Showing posts with label Stories. Show all posts
Showing posts with label Stories. Show all posts

Monday, June 23, 2025

కథ విలువ - చెంగల్వ - సేకరణ




 


కథ 

విలువ 

- చెంగల్వ 


నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను.


వచ్చింది శరత్చంద్ర. అతనితో నా పరిచయం ఏమంత ఎక్కువ కాదు. అయినా అతనో రచయిత అని తెలిసాక అదో రకమైన ఆత్మీయత లాంటిది ఏర్పడింది. నాకున్న సాహిత్యాభిరుచి అందుకు కారణమేమొ ! లేదా నాకు తెలిసిన రచయిత అతనొక్కడే కావటమొ! 


"బావున్నారా? ఏంటి సంగతులు" అడిగాడు శరత్ చంద్ర.


"బావున్నానండి, ఎవరి దగ్గరకి  వచ్చారు? " 


డైరెక్ట్ గా ఎందుకని అడగలేక అలా అడిగాను. అతన్ని కలిసి దాదాపు ఓ రెండు నెలలు అయివుంటుంది. ఏం మాట్లాడక పోవటం చూసి అతని మొహంలోకి చూసాను. ఎటో చూస్తున్నాడు. మనిషి కాస్త చిక్కి పోయాడు. గడ్డం చేసుకో లేదు.


"ఒక్క నిమిషం" అని లేచి లోపలికి నడిచాను. ఏదో అడగటానిక వచ్చి మొహమాట పడుతున్నట్లున్నాడు. 


అమ్మో! ఒక వేళ అదే అడగటానికి వచ్చాడేమొ.... నా గుండె వేగం ఒక్క సారిగా పెరిగిపోయింది. 


స్వతహాగా నేను మంచివాడినే. ఆ ఒక్క విషయంలో తప్పించి చేతనైనంతగా సహాయపడాలనే మనస్తత్వం నాది. నాకున్న  ఇన్ ఫ్లూయెన్స్ తో చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాను. . ఎన్నో వ్యాపార ఒప్పందాలు కుదిర్చాను. ఎందరివో కూలిపోతున్న సంసారాలు నిలబెట్టాను. నా సలహాలు పాటించి ఎందరో బాగు పడ్డారు. ఎటొచ్చి ఆ ఒక్క విషయంలో మాత్రం ఎవరికి ఇంత వరకు సహాయం చేయలేదు. అందుకే నన్ను కొందరు పిసినారి శ్రీకాంతరావు అని అంటారు. అదేంటో ఎవ్వరైనా సరే నన్ను డబ్బు అడిగితేచాలు, ఏదో చేదు తిన్నట్లు అయిపోతుంది. ఎంత ప్రయత్నించినా "లేదు", "సారీ", "ఆ విషయం తప్పించి ఇంకేమున్నా సరే అడగండి, తప్పకుండా చేసి పెడతాను" అన్న మాటలు తప్పించి ఇంకేవి రావు. అందుకే పిసినారి శ్రీకాంతరావు పెళ్లి చేసుకోక పోవటానికి కారణం కూడా అదే అంటారు. కాస్త సహృదయులు అంటే నా సహాయం పొందిన వారు మాత్రం చంద్రుడికి మచ్చలాగా శ్రీకాంతరావు గారికి పిసినారి తనం అదో రకమైన శోభ తెచ్చింది అనటం కూడా విన్నాను. ఇక్కడ శోభ అంటే అవి తిట్టో మెచ్చుకోలో అర్థం సందర్భానుసారం మారుతు ఉంటుంది. 


ఓ గ్లాసులో మంచినీళ్లు తీసుకెళ్లి "తీస్కోండి"

అని శరత్ చంద్ర చేతికి అందించాను. 

" అవసరం లేదండి" అంటూనే

అందుకున్నాడు. 


అవి త్రాగాక, సాలోచనగా అడిగాను "ఇందాక ఏదో చెప్పారు."


"ఏం లేదండి! మీరు కొంచెం సహాయం చేయాలి". అన్నాడు చాలా ఇబ్బంది పడిపోతున్నట్లు. 


" ఏం చేయమంటారు చెప్పండి!" సవినయంగా

అడిగాను.


ఒక్క విషయం అంటే ధన సహాయం తప్పించి" రెండో మాట నా గొంతునుండి బయటకి వచ్చినట్లు లేదు. కారణం శరత్చంద్ర పట్ల నాకున్న గౌరవ భావం కావచ్చు లేదా అతన్నా స్థితిలో చూడటం వల్ల జాలి వేసిందనచ్చు. 


అలాగని నేనతనికి ధనసహాయం మాత్రం చేయలేను. డబ్బంటే నాకు ప్రాణం, ఎలా ఇవ్వగలను చెప్పండి. 


అంతెందుకు ఒక సారి మా నాన్నగారు వచ్చి "ఒరెయి! క్రితం సంవత్సరం పంట సరిగ్గా లేదు. ఈ సంవత్సరం కూడా వర్షాలు తగినంత పడే అవకాశాలు లేవని అంటున్నారు. అందుకే మన పొలానికి బావి తవ్వించి పంప్సెట్ వేయించాలనుకుంటున్నాను, ఓ ఏడెనిమిది వేలు నువ్వు సర్దాలిరా!" అన్నారు. 


నాకు ఏడెనిమిది వేలు ఓ లెక్క కాదు. ఆయన తదనంతరం ఆ పొలం- ఆస్తి నాకే వస్తాయని నాకు తెలుసు. కానీ అవేవి నాకు వద్దని ఏనాడో నాన్నగారికి చెప్పేసాను ఎందుకంటే నాకు నైతికంగా వాటిమీద ఏ హక్కులేదు. కారణం ఎప్పుడో, నాకు పది పన్నెండేళ్ల వయసులో ఓ సారి పొలానికి వెళ్లాను. ఆ తరువాత ఇంత వరకు వాటి ఛాయలకి వెళ్లలేదు.


నిర్మొహమాటంగా నేను డబ్బు సర్దను అని చెప్పేసాను. ఆయన ఆశ్చర్యపోయారు. ప్రలోభ పెట్టారు. నేను లొంగలేదు. 


బెదిరించాడు. నేను భయపడలేదు. చివరికి తనాస్తి అంతా అనాధశరణాలయానికి రాసేస్తా నన్నాడు. నేను సంతోషంగా అంగీకరించాను. 


కొన్ని శాపనార్ధాలు పెట్టి మరీ వెళ్లి పోయాడు. అలాంటి నేను ఇంకెవరికన్నా ధనసహాయం చేయటం అన్న మాట వట్టిది. 


ఇక్కడ ఇంకో విషయం మీకు తెలియాలి. మా అమ్మా నాన్నలకు  నేను ఒక్కడినే సంతానం. నాకు పదేళ్ళ వయస్సులోనే అమ్మ మరణించింది. పన్నెండు ఏళ్లు వచ్చేవరకు మా ఊరి బడిలో నే చదువుకున్నాను. ఆ తరువాత చదువుకోటానికి దగ్గర్లోనే ఉన్న టౌన్ కు   పంపించారు నాన్నగారు.


పోను నాలుగు మైళ్లు, రాను నాలుగు మైళ్ళు ప్రయాణం. దాంతో చాలా అలసిపోయే వాడిని. అది గమనించిన నాన్నగారు నన్ను టౌన్‌ లో  ఉంటున్న మా ఊరి మునసబు గారి అబ్బాయి సుందరంతో పాటే ఉంచేసారు . 


సుందరం నాకంటే ఓ ఆరేడు ఏళ్లు పెద్ద, చాలా విశిష్టమైన వ్యక్తి. పగలంతా ప్రెస్ లో పని చేసి రాత్రిళ్లు కాలేజిలో చదువుకునే వాడు. అతని సహచర్యం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పిందని చెప్పచ్చు. కొన్ని' రోజులు గడిచాక చిన్నగా అన్ని విషయాలు చెప్పసాగాడు. స్వశక్తిపై ఆధారపడి చదువుకోవటం చాలా గొప్ప విషయం అని, అందరు అలా చేయలేరని చెప్పాడు. తల్లితండ్రులపై ఆధార పడకుండా వారి కోరికలు తీర్చగలగటం, అంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాయించటం లాంటివి, ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని అన్నాడు. ఊరందరికి ఆదర్శం అవుతామని చెప్పాడు. ఉపదేశాల్లో ని ఆ లోటుపాట్లు తెలిసే సరికి ఆలస్యం అయిపోయింది  అనుకోండి. అది వేరే విషయం.


మరో సంవత్సరం గడిచింది. సుందరం నా మనసుని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఊరు వెళ్లినప్పుడు నాన్నగారు ఇచ్చిన డబ్బుని తిరస్కరించాను. సుందరం బ్రతకటానికి నిశ్చయించినట్లు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. అంత వరకు స్వతంత్రంగా బ్రతుకుతున్నట్లు ఆయనకి కూడా తెలియదు. మునసబు గారే చదివిస్తున్నారు. అనుకున్నారు. “పిచ్చి పిచ్చి వేషాలు వేయక, డబ్బు తీసుకెళ్లి వళ్లు దగ్గర పెట్టుకొని చదువు కో" అన్నారు. 


నేను ఒప్పుకోలేదు. అది మొదటసారి నేను ఆయన్ని ఎదిరించటం. మాట మాట పెరిగింది. ఆయన నాపై చేయి చేసుకున్నారు. నాకు పౌరుషం వచ్చి ఆ రాత్రే ఎవరికీ చెప్పకుండా టౌనుకు  చేరుకున్నాను. సుందరం తనతోటే ఉండమన్నాడు. మళ్లీ నాన్నగారు వచ్చి బలవంతంగా తీసుకు వెళతారేమో అన్న భయం వ్యక్త పరిచి, అతనికి తెలిసిన వారున్న వేరే టౌన్ ఏదన్నా ఉంటే అక్కడ వారి ఎడ్రస్ చెప్ప మన్నాను. ముందు సుందరం ఒప్పుకోలేదు. నాన్నగారు చెప్పినట్లు వినమని సలహా ఇచ్చాడు. కానీ నేను పట్టు బట్టటంతో విజయవాడలో ఓ హోటల్ సర్వర్ గా పని చేస్తున్న స్నేహితుని ఎడ్రస్ ఇచ్చాడు. అలా ప్రారంభం అయింది నా స్వంత జీవితం. 


ఎలాగన్నా సరే కష్టపడి డిగ్రీ పూర్తి చేసి, మంచి ఉద్యోగం సంపాయించి తిరిగి ఊరికి వెళ్లాలన్నది నా ఆశయం. ఎన్నో ఊళ్లు తిరిగాను, ఏమిటేమిటో పన్లు చేసాను. మొత్తానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను. చదువు పట్ల నాకున్న ఆసక్తి గమనించి సదాశివరావు మాస్టారు చాలా రకాలుగా సహాయపడ్డారు. చివరికి ఆయన సహాయంతోటే ఇప్పుడు పని చేస్తున్న కంపెనీలో క్లర్కుగా  చేరాను. 

 నేడు నేనే దానికి మేనేజర్ని.


నా స్వానుభవం మీద తెలుసుకున్న విషయం ఏమిటంటే "ప్రపంచంలో డబ్బు తరువాతే అన్ని."


మొదట్నించి డబ్బుకై కటకటలాడి పైకి రావటం మూలాన పొదుపు అతి ఎక్కువగా పాటించటం అలవాటైంది. చాలా సార్లు డబ్బు అప్పిచ్చి మోసపోయాను. ఇక జీవితంలో ఎవరికి ధనసహాయం చేయకూడదని నిశ్చయించుకున్నాను.


కొందరు వడ్డీ కూడా ఇస్తామన్నారు. నా దృష్టిలో వడ్డ్నీ తీసుకోవటం జలగలా రక్తాన్ని పీల్చటం లాంటిది. దానికి కూడా ఒప్పుకోలేదు.


ఇక పెళ్లి చేసుకోక పోవటానికి ప్రత్యేకంగా కారణం ఏమిలేదు. చేసుకుందాం  , ఇంకా చాలా వయసుంది.


" రావు గారు - రావు గారు" అని నా భుజాల్ని పట్టుకొని ఊపేస్తున్నాడు శరత్ చంద్ర.   


      అతని ముందు అంతటి ఆలోచనల్లో మునిగిపోవటం కొంచెం సిగ్గుగా తో చింది.


" సారీ! ఏవో జ్ఞాపకాలు- ఆలోచనలు!"అన్నాను.


"  అందుకేనండి పెళ్లి చేసుకోమని చెప్పేది." అన్నాడు నవ్వుతు.  

  

 నవ్వుతూనే అడిగాను "ఇంతకి ఏంటి చెప్పారు."


అతని మొహంలో నవ్వు మాయమైంది .   

" ఏం చెయ్యాలో తోచలేదండీ! ఓ ఎనిమిది వందలు కావాలి, నా రెమ్యునరేషన్ రాగానే ఇచ్చేస్తాను." ఎంతో అవమానం జరిగినట్లు అడిగాడు. నా గుండెల్లో రాయి పడింది.


నేనేం మాట్లాడక పోవటం చూసి తనే చెప్పసాగాడు. దాదాపు మూడు వేలు రావాలండి "కాంతిదీపం" నుండి. వారికేవో  ఆర్థిక ఇబ్బందులు .  గత ఎనిమిది నెలలుగా అక్కడ నుండి ఏమి రాలేదండి. మిగతా చోట్ల నుండి అప్పుడప్పుడు ఎమ్. ఓ లు వస్తున్నాయి గానీండి సరిపోవటం లేదు. మొన్నీ మధ్యే ఓ నవల "సుప్రభాతం" ఎడిటర్ గారికి ఇచ్చాను.  తప్పకుండా పబ్లిష్ చేస్తానన్నాడు. అదే జరిగితే ఓ రెండు వేల వరకు వస్తుందండి. ఇవే కాకుండా ఇంకా చాలా ఎమ్. ఓ రావాలండి. ఒకటే మాత్రం నిజమండి నా రచనలు ఏవి తిరిగి రావు కానీ రెమ్యునరేషనే టైంక్ లేదండి." 


ఓ సారి నా మొహ లోకి చూసి తిరిగి మొదలు పెట్టాడు.


" మా ఇంటి అద్దె కట్టి  నాలుగు నెలలు అయిందండి. ఇంటాయన వచ్చి కూర్చున్నాడు. అదే ఇవ్వకపోతే సామాన్లు బయట పారేసానన్నాడు. మీరే ఆదుకోవాలి."


నాగుండె వేగం పెరిగి పోయింది. "అది తప్ప ఇంకేమన్నా సరే అడగండి తప్పకుండా చేసి పెడతాను " . నా మాటలకి " మీరలా  మాట్లాడకండి, నన్ను ఈ పరిస్థితుల్లో.. ఆదుకోగలిగిన వారు మీరొక్కరే, ఇప్పటికే తెలిసిన వారందరి దగ్గర అప్పు తీసుకున్నాను." 


తల పంచుకొని చెప్పాడు.


"తీర్చలేడని  " నాకు అర్థమైంది.


నా నుండి ఏ జవాబు లేదు.


"పోనీ ఓ పని చేస్తాను సార్!" ఎంతటి దీనస్థితిలో ఉన్నాడో ఆ సంబోధన వల్ల


"నా ఎడ్రస్ మారిందని అన్ని పత్రికలకి ఉత్తరాలు రాసి, కొత్త ఎడ్రస్ అని మీ ఎడ్రస్ ఇస్తాను. పోస్ట్ మేన్‌ కు  కూడా మీ ముందే చెప్పి కావాలంటే ఆథరైజేషన్ లెటర్ కూడా ఇస్తాను. మీ అప్పు తీరిన తరువాత నాకు వచ్చే రెమ్యునరేషన్ తీసుకుంటాను.     కాదనకండి సార్. ఇంకెప్పుడు మిమ్మల్ని ఒక్క నయాపైసా కూడా అడగను-" అంటు కుర్చీలోంచి లేచి నా దగ్గర్కి వచ్చేసాడు.


" నా దగ్గర ఇప్పుడంత డబ్బులేదు" అన్నాను.

ఇవ్వటం నాకిష్టం లేదు.


"మీరు ఆదుకోకపోతే వీధినపడతాను. పోనీ.. ఇంకో పని చేయండి!  ఇప్పుడు నా దగ్గర కథలు ఉన్నాయి .  అవి మీరు తీసుకుని ఎంతో  కొంత ఇవ్వండి.  మీకు రచయిత కావాలని ఎంతట కోరికో నాకు తెలుసు సార్! అని ఓ క్షణం ఆగాడు."వాటిలో కొద్దిపాటి  మార్పులు మీ ఇష్టం ఉంటే చేస్కోండి. లేదా వాటిని అలానే మీ పేరు మీదే పంపించుకోండి. నేనెవరికి ఈ సంగతి చెప్పను. వాటి మీద ఎంత రెమ్యునరేషన్ వచ్చినా మీరే తీసుకోండి. ఒక్క పైసా కూడా నాకు ఇవ్వవలసిన అవసరం లేదు. నా తల్లి మిద ప్రమాణం చేసి చెబుతున్నాను ఈ విషయం నా ప్రాణం పోయినా ఎవ్వరికి చెప్పను." అతడి గొంతులో నిజాయితీ ఓ రకంగా నన్ను కదిల్చి వేసింది. నాకు రచయిత అవ్వాలన్న కోరిక ఎన్నాళ్లుగానో ఉంది. అప్పుడెప్పుడో ఓ సారి నాక్కూడా కథలు రాయటం నేర్పించమని ఈ శరత్ చంద్రనే అడిగాను. "అదేమంత బ్రహ్మవిద్య . తల్చుకుంటే మీరు కూడా వ్రాయచ్చు" అన్నాడు. తరువాత కొంతకాలం నేను ప్రయత్నించి చేతకాక వదిలేసాను. 

అనుకోకుండా ఇప్పుడా అవకాశం వచ్చినట్లు అన్పించింది.


శరత్ చంద్ర రచనలు ఎంత గంభీరంగా ఉంటాయో అంత ఆహ్లాదంగాను ఉంటాయి. నిత్యం మన చుట్టు తిరుగాడుతు ఉండే వారిలో నుండి కొన్ని పాత్రల్ని ఎన్నుకొని వాటి ద్వారా ఏదో ఓ నీతి బోధిస్తునే కథ నడుపుతాడు.


అయినా అతను రాసిన కథల్ని నా పేరు మీద పంపించుకోవటానికి నా మనసు ఒప్పుకోలేదు. కానీ నన్ను కూడా సమాజం రచయితగా గుర్తిస్తుంది. నా కీర్తి పెరుగుతుంది. అసలు నా వంటి బాధ్యతాయుతమైన పదవిలో వుండి రచనలు చేస్తున్నారంటే వారికి లభించే గౌరవాభిమానాలే వేరు.


"నీ రచనలని నా కెప్పుడిస్తావు!" అంగీకారాన్ని ఇన్ డ్రైరక్టుగా తెలిపాను. ఏకవచనం ప్రయోగించినా ఏం పట్టించుకోలేదు. కాదు పట్టించుకునే స్థితిలో లేడు శరత్ చంద్ర.


" ఇప్పుడే తెచ్చివ్వగలను సార్, కానీ ఇంటాయన కూర్చొనున్నాడు." తన అసమర్థతను  తెలియచేసాడు.


"ఎంత కావాలన్నావు? " 


"ఎనిమిది వందలు సార్!" గొంతులో కొంచెం అనుమానం.  నేను లోపలి గదిలోకి నడిచాను. నేను చేస్తోంది తప్పు అని ఓ ప్రక్క అంతరాత్మ గొంతు చించుకొని అరుస్తోంది. రచయిత అన్న పదం నా పేరుకి జోడించబడితే వచ్చే కీర్తి నాలోని స్వార్థానికి  సూర్యుని వెలుగులా కనిపించి అంతరాత్మని తరిమికొడుతున్నది' 


బీరువాలోంచి డబ్బులు తీసాను, మూడు వేలకి పైగానే ఉన్నాయి.


బయటకొచ్చి శరత్ చంద్రక్ అందించాను. అతను లెక్క పెట్టుకునే లోపే మిగతావి రేపు పొద్దున్నే వచ్చి తీసుకెళ్లు" అన్నాను. 


" రచనలు ఇచ్చాకే మిగతాది" అని అతనికి అర్థం అయ్యే ఉంటుందని నాకు తెలుసు. 


అతని కళ్లు అదో రకమైన కాంతి నింపుకోవటం గమనించాను. గండం గట్టెక్కినట్లే అన్న భావం కనపడింది.


అది మొదలు శరత్చంద్ర తను రాసిన ఏ కధైనా. . నవలైనా తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు. అది చదివి నాకు తోచినంత ఇచ్చేవాడిని. ఆ తరువాత మరో రెండు సార్లు చదివి అక్కడక్కడా శైలి మార్చి, ఏవన్నా మార్పులు అవసరం అనుకుంటే అవి కూడా చేసి నా పేరు మీద పత్రికలకి పంపించ సాగాను.


 చిన్నగా నాక్కూడా ఓ రచయితగా గుర్తింపు వచ్చింది. నేను పొందిన మరో లాభం ఏమిటంటే ఏ కథకి గానీ నవలకి గానీ నేను శరత్చంద్రకి ఇచ్చిన డబ్బుకంటే నాకు ఎక్కువ పారితోషికమే లభించేది. ఆ రెండిటలో తేడాలన్ని ఓ డైరీలో రాసిపెట్ట సాగాను.


ఓ సంవత్సరం గడిచింది.


ఏ నాడు శరత్చంద్ర ఇంత కావాలి అని అడగలేదు. పైగా ఇచ్చిన మాట ప్రకారం ఎవ్వరికి ఈ విషయం చెప్పలేదు.


హఠాత్తుగా నాకు ఓ రోజున ఓ ఉపాయం తట్టింది. 


" నేనే ఎందుకు కథలు రాయకూడదు" అని . 

వెంటనే ఆచరణలో పెట్టాను. 


శరత్ కథల ప్రభావం దానిపై స్పష్టంగా కనిపించింది. శరత్ కు  కబురు పెట్టాను. వచ్చాక నేను రాసిన కథ చూపెట్టాను. చదివి కొన్ని మార్పులు సూచించాడు. అవి అంతవరకు నాకు తట్టనందుకు సిగ్గు పడ్డాను. ఆ రోజే పోస్ట్ చేసాను.


తన స్వంత ఊరిలో ఏదో పని ఉందని శరత్చంద్ర ఆ మర్నాడు రైలు ఎక్కాడు.


అనుకున్న విధంగా అనుకోండి, లేదా అంతకు ముఁదు ఉన్న కీర్తి ప్రతిష్ఠల కారణంగా ఆ (స్వంత కథ అంది. ఆ తరువాత సంచికలో నా (స్వంత) కథకి సంబంధించి కొన్ని విమర్శలు వచ్చాయి. ఎప్పటి స్థాయిలో లేదని కొందరు పాఠకులు ఉత్తరాలు రాసారు. అంతకుముందు అంటే ఆ కథని అచ్చులో చూసుకున్నప్పుడు నాకు కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు. అది వర్ణించలేను. కానీ దాన్ని పంచుకోవటానికి నాకు ఎవరు కనబడలేదు. ఎవరితోటి ఆ ఆనందానికి కారణం చెప్పలేను. అలాగని మామూలుగా ఉండలేను.


విమర్శలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేక పోయినా, నాకు తెలియాలికదా? శరత్ చంద్ర  కోసం కలవరించసాగాను. మరో రెండు రోజుల తరువాత వచ్చాడు అతను.  


అతని చేతిలో నా (స్వంత) కథ అచ్చైన  సంచిక ఉంది. మొహంలో తాండవిస్తున్న నిష్కపటమైన ఆనందాన్ని చూసి ఆశ్చర్య పోయాను. 


నా జీవితంలో అంతగా ఆశ్చర్యపడే అవకాశం లేదు.


"చూసారా మీరు కూడా వ్రాయగలరు అని చెబితే ఆ రోజు నమ్మలేదు. నాకు చాలా సంతోషంగా ఉందండి" అంటూ  తను తెచ్చిన ఓ స్వీట్    నాకు అందించాడు.


నాకు మాటలు రాలేదు. ఇక మీదట తన కథలు తీసుకోరేమో (కొనరేమో) అన్న అనుమానం గాని భయం గాని మచ్చుకైనా అతనిలో కనబడలేదు. 


నా కథ అచ్చయినందుకు  అతడు మాటల్లో వ్యక్త పరచిన దానికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు.


నా మనసు వికలమై పోయింది. ఇటువంటి విశాల హృదయం ఉన్న ఉన్నతుణ్ణా నేను ఇంతకాలం స్వార్థానికి  వాడుకుంది. సంచలనాత్మక రచయితగా పేరు పొందింది నేను, కృషి ఇతనిది. నాలో అంతర్మథనం  ఆరంభమైంది.


"ఒక నిమిషం కూర్చో" అని చెప్పి లోపలి గదిలో కి నడిచాను. బీరువా తెరచి డైరీలో శరత్ ద్వారా సంపాయించింది ఎంతో చూసాను. పెద్ద మొత్తమే. చెక్ బుక్ తీసుకొని ఆ అంకె వేసి సంతకం పెట్టాను. అది తీసుకెళ్ళి శరత్ చేతిలో పెట్టాను.


అతనికి ఏమి అర్థం కాలేదు. "నన్ను క్షమించండి శరత్ చంద్రగారు. దయచేసి మీరేమీ మాట్లాడకండి. మీ దృష్టిలో తప్పు కాదన్నా నేను చేసింది మాత్రం తప్పు... ఇది మీ రచనల ద్వారా నేను సంపాయించిన డబ్బు మాత్రమే. కీర్తికి విలువ కట్టలేను. అందుకని నేనే మీకు రుణపడి ఉన్నాను. మీ కెప్పుడు అవసరం ఉన్నా నిర్మొహమాటంగా అడిగి తీస్కోండి" అన్నాను. 


నాకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది ఇప్పుడు.

- చెంగల్వ 

( ఆంధ్రపత్రిక- వా - 11 - 05 - 1990 ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26 -12-2021 ; బోథెల్, యూఎస్ఎ 




Thursday, December 30, 2021

కథ బొమ్మల పెళ్లిళ్లు కొడపటిగంటి కుటుంబరావు. ( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 


కథ 

బొమ్మల పెళ్లిళ్లు 

కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 

బోధెల్ - యూఎస్ఎ



ఆరోజు సరోజినికి పర్వదినం. ఆపిల్లకళ్లకు సమస్తం ఆనందమయంగా తోచింది. 


వాళ్ల బావ భైరవమూర్తి గారి మేడ టాజిమహల్లాగుంది. ఇంటిపక్క తోట నందనవనంలాగుంది. తనతో తోటలో పికారు చెయ్య టానికి వచ్చిన సావిత్రి సాక్షాత్తూ దేవకన్యకలాగుంది. 


ఆరోజున సరోజినికి సావిత్రినిచూస్తే అనురాగంపొంగి పొర్లటం మొదలు పెట్టింది. ఈ ప్రేమావేశం తాత్కా లిక మేఫనీ, పూర్వం ఉన్నదికాదనీ, ముందుండబోదనీ ఆ ఉత్సాహంమీద సరోజినికి తోచటం అసంభవం. దీనికంతా కారణం అప్పుడే ప్రవేశిస్తున్న వసంతరుతువు కాదు, ఆనాడు భైరవమూర్తిగారి శిశువు అన్నప్రాశన.


మీరు సావిత్రినికాని సరోజినిని కాని ఇద్దరినీ కాని బాగా ఎరిగుండకపోతే ఇద్దరూ కవలపిల్లలని చెప్పినా నమ్ముతారు. 


నిజానికిమటుకు సరోజిని సావిత్రికి పిన తల్లి. సావిత్రి సరోజినికన్న ఏమాత్రమో పెద్దదీ, సరోజినికన్న మితభాషి కూడా కావటంచేత చూడగానే ఇద్దరిలో కనపడే భేద మేమిటంటే సావిత్రి పినతల్లికంటె గంభీరంగా ఉండేది. అంతకుమించి ఇద్దరిలోనూ ఎక్కువ తారతమ్యం లేదు.


సరోజిని సావిత్రిని తోటంతా తిప్పి ఆఖరుకు  తన ప్రాణానికి మంచి పాదరిల్లంటిది కనపడ్డ చోటు  చూపి ఇక్కడ కాస్సేపు కూర్చుందామన్నది. 


ఇద్దరూ ఆకుల కింద కూర్చున్నారు. కొంతసేపు ఆకబుర్లూ ఈకబు ర్లూ చెప్పి సరోజిని అసలు సంగతి కొచ్చింది.


“అయితే, సావిత్రీ బావ నీ పెళ్లి చేస్తాడుట నిజవేనా ? " 


సావిత్రి సమాధానంగా పినతల్లిని చూసి నవ్వింది.


"అంతా నిశ్చయమయిందా?" 


" అదే నిశ్చయం. ఇంకా తాంబూలా లిచ్చుకో లేదు.”


2


“నీ కాబొయ్యే మొగుడెవరు ?  "


సావిత్రి చాలా నేర్పరి. ఎటువంటి ప్రశ్న కటువంటి సమాధానం చెప్పాలో ఎరుగును .


“ఎరగవు టే? మామయ్య ఇక్కడ చదువుకునేట ప్పుడు వస్తూండేవాడే—రాధాకృష్ణ మూర్తని !” 


" నాకు బాగా జ్ఞాపకంలేదు... అయితే నీకీ  సంబంధం ఇష్టమేనా?" 


" ఎందు కిష్టంకాదు?”,


సరోజిని తనావిషయం మాట్లాడదలుచుకున్నది అ యిపోయినట్టు నన్న గొంతుతో ఏదో మంగళహారతి ఎత్తిచప్పున ఆపి “ఇప్పు డీసంబంధం కాకుండాపోతే?” అన్నది.


" ఏమిటి?"


“నిన్ను ఆ అబ్బాయికిచ్చి -ఆయన పేరేమిటి? —ఆయనకిచ్చి చెయ్యరనుకో..”. 


" పోనీ!...అయినా ఎందుకు చెయ్యరు?”.


"ఇంకొకరి కిచ్చిచే స్తే!" 


" ఇంకో రెవరు?"


“అన్నయ్యకి స్తే!”


సావిత్రి నవ్వి “తాతయ్య కిష్టంలేదుగా?" అంది. 


"తాతయ్య సంగతి కాదిప్పుడు! నీ సంగతి చెప్పు!"


" ఏమో! నా కంత యిష్టంలేదు సుమా. మామయ్య ఎప్పుడూ మేనకోడలిని చేసుకోటం నీతి కాదఁటుంటాడు. అయినా ఇప్పుడెందు కాఆలోచన?”


సరోజిని సావిత్రి చెయ్యి తీసుకుని వేళ్లు సాగ దీస్తూ “ఇవాళ మా నాన్న మీ నాన్న నడగబోతున్నాడు. నిన్ను అన్నయ్య కియ్యమని. నీకింకా తెలీదేమో?” అని సావిత్రి మొహం వంక చూసింది. 


సరోజిని అనుకున్నట్టు సావిత్రి మొహాన  ఏభావం కనపళ్ళేదు. 


ఇంత రహస్యం చెప్పినా సావిత్రి చలించకపోవటంచూసి సరోజినికి ఉత్సాహభంగమైంది. ఇద్దరూ కొంతకాలం మౌనంగా కూర్చున్నతరువాత సరోజిని పోదామంటూ లేచింది.


“కాస్సేపు కూర్చోవే అబ్బ! ఇంట్లో ఏముంది?"


"ఇంకా అడుగూ బొడుగూ కాఫీ ఉందేమో తౌగి ఇప్పుడేవస్తా. లేకపోతే మంచినీళ్లైనా తాగుతా: ఏం చేస్తాం!" అంటూ చెయ్యి వదలించుకుని సరోజిని ఇంటి వైపు పరిగెత్తింది.


సరోజినటువెళ్లింది, సుందరం ఇటొచ్చాడు. అతను వెనకనించి సావిత్రిని సమీపించి “ఇక్కడున్నావుటే అమ్మాయి? అమ్మ నీకోసం వెతుకుతూంటేను,,, ఓసి!" అంటూ సావిత్రి పక్కనేకూలబడి ఒక చేత్తో సావిత్రిని దగ్గరికి తీసుకున్నాడు.


“నీపెళ్లెప్పుడే, పెళ్లికూతురా ? రాధాయి కంట గడు 

తున్నారూ నిన్ను! మంచివెధవ నీకు మంచి మొగుడవుతాడు. ఆలుసుమాత్రం ఇచ్చేవు సుమా! ఒక చెంపనించి తొక్కి పెడితే కాని మాటవినడు. జాగ్రత్త."


" ఏమ్మాటలు, మామయ్యా!"


"ఓసి! నీకెంతసిగ్గు ! ఒక్కత్తెవు కూర్చుని మొగుడి విషయం ఆలోచిస్తున్నావేమోనని మంచి  చెప్పబోతే తప్పా? నే పోతున్నా లే!”


" ఉండు! ఉండు! అట్లా అయితే నేనూ పెళ్లి విష యమే మాట్లాడతాను. ఒకటి చెప్పు. మేనమామను పెళ్లి చేసుకోవచ్చునా?”


"తప్పు!"


" నేను మరి నిన్ను చేసుకోబోతున్నా నే!"


సుందరం సావిత్రి చెంపమీద ఒక్కటి పెట్టి “ఈసారి  ఆమాటంటే నీతో మాట్లాడను," అన్నాడు. 


సావిత్రి చెంపరుద్దుకుంటూ నవ్వి, “ఈ మాట మీ నాన్న అన్నా ఇదేనా శిక్ష!” అన్నది. 


సుందరం ఆశ్చర్యంతో మేనకోడలి వంకచూసి, “నాకింకా తెలీదే! నీతో ఎవరన్నారు?" అని అడి గాడు.


"సరోజిని.”


“దాని కన్నీ తెలుసు!... హూఁ! ఆ అయిదు వేల కట్నం నాన్న గారి మతిచెడగొడుతున్నది. సంవత్సరం కిందట ఈ విషయం వచ్చినప్పుడు అయినవాళ్లలో కట్నంరాదని చాతనాయిన  వంకలన్నీ చెప్పి మనిద్దరికీ ముడిపడకుండా చేశాడు. ఈసారి బావ ఎట్లా తప్పించుకుంటాడు? ఇంకో వెయ్యి ఇస్తామంటే సగోత్రీకుల పిల్లనైనా చేసుకుంటారు నాన్న గారు. ఒక్కపాఠం నేర్చుకో, పిల్లా! నీ కెప్పటికైనా పిల్లలు పుడితే విశ్వ ప్రయత్నంచేసి వాళ్లకు పెద్దవాళ్ళ నెదిరించటం నేర్పు. నాకిన్నేళ్లు  వచ్చినై, ఇంత చదువు చదివాను! నాన్న గారు రేపు కొండముచ్చును పెళ్ళిచేసుకోమంటే కాదనేటం దుకు నాకు ధైర్యంలేదు... మీ నాన్న నీకు చనువిచ్చా డుగా! రాధాయినే చేసుకుంటానని పోట్లాడు.”


"నేను పోట్లాడను. నాన్న పెళ్ళివిషయం నన్నడగడు, నేను సిగ్గుపడతానని ఆయన నమ్మకం, నేను సిగ్గు లేనట్టు ఆయన కెట్లా తెలియచెయ్యటం?" 


" ఆహా ఏం లోకం ! ఎవరి పిల్లల మనసు వాళ్ళకు తెలీదు!"


ఆసాయంకాలం సుందరం, రాధాకృష్ణమూర్తి కృష్ణ ఒడ్డున ఇసకలో కూర్చున్నారు.


ఆ మర్నాడు సావిత్రి పెళ్ళికి ముహూర్తం ఏర్పాటు చేశారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. ముహూర్తం ఇరవైరోజుల్లో ఉంది. 


" రాధా! నా పెళ్ళికి తప్పక రావాలిసుమా , చెల్లెలిని చేసుకుంటున్న వాడి పెళ్ళి నీకెక్కడ తటస్తపడుతుంది?" అన్నాడు సుందరం దీనంగా.


‘‘అర్ధంలేకుండా మాట్లాడతావేంరా, సుందరంగా !  అప్పకూతుర్ని చేసుకుంటున్న వాడివి నువ్వే నేం లోకం లో! నీకు మళ్ళీ అటువంటి పిల్లవస్తుందీ?”


"అటువంటి పిల్ల మాసరోజా ఒకతె ఉందిగా!" 


" ఛీ! అప్రాచ్యుడా! వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారను కుంటున్నావుకాని, నక్కకూ —ఇద్దరికీ ఎంతో భేదం ఉంది. నాకు సంబంధమే కనపడదు.” 


“ఇంకేం? నాకు భేదమే కనపడదు. నిన్నా ఇవాళ లోపల   వందసార్లు సావిత్రిని సరోజిని పేరు పెట్టి పిలిచాను. అది పలకదు!" 


" నీ మొహం! దానిక్కోపం, వళ్ళుమంట, ఎందుకుండదు ? చిత్రంచూడు. ప్రకృతి మనల్ని వెక్కిరించటాని కిట్లాచేసిందికాని వాళ్ళిద్దరిలో నీకు కనపడ్డభేదం నాకు  కనపడి నీ కాభేదం కనపడకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను సావిత్రిని కొంతవరకు నిశ్చింతగా - పెళ్ళిచేసుకునేవాణ్ణి. సరోజానీకు కుదిరేది.” 


ఇక్కడ రాధాకృష్ణమూర్తి ఈడుకుమించిన మాటన్నాడు.


"ఎందుకు దిగులుపడతావురా? పెళ్ళయిన మరుక్షణం నుంచీ  ప్రయత్నంచేసినా ఇద్దరికీ సంబంధం కనపడదు.” 


" నీదయవల్ల  అట్లా అయినా బాగుండును."


" నాన్నక్కోపం వచ్చింది మీ బావగారిమీద.”


" పెద్దకట్నం పోయిందే అని.” 


" సామెత చెప్పినట్టుంది.”


పూర్తిగా పొద్దుకూకకుండానే ఇద్దరూ ఇంటిదారి పట్టారు. భైరవమూర్తి గారి మేడముందు రాధాకృష్ణ మూర్తి గుడ్ నైటన్నాడు.


సుందరం  రాధాకృష్ణమూర్తి చెయ్యిపట్టుకున్నాడు. "ఒక కప్ కాఫీ తాగిన తరువాత. " 

" కాఫీ! అవశ్యం ”


ఇద్దరూ మూలగదిలో చేశారు. సుందరం లోపలికి వెళ్లాడు, సరోజినితో రెండు  కప్పులు కాఫీ తయారు చెయ్యమన్నాడు. అందుకని సరోజిని మూడు కప్పుల కాఫీచేసి తనకోకప్పు దాచుకుని మిగిలిన కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. తరవాత కొంచెం ఎడంగా నుంచుని రాధాకృష్ణమూర్తిని పరీక్ష చెయ్యటం మొదలు పెట్టింది. 


రాధాకృష్ణ మూర్తి కాఫీ కాస్త రుచి చూచి కప్పుబల్ల మీద పెట్టి "ఫైన్ ” అన్నాడు.


సుందరంకూడా కొంచెం తాగి మొహం చిట్లించి, “నాకు కాఫీ రుని తెలీదురా ఖర్మం!" అన్నాడు


" సావిత్రికీ అంతే, అన్నయ్యా దానివన్నీ నీగుణా లే" అన్నది సరోజిని నవ్వుతూ. 


రాధాకృష్ణమూర్తి కొంచెంసేపు సరోజిని వంకచూసి, తలగోక్కుని కాఫీతాగటం సాగించాడు.


ఈ కాఫీ మాత్రం ధుమాగా ఉందిరా. యమాగా ఉందనుకో! అద్భుతంగా ఉందంటేనమ్ము . ఎందుకూ? నెంగరం అయ్యరు కాఫీకి నకలు. అసలుకు సరియయిననకలు" 

 సరోజిని తల ఒక పక్కకు  ఒరగేసి  రాధాకృష్ణమూర్తి  వంక చూస్తూ "పాపం, సావిత్రికి సుందరమే మొగుడయే వాడు?" అనుకుంది.


" నేను పోతున్నాను. మీకింకేమన్నా కావాలా? " 


"నీళ్ళు” సుందరం.


" తాగటానికేనా?"…రాధాకృష్ణ మూర్తి. “


" తప్పకుండా! లేకపోతే ఈ చేదుఇట్లాగే ఉండనీమంటావా ఏమిటి?”


సరోజిని  బిగ్గరగా నవ్వుతూ పరిగెత్తిపోయింది.


రొండు నిమిషాలపాటు స్నేహితులిద్దరూ మౌనంగా  కూర్చున్నారు. చివరకు రాధాకృష్ణమూర్తికి మాట్లాడబుద్ధయింది. "మీ చెల్లెలికీ మీ మేనకోడలికి భేదం లేదంటావేంరా? " 


“ఆఁ?" అన్నాడు సుందరం పరధ్యానంగా,


" ఇద్దరికీ లక్షభేదం ఉంది.” 


" ఎవరు?"


" మీ చెల్లెలికీ- మీ సావిత్రికీ "


"ఏమిటి?"


భేదం —లక్ష భేదం—”


"ఏంభేదం?"


" ఉంది " 


"ఎందుకుంది. "


"ఎందుకు లేదు.”


ఇప్పుడు సుందరం దోవకొచ్చాడు.


‘నాఆలోచనంతా పాడు చేశావు! ఏమిటా మనం మాట్లాడుతున్నది?”


రాధాకృష్ణమూర్తి మళ్ళీ వెనక్కి రాదలుచుకోలేదు. "సావిత్రి ఇంత ఉత్సాహంగా ఉండదు.”


స్నేహితు డేంమాట్లాడుతున్నాడో తెలీక సుందరం " ఆఁ?" అన్నాడు. ‘


" ఇంక మాట్లాడదు.".


" ఎవరు?" 


'' సావిత్రి.” 


" సావిత్రంటే  . ఓహో సావిత్రా? ఇంకాసావిత్రేమో ననుకున్నా!"


" ఇంక నవ్వ దసలు .”


"ఎవరు? సావిత్రేనా?"


" ఆ! అంటే సావిత్రికాదు? సావిత్రి!"


"సావిత్రి నవ్వదా ?”


"నవ్వదు. ఎందుకు నవ్వాలి? నవ్వు నాలుగందాల చేటు  " 


రాధాకృష్ణమూర్తి తలగోక్కుని అకస్మాత్తుగా " గుడ్ నైట్" అని వెళ్లిపోయినాడు.




జరిగిన సంగతి  ఏమిటంటే రాధాకృష్ణమూర్తి మొదట సావిత్రికోసం ఉబలాటపడ్డప్పుడు తనమనస్సును ఆపిల్ల కర్పించుకున్నాడు. ఒకపిల్ల తన అనుజ్ఞ లేకుండా తన మనసును ఎత్తుకుపోయినట్లు   అతనికి కొత్త అనుభవం. అనుభవంలేనివాడు కనకనే పని పెట్టుకొచ్చి సరోజిని తన మనస్సును   ఆకర్షిస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. దానికి అతనికివ్వబడ్డ విశేషేమిటంటే సరోజిని !


రాధాకృష్ణమూర్తి మాట్లాడుతున్నది వినిపించుకో కుండా సుందరం ఆలోచిస్తున్న దేమిటంటే తన చెల్లెలికీ సావిత్రికీ ఏం సంబంధం ఉందా  అని. దానిక్కారణం ఉంది. 


అతను సావిత్రిని సరిగా చూసింది కిందటిరోజు ఉదయం. చెల్లెలిని సరిగా చూసిందంతకు పూర్వమే! మగ వాడికి పెళ్లియావ లేనంత కాలం ఆడపిల్లలంతా ఒకటి గానే ఉంటారు. వాళ్ళిద్దరికీ కొంతపోలికకూడా ఉండే చెప్పేదేమిటి?


అన్నిటికన్న ముఖ్యమైనవిషయం మొదటినించీ సావిత్రికి దిగులు తన్ను తనమామ కియ్యరనే .


—కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 ; బోధెల్ ; యూఎస్ఎ


Tuesday, December 28, 2021

కథ తలవంచని పూవులు రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


కథ 

తలవంచని పూవులు 

రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి 

సేకరణ  - కర్లపాలెం  హనుమంతరావు

28 -12-2021

బోథెల్ ; యూఎస్ ఎ  

                  

( భారతి - అక్టోబర్, 1957 సంచిక ) 


విక్రమ ధనంజయా ! వీరనారాయణా! జయీభవ ! విజయీభవ! విద్యాభోజ ! విదర్భ రాజా ! విజయీభవ ! దిగ్విజయీభవ !


వండియాగధులు వెండిదుడ్లతో ప్రవేశించి పక్కకు తిప్పుకొన్నారు. మాలవ మహారాజులుంగారు రత్నఖచిత  సువర్ణ సింహాసవంమీద ఆసీనులు ఆయి సామంత, దండనాథాదులూ, యావత్ప్రజానీకమూ ఆ వెనుక యథాస్థానాల్లో కూర్చున్నారు. ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారుజనం..


ఏటేటా జరిగే శారదా ఉత్సవాల్లో ఆరోజు చివరిది.  దేశదేశాగత నట, విట, కవి, గాయక , వైతాళికులతో ఆనగరం తొమ్మిదిరోజులనుంచీ నిండిపోయింది. అన్ని రోజుల ఉత్సవ సారమూ ఆరోజున మూర్తికట్టి అక్కడికి చేరినట్టుంది.


సూర్యకాంతి ప్రాసాదంలో ఆనాడు వినోద ప్రదర్శనం. ముందు ఆస్థాన వైణికుడు వీణ మీద పట్టు బురఖాతీసి శ్రుతి సవరిస్తున్నాడు. జనం సుకుమార వీణాగానానికి ఎదురుచూస్తున్నటులేదు. విచ్చుకత్తుల రాజభటులు ఎర్రని చూపులతో ఎంత అదలిస్తున్నా కోలాహలం అణగటం లేదు.


దాక్షిణాత్య శిల్పి చంద్రమౌళి ఒక ప్రక్క నిల్చున్నాడు. అతడెప్పుడూ రాజసభలు చూడలేదు. నాగరికుల తళుకు  బెళుకులకు ఆతని  అమాయక హృదయం అలవాటుపడలేదు. హృదయాలను సైతం కరిగించి అమృత మూర్తులుగా మలచగల అతనికి పాటి మానవులను పలకరించి ప్రసన్నులను చేసుకోవడం ఎట్లాగో తెలియలేదు. ప్రాసాదం చివర ఒక స్తంభాన్ని ఆనుకొని తెల్లబోయి చూస్తున్నాడు. 


నగర జనుల నిష్కారణ భంగిమలను, ఒయ్యారాలను చూచి  సహజంగా ఉండవలసిన మానవులు ఎందుకిట్లా బిగువులు పోతారో అతనికి అర్థం కాలేదు.


వీణ ప్రారంభం అయింది. ఆ సిద్ధహస్తుడు అమృత వాహిని పలికిస్తున్నాడు. శ్రోతలు ఇంకెందుకో చూస్తున్నట్టుంది. మంత్రి హస్తసంజ్ఞతో వీణ ఆగి పోయింది.


ఇక ఇంద్రజాలం అన్నారు. ఒక పొట్టివాడు ముందుకువచ్చి మహారాజు ఎదుట భూమికి మూడు సారులు సమస్కరించి నిలుచున్నాడు. శుద్ధ శ్రోత్రియంగావున్న ముఖంలో చంద్రవంకలా గంధపుచారలుంచి దానిమీద ఎర్రని కుంకుమబొట్టు పెట్టాడు. చేతిలోని నెమలీకుంచె ఆకాశం మీద మూడుసార్లు తిప్పాడు. జలజల పువ్వులు రాలాయి. 'గగన కుసు మాలు ప్రభూ చిత్తగించండి' అన్నాడు. ప్రజలు విరగబడి నవ్వారు. 


నెమలిపింఛం గాలిలో సున్నా లుగా చుట్టాడు. అందులో కన్నులు మిరుమిట్లు గొలుపుతూ బలిష్టమైన రెండు వానరవిగ్రహాలు బయలు దేరి యుద్ధం చెయ్యడం ప్రారంభించాయి. “వాలి సుగ్రీ వులు" భూలోక దేవేంద్రా!' అన్నాడు. ప్రధాని చూపుతో ఆగి, పక్కకు తొలగిపోయాడు. వీణకన్న దీనితో కొంచం ప్రజలముఖాలు కలకలలాడాయి.


ఒక మహాకాయుడు  నడిచే నల్ల రాతి విగ్రహంలా సభామధ్యానికి వచ్చాడు . ప్రజల్లో కలకలం బయలు దేరింది. ఉన్న చోటునుంచి ముందుకు త్రోసుకువస్తున్నారు. రాజోద్యోగులు సర్దలేక  తొక్కిడిపడుతున్నారు. '



' అడుగో బ్రహ్మదేశపు బలశాలీ' అనేమాటలు సభలో గుప్పుమన్నాయి. అతనికి కావలసిన యేర్పా ట్లన్నీ చరచర చేయించారు. మహారాజు సింహాసనం మీద సుఖస్థితిలో సర్దుకుని కళ్ళల్లో కుతూహలం కనపరచారు. మహాకాయుడు మెడలు తిరగని బింకంతో మహారాజువై పు తలవూపి సమస్కారం అభినయించాడు. ఇద్దరు భృత్యులు రెండుబాహువుల పొడవూ, రెండంగుళాల మందమూగల ఒక ఇనుప చువ్వను తెచ్చి అతని ముందుంచారు. అతడు అవలీలగా ఏనుగు తామర  తూడును అందుకున్నట్టు దాన్నందుకుని కుడిచేతి వేళ్ళ మధ్య రెండు నిమిషాలు గిరగిర తిప్పి భూమిపై నిల బెట్టాడు. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అతడు దానిని పొట్లకు ఆనించి కండరాలు పూరించి ఇటు ఊగి అటు ఊగి కొంతసేపటికి పూర్ణానుస్వారంగా వంచి  ఆ వలయాన్ని నిర్లక్ష్యంగా ఎదుటికి పడవే శాడు. ప్రజలు చప్పటవర్షం కురిపించారు. ప్రభువు ముఖంలో చిరునవ్వు వెలిగింది. ప్రధాని ఆజ్ఞ రాజ భృత్యులు వేయిదీనా రాలు వెండిపళ్లెరంలో పోసి అతనికి బహూకరించారు. మహారాజులుం గారు లేచారు . అతన్ని చూడడానికి జనం విరగబడి వెంటబడ్డారు . 


రాజమార్గంలో జనప్రవాహం పొంగిపోయింది. చంద్రమౌళి  జనుల ఒత్తిడికి ఆగలేక తూలి ఘంటాపసంమీద పడ్డాడు. అతని పెదవిమీద, వాడి లేకులూడిన పువ్వులా చిరునవ్వుపుట్టి చెదరి అదృశ్యమయింది.



సాయంకాలం చంద్రకాంత సౌధంలో మహా సభ అన్నారు. మధ్యాహ్నం నుంచి సభాభవనం ఆలంకరిస్తున్నారు. సభాస్థలి భూలోక స్వర్గంలో ఉంది. మాలవసుహారాజు  వైభవానికి అది ప్రదర్శనశాల గాబోలు • రంగురంగుల తలపాగాలతో సకల సామంత రాజులూ సభలోకి వేంచేస్తున్నారు.


చంద్రమౌళి  ఒక పట్టుసంచీ చేతితో పట్టుకొని చంద్రకాంత సౌధం చలువరాతి మెట్లమీద నిలుచున్నాడు. నేటి సభలో ప్రవేశం ఎట్లాగా అని తెల్లని అమాయకపు కళ్ళతో ఆలోచిస్తున్నాడు. 


ఎక్కడి దక్షిణదేశం? ఎక్కడి విదర్భనగరం? రెండు దూర దూర దేశాలను రెండు దూరదూర మానవ హృదయాలను దగ్గరగా చేర్చి స్నేహపూరితం చేసే శక్తి లోకోత్తరమైన తన శిల్పకళకు లేదా? అనుకున్నాడు.


మహాకవిగారు సపరివారంగా వస్తున్నారు. ఆయన తెల్లని బట్టతల, చుట్టూ రెల్లుపూలు పూచిన గోదావరిలంకలా ఉంది. చెవులకు బంగారు కుండలాలు, చేతులకు సింహతలాటం మురుగులు. పెద్దరకం కుంకుమ రంగు కాశ్మీరు కాలువ భుజాలను కప్పింది. వెంటవచ్చే ఆశ్రితకవుల కైవారాలతో ఆయన హృదయం మత్తెక్కి ఉంది. ఆయన చూపునకు మరింత ఒదిగి, తన అల్పత్వం ఒప్పుకొన్న బట్టుమూర్తికి ఆకోటలో కనకాభిషేకం - కాదని తలయెత్తినవాడికి దేవిడీనున్నా. ఆ కోట బురుజులు ఆయనకోసం కట్టినవి. వాటి మధ్యకు తనకు తెలిసి సంతవరకూ ఏ ప్రతిభాశాలినీ రానివ్వలేదు. వచ్చినా ఆ - పరిధి దాటి ఎక్కడికీపోడు. తన పద్యాల అర్థం తానే - చెప్పాలి. మహారాజే ఆనందించాలి. తక్కిన కవీశ్వరు లకు మహారాజుకూ ఆయన ఆనకట్టు.


చంద్రమౌళికి సరిగా నమస్కరించడం చాతకాలేదు. అయినా చేతులు జోడించి మెట్టుమీద నిలుచున్నాడు. మహాకవిగారు నిర్లక్ష్యంగా నిలువునా చూసి 'ఎవరయ్యా నువ్వు' అన్నట్టు కళ్లను ఎగర వేశారు. 


"చాలా దూర దేశంనుంచి వచ్చానండి” 


" మం... చి పనిచే... శావు"


"మాలవ ప్రభువు మిక్కిలి రసజ్ఞులనీ, కళా సౌందర్య వేత్తలనీ మా వైపు గొప్పవాడుక”


"ఎవరు కాదన్నారు?” 


" ఆ రసిక ప్రభువు దర్శనం చేస్తేనే నా కళ చరితార్థం; ఆ నే నమ్మకంతో ఎన్ని కష్టాలైనా లెక్క చెయ్యకుండా వచ్చాను..." 


"అబ్బా!”


" కళాజీవి  బాధా, రసజ్ఞ సందర్శనం కోసం పడే తహతహా  మహాకవీంద్రులు తమకు తెలియనిది కాదు. " 


ఈ చివరిమాటతో కవిగారి వికారం కొంత ఉపశమించినా ఆయన అహంకారానికి తగిన ఆహారం పడలేదు. “


" నా కళను ప్రభువులవద్ద ప్రదర్శించే అవకాశం.. " 


"ఇంతకీ... ఏమంటావు?"


" .. కలిగించ వలసిందని కోరుతున్నాను.." 


“మధ్యను నేనెవరు? నువ్వేమో మహాకళావేత్తవు , ఆయనేమో  మహా రసజ్ఞులాయె! ఆలస్యం ఎందుకు ప్రభువులు సభకు వేంచేసే వేళ అయింది. వెళ్ళి దర్శనం చెయ్యి.”


"ఒక దేశాంతం ఆగంతకుడికి ఈ మాత్రం సహాయము చెయ్యలేరా? మీ ప్రభువు కళాప్రియత్వానికి ఈమాత్రం వన్నె పెట్టలేరా ?”


" ఈ మధ్య కొత్తమాటలు నేర్చారు. చిన్నప్పటి నుంచీ వేల  పద్యాలు రాసి పోశాను. మహాకవి అనిపించుకున్నాను. అంతేగాని ఈ కళ యేమిటి? కళాయి యేమిటి?...కవిత్వం ఏమైనా చేసి తెచ్చావా?" 


" లేదండి."


"అయితే...ఈ ఉపన్యాసమంతా ఏమిటి? మాకు చాలా తొందరపని ఉంది. ఇప్పుడు కవుల సభ. నువ్వేమో కనివి కావు. ఇంక నీ కళా ఏమిటి?


“మనవి చేస్తున్నాను. కవిత్వం అంటే నాకు తెలియదు. నేనేమీ మాటాడలేను. కాని నేను తెచ్చిన ఆపూర్వ వస్తువు పలుకుతుంది. మాటాడుతుంది. రసజ్ఞుల  మనస్సును లాలించగలరు. ఒక్క త్రుటి ... ప్రభువు ఎదుట నిలుప గలిగి తే... " 


“అబ్బో!... ఏదీ ఆ వస్తువు?"


"క్షమించండి. ప్రభు సమక్షంలో తప్ప పైకి తియ్యను. అది నా కళామర్యాద. ఆయన కానుకను ఆయనే తొలిసారి చూడాలని నా కాంక్ష . ఈ ప్రభు గౌరవాన్ని మీరు కూడా ఆమోదిస్తారనే నమ్ముతున్నాను.” 


మహాకవి గారి కుండలాలు ఊగాయి. అవమానం జరిగింది. కళ్ళల్లో మంటలు రేగాయి. తన ప్రాముఖ్యం కోసం  ఇంతవరకూ  చేతులు జోడించుకు తిరిగేవాడేగాని ఎదిరించి మాటాడిన వాడు లేకపోయాడు. శిల్పివైపు చురచుర చూసి జారే కాశ్మీరు శాలువాను మరింత పైకి లాగి  చరచర పరివారంతో నడిచి వెళ్ళిపోయారు. 


చంద్రమౌళి తన తప్పేమో  తెలియక తెల్లబోయాడు. కర్తవ్యం ఏమిటి?


లోపల సభ ప్రారంభమయింది. మహాకవి గారి శుష్క సమాసాలు సాగిసాగి వినిపిస్తున్నాయి. ఇటు నుంచి చదివితే రాజు పేరు, అటునుంచి విదివితే తన పేరూ ఇందులో ఉందని ఒత్తి ఒత్తి చెబుతున్నారు . 


చంద్రమౌళి ఇంత దూరం వచ్చి రాజ దర్శనం చెయ్యకుండా వెళ్ళకూడదనుకున్నాడు. చర్రున  సభలోకి దూసుకువెళ్లాడు.  సభాస్థలి చేరకుండా రాజభటు లడ్డగించారు. 


"ప్రభుదర్శనం చెయ్యాలి! " 


" అనుజ్ఞ నుండి తీరాలి" 


"ఇది మీ ప్రభువారికి కానుక. పాదపీఠం దగ్గర ఉంచివస్తాను. వెళ్ళి నివ్వండి.”


"అడుగు కదిలితే .. మెడ  మీద తల ఉండదు"


"మీ ప్రభువు సరసతా, మీ యోగ్యతాఇంతటి వేనా ? " 


ఒక రాజభటుడు చటుక్కున  వచ్చి ఆ మహాశిల్పి మెడమీద చెయ్యి వేసి ఒక్క ఊపున గెంటివేశాడు. 

అతడు చలువరాతి  మెట్లమీదనుంచి దొర్లి   నేలమీద పడ్డాడు. చేతిలోని  పట్టు సంచీ  దూరంగా పడ్డది. 


చంద్రమౌళి నెమ్మదిగా లేచి సంచీ  తీసుకుని నీరునిండిన కళ్ళతో ఒక్కసారి రాజభవనంకేసి చూసి చరచర కోట వెలుపలికి నడిచాడు. 


రాజవీధి నిర్మానుష్యంగా ఉంది. తన లోకోత్తర శిల్పాన్ని పైకి తీసి తినివితీరా  చూసుకున్నాడు. దాని వెనక ఉన్న కథ అతని తడికళ్ళల్లో తిరిగింది.


3


ఒక నాడు తన పల్లె కుటీరంలో చంద్రమౌళి ఉలిని ఒక మంచిగందపుముక్క మీద నడుపుతున్నాడు. 


అతని తీయని  ఊహలు సున్నితమైన ఉలి నుంచి  జారి  చందన ఖండంలో సుందర రేఖలుగా విడుతున్నాయి. శిల్ప సౌందర్యమో, చందన  హృదయమో  ఆ రేఖల్లో పరిమళాలు నింపుతున్నాయి. 


సుందరేశ్వరుని ముందు కృశాంగి హైమవతి, ఆయన కళ్ళల్లో ప్రేమ భిక్ష . ఆ కులపాలిక అరమోడ్పు కన్నుల్లో చిక్కని సిగ్గులు.   ఉలి కన్నా వేగంగా మనసు పరిగెత్తుతున్నది . ఆ శిల్పంలో కలిసిపోయి తానున్నట్టే  మరచిపోయాడు ఆకళా తపస్వి. 


తన కుటీరం వాకిట్లో ఏదో అలజడి. అయినా  అతను తలయెత్తలేదు. ఇంకా   కర్రగుండెలో నుంచి కళను పిండుతూ నే ఉన్నాడు.  


భార్య 'ఆశ' ఆలజడిగావచ్చి ఎదుట నుంచుంది. ఐదేళ్ళబిడ్డ కళ వెక్కి వెక్కి యేడుస్తూ ఉండగా  చంద్రమౌళి ఆలయెత్తి చూచాడు.


తపబిడ్డకంటినుంచి జారే నీలాలు చూచిన అతని చేతిలోని ఉలి జారిపోయింది. తపోభంగంలా శిల్పం ఆగిపోయింది. 'ఏమిటి సంగతి' అన్నాడు విధిలేక. 


ఆశ ఎర్రబముఖంలో చెప్పడం పెట్టింది.—“పాపం, 'కళ? యేమీ చెయ్యలేదు సుమండీ —మన పొగడ చెట్ల క్రింద పువ్వులేరుకుంటూ ఆడుకుంటున్నది. ఆ ధనవంతుల బిడ్డలేదూ శేషగుణి, ఆ పిల్ల, కళను పిలిచి తీసుకువెళ్ళింది. ఇద్దరూ చాలా సేపు ఆడుకున్నారు. ఆ పిల్ల మెడలోని  రత్నాలహారం దీని మెడలో వేసి 'నీకిచ్చేశాను తీసుకో'  అందిట. కళ నిజమనుకుని ఇంటికి పరుగెత్తుకువస్తూఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ కళ హారం ఎత్తుకు పోతున్న తాన  తల్లితో చెప్పింది. వెంటనే ఆవిడ పరుగెత్తుకువచ్చి 'దొంగబుద్ధులు, దొంగపిల్లలు . లేనివాళ్లతో స్నేహాలు వద్దంటే మా పిల్ల వినదు ' అని ఈ పిల్లను గుంజి హారం తీసుకుని వెళ్ళిపోయింది. 


" ఇదేనా  మర్యాద ? చూడండి. కూటికి పేదలమైతే గుణానికీనా?" అని ఆమె బరువుగా నిట్టూర్చింది, చురచురము నే కళ్ల తో. 


చంద్రమౌళి అన్నాడు నెమ్మదిగా — "పిచ్చిదానా నీకూ ధనవంతులం టే వ్యామోహం. వారి తళతళలాడే   నగలూ, మిలమిల లాడే చీరలూ దూచి ఎంత ఆకర్షణ నీకు! వారిలాగే మెరిసి పోవాలని ఎంత ఆరాటపడతావు ! ఆ కోరిక ఎప్పుడో మనల్ని శాపమై మొత్తుకుంది. ఈ సడిస్తుంది. అని నీకు తెలియ లేదు. ఇంక ఊరుకో " అని మళ్లా శిల్పాన్ని అందుకున్నాడు. 


ఆశ ఊరుకోలేదు.


" ఆపండి ఆ పని. ఆలుబిడ్డలు సుఖించని ఈ చెక్క డాలు శిల్పాలూ ఎందుకూ? చేతులో ఇంత నేర్పుండి ఏం లాభం? తలుచుకుంటే అట్లాంటి రత్నహారాలు పది సంపాదించగలరు. నన్నూ  బిడ్డనూ అలరించి అలంక రించగలరు. కళను చూచి మెచ్చి ఇచ్చే ప్రభువులు దేశంలో లేకపోలేదు. వచ్చేవి కారణోత్సవాలు. మీ చెయ్యిసోకి తే

రాళ్ళుమాటాడతాయి. ఒక్క శిల్పంతో ఆ మాలవరాజును సంతోష పెట్టలేరా? కాంక్షతో  తీవ్రంగా వెలిగే  ఆశ కళ్ళకు అతడు లొంగిపోయాడు.


ఆనాడే దీక్ష వహించాడు. ప్రశస్తమైన ఏనుగు దంతం సంపాదించారు. చంద్రవంకలా ఉన్న ఆ దంత  ఖండాన్ని నిలువునా పూలదండగా  మార్పివెయ్యా లను కున్నాడు . ఉలి ఆమోఘంగా పని చెయ్యడం ప్రారంభించింది. 


ప్రతీ రాత్రి ఎదురుగా కూర్చునేది. ఆమె కళ్ళ అందం ఆతని  శిల్పానికి దీపం అయింది. ఆమె ఎర్రని పెదవుల చిరునవ్వు అతని కల్పనకు జీవంపోసింది. ఆమె ఒక్కొక సుందర భంగిమ అతని చేతిని పరుగులెత్తించింది. ముప్పది రోజులు అహోరాత్రాలు పని చేశాడు.


ముక్కలు చెయ్యలేదు. అతుకు లేదు. ఏనుగు దంతం హఠాత్తుగా మల్లెపూలదండగా  మారిపోయింది. రేకురేకునా సహజమైన మధురిమలు. ముడత ముడతలో  అచ్చమైన నొక్కుల సొగసులు. కొన్ని పూర్తిగా విడిన మల్లెలు, కొన్ని అరవిచ్చినవి . చివర ఒక బొడ్డు మల్లె కొలికి  పూస. 


ఒక్కొక్క పువ్వుకూ ఒక్కొక్క నెత్తురుబొట్టు ఖర్చు పెట్టాడు.


చిక్కిపోయిన చెక్కిళ్ళతో తృప్తిగా నవ్వి అతిని గుండె  పూచిన పూలమాలను ఆశ ఎదుట  సగర్వంగా ఎత్తి పట్టుకున్నాడు. ఆశ కళ్ళల్లో ఆనందజలం చిమ్మింది. 


ఒక ముహూర్తాన ప్రభు సందర్శనంకోసం మూటకట్టుకు బయలుదేరాడు.



చంద్రమౌళి రాజవీధిలో వేడిగా నిట్టూర్చి తన  శిల్పం వైపు ఇంకొక సారి చూశాడు. ఆ తెల్లని పువ్వులు తనని  చూసి పకపక నవ్వినట్లనిపించింది. ప్రతి పువ్వూ తీసకోసం దీనంగా ఎదురు చూసే  ఆశ ముఖం జ్ఞాపకం చేసింది. అమాయకపు కళ్ళల్లో నీరు కార్చి తన బిడ్డ కళ పరుగెత్తుకొనివచ్చి కాళ్లు  చుట్టు వేసుకున్న ట్టనిపించింది.


పొంగివచ్చే కన్నీళ్లను ఆపుకుని నగరం వెలుపలి శూన్యంలోకి వచ్చి ఒక రావి చెట్టుకింద నిలుచున్నాడు. అమోఘమైన తవ శిల్పాన్ని ఊచిపుచ్చుకుని చెట్టు మొదటికి విసిరి వేశాడు. అది పోయి ఒక రాతికి తగిలిన చప్పుడయింది.


నివ్వెరపోయి చెట్టు మొదట పరిశీలించాడు. ఆశ్వయుజమాసపు వెన్నెల వెలుగుల్లో స్పష్టంగా కనబడుతున్నది. 


ఆ పుష్పమాల ధ్యానముద్రలో ఉన్న బుద్ధదేవుని పాదాల ముందు పడింది.


అతనికి నవ్వు వచ్చింది.


“సింహాసనంమీది విగ్రహానికి సమర్పించదలచిన ఆపూర్వ పుష్పమాల ఈ జీమా దయామూర్తి పాదాలను పూజించిందా? ఎంత ధన్యుణ్ణి! 


చంద్రమౌళి నిమీలిత నేత్రాలతో బుద్ధదేవుని పాదాలముందు నిలువునా మోకరిల్లాడు. 


బుద్ధ జీవుని ఒక శీతల హస్తం అతని వెన్నుపై నిమిరినట్లయింది !



రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి

 ( భారతి - అక్టోబర్, 1957 సంచిక ) 


సేకరణ  - కర్లపాలెం  హనుమంతరావు

28 -12-2021

బోథెల్ ; యూఎస్ ఎ  

                  


Monday, December 27, 2021

కథ ఆప్తబంధువు - ఏల్చూరి విజయరాఘవరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 కథ 

ఆప్తబంధువు 

- ఏల్చూరి విజయరాఘవరావు 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


“ధన్ ధనా- టక్ టకా - ధన్ ధనా- ట౯కా- తక తకిట తకతకిట--- తకతకిట తకతకిట 

ఖండజాతి లయలో..  శరవేగంతో పరిగెత్తుతోంది రైలు బండి. 

బెజవాడ రావడానికింకా ఎనిమిది గంటలన్నా పట్టచ్చు. పానకాల్రావుకు నిద్ర రావడంలా. 


అమావాస్య చీకటి రాత్రుల్లో చెట్లూ, చేమలూ, గుళ్ళూ- గోపురాలూ, పల్లెలూ- పట్నాలూ, గతంలోకి మాటుమణిగి పోతుంటే, ముందు రాబోయే స్టేషన్లన్నీ భవిష్యత్తులో పొంచి కూర్చున్న ఆశల్లా వువ్విల్పూరిస్తూ పానకాల్రావు మనస్సును పదే పదే పీకుతున్నాయి. .  గమ్యం దగ్గర కొస్తున్న కొద్దీ! 


అతని తొండర వాటికేం తెలుసు మరీ! ఇవ్వాళన్నా యీ మాయదారి రైలును మరికాస్త తొందరగా పరిగెత్తించే నాధుడే  లేడా? 


తెలుసు. అల్లా జరగడం అసంభవమని. అయినా బాణం తగిలిన జింకలా కొట్టుకుంటున్న పానకాల్రావు గుండెల్లో తర్కశక్తి నెప్పుడో మింగేసింది ఆవేశం!


' మదర్ సీరియస్... కమ్ సూన్' మామయ్యిచ్చిన టెలిగ్రామిది... 


ఇదమిదం తెలియడంలో అలాంటి పరిస్థితిలో పానకాల్రావేమిటి , పాపారావైనా, పార్వతమ్మయినా ఆ సందిగ్ధావస్థలో .. ఎవరైతేనేం తడబడక తప్పుడు గదా! 


ప్రాణాలతో తల్లిని చూసి తీరాలి. "నాన్నా! ఎల్లా వున్నావురా? ఎన్నాళ్లయిందో నిన్ను చూచి!..." అంటూ ఆప్యాయంగా తల్లి బుజ్జగిస్తూ పలికితే, తను గంగా యమునా సరస్వతు లీదుకుంటూ వొడ్డు చేరుకుని, స్వర్గానికి నిచ్చెనకట్టి , గంధర్వగానంతో అప్సరసలు నృత్యం చేస్తున్న ఇంద్రసభలో జారిబడ్డట్టు మురిసిపోడూ మరి! 


ఏమిటో!


రాత్రింబవళ్ళూ కవిత్వం రాసే పిచ్చితో ఇలాంటి వూహలే. రైల్లో కూర్చున్నా! 


తెల్లగా 'ధగ' 'ధగ'లాడే గడ్డం, లాల్చీ, ధోవతీ- 'ఫట్టు 'మని పరాయి వాళ్ళు చూస్తే, విశ్వకవి టాగూరు గారి వేలువిడిచిన తమ్ముడిలా కనిపిస్తాడు పానకాల్రావ్! 


పత్రికలో పని చేస్తున్నాడు. సబ్ ఎడిటర్. "క్షణం తీరిక లేదు. దమ్మిడీ ఆదాయం లేదు" అంటుంటాడు పదే పదే . అయినా చేసే పనిలో మామిడికాయ రసం తాగుతున్నట్లు సంతృప్తి కనబడడంతో, “మనసు గుర్రం' కళ్ళాలింకా చేజారి పోలేదు! 


ఎన్నాళ్ళ నుంచో " అమ్మ"ను చూడాలనుకుంటూ, ఢిల్లీ నుంచి బెజవాడకు పోయే విమానాలవీ, రైళ్ళ "టైమ్ టేబుల్స్" రోజూ తన పత్రికలో అచ్చవుతుంటే బట్టీ పెట్టడం తప్ప. పని కల్పించుకుని టిక్కెట్టుకొని బెబవాడ వైపు ప్రస్థానం  చేసే ఘడియలిల్లా తల్లి అనారోగ్యంతో తన్ను పీక్కుతినబోతున్నాయని అతను కలగన లేదెప్పుడూ...


"ధన్ ధనాటకకా.." 


రెండవ తరగతి పెట్టె కిక్కిరిసి, నిండు  చూలాల్లా కదలలేక కదులుతున్నట్టు తూలుతోంది. అర్థ నిద్రతో వున్మీలితమైన కొందరు ప్రయాణీకుల కళ్ళల్లో రైలు....


ఈ మధ్య టీ. పీ. జోరుకదా! ఆదివార మొస్తే "మహాభారతం” తప్పదందులో కొందరు ప్రయాణీక ప్రేక్షకులకు! కానీ రైల్లో ఎల్లా?! 


సొంత జీవితపు "భారతం"లోని వొడుదుడుకులు మరిచిపోవడానికి "మహా భారతం" పుస్తకం చదువు కుంటున్నాడు పానకాల్రావు... 


అనుకోకుండా వచ్చిన ప్రయాణం గనక "అన్ రిజర్వుడు" పెట్టెలో ఎలాగో కాళ్ళు ముడుచుకుని కాలక్షేపం చేస్తున్నాడు. 


బెజవాడ రావాలి. స్టేషన్లో మామయ్య కనపడి "అమ్మకేం ప్రమాదం

లేదులే, భయపడకు పానకాలూ" అనాలి.... "


నజాయతే మ్రియతేవా కదా చిన్నాయంభూత్వా

భవితా వాసభూ యా ః..." 


భగవద్గీత" పేజీలు తిరుగుతున్నాయి.....


"వాట్ ఎ రాటెన్ రష్?” సూటూ బూటూ, 'ఫెదర్' హ్యాటూ, చేతిలో ఎ.ఐ.పి. ఫాన్సీ బ్యాగూ, అర్థరాత్రయినా 'ఆరంజీ కలర్' కూలింగ్ గ్లాసులూ.... మిగలక మిగలక మిగిలిన అర ఇంచీ ఖాళీ స్థలం వైపు పానకాల్రావును "జరగమ"ని "ఫారిన్ జంటిల్మన్" ఠీవితో సంజ్ఞ చేస్తూ, ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునే లోపలే బిత్తర చూపులు చూస్తున్న పానకాల్రావు పక్కన "దఢీలున" కూర్చుండి పోయాడొక   ఆగంతకుడు!! 


సంగీత సాహిత్యా లెవరినైనా మనస్కుల్ని శాంతింప  చేస్తాయేమో! హఠాత్తుగా జరిగిన అన్యాయానికి బాధపడుతూ కూడా నెమ్మదస్థుడైన పానకాల్రావు "ఏమనాలో" తెలీకుండానే"నమస్తే" అనేసి. ఇంకొంచెం జరిగి కూర్చున్నాడా పెద్ద మనిషి “వసతి" కోసం!


"అతిథి దేవో భవా!"


ఇది మన భారతీయుల నిండుతనం! 


" ఎందాకా?" తన పై వుద్యోగస్తుడిలా ప్రశ్నించాడా పెద్దమనిషి!


"బెజవాడ."


"ఇంకేం. నేను బెజవాడే. ఎప్పుడూ విమానంలో తప్ప ప్రయాణం చేయలేదు. అమెరికా నుంచి మేం దిగి నాల్గు రోజులైనా కాలా. అబ్బ! ఇలాంటి చెత్త రైళ్ళల్లో మీరెలా ప్రయాణం చేస్తారర్రా! ఇట్ ఈజ్ ఎ షేమ్! మా వూళ్ళో ఇంట్లో కన్నా రైల్లోనే కమ్మటి  నిద్దరొస్తుంది! వాషింగ్టన్ లో  పడుకుంటే న్యూయార్క్ లో బెహరా వొచ్చి కాఫీ యిచ్చి లేపిందాకా మూసిన కన్ను తెరవపన్లా ! .... అది సరేగాని, ఏమిటా పుస్తకం?"


" మహా భారతం."


పానకాలావు కయోమయంగా వుంది. అయినా ఈయన లెక్చర్లు వింటూ ఎలాగోలా రాత్రి గడిచి కొంప జేరుకొంటే కొంత ఆదుర్దా తగ్గుతుందేమో! మరి వేరే గత్యంతరం?


"మీకు థ్రిల్స్ కావాలంటే “మహా భారతం" చదివేం లాభమండీ! ఇదిగో "గాన్ విత్ ది విండ్" నేను ముఫ్ఫయ్యొకటో సారి చదువుతున్నా. మనం బెజవాడ చేరే లోపల మళ్ళీ చదువడం పూర్తయితే మీకిస్తా లేండి... అయినా యీ రైళ్ళల్లో ఫ్యాన్లు బాగు చేసే నాథుడే లేడాండీ! ఇక్కడ గాలిరాదు.  కిటికీ తెరవాలంటే సుత్తితో కొట్టినా బిగుసుకు పోయి కదలదు ! చూశారా ఆ "బల్బు"లన్నీ ఎలా పగిలి పోయాయో! వెనక పెట్టెలో బాత్రూమ్లో నీళ్ళబొట్టు లేదు. అందుకే ఇక్కడి కొచ్చా. మిమ్మల్ని ఇబ్బందిపెడుతూ - పాపం! మీ ఇండియా ఇంకా, స్టోన్

ఏజ్ కాలంలోనే నిద్రపోతున్నట్టుంది! ఇప్పుడు తెలుసా మీకు?" చంద్రలోక మేంటి "- "సూర్యలోక మేంటి " "అంగారక లోకమేంటే"- చివరకు "బ్రహ్మలోకం"లో కూడా చక్కర్లు కొట్టి , పొద్దున భూమి మీద "టీ" త్రాగి వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ భార్యాబిడ్డల్తో  బాతాఖానీ కొట్టడానికి రాత్రి భోజనాల వేళ కిల్లు చేరుకోగలం!! గణితమండీ! అంతా శుద్ధ గణితం మహిమంటే నమ్మండి! అదీ అమెరికా అంటే! అలాంటి లెక్కలు  తెలిసిన మహానుభావు డొక్కడైనా మీ వూళ్ళో పుట్టాడా చెప్పండి?


వొళ్ళు మండుకొస్తోంది ఆవేశంతో పానకాల్రావుకు. ఒక్కుమ్మడిగా లేచి "రామానుజం రామానుజం" అంటూ మన మేథమేటిక్స్ మేధావి పేరు తలుచుకుంటూ, పక్కవాడి పళ్ళు రాలేట్టు చంప చరుద్దామనుకున్నాడు... కానీ...


తనలో నివురుగప్పిన నిప్పులా. .   భూమిగర్భంలో బంగారంలో దాక్కున్న సాహిత్య సంస్కారమలా చేయనిస్తుందా! 


 వీడెవడు? మన భారతీయుడేనా? చూడ్డానికి మాత్రం అలాగే వున్నాడే! అదేమి ? పచ్చి తెలుగు మాట్లాడుతుంటే! ఎరువుకు తెచ్చుకున్న సూటూ బూట లాగేస్తే..  కళ్ళూ, కాళ్ళూ.. ముక్కూ. నోరూ- అన్నీ, మనలాగే వున్నాయి మరి! అయితే ఇంత "దర్జా వాగుతున్న పెద్దమనిషి తనతో  "రెండో తరగతి" (అదీ. అన్‌ రిజర్వ్ డ్‌!)లో దేని కిరుక్కున్నట్టు?!! 


పోనీ తనకెందుకీ గొడవంతా? తనకున్న దిగుళ్ళు చాలకనా! ఇలాంటి "బేవార్సు" వాళ్ళని పదిమంది వెతుక్కుపోతుంటే... 


అయినా, అతన్ని "బేవార్సు" వాడనుకోవడం తన పొరపాటే అయితే?!! 


తను మాత్రం విమానంలోనో, ఫస్ట్ క్లాస్ రైలు పెట్టెలోనో

ప్రయాణం చేయగల అర్హత లేనివాడా మరి! అనుకోకుండా తనూ యీ "గరీబీ " పెట్టి "గలీజు" లో కళ్ళు మూసుకుని కాలక్షేపం చెయ్యాల్సిరాలా?! 


అతనికీ, అలాంటి అవసర ప్రయాణం కాకతాళీయ న్యాయంగా తటస్పంచిందేమో .. పాపం!


నెమ్మదిగా అడిగాడు పానకాల్రావు " మీదసలే వూరండీ?"


" కొన్నాళ్ళు జపాన్లో వుండే వాళ్ళం. మా ఫ్యామిలీలో సగం మంది కెనడాలో పెద్ద పెద్ద పుద్యోగాల్లో హేమాహేమీల్లా  పని చేస్తున్నారు. నాకో రెండేళ్ళ క్రితం అమెరికాలో వరల్డ్ బ్యాంకులో కి ట్రాన్స్ఫర్ అయింది. మీ ఆంధ్రా గవర్నమెంటు వాళ్ళు "బీదల కోసం ఇళ్ళు కట్టించే పథకం" కింద మా దగ్గర నాలుగు మిలియన్ల డాలర్ల అప్పు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సందర్భంలోనే, మీటింగ్ కోసం బెజవాడ వెళ్తున్నా. "సీదా ప్లేన్ లేదు. రైలే తొందరగా చేరుతుందని ఎవరో చెప్పారు. అందుకూ యీ రభస!"


న్యాయంగానే వుందతని వుదంతం! కానీ తన అసలు ప్రశ్నకు జవాబు రాలేదింకా. "ఇతను స్వతః తెలుగువాడా, కాదా" అని. ఈ ధర్మసందేహం తీర్చుకుని తీరాలి... అనుకున్నాడు పానకాల్రావు .


"అవునండీ! రైల్లోనే  నయం. ఈ రోజుల్లో విమానాలైనా మనల్ని "టైమ్"కు అందించి చస్తాయి గనకనా... ఒక్క మాట .. మీరు తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళేనా?"


ఇంగ్లీషులో సమాధానమిచ్చాడాయన.


"యస్. బేసికల్తీ వుయ్ ఆర్ ఆంధ్రాస్, బట్ నౌ వుయ్ ఆర్ అమెరికన్ సిటిజన్స్".


ఏమైనా, అతనికీ విషయం మీద చర్చ రుచించినట్లు లేదని, అతని ముఖ కవళికలే చెబుతున్నాయ్! 


"ధనాధనా టక్ టకా ”


మేం మేం మాట్లాడుకుంటున్నా రైలుకేం బట్టింది! శరవేగంతో 'కాలం'లా పరుగెడూనే వుంటుందది! 


బెజవాడ సమీపిస్తున్న కొద్దీ  పానకాల్రావు  పక్క మనిపి దౌర్జన్యంగా  తన సగం సీటు లాక్కుని, వారి వింతలన్నీ ఏకరువు పెడుతూ, సోది కబుర్లు చెబుతున్న మాటే మరిచిపోయి తన కోసం పంచప్రాణాలు ధారబోసె  మాతృదేవతను గురించే "వదే పదే" ఆలోచిస్తూ, ఆమె ఆయురారోగ్యాల కోసం భగవంతుణ్ణి ప్రాధేయపడుతూ, మళ్లీ ప్రయాణ బడలికలో మగత నిద్ర ముంచెత్తుకొచ్చే లోపల, "మహాబారతం" లోంచి "భగవద్గీత" పేజీలు తిప్పడం మొదలెట్టాడు అటు కన్నతల్లి అనారోగ్యపు అశాంతికీ ఇటు యీ ఆగంతకుడి "మాతృదేశ విమర్శ "దాడికీ", "కృష్ణార్జున సంవాద' మే శరణ్యమని నమ్మిన పానకాల్రావు. 


ఇంతలో ఆయనన్నాడు "అవర్ డెస్టినేషన్ ఈజ్ నియరింగ్ . ఇంతలో బాత్రూమ్ కెళ్లొస్తా ; నా బ్యాగ్ లో  ఫారిన్ ఎక్చేంజి కొల్లలుగా వుంది. కాస్త జాగ్రత్తగా చూస్తుండండేం'' 


పానకాల్రావు కాశ్చర్యమేసింది. తలా తోకా తెలియని తన మీద ఎంత “భరోసా" ఈయనకు! " ఆ డబ్బు బ్యాగ్ లోపలికే తీసుకు పోదురూ" అందామనుకుంటున్న తన సమాదానం వినకుండానే జనాన్ని తోసుకుని బాత్రూంలో కెళ్లి పోయాడా

" పారెన్ రిటరన్ !"


నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః I

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 


ఇలా చదువుతూ, చదువుతూ ఎంత సేపైందో! 


మైమరచి బాహ్య ప్రపంచంతో సంబంధమే లేనట్టు గాఢమైన సుషుప్తిలోకి చొచ్చుకు పోయింది పానకాల్రావు మనస్సు . 


మధ్య మద్య ఎక్కేవాళ్లూ. దిగేవాళ్లూ "నీడ నీడ"గా కనబడుతున్నారంటే ఒకసారి టికెట్ కలెక్టరొచ్చి చెక్ చేసి పోతూ పోతూ టాగూర్ అందమైన గడ్డంతో, అపురూపమైన వదనారవిందంతో "మాంచి". పెద్దమనిషిలా  కనబడుతున్న పానకాలావు నడిగాడు కూడా " ఇక్కడెవరన్నా టిక్కెట్టు లేకుండా ఎక్కి మిమ్మల్ని అవస్థ పెట్టలేదు కదా సార్? అన్ రిజర్వుడు కంపార్టుమెంట్లలో  మాకు రోజూ ఇదే గొడవ కదా! అందుకే అడుగుతున్నా"


"ఎబ్బె! ఏం లేదండీ!" మాట వరసకనేశాడు పానకాల్రావు టిక్కెట్ కలెక్టర్ కు  ' థాంక్స్'  చెప్పి


 "ధన్ ధనా- టక్ టకా.." 


తెల్లవారుతోంది. ఈ స్టేషను గాక, ఇంకొక్కటి దాటితే బెజవాడ! 


 "ఇడ్లీ..  కాఫీ అరుపులు ! " ప్లాట్ ఫోరమ్ నిండా మోగుతున్నాయి.


తన ఎలాగో  వూగుతూ వూగుతూ, వోరబడి కాస్తో కూస్తో  నిద్రకు దిగి  లేచాడు పానకాల్రావు.  బాత్రూమ్ లో  గంటకు పైగా గడిపి, ముస్తాబై వచ్చిన పారిన్" పెద్దమనిషి' " బెజవాడ వచ్చేస్తోంది.  మీరూ బాత్రూమ్ వగైరా వెళ్లొచ్చి ప్రెష్ గా కూర్చోరాదూ?" 


ఆప్యాయంగా సొంత చుట్టంలా ఆయన అలా అంటే “వద్ద”న బుద్ధేయలేదు .  పయనమైనాడు పానకాల్రావు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. 


ఖండలయలోంచి ఆదితాళంలోకి దిగి, చివరకు తాళం తప్పినట్లు రైలు రొద ఆగింది నెమ్మది నెమ్మదిగా. 


"బెజవాడ వచ్చింది’' 


అమ్మను చూడాలి! మామయ్య నాకోసం వెతుకుతున్నాడేమో!" 


అసలు రైలాగినా ఆదుర్దాతో  పానకాల్రావ్ గుండెల్లో కొత్త కొత్త రైళ్లు పరుగెడుతున్నాయి! 


బాత్రూమ్ తలుపు తీసుకుని, దిగే జనాన్ని తోసుకుంటూ సొంత సీటు దగ్గర చేరేడు. 


తన పెట్టే, బెడ్డింగూ కూచున్న చోట శూన్యం! 


ఆ పారిన్ పెద్దమనిషి లేడక్కడ! 


పరిగెడుతున్న గుండెకాయ, ఒక్కసారిగా  కొట్టుకోడమే మానేసి నట్టయింది. 


సామాను పోతే పోయింది అమ్మకు తెచ్చిన మందులన్నీ, అందులో నే వున్నాయి! 


ఏం చేయడమో ఆలోచించే లోపల మామయ్య గొంతు వినిపించింది.


“పానకాలూ- పానకాలు-"


ఇద్దరూ. కొత్తగా పెళ్లయిన  భార్యాభర్తలు పడగ్గదిలో కౌగలించుకున్నట్లు  కౌగలించుకున్నారొక్కసారి! 


" మామా” అమ్మెలా వుంది? " 


"గండం తప్పిందోయ్! నీ కోసమే కలవరిస్తోంది .. పద ! కూలీని పిలుస్తా..  సామానేదీ?"


చావు కబురు చల్లగా చెప్పమంటారు. అయినా తల్లిని ప్రాణాలతో చూడగలుగుతున్నానన్న ఆశలో పానకాల్రావుకు సామాను పోయిన దుఃఖం కించిత్తు కూడా బాధపెట్టలేదా క్షణంలో . 


గొంతులోంచి చేదు కాకరకాయ కక్కేసినట్టు "దబా" "దబా" సామాను పోయిన వ్యవహారమంతా మామయ్యతో చెప్పేశాడు.


"ఆరి నీ తస్సదియ్యా!  పట్నాల్లో కాపురం జేస్తూ ఆమాత్రం జాగ్రత్త లేకపోతే యెల్లాగోయ్! రైలు కదిలే లోపల త్వరగా .. పదమరి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ మనవాడే. గోపాలంగారు.... నడూ ! చెప్పిచూదాం! " ఇంకాయేమేమిటో అంటున్నాడు మామయ్య. 


ఈ లోపల కిందటె  స్టేషన్లో అవతరించిన “టక్కెట్ కలెక్ట"రే, మన "ఫారిన్ గెస్టు" నొక పోలీసు బంట్రోతుతో సహా నెట్టించుకొస్తూ, వీళ్ళ పెట్టి దగ్గరికి చేరుకున్నాడు!


"ఏమండీ! ఈయన టిక్కెట్టు మీ దగ్గరుందా? " 


"అదేమిటీ? ఆయన టిక్కెట్టు నా  దగ్గరెందుకుంటుందండీ?!


"అయితే ఆయన మీ "బావమరిది" కాడా మరి?" .


మామయ్య, పానకాల్రావు దిగాలుపడి చూస్తున్నారు! 


వరల్డ్ బ్యాంకు మెంబరు గారి ముఖాన కత్తి వేస్తే నెత్తురు చుక్క లేదు. 


"ఈ కొత్త బావమరి దెక్కడ దాపరించాడో" అని మామయ్య నిర్ఘాంతపోతున్నాడు! .


అప్పుడు అన్నాడు పోలీసు బంట్రోతు "మరి అతని చేతిలోని యీ పెట్టి మీది మీ చిరునామా.. మీ వుద్యోగ వివరాలూ, పేరూ వూరూ, అన్నీ అతనికి ఎంతో పరిచయంలా, గోపాలంగార్ని నమ్మించేశాడండీ! ఆ వొక్క  టిక్కెట్ట ముక్క చేతిలో లేకపోబట్టి గోపాలంగారి కనుమాన మొచ్చి. . సరిగ్గా యీయన గేటు దాటేసుకుంటున్న సమయానికి లంకించుకుని, వాకబు చెయ్యమని మమ్మల్నిలా పంపారండీ!"


"ఓరి భగవంతుడా నా పెట్టా, బేడా పాకుండా రక్షించడమే కాకుండా నాకొక కొత్త ' ఆప్తబంధువు ' ను  కూడా సృష్టించావు గదరా! ప్యాన్ లు పని చేయని, బల్పులు పగిలి, కిటికీలు

బిగుసుకుపోయిన భారతదేశపు రైళ్లల్లో హిమాలయాల నుంచి కన్యాకుమారి ప్రతిక్షణం వేలాది భారతీయులు దైనందిన కృత్యాల్లో ముగ్ధులై ప్రయాణం చేస్తూనే వుంటారు.  అవి మన కోసం- మనం వాటి కోసం జీవిస్తూనే కాలం గడుస్తుంది. 


అయితే వాటిల్లోనే, "అమెరికా, ఇంగ్లండు" వగైరాలూ, "అంగారక గ్రహం"- "బ్రహ్మలోకం" వగైరాలూ, చక్కర్లు కొట్టి ఎప్పుడోప్పుడు  తిరిగొచ్చే సమయానికి టికెట్ లెస్  ట్రావెల్ కోసం శ్రీకృష్ణ జన్మసానం పోబోతూ, మన మన "బావమరుదు" లయ్యే సదవకాశం, ఎంత మందికి దక్కుతుందో మరి! '' అనుకుంటూ “దేశపు అమ్మనూ", "కడుపున కన్నతల్లినీ"- ఇద్దర్నీ తలుచుకుంటూ, మధ్య మధ్య తన విచిత్ర ప్రయాణపు కబుర్లతో సతమత మవుతూ, మామయ్యతో సహా గుర్రబ్బండెక్కాడు పానకాల్రావ్. 

***

- ఏల్చూరి విజయరాఘవరావు 


( ఆంధ్రసచిత్రవారపత్రిక - 31-8-1990 ) 

సేకరణ : 

కర్లపాలెం హనుమంతరావు 

27-12-2021 

బోథెల్; యూఎస్ ఎ 






కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...