Showing posts with label Western. Show all posts
Showing posts with label Western. Show all posts

Sunday, December 15, 2019

తోకచుక్కలు, గ్రహాలు, నక్షత్రాలు -కీర్తి ప్రతిష్ఠలు -కర్లపాలెం హనుమంతరావు




తోకచుక్కలు తృటికాలం మెరిసి కనుమరుగవుతాయి. గ్రహాల వెలుగు దూరాలు, దగ్గరల మీద ఆధారపడుంటుంది. నక్షత్రాల కాంతి నిరంతరాయం. దవ్వులతో నిమిత్తం లేని చిరంజీవి నక్షత్రం. స్థూలంగా సాహిత్య వినీలాకాశంలో మెరుపులీనే కవులనూ ఈ తోకచుక్కలు, గ్రహాలు, నక్షత్రాలతో పోల్చుకోవచ్చు. అసమాన ప్రతిభగల వాళ్లను నక్షత్రాలతో పోల్చడం ఉచితం. సామాన్య జనాలకు వీళ్ల ప్రతిభా పాటవాలు బేరీజు వేసేటంత సామర్థ్యం ఉండదు. సమకాలీన రచయితలు వృత్తిఅసూయల కారణంగా వారి కీర్తి ప్రతిష్టలకు అడ్డు.  అన్నిటికీ మించి అత్యంత ప్రతిభావంతులను అనామకులుగానే మిగిల్చే అతి ముఖ్య కారణం.. పూవై పరిమళాలు వెదజల్లక ముందే ఆ మొగ్గలను తుంచేయడం.  సమకాలికుల రహస్య ఆయుధం ఇదే! సాటి రాచయితలు ఎవ్వరూ తమకన్నా ఎక్కువగా కీర్తి ప్రతిష్ఠలు పొందడం గిట్టని ఈర్ష్యాపరులు వీళ్లు. ఎవరూ స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఇష్టపడరాదు. తాము అనుకున్న భావాజాలమే తమకు అనుకూలమైన వర్గ ప్రయోజనాలకు తాము ఆమోదించిన మోతాదులో ప్రతిభను ఉపయోగించే వాళ్లనే వీళ్లు ప్రతిబావంతులైన  రచయితలుగా అంగీకరించేది. వాళ్ల దురష్టం కొద్ది ఎన్ని అవాంతరాలు సృష్టించినా కొంతమంది ప్రతిభావంతులు తాము అదుపుచేయలేనంత నైపుణ్యంతో ఊహించనంత కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. జీనియస్ ల పట్ల సెకండ్ రేట్ సమకాలికుల అకృత్యాలు ఈనాటివి కాదు.
ఎదుటివారి ఆధిక్యాన్ని మరుగుపరచడం రెండు పద్ధతుల్లో సాధ్యం. అంతకన్నా ఎక్కువ ప్రతిభను ప్రదర్శించేందుకు కృషిచేయడం. కష్టంతో కూడిన ఈ పని కన్నా అసలు ఎదుటివాడి ప్రతిభనే గుర్తించకపోవడం సులభం. చేవ తక్కువ అసూయాపరులు అందుకే ఎక్కువగా రెండో పద్ధతిలో పోతుండేది. స్వీయ సంస్కరణ కన్నా రంధ్రాన్వేషణ సులభమైన పని కూడా. కోకిల, కాకి ఒకే పక్షి జాతి. పంచమ స్వరంతో  లోకాన్ని పరవశింపచేస్తుందని కోకిలకు కీర్తి. అది సహించలేని కాకులు గుంపుగా చేరి గోలగోలగా కూయడంలా ఉంటుంది అసూయపరుల అవాకులు, చవాకులు. స్పానిష్ తత్వవేత్త  జాల్త్ జార్ చెప్పుకొచ్చిన ప్రతిభ, అసూయల మధ్యనుండే అంతరం అన్నివేళలా అన్ని స్థలాలా  దర్శనిమిచ్చేదే! ప్రతిభలేమితో బాధపడే ఆత్మన్యూనత నుంచి మనసును ఉపశమింపచేసే బ్రహ్మాస్త్రం అసూయాద్వేషాలు. ద్వేషం దాచి అసూయతో చేసే వెటకారాలు ప్రతిభావంతుల కీర్తిని మరింత పెంచుతాయి.  'ప్రతిభ లేని సందర్భంలో వినయం భూషణంగా భాసిస్తుంది' అంటాడు లిక్టెన్ బర్గ్.  అట్లా అని అతివినయం చేటు తెస్తుంది.  గోతె  'దొంగవెధవలే అతివినయం నటిస్తారు' అంటూ కుండబద్దలు కొట్టేసాడు మరి. సెర్ర్వాంటస్ కూడా తన 'జర్నీ అప్ పర్నాసస్' లో కవులను అతివినయం ధూర్తుల జాబితాలో కలిపేస్తుంది' అని చేసిన  హెచ్చరిక మర్చిపోరానిది. 'నా రాతలు కాలానికి ఎదురీతలు' అని షేక్స్పియర్ లా అతిశయాలు పోవాలంటే షేక్స్పియర్ అంతటి ప్రతిభ ఉందో లేదో బేరీజు వేసుకోవాలి ముందు. చెత్తను మాత్రమే  ఆకాశానికి ఎత్తేసే కువిమర్శకులు అసూయతో చేసే వ్యాఖ్యలు ఒక రకంగా  ప్రతిభ గల రచయితలకు ప్లస్సే! అరచేయి అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేనట్లే కుళ్లుబోతుతనంతో చేసే వ్యాఖ్యానాలు సత్తా గల సద్గ్రంథాలను సహృదయలోకం నుంచి ఆట్టే కాలం దూరంపెట్టలేవు. పనిగట్టుకుని చెత్తను ప్రోత్సహించినా కాలం గడిచే కొద్దీ ఆ కళ వెలాబోవడం ఖాయం.   కాల పరీక్షకు కూడా తట్టుకునే ప్రతిభ తటాలున కళ్లెదుట తలెత్తుకు నిలబడినప్పుడు కుళ్లుమోతులకు మతిపోతుంది ముందు. మాటా పడిపోతుందేమో కూడా!  ఆ మౌన ముద్రా ప్రమాదకరమే. సెనాకా హెచ్చరించినట్లు 'కాటేసే వాటం కోసం కాలనాగులు ఆలోచించే సమయం కూడా కావచ్చును. సాహిత్యం పరిభాషలో ఈ మౌనం పేరే 'విస్మరించడం'. అసూయాపరులతో   ఎన్నేసి  ఇడుములు పడ్డాడో కానీ పాపం..  'విదేశాల నుంచి విడుదలయితే తప్ప  స్వదేశీయుల దృష్టి మంచి పుస్తకం మీద పడదు' అని వాపోతాడు మహా తత్వవేత్త గోతె.
మనం చేసే పనే మరొకడూ చేస్తున్నప్పుడు.. మనల్ని వదిలి ఆ మరొకడిని పొగడ్డం అంటే మనల్ని మనం కించపరుచుకున్నట్లు. ప్రతిభ పరంగా రెండు పనుల్లో ఉండే తేడాను గుర్తించనీయకుండా మన మనసును శాంతింపచేసేది అసూయ. సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా మానవుల్లో సహజంగా ఉండే నైజమే అయినా కళాజగత్తుని ఈ ఈర్ష్యాద్వేషాలు మరంత ఎక్కువ పాళ్లల్లో ప్రభావితం చేయడమే ఆశ్చర్యం.
ఎన్నో అడ్డంకులని అధిగమించి ఎవరికైనా చిరస్థాయి కీర్తి లభించింది అంటే ఆ ప్రతిభ ఎంతటి ఉన్నతమైనదో అర్థంచేసుకోవాలి.
పరస్పర డబ్బా బృందాల వ్యవహారాలను పక్కన పెట్టి మరంత లోతుగా తరచి చూద్దాం. గొప్ప పని స్వయంగా చేయడంలో ఉన్న తృప్తి ఎదుటివారి గొప్ప పనిని గుర్తించి మనస్ఫూర్తిగా శ్లాఘించడంలో కూడా లభిస్తుంది.  నిజాయితీగా ఒకరిని పొగడడం.. మనల్ని మనం కించపర్చుకోవడం కిందకు రాదు. గ్రీక్ కవి హోమర్ సమకాలీనుడు హీసియడ్ మాటల్లో చెప్పాలంటే 'కొందరికి ప్రతిభ స్వయంగా పసిగట్టే ప్రజ్ఞ ఉంటుంది, మరి కొందరికి విజ్ఞులు విడమరిచి చెబితే అర్థమవుతుంది. చాలామంది స్వయంగా తెలుసుకోనూలేరు. ఎవరు చెప్పినా వినిపించుకొనే సహనమూ ఉండదు.' అందుకే మాకియవెల్లి భావించినట్లు లోకంలో జీవించి ఉన్న కాలంలోనే కీర్తి ప్రతిష్ఠలు గడించే అవకాశం అరుదు. హీసియడ్ క్లాసిఫికేషన్ లోని రెండో తరగతికి చెందిన సమాజంలో జీవింఛడం కూడా ఒక అదృష్టమే! దొరికిన గుర్తింపు చిరస్థాయిగా నిలబడేదీ ఈ రెండో తరగతి జిజ్ఞాసుల కారణంగానే.
ఒకసారి గుర్తింపు పొందిన పనిని, వ్యక్తిని గురించి తిరిగి తిరిగి పొగిడేందుకు ఎవరూ సంకోచించరు.. సరి కదా, కాలం గడిచే కొద్దీ ప్ర్రశంసలకు పోటీ పడతారు. పదిమంది గుర్తింపు సాధించిన పనిని తామూ పొగడకపోతే తతిమ్మా బృందం కన్నా వెనుకపడతామేమోనన్న హిపోక్రసీ వీరి నోటి నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. జెనోఫోన్ సూక్తి ప్రకార్రం 'జ్ఞానం ఎక్కడ ఉందో గుర్తించడం కూడా జ్ఞానం కిందే లెక్క. స్వయంగా  ప్రతిభ ప్రదర్శించలేని లోపాన్ని ప్రతిభ ప్రదర్శించిన వారిని శ్లాఘించడం ద్వారా అయినా పూరించుకోవాలన్న సామాన్యులకు ఉండే యావ కీర్తి ప్రతిష్ఠల కొనసాగింపుకు ప్రధాన కారణం. అందరూ అందరు ప్రతిభావంతులను పొగడడం అసాధ్యం.  ఏ తరగతికి చెందిన రచయితలకు ఆ తరగతికి చెందిన వందిమాగదులు. ఆ పొగడ్తరాయుళ్ల మధ్య పోటీ కూడా కద్దు. ఎథీనియన్ రాజకీయ పండితుడు ఫోసియస్  అనర్గళంగా ప్ర్రసంగించగల సామర్థ్యం గల వక్త. ఒకానొక సభలో ఆయన ఉపన్యాసం ఉధృతంగా సాగే వేళ  నిశ్శబ్దంగా ఉన్న హాలులో ముందుగా ఒక మూల నుంచి కరతాళ ధ్వనులు మొదలయ్యాయి. కొంత విరామం తరువాత ఒకరికొకరుగా ఆ తమాషాను అందిపుచ్చుకొని  సభాప్రాంగణం దద్దరిల్లేలా చప్పట్లను మారుమోగిస్తుంటే.. అర నిమిషం తరువాత ఆ హంగామానంతా అణగనిచ్చి అణుకువగా 'మరీ అంత మూర్ఖంగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి' అంటూ చేతులు జోడించాడుట. అనుకరణతో కొనసాగే ప్రశంసల వల్ల అసలైన కీర్తి ప్రతిష్ఠలేమాత్రం అబ్బవు. చిరకాలం మనగలిగే కీర్తి క్రమంగా, నిదానంగా పరిపక్వత సాధిస్తుంది. సమకాలికుల సమర్థన ఒక్కటే చాలదు . తరువాతి తరాల  గుర్తింపును కూడా సాధించి నిలుపుకోవడానికి చాలా ప్రతిభా వ్యుత్పత్తులు ప్రదర్శించాలి. సమకాలికుల అసూయాద్వేషాలకు తట్టుకుని శతాబ్దాల పాటు ప్రాజ్ఞులుగా మన్ననపొందేది కోటికి ఒక్కరు. కొద్దిపాటి తెలివితేటలతోనే కీర్తి ప్రతిష్ఠలు మూటగట్టుకునేవాళ్లే ఎక్కువ. తమ జీవితకాలంలోనే మంచు తునకలా కరిగిపేయే పేరు ప్రఖ్యాతులు ఈ తాత్కాలిక వస్తు జాబితాలోకే వస్తాయి. యవ్వనంలో ఓ వెలుగు వెలిగి వయసు వాటారే దశలో పేరు మసకబారే ప్రముఖులు అశేషంగా కనిపిస్తారు. అందుకు విరుద్ధంగా జీవించివున్న కాలంలో ఆట్టే గుర్తింపు లేకపోయినా తరువాతి తరాల దృష్టిలో మేధావులుగా కీర్తింపబడేవాళ్లు కొందరుంటారు. వాళ్లు అచ్చమైన ప్రతిభావంతులు. రోమన్ కేథలిక్ సంప్రదాయంలో మరణానంతరమే సెయింట్స్ గా మన్నింపు దక్కడం ఇందుకు ఉదాహరణ. గొప్పపని వెంటనే సామాన్యుడి మెప్పుదల పొందదు. పజ్జెనిమిదో శతాబ్ది జర్మన్ పాత్రికేయ రచయిత సీగ్ ఫ్రీడ్ తన హెరొడెస్ ' లో ఆ మాటే చెబుతాడు. చరిత్రలోకి వెళ్లి చూస్తే హెరొడెస్ మాటల్లోని వాస్తవం తెలిసివస్తుంది. ఈనాడు గొప్ప కళాఖండాలుగా హారతులు అందుకునే ఏ చిత్రమే చిత్రకారుని జీవితకాలంలో ఆ స్థాయిలో గుర్తింపు సాధించిన దాఖలాలు కనిపించవు. అనేక తరాల పాటు అనేకమంది కళావివర్శకులు వాటి విలువను వివరించినప్పుడు గాని సామాన్యుడికి వాటి గొప్పతనం బుద్ధికెక్కదు. ఇక రచనల విషయానికి వస్తే చిరకాల కీర్తి ప్రతిష్ఠలకు రెండు అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. పండిత పామర జన రంజకంగా ఉండటం.. వస్తువు ఏ తరగతి పాఠకులకు చెందివుందనే కోణం. వీధినాటక ప్రదర్శనకారులు, సర్కస్ కళాకారులు, నాట్యకత్తెలు, గారడీ ప్రదర్శకులు, నటీనటులు, గాయకులు, సంగీత విద్వాంసులు, రచయితలు, భవన నిర్మాతలు, చిత్రకారులు, శిల్పులు, చివరగా తత్వవేత్తలు. తమాషా ప్రదర్శకులకు మాదిరి తత్వవేత్తలకు తటాలున గుర్తింపు రాదు. విషయం వినోదానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఆకర్షణా తక్కువే. తత్వవేత్తల ప్రబోధ సారం తమాషా ప్రదర్శనలో మాదిరి తటాలుమని తలకెక్కదు. లోతైన అంశాల స్వారస్యాన్ని ఆలస్యంగా అయినా  ఆస్వాదించే స్వల్ప వర్గాలు పరిమితంగా ఉంటాయి కనుక తత్వవేత్తలకు ఒక పట్టాన తమ జీవితకాలంలోనే కీర్తి ప్రతిష్ఠలు దక్కే అవకాశం తక్కువ. సర్వజనామోదం పొందిన వ్యక్తి కీర్తి ఎక్కువకాలం మనలేదు, నెమ్మది నెమ్మదిగా తక్కువ మందితో మొదలయ్యే గుర్తింపు తరతరాలపాటు నిలబడుతుంది.
దాదాపు తత్వవేత్తల సరసనే చేరే వర్గం కవులు, రచయితలు. చిత్రకారులు,  సంగీతప్రాజ్ఞులు, శిల్పనిపుఉణులు. సాకారాత్మకం చెందిన కళకి చావు ఉండదు. అచ్చయిన పుస్తకంలో సరుకుంటే కాలం గడిచిపోయినా ఏదో ఓ శుభదినాన దాని వెలుగులు బైటపడడం ఖాయం. వేలాది రాగి రేకుల మీద నిక్షిప్తమయ్యాయి కనకనే అన్నమయ్య సంకీర్తనలు కాలాంతరంలో ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించాయి. కర్త కన్నా కావ్యం ఎక్కువ కీర్తి ప్రతిష్ఠలు సాధించడం మన్నం చూస్తున్నాం. థేల్స్, ఎంపిడాకల్స్, హెరాక్లిటస్, డెమోక్రిటస్, పార్మెనెడ్స్, ఎపిక్యూరస్  వంటి గ్రీకు తత్వవేత్తలు నక్షత్రాల మాదిరి మేథో జగత్తు మీద వెలుగులు విరజిమ్మడానికి కారణం.. తోకచుక్కలు, గ్రహాల మాదిరి కాకుండా తారల స్థాయిలో  నిదానంగానే అయినా కీర్తి ప్రతిష్ఠలు సాధించడం,
తత్వశాస్త్రం సామాన్యుడి జీవితానికి అనునిత్యం ఉపయోగించే బౌతికాంశం కాదు. దానికి కీర్తి ప్రతిష్ఠలు  తక్షణమే దక్కకున్నా సమాజానికి జరిగే నష్టం తక్కువ. సామాన్యుడి చైతన్య స్థాయిని తట్టి లేపి సుఖమయమైన జీవిత సూత్రాలకు మార్గం చూపించే సత్సాహిత్యం సమకాలీనుల ఈర్ష్యాద్వేషాల కారణంగా మరుగునే ఉండిపోవడం మాత్రం జనావళికి నష్టం కలిగించే అంశమే! వినోదమూ జీవితానికి అవసరమైన దినుసే. ఆ వంటకం తయారుచేసే వంటవాడికీ గుర్తింపు తప్పనిసరి ప్రేరణే. వంటకంలో ప్రత్యేకత ఉంటే  వంటింటి దాకా వెళ్ళి అభినంధించే సంప్రదాయం ఇంగ్లీషువారి సంస్కృతిలో ఉంది. మంచి పుస్తకం మంచి వంటలాంటిదే. కానీ పుస్తకం శ్రేష్టత పనిగట్టుకుని పరిచయం చేస్తే మినహా ప్రాచుర్యంలోకి రాదు. కృత్రిమంగా అయినా సరే కీర్తి ప్రతిష్ఠలు గడించాలని పాకులాడే పేరాశగాళ్ల సంఖ్యే సమాజంలో ఎక్కువ. మిత్రుల చేత పొగిడించుకోడం, భజన బృందాలతో కీర్తించుకోడం, దొంగ విమర్శలు రాయించుకోడం, అసందర్భ సన్మాలకు అంగలార్చడం వంటి ఎన్ని స్వీయ ప్రాయోజిత కార్యకలాపాలకి పాల్పడినా పుస్తకంలో గుజ్జంటూ లేని పక్షంలో గాలి నింపిన బంతి మాదిరి ఆకాశంలో నిలబడుతుంది. గాలి పోయి నేల కూలిన బంతుల్లాంటి నిష్ప్రయోజనమైన సాహిత్యంతో సమాజానికి ఒనగూడే ప్రయోజనం సున్నా. ప్రతిభ అనే ఇటుకలతో నిర్మితమయే  ప్రజాసాహిత్యం శుక్ల పక్షం చంద్రుని మాదిరి దినదినప్రవర్థమానమయి తీరుతుంది. కాలం గడిచే కొద్దీ గురుత్వాకర్షణ శక్తిని కూడా ధిక్కరించి సాహిత్యాకాశంలో వెలుగులు విరజిమ్ముతుంది. సత్సాహిత్యం కాలాతీతమైన కీర్తి ప్రతిష్ఠలు గడించడం సమాజానికే శ్రేయస్కరం.
(మూలంః ఆర్థర్ షోపెన్ హావర్ ప్రసంగం - కీర్తి ప్రతిష్ఠలు- మిసిమి- జమవరి- 2016)
`


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...