Sunday, May 20, 2018

హిందూ పదం.. మతానికి సూచిక కాదు. అది ఒక సంస్కృతికి సంకేతం - వ్యాసం




'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక భాగం భరత వర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా నివృత్తి అవుతుంది.
'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.
స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు కనిపిస్తాయి.
యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం పడింది.
రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయ్!
ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం 'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మత రూపంలో చొప్పించి పబ్బం గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.
నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.. అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు. వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక  ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ 'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.
తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం, ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.
ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద 'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం హిందూధర్మంగా గుర్తింపబడింది.
'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!
స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.
మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించాడు. రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!
ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు చేస్తున్నాయిప్పుడు!
హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో.. ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది. మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం, వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత ప్రభావం,
ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక, ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత, విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే. భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వ చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత సిద్ధాంతంతో ప్రభావితమైనవే!
కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది. రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ సమాజంలో చెల్లదు.  
హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు  ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.
టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నదిపించారు. బెదిరిన బ్రిటిష్ దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ప్రత్యేక ఇస్లాం రాజ్యం కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా  చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా  పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.
భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ. స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు  అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది. చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?
***
కర్లపాలెం హనుమంతరావు
2౦ -05 -2018
(దాశరథి రంగాచార్య అక్షర మందాకిని (8) – హిందుత్వం పై ఇస్లాం ప్రభావం –వ్యాసం – ప్రేరణతో)

Friday, May 18, 2018

ప్రాచీన సాహిత్యమూ పరిచయం కావాలి!- వ్యాసం



వెయ్యేళ్ల పైబడిన చరిత్ర తెలుగు సాహిత్యానిది. ప్రబంధ సాహిత్య కాలం అందులో స్వర్ణయుగమంటారు. అందుకు ఒప్పుకోని వారూ ఉన్నారు. ఏదేమైనా మన ప్రాచీన సాహిత్యాన్ని గూర్చి కొద్దో గొప్పో పరిచయం ఉండటం ప్రతీ యువకవికీ అవసరమే! కానీ ఆ దిశగా ద్వారాలు ఎందుకు మూసుకున్నట్లు? సాహిత్యాన్ని ప్రత్యేక అంశంగా ఎన్నుకునే విద్యార్థులు మాత్రమే అధ్యయనం  చేసే విభాగంగా భావించడం తప్పు.
చైనా తాంగ్ రాజులను గురించి రాసిన ప్రాచీన సాహిత్యాన్ని ప్రస్తుత కమ్యూనిష్టు ప్రభుత్వాలేమీ ప్రపంచానికి కనిపించకుండా దాచేయడంలేదు. రాజులకు సంబంధించిన ఈర్ష్య, అసూయ, మదం, మాత్సరాలకు చెందిన కథలే కదా అని షేక్స్పియర్ సాహిత్యాన్ని ఆంగ్లేయులు 'ఓన్' చేసుకోకుండా వదిలేసిందిలేదు. పెద్ద కులాలకు చెందిన వ్యవహారల పట్ల శ్రద్ధ ఎక్కువగా చూపించిన 'పుష్కిన్' సాహిత్యాన్ని మాక్సిం గోర్కీ 'ఆరంభాలలకే ఆరంభం'గా ప్రస్తుతించాడు. సంగం రాజుల కాలంలో వర్ధిల్లిన పంచకావ్యాలను తమిళులు తమ సంస్కృతికి చిహ్నంగా సగర్వంగా చెప్పుకుంటారు ఇప్పటికీ. మన దగ్గరే ఎందుకో ప్రాచీన సాహిత్యం మీద అర్థంలేని  చిన్నచూపు! దురదృష్టం.
కవి భావజాలంతో కావ్యాన్ని తుల్యమానం చెయ్యడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ! కవి వ్యక్తిత్వాన్ని అతను సృజించిన  కావ్యం ద్వారానో, కావ్య నైపుణ్యాన్ని అది  సృజించిన కవి వ్యక్తిత్వం ద్వారానో అనుశీలించడం ఉత్తమ సాహిత్య విమర్శ అనిపించుకోదు. రాజాశ్రయాలలో జీవిక సాగిస్తూ సృజనను ఒక వృత్తిగా కొనసాగించే కవులు కొన్ని వత్తిడుల మధ్య, అవసరాల దృష్ట్యా కావ్యరచన సాగించే సందర్భాలు కద్దు. కాబట్టి కవి వ్యక్తిత్వాన్ని ఆ కావ్యం ద్వారా అనుశీలించడం సరికాదు.
ఎంతటి ప్రతిభా వ్యుత్పత్తులున్న కవి అయినా రాసేది రాజుల కథలే అయినప్పటికి తన కాలంనాటి సామాజిక పరిస్థితుల ప్రభావం నుంచి పూర్తిగా వైదొలగి రచన సాగించలేడు. 15 వ శతాబ్దం నాటి శ్రీహర్షుని నైషధాన్ని శ్రీనాధుడు 'శృంగార' నైషధంగా ఎందుకు పేర్కొన్నాడో, 16 వ శతాబ్ది నాటి రాజు శ్రీకృష్ణదేవరాయలు తన 'ఆముక్తమాల్యద'లో'తృణీకృతదేహుడు' అయిన మాల దాసరి పాత్రను ఎందుకు అంత ఉన్నతంగా చిత్రీకరించాడో అర్థం చేసుకోవాలంటే ఆనాటి సాంఘిక, తాత్విక, చారిత్రక జ్ఞానమూ కొంత అవసరం.  సాహిత్య విమర్శంటే కేవలం కావ్యలక్షణాలకు, కవి వ్యక్తిత్వానికి, అలంకార శాస్త్రానికి, వ్యాకరణ శృంఖలాలకు మాత్రమే చెందింది కాదు. కవి, కావ్య కాలాలనాటి చారిత్రిక, తాత్విక, సాంఘిక ధోరణులను సైతం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే ఆ అనుశీలన కవికి, కావ్యానికి న్యాయం చేసేది. తెలుగులో ఈ తరహా సాహిత్య విమర్శలు ఇంకా పారంభదశలో అయినా ఉన్నాయా అని అనుమానం.
యూరోప్ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాతల్లో ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఒకరు. ఆయన చిత్రకళను గూర్చి పరిశీలిస్తూ ఒక విమర్శకుడు 'డావిన్సీ సమస్య ఒక్క మానవత్వ మహిమను చిత్రీకరించడమే కాదు.. ఆ సృజనను పది కాలాలపాటు ముందు తరాలూ ఆస్వాదించే విధంగా పదిలపరిచడం ఎలాగు అన్నది మరో సమస్య' అంటాడు. ఏ కళాజీవీ తన సృజన కాలానికి ఎదురీది కలకాలం  చిరంజీవిగా నిలబడాలన్న తపనతోనే పని ప్రారంభిస్తాడు. అందుకు తగిన విధానాలనే ఎంచుకొని అనుసరిస్తాడు. ఉదాహరణకు సముఖం వేంకట కృష్ణప్ప నాయకుడి 'అహల్యా సంక్రందనము' తీసుకుందాం.
'మగనాలొకతె చాపల్యమున పర పురుషు నాదరించినది. ఆమె అహల్య. ఆమె కథ ఈ అహల్యా సంక్రందనము'. జారిణి అయినా ఆ అహల్య పంచకన్యలలో ప్రధమగణ్యగా ఆదరించబడింది! స్త్రీకి సౌశీల్యమే సహజాభరణంగా  స్థిరీకరించబడిన  సమాజంలో ఈ వైరుధ్యం ఏ విధంగా సాధ్యమైనట్లు? పతివ్రతా శిరోమణులు ఎందరో ఉండగా కవికి సందేహాస్పద శీలవతి అహల్య కథ మీదే ఎందుకు దృష్టి మళ్లింది? అహల్య జారత్వానికి ఇంద్రుడి మీద ఆకర్షణ కారణమంటారు.  తైత్తరీయారణ్యకంలో మరి ఈ ఇంద్రుణ్ణే యాగశాలకు ఆహ్వానించే సందర్భంలో '.. అహల్యాయై జార..'  అని వేదమంత్రోక్తంగా ఆహ్వానిస్తారు! ఈ రకమైన విరుద్ధ భావాలను సమర్ధవంతంగా సమన్వయించుకొనే మేధో సామర్థ్యాన్ని మెరుగుపరుచుకొనేందుకైనా అన్ని రకాల భావజాలాలతో.. అవి  ప్రాచీనమైనవైనా సరే..  పరిచయం అవసరం.
దేహాన్ని నిరాకరించిన ధార్మాలు ఒక పక్క,  దేహధర్మమే ప్రధానమన్న భావజాలం మరో పక్క .. విరుధ్ధమైన భావజాలాల మధ్య కవులు కావ్యరచనలు కొనసాగించవలసిన అగత్యం నేటికన్నా రాజరికానిదే గుత్తాధిపత్యంగా సాగిన కాలంలో మరింత ఎక్కువగా ఉండేది. దైవం, ధర్మం, దేహం.. కవికి మూడు వైపులా తలుపులు బార్లా తెరిచి  'రా.. రమ్మ'ని ఉబలాట పెట్టినప్పుడు ఏ కవికి ఆ కవి తన అవసరాలు, వ్యక్తిత్వం,  అగత్యాల దృష్ట్యా ఏదో ఓ మార్గం ఎంచుకొని ముందుకు సాగిన మాట నిజం. కవి తొక్కిన దారి సరే.. తొక్కవలసిన పరిస్థితులు.. నడిచిన దారిన కవి  ప్రదర్శించిన ప్రతిభా వ్యుత్పత్తులు .. సర్వం సమగ్రంగా తుల్యమానం చేయడం సరయిన సాహిత్యదర్శనం అవుతుంది. అది మానేసి.. ఈనాటి జీవిత విలువల ఆధారంగా ఆనాటి కవులను, వారి కావ్యాలను బేరీజు వేయడం సరికాదు. కొత్త కవులకు వాటిని దూరంగా ఉంచడం అంతకన్నా సబబూ కాదు.
దేహానికి, దైవానికి జరిగిన భీకర సంగ్రామ చరిత్రను ఒకప్పుడు సొఫాక్లిజ్, యురిపిడిస్ వంటి గ్రీకు ప్రాచీన సాహిత్యకారులు అద్భుతంగా అక్షరీకరించారు.  సాహిత్యకౌశల్యంలో, వస్తువివేచనలో, అభివ్యక్తి గాఢతలో వారెవరికీ తీసిపోని రీతిలో మన ప్రబంధ సాహిత్యం నిలబడింది.  పాతదని మనమే పక్కన పెట్టేసుకుంటున్నాం. వజ్రాలు పాతవైతే మాత్రం ఆ వెలుగు ఎటు పోతుంది? చూసి తరించాలంటే మనమే మూసుకున్న కళ్లు తెరుచుకోవాలి. ఆ జిలుగు వెలుగులు మన కొత్త తరాల అనుభవానికి వచ్చే విధంగా ప్రదర్శించాలి.
వెయ్యేళ్ల పై బడ్ద తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధయుగాన్ని స్వర్ణయుగమంటున్నారు . ఏ విశేషాలూ లేకుండానే ముఖస్తుతిగా ఏ విమర్శకుడూ ప్రస్తుతించడు కదా! ఆ విశేషాలను ఆస్వాదించేందుకు ప్రస్తుత తరాలకూ ప్రాచీన సాహిత్యం అందుబాటులో ఉంచడం  అవసరం.
(ఎమెస్కో ప్రచురణ- అహల్యా సంక్రదనము- వాడ్రేవు చినవీరభద్రుడి పరిచయ వాక్యాల ప్రేరణతో- వారికి కృతజ్ఞతలతో ఎమెస్కో వారికి ధన్యవాదాలతో)
-కర్లపాలెం హనుమంతరావు
19 – 09 -2018
***

Thursday, May 17, 2018

కవిత్వంలో నేను






కవిత్వం ఒక తపస్సు అయితే
నేను
తాపసిని కాలేకపోవచ్చు కానీ
ఫల పుష్ప పత్రాలు కాసినైనా
తల్లిపూజకు భక్తితో అందించుకోగలను
కవిత్వం ఒక సంగీత సాగరమైతే
నేను
అల కాలేకపోవచ్చు కానీ
ఉవ్వెత్తున ఎగసి పడే తరంగానికి
పక్కమృదంగ తోడిరాగమందిచుకోగలను
కవిత్వం ఒక యుధ్దమైతే
నేను
యోధుణ్ణి కాలేకపోవచ్చు కానీ
దుష్టశక్తిని తురిమే
యోధ ముష్టిఘాతంలో
జీవశక్తిని ఖచ్చితంగా జోడించుకోగలను
కానీ..
కవిత్వం ఒక రాజీపత్రమైతే 
ఆ లాలుచీ ప్రకటన మీద
శిరస్సు వంచుకు సాగిలపడే
సంతకం కింది చుక్క మాత్రంగా 
చచ్చినా బతకబోను!
-కర్లపాలెం  హనుమంతరావు 
19 -05 -2018







'ఓ మై గాడ్!'- సరదా వ్యాఖ్య



'ఓ మై గాడ్!'- సరదా వ్యాఖ్య

హఠాత్తుగా ఎదురుగా ఓ ఆకారం ప్రత్యక్షమయింది.
 నెత్తి మీద కిరీటం. నుదుట నిండా పట్టెనామాలు.. పొట్టకి తిరుచూర్ణాలు. పేరు తెలీని అభరణాలు!
 'ఎవరు స్వామీ తవఁరూ? నా నడినిద్రలోకి ఎందుకిలా నడిచి వచ్చారు?’
'మానవా! నన్నే మరిచిపోతివా?’
 'ఓఁ.. మై.. గాడ్! నువ్వా దేవా! పడీ పడీ నీ గుళ్లూ గోపురాల చుట్టూ ఎన్ని వేల సార్లు  పొర్లుదండాలు పెట్టానయ్యా! అప్పుడేమీ కనికరించని దయామయా.. ఇప్పుడిదేమి.. పిలవని పేరంటానికిలా  ఊడిపడితివి.. దేవదేవా?’   
'పిలవని పేరంటమా! శంఖు చక్రాదులనైనా చంకనేసుకోకుండా వట్టి గదాయుధంతోనే వచ్చినందుకా ఈ   చులకన? అరక్షణం కిందటే గదటయ్యా  'ఓఁ.. మైఁ.. గాడ్!' అంటూ గావుకేక వేసితివీ!’
'గాడ్! అదా తమరి గోల! రాత్రింబవళ్లు మా టీవీలల్ల మహాకూటములూ.. ప్రజాకూటములంటూ ఒహటే రాచకీయ నాటకాలు స్వామీ! ఏ మిత్రపక్షాల మధ్యున్నది ఏ శత్రుత్వమో, ఏ శత్రుశిబిరాలది ఏ మిథ్యా మిత్రత్వమో! ఆ అయోమయం తలకెక్కక  ఓ సారేమన్నా 'ఓఁ.. మై  గాడ్' అంటూ అలా గావుకేక వేసానేమో!  అంత మాత్రానికే తమరింత ఆత్రంగా గరుడవాహనం  కూడా మరిచి వగర్చుకుంటూ వేంచేసెయ్యాలా స్వామీ.. వింతగా ఉందే! అవతల తిత్లీ తుఫాను దెబ్బకు దిబ్బా దిరిగుండం మొత్తం  కొట్టుకుపోయి తలలు బాదేసుకుంటున్నారయ్యా తమరి భక్తజనాలు! ఆ బక్కభక్తుల దగ్గరికైనా వెళ్లి నీ వరాల జల్లులేవో కురిపించుకోవచ్చుగదా! కోదండ రామావతారులు.. తమరికీ  ఏ కోడైనా కత్తితో అడ్డొచ్చిందా దేవా? ఆ నయా పవర్ స్టారెవరో  వచ్చి కాచి కాపాడతాడేమోనని  నిద్దట్లో కూడా పాపం బక్కాభిమానులు ఉలిక్కిపడి అరుస్తున్నారయ్యా!  ఆ స్టారు రాక  ఎటూ రవ్వంత లేటవుతుందని  సర్వాంతర్యాములు తమకూ తెలీకా! ఎందుకయ్యా ఎంతకూ దర్శనమివ్వని తమరి నిర్వికారపు మెలిక?’
'కంటికి కనిపించకుంటేనే ఎంతో అల్లరీ ఆగమూ అన్ని గుళ్లూ గోపురాలల్లో! ఇహ దయతలచి ఒక్క క్షణమేగదా అని   దభిక్కని దర్శనభాగ్యమిచ్చేస్తినా! వెయ్యి యుగాలకు సరిపడా పిట్టకథలు అల్లి మరీ నాకున్న ఈ రవ్వంత పరువూ పవిత్రతలు మంటగలిపేస్తారన్న భయం భక్తా!’
‘అలాగని.. నా నడినిద్రట్లోకిలా ధడాల్మని వచ్చేసెయ్యడవేఁ? వీరలౌకికవాదులం గదా మేం. ఎంత వేధించినా మీ మతంలోకి  రాబోము. పొత్తులంటేనే సోషల్ మీడియాలల్లో బొత్తులు బొత్తులుగా జోకులు పేలుతున్న ఈ సీజన్లో.. ఈశ్వరా నా నిద్రట్లోకిలా చంద్రన్నలా దూరింది మళ్లీ ఏ కొత్త రాజకీయరంగ అరగంగేట్రానికి స్వామీ? ఇదేమీ తమరి స్వర్గధామం కాదు! ఒక్క ఫొటోకి ఐదు నిమిషాలల్లో వెయ్యి  మార్ఫింగులొచ్చేసే  మా పాడురోజులు! ఇహ కలహభోజనులంటావా?  మీడియా ముసుగులో గాలికి తిరిగే వారి జోరు విడిగా చెప్పపనే లేదు. ఏ దారే పొయ్యే దానయ్య సెల్ఫోను కన్ను మన మీద పడ్డా అర్థరాత్రిలోపే పెద్ద వైరలైపోతుందయ్యా స్వామీ  వీడియో! ‘చీకటి ఒప్పందాలు’ అంటూ తెల్లారి పత్రికలు పోసే పతాక శీర్షికల తలంట్లకు ముందు వైరల్ ఫీవర్లు ముంచుకొచ్చేది మాకు. నిరాకారులు తమరు. తమాషాగా తగిన సందు చూసుకొని మా అమిత్ ‘షా’  మాదిరి చిటికెలో తప్పించుకోగలరు. వేళకు మొహం చాటేసే కళ   మా రాహులు బాబుకు మాదిరి మాకే దిగ్గీబాబా ట్రైనింగయినా ఇవ్వలేదు మహాత్మా! తగులుకున్నోడికల్లా తగు బదుళ్లు చెప్పలేక మా చిదంబరం సాబులా  పాతచెప్పుల అనుభవం మేం చవిచూడాలనా తమరి స్కీము?తక్షణమే తమరిక్కణ్నుంచి తప్పుకోడం  ఉభయత్రా  శ్రేయస్కరం’
 'నీలో నచ్చేది నాకదే చిచ్చర పిడుగా! ఉచ్ఛనీచాలేవీ  చూసుకోవు. ఎంత మోదీనైనా ‘గీదీ’ అనేసేయగలవు. నా పేరున వేదాలు వల్లించి ఓటర్లను ముంచే భూతాల కన్నా మీ టైపు బోల్డ్ శాల్తీలే లోకానికి   బెటర్. అందుకే అర్భకా! నువ్విట్లా నా పేరుతో నిట్టూర్చీ నిట్టూర్చగానే ఇట్లా నిట్టనిలువుగా నీ ముందుకొచ్చి నిలబడింది నేను! ఎట్లాగూ వచ్చాను కాబట్టి..  వట్టి చేతుల్తో వెనక్కి మళ్లడం కుదరదు. మా లక్ష్మమ్మతో మొట్టికాయలు తప్పించేందుకైనా.. ప్లీజ్.. ప్లీజ్.. ఏదో.. నీకు తోచిందే.. ఓ కోరిక,, చిన్నదో.. పొన్నదో యాచించుకో నాయినా! ‘తధాస్తు’ అని దీవించి  నా దారిన నేను వెళ్లిపోతాను’
దేవుడి దీనస్థితికి నిజంగానే జాలేస్తోంది.  నా నిద్ర కోసమైనా ఏదో ఓటి కోరక తప్పేట్లులేదు పరిస్థితి.
 'ఆపద్భాంధవా! ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద సర్వత్రా ఉత్కంఠగా ఉంది! కోట్లలో కొనుగోళ్లు నడుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కొద్ది మందైనా ఈ ఊబి నుంచి బైటపడతారు.. దయచేసి రాబోయే ఫలితాలు ముందే తమరు సెలవివ్వండి సర్వేశ్వరా!’
'సారీ భక్తా! అది మీ భూలోక సర్వే సిబ్బంది భుక్తికి ఇబ్బంది. ఇ.సి కోడులతో నాకు ఇబ్బంది. మరింకేదైనా కోరుకో మానవా!'
అయితే.. ఆ అయోధ్యలో నీ గుడి గురించి ఓ అనుమానం ఉంది ..'
'ఆ బంతి సర్వోన్నత న్యాయస్థానం కోర్టులో ఉంది. మరింకేదైనా కోరుకో మానుషా!'
'ష్షూఁ.. చచ్చే చావొచ్చిందయ్యా స్వామీ తమరి సవాలక్ష షరతులతో! పోనీ బి.సి. కులాల ఆందోళనలన్నీ స్వయానా చూస్తుంటివిగదా! పర్సనల్ గా నా కే ఫేవరూ వద్ధు కానీ వరదా.. పాపం.. వాళ్ళ రక్షణకని తమరే ఏదైనా వరం ప్రసాదించచ్చు కదా!’
‘అడ్డె.. అడ్డె.. ఆపవయ్యా నీ కోరికల వరద! ఎవరి మనోభావాలకూ దురద రారాదు!  ఆ కండిషన్  మైండులో ఉంచుకొని మాత్రమే నీ డిమాండుండాలి. మైండిట్ మై సన్! ప్రొసీడ్.. నిర్భయంగా!’
నిర్భయ అంటే గుర్తుకొచ్చింది దర్భశయనా! పోనీ.. ఆ నిర్భయ కేసులోని అర్భకుల మీదయినా దయచూపించరాదా..!
 ‘మహిళామండళ్లు మండిపడతాయయ్యా మందభక్తా! ముందు మా శ్రీ మహాలక్ష్మమ్మే  నన్ను చెండుకు తింటుంది! నువ్వే కాదు.. నేనూ భయపడరాదు.. అలా ఉండాలి నీ నిర్భయమైన  కోరికేదైనా! ఊఁ.. కానీయ్.. కోళ్లు కూసే వేళవుతోందతవతల!’
 'సరేనయ్యా స్వామీ! మహిళలంటే మగాళ్ల జీవిత భాగస్వాములు. ఆ అమ్మలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లే ఏళ్ల తరబడి పెండింగులో ఉండింది. పోనీ.. దాని ఎండింగు కొసమైనా  షార్ట్ కట్టు  దారేదైనా చూడరాదా మాధవా! ఓ పనైపోతుందీ!’
'పెద్దలసభ కదరా ఆ రభసను ఓపెన్ చేసింది! క్లోజ్ చేసే డ్యూటీ సైతం  పార్లమెంటుదే సుమీ! మరింజేదైనా వెంటనే కోరుకో స్వామీ చంపక!’
 'ఆ ట్రంపు హెచ్చులు.. హెచ్ వస్ వీసాలూ..’
 'అమెరికన్ దేవుళ్ల తగులాటాలయ్యా అవన్నీ! ఇక్కడి దేవుళ్ల పరిధిలోవే నువ్వు కోరుకొనే వరాలుండాలి. కమాన్! కాల్ వస్తోందవతల్నుంచి. మా శ్రీలక్ష్మిదే! చప్పున కోరుకోరా పప్పుభక్తా.. పీడించక!’  
 వళ్లు మండింది నాకు చివరికి. ఈ దేవుళ్లతో యవ్వారాలు ఇట్లాగే ఉంటాయని తెలుసు. ఏదీ సర్వోన్నత న్యాయస్థానాల మాదిరి ఓ పట్టాన  తెగేది కాదు.
అవతలేమో తెల్లంగా తెల్లారిపోతోంది. బైటెవరో తలుపులు తెగ బాదిపారేస్తుంటిరి! ఏ తుంటరి కంట పడ్డా..గాడ్తో గూడుపుఠాణీ .. అంటూ పేపర్ల ఫ్రంట్ పేజీల్లో బఠాణీలు అమ్మేసే రోజులివి.
'గాడ్' ని వదిలించుకోవాలంటే ముందు  ఇతగాడు ఈజీగా ఇవ్వగల వరాలేవిఁటో   తేలాలి.
ఆఁ.. గుర్తుకొచ్చింది. కామాంధులెంతటివారైనా వదిలేయకుండా కఠినశిక్షలు పడాలంటూ మహిళందరూ తెగ ఉరుముతున్నారివాళ ప్రపంచమంతటా.  ఆ ‘మీ.. టూ’ ఉద్యమానికి మీ టూ  ఓ ఓటేసేస్తే పోలా! ఎంతటి మొండి గాడ్ కైనా ‘నో’ అనేందుకుండదు గాక ఉండదు. వివరంగా విషయాలన్నీ చెప్పి 'ఉరిశిక్ష'ల్లాంటి కఠిన శిక్షలేవఁన్నా కుదురుతుందా ముకుందా ఈ కీచకాధములకు? ఎట్లాగూ దుష్ట శిక్షణ.. శిష్ణ రక్షణ దేవుడిగా తమరి డ్యూటీలోని భాగమేనాయ! అని అడిగాను చివరాఖరికి.
‘ఉష్షో! ఊపిర్లు  లాగేసే డ్యూటీ కాలయముడిది కదరా ఢింబకా! అతగాడి పనిలో నేను వేలెడితే.. మీ రాజ్యాంగ వ్యవస్థల్లో కేంద్రం జోక్యం మాదిరి గందరగోళమయిపోతుందయ్యా మా స్వర్గలోకం పరిస్థితి! అవతల మా ఇందిరమ్మ  అప్పుడే ఇంటలిజెన్సు వర్గాలను పురిగొల్పింది. కమాన్.. ఆ కామాంధుల మేటరొదిలి  మరింకేదైనా కోరుకో... క్విక్!’ 
'తప్పుడు వెధవలని తెలిసి కూడా శిక్షించడం కుదరనప్పుడు ఎందుకయ్యా దేవుడా నీకిన్నేసి బిల్డప్పులు! వచ్చినప్పట్నుంచీ చూస్తున్నా.. అంత లావు గదాయుధం భుజం మీద మోయలేక  తెగ వగరుస్తున్నావు!  పోనీ ఈ బుల్లి దోమనైనా వధించేయగలవా నీ అతిభీకర గదాయుధంతో?’ వళ్లు మండి అరిచేసాను మహావెటకారంగా!
'థేంక్ గాడ్ రా బాబూ! ఆఖరికి నా దుష్టశిక్షణ ధర్మకార్యానికి సరిపడ్డ  కోరికనే కోరావు బిడ్డా! ఇదే చూడుము! మదీయ గదాఘాతంబుతో ఈ దుష్టదోమను ఒక్క వేటున దునుమాడువాడను’ అంటూ పాండవవనవాసం ఎన్టీఆర్ మార్కు అబినయంతో  మశక సంహారం సీనును కళ్లక్కట్టించేసాడా విశ్వరూపుడు. కళ్లు నులుముకొని చూసే లోపే  అంతర్ధానమూ అయిపోయాడీ అనంతశక్తిసంపన్నుడు!
మిజం చెప్పద్దూ! దేముడి పీడ వదిలినందుకన్నా దోమ పీడా వదిలినందుకు బ్రహ్మానందభరితమయింది నా మానసమంతా ఒక్క క్షణం.
ఒక్క క్షణమే బాబూ ఆ ఆనందమంతా! దైవగదా ప్రహారానికి చచ్చినట్లు మాత్రమే నటించినట్లుంది ఊ దోమాజీ! ఏ నక్సల్స్ గ్రూపులో చేరి శిక్షణ పొందిందో గాని మరి.. శత్రువలా కనుమరుగవగానే యధాప్రకారం తన రక్తపీడనోద్యమాన్ని పునరుజ్జీవనం చేసేసింది.. నా మీద! అదీ కథ!
ఇదేం సొదరా బాబూ? ఇందులో ఏం నీతి ఉందని ఇంత వూదర అని కదా తమరి చీదర! ఉంది సోదరా!
సాక్షాత్ సర్వశక్తిసంపన్నుడైన సర్వేశ్వరుడంతటి మహాదేవుడే ఆఫ్ట్రాల్  ఓ బుల్లి దోమస్యనే దిగ్విజయంగా జయించని   ఈ కాలంలో.. ఇహ దేవుడిలాంటి మన ప్రధాని  మోదీజీ మాత్రం  ఏ మహిమలు.. మాయమంత్రాఅలు చూపించి  దేశాన్ని ఉద్దరించగలడు? వూరికే బండరాళ్లేసెయ్యడమే గానీ ఎవరో ప్రసాదించిన ప్రత్యేక హోదా, నిధులు, విధులు, నీళ్లు, నియామక వరాలను సంపూర్ణంగా తీర్చి ఎలా నిభాయించుకోగలడు? పనిలేని నేతలంతా   నిష్కారణంగా కల్సి ‘సేవ్ ది నేషన్’ వంకతో    ధానంతటి పెద్దను వృథాగా వేధించడం తగదు కాక తగదనేదే ఈ కథ చెప్పే అంతిమ నీతి!
***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...