుంచి ఆగ్నేయాసియా దేశాలకి ఏ పేచీలూ లేని  జలమార్గ వ్యాపారాలకి దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశే అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఈ ఆంధ్రదేశానికి దక్కను పీఠభూమి అనుకూలం. ఈస్టిండియా కంపెనీవాళ్ళు  వ్యాపారానికీ, తెల్లప్రభువులు  పరిపాలనకీ ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మక కేంద్రంగా ఎన్నుకోవడానికి ఈ నైసర్గిక రూపమే ప్రధానకారణం. ఆ నైసర్గికత తిరిగి రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రాధాన్యత సంతరించుకునే  పరిస్థితులు వచ్చిపడ్డాయి. ఆంధ్రులకి ఇది ఆయాచితంగా దక్కిన వరం.
‘చరిత్ర’ భౌగోళికాంశాల చుట్టూతానే ప్రదక్షిణం చేస్తుందని ఒక సూత్రం ఉంది. తదనుగుణంగానే కొత్త అమరావతి పాతఅమరావతికి పొలికేక దూరంలో  ఏర్పడుతోంది.
కాలంతో పాటు ప్రవహించే గుణం లేకుంటే క్షణం చాలు ప్రగతిస్పర్థలో వెనకబడేందుకు. కాటన్ దొర బ్యారేజీ కట్టిన తరువాత గోదావరీ ప్రాంతంలో  వ్యవసాయం మాత్రమే ముమ్మరమయింది, బియ్యం మిల్లులు కట్టి డబ్బులు గడించుకోవాలన్న దుగ్ధ దగ్గరే జనం దృష్టి నిలబడిపోయింది! కాలానుగుణమైన సాంకేతికాభివృద్ధిమీద యువతా బుద్ధి ప్రసరించకపోవడం ఆశ్చర్యమే! గతం గతః ! పై పై పొరగా కనిపించే పదమూడు జిల్లాల కొత్తరాష్ట్రం జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంత ప్రాధాన్యతను సంతరించుకొన్నదో ఇప్పుడైనా అర్థంచేసుకోవాలి. విభజనరూపంలో  ప్రస్తుతం వచ్చింది సంక్షోభం కాదు. సంక్షేమరంగాల అభివృద్ధికి సదవకాశం. ఆ దిశగా ఆంధ్రుడి ఆలోచన సాగాల్సిన తరుణమిది.
చైనా తన దక్షిణప్రాంతంలో పేర్చుకుపోతున్న ఆయుధసామాగ్రిని చూసి అమెరికా అసహనంగా ఉంది. ఆగ్నేయాసియా దేశాలమధ్య ఏదైనా ఓ కొత్త వ్యాపారబంధం ఏర్పడి బలపడితే అగ్రరాజ్యానికి అది బొత్తిగా నిద్రపట్టని కారణమవుతుంది. ఒబామా 2012లో రెండోసారి అధ్యక్షుడయిన వారం రోజులకే కంబోడియా సందర్శించారు. మునుపటి అధ్యక్షులెవరూ పట్టించుకోని ఆ చిన్నదేశానికి అమెరికా  విదేశాంగవిధానం ఇస్తున్న ప్రాధాన్యతనబట్టే  ఆగ్నేయాసియా ప్రస్తుతం అంతర్జాతీయంగా  ఎంత ముఖ్యస్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ కీలకస్థానానికి కూతవేటు దూరంలో కొత్త రాజధాని నిర్మాణం జరుగడంఆంధ్రుల అదృష్టం!
కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలో ప్రతిపాదనలో ఉన్న కేంద్ర  రాకెట్ లాంచింగ్ కేంద్రం, నెల్లూరు జిల్లా వాకాడు దగ్గర రూపుదిద్దుకొంటున్న  'నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ' శిక్షణా సంస్థలూ  కేంద్రం విదేశీవిధానంలోని మారుతున్న ప్రాధాన్యతలకు అద్దం పడుతున్నాయి.  రాష్ట్రస్థాయి హోంశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సముద్రతీర నిఘా విభాగం చాలు.. రాష్ట్ర తూర్పుతీప్రాంతం భద్రతాపరంగా  ఎంతటి ప్రాధాన్యత సంతరించుకొంటున్నదో అర్థం చేసుకునేందుకు!  తరుముకొచ్చే స్పర్థలకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచపటంమీద ఎంత 'స్ట్రాటజిక్’ పొజిషన్లో ఉందో అర్థమైతే అభివృద్ధికి సోపానంగా దాన్ని ఎలా మలుచుకోవచ్చో అవగతమవుతుంది.
సింగపూర్, మలేసియా, ఇండొనేసియా, మయన్మార్ వంటి  ఆగ్నేయాసియా దేశాలతో ఆంధ్రులకు గల సత్సంబంధాలు చాలా పురాతనమైనవి. ప్రముఖమైనవి. వారసత్వంగా వస్తున్నవి. సహజసిద్ధమైన జలరవాణా వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమయింది. శతాబ్దాల తరబడి కొనసాగే రవాణావ్యవస్థలు  రెండు కొసలనూ అనివార్యంగా ముడివేస్తాయి. ఆగ్నేయాసియా, ఆంధ్రదేశాల సంబంధాలు ఆ కారణంచేతే సహజబంధుత్వాలస్థాయికి ఎన్నడో చేరుకున్నాయి. కొత్తరాజధాని కూతవేటు దూరంలో సాకారమవుతున్న ప్రస్తుత తరుణంలో  దక్షిణాసియా దేశాల కదలికలు, నీడలు నవ్యాంధ్రలో అధికమవడాన్ని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. అభివృద్ధికాముకతతో ఆహ్వానించాలి. ముఖ్యరేవుపట్టణాలకు అందుబాటులోగల అమరావతిలో నూతన రాజధాని  సాకారమవడం నవీన   అభివృధ్ధి నమూనాకు శ్రీకారం చుట్టే చర్యగానే ఆంధ్రులం భావించాలి!
భారతదేశ తొలి తెలుగుప్రధాని పి.వి. ప్రతిపాదించిన 'Look to East' అప్పట్లో ఒక భావనాత్మకమైన ప్రతిపాదన మాత్రమే. కాలక్రమేణా ప్రపంచంమొత్తం తూర్పు వైపుకు చూపు మళ్లించుకోక తప్పని అంతర్జాతీయ పరిణామాలు రూపుదిద్దుకొంటున్న తరుణంలో..  నవ్యాంధ్రప్రదేశ్ తొలిముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నింగిలో ఎగిరే ఆ గాలిపటం దారాన్ని అమరావతికి ముడివేసారు. భారతీయుల ‘తూర్పు  చూపు’ భావనకు ఒక బౌతిక వేదిక నిర్మించే బాధ్యత  ఆ విధంగా ఆంధ్రులకు సమకూరినట్లు!   నూతన రాజధాని ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న పాత అమరావతికి కనుచూపుదూరంలోనే అన్నిహంగులతో రూపుదిద్దుకొనే శుభసందర్భంలో ఆంధ్రులందరికీ అభినందనలు. 
వేలాది ఎకరాల పచ్చని పొలాల గట్లు తెంపుకొని ఏకఖండ క్రీడారంగంగా  ఆటకు సిద్దవవుతున్న వేళ ఆంధ్రులూ అదే క్రీడాస్ఫూర్తితో ప్రగతి గోదాలోకి దూకాల్సిన తరుణం ఆసననమైనట్లే! శుభకామనలు!
***




Friday, June 5, 2015




మేఘాల మొహంచాటు!
మేఘాలకు,  నాయకులకు బోలెడడన్ని పోలికలు. గాలివాలునుబట్టి కొట్టుకుపోవడం ఉమ్మడి లక్షణం. మేఘాలకైనా, నేతల సిద్దాంతాలకైనా ఒక స్థిరమైన రూపమంటూ ఉండదు. ఉరిమే మేఘాలన్నీ కురవాలన్న నియమం ఏమీ లేనట్లే.. గర్జించే నేతాశ్రీలంతా చేతల్లో ఆ సత్తా చూపిస్తారన్న హామీ లేదు.
సూర్యరశ్మి వేడికి నేలమీది నీరు ఆవిరిగా మారి పైన మేఘంలా తయారవుతుందని కదా మనమందరం బడిపాఠాల్లో చదువుకొంది?! నాయకుడి తయారీకీ సరిగ్గా ఇదే సూత్రం! గల్లీల్లో తిరిగే ఏ చిల్లరగాడిమీదో పైవాడి చల్లనిచూపు పడితే చాలు..  ఆ అదృష్టవంతుడు అలా.. అలా పైకిపోయి చివరికి ప్రజానాయకుడై నేరుగా  మననెత్తిమీదకే  దిగుతాడు.
మబ్బులు వాటంతటవే సాధారణంగా వానజల్లులు కురిపించవు. నేతలూ వాళ్లంతటవాళ్ళే జనాలమీద వరాలవాన ఎప్పుడూ కురిపించరు. వాతావరణం చల్లబడాలి. లేదా కదిలేమేఘం ఏ కొండకొమ్ముకో 'ఢీ' కొట్టాలి. అప్పుడుగాని మబ్బులు గుప్పెడు  తుప్పర్లు రాల్చవు. పైవాడు దగ్గరకు పిలిపించుకొని మందలించకపోతే, రాజకీయంగా ఉక్కపోత ఎక్కువ కాకపోతే- ఏ ఒక్క నాయకమ్మన్యుడైనా జనాలకి పనులు చేసిపెడతాడా!
నేలమీదకు చేరే నాలుగు చినుకులూ కాలువల్లోకి పారి పంటపొలాలను తడపాలన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎగువనున్న అదృష్టవంతులు ఎవరైనా దారికాసి ఆ కాసిని నీళ్ళుగాని మళ్ళించుకుపోతే.. దిగువన్నున్న దౌర్భాగ్యానికి మనకు  చివరకు మిగిలేది పంట బీడుపడిందన్న దిగులే! నేతల చేతుల్లోని నిధులు జనందాకా ప్రవహించే సందర్భానికీ  సరిగ్గా ఇదే సూత్రం వర్తిస్తుంది.
కురవకపోతే మానె.. కాసే ఎండలకూ అడ్డొచ్చి ఆరేసుకొన్న బట్టలనూ ఆరకుండా చేస్తాయి కొన్ని మబ్బులు. జనం ఎన్నుకొన్న కొంతమంది నాయకులదీ అదే తంతు. జనాలకు పనికొచ్చే పనులేవీ చేయకపోగా.. పైనుంచి వచ్చే  నిధులకూ మోకాలడ్డే బకాసురులు ఎందరో ! మబ్బులకేమీ స్వలాభం ఉండకపోవచ్చు. డబ్బుపిచ్చి నేతలు మాత్రం అలాకాదు.  సొంతలాభం రవంతయినా కనిపించని పక్షంలో  సైంధవపాత్ర పోషించడం ఖాయం.
ఇంత కష్టపడి మబ్బులకు, నేతలకు మధ్య ఇన్నేసి పోలికలు  ఇప్పుడు కనిపెట్టడం  ఎందుకని కదా  సందేహం?!
నైరుతి మొదలవబోతోంది. అయినా ఆకాశంలో రుతుపవనాల జాడ కానరావడం లేదు.  రైతన్నలు దుక్కిదున్నుకొని  ఆకాశంవంక ఆశగా మోరెత్తి చూస్తున్నారు. ఎండిన బీళ్ళు-  పరదేశంనుంచి తరలివచ్చే బిడ్డకోసం కలవరించే కన్నతల్లిలా వళ్లంతా కళ్ళు చేసుకొని ఎదురుచూస్తున్నాయి. గెలిచి  రాజధానిచేరినాక   చేరదీసిన జనం వంక తేరిపార చూడని ప్రజాప్రతినిధికి మల్లే మబ్బులూ మొహం చాటేస్తున్నాయి!
ప్రజాస్వామ్య విలువలతో పోటీపడుతూ  రుతుపవనాలూ రోజురోజుకూ బలహీనమవుతున్నాయి!  
తీవ్రమైన వత్తిడివస్తే తప్ప నమ్ముకున్న జనాలకేమీ  స్వచ్చందంగా చేయని నేతప్పల్లాగా.. అల్పపీడనానికి, అధికపీడనానికి మినహా  స్పందించడమే లేదు కారుమేఘాలు! ప్రత్యేకహోదామీద మోదీసర్కారు తీరుతో పోటీకి దిగుతున్నాయా నైరుతి పవనాలు?!  
కోరుకొన్న పక్షమే అధికారంలో కొచ్చినా.. కోరుకొన్న రీతిలో పనితీరు చూపనట్లు.. వేళకే  కేరళ తీరాన్ని తాకినా,, తెలుగునేలమీదకొచ్చేసరికి సరిపడా సహకరించడం లేదు  రుతుపవనాలు!
జనంలో తిరిగేందుకు జంకే నేతలకు మల్లే తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించేందుకు ఎందుకా సంకోచం?! మన ఓట్లతో గెలిచి పొరుగుసేవలకోసం పరుగులుతీసే నేతలకు   నైరుతీ పవనాలేమన్నా తాతలా? తెలుగు రాష్ట్రాకాశాలమీద పరుచుకొనే మేఘమాలకు ఎప్పుడూ  ఎక్కడో పశ్చిమంమీద ఎందుకో ఆ పక్కచూపు? ఉత్తరాన ఉరమడాని ఆ ఆగమేఘాలమీద ఆ ఉరుకులెందుకో?  తెలుగునేతల వత్తిడి మోదీసర్కారుమీద పనిచేయనట్లే .. మన సముద్రాల్లోని అల్పపీడనాలు స్వల్పంగానైనా రుతుపవనాలమీద ప్రభావం చుపించడం లేదే! మేఘాలకు, నేతలకు మధ్య ఇప్పుడీ సాపత్యాలెందుకయ్యా అని మీరు గయ్యిమంటారని తెలుసు.
ముఖ్యమంత్రుల సమావేశాలకు ముఖ్యమైన మంత్రులే మొహాలు చాటేస్తున్నారు. ఉపాధి పథకాలు, ఉద్యోగాల కల్పనలు, ఉపకారవేతనాలు, ఉద్యోగుల బకాయిలు- ఊసెత్తితేనే చాలు  సర్కారు పెద్దలు మొహాలు  పక్కకు తిప్పుకొంటున్నారు’. పార్టీ వ్హిప్పుల్నే పట్టించుకోకుందా ఎన్నికల్లో అభ్యర్థులు మొహాలు చాటు చేసుకొంటుంటే.. మా మొహాలుమాత్రమే  చాటలుగా మార్చి  కుంభవృష్టి కురిపించాలా?’ అని నిగ్గదీస్తున్నాయి విరగ్గాసే  ఎండలు మాటున చేరి వెండిమబ్బులు!
సరే! ఎవరికి వాళ్ళు సమయం దొరికింది కదా అని మొహాలు చాటుచేసుకొంటో జనాలతో ఆటాడుకొంటున్నారుగదా! మళ్లీ ఎన్నికలంటూ రావా? ఓట్లడుక్కుంటూ  నేతలు గుమ్మాలముందుకొచ్చి   నిలబడరా! అప్పుడూ ఇలాగే నైరుతీ రుతుపవనాల మోడల్లో  ఓటర్లూ మొహాలు చాటేస్తే! అసలు పోలింగుబూతులకే పోకుండా పొరుగూరు కొత్తసినిమా చూడ్డానికి చెక్కేస్తే!
-కర్లపాలెం హనుమంతరావు
***
(28-06-2011 - ఈనాడు - సంపాదక పుట గల్పిక)


Thursday, June 4, 2015


పెరుగుట (నడ్డి) విరుగుట కొరకే!
తెలుగువాడు పాలిటిక్సులో ఎంత చురుకో.. పాకశాస్త్రంలో అంతకు మించి చురుకు! తింటే గారెలే తినాలనుకొనే  చాపల్యం తెలుగునాలికది.
నలుడికి, భీముడికి నవగాయ పిండివంటలు రుచికరంగా చేయడం నేర్పింది తెలుగువాడే! పంచదారకన్న, పాలమీగడకన్న, జుంటి తేనియకన్నా, జున్నుకన్న, వెన్నకన్న, దోరమాగిన మామిడికన్న తనపలుకే తీపిగా ఉంటుందని డప్పుకొట్టుకొంటాడు తెలుగువాడు. పాకశాస్త్రంమీద ఎంతో పట్టు ఉంటేగాని ఇంతటి జ్ఞానవంతమైన 'ఉప్మా'నాలు ఊహలకు తట్టవు సుమా!
పరమాత్మతత్వాన్ని పరిచయంచేసే ఆంధ్రభాగవతం మాత్రం?! సందుచూసుకొని మరీ బమ్మెర పోతనామాత్యుడు గొల్లపిల్లల వేళ్ళసందుల్లోని మాగాయపచ్చడి పసందునుగూర్చి  నోట నీరూరించే సుందరశైలిలో వర్ణించేసాడు. ఇహ కర్పూరవిడియాన్నిగూర్చి  కవిసార్వభౌములవారు  చెప్పుకొచ్చిన విశేషాలకు కొదవే లేదు!
'భరత ఖండా'న్ని ఒక  చక్కని పాడియావుతో పోల్చాలన్న గొప్ప తలపు  తెలుగువాడికికాక మరెవరికి తడుతుందబ్బా!  చిక్కని పాలమీది మిసమిసలాడే మీగడను పంచదారతో కలిపి నంచుకున్నట్లు రామామృత రూపలావణ్యాలను ప్రేమ దాస్యాలనే దోసిళ్లతో జుర్రుకొంటానం'టాడు భద్రగిరి రామదాసు! ‘ఓ రామ! నీ నామమెంత రుచిరా! ఎంత  రుచి.. ఎంత రుచి.. ఎంత రుచిరా!’ అంటూ అన్నేసి మార్లు చంటిపిల్లకు మల్లే   లొట్టలేసేటంత చాపల్యం తెలుగు నాలికకి కాక మరెవరి నాలిక్కుంటుందీ!    
అలంకారాలలో ఉపమాలంకారం, పండుగల్లో అట్లతద్దె తెలుగువాడి ప్రత్యేకతలు. బిడ్డ- పేగు మెళ్ళో వేసుకొని పుడితే మేనమామకు అరిష్టమని నమ్మకం. అయినా సరే.. కరకరలాడే  గారెలుగాని ఓ బాండీడు దండిగా వండించి దండగా మేనబిడ్డ మెళ్లో వేయించేస్తే సరి.. అరిష్టం గిరిష్టం చిటికెలో మటుమాయంట! ఎంత తిండిపోతులు కాకపోతే  తెలుగువాళ్లకి ఇంత వింతైన చిట్కాలు తడతాయి!
బందరులడ్డు, కాకినాడకాజా, హైదరాబాదుబిర్యానీ.. ఊరుకో ఖాద్యంపేరు తెలుగునాట! ఊళ్ళపేళ్ళకన్నా   తినుబండారాలపేర్లే తేలికైన బండగుర్తులు కాబోలు తెలుగుబుర్రలకు!
తెలుగు పిల్లలుకూడా 'కాకి- రొట్టె'లాంటి కథలంటేనే లొట్టలేసుకొంటూ వింటారు! 'తిండి గలిగితే కండగలదోయ్! కండకలవాడేను మనిషోయ్!' అంటూ గురజాడవారిదీ  తిండిదండకమేనాయ! ‘రొట్టెముక్క, అరటి తొక్క.. ఏదీ పక్కకు తీసిపెట్టేది కాద’ని రుక్కుల్లో మహాకవి శ్రీ శ్రీ నే అంత నొక్కిచెప్పిం తరువాత ఇహ తెలుగువాడి జిహ్వచాపల్యాన్నిగూర్చి  వేరే  చర్చ అవసరమా!
పరబ్రహ్మను  సరే..  పకోడీలనూ వదలకుండా పద్యాలు అల్లేడే మన తెలుగుకవి! 'పీత్వా పీత్వా స్వర్గలోకమ్ అవాప్నుయేత్' అని  ఓ కాఫీగత తెలుగుజీవి కితాబు! అన్నట్లు రాగాలలో సైతం కాఫీరాగం అంటే తెలుగువాడికెందుకో అంత ప్రత్యేకాభిమానం!
గోంగూర పేరు చెబితే గంగవెర్రులెత్తిపోతుంది తెలుగుమనసు. పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలాంటి  దేశాలు పట్టిపోతోంటే వాళకి ఏ  పచ్చళ్ళు ప్యాకు చేసి పెట్టాలా అని తెలుగుతల్లులు తల్లడిల్లిపోతుంటారు. సాఫ్టువేరంటే ఇప్పుడొచ్చిందికానీ, అప్పట్లో అంతర్జాతీయంగా తెలుగువాడికి  ఖ్యాతితెచ్చింది ఊరగాయ పచ్చళ్ళేగా! తెలుగువాడి గుత్తొంకాయకూరమీద ఇంతదాకా ఎవరూ పరిశోధనకు పూనుకోలేదు! ఎంతాశ్చర్యం!
ఉల్లిచేసే మేలు తల్లికూడా చెయ్యదని కనిపెట్టింది కచ్చితంగా తెలుగువాడే అయుండాలి. వేపాకును రెబ్బనుకూడా వదిలిపెట్టడు తెలుగువాడు. 'తినగ తినగ వేము తీయగనుండు' అని దానికీ ఓ ప్రయోజనం సాధించిన మొనగాడు మన తెలుగువాడే!
'మాయాబజారు' చిత్రంమీద ఆ తొలినాటిమోజు తెలుగువాడికి ఎన్ని తరాలు గడిచినా తీరిపోదు. ఎందుకో తెలుసా? ' పెళ్ళివారికని చేసిన వంటకాలన్నింటినీ ఘటోత్కచుడు వంటింట్లోదూరి ఒక్కొక్కటే ఠకాల్ ఠకాల్మని లాగించేస్తాడు చూడండి! ఆ ఒక్క దృశ్యంకోసమే ఎన్నొందలేళ్ళయినా విసుగులేకుండా తెలుగుప్రేక్షకుడు ఆ  చిత్రాన్నాదరిస్తాడు! ఆహా! ఆ 'వివాహ భోజనం'లోని అనుపాకాల పేర్లు విటుంటే చాలదూ.. తెలుగునోటెంట లాలాజలం గంగాజలంలా వరదలై  వూరేందుకు!
పెళ్ళిని  పప్పన్నమని ముద్దుగా పిలిచేది ప్రపంచంమొత్తంమీద ఒక్క తెలుగువాడే! అప్పుచేసైనా సరే పప్పుకూడు తినడం తెలుగువాడిలి తప్పుకాదు. పైపెచ్చు గొప్పకూడాను! పిండివంటల  ఊసులేకుండా ఏ తెలుగు పండుగైనా  ఉంటుందేమో చెప్పండి చూద్దాం! ఒకానొకప్పుడు పెళ్ళిచూపుల్లో మగపెళ్ళివారు ఆడపిల్లని అడిగే ముఖ్యమైన ప్రశ్నే'వంట'ను గురించి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని తెలుగువాడికి తెలిసినంతగా మరో భాషవాడికి తెలుసా?
క్షీరసాగరమధన సమయంలో  నోరున్న తెలుగువాడుగాని ఉండుంటే అమృతం చిలకడానికన్నా ముందు ఓ అరకప్పయినా  కాఫీ కడుపులో పడాలని పేచీ పెట్టుండేవాడు. తిండిపోతుపోటీలు  ఒలంపిక్సులో  జరుగుతుంటే.. తెలుగువాడికే ఎప్పుడూ కప్పులూ సాసర్లూ!
తెలుగురాష్ట్రాన్ని 'పూర్ణగర్భ'గా చెప్పుకొని రొమ్మువిరవడం ఒక్క తెలుగువాడికే చెల్లింది. రైతన్నను ‘అన్నదాత’ అని గౌరవించే సంప్రదాయం  తెలుగువాడిదే! ఇప్పుడంటే ఎక్కడబడితే అక్కడ మందుపాతర్లుకానీ.. మొన్న మొన్నటి వరకు అడుగడుక్కీ బియ్యంపాతర్లే కదూ కృష్ణాగోదావరీ తీరాల్లో!
తెలుగువాళ్ళకు మల్లే తెలుగుదేవుళ్లకీ ప్రసాదాలంటే సాదాసీదా ఇష్టం కాదు. తిరుపతి లడ్డుకు తిరుపతి వెంకన్నకున్నంత గ్లామరు! రుద్రాక్షమాల తిప్పే సన్యాసిగాని తెలుగువాడైతేనా! 'ద్రాక్ష' మాట చెవినబడంగానే  దీక్ష .. గీక్ష జాన్తానై!  పుంజాలు తెంపుకొని పరుగందుకోడూ!  
పాల, మీగడలకోసం బాలగోపాలుడిచేత పోతన చేయించిన ఆగడాలు అన్నా ఇన్నా?!
'ఇంతకీ ఈ తిండిగోలంతా ఇప్పుడు  దేనికండీ?'  అనికదూ తమరి సందేహం! కందిపప్పు కిలో వంద అందుకుంటోంది. ఎండుమిర్చి కిలో డెబ్బయ్ పైమాటే! వేరుశనగనూనైతే సెంచరీకొట్టి ఏడాది దాటింది! చక్కర ధరవింటె నోరు చేదెక్కుతోంది! ఉల్లి కొనకముందే కంటికి నీళ్లు! పాతబియ్యం సామాన్యుడు కొని తినే స్థాయిలో ఉన్నాడా?! అన్ని దినుసుల విహారం ఆకాశ మార్గానే!  ఎండల్లాగే మండుతున్నాయి ధరలు.  ఆ కడుపుమంట చల్లారడానికేనండీ ఇన్ని తిప్పలు!
శ్రీకృష్ణపరమాత్ముడీ సీజన్లోగాని సీనులోకొచ్చుంటే పదహారువేలమంది గోపికలను భరించలేక అర్థాంతరంగా అవతారం చాలించుండేవాడు! అన్నబలమే అన్నిబలాలకూ మూలమన్నారు కదా పెద్దలు! దశకంఠుడుగాని ఆ మాటవిని తన పదినోళ్లకు ముప్పూటలా ముద్దందంచాలనుకొంటే  లంకను ఏ అమెరికన్ బ్యాంకుకో తాకట్టు పెట్టక తప్పేది కాదు!  ద్వాపరంలోకనక  తలా ఓ వూరిస్తే చాలని కౌరవులతో కాళ్లబేరాని కెళ్ళారు పాండవులు. అదే  ఈ కరువుకాలంలో అయితేనో?! మినిమమ్ ఓ ఐదుమండలాలకు తగ్గకుండా డిమాండు ఉండుండేది!  బకాసురుడు రోజూ ఓ బండెడు అన్నం, పప్పూ కూరలు, నంజుకుకునేందుకు ఓ మనిషి కావాలని షరతు పెట్టాడు విరాటపర్వంలో!  ఒక్క మనిషి మినహా అన్నంకూరలను అంబానీసోదరులైనా కొని తట్టుకోగల స్థితిలో లేదు  కాలం!
వేలు పోసినా నాలుగువేళ్ళూ నిమిషంపాటైనా నోట్లోకి పోవడం గగనంగా ఉంది. పెరిగే ధరలను గూర్చి నిలదీస్తారని భయం! తిరుపతి గుళ్ళో భక్తుల్ని స్వామివారిముందు కనీసం కనురెప్పపాటైనా  నిలబడనీయడం లేదు! ఈ కరువు కాటకాలిలాగే కొనసాగితే చివరికా భద్రాద్రిరాముడికి కూడా  'శబరి' ప్రసాదమే మహానైవేద్యమవుతుందేమో!
సౌదీ అరేబియాలో భర్తకు  చాయినీళ్ళు పోయని  ఇల్లాళ్ళకు ఈజీగా విడాకులిచ్చేయచ్చంట! ఇక్కడా అలాంటి గృహవిచ్చిన్నాలు  ఘోరంగా  పెరక్కముందే ఉభయ సర్కారులు మేలుకొంటే మేలు.

కైలాసంలో మజ్జిగ దొరక్కే శివుడు నీలకంఠుడయాడని, వైకుంఠంలో మజ్జిగ దొరికుంటే విష్ణుమూర్తి నల్లబడేవాడు కాడని. అమృతానికి బదులు మజ్జిగ్గాని వాడుంటే స్వర్గాధిపతి మరీ అంతలా డీలా పడడని, మజ్జిక్కి దూరంగా ఉన్నందువల్లే లంబోదరుడికా బానబొజ్జ ప్రాప్తించిందని .. 'యోగరత్నాకరం' మొత్తుకొంటోంది. ధరలు దారుణంగా పెరిగే రోజుల్లో  'పెరుగు' 'పెరుగు' అని కలవరించకుండా ఓ కుండనిండా చల్లని మజ్జిగ చిలుక్కొట్టుకొని తాగితే వంటికి, ఇంటికి మంచిదని చిట్కా! మంచిదే కానీ..  ఆ పెరుగు వచ్చే పాలుమాత్ర్రం సర్కారుసారాలా ధారాళంగా ఏమన్నా పారుతున్నదా దేశం నలుమూలలా? 
మంది ఎక్కువైతే  పెరుగు దానిపాటికదే మజ్జిగ అవుతుంది. నిజమేకాని, ధరలూ అలా ఆగకుండా ఆకాశంలోకి పెరుగుతూ పోతుంటే ఆ మజ్జిగా చూరునీళ్లకన్నా జావగారొచ్చు! 'పెరుగుట   విరుగుట కొరకే' అంటారా! బాగుంది. ఆ విరగుడు కార్యం జరిగే లోపల మన తెలుగు నడుములు విరక్కుండా ఉండాలి కదా తమ్ముళ్లూ!
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- సంపాదకీయం పుట గల్పిక- 07-06-2009)

Tuesday, June 2, 2015

కవిత ప్రశ్నల బేతాళుడు.. కుపించుటలేదు ! - కర్లపాలెం హనుమంతరావు




కవిత 
ప్రశ్నల బేతాళుడు.. కుపించుటలేదు !
- కర్లపాలెం హనుమంతరావు 

అన్నం ముద్దలో సున్నం కనపడుతున్నా
తాగే నీళ్లల్లో నాచు తేలుతున్నా
కడుపు నింపుకోవటమే 
మేటి సిద్ధాంతం మాకు!

ఎత్తిన చేతులకు 
పసిడి కడియాలు 
తొడుగుతున్నప్పుడు
వేలెత్తి చూపించి 
నెత్తికి తెచ్చుకోవడమెందుకు? 

బతుకు 
బజారు అమ్మకం సరుకైన తరువాత
తిరుగుబాటు కాదు
జరుగుబాటే మేలు 

కుర్చీలని  ప్రశ్నించి 
గోడ కుర్చీలేయట మెందుకు ?

శిలలను ధిక్కరిస్తే 
శిలువలే కదా 
దక్కే బహుమానాలు!

కౌరవుల పాలనలో 
పాండవులు మాత్రం  
అజ్ఞాతంలో లేరూ!

సత్యానికి విజయం 
తథ్యం  మంటావు
నిజమే   
చివరి సీనులో కదా 
జయం ప్రత్యక్షం ? 

అందాకా అయినా 
మందలో గొర్రెల్లా
నలుగురితో నారాయణా...!

టూత్‌పేస్ట్ యాడ్ 
నవ్వుల పోటీకైనా
వెనకుండిపోవడం 
వట్టి వెర్రిబాగులతనం 

అందుకే 
మా మెదడు దుకాణంలో 
ప్రశ్నల స్టాకు లుండవు!

బదులు చెప్పే ధర్మరాజులు 
కరువైనప్పుడు
ప్రశ్నలడిగే యక్షుడవడం 
 వృధా గదా!

జీవిత 
పరమపద సోపానపటంలో
నిచ్చెలకు మించి  
పాములే ఉన్నప్పుడు 
తోకలను పట్టుకునైనా 
పైకెగబాకటమే 
 'ఆర్టాఫ్ లివింగ్'!

అందుకే 
మెదడులోని భేతాళుణ్ణి
ప్రశ్న కథలడకుండా 
ఎన్నడో   తన్ని తరిమేశాం!
***

కూరగాయలు- క్రూరగాయాలు
బంగారంధర పడిపోయిందనో.. వెండిధర కొండెక్కిందనో గుండెలు బాదేసుకొంటున్నాం!  రోజూ కంచంలో పడే కూరముక్కలకు రెక్కలెలా మొలుస్తున్నాయో తలుచుకొనే  నాధుడే కనిపించడం లేదెక్కడా! ఏ నోటవిన్నా మండే ఎండల్నిగురించేగాని, మండిపోయే కూర మండీలను గురించి ఆర్తనాదాలేవీ!
మా పెద్దన్నయ్యగారమ్మాయి కొచ్చిన బంగారంలాంటి సంబధం ఈ పాడుకూరగాయల మూలకంగానే తప్పిపోయింది. కట్నాలు. కానుకలు, పెట్టుపోతలంటే.. ఎన్ని కోట్లయినా ఏదో తలతాకట్టు పెట్టైనా తట్టుకోవచ్చు. పెళ్ళివారికి ముప్పూటలా విందుల్లో క్రమం తప్పకుండా నాలుగు రకాల నవగాయకూరలు వండి వడ్డించాలంటే .. నడ్డి నిలబడేనా? రూపాయలంటే ఏదో తంటాలుపడి తెచ్చిపోయచ్చుగానీ.. కూరగాయలు ఏ దొడ్డిలో సృష్టించి తేగలం ఈ కటిక  కరువు రోజుల్లో?!
శ్రీకృష్ణుడంతటివాడు ద్వాపరంలో తూకంలో ఒక్క తులసాకుకే తూగాడంటే ఏమోలే.. పురాణం కథ కదా అనుకున్నాం. నిజమేంటో ఈనాటికి అనుభవపూర్వకంగా తెలుసుకొంటున్నాం. అప్పుడూ ఇప్పట్లానే ఏ మహా కరువుకాటకాలో వచ్చి పడుంటాయీ! అందుకే పాపం..  అంతలావు నవనీత ప్రియుడూ వట్టి తులసాకు రెబ్బకే సిబ్బెలోనుంచి దూసుకొచ్చేసాడు!  దేవుళ్లకీ తప్పలేదన్నమాట కరువుకాటకాల శాపం!
అంతకుముందు అవతారాల్లో మాత్రం? చెంచులక్ష్మి నరసింహస్వామంతవాణ్ణి పట్టుకొని 'చెట్టులెక్కగలవా.. ఓ నరహరీ? పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి చిటారుకొమ్మన చిగురు కోయగలవా?' అంటూ వెంటబడింది! కాబోయే దంపతులేగదా.. సరసాలకేదో అనుకొంటున్నారనుకొన్నాంగాని, సరసమైన ధరలకు చివరికి చింతాకు చిగురైనా దొరకనంత కరువొచ్చిపడిందని   తెలుసుకోలేక పోయాం. కనీసం కాయో కసరో ఐనా  పోగేసుకు రాలేని పోరణ్ని చెసుకొంటే  సుఖపడేదేముండదన్న జ్ఞానం ఆ నాటి అడవిపిల్లలకే  వచ్చేసిందన్న మాట!
ఇప్పుడూ అదే వరస! అబ్బాయి ఏ ఐఐటీనో చదివి గొప్ప ఉద్యోగంచేస్తున్నా నెలకెన్ని లక్షలు  తెచ్చిపోస్తాడని కాదు ఆడపిల్లలు చూస్తున్నది.  వారానికో సారైనా కనీసం కూరలోకి  క్యాబేజీ పూవైనా కొని తేగల మొగాడేనా మగడు?'అని చూసుకొంటున్నారు!
కాకిముక్కుకి దొండపండని  ఎద్దేవా చేసేరోజులు వెళ్ళిపోయాయమ్మా! ముక్కుకి దొండపండుంటే కాకి అయినా సరే కోకిలకన్నా  రేటెక్కువ పలికే రోజులు నాయనా! ముదిరితే బ్రహ్మచారి పనికి రాడేమోగాని..  ముదురుదో, ముచ్చదో అసలు ఏదో  కూరగాయంటూ ఓటి కంటబడితే చాలు బ్రహ్మానందపడిపోయే రోజులు బాబూ ప్రస్తుతం  తన్నుకొస్తున్నవి! బిడ్డల్ని బంగారుకొండలని కాదు.. 'బంగాళాదుంప గంపల'ని గారాబంచేసే రోజులొచ్చి పడ్డాయి మరి! గాభరా పడితే ఎలా?
నిండుసభలో చెల్లమ్మకు పరపరా చీరెలు తానులకొద్దీ సరఫరా చేసిన నల్లనయ్యయినా సరే.. ఆ ముద్దుల చెల్లాయి సర్దాగా 'ఓ తట్ట కూరగాయలు తెచ్చి పెట్టరాదా!' అనడిగితే? తెల్లమొగమేయడం ఖాయం! అంతలావు కటిక కరువురోజులొచ్చి పడ్డాయి చివరకు!
అక్షయపాత్ర మాహాత్మ్యం ప్రస్తుత కాలంలో చెల్లనే చెల్లదు. మొన్న కార్తీకమాసంలో మా కాలనీవాసులు వనభోజనాలని ఓ.. ఒహటే ఊగిపోయారు! కానీ చివరాఖరికి ఉసిరావకాయ పిసరంతైనా   నాలిక్కి రాసుకోకుండానే 'భోజనాంతకాల గోవిందనామస్మరణలు' కొట్టుకొన్నారు!
మొన్నటి దసరా పండక్కి మా సత్తెయ్యగారింటికొచ్చిన కొత్తల్లుడుగారు మాత్రం? అందరం ముందనుకొన్నట్లు ఏ కొత్తమోడలు బైకో మార్పించివ్వమని అడగలేదు! బట్టలకు బదులు  కూరగాయబుట్టలు కొనివ్వమని అలకపానుపెక్కాడు! దీపావళి వచ్చిపోయినా దిగతేనే మానవుడు! 'ఉల్లిపాయ టపాసులంటే ఎన్నివేలైనా ఎలాగో కొనివ్వగలంగానీ.. నిజం ఉల్లిపాయలు. కరేపాకు, కొత్తిమేర కట్టలంటే.. ఈ కరువుకాలంలో ఎక్కణ్ణుంచి తేగలం?' అనా మామగారు ఒహటే మొత్తుకోళ్ళు! 
మా తోడల్లుడుగారు కొంతకాలంగా బ్యాంకులాకర్లలో బంగారం, దొంగపత్రాలకు బదులు.. బంగాళా దుంపలు, కందలువంటి నిలవగడ్డలు దాస్తున్నాడని వినికిడి. ఆయనేమన్నా నాకూ  సాయపడతాడేమోనని ఫోనుచేస్తే 'బ్రదర్! ఇలాంటివన్నీ ఫోనులోనా అడుగుతావు! కొంపలంటుకుపోవూ!  అసలే నామీద ఆదాయప్పన్ను వాళ్ళ కన్ను ఎప్పట్నుంచో పడుంది గదా' అంటూ బాగా మందలించాడు. ఆయనగారంటే గవర్నమెంటాఫీసులో అదేదో శాఖతరుఫున గుత్తేదార్లకు పన్లప్పగించే సీటులో ఉన్నాడు! పెద్దమనుషులు పెద్దపెద్ద పన్లకోసం ఇదివరకు మల్లే చేతులూ అవీ తడపటం లేదట!  బల్లకింద కూరగాయల బస్తాలు దొర్లించిపోతున్నారని వాళ్లావిడ మా ఆవిడతో  గొప్పలు చెప్పుకొంటున్నది!
నన్నడిగితే సిబిఐవాళ్ళు నిజంగా దాడులు నిర్వహించాల్సింది ఎర్రచందనం దుంగలమీద కాదు. ఎర్రగడ్డలు దొంగలమీద. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎవరెవరు  ఎంతంత  సరుకు  ఏ ఏ దేశలకు అక్రమంగా తరలించుకుపోతున్నారో!
అఫ్జల్ గురువంటి ఏ కొద్దిమందికో తప్ప ఇప్పుడు దేశంలో ముప్పూటలా కంచంనిండా కరేపాకు చారైనా కలుపుకు తినే అదృష్టం ఎంతమందికుందంటారు?!
ఫోర్బ్స్ పత్రిక అడపా దడపా ప్రకటిస్తున్న జాబితాలోని కుబేరులైనా కడుపునిండా కూరా.. నారా.. కలుపుకొని తృప్తిగా భోంచేస్తున్నారని గట్టిగా చెప్పలేని పరిస్థితి. పిల్లకాయలు 'పీచుబీరకాయలంటే ఏంట'ని అడిగితే ఏ ప్రదర్శనశాలకో తీసుకెళ్ళి ఏ జనపనార మోడళ్లనో  చూపించాల్సిన దౌర్భాగ్యం.
సర్కారుగాని, స్వచ్చందసంస్థలుగాని ప్రోత్సాహక పురస్కారాలిచ్చే సందర్బంలో 'పర్సులు' గట్రా బహూకరించకుండా..  కూరగాయలు.. రకానికొకటిగా.. కలగలిపి.. కలగూరగంపగా ఓ గంపెడు పురస్కార గ్రహీత నెత్తిమీద పెడితే.. మిగతా వారికీ .. కనీసం ఆ కాయగూరలకోసమైనా.. ఓ సత్కార్యం నిజంగా చెయ్యాలన్న సద్భుద్ధి కలుగుతుందేమో!.
మళ్లీ వచ్చే ఎన్నికలదాకా ఈ కరువు ఇలాగే కొనసాగితే? 'నమో' సర్కారే నగదు బదిలీ పథకం నమూనాలో ఉచిత కూరగాయల పథకమేదో ఒకటి  మొదలు పెడుతంది. ఆ అచ్చేదిన్ వచ్చేలోపలే కూరగాయల ధరలు దిగిరావాలని నా కోరిక!
***
 


Monday, June 1, 2015

అనగనగా ఓ గాడిద- రచన - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక - 13 -10-2019 - ప్రచురితం )



అనగనగా ఓ గాడిద

అనగనగా ఓ గాడిద. దానికి బతుకుమీద విరక్తిపుట్టి రేవులో మునిగి చద్దామని బయలుదేరింది. చివరి నిమిషంలో దేవుడు ప్రత్యక్షమై 'ఏవిటి నీ బాధ?' అని అడిగాడు. 'కోకిలమ్మకు కమ్మటి గొంతిచ్చావు. కోతిబావకు గెంతులిచ్చావు. నెమలికన్నెకు అందమైన ఈకలిచ్చావు. మా జాతిదే అయిన గుర్రానికీ మంచి తేజాన్నిచ్చావు. సింహాన్ని సరే వనానికే మహారాజుని చేసావు. చివరికి చిట్టెలుకక్కూడా గణాధిపతి వాహనంగా గౌరవమిచ్చావు. నేనేం పాపం చేసానని నాకీ గాడిద బతుకిచ్చావు?! గాడిదచాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను. చీదరింపులకు అంతే లేదు. ఇన్నిన్ని అవమానాలు పడుతూ బతికేకన్నా ఈ రేవులో పడి చావడం మేలు' అని ఘొల్లుమంది గాడిద.
'ముందా కొళాయి కట్టేయ్! ఏం జన్మ కావాలో కోరుకో!' అన్నాడు దేవుడు జాలిపడి.
'అందంగా ఉండాలి. అందరూ నా వెంటే పడాలి. పదహారేళ్ళ పడుచుగా పుట్టించు దేవా!' అని అడిగిందా గాడిద ఆశగా.
'తథాస్తు!'అని దీవించి మాయమైపోయాడు దేవుడు.
పదహారేళ్ళ పడుచుగా పదహారు రోజులైనా కాకుండానే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యానుకి ఉరేసుకోబోయిందా మాజీగాడిద.
'మళ్ళా ఇదేం పిచ్చిపని!' అర్జంటుగా ప్రత్యక్షమైపోయి ఆత్రంగా అడిగాడు దేవుడు అడ్డంబడి.
'నా అందమే నాకు శాపమైంది. అడ్డమైన వెధవా ప్రేమించానని వెంటబడుతున్నాడు. కాదంటే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. ఇక్కడా నాకు గాడిదచాకిరీ తప్పడంలేదు. ఇంట్లో రోజూ పెద్దయుద్ధమైపోతోంది. ఈ మగప్రపంచంలో ఆడదానికి ఇంటా బైటా బేటిలూ.. బాటిలే! ఆడదై పుట్టేకన్నా అడవిలో మానై పుట్టడం మేలన్న సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో ఇప్ప్డు అనుభవంలోకొచ్చింది. మానుగా వద్దుగానీ.. వీలైతే నన్ను ‘జెంటిల్ మేను’గా పుట్టించు! కుదరదంటావా.. నా మానాన నన్ను చావనీయ్!' అని ముక్కు చీదిందా కన్నెగాడిద.
'జెంటిల్మాన్ అంటున్నావు కాబట్టి ఓ గవర్నమెంటు చిన్నబళ్ళో పంతులయ్యలా  తక్షణమే పుట్టు!' అంటూ ఆశీర్వదించి అంతర్దానమైపోయాడు దేవుడు.
సర్కారుటీచరుగా పుట్టి శతదినోత్సవంకూడా రాకుండానే టేంకుబండుమీదనుంచి దూకబోయిందా గతజన్మగార్దభం.
యథాప్రకారం మళ్లీ విధాత ప్రత్యక్షం! 'పదిమందికీ పాఠాలు చెప్పే పని అప్పగించినా ఇదేం పిచ్చిపని పంతులుగారూ! అయ్యవారి వృత్తీ నీకు నచ్చలేదా?!'
'అయ్యో! నాకసలు పిల్లకాయలకి పాఠాలు చెప్పే అవకాశం ఎక్కడొచ్చింది స్వామీ! అందరూ నాకు పాఠాలు చెప్పేవాళ్ళేనాయ! వేళకు జీతాలు రావు. వచ్చిన జీతాలు చాలవు. ఎవరికీ పంతులంటే లెక్కే లేదు. జనాభా లెక్కల్నుంచి, ఓటర్ల వివరాల సేకరణవరకు అన్నింటికీ అయ్యవార్లకే చచ్చేచావాయ! గాడిద చాకిరీ ఇక్కడా తప్పడంలేదు. గాడిదలకన్నా బుద్ధితక్కువ వెధవాయలతో వేగలేకే ఈ విరక్తి. బడిపంతులైతే అబ్ధుల్ కలాంసారుకిమల్లే  మంచిపేరొస్తుందని ఆశపడ్డాగానీ బడుద్దాయుల నోళ్ళలో  పిచ్చి పిచ్చి మారుపేర్లతో నానుతానని తెలీదు. వంటబట్టని చదువులు, వకపట్టాన అంతుబట్టని జీవోలు, అంతేలేని పదోన్నతుల కౌన్సలింగులు, అంతమేలేని బలవంతపు  బదిలీలు, బెదిరింపులు! బందులదొడ్డిలాంటి బడి. దాని చవుడుగోడలకిందబడి దిక్కుమాలిన చావు చచ్చేకన్నా.. ఈ మురికినీళ్లల్లోకి దూకి ముందే నీ దగ్గరకు రావడం సుఖమనిపించిందయ్యా! మంచిపుటక పుట్టే యోగం ఎటూ లేదు. మనసారా చావడానిక్కూడా నాకు రాసిపెట్టిలేదా భగవాన్?!’ అని ఎదురు దాడికి దిగాడా గాడిద జీన్సు ఉపాథ్యాయుడు.
'ఆ అవకాశం నీకు రాసిపెట్టిలేదు భక్తా! వైద్యో నారాయణో హరిః’ అనిగదా సామెత. మరి ఆ భూలోక దేవుడి అవతారంకూడా ఓసారి ట్రై చేసి చూడరాదా?' అంటూఅంతర్ధానమయిపోయాడు దేవుడు.
వైద్యుడుగా జన్మించిన ఆ జీవి ఆరునెల్లు తిరక్కుండానే యథాప్రకారం ఆత్మార్పణకు పూనుకొన్నాడు.
దేవుడికి తప్పుతుందా? తిరిగి ప్రత్యక్షం!
'పదిమంది రోగులకి మంచి మందూ మాకూ ఇచ్చి మానవసేవ చేయమని వైద్యమాధవుడిగా పుట్టిస్తే.. నువ్వేందీ.. మళ్ళీ ప్రాణార్పణకు బైలుదేరావు? మళ్లీ ఏం పుట్టి మునిగింది నాయనా?'
'ప్రాణదానాలు చేయమని ప్రభుత్వాసుపత్రుల్లోనా పారేసేది పరంధామా! ఆపరేషన్లు చేయడానికి పరికరాలే కరువు  వైద్యాలయాల్లో! రోగి ప్రాణంపోతే బంధువులు మా ప్రాణం తీసేస్తున్నారు. ఏళ్లతరబడి కళ్లు గుంటలుపడేటట్లు చదివింది నెలకు సరిపడా ఇంటికి సరిపడా సరుకులైనా కొనలేని జీతభత్యాలకోసమా? పగటికీ, రాత్రికీ తేడా తెలీకుండా ఆ డ్యూటీలేంటి? పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకొంది.. అదిగో.. వాడి తల్లి డెలివరీ  రోజునే! ఈ పరేషాన్లు నా వల్లయే పన్లు కాదుగాని.. వీలైతే నా పూర్వజన్మ గాడిద బతుకే తిరిగి ఇచ్చేయ్! కాదంటే నీ దారిన నువ్వు దయచేయ్!'
'పోనీ ఓ సాఫ్టువేరు ఇంజనీరు బాడీ ఖాళీ కాబోతోంది. అందులోకి నిన్ను ఇన్ స్టాల్  చెయ్యమంటావా?ఇవాళ కుర్రకారంతా  అంతిమంగా కోరుకొంటున్నది  ఆ విలాసజీవితమేగా?'
గాభరా పడింది గాడిద. 'అయ్యయ్యో! అంతపని చెయ్యద్దు దేవయ్యా! ఆ జన్మ జన్మజన్మలకీ వద్దనే వద్దు. ఎవడి బాడీలోకో దూరి మళ్ళీ వాడి కారులోను, కార్డులోను, హోములోను గట్రా క్లియర్ చేసేందుకు గాడిద చాకిరీ చేసేకన్నా.. నా సొంత గాడిద బాడీలోకే దూరిపోయి తంటాలు పడ్డం మేలు ! ఎప్పుడూడిపోతుందో కూడా తెలీని ఆ సంచారజీవి నౌఖరీకన్నా.. ఎవరికీ అక్కర్లేని నా ఖరం పోస్టే మెరుగు!'
'పోనీ మంచి సినిమా స్టారువయ్యే ఉద్దేశం ఉందా? బోలెడంత గ్లామరూ.. డబ్బూ.. అందం.. ఆనందం.. అభిమానులూ నీ సొంతం. కొంతకాలం పోతే సొంత రాజకీయపార్టీకూడా పెట్టుకోవచ్చు. అన్నీ కలసివస్తే అమాంతం ఏ  ముఖ్యమంత్రో, దేశానికీ ముఖ్యమైన మంత్రో అయిపోవచ్చు. భూమ్మీద జన్మించిన ప్రతి జీవీ అంతిమంగా ఆశించే అంతస్తును అందుకొనే అంతిమ సోపానం అంతకు మించింది మరేదీ లేదు బోళాభక్తా! మరి నీయిష్టం!'
'అడ్డదారుల్లో వెళ్ళి అలా పెద్దమనిషయేకన్నా.. నేరుగానే సియమ్మో పియమ్మో అయిపోవడం ప్రాణానికి హాయిగదా దేవా? వీలయితే ఆ రెండు పదవుల్లో ఏదో ఒహటి వెంటనే ప్రసాదించు స్వామీ! మళ్ళీ ఆత్మహత్యలమాట తలపెడితే ఒట్టు!'
దేవుడి మొహంలో చిరునవ్వు.
'మూడు మానవ జన్మలెత్తంగానే ఎంత తెలివిమీరిపోయావే గాడిదా! ఆ పదవులేమీ ప్రస్తుతానికి ఖాళీగా లేవుగానీ దానికన్నా కొద్ది దిగువలో ఉన్న మంత్రిపదవి శాంక్షను చేస్తున్నా.. సర్దుకో!' అంటూ అంతర్ధానమైపోయాడు యథాప్రకారం జనార్దనుడు.
గాడిద ఆ మంత్రి పదవి వెలగబెడుతున్న ఏడాదిలోనే జిల్లా పరిషత్ ఎన్నికలొచ్చిపడ్డాయి. మంత్రిగారి ఇలాకాలోని జనం జెల్లాయి కొట్టేసరికి మాజీగాడిదగారి మంత్రిపదవి ఊడింది.
ముఖ్యమంత్రిగారి క్యాంపాఫీసు కార్యాలయంలోక్కూడా ప్రవేశం దొరకనంత అధమావస్థకి పడిపోయింది మాజీమంత్రిగారి పరపతి.
ఆ అవమానంతో.. ఆందోళనతో మంచమెక్కిన మూడోరోజుకే నాడి పడిపోయి దేవుడు కనిపించాడు మళ్లీ. బావురుమన్నాడు గాడిదజీవుడు. 'ఆడపిల్లగా ఉన్నప్పుడు మగాడి వేధింపులకన్నా, అయ్యవారుగా ఉన్నప్పుడు పిల్లకాయలు తిట్టిపోతలకన్నా, వైద్యవృత్తిలో ఉన్నప్పుడు రోగిబంధువులిచ్చిన కాలితాపులకన్నా.. ఇప్పుడు చాలా ఆవేదనగా ఉంది పరమాత్మా! పదవూడిన తరువాత నేతబతుకెంత యాతనగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. దీనికన్నా నా పూర్వజన్మ గార్దభమే ఎన్నోరెట్లు మిన్న. నా పాతజన్మ నాకు తిరిగి ప్రసాదించవూ! చచ్చి నీ కడుపున పుడతాను మహానుభావా!’
'అది కుదిరేపని కాదు గాడిదా! అందుకే నిన్ను నేను ముందే అన్ని విధాలుగా హెచ్చరించింది’ అన్నాడు దేవుడు తాపీగా.
అయోమయంగా చూసాడు జీవుడు.
'అటు చూడు! అంతా నీకే తేటతెల్లంగా అర్థమవుతుంది!' అన్నాడు దేవుడు.
జీవుడు అటుగా చూసాడు. గతంలో తను 'ఛీ.. వద్ద'ని చీదరించుకున్న గాడిద బాడీముందు మంగళగిరి చేంతాండంత క్యూ!
ఆ క్యూలో  పడుచుపిల్లగా పుట్టినప్పుడు తనతో ఆడుకొన్న ఆడపిల్లలు బోలెడంత మంది! స్కూలుటీచరుగా పనిచేసినప్పుడు తను కలసి పనిచేసిన గురుదేవులూ తక్కువమంది లేరు! గతంలో ధర్మాసుపత్రిలో తనతో కలసి రోగిబంధువులందరిచేత చివాట్లు, చెప్పుదెబ్బలు తిన్న వైద్యనారాయణులందరూ దాదాపుగా అక్కడే నిలబడున్నారు!
తాను వద్దని వదిలేసిన సాఫ్టువేర్లు.. ఇంజనీర్లు, పెద్ద పెద్ద సినిమాస్టార్లు, బిజినెస్ మాగ్నెట్లు, నిత్యం బిజీగా ఉండే మీడియా మొఘళ్ళు, ఇంకా బంజారాహిల్సు జూబ్లీహిల్సుల్లో బంగళాలు కట్టుకొని ప్రపంచానికి దూరంగా బతికే పేరులే తప్ప ఫేసులెప్పుడూ చూడని ఫేమస్ పర్శనాలిటీసు బోలెడంతమంది.. ఎంతో సేపట్నుంచి అక్కడే నిలబడున్నట్లు వాళ్ళ మొహాల్లోని అసహనాలే ఆనవాలు పట్టిస్తున్నాయి.
'ఇంతకీ వీళ్ళందరూ ఇక్కడ నిలువుకాళ్ల ఉద్యోగం చేస్తున్నది ఎవరికోసం? సినిమా థియేటర్లో కనిపించే క్లాసులన్నీ ఇక్కడ క్యూలో కనిపిస్తున్నాయే! దేనికోసం ఈ కోన్ కిస్కాగాళ్ళు, కోటీశ్వరులు ఇక్కడిలా  మునిగాళ్లమీద  జపాలు చేస్తున్నారు? దేవుడెందుకు తనను వీళ్లవంక చూడమన్నాడు?!' తాను అడిగింది తన పాతగాడిద బాడీనే గదా! తన బాడీ తనకు స్వాధీనంచేయకుండా ఏదన్నా తిరకాసు పెట్టడానిక్కాదుగదా ఈ మాయలమారి దేవుడుగారు ఇప్పుడీ'క్యూ' షో పెట్టింది?! ఆమాటే నట్టుకొట్టకుండా సూటిగా అడిగేసింది దేవుణ్ణి గాడిద.
సమాధానంగా చిదానందంగా నవ్వి చిన్నగా బదులిచ్చాడు భగవంతుడు 'ఆ క్యూ మొదట్లో ఏముందో చూడు! నువు వద్దని వదిలేసిన బాడీనే పడుందక్కడ! ఇప్పుడు దానికీ బోలెడంత గిరాకీ! గాడిదచాకిరీ అని నువ్వు చీదరించుకొన్నావుగానీ.. నిజానికి ఈ క్యూలోని  ఏ ఒక్కడన్నా గంటలో చక్కదిద్దే పనిముందు  నువ్వు జీవితాంతం ముక్కుతూ మూలుగుతూ చేసే పని దూదిపింజెకన్నా తేలిక.'అడ్డగాడిద' అంటూ నిన్నడ్డంపెట్టుకొని మనుషులు తిట్టుకొంటారని నీ కంప్లయింటుగానీ.. వాస్తవానికి ఇక్కడునవాళ్లందరూ నిత్యజీవితంలో నీకన్నా ఎక్కవ అవమానాలు భరిస్తున్నారు. ఆడవాళ్లపేర్లతో మగవాళ్ళు తిట్టుకొనే తిట్లు నరమానవులు విని సహించలేనివి! పంతుళ్లమీదున్నన్ని పిచ్చిసామెతలు ప్రపంచంలో మరెవ్వరిమీదా లేవు. డాక్టర్లకు నిత్యం ఆసుపత్రుల్లో జరిగే సన్మానాలు చూస్తే నువ్వు తట్టుకోలేవు. ఇహ సినిమావాళ్లమీద నడిచే పుకార్లలో ఒకవంతు నీమీద నడిచినా నువ్వెందుకు మీ అమ్మకడుపులో పుట్టావా అని ఆవేదన చెందేదానివి. డబ్బున్న మారాజులకు పన్నువేధింపులు, మీడియా మొఘళ్లకు గూండా మొగుళ్ళు! నేతాశ్రీల నరకయాతనలముందు నీ బతుకెంత స్వర్గతుల్యమో అర్థం చేసుకో! నీ గాడిద బతుక్కిప్పుడెంత డిమాండొచ్చి పడిందో నీకు తెలీడం లేదు. వానలు పడక ఎండలు మండిపోతున్న ఈ సీజన్లో అందరి నోళ్ళల్లో  నీ నామస్మరణే! మీ గాడిదలకు పోటీలు పడి పెళ్ళిళ్ళు ఆర్భాటంగా చేసేస్తున్నారు జనం. గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తే కుంభవృష్టిగా వర్షాలు పడతాయని వాళ్ల నమ్మకం. గత ఎన్నికల్లో  ధరావతు కోల్పోయిన  నేతాశ్రీలు పోయిన పరువు పరుసు మళ్ళీ ఎలాగైనా  దక్కించుకోవాలని కనీసం నీ గాడిద బాడీలోనైనా దూరిపోవడానికి ఇలా పోటీలు పడిపోతున్నారు..'
'నా గాడిద శరీరం నాకే దక్కడం న్యాయం! నా శరీరం నాకు తిరిగి రావాలంటే నేనేం చేయాలి స్వామీ?' బిక్కమొగమేసుకొని అడిగింది గాడిద.
'చేసేందుకేముంది గాడిదా? నా చేతులుకూడా దాటిపోయింది వ్యవహారం. బాడీ నీదే అయినా నీకిప్పిస్తే  నామీద కేసేసేందుకు  కాచుక్కూర్చోనున్నాయి కొన్ని అదృశ్యశక్తులు. ఆ రిస్కు నాకొద్దు. నువ్వెళ్ళి క్యూలో నిలబడు.  నమోదు చేయించుకో! విధి లాటరీ తీయబోతోంది.  నీ లక్కు బాగుంటే నీ బాడీ నీకు దక్కవచ్చు' అంటూ ఠక్కున మాయమైపోయాడు దేవుడు .. మళ్ళీ గాడిద ఏ పితలాటకం పీకలకు మీదకు తెస్తుందోనని భయపడిపోయి.***


రచన - కర్లపాలెం హనుమంతరావు 
( సూర్య దినపత్రిక - 13 -10-2019 - ప్రచురితం ) 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...