Tuesday, September 20, 2016

ముళ్లపూడి 'పూల'రెబ్బలు!- చిరు వ్యాసం

ముళ్ళపూడి వెంకట రమణగారు మనకున్న హాస్య రచయితల్లో 'సీరియస్' హాస్యరచయిత. ఏ  రచయితకయినా ఓ బాణీ ఉంటుంది. ఉండాలి. అలా ఉండకుండా 'అల్లాటప్పా' గా రాసే  రచయితను.. సొంతంగా ఎంత ప్రొమోట్ చేసుకున్నా .. మొహమాటానికైనా  సమాజం గుర్తించినట్లు మొహమైనా పెట్టదు. ఆ బాపతు జాబితాలో లేనందువల్లే ము.వెం.రమణను గురించి మన ముచ్చట్లిక్కడ. 
ముళ్లపూడివారు విలక్షణమైన శైలిలో సునిశితమైన హాస్యరసౌషధాన్ని వడగట్టి మరీ రోగిష్టిమారి సమాజానికి అక్షర చికిత్స చేసిన హాస్య నారాయణుడు. మణిప్రవాళ భాష ఆయన ప్రత్యేకత. 'పురాణం' సీత వచ్చే వరకు.. (వచ్చిన తరువాత కూడా).. ఆ మిక్సరు  శైలిలో అంతగా గిలిగింతలు పెట్టిన వినోద రచయితలు ఆ స్థాయిలో మనకు  దొరకరు. అతిశయోక్తికో.. అలంకారానికో అంటున్న మాట కాదిది.
ఒక భాషలోని పదాలను మరో భాషలోకి పట్టుకొచ్చినా.. 'పరాయి పదాలు' అవన్నీఅంటూ  మరెవరో  పనిగట్టుకొని వచ్చి దెప్పిపొడిచేదాకా చదువరి బుద్ధికి తోచనంత గడుసుగా రాసుకు పోవడం ముళ్లపూడివారి కలం బలం. ఒకసందర్భంలో ఆయనే  'ప్రారంభంలో   'మణి ప్రవాళ భాష'ను ప్రయోగిస్తున్నప్పుడు.. ప్రచురించేందుకు పంపించిన పత్రికాఫీసుల్లోని దిద్దుబాటు పెద్దలు (ఎడిటర్లు) ఆంగ్లపదాలను పనిగట్టుకొని మరీ దిద్దిపెడుతుండేవారు. ప్రతీ రచనకు ఒక తనదైన పరిమళం (ఎస్సెన్సు) ఉంటుది కదా! ఆ సౌరభాన్ని సమాజం గుర్తించే వరకు పాలుమాలకుండా నేను అలా రాసుకుంటూ పోవడమే  రచయితల శ్రేణిలో నా పాలుగా  నేను సాధించుకున్న విజయం.. ఏదైనా ఉంటే!'.. అంటారు. సరిగ్గా ఇలాగే అనక పోయినా ఈ అర్థం వచ్చేవిధంగా చాలా సందర్భాల్లో చెప్పుకొస్తుండేవారు.
ముళ్లపూడి వారిది మరీ విదూషక సాహిత్యం అనుకుంటే ఆయన అక్షరాన్ని  సరిగ్గా అర్థం చేసుకోనట్లే. విషయం ఎంత గంభీరమైనదయినా సరే .. చదువరుల బుద్ధికి సరళంగా.. సర్దాగా..  ఎక్కించేటందుకు ఆయన స్వయంగా కనిపెట్టుకున్న కనికట్టు విద్య ఆయన శైలి. 'సీరియస్' అంశాన్ని సీరియన్ గానే రాయలేక ఈ అగచాట్లన్నీఅని విమర్శలకు దిగేవారికి ఆయన 'కానుక' కథ   ఒక చక్కని సమాధానం.
ముళ్లపూడి వెంకట రమణ లేకపోయుంటే 'హలో! ఓ ఫైవుందా?' అంటూ వెంటబడే అప్పుల అప్పారావు పుట్టుండేవాడు కాదు. బుడుగు.. సీగాన పెసూనాంబల అల్లరితో తెలుగిళ్ళు తుళ్ళి పడుండే ఆస్కారం ఉండేది కాదు. రాధా గోపాళాల సరిగమల సరాగాలతో తెలుగు సాహిత్యపు పడకటిళ్ళు  శృంగారభరితమై ఉండేవి కావు. బాబాయి.. పొడుగు జడల సీత.. పక్కింటి లావుపాటి పిన్నిగారి మొగుడుగారు.. జట్కావాడు..ఓత్లవాడు.. పెట్టే ప్రయివేట్లు తెలుగు ప్రజలకు దక్కే లక్కుండేది కాదు. తెలుగు సాహిత్యానికి   బాపు 'బొమ్మ'ను అందిస్తే ఆ బాపూబొమ్మకు చిలక పలుకులు  నేర్పించింది ముళ్లపూడి వెంకట రమణే.
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 'ముళ్లపూడి వెంకట రమణ సాహితీ సర్వస్యం' పేరిట  కథలు రెండు సంపుటాల్లో, బాల సాహిత్యం ఒక సంపుటం, సినిమా విశేషాలు రెండు సంపుటాల్లో, అనువాదాలతో ఒక సంపుటం.. అఖరున కదంబ సాహిత్యం గుదిగుచ్చిన రెండు సంపుటాల్లో.. (నాకు తెలిసినంత వరకు) శ్రీ ఎమ్బీఎస్ ప్రసాద్ గారి సంపాదకత్వంలో ప్రచురించారు. దాదాపుగా ఇవన్నీ నేను వివిద పత్రికల్లో చదివినవయిప్పటికీ అన్నింటినీ ఒకే చోట గుదిగుచ్చిన పూమాలలు కాబట్టి   నా చిన్ని గ్రంధాలయంలో  ఇష్టంగా అమర్చుకొని .. 'మూడ్' బావో లేనప్పుడల్లా .. ఆఘ్రాణిస్తుంటాను. హాస్యం.. వ్యంగ్యం నా విశ్రాంత సమయానికి ఇంత విలువను.. కొంత 'విలువలను' అందించే  దినుసులు.
ముళ్లపూడివారిని గురించి సమగ్రంగా.. సాధికారికంగా చర్చించే పాటి విద్వత్తు నాకు సరిపడినంతగా లేకపోవచ్చు. కానీ అభిమానం ఊరికే కూర్చోనీయదు కదా! అందుకే అప్పుడప్పుడూ నన్నిలా కాగితంబజారుకీడ్చుకొచ్చి  అల్లరి పెడుతుంటంది. అధికప్రసంగంగా అనిపించినా  సహృదయంతో అర్థం చేసుకుంటారని నమ్మకం. ఆ ధీమాతోనే  అప్పుడప్పుడు.. ఇలా.. తోచింది  తోచినట్లు పదుగురితో పంచుకునే సాహసం చేస్తున్నది.
'ఈ భూ ప్రపంచంలో ఎదుటి వాడినుంచి కృతజ్ఞత ఆశిస్తే.. నుదుటి తలబొప్పులు తప్పవ'న్నది ముళ్లపూడి వారి ఒక పాత్ర ఫిలాసఫీ. అంధ్రారాజకీయాల్లోని అనైకమత్యాన్ని ఆనాడే పసిగట్టిన మహానుభావుడు.  కాబట్టే.. ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని అందరికి మల్లేనే ఆంధ్రుడై ఉండీ తూర్పార పట్టి మరీ పరువు తీసేసాడు. 'యథార్థవాదీ.. లోక విరోధీ' కనక .. నిజాలేమన్నా చెప్పాలనుకున్నప్పుడు తను సృష్టించిన పాత్రల ద్వారా వెంట్రిలాక్విజం చేయించే కళను నమ్ముకున్నాడు ముళ్లపూడి. తెలుగు వాడిని  నవ్వించడం కష్టం. కవ్వించడం సులభం. కవ్వించి రాళ్ళు రువ్వించే బాపతు కుళ్లుబోతురాయుళ్ళ ఆటల్నుంచి అప్పుడప్పుడైనా అమాయకమైన తెలుగు జాతికి రవ్వంత విశ్రాంతి కల్పించాలన్న  పేరాశ ఏదో ముళ్లపూడివారిని ఈ నవ్వుల ముళ్లబాట పట్టించినట్లుంది. దారి మరీ కంటక ప్రాయంగానే ఉన్నా .. నిప్పులు కురిసే  కళ్లనుంచే ఉప్పటివైనా.. తీయటి కన్నీటి బొట్లు రెండు రాల్పించాలన్న వాత్సల్యమే  ఆయన చేత  'కోతి కొమ్మచ్చులు' ఆడించింది. ఆయన విషాద విదూషక    వైదుష్యం సాహిత్య చరిత్ర పుటల్లో పదిలంగా నిలిచిపోయింది. 'రాయడం' అక్షరం వచ్చిన ప్రతీవాదూ  చేసే చేతిపనే. అదేం బ్రహ్మవిద్య కాదు.  చేతిలో ఉన్న ఆ దివ్యవిద్యకు తోడుగా మానవత్వం జోడించడమే ముళ్లపూడివారి లోకంమీది ప్రేమకు నిదర్శనం. ఆయనే ఒక సినిమాకి రాసిన సంభాషణల్లో అన్నట్లు ' నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు. ఏడుపొచ్చినప్పుడూ  నవ్వే  వాడే హీరో. ఆలాంటి హీరోలను తయారుచేసే ముళ్లపూడిని మరేమని పిలుచుకోవాలి?!
బాపుతో జత కలసిన  వేళా విశెషం. కొన్ని తరాలు తెలుగువారిని  ఆయనతో కలసి   ఊపేసారు. ఊపేస్తున్నారు.  ప్రస్తుతం మన మధ్య  లెకపోతేనేం..  తెలుగు నవ్వుల నదుల్లో..  లాహిరి ప్రయాణం చేయాలని సరదా పడే   హస్యరస ప్రియులకు ఆయన.. భావపుష్పాల.. భాషాపుష్పాల  జల్లులతో ముంచెత్తెయ్యడానికి సదా సిద్ధం!
ముళ్లపూడి వారలా  వెదజల్లిన పూలవానలనుంచి ఏరి పోగేసిన  కొన్ని మణులు.. మాణిక్యాలుః


'కరవుప్రాంతంనుంచి వచ్చిన అర్జీమీద తపాళాబిళ్ల అతికించడానిక్కూడా నాలికలు తడారిపోయున్నందువల్లా, నీటి చుక్క పుట్టనందువల్లా స్టాంపును గుండుసూదికేసి గుచ్చి పోస్టులో వేశారుట'
-రాజకీయ బేతాళ పంచ విశంతిక

'సినిమా కథలు వారఫలాల వంటివి. తారాబలాలను బట్టి మారుతుంటాయి'!
-విక్రమార్కుడి మార్కు సింహాసనం కథలు

'బుడుగుః నాకు కోపం వస్తే 'జాటర్ డమాల్' అంటాను. ఆ మాటకు అస్సలు అర్థం లేదంటాడు నాన్న. ఎందుకు లేదు? ఉంటుంది. తెలియాలి అంతే! జాటర్ డమాల్ అంటే అర్థం లేదూ అని అర్థం అన్నమాట.'
-బుడుగు నవలలో

'కోటీశ్వరి ఒకానొక్క కొడుకుని పకడ్ బందిఖానాలో పెంచింది'
-పెళ్ళికొడుకు సినిమా

'ఇంట్లో కుక్కల్నుంచుకుంటారుట్రా ఎవరైనా? మధురవాణ్ణుంచుకుంటారు. ఆవకాయనుంచుకుంటారు. ఆస్తులు పంచుకుంటారు. కానీ కుక్కపిల్లను పంచుకోడమేవిట్రా?'
-రావికొండల్రావుమీద వ్యాసం రాస్తూ

'రాక్ ఫెల్లర్ కి ఎంత డబ్బున్నా జేబులో  వేసుకు తిరగడు కదా! ఓ అర్థణా బఠాణీలు కొనబోయినప్పుడు చెక్కులిస్తే వాడు పుచ్చుకోడు కదా! అప్పు చెయ్యకేం చేస్తాడు పక్కవాడి దగ్గర?
-ఱుణానందలహరి
ఇలా చెప్పుకొంటూ పోతే.. కడుపు చెక్కలయ్యే ప్రమాదం కద్దు. అంచేత ప్రస్తుతానికి 'ది ఎండ్'.. పైనున్న పెద్దాయనికి మనసారా స్మృత్యంజలి సమర్పించుకుంటో!

-కర్లపాలెం హనుమంతరావు

Sunday, September 18, 2016

కొన్ని ఆలోచనా శకలాలు


కర్లపాలెం హనుమంత రావు॥కొన్ని ఆలోచనా శకలాలు॥
1
ఈ చినుకు
ఏ సముద్ర
ఆనందబాష్పమో!
2
ఎవరన్నారు
కాలం గుప్పిట్లో చిక్కదని?
నాన్న ఫొటో!
3
కుట్టకుండా వదిలేసింది
గండు చీమ
ఎంత విశాల హృదయమో!
4
కంటికీ చేతులుంటే
ఎంత బాగుణ్ణో
కదా ఊహాప్రేయసీ!
5
ఎక్కినా
దిగినా
అవే మెట్లు
6
నలుపు తెలుపుల్లో
ఎన్ని రంగులో
పాత మిత్రుల గ్రూప్ ఫోటో!
7
మాయాలోక విహారం
పుస్తకం
కీలుగుర్రం
8
కోయిల కూస్తోంది
మావి చిగురు
మిగిలుందని!
9
మింటి మీదా
వంటి మీదా అర్థచంద్రులు
రాత్రి సార్థకం
10
తట్టి
తడిపింది
హైకూ
11
ఫొటోలోని బాబుకి తెలుసా
తనలాంటితనే తనను చూస్తాడని
నా పాతఫోటొ మాబాబు చేతుల్లో!

చురకలు- చిరు కవితలు

1

వాడు మొదలుపెడతాడు
అది పూర్తి చేస్తుంది
మందు
2
ఎఫ్ డి ఐ
ఏ ‘చిల్లర’గాళ్ళ కోసమో!
3
గిరి గీసుకుని బతికే వాళ్ళే
నిఖార్సైన
‘గిరి’జనులు
4
 కాయ
వేరు 'కాయకష్టం'
చేరు
పెద్దింటి పండ్లకొష్టం 
సమాజ సంపదకూ
అదే సూత్రం
5
ప్రతి కుక్కకూ ఒకరోజొస్తుంది
స్లం డాగ్స్ కి
ఆస్కార్ రాలా!
6
దేవుడి గుడికి
బంగరు తొడుగు
దీనుడి గుడిసెకు
అంబరం గొడుగు!
7
సిగ్గు లేదూ!
పట్టపగలే
పసిపిల్లలా ముందూ…!
ఛీ..ఛా…నల్సు
కంట్లో నలుసు
8
అమ్మేసినా
బెయిలొస్తుంది
బొమ్మేస్తే మాత్రం
జెయిలొస్తుంది!
9
ఇసుకకీ కరువే
ఎక్కడి దుమ్మూ
ఎత్తిఓసుకోడానికే చాలడం లేదు!
10
కంచే చేనుని మేస్తుందా!
మేసేసింది
కంచే కాని
చేను ఎక్కడా కనిపించడం లేదు అ
11
రాత్రి పగలూ
తేడా లేదు
మున్సిపాల్టి వీధి దీపాలకి
12
ముని వేషంలో రావణుడు
వటువు వేషంలో వామనుడు
రైతు వేషంలో ఇప్పుడు
నాయకుడు

Saturday, September 17, 2016

పెళ్లానికి ప్రశంస- పెళ్లాల ప్రశంసా దినోత్సవ సందర్భంగా!

సెప్టెంబరు 18- భార్యల ప్రశంసా దినోత్సవ సందర్భంగా
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ..!’
 'ఇంటి జ్యోతివి.. ఈ రాగాలేవిఁటి పరగడుపునే?!'
ఏ గోలైనా చేయచ్చు! మీ మగాళ్ల రూళ్ళు.. రూళ్లకర్రలు..  వుయ్ డోంట్ కేర్! ’ఇవాళ 'భార్యల దినం!' ‘
'దినమా? ఆ పదమే.. ఏంటోగా ఉంది. పోనీ 'ఉత్సవం' అనన్నా అనరాదా అనూరాధా! వింటానికైనా ఉత్సాహం ఉంటుందీ!
'ఉత్సాహాలు పదాల్లో ఉంటాయా బండబ్బాయ్ గారూ!.. ఐ మీన్.. బండి అబ్బాయిగారూ! భర్తలు ప్రియంగా  పాడే  'డార్లింగూ!.. ఓ మై డార్లింగూ.. ' లాంటి రొమాంటిక్ పాదాలమీద కదా ఉండేదీ!'
'ప్రియం' అంటే ముందు మా మగాళ్లకు  పెళ్లాలకన్నా ఏటేటా ముంచే  బడ్జెట్టుకి  ముందే పెరిగే సిగిరెట్ పెట్టెలు గుర్తొస్తాయ్ ప్రేయసీ!'
'ఛీఁ!.. ఛీఁ! మొగుడూ పెళ్లాలం.. ముద్దూ ముచ్చట్లు పెట్టుకొనే వేళ.. ఆ కంపు  పెట్టెల గోలేల నాయకా! ఇవాళ పెళ్లాలని ప్రశంసించాలని చెప్పినా ఈ వేళాకోళాలేల బాలకాఅంతంతలేసి కవిహృదయాలూ గట్రా వంటబట్టకపోతే.. పోనీ..  బంగారిమామ పల్లెపదాల బాటైనా  పట్టొచ్చుగా! 'ఈ నాటి మన వూసులేనాటికీ.. ఎంత దూరానున్నా వంతెనల్ కట్టాలనీ..!' ఆహాహా!  ఎంత రోమాంటిగ్గా రాసాడో కదా కొనకళ్ల!'
'హలో! ఆ కళ్లల్లో మెరుపులేమిటి భామా? ఈ బంగారి మామలెవర్తల్లీ మొగుడూ పెళ్లాల ముద్దూ ముచ్చట్ల   మధ్యలో ?'
'బంగాళా వేపుళ్ళు తప్ప తవఁరికీ బంగారాలూ.. శృంగారాలూ.. ఎలా  తలకెక్కుతాయిలే! చీఁ! బంగారంలాంటి మూడును  మూడు ముక్కలు చేసేవుగదా ప్రాణేశ్వరా! నిన్నూఁ..!'
'బాగుంది!!భహు బాగుంది! ఇవాళ  పెళ్లాలని ప్రశంసించే దినమా? మొగుళ్ళని రాచి రంపాన పెట్టి హింసించే దినామా.. భామా? ఈదీ అమీను.. సద్దాం హుసేనూ.. హిట్లరూ.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఇంట్లో పెళ్లాలకన్నా డిక్టేర్లట్రా?' అనక్కడికీ మా  నక్కా వెంకట్రావొక్కటే చెవినిల్లు కట్టుకొని  మరీ పోరాడు. విననిస్తేనా  పాడు బుద్ధి! వయ్యారి నడక.. వాల్చూపు సెగ.. గుండె దడ  తట్టుకోలేకొచ్చి ఈ వగలాడి  వళ్లో కొచ్చి పడిపోయాను! ..ద్యావుడా!’
'మరే! హ్హి.. హ్హి.. హ్హి.. హ్హీ!'
'ఆ ఒక్క నవ్వే యేలు.. వజ్జెర వయిడూరాలు'
'చాల్చాలు బాబూ .. తమాషాలు! పాటల్తోనా బోల్తా పడేయాలు.. వేషాలు!'
'ఇదే విరసమంటే! ప్రశంసించాల్సిందేనని  హింసిస్తారు! మెచ్చుకుంటే మాత్రం ఇలా  ఇచ్చకాలనేస్తారు! శ్రీమతులంతా ఇలా శివకాశీ బ్రాండులైపోతే.. మా మొగుళ్లకిహ .. కాశీయాత్రలే కదా అంతిమంగా గతి!.. ..'కాశీకి పోయాను రామాహరీ! గంగ తీర్థంబు తెచ్చాను రామాహరీ!..'
'ఆపుతారా స్వాములూ ముందా ఆపసోపాలు! పెళ్ళికి ముందే తవఁరి కాశీ యాత్రలన్నీ  క్లోజు. అలవాటు లేని అవపోసనాలకి పోయి శ్రీవారిలా జావళ్లందుకుంటే  'మోటూ'గా మారేది నా వళ్లే! ఆనక సూటి పోటు మాటలు పడేదీ  మా వాళ్లే!'
' 'మోటూ'ల్తోనైనా ఎలాగో నెట్టుకు పోవచ్చు మా మొగాళ్ళు. మీ  పెళ్లాలు.. ఇల్లనే టీవీ సెట్లకు  'రీమోట్లు'గా మమ్మల్ని  మార్చాలని చూస్తేనే మాకు వళ్ళు మండేది.  ఏ మఠానికైనా   పారిపోవాలనే తట్టేది. పక్క దేశం స్వర్గానికన్నా మిన్నగా ఉందని  ఎట్లాగూ టాకొకటి ఊపందుకుంది.. తస్మాత్ జాగ్రత్త .. తరుణీమణీ!  బహుభార్యాత్వం మగాడి జీవితకాలాన్ని మరింత పొడిగిస్తుందనికూడా ఈ మధ్య బ్రిటన్ షివెల్డ్ విశ్వవిద్యాలయం పెద్దలు  పరిశోదనలు చేసి మరీ భరోసాలిచ్చేసారు.. మరి’'
' 'నాతి చరామి' అంటూ పెళ్ళినాడిచ్చిన మాట సంగతేంటీ మహారాజశ్రీ మొగుడుగారూ? మంగళ సూత్రాలు  మా మెళ్లలో మరికొంత కాలం  వేళ్లాడేందుకోసం  కుష్టు మొగుళ్లను.. భ్రష్టుమొగాళ్లని..  తట్టల్లో.. బుట్టల్లో..  మోసుకొంటూ సానివాడల చూట్టూతా చక్కర్లు  కొట్టే రోజులు కావివి..  లొట్టలేసేయకండి! ఈ కాలం ఇల్లాళ్లం! మరీ.. అంత మంచి గయ్యాళులం కాం! 'నా ఇంటి సామ్రాజ్యానికి నవ్వొక్కదానివే పట్టమహిషవ'ని అగ్ని సాక్షిగా పెళ్ళినాడు మాటిచ్చారు! కాబట్టే.. మీ మొగాళ్లెంత మొద్దురాచిప్పలైనా .. మాడు మీదెక్కించుకొని ఇష్టంగా  తొక్కించుకొంటున్నది ఆడాళ్లం! మైండిట్… మైడియర్ డార్లింగ్! పెళ్లికి ముందూ కళ్లు మూసుకొని.. పెళ్లయిన తరువాతా.. నోర్మూసుకోమంటే..నో.. వే! గృహహింస చట్టం సెక్షన్లు యాక్షన్లోకొచ్చేస్తాయ్ మరి! ఖబడ్దార్ సర్దార్!'
'వామ్మో! మరి.. తానమ్ముడు పోయైనా సరే దీనుడైన నాధుడి యావ తీర్చాలన్న   సుమతీశతకం పద్యం గతి?'
'మతిలేని పద్యాలు.. శృతిలేని సూక్తులు!  తలలాడించే పిచ్చితల్లులెవరూ లేరిక్కడెవరూ ఇప్పుడు. తెలుసుకొని మసులుకొంటే మేలు  మేల్ చవనిసిష్టుల్లారా! శివయ్య కాలం కాబట్టి మొగుడి  వంట్లో  భాగంకోసం కేదారేశ్వరీ నోము నోచిందేమో మా  శ్రీ గౌరమ్మ తల్లి!   ఈ-కాలం ఈ కాలం. మొగుడి మెళ్లోకో  డోలుగా మారింతరువాత.. మోతైనా సరే .. తిరగమోతైనా సరే.. మా  శ్రీమతుల చేతుల మీదుగానే సాగి తీరాలి.  శ్రీవార్ల ఆస్తిపస్తులు..  జీత భత్యాలు.. పింఛన్లు..  భరణాలు.. ఆభరణాలు.. అన్నింటిమీదా చట్టబద్ద్జంగా మా శ్రీమతులకే సర్వహక్కులు
'మరేఁ! మనీపర్సు చిల్లరైనా కాపాడుకోవాలిగా  మా మగాళ్లం!  మగనాళ్లతో ఇకిలింతలకైనా  పోక తప్పని  దుస్థితి తెచ్చిపెట్టారు  మీ ముద్దుగుమ్మలు! 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ! .. షాదీ మాటే వద్దు గురూ!' అంటూ కోట శ్రీనివాసర్రావు చెవిలో కోట కట్టుకుని  మరీ పాటేసాడు మనీ సినిమాలో. శని   విననిస్తేనా! అనుభవిస్తున్నాం అమ్మళ్లూ  అందుకే ఈ బాండెడ్ లేబర్లూ! హ్హుఁ'
'ఒయాసిస్సును చూసా.. ఎడారని బెదిరేది వయస్యా! సావిత్రి పక్కనుండబట్టే సత్యవంతుడికా ప్రాణాలు మళ్లీ దక్కింది. సీతమ్మతల్లి తోడుండబట్టే రామయ్యతండ్రి వనవాసం హనీమూన్ను మించి రక్తి కట్టింది!  పెళ్లాలంతా కళ్లాలైతే   వేలాదిమందిని వెంటేసుకొని తిరిగిన గోపాలుడో   వెర్రిబాలుడా? ముక్కు మూసుక్కూర్చునే విశ్వామిత్రుడంతటి మునిముచ్చుకే   మేనకమ్మతల్లి కంటబడగానే కళ్లు చెదిరాయి! ఆడపొడే పడని   రుష్యశృంగుడు శాంతమ్మతల్లితో సంసారమెంత ప్రశాంతంగా చేసాడో తెలిసీ..’
'షటప్పూ..  నీ అష్టాదశ పురాణాలకి! షట్కర్మచారిణి.. సహధర్మచారిణి..  అంటారు కదా..  మన పెద్దాళ్ళంతా! ఖర్మకాకపోతే అందులో  ఏ ఒక్క గుణమైనా..'
'.. మాకు లేదంటావు! మనువాడిన ఆడది మగాడికి దాసి.. మంత్రి.. లక్ష్మి.. భూమి.. తల్లి.. రంభా? ఓ కే! మీకూడిగాలు చేయడానికి రడీ! కాకపోతే ఒకే కండిషన్!  ముందు మీ మగాళ్ళూ    కనీసం ఓ  రాజో.. రాముడో.. కృష్ణుడో.. కర్ణుడో.. ఇంద్రుడో.. మన్మథుళ్ళాంటి ..  కొన్ని పాత్రల్లో అయినా   సహజంగా జీవించండీ! అవీ మీరు చెప్పిన ఆ పెద్దాళ్ళు  మగాళ్లకు  విధించిన షట్కర్మలే స్వామీ!   'వై ఫై' కాసేపు లేకపోతేనే కలియుగాంతం వచ్చేసినట్లు  కంగారు పడతారే మీరు. ఇంటి బంగారం 'వైఫ్'.. రోజంతా కంటిక్కనిపించక పోయినా.. పడగ్గది వేళదాకా ..  చీమ కుట్టినట్లైనా అనిపించదు?! మగాళ్ల లోకం కాబట్టి తవఁరేం చేసినా చెల్లిపోతుందనా బాడాయి?'
 'వివాహ సంబంధాల్నుంచీ.. విడాకులు.. పిల్లల పెంపకాలదాకా.. చట్టాలన్నీ మీ ఆడాళ్లకే కదా చుట్టాలు మహాతల్లీ! మూడోవంతు కోటా చట్టసభల్లో లేకపోతేనేమి.. ఇంటి పెత్తనానికంతా ఇంతే కదా గుత్తేదార్. భా.బాలు.. ఐ మీన్..  భార్యా బాధితుల గుండెలు బాదేసుకొంటున్నారు. . ఐ.పి.సి.సెక్షను 498(ఎ) రాజ్యాంగానికే విరుద్ధమని భోరుమంటున్నారు.. ‘
'సెక్షన్ల పెర్లేవో గడగడా వప్పచెప్పేసి  తిప్పలు పెట్టేద్దామనే తవఁరీ   ఓవర్ యాక్షన్?! సంసారం వ్యాపారం కాదు బావా.. పెళ్లాన్ని 'స్లీపింగ్ పార్ట్ నర్'గా చిన్నబుచ్చేందుకు. కాపురం కాశీకి పోయే రైలుబండా.. పడగ్గదిని 'స్లీపర్ కోచిగా మార్చేయడానికి?'
'బుద్దొచ్చిందిలేవేయ్ బాలామణీ! ఇల్లొక రొమాంటిక్ జిమ్.. శృంగార వ్యాయామశాల.. మొగుడూ పెళ్లాలం అందులో ఒహళ్లకొహళ్ళు 'కోచ్' లం. ఎవరి పట్టులు వాళ్లవి. పట్టువిడుపులుంటేనే కుస్తీ సాగేది. సరేగానీ.. ఈ అమెరికా పండగలన్నీ ఈ మధ్య   ఇండియాలో చేసుకోటమేంటి?!’
'మూడొంతుల జనం ఏడాదిలో సగం అమెరికాలో ఉంటున్నాం.  ఒక్క వంతన్నా  వాళ్ల మంచి ఆలోచనలను మనం  ఆచరిస్తే తప్పేందే చెప్పు మహాశయా! కన్నవాళ్లందర్నీ కాదనుకొని.. కట్టుకొన్నవాడే సర్వస్వమనుకొని.. గడపదాటి   కొత్త లోకంలోకి అడుగు పెడుతుంది..  పాపం ఆడది. వంటి రక్తాన్ని, ప్రాణాన్ని.. మానాన్ని.. అభిమానాన్ని ఒహడు కింద అదిమి పెట్టినా సహిస్తుంది. వాడికి   పిల్లల్ని కని పెడుతుంది. పిల్లల్ని .. వాడిని..  జీవితాంతం విశ్వాసంగా కనిపెట్టుకొని ఉంటుంది. రోజులో సగం సమయం నిద్రకనే  ఉన్నా.. ఆ మగతలో కూడా  మొగుడో..  పిల్లలోఅంటూ  కలవరించే   పిచ్చిది ఆడది. గీజరు ఓ రెండు నిమిషాలపాటు ఎక్కువగా వాడుకుందని గొడ్డులా బాది చంపేసే మొగాళ్లు మొనగాళ్లుగా బోర విరుచుకొని ఆంబోతుల్లా బైట తిరిగే వేళ వచ్చిందీ 'భార్యామణులను ప్రశంసించే ప్రత్యేక సందర్భం'. అమెరికా పండగైతే ఏంటి.. అనకాపల్లి ఆడపిల్లైనా  ..మొగుడు  మనసారా ఒక్కసారి చేరదీసి   పలకరిస్తే చాలు..  రోజంతా .. ఇంటిని.. ఇంటి మనసులని.. తాజా రోజా పరిమళాలతో ముంచెత్తి పారేస్తుంది'
'హలో! ఝాన్సీరాణిగారు కత్తి దించేసెయ్యాలి ఈ జానకీ రాముడు ప్రశంసాపూర్వకంగా ఇచ్చే  పూలగుత్తి అందుకోవాలి!

***
-కర్లపాలెం హనుమంతరావు 

అపనా తనా మనా -మారోరె భైరన్నా!-అంటే ఏ౦టిట?- -బాలాంత్రపు రజనీ కాంతారావు రావు గారి వివరణ

అరవైఏళ్ళ  క్రిందట ఆంధ్ర దేశంలో అన్ని 
పల్లెలు.. పట్టణాలలో.. బజారుల్లో పాటక
(మాములు) జనంనోట తరచూ వినిపించిన  చౌకబారు పాట పల్లవిది.
అప్పట్లో ఒక సినిమాలో హాస్యగాడు కూడా  పల్లవి తోనే ఒక పాట ఎత్తుకుని పాడాడు కూడా. దాంతో అది మరింతగా జనం నాలికల మీద నాట్యమాడింది.
సరే... ఇంతకీ ఈ పాటకి అర్థం ఏమిటి?
'అప్పన్నా' అని వుంది కనక 
ఇదేమన్నా విశాఖపట్నం ప్రాంతం లోనిసింహాచలం దేవుడు అప్పన్న పేరున
కట్టి పాటా అలాంటిదే అయివుంటే  ప్రాంత ప్రసిద్ధ కవులు,మేధావులు 
పురిపండా, శ్రీ శ్రీ,ఆరుద్ర  లాంటి 
వారన్నా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించివుండాలి కదాఅలా ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడ కనపడవు! కానీ ఆ ప్రాంతపు సంగీత కళానిధి ద్వారం వెంకట స్వామి నాయుడుగారు తమ కర్ణాటక సంగీత కచేరీ చిట్టచివరి అంశంగా వినిపించే జానపదాల గీతాల తోరణ మాలికలలో  పాట కచ్చితంగా వినిపిస్తుండేది. కాకినాడ శెమ్మా 
గోష్టులలోకూడా  పాట 
వరసల్లోనే దశావతారాలు పాడుతుండే వారని ప్రతీతి"జాలమూ ఏలనురా, నీల మేఘ శ్యామ.. పాలించు గుణధామ భద్రాద్రిరామ!"అని అన్ని అవతారాలు  వరసల్లోనే సాగుతుండేవి.
దీని సంగీతం హిందూస్థానీ- దేశ్ రాగాలకు దగ్గరలోవుండేది
దీనికిమూలమయిన గేయ మాత్రం "అప్పన్నా తనా మనా"నే అంటారు రజనికాంతారావు గారు.
అసలు ఇంతకీ ఇంతగా ప్రాచుర్యం 
పొందిన  పదాలకి అర్థం ఏమిటి?
ఒక్కొక్కరు ఒక్కో రకమయిన అర్థం చెప్పటమే ఈ పదాలలోని విశేషం.
'ఇద్దరు తాగుబోతుల మధ్య సాగిన సంవాదం' అంటూ ఆయన సరదాగా ఇలా వివరణ ఇచ్చేవారట. "అప్పన్నా 
తన్ననా?.. మాననా?" అని ఒకడు మత్తులోఅడుగుతుంటే రెండో వాడు "మారోరె భైరన్నా!"(కొట్టరా కొట్టు) అని రెచ్చగొట్టేవాడుట! జ్ఞాని, తపస్వి, కలకత్తా నుంచి కేరళ వరకు దేశంలోని 
అన్ని ప్రాంతాలు దర్శించిన శ్రీ 
బాలాంత్రపు రజని కాంతారావు గారి 
బాబాయి సూర్యనారాయణరావుగారు సంగీతంలోని  జానపదబాణీలనుంచి, బజారు మట్టపు కబుర్ల దాకా 
బ్రహ్మపదార్థాల్లాంటి  విషయాలనుకూడా చక్కగా అర్థసహితంగా వివరించగల ఘటనా ఘటన సమర్థుడు.  అయన 
గారికి రజనీ కాంతారావుగారు  పాట 
అర్థం తత్త్వసమన్వయం చేసి ఇలా సెలవిచ్చారుట. 'ఇది తెలుగు తాగుబోతుల పాట కాదు. సూఫీ సంబంధమయిన   వేదాంతగర్భితమయిన హిందూస్థానీ 
ఫకీరు ఉపదేశ సారం ."అపనా తన్ న మాన్ నా(నీ శరీరం  సంగతి పట్టించు 
కోవద్దు. మరోరె భయ్ రహ్ నా! (చనిపోయినవాడు ఉండే స్థితిలో ఉండరా సోదరా!).అని ఉపదేశార్థంట!. చనిపోయిన మనిషి
 ఎంత ప్రశాంతంగా వుంటాడో అంత ప్రశాంతంగావుండమ'ని ని రామదాసుకు 
తారక మంత్రం బోధ చేసిన  కబీరుదాసువంటి మహానుబావుడో మన ప్రాంతపు జానపదులకు చేసిన ఉ పదేశమని రజనీగారి 'భాష్యం'!

తెలుగు భాషలోని పదబంధాలతో  ఎన్ని చమత్కారాలు చెయ్యవచ్చో!  ఆ విషయం సోదహరణంగా  చెప్పటానికే  ఎప్పుడో చదివిన ఈ సరదా సంఘటనని  ఇక్కడ ఇప్పుడు పొందుపరిచింది!
(బాలాంత్రపు రజని కాంతారావు గారి 'రజనీ భావ తరంగాలు' నుంచి సేకరించి దాచుకున్న  చమత్కార గుళిక ఇది)
***
-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...