Showing posts with label War. Show all posts
Showing posts with label War. Show all posts

Monday, April 13, 2020

అలెగ్జాండరు జగజ్జేతా?!- -కర్లపాలెం హనుమంతరావు






'అలెగ్జాండర్ , ది గ్రేట్' అని మాకు ఎనిమిదో తరగతిలోనో, తొమ్మిదో తరగతిలోనో   ఇంగ్లీషు పాఠం ఉండేది. ఆ పాఠం పంతులుగారి నోట వింటున్నప్పుడు, అచ్చులో రోజూ చూస్తున్నప్పుడు 'ఆహా! అలెగ్జాండర్.. నిజంగా ఎంత గ్రేటో!' అనుకుంటుండేవాళ్లం ఆ చిన్నతనంలో.
పెరిగి పెద్దవుతున్నా చాలాకాలం వరకు ఆ అభిప్రాయంలో మార్పు రాలేదు. కానీ ఆ మధ్య సుధాకర్ ఛటోపాథ్యాయ అనే చరిత్ర పుస్తక రచయిత రాసారని చెబుతున్న ' ద అకమీనీడ్స్ అండ్ ఇండియా' పుస్తకంలోని కొద్ది భాగం ఆంధ్రజ్యోతి సంపాదక పుటలో శ్రీమతి ముదిగొండ సుజాతారెడ్దిగారు రాసింది అనుకోకుండా చదవడం జరిగింది. 'ఆహా! అయ్య.. అలెగ్జాండరుగారిలోని గొప్పతనం ఇదా!' అని ఆశ్చర్యపోవడం నా వంతయింది.
ప్రపంచం మొత్తాన్ని జయించాలన్న పిచ్చి కోరికతో చేసిన యుద్ధాల్లో  ఆయనగారు అవసరమైన చోట యుద్ధనీతులక్కూడా తిలోదకాలిచ్చేసినట్లు చదివితే అవాక్కవక తప్పదు ఎవరికైనా. పెషావరు యుద్ధంలో అలెగ్జాండరుకి ఎదురైన ప్రతిఘటన చాల బలమైనది. తానే స్వయంగా యుద్ధరంగంలోకి ఆయుధం పట్టుకుని దిగినా గెలుపు అంత సునాయాసంగా దక్కే అవకాశం కనిపించలేదు.  అశ్వకులఅనే బలమైన శత్రుజాతిని  వీరోచితమైన పద్ధతిలో ఎదుర్కోలేక రాత్రి పూట చాటుగా చీకటి మాటున కోటలోకి జొరబడి  మూకుమ్మడిగా ఉచకోత కోయించాడని రాసుందా గ్రంథంలో!
అలెగ్జాండరు రక్తంలో ఉన్నది యోధత్వమా? ప్రపంచదేశాల సంపదనంతా కొల్లగొట్టి స్వదేశానికి తరలించుకుపోవాలన్న డబ్బువుబ్బరమా? ఆ వ్యాసంలో రాసింది చదివేవారికి ఎవైరికయినా ఆ అనుమానం రాక తప్పదు.
మేసిడోనియా దేశం(ఇప్పటి స్లోవాకియా) రాజు ఫిలిప్స్ ముద్దుల బిడ్ద అలెగ్జాండరు. అతనికి చిన్నప్పట్నుంచే యుద్ధాల పిచ్చి. అరిస్టాటిల్ శిష్యరికంలో మెరికలాగా తయారయాక ప్రపంచ దేశాలన్నింటి మీదా పెత్తనం చెలాయించాలన్న కొత్త తుత్తర మొదలయిందంటారు.
సైన్యాన్ని, వనరులని దండిగా సమకూర్చుకుని ముందుగా దగ్గర్లోనే ఉన్న అకీమీనియన్ దేశం మీదకు దండయాత్రకెళ్లాడు. అప్పటికే మూడో తరం ఏలుబడిలో పడి   బలహీనంగా ఉందా దేశ రక్షాణ వ్యవస్థ.  డేరియన్ని ఓడించడం మంచినీళ్ల ప్రాయమయింది. ఆ విజయం ఇచ్చిన అత్మవిశ్వాసంతో ధనాగారంగా వర్ధిల్లే మన భరతఖండం మీద కన్నుపడింది అలెగ్జాండరుకి.
దారిలోని ఈజిప్టు, అసీరియాలాంటి దేశాలను ఒక్కొక్కటిగా వశపరుచుకుంటూ పర్షియా రాజధాని పెర్సిపోరస్ చేరుకొన్నాడు అలెగ్జాండర్. కొన్నాళ్లపాతు తనకూ. తన సైన్యానికి విరామం అవసరమనిపించిందేమో..  ఆ దేశం రాజు మీద పై చేయి సాధించినా అతని కూతుర్ని వివాహమాడి మనుగుడుపు అల్లుడు మాదిరి సుఖాలు అనుభవించాడు. సామదానభేదదండోపాయాలలో ఏది ఎప్పుడు ప్రయోగించాలో అరిస్టాటిల్ శిష్యరికంలో బాగా ఆకళింపు చేసుకున్న జిత్తులమారి! లేకపోతే దక్షిణ గాంధారం రాజు అంబి తక్షశిలలో అలెగ్జాండర్  ముందు అంత సులభంగా ఎందుకు    స్వీయాత్మార్పణ చేసుకొంటాడు? అక్కడి గెలుపు ఇచ్చిన కిక్కులో అలెగ్జాండర్ జీలం.. చీనాబ్ నదుల మధ్య ప్రాంతాల్లో ఉన్న పౌరస్ మీదకొచ్చి పడ్డాడు.
పౌరస్ పౌరుషం అలెగ్జాండర్ మునుపెన్నడూ రుచి చూడనిది. పౌరస్ గజబలం ముందు  అలెగ్జాండర్ ఆశ్వికదళం డీలాపడిందంటారు.
నిజానికి అక్కడ అలెగ్జాండరుకి ఏ మేరకు విజయం లభించిందో ఇతమిత్థంగా చెప్పలేం. యూరోపియన్ హిస్టోరియన్స్ రాసిన చరిత్రే మనకు ఆధారం అప్పట్లో. తమ యూరోపు యుద్ధవీరుడికి ఆసియావాసుల ముందు  పరాజయం కట్టబెట్టడం తలవంపులుగా భావించినట్లుంది.. మధ్యగోళ చరిత్రకారులు ఆ అపజయాన్ని కనీసం రాజీగా కూడా చిత్రించేందుకు ఇష్టపడలేదంటారు సుధాకర్ ఛటోపాధ్యాయ. పౌరస్ మీద పై చేయి సాధించినా అలెగ్జాండర్  శత్రువుకు రాజ్యాన్ని ఉదారంగా  వదిలేసి వెనక్కి మళ్లినట్లు తమ చరిత్రలో రాసుకున్నారని ఆ చరిత్రకారుడి  ఫిర్యాదు.
‘The classical authors have evidently twisted the facts to glorify their one hero'(p.21) అని ఆ పుస్తకంలో రాసి ఉన్న దాన్ని బట్టి అలెగ్జాండర్ విజయం అనుమానస్పదమే అనిపిస్తుందిప్పుడు.
ముందున్న ప్రాంతమంతా ఎగుళ్లు దిగుళ్లు. సముద్రాలు, నదులు, దట్టమైన అడవులు. పాములు, తేళ్లులాంటి ప్రాణాంతకమైన జీవులు సంచరించే ప్రాంతాలే అన్నీ. దట్టంగా వర్షాలు దంచికొడుతున్నాయ్ ఆ సమయంలో. వరస యుద్ధాలతో బాగా అలసిపోయుంది సైనికదళం. అన్నిటికీ మించి అప్పటి వరకు వివిధ దేశాలలో దోచుకున్న సంపదతో తృప్తి చెంది తిరిగి స్వదేశంలో తమవారితో సుఖపడాలన్న కోరిక.. ఆ సైనికులలో మొండితనాన్ని కూడా పెంచిందంటారు.  అతికష్టం మీద అలెగ్జాండర్  వాళ్లకు నచ్చచెప్పుకుని ముందుకు నడిపించినా.. సింధునది దక్షిణ ప్రాంతంలో మల్లులు, క్షుద్రకులు అనే రెండు జాతులు ఉమ్మడిగా చేసిన దాడిలో అలెగ్జాండరే స్వయంగా విషపూరితమైన  అమ్ము శరీరానికి తాకి గాయపడ్డట్లు కథనం.
ఏదేమైనా ప్రపంచ విజేత కావాలన్న తన కల నేరవేరక ముందే అలెగ్జాండర్ తిరిగి స్వదేశానికి పయనమయిన మాట మాత్రం పచ్చి వాస్తవం.
అంభంలో కుంభం అన్నట్లు.. ఆ తిరుగు ప్రయాణం మధ్య దారిలో మలేరియా జ్వరం తగులుకొని బాబిలోనియాలో(సూసానగరం అని కొందరంటారు) క్రీ.పూ 324లో ఆఖరి
శ్వాస విడిచాడు అలెగ్జాండర్. ప్రపంచాన్ని లొంగదీసుకోవడం మాట అటుంచి మృత్యువుకు తాను అంత నిస్సహాయంగా లొంగిపోయాడు.
అయినా 'అలెగ్జాండర్ .. జగజ్జేత' అంటూ యూరోపియన్లు  తమకు అనుకూలంగా రాసుకున్న తప్పుల తడక చరిత్రను తెల్లవాడి పుణ్యమా అని మనం వల్లెవేసాం!  మన పిల్లల చేతా ఇప్పుడు వల్లెవేయిస్తున్నాం!
చరిత్రలూ చాలా రకాలుగా ఉంటాయి. ఎవరి విశ్వాసానికి తగ్గవి వాళ్లు  చదువుకుంటున్నారిప్పుడు! అలాంటప్పుడు ఏ సమాచారాన్నని తప్పు పట్టగలం? ఏ సమాచారం కరెక్టని నెత్తి మీద పెట్టుకోగలం?
-కర్లపాలెం హనుమంతరావు
13 -04 -2020
బోథెల్, యూ.ఎస్.ఎ


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...