Sunday, June 28, 2020

కర్షకా! -శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి- సేకరణః కర్లపాలెహనుమంతరావు




కొలములని జాతులని మేలుకోవలనుచు
పేరు పేరున భేదభావ
ముగ్గడించుట యవనికో యొప్పుగాని
కర్షకా, నీకు జెల్లదా కాపథంబు!
***


ఆలతో లేగపిండుతో అహరహంబు
కాపురము సల్పు నీ కేల కాని త్రోవ!
నిఖిల జీవుల కాశ్రయ నిలయమైన
కృషియె నీ జీవితమునకు గీర్తి తెచ్చు.
***
కలిమిలేముల త్రొక్కిళ్ల వలన నమిత
మోద ఖేదము లందుట కాదు నీతి;
కాలచక్రంబు పరవళ్లు లీల దాటి
వడిదుడుకు లేక మసలుట గడుసుదనము.
***
వేడి వెలిగ్రక్కు పడమటి గాడుపులకు
గాంతి తరిగిన తీవెల దొంతియట్లు
విమల పూర్వసత్సంప్రదాయములు నేడు
సన్నగిల్లుట గురితింపు మన్న నీవు!
***
పాలకుల వేషభాషల ప్రాభవమున
పాలితుల వైఖరియు మారుపాటు నొందు;
అందు విద్యాధికుల సంఘమందు ముందు
గలుగు పరిణామ మది నీకు హితము గాదు!
***
సర్వశాస్త్త్ర విచారము సలిపి విభుధ
సంఘ మూహించి విజ్ఞానసార మెల్ల
నాట పాటల ననుభవమున
చిత్తమున హత్తుకొనుట నీ వృత్తియగును.
***
వర్తకము రాచఠీవి సంప్రతులజులుము
చదువుసంధ్య వారి సంసారగోష్ఠి
సర్వమానవగ్రాసవాసముల తృప్తి
నీదు వృత్తికి శాఖలై నెత్తికెక్కె!
***
దున్నగా దూడల జేరు నన్న రీతి
కాయకష్టంబు వంక కేగకయె, దండి
 లాభముల కాసపడి మాయవైభవంబు
లంది కులికెడి వ్యక్తుల నయయుమన్న.
**
పరుగు పరుగున బ్రాప్తించు పాలకన్న
నిలిచి శాంతించి త్రావిన నీరె మేలు;
లక్షల కొలంది జేకూర్చు లాతివృత్తి
కన్న శ్రేయంబు నీ వృత్తియన్న నిజము.
***
పశుపతికి నీకు సంబధ బాంధవంబు
లుండు నన్న అసత్యము మేముండు నన్న!
శిశువు కన్నను నిచ్చలు పశువు నెంతో
గారవింతురు నీవుగా కేరు చెపుమ!
***
అలు- పిల్లలు జెల్లలు-నాలుపిండు
గొడ్డుగోదలు-దూడలు-దొడ్డు లొక్క
చేతిన నడిచిన రీతి నున్న
గలుగు సంతోష మింతని చెప్పగలమె!
***
ఆరుగాలము కష్టించి ఆలుమగలు
బిడ్డపాపలు తమ దృష్టి పడ్డ మెదుకె
యారగింతురుగా కంతె, పారతంత్ర్య
బుద్ధి యవ్వారి పొంతకు పోవదన్న!
***
అతని కష్టార్జితమున కాసపడెడి
'పర భృతంబుల' లెక్కకు తరుగులేదు,
వాని 'సిద్ధాన్నము'ను నోటవైచుకొనుచు
నెగిరిపోజూచు డేగ ల వెన్నో కలవు!
***
నారుపోసినవాడెపొ నీరు వోయు
నను వేదాంత సూక్తి నీ కమృతగుళిక;
నమలి భక్షించుకన్నను నాణె మరయు
మ్రింగుటే యన్న సూక్తి యెరుంగవన్న.
***
లోకమును ధాత సృజియించుగాక, దాని
తిండి దండిగ సృష్టించు తెరవు నీదె,
ఉద్ధియగుదువు ధాతకు నోయి నీవు
చూడ నెచ్చటిదో యీ చుట్టరికము.
***
'ఆత్మవ త్సర్వ భూతాని'యనెడి మాట
అక్షరాలను బాటింప నర్హు డెవడో!
ఎవరి కయ్యది సరిపడు నవని నీకు
దప్ప తక్కినవారిలో నెప్పుడైన?
-శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి
(ఆంధ్రపత్రిక- శ్రీ చిత్రభాను సంవత్సరాది)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
28 -06 -2020












Friday, June 26, 2020

నేను రాసిన చెడ్డ కథ- తెలుగు వెలుగు మాసపత్రిక ప్రచురణ




కథలు రాసే కొత్తల్లో నేను రాసిన ఒక కథను గురించి టూకీగా గుర్తుచేస్తాను. కథలోని ముఖ్యపాత్ర ఒక యువకుడు. అతగాడికి ఎలా తగులుకుంటుందో విచిత్రమైన ఒక సెంటిమెంటు తగులుకుంటుంది. తన దగ్గర ఉన్న పసుపు పచ్చని నిలువు గీతల  చొక్కా తనకు అదృష్టం తెచ్చిపెడుతుందన్నది ప్రగాఢంగా విశ్వాసిస్తుంటాడు. అది మూఢనమ్మకం కదా అని  ఎవరైనా అడిగితే కాదని చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలు ఏకరువు పెట్టడం అతగాడి అలవాటు. ఆ పసుపు పచ్చని చొక్కా వంటి మీదున్నప్పుడే ఒకసారి రోడ్డు మీద పది వందనోట్లు నిండిన మనీపర్సు దొరుకుతుందతనికి. మరో సందర్బంలో అనుకోకుండా పార్కులో మార్నింగ్ వాకింగుకని వెళ్లిన సమయంలో ఒక అందమైన అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయే తరువాత అతని జీవితంలోకి ఆర్థాంగిగా ప్రవేశిస్తుంది కూడా. ఆమె పేరును హరిద్రగా మార్చుకుంటాడు. ఆ హరిద్రకు కూడా పెళ్ళిచూపుల్లో ఈ కుర్రాడు  ఈ పసుపు రంగు నిలువు గీతల చొక్కాలో కనిపించడం వల్లే బాగా నచ్చుతాడు. అటువంటి అనూహ్యమైన.. అహేతుకమైన అనేక సంఘటనలన్నీ కథ చదివే పాఠకులకు మల్లే యాదృఛ్చికంగా జరిగిన  సంఘటనలని అనుకోడు ఆ కుర్రాడు. తనకు అదృష్టం తెచ్చిపెట్టేందుకే అలా కలసివచ్చిన సంఘటనలుగా విశ్వస్తిస్తాడు. అదే సెంటిమెంటుతో ఉన్న ఆ అబ్బాయి ఒకసారి తన ఉద్యోగానికి సంబంధించిన  ప్రమోషన్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సివస్తుంది.  బస్ స్టేషన్ కని బయలుదేరిన అతనికి దారి మధ్యలో తనకు అదృష్టం తెచ్చిపెట్టే ఆ పసుపు పచ్చని చొక్కా ఇంటి దగ్గరే మర్చిపోయినట్లు హఠాత్తుగా గుర్తుకొస్తుంది. ఆ చొక్కా కోసం తిరిగి ఇంటికి వెళ్లడం వల్ల బస్ తప్పిపోవడం, మరో బస్ దొరకక ఇంటర్వ్యూకి హాజరవలేకపోవడం బాగా రాసానని అప్పట్లో చాలామంది మెచ్చుకున్నట్లుగా కూడా గుర్తు. అదలా ఉంచితే..  ఆ అవకాశం మిస్సయిన విషయమై అతను రాత్రంతా తలుచుకొని బాధపడుతుండగా.. మర్నాడు ఉదయమే వార్తాపత్రికలో వచ్చిన మరో వార్త అతని సెంటిమెంటుని మరోసారి మరింత బలపరిచే విధంగా  చేస్తుంది. అతను వెళ్లవలసిన బస్సు దారిలో ఒక పెద్ద ప్రమాదానికి గురై అందులోని ప్రయాణికులంతా అక్కడికి అక్కడే చనిపోతారు. ఆ విధంగా పసుపు పచ్చ నిలువు గీరల చొక్కా మరోసారి  ముఖ్యపాత్ర ప్రాణాన్ని రక్షించినట్లుగా చెప్పి ముగించడం వల్ల జీవితంలో అహేతుకమైన సెంటిమెంటుకున్న ప్రాధాన్యత ఎంత గొప్పదో చెప్పకనే చెప్పినట్లయిందన్న ఇంగితం అప్పట్లో నాకు లేకపోయింది.  ఇప్పుడైతే ఇలాంటి చెత్త కథను, చెడ్డ కథను  చస్తే రాయను. ఈ కథ ఎంత చెడ్డదో.. ఎందుకు చెడ్డదో ఇప్పుడు నాకు స్పష్టంగా అవగాహన ఉంది. నా అవగాహన మేరకు కవివరించే ప్రయత్నమే ఈ చిన్న వ్యాసం.
జీవితంలో చాల సంఘటనలు జరుగుతుంటాయి. కాకతాళీయంగా జరిగే సంఘటనల చుట్టూ ప్రధాన పాత్రలను తిప్పడం.. కథను కొనసాగించి ముగించడం చాలా బ్యాడ్ టెక్నిక్. 'గోడకు తుపాకీ వేలాడుతూ కనిపిస్తే  కథ పూర్తయే లోపు అది పేలి తీరాల్సిందే' అంటాడు చెహోవ్. పరిసరాల ప్రభావం కథ మీద ఎంత ప్రగాఢంగా ఉంటుందో తెలియచెప్పే ఈ సూత్రం  మంచి కథకుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటాడు. ఒక మామూలు సాధారణ సంఘటన పట్లే కథలో ఇంత అప్రమత్తత అవసరమైనప్పుడు.. ఇక నిజజీవితంలో  నిత్యం జరిగే సంఘటనలు కథలో పొదిగే సందర్భంలో రచయిత ఇంకెంత మెలుకువగా ఉండాలి? ఆ జాగ్రత్త తీసుకోకుండా రాసిన కథ కాబట్టే ‘పసుపు పచ్చ చొక్కా’ కథను పరమ చెత్త కథగా ఒప్పుకుంటున్నది.
'సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం సామాజికపరంగా ఉంటుంది' అన్న బాధ్యత రచయిత తీసుకున్నప్పుడు కథకు ఎంచుకొనే అంశాలు, వాటిని వివరించేందుకు ఉపయోగించుకొనే సంఘటనలు అనుకూల దృక్పథం కలిగివుంతాయి. ప్రతికూల దృక్పథం కలిగివున్నా వాటి వెనకున్న కార్యకారణాలను రచయిత అనుకూల దృక్పథంతో వివరించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ రెండూ లోపించినందు వల్లే నా ‘పసుపు పచ్చ చొక్కా’ కథ చెడ్డ కథల జాబితాలో చేర్చున్నది నేను.
 రాజస్థాన్ లో ఆ మధ్య చనిపోయిన భర్తతో సహా ఒక మహిళ ఊరంతా చూస్తుండగానే చితి ఎక్కి బూడిదయింది. ఊళ్లో వాళ్లంతా ఆనక ఆమెకు గుడి కట్టించి మరీ దేవతగా కొలిచిన వార్త  ఒకటి  ఒక వారం పాటు దేశమంతటా అన్నిమాధ్యమాల్లో  చక్కర్లు కొట్టింది. మామూలు జనాలను బ్రహ్మాండంగా ఆకర్షించింది సహజంగానే!
సమాజాన్ని విశేషంగా ఆకట్టుకనే అసహజ సంఘటనలు అప్పుడప్పుడు ఇలా  జరుగుతూనే ఉంటాయి. వాటిని మీడియా తమ స్వప్రయోజనాల కోసమో, వ్యాపార లాభాల కోసమో సంచలనం చేయడం ఈ పోటీ  ప్రపంచంలో పరిపాటే. మీడియాలాగా రూపాయి లౌల్యాన్ని పెంచి పోషించడం సాహిత్యం అంతిమ లక్ష్యం కాదు.  ప్రగతిని వెనక్కు నడిపించే మూఢ విశ్వాసాల పట్ల, దిగజారుతున్న   మానవీయ విలువల పట్ల, క్షీణిస్తున్న కుటుంబ సంబధాల పట్ల, ఆర్థిక.. లైంగికపరమైన దోపిడీల పట్ల, అసమానతల పట్ల, ప్రకృతి పైన పెరిగే ఉదాసీనతల పట్ల. సాటి జీవజాతుల మీద ప్రదర్శించే క్రౌర్యం పట్ల సమాజాన్ని ఎల్లవేళలా అప్రమత్తం చెయ్యడమే సాహిత్యం ప్రథమ, ప్రధాన  కర్తవ్యంగా ఉండి తీ

రాలి. ఇందులో మరో మాటకు తావు లేదు. తాత్కాలికమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే, భావోద్వేగాలతో బానిసనలుగా చేసుకునే అశ్లీల, అసభ్య, అహేతుక సాహిత్యాన్ని సృష్టించడం తేలికే.  నానాటికి మానవ సంబంధాల దిగజారుతున్న సమాజంలో ఈ తరహా ప్రతికూల సాహిత్య సృష్టి షార్ట్ కట్లో  రాత్రికి రాత్రే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది కూడా!
ఒక వంక విశ్వవ్యాప్తంగా అన్ని రంగాలలో  వైజ్ఞానికి స్పృహ పెరుగుతూ మానవ వికాసం మనోవేగంతో పురులు విప్పుతుంటే.. మరో వంక మనిషిని పూర్వపు చీకటి సంస్కృతుల్లోకి నడిపించే కళలను, సాహిత్యాన్ని సృష్టించడం, ఆకర్షించడం మనిషి పట్ల కళాకారులు, సాహిత్యజీవులు చేసే ద్రోహమే అవుతుంది.
అందుకే మూఢవిశ్వాసాలను పెంపొందించే విధంగా, అస్వాభావికమైన అరుదైన యాదృఛ్చిక సంఘటనలను ప్రధాన వస్తువుగా ఎన్నుకొని, దాని చుట్టుతానే కథనూ, కథలోని ముఖ్యపాత్రలనూ తిప్పే రచయితలను 'ఏం చేసినా పాపం లేదు' అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు.
కథ సహజంగా ఉండాలి.. అంటే కథలో రచయిత ఎన్నుకున్న ప్రధాన వస్తువు నిత్యం వర్తమాన జీవితంలో జరిగేదిగా ఉండాలి. కథ చదివిన పాఠకుడి మనసు రసవంతంగా సంతృప్తి చెందడం రచయిత శైలికి, శిల్పానికి సంబంధించిన అంశం. ఆ నైపుణ్యం లోపించిన కథ ఎలాగూ కాలానికి ఎదురీది నిలచేది కాదు.  అసలది కథగానే పరిగణింపులోకి రాబోదు. కథన నైపుణ్యాలూ కొదవ లేకుండా శైలీ విన్యాసాలను ప్రదర్శించే చెయి తిరిగిన రచయితలయినా సమాజాన్ని, మనిషిని, మనసుని వెనక్కి నడిపించే, చీకట్లోకి నెట్టే, విలువలు దిగజార్చే కథలను వండి వార్చినా అవి చెడ్డ కథలే అవుతాయి తప్ప ఎంత ఆకర్షణీయంగా సృష్టించినప్పటికీ ఎన్నటికీ మంచి కథలు  కాలేవు. నేను ముందు చెప్పిన నా ఆ పసుపు పచ్చ చొక్కా కథ అందుకే మహాచెడ్దది అని తరువాత తెలుసుకున్నాను. ఆ తరహా పొరపాతు కొత్త రచయితలు చెయ్యద్దనే ఈ చిన్ని వ్యాసం
-కర్లపాలెం హనుమంతరావు
(తెలుగు వెలుగు మాసపత్రిక జూన్, 2020లో ప్రచురితం


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...