Sunday, April 25, 2021

మహమ్మారి కరోనా విస్తరణకు - మన లెక్కలేనితనమే కారణమా! -కర్లపాలెం హనుమంతరావు

 

 



రష్యా అధినేత కృశ్చేవ్ ఓసారి ఇండియా వచ్చినప్పుడు స్వాగత వచనాలు పలికి తోడుకుని తెస్తున్నాడుట అప్పటి మన దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. మార్గమధ్యంలో  ఓ పౌరుడు తన ట్రేడ్ మార్క్ చెంబుతో పొదల్లో దూరడం చూసి కృశ్చేవ్ ఆసక్తి కొద్దీ అతగాడు అంత పరగడుపునే పొదల చాటుకెళ్లి చేసే మహాకార్యమేంట’ని అడిగితే, వివరాలు కనుక్కొచ్చిన మనిషి తెచ్చిన సమాచారం దేశం శుచి శుభ్రతలకు సంబంధించిందవడంతో చెప్పలేక చెప్పి చాచాజీ తలొంచుకున్నాడుట. మరి కొంతకాలం తరువాత అదే సన్నివేశం మాస్కోలో కాకతాళీయంగా జరిగటంతో  చాచాజీకీ బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. 'చెంబు చేత పట్టుకుని పొదల చాటుకు జనం పరుగెత్తే దృశ్యాలకు తమ దేశమూ కొదవేంపోలేదూ!' అన్నట్లు నవ్వితే తలతీసినట్లనిపించిందీ సారి  కృశ్చేవ్ కి. ఆ అనాగరికుడిని పట్టి తెమ్మని ఆయనిచ్చిన ఆదేశం మేరకు.. వెళ్లి వచ్చిన మనిషి 'ఆతగాడి పలుకును బట్టి ఇండియనని చెప్పడంతో చాచాజీకీ మరో మారు తలవంచుకునే పరిస్థితి తప్పింది కాదు'అని కుశ్వంత్ సింగ్ ఓ సందర్బంలో చెప్పిన పిట్టకథ ఇప్పుడు గుర్తుకొస్తోంది. భారతీయులను అవమానించే ఈ తరహా చెత్త కథలు  కట్టుకథలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  కానీ.. అలవాట్ల వరకు భారతీయుల వెకిలి చేష్టలను చక్కగా వెలిబుచ్చేవని మాత్రం ఒప్పుకోక తప్పదు.

మారుతున్న కాలంలో ఇప్పుడు ఏ భారతీయుడూ విదేశీ గడ్డ మీద ఆ విధంగా ప్రవర్తించడంలేదు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము' అన్నట్లు మాతృభూమి వళ్ళు పులకరించేలా ఎంతో ఒద్దికైన ప్రవర్తనతో పదిమంది మధ్యనా ఆదర్శవంతంగా నడుచుకుంటున్నాడు. కానీ.. చిత్రంగా ఆ బుద్ధిమంతుడే కన్నభూమి పై కాలు పెట్టిన తొలిక్షణం నుంచి  మళ్లా లోపలున్న ఒరిజనల్ని బైటికి తీసేస్తున్నాడు! పాత దురలవాట్లను శాయశక్తులా పాటిస్తున్నాడు! రోడ్లను  యధా తధంగా ఉమ్ముతో పావనం  చేయడం నుంచి కుండీ ఎదుటే ఉండినా  చెత్త అందులో పడకుండా శాయశక్తులా శ్రద్ధవహించడం వగైరా.. వగైరా వరకు.. ఏది చట్టమో అంతా తెలిసినట్లే.. పంతంగా వాటిని ఉల్లంఘించే పాత అలవాట్లనే సాధన చేస్తున్నాడు! అందువల్లనే పై తరహా చిల్లర కథలకు అంత  విస్తృతమైన   ప్రచారం!

క్రమశిక్షణారాహిత్య కార్యకలాపాలలో సుశిక్షణేదో పొందినట్లు మనం మరీ అంత విపరీతంగా ప్రవర్తించడం ఎందుకు! ప్రస్తుతం దేశంలో జరిగే కరోనా విలయ తాండవంలో  ఈ అపరిశుభ్రతే కదా ముఖ్య కారణం!

మొదటి దశలో ఎంతో శ్రద్ధగా ధరించిన మొహం తొడుగులు రెండో దశలో ఎందుకు నామర్దాగా మారినట్లు! ప్రారంభంలో వైద్యులు చెప్పుకొచ్చిన సామాజిక దూరం వంటి జాగ్రత్తలన్నీ నియమబద్ధంగా పాటించిన మనమే తదనంతర దశలో  ఏం ఘనకార్యం సాధించామని  పూర్తిగా గాలికి వదిలేసినట్లు! పెళ్లిళ్లు, ఉత్సవాలు వంటి సామూహిక కార్యక్రమాలకూ సై అనేందుకు ఏ వైద్యం మనల్ని కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి చేసేసిందని! ఇంటికొకరు పిట్టల్లా రాలుతున్న కరోనా దేశంలో   హరిద్వారా కుంభమేళా, అయిదు రాష్ట్రాల ఎన్నికల మేళా చూసి ప్రపంచం నోరెళ్లబెట్టేస్తోంది. కనిపించే రోగగ్రస్తులకు ఎన్నో రెట్లు కనిపించని రోగవాహకులుగా ఉన్న  దుర్భర పరిస్థితులకు కారణాలేమిటో కనుక్కునే ప్రయత్నాలు ఏ కోశానా కనిపించడం లేదు ఇప్పటికీ! మన అపరిశుభ్రతే మనకు తీరని శాపం అని  సామాన్యుల నచ్చచెప్పేందుకు ఇంకే బ్రహ్మదేవుడు దిగిరావాలో!

పరిశుభ్రతకు సంబంధించిన చట్టాలు లేక కాదు. ఉన్నవాటినైనా కఠినంగా అమలుచేసే చింతన లేదనే ఈ చింతంతా! అపరాథ  రుసుం పైసల్లోఉండటంతో ‘ఆఁ! చెల్లించేస్తే పోలా!’ అన్న తుస్కార ధోరణే తప్ప సంస్కార కోణంలో ఆలోచించే గుణం తరతరానికి తరిగిపోతూ రావడమే కరోనా తరహా మహమ్మారులకు మన మీది ప్రేమ దినదినాభివృద్ధి చెందడం.

నిజం నిష్ఠురంగానే ఉంటుంది. ద్విచక్రవాహన చోదకులు ఎంత మంది శిరస్త్రాణాలు ధరిస్తున్నది? ధరించనివాళ్ళ మీదయినా నమోదయ్యే కేసులు ఎన్ని? ఎరుపంటే ఏదో జడుపున్నట్లు  ఆ రంగు లైట్ కంటపడగానే ఆగాల్సింది పోయి  వాయువేగంతో పారిపోయే వాహనాలే జాస్తీ మన దేశంలో ఎంత  బిజీ రోడ్ల మీదయినా! ‘ఒన్ వే’ అంటూ  నియమం ఓటి  ఉన్నా ‘జానే దేవ్’ అనే సజ్జే గజ గజానికీ ఈ దేశంలో! మూగజంతువు మీద నుంచి బండి నడుపుతూ పట్టుపడితే అపరాధ రుసుం కేవలం 50 రూపాయలా! కబేళాకు గొడ్డును అమ్మేందుకు ఆరోగ్యంగా ఉండే కాలును పుటిక్కున  విరిచేస్తున్నాడు త్రాష్టుడు! జబ్బు పడ్డ గొడ్డును పోషించడం ఖర్చుతో కూడిన వ్యవహారమయితే.. అదే కబేళాకు అమ్మేస్తే ఝంఝాటం వదలడంతో పాటు అదనంగా అంతో ఇంతో ధన లక్ష్మీదేవి సుప్రసన్నం!

సింగపూర్ లో ట్రాఫిక్ ఉల్లంఘనకు శిక్ష వెయ్యి డాలర్లు. చెల్లించలేని పక్షంలో జైలు శిక్షలు. అదే ఇండియాలోనో! గుప్పెడు రూకలతో చూపిస్తే అంతా గుప్.. చుప్! అవినీతిని గురించీ, న్యాయ విచారణల తీరును గురించి ఎంత తక్కువ చెబితే అంత మన్నన.

రోడ్డు నిబంధనలు తెలుసుకుని, నేర్చుకుని కష్టపడి  పరీక్ష ఉత్తీర్ణమవకుండానే  కొంత సొమ్ము మనది కాదనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికే బెంజి కారులో వచ్చేసే వ్యవస్థలో మనం బతుకుతున్నది. మందు కొట్టి బండి నడిపినంత మాత్రాన గ్యారంటీగా పోలీసు కేసు బుక్కవాలనుందా ఇక్కడ? కేరాఫ్ ఫుట్ పాత్ గాడి  పీకల మీద నుంచి గాడీ నడిపేసుకెళ్ళిన బేఫర్వా  హీరోగాడే సేఫ్ గా మూవీలు చేసుకునే దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఎవడికి తోచిన అర్థం చెప్పుకుంటున్నాడు మరి.  సాంకేతిక కారణాలనేవి సైంధవుడి సోదరుడికి మల్లే   అడ్డుపడకుంటే  ఈ దేశపు  చట్టసభలను నింపే శాల్తీల పడకలన్నీ నిజానికి సెంట్రల్ జైళ్లలో ఉంటాయి. పగటి కలలో అయినా ఆ మాత్రం  సంస్కరణలను ఊహించుకుంటే పిచ్చాసుపత్రిలో బెడ్ సిద్ధం చేసే దుస్థితి. తోటకూర నాటి నుంచే విచ్చలవిడితనం ఇచ్చే సుఖాలు మరిగిన సంతు ఎదిగొచ్చే కొద్దీ ఎంత అసాంఘిక జంతువుగా మారుతుందో చెప్పాలంటే మరో  థగ్గుల చరిత్ర తిరగరాసినంత తంతవుతుంది.  

'ఇచ్చట మల మూత్రములు విసర్జించ రాదు' అన్న హెచ్చరికలు ఇక్కడ దర్శనమిచ్చినన్ని బహుశా ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ కనిపించవు. నడిరోడ్డు పక్కన మగవాళ్లు ప్యాంటు జిప్పులు నిస్సిగ్గుగా తీసే జగుప్సాకరమైన సన్నివేశాలకూ ఈ పవిత్ర దేశమే ప్రథమ స్థానం.  

1936 ప్రాంతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషనంటూ ఓటి ఏర్పడి  గాంధీజీ అప్పటి అవసరాలకని ఇచ్చిన 'పౌరుల సహాయ నిరాకరణ' ఉద్యమానికి ఊతంగా విద్యార్థులను బళ్ల నుంచి బయటికి వచ్చేయమంది. గురువుల బోధనలను ధిక్కరించినవాడే అప్పట్లో గొప్ప దేశభక్తుడుగా గుర్తిస్తానంది! బ్రిటిష్ ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించేలా సమాచార, రవాణా, పాలనా సౌకర్యాలు సర్వస్వానికి ఆటంకాలు కల్పించడాలవంటివి ఏళ్ల పర్యంతం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించిన సంస్కృతి ఈ దేశానిది.  స్వాతంత్ర్యం వచ్చినా తుచ్ఛ రాజకీయాలలో అదే నీచ సహాయ నిరాకరణ ధోరణులు! పుట్టుకొస్తున్న కొత్త తరాలకు  నియమ నిబంధనల పట్ల  ఉండవలసిన స్థాయిలో బాధ్యతాయుతమైన భయభక్తుల కొదవ అందుకేనేమో అనిపిస్తున్నదిప్పుడు! రాజకీయ పక్షాలే స్వలాభాపేక్ష నిమిత్తం విద్యుత్ వగైరా బిల్లులు చల్లించవద్దని, బ్యాంకు రుణాలను నిర్భయంగా  ఎగవేయమని,  పాఠశాలలకు వెళ్లి ఫలానా విద్యలు చదవరాదని,  రాస్తాలను దిగ్బంధనం  చేసెయ్యాలని, బస్సులు పై రాళ్లు రువ్వాలని, రైలు పట్టాలు పీకెయ్యాలని, ప్ర్రభుత్వ అస్తులు ధ్వంసం చేసి మరీ ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శించాలని ప్రోత్సహిస్తున్నప్పుడు సామాన్య పౌరుడికి ఏది ఎప్పుడు ఎవరి మాట ఏ మోతాదులో ఆచరించవలసిన అగత్యం ఉందో ఎట్లా అవగాహనకొచ్చేది?

భారతీయులు అమితంగా ఆరాధించే ఆరాధ్య గ్రంథం భగవద్గీత కర్మయోగమే విశిష్ఠమైన వ్యక్తులు ఏమి చేస్తారో చూసి తతిమ్మా ప్రపంచం దాన్నే అనుసరిస్తుందని   'యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః ।స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే' శ్లోకంలో చెప్పింది కదా! మన నేతాశ్రీలకు గీతలు, రామాయణాలు చదివే పాటి తీరిక ఉండదు.  కాబట్టే  చట్టాలు చేసిన తమ చేతులతోనే ఆ చట్టాలను నిర్భయంగా చట్టుబండలు చేసేస్తున్నారు! భారీ సభలు రోడ్డు కడ్డంగా పెట్టి చెవులు దిబ్బళ్లుపడేలా నినాదాలు చేయించే నాయకులను నుంచి సామాన్యుడేం నేర్చుకోవచ్చు? డ్యూటీలో ఉండే ఉద్యోగులను తిట్టడం, కొట్టడం మాత్రమే నాయకత్వానికి ముఖ్య ల్క్షణంగా భావించే నేతలున్న దేశంలో  పౌరుడు మంచి మార్గాన్ని ఏ మూల నుంచి ఎంచుకోవాలి?

పర్యవసానం ఏదైనా కానీ, చివరికి ఇవాళ మొత్తంగా పడకేసింది సామాజిక ఆరోగ్యం.. దానికి ఏ ఆసుపత్రుల్లో పడక దొరకని దుస్థితి. ఊపిరాడని పరిశుభ్రత.. దానికీ ఆక్సిజన్ కరువంటున్న అస్తవ్యస్త వ్యవస్థ పరిస్థితి!  

 

-కర్లపాలెం హనుమతరావు

25 -04 -2021

Saturday, April 24, 2021

గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్లు -కర్లపాలెం హనుమంతరావు

 


భావికాలజ్ఞానాన్ని ఇంగ్లీషులో చెబితే వీజీగా అర్థమవుతుందనుకుంటే ‘విజన్’  అనుకోండి.. సర్దుకుపోవచ్చు. ఇదివరకు  జరిగిన సంగతులను ఇప్పటికీ గుర్తుంచుకుని  వాటి అనుభవాలు పాఠాలుగా భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు ఇప్పటి నడత మార్చుకునే పద్ధతి. బుద్ధిమంతులు చేసే దిద్దుబాటు చర్య.

టు ఎర్ ఈజ్ హ్యూమన్– అన్నారు కదా అని పద్దాకా తప్పులు జరిగినా ఇబ్బందే. సరిదిద్ద రాని పొరపాట్లు జరిగితే చరిత్ర  చెడుగా గుర్తుంచుకుంటుంది. కాలానికి ఎవరి మీదా ప్రత్యేకంగా  గౌరవం ఉండదు.

 

జరగబోయే ఘటనల గురించి అందరికీ ఒకే తీరున సంకేతాలందడం రివాజు. అర్థమయిన బుద్ధిజీవులు పద్ధతి మార్చుకుని కాలం మీద తమ ముద్ర వేస్తారు. అర్థంకాని బుద్ధిహీనులు అట్లాగే అనామకంగా కాలగర్భంలో కలిసిపోతారు. 

 

భావికాల జ్ఞానలేమి కలిగించే నష్టం ఏ రేంజిలో ఉంటుందో చెప్పేందుకు  అడాల్ఫ్ హిట్లర్ చరిత్ర ఓ పాఠం. తమను తాము స్థాయి మించి  ప్రేమించుకునే ఆ నియంత వంటి వాళ్లకు హితవు చెప్పేవాళ్ళు ఎంత సన్నిహితులైనా సరే  శత్రువులయిపోతారు. గిట్టనివాళ్ల మీద కక్షతో కొంతమంది దుష్ప్రర్తనకు తెగబడితే, సంభవం కాని లక్ష్యాలు పెట్టుకుని సమకాలీన పరిణామాల పట్ల శ్రద్ధ పెట్టనితనం వల్ల మరికొంత మంది అల్లరిపాలవుతారు.   ఈ రెండు రకాల పాలకులనూ మనం సమకాలీన వ్యవస్థలోనే గమనించవచ్చు.

 

హిట్లరు మనసులో నిరంతరం ఒకటే ఊహ తిరుగుతుండేది.  ప్రపంచం ఓ ముద్దయితే.. అది తన అంగిట్లో మాత్రమే పడవలసిన ఖాద్యపదార్థమని. అతగాడి భావిజ్ఞాన  లేమి ప్రపంచానికి తెచ్చిపెట్టిన మొదటి ప్రపంచ యుద్ధ వినాశనం అందరికీ తెసిసిందే. అసంభవమైన ఆ లక్ష్యం సాధించే ప్రక్రియలో సమకాలీన సమాజం ప్రదర్శించే  పరిణామాల పట్ల  అలక్ష్యమే హిట్లర్ సర్వనాశనానికి ప్రధాన కారణం. మనిషి నైజంలోని ఈ తరహా కనిపించని గుడ్డితనం (inattentional blindness)  కొత్త శతాబ్దం మొదటి ఏడాదిలో ఒకానొక అమెరికన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచానికి ప్రదర్శించి చూపించారు. 

 

ఓ బాస్కెట్ బాల్ మ్యాచ్ ను  తెరపై చూపిస్తూ బంతి ఎన్ని సార్లు చేతులు మారిందో కచ్చితమైన లెక్క చెప్పాలని విద్యార్థులకు పోటీ పెట్టి,  ఆట మధ్యలో అప్పుడప్పుడూ ఓ గొరిల్లా  కన్రెప్పపాటు సమయంలో  గుండెలు బాదుకునే దృశ్యం కూడా ప్రదర్శించారు. బంతి చేతులు మారడం మీద మాత్రమే ధ్యాస పెట్టిన చాలా మంది  విద్యార్థులకు గొరిల్లా గుండెలు బాదుకునే దృశ్యమే దృష్టిపథంలోకి రాలేదు. 

 

వాస్తవ ప్రపంచంలో ఈ తరహా పొరపాటు చేసినందు వల్లనే మోటరోలా సెల్ ఫోన్స్ కంపెనీ ఖాతాదారుల మార్కెట్ ని చేజేతులా నోకియాకు  జారవిడుచుకుంది.  ధ్యాసంతా అప్పటికి ఉన్న ఖాతాదారులను సంతృప్తి పరచడం మీద మాత్రమే  లగ్నం చేయడంతో ఖాతాదారుల్లోని 'గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్ళు' గమనించే అవకాశం లేకుండాపోయింది. నోకియాదీ అదే మిస్టేక్.  సాంకేతిక నైపుణ్యాల పరంగా కూడా భావి కాలంలో జరగబోయే పెనుమార్పులను  ఊహించాలన్న జ్ఞానం లేకపోవడంతో మార్కెట్ ఆనేక చిన్న ధారాదత్తం చేసింది.

 

ఇక చరిత్రలోకి తొంగి చూస్తే ఇట్లాంటి ఉదాహరణలు  ఎన్నైనా చెప్పుకోవచ్చు. క్రీ.శ 1217 ప్రాంతంలో సమర్ఖండ్ లోని ప్రాంతాలెన్నింటినో కైవసం చేసుకున్న అల్లావుద్దీన్-2 ప్రపంచం తనని 'బాద్ షా'గా గుర్తించాలని ఆశపడ్డాడు. బాగ్దాద్ అధినేత ఖలీఫా ససేమిరా అనేసరికి అల్లావుద్దీన్ అహం దెబ్బ తినేసింది. ఆ కక్ష కడుపులో పెట్టుకుని వాణిజ్య సంబంధాల కోసం పదే పదే ప్రయత్నించిన చెంగిజ్ ఖాన్ ను ఎన్నో సార్లు అవమానించాడు అల్లావుద్దీన్. అక్కడికీ డిప్లొమసీ బాగా వంటబట్టిన  చెంగిజ్ ఖాన్ అవమానలన్నిటినీ దిగమింగుకుని రాయబేరానికో ముగ్గురు మధ్యవర్తులను పంపిస్తే, భవిష్యత్తులో ఏం జరగనుందో ఊహించలేని అల్లావుద్దీన్  ఆ ముగ్గురినీ రాజనీతికి విరుద్ధంగా ఉరితీయించాడు. సహనం కోల్పోయిన చెంగిజ్ ఖాన్ అల్లావుద్దీన్ స్వాధీనంలోని నగరాలెన్నిటినో నేల మట్టం చేసిందాకా నిద్రపోనేలేదు. 

 

పాలకుల వ్యక్తిగత అహంకారానికి లక్షలాది మంది అమాయకుల ప్రాణాలు ఆ విధంగా బలికావడం చూసిన తరువాతా  భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించకుండా పగ, ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధానమనుకుంటే పాలకులకు ఏ గతి పడుతుందో పాఠాల్లా నేర్పేటందుకు బోలెడన్ని సంఘటనలు ఇట్లాంటివే చరిత్ర నిండా కనిపిస్తాయ్!

 

కనిపించని గుడ్డితనం (భావికాలజ్ఞాన లేమి)తో బాధపడే పాలకులు.. ఎవరూ ఏమీ చేయలేరు అనే అహంకారం పెంచుకోవడం పొరపాటు. మారిన కాలంలో ప్రజాస్వామ్యం వ్యవస్థ అధికార మార్పిడి అంతిమ శక్తి సామాన్యుడి చేతిలో పెట్టిన తరువాతా రాజరికాలలో మాదిరి ఇష్టారాజ్యంగా పాలకులు ప్రవర్తిస్తే హిట్లర్ కు,    అల్లావుద్దీన్-2 లకు పట్టిన గతే పట్టడం ఖాయం.

 

పాలకుడు అనేవాడు ప్రజలలో కనిపించకుండా నిరంతరం సాగే

'గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్లు' తప్పకుండా వింటుండాల్సిందే!

-కర్లపాలెం హనుమంతరావు

-24 -04 -2021

 


Tuesday, April 20, 2021

ప్రమదల పునరుత్పత్తి హక్కులు- కోవిడ్ మహమ్మారి ప్రవేశంతో మరింత అధ్యాన్నం! --కర్లపాలెం హనుమంతరావు

 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా మహిళల్లో హింస, నిరుద్యోగమే కాదు..  లైంగిక పరమైన ఆరోగ్య సంరక్షణా కొరవడింది. ఫలితం.. పునరుత్పత్తి నాణ్యత దిగజారడం. 

మనదేశం వరకే చూసుకుందాం.  లభిస్తున్న గణాంకాలను బట్టి ప్రభుత్వ సేవల అసమానతలు, సమన్వయలోపాలు సుస్పష్టం. 

 

స్వీయ హక్కుల పట్ల ఆట్టే అవగాహన లేని సమూహాలలో స్త్రీలది ప్రథమ స్థానం. విద్య, రవాణా వంటి  ప్రాథమిక  సౌకర్యాల కల్పనలోనే సమన్వయ లోపాలు ఇంత స్పష్టమవుతున్నప్పుడు ఇక   ఆరోగ్య పరిరక్షణ పరంగా ప్రస్తుతముండే దైన్య పరిస్థితిపై కథనాలు రాసుకోడం  వృథా కాలయాపన. ఎబోలా, జికాల వంటి మహమ్మారులు విజృంభించిన తరుణంలో దెబ్బతిన్న మాతాశిశువుల ఆరోగ్య పరిస్థితులేవీ పాలకులకు కోవిడ్-19  సంక్షోభంలో పాఠాలు నేర్పించినట్లే  లేవు! మహిళల ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఆరోగ్య సంరక్షణ అత్యయిక పరిస్థితినీ ఎప్పటికి  గుర్తిస్తారో  మన  ప్రభువులు! 

 

కోవిడ్ అనంతర ప్రపంచంలో మహిళలను మళ్లా వారి మానానికి వారిని విడిచిపెడితే మానవజాతి మనుగడకే మొత్తంగా ప్రమాదం. స్త్రీల పునరుత్పత్తి సమస్యలు స్త్రీలకు మాత్రమే  పరిమితం కాదు. 

  అంశం చుట్టూతా అనేక సమస్యలు మూగున్నాయి; వాటిలో చట్ట సంబంధమైనవే కాదు, నైతికపరమైనవి కూడా ఉన్నాయి. వాటిని గురించే ఈ క్షోభంతా!

 

జనాభాలో సగంగా ఉన్న స్త్రీ జాతికి నేటికీ తన కుటుంబ పరిణామాన్ని   నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు!   సహజ న్యాయాన్నీ ఒక  హక్కుగా  స్త్రీలు  దేబిరించే దశకు తెచ్చిన ఈ మగ ప్రపంచాన్ని ఏం చేసినా తప్పులేదు!

 

కనే బాధ్యత మాత్రమే అప్పగించేసి .. ఎంత మందిని, ఏ సమయంలో ప్రసవించాలో,  సంతానాన్ని ఏ   తీరున పెంచాలో అన్న  కీలకమైన నిర్ణయాలను ఇంటి పెద్దలు తామే  పుచ్చేసుకున్నారు!   గుడ్లప్పగించి చూసే దైన్యమే  ఆధునిక స్త్రీ దైనా!

 

కరోనా మహమ్మారి కారణంగా ఉనికిలోకి వచ్చిన లాక్ డౌన్ వాతావరణంలో మహిళ పరిస్థితి మరింత దయనీయం.  ముఖ్యంగా పునరుత్పత్తి పరంగా!

 

జాతీయ మహిళా కమీషన్ దగ్గర నమోదయిన గృహహింస ఫిర్యాదుల పెరుగుదల చూస్తే గుండెలు అవిసిపోతాయి. తక్షణ సహాయం అందే పరిస్థితులు కరువైన లాక్-డౌన్ వాతావరణంలో మెజారిటీ స్త్రీల వ్యథలు పడకటింటి నుంచే మొదలు!  జాతీయ మహిళా కమీషన్ లో గృహహింస    బాధితుల సౌకర్యార్థం   వాట్సప్ విభాగం ఓటి  ప్రత్యేకంగా ఏర్పడటమే  దిగజారిన పరిస్థితులకు దర్పణం.  

 

గృహహింస అంటే కేవలం దేహం మీద జరిగే బౌతిక దాడి ఒక్కటే కాదుగా! ఆంక్షలు, ఆరోగ్య రక్షణకు ఆటంకాలు, మానసిక పరంగా  వేధింపులు.. ఏ తరహా ఒత్తిళ్లయినా సరే  గృహహింస కిందకే వస్తాయి.  సన్నిహితంగా మసిలే జీవిత భాగస్వామి చేసేదయితే  ఆ హింస ప్రభావం మహిళ పునరుత్పత్తి  నాణ్యతను మరంత  తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణుల హెచ్చరిక కూడా  . 

కరోనా- 19 లాక్ డౌన్ వాతావరణం పునరుత్పత్తి ఆరోగ్య పరిస్థితులపై మహిళల  నియంత్రణ శక్తిని  మరంతగా  బలహీనపర్చినట్లు ఐక్యరాజ్య సమితి స్వయంగా నిర్ధారించడం  ఆందోళన కలిగిస్తుంది . సుమారు 12 మిలియన్ల మంది మహిళల గర్భనిరోధక వినియోగ చర్యలకు అంతరాయం ఏర్పడ్డట్లు  ఓ అంచనా. దీని ఫలితంగా 2020 అనంతరం కాలంలో సుమారు 1.4 మిలియన్ల అనాలోచిత గర్భధారణాలకు అవకాశం కలిగినట్లని ఆ నివేదికే తేటతెల్లం చేస్తోంది!

 

సమయానికి అందని కుటుంబ నియంత్రణ సేవలు, లాక్ డౌన్ కారణంగా విధించిన పరిమిత ప్రయాణాలు.. నిషేధాలు,  అవసరానికి అందుబాటుకు రాని  అనేక ఇతరేతర ఆరోగ్యసౌకర్యాల చలవ .. ఈ గందరగోళమంతా! 

 

 పునరుత్పత్తికి సంబంధించిన  హక్కులు, కుటుంబ నియంత్రణ.. గర్భస్రావం వంటి  సేవలను పొందే విషయమై  చట్టపరంగా ఉండే  హక్కులు  అన్నీ నామ్ కే వాస్తేనే!  వాస్తవ          లభ్యత విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన్నన.

 

 మనదేశం    వంటి  అభివృద్ది చెందుతున్న దేశాలలో సహజంగానే ప్రజలకు అందే ప్రభుత్వ సేవలు అరకొరగా ఉంటాయి  . అందులోనూ  తరాల తరబడి అణచివేతకు  గురవుతోన్న    స్త్రీజాతికి ..  ఆరోగ్య పరమైన లైంగిక  హక్కుల పట్ల               అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఈ క్రమంలోనే పునరుత్పత్తికి సంబంధించిన హక్కుల పరిజ్ఞాన లేమి అతివల అవాంఛిత గర్భధారణలకు  ముఖ్య కారణమవడం!

 

మొత్తం భారతీయ మహిళల్లో దాదాపు సగం మందికి గర్భనిరోధానికి  పాటించే  ఉపాయాలు తెలియవు; తెలిసినవారికేమో  వివిధ కారణాల వల్ల  ఆయా  సౌకర్యాలు బహుదూరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుటుంబాల నియంత్రణ   ప్రణాళికల్లో స్త్రీ భాగస్వామ్యం దాదాపు శూన్యం .. అదీ విడ్డూరం!

 

గర్భనిరోధ వినియోగం చుట్టూతా ఉన్న డేటానే  ఈ స్త్రీ స్వయంప్రతిపత్తి లోపానికి ఓ కీలక ఉదాహరణ. 'ఏ అపాయమూ లేకపోయినా వాసెక్టమీలకు కేవలం 0.3% మంది పురుషులు మాత్రమే సంసిద్ధమవుతున్న నేపథ్యంలో    వివాహిత మహిళల్లో హానికరమైనప్పటికీ నూటికి 36  మంది  స్టెరిలైజేషన్ ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారు!  

 

సంస్కృతీ సంప్రదాయాల పరంగా ఈ తరహా అంశాల మీద  బాహాటమైన చర్చలకు ఆస్కారం ఉండటంలేదు. అవివాహితులైన స్త్రీలకు ఏ విధమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించే అవసరం లేదనే ఒక నైతిక  భావన కద్దు,

 

కానీ  మారుతున్న కాలం ప్రభావం!   ఈ దేశంలో లైంగికపరంగా ప్రస్తుతం  చైతన్యం కలిగివున్న గ్రామీణ అవివాహితులే  27% ఉన్నట్లు అనధికార గణాంకాలు నిగ్గు తేలుస్తోన్న  నేపథ్యం! ఎంత సమర్థవంతమైన ఆరోగ్య సేవా కార్యకర్తలు ఉన్నప్పటికీ,  ఈ తరహా వర్గాలను  ఏ గణనలోకీ తీసుకోలేని   పక్షంలో, చర్చల ద్వారా  సాధించే సానుకూల ఫలితాంశాలు ప్రశ్నార్థకమే అవుతాయి కదా?

 

2020 లో దేశవ్యాప్తంగా కొనసాగిన లాక్ డౌన్ సమయంలో కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి ఆరోగ్య సేవా క్షేత్రాలు  తీవ్రంగా దెబ్బతిన్న మాటయితే  వాస్తవం. గృహ నిర్బంధ పరిస్థితుల  కారణంగా,  దేశంలో 25 మిలియన్ల జంటలకు గర్భనిరోధక సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. నిజం చెప్పాలంటే రాబోయే ఏడాదిన్నర కాలంలో భారతదేశం    జననాల విషయంలో రికార్డు నమోదుచేసుకునే అవకాశం దండిగా ఉందంటున్నారు ఆరోగ్య శాస్త్ర నిపుణులు!  

 

'అన్ని వర్గాలకు సమాన హక్కులు'  అని సర్వత్రా వినవస్తున్న   సామాజిక వ్యవస్థ నినాదమే మూహిళల    పునరుత్పత్తి హక్కుల అంశంలోనూఉంది. పునరుత్పత్తి  అతివ  జీవితాన్ని అత్యంత అధికంగా ప్రభావితం చేసే ప్రధాన అంశం. అందులో స్త్రీ   పురుషునితో సమానంగా స్వతంత్ర ప్రతిపత్తికై డిమాండ్ చేయడంలో  అసమంజసమేమీ లేదు.

పునరుత్పత్తికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం యావత్తూ ఆమెకు సకాలంలో అందుబాటులో ఉంచడం.. ఆ చైతన్యం ద్వారా ఆమె తీసుకునే పునరుత్పత్తి సంబంధమైన నిర్ణయాలను మన్నించగలగడం పురుష ప్రపంచం..  ముందు అహం చంపుకొనైనా అభ్యసించడం అవసరం. ఇది నేరుగా ఆర్థిక, సామాజిక పరంగా స్త్రీని  పురుషునితో సమానంగా ఎదిగే అవకాశం

కల్పించడమే!  స్త్రీల జీవితాల మీద స్తీలకు, స్త్రీ దేహం మీద స్త్రీకి మాత్రమే సర్వహక్కులు కల్పించినప్పుడే ఇది సాధ్యమయే సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం సాకారం అయ్యే ఆశ కనుచూపు మేరలో ఉండగానే కోవిడ్ - మహమ్మారి స్త్రీ జీవితాన్ని మరింత ఛిద్రం చేయడమే విషాదకరం!

-కర్లపాలెం హనుమంతరావు

18 04 -2020

Wednesday, April 14, 2021

మారని తలరాతలు- ఈనాడు – వ్యంగ్యం - కర్లపాలెం హనుమంతరావు

 


 


మా నేత మారాడ్రా!

నమ్మచ్చా!

నిజవైఁ న పరివర్తనకు ఇరవైనాలుగ్గంటలే ఎక్కువ

మరి.. పూటగడవక ముందే నిండు సభలో ఈ గజడదబలు.. ?

అర్థం కాలా!

గ- అంటే గలభా. జ- అంటే జగడం. డ- అంటే డబ్బా కొట్టింగ్. ద- అంటే దబదబా బల్లల చరుపులు. ఇహ ‘బ’ అంటే..

బడబడా వాగడమేగా!  నీలాగా.. ఇలాగా! తెలీకడుగుతా! మేం మారడం అంత అబ్బురమా.. అపురూపమా? ఒపీనియన్ అంటే  వంటి మీది బనియన్ వంటిదే గదరా శుంఠా! అమావాస్యకో పౌర్ణానికో ఓ సారన్నా అది మారకపొతే బాడీ కుళ్లు కంపు కొట్టదా? ఊసరవెళ్ళి సృష్టి రహస్యమేంటంటావ్? మా పాలిటిక్సోళ్లకు పాఠాలు నేర్పే పంతులు.! క్షణానికో రంగది మార్చేదే రాజకీయాలోళ్లని చూసి నేర్చుకోమని. అయినా మార్పూ మంచిదే.. చంద్రుడి మీది మరకలాగా!

ఆ మారేదేదో అసతోమా సత్ గమయా.. మోడల్లో  ఉండాలి భయ్యా! వెల్తుర్నుంచి మరింత అంధకారంలోకి తోసే మార్పూ మార్పేనా? గతంలో రష్యా మారింది జార్ చక్రవర్తుల నియంతృత్వ పెత్తనం నుంచి. చైనా మారింది పీడించే రాజుల చీనా నుంచి ప్రజల చీనాగా! నిన్న గాక మొన్న నేపాల్ మారింది! మెడ్రాస్ చెన్నైగా, బొంబాయ్ ముంబాయ్ గా.. ఇట్లా ఎన్ని మారడంలా?

 'ఛేంజ్' స్లోగన్ ఒబామాను ఏ రేంజ్ కు ఎగరేసిందో అది చెప్పూ!

ఓ బాబు మాడు మొహం మీద చిర్నవ్వు పులుముకుంటే, మరో  సాబు మార్పనే ముక్క పట్టుకుని పార్టీ పెట్టుంటే .. ఏంటంట బెనిఫిట్ ప్రజానీకానికి? ఇప్పుడదే ‘మార్పు’  వంక పెట్టుకునేసి గోడలు దూకేస్తున్నారు బడా బడా ప్రజాప్రతినిధులు చెడామడా! జనం నమ్మి ఓటిచ్చి చట్టసభకు పమ్మించిన రంగుల్ను కూడా మార్చేసుకుని! హుఁ..

నీ కుళ్ళేడుపులకేంలే! ఈ పుల్లిరిపు మాటలు లోకాన్నే మాత్రం మార్చకుండా అపలేవబ్బీ! రూపాయిక్కిలో బియ్యం దొరుకుతుందిప్పుడు. అయినా దెప్పుళ్లే!ఆ మార్పు  కనిపించదు నీకు!

కందిపప్పూ రోజుకో రకంగా మారుతోందిగా. మరి దాం సంగతో? 'సత్యాలు' మారిపోతున్నాయ్. నిందితులే అప్రూవర్లుగా మారిపోతున్నారు. ఆసుపత్రుల్లో బిడ్డల మార్పేమన్నా ఆగుతుందా? కిడ్నీల దొంగ మార్పిడో? ఇప్పుడదే ఓ పేద్ధ  కార్పొరేటెడ్ వ్యాపారం! మీ పెద్దాయన చెప్పాడని పెద్ద పెద్ద అధికారులే మారిపోతున్నార్..

 

కూల్.. కూల్! నీ ఎనుగు జ్ఞాపక శక్తి కూలా! ఎప్పటి మార్పుల్నో మనసులో పెట్టుకుని మమ్మల్నిప్పుడు దులపరించడవాఁ? మా హయాం మార్పుల్ని గూర్చి కొద్దిగా మెచ్చుకోలు మాటలైనా ఊడిపడవు కాబోలు! కొత్త నోట్లను తెచ్చాం పాత నోట్ల చోట్లో. ఆయోగ్ సంస్థల్లాంటివి కొత్తవి కట్టుకుపోయేటన్ని నెత్తికి తెచ్చిపెట్టాం..! బ్యాంకుల్లో మార్పులు.. చట్టాల్లో మార్పులు.. అసలు చట్టాలు చెయ్యడంలోనే మౌలికంగా మార్పులు! మనసుండి చావాలే గానీ  మేం తెచ్చిన మార్పులు మూల మూలలా కనిపిస్తానే ఉంటాయ్!

ఎందుక్కనిపించడం లేదన్నా! నోట్లు రద్దయినా దొంగనోట్లు  మారుతూనే ఉన్నాయించక్కా ఇప్పటికీనూ! ధరలు రోజుకో రకంగా మారే కథిహ సరే సరేనూ! ఓటర్ల జాబితాలో పేర్లు అదేంటో తమాషాగా తెల్లారేసరికల్లా మారుతూనే ఉంటయ్! ఇసుక బంగారంగా మారుతున్న కతలు ఇహ విసుగూ విరామం లేకుండా నడుస్తూనే ఉండె!

పుటం పెట్టినా నీ వెటకారపు ధోరణి మారదురా బాబో! నీ కోసం కాకపోయినా జనాల్ని మా వేపుకు మార్చుకునేందుకు చెబుతున్నా! మార్పనేదే లేకపోతే మనిషింకా నీకు మల్లేనే కోతిలా గెంతుతూనే ఉండేవాడిప్పడికీ. బోయ వాల్మీకిగా మారకపోయుంటే మనకు రామాయణమనే ఉద్గ్రంధం  రాజకీయాలు చేసుకునేందుకు దొరికేదేనా! విభీషణు రాములోరి పక్షం మారడమే రావణాసురుడి అంతానికి అసలు కారణం. మారడం చేతరాకే హరిశ్చంద్రుడు కూడా మీ బాబోరికి మల్లే అష్టకష్టాలు పడింది.. పెట్టింది.

మాట మాటకూ మాట మార్చే రావుల  సంగచ్చెప్పూ! మేం మెదలకుండా ఊరుకునుంటే.. ఇహ  సాధువేషంలో దూరబట్టే రావణాసురుడికా సీతమ్మ తల్లి సులువుగా దొరికిందని బుకాయించను కూడా బుకయిస్తావ్! అర్థిక మాంద్యం వల్ల జనాలు ఉద్యోగాలు మారుతున్నారు. ఆ సంగతి మరి మిరు నోరెత్తి బైటకు చెప్పరు.  మైకేల్ జాక్సన్లు వంటి రంగు మర్చుకుంటేనో, వాస్తు ప్రకారం వంటింటి ఫ్లాట్ ఫాం దిశ మార్చుకుంటేనో సామాన్య జనానికి వరిగి వళ్లో పడేదేముందంట? నీ వీలును బట్టి సెక్సు మార్చుకోడానికి, పాత్రను బట్టి బాడీ షేపు మార్చడానికీనా రాజకీయాలలోకే రావడం! వందేమాతరం వరస మారిందనో, అమెరికా రిటనోడి యాస మారిందనో వంక బెట్టి నీ సొంత లాభం కోసం మారడమే ప్రజాప్రతినిధిగా జనానికి నువ్వు చేసే అతిపెద్ద ద్రోహం.

 

నీ ముసుగులో గుద్దులాట చూస్తుంటే ముద్దేస్తుందబ్బీ! మా నేత దినదినం గొప్పవాడిగా మార్పు చెందడం చూళ్లేకే ఈ కుళ్లు ఏడుపులన్నీ.. ‘మార్పు’ను అడ్డమేసుకుని'

 

'నీ గొప్ప నీ దగ్గరే ఉంచుకోఅన్నాయ్.. నాకు నో అబ్జెక్షన్. సముద్రం గొప్పదైతే ఎవరికిరా గ్రేట్? నీళ్లు ఉప్పన. గడ్డిపోచనైనా తనలో నిలకడగా ఉండనీయదు. జీవంతో లోపలికి లాగేసుకోడం.. నిర్జీవంగా ఒడ్డుకు విసిరేసేఎయ్యడం.  గుక్కెడు తాగే మంచితీర్థ మిచ్చే బావి కోసమే జనమెప్పుడైనా అలమటించేది. 'జనంతో మంచి సంబంధాలుంటే నడకలో, నడతలో వినయం .. విని సవరించుకొనే మంచి గుణం, మాటల్లో మార్దవం  ఉంటాయి' అని ఉపన్యాసాలు దంచాడుగా  మరి మన అధినేత!.. మరిప్పుడు..

నిన్నింకా మా పార్టీ వేపుకు మార్చుకునే ట్రయల్స్ శుద్ధ వేస్ట్. నువ్వు మారవురా బాబో! మన టీ.వీ సీరియల్స్, సినిమా కతలు, రోడ్ల బాపతే..

‘జనం తలరాత’ అని మాత్రం అని అనవు కదా! మరి మారంది మీరా.. మేమా? హ్హా.. హ్హా..హ్హా!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట 01 -08 -2009 - 'మారేవి.. మారనివి' శీర్షిక పేరుతో ప్రచురితం)



 


 

 

 

 

 

 

 

 

ఒకటి ఒకటి కాదు! హనుమంతరావు (ఈనాడు - సంపాదకీయ పుట ప్రచురితం)

 



'కొత్త సిద్ధాంతం కనుక్కున్నానోచ్!' అన్నాడు సుబ్బారాయుడు. సిద్ధాంతాలు కనుక్కోడంలో అతగాడు సిద్ధహస్తుడు. సుబ్బారాయుడి సిద్ధాంతం కనుక్కునే ముందు సుబ్బారాయుణ్ణి గురించి తెలుసుకోడం ముఖ్యం.

 

ఏడేళ్లు రెవిన్యూ డిపార్ట్ మెంటులో మమేకమై పనిచేసిన అనుభవంతో సుబ్బారాయుడు ఆ మధ్య ఓ చివిత్రమైన యంత్రం కనుకున్నాడు. అది అప్పట్లో గొప్ప సంచలనమే కాదు.. సుబ్బారాయుడి స్థానచలనానికీ కారణమయింది.

 

గవర్నమెంటాఫీసన్న తరువాత పదిరకాల మనుషులు వచ్చిపోతుంటారు. ఎవరు నిజంగా మంత్రిగారి బంధువో, ఎవరు కాంట్రాక్టర్ సర్కిల్లో తిరిగే మనిషో, ఎవరు కోన్ కిస్కా గొట్టాంగాడో .. పెదవి విప్పకుండానే పసిగట్టే యంత్రమది. పార్టీ వచ్చి ఎదుటి సీట్లో కూర్చోగానే దాని మనసు, పరసు కూడా ఇట్టే వాసనపట్టేయడమే దాని స్పెషాలిటీ.

 

ప్రయోగాత్మకంగా దాన్ని తన సీటుకు పెట్టుకున్న పూటే ఆకస్మిక తనిఖీకి వచ్చిపద్డారు సంబంధిత మంత్రి. ఆయన సరాసరి వచ్చి సుబ్బారాయుడు ఎదర సీట్లోనే అధిష్ఠించారు. మంత్రిగారని యంత్రానికేం ఎరిక? జేబులు తడుముతూ వీడియోలో పడ్డం.. వెంటనే సుబ్బారాయుడి ఉద్యోగం ఊడ్డం.. అంతిమ ఫలితం.

 

ఆ సాయంత్రమే మంత్రిగారు పిలిపించుకుని తనను, యంత్రాన్ని తన వ్యక్తిగత కార్యాలయంలో నియోగించుకున్నట్లు సుబ్బారాయుడు చెబుతుంటాడస్తమానం. మంత్రిగారి మంత్రాంగం బృందంలో చేరిం తరువాత యంత్రాల పని మాని.. సూత్రాలు కనిపెట్టే రంధిలో పడ్డాడు సుబ్బారాయుడు.

 

'ఒక్కటిగా కనిపించేది ఏదీ ఒక్కటి కాదు'- అదీ సుబ్బారాయుడి కొత్త సిద్ధాంతం ఈసారి.

 

'మరెన్ని?' అడిగానో రోజు మా ఇంటికి మాటా మంతికని వచ్చి కూర్చున్నప్పుడు.

'రెండు.. అంతకు మించి ఎన్నైనా కావచ్చు'

 

'అదెలాగా?!'

 

నా జేబులోంచి ఓ వంద నోటు తీసుకుని 'ఇదెంత?' అనడిగాడు సుబ్బారాయుడు.

'వంద'

'కాదు.. రెండు యాభైలు..' అంటూ తనజేబులో పెట్టుకున్నాడు.

కాదనేందుకేం లేకపోయింది. లాజిక్ అలా కుదిరింది. ఇంతలో మా పాప శిరీష వచ్చి మంచి నీళ్ళిచ్చింది. 'పిల్లలెంత మంది?' అనడిగాడు మళ్ళీ.

'ఈ పిల్ల ఒక్కతే!' అన్నా బిక్కుబిక్కుమంటూ.

'కాదు.. ఇద్దరూ!' అనేశాడు వెంటనే. 'పాపా! నువ్వు నాన్న కూతురివా? అమ్మ కూతురివా?' అని పాపనే అడిగేడు.

'ఇద్దరి కూతుర్నీ' అందది ముద్దుగా.

'చూశావా! నాన్న కూతురు శిరీషా, అమ్మ కూతురు శిరీషా' అన్నాడు సుబ్బారాయుడు.

 

'నమస్తే! అన్నయ్యగారూ!' అంటూ కాఫీ కప్పులు తీసుకెళ్లేందుకని వచ్చింది మా శ్రీమతి. 'నీ కిద్దరు పెళ్లాలు' అని ఎక్కడంటాడోనని ముందే జాగ్రత్త పడి వాడిని బైటకు తీసుకొచ్చేశా వెంటనే.. బస్సెక్కించడానికి.

దారి పొడుగూతా వాడు  ద్వైత సిద్ధాంతాన్ని గురించి బాధిస్తూనే ఉన్నాడు.

 

'సమస్త విశ్వాన్నీ అక్రమించిన సర్వేశ్వరుడు ఒకడైతే.. బూజుపట్టిన పూజగదిలో ముక్కవాసన గొట్టే అగరొత్తులు పీలుస్తూ గోడకు చేరగిలబడిన సర్వేశ్వరుడు ఇంకొకడు. గుజరాత్ ఘోరం విని కన్నీళ్లు పెట్టుకుని కవిత్వం రాసిన వాజ్ పేయీ ఒకరైతే, మోదీ పాలన బ్రహ్మాండంగా సాగుతోందని పార్లమెంటు సాక్షిగా వాదించే వాజ్ పేయీ మరొకరు. 'యుద్ధానికి సిద్ధం' అనే ముష్రఫ్ ఒకరైతే, 'శాంతి చర్చలకు వస్తాం' అనే ముష్రఫ్ మరొకరు. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక బుష్.. పాకిస్తాన్ లో మరో బుష్. ఇలా ప్రపంచమంతా ద్వైతంతో ఎందుకు నిండి వుందో తెలుసునా?' అనడిగాడు నా స్కూటర్ వెనక నుంచి దిగిపోతూ.

దూరంగా అతగాడెళ్లాల్సిన బస్సు వస్తూ కనిపించింది. అయినా వదలడు కదా!

 

'పులీ మేకా; పామూ ముంగిసాల్లాంటి శత్రువులను సృష్టించిన బ్రహ్మదేవుడికి మనిషిని సృష్టించే వేళకు నిద్ర ముంచుకొచ్చింది. అప్పటికే బాగా నైటయింది. 'లైటార్పి ఇహ పడుకోండీ!' అంటూ పక్కన సరస్వతీదేవి సతాయింపొకటి. ఆ చికాకులో మతిమరుపు మహాశయుడు బ్రహ్మయ్య మనిషిని రెండు సార్లు తయారు చేసేశాడు. తెల్లారి లేచి చూసుకున్న తరువాత గానీ తాను చేసిన తప్పు తెలిసిరాలేదు. సృష్టించడం తప్పించి నాశనం చేసే పని బ్రహ్మయ్యకు చేతకాదు కదా. అంచేత రెండింటినీ కలిపి ముద్దచేసి భూమ్మీదకు విసిరేశాడు. అందుకే మన భూమ్మీది మనుషులెప్పుడూ రెండుగా కనిపిస్తారు. రెండు సోనియమ్మలు, రెండు మోదీలు, రెండు నువ్వూలు.. రెండూ నేనూలూ..' అంటూ బస్సెక్కేశాడు.

అదే ఆఖరు చూపనుకుంటా నా వరకూ.

 

మొన్న పెద్ద బజార్లో గోడ మీద పెద్ద వాల్ పోస్టరొకటి కనిపించిందట మా శ్రీమతికి. 'స్వామి వైవిధ్యానందులవారి ప్రవచనములు' అన్న దాని పక్కనున్న ఫోటో శాల్తీకి గడ్డం, మీసాలు లేకుంటే అచ్చం మీ సుబ్బారాయుడేనండీ!' అంది మా ఆవిడ ఇంటికి తిరిగొచ్చిం తరువాత.

సొంత పెళ్ళాన్ని పట్టుకుని ద్వైతం మత్తులో 'నీ కిద్దరు మొగుళ్లు’ అన్నాట్ట ఇంట్లో ఓ రోజు! ఆవిడగారు చీపురు కట్ట తిరిగేసింది. అప్పట్నుంచి అదే పోత..  పోత! అర్నెల్ల తరువాత స్వామి వైవిధ్యానందులవారి అవతారంలో తిరిగి  ప్రత్యక్షమయాట్ట! ఈ మధ్యన ప్రవచనాలూ.. అవీ ఇస్తూ మస్తు ప్రచారంలోకి వచ్చేశాట్టలేండి!

 

'మీరూ ఓ సారి వెళ్లి కల్సి రారాదూ!  మంత్రులూ, ఎం.పీలతొ కలివిడిగా తిరిగే మనిషి.. మనకూ ఎందుకైనా పనికొస్తాడు ముందు ముందు' అనింట్లో ఒహటే పోరుపెడుతుంటే .. అదీ నిజమేననిపించింది నాక్కూడా.  సాయంత్రం ఆ సభ జరిగే వైపుకు వెళ్లాను.

అనివార్యకారణాల వల్ల సభ వాయిదా పడిందని బైట బోర్డు!

 

మర్నాడు పేపరు చూస్తే గానీ తెలిసింది కాదు.. ఆ అనివార్య కారణాల కథా కమామిషేంటో! వారణాసి నుంచి వేంచేస్తో వైవిధ్యానందులవారు యూపీ ఎం.పి పాసు మీద  శిష్యగణంతో సహా పట్టుబడిపోయారుట! అదే సమయంలో సదరు గౌరవనీయులైన ఎం.పీగారు  లోకసభలో బెంచీ మీద కూడా గుర్రుకొడుతూ కెమేరాలకు చిక్కడంతో.. టీవీలు లైవ్ ప్రసారాలతో ఆడుకున్నాయి. ఆ  వత్తిడి కారణంగా స్వామివారిని స్టేషన్ రూములోనే నిర్బంధించక తప్పింది కాదని .. భక్తశ్రేణికి రైల్వేవారి వినయపూర్వకమైన ప్రకటనోటి వెలువడింది!

 

 ద్వైత సిద్ధాంత మర్మాలను గురించి స్వామివారు బోధపరచపోతే రెండు శాల్తీలకూ పెనాల్టీలు కట్టమని కూర్చున్నాట్ట  నాస్తిక కుర్ర టీ.సీ.  బోర్డు అధికారుల బుర్రలకు ద్వైత సిద్ధాంత సారం బాగా పట్టించేదాకా స్వామి వైవిధ్యానందులవారికి రైల్వేవారి సెల్లే వసతి గృహం కాబోలు!

 

'అయ్యొ రాతా! దానికోసం గానూ సభెందుకండీ వాయిదా? ఒక స్వామి సెల్లులో ఉన్నా మరో

స్వామి ప్రవచనాలకు వచ్చి పోవచ్చుగదా?' అంది మా శ్రీమతి ఎంతో విశ్వాసంగా.

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు - సంపాదకీయ పుట తేదీ. 02, అక్టోబర్, 2002న- ప్రచురితం)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, April 13, 2021

శ్రమకు తగ్గ ఫలం - వ్యంగ్యం ఈనాడు -కర్లపాలెం హనుమంతరావు

 



ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. దేశంలోనీ నూట పాతిక పై చిలుకు కోట్ల జనాభాకు ముష్టి ఏడొందల తొంభై మూడు మంది మాత్రమేనా ప్రతినిధులం! మా కన్నా తక్కువ స్థాయి పనోళ్లకి మాకు మించిన జీతభత్తేలా? మా గౌరవనీయులైన ప్రజాప్రతినిధుల  మానమర్యాదలు నిలబందుకైనా  వాళ్ల కన్నా కనీసం ఓ రూపాయన్నా ఎక్కువ జీతంగా దక్కాల్సిందే! .. ఎవరు బాబూ నువ్వు? ఎందుకు నీకా నవ్వు?

గుర్తుపట్టవులే? నీ అంతరాత్మను కద! ఎన్నికల సంఘానికి నువ్వు సమర్పించిన దొంగలెక్కల ప్రకారం చూసుకున్నా.. నీ ఒక్క పూట ఆదాయం .. ఈ దేశంలోని తెల్లకార్డువాడి ఏడాదాయనికి వందరెట్లెక్కువ! అందుకే నవ్వాగలా! ఫ్రీ బంగళా, ఉచితంగా ఫోన్ కాల్సు, నియోజకవర్గంలో తిరిగినా తిరక్కున్నా మీరు ఆఫీసు సాదర ఖర్చులకన్చెప్పి  ఏవేవో బిల్లులు పుట్టించి ఇంకెంత బొక్కుతున్నారో..  కాగ్ వాడికే నోరాడని పరిస్థితి. ఇహ విమాన ప్రయాణాలని, రైల్లో బంధుబలగానిక్కూడా ఫస్ట్ క్లాస్ సదుపాయాలని.. అవీ ఇవీ మీరు నొక్కేవన్నీ చూపిస్తూ సర్కారు బొక్కసానికి ఏటా ఎంతో కొంత బొక్కేస్తూనే ఉంటివి! ఇంకా చాల్చావడం లేదంటూ తెల్లారంగానే ఈ కొత్త ఆగమేంటి సోదరా? ఈ కరవు, కరోనాల కష్టకాలంలో  అసలు నీకు దక్కుతున్నదే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయ్! మన్లో మన మాట.. అసలుకి మీకు జీతభత్యాలెందుకు  పెంచాలి? ఒక్క కారణం చెప్పు.. నవ్వకుండా నోరు మూసుకుంటా!

ఒక్కటి కాదు.. వంద చెబుతా.. వినే ఓపిక మరి తగ్గకుండా ఉండాలి నీకే! ఈ ప్రజాప్రతినిధి వృత్తిలోకి రాక మునుపు నా సంపాదన ఎంతో నీకూ తెలుసని నాకూ తెలుసు.  మామూళ్లు, సెటిల్మెంట్లు, రింగులు గట్రా నేరుగా చేసుకునే సౌకర్యం గతంలోలా ఇప్పుడుండదుగా మరి! పనోళ్లకు సిమెంటు ఫ్యాక్టరీలున్నా పట్టించుకోని పబ్లిక్.. అదేంటో మేం ఇసుమంత ఇసుక దందాకు ప్రలోభ పడ్డా.. అదేందో మహా విసుగుదల చూపిస్తూంది! కాబట్టే ప్రభుత్వ వైద్యులకు మల్లే మాకూ నాన్ ప్రాక్టీస్ ఎలవన్సులాంటిదేదైనా భారీగా ఉండాలని డిమాండ్. ఏం తప్పా?

పాయింటేనబ్బీ!

చేంతాడంత మా ఆదాయాల లిస్టు చదవడమే నీకింట్రెస్టు.  మా ఖర్చుల పట్టికేనేడన్నా  పట్టించుకున్నావా అన్నా?  సర్కారు మార్కు ముష్టి ముగ్గురు సెక్యూరిటీ మా అక్కరకేం సరిపోతుంది చెప్పు! కాలు బైటపెడితే ఎంత హంగూ ఆర్భాటం  కావాలి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులన్న తరువాత! పెట్రోలు రేట్లు రేకెట్ల వేగంతో పోటీ పడుతున్నట్లు పబ్లిక్కే పడతిడుక్కుంటుంటిరి. సెక్యూరిటీలో ఒక్కోరికేమన్నా రెడ్ ఫెరారే కారేమన్నా కోరుకున్నామా? అక్కడికీ,  ప్రయివేట్ సైన్యం పాట్లేవో సొంతంగానే పడుతుంటిమిప్పడి దాకా! బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు, బాంబులు, బుల్లెట్లకయ్యే ఖర్చులు ఎంతని అచ్చుకోము సామీ ఈ కరవుకాలంలో! అన్నీ బైటికి చెప్పుకునే ఖర్చులే ఉంటాయా చెప్పు ప్రజా ప్రాతినిథ్యమనే తద్దినానికి తయారైం తరువాత. ఎన్నికల ప్రహసానాల మర్మం నీకూ  తెలుసు. ఎన్నెన్ని రకాల వత్తిళ్లయితే 'బూత్ గండాల' నుండి బైట పడ్డం!

 

నిజవేఁ! ఇది వరకు మాదిరి ఏదో ఓ సందు చూసుకొని సర్కారు భూముల మీద జెండాలు పాతేసే సీన్లు .. పాపం  సన్నిగిల్లాలాయ మీ ప్రజాప్రతినిధుల కిప్పుడు! దేవుడి సొమ్ము దేవుడికే తెలీకుండా మాయమైపోతుండె! ఇహ మీ వాటా కొచ్చే దెంత..  చిటికెడు బూడిద.. సింగిల్ చెవిలో పూవు!

 

ప్రభుత్వాలేమన్నా స్థిరంగా ఉండుంటే, ఆ నిబ్బరం  వేరు .. మన వాటా మన పరమయిందాకా, ఏ కేంటీంలో చాయ్ తాగుతూనో, లాబీల్లో కులాసా చేస్తూనో గడిపేయచ్చు. ఎప్పుడు ఏ బిల్లు మోషన్ కొచ్చి కొంప ముంచుతుందో.. కాల్ సెంటర్ గార్ల్ కన్నా మెలుకువ తప్పనిసరయిందిప్పటి ప్రజాప్రతినిధికి. మరి  ఆ మేరకైనా జీతభత్యాలలో మాకు  మెరకా పల్లం సరిచేయాల్నా వద్దా? లాభదాయక పదవుల్లో ఉండద్దని రూలు పెట్టగానే సరా!  ఆ వారా మాకు జరిగే నష్టం పరిహరించే  లెక్కలు  మాత్రం  చూసుకోవాలా.. లేదా?   లెక్కన చూసుకుంటే మేమిప్పుడు అడిగే  ఐదురెట్ల హెచ్చింపు పులుసులో ముక్క. అదేందో! ప్రజాప్రతినిధి అంతరాత్మవయి వుండీ పద్దాకా జనం తర్ఫున  పీకులాడే రోగం నీకు!  బొత్తిగా అప్రజాస్వామికం నీ వ్యవహారం!

 

సారీ బ్రో! నువ్వింతగా ఒప్పించిం తరువాత కూడా   మైండ్ సెట్ మారకపోతే నేనీ పోస్టుకే వేస్ట్.  మీ జీతభత్యాల పెంపు ఐదేంటీ.. ఇంకో అయిదు రెట్లు ఎక్కువున్నా  తక్కువే సుమా!

 

థేంక్స్ అంతరాత్మా! ఇప్పడికైనా దార్లో  పడ్డావ్!

 

కానైతే నాదీ ఓ చిన్న విన్నపం బ్రదర్! జీతానికి తగ్గట్లు పనీ పాటా ఉండటం సహజన్యాయం. అరవై ఏళ్ల కిందట ఏటా అరవై ఎనిమిది బిల్లులు పాసయేవి చట్టసభల్లో. ఇప్పుడో?   సంవత్సరానికి యాబై ఆమోదమయేందుకే అస్సులు.. బుస్సులు! అవీ చర్చలేవీ లేకుండానే చట్టాలైపోయే పరిస్థితులు! చట్టసభల్లో మీ ప్రజాప్రతినిధుల హాజరు మరీ చిన్నబళ్లల్లో బుడతల హాజరు కన్నా హీనంగా ఉందని జనం బెంగ.

 

అయితే ఏంటంటావ్?

 

ఎకౌంటబలిటీనే బట్టే ఎక్కౌంట్స్   సరిచేయాలంటాను. గంటకు ఇంతని హాజరు భత్యం  ఉండాలి. హాజరుపట్టీ ప్రకారమే జీతాల పట్టి తయారవ్వాలి. వాకౌట్ చేసిన రోజున  జీతం మొత్తం కట్! సభాపతి లేకుండా మాట్లాడిన పక్షంలో పదానికింతని పెనాల్టీ విధించాలి. మార్షల్స్ బలవంతంగా మోసుకుపోయే సందర్భాలలో  కిలోకింతని బాడీ బరువును బట్టి రుసుం విధించడం అవసరం. ఫలహారశాలల్లో  అనుమతి మేరకు లాగించడం వరకు ఓకే.  అదనపు మేతకు మాత్రం అధికంగా వసూలుచేసి తీరాలి. రాజకీయాల్లోకి రాక ముందూ.. వచ్చిం తరువాత ఉండే ఆదాయాలలోని వ్యత్యాసాన్ని బట్టి శిస్తులు వసూలు చేసే కొత్త విధానం తీసుకొస్తే మీ ప్రజాప్రతినిథుల నెలసరి జీతభత్యాలు ఎనిమిది లక్షలేంటి.. పద్దెనిమిది లక్షల మీద ఒక్క రూపాయి పెంచుకున్నా ఆక్షేపించేందుకు లేదు.  దట్సిట్!

 

సడి! నీ లెక్కన ఇక మాకంటూ మిగిలేదేముంది.. ఆ ఒఖ్క రూపాయి తప్ప!

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుట వ్యంగ్యం - తారీఖు నమోదు కాలేదు)



 

 

 

 

 

 

 

 

 

 

!

 

 

 

 

 

 

Monday, April 12, 2021

శ్రీరాములవారికి సాయము కావలెనా?-ఈనాడు వ్యంగ్యం – -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట వ్యంగ్యం 28 -04 -2008)

 

 

'వనవాసానంతరం శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అట్టహాసంగా జరుగుతోంది. అటూ ఇటూ తమ్ముళ్లు, వెనక వాలి కొడుకు, పక్కన సీతమ్మ, పాదాల చెంత హనుమంతయ్య- రవివర్మ బొమ్మంత అందంగా ఉన్న ఆ వింతను చూసి అంతా ఆనందిస్తూంటే, అసుంటా దూరంగా నిలబడ్డ సౌమిత్రి మాత్రం ఈ వంకో సారి చూసి వింతగా నవ్వుకున్నాడో రెప్పపాటు..
'ఎందుకు తాతయ్యా?' అనడిగాడు చిన్నా.
'చెబ్తా! ముందీ 'డాండ డడాండ డాండ..' పద్యం అప్పచెప్పు!' అన్నాడు రాంకోటి బాబాయ్.
ఆయనో రిటిర్డ్ తెలుగు టీచర్. ఇంట్లో మనవడికి రామాయణం చెబుతున్నాడు గాని, బైటెంత భారతం జరుగుతోందో ఆ పెద్దాయనకు తెలీదు.
'నాసావాళ్లు ఆకాశం నుంచి తీసిన ఈ ఫొటోలు చుశావా బాబాయ్.. అసలు రామసేతువనేదే లేదంటున్నారే!'అని రెచ్చగొట్టా.
'నీరజాక్షి కొరకై నీరథి దాటిన నీ కీర్తిని విన్నానురా' అన్నాడు గదరా త్యాగయ్య. మరి వారధి లేకపోవడమేంటీ! వెధవ డౌట్లు!'
'విన్నాను అన్నాడు గానీ కన్నాను అన్లేదుగా! ఆ కట్ట.. మనుషులు మట్టి పోసి కట్టిందని పురావస్తు సర్వే జనాల పరిశోధనల్లో కూడా తేలింది బాబాయ్!'
'ఆ సర్వే జనాలెవరో కానీ సుఖినోభవన్తు. మనుషుల కట్టయివుంటే మన పంజగుట్ట ఫ్లై ఓవర్లా ఎప్పుడో కూలుండేవి గదరా! దైవ నిర్మితం. కాబట్టే పర్మినెంటుగా అట్లా పడుంది పిచ్చోడా! 'కదలేవాడు రాముడు గాడే' అన్నాడు త్యాగయ్య. రామయ్యే ఆ గాడ్.. ముందది తెలుసుకో!'
'రాముడేంఈ గాడ్ కాడు.. హి వాజ్ జస్ట్ అ రూలర్ అంటున్నారు బాబాయ్.. ఇంకా ఆ వార్తున్న పేపరు చదివే దాకా నువ్వొచ్చినట్లు లేదు'
''రామ.. రామ! పరంధాముడే పురుషోత్తముళ్లా అవతరించాడ్రా బడుద్ధాయ్! మీకర్థమై అఘోరించినట్లు లేదు'

చిన్నాగాడు ఊరుకుంటాడా!చిచ్చర పిడుగు! మధ్యలో దూరిపోయి 'తాతయ్యా! మరి రావుఁ డు దేవుఁ డైతే అన్ని సినిమా కష్టాలెందుకు పడ్డం! ఈ అంకుల్సంతా 'ఉన్నావా.. అసలున్నావా' అని అక్కినేని తాతయ్యలా నిలదీస్తుంటే నీ పూజ గది నుంచి బైటికొచ్చి వీళ్ల బ్యాండ్ బజాయించెయ్యచ్చు గదా బాగా?'
'భడవాఖానా! ఆ పుణ్యమూర్తేమన్నా ఫ్రీడం ఫైటర్రా? పింఛన్ కాసుల కోసం ఇంకా బతికే ఉన్నట్లు పత్రాలు పుట్టించుకు తిరగడానికి? ప్చ్! బొత్తిగా లౌక్యమెరగని దేవుడయిపోయాడు! వారధి శంకుస్థాపన్నాడన్నా ఓ రాయి శిలాఫలకంలా పాతించేసుంటే ఇప్పుడిన్ని శంకలకు ఆస్కారం ఉండేదే కాదు. కనీసం ఇందిరమ్మలా పథకాలన్నిటికీ తన నామధేయం పెట్టించుకునుంటే సరిపోయుడేది.. ఈ చిరునామాలవీ నిరూపించుకునే తల్నొప్పులు తప్పుండేవి! నాలుగైదు కాలనాళికలు ఏ రామేశ్వరం, భద్రాద్రిల్లోనో పాతేసుంటే 'ఉన్నాడో .. లేడో భద్రాద్రి యందు' అంటూ అస్తమానం ఆ రాందాసుకు తాతలాగా సందేహపడేవాళ్లందరికీ సమాధానం దొరికేది. రావణాసురుడే బెటర్రా బుజ్జిగా! మనోల మందమనస్తత్వం ముందే తెలిసి తన వారసుల్ను సందు సందునా వదిలిపోయాడు. ఇప్పుడీ పిచ్చ రచ్చంతా ఆ రావణాసురుడి వారసుల అల్లరే! ఏ గామా కంపెనీకో లాభాలార్జించే దొడ్డి దారి స్కామనుకో.. ఈ నసంతా!'
'నువ్వు మరీ బాబాయ్! దారి కడ్డంగా పడున్న ఆ రాళ్ల గుట్టల్ని కొట్టేసేస్తే రవాణా సమయం ఆదా అవుతుంది కదా! దూర భారాలు తగ్గి ధనం, ఇంధనం కూడా మిగులుతుందంటున్నారు ఆర్థికవేత్తలు. అయినా. లేని రాముడు కట్టని గుడిని కొట్టేస్తే నీకేం కష్టాలొచ్చిపడతాయో నా కర్థం కాడంలే బాబాయ్.. నువ్వూరికే రొష్టుపడ్డం తప్పించి'
'సునామీలొస్తే జనాలన్యాయంగా చస్తార్రా సన్నాసీ! జీవజాలం నశిస్తుంది. తీరప్రాంతం తలకిందులవుతుంది. ఉగ్రవాదులు ఈ వైపు నుంచి కూడా విరుచుకుపడతారు. పెట్టని కోటల్లాగున్న హిమాలయాలు అడ్డంగా ఉన్నాయని కూల్చేసి ప్లాట్లేసి అమ్ముకుంటామన్నట్లుందబ్బీ నీ పెడవాదన! దేవుళ్ల నివాసాలుండేవి అక్కడేరా!వాళ్లూరుకుంటార్రా! బోధివృక్షం వట్టి చెట్టేగా! మరి కొట్టేసి కట్టెల కింద అమ్ముకోమను చూద్దాం! దేహశుద్ధయిపోతుంది శుద్ధంగా. రావుఁడు లేడంటున్న రాక్షసులను ఇతర మతాల దేవుళ్ల జోలికి వెళ్లమను.. తాట తీస్తారు. తారక రామయ్యొక్కడేనట్రా ఈ తాటక వంశవారసులందరికీ తేరగా దొరికిందీ!' బాబాయ్ అంతెత్తున లేవడం అదే మొదటిసారి నాకు తెలిసి.
మూడ్ మార్చక తప్పేట్లు లేదు. 'చిన్నాగాడికి ఇందాకేదో పాఠం చెబుతుంటివిగా! సినిమా గుమ్మడి మాదిరి మూడీగా ఉండే లక్ష్మణస్వామికి అన్న పట్టాభిషేకం టైంలో అంత చేటున ఎందుకు నవ్వొచ్చినట్లో? చెప్పు బాబాయ్.. నాక్కూడా వినాలనుంది' అనడిగా,
'నేన్చెప్తానంకుల్!' అంటూ మధ్యలో దూరాడు చిన్నాగాడు. 'త్రేతాయుగం కాబట్టి ఈ రాముడికి రెండో సాటి దేవుదు లేడంటూ గడ కట్టి మరీ భేరికల్తో డాండ డడాండ డాండంటూ నినదాలు భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్లు చేసుకోడమే గానీ, రాబోయే కలికాలంలో మత్త వేదండాలెక్కి మరీ 'అసలుకి దాశరథీ లేడు.. గీశరథీ లేడు; అతగాడు కట్టించినట్లు పుట్టించిన వారథులసలే లేవం'టూ ఇంతకు మించి గగ్గోళ్ళు బైల్దారతాయని వీళ్ళకెవళ్లకీ తెలీడంలేదు.. పాపం' అని ఆ వెటకారపు నవ్వు.! కదా తాతయ్యా?'
'ఎవర్రా అట్లా గగ్గోళ్లు పెట్టేదీ?' అగ్గిరావుఁడైపోయాడింకోసారి పెద్దాయన.
'ఇంకెవరూ? దక్షిణాన కరుణానిధి తరహా బ్యాచీ.. ఉత్తరాన.. '
'భడవా! బాగా ముదిరిపోయాడ్రా వీడూ.. ' అంటూ అడ్డొచ్చాడు అప్పుడే ఊడిపడ్డ వాడి డాడీ!
బెదిరి పెద్దాయన పూజగదిలోకి తారుకున్నాడు కొడుకు రాకతో.
'అయినా నాన్నకూ.. చిన్నాకూ ఈ వయస్సుల్లోనుట్రా ఈ రామకీయాలూ గట్రా?! ఒక కుంకకింకా బొడ్డూడనేలేదు. ఇంకోరికిక కింద పడ్డ పైగుడ్డ అందుకునే ఓపిక్స్ రాబోదు! అవతల రోడ్డు వైడెన్ కోసమని రామాలయాన్ని లేపేయాలని కోర్టుల్లో కేసేసినోళ్లే.. తీర్పు తమ వైపు రావాలని అదే గుళ్లో అర్చన చేయించేస్తున్నారు! దేశమంతా ఎంతంత తింగరోళ్లతో నిండుందో నీకు తెల్దా? రామకీయాలంటే.. అధికారం కోసం పొలిటికల్ పార్టీలోళ్ళు చేసుకునే రాజకీయాలు. మన ప్రజారాముళ్ల నా విషయంలో అప్రమత్తం చేయాల్సిందిపోయి.. ఇంట్లో ఏందిరా నువ్వూ ఈ పిచ్చి పిచ్చి టీవీ టైపు చర్చలు!' అంటూ నాకే పెట్టాడు ఇంత గడ్డి చివరకు మా అన్న.
నిజవేఁ! శ్రీరాములవారి సాయము కావలెను అని ప్రతి పనికి ముందు రాసుకునే మానవులం .. శ్రీరాములవారికి సాయంపోడానికి ఎంత సాహసం! శ్రీరాములవారికి మన సాయము కావలెనా? అనిపించింది నాకూ చివరకు.
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట వ్యంగ్యం 28 -04 -2008)


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...