Showing posts with label election. Show all posts
Showing posts with label election. Show all posts

Sunday, December 12, 2021

ఎన్నికల కమీషన్ పని తీరు ఎందుకు తరచూ ప్రశ్నలకు గురి అవుతున్నట్లు? -కర్లపాలెం హనుమంతరావు

 ఎన్నికల కమీషన్ పని తీరు ఎందుకు  తరచూ  ప్రశ్నలకు గురి అవుతున్నట్లు?

-కర్లపాలెం హనుమంతరావు

 

 దేశంలోని  న్యాయస్థానాలిప్పుడు రెండో దశ కోవిడ్ సంక్షోభానికి కేంద్ర ఎన్నికల కమీషనుకే బాధ్యత అంటగడుతున్నాయి.. కఠిన వ్యాఖ్యలూ చేస్తున్నాయి! మద్రాస్ న్యాయస్థానం ఎన్నికల అధికారుల పై హత్య కేసు నమోదు చేయాలని  ఆగ్రహంతో ఊగిపోయింది. ‘ప్రాణానికి మించి మరేదీ ముఖ్యం కాదు. రాష్ట్ర ఎన్నికలు ఇప్పుడా నిర్వహించడం?’ అంటూ మరో రాష్ట్ర న్యాయస్థానం శిలవేసింది.  భారీ జన సందోహం నివారించడం అసాధ్యమని తెలిసినప్పుడు చాలినన్ని నిషేధాజ్ఞలు ఎందుకు లేవు; ఉన్నవాటి అమలుకైనా చిత్తశుద్ధి ఎందుకు కరువు? కాబట్టే  న్యాయవ్యవస్థ ఇప్పుడిన్నిందాలా  తప్పుపట్టడం! ఇది జనావళి నిరసన స్వరమే! 

ఏళ్ల కిందట కేంద్ర ఎన్నికల ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన కీ.శే టి.ఎన్. శేషన్ ప్రస్తావన ఇప్పుడు విస్తృతంగా వినవస్తోంది. ప్రస్తుత ఎన్నికల కమీషన్ నిస్తేజమే అందుకు ప్రధాన కారణం అనుకోవాలి.  శేషన్ చొరవలో పదో శాతమైనా ఇప్పటి ఎన్నికల  కమీషన్ ప్రదర్శించదెందుకు? అంటూ ఓ న్యాయస్థానం తలంటు వరకు వ్యవహారం వెళ్లడం కేంద్ర ఎన్నికల సంఘం స్వయం కృతాపరాధం.   

కమీషన్ విఫలమైన పక్షంలో కోర్టులే స్వయంగా నియంత్రణ బాధ్యతలు  చేపట్టేందుకు సిద్ధమవుతున్నవంటేనే దేశంలో కరోనా మహమ్మారి సృష్టించే సంక్షోభం ఏ స్థాయిలో పెచ్చుమీరుతున్నదో అర్థంచేసుకోవచ్చు. కోర్టులు ప్రత్యక్షంగా అనవు  కానీ, దేశంలోని రాజకీయ పండితుల, విశ్లేషకుల అభియోగం  ప్రకారం ఎన్నికల కమీషన్ కేంద్రంలోని పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే! 

2019 ఏప్రియల్  8 తారీఖున దేశంలోని బుద్ధిజీవులు కొద్ది మంది ఉమ్మడిగా  దేశాధ్యక్షుడిని ఉద్దేశించి  ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో 'ఎన్నికల కమీషన్ విశ్వసనీయత ఏ స్థాయి దాకా దిగజారిందో వివరించారు. ఇప్పటి  దుస్థితి అంతకు  మించిన అధ్వాన్నం!  

స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత భారత  రాజ్యాంగం కేంద్ర ఎన్నికల  కమీషనుకు ప్రసాదించింది. రాజకీయ పక్షాలను గుర్తించడం నుంచి ఏ పార్టీకి ఏ ఎన్నికల గుర్తు ఆమోదించాలన్న అంశం వరకు సర్వే సర్వత్రా సర్వస్వతంత్రంగా బాధ్యతలేవైనా నిర్వర్తించుకునే హక్కు  కల్పించింది. దానర్థం అధికారానికో, మరో లౌల్యానికో లొంగి ప్రశ్నలకు అతీతంగా   బాధ్యతలు  నిక్షేపంగా నిర్వహించుకోవచ్చనా?! మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విధించడం నుంచి  ఎన్నికల ఖర్చు  సైతం అదుపు చేసే  అధికారం వరకు సర్వాధికారాలు ధారపోసినా   కమీషన్ గత కొంత కాలంగా ప్రవర్తిస్తున్న తీరు తరచూ దేశమంతటా ఎందుకు విమర్శల పాలవుతున్నది? ఒక సారైనా  ఆత్మవిమర్శ చేసుకోవద్దా? 

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల   దుర్వినియాగం, ఓటరు జాబితాల సవరణలపై అవకతవకల వంటి ప్రధానాంశాలపై సైతం   కమీషన్ శీతకన్ను వంటి అపవాదులు  ఎప్పటి నుంచో వస్తున్నవే1 ఇప్పటికి మించిన  కఠోర పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి వర్తమాన ప్రపంచానికి దర్పణప్రాయంగా  నిలిచిన సందర్భాలు కేంద్ర ఎన్నికల  కమిషన్ చరిత్రలో కోకొల్లలు! కానీ, గత కొంత కాలంగా షెడ్యూల్స్ ప్రకటించే తీరు మొదలు, ఫలితాల ప్రకటనలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే అంశం వరకు అడుగడుగునా విమర్శల వడగళ్ల వానంలోతడిసి ముద్దవడం..! కొత్తగా నకిలీ ఓటరు కార్డుల తయారీ       ప్రత్యక్ష సాక్షాలతో సహా వివాదమవుతున్నా       నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నది  ఎన్నికల కమీషన్! న్యాయవ్యవస్థ చేత సైతం మొట్టికాయలు తినడానికి ఇట్లాంటివే సవాలక్ష కారణాలు! కమీషన్  పని తీరులో     సమూలన  ప్రక్షాళన అందుకే తక్షణం   అగత్యం  అనిపించడం!           

1986 -1990 కాలం నాటి ఆర్.వి.ఎస్ పేరిశాస్త్రి ఆధ్వర్యంలో ఈ.వి.యం ల విధానం, ఓటరు వయస్సు 18 ఏళ్లకు కుదించడం వంటి సంస్కరణలు ఆరంభమయిన   మాటనూ కొట్టిపారవేయలేం.  అస్మదీయులకు  అనుకూలంగా  పని తీరు లేదన్న అసహనంతో ప్రధాన ఎన్నికల కమీషనర్ కు  సమాంతర అధికార వ్యవస్థను కొత్తగా  చొప్పించే ప్రయత్నం మొదలవడం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాము నుంచి. పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రి స్థానంలో అధిష్ఠించిన అనంతరం  కమీషన్ స్వతంత్రను దెబ్బతీసే కొన్ని చర్యలు వెనుకంజ వేసిన మాట నిజం. ఆ ప్రజాస్యామ్య     శుభ ఘడియల్లోనే  కేంద్ర   ఎన్నికల  ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన  కీ.శే టి.ఎన్. శేషన్ (1990 -96) కేంద్ర ఎన్నికల కమీషన్ శక్తి సామర్థ్యాలు ఏమిటో స్వయంగా నిర్వహించి చూపించారు.

ఎన్నికల వేళ  రాజకీయ పక్షాలు అనుసరించే అప్రజాస్వామిక విధానాలను ఏ విధంగా కట్టడిచేయవచ్చో   నిష్పక్షపాతంగా  ప్రత్యక్షంగా శేషన్ నిర్వహించిన తీరును న్యాయస్థానాలు సైతం ఇప్పుడు స్మరించుకుంటున్నాయి.

శేషన్ కు ముందున్న ఎస్. వై. ఖురేషీ వంటి కమీషనర్లు ఎన్నికల  కమీషన్ కు ఉండవలసిన మరన్ని  అధికారాలకై కంఠశోష పెట్టారు. సంకల్పం ఉండటమే ప్రధానం,  ధన బలం, మంద బలం, కుల మతాల  వంటి రాజకీయ పక్షాలు ప్రదర్శించే అప్రజాస్వామిక విధానాలను  కట్టడిచేసే  అధికారాలు కేంద్ర ఎన్నికల యంత్రాంగానికి ఇప్పటికున్నవే  పుష్కలం.  రాజ్యాంగం కల్పించిన ఆ ప్రత్యేక అధికారాల ప్రస్తావన   న్యాయస్థానాలు పదే పదే చేస్తున్న   ఆంతర్యం ఎన్నికల సంఘం గ్రహించాలి.. అదే తక్షణావసరం! సంకల్ప లేమి వల్లనే ఎన్నికల కమీషన్ యంత్రాంగానికి ఇవాళ అన్ని  దిక్కుల నుంచి ఇన్నిన్ని అక్షింతలు.

ఎన్నికల కమీషన్ లో అసలు  సంస్కరణల ఊసే లేదని  కాదూ!  పనితీరులో పారదర్శకత, నిష్పక్షపాత మెరుగు పడే క్రమంలో  సంఘం   తరుఫు నుంచే సుమారు 50 సంస్కరణల వరకు  ప్రభుత్వానికి సమర్పించిన మరపురాని  అపూర్వ ఘట్టం సదా స్మరణీయం. నేరపూరిత రాజకీయాలను  దూరం పెట్టడం, పార్టీ విరాళాల సేకరణ పై పారదర్శకతకు పట్టుబట్టడం, పెయిడ్ న్యూస్, లంచం వంటి విషయాలు బైటపడినప్పుడు ఏకంగా ఎన్నికలను రద్దుచేసే అధికారం కలిగి ఉండడం వంటి కొన్ని కొత్త కోరలు మొలిచిన  మాట విస్మరించలేం! రాజకీయ పక్షాలకు రాష్ట్ర స్థాయిలో  ఎలక్ట్రానిక్ మాధ్యమాల వినియోగ సౌకర్యం, ఎన్నికల జాబితా కంప్యూటరీకరణ, ప్రతి ఓటరుకు ఓటరు గుర్తింపు పత్రం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను కచ్చితంగా పాటించవలసిన అగత్యం.. వంటి సంస్కరణలు కొన్ని  ఆచరణలోకి రాకపోనూలేదు.  

అయినా డబ్బు తాలూకు  విచ్చలవిడితనం ఎన్నికల తాలూకు  ప్రజాస్యామిక పవిత్రతను దెబ్బతీస్తున్న క్రమమే అభ్యంతరకర స్థాయికి పెరిగి పోయిందిప్పుడు.   2019 నాటి ఎన్నికల ఖర్చు సుమారు 60,000 కోట్లు. ఇది ప్రపంచంలోనే  రికార్డ్! మీడియా స్టడీస్ సెంటర్ గణాంకాల ప్రకారం మునుపటి ఎన్నికల ఖర్చుకు ఇది రెట్టింపు! 

. . 

ప్రపంచంలోనే అతి పెద్దదిగా  చెప్పుకుంటున్నది కదా  మన దేశ  ప్రజాస్వామ్యం! మరి   దాని పరిరక్షణకు నాడి వంటి  ఎన్నికల క్రతువు నిర్వహణకు ఉండవలసిన దీక్షాదక్షతలేవీ? ఎన్నికల క్రతువు  నిష్పక్షపాతంగా, పారదర్శకంగా   నిర్వహించడంలో లోపాలు చొరపడినప్పుడే న్యాయస్థానాల కార్యశీలత తప్పనిసరయేది!

నిజం చెప్పాలంటే నిర్వాచన్ సదన్  నిర్వహించే అధికారుల సమర్థతలో లోపం ఉండి కాదు ఈ దుస్థితి. రాజకీయపరమైన వత్తిళ్లకు ఎదురొడ్డి నిలబడవలసినంత  పట్టుదల  లోపిస్తున్నదనే దేశం గిలి. తాజాగా వివిధ న్యాయస్థానాలు వెలిబుచ్చుతున్న దురుసు వ్యాఖ్యానాలు  అశేష భారతావని తరుఫున వినవచ్చే అసమ్మతి స్వరాలు.  

-కర్లపాలెం హనుమంతరావు

05 -05 -2021

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...