Showing posts with label Chaild. Show all posts
Showing posts with label Chaild. Show all posts

Sunday, December 12, 2021

చిన్నపిల్లల కోసం : శాస్త్రం - వ్యవహారం - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

ఒక ఊరికి నలుగురు ఉద్దండులు వెళ్ళారు - ఆ ఊరి మోతుబరిని  మెప్పించి, పారితోషికాలను పొందాలనే ఆశతో.

తిన్నగా ఆ ఊరి సత్రపు యజమానిదగ్గరకు వెళ్ళి తమకు బస, భోజన సౌకర్యం వగైరా ఇవ్వమని అడిగారు. వారి మాటల్లో స్వోత్కర్షగా మాట్లాడడం, కొంత అహంకారం వంటివి కనిపించాయి ఆ సత్రపు నిర్వాహకుడికి. అంతేగాక, వాళ్ళలో ‘ముఖ్యమైనదేదో’ తక్కువ అనిపించింది కూడా!  అందుకని ఆయన వాళ్ళకు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు.


“అయ్యా! చిన్న ఇబ్బంది కలిగింది. బసకి ఏమీ ఇబ్బంది లేదుగానీ, మీకు భోజనాలు వండడానికీ, వడ్డించడానికీ సిబ్బంది లేరు. కాబట్టి, కావలసిన డబ్బు ఇస్తాను గానీ మీరే వండుకోవలసి ఉంటుంది.

మీరు తలకొక పని చేసుకుని, ఈ రోజుకి గడిపేయాలి” అన్నాడాయన.

"సరే" అన్నారు వీళ్ళు.


ఆయన ఒప్పజెప్పిన పనులు:


తార్కికుడు (logician) ఊరిలోకి పోయి నేయి తీసుకురావడం. 

వైయాకరణి (grammarian) మజ్జిగ కొనడం. 

జ్యోతిష్యుడు (astrologer) - విస్తరాకులకోసం చెట్టెక్కి, వాటిని కోసుకొచ్చి, తరవాత పుల్లలతో కుట్టడం. 

గాయకుడు (singer) - అన్నం వండడం. 


వీరందరూ అక్కడికి వెళ్ళినది 10 గంటలకు. 

‘2 గంటలయేసరికి మీ భోజనాలన్నీ అయిపోయి, కాస్త విశ్రమించవచ్చు’ అన్నాడతను వాళ్ళతో.


సరేనని వీరందరూ తలొక వైపుకు  బయలుదేరారు.


తార్కికుడు  నెయ్యి కొన్నాడు. సత్రానికొచ్చే దారిలో ఆయనకు ఒక అనుమానం వచ్చింది - ‘చెంబుకు నేయి ఆధారమా? నేతికి చెంబు ఆధారమా?’ అని (ఏది ఆధారం? ఏది ఆధేయం?). బాగా ఆలోచించినా సమాధానం దొరకలేదు! ‘పోనీ ఒంపి చూస్తే సరి!’ అనుకుని చెంబును తలకిందులు  చేశాడు. సమాధానం దొరికిందిగానీ, నేయి నేలపాలైంది.  ఏం చేయాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ అక్కడే చతికిలబడ్డాడు! 


ఇక వైయాకరణి - ఎందరో గొల్ల స్త్రీలు మజ్జిగను అమ్ముకుంటూ ఆయనకెదురుగా పోతున్నారు. “చల్ల” అని దంత్య చకారాన్ని ఎవరూ పలకటంలేదు . ప్రతీ స్త్రీ కూడా “సల్ల” అనే భ్రష్టరూపాన్నే పలుకుతోంది! ఆయనకు చాలా కోపం వచ్చింది. ‘ఔరా! ఈ ఊరిలో ఈ అపభ్రంశపు శబ్దాలను వినలేకపోతున్నాను. సరియైన ఉచ్ఛారణ పలికే మనిషి దొరికేవరకూ నేను మజ్జిగను కొనను' అని భీష్మించుకుని ఒకచోట కూర్చుండిపోయాడు!


ఇక జ్యోతిష్యుడి సంగతి:

ఊరి చివర్లో ఉన్న ఒక మోదుగచెట్టునెక్కి, ఆకులను కోసుకుని, కిందకు  దిగబోతోంటే ఒక తొండ కనిపించిందాయనకు. ఏవో లెక్కలు వేసుకుని చూస్తే, అది దుశ్శకునమనీ, అది అక్కడే ఉంటే గనుక మరొక 4 గంటలవరకూ  చెట్టు  దిగడం దోషమని నిర్ణయించుకున్నాడు! ఆ తొండ ఈయనను  చూచి బెదిరిందో, ఏమో - అది అక్కడ, ఈయన పైన ఉండిపోయారు!


ఇక, గాయకసార్వభౌముడి విషయానికొస్తే - ఆయన ఎసట్లో బియ్యం పెట్టాడు. కుండలోని నీళ్ళు మరుగుతున్నాయి. ఆవిరికి మూత పైకీ క్రిందకీ పడిలేస్తోంది. ఈయన తాళం వేయసాగాడు . ఆదితాళం- ఉహూఁ, రూపక- ఉహూఁ, జంప-   ఉహూఁ --- ఏ తాళానికీ రావట్లేదు. అశాస్త్రీయమైన ఆ తాళానికి విసుగొచ్చి, ఆయన ఆ కుండమీద ఒక రాతిని విసిరేశాడు! ఇంకేముంది! అన్నం నేలపాలయింది. మరి ఈయన వంటగదిలోనే!


వీరందరూ ఏవో అవకతవకలు చేస్తారని ముందే ఊహించిన సత్రపు నిర్వాహకుడు. కొందరు మనుషులను పంపి, ఎక్కడెక్కడో చతికిలబడ్డ వారినందరినీ ఒకచోటికి చేర్చాడు.


'నాయనలారా! మీకందరికీ ఎప్పుడో వంటలు చేయించే ఉంచాను, భోజనాలకు లేవండి. 

దయచేసి నా మాటలు రెండు వినండి. మీరు మీ  శాస్త్రాలలో గొప్పవాళ్ళే అయుండచ్చు. కానీ మరొకరిని తక్కువచేసే విధంగా ఉండకూడదు మీ శాస్త్రజ్ఞానం వల్ల కలిగిన అహంభావం . మరొకటేమిటో మీకు చెప్పనక్కరలేదనుకుంటా. శాస్త్రజ్ఞానం ఒక్కటే  చాలదు జీవితంలో. దానితోపాటు కొంత వ్యవహారజ్ఞానం కూడా ఉండకపోతే కష్టమని మీకు మీరే నిరూపించుకున్నారు కదా!' అని వాళ్ళను సున్నితంగానే మందలించాడు.

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

18 -09- 2021 

( ఎప్పుడో.. ఎక్కడో  విన్న కథ) 

బోథెల్ ; యూ . ఎస్.ఎ 

Wednesday, December 8, 2021

చలం రాసిన బాలల గేయం ఆహ్వానము

 



చలం రాసిన బాలల గేయం 

ఆహ్వానము


రచన: చలం; దీక్షితులు

( చందమామ - మాసపత్రిక - జూలై, 1947 సంచిక 1 

- సేకరణ: కర్లపాలెం హనుమంతరావు 



చందమామా రావే, జాబిల్లి రావే 

రైలెక్కి రావే, రష్యాకధలు తేవే 

ఇంజనెక్కి రావే, ఇంగ్లీషు కధలు తేవే 

బస్సెక్కి రావే, బాంగ్లా కధలు తేవే 

కారెక్కి రావే, కాంమ్రేడ్ కధలు తేవే 

హారన్ ఊత్తూ రావే, ఆకలికధలు తేవే 

కొండెక్కి రావే, కోటివేలు తేవే 

ఒలిచిన చోకలేట్లు ఒళ్లో పెట్టుకొని 

కరిగిన ఐస్క్రీం చేత్తో పట్టుకొని 

అలా అలా అలా వచ్చి, 

మా తెలుగుపిల్లల తీపి నోట్లో పోసిపోవే.


రచన: చలం; దీక్షితులు

( చందమామ - మాసపత్రిక - జూలై, 1947 సంచిక 1 

- సేకరణ: కర్లపాలెం హనుమంతరావు 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...