Tuesday, October 13, 2015

ఉషోదయమంటే!-కవిత


తపోభంగమైన మునిపుంగవునిలా
కల
ఎప్పుడు నిద్ర లేచిందో మసీదు
మీనార్ మీదనుంచీ ఆర్తిగా పిలుస్తోంది
బాట పొత్తిళ్ళలో  పాలప్యాకెట్ పాపాయిల సందడి
ప్రపంచాన్ని పేపర్లో చుట్టేసి మెదడు కారిడార్లలోకి
గురిచూసి విసిరే పసిబైసికిళ్ళు
రాత్రిచీకటి
రోడ్డువార విసిరేసి రహస్యాలని
సైడుతూముల్లోకి వూడ్చేసే ఝాడూకర్రలు
నైడ్డ్యూటీదిగి దాలిగుంటల్లోకి
సర్దుకుంటున్న వీధిసింహాల విరామాలు
దారిపక్క తాళపత్రాసనంలో
వచ్చేపోయే దృశ్యమాలికలను
అర్థనిమీలిత త్రాలతో అవలోకిస్తూ చెట్లు
నింగిచూరుకు దిగాలుగా వేలాడే
బెంగమొగం  ముసలి చంద్రుడు!
వెలుగు రాకను
దండోరాలేసే పులుగు రెక్కలు
సాక్షినారాయణుడి దివ్యదర్శనార్థం
అభ్యంగస్నానాలాచరించి
ముగ్గుదుస్తుల్లో ముస్తాబయే ముత్తైదువుముంగిళ్ళు
భక్తజనసందోహం సుప్రభాతసేవార్థం
డిబట్టల్లో నిలబడ్డ గుడి మెట్లు
చదివిన పాఠాలే!
అయినా
పునశ్చరణ చేసుకునే
ఉదయ వ్యాహ్యాళులు

గతించిన శూన్యసమయాన
అందాల బంధ గంధాల అరగతీతలో
ఏ  గంధర్వలోకా
న్ని పుష్పమాలికలకు
వికాసభూమికలు ర్పడ్డాయో!
మౌనంవ్రతం ముగించుకుని
తూర్పువాకిలి తలుపు తెరిచుకుని
వీధిమొగదలకు కదిలి వస్తోంది
ఉదయరాగసంధ్య
సూర్యనమస్కారాలకోసం సిద్దమవుతోంది లోకం
రాత్రి ఏకాంతంలో
తెల్లహృదయం మీ
ఏ రంగుభావాలని పొదిగి
సొమ్మసిల్లిందో కవిసమయం!
తొలికిరణం  కరచాలనంతో గానీ
రంగూ.. రుచీ.. వాసనా తేలదు
ఉషోదయం అంటే
రాత్రిబావిలోపడ్డ లోకంబంతిని
మెల్లగా బైటకు తీయటమేనా!
మరో ముప్పూ   సమావేశాల కోసం
సమాయాత్తమయ్యే
భువనభవనపు అంతరంగానికి వేసే
మొదటి వైట్-వాష్ కోటింగు కూడా కదా!

***
కర్లపాలెం హనుమంతరావు

Sunday, October 11, 2015

చురకలు- చిన్ని కవితలు

నాయకులు దర్జాగా దేశాన్ని
తెగనమ్ముతున్నారు
ఐనా గొర్రెల్లా జనం ఆ కసాయిల్నే
తెగ నమ్ముతున్నారు!


ఏరుకుని తీసుకోడానికి
తల్లి పొట్ట
రేక్కాయల బుట్టా!
రేతస్సు జనిత తేజస్సే కదా
మగాడి లాగా ఆడబిడ్డా!






                                    వెయ్యి కిలోలబరువైనా
అవలీలగ మోస్తాట్ట వస్తాదు
బడిపిల్లడి బ్యాగు మాత్రం
మోయలేక  పడి చస్తాడు



పదవి నీది- నొప్పులు నావి
-ముఖ్యమంత్రిపెదాల బాధ
అదీలేదు మరి
నా తిప్పలు చూడరాదా!
అప్పోజిషన్నేత పాదాల  రొద



 ఏసిబి.. సిబిఐ.. కాగూ
ఈడీ.. కోర్టులు
అక్రమార్కులను కొత్తగా
ఆవహించిన పంచ ‘భూతాలు’ !




లక్షల కోట్లల్లో
కుంభకోణాలు
న భూతో
నా దేశానికి
న భవిష్య్తత్!





తెలుగుతల్లి కొప్పుకు
కొత్తటీవీ
యాంకరమ్మల
సంకర కూ’తలనొప్పులు’!
-కర్లపాలెం హనుమంతరావు









Friday, October 9, 2015

గుత్తి వంకాయ కూరోయ్ బావా!- ఆపాత మధురాలు





http://www.maganti.org/lalitasangitam/audios/guttivankay.html
ఇక్కడ నొక్కండి...వేరే పేజీ తెరుచుకుంటుంది.

(మాగంటి వారి వెబ్ సైట్ చూస్తున్నప్పుడు నాకీ ఆణిముత్యం దొరికింది.బసవరాజు అప్పారావు గారి ఈ వెర్రి పిల్ల పాట  ఆ  రోజులలో చాలా ప్రసిద్ధం. బందా కనకలింగేశ్వర రావు గారి విలక్షణమయిన గళం లోనుంచి జాలువారిన ఈ పాట తెలుగు వారి అందరికి గుత్తి వంకాయ కూర ఎంత ఇష్టమో అంత ఇష్టం ఈ తరానికి కూడా ఒక సారి ఆ రుచి చూపించాలనే సదుద్దేశంతోనే ఈ పాటను ఇక్కడ పెట్టటం జరిగింది.నాకు సాంకేతికమయిన అంశాలలో అంతగా అనుభవం లేని కారణం గా పై లంకెను నొక్కగానే వేరే పేజి తెరుచుకునే విధంగా ఏర్పాటు చేశాను .పాటను విని ఆనందించిన తరువాత తిరిగి ఈ పేజీ లోకి వచ్చి మీ స్పందన తెలియచేస్తే నా కృషి ఫలించినదనుకుంటాను.మీ మిత్రులకు ఈ బ్లాగ్ సంగతి చెబితే మరింత సంతోషిస్తాను,
మాగంటి వెబ్ సైట్ వారికి సేకరించిన  సేకరించిన డాక్టర్  కారంచేడు గోపాలం గారికి కృతజ్ఞతలు.)

గుత్తి వంకాయ కూరోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!
కూర లోపలా నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా!
              కోరికతో తినవోయ్ బావా!
తియ్యని పాయసమోయ్ బావా!
తీరుగా ఒండానోయ్ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా!
                బాగని మెచ్చాలోయ్ బావా!
కమ్మని పూరీలోయ్ బావా!
కర కర వేచానోయ్ బావా!
కర కర వేగిన పూరీ లతో నా
నా కాంక్ష వేపినానోయ్ బావా!
                కనికరించి తినవోయ్ బావా!
వెన్నెల ఇదిగోనోయ్ బావా!
కన్నుల కింపౌనోయ్ బావా!
వెన్నెలలో నా కన్నె వలపనే
వెన్న కలిపినానోయ్ బావా!
                 వేగముగా రావోయ్ బావా !
పువ్వుల సెజ్జిదిగో  మల్లే
పువ్వులు బరిచిందోయ్ బావా !
పువ్వులలో నా యవ్వనమంతా
పొదివి పెట్టినానోయ్ బావా!
పదవోయ్ పవళింతాం బావా!
-బసవ రాజు అప్పారావు గారు

Thursday, October 8, 2015

కొన్ని 'చిత్రా'లు- కవితలు



1
 అమ్మ కాబూలీ!
 అప్పు వసూలుకు
 బిడ్డై తిష్టేసింది గుండె నట్టింట్లో!

2
 శిశిరం బోసిచేసిపోతేనేమి
 వసంతం వచ్చి పచ్చిసంతకం చేస్తుంది
 చెట్టంత ఆశతో.. నువ్వుండాలిగానీ!

3
 వేర్లు పాతాళంలోకి
 కొమ్మలు ఆకాశంలోకి
 పువ్వులు  హృదయంలోకి!

4
 రైలు ఊయలుకు
 ప్రయాణీకులంతా
 బుజ్జి పాపాయిలే!

5
 రాయీ వెన్నముద్దే
 విత్తు
 కత్తయితే!

6
 తెడ్డు.. తెరచాప.. లంగరు
 పడవకైనా.. బతుక్కైనా
 మూడు ముక్కల్లోనే కతంతా!

7
 దాయని
 దుఃఖదాయని
 -ప్రేమవాహిని!

8
 ఘటన క్షణికం
 స్మరణ పురాణం
 మనసు వ్యాసపీఠం

9
 కన్నీరు ఉప్పన!
 హృదయం
 సముద్రం కదా!

10
 పూలకోసం  పాపాయి- కింద
 పాపాయికోసం పూలు- పైన
 గాలివంతెన వంతే ఇంక మిగిలింది!
-కర్లపాలెం హనుమంతరావు


తన్మయత్వం అంటే…?- ఓ కవిత్వపరమైన పరిశీలన

చదివేటప్పుడు పాఠకుడు ‘నేను ఎక్కడ ఉన్నాను?’ అని ప్రశ్న వేసుకుంటే ‘నేను ఇక్కడ ఉన్నాను‘ అని స్వీయ లోకం నుంచి కాకుండా మరోలోకం నుంచి మారు బదులు వస్తే అదే తన్మయత్వం’ అంటారు ప్రముఖ సాహిత్యవేత్త కవికొండల వెంకటరావుగారు యనభై ఏళ్లకిందట ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకని రాసిన ఒక వ్యాసంలో. వారి అబిప్రాయం ప్రకారం పాఠకుడు తన దృష్టిపథాన్ని విడిచిపెట్టి.. కవి దృష్టిపథాన్ని విడిచి పెట్టి.. చదివే అంశం దృష్టిపథం వెంటబడి పోవడమే ఆ తన్మయత్వ ముఖ్య లక్షణం. వాస్తవంకూడా అంతేననిపిస్తోంది.
రామాయణం– రాసిన వాల్మీకి కథ కాదు. చదివే పాఠకుడి కథ అంతకన్నా కాదు. సీతారాముల కథ. మనల్ని మనం  మరచి, వాల్మీకినీ మరచి, సీతారాములనే స్మరించుకుంటో చదువుతాం కదా.. అదేనేమో వెంకటరావుగారు ఉటంకించిన ఆ పరలోక శక్తి! నిజమే. శ్లోకం ప్రతిపదార్థమో.. తాత్పర్యమో తెలుసుకుంటో అంతః సారంలోకి వెళ్ళకుండా పదే పదే ఎంత వల్లె వేసినా అది పురాణ పఠనం అవుతుందేమో  గానీ తన్మయత్వం కాబోదు గదా! ఆ తన్మయలోక ప్రయాణానికి టిక్కెట్టు దొరకటం అంత సులభం కూడా కాదేమో!
అంశా’న్నే లక్ష్యంగా తీసుకోవడం -అంటున్నారు వెంకటరావు గారు. అంటే ఏమిటో
బాహ్య స్వరూపమైన భాషను అనా అర్థం? ఆంతరంగికమైన భావాన్ని అనా అర్థం? రెండూ కాదు. అంశం ప్రతిపాదించే ‘ధర్మం‘ అని అనుకుంటా వెంకటరావుగారి ఉద్దేశంలోఉన్నది.
ధర్మం ప్రతిపాదించని అంశం అంటూ ఏదైనా అసలు ఉంటుదా? ఉండదేమో. ధర్మం సహజ లక్షణం మర్మం. ఆ మార్మికత మీద లక్ష్యం ఉంచడమే తనయత్వం సాధించే ప్రక్రియల్లోని ముఖ్య మార్గం అనిపిస్తోంది.  రావణాసురిడి పది తలలమీదో, రాములవారి ధనుర్విద్యా పాటవం మీదో దృష్టి లగ్నం చేస్తే పర శక్తి కనికరించదు. సీతారాముల చరిత్ర ముఖ్య ధర్మం–  నైతికత. భాతృధర్మం, పితృవాక్య పరిపాలన, ఏకపత్నీవ్రత సంకల్పం. నిష్ట, నైష్టిక ప్రవృత్తి, శరణాగత ఆర్త త్రాణ పరాయణత్వం లాంటి చరిత్రోదితాలైన ‘ధర్మా’లమీద దృష్టిసారిస్తేనే తన్మయత్వం సాధ్యం అయేది
రావుగారి లెక్క ప్రకారం ఈ ధర్మం మళ్లీ రెండు విధాలు.
 1.విశ్రుతం
 2.విస్మృతం
ప్రచండ వేగంతో వీచి, పెద్ద పెద్ద చెట్లను పడదోసి, భయంకరమైన వాననీటితో ముంచెత్తే గాలివాన ఆర్భాటం లాంటిది కేవల శ్రుత ధర్మం అయితే..  దూదిగుట్టలాగా విశాల ఆకాశానికి ఒక మూల ఒదిగి  సూర్యకాంతికి ఆరుతున్నట్లుండే తెలిబూది మేఘంలాంటిది విస్మృత ధర్మం.
ప్రకృతిలో  ఆ రెండు ధర్మాలూ విడివిడిగా ఉండవు. ఒకే ఒరలోని  రెందు కత్తుల్లా ఉన్నా.. ముందు మన మనసుకు తళుక్కుమని  తట్టేదే ప్రధాన ధర్మం. తుఫాను వీచేటప్పుడు విరామాన్ని గురించిన ఆలోచన తోచదు కదా! కదలక మెదలక  నిలబడి ఉన్న మేఘ శకలాన్ని చూసినా అంతే! అలాగే అప్పటిదాకా అది చేసిన ప్రయాణం కాని, ఇకముందు చేయబోయే ప్రయాణాన్ని గురించి గానీ మనసుకు తట్టదు. తుఫానుది చలనం.. మేఘశకలానిది నిశ్చలనం.. ప్రధాన ధర్మాలు కావడమే ఇందుకు కారణమేమో! అయితే ఇది కేవలం బాహ్యలోక లక్షణం మాత్రమే.
కావ్య ప్రపంచంలో అలా ఉంటుందారెండు ధర్మాలూ ఒకే చర్యలో సమ్మిశ్రితంగా  ఉండి.. పాఠకుడి మనోనేత్రానికి ఒకేసారి దృగ్గోచరం  అవుతుంటాయి కదా! అంశం పరిపూర్ణంగా ప్రత్యక్షం అయే దాకా ఉత్కంఠను నిలిపి ఉంచేదీ ఈ సమ్మిశ్రిత ధర్మ సూత్రమే.
ఆకాశంలో నిలకడగా ఉన్న మేఘాన్ని కాళిదాసు మహాకవి దేశ దేశాల వెంట తిప్పి విశ్రుతం చేసాడు. విస్మృతిలో ఉన్న మేఘానికి విశ్రుత ధర్మం ఆపాదించడమే మేఘదూతంలో మహాకవి చూపించిన గడుసుదనమేమో! అక్కడ పాఠకుడు తన్మయత్వం పొందాలంటే ముందు విస్మృత స్థితిలో ఉన్న మేఘాన్ని దర్శించాలి. దాని వెంట దేశదేశాలు తిరుగుతున్నట్లు ఉహించుకుని శ్లోకాలు చదువుకోవాలి. మనన చాతుర్యం లేకుండా కేవలం పఠన చాతుర్యంతో  తన్మయత్వాన్ని సాధించడం అంటే   ‘తివిరి ఇసుమున తైలంబు‘ తీసే ప్రయాసే అవుతుంది.
అయితే ఆ తన్మయత్వపు స్థాయి చదువరి పఠన చాతుర్య భేదాల మీద ఆధారపడి ఉంటుంది. సుడిగాలి బాలకృష్ణుణ్ని ఎగరేసుకు పోయే తృణావర్తుని కథ చదువుతున్నాం అనుకుందాం. కథ వరకూ చదివి ఊరుకుంటే అది విశ్రుతం. తన్మయత్వానికి ఇహ అక్కడ తావన్నదే లేదు. ఆ సుడిగాలిని అణచి మందస్మితారవిందంతో కిందకి దిగివచ్చే బాలకృష్ణుణ్ని విస్మృతికి తెచ్చుకుంటేనేగాని సంపూర్ణ తన్మయత్వం సాధ్యం కాదు.
తన్మయత్వాన్ని పాఠకుడి స్మృతిపథంలోకి మళ్ళించే రసవిద్య బాధ్యత  కృతికర్తది అయితే.. కావ్య పఠనంలోని తన్మయత్వ స్థాయిని అందిపుచ్చుకునే శక్తి చదువరి  బుద్ధిస్థాయి ఆధారితం. ఆ సృజన శక్తి  కవులందరికీ ఒకే విధంగా వశం కానట్లే.. ఈ పఠన కౌశలమూ చదువరులందరి బుద్ధి స్థాయికీ ఒకే విధంగా అందదు. ఆ రస రహస్యం అంతుబట్టకే కావ్య(కవిత్వ)లోకంలో అప్పుడూ ఇప్పుడూ ఇన్నిన్ని వృథా కుమ్ములాటలు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్ర పత్రిక 1931 సంవత్సరాది సంచిక లోని కవికొండల వెంకటరావుగారి ‘తన్మయత్వం‘ గల్పిక చదివిన తరువాత కలిగిన ఆలోచనలు)


(October 8, 2014 నాటి సారంగ అంతర్జాల పత్రికలో ప్రచురితం)




Wednesday, October 7, 2015

పసిపాప సందేశం- చిన్ని కథ


ఉమ్మడి కుటుంబం లో అత్తారింట్లో పెట్టే ఆరళ్ళు తల్లికి చెప్పుకుందామని పుట్టింటి కొచ్చింది కల్పన కూతురు తో సహా.అపిల్లకి ఏడేళ్ళు. తల్లితో మాట్లాడనీయకుండాఒకటే అల్లరి చేస్తుంది.
ఆ గోల భరించ లేక గోడ మీడున్న ప్రపంచ పటం తీసి ముక్కలు ముక్కలు గా చించి "వీటినన్నింటిని మళ్ళి ఒక షేపు లోకి తీసుకొంచ్చిన దాక నా జోలికి రావద్దు" అని పని పురమాయించింది. ఆ రాకంగానయినా కాస్సేపు తల్లితో ప్రశాంతంగా మాట్లాడనిస్తుందేమోనని ఆశ.
ఐదు నిముషాలు కూడా కాకుండానే పాప అతికించిన పటం పట్టుకొచ్చేసింది.
అంత తొందరగా ఎలా పెట్టింది?!
ఆ మాటే పాపను అడిగితే "ఇందులో ఏముందే అమ్మా! పటం వెనక నువ్వ్వు ఇదివరకు వేసిన పాప బొమ్మ ఒకటుంది కదా!..దాన్ని బట్టి టకటక పెట్టేసా" అనేసింది.
ఆలోచనలో పడింది కల్పన.
'ఆరళ్ళు పెట్టే అత్తగారు తనకు వంట్లో నలతగా వుంటే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిన దాక కొడుకుతో దెబ్బలాడటం గుర్తుకొచ్చింది .తంటాలు పెడుతుందనుకునే తోడికోడలు తాను పది రోజులు ఆసుపత్రిలో వుంటే వేళ తప్పకుండ పథ్యం తయారుచేసి స్వయంగా ఆసుపత్రికి తెచ్చి తిన్న దాక దగ్గ్గర నుంచి కదలక పోవటం గుర్తు కొచ్చింది. అస్తమానం అల్లరి పెట్టే ఆడపడుచు అవసరానికి రక్తం ఇచ్చి ఆదుకోవటం గుర్తుకొచ్చింది.ఊరునుంచి వచ్చి మూడు రోజులు కూడా కాకుండానే ఇంటికి పోదామని పాప ఎందుకు మారాం చేస్తుందో ఇప్పుడు అర్ధమయింది కల్పనకు.
ఏ విషయాన్నయినా పాజిటివ్ కోణం లో చూడాలనే సందేశం పాప నోటితో చెప్పకుండానే పటం ద్వార చూపించినట్లయింది.
తల్లికి ఇక తన గొడవలు చెప్ప  దలుచుకోలేదు.

ఆ సాయంత్రమే అత్తగారింటికి బయలు దేరింది.
-కర్లపాలెం హనుమంతరావు


Friday, October 2, 2015

పాట రద్దయి పోదు!- కవిత

కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఎంత దయనీయం!
ఇలాంటి విషాద ఘడియ ఒకటి వచ్చి పడుతుందని ఊహించనే లేదు .
భ్రాంతి దిగ్ భ్రాంతి గా మారిన దురదృష్టపు క్షణాలివి.
వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని చిలుక
కొండచిలువతో కలిసి బృందగానం ఆలపించటం కన్నా విషాదం మరేముంటుంది ?
కత్తి అంచున నిలబడి గొంతెత్తి పాడుతూ ఆడి పాడిన ఆ పాట నిజామా?
కొత్త నేస్తం తో చెట్టపట్టాల్ పట్టి చిందులేసే ఈ పాట నిజామా?
నిప్పుకుండను పుక్కిట పట్టిన ఆ పాటేనా
బజారులో రెండు రూపాయలకమ్మే నీటి పాకెట్లా ఇలా కలుషితమయిపోయిందీ!
నీ పాట తాకట్టు కొట్టువాకిట్లో తచ్చాడుతున్నప్పుడే నాకు స్పృహ వచ్చి వుండవలసింది
కలల్ని మింగి హరయించుకోవటం కష్టమని నీ కిప్పుడనిపించిందా!
మరి నీ రాగాన్ని భుజాన మోసుకు తిరుగుతున్న వాడి గతేమిటి పాటగాడా!
దగా, మోసమని నడి బజారులో వాడు నిన్నలా నిలదీస్తోంటే
నీ గురించి కాదు గాని
నిన్ను నమ్ముకున్న పాటను గూర్చి జాలేస్తుంది.
జనం భుజాలమీద మోసుకునే పదాలను నువ్వలా రాజు పాదాల ముందు పరచావు
పాట పరుసవేది స్పర్స అంటకముందు నీవూ ఆ జనం మనిషివేనని మరిచావు .
ఏ బలహీన క్షణాలలో రుద్రుడు కాముడి మాయలో పడి ఓడిపోయాడో
ఆ మాయదారి క్షణాలే మళ్ళి నీ పాటకూ దాపురించాయని సరిపెట్టు కోమంటావా?
వేళ్ళు నరికినా తలను తెంపినా
నీ పాటనే మొండిగా పాడుకొనే మొండెం నిన్నిప్పుడు అడుగుతుంది మిత్రమా!
బదులు చెప్పు!
కవాతుకు ఒక పాట తగ్గింది ..అంతేగా !
వేల గీతాలు ఈ అపస్వరాన్న్నితొక్కుకుంటూ వెళ్ళిపోతాయి
పాట ఆగితే ఆట ఆగదు
ఇది దొరలు గడీలో ఆడుకునే కుర్చీలాట కాదుగా !
సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట
నెత్తురు గడ్డ మీద పూచిన పూవు అంత తొందరగా వాడిపోదులే!
పాట మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా
అడుగునున్న తడి మాత్రం ఏ అమ్మకానికీ కుదరదు.
నాలిక మెలికలు తిరిగినంత తేలికగా పాట ఆత్మ మడత పడదు.
నువ్విలా చివరి అంకపు స్త్రోత్ర పాఠపు సర్వేజనా సుఖినో భవన్తులాగా
ఎంత జీరబోయినా
పాట రద్దయి పోదు
రద్దయేది పాటగాడిగా నువ్వు మాత్రమే మిత్రమా !
-కర్లపాలెం హనుమంత రావు
(ప్రజాకళ-జూలై-2012 సంచికలో ప్రచురితం)
సందర్భంః వైయస్సార్ పథకాలకు అనుకూలంగా గజ్జెకట్టి గొంతువిప్పి  ఆడిపాడిన ఓ ప్రముఖ ఉత్తరాంధ్ర జనంకళాకారుడి  రివిజనిజాన్ని నిలువెల్లా గర్హిస్తూ అప్పట్లో రాసుకొన్న పాట

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...