Showing posts with label internet-magazine. Show all posts
Showing posts with label internet-magazine. Show all posts

Sunday, December 12, 2021

సంపూర్ణ మద్యపాన ఉద్యమం - కర్లపాలెం హనుమంతరావు - వ్యంగ్యం - చుట్టుపక్కల చూడరా కాలమ్ - కౌముది అంతార్జాల పత్రిక


 

నేరమూ శిక్షా -కథానికః -కర్లపాలెం హనుమంతరావు

 


 

పగలు రాజ్యపాలన సాగిస్తూ రాత్రిళ్ళు మారువేషంలో సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను స్వయంగా పరిశీలించడం మహారాజు కృష్ణవర్మకి  అలవాటు.

ఒకసారి ఇలాగే బాటసారి వేషంలో పర్యటిస్తూ రాత్రి చీకటి పడే వేళకు  నగర పొలిమేరల్లోని ఒక ఇంటితలుపు తట్టారు కృష్ణవర్మమహారాజు.

ఆ ఇల్లొక బీద బ్రాహ్మణుడిది. ప్రాచీన సంప్రదాయాలకు ప్రాణమిచ్చే కుంటుంబం అతనిది. ఉన్నంతలోనే చేతనైనంత అతిథి మర్యాదలు చేసాడా రాత్రి.

భోజనం ముగించి.. పడుకునే ముందు బాటసారికి, బ్రాహ్మణుడికి మధ్య చిన్నపాటి లోకాభిరామాయణం సాగింది.

మాటల సందర్భంలో బ్రాహ్మణుడు మారువేషంలోని రాజావారితో  దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను ఏకరువు పెట్టి రాజుగారి పాలనను దుయ్యబట్టాడు.

అంతా సావకాశంగా విన్న రాజావారు "అన్ని కార్యాలూ రాజుగారే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమా! న్యాయ పర్యవేక్షణ, చట్టం అమలు వంటి  విభాగాల నిర్వహణకు అందుకే ఆయన ఎక్కడికక్కడ  ఉద్యోగులను నియమించారు కదా! వారి ప్రవర్తనల్లో లోపం కలితే ఆ దుష్ఫలితాలను రాజుకు ఆపాదించడం సరి కాదు" అని  వాదనకు దిగారు.

"కావచ్చు కానీ.. ప్రజలకు వాటితో పనిలేదు. అంతంత లోతులు ఆలోచించ లేని అమాయకులు వారు. సుఖంగా బతుకుతున్నప్పుడు రాజుగారి చలవ వల్లనే అని ఎలా నమ్ముతారో..  శాంతి భద్రతలు కరువైనప్పుడూ అలాగే  రాజుగారి వైపు  వేలెత్తి చూపిస్తారు. శరీరానికి  దెబ్బ తగిలితే.. గాయపరిచిన ఆయుధాన్ని కాకుండా.. ఆ ఆయుధాన్ని ప్రయోగించిన మనిషినే కదా మనం దూషిస్తాం! అన్యాయం చేసింది ఉద్యోగే అయినా.. అలాంటి దుర్మార్గుడికి అధికారం అప్పగించిన రాజే ఆ నిందను భరించక తప్పదు. సత్పరిపాలన అంటే సచ్చరితులను గుర్తించి సరైన పదవుల్లో నియోగించుకోవడమే" అన్నాడా బ్రాహ్మణుడు.

రాజావారు ఆలోచనలో పడ్డారు.

"చెప్పడం సులభమే.  పదవి చేతి కొచ్చిన తరువాత గాని అసలు నైజం బైటపడదు.   ఎవరి దాకానో ఎందుకు? మీకే గనక ఓ న్యాయాధికారి పదవి అప్పగిస్తే రాజుగారికి ఏ మచ్చా రాకుండా బాధ్యతలు నిర్వహించగలరా?" అని అడిగారు చివరికి.

బ్రాహ్మణుడే మాత్రం తొట్రు పడలేదు. "మహారాజు గారి నమ్మకాన్ని వమ్ముచేయననే అనుకుంటున్నాను" అన్నాడు. ఆ సంభాషణ అంతటితో ముగిసి పోయింది.

 

మర్నాడు ఆ బ్రాహ్మణుడిని కృష్ణవర్మ  కొలువుకి పిలిపించారు. రాత్రి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది స్వయంగా మహారాజే అని అప్పటికి గాని గ్రహింపుకి రాలేదు బ్రాహ్మణుడికి.

"నేటి నుంచి నగర న్యాయపాలనాధికారాలు తమకే అప్పగిస్తున్నాం. న్యాయం 'తు..' తప్పకుండా పాటించడ మెలాగో మీరు నిర్వహించి చూపించాలి. గడువు నెల రోజులు.  గాడి తప్పినట్లు ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా శిక్ష ఘోరంగా ఉంటుంది. తల కోట గుమ్మానికి వేలాడటం ఖాయం. బీరాలు పలికి చివరికి కార్యభీరువులయే వారంతా నేర్చుకోవాల్సిన పాఠ్యగ్రంథంగా పనికొస్తుంది. అంగీకారమైతే  వెంటనే అంగుళీకమును అందుకోవచ్చు" అని రాజముద్ర ఉన్న ఉంగరాన్ని  ముందుకు చాచారు కృష్ణవర్మమహారాజు.

క్షణకాలం మాత్రమే ఆలోచన. ఆ రాజముద్రను అందుకుని భక్తిగా కళ్లకద్దుకొన్నాడు పేద బ్రాహ్మణుడు. నగర కొత్త న్యాయాధికారిగా రామశాస్త్రి పేరు  ప్రకటింపబడింది. రామశాస్త్రి ఆ బ్రాహ్మణుడి పేరే.

 

సగం గడువు తీరిపోయింది. నగరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఇప్పుడు. మొదటి వారంలో రామశాస్త్రి దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలావరకు అక్కడికక్కడే పరిష్కరింపబడ్డాయి. దోషులను విచారించడంలోను, దండనలు విధించడంలోను, శిక్షల అమలును పర్యవేక్షించడంలోను.. రామశాస్త్రి చూపిస్తున్న నిజాయితి, నిష్పక్షపాతం, నిబద్ధత, చాతుర్యం రెండోవారంలోనే మంచి ఫలితాలు చూపించడం మొదలు పెట్టాయి. నేరస్తులు జంకుతున్నారు. నిందితులు తప్పించుకునే  కొత్తదారులు వెదుకుతున్నారు. శిక్షల రద్ధుకోసం పూర్వం  అవలంబించిన అడ్దదారులేవీ పనిచేయక ఇబ్బంది పడుతున్నారు బందీలు.

కొత్తన్యాయాధికారికి జనం  'జేజే'లు పలకడం నగరసంచారంలో  కృష్ణవర్మ మహారాజు స్వయంగా గమనించారు. మహారాజా వారు రామశాస్త్రినే రాజ్యం మొత్తానికి శాశ్వత న్యాయాధికారిగా నియమించబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలో కొచ్చేసింది ఎలాగో. అప్పుడు జరిగిందా విచిత్రం.

 

పనిమీద దేశాంతరం పోయిన ఒక చిన్నవ్యాపారి అనుకోకుండా అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అమావాస్య కావడం వల్ల అప్పటికి చీకటి బాగా చిక్కపడి ఉంది. భార్య చాలా తాత్సారం చేసి గానీ తలుపు తీసింది కాదు.  అనుమానం వచ్చిన భర్త ఇల్లంతా వెతికితే పడకగదిలో మంచం కింద మరొక మగమనిషి  నక్కి  కనిపించాడు.  తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో వాడికీ, ఇంటియజమానికీ మధ్య పెద్ద పెనుగులాట అయింది. ఆ దెబ్బలాటలో కత్తిపోటుకి బైటమనిషి ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి.

ఇప్పుడు హతుడి భార్య  న్యాయం కావాలంటూ రామశాస్త్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. "ఒక ఇంటి ఆడది చనువు ఇవ్వకపోతే మొగవాడనే వాడికి అర్థరాత్రి ఆ  ఇంట దూరే ధైర్యం ఎక్కడి నుంచీ వస్తుంది? భర్త వుండీ పరాయి మగవాడితో పోవాలనుకునే ఆడదానికి పడాలి అసలైన శిక్ష.. ముందుగా" అని విగతజీవుడి భార్య వాదన.

కొట్టి పారేయదగింది కాదు.

"నాకే పాపమూ తెలీదు. ఈ మనిషి ముఖం కూడా నేను   ఎన్నడూ చూసి ఎరగను.  వీడు ఎప్పుడు ఇంట్లో కొచ్చాడో..  పడకగదిలో మంచం కింద ఎందుకు దూరాడో అస్సలు   తెలీదు.  నా బిడ్డమీద ఒట్టు. తలుపు ఆలస్యంగా తీయడానికి కారణం నేను మంచి నిద్రలో వుండటమే. మా ఇంటాయన  ఆ సమయంలో వస్తాడని నేనేమన్నా కలగన్నానా?"అని భోరుమంది ఆ ఇల్లాలు. కన్నబిడ్డమీద కూడా ప్రమాణం చేసి చెప్పిందా ఇల్లాలు. కల్లిబొల్లి కథలుగా  శంకించడం సబబు కాదు.

"నిజానికి ఆ దుర్మారుడే నన్ను చంపాలని చూసాడు. తప్పించుకునే ప్రయత్నంలో నేను కత్తి విసిరిన మాట నిజమే. కాని.. వాణ్ణి చంపాలన్న ఉద్దేశం ఏ కోశానా లేదు. గాయ పరిచి చట్టానికి పట్టిద్దామన్నదే అప్పటి నా ఆలోచన.   చేతికి గురి చూస్తే కత్తి  గొంతులో దిగబడింది.." అని పశ్చాత్తాపం ప్రకటించాడు ఇంటి యజమాని. ఆయనకు పరమ శాంతపరుడిగా చుట్టుపక్కల మంచి పేరు కద్దు.

విచారణలో ఏ మాత్రం పొరపాటు జరిగినా అమాయకులు అన్యాయంగా బలైపోయే ప్రమాదం ఉంది.

రామశాస్త్రికి మొదటిసారి ధర్మసంకటం ఏర్పడింది.

'న్యాయానికి భార్య ఉండీ.. పరాయిస్త్రీ కోసం వెంపర్లాడిన ఆ కాముకిడికి తగిన శిక్షే పడింది. కానీ దాని పర్యవసానం  అమాయకురాలైన వాడి భార్య మీద కూడా పడింది. వ్యాపారి భార్య మీద ఆరోపించిన కాముకత్వానికి రుజువులు లేవు. చట్టప్రకారం శిక్షించడం కుదరదు. సహజన్యాయం దృష్టితో చూస్తే.. తన కాపురంలో నిప్పులు పోయబోయిన దుర్మార్గుడిని ఆత్మగౌరవం గల ఏ మగవాడూ ఉత్తిపుణ్యానికి సహించి వదిలి పెట్టలేడు. నిజంగా వాణ్ని చంపినా వ్యాపారికి పాపం అంటుకోరాదు.

కాని ఇది న్యాయస్థానం. న్యాయం ఇక్కడ  కొన్నిచట్రాల పరిధిలో మాత్రమే ఇమిడి నిర్థారింపబడుతుంది.  కావాలని చేసినా.. అనుకోకుండా జరిగినా ఒక నిండుప్రాణాలు గాలిలో కలసిపోయాయి. దానికి కారకుడైన వాడిని ఉపేక్షిస్తే సమాజం మొత్తానికి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి.

ఇదే అదనుగా తన మీద గుర్రుగా ఉన్న తతిమ్మా న్యాయాధిపతులు మహారాజు గారికి ఫిర్యాదులూ చేయవచ్చు. తన తలను గురించి కాదు కానీ.. రాజ్యం మళ్ళీ పూర్వసంక్షోభంలో  చిక్కుకుంటుందేమోనన్నదే దిగులు.  ముందు ముందు సమాజానికి  ఈ తలతో చేయవల్సిన సేవ ఎంతో వుంది. ఈ చిన్న కారణంగా ఆ పెద్ద సామాజిక భాధ్యతనుంచి ఇలా తప్పుకోవాలనుకోవడం కార్యశీలుడి లక్షణం కాదు.'

ఆ రాత్రంతా ఎన్నో రకాలుగా ఆలోచించిన రామశాస్త్రి తెలారి చెప్పవలసిన తీర్పు మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. అప్పుడు గాని నిశ్చింతగా నిద్ర పట్టిందికాదు.

 

మర్నాడు న్యాయస్థానంలో రామశాస్త్రి చెప్పిన తీర్పు ఎందరినో ఆశ్చర్య చకితులను చేసింది.  'ఘటన పుర్వాపరాలు అతి సూక్ష్మంగా పరిశీలించిన పిమ్మట ఈ నేరం మొత్తానికి సంపూర్ణ భాధ్యులు దేశాన్ని ఏలే కృష్ణవర్మమహారాజు గారే అని నిర్ధారించడమైనది. దేశాంతరం పోయిన చిరువ్యాపారి చేసే పని తాను పండించిన కూరగాయలను కనీస ధరలకు అమ్ముకోవడం. దేశీయంగా తగిన మద్దతు ధర దొరికితే ఎవరూ కుటుంబాన్ని అలా వదిలి దేశాలుపట్టిపోరు.

 

మహారాజుగారి మరో నేరం మృతుడి దుర్మరణం.  స్వయంకృషితో నిమిత్తం లేకుండా సంపదలు వచ్చి పోగుపడే మిడిమేళపు వర్గం ఒకటి దేశంలో వర్ధిల్లుతున్నది ప్రస్తుతం. వారికి పొద్దు గడవడమే పెద్ద ఇబ్బంది. తిన్నదా అరగదు. కొవ్వా కరగాలి. రకరకాల దోవల్లో వాంఛలు తీర్చుకునే తాపత్రయాలు ప్రదర్శిస్తుంటారు. సంసార స్త్రీలను ఉచ్చులోకి లాగడం ఈ తరహా కుత్సిత ప్రయత్నాలలో ఒకటి. చట్టాలు వీరికి చుట్టాలు. న్యాయం ఆంటే వీరికి మహా అలుసు. పాపాత్ములకు ఏ శిక్షలూ పడని ఈ అస్తవ్యస్త వ్యవస్థకూ సర్వోన్నతాధికారి అయినందు వల్ల మహారాజుగారే  ఈ నేరానికి భాద్యత వహించవలసి ఉంది.

 

కట్టుకున్న వాడితో కలసి   బతుకును పండించుకోవాలన్న ఒక్క ఆశతో మాత్రమే స్త్రీ  మెట్టినింటికి అడుగుపెట్టేది. కలకాలం పక్కనే ఉంటానని  ప్రమాణం చేసి మరీ చెయ్యందుకున్న  మగవాడు  కలలో తప్ప కనపడని  దుస్థితి దాపురిస్తే పడతులందరూ  ఒకే రీతిలో స్పందిస్తారన్న ధీమా లేదు.  కడుపు నిండిన వాడు అన్నం దొంగిలిస్తాడా? సంసార జీవితం సంతోషంగా సాగితే పక్క చూపులు చూస్తుందా ఏ సుదతైనా? బిడ్డ ఖాళీ కడుపుకి కన్నవారిదే నేరం ఎలాగో..  ఇక్కడ ఏలిన వారి దోషం ఇక్కడ అలాగే.

మూడు తప్పులకూ మూలకారణం  మహారాజుల వారే కనక మరణ దండనే వారికి సరైన శిక్ష.  నిందితుడే స్వయంగా,  బహిరంగంగా మహారాజుల వారి పైకి  కత్తి విసిరాలి. ఆ తరువాత  ఆ నేరం మీద వ్యాపారికీ యథేచ్చగా ఉరిశిక్ష అమలు చేయవచ్చు.  హతుడి భార్య కోరుకుంటున్న న్యాయం కూడా   అప్పుడే సాధ్యమవుతుందని ఈ న్యాయస్థానం భావిస్తున్నది"

రామశాస్త్రి తీర్పు పుట్టించినంచిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రజలు తీర్పుకి అనుకూలంగా.. ప్రతికూలంగా రెండు వర్గాలుగా చీలి వాదులాడుకోవడం మొదలు పెట్టారు. అంశం మహారాజుగారి మరణదండనకు సంబంధించింది అవడం చేత ఆ చర్చల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద తీవ్రంగా ఉంది. తీర్పులో ప్రస్తావించిన దేశీయ వ్యాపార ధోరణులు.. కలవారి విచ్చలవిడి బతుకులు.. ఆడవారి జీవితాల్లో  జరుగుతున్న అన్యాయాల్లాంటి ఎన్నోసామాజిక సమస్యలు మేధావివర్గాల చర్చల్లో నలిగి నలిగి సామాన్య్లుల అవగాహనా స్థాయి పదును కూడా పెంచాయి. న్యాయస్థానాల్లో, శాంతిభద్రతల రక్షణ  యత్రాంగాల్లో అప్పటి వరకూ లోపాయికారీగా సాగుతోన్న అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం లాంటి ఎన్నో రుగ్మతలు ఇప్పుడు నిర్భయంగా బహిరంగ చర్చల్లో నలుగుతున్నాయి.

రామశాస్త్రి కోరుకున్న చైతన్యం కూడా అదే.

 మహారాజుగారూ  తీర్పుకి కట్టుబడి ఉంటానని ప్రకటించడంతో చట్టం ముందు అందరూ సమానమేనన్న సందేశం అత్యంత బలంగా సమాజానికి అందించినట్లయింది. న్యాయవ్యవస్థ పక్షపాతం మీద అప్పటిదాకా ధనికవర్గాలకున్న భేఫర్వా మొత్తం  ఒక్కసారి కుప్పకూలింది.

రామశాస్త్రి తీర్పు అమలు చేయాల్సిన క్షణాలు రానే వచ్చాయి. బహిరంగ వధ్యశిల ఏర్పాటు చేయబడింది.  రాచపరివారం సమస్తం వెంటరాగా మహారాజు గారు శిక్షాస్థలికి అట్టహాసంగా తరలి వచ్చింది.

శిక్షలు విధించడమే తప్ప శిక్షలు అనుభవించే వ్యవస్థ రాచరికానికి కొత్త. చరిత్రలో సైతం ఎక్కడా జరిగినట్లు విని ఉండని ఈ  అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి జన సమూహాలో  విరగబడి వచ్చాయి.

 ఎక్కడ విన్నా మహారాజుగారి మంచితనాన్ని గురించిన స్మరణలే.  ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించే  కృష్ణవర్మ మహారాజు స్థానాన్ని వారసులు  ఎంతవరకు పూరిస్తారోనన్న నిరాశ. మహారాజుగారి పాలనలో కొన్ని పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు. రామరాజ్యానికే ఈ మచ్చ తప్పలేదని రామాయణం చెబుతోంది.  రాములవారికి ఇలాంటి దారుణమైన శిక్ష పడిందా?

చర్చలు ఇలా పలు రకాలుగా సాగుతుండగానే.. చీకటి పడింది. తీర్పులో విధించబడిన సమయానికి సరిగ్గా వ్యాపారిని మరణ వేదిక మీదకు తీసుకొచ్చారు. అతని చేతికి ఒక కత్తి ఇచ్చారు.

ఎదురుగా తలమీద ముసుగుతో సర్వంసహా చక్త్రవర్తులు..  ప్రాణాలు అర్పించడానికి సిద్ధబడి ధీరోదాత్తంగా  నిలబడి వున్న దృశ్యం.

ప్రకటన వెలువడింది "వ్యాపారీ! తీర్పు ప్రకారం నువ్వు మహారాజుగారి  మెడ మీదకు ఈ కత్తి విసరాలి. ఒకే ఒక్క వేటుతో  మహారాజుగారి ప్రాణాలు  పోవాలి సుమా! ఇహ అప్రమత్తమయి  విసురూ!"

అంతటా హాహాకారాలు.

వజవజా వణుకుతూ వ్యాపారి చేతిలోని కత్తి బలంగా విసిరాడు.  గురి తప్పింది.  మెడకు తగలవల్సిన కత్తి భుజానికి రాసుకుని కింద పడింది. తీర్పులో వ్యాపారికి ఇచ్చింది ఒకే ఒక్క అవకాశం కనక మహారాజు గారు ఇక  సురక్షితం.

అంతటా ఆనందంతో కేరింతలు.

ప్రజాభిమానానికి  కదలి పోయారు కృష్ణవర్మ మహారాజు. ఇంతగా ప్రేమించే ప్రజలకు ఏమిస్తే రుణం తీరేను! జన సంక్షేమానికి మరింత  ప్రాధాన్యమివ్వాలని ఆ క్షణంలోనే  కృతనిశ్చయానికొచ్చారు  కృష్ణవర్మ మహారాజు.

ఇదంతా రామశాస్త్రి చిత్రమైన తీర్పు  కలిగించిన మనోవికాసం.

"నిజమే కానీ.." అంటూ అప్పటి వరకూ తనను తొలుస్తున్న సందేహాన్ని రామశాస్త్రి ముందు బైట పెట్టారు మహారాజా వారు "అర్థరాత్రి పరాయి యింటిలోకి  ఆ దుర్మార్గుడు జొరబడింది ఎందుకో నిర్ధారణ కాలేదు. ఆ ఇంటి ఇల్లాలు చరిత్ర ఎంత స్వఛమైనదో  తేలిందిలేదు.  వ్యాపారి 'దుర్మార్గుడిని కావాలని చంపలేదు.. నిర్దోషిన'ని బుకాయిస్తున్నాడు. ఆ మాటల్లోని  నిజాయితీ పాలు నిగ్గుతేలలేదు. తప్పు చేసిన వాళ్ళందరిని గాలికి  వదిలేసి ఆ సంఘటనతో ఏ మాత్రం సంబంధం లేనినాకీ..శిక్ష ఏమిటి? అందునా గురి చూసి విసిరే కత్తికి ఎదురుగా నిలబడి ఉండడం!  వ్యాపారి సుశిక్షితుడైన యోధుడు కాడు. కాబట్టి తడబడ్డాడు.  లేకపోతే.."

మధ్యలోనే అందుకొని ముగించాడు రామశాస్త్రి "అతను తడబడ లేదు మహారాజా! గురి చూసే విసిరాడు. కానీ ఆ గురి తప్పింది. అతని గురే అంత. కుడికన్నులో దృష్టిలోపం ఉంది. ఆ లోపం కారణంగానే ఆ రోజు రాత్రి కూడా ఈ వ్యాపారి చేతిలో ఆ దుర్మార్గుడి ప్రాణాలు పోవడం!  దుర్మార్గుణ్ని గాయపరిచి వదిలేద్దామనే కత్తి విసిరాడు పాపం, ఇతగాడు. దృష్టి లోపం వల్ల అది అతని ప్రాణాలు పోవడానికి కారణం అయింది. నిజానికి అలాంటి నీచులు బతికి ఉండటం వల్ల అమాయకులకు ఏ మాత్రం మనశ్సాంతి ఉండదు. వ్యాపారి భార్య  ఒంటరిగా ఉండటం చూసి   నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే వాడు చీకటి మాటున చాటుగా వచ్చి పడక గదిలో ముందే దూరి కూర్చున్నది. ఆ పాపంలో ఆమెకే భాగం లేదు. ఆ కాముకుడి చరిత్ర.. ఆ ఇల్లాలి చరిత్ర వాకబు చేయించిన తరువాతనే నేనీ రకమైన శిక్ష ఖరారు చేసింది.

సంఘటన విచారణకు వచ్చినప్పుడు  ఆ చిన్నవ్యాపారికి శిక్ష పడుతుందనే అందరూ భావించారు. సాక్ష్యాలనీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి. నా మనస్సాక్షి ఒక్కటే  అనుకూలం. వాకబు చేసిన మీదట నా నమ్మకం నిజమని తేలింది. కానీ సాక్ష్యాలుగా అవి చాలవు.  వ్యాపారిని శిక్షించకుండా వదిలేస్తే నా తల కోట గుమ్మానికి వేలాడితే చూడాలను వువ్వీళ్ళూరేవాళ్ళకు అవకాశం ఇచ్చినట్లవుతుంది.  ఇప్పటి వరకూ ఈ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడిప్పుడే ఆ  పరిస్థితులు చక్కబడుతున్నాయి. నా తలను గూర్చి నాకు బెంగ లేదు. కానీ.. తమ మంచితనం వల్ల ఈ పేదవాడు కలలో అయినా ఊహించలేని విధంగా ప్రజాసేవ చేసుకునే ఈ గొప్ప అవకాశాన్ని పొందాను. దాన్ని సమాజ హితం కోసం మరింత పదునుగా వాడాలని మాత్రం ఆత్రంలో ఉన్నాను.  ముందు ముందు నా విరోధులు మీ మనసు విరిచే ప్రమాదం ఉంది. అందుకే .. ఏ సంబంధం లేకపోయినా ఈ వ్యవహారంలో  మిమ్మల్ని కూడా ఇరికించవలసి వచ్చింది. మీ ముందు అనుమతితోనే ఇది సాధ్యమయిందనుకోండి. వ్యాపారి దృష్టి లోపం మీద ఒకసారి మీకు నమ్మకం ఏర్పడితే ..ఇంక ఎవరు ఎన్ని చెప్పినా మీరు నా తీర్పుని  శంకించరన్న నమ్మకమే నా చేత ఈ అతిసాహసం చేయించింది. మీ సహృదయత వల్లే ఇది సాధ్యమైంది.  ఇదీ నేను ఇవ్వాలనుకున్న సంజాయిషీ. ఇప్పుడు మీరే శిక్ష విధించినా శిరసావహించడానికి ఇక సిద్ధం మహారాజా!"

మందహాసం చేసి అన్నారు  మహారాజు "నాకు ఇంత పెద్ద శిక్ష విధించిన పెద్దమనిషిని వూరికే వదిలి పెట్టడం కల్ల.శిక్ష ఖాయం. అమలుకు గడువు దాకా వేచి చూడటం దేనికి? రేపే ముహూర్తం. మీరు మా ముఖ్య  ఆంతరంగిక వర్గంలో చేరాలి. సామాన్యులకు మా ద్వారా  మరింత న్యాయం జరిగే అవకాశం కల్పించాలి!   మా ముఖ్య సలహాదారులుగా  చేరడమే  మీకు తగిన శిక్ష " అంటూ ఆప్యాయంగా రామశాస్త్రిని ఆలింగనం చేసుకున్నారు కృష్ణవర్మ మాహారాజు.

-కర్లపాలెం హనుమంతరావు

( గో తెలుగు.కామ్ లో ప్రచురితం)

***

 

 

   

 

 

 

 

 

 

 

Saturday, December 4, 2021

గల్పిక: ముద్దూ ముచ్చట - కర్లపాలెం హనుమంతరావు

' ప్రకృతి వరం- జీవితం.జీవితం వరం- ప్రేమ . ప్రేమ వరం- ముద్దు' అంటాడు ఉమర్ ఖయాం. 'గంభీరవారాశికల్లోలమండలం, బంభోజవైరి ముద్దాడుచుండె,/అత్యున్నతంబైన యవనీధ రానీక, మంబోధ పటలి ముద్దాడుచుండె..' అంటో ముద్దుకుఅచేతనాలే మురుసి పోతుంటేమనిషి చిత్తవృత్తినిగురించి మరిక చెప్పేదిఏముంది?' అవును.. ఒకపార్శీ కవి అన్నట్లు కండచక్కెర, కలకండ పటిక, కదళీ ఫలం, ఖర్జూర మిశ్రమం, గోక్షీరసారం, ద్రాక్షారసం, దివ్యామృతం, అలరుతేనెల ధార, చెరుకు రసాల చవులు దేనిలోనూలేనిదీ ముద్దులోపలి తీపి. వట్టి రుచేనా.. మనసుముడతలను సరి చేసేదీ ఈపెదాల ముడితడే. పెదవి పెదవి కలిసాయంటేసగం సంగమం శుభప్రదమయినట్లే. 'సపది మద నానలో దహతిమమ మానసం, దేహి ముఖకమల మధుపానం' అంటూప్రియనాయిక మధురాధరాల కోసంవూరికే ఆరాటపడతాడా జయదేవుడిఅష్టపది నాయకుడు! 'అన్యులెవరు చూడకుండగొల్లభామా! ఒక్క/ చిన్ని ముద్దు బెట్టిపోవే గొల్లభామా!' అని నల్లనయ్యనే గొల్లభామవెంట పరుగులెత్తించి అల్లరిపెట్టింది ఈ అధరవల్లరి.'కన్నుల కపూర్వమైన చీకటులు గవియు, గాఢముగమేనికి వింత మైకమ్ము గ్రమ్ము/చిత్తమున కేదో యున్మాదమత్తమిల్లు, చెక్కిళ్ళు ముద్దిడునవసరమున.' అదీ మధురాధర సంగమావస్థమదనావస్థ. మదనతాపానికి ప్రథమ చికత్స ప్రియముఖకమల మధువు ఆస్వాదనమే. ఆఔషధ సేవనం'సురగణాధీశ దుర్లభసుఖమొసంగు, అగణితాత్మ వ్యథాభార మణచివేయు/ భీష్మసదయప్రతాపంబు ప్రిదుల సేయు'. తొలిరేయి తొలిముద్దును గురించికలవరించని వారుఅసలు యవ్వనులేకారు.
నిజానికి తొలిముద్దు దొరికేది తల్లినుంచే. అమ్మవరం ఇచ్చిన పాపదైవానికి భక్తతల్లి సంతృప్తితో చెల్లించే ముడుపు- ముద్దు. 'నిండుమోమున పండు వెన్నెల హసింప/ చిల్క పల్కులు ముద్దులు గుల్కుచుండ/నల్లనల్లన గజ్జియల్ ఘల్లుమనగ/చిరునడతల దరిజేరే చిట్టితల్లి'ని ఏ తల్లి నిజానికి ముద్దాడకుండా ఉండ గలదు? గోరుముద్దలే కాదు..అమ్మ నాన్నలు ఆప్యాయంగా పంచి ఇచ్చేగోరువెచ్చని మురిపాల ముద్దులూ ఎదిగే బిడ్డలకు బలవర్థక ఔషధాలే. యవ్వనంలో మనసు కోరే, మనసును కోఱే ఆ 'ఛీ పాడు' ముద్దుతోనే అసలు పేచీ. తలుపు చాటునో, పెరటిచెట్టు చాటునో, పొలం గడ్డిమేట చాటునో.. పెదవి పై పడే మొదటి ఎంగిలి ముద్రే జీవితాంతం మనసు పుస్తకంలో భద్రంగా మిగిలే నెమలీక. 'తల్లిదండ్రియు దక్కు బాంధవులు జ్ఞప్తి, దొలగిపోదురు వలచిన పొలతిమిన్న/నిద్దపుంజెక్కిలిని ముద్దు దిద్దువేళ' అన్నారు కవి దాశరథి.వెనక వచ్చిన ఆ కొమ్ముల విసురు మగాడికైతే అతిశయ బాహాటమే కానీ మగువకు మాత్రం మనసుతో సైతం పంచుకో సంశయించే అనుభవం. ఆ ముద్దుల్లో మళ్లీ ఎన్ని రకాలు! 'కార్యార్థియై యధికారిబిడ్డల చేరి, బుడిబుడి నద్దించు ముద్దు వేరు,/వెలయిచ్చి కూడెడు వెలయాలి చెక్కిళ్ళ, మురువుమై పొరలించు ముద్దు వేరు/చిన్నారిపొన్నారి చిరుత పాపల పాల, బుగ్గల గీలించు ముద్దు వేరు/నవమాసాగమమందు గవగూడు ప్రియురాలి, ముద్దు చెక్కిలిబెట్టు ముద్దు వేరు/ స్వప్నమున దాను వలచిన సారసాక్షి, నిద్దపుం జెక్కిలిబెట్టు ముద్దు వేరు'. అధరాలు అవే. ఎవరివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదానప్రదాలు చేస్తున్నాయన్నదే ప్రధానం. చేతి వేళ్ళ మీద అద్దే ముద్దు అభిమాన సూచకం. నుదుటి మీద దిద్దే ముద్దు భరోసాకు చిహ్నం. చుబుకం మీద సాగే చుంబనం సంసిద్దతకు అద్దం. పెదాలపైని ముద్దుదైతే పతాకస్థాయే. చెవుల దొప్పలు, ముక్కు చివరలు కంటిరెప్పల వంటి ఏ ఇతర వంటిభాగాలైనా ముద్దుసీతాకోకచిలుక రాక కోసం ఎదురు చూసే పద్మపుష్పాలే.
మనిషి పెదాలు మాత్రమే ముద్దుకు అనువుగా సృషించినట్లుంటాయి. స్పర్శ నాడుల చివరలకన్నీ చివుళ్ళ చివరనే ముడి. మనసు లోపలి ఉద్వేగాలవడి ముందుగా బైట పడేదీ అధర ముఖద్వారాలనుంచే. సిగ్గు, బిడియం, కామన, సంశయం, భయం, అసహ్యం.. ఏది ముంచుకొచ్చినా చివురుటాకుల్లా ముందు వణికేవ పెదవి చివరి భాగాలే. ముద్దులాడుకునే వేళ 'డోపమిన్' అనే రసాయనం మోతదుకి మించి విడుదలై ఆకలి మందగించడం, నిద్రకు దూరమవడం సహజం. 'ఆక్సిటోసిన్' అనే మరో ప్రేరకం అధికంగా విడుదలై శృంగారవాంఛ రెట్టింపు అవుతుంది.'న్యూరోట్రాన్స్ మీటర్స్' మెదడులోఉత్పన్నమై గుండె లబ్ డబ్ ల వేగం పెరిగిపోతుంది. మనిషి జీవితంలో ముద్దు పద్దు సరాసరి 20,160 నిమిషాలు. నిముషం ముద్దుకు 20 కేలరీలు ఖర్చు. ముద్దుకో శాస్త్రమూ కద్దు. పేరు 'ఫైల్మేతాలజీ'. మమకార ప్రకటనకి ముప్పై నాలుగు కండరాల సహకారం అవసరం. వ్యాధుల సంక్రమణంలోనూ ముద్దుదే ముఖ్య పాత్ర .'నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా?' అంటో 'టాం టాం' కొట్టే పెదవులు నంటే ఉంటాయంటున్నారు అంటువ్యాధి కారక క్రిములు. అయినా ముద్దంటే చేదెవరికి? చంటిబిడ్డలనైనా అందుకే ఓ హద్దు దాటి ముద్దాడ వద్దని ఆరోగ్యశాస్త్రం హెచ్చరిస్తోంది. మన్మధ సామ్రాజ్య విహారయాత్రలో ముద్దు ఒక 'టోల్ గేట్'. మధువుకూ, ధూమానికి ఆమడ దూరం మధురాధరాల ఆదరం. నమిలిన తిండిని బిడ్డకు అందించడంతో ప్రేమగా పెదవులు కలపడం మొదలయిందని ఓ ఊహ. ముద్దు ఆలోచన ముందు రోమనులదే అని ఒక వాదం. భారతీయులకూ బోలెడంత చుంబన సాహిత్యం ఉంది. 'శతపథ బ్రాహ్మణ'మే ఉదాహరణ. ముద్దు సమయ సందర్భాలమీద పెద్దలకే పెద్ద అవగాహన లేదంటున్నారు శృంగార శాస్త్రవేత్తలు. వారానికి సగటున 11 సార్లేనుట దంపతుల మధ్య ముద్దాయణం. అదీ కంటిరెప్ప పడి లేచే లోపలే చప్పున చల్లారిపోతోందని, పెళ్లయిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరు ముద్దుకు దూరమవుతున్నారని 'డెయిలీ ఎక్స్‌వూపెస్' బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్'సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే సారాంశం. సంపాదనే లక్ష్యంగా సాగుతున్న సంసారాల్లో ముద్దు ముచ్చట్లు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే. 'ప్రణయకోపము పంచబంగాళమైపోవు, నీసడింపులవెల్ల బాసిపోవు/మనసు బింకబెల్ల మటుమాయమైపోవు, నాత్మగౌరవమెల్ల నడగిపోవు/ కోటి రూకలును గవ్వకు సాటి రాకుండు, త్యాజంబుగా తోచు రాజ్యమైన/అవధి చెప్పగ రానియానంద మెసలారు, స్వాంతంబు తన్మయత్వంబు జెందు/' .అదీ ముద్దు మహిమ మరి. వద్దనుకుంటే ఎలా?

- కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ.ఎస్.ఎ 

( సిలికాంధ్రవారి సాహిత్య అంతర్జాలి పొదరిల్లు - సుజనరంజని - ఫిబ్రవరి 2015 లో ప్రచురితం ) 


 


Wednesday, August 25, 2021

భూపాలరాగం - కర్లపాలెం హనుమంతరావు - కవిత

 పురుగుమందుకు మనుషులంటేనే ఎందుకో అంత ప్రేమ !

విషం మిథైల్ ఐసో సైనేట్ మారు వేషంలో

నగరం మీద విరుచుకుపడిన చీకటి క్షణాల ముందు

హిరోషిమా నాగసాకీ బాంబు దాడులే కాదు

'తొమ్మిదీ పదకొండు' ఉగ్ర దాడులు కూడా దిగదుడుపే !


టోపీల వాడి మాయాజాలమంటే అంతే మరి!

మనకి ఊపిరాడదని మన తలుపుకే కన్నం వేసే కంతిరితనం వాడిది.

అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చి మిరియంమొక్క అడిగినా

కంపెనీవాడొచ్చి మూడడుగుల నేలడిగినా

మన కళ్ళుకప్పి మాడుమీద వాడి జెండా దిగేయ్యటానికే!

మన కండలు పిసికి పండించిన  పంటను ఓడల కెత్తుకెళ్ళటానికే.

అదిప్పుడు పాత కథ.

కొత్త కథలో..

వామనుడు అడగక ముందే  నెత్తి చూపించే అమాయక బలి చక్రవర్తులం మనం

భూమిని చాపలా చుట్టి వాడి పాదాల ముందు పరచటానికి

పోటీలు పడే కలియుగ దానకర్ణులం.

మన రూపాయి ప్రాణవాయువును

వాడి డాలరు బతుకుతెరువు కోసం

తృణప్రాయంగా సమర్పించుకునే

పిచ్చి బేహారులం

వాడి విమానాలు క్షేమంగా దిగాలని

మన వూళ్ళు కూల్చుకుని

రహదారులు విశాలంగా చేసుకునే

విశాలహృదయులం

వాడి నాలిక మడత పడటం లేదని

మన మాటను సంకరం చేసుకునే టందుకయినా సంకోచపడం.

వాడి అణుదుకాణాల కోసం

మన అన్నపూర్ణ కడుపులో చిచ్చు పెట్టుకోటానికయినా మనం సిద్దం.

సార్వభౌమత్వమంటేనే ఒక చమత్కారం

ఆ డాబు దర్పాలకి మురిసి చప్పట్లు కొట్టటమే మనకు గొప్పతనం.

అణుఒప్పందం వల్ల భవిష్యత్తులో జరిగే భారతీయ చెర్నోబిల్ నాటకానికి

పాతికేళ్ళ క్రిందటే ప్రారంభమయింది

భూపాల రాగం… వింటున్నారా!

- కర్లపాలెం హనుమంతరావు 

( Published on 2010, October 5 in 'Poddu'(పొద్దు )- Internet Telugu Monthly Magazine)

About కర్లపాలెం హనుమంతరావు

రచన వ్యాసంగం లో కర్లపాలెం హనుమంతరావు గారిది పాతికేళ్ళ పైబడిన అనుభవం. వందకు పైగా చిన్న కథలు,వందన్నరకు పైగా వ్యంగ్య గల్పికలు (అన్నీ ప్రచురితాలే), డజనుకు పైగా నాటికలు, ఆకాశవాణికి రచనలు... వారి సాహిత్య రికార్డు. సినిమాలకు రచన చేసిన అనుభవం అదనం. "శైలజ కృష్ణమూర్తి-వాళ్ళకింకా పెళ్లి కాలేదు ", "ఫోటో" చిత్రాలకు రచన విభాగంలో పనిచేసారు. మరికొన్ని చిత్రాలకు రచనా సహకారం అందించారు. ఈనాడు ఆదివారం ఎడిటోరియల్ కు రచనలు అందిస్తుంటారు. "ఒక్క నవల మీద తప్ప అన్ని ప్రక్రియల మీద చెయ్యి చేసుకున్నపాపం నాది. స్థిరంగా వుండక కొంత, చేసిన బ్యాంక్ మేనేజర్ వృత్తి వుండనీయక కొంత. మొత్తంగా పెద్దగా సాధించినదేమీ లేదు. వారం వారం ఈనాడులో మాత్రం దాదాపు పుష్కర కాలం మించి  ఎవరినో ఒకరిని సాధిస్తూ ( వ్యంగ్యం ) కాలక్షేపం చేస్తున్నాను. మధ్యలో ఆంధ్రభూమి వెన్నెల సినిమా పేజీలో కొత్త సినిమాలను సాధిస్తూ కాలక్షేపం చేశాను. కవిత్వం అంటే మరీ ఎక్కువ ఇష్టం కాబట్టి దాన్ని చదువు కోవటం తప్ప సాధించింది తక్కువ .మరీ తప్పనప్పుడు, మనసు మరీ సాధిస్తున్నప్పుడు తప్ప కవితామతల్లి జోలికి పోయే సాహసం చేయను." అని అంటారాయన.

- పొద్దు కవి పరిచయం 

Thursday, July 9, 2020

బుర్ర కాదు.. బుద్ధి ప్రధానం! -కర్లపాలెం హనుమంతరావు



జింజాం త్రోపస్, జావా, నియాండర్లల్, సోలో, స్టీన్ హోం లాంటి దశలన్నీ దాటేసి హోమో సెపైన్స్ గా అవతరించి ప్రకృతి మీద పూర్తి ఆధిపత్యం సంపాదించినట్లు విర్రవీగే దశలో మనిషి పొగరును అణచడానికి సృష్టి ఉనికిలోకి వచ్చిన కొత్త మహమ్మారి కరోనా వైరస్ ఉపద్రవం. ఆకూ అలమల సేకరణ దశ నుంచి, ప్రకృతి వనరుల రహస్యాలను ఒక్కొక్కటినే ఛేదించుకుంటూ.. విశ్వాంతరాళలోకి రాకెట్లు తోలే వికాస స్థాయి వరకు చేరిన మనిషి తెలివితేటలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అగత్యమైతే లేదు. కానీ మనిషి ఆలోచనలు ఒక చోట నిలబడతాయా? నిలబడితే వాడు మెదడు గల మనిషవుతాడా? సృష్టిలో తతిమ్మా జంతుజాలల కన్నా తనకు అదనంగా లాభం చేకూరింది చంచలించే మెదడు స్వరూపం అని ముందు అర్థం చేసుకున్నాడు. సామాజికంగా, సామూహికంగా రోజుకు కొన్ని వేల కొత్త పదాల సృష్టి మెదడు లేకుండా సాగే వ్యవహారం కాదుగదా? బయో మెడిసిన్ అంటూ మొదలు పెట్టి ఇప్పుడు బయోవార్ వరకు ఆలోచన సాగించడం మనిషి మెదడులో పుట్టుకొస్తున్న కొత్త ఆలోచనల వల్లనే అర్థమవుతుంది.

మనిషి మెదడు బరువు సగటున మూడు పౌన్లు అని ఒక అంచనా. రష్యన్ రచయిత్ తుర్జనీవ్ మెదడు బరువు నాలుగు పౌన్ల చిలర. ఫ్రెంచి రచయిత్ అనటోల్ ఫ్రాన్స్ మెదడు బరువు ప్రపంచంలో కెల్లా చిన్నది. బరువు రెండు పౌన్ల పై చిలుకు.ఈయనా రచయితే. ఇద్దరికీ ప్రపంచ సాహిత్యంలో సమానంగానే పేరుంది. మెదదు బరువు సంగతి ఆనక, ముందు ఉన్న మెదడు చేత సక్రమంగా చాకిరీ చేయించుకునే ఇంగితం కదా ప్రధానం! బుర్ర ఎంత పెద్దదయి వుండీ ఏం ప్రయోజనం బుద్ధి కురచనైతే! బుద్ధి పెద్దదై బుర్ర బరువులో తేడా వచ్చినా మానవాళికి పోయేదేం లేదు. తమ కంటే ఇతర జాతులు తెలివిలో తక్కువవి, ఆ కారణం చేత అవి స్వాతంత్ర్యానికి అనర్హమని నిన్న మొన్నటి వరకు యూరోపియన్లు, వలసదార్లు నమ్ముతూ వచ్చారు. తెల్లవాళ్లకు తమ బుద్ధి కౌశలం మీద అతివిశ్వాసం. సాటి నీలివర్ణంవాళ్ల తెలివితేటలను మీద కొంచెంచూపు. కాని చరిత్ర తిరగేస్తే నాగరికతను సానుకూల పరిచిన వివిధ వస్తు సముదాయం సృష్టికర్తలలో నల్లజాతీయులే అధికం. నిన్న మొన్నటి వరకు బానిసలుగా బతుకులు బరువుగా ఈడ్చిన జాతులు ఎన్నో గత శతాబ్దిలో విమోచనాలు నడిపి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు సాధించడం చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. బైటికి అనరు కానీ ఇప్పటికి సామ్రాజ్యవాదుల మనసుల్లో తమ ఆదిక్యతాభావన పైన  విపరీతమైన విశ్వాసం కద్దు. దానిని ప్రశ్నించే వర్గాల మీద అంతే విద్వేషమూ సహజంగా వెంట ఉంటుంది కదా! సందు దొరికితే తమ ఉక్రోషం తీర్చుకునే అవకాశం పెత్తందారి వర్గాలు ఎన్నటికీ వదులుకోవు. మొన్న అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రో- అమెరికన్ అకారణ దారుణ మరణం వెనుక తాత్కాలికమైన కోపతాపాలు ఒక్కటే కారణం అనుకోవడం సరికాదు. ఒక్క అమెరికా అనే కాదు.. ప్రపంచమంతటా ఇప్పుడు నడుస్తున్నవి విద్వేష పురాణాలే అనిపిస్తుంది. ఒక దేశంలో రంగుల తేడా అయితే, మరో దేశంలో మతాల మత్సరం. ఇంకో ప్రాంతంలో కులాలపై చిన్నచూపు. కరోనా ప్రబలిన కొత్తల్లో అకారణంగా చైనాను అమెరికా నిందించడం, మతావేశాలు పెచ్చరిల్లే ప్రస్తుత సందర్భంలో భారతదేశంలో మైనారిటీ మతాన్ని మూలకారణంగా ప్రచారం చేసే ప్రయత్నమూ ఇవన్నీ మనిషి మెదడులోని చీకటి పార్శ్వం చురుకుతనం పుణ్యం. అన్ని ఆధిక్యతల మీద ఆధిక్యత ప్రదర్శించేది అంతిమంగా ఆర్థికకోణమే. డబ్బు శక్తి పెట్టుబడిదారుడికి తెలిసినంతగా కార్మికుడికి తెలిసే అవకాశం లేదు. ఇవాళ చైనా అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్నంగా సాగుతున్న పోరుకు కూడా ఈ ఆర్థికమే మూల కారణం. గత శతాబ్దమంతా తన కర్రపెత్తనం మీద ప్రపంచాన్ని నడిపించిన అమెరికాకు కొత్త శతాబ్దిలో పరిస్థితులు చేజారిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపించడంతో ఆందోళన పెరిగినట్లు అర్థమవుతూనే ఉంది. ప్రపంచ మార్కెటు గతంలో మాదిరి గుత్తంగా తన దగ్గరే ఉండే పరిస్థితులు కచ్చితంగా లేవు. ఉత్పత్తి రంగంలో కొత్త కొత్త పుంతలు తొక్కుతూ అశేషమైన మానవ వనరులు, మేధో వనరులకు తోడుగా మంచి ప్రణాళికతో ముందుకు దూసుకొస్తున్న చైనా జోరుతో అమెరికా బెంబేలెత్తుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. మరో మూడు దశాబ్దాలకు శతవర్షోత్సవంలోకి అడుగుపెట్టబోతున్న చైనా ప్రపంచ మార్కెటు మీద తన పట్టు పూర్తిగా బిగించేందుకు ఎన్ని చెయ్యాలో అన్నీ చేయడం గమనించవచ్చు. స్వావలంబన దిశగా స్థిరబడుతూ ప్రపంచమంతా తన ఉత్పాదక వస్తువుల మీద ఆధారపడేలా ఆ దేశం వేసే అడుగులతో అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా పోటీపడే అవకాశం లేదు. అందుకే చైనాను వంటరి చేసి ఆర్థికంగా దమ్మున్న దేశాలను తన వైపు ఉంచుకునే ప్రయత్నంలో భాగంగా చైనా లేని జి- 7లో భారత్ లాంటి అభివృద్ధి చెందే దేశాన్ని కూడా కలుపుకోవాలని కొత్త ఎత్తుకు తెరలేపింది. ఏళ్ల తరబడి ఒకే ఆట ఆడుతున్న అమెరికాకు ఇప్పుడు ఆ విడగొట్టి పాలించే ఎత్తు పారడం కష్టంగా ఉంది. అమెరికా చైనా వస్తువుల మీద ఆధారపడి ఉండటం, చైనాకు ఏ విదేశీ వత్తాసు వస్తూత్పత్ప రంగంలో అవసరం లేకపోవడం ప్రధానకారణాలు. ముఫ్ఫై ఏళ్ల కిందటి చైనాకు ఇప్పటి చైనాకు హస్తిమశకాంతరం తేడా ఉంది. ఎంతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసుకుంటూ ఒక లక్ష్యంతో ముందుకు దూసుకుపోయే చైనీయుడి మెదడు బరువు, కొన్ని దశాబ్దాల తరబడి అభివృద్ధి రంగంలో అగ్రగామిగా ఉంటూ వచ్చిన అమెరికన్ జాతీయుడి  మెదడు బరువు కన్నా తక్కువ అవడం ఇక్కడ గమనించక తప్పని ముఖ్యమైన అంశం. 'స్నేహితులను ఎలా సంపాదించాలి?'   అనే పేరుతో గొప్ప గొప్ప హిట్ ఫార్ములాలతో వక్తిత్వవికాస గ్రంథాన్ని రాసిన డేల్ కేర్నజీ.. ఆంగ్లేయుడు.. ఆనక ' డబ్బు ఎలా సంపాదింఛాలి?' 'కోటీశ్వరులు ఎలా కావాలి?' అంటూ ఆర్థిక సంబంధమైన పుస్తకాలనూ రాసిన విషయం మనం మర్చిపోకూడదు. అదే బాటలో నడిచిన పార్కిన్ సన్లు, లారెన్స్ పీటర్ల తరహాలో ఏ పుస్తకాలో రాయడంలో కాకుండా  దేశ జి.డి.పి ని పెంచే కృషిలో పెట్టి తన మెదడు బరువును నిరూపించుకుంటున్నాడు ఇవాళ చైనా జాతీయుడు. 'బుర్ర తాటికాయంత ఉంటే ఏం లాభం.. బుద్ధి చింత పిక్కంత 'అని తెలుగులో ప్రచారంలొ ఉన్న సామెత సారాంశం ముందు అర్థం చేసుకోవాలి. వట్టిగా యాప్స్ నిషేధించినా  చైనాకు వచ్చే నష్టం తాత్కాలికమే అని మనమూ తెలుసుకోవడం మేలు. అంతకు అంత  గుంజే మరేదో ఆర్ర్థిక తారక మంత్రంతో నష్టం పూడ్చుకోగలడు. చైనాను చూసైనా మనం మన స్వంత కాళ్ల మీద నిలబడే మంచి తంత్రం గ్రహించడమే మేలు. ఈ కయ్యాలు, కాలు దువ్వుళ్లు ఎత్తుల తతంగాలన్నీ ముగించుకున్నాక!
***
- కర్లపాలెం హనుమంతరావు

Karlapalwm2010@gmail.com
+918142283676


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...