Sunday, September 10, 2017

డాక్టర్ పు ట్టపర్తి, బీనాదేవి నరసింగరావు, ఉషశ్రీ గార్లకు నివాళులు... ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం ప్రచురణ


ఈ సెప్టెంబరు నెలలో పరమపదించిన 
సాహిత్య మూర్తులు 
డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు, 
గళగంధర్వుడు ఉషశ్రీ, 
బీనాదేవి అర్థభాగం భాగవతుల నరసింగరావు గార్లు. 
ఆ ముగ్గురు సాహిత్య మూర్తులకు 
మనసారా నివాళులు







డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు

'కవి' అంటే 'కట్టేసి వినిపించే యమకింకరుడు' అన్న అపప్రథ బహుళ ప్రచారంలో ఉన్న కాలంలో కూడా పుట్టపర్తివారి నిలువెత్తు విగ్రహం స్వంత ఊరు కూడలి నడుమ సగర్వంగా నిలడి ఉంది. పుట్టపర్తివారంటేశివతాండవానికి మరో పేరు. కవితార్తితో పండితుడు రాసి.. చేసిన శివతాండవం ప్రాచీన, నవీన; సంగీత సాహిత్య రస పిపాసులు అందరినీ సమానంగా అలరిస్తుంది నేటికీ!. నారాయణాచార్యులవారి పాండిత్య ప్రకర్షకి ఆకర్షితులయే స్వామి శివానంద సరస్వతి 'సరస్వతీ పుత్ర' బిరుదు ప్రదానం చేసింది.
వేష భేషజాలకి మాత్రమే దాసోహమనే నవనాగరిక సమాజం సైతం దృష్టి  మళ్లించుకోలేనంత బహుముఖీన ప్రజ్ఞ   పుట్టపర్తి ఆచార్యులవారిది. ఎవరు రాసే  పరీక్షలో వారే వారి పూర్వ విరచిత గ్రంథం నుంచి వివరణ రాసుకోవలసిన వింత  ఘటన ప్రపంచం మొత్తంలో పుట్టపర్తివారికిలాగా మరే ఇతర సాహిత్యమూర్తికీ అనుభవమయి ఉండదేమో! 15 భాషలలో ఉద్దండ పండితులు అప్పటికే! మళయాళ నిఘంటు నిర్మాణంలో సహాయ మందించమన్న విన్నపాలు అందుకున్న తెలుగు పండితుడు పుట్టపర్తిఏడు పదులమీద ఏడేళ్లు గడిచినా ఏదో కొత్త  భాష నేర్చుకునే  ఉత్సుకత  కనబరిచే   నిత్యోత్సాహి పుట్టపర్తిసకల కళా నికేతనం ఆచార్యులవారి అపురూప   వ్యక్తిత్వంచేపట్టిన  ప్రక్రియ ఏదైనా..  అపార పాండిత్య ప్రకర్ష దానికి  జోడించి తెలుగు భాషామ తల్లి గళసీమలకు  మణిహారాలుగ తొడగడం నారాయణాచార్యులవారి మొదటినుంచి ఓ  సరదా.. శతాధిక  గ్రంథ రచనల దగ్గరైనా ఆగింది కాదు ఆ పండితులవారి కలంబాల్యంలో పుట్టపర్తి రాసిన పద్యకావ్యం 'షాజీ' అప్పటి మద్రాసు రాష్ట్రం పాఠశాలలో తెలుగు వాచకం!!
అనంతపురం జిల్లా, చియ్యేడు  గ్రామంలో 28-03-1914 శ్రీనివాసాచార్యులు, లక్ష్మీదేవి అనే పుణ్య దంపతుల నోముల పంటగా జన్మించిన పుట్టపర్తివారిదీ   కృష్ణదేవరాయల గురువు శ్రీ తిరుమల తాతాచార్యులగారి మూల వంశమే. బాలాచార్యుల్ని  పెనుగొండ సబ్ కలెక్టరు  సతీమణి చేరదీసారుఆంగ్లంలో నిష్ణాతునిగా మలిచారు. ప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్షమ్మగారి సుశిక్షణలో, మేనమామ రాళ్ళపల్లిగారి క్రమశిక్షణలో  భారత, భాగవతాది గ్రంధాల అవలోకన,   సంగీత, నాట్య శాస్త్రాల అవపోశన సాగిందికడప గడపలో కాలు కుదుట పడ్డాక సహచరి   కనకమ్మగారి సాహచర్యంలో గృహ ప్రాంగణాన్నే కమ్మని  సాహితీ మాగాణంగా మలుచుకొన్నారు.. పుట్టపర్తివారిని వరించని   సాహితీ ప్రక్రియ లేదుఏకవీర'కు మళయాళ అనువాదం.. కోశాంబి, సావర్కర్ల వంటి ఉద్దండుల రచనలు, అరవిందుల గీతోపన్యాసాలు, శివకర్ణామృతం, అగస్తేశ్వర సుప్రభాతం, మల్లికార్జున సుప్రభాతం వంటి సంస్కృత  గ్రంథాలకు తెలుగు  సేతలు, ఆంగ్లంలో లీవ్స్ ఇన్ ది విండ్, ది హీరో వంటి మౌలిక రచనలు,.  అన్నీ ఒకే వ్యక్తి ఒంటి చేతిమీదుగా   సాహిత్య క్షేత్రంలో పండిన ఫలాలేనంటే  నమ్మ బుద్ధి కాదు కదా!.  ..  పుట్టపర్తివంటి దిట్టకవుల విషయంలో నమ్మక తప్పదు మరి. ఆచార్యులవారికి చాదస్తపు ఆచారాలమీద ఆట్టే ఆసక్తి లేదంటారుప్రతిభకు తగ్గ గుర్తింపుకు  నోచుకోలేదని అస్తమానం నొచ్చుకొనే వైష్ణవ సరస్వతీ పుత్రుడు 01-09-1990, శనివారం, ఏకాదశి.. తొలి జాములో భాగవత సారాన్ని వివరిస్తూ శివైక్యం చెందారు. తెలుగు సాహిత్య లోకానికి పూడ్చలేని లోటును మిగిల్చి పోయారు.
***



బీనాదేవి.. నరసింగరావుగారు
కలం పేరు  కొందరికి అసలు పేరుకు మించి మంచి పేరు తెస్తుంది. ఆలుమగలిద్దరూ కలసి అక్షర వ్యవసాయం చేసినా కలిసివచ్చే అదృష్టం కొన్ని కాపురాలకే. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా గల జంట బీనాదేవిగా పేరుబడ్డ భాగవతుల నరసింగరావు.. త్రిపుర సుందరులనే సాహిత్య  దంపతులది.  ఒకే పేరుతో రాసినా భార్యాభర్తలిద్దరూ ఒకే విధంగా చెలరేగిన  సందర్బాలూ  ఒక్క తెలుగు సాహిత్యంలోనే కాదు..  విశ్వసాహిత్యం మొత్తంలో కూడా ఒక్క బీనాదేవి దంపతులదే అయివుంటుంది.    నరసింగరావుగారు  కీర్తి శేషులయే వరకు బైటి ప్రపంచానికి తెలియని వింత బీనాదేవి పేరుతో వచ్చే రచనలన్నీ అచ్చంగా అన్నీ నరసింగరావుగారి కలంనుంచి ఊడిపడ్డవే కాదని. కళాకారులను సహజంగానే కీర్తి  వెంపర్లాట వెంటాడుతుంటుంది.  భర్తే బీనాదేవి పేరుతో అన్నింటిమీదా చెయి చేసుకొంటున్నారన్న అపప్రథను ఎంతో సహనంగా సాగనిచ్చిన సహచరి  త్రిపుర సుందరిగారి సౌమ్యగుణాన్ని  ఒప్పుకు తీరాలి!
బీనాదేవి కథల్లోని పాత్రల వస్తౌచిత్యం  విస్మయం కలిగించే తీరులో సాగుతుంది.  రావి శాస్త్రి ప్రభావం నీడలా వెన్నాడుతుంటుంది.   పుణ్యభూమీ కళ్లు తెరు, మార్క్సిజం ప్రభావంతో రాసిన హేంగ్ మీ క్విక్ లాంటి ఎన్నో రచనల్లో ప్రతీ అక్షరం ప్రజల తరుఫున వకాల్తా పుచ్చుకొని సమాజాన్ని, పాలకులను బోనెక్కిస్తుంటుంది.  బీనాదేవి  రచనలు రావి శాస్త్రి రచనలకు నకలుగా ఉండటం ఒక బలం. బలహీనత కాకపోవడం ఆశ్చర్యకరం. నకళ్లు వేరు. ఒకే కళ్లతో లోకాన్ని చూడడం వేరు. బీనాదేవి విషయంలో రెండో లక్షణమే నిజమయింది. రావి శాస్త్రి రచనా వ్యక్తిత్వానికి  బీనాదేవి కేవలం వారసత్వ ప్రతిరూపం.. అంటారు కొడవటిగంటివారు. కాదనలేం.
నరసింగరాజు ఆగస్టు 25, 1924లో జన్మించారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. త్రిపురసుందరి ఫిబ్రవరి 11, 1935న జన్మించారు.  1990లో నరసింగరావుగారి మరణానంతరమూ అదేపంథాలో రచనలు కొనసాగించారు. బీనాదేవి పేరుతో వచ్చిన ఫస్ట్ స్టోరీ  ఫస్ట్ కేఫ్ 1960లో , ఏ మేటరాఫ్ నో ఇంపార్టెన్స్ 1972లో. రాధమ్మపెళ్లి ఆగిపోయింది, డబ్బు డబ్బు డబ్బు 1975లో, హరిశ్చంద్రమతి 1980లో వెలుగు చూసాయి. బీనాదేవి ‘కథలు – కబుర్లు’ భర్త పోయిన తర్వాత భార్య ఒంటిగా ప్రకటించిన రచన.  త్రిపుర సుందరమ్మ 90ల తర్వాతా రచనా వ్యాసంగం కొనసాగించడం గమనార్హం. కొన్ని రచనలు  పోటీలలో బహుమతులూసాధించాయి.  బీనాదేవి రచనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర పలుకుతుంటుంది.. కథల్లోని, పాత్రల వస్తౌచిత్యం విస్మయం కలిగిస్తుంది. బీనాదేవి పేరు వినగానే చప్పున స్ఫురించేది 'పుణ్యభూమీ  కళ్లు తెరు''హేంగ్ మీ క్విక్' పై మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది. న్యాయస్థానాల్లో ఓడిపోయే పేదల నిజాయితీ,   కష్టాలు కళ్లక్కట్టినట్లు కనిపిస్తాయి.   1972లో బీనాదేవికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆత్మహత్య, అసలు లేని వడ్డీ,  ఉద్యోగపర్వం, అదృష్టహీనుడు, కుంకుమ ఖరీదు పదివేలు.. వరస బెట్టి ఇలా వప్పచెప్పుకు పోతుంటే చక్కనివి కాని కథలను వేరుగా పెట్టడం చాలా కష్టం.  వాస్తవాన్ని  వస్తువులుగా స్వీకరిస్తూ,  దోపిడీని, రాజ్య స్వభావాన్ని తూర్పార పట్టేస్తూ నిత్యం చైతన్యవంతమైన అక్షరాలను చెక్కే  బీనాదేవి కలం అందుకే తెలుగు  కాల్పనిక సాహిత్యరంగంలో అంతలా కలకలం సృష్టిస్తుంటుంది ఇప్పటికీ!
***

గళ గంధర్వుడు ఉషశ్రీ
పిన్నా పెద్దా అందరినీ తన వాగ్ధాటితో  కట్టేసినట్టు  రేడియో సెట్టుల ముందు కూర్చోపెట్టిన  పురాణ ప్రవచనాల  తాలూకు మంద్రగళ గంధర్వుడి పేరు ఉషశ్రీ! అసలు పేరు పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు . ‘సమస్త సన్మంగళాని భవంతు.. మొదలు  స్వస్తి వచనం వరకూ ప్రత్యక్షరం సుస్పష్టంగా, సూటిగా హృదయరంజకంగా ఉషశ్రీ సాగించే  ప్రత్యక్ష  వ్యాఖ్యానాలు  తెలుగు శ్రోతలమీద  ఓ తరం పాటు తనదైన శైలిలో చెరగని ముద్ర  వేసాయి. నండూరి రామకృష్ణమాచార్యులు, దిగువర్తి సీతారామస్వామి వంటి ఉద్ధండులు.. బాలదీక్షితుల వాక్పటిమను గుర్తించి, విషయాన్ని మరింత ఆకట్టుకునే చిట్కాలు నేర్పిన గురువులు. విషయం ఏదైనా సరే..  చెప్పే సమయంలో వడుపుగా  సమకాలీన  అంశాలను గడుసు  వ్యావహారికంలో మనసులకు హత్తుకొనేటట్లు  చెప్పడం ఉషశ్రీ విలక్షణ శైలి. ‘సహదేవుడు నక్సలైటా?అని అడగాలని ఒక్క ఉషశ్రీ బుర్రకి మాత్రమే తట్టే చిలిపి ఆలోచన!      విసుగెత్తించే పాడి పంటలు కార్యక్రమాన్నైనా సరే  ఆ మాటకారి తనదైన చమత్కార పంథాలో  రక్తి కట్టించేవాడు. దేవాలయ ప్రాంగణాలలో ఉషశ్తీ పురాణ ప్రవచనాలు కొత్త సినిమా  మొదటాట రద్దీని తలపించేవి.   సినిమా రద్దీ మొదటి వారమే. ఉషశ్రీ ప్రవచనాలకి చివరి రోజు వరకు అదే సందడి. ఆగల గంధర్వుడు అనర్గలంగా చేసిన పురాణ ప్రవచనాలే  (రామాయణ భారత.. భాగవతాలు)  ఆకాశవాణి అభిమానుల సంఖ్యను పెంచిందన్న అభిప్రాయం కద్దు. నిరక్షర కుక్షులకు సైతం కళ్లక్కట్టినట్లు   సాగేది కాబట్టే ఉషశ్రీ  భద్రాచల సీతారాముల కల్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానానికి అంతటి   ప్రాచుర్యం. 'శ్రీ గురుభ్యోనమః' అంటూ ఆరంభించి శ్రోతలు సంధించే ఏ ప్రశ్నకైనా తనదైన మార్కు మసాలా జోడించి మరీ సంతృప్తికరమైన  సమాధానాలిచ్చే ధర్మసందేహాలు కార్యక్రమం  అప్పట్లో ఆకాశవాణి కార్యక్రమాలలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఆనాటి   ధ్వన్యనుకరణ ప్రదర్శనల్లో   ఉషశ్రీ గళ అనుకరణ  ఉంటేనే హిట్టు.. అన్నట్లుగా ఉండేది పరిస్థితి.
పాత్రికేయుడుగా ప్రారంభించిన ఉషశ్రీ వ్యావృత్తి 1965 నుంచి  ఆకాశవాణి వ్యాఖ్యాతగా కొనసాగింది. దీక్షితులుగారు  దక్షతగల కవి, రచయిత కూడా. 60ల్లో ఆయన కృష్ణాపత్రిక్కని రాసిచ్చిన 'పెళ్లాడే బొమ్మ' ధారావాహికం ఆ  తరహాలో చేసిన మొదటి రచన.  రాజాజీగారు  ఉపన్యాసాలను రసవత్తరంగా  అనువదించాలంటే  ఉషశ్రీ ఎక్కడున్నాడో వెదుక్కోవాల్సిందే! ఆతిథి మర్యాద అనే పురాణపండ కథ ఒకటి  ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో ఒకటిగా ప్రచురితమయింది. సహజంగానే  దీక్షితులవారు సాంపదాయక వాది. ఆధునిక పోకడలను విమర్శించడంలో ఆయన ఎన్నడూ వెనుకంజవేయని  మొండి  ఘటం కూడా! 1973లో భారత ఘట్టాలతో ప్రారంభయిన ఉషశ్రీ రేడియో పురాణ ప్రవచన పరంపర .. అవిఛ్చినంగా  కొనసాగింది.  1979లో తిరుమల తిరుపతి దేవస్థానంవారి తరుఫునుంచి  ఉషశ్రీ వచన భాగవతం వెలువడింది.
ఉషశ్రీ జననం మార్చి 16,1928. కాకరపర్రు జన్మస్థలం. తండ్రి రామ్మూర్తి కాంగ్రెస్ జాతీయోద్యమ నాయకుడు. తల్లి కాశీ అన్నపూర్ణమ్మ.
ఒక నిండు తరాన్ని తనదైన సమ్మోహన శైలితో అపూర్వంగా కట్టిపడేసిన ఆ   గాంధర్వగళం  1990 సెప్టెంబరులో  మూగపోయింది.   కళకి జరత్వం ఉండదు. ఉషశ్రీగారి గళ తరంగం  ఆ నాటి శ్రోతల హృదయాంతరంగాల్లో నిరంతరాయంగా  మారుమోగుతూనే ఉంటుందన్న మాట నిజం. బాలాంత్రపు రజనీ కాంతారావుగారు చమత్కరించినట్లు బాగా నోరు పెట్టుకొని  బతికేసిన గొప్ప స్వర మాంత్రికుల వరసలో ఉషశ్రీది ఎప్పుడూ ముందు వరసే. ఆ గళ గంధర్వుడికి నిండు మనసుతో నివాళి***
కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక 04-09-2017 నాటి ‘సాహితీ గవాక్షం’ లో ప్రచురితం)

  

















 .




Wednesday, August 23, 2017

తొండపు స్వామీ... దండము నీకు!-ఈనాడు సరదా గల్పిక



గణాధిపతి హాస్య రసానికి అధిపతి. చందమామయ్యే పాపం ఎందుకో అలా నీలాపనిందలపాలయ్యాడు కానీ, ఆ బొర్ర దేవుణ్ని చూస్తే నవ్వు రానిదెవరికి? హాయిగా చవితి పండుగ ముందునాడు, వినాయకుడి ముచ్చట్లు చెప్పుకొందాం. అదే పుణ్యం పురుషార్థం కూడానూ!
జాజి, జవ్వాజి అంటూ పత్రులు ఇరవయ్యొక్క రకాల్తోనా గజాననుడికి పూజా పునస్కారాలూ? అన్నేసి రకాల ఆకులు ఈ కరవు రోజుల్లో దొరుకుతాయనే! కరివేపాకు రెబ్బ కూడా కాడ పది కాడ నిలబడి కిందికి దిగిరానంటుందబ్బా రైతు బజార్లల్లో! జనాలేవన్నా ఆ అదానీ, అంబానీలకు దగ్గరి చుట్టాలా పక్కాలా? బీదా బిక్కీ ఒక్కపూట బొక్కేందుకే ఇంత బలుసాకు రెక్క దొరక్క బిక్కచచ్చి బతకతా ఉంటే- మళ్లా ఇదేం విపరీతమయ్యా మహానుభావా!
గారెలు, బూరెలు, వడపప్పు, పాయసాలంటూ చేంతాడంత పట్టీలు పట్టుకు చందాలకని ఇల్లిల్లూ తిరిగి వేపడం, ఉండ్రాళ్ల మీదకు దండు గొలుపమంటూ ఆ బొజ్జ గణపయ్యను ­రికే రెచ్చగొట్టొద్దు బాబోయ్‌! దినం గడవడమే గండంగా ఉందిగదా ఇక్కడ మహాశయా!
ఏ దినుసుమీద ఎంత జీఎస్‌టీ వాతో... కొన్న తరవాత కానీ తేలడం లేదు రాత! ఏదో విధాయకం కనక భాద్రపద చవితికి సరదాగా వినాయకుణ్ని ఓసారి వచ్చి పొమ్మనడమే కాని- చూసీచూడనట్లు సర్దుకుపోవాలని ఆ లంబోదరుడికి మాత్రం తెలీదా?
సరే, ఎలాగో ఆ ఎలుక వాహనుడు వాలిపోతున్నాడు కాబట్టి, కొన్ని హెచ్చరికలు ముందస్తుగా మనమూ చెప్పక తప్పదు. శ్రీ గజాననా... శ్రద్ధగా విను నాయనా! గుళ్లల్లోని దేవుళ్లే నేరుగా భక్తుల ఇళ్లకు వెళ్లొచ్చే కొత్త రోజులు వచ్చి పడ్డాయిప్పుడు. కుడుముల మీద మరీ అంత యావుంటే కుదరదు. ఏ భక్తుడి బీరువాలోనో లటుక్కుమని ఇరుక్కునే ప్రమాదం కద్దు. జర భద్రం జగన్నాయకా!
పోయిన ఏడాది మాదిరే పూజలో వెయ్యి నోట్లు విసిరితే ఉబ్బి తబ్బిబ్బు కావద్దే! ఆ చెల్లని నోట్లతో నిన్ను బోల్తా కొట్టించేసి, నీ నుంచి వరాలు దండుకొనే పథకాలు దండిగా తయారవుతున్నాయ్‌ నీ పూజా పందిళ్ల వెనక వినాయకా! అమాయకంగా ఎవరి మాయలోనూ పడిపోవద్దు. ఆనక ఏ ఈడీ కేసులోనో ఇరుక్కుంటే మీ డాడీవచ్చి విడిపించాలన్నా- ఫలితం సున్నా!
కోరిన విద్యలకెల్ల ఒజ్జవని బుజ్జగించి మరీ ఏ చెత్త బడులకో అనుమతులు రాబట్టేస్తారండోయ్‌ విద్యా వ్యాపారుల దండు. ఆ అడ్డా సరకుతో జర భద్రంగా ఉండాలి జగన్మాత తనయ! అత్యున్నత న్యాయస్థానాలే నిదానంగా పోయే విధానాలతో ఉంటే, నీకు మరీ అంత అత్యుత్సాహం తగదు! ఆనక జరిగే తగాదాల్లో పార్టీ కావద్దు!
పుట్టిన రోజు వేడుకలకని అంత ఉల్లాసంగా వచ్చేస్తున్నావు. మంచిదే కానీ, ఎన్నికల వేడి నీకన్నా ముందస్తుగానే వచ్చి పడిందిప్పుడు వాడవాడలా! పాడు నేతలు నీ అభయ హస్తాన్ని ఎంతలా వాడుకుంటారోనన్నదే మా భయం. ఎచ్చులకుపోయి ఎవరి ఉచ్చులోనూ ఇరుక్కుపోకుండా ఉండటానికే ముందస్తుగా నీకీ హెచ్చరికలు!
మాదక ద్రవ్యాల వినియోగం మహజోరుగా సాగే సీజన్లోనే వచ్చి పడాలా నీ చవితి పండుగ సంబురాలు శంభు తనయా! పూజా పత్రిలో రవ్వంత గంజాయి ఆకు దొరికినా చాలు- కైలాసగిరికి నువ్వు తిరిగి వెళ్లే మాట కల్ల! జర భద్రం జగన్నాయకా!
పుస్తకాల సంచి బరువు బాధల నుంచి బడి పిల్లకాయలను కాపాడాలని రెండు తెలుగు ప్రభుత్వాలూ తెగ తంటాలు పడిపోతున్నాయి. భారీ కాయమాయె నీది! ఏ ఆకతాయితనానికో పసిపిల్లకాయల భుజంమీదకు ఎక్కుతావోనని భయం!
అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతూ చెడ తిరిగే దున్నపోతులకీ దేశం గొడ్డుపోలేదు. వాటి మీద ఎక్కి, వాళ్ల వంకర బుద్ధులనన్నా తిన్నం చెయ్యి స్వామీ- నీ చవితి పండగకు అప్పుడు ఓ చక్కని సార్థకతా ఏర్పడినట్లు ఉంటుంది.
అన్నట్లు, ఆఖరుగా నిమజ్జన దృశ్యం ఉంటుంది. ఎప్పట్లా ట్యాంకుబండ్‌ మీదే అది తప్పనిసరా స్వామీ? బోలెడంత జనం సొమ్ము ధారపోస్తేగాని ఆ మాత్రమైనా పరిశుద్ధమైంది కాదీ సాగరు జలాలు! మళ్ళీ మురికి చెయ్యడమంటే ఎవరి ముల్లెకో లాభం చేకూర్చడమన్న మాటే! నీ భక్తులకు నువ్వే నచ్చజెప్పాలి. న్యాయస్థానాల తీర్పుల్ని గౌరవించడం నువ్వే నేర్పించాలి విఘ్నేశ్వరా!
నీ మూషిక వాహనాన్నే నమ్ముకుని రావయ్యా గణనాయకా! నామోషీ ఏం లేదులే. కాకుంటే మా కొత్త పాయింట్లపద్ధతికి కాస్త నీ కొంటె మూషికం అలవాటు పడాలంతే! ఏనుగు చెవులని ఏమంత బేఫర్వా వద్దు. ఎన్నికల మధ్యలోకదా నీ చవితి పండుగ వచ్చి పడిందీ! మా బూత్‌రాజకీయాలకి ఓ బేలు దూదుండలు తప్పనిసరి. గుర్తుంచుకొని వెంట తెచ్చుకో... పండుగ తొమ్మిది రోజులూ రెండు చెవుల్లో దోపుకొందువుగాని!
ఉచిత ఫోను సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంత విపులంగా నీతో ముచ్చటించడానికి వీలైంది. చివరగా చిన్న విన్నపం. నీతోపాటు సిద్ధిని, బుద్ధిని వెంట తీసుకురావయ్యా! వాళ్లిద్దరే మా పెద్దమనుషులందరికీ ఇప్పుడు అత్యంత అవసరమని మా మెజారిటీ సామాన్యుల తిరుగులేని తీర్మానం!

- కర్లపాలెం హనుమంతరావు

Sunday, August 13, 2017

పుస్తక ప్రపంచం- ఈనాడు సంపాదకీయం


మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అధికం. మనువు మాట ప్రకారం, ఆతెలియనివాటిని తెలియజెప్పేవి– శ్రుతి, స్మృతి, సిద్ధులదివ్యదృష్టి, సజ్జనులసాంగత్యం. గురువ్యవస్థ, పర్యటన, పరిశీలన, స్వయంచేతన– వాటిని సాధించే మార్గాలు. గురువులు అందరికీ దొరకరు. దేశాటనా, పరిశోధనా అందరికీఅందుబాటులో ఉండేవీ  కావు. తలబోడి అయిన పిదపకాని దొరకని దువ్వెన– అనుభవం. మిగిలింది స్వయంకృషి. దానికి నెలవైనవే పుస్తకాలు.
తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం బోధిస్తాడు. ఏకకాలంలో ఈ మూడుధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం లోకంలో పుస్తకాలు ఒక్కటే అనేవారు               డాక్టర్ 
సర్వేపల్లిరాధాకృష్ణన్. నిజం– పుస్తకాలనేస్తుడికి ఒంటరితనంఅంటు సోకదు. అక్షరచెలిమిని మించిన కలిమి సృష్టిలో మరేదీలేదని అక్బర్ బాదుషా భావన. స్వయంగా అక్షరాస్యుడు కాకపోయినా విద్వాంసులతో నిత్యసంపర్కమే ఆ బాదుషాలోని సంస్కారానికి సుగంధాలు అద్దింది. వాగ్భూషణం భూషణం అనికదా ధూర్జటికవి సువాక్కు! రాజుకు స్వదేశంలోనే గుర్తింపైతే విద్వాంసుడికి సర్వేసర్వత్రా సమ్మానమే అన్నదీ ఆ కవి సుభాషితమే. దొంగలభయం ఎరగని ఈ సొత్తు పదిమందికీ పంచిన కొద్దీ పెరిగేదే కాని తరిగేది కాదు. మనిషికి జంతువుకు మధ్యనే కాదు– మనిషికీ మనీషికీ మధ్య తేడాకు కూడా చదువే కారణం! జ్ఞానాన్ని సుగంధంతో పోల్చిన కాళిదాసు పుస్తకాన్ని ప్రసూనం అంటాడు. పూవులాగే పుస్తకమూ ఏస్వలాభాపేక్ష లేకుండా నలుదిక్కులా పరిమళాలు వెదజల్లే సద్గుణం కలిగి ఉంటుంది.
శ్రావ్యంబై రసవంతమై మధురమై సర్వాంగ సంపన్నమై/ నవ్యంబై పరిణామ రూపగతులన్  రంజిల్లుచున్   భావముల్/ సువ్యక్తం బొనరించున్ జగమున్ శోభిల్లు వాక్కు అన్న గిడుగు సీతాపతి శారదాశతకం పద్యంలోని ప్రత్యక్షరమూ పరమసత్యమే. ఆవాగ్భూషణం అమరి ఉండే మధుర మంజుల మంజూష పుస్తకం. పుస్తక ధారిణి అయిన పలుకుతల్లిని సంభావించుకునే సుదినం ప్రపంచ పుస్తకదినం.
చదువుసంధ్యల సంగతులు సృష్టి ప్రారంభంకన్నా ముందునుంచి సాగుతున్నవే!విధాత మగతావస్థలో ఉండగా జలరాసి సోమకాసుర రాకాసి చేతిలో జారిపడ్డ వేదవాజ్ఞ్మయాన్ని మీనావతారుడు ఉద్ధరించిన కథ భాగవతంలోఉంది. వేదవిజ్ఞానం సమస్తం ఏదో ఓ  గ్రంథరూపంలో నిక్షిప్తమై ఉందనే కదా దీని అర్థం! తొలిదేవుడు వినాయకుడు వ్యాసులవారి భారతానికి తొలిరాయసగాడు కూడా. చేతికి గంటము వస్తే/ కోతికి శివమెత్తినట్లు కొందరు మంత్రుల్/ నీతి ఎరుంగక బిగుతురు/ సీతారామాభిరామ సింగయరామా! అన్న చమత్కార చాటువే చెబుతుంది రాత ప్రాముఖ్యాన్ని. దశరథుడి పాలనలో నిరక్షరాస్యులనేవారు అసలు లేనేలేరని రామాయణం ఉవాచ. ఓబౌద్ధగ్రంథంలో చర్మాలపై రాయడాన్ని గురించి నప్రస్తావన ఉంది. చీకటిసిరా పూసిన ఆకాశమనే చర్మం పైని చంద్రమ అనేసుద్ద ముక్కతో విధాత చేస్తున్న గణితంలో చివరికి సర్వం తారారూపాలైన సున్నాలే ఫలితాలవుతున్నాయని సుబంధకవి వాసవదత్తలో బహుచక్కని రాతసామ్యాన్నిచెప్పుకొస్తాడు. తాటియాకును, భూర్జపత్రాన్ని జ్ఞానచిహ్నాలు భావించారు మన పూర్వీకులు. జ్ఞానదాత బ్రహ్మ హస్తాన తాళపత్రగ్రంథాలున్నట్లు చెక్కివున్న బాదామి, బహొళె శిల్పాలు ఎన్నోపరిశోధకుల తవ్వకాల్లో బయటపడ్డాయి. బుద్ధుడి జాతకకథలో కర్రపుస్తకాల ప్రస్తావన కనిపిస్తుంది. పాటీలనే ఒకరకమైన పత్రాలపై రాయడాన్ని శ్రీనాథుడూ శృంగారనైషధంలో బహు విశదంగా వర్ణించుకొస్తాడు. శాతవాహనుల కాలంలో గుణాఢ్యుడనే కవిపండితుడు తన విశ్వకథాసంపుటి బృహత్కథకు తగిన ఆదరణ కరవైందన్న ఆవేదనతో అగ్గిపాలు చేసిన కథ అందరికీతెలిసిందే. ప్రతిపుస్తకానికీ భాగ్యాభాగ్యాలు జంటగా అంటి ఉంటాయని నానుడి. పుస్తకంబులు గలిగిన పూరిగుడిసె/ యందు నిరుపేద కాపునై యుందుగాని/ పుస్తకములు లేనట్టి భూరిసౌధ/ మందు చక్రవర్తిగ నుండనభిలషింప అన్న విశ్వాసం ప్రస్తుతం తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. ఇది ఎంతైనా ఆనందించదగ్గ అంశమే.
నిప్పు తరవాత మానవుడు ఆవిష్కరించిన అత్యంత సమర్థమైన సాంకేతిక వింత– పుస్తకం. మార్క్ ట్వైన్ మహశయుడు అన్నట్లు– మంచిమిత్రులు, మంచిపుస్తకాలు, మంచినిద్ర వీటికి మించిన మంచి ప్రపంచం మరొకటి ఏముంటుంది? పుస్తకమంటే లక్షఅక్షరాలు, కిలోకాయితాలు, చిటికెడుసిరా మాత్రమేనా? నవరసతరంగాల నురగలపై తేలియాడే కాగితం పడవ. అదిజేబులో పట్టేసే పూలతోట– కొందరు సౌందర్యారాధకుల పాలిటి తెలియని లోకాలకు ఎగరేసుకు పోయే మాయాతివాచీ.  మరికొందరు ఊహాప్రేమికులకు. తులసిదళమంత పవిత్రం. మరి కొంతమంది గ్రంథప్రియులకు. కలతలు తొలగించే తారక మంత్రం, పాపాలను పారదోలేది, మాంద్యానికి మందులా పనిచేసేది, దుఃఖం దుమ్మును దులిపేసి మనసును తేలిక చేసేదీ  పుస్తకమే.
కల్పతరువు, గురువు, భూత వర్తమాన , భవిష్యత్కాలాల అరలలో కాలం దాచుకున్న  సంపద, కరదీపిక, ఆశారేఖ పుస్తకం అంటారు మహాత్మాగాంధీ. అక్షరసత్యమైన మాట. సెర్వాంటిస్, షేక్‌స్పియర్, గార్సిలాసోడిలావేగాలాంటి విశ్వవిఖ్యాత సాహిత్యవేత్తల జన్మదినం.. ఏప్రియల 23. ఈ సుదినాన్ని అంతర్జాతీయ సంస్థ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక విభాగం ప్రపంచ పుస్తకదినంగా సంస్మరించుకోమని కోరడం అన్నివిధాలా సముచితం.

కేవలం అక్షరవేత్తలను సన్మానించుకునే ఉత్తమ సంప్రదాయం మాత్రమే కాదు కాపీ హాక్కుల రక్షణ చట్టాలను ఎక్కడికక్కడ యావత్ ప్రపంచం  పునః సమీక్షించుకునే సందర్భం నైతం ఈ పుస్తక సంస్మరణ శుభసమయానే. అక్షర ప్రియులందరికి    అభినందనలు.

(ఏప్రిల్23.  ప్రపంచపుస్తకదినం‘ సందర్భంగా - ఈనాడు ఆదివారం–సంపాదకీయం)

కన్నయ్య నల్లనయ్య ఎలా అయ్యాడు?-బమ్మెర



నిజంగానే ఏమీ తెలియక, ఎవరైనా ఏమైనా అడిగితే ఏదో ఒకటి చెప్పేసి చెల్లుబాటు కావచ్చు. కానీ, అన్నీ తెలిసి తెలిసే కావాలని అడుగుతుంటే ఏమనుకోవాలి? మన లోతెంతో తెలుసుకోవడానికి అలా అడిగారనుకోవాలా? ఒకవేళ తెలిసినా హఠాత్తుగా ఇప్పుడది గుర్తుకు రాక అడిగారనుకోవాలా? అయినా, ఆ ఆడిగింది సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడే అయితే, ఎవరికైనా ఇంక మాటలెలా వస్తాయి! కాకపోతే ఆ అడిగింది తల్లి యశోదనే కాబట్టి, లోకానికి చక్రవర్తే అయినా, తల్లికి కొడుకే కాబట్టి, ఆమేదో సమాధానం చెబుతుంది. 1978లో విడుదలైన సత్యం-శివం-సుందరం సినిమా కోసం విఠ్ఠల్‌ భాయ్‌ పటేల్‌ రాసిన ఈ పాటలో ఈ తల్లీ కొడుకుల సంభాషణల స్వారస్యమే కనిపిస్తుంది. లక్ష్మీకాంత్‌- ప్యారేలాల్‌ స్వరరచనకు లతా మంగే ష్కర్‌ గాత్రం నిజంగా ప్రాణమే పోసింది.
యశోమతీ మైయా సే బోలే నంద్‌లాలా
రాధా క్యోఁ గోరీ.... మై క్యో కాలా?
(నందకిశోరుడే అడిగాడు యశోదమ్మని...
 రాధ ఎందుకు ఎరుపు? నేనెందుకు నలుపని?)
తనకు తెలిసిందేదో తెలిసే ఉంటుంది. తనలో కదిలే ప్రశ్నలకు తనవైన సమాధానాలు ఉండే ఉంటాయి. అయినా ఆ ప్రశ్నలకు ఎదుటి వాళ్ల నుంచి ఏం సమాధానం వస్తుందో చూద్దామనే కదా ఆ ప్రశ్నలు వేయడం! అయితే ఏ ప్రశ్నకైనా అందరి నుంచీ ఒకే సమాధానం రాదు. ఎందుకంటే ఎవరి అనుభవాలు వారివి! ఎవరి జీవితం వారిది! మొత్తంగా చూస్తే ఒక్కొక్కరికీ ఇక్కడ ఒక్కో వేరు వేరు ప్రపంచం ఉంటుంది. అందరి రక్తం ఒకటే కదా అన్నట్లు, స్థూలంగా అందరి జీవితాలూ ఒకేలా అనిపించవచ్చు. కానీ, అత్యంత సూక్ష్మమైన లోలోతుల్లోకి వెళితే హృదయానికీ, హృదయానికీ మధ్య, జీవితానికీ జీవితానికీ మధ్య అనంతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. దీనికి తోడు, అసలు సమాధానం ఒకటైతే, దాన్ని వక్రీకరించడం మరొకటి. అందుకే ఒకే ప్రశ్నను వేరు వేరు వ్యక్తులను అడగడం ద్వారా ఒక ప్రశ్నకు చెందిన వేయి సమాధానాలు దొరుకుతాయి. ఒకే సత్యానికి చెందిన వేయి ముఖాలు తెలుస్తాయి.





బోలీ ముస్కాతీ మైయా లలన్‌ కో బతాయా
కారీ అంధియారీ ఆధీ రాత్‌ మే తూ ఆయా
లాడ్‌లా కన్హయ్యా మేరా కాలీ కమ్‌లీ వాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా/
(ముసిముసిగా నవ్వుతూ అమ్మ ముద్దుల కొడుకుతో అంది...
నడిరాత్రి కారు చీకట్లో కదా! నువ్వు జన్మించింది.
అందుకే ఓరి కన్నా! నువ్వు నల్ల కలువవయ్యావు.. నువ్వు అందుకే నలుపు..)
నేనెందుకు నలుపని కన్నబిడ్డే నిలదీసి అడుగుతుంటే కన్నతల్లిగా సమాధానం చెప్పాలి కదా! నిజమే కానీ, ఏ పరిణామానికైనా లోకంలో ఒకే ఒక్క కారణం ఉండదు కదా! ప్రతి పరిణామం వెనుక పైకి కనిపించేవీ, కనిపించనివీ అనేకానేకమైన కారణాలు ఉంటాయి. అలా అని అన్ని కారణాల్నీ ఒకేసారి చెప్పడం కూడా అన్నిసార్లూ కుదరదు . అందుకే ఒక కారణంగా యశోద ’’నాన్నా! అర్థరాత్రి వేళ అదీ కటిక చీకట్లో నువ్వు పుట్టావు. ఆ చీకటి ప్రభావంతోనే నువ్వు నల్ల కమలానివయ్యావు.. నీ నలుపు అలా వచ్చిందే కన్నా’’ అనేసింది. ఆ సమాధానంతో సంతుష్టుడు కాని కృష్ణుడు అది కాదు సమాధానం అంటూ మారాం చేశాడు. ‘‘నా నలుపు సంగతేంటో తేల్చ’’మని తిరిగి ప్రశ్నించాడు.
 బోలీ ముస్కాతీ మైయా సున్‌ మేరే ప్యారే
 గోరీ గోరీ రాధికా కే నైన్‌ కజ్‌రారే
 కాలే నైనో వాలీ నే ఐసా జాదూ డాలా
 ఇసీ లియే కాలా / యశోమతీ మైయా/
 (ఆ తల్లి మందహాసం చేస్తూ, ఓ ముద్దుతండ్రీ!
ఎర్రనైన రాధికవి నల్లనల్లని కాటుక కళ్లు!
 ఆ నల్లకళ్ల అమ్మాయే ఆ మంత్రమేదో వేసింది.
 నువ్వు అందుకే నలుపు)
మరో సమాధానంగా యశోద ‘‘రాధ తన కాటుక కళ్లతో నిన్ను అదే పనిగా చూడటమే నువ్వు నలుపు అయిపోవడానికి అసలు కారణం’’ అనేసింది. చూసినంత మాత్రాన్నే మనుషులు నలుపెక్కుతారా? అంటే ఏమోమరి! ఆమె ఎన్నిసార్లు, ఎంత తీక్షణంగా చూసిందో ఎవరికి తెలుసు? అందులో ఏదో నిజమంటూ లేకపోతే, కన్నకొడుకుతోనే అలా ఎందుకంటుంది! అనుకుంటూ మనమేదో మన మనసుకు సర్ది చెప్పుకోవచ్చు. కానీ, ఆ తల్లికి అలా చెప్పాల్సిన అవసరం ఏముందో ఎవరికి తెలుసు? అయినా ముందు ఒక కారణం చెప్పి ఆ తర్వాత మరో కారణం ఎందుకు చెప్పినట్లు! అంటే అసలు నిజం చెప్పడం ఆమెకు ఇష్టం లేకేనేమో ఇలా దాటేయడం? కాకపోతే, తన కొడుకు ఔన్నత్యం గురించి చెబితే లోకానికి కంటగింపుగా ఉంటుందని కూడా ఆమె అసలు నిజం చెప్పకపోవచ్చు.

ఇత్‌నే మే రాధా ప్యారీ ఆయీ ఇఠ్‌లాతీ
మైనే నా జాదూ డాలా, బోలీ బల్‌ ఖాతీ
మైయా కన్హయా తేరా జగ్‌ సే నిరాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా /
(అంతలోనే ప్రియమైన రాధ... హొయలొలుకుతూ వచ్చింది
 అలక వహిస్తూ నేను ఏ మంత్రమూ వేయలేదు
అమ్మా నీ కొడుకు లోకానికే అతీతుడు.. అందుకే నలుపు అంది)
కన్నతల్లి ఏం చెబితే నేమిటి? అసలు నిజం దాచేయాలని ఆమె ఎంత ప్రయత్నిస్తేనేమిటి? అదంతా బట్టబయలు చేసింది రాధ. కాదా మరి! కృష్ణుడి రంగు నలుపెక్కడానికి తన కాటుక కళ్లే కారణమని చెప్పేస్తుంటే తానెలా ఊరుకుంటుంది.? అందుకే అంది.... ‘‘యశోదమ్మా! నీ కొడుకు నలుపు రంగుకు నేనెలా కారణమవుతాను తల్లీ! నావి ఎంత కాటుక కళ్లు అయితే మాత్రం నా చూపులకే నీ కొడుకు నలుపెక్కుతాడా?అసలు విషయం ఏమంటే... నీ కొడుకు లోకానికే అతీతుడు అతని నలుపు రంగుకు అసలు కారణం ఇదే! కాదనగలవా అమ్మా!’’ అంటూ అటు నుంచి విసురుగా వెళ్ళిపోయింది రాఽధ. అవునూ! అతీతుడు కావడానికీ, శరీర వర్ణం నలుపు కావడానికీ ఏమిటి సంబంధం అనిపిస్తోంది కదూ! అందులో వింతేమీ లేదు. అనంతమైనవే ఎప్పుడూ అతీతంగా ఉంటాయి. అనంతమైనవే నలుపు ( నీలం) రంగులో ఉంటాయి. అనంతమైన సముద్రం నలుపు రంగులో ఉంటుంది. అనంతమైన ఆకాశం నలుపురంగులో ఉంటుంది. అలా చూస్తే అనంతమూర్తులైన రాముడూ నలుపే, కృష్ణుడూ నలుపే. అందుకే నలుపు రంగు అనంతత్వానికీ, దివ్యత్వానికీ ప్రతీకే తప్ప మరొకటి కాదు. రాధ మాటల్లోని ఆ అతీత తత్వం, పరమ సత్యమే తప్ప వేరేమీ కాదు.
- బమ్మెర

(ఆంధ్రజ్యోతి- దినపత్రిక- నవ్య- 14-08-2017)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...