Showing posts with label su. Show all posts
Showing posts with label su. Show all posts

Monday, December 13, 2021

వ్యాసం స్వామి వివేకానంద -రచన - కర్లపాలెం హనువుంతరావు ( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ )



వ్యాసం 

స్వామి వివేకానంద 

 -రచన - కర్లపాలెం హనువుంతరావు 

( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ ) 



స్వామి వివేకానంద డాంబిక ప్రదర్శన లేని విరాగి.  ప్రాపంచిక విషయాల తరహాలోనే రాజకీయ వ్యవహారాలనే తామరాకు పైన   తనను  తాను ఓ నీటి బిందువుగా భావించుకున్న ఆధునిక యోగి.  ఆ పరివ్రాజకుడికి ఆ అంటీ ముట్టనితనం   సాధ్యమయిందా?  పరిశీలిద్దాం. 

తన జీవితకాలంలో ఎన్నడూ రాజకీయరంగం దిశగా స్వామి అడుగులు పడిన సూచనలు కనిపించవు.  ఏ రాజకీయ పక్షానికీ ఆయన మద్దతు లభించిన  దాఖలాలూ దొరకవు. తన స్వంత  పరివ్రాజక సంస్థలోనూ రాజకీయరంగ ప్రస్తక్తిని నిషేధించిన స్వామీజీ.. ఆ నిబంధనను అధిగమించినవాళ్లని సభ్యత్వం నుంచి తొలగించేందుకైనా సందేహించినట్లు కనిపించదు. రామకృష్ణ మిషన్ నుంచి నివేదిత రాజకీయ సంబంధిత  కారణాల  వల్ల వైదొలగినప్పటి బట్టి స్వామీజీలో ఈ రాజకీయ విముఖత మరింత కరుడుగట్టినట్లు  భావిస్తారు. వివేకానందుడు నివేదితకు పరివ్రాజక సంఘంలో సభ్యత్వం నిరాకరించడం  ఈ సందర్భంగా గమనించవలసిన ముఖ్యాంశం.  

మనిషి పట్ల స్వామికి ఉండే ప్రేమ, సానుభూతి అపారమైనవి. అయినా సందర్భం వచ్చిన ప్రతీసారీ  వివేకానందుడు రాజకీయాల పట్ల తనకున్న విముఖతను నిర్మొహమాటంగా బైటపెట్టేవారు. స్వామి దృష్టిలో రాజకీయాలు మనిషిని సంకుచిత మార్గంలోకి మళ్లించేవి. రాజకీయం మిషతో ఎదుటి మనిషిని పీడించడమే కాదు, తనను గూర్చి తాను  డాంబికంగా  ఊహించుకునే మానసిక రుగ్మత మొదలవుతుందన్నది  వివేకానందుడి నిరసన వెనక ఉన్న భావన. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ప్రహసనాలు చూస్తున్నప్పుడు వివేకానందుడి నాటి ఊహలో వీసమెత్తైనా అసత్యం లేదనే అనిపిస్తుంది.  

స్వామి దృష్టిలో ఈ దేశం పుణ్యభూమి. ఇక్కడి అణువణువు అత్యంత పవిత్రమైనది.  రుషులు,  జాతి వివక్షతకు తావీయని పద్ధతుల్లో  సర్వ మానవాళికి  ఉచితంగా  ఆధ్యాత్మిక జ్ఞానసంపదను పంచిపెట్టారు. వారి అనుయాయులదీ అదే సన్మార్గం. భారతీయుల  మానవతావాదం యావత్ ప్రపంచం దృష్టిలో గౌరవనీయమైన స్థానం సాధించుకునేందుకు ఇదే ముఖ్య కారణం. సర్వశ్రేష్టమైన మానవత్వం పట్ల   భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతి కనబరచిన శ్రద్ధాసక్తులు  ప్రపంచం దృష్టికి తేవడమే లక్ష్యంగా చికాగో సర్వమత మహాసభ తాలూకు   వివేకానందుడి తొలి  ప్రసంగం సాగింది కూడా. 

 ప్రపంచం భారతీయ సంస్కృతి ఔన్నత్యం గూర్చి చర్చించడానికి భారతీయులు కేవలం భారతీయుల మాదిరిగానే ఉండి తీరాలని స్వామి ప్రగాఢంగా విశ్వసించారు. కేవలం ఆ కారణం చేతనే మరే ఇతర దేశమో, సంస్కృతో మన దేశం మీదనో,  సంస్కృతి మీదనో పెత్తనం చెలాయించే అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, చెత్త రాజకీయాల ద్వారా  జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వివేకానందుడు తీవ్రంగా అసహం వ్యక్తపరిచింది.  

ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయుల పుణ్యభూమి పై పరాయివారి పాలన కొనసాగకూడదన్నదే స్వామి ప్రగాఢ కాంక్ష. ఆ చింతనాపరుడి ఆలోచనల నుంచి రగిలిన దేశభక్తి భావనలే అప్పటి ఈ దేశపు యువతను తెల్లవారి పాలనకు ఎదురు నిలిచే దిశగా ప్రోత్సహించింది. స్వీయ వ్యక్తిత్వ వికాస నిర్మాణం దిశగా ధ్యాస పెట్టేందుకూ దోహదించిన భావజాలం వివేకానందునిది. ఆ పరివ్రాజకుడి ప్రబోధాల ప్రభావమే మరణానంతరమూ  బ్రిటిష్ దొరల దృష్టిలో స్వామిని  విప్లవకారుడి కింద ముద్ర వేయించింది. 

నైతిక పతనం వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం  సాధ్యం  కాదు. రాజకీయాలదే మనిషి పతనానికి చాలా వరకు ప్రధాన బాధ్యత- అన్నది రాజకీయాలపై వివేకానందుని తిరుగులేని సూత్రీకరణ. 'చట్టం, ప్రభుత్వం, రాజకీయాలు మాత్రమే సర్వస్వం కాదు. అవి కేవలం మనిషి జీవన పరిణామ క్రమంలో కొన్ని దశలు మాత్రమే. మానుషత్వ సాధన ఆయా రంగాల ఊహకైనా అందనంత ఎత్తులో ఉంటాయన్న'ది  వివేకానందుడి ఆలోచన. మనిషి అంతరంగ పరంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన నీతి నిజాయితీల  పట్ల రాజకీయాలకు ఎప్పుడూ బొత్తిగా ఆసక్తి ఉండదు’ అన్నది వివేకానందుడి ఫిర్యాదు. కులం, మతం, వర్గం -ఇత్యాదుల పరంగా ప్రజావళిని  విభజనకు గురి చేసే రాజకీయాలు ఈ దేశాన్ని పట్టి వదలకుండా పీడిస్తున్న ప్రధాన రుగ్మతలుగా స్వామి ఆనాడే గుర్తించి గర్హించారు. రెండో ప్రాధాన్యంగా ఉండవలసిన ‘గుడి- మసీదు- చర్చి’ రాజకీయాలు మొదటి స్థానం ఆక్రమించడం స్వామీజీకి బొత్తిగా  గిట్టేది కాదు. మానుషత్వం సంకుచితమయిపోతూ, దేవుళ్లూ దయ్యాలనే భావనల పట్ల వెర్రితనం ప్రబలిపోవడం మనిషికి, మనిషికి మధ్య పూడ్చలేని అగాథాలను సృష్టికేనన్నది ఆయన భావన. రాజకీయక్షేత్ర అనైతిక క్రీడల పట్ల స్వామీజీ క్రుద్ధుడు కాని క్షణం లేదు. 'ఉన్న పరిమిత అనుభవంతో నేను సేకరించిన జ్ఞానం నాకు బోధిస్తున్నది ఏమిటంటే.. మతం మీద మనం ప్రదర్శించే విముఖత్వానికి  మతం అసలు కారణమే కాదు. మనిషిలోని విద్వేషగుణానికి మతాన్ని తప్పు పట్టి ప్రయోజనంలేదు. ఏ మతమూ మనిషిని నిట్టనిలువుగా తగలవేయమని చెప్పదు; సాటి మనిషిని పీడించమనీ రెచ్చగొట్టదు. ఆ తరహా  దుష్కృత్యాలు చెయ్యమని మనిషి మీద వత్తిడి చేసేందుకుగాను మతం పుట్టలేదు. అంతులేని అమానుష కార్యాలన్నిటికి మనిషిని  ప్రేరేపిస్తున్నవి నిజానికి జుగుప్సాకరమైన రాజకీయాలే. కానీ,  ఆ తరహా  అవాంఛనీయ రాజకీయాలనే నిజమైన మతమని జనం నమ్ముతున్నారిప్పుడు! ఈ విషాదకర పరిణామాలకు బాధ్యులెవరో గ్రహించినప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించేది' అన్నారో సందర్భంలో స్వామి వివేకానంద మతానికి రాజకీయాలకు మధ్య గల అపవిత్ర సంబంధాలను ఎండగడుతూ.  

మతం అసలైన పరిమళం ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసి దుష్కృత్యాల మీద ధ్యాస పెట్టడు. పరులకు దుఃఖం కలిగే చర్యలు చేపట్టడు.  స్వానుభవం నుంచి వెలికి తీసిన వెన్నముద్దల వంటి సూక్తులు పంచిపెట్టే ఒక సందర్భంలో స్వామి వివేకానందుడు 'మనిషి మేధస్సు చేయదగిన అత్యుత్తమైన ఆరోగ్యకరమైన దారుఢ్య సాధన.. స్వచ్ఛమైన అంతరంగంతో మతాన్ని అనుసరించడం మాత్రమే' అని హితవిచ్చారు.  

జంతువు, మనిషి, దేవుడు- ఈ ముగ్గురికి  ముఖ్య ప్రవృత్తుల సంగమమే మనిషి. అతనిలో అంతుబట్టకుండా దాగి  ఉండి అంతర్గతంగా చెలరేగే రాగద్వేషాల వంటి దుర్లక్షణాలను అణచివేయడం ద్వారా పశుప్రవృత్తిని సాధ్యమైన మేరకు కుదించి మనిషిలో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని తట్టిలేపడమే 'మతం' అసలు లక్ష్యం. 'కాబట్టే  దేశానికి ఒక రాజ్యాంగం ఎంత అవసరమో, మనిషికి మతమూ అంతే అవసరం' అని వివేకానందుడు భావించింది. ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు వంటి విద్వేష భావనలకు మాత్రమే ఆలవాలమైన రాజకీయాలు సర్వమానవళి పట్ల సరిసమానమైన ప్రేమాభిమానాలను పంచవలసిన మనిషికి మేలు చేయవని స్వామి గట్టిగా నమ్మారు. ప్రతికూల దృక్పథ రాజకీయాలతో ప్రపంచమంతా పొంగి పొర్లిపోతున్న సన్నివేశాల మధ్య జీవిస్తున్న స్వామి పౌరుల మనసులు దుర్మార్గమైన ఆలోచనలతో కలుషితం కాక  ముందే, వారి మెదళ్లను అందుకే ఉదాత్తమైన ఆధ్యాత్మిక భావనలతో ముంచెత్తెయ్యాలని  అనుక్షణం ఆరాటపడిపోయింది.  

యూరోపియన్ మేధావుల సదస్సులో ఉటంకించిన భావాలను పునరాలోచిస్తే వివేకానందుడికి భారతీయ సోషలిజమ్ పట్ల ఎంత  చక్కని  అవగాహన ఉందో అర్థమవుతుంది. 'భారతదేశంలోనూ సోషలిజమ్ ఉంది. కానీ  అదీ యూరోపియన్ తరహా ద్వంద్వ విధానం కన్నా విభిన్నంగా ఉంటుంది. అద్వైతమనే అఖండ జ్యోతుల వెలుగుల్లో కళాకాంతులీనే సాంఘిక వ్యవస్థ మాది. యూరప్ లో ప్రాచుర్యంలో ఉన్న సోషలిజమ్ భావనలో మాత్రమే ఆర్థిక సోషలిజమ్. అర్థికపరమైన  కోణంలో చూడడమే అందులోని ప్రధాన  లోపం. బైటకు  వ్యక్తివాదానికి చోటిచ్చే వ్యవస్థగానే  కనిపించినప్పటికీ,  వాస్తవానికి అది వ్యక్తిలోనే నిత్యం సంఘర్షించే రెండు పరస్పర విరుద్ధమైన శక్తుల(మనసు, మెదడు)ను పరిగణలోకి తీసుకునేపాటి శ్రద్ధ చూపించలేదు’ అని స్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాట. మార్క్సిజమ్ ఒక  రాజకీయ భావజాలంగా యూరప్ నంతటా ముంచెత్తుతున్న దశలో, దాని తాకిడి హిందూదేశపు ఎల్లలలను కూడా తాకుతున్న నేపథ్యంలొ వివేకానందుడు నిర్భీతిగా వెల్లడించిన మనసులోని మాటలు ఇవి. ఆ నాటి రాజకీయ యుగసంధిలోని పరిణామాలన్నింటిని బాగా ఆకళింపు చేసుకున్న ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టే వివేకానందుడు సోషలిజమ్, మార్క్సిజమ్ వంటి సాంఘిక చైతన్య భావజాలాలలోని  'సామాన్యుణ్ణి ఉద్ధరించే లక్ష్యం'  వైపుకు ఆకర్షితుడై తనను తాను ఒక 'ఆధ్యాత్మిక సోషలిష్టు'గా ప్రకటించుకున్నాడు. ఒక పరివ్రాజకుడు సోషలిజమ్ పట్ల ఆకర్షితుడవడం వరకు నిజంగా ఒక అద్భుత సన్నివేశమే! కాని ఆ పోలిక అక్కడి వరకే సరి.

సోషలిజమ్ లోని శ్రామిక పక్షపాతం స్వామిని బాగా ఆకర్షించిన సద్గుణాలలో ఒకటే కానీ, అదే సమయంలో పీడితుని బాధా విముక్తికై సోషలిజమ్ సూచించిన మార్గమే సమగ్రమైనదిగా భావించడానికి ఆయన సమ్మతించలేదని కూడా గమనించడం ముఖ్యం. సోషలిజమ్ భావనను ఆయన 'సగం ఉడికిన ఆహారం'గా భావించారు.  

అంతర్గతంగా దాగిన లోపాల వల్ల ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే  శక్తి సోషలిజానికి చాలదన్న భావన వివేకానందుడిలో ఉంది.  సోషలిజమ్ ప్రవచించే మేధావుల మధ్య గల అభిప్రాయ భేదాలనూ ఆయన గుర్తించకపోలేదు.

 సోషలిజమ్ అన్న భావన ఆధునిక ప్రపంచానికి సైంట్ సైమన్ (1760 -1825), ఫ్యూరర్ (1772 -1832), రాబర్డ్ ఓవెన్ (1804 -1892) ద్వారా పరిచయం చేయబడింది.  త్రిమూర్తుల ద్వారా ప్రవచితమైన ఈ సామాజిక సూత్రాలు  ఎవరి వల్లా నమ్మదగిన స్థాయిలో సవ్యంగా నిర్వచించబడలేదన్నది ఒక ఫిర్యాదు. 'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం, ఎవరి అవసరాన్ని బట్టి వారికి దక్కవలసిన భాగం' అన్నది మార్క్స్ భావజాలమయితే,  విభేదించిన లెనిన్ మహాశయుడు దాని స్థానే  'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం.. ఎవరికి శ్రమను బట్టి వారికి దక్కవలసిన భాగం' అని కొత్త నిర్వచనం వెలువరించాడు. బెర్నార్డ్ షా ఆ ఇద్దరినీ ఖండిస్తూ ' సోషలిజమ్ మీద స్వామీజీ  చేసిన అధ్యయనమే సరళంగా, సవ్యంగా, సూటిగా సాగింద'ని  కితాబిచ్చాడు.  పారిశ్రామిక దేశాలు కాకపోయినప్పటికీ రష్యా, చైనాలలో కమ్యూనిస్టు విఫ్లవాలు చెలరేగడమే స్వామి పరిశీలనలోని సంబద్ధతకు నిదర్శనం' అని జి.బి.షా భాష్యం. 1897 సంవత్సరంలోనే  'మరో అర్థ శతాబ్దానికి భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధిస్తుంద'ని స్వామి చెప్పిన జోస్యం సత్యం కావడం బట్టి  ఆయన పరిశీలనలోని బుద్ధినైశిత్యం వెల్లడవుతుంది. ఆ రోజుల్లో అసంభవమనిపించిన భారతదేశ స్వాతంత్ర్య హోదా స్వామి చెప్పిన విధంగానే సరిగ్గా 1947లో సాకారం కావడం మిడతంభొట్టు జోస్యమైతే కాదు గదా! నిశిత పరిశీలనా ప్రజ్ఞ గల ఘటికులే ఈ విధమైన నిర్దుష్ట ప్రతిపాదనలు ధైర్యంగా ముందుకు తెచ్చి ‘ఔరా!’ అనిపించుకోగలిగేది. 

స్వామి ప్రస్థానించిన 1902 కి అర్థ శతాబ్ది తరువాత భూగోళ   రాజకీయం పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అధికారం కోసం, అర్హతలతో నిమిత్తంలేని పెత్తనాల కోసం ప్రపంచదేశాలు  ప్రదర్శించే అత్యంత హీనమైన దౌర్జన్య రాజకీయరంగాలు ప్రపంచాన్ని పేలబోయే అగ్నిగుండంగా  మార్చేసాయన్న మాట నిజం. 

 సామ్రాజ్యవాదం, జాతీయవాదం, ఉగ్రవాదాలకు తోడు నియంతృత్వ పోకడలు ప్రబలి నేరాలకు, మూకుమ్మడి హత్యలకు అణచివేతలకు అంతమనేది లేకుండా కొనసాగుతున్నది ప్రపంచ రాజకీయమంతా.  రెండు సోషలిష్టు విప్లవాలు బలిగొన్న రక్తపాతం ఎంతో లెక్కలు అందనంత గాఢమైనది.  రెండు ప్రపంచయుద్ధాలు, అణుబాంబు విస్ఫోటాలు, ట్రేడ్ సెంటర్ దాడి వంటి దుర్ఘటనల వల్ల మానవత్వానికి జరిగిన చెరుపుకు  లెక్కలు కట్టడం ఎవరి తరమూ కాదు. అత్యంత సూక్ష్మ దార్శనిక దృష్టి గల స్వామి వివేకానందుడు అందుచేతనే ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి చాలా ముందు నుంచే ' ప్రపంచం అగ్ని పర్వతం అంచున నిలబడి ఉంది. అది ఏ క్షణంలో అయినా భగ్గుమని పేలి సర్వమానవాళికి పూడ్చలేనంత నష్టం  కలిగించే అవకాశం ఉంది' అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ తరహా కష్టనష్టాల భారం తగ్గించే దిశగా అందుకే స్వామి యూఎన్ఓ వంటి  అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఏర్పాటయి చురుకుగా పనిచేయాలని అభిలషించింది. 

కొన్ని దశాబ్దాల కిందట వరకు జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సమస్యలను  జాతీయ స్థాయి సంస్థలే సమన్వయించి  సర్దిచెప్పేవి. పరిస్థితి మారింది. రెండు దేశాల పిట్టగోడ సరిహద్దు వివాదాలు కూడా ఊహించడానికైనా  సాధ్యం కానంత ఉత్పాతాలకు దారితీసి ప్రపంచదేశాలన్నింటిని  రచ్చలోకి ఈడ్చుకొస్తున్నాయి. ఇదంతా గామనించిన స్వామి ఆ తరహా సమస్యల పరిష్కారం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ  సంస్థల ద్వారానే సుసాధ్యమౌతుందన్న మాట వాస్తవం. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, అంతర్జాతీయ న్యాయచట్టాల ఆవశ్యకత నానాటికి పెరగక తప్పదు' అని ముందుగా గుర్తించి  ప్రకటింనిన వాస్తవిక రాజకీయ పరిశీలకుడు స్వామి వివేకానంద.   

నేటి మనిషి జీవితంలో రాజకీయాలు అంతర్గత విభాగాలవక తప్పడంలేదు.  రాజకీయాలతో నిమిత్తంలేని బతుకులు సాధ్యం కాదన్న పచ్చి వాస్తవం స్వామి అనుభావానికేమీ అందకుండా పోలేదు ఎప్పుడూ. అందు చేతనే సామాన్య గృహస్తును రాజకీయాల నుంచి దూరంగా ఉండమని ఆయన ఏనాడూ కోరలేకపోయివుండవచ్చు. కానీ రాజకీయాలతో అనుసంధానం ఏర్పరుచుకునే విధానంలోనే కొత్త పుంతలు తొక్కమని మాత్రం  ప్రబోధించేందుకు ప్రయత్నం చేసారాయాన. ‘భారతీయ వేదాంతం రాజకీయాలలో తెచ్చే సగుణాత్మకమైన మార్పులను  ఊతం చేసుకోకుండా ఇంగ్లాండ్ దేశానికి  నేను మతం  అగత్యాన్ని గురించి ప్రబోధించలేకపోయాను. ఇక్కడ ఇండియాలో కూడా సంఘసంస్కరణలు ప్రవేశపెట్టే ముందు  ఆధ్యాత్మిక రంగం  మానవాళికి చేకూర్చే మేళ్ళను గురించి ముందు  చర్చించవలసిన అగత్యం ఉందని మాత్రం హెచ్చరిస్తున్నాను. రాజకీయ భావజాలాన్ని ప్రబోధించే సమయంలోనూ అది భారతదేశానికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదలో ఏ మేరకు అభివృద్ధి  సాధించగలదో ముందు చెప్పాలి.'  అన్నది  రాజకీయాల  వరకు చివరకు స్వామి వివేకానందుడు తీసుకున్న వైఖరి.  

వివేకానందుడి స్వంత వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు రాజకీయ ప్రభావానికి అతీతమైన రాజకీయ పరిశీలకుడు ఆయన. ఏ జాత్తీయ, అంతర్జాతీయ రాజకీయాలకూ ఆయన మనస్తత్వాన్ని మార్చే శక్తి చాలదు. కానీ స్వామి రాజకీయ పరిశీలన అర్థవంతంగా ఉంటుంది.  నిర్దుష్టత శాతం ఎక్కువ. నైపుణ్యంతో కూడిన సునిశితత్వంతో, సూక్ష్మ పరిశీలనతో  నిరపాయకరంగా సాగే వివేకానందుని ప్రసంగాలంటే అందుకే మానవ జీవితంలోని అన్ని పార్శ్వాల మేధావులు అత్యంత శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడేది. ఆఖరుకు అవి రాజకియ సంబధమైన  ప్రసంగాలైనా సరే.. మినహాయించడానికి వీలులేనివి!  

'స్వామి వివేకానందుని సంపూర్ణ మేదోశక్తిని ఒకే చోట పోగేసి పరిశీలించేవారికి నోటమాట  రాకపోవడం సాధారణంగా జరిగే అనుభవమే. జాతీయవాదానికి, అంతర్జాతీయవాదానికి  మధ్య మరేదో నూత్న భావజాలంతో నిండిన మానవతావాదంలా పరమ ఆకర్షణీయంగా ధ్వనింపచేయడమే వివేకానందుని ప్రసంగాలలోని ప్రధాన ఆకర్షణ' అంటారు  'గుడ్ బై టు బెర్లిన్' రచయిత క్రిస్టోఫర్ ఐషర్ వుడ్. భారతీయుల చరిత్ర, భాషా సాహిత్య సంస్కృతులలో లోతైన అధ్యయనం చేసిన ప్రముఖ ఇండాలజిస్ట్ ప్రొఫెసర్ ఎ.ఎల్. భాషమ్  'రాబోయే కొన్ని శతాబ్దాల వరకు స్వామి వివేకానంద  ఆధునికి ప్రపంచ నిర్మాతల వర్గంలోని చింతనాపరులలో ఒక ప్రముఖునిగా గుర్తుండిపోవడం ఖాయం' అని స్వామీజీ రచనలు అన్నీ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన తరువాత వెలిబుచ్చిన ఆఖరు మాట. కాదని మనం మాత్రం ఎట్లా అనగలం!

*** 

                                            

-రచన - కర్లపాలెం హనువుంతరావు 

( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...