Thursday, August 4, 2016

సరళీకర వ్యాపార విధానాలు


'ఈ మధ్య పత్రికల్లో మరీ ఎక్కువయిందేంది బాబాయ్ గోల! ఈ 'ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏందీ?'
'పక్కనే చక్కని తెలుగు ముక్కల్లో రాసుంది.. చదువుకోవచ్చు గదరా! 'సరళతర వ్యాపార నిర్వహణ' అనీ! పనిమాలా  వచ్చి మీ బాబాయి పనిని చెడగొట్టందే నీకేం తోచదా  బాబిగా?
'బాబాయీ!.. పనీనా! బాబోయ్.. ఇదేంటి పిన్నీ కొత్తగా!'
'అట్లకు పిండి రుబ్బి పెట్టాలి. బట్టలకు సబ్బెట్టి ఉతికి ఆరబెట్టాలి.. అన్నింటికన్నా ముందు ఇప్పుడు ఈ బియ్యంలో రాళ్లు ఏరి పెట్టాలి' అదీ మీ పిన్ని నాకు జారీ చేసిన  హుకూంరా  హనుమంతూ! ఏ 'సరళతర విధానం' అవలంబించి ఈ పనులన్నీ చక చకా  తెముల్చుకుందామా! అని ఇందాకట్నుంచీ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇదిగో.. ఇంతలోనే నువ్వొచ్చేసావు! ఇంద.. నువ్వూ ఈ చేట చేత్తో పుచ్చేసుకో!'
'ఈ బియ్యంలో రాళ్లు ఏరే కన్నా.. రాళ్ళలో బియ్యం ఏరడం సులభం లాగుంది   బాబాయ్! అదే ప్రస్తుతానికి నీవు అవలంబించవలసిన 'సరళతర' విధానం కూడానూ!
'మా బాగా చెప్పావురా బుజ్జిగా! ఈ దుకాణాలవాళ్ళు బియ్యంతో వ్యాపారం చేస్తున్నారో.. రాళ్ళతో వ్యాపారం  చేస్తున్నారో బోధ పడకుండా ఉందిరా!'
'అర్థమయిందిలే బాబాయ్ ఇప్పుడు ఈ 'ఈ వే డూ బి' అంతరార్థం.  ఐ మీన్  'సరళతర వ్యాపార నిర్వహణ' మూలసూత్రం!'
'ఛ!.. చ! ప్రపంచ బ్యాంకు ఇలాంటి  చేటలో బియ్యం చెరిగే  విధానాలను గురించి  ఎందుకు నివేదికలు తయారు చేస్తుందిరా తిక్క సన్నాసీ? పెద్ద పెద్ద  వ్యాపారాలు చేసుకునేందుకు ఉన్న వెసులుబాట్లను బట్టి వివిధ దేశాలకు అది ర్యాంకులిస్తుంటుందిగానీ ప్రతి ఏటా. ఆ ర్యాంకుల్ని ఆధారం చేసుకొనే   వ్యాపారస్తులు ఏ ఏ దేశాల్లో పెట్టుబళ్ళు పెడితే గట్టి లాభాలు గుంజుకోవచ్చో  ఓ అంచనాకొస్తుంటారు'
'అట్లాగయితే .. మన దేశానికే మొదటి ర్యాంకు వస్తుండాలే!'
'వెనకనుంచి మొదటి ర్యాంకు రానందుకు సంతోషించు!   పోయినేడాది మనది  నూట ముఫ్ఫై నాలుగో ర్యాంకు ..నూట ఎనభై దేశాల పట్టికలో! ఈ సారేదో నాలుగు స్థానాలు ముందుకు జరిగాయనుకో! సింగపూర్ దే మొదటినుంచీ మొదటి స్థానం'
'అన్యాయం బాబాయ్! అంతా సింగపూరు సింగపూరు అంటూ చిందులేసే వాళ్లే కానీ.. మన దగ్గరున్నన్ని  సులువుసూత్రాలు  ప్రపంచంలో ఇంకెక్కడున్నాయి.. చెప్పు! ఈస్టిండియా కంపెనీ ఈ వెసులుబాట్లన్నీ లెక్కేసుసుకొనే కదా మన దేశాన్ని వెదుక్కుంటూ  వచ్చి మన నెత్తికెక్కిందీ!'
'ఆ పాత స్టోరీలన్నీ ప్రపంచ బ్యాంకు ముందు పరమ వేస్టురా అబ్బిగా?'
'పోనీ.. ఇప్పటి లెక్కలు చూసుకున్నా మనకే ఫస్టు ర్యాంకు రావాలి బాబాయ్ న్యాయంగా! సర్కారు భూముల్ని ఇంచక్కా ఆక్రమించి ఆకాశాన్నంటే భవంతులు లేపినా .. అడిగే నాధుడుండడు మన దగ్గర. తిక్క పుట్టి ఎవరైనా కోర్టు గడప తొక్కినా .. ఏ అపరాధ రుసుమో కట్టేస్తామని.. అఫిడవిట్టో అదేందో ఒకటి గీకి పారేస్తే సరి.. అంతా సెట్టైపోయినట్టే. ఆక్రమించిన భూములు అమ్ముకొనేటప్పుడు సెటిల్మెంటుకు ఏ ప్రజానేతో వచ్చి మోకాలడ్డినా ఓ శాతం మనది కాదనుకుంటే సరి..  అంతా ఓం శాంతిః.. శాంతిః.. శాంతిః!'
'ఆ మాటా నిజమేననుకో! వడ్డించే చేతులు మనవాళ్లవయేట్లు కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు.. తట్టెడు సిమెంటన్నా తయారవకముందే పది రూపాయల షేరు పదింతలు పెంచి రాత్రికి రాత్రి రాక్ ఫెల్లర్ తాతై పోవచ్చు'
'మరే! తుక్కు తవ్వుకునేందుకని అనుమతులు తీసేసుకొని ఉక్కు తయారయే సరుకు తవ్వుకున్నా చాలుగదా.. ఏడుకొండలవాడి నెత్తికి  కిరీటాలనేంటి.. పడుకొనే గదుల్లో పక్క ఎక్కేందుకు  వాడే ఎత్తుపీటలు కూడా ఇంచక్కా మేలిమి బంగారంతో మలాములు చేయించుకోవచ్చు'
'లెక్కలడిగే నోళ్ళు నొక్కి పారేసేందుకు విందులు.. వినోదాలు..   నాలుగు నోట్ల కట్టల సందు చూసుకొని  విసిరేయడాల్లాంటి  చమత్కారాలు చచ్చేటన్ని ఎటూ మన దగ్గర ఉంటాయిగదా!'
'వేలు దూరే సందిస్తే చాలు.. కాలు బార్లా చాపుకునే వెసులుబాట్లు వేలకు వేలున్నా మన దగ్గర మరి ఎందుకు  మరీ  ఇంత దిక్కుమాలిన దిగువ ర్యాంకులో మనల్ని తొక్కేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు?'  మంచి ర్యాంకు కొట్టేయాలంటే మరేదన్నా  మతలబు ఉందంటావా బాబాయ్?'
'ఏమోరా! దమ్ముండాలే కానీ దుమ్మూ ధూళితోనైనా సరే దుమ్ములేపే వ్యాపారాలు బ్రహాండంగా చేసిపారేసే వెసులుబాట్లు మన దేశంలో వీశలకొద్దీ వాడుకలో ఉన్న మాటా వాస్తవమే! ఒప్పుకుంటాగానీ.. ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ పెరామీటర్లకీ  పక్కదారి చిట్కాలు బొత్తిగా సెట్టవవేమోరా! టర్కీలో ఎప్పుడో రద్దయిన తుక్కునోట్లనుకూడా   ఇంచక్కా  కోట్లకిందకు మార్చేసే   చురుకు బుర్రలకైతే  లెక్కలేదిక్కడ!   గాలికీ వానకీ   ఎక్కడో శేషాచలం అడవుల్లో పడి  ఎదిగేవి ఇక్కడి  చందనం మొక్కలు!  పులులూ.. చలులూ అని కూడా వెరవకుండా ప్రాణాలకు తెగబడి మరీ   రెండు  దుంగల్ని  నరికి  ఏ చైనాకో జపానుకో తరలించి  నాలుగు డబ్బులు దండుకునే  రూట్లు ఎన్ని కనిపెట్టారు మన లోకల్ కొలంబస్సులు! కొత్త మార్గాలు కనిపెట్టారన్న కనీసమైన కృతజ్ఞతైనా లేకుండా  ఎన్ని ఎన్ కౌంటర్లు జరిపారో  వాళ్లమీద  ఈ గడ్డమీద!'
'రాత్రనక పగలనక వళ్లూ కీళ్లూ ఇరగ దీసి మరీ  సాధన చేసి గెలిచినా క్రికెట్ అటగాళ్లకు  చివరికి గిట్టేది ఓ కప్పు.. అదీ పదకొండు ఆటగాళ్లకీ కలిపి ఒహటి. కనీసం కాఫీ.. టీలు  పోసుకొని తాగేందుకైనా వీలు లేకుండా పొడుగు మూతిది.  వేలంపాట విధానం కనిపెట్టి ఆటగాళ్లూ వేలంపాట సరుక్కన్నా ఏమీ తీసిపోరన్న లాభసూత్రాన్ని కనిపెట్టిన లలిత్ మోదీనైనా బిజినెస్ మోడల్ గా చూసుకోవద్దూ!  ఆ అబ్బిని  దేశం  సరిహద్దులు దాటిందాకా తరిమి  తరిమి కొడితిమి గదా మనందరం కలసి! ఏటేటా అందమైన సుందరాంగుల శృంగార భంగిమలతో గోడకేలండర్లు పంచి పెట్టే అమూల్యమైన ఆలోచన   మాల్యా జీది.   బ్యాంకులకు అతగాడేవో  ముష్ఠి మూడువేల కోట్లు బకాయి పడ్డాడని దేశం దాటి పారిపోయిందాకా నిద్రైనా పోకుండా పహరా కాస్తిమి! ఆడంగులు.. పీనాసులు  పోపు డబ్బాల్లో.. పక్కగుడ్డల కింద సందుల్లో దాచుకున్న  చిల్లర సొమ్మునంతా బైటికి తీయించడమేమన్నా  సామాన్యమైన  చమత్కారమా? స్తబ్ధుగా పడున్న  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను  ఒక్కసారిగా తట్టిలేపాడన్న   విశ్వాసమైనా    లేదు అగ్రిగోల్డు పెద్దాయనమీద దేశంలోని పెద్దలెవరికీ!'
'నిజమేరా!  నాలుగు డబ్బులు దేశానికి రాబట్టే  ఉపాయాలు కనిపెట్టే వ్యాపారస్తులమీదా న్యాయస్థానాలు సైతం అట్లా  అగ్గినిప్పులు కురిపిస్తుంటే.. ఏ గుండె నిబ్బరంతో విదేశాలనుంచి బిజినెస్ మాగ్నెట్లు  సముద్రాలు దాటి వచ్చి మరీ ఇక్కడ పెట్టుబళ్ళు పెడతారు!.. మదుపుదార్లకు  డబ్బులు చెల్లించే విషయంలో విఫలమై తీహార్ జైలు ఊచలు లెక్కించే  సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ రాసిన పుస్తకం ‘లైఫ్ మంత్రాస్’ వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ బుక్ గా రికార్డుకెక్కింది. అయినా  ప్రపంచ బ్యాంకు అతగాడి వ్యాపార  సులువు సూత్రాలని లెక్కలోకే తీసుకోలా! ప్రపంచ బ్యాంకు పెరామీటర్లకూ  కొన్ని పరిమితులు ఉండిపోయాయనుకుంటా!'
'అలాగని.. అన్ని రకాల వ్యాపారాలకు తరగని గని వంటి మనదేశానికి ఇంత దిక్కుమాలిన ర్యాంకు ఇచ్చి కిందకు తొక్కేస్తే.. అరటి తొక్కల వ్యాపారం కూడా ఇక్కడ ఇంక ఎక్కిరావడం కష్టం కదా!బాబాయ్! అందరూ మన ఆంధ్రపత్రిక నాగేశ్వర్రావు పంతులుగారంత చురుగ్గా ఉండరు.. తలనొప్పి మందు అమృతాంజనాన్ని కూడా ఫ్రాన్సులాంటి దేశాల ఆడపిల్లలకి సౌందర్య సాధనం కింద అమ్మి సొమ్ము చేసుకోవడానికి!'ఈ కాలం 'ఈ-కాలం' అయిపోయింది. ఈ ర్యాంకుల గొడవొకటి కొత్తగా నెత్తిమీదకొచ్చి పడింది.   ఎలాంటి వ్యాపార  వెసులుబాటులో విస్పష్టంగా  చెప్పకుండా   వట్టిగా  'సరళతర వ్యాపార నిర్వహణ' అని ఒక పేరు పెట్టి  ర్యాంకుల పట్టికలు తయారు చేసేస్తుంటే.. ఎంత   మేథస్సు పొంగిపొర్లే పుణ్యభూమి అయినా   పైసా పెట్టుబడి పెట్టేందుకు  విదేశీయులే కాదు.. స్వదేశీయులూ ఛస్తే  ముందుకు  రారు'
' అందుకే కదరా ఇందాక మీ పిన్ని రాళ్ళేరమని ఇచ్చిన బియ్యాన్ని 'ఈజీవే ఆఫ్ డూయింగ్ బిజినెన్' పద్ధతిలో  రాళ్ళకు బదులు బియ్యం గింజలేరి ఇచ్చేసింది! ఇదిగో .. దాంతో చేసిన కిచిడీ! అందుకో!  రుచి చూడు! ఫలితం పాజిటివ్ గా ఉంటే   .. 'సరళతర  వ్యాపార నిర్వహణ' ప్రాజెక్టు రిపోర్టొకటి తయారు చేసి'   ప్రపంచ బ్యాంకుకి సమర్పించేటట్లు మన ప్రభుత్వాలమీద వత్తిడి పెంచేద్దాం!'
'బాబోయ్! పన్ను విరిగింది బాబాయ్! నీ బియ్యం కిచిడీ బంగారం కానూ!'
విరగదుట్రా మరి! బియ్యం  కిచిడీలో అన్నీ రాళ్లేనాయ మరి!'
 మీ బాబాయిగారి 'సరళతర వ్యాపార నిర్వహణవిధానం అలాగా ఏడ్చింది మరి! ఆడమనిషినని తీసి పారేయకుంటే తోచిన సలహా ఒక్కటిస్తాను. వింటే వినండి! ఈ దేశంలో  అపరిమిత లాభాలు గడించి పెట్టే సరళతర వ్యాపార నిర్వహణ' విధానాలు  సక్రమంగా పనిచేసే రంగం ఒక్కటే ఒక్కటి.. రాజకీయ రంగం. అందులో మీరెలాగూ రాణించే రకం కాదు గానీ.. లోపలికి పదండి.. మీకోసం రోలు.. పొత్రం ఎదురు చూస్తున్నాయి.. అట్లకి పిండి రుబ్బి పెడుదురుగానీ ఇద్దరూ కలసి!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం- ఈనాడుకి.. కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)

Monday, August 1, 2016

పెళ్ళిచూపులుకాని పెళ్ళిచూపులు- మరీ చిన్న కథ

రామసుబ్బు చేసేది విప్రోలో పెద్ద ఉద్యోగమే అయినా బామ్మగీసే గీటు దాటేరకం బొత్తిగా కాదు. ఒక్క పెళ్ళి అనేమిటి! పెళ్ళిచూపులుకూడా శుద్ధసాంప్రదాయఫక్కీలో సాగితీరాలన్న బామ్మగారి ఆంక్ష. అందుకు ఒప్పుకున్న తరువాతే సుబ్బురామమ్మను చూసేందుకు రామసుబ్బు స్నేహితుడితోసహా తరలి వచ్చింది.
పాతకాలం మోడల్లో ఫలహారాలు సుష్టుగా లాగించిన తరువాత పిల్లను తెచ్చి చాపమీద కూర్చోపెట్టారు. మగపెళ్ళివారి తరుఫునుంచి ప్రశ్నలవర్షం ప్రారంభమయింది.
'సంగీతం వచ్చా?
'రామలాలీ మేఘ శ్యామలాలీ..'
'గొంతులు బాగున్నాయి సరే ఆమెతో పాటు ఆ పక్క జంటస్వరం ఎందుకు?'
'మొదట్నుంచీ మాకిద్దరికీ కలిసి పాడటమే అలవాటండీ!'
'సంగీతానిదేముందిలేండి! సంసారం చేసుకోవడానికి కావాల్సింది వంటా వార్పూవంటచేయడం వచ్చా.. రాదా.. మీ స్నేహితురాలికి?'
'వంకాయకూర బ్రహ్మాండంగా చేస్తుందండీ!'
'వంకాయకూర ఒక్కటేనా వచ్చు?!'
'కాలేజీకెళ్లి చదువులు సాగించడంచేత ఇంట్లో వంటచేసే తీరిక లేదండీ! కావాలంటే రెండునెల్లలో అన్నీ నేనే దగ్గరుండి నేర్పిస్తానండీ! నాకు అన్ని రకాల వంటలూ చేయడం వచ్చు'
'బాగుంది! రేపు మీ స్నేహితురాలికి ఒంట్లో ఓపికలేదు పొమ్మన్నా  మీరే ఆపద్ధర్మంగా ఆమెకు సాయం పట్టేటట్టున్నారే!  మరి మీరు ఏమీ చదువుకోవడం లేదా ఏమిటీ?'
'ఇద్దరం కలిసే చదువుకొన్నామండీ ఇంటరుదాకా! మెడిసన్లో నాకు సీటు వచ్చినప్పట్నుంచే విడివిడిగా వెళ్ళి చదువుకోవాల్సి వస్తోంది'
'సరే! కాస్త మీ స్నేహితురాలిని  అసుంటా నడిచి చూపించమనండి! లేకుంటే కాలో చెయ్యో వంకరుంటే ఎలా తెలిసేదీ!'
సుభద్ర పక్కనుండి సుబ్బరామమ్మచేత నడిపించింది.
కట్నకానుకలదాకా రాకుండానే  ఆ సంబంధం రద్దయిపోయిందని వేరే చెప్పాలా!
సడేలే! మరి ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ దేనికంటారా!
అక్కడే ఉందండీ అసలు ట్విస్టంతా. సంబంధం రద్ధయిందన్నానేగాని.. బాజాభంత్రీలు మోగలేదని అన్నానా!
ఈ పెళ్లిచూపులు అయిన రెండునెల్లకు భాజాభంత్రీలు మోగాయి.. రామసుబ్బు స్నేహితుడు సుబ్రహ్మణ్యం పెళ్లికొడుకైతే.. సుబ్బరామమ్మ స్నేహితురాలు సుభద్ర పెళ్ళికూతురు!
వాళ్ళిద్దరూ ఒకళ్లకొకళ్ళు తెగనచ్చేసుకొన్నారు రామసుబ్బు పెళ్ళిచూపుల్లో.
బామ్మగారి పనుపుమీద పెళ్లికూతుర్ని అడ్డమైన ప్రశ్నలు వేసినందుకు ఆనక సుబ్బరామమ్మకు సుబ్రహ్మణ్యం ప్రయివేటుగా సారీచెప్పడం సుభద్రకు తెగనచ్చేసిందిస్నేహితురాలికోసం పెళ్ళిచూపుల్లో సుభద్ర అన్నిరకాల మాటలు చిరునవ్వుతో ఎదుర్కోవడం సుబ్రహ్మణ్యానికీ బాగా నచ్చేసింది.
పెళ్ళిచూపులు కాని పెళ్ళిచూపుల్లో నిజమైన పెళ్లిచూపులు జరగడమే ఈ కథలో విశేషం
-కర్లపాలెం హనుమంతరావు
-***

రాత ముచ్చట్లు- ఓ సరదా గల్పిక



చెన్నైనుంచి హైదరాబాదు వస్త్తున్నాను చెన్నై ఎక్స్ ప్రెస్సులో
పక్క సీటులో  ఒక మోస్తరు పెద్దమనిషి తగిలాడు.  పరిచయాలు గట్రా అయిన తరువాత నేను 'రాతల తాలూకు శాల్తీన'ని ఏ కారణం వల్ల ఊహించాడో! 'ఇప్పటి వరకూ ఏమేం రాసారు సార్?' అని తగులుకున్నాడు.
మనం రాసినవి.. రాసేవన్నీ అలా బైటికి చెప్పుకుంటూ పోతే ఏం బావుంటుంది?
నెత్తికి నూనె రాస్తాను. స్నానాల గదిలో వంటికి సబ్బు రాస్తాను. కాలు కండరం పట్టినప్పుడు .. తలనొప్పితో కణతలు బద్దలవుతున్నప్పుడు     జండూ బామో..  ఆయింటుమెంటో రాస్తుంటాను.
బైట ఊళ్ళకు ఇలా పనులమీద  వచ్చినప్పుడూ నాకీరాతతలనొప్పులు తప్పవు.   తరుచూ కాళ్ల కండరాలు పట్టేస్తుంటాయి. ‘అందుకే ఎక్కడున్నా మా శ్రీమతిగారు సెల్లోనైనా సరేఅది రాసారా? ఇది రాసారా?’ అని వేపుకు తింటుంటుంది. ఆమె ప్రేమ ఆమెది. ఇప్పుడు ఆరాత మీదే పెద్ద రచ్చ అయింది సెల్లో!
ఇంటి మనుషుల తోనే కాకుండా బైట కొత్తవాళ్ళ ముందు కూడా.. ఆ రాసేవన్నీ వివరంగా  చర్చకు పెట్టడమెందుకు!'.. అనిపించి   నవ్వి ఊరుకున్నాను.
ఆయనగారు పట్టువదలని విక్రమార్కుడికి వేలు విడిచిన మేనమామలాగున్నాడు.  వదిలితేనా!

'రాసేవాళ్ళెవరైనా సరే.. నాకు చాలా ఇష్టమండీ!  మీర్రాసినవాటిల్లో కొన్నైనా చెప్పండి! అవన్నీ కొని మా ఆడోళ్ళచేత కూడా  చదివిస్తా  దొరక్కపోతే బండి దిగేలోపు నాకూ ఏదైనా రాసివ్వండి! ఎప్పుడూ ఏవోవే పిచ్చి పిచ్చివి కొంపమీదకు కొని   తెస్తుంటానని ఒహటే   దెప్పుతుంటుంది !' అని ప్రాధేయపడ్డం పెంచేయడంతో పెద్ద చిక్కుల్లో పడిపోయాను.
నిజం చెప్పద్దూ! రాయడమే కాదు.. చదవడంమీదకూడా నాకాట్టే ఆసక్తి లేదు చిన్నప్పట్నుంచీ. ఆ రాతలూ కోతలూ కవులకి.. ఆఫీసుల్లో క్లర్కులకీ.. దస్తావేజులాఫీసుల్లో డాక్యుమెంటు రైటర్లకీ తప్పని గొడ్డు చాకిరీ అని నా అభిప్రాయం. రిటైరయిన తరువాత పెద్ద పెద్ద అధికారులూ..  రాజకీయాల్లో బాగా నలిగేవాళ్లూ రాస్తారని విన్నాగానీ..  వాళ్ళు నిజంగా సొంతంగా రాస్తారా? అన్న ధర్మ సందేహం ఒహటి నన్నెప్పుడూ పీడిస్తుంటుంది.  వాళ్ళ వాళ్ల వృత్తుల్లో జీవితమంతా  నుజ్జు నుజ్జు చేసుకున్నాక ఇహ   ఓపిక లెక్కడేడుస్తాయీ రాస్తూ కూర్చోడానికి
రాసి పెట్టేందుకు మనుషుల్ని పెట్టుకుంటారంటారు. కాబట్టే కామోసు.. పనుల్లో  ఎంతో బిజీగా ఉన్నా వాళ్ళ పేర్న హఠాత్తుగా అంతంత బౌండ్లు   'ఆత్మ కథలు' వెలువడి పోతుంటాయి!రాతలను గురించి సరే! వాళ్ళు 'ఆత్మ'లను గురించి కూడా కథలు రాయడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది సుమండీ!' అంటుంది మా శ్రీమతి.
రాజకీయాల్లో తిరిగే వాళ్ళెవరికీ ఆత్మలులాంటివి ఉండవని  ఆవిడ దృఢ విశ్వాసం.  ఆమెగారి ఉద్దేశంలో రాసేవాళ్లంతా ఏ యండమూరిలాగానో.. మల్లాది లాగానో.. యద్దనపూడి సులోచనారాణి మాదిరో మంచి  ఆలోచనా పరులో.. మేధావులో అయి ఉంటారని.. ఉండాలని.

ఆ మాటకొస్తే ఆలోచించ గలిగే మేధావులందరికీ రాయలనే బుద్ది మాత్రమే పుట్టాలని రూలెక్కడుంది? జ్ఞానులు  తమ ఆలోచనలను మరింత నిరపాయకరమైన మార్గంలోకి కూడా  ఎందుకు మళ్ళించాలనుకోకూడదు? న్యూటను మహాశయుడు మంచి  ఆలోచనాపరుడే కదా! ఆయన ఆపిల్ చెట్టుకింద కూర్చున్నప్పుడే పండు పడింది. అదృష్టం. అదృష్టం పండు పడ్డందుక్కాదు.  ఆ పండు ఆయన తలపండుమీద పడనందుకు. ఎదురుగా ఆపిల్ పడ్డప్పుడు 'ఆఁ!.. ఏదో పడిందిలేఁ!' అని పట్టించుకోకుండా.. ఏరుకొని కోసుకుతిని మర్చిపోకుండా  'ఎందుకు పడిందబ్బా?!' అని బుర్ర తెగ బద్దలు కొట్టుకోవాలనే  బుద్ధి పుట్టడం కూడా మన అదృష్టమే కదా! ఆయనగారికి అలా బుర్ర బాదుకోవాలన్న ఆలోచన తట్టక  పోయుంటే?! ఇవాళ్టికీ ఇంకా 'E=mc2'   సూత్రం వెలుగులోకే వచ్చుండేది కాదు కదా! ఇవన్నీ మా ఆవిడ పెద్దబుద్ధికి తోచని చిన్నవిషయాలు.. అలా వదిలేద్దాం. ఇప్పటి ఆలోచనంతా పెద్దలు  రాయించే 'ఆత్మ కథల' ను గురించి కదా!
రాయాలనే ఆలోచన రాజకీయ నాయకుల బుర్రల్ని తొలవడం మొదలైందంటే దానిక్కారణం.. ఆ నేతాశ్రీలకి ఆలోచించే తీరిక పుష్కలంగా దొరికిందనేగా! నిత్యం ప్రజల జీవితాలతో ఆటలాడ్డానికే ఎక్కడి సమయం చాలని  పెద్దమనుషుల మనసులను  అలా మాటలమీదకూ  మళ్ళించేందుకు కారణాలు ఏమై ఉంటాయో? ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఒక్కటే అంటే నమ్మలేం.   కట్టిన డిపాజిట్లు పూర్తిగా గంగలో కొట్టుకుపోయినా   రాజకీయాలమీదే ప్రాణం కొట్టుకులాడే బుద్ధి కదా ఆ పెద్దలది?..    ఏదైనా బైటికి  రావడం కుదరని  పెద్ద నేరాల్లో  ఇరుక్కొని బొక్కలో   నాల్రోజులు   గడపక తప్పని ఖర్మ తటస్థపడ్డప్పుడు మాత్రమే  ఇలా రాతలమీదా కోతలమీదా    మనసులు మళ్ళుతాయనుకుంటా.
 గాంధీజీ 'సత్యం తో నా ప్రయోగాలు' కారాగారంలో ఉన్నప్పుడు ప్రారంభించిందే!. ఆయన అప్పట్లో చేసిన నేరం అప్పటి తెల్లదొరల చెత్త పెత్తనాన్ని నిర్ద్వంద్వంగా ధిక్కరించడం. ఇప్పటి నాయకుల నిర్వాకాలతో  ఆ ధీరత్వాన్ని పోల్చేందుకు లేదులేండి. జవహర్ లాల్ నెహ్రూజీ కూడా జైలుగోడల మధ్య ఉన్నప్పుడే కన్నకూతురికోసం ఉత్తరాలు.. జాతి విజ్ఞానంకోసం 'భారత దర్శిని' రాశారు.  నేతల కారాగార జీవిత పుస్తకాల  జాబితా ఏకరువు పెట్టడం మొదలు పెడితే  ఆ చిట్టాకు ఆఖరు పేజీ ఉండదు. అట్లాంటి జాబితా ఒకటి తయారు చేసినా  పాలిటిక్సులో పనిచేసే నేతల చేత   గిలికించాలంటే ఏదైనా  బెయిలు దొరకని నేరంలో గట్టిగా  ఇరికించెయ్యాల్సిందేనన్న   అపోహా ఏర్పడే ప్రమాదం కద్దు. అందుచేత అటువైపు మనం వెళ్ళొద్దు.
అయినా  ఈ- కాలంలో ఎంత  సెల్లుల్లో కుక్కించినా  నేతాశ్రీలకంత  రాసేంత తీరికలు  ఎక్కడేడ్చాయీ?  'సెల్లు'ల సంపర్కం వల్ల సెల్లు సంబంధాల్లో కూడా  బోల్డన్ని మార్పులొచ్చేసాయి.  అంచేత నేతల జైలురాతల గొడవనలా  వదిలేసేద్దాం..
 నేతాగణాలకు అధికార వియోగాలు.. అధికారులకు  పదవీ విరమణ అనంతరం వేధించే సంపూర్ణ విరామాలు.. పుస్తకాలు రాసేందుకు పురిగొల్పే మరో కొన్ని ప్రేరణలు. నానా గడ్డి కరిచి గట్టి జీవితం ఏర్పరుచుకున్న పెద్దమనుషులకు చివర్లో అలా వట్టి మనిషులుగా మిగిలి పోవడం సుతరామూ ఇష్టముండదు.   కాబట్టె   వివాదమేదైనా  రాజేసే అంశాన్ని ఎన్నుకొని ఏ 'ఆత్మ'నో అడ్డం పెట్టుకొని పుస్తకం తీయించి  పారేస్తే.. మళ్లీ వచ్చే ఎన్నికల వరకు   పేరు నలుగురి నోళ్లలో నలిపించుకునేందుకు  వీలుగా ఉంటుందన్నది అసలు పథకం అయుండవచ్చు.
పదవుల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తుకురాని ఆత్మలు.. అంతరాత్మలు   పదవీ వియోగాల తరువాతే ఎందుకు వెంటాడి వేధిస్తుంటాయనే  కదూ  ఆశ్చర్యం!
పని పడనప్పుడు పట్టించుకోక పోవడం.. అవసరం పడ్డప్పుడు అమాంతం వచ్చి  వాటేసుకొనే కళను  సానబెట్టబట్టే కదా నాయకాగణమంతా ఇంతింతి  ఎత్తులకు ఎగబాకుతున్నదీ!  ఇహ ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏముంది?
అమెరికాలో కూడా  ఈ మధ్య ఈ 'అంతరాత్మ' నాటకమే కదా నడిచిందీ! ప్రైమరీ అభ్యర్థుల వత్తాసుతో దేశాధ్యక్ష పదవి అభ్యర్థిత్వంకోసం పార్టీ తరుఫున జరిగే  పోటీలో  చివరి దశకు చేరుకున్నాడా 'ట్రంప్' మహాశయుడు! ఆ మహానేతకూ  సొంత  పార్టీ అంతరాత్మలనుంచి  అసమ్మతి సెగలు తప్పలేదు! ఇప్పటికిప్పుడైతే ఆ నిప్పేమీ రాజుకోలేదు గానీ..  విచిత్రం ఏదైనా జరిగి ప్రత్యక్ష ఎన్నికల తదనంతర దశలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సిన  దుర్భర పరిస్థితులు కనక  దాపురిస్తే ట్రంపుగారు మాత్రం గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారా?  కథలు రాయడానికి తన అంతరాత్మను నిద్రనుంచి లేపకుండా ఉంటారా? ‘లేపడని గ్యారంటీ ఏంటీ?
అమెరికా ట్రంపుల.. దువ్వూరి సుబ్బారావువంటి మాజీ ఆర్ బి ఐ   పెద్దల 'అంతరాత్మ'లు చేయాల్సిన  పెద్దపనులు  అతి సామాన్యుణ్ణి నేను  చేయడానికి పూనుకొంటే ఏం బావుటుంది?

ఆ మాటే పక్కసీటు అభిమానికి   ‘నచ్చ చెప్పడమెలాగురా దేవుడా?’ అని తన్నుకులాడుతున్నానా.. ఉరుములేని పిడుగులాగా వచ్చిపడ్డ టిక్కెట్ కలెక్టరుగారే నన్నా ఆపదనుంచి గట్టెక్కించేసారు!
పక్కసీటు  పెద్దాయన పేర్న  భారీ చలానా రాసి ఇచ్చి  ఆ మహానుభావుడి 'రాత' ముచ్చట ఇంచక్కా తీర్చేసి కథ సుఖాంతం చేసేశారు
 రిజర్వేషను కానీ.. ఫస్టు క్లాసు గానీ.. బోగీ ఏదైనా.. జనరల్ కంపార్టుమెంటు రేటుకి మించి కానీ అదనంగా పెట్టి టిక్కెట్టు కొనే అలవాటు లేదుట ఆ పెద్దమనిషికి ఎంత పెద్ద దూరప్ప్రయాణాలు  పెట్టుకొన్నప్పుడైనా!
అదీ మేటరు!
-కర్లపాలెం హనుమంతరావు
***
(వాకిలి- అంతర్జాతీయ పత్రిక- లాఫింగ్ గ్యాస్- ఆగస్టు, 2016 లో ప్రచురితం)



Thursday, July 14, 2016

కామెడీ కథః స్వర్గం- నరకం


ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారంరోజుల గడువుంది. ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!
ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాలకోసం నరాలుతెగే ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.
అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే.. కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.

ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ!  ఆమ్ ఆద్మీలకంటే ఇలాంటి చేంతాళ్ళు అలవాటేగాని.. శనివారం తిరుమల శ్రీవారి సుప్రభాతసేవ దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యంలేని పెద్దాయన  రాంభద్రయ్యగారిలాంటివారికి ఈ  క్యూలు వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.
ఇదేమీ భూలోకం కాదు. లాబీయింగుకిక్కడ బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం ఎదురుచూడడం  రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని వ్యవహారం. అక్కడికీ ఎవరూ చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.
'ఇదేం మీ భూలోకం కాదయ్యా భద్రయ్యా! మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు కుదరవిక్కడ.  ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ ఫలితాన్నిబట్టే నీకు స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు. అప్పుడే అంత అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం నీళ్ళకోసం, రేషన్ కోసం, గ్యాసుబండలకోసం, ఏడుకొండలవాడి దర్శనంకోసం.. ఎన్నేసి రోజులు నిలువుకాళ్ళ కొలువులు సాగిస్తారో నీకేమైనా అవగాహన ఉందా?' అని గదమాయించాడు దేదదూత (దేవుడు, దయ్యం కలగవలసిన అంశ దేదదూత)
'ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో చూసావా?ముందు నా స్వర్గం సంగతి తెముల్చు!' పాయింటు లేనప్పుడు టాపిక్కుని పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.
చిత్రగుప్తుడి దగ్గరకొచ్చింది కేసు.
చరవాణిలో ఆయనగారు ఎవర్నో(దేవుణ్ణే అయుండాలి) కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి అన్నాడు 'ఓకే పెద్దాయనా! మీదేమో రాజకీయనేతల ఫాయిదా! కనక ప్రత్యేక పరీక్ష పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే  మీకు పాతజీవితం తాలూకు  పాప పుణ్యాలతో నిమిత్తం లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో ఎన్నుకోవచ్చు!'
'నాకు స్వర్గమే కావాలయ్యా!'
'ఆ తొందరే వద్దు. ఆసాంతం విను ముందు! ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి'
'ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!'
'సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం' అని దేదదూత  వంక సాభిప్రాయంగా చూసాడు చిత్రగుప్తుడు. అర్థమైందన్నట్లు రామచంద్రయ్యగారి భుజంమీద చెయ్యేసి బలంగా కిందికి నొక్కాడు దేదదూత.
కనురెప్పపడి లేచేటంతలో రాంభద్రయ్యగారి కంటిముందు.. నరకం!
నరకం నరకంలా లేదు! స్వర్గంలా వెలిగిపోతోంది. శ్రీరామనవమినాటి భద్రాచలం, ఒంటిమిట్టల సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు, మరకత.  మణిమాణిక్యాలతో  నిర్మితమైన  రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో ఆవరణమంతా గానాబజానా వాతావరణంతో మత్తెక్కిపోతోంది. అదనంగా మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తిలోత్తమాదుల్ని తలతన్నే అందగత్తెల   అంగాంగ  శృంగార నాట్యభంగిమలు!
పాతమిత్రులందర్నీ అక్కడే చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన చేసి కోట్లు వెనకేసిన  స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది కంటపడితే చాలు వెంటాడైనా సరే  కోరిక తీర్చుకునే కీచకాధములు, అధికారంకోసం మనుషుల ప్రాణాల్ని  తృణప్రాయంగా తీసేసే  పదవీలాలసులు, ఉద్యోగాలు.. ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి ఆనక  బోర్డ్లు తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు,  సర్టిఫికేట్లు, కరెన్సీ నోట్లు, మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు, నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా  దర్జాగా కర్రపెత్తనం చేసే దళారులు..  అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ, తూలుతూ, పేలుతూ  యధేచ్చగా చిందులేయడం చూసి రాంభద్రయ్యగారికి మతిపోయినంత పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది.. తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా చూపించే యమకింకరులు   కూడా చాలా    ఫ్రెండ్లీగా       కలగలిసిపోయి           వాళ్లమధ్య
కలయతిరుగటం! అతిథుల భుజాలమీద ఆప్యాయంగా  చేతులేసి,  బలవంతంగా సుర లోటాలు లోటాలు తాగించడం.. లేట్ నైట్ జోకులేస్తూ జనాలను అదే పనిగా కవ్వించడం.. నవ్వించడం! ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని అప్పటివరకు రాంభద్రయ్యగారికి తెలియనే తెలియదు. పగలంతా ఎంతానందంగా గడిచిందో .. చీకటి పడ్డాక అంతకు రెట్టింపు సౌకర్యాలు సమకూర్చబడ్డాయి. ఏకాంతంలో అతిలోకసుందరులెందరో   బరితెగించి మరీ  ఇచ్చిన సౌందర్య ఆతిథ్యాలు  ఎన్ని జన్మలెత్తినా మరువలేనిది.
ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే  ఈ నరకసుఖాలని  చచ్చినా వదులుకోరాదని.
కానీ.. షరతు ప్రకారం మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం సాంత్వన సంగీతమంటే   ఏదో ఒక ఐదారు నిమిషాలు  ఓకేగానీ..  మరీ   రోజుల తరబడి ఆకాశవాణి సంతాపసంగీతం  తరహా అంటే.. మాజీ ప్రధాని మన్మోహన్జీకయినా తిరగబడాలనిపించదా! ఒక వంక కడుపులో పేగులు కరకరామంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ  ప్యారడైజ్ బిర్యానీనో పడుతుంటే మజాగానీ .. అజీర్తి రోగిమాదిరి అసలాకలే లేని హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే! దప్పికతో నిమిత్తం లేకుండా ఏ   బాగ్ పైపరో.. ఆఫీసర్సు చాయస్సో.. స్థాయినిబట్టి ఆరగా ఆరగా ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా బెత్త దూరంలో జిల్లుమన్నట్లుండేది!  ఎంత అతి మధురామృతమైనా సరే ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం ’చీర్స్’ కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి గుటకలేస్తూ కూర్చోడం కంటే.. ‘ఛీ!’ అంతకన్నా ప్రతిపక్షంలో ఐదేళ్ళపాటు అవస్థలు పడ్డం మేలు! ఆకలి దప్పులు, నిద్ర నిప్పులు, మంచి చెడ్డలు, ఆరాటాలు.. పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే రాంభద్రయ్యలాంటి ఆసులో కండెలకు అసలు అయే పనే కాదు.  
'ఎవర్నుద్దరించేందుకు, ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో.. జన్మరాహిత్యం.. కోరుకోవాలి బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు, చీనిచీనాంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,. స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని ఒక్క రోజులోనే  తేలిపోయింది.  వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే అయినప్పుడు ఆ నరకంలోనే స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని’.
మర్నాడు   చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో ఆలోచన  లేకుండా నరకానికే ఓటేసేసారు రాంభద్రయ్యగారు.
ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు పెట్టిన పెద్దాయనకి కళ్ళు బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.
నరకం మునుపటి స్వర్గంలాగా లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న  మురికివాడకు నకలుగా ఉంది.  మొన్నటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి బొత్తిగా సాపత్యమే లేదు!
మొన్నటి దృశ్యం- ఒబామాజీ భారతావనికి పర్యటనకు వచ్చేముందు తీర్చిదిద్దిన సుందరనగరం!
నేటి దృశ్యం- వినాయక నిమజ్జనం మర్నాటి ట్యాంకు బండు కింది హుస్సేన్ సాగరం!
పైనుంచీ ఆగకుండా అదే పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ చెత్తను  ఎతిపోస్తున్నది  వేలాదిమంది కూలీజనం.
నిజానికి  వాళ్లంతా మొన్నరాంభద్రయ్యగారు నరక  సందర్శనార్థం  విచ్చేసినప్పుడు-  పిలిచి ఆతిథ్యమిచ్చిన  గేస్తులు! భూలోకం తాలూకు పురానా  నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు  వేళ్లాడుతున్న దుస్తులు  అప్పటికిమల్లే  చీని చీనాంబరాలు కాదు. చివికి, చినికి, చీలకలైన మసి పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ పెద్దలంతా  భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన గౌరవనీయులు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు వాళ్ల వీపులమీద ఇప్పుడు కొరడా దెబ్బలు ‘ఛళ్ళు’మని  పడుతున్నాయి! ఆ కొరడాధరులంతా మొన్న ఇదే చోట శిబిచక్రవర్తిని,  అంబరీషుణ్ణి మించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని మురిపించి మైమరిపించిన   యమకింకరాధములు!
నోటమాట రాకా మాన్పడిపోయిన రాంభద్రయ్యగారి చేతిలోకూడా ఓ పెద్ద చెత్తబుట్ట పెట్టి ముందుకు తోసాడో యమకింకరుడు. ఆగ్రహం పట్టలేక నరాలు చిట్లేంత బిగ్గరగా గావుకేక వేసారు రాంభధ్రయ్యగారు 'మోసం!.. దగా! మొన్న నరకానికి స్వర్గధామంగా విపరీతమైన కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక ద్రోహం.. కుట్ర!'
తాపీగా సమాధానమిచ్చాడా యమకింకరుడు 'ద్రోహానికి.. కుట్రకి.. ఇదేం మీ భూలోకం కాదు మానవా!  నువ్వు నరకాన్ని చూసిన రోజు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు సాగుతున్నది. ఆ ఎలక్షన్లన్నీ  అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న నరకానికే కదా నిన్నిప్పుడు తరలించింది? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ భూమ్మీద జనానికి ఎన్నికలప్పుడు  మీరు చేసే హామీల్లోనూ.. చూపించే రంగులకలల్లో కూడా మోసం.. దగా ఉన్నట్లే లెక్క!
రాంభద్రయ్యగారింకేదో వాదనకు దిగబోతుంటే ఆకాశంలోనుంచి వాణి వినిపించిందీసారి పరమ  గంభీరంగా ’ముందే చెప్పాం గదా రాంభద్రయ్యా!  భూమ్మీద మీలాంటి మహానేతలు నడిపిస్తున్న ప్రజాస్వామ్య విధానాలనే మేమూ ఇక్కడ పైలోకాల్లో అనుసరిస్తున్నామీ మధ్య అని'
'అబ్బా!' అని రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కింకరుడు కొట్టిన కొరడా దెబ్బకు రాంభద్రయ్యగారి రియాక్షన్! భూలోకంలో  ప్రజాస్వామ్యం వంకతో కుపరిపాలన సాగించే   రాంభద్రయ్యగారి సహచర గౌరవనీయులందరికీ ఆ  పెడబొబ్బలు వినిపిస్తే బాగుణ్ణు!
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాల పత్రిక జూలై 2016- లాగింగ్ గ్యాస్ కాలంలో ప్రచురితం)















Tuesday, July 5, 2016

గొడుగులు- గొడవలు- ఒక సరదా గల్పిక




'ఎవరదీ?'
నేనే బాబాయ్! ఛత్రపతిని'
'వానా వంగడం ఏవీ లేదు కదట్రా! ఇప్పుడీ నడివీధిలో ఒక్కడివే గొడుగేసుకొని ఏవిట్రా  విచిత్రంగా!'
'ఇవాళ 'గొడుగుల దినం' కదా బాబాయ్.. అమెరికాలో! .. అందుకనీ..'
'మూలన పడున్న ఈ ముతక గొడుగుని బ్సిటికి తీసి ఇలా ఊరేగిస్తున్నానంటావ్!  అదేదో దేశంలో జరిగే 'దినం' పేరు చెప్పి ఇక్కడిలా వూరికే ఊరేగుతున్నావంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదురా బాబ్జీ!.. అమెరికానుంచి పట్టుకొచ్చిన పైత్యమేమో అనిపిస్తున్నది!'
'సీమదొరలకి మనలాగా గొడుగులు.. గిడుగులు జాన్తా నై బాబాయ్!  పరమ నామర్దా కూడా! వాళ్ళు  నెత్తిన పెట్టుకొనేది ‘టోపీ’ ని!. మనమే! ఎండకూ వానకూ మాడును కాచి కాపాడే గొడుగుని వాడకం  అయినాక  గోడకు వేలాడదీసేది!'
'అబ్బో! టిక్కెట్టిచ్చి గెలిపించిన పార్టీ అధికారంలోకి రాలేదని.. దాన్నో మూలన పడేసిని   ఘనుడివి! ధర్మా పన్నాలొద్దు! మన వాళ్ళు  గొడుగుల్ని పనయినాకా  అటకెక్కిస్తారని కదూ నీ వెధవ అభియోగం! చేతిలో గొడుగు లేకుండా కాలు బైటపెట్టని తరం  మా నాన్నగారిది! మా తాతల కాలంలో అయితే గొడుగు పెద్దరికానికో ముఖ్యమైన గుర్తు. పాత సినిమాలు చూస్తావో.. లేదో! రాజ్ కపూర్ .. నర్గీస్ దత్తుల ప్రేమకహానీలో గొడుగుదే పెద్ద పాత్ర! పిలగాడివి.. నీకు చరిత్ర తెలీదు.  ఛాంర్లేనుకు గౌరవం పెంచిందీ.. చార్లీ చాప్లిన్కి గుర్తింపు తెచ్చి పెట్టిందీ ఈ ఛత్రమే  ఛత్రపతీ! శివాజీ మహారాజుకి ఛత్రపతి బిరుదెలా గౌరవం పెంచిందో తెలుసా! రాయలవారికి తన వెనక గొడుగు పట్టి పరుగెట్టే  గోపాలుడంటే గొప్ప ప్రీతి. రాయసానికే కాదు ఛత్ర చామరాలు.. దైవత్వానికీ పెద్ద ఆకర్షణలే బాబూ మన సంప్రదాయంలో. రాళ్ళవాన బారినుంచి ఆబాలగోపాలాన్ని కాపాడేందుకు బాలకృష్ణుడు గోవర్ధన్నాని గొడుగులా ఎత్తి పట్టుకొన్న వైనం నీకు తెలుసా?   బలిని పాతాళం అడుగున  తొక్కేందుకు బయలుదేరిన అవతార మూర్తి వామనుడి నెత్తిమీదా అలంకారంగా ఉండేది ఈ గొడుగే!  ఏదుకొండలవాడి కొండకి ఏటేటా అరవదేశంనుంచి తరలి వచ్చే గొడుగుల ఉత్సహం సందడి  నీకు తెలీదులాగుంది! నీకు తెలిసిందల్లా మీ మార్కు  రాజకీయాల్లో   ఏ ఎండకు పట్టే ఆ గొడుగులూ,,  ఏకఛ్చత్రాధిపత్యంకోసం పక్క పార్టీలనుంని అభ్యర్థులను గొడుగు కర్రలేసి లాక్కోవడాలు!'
'రాజకీయాల్లో ఉన్నామని కదూ మా మీద ఈ  రాళ్ల విసురుళ్లూ?! ఏ ఎండకు ఆ గొడుగు పట్టే గాలివాటం సరుకు పుట్టాగొడుగుల్లా పుట్టుకొస్తున్న మాటా నిజమే! కానీ  కారణం ఎవరు బాబాయ్? ఎన్నికల సంఘాలే 'గొడుగు'ను గుర్తుగా అంగీకరించాక మా నేతల ఒక్కళ్లమీదే  ఇలా బురద చల్లుళ్లు.. ఏవన్నా బావుందా! చెత్త నేతల గతం తెలిసీ నెత్తికి గొడుగు పడుతున్న ఓటర్లది అసలే తప్పు లేదంటాప్ .. పాపం!'
'నీతి నిజాయితీలనేవి బొత్తిగా లేని రాజకీయనాయకులే అందరూ.. అని నేనడంలేదులేరా నాయనా! ఒహటీ అరా ఒకవేళ అలాంటి  చాదస్తులు ఇంకా ఎక్కడైనా  మిగిలున్నా .. మీ తరం వాళు వాళ్లకిస్తున్న మర్యాదల మాటేమిటీవయసుమీద పడిందనో.. వంట్లో ఓపిక సన్నిగిల్లిందనో.. ఏదో ఒహ వంక కనిపెట్టి పాతకాలంనాటి పనికిరాని గొడుగులకు మల్లే గోడలకు వేలాడదీయడంలా!.. ఎందుకురా అర్థాంరంగా ఇప్పుడంతలా నవ్వులూ!'
'గోడకు వేలాడె గొడుగు గుర్తుకొచ్చిందిలే బాబాయ్!  చూసేందుకది అచ్చంగా చెట్టుకొమ్మకు  వేలాడే గబ్బిలం మాదిరిగా ఉంటుందిగదా! నవ్వాగలేదు!'
'గోడకు వేలాడుతున్నా.. వీధిలో ఊరేగుతున్నా.. గొడుగులది ఎప్పుడూ గబ్బిలాల రూపమేరా బాబిగా! పిచ్చుకలు.. పిచ్చికాకులు అంతరించిపోతున్నాయని అంతలా  ఆక్రోశ  పెడుతున్నారే  జనాలు!  మరి ఇప్పుడీ  గొడుగులకు పడుతున్న దుర్గతులను గురించి పట్టించుకోరా ఎవ్వరూ!! ఎందుకు?'
' గొడుగు ఈ ఈ-కాలం తరానికి కి బొత్తిగా పొసిగే సరుకు కాదులే   బాబాయ్!  మూడు కాళ్ళ ముసలయ్యలక్కూడా గొడుగుతో బైట కనబడ్డం పెద్ద నామర్దా అయిపోయిందిప్పుడు.  చరవాణుల్లో సందేశాలందించేందుకే రెండు చేతులూ చాలడం లేదు సుందరాంగులకి.. మళ్లీ గొడుగొకటి నెత్తిమీదకంటే పెద్ద గొడవలయిపోతాయి! ఎన్నిరంగులు.. హంగులతో  హొయలు పోయే సరుకు సంతలోకొస్తే మాత్రం ఛత్రాన్ని  కొనే చాదస్తం ఎవరికుంటుంది .. చెప్పు! గొడుగులకన్నా.. చరవాణి తొడుగులు అమ్ముకోవడం లాభదాయకం అనుకుంటున్నారు బజారు  వ్యాపారస్తులు! రద్దీగా ఉండే బస్సుల్లోకి తోసుకొని ఎక్కడం రాక కిటికీ చువ్వలగుండా సీటుమీద  చేసుకొనేందుకు మినహా ఇప్పుడీ గొడుగు కర్రలు ఎందుకూ పనికొస్తున్నాయి చెప్పూ! ఎన్నికల సంఘమొక్కటే  దీనిమీదింకా ముచ్చట పడుతున్నది.  అభ్యర్థికి గుర్తుగా అదింకా  దీన్ని ఆమోదిస్తుండటమే ఒహ గొప్ప విషయం. 'ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి చట్టబద్ధమైన ప్రజాస్వామిక  హక్కుగా జనం ఎందుకు ఆమోదించడం  లేదో అర్థం కాకుండా ఉంది నాకిప్పటిక్కూడా!’
'జనామోద ప్రమోదాలమీదే ఇంకా మన నేటి రాజకీయాలు  నడుస్తున్నాయనే నన్ను భ్రమ పడమంటావుట్రా సన్నాసీ! ఇప్పుడు నువ్వు ఈ గొడుగు పట్టుకు తిరగాడినికి కారణం నిజంగా అమెరికా గొడుగుల పండుగ' సందర్భం అవునో కాదో చేప్పేపాటి జ్ఞానం నాకు లేకపోవచ్చుగాని..  ఇక్కడ నడుస్తున్న రాజకీయం మాత్రం  అమెరికా తరహా జనామోద అధ్యక్ష ఎన్నికల తరాహాలోవి కాదని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అదేంటిరా! మాట పూర్తి కాకుండానే ఎక్కడికా పరుగులు! అరేయ్.. ఛత్రపతీ! నిన్నే!,, నిన్నే!..'

'సార్! ఇప్పుడా గొడుగు వేసుకొని ఉరకలెత్తుతున్న మనిషి ఎవరో చెప్పగలరా?'
'ఛత్రపతి! అదేనయ్యా! మొన్నటి మన  నగర పాలిక ఎన్నికల్లో మనమంతా  ఓట్లేసి గెలిపించిన వార్డు అభ్యర్థి! ఇంతకీ మీరు ఎవరు? మా ఛత్రపతితో మీకేంటి అంత గత్తర?'
'సార్! మీ  ఛత్రపతి ఎన్నికల్లో గెలిచిన తరువాత సర్కారు పార్టీలోకి గెంతాడు కదా! నగర పాలిక కార్యాలయంలో గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తానని నా దగ్గర ఐదు లక్షలు నొక్కేసాడు. ఇప్పటి వరకు నౌఖరీ లేదు.. కదా.. కనీసం.. నా  డబ్బులు తిరిగివ్వమని అడుగుతున్నా .. ప్రయోజనం లేదు. ఎదురు పడ్డప్పుడల్లా ఇలా ఏ గోడనో.. గొడుగునో.. చాటు చేసుకొని.. మొహం తప్పించేస్తున్నాడు..'
ఇప్పుడర్థమయింది.. ఎండా వానా  ఏవీ లేక పోయినా .. ఇలా వీధిలోకి వచ్చినప్పుడల్లా  గొడుగు ఎందుకు వాడుతున్నాడో మా ఛత్రపతి!
అమెరికా గొడుగుల పండుగా కాదు.. పాడూ కాదు! ఇది ఇండియా రాజకీయాల గొడవ!
***
కర్లపాలెం హనుమంతరావు
 (అమెరికాలో జూలై 6 గొడుగుల పండుగ- ఆ సందర్భంగా)



Monday, July 4, 2016

పప్పుచెక్కల కనకమ్మ- చిన్నకథ


వేటపాలెం అంటే బైటి వాళ్లకి జీడిపప్పు గుర్తుకు రావచ్చేమో కానీ.. అక్కడ పుట్టి పెరిగిన మాకు మాత్రం అంతకు మించిన రుచిగా ఉండే కనకమ్మ పప్పుచెక్కలు గుర్తుకొస్తాయి.
మా చిన్నప్పుడు వేటపాలెం చాలా చిన్నఊరు. మద్రాసు హైవే రోడ్డైనా కనకమ్మ కొట్టు మలుపును తప్పించుకు పోయేందుకు లేదులారీ డ్రైవర్లు.. బస్సు డ్రైవర్లు.. బాణలి పెట్టున్న సమయంలో అటుగాని వస్తుంటే బళ్ళు పుకొని మరీ  పప్పుచెక్కలు పొట్లాలు కట్టించుకొని పోతుండేవాళ్ళు. ఆలస్యమయినా ప్రయాణీకులకుకూడా  పెద్ద అభ్యతరం ఉండేది కాదు. వాళ్లకి మాత్రం కనకమ్మ పప్పుచెక్కలేమన్నా చేదా!
మొదటాట సినిమాకు పోయేందుకు మా అమ్మావాళ్లు ప్రోగ్రామ్ వేసినప్పుడల్లా.. సినిమాకన్నా ముందు కనకమ్మ పప్పుచెక్కల రుచి గుర్తుకొచ్చి నోట్లోకి నీళ్ళు వచ్చేవి మా పిల్లలకు. సినిమా చూసి తిరిగొస్తూ దారిలో ఆగి అమ్మావాళ్లు కొనిచ్చే పప్పుచెక్కలు కరకరలాడించుకొంటూ ఇంటికొస్తేగాని  మంచినిద్ర పట్టేది కాదు మాకు.
ఇష్టాన్నీ ఒక పట్టాన బైటపెట్టని మా నాన్నగారూ అమ్మ తెచ్చే పప్పుచెక్కలకోసం అప్పటివరకు భోజనం చెయ్యకుండా కూర్చొనుండేవాళ్ళు!
పపుచెక్కల కనకమ్మతో మా పిల్లకాయలకి మరో పండుగ అనుబంధంకూడా ఉంది.
వినాయకచవితి పూట తొమ్మిదిమంది వినాయకుళ్లను చూసి.. తొమ్మిది ఇళ్ల పెద్దలతో శాపనార్థాలు పెట్టించుకొంటే పిల్లల ఆయుర్దాయానికి ఢోకా ఉండదని ఓ నమ్మకంమా పిల్లల తిట్లుతినే  పెద్దలజాబితాలో  కనకమ్మస్థానం ఎప్పుడూ పదిలంగా.. ప్రథమంగానే ఉండేది.
మగదిక్కులేని ఒంటరి ఆడమనిషిని కవ్వించి తిట్లు తినడం మా పిల్లలకి సులభంగా ఉండేది. ముళ్లజిల్లేళ్ళు.. రాళ్లు..  సేకరించుకొని తెల్లారకుండానే కనకమ్మ ఇంటిముందు చల్లేవాళ్లం. మా అల్లరి బృందానికి సాంబడు నాయకుడుఆమె ఆపకుండా శాపనార్థాలు పెడుతుంటే వీనులకు విందైన సంగీతం వింటున్నంత ఆనందం కలిగేది మా పిల్లకాయలకి. 'మీ దెవసం చెయ్య!' అంటూ కొత్త కొత్త తిట్లు  కనిపెట్టి మరీ ఆమె రెచ్చిపోతుంటే పిచ్చ ఆనందంతో సాంబడు గంతులేయడం నాకిప్పటికీ బాగా గుర్తు.
కనకమ్మ దుకాణాన్ని అక్కణ్ణుంచి లేపేయించాలని పక్కనున్న హుస్సేస్ సాహెబ్ ది ఎప్పణ్నుంచో పథకం. కనకమ్మకు అత్తగారినుంచి వచ్చిన ఆస్తి  చిన్న పెంకుల వసారా. రెండు పెద్ద భవంతుల మధ్య దిష్టిపిడత మాదిరిగా ఉన్నదని హుస్సేన్ సాహెబ్ చిరాకు!.
హుస్సేన్ సాహెబ్ బీడీల వ్యాపారంతో గడించిన సొమ్ముతో కనకమ్మ అత్తగారినుంచి ఒకానొకప్పుడు ఆ భవంతులున్న స్థలం మొత్తం అధికధర పోసి కొన్నాడు. హైవేమీద ఉండటం ఒక కారణమైతే.. ఏ వ్యాపారానికైనా అచ్చివస్తుందన్న సెంటిమెంటు ఒకటి. సెంటిమెంటుకి మతంతో నిమిత్తమేముంటుంది!
కనకమ్మ కొరకరాని కొయ్యగా మారింది సాహేబుకి. ఆమెచేత దుకాణం ఖాళీ చేయించాలని చూసినప్పుడల్లా కనకమ్మ బెజవాడ కనకదుర్గమ్మే అయేది. స్థానిక ఎమ్మెల్యే ప్రాబల్యంతో హుస్సేన్ సాహెబ్  కనకమ్మమీద  వత్తిడి పెంచిన రోజుల్లో ..
ఒకరోజు మద్రాసునుంచి పొన్నూరు పోతూ తమిళనాడు గవర్నరుగారి సతీమణిగారి కార్లు కనకమ్మ దుకాణంముందు రెండుగంటలపాటు  ఆగాయి! తిరిగి వెళ్లే  కాన్వాయిలో ఉన్న వాళ్లందరి చేతుల్లో పప్పుచెక్కల పొట్లాలు చూసి ఊరు ఊరంతా  అవాక్కయింది!
తరువాత విచారణలోగాని తేలలేదు..  కనకమ్మ బంధుబలగం సామాన్యమైంది కాదని. ఆమెతో పెట్టుకొంటే 'గురువుగారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది' అని ఎమ్మెల్యే తప్పుకోవడంతో హుస్సేన్ సాహేబు ఇంకేమీ చప్పుళ్లు చెయ్యలేక చతికల పడిపోయాడు.
మనుషులు ఊరుకున్నారని కాలం రుకుంటుందా! నాలుగేళ్ళు గడిచేసరికి కనకమ్మ ఫొటోకి దండ పడింది.
ఆమె పప్పుచెక్కల దుకాణం రూపం మారింది. అది ప్పుడు దిక్కూమొక్కూలేని ఆడవాళ్లకు.. పిల్లజెల్లాకు మళ్ళీ నీడ దొరికేదాకా ఆశ్రయమిచ్చే ఉచిత మధ్యంతర ఆశ్రమం. ప్రభుత్వ ఆర్థికసాయానికి తోడు కనకమ్మ పప్పుచెక్కలు అమ్మి పీనాసితనంతో కూడేసిన ఐదు కోట్లు మదుపుతో మొదలయింది స్వచ్చంద సేవాగృహం.
వినాయక చవితి పండుగనాడు పిల్లలచేత రాళ్లేయించుకొని 'మీ దెవసం చెయ్య!' అంటూ  పడరాని తిట్లు తిట్టిపోసిన కనకమ్మ వాస్తవంలో అనాథ పిల్లలెరూ నిజంగాదెవసం సాలుకారాదన్న మంచి ఉద్దేశంతో స్థాపించిన ఆ సేవాగృహానికి ఇప్పుడు ధర్మకర్త మా సాంబడే!
ఇప్పటికీ ప్రతీ చవితినాడు ఊళ్లోని పిల్లకాయలు ఆ  వసతిగృహంమీద రాళ్లేస్తుంటారు. వసతిగృహంలోని  పెద్దలు పిల్లల్నితిట్లతో దీవిస్తుంటారు. లాగే   జరాగలన్నది చనిపోయేముందు కనకమ్మ చివరి కోరిక!
పండగ తొమ్మిది రోజులూ కనకమ్మ దుకాణం పప్పుచెక్కలు ఊరి పిలలకీ.. పెద్దలకీ ఉచితంగా  పందేరం కూడా

*** 
-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...