Tuesday, June 22, 2021

మన స్వాతంత్య్రం మేడిపండు! - కర్లపాలెం హనుమంతరావు ఈనాడు సంపాదకీయం - 15 - 08- 2012

 



అసత్యం నుంచి సత్యం దిశగా, అజ్ఞానమనే అంధకారం నుంచి  జ్ఞానమనే జ్యోతి  ప్రకాశం వైపుగా, మృత్యువు నుంచి   అమృతత్వానికేసి  .. ప్రభూ, మమ్ములను నడిపించు' అంటూ  చేసే 'అసతోమా సద్గమయ'  ప్రార్థన సహస్రాబ్దాల భారతావని సాంస్కృతిక సంస్కార సారం. దశాబ్దాల కిందట  ఇదే శుభ దినాన  దేశమాత దాస్యశృంఖలాలు విచ్ఛిన్నమయి, నడిరేయిలో స్వాతంత్య్ర భానూదయమైన క్షణం ప్రతి భారతీయుడి గుండె ఆనందార్ణవమైన  మాట నిజం. 'ప్రాగ్దిశాకాశంలో వినూత్న తార'గా పండిట్ నెహ్రూ అభివర్ణించిన ఆ స్వాతంత్ర్య  దేశం సాధ్యపడిందెలా? దోపిడి, పీడనల వలస పాలనకు  వ్యతిరేకంగా యావద్దేశం ఒకే  తాటి మీద కొచ్చి   పూరించిన సత్యాగ్రహ సమర శంఖారావం   తెల్లవాడి గుండెల్లో దడపుట్టించింది.  సరిహద్దులు దాటు వరకు  తరిమికొట్టింది. 'తమసోమా జ్యోతిర్గమయ' దారిన ఆ అర్థరాత్రి ఉదయించిన  స్వాతంత్య్ర ఉషోదయ కాంతులు  కోట్లకొద్ది తాడిత పీడిత జనావళి జీవితాలలో నవ్య కాంతుల ప్రసారాలకు నాందీ ప్రస్తావనలవుతాయనే  నాటి అశేష విశాల జనావళి ఆశ్వాసించినది. మొక్కవోని విశ్వాసంతోనే భారతావని ప్రగతి ప్రస్థానం దశాబ్దాల కిందట మొదలయినది . ఇన్ని  దశాబ్దాల కాలగతిలో ఇండియా స్వీయ శక్తి సామర్థ్యాల మేరకు అభివృద్ధి నిజంగా  సాధించిందా?  అన్న ధర్మసందేహం మొన్న  ప్రధానమంత్రికే కలిగింది! అదీ అబ్బురం! అభివృద్ధికి అవినీతిని సమానార్థకం చేసేసిన  పాలకుల పాలబడి రాజ్యాంగ వ్యవస్థలే భ్రష్టుపట్టిన దురదృష్టకర వాతావరణం ఇప్పుడు దేశమంతటా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ప్రగతి చాటున అవినీతి జగతిని  సృష్టించిన ప్రజానేతల పాలన- నాటి సుహార్తో, మార్కోసుల ‌ వంటి  మహామహుల జమానాలకు  నమూనా! దాని దుష్ప్రభావాలు రాష్ట్రాన్ని నేటికీ వెంటాడుతుండగా, సీబీఐ అభియోగపత్రంలో అయిదో నిందితుడిగా ముద్రపడి తాజాగా మంత్రి పదవి త్యజించారు ధర్మాన! 'కొడుకు వలన, కొడుకు చేత, కొడుకు కోసం'గా ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ అస్మదీయ మంత్రులు, ఐఏఎస్‌ల అండతో అవినీతి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి పదుల వేలకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని జగన్‌కు నిర్మించి ఇచ్చారు. 'కోట్లు మీకు- కోర్టులు మాకా' అని ఎంత గుస్సా పడితేనేం- నాటి పాపంలో పాల్పంచుకొన్నందుకు మంత్రులూ బాధ్యత వహించక తప్పదు. రాక్షసంగా జనానికి కీడుచేసే యంత్రాంగమే రాజకీయంగా చలామణీ అవుతోందిప్పుడు!


'గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్' అన్న భావన బలపడుతోందంటే, క్షీణ విలువలకు ఆటపట్టుగా జాతి దిగజారుతోందని అర్థం. నేడు భారతావనిని పట్టి కుదుపుతోంది అదే అనర్థం. భారత స్వాతంత్య్రోద్యమం పూర్తిగా త్యాగధనుల చరిత్ర. మందికోసం మాగాణులమ్ముకొన్న (అ)సామాన్యులు మొదలు, దేశహితం తప్ప మరేమీ పట్టని దార్శనికులు యాభయ్యేళ్ల క్రితందాకా నడయాడిందీ నేల! సొంత ఇల్లు లేని 'హోం'మంత్రిగా, దరిమిలా ప్రధానమంత్రిగా ఆయా పదవులకే వన్నె తెచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వ్యక్తిత్వం నేటి నేతల్లో ఎందరికి తెలుసు?ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రైల్వేమంత్రి పదవిని త్యజించిన లాల్ బహదూర్ ముందు నేటి నేతలంతా పిపీలికాలే. 'ప్రయత్నలోపం లేకుండా ముందడుగేద్దాం... విజయం సాధిస్తే సంతోషం. విఫలమైతే రాజీనామా చేసి నిష్క్రమిస్తా'నని ప్రధానమంత్రిగా ఆయన చెప్పిన మాట సమున్నతాదర్శానికి కరదీపికే! అభియోగపత్రం దాఖలైతే రాజీనామా చెయ్యాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని కుతర్కం తీసిన లాలు మహాశయుల తలదన్నే నేతలు రాష్ట్రంలోనే దాపురించారు. ఫెరా ఉల్లంఘన కేసులో జైలుశిక్షకు గురైనా నైతిక బాధ్యతను తుంగలో తొక్కి పదవిని పట్టుకు వేలాడుతున్నారు ఓ మంత్రిసత్తములు! పదవులు చేపట్టేముందు చేసిన రాజ్యాంగ ప్రమాణాలే గీటురాయి అయితే మంత్రివర్గంలో అసలు మిగిలేదెందరు? 'రాజ్యాంగాన్ని ముట్టకుండానే, కేవలం పాలన యంత్రాంగం సరళిని మార్చడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాచి, దాన్ని భ్రష్టుపట్టించడం సాధ్యమే'నని 1949 అక్టోబరులోనే భారతరత్న అంబేద్కర్ హెచ్చరించారు. అక్రమాల ఏలికలు ఇప్పుడు చేస్తున్నవి అదే తరహా అవినీతి ప్రయోగాలు!


క్రమం తప్పక ఎన్నికలు జరగడమే ప్రామాణికమైతే, 'మేరా భారత్ మహాన్' అనుకోవాల్సిందే. డబ్బులు వెదజల్లి గెలవడం, మళ్ళీ అంతులేని సంపదలు పోగేసుకోవడానికి నానా గడ్డీ కరవడం- భారత ప్రజాస్వామ్య ముఖచిత్రం ఇదీ అంటే, సిగ్గుపడాల్సిందే! నేడు- నేరం, రాజకీయం అవిభాజ్యం; రాజ్యం అవినీతి భోజ్యం! 'కాగ్' లెక్కల ప్రకారం లక్షా 76వేలకోట్ల రూపాయల రాబడి నష్టానికి కారకుడైన అవినీతి 'రాజా'- సుప్రీంకోర్టు కొరడా ఝళిపించేదాకా కేంద్రమంత్రి పదవిలో ఎలా కొనసాగగలిగాడో తెలియనిది కాదు. పద్నాలుగుమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు రువ్విన అన్నా బృందమే అందుకు రుజువులు చూపాలంటున్నారు సాక్షాత్తు ప్రధానమంత్రివర్యులు! 'ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపండి- వాస్తవాలుంటే, విచారణ జరిపిస్తాం' అన్నది వైఎస్ పెడధోరణి. అదే పంథాను కేంద్రమూ పుణికిపుచ్చుకొంటే- ఎక్కడికక్కడ దోచుకొన్నవాళ్లకు దోచుకున్నంత! అవినీతిపరులకు రక్షాకవచాలు తొడగడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పరస్పరం పోటీపడుతున్నాయని చెప్పక తప్పదు. పట్టుమని అయిదేళ్లలో రాష్ట్రం పుట్టిముంచి పదుల వేలకోట్ల రూపాయల అక్రమాస్తుల్ని జగన్‌కు దోచిపెట్టేలా నీకిది నాకది(క్రిడ్ ప్రో కో) బాటలో సాగిన వైఎస్, 26 జీఓలతో చీకటి లాలూచీలకూ చట్టబద్ధత కల్పించారు. ఆ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు సంబంధిత మంత్రులు, అధికారులకు నోటీసులు జారీచేస్తే న్యాయసహాయం పేరిట- మళ్ళీ ప్రజాధనాన్నే వెచ్చించి మచ్చపడ్డవాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తోంది కిరణ్ సర్కారు! ప్రజలకోసమే ప్రభుత్వాలున్నాయని, జనశ్రేయం కోసమే అవి పనిచేస్తున్నాయని ఎవ్వరూ గుండెమీద చెయ్యి వేసుకొని చెప్పలేని మేడిపండు ప్రజాస్వామ్యం మనది. అధికార స్థానాల్లోని అవినీతి కుళ్లును ప్రక్షాళించడానికి సత్యాగ్రహ స్ఫూర్తితో జనం మరో స్వాతంత్య్ర సమరమే సాగించాలి!

(సంపాదకీయం, ఈనాడు , 15:08:2012)

Saturday, June 19, 2021

నవ్వు అరవై విధాల మేలు -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

 



 

హాసం పరమేశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. 'కారము వాడి చూపులగు, నాకారము శ్వేతచంద్రికగు, సం/స్కారము మందహాసములు, ప్రా/కారము ప్రేమ సన్నిధి గదా!' అన్న ఆదిదేవుని  సంస్తుతే ఇందుకు ఒక అందమైన ఉదాహరణ. రావణ వధ అనంతరం అయోధ్యలో ఆరుబయలు వెన్నెలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. సభ పరమ గంభీరంగా సాగుతోంది.. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి పెదవులపై చిరుదరహాసాలు! ఎవరికి వారుగా ఆ నవ్వుకు తమకు తోచిన భాష్యం చెప్పుకోవడం.. తదనంతర కథా పరిణామం. నవ్వును నిర్వచించటం సృష్టించిన విధాత మేధకైనా మించిన పని అని చెప్పటమే ఇక్కడి ఉదహృతానికి సంబంధించిన ఆంతర్యం. ఆంధ్ర భాగవతం నరకాసురవధ ఘట్టంలో 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటాడు పోతన. భామ మందహాసం అదే. హరిని, అరిని ఆ నారి చూసే తీరులోనే భేదం అంతా. గిరిజాసుతుడి రూపాన్ని పాపం  ఏ భావంతో తేరిపార చూశాడో.. నీలాపనిందల పాలయ్యాడు చవితి చంద్రుడు. హాసానికి, పరిహాసానికి మధ్య ఉండే పలుచని మేలితెర మూలకంగానే భారతంలోనూ సాథ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాలపాలయింది. 'నవ్వకుమీ సభ లోపల/ నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/ నవ్వకుమీ పరసతితో/ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అంటూ హాసంపై గల పరిమితులను గుర్తుచేసే శతక పద్యమూ మనకొకటుంది. 'కారణము లేక నవ్వును.. ప్రేరణమును లేని ప్రేమ.. వృథరా!' అని శతకకారుడు ఏ కారణంతో అన్నాడో కాని- వాస్తవానికి 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు' అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.

 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని పాతకాలపు మొరటు మాట. శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి  గౌరవ స్థానమిచ్చారు ఆలంకారికులు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్భోచితంగా సంభాషణలు సాగించినా, అసందర్భంగా సంభాషణల మధ్య తలదూర్చినా, శబ్దాలు విరిచి ఉచ్ఛరించినా, పదాలు అడ్డదిడ్డంగా మార్చి కూర్చినా, చేష్టితాలు వికృతంగా అనుకరించినా, అకటా వికటంగా ప్రవర్తించినా.. అనేకానేక సవాలక్ష  వంకర టింకర విన్యాసాలింకేవైనా ప్రదర్శించినా, మందహాసం నుంచి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వులను పువ్వుల్లా రాల్చవచ్చు. తిక్కన సోమయాజి భారతంలో- పిన్న నవ్వు, చిరు నవ్వు, అల్లన నవ్వు, అలతి నవ్వు, మందస్మితం, హర్ష మందస్మితం, ఉద్గత మందస్మితం, జనిత మందస్మితం, అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిది. కలకల నవ్వు, పెలుచ నవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటూ పెద్ద నవ్వులు మూడు. కన్నుల నవ్వు,ఆ కన్నుల్లో నిప్పురవ్వలు రాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు, కటిక నవ్వు, కినుక నవ్వు అని తతిమ్మా మరో ఎనిమిది.. మొత్తంగా ఇరవై రకాల నవ్వులతో వివిధ పాత్రలు పోషించిన హాసవైవిధ్యాన్ని రసప్లావితంగా ప్రదర్శిచి 'ఆహో' అనిపించారు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభోగాలను గురించి కాళిదాసు మొదలు కృష్ణదేవరాయల దాకా, శ్రీనాథుడు లగాయతు చిన్నయసూరి వరకు అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ భారతీయ సాహిత్యంలో కోకొల్లలు. ఆ సాహిత్యం సమస్తాన్ని రామాయణ, భారత, భాగవతాదులకు  మించి శతసహస్రాధికమైన శ్రద్ధాసక్తులతో మనం పారాయణ చేసిన మాటా వాస్తవం. మే మొదటి వారాంతంలో వచ్చే  'ప్రపంచ నవ్వుల దినం'  ప్రత్యేకత అంతా... సుమతీ శతక కర్త చెప్పిన ఆ 'కారణం లేని నవ్వు' మహత్తుపై మరింత సదవగాహన పెంచుకోవడమే!

ఉరుకుల పరుగుల జీవితాలు, ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసిరాని నివారణ లేని కరోనా తరహా పెనురోగాలు... ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్న వైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధుల పై ఇంకెన్నో అధ్యయనాలు, మరింకెన్నో పరిష్కారాలు. అందరికీ అందే ద్రాక్షపళ్లేనా ఆ పరిశోధనాఫలాలలో కొన్నైనా! ఆ వెసులుబాటు లేనితనమే వీలున్నంత మేర మందుల జోక్యం లేకుండా జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యత  కల్పిస్తున్నది క్రమంగా. నవ్వు నాలుగు విధాల చేటన్న మాట సరి కాదు. సరికదా, అందుకు విరుద్ధంగా ఆరోగ్యానికి అరవై రకాల మేలు కూడా. చాలా అధ్యయనాల్లో హాసోల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం, సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగా గురువు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించిన హాసచికిత్సా విధానమే నవ్వుల దినోత్సవ నేపథ్యం.  కారణమేమీ లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు.. ఉద్రిక్తతల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి కలుగుతాయని కటారియా వాదం. నవ్వు రక్తవాహికలను విశాలపరుస్తుంది. ఒత్తిడి కారక హార్మోన్ల ఉత్పత్తిని విరోధిస్తుంది.  రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకోవడం వంటివి వందలాది లాభాల్లో ఒకటి మాతమే. నిస్పృహకు, నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వగలిగితే చాలు.. దానికే పది నిమిషాల పాటు వ్యాయామం చేసినంత మేలు. ముఖ సౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక సాధనం. సూదంటురాయిలా మంచివారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానిదే. కారణాలు అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపకా నవ్వగలగడం... ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను వెలిగించుకోగలగడం హాస దినోత్సవ సంబరాల వెనకున్న  ప్రధాన స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తిమంతమైన మంత్రం మన పెదాల మీదనే సేవకు సదా సిద్ధంగా  ఉంటుంది. ఆ హాస సేవికకు పనికల్పించేందుకే నవ్వుల క్లబ్ హాస నినాదం... హా...హా...హా.. పుట్టుకొచ్చింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

Tuesday, June 15, 2021

వెలుగుదారి - ఈనాడు సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం, 01 -01 -2012)

 



కాలమనే కడలిలో మరో కొత్త అల లేచింది. కొత్తదనమనగానే చిత్తానికెందుకో అంత ఉత్తేజం! 'అంతరంగం వింత విహంగమై/ రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో/ ఎగిరిపోవాలని ఉబలాటపడే' శుభవేళ ఇది. 'అక్కయ్యకి రెండో కానుపు/ తమ్ముడికి మోకాలి వాపు/ చింతపండు ధర హెచ్చింది/ చిన్నాన్నకు మతిభ్రమ కలిగింది'. ఇలా, నిద్రనుంచి మేల్కొన్న మరుక్షణంనుంచీ గోరుచుట్టులా మనిషిని సలిపే సమస్యలు సవాలక్ష. 'ఆనందాన్ని చంపేందుకు/ అనంతంగా ఉంది లోకం/ కులాసాని చెడగొట్టేందుకు అలాస్కా దాకా అవకాశం ఉంది' అన్న కవి తిలక్ పలుకులు నిరాశ కలిగించేవే అయినా అవి నేటికీ సరిపోయే నిష్ఠుర సత్యాలే. చుట్టుముట్టిన చీకట్లను తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగుదారి వెతుక్కుంటూ రాదు కదా! కాసేపైనా గోర్వంకల రెక్కలమీద ఊహావసంతాల చుట్టూ చక్కర్లుకొట్టి రాకపోతే ఈ చికాకుల లోకంనుంచి మనిషికి మరి తెరిపేదీ! 'మనసూ మనసూ కలగలిసిన మైమరుపు ముందు మద్యం ఎందుకు?' అంటాడొక నవ కవి. ఎవరెస్టుకన్నా ఎత్త్తెన శిఖరాల్నీ వూహల్లో త్రుటిలో లేపేయగల చేవ సృష్టిమొత్తంలో ఉంది మనిషికే. అదో అదృష్టం. ప్రతి క్షణం ఓ రుబాయత్ పద్యంలా సాగిపోవాలంటే సాధ్యపడకపోవచ్చు. పాతంతా గతించి, సరికొత్తదనం మన జీవితం గడపలోకి కొత్త పెళ్ళికూతురులా అడుగుపెట్టే వేళా మనసు ఒమార్ ఖయ్యాం కాకపోతే జీవితానికింకేం కళ! 'నేటి హేమంత శిథిలాల మధ్య నిలచి/ నాటి వసంత సమీరాలను' తలచుకొనే శుభసందర్భం కొత్త ఏడాది తొలి పొద్దుపొడుపే! ఉషాకాంతుల వంటి బంగరు వూహలతో దివ్య భవితవ్యానికి సర్వప్రపంచం సుస్వాగతాలు పలికే సంప్రదాయం వెనకున్న రహస్యం- మనిషి నిత్య ఆశావాది కావడమే!

 

ఆదిమానవుణ్ని అణుమొనగాడిగా మలచింది ఆశావాదమే. 'మనిషికి మనిషికి నడుమ/ అహం గోడలుండవని/ అంతా విశ్వజనని సంతానం కాగలరని/ శాంతియనెడి పావురాయి/ గొంతునెవరు నులమరని/ విశ్వసామ్య వాదులందు/ విభేదాలు కలగవని' మనిషి కనే కల వయసు మనిషి పుట్టుకంత పురాతనమైనది. ఎదురుదెబ్బలెన్ని పడినా బెదరక కాలానికి ఎదురేగి మరీ వూరేగే సుగుణమే మనిషిని మిగతా జీవరాశికి అధిపతిగా నిలబెట్టింది. శిశిరం వచ్చి పోయిందనీ తెలుసు. తిరిగి వచ్చి విసిగిస్తుందనీ తెలుసు. అయినా మధుమాసం రాగానే మావికొమ్మమీద చేరి కోయిల కూయడం మానదు. చినుకు పడుతుందా, వరద కడుతుందా... అని చూడదు. వానకారు కంటపడితే చాలు- మయూరం పురివిప్పి నాట్యమాడకుండా ఉండదు. అత్తారింట్లో అడుగుపెట్టే కొత్తకోడలి అదృష్టం లాంటిది భావి. గతానుభవాలతో నిమిత్తం లేదు- రాబోయే కాలమంతా సర్వజనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించే అలాంటి స్వభావమే మనిషిదీ. 'సకల యత్నముల నుత్సాహంబె మనుజు/ లకు సకలార్థ మూలము' అని రంగనాథ రామాయణ ప్రవచనం. 'నానాటికి బ్రదుకు నాటకము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్ట నడిమిపని నాటకము' అని అన్నమయ్య వంటివారు ఎన్నయినా వేదాంతాలు వల్లించవచ్చు. రక్తి కలగాలంటే నాటకానికైనా ఆసక్తి రగిలించే అంశం అవసరమేగా! పర్వదినాలు ఆ శక్తిని అందించే దినుసులు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో ఉత్సాహంగా మునుముందు జరుపుకోబోయే పండుగలన్నింటికీ జనవరి ఒకటి నాంది. గురజాడవారు భావించినట్లు 'నవ వసంతము నవ్య వనరమ/ మావి కొమ్మల కమ్మ చివురుల/ పాట పాడెడి పరభృతంబు(కోయిల)ను' పాడకుండా ఆపటం ఎవరితరం! కొత్త సంవత్సరం మొదటిరోజున మనిషి చేసుకునే సంబరాలను ఆపబోవడమూ ఎవరి తరమూ కాదు. ఎవరికీ భావ్యమూ కాదు.

 

'వైషమ్యాలు శమింపలేదు; పదవీ వ్యామోహముల్ చావలే/ దీషణ్మాత్రము గూడ; మూతవడలేదే కైతవ ద్వారముల్/ మరి యెన్నాళ్లకిటు వర్ధిల్లున్ బ్రజాభాగ్యముల్?' అంటూ రణక్షేత్రం మధ్య అర్జునుడిలా మనసు జీవితక్షేత్రంలో విషాదయోగంలో పడే సందర్భాలు బోలెడన్ని ఉంటాయి. భుజంతట్టి, లేపి, నిలబెట్టి చైతన్యమార్గం చూపించే నాటి ఆచార్యుని 'గీత' లక్ష్యమే నూతన సంవత్సర శుభాకాంక్షల అంతరార్థం. 'ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు దివ్వెల నూనె తరుగలేదు/ పవలు రేలును తీరుబడి లేక ఘోషించు/ తోయధీశుని గొంతు రాయలేదు'- మరి ఎందుకు మధ్యలో ఈ విషాదయోగం? నియతి తప్పక నడిచే కాలమూ మనిషికిచ్చే సందేశం- శిశిరంలో సైతం వసంతాన్నే కలగనమని. అంది వచ్చిన కాలాన్ని ఆనందంగా అనుభవించాలని. కొనలేనిది, పట్టుకొనలేనిది, సృష్టించలేనిది, వృథా అయినా తిరిగి సాధించలేనిది, మొక్కినా వెనక్కి తెచ్చుకోలేనిది... మనిషి కొలమానానికి అందనంత అనంతమైన వింత- కాలం. జీవితంలో ప్రేమించడమొక్కటే కాలాన్ని వశపరచుకోగల ఏకైక మంత్రం. కాలగమనాన్ని సూచించే పర్వదినం జనవరి ఒకటి ప్రత్యేకతే వేరు. కుల మతాలు, చిన్నా పెద్దా, ఆడా మగ, తెలుపూ నలుపు ఏ తేడా లేకుండా 'సర్వేజనా స్సుఖినో భవంతు' అనే ఒకే ఉద్వేగభావంతో ప్రపంచమంతా సంబరాలు చేసుకొనే అపూర్వ పర్వదినం నూతన సంవత్సరం మొదటిరోజు మొదటి క్షణం. అంత ఉత్తేజకరమైనది, ఉత్సాహభరితమైన పండుగ మళ్ళీ వచ్చేది వచ్చే ఏటి మొదటిరోజు ఇదే సమయానికే. అందుకే ఈ రెండు పండుగల నడుమ కాలమంతా సర్వప్రపంచంలో సుఖ ఐశ్వర్య శాంతులతో ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుందాం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 01 -01 -2012)


కాలమర్మం! -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సాహిత్య సంపాదకీయం .. 05:01:2014 నాటిది)


 'ఒక్కనాటి ప్రపంచము ఒక్కనాటి వలెకాదు/ ఒక్క నిమిషము వలెనొకటి గాదు-' ఆధ్యాత్మిక ఆచార్యులు అన్నమయ్య కాలభావన అది. భారతీయుల కాలవివేచన వేదకాలం నాటిది. బ్రహ్మప్రోక్తాలని ప్రతీతి కలిగిన వేదాలు 'సూర్యుణ్ని ఉషాకన్యానాథుడి'గా ప్రస్తుతించాయి (రుగ్వే. 7 మం. 75 రుక్కు). బ్రాహ్మణాలైతే నక్షత్ర మండల ప్రస్తావనలూ తీసుకొచ్చాయి. కల్పం, బ్రహ్మకల్పం వంటి కాలాపేక్ష సిద్ధాంతాలు పురాణేతిహాసాలనిండా బోలెడన్ని. 'ద్వంద్వాన్ని సమదృష్టితో చూడటమే కాలాన్ని జయించడం'గా భావించాడు ఆంగ్లరచయిత, తత్వవేత్త హక్స్‌లీ. మన శంకర భగవత్పాదులు ప్రబోధించిన 'మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్య్ర చిత్రీకృతం' సిద్ధాంతంలో ఇమిడిఉన్నదీ ఇదే రహస్యం. 'అతీతాది వ్యవహార హేతుః' అని కాలాన్ని యుగాల కిందటే నిర్వచించిన మహానుభావులు మన ప్రాచీన జ్ఞానులు. కాలచింతనే మహా వింతైనది. భూమి పుట్టుకనుంచీ బుద్ధిజీవులను వేధిస్తోంది. బమ్మెర పోతనామాత్యుడు భాగవతంలో 'ప్రారంభ సంపత్తికాధారం బెయ్యది?' అని సందేహపడితే... 'ఎందులోనుంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలం?' అని ఆరుద్ర 'త్వమేవాహం'లో తర్కం లేవదీశాడు. 'మొదలూ చివరా తెలియని/ అనాది గర్భాన్ని చీల్చుకుని/ వూపిరి పోసుకున్న క్షణాన/ నాకు తెలియదు ఈ అనంత కాలవాహిని పొడవెంతో' అనే మథన మనిషికి ఆకులు అలమలు మేస్తూ కారడవుల్లో తిరుగాడే నాటినుంచే వెంటాడుతోంది. కాలం- పదార్థం నాలుగో పరిమాణమన్న సాపేక్ష సిద్ధాంతం అర్థం కానంతకాలం కంటిముందు కాలంచేసే గారడి అంతా దేవలీలే. 'జనయిత్రి గర్భకోశమున బిండము జేసి యవయవంబుల దాన నలవరించి/ శిశురూపమున దానిక్షితి తలంబునద్రోయడం' మొదలు 'కర్ర చేతను బట్టించి కదలలేని స్థితికి దెప్పించడం' దాకా 'కాలమహత్తత్త్వంబు నిట్టిదనుచు వర్ణనము' చేయటం వశం కాదన్న బ్రహ్మశ్రీ రాజలింగ కవి విస్తుబాటే ఇందుకు ఉదాహరణ. కాలమర్మం అవగాహన కావాలంటే 'స్థల కాల పరస్పరాధారిత సిద్ధాంతం' బోధపడాలి. రెండు సంఘటనల మధ్య ఉండే అంతరం 'కాలం' అని, రెండు పదార్థాల మధ్య ఉండే దూరం 'స్థలం' అనుకునే సాధారణ భావజాలం నుంచి బైటపడాలి. ప్రకృతి గుణకల్పవల్లి చూపించే చిత్రాలన్నింటిని కాలపురుషుడు కల్పించే లీలావిలాసాదులుగా మనిషి భ్రమించేది ఆ నారికేళపాక సిద్ధాంతం తలకెక్కకే. 'ఒక తరి సంతోషము, వే/రొక తరి దుఃఖంబు, మరియొక తరి సుఖ మిం/కొక తరి గష్టము' కూర్చే తలతిక్క కాలానిదని తూలనాడేదీ అందుకే. మనిషి కంఠశోషేగాని కాలానికేమన్నా కనికరం ఉంటుందా? 'కుంటుతూ కులుకుతూ తూలుతూ గునుస్తూ... ఇలా సాగుతుందేమిటి చెప్పుమా కాలమా!' అని బుగ్గలు నొక్కుకోవడానికి సమయమేమన్నా 'సౌందర్యస్పర్ధ'లో సుందరాంగుల అంగవిన్యాసమా? కాలం ఒక క్షణమైనా వెనక్కు చూడదు. ఏం సాధించాలనో ఈ నిబద్ధత?దువ్వూరివారు 'వనకుమారి'లో అన్నట్లు 'కష్టజీవి కన్నీటి కాల్వకైన గాల చక్రము నిలవదు/ ధారుణీపాల పాలనా దండమునకు/ వెరచి యాగదు' కాలం. బోసిపాపల్ని నవ్వించడం, పగటికలలు కనే మగతరాయుళ్లను కవ్వించడం... 'చావుకబుర్లు వింటూ స్వగతంలో విలపించే వృద్ధులను దీర్ఘనిద్రకై దీవించడం'- కాలం ధర్మం.

అనంతమైనది భూతకాలం. అశేషమైనది భావికాలం. నడిమధ్యలో కాసింతసేపు కాలు ఝాడించినంత మాత్రాన సర్వం తెలుసని అనుకోవడం అజ్ఞానం. 'దైవరూపంబు కాలంబు దానికెపుడు/ లోటు గలుగదు మన బుద్ధి లోపంబుగాని' అన్న పానుగంటివారి 'కల్యాణరాఘవం' మాట నిజం. 'బాలు కంట తాబేలు వలెను/ ...వృద్ధు కంట లేడిరీతి' పర్వెత్తు కాలం నిరూపించేదీ ఈ సత్యాన్నే. కాలాన్ని దేవతలైనా వంచించలేరు అనిగదా కౌటిల్యుడి సూక్తి! మానవమాత్రుల శక్తియుక్తులు ఇక దాని మహత్తు ముందెంత! భర్తృహరి వైరాగ్య శతకంలోని పది శ్లోకాలు చాలు- కాలం ఎంత బలీయమైనదో తెలియజెప్పడానికి. 'భావినుంచి గతంలోకి వర్తమానం గుండా సాగే క్షణసముదాయాల నిరంతర ప్రవాహం'గా కాలాన్ని నిర్వచించారు అధునాతన కాలశాస్త్రవేత్తలు స్టీఫెన్‌ హాకింగ్‌, ఐన్‌స్టీన్‌, లైబ్నిజ్‌. కాంతివేగాన్ని మించి ప్రయాణిస్తే గతంలోకి తొంగి చూడటమూ సాధ్యమేనని హెచ్‌.జి.వెల్స్‌ వూహ. అది వాస్తవమైతే ఎంత బాగుణ్ను! రాయలవారి భువన విజయాన్ని పునర్దర్శనం చేసుకోవచ్చు. 'ఫెళ్ళుమనె విల్లు- గంటలు ఘల్లుమనె-గు/ భిల్లుమనె గుండె నృపులకు- ఝల్లుమనియె జానకీ దేహమొక నిమేషమ్ము నందే' అని కరుణశ్రీ వర్ణించిన 'శివధనుర్భంగ' దృశ్యాన్ని కమనీయంగా పునర్వీక్షణ చేసి పులకించిపోవచ్చు. వూహకు అవధులు లేకపోవచ్చు. కాని దాన్ని భావించే బుద్ధికున్నాయిగా హద్దులు! కాలానికే గనుక నిజంగా కళ్లుంటే? 'నాజూకుగా ఉండే మనుషులలో బూజు పట్టిన భావాలు చూసి/ కొత్తచివుళ్లు తొడిగిన పాత చెట్ల చాటున/ పువ్వుల మిషతో నవ్వుకుంటుందా? విసుగూ విరామం లేకుండా../ అభివృద్ధీ, వినాశనం, క్షామం, క్షేమం విప్లవం... విశ్వశాంతి' అని కలవరించే మనిషిని చూసి కలత పడుతుందా?' ఎక్కడ బయలుదేరిందో, ముందుకే ఎందుకు కదులుతుందో, ఎప్పుడు ఆగుతుందో... ఏమీ తెలియదు. మనిషికి తెలిసిందల్లా కాలంతో కలిసి ప్రస్తుతంతో ప్రయాణించడమే. ఆ ప్రస్థానంలోని మలుపురాళ్ల గుర్తులే సంవత్సరాలు. నడచివచ్చిన దారివంక మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవడం, గడవాల్సిన దూరాన్ని బుద్ధిమేరా ఒకసారి బేరీజు వేసుకుని... కాలూ చేయీ కూడదీసుకోవడం... బుద్ధిమంతులందరూ చేసే పనులు. చేయాల్సిన పనులు. కాలాన్ని సద్వినియోగపరచుకునే ఘన సంకల్పమిది!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సాహిత్య సంపాదకీయం ..05:01:2014 నాటిది)

Monday, June 14, 2021

ధూమకేతువు చెప్పే నీతిపాఠం -కర్లపాలెం హనుమంతరావు



దేవుళ్ళు తాము చంపిన రాక్షసుల పేర్లు బిరుదులుగా తగిలించుకోడం సరదా కోసం కాదు. పూజించే భక్తులను రాక్షసత్వంతో ప్రవర్తించవద్దని హెచ్చరించడం కోసం. వినాయకుడిని 'ధూమకేతవే నమః' అని కీర్తించడంలో కూడా ఇట్లాంటి ఓ గట్టి హెచ్చరికే దాగివుంది.చెడ్డపనులు చేస్తే మళ్లీ రాక్షస ప్రవృత్తితో జన్మ ఎత్తాల్సొస్తుందనే బెదురు  గతంలో బాగా ఉండేది. కానీ అట్లా ఎత్తిన జన్మలో కూడా  కొన్నైనా మంచి పనులు  చేస్తే ఈ  దుర్జన్మ పీడా వగదిదుతుందన్న  ఊరటా పురాణేతిహాసాల తాలూకు కథలలో కనిపిస్తుంటుంది.  ఈ సందర్భంగానే ధూమాసురుడు అనే దుర్మార్గుడిని గురించి కొంత చెప్పడం.

పుట్టింది రాక్షస జాతిలోనే అయినా ధూమాసురుడు వేదాలను మొత్తం కంఠోపాఠం చేశాడు. చదివిన చదువుకు.. నడిచే తీరుకు బొత్తిగా సంబంధం ఉండదనడానికి ఈ దుర్మార్గుడి దుష్ప్రవర్తనే సరైన దృష్టాంతం. శివుడికి భక్తుడు అయివుండీ భృగువుతో సంవాదం చేసే పాటి పాండిత్యం సాధించినా రజోగుణం ప్రబలినప్పుడు మాత్రం యుద్ధాలు చేయాలని, దేవతలనే వాళ్ళు ఎక్కడున్నా వెదికి మరీ చీల్చి చెండాడాలని అణుచుకోలేనంత కుతిగా ఉండేది అతగాడికి. అట్లాంటి తీటలు తీరడం కోసం జైత్రయాత్రలు చేయడం, దేవతలను చెండుకు తినడం రాక్షస జాతికి సహజమే అయినా, దేదేవతలకు మాత్రం  పద్దాకా ఏదో ఓ రాక్షసాధముడి కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి.

ధూమాసురుడి దెబ్బకు తట్టుకోలేక ఎప్పట్లానే శివుడిని ఆశ్రయిస్తే, ఆయనా ఎప్పట్లానే ఆశ్రితులను కాపాడే పని పెద్దకొడుకు వినాయకుడికి పురమాయించాడు.

తండ్రి ఆజ్ఞ! తప్పుతుందా! ఏం చేద్దామా అని బొజ్జ గణపతయ్య బుర్ర బద్దలు చేసుకొనే సమయంలో తరుణోపాయంగా మాధవుడు అనే బ్రాహ్మడి కుటుంబం తాలూకు తంటా ఒకటి తెలియవచ్చింది. సంతానవతి కాని  కారణాన  మాదవుడు  భార్య సుముదను  వదిలేస్తానని తరచూ బెదిరిస్తుంటాడు. ఆమెకు మరో దారి లేక నారాయణుడిని ఆశ్రయించడం, ఆ సందు చూసుకుని వినాయకుడు ఆమె గర్భంలో జొరబడ్డం జరిగిపోతుంది.

యుద్ధానికని  బయలుదేరే  ధూమాసురుణ్ణి ఈసారి ఆకాశవాణి గట్టిగానే హచ్చరిస్తుంది. 'చావు మూడే రోజు దగ్గర్లోనే ఉంది. ఇట్లా  సుముదమ్మ కడుపులో జీవం పోసుకొంటోంది' ఆవటా అని. ఎంత రాక్షసుడికైతే మాత్రం ఎదుటి వాళ్లను ఏడిపించి చంపడం సరదా గానీ, స్వయంగా  చావును కావులించుకోవడానికి సరదా ఎందుకు పుడుతుంది? అందరికి మల్లేనే ఆ రాక్షసుడూ మృత్యుభయంతో యుద్ధాలు గిద్ధాలు కట్టిపెట్టి ఇంచక్కా దక్కిన రాజ్యాన్ని చక్కగా   'రామరాజ్యం' మోడల్లో 'ధూమాసుర రాజ్యం' గా సుప్రసిద్ధం చేద్దామని సిద్ధమయిపోయాడు.   అందుక్కారణం అతగాడి కొలువులో కనీసం ధర్ముడు అనే ఒక్క మంచి మంత్రైనా ఉండి రాజుకు హితబోధ చేయడం. తతిమ్మా కొలువు కూటానికి ఇది మహా కంటకంగా మారింది. ధర్ముడు లేని సందు చూసుకొని ధూమాసురుణ్ని రెచ్చగొట్టేస్తారు.

అటు ధర్ముడు ఇటు దుర్మార్గులైన తతిమ్మా మంత్రులు.. దోళాంళనల మధ్య ఊగిసలాడే ధూమాసురిడి వికారాలకు అమృతంలా అనిపించే సలహా ఎవరిస్తారో తెలీదు కానీ.. ఇస్తారు. ఆ వికృత  ఆలోచన కార్యరూపమే సుమద కడుపులో ఎదిగే వినాయకుణ్ణి సంపూర్ణాకారం తీసుకోక ముందే సఫా చేసేయడం.

ధూమకాసురుడి ప్రయత్నం వృథా అయిందని,   దుర్మార్గుడే వినాయకుడి చేతిలో చివరికి ఖతమయ్యాడని వేరే చెప్పక్కర్లేదు కానీ, ఇక్కడ చెప్పవలసిన అసలు ముఖ్యమైన మాట మరోటి ఉంది.  చరిత్ర ఎటూ మనకు పట్టదు.  కనీసం మనం నెత్తికెత్తుకొని నిత్యం పూజించే పురాణాలు, ఇతిహాసాలలో కనిపించే ఈ తరహా నీతికథలనయినా  మన సో కాల్డ్ ప్రజానేతలు  సమయ సందర్భాలను బట్టి ఖాతరు చేస్తుంటే ఎన్నుకునే సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకపోను.  ఇప్పుడు జరుగుతున్న 'రఘు రామరాజు  కారాగార  కఠిన దండన' కథా కమామిషు వింటుంటే మంచి పాలకులు మనకు ఇక సంప్రాప్తించే యోగం ఉందా' అని బాధేస్తుంది. 

మనుషుల .. ముఖ్యంగా రాజకీయాలలో నలిగే పెద్దమనుషుల మతిమరుపు  రోగం బాగా ఎరిక కాబట్టేపాపం వినాయకుడు దుర్మార్గుడైన ధూమాసురుడిని మళ్లీ కనిపించకుండా శిక్షించినా..  తన పేరులో అతగాడి   పేరు దూర్చుకుని 'ధూమకేతువు'ను అని కూడా  గుర్తు చేయడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు. పాలకుల పెడబుద్ధులు సరిచేయడం భగవంతుడి తరమైనా అవుతుందా? చూద్దాం!

- కర్లపాలెం హనుమంతరావు

12 -06 -2021

Saturday, June 12, 2021

రాజద్రోహం – వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

24 విభాగాలుగా ఉన్న భారత రాజ్యాంగంలోని మూడో భాగం ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ప్రపంచంలోని మరే  రాజ్యాంగమూ ఇంత విస్తృతంగా ఈ తరహా హక్కులను గురించి ప్రస్తావించింది లేదు. అయినా రాజ్యాంగ  హక్కుల ఉల్లంఘన ఇక్కడే ఎక్కువగా జరగడం.. అదో విచిత్రం!

మాట్లాడే హక్కు నుంచి శాంతికి భంగం కలగకుండా సమావేశాలు జరుపుకునే హక్కు, సంఘాలు.. సంస్థలు పెట్టుకునే హక్కు, దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలగడం, నివాసిస్తూ శాశ్వత చిరునామా పొందడం, చట్టబద్ధమైన పని, వ్యాపారం, ఉపాధి ఏదయినా  యధేచ్ఛగా  చేసుకోవడం .. వంటి హక్కులన్నింటి మీదా 19 నుంచి ఇరవైరెండో అధికరణ దాకా రాజ్యాంగంలో ఆదేశాలున్నా.. అతి ముఖ్యమైన వ్యక్తిగత హక్కుకు మాత్రం తరచూ  తూట్లు పడడం దేశ  ప్రజాస్వామ్య వ్యవస్థను  నవ్వులపాలు చేసే వికృత చేష్టగా  మాత్రమే చెప్పుకోక తప్పదు.

పుస్తకాలలో కాకుండా పౌరుడు వాస్తవ జీవితంలో ఎంత వరకు పౌరుడు  స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నాడన్న అంశం మీదనే కదా   ప్రజాస్వామ్య స్ఫూర్తి సాఫల్యం ఆధారపడడం! అక్కదికీ ఎంత ప్రాథమికమైన హక్కైనా వ్యక్తి అనుభవించే విషయం దగ్గరికొచ్చే సరికి రాజ్యాంగమూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోలేదు. శిక్షాస్మృతి ఆర్టికల్ 124 (ఎ) స్వేచ్ఛను యధేచ్ఛగా అనుభవించేందుకు లేకుండా విధించిన ఈ తరహా జాగ్రత్తలలో ఒకటి. ఇది ఆంక్ష కాదు.   ముద్దుగా తెల్లదొరలు ‘రాజద్రోహం గా పిల్చుకున్న ఆ కట్టడి స్వాతంత్ర్యం సాధించుకున్న ఇన్నేళ్ల తరువాత కూడా మన రాజ్యాంగంలో  భద్రంగా పడివుండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

ఇంతకూ ఈ సెక్షన్ 124 (ఎ) ‘రాజద్రోహం’ అంటే ఏమిటీ? అంటే- స్థూలంగామాటలు, సైగలు, హావభావాలు, పీడించడాలు వంటి ఇంకే రకమయిన  చేష్టల ద్వారా అయినా సరే  ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను పడగొట్టాలనిపించేలా పిచ్చి  ప్రేలాపనలకు  దిగితే సరాసరి ‘రాజద్రోహం’ నేరం కింద గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడేలా చర్యలు తీసేసుకోవచ్చు.  వలస పాలకులు అప్పట్లో తమ రాజ్యం భద్రంగా ఉండడం కోసం పెట్టుకున్న అమానుష  ఆంక్ష దేశం స్వాతంత్ర్యం సాధించుకున్న  తరువాత ఇక రాజ్యాంగంలో ఎందుకు? ఇటీవల కాలంలో దేశంలోని చాలా ప్రభుత్వాలకు   గిట్టని వాళ్ళ నోళ్ళు మూయించడానికి మాత్రం  ఈ సెక్షన్ మహా వాటంగా ఉపయోగిస్తున్నది. అదే దిగులు.

 శిక్షాస్మృతిలో ఒకటిన్నర శతాబ్దాలుగా అట్లాగే పడివున్న భయంకర వ్యర్థ చట్టానికి సవరణలేమైనా వీలవుతాయేమోనన్న సంకల్పంతో సిఫార్శుల నిమిత్తమై రెండేళ్ల కిందట  కేంద్రం, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  నిపుణుల కమిటీ నొకటి వేయడం, ఐపిసి సంస్కరణలకు సంబంధించి సూచనలేమన్నా ఉంటే చెప్పమని ప్రజల నుంచి, , ప్రజాసంఘాల నుంచి కోరడం లాంటి లాంనాలన్నీ పూర్తిచేసింది కూడా. కానీ, అంతు చిక్కని చిక్కులేవో రాజద్రోహం క్లాజు అంతిమ దహన సంస్కారాలకు అడ్డుపడుతున్నాయ్! బహుశా బెయిల్ కోసం ఏలాంటి నిబంధనలు ఇందులో పొందుపరచవలసిన అవసరం లేనందువల్లనా? ప్రభుత్వాలకు గిట్టనివాళ్లను ఎవరినైనా ఎంత కాలమైనా నిర్బంధంలో ఉంచుకొనే వెసులుబాటు ప్రభుత్వాలకు ఈ సెక్షన్ కల్పిస్తుంది కదా!   

1950లో రాజ్యాంగాన్ని రాసుకుని ఆమోదించే సందర్భంలోనే ఐపిసి తాలూకు 124 (ఎ) అధికరణం రద్దు చెయ్యాలనే ప్రతిపాదన బలంగా వినిపించింది. సర్దార్ భోవిందర్ సింగ్, ప్రొఫెసర్ యశ్వంత్ రాయ్ లాంటి రాజ్యాంగ ప్రముఖులు 1948 డిసెంబరు 2న జరిగిన రాజ్యాంగ  ముసాయిదా కమిటీ చర్చలో ఈ ‘దేశద్రోహం’ అనే దుర్మార్గ పదాన్ని చేర్చడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. రాజద్రోహం క్లాజు మౌలికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి  విరుద్ధమనేది మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయం కూడా

వక్రీకరించేందుకు, వ్యతిరేకులపై ఉపయోగించేందుకు సులువుగా ఉపయోగపడేది ఈ  సెక్షన్ 124 (ఎ) లోని ‘అవిశ్వాసాన్ని’ అనే పదం. అందుకే   ప్రసిద్ధ న్యాయవాది ఎ.జి  నూరానీ ఈ నిబంధన కింద, మేం ఎల్లవేళలా ప్రభుత్వాన్ని ప్రేమించక తప్పదన్నమాట’ అని ఎద్దేవా చేసేవారు.  న్యాయశాస్త్ర కోవిదుడు  ఫోలే ఎస్. నారిమన్ వాదన ప్రకారమయితే ప్రభుత్వాన్ని అవమానించడం లేదా విమర్శిస్తూ రాయడం, విద్వేషపూరితంగా మాట్లాడటమైనా సరే.. అసలు  దేశద్రోహం సెక్షన్ 124 (ఎ) కిందకే  రాదు!

కానీ, ఇటీవలి కాలంలో, వివిధ రాష్ట్రాలలో  పాత్రికేయుల నుంచి  అధికారుల దాకా ఎందరో తరచూ ఈ  దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు! ఈ నేపథ్యంలోనే ఈ సెక్షనుతో పాత్రికేయుల ప్రాథమిక హక్కులు నిరాకరించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం  బాధ్యులను గట్టిగా హెచ్చరించడం.  తప్పు పట్టే  పత్రికలది ప్రజల నిరసనగా తీసుకోవాలే తప్పించి,   దేశద్రోహంలాంటి నాన్-బెయిలబుల్  అభియోగాలు మోపమేంటని జనసామాన్యంలాగానే సుప్రీం కోర్టూ అభ్యంతరపెట్టడం ప్రజాస్వామ్యవాదులందరికీ ముదావహం కలిగించే పరిణామం.  

ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరంగా, ఆరోపణలు చేసారంటూ ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువాపై బీజేపీ పరువు నష్టం దావా వేసిందా మధ్యనభాజపా నేత అజయ్ శ్యామ్ దాఖలు చేసిన అభియోగం మేరకు హిమాచల్ ప్రదేశ్ లో నమోదైన రాజద్రోహం’ కేసును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు  భావప్రకటనా స్వేచ్ఛకు ఊపిరిపోసే ఔషధం.

భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా వేసిన రాజద్రోహం వ్యాజ్యం పై 1962 నాటికే  కేదార్ నాథ్ సింగ్ కేసులో    న్యాయమూర్తులు యు.యు లలిత్, వినీత్ శరణ్ లతో కూడిన ధర్మాసనం పాత్రికేయులకు ఊరటనిచ్చింది. మళ్లీ ఇప్పుడు, కోవిడ్.. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రముఖ పాత్రికేయుడు  వినోద్ దువా తయారు చేసిన యూ-ట్యూబ్ కార్యక్రమం బిజెపి నాయకులకు ఆగ్రహం తెప్పించిందని,  ప్రధాని పరువుకు నష్టం కలిగినట్లు ఏ   ఐపిసి  501,  ఐపిసి 505 సెక్షన్లో  పోలీసులు బనాయించడాన్ని  సుప్రీం కోర్ట్  తీవ్రంగా తప్పుపట్టింది.  

ప్రభుత్వాన్నైనా సరే  విమర్శించే హక్కు సాధారణ పౌరుడికి కూడా ఉంటుందని, హింసను ప్రజ్వరిల్లనంత కాలం ఆ విమర్శను రాజద్రోహం కింద పరగణించడం కుదరదని సుప్రీం మరోమారు తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వమూ  ప్రజావాణి వినిపించే రెండు ఛానళ్లపై కక్షపూరితంగా రాజద్రోహ నేరం ఆపాదించిన కేసును విచారించే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం అసలీ ‘రాజద్రోహం’ అధికరణ 124(ఎ) మొత్తాన్నే మొదలంటా కూలంకషంగా పరీశీలించవలసిన అగత్యం ఏర్పడిందని  అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి తిరిగి మంచి రోజులు వచ్చే  ఆస్కారమున్నట్లు   న్యాయవ్యవస్థలో  చోటు చేసుకుంటున్న ఈ తరహా సంస్కరణవాదమే ఆశ కలిగిస్తున్నది. 

-కర్లపాలెం హనుమంతరావు

   11 -06 -2021

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...