Showing posts with label koumudi. Show all posts
Showing posts with label koumudi. Show all posts

Friday, March 5, 2021

శేషారత్నం - కథానిక - -కర్లపాలెం హనుమంతరావు - కౌముది/రచన ప్రచురితం

 

కాంతయ్య పోయి మూణ్ణెలయింది. తండ్రి పోయిన ఏడాదిలోపే కూతురికి  పెళ్లి చేస్తే  కన్యాదాన ఫలం తండ్రికి దక్కుతుందన్న నమ్మకంతో అనంతమ్మ కూతురు పెళ్ళి పెట్టుకుందిప్పుడు,

అబ్బాయి చెన్నైలో ఫిలిప్స్ కంపెనీలో ఉద్యోగం . కావలివాళ్ళు. కాస్త కలిగిన వాళ్ళు. కాంతయ్యకు మా టీచర్స్ సర్కిల్ లో మంచివాడన్న పేరుంది. ఆయన కూతురు గాయత్రిని చేసుకుంటామని మా ఆర్ జె డి మ్యాడం గారే ముందు చొరవ చూపించడం వల్ల ఏ ఇబ్బందుల్లేకుండానే సంబంధం ముడిపడింది. ముహూర్తానికి ఇంకో నెల రోజులు టైముందనంగా  అనంతమ్మ దగ్గర్నుంచి 'కాస్త అర్జంటుగా వచ్చి పొమ్మ'ని కబురొస్తే గుంటూరొచ్చాను. 

పెళ్లి పనులు నిదానంగా నడుస్తున్నాయి. గాయత్రికి అప్పుడే పెళ్లికళ వచ్చేసింది కూడా. మా కాంతయ్య కనక ఉండుంటే ఎంత సంతోషించేవాడో అనిపించిందా క్షణంలో. అనంతమ్మే ఎందుకో కాస్త కళవళపడుతోంది. 

ఆ మధ్యాహ్నం నేను ప్రయాణపు బడలికలో పడుకుని ఉంటే గదిలోకొచ్చింది 'నిద్ర పోతున్నావా అన్నయ్యా!' అంటూ. 

'లేదులే! ఏవిఁటి విషయం? ఎందుకంత తొందరగా రమ్మని కబురుచేసావు?' అని ఆడిగా. 

బీరువాలో నుంచి ఏవో కొన్ని కాగితాలు తీసి నా ముందు పెట్టింది తను. 'ఇంటి పేపర్ల కోసం వెదుకుతుంటే ఇవి కనిపించాయన్నయ్యా! ఏంటో అంతు బట్టక నీకు కబురు పంపించా. గాయత్రికే ముందు చూపిద్దును కానీ, దాని పరీక్షల గొడవలో అదుందిప్పుడు. ఆయనా నువ్వూ అరమరికలు లేకుండా ఉండేవాళ్లుగా! నీ కేమైనా తెలుస్తాయని..'అంది. 

'నేను చూసి చెబుతాలే! నీవు పోయి పని చూసుకో!' అని అప్పటికామెను పంపించేశా.  

కాంతయ్య స్టేట్ బ్యాంకులో ఏదో లోను తీసుకున్నట్లున్నాడు. వాయిదాలు సక్రమంగా రావడం లేదని ఇచ్చిన నోటీసులు అవన్నీ. పాత బాకీ వడ్డీతో సహా  సుమారు లక్షన్నర. పదిహేను రోజుల్లోపు బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఇంటిని జప్తు చేసి సొమ్ము జమేసుకునే నిమిత్తం చర్యలు చేపడతామని ఇంగ్లీషులో  లాయరిచ్చిన నోటీసులు రెండున్నాయందులో. నోటీసులన్నీ ఏదో రామన్నపేట  అడ్రసు నుంచి రీడైరక్టు చేయబడ్డవి. 

కాంతయ్యా నేనూ ఒకే సారి ఉపాధ్యాయ వృత్తిలో చేరినవాళ్లం. వేటపాలెంలోని  ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరం ఒకేసారి కలసి పనిచేసాం మొదట్లో. మంచి స్నేహితులమయ్యాం. తరువాత  ఎన్ని స్కూళ్లు మారినా, ఎన్ని పొజిషన్లు మారినా ఇద్దరి మధ్యా స్నేహం బలపడుతూ వచ్చిందే కాని, చెదరలేదు. 


మా నాన్నగారి ఊరు పెదగంజాం. ఆ ఊరి శివాలయం పూజారి సాంబయ్యగారి అమ్మాయి ఈ అనంతలక్ష్మి. ఈ సంబంధానికి కాంతయ్యను సూచించింది నేనే. నా భరోసా మీదనే సాంబయ్యగారు కాంతయ్య దగ్గర ఆస్తిగా ఒక్క చిల్లుకాణీ లేకపోయినా గవర్నమెంటు ఉద్యోగం చూసి కూతుర్ని కట్టబెట్టారు. ఆయన పోయే ముందు ఊరి బయట ఉన్న రెండు గదుల పెంకుటింటిని కూతురు పేరున రాశారు. 


మా కాంతయ్య మాణిక్యం. గాయత్రి పుట్టినప్పుడు అనంతమ్మకు గర్భసంచీలో సమస్య వచ్చి మళ్లీ పిల్లలు పుట్టే ప్రయత్నంగాని చేస్తే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరిస్తే తనే ఆపరేషన్ చేయించుకున్న మంచిమనిషతను. అనంతమ్మయితే మొగుడే వైకుంఠం, కూతురే కైలాసంగా బతికే అమాయకురాలు. హాయిగా సాగిపోయే ఆ సంసార నౌకను చూసే విధి ఓర్వలేకపోయినట్లుంది..  కాంతయ్య ప్రాణానికే ప్రమాదం తెచ్చిపెట్టింది. 


మూడు నెలల కిందట విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఏదో కార్యక్రమం రికార్డు చెయ్యడానికని వచ్చి బైట రోడ్డు దాటే సమయంలో లబ్బీపేట వైపు నుంచొచ్చే సిటీ బస్సు ముందు చక్రాల కింద పడి నజ్జునజ్జయిపోయాడు మా కాంతయ్య! ఆ విషాదం నుంచి అనంతమ్మ ఇంత తొందరగా తేరుకుంటుందని నేనైతే అనుకోలేదు. తను డీలాపడితే కూతురు మరంత కుంగిపోతుందనుకుందో ఏమో, ధైర్యం కూడగట్టుకుని ముందా పిల్లను ఓ అయ్య చేతిలో పెట్టే పనిలో పడింది. కలిసొచ్చి మంచి సంబంధం కుదిరినందుకు అందరం ఆనందంగా ఉన్నాం. ఇప్పుడీ అనుకోని కుదుపు!


అప్పటికేదో అనంతమ్మకు సర్దిచెప్పాగానీ, అసలు విషయం తెలుసుకునేందుకు నా ప్రయాణం మరో రోజుకు వాయిదా వేసుకుని బ్యాంకుకెళ్లా నేను. మేనేజరుగారు కాంతయ్యకు పూర్వ పరిచయస్తుడవడంతో వివరాలు రాబట్టటం తేలికయింది. అనంతమ్మ పేరుతో ఉన్న ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మూడేళ్ల కిందట బ్యాంకు నుంచి రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు కాంతయ్య. ఇంత వరకు ఒక్క పైసా కూడా జమపడలేదు. కనక బ్యాంకు రూల్సు ప్రకారం జప్తుకు వెళ్లే చర్యలు చేపట్టడం ఖాయం అని చల్లగా చెప్పుకొచ్చారు మేనేజరుగారు. 


అనంతలక్ష్మి పేరున ఉన్న ఇల్లు అనంతలక్ష్మికి తెలీకుండా కుదువపెట్టడం ఎలా సాధ్యం? లోను అప్లికేషన్ తీయించి చూస్తే అందులో ఉన్నది అనంతలక్షి ఫొటో కాదు! ఎవరో ఆడమనిషిది. అడ్రసు మాత్రం అప్పట్లో కాంతయ్య పనిచేసిన రామన్నపేటదే! హామీ సంతకం సాక్షాత్తూ కాంతయ్యదే! మేనేజరుగారికి కాంతయ్య హఠాన్మరణం గురించీ, అతగాడి కూతురి పెళ్లి గురించీ వివరంగా చెప్పి.. పెన్షన్ బెనిఫిట్స్ నుంచి నేనే పూనుకుని ఎంతో కొంత జమచేయిస్తానని హామీ ఇచ్చి, లోన్ పేపర్లోని చిరునామా, ఫొటో జిరాక్సులు తీసుకుని వచ్చేశా.


కాంతయ్య ఇలాంటి పనిచేసేడంటే  నమ్మశక్యంగా లేదు. భార్య ఆస్తి మీద భార్యను కాకుండా వేరే ఎవరో ఆడమనిషిని ఆ స్థానంలో చూపించి అంత భారీ రుణం ఎందుకు తీసుకున్నట్లు? నాకు తెలిసి కాంతయ్యకు స్మోకింగూ, మంచితనం  తప్ప వేరే వ్యసనాలు లేవు. సీదాసాదా వ్యక్తిత్వం. మాటకు కట్టుబడే మనిషి. మరేమిటి ఈ మిస్టరీ? ఆ ఇంటిని చూసుకునే అనంతమ్మ పిల్లకు పెళ్లి పెట్టుకుంది.  ఇంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని ఆ అమాయకురాలికి తెలిసివుండకపోవచ్చు. తెలిస్తే ఇప్పుడు ఏం చేసుంది? ఒక వంక మొగుడు చాటుగా చేసిన నమ్మక ద్రోహం. మరో వంక పీకల మీద కూతురు పెళ్లి! కాంతయ్య పరువు మర్యాదలు చూసి వచ్చినవాళ్లు ఇప్పుడు ఆ సంబంధం చేసుకుంటరా? తనో రోల్ మోడల్ గా భావించుకున్న తండ్రి అసలు స్వరూపం తెలిసి గాయత్రి క్షమించగలదా? పీటల మీద వరకు వచ్చేసిన ఈ పెళ్లి ఇట్లా ప్రమాదంలో పడటం ఆ సున్నితమైన మనసు తట్టుకోగలదా? నిన్నటి వరకు అంతా సవ్యంగా సాగిపోతోందనుకున్న వ్యవహారం ఇట్లా సడన్ గా అడ్డం తిరిగే సరికి ఏం చెయ్యాలో  తెలీక రాత్రంతా ఆలోచిస్తూనే ఉండిపోయాను. తెల్లారుఝాముకో నిర్ణయానికొచ్చాను. 'ముందు ఆ ఆడమనిషెవరో తెలుసుకోవాలి. వీలైతే వెంటనే ఆ డబ్బును రాబట్టాలి. ఇంటి తనఖా రద్దైపోతే ప్రస్తుతానికి సమస్య ఉండకపోవచ్చు. ముందు, లోన్ పేపర్లలో ఉండే చిరునామాకు వెళ్లిరావాలి. అప్పటి వరకు అనంతమ్మకు ఏమీ చెప్పకూడదు.' అనుకున్నాను. నాకూ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా.. హైదరాబాద్ ప్రయాణం మరో రోజు వాయిదా వేసుకుని రామన్న పేట బైలుదేరాను.. లోను  జిరాక్సు పేపర్లూ, ఫోటో తీసుకుని. 

***

రామన్నపేట పెద్ద ఊరేమీ కాదు. చీరాల వేటపాలెం మధ్య దారిలొ రోడ్డుకు  ఎడంగా ఇసుక దిబ్బల మీద ఎత్తులో ఉంటుందా ఊరు. బస్సు దిగి ఊళ్లోకి వస్తూ విచారిస్తే 'అనంతలక్ష్మి' పేరు గలవాళ్లెవరూ లేరు పొమ్మన్నారు చాలామంది. ఫొటో చూపించి అడిగితే ఒక ముసలాయన 'ఈమె పేరు అనంత లచ్చమ్మ కాదు సారూ! అనసూయమ్మ. అట్లు పోసుకునే అనసూయమ్మ అంటే ఎవరైనా చెబుతారయ్యా! అట్లా శివాలయం దాకా పోయి ఎడం వేపు గొందిలోకి మళ్ళితే అక్కడుంటుంది' అన్నాడు అదో రకంగా నవ్వుతూ. 

నేను ఆ వివరాలు కనుక్కుంటూ వెళ్లేసరికి ఒక నలభై, నలభైఅయిదేళ్ల ఆవిడ ఒక తాటాకు పాక  పంచలో అట్లు పోస్తూ పెనం ముందు కూర్చుని కనిపించింది. ఫొటోలోని మనిషి ఆమే! కొంతమంది మగవాళ్ళు చెక్క బెంచీల మీద కూర్చుని ఆకుల్లో అట్లు వేయించుకుని తింటున్నారు. నన్ను చూసి 'శేషారత్నమా! సారుకు ఆ స్టూలు తెచ్చి ఎయ్యి' అని లోపలికి కేకేసిందామె. 


నేను అట్లు కోసం వచ్చాననుకున్నట్లుంది ఆమె. అదీ ఒకందుకు మంచిదే. వచ్చీ రాగానే వ్యవహారంలోకి దిగితే బెడిసిగొట్టే ప్రమాదముంది. బాదం ఆకుల్లో రెండు అట్లు వేయించుకు తిని 'కాఫీ ఉందా?' అనడిగాను. 'కాఫీలు ఈడ ఎవుళ్లూ తాగరు సార్! టీ కావాలంటే అట్లా పోతే మస్తాను బంకు కాడ దొరుకుద్ది' అంది. నేను తటపటాయిస్తుంటే చూసి 'పోనీ.. మా పిల్లకు రెండు రూపాయలు ఇయ్యండి సార్! తెచ్చిపెట్టుద్ది' అంది. ఆ అమ్మాయి పోయి తెచ్చిచ్చిన టీ తాగేసరికి కొట్టు ముందు జనం కాస్త పల్చబడ్డారు. 


సమయం చూసి అడిగాను 'ఇదివరకు ఈ ఊళ్లో కాంతారావుగారని ఒక పంతులు గారు పనిచేసిపోయారు. ఆయనిప్పుడు ఎక్కడున్నాడో ఏమన్నా తెలుసా?'

'మీరెవరూ?' అని అడిగిందావిడ చేస్తున్న పని ఆపేసి అనుమానంగా చూస్తూ. 

'స్టేట్ బ్యాంకు నుంచీ వస్తున్నానమ్మా! ఆయన తీసుకున్న లోను విషయం మాట్లాడదామనీ!' అన్నాను. 

అనుకున్నట్లే ఆమె ముఖకవళికల్లో మార్పు వచ్చింది. పొయ్యి మీద నుంచి పెనం ఇవతలకు లాగిపడేసి దాని మీదిన్ని నీళ్ళు చల్లి లేచి 'సారూ! ఒకసారిట్లా లోపలికి వస్తారా?' అని అడిగింది తను లోపలికి పోతూ. నేను ఆమెను అనుసరించాను. బైట నిలబడ్డ ఇద్దరు ముగ్గురు ఆరాగా లోపలికి తొంగిచూస్తున్నారు. పల్లెటూళ్లల్లో అందరికీ అన్నీ కావాలి. 

ఆమె ఒక నులక మంచం వాల్చి నన్ను కూర్చోబెట్టి 'పంతులుగారు ఇప్పుడేడ పనిచేస్తున్నారో నాకూ తెలవదయ్యా! ఆయన ఆ బ్యాంకులోను నా కోసమే తీసుకున్నారు సారూ!' అందామె ఆగి ఆగి ఆలోచిస్తున్నట్లుగా.

ఆ అప్పుకు ఒక్క పైసా జమకాలేదమ్మా! ఇట్లా చేస్తే బ్యాంకువాళ్లు చూస్తూ కూర్చుంటారా? పోలీసు కేసవుతుంది. ముందు నిన్నే అరెస్టు చేస్తారు' అన్నాను బెదిరిస్తున్నట్లు. 

'నన్నెందుకు చేస్తారూ!' అంది బెదిరిపోయి. 

'అప్పు పత్రాల మీద నీ ఫొటోనే కదా ఉందీ! నువ్వు పేరు మార్చి ఆయన భార్యనని మోసం చేస్తే బ్యాంకువాళ్లు చేతులు ముడుచుక్కూర్చుంటారా? బ్యాంకులో తనఖా పెట్టిన కాగితాలు నిజంగా నీవేనా?' అన్నాను స్వరం మరంత పెంచి. 

ఆమె తలవేలాడేసింది. అప్పటి దాకా చిత్రం చూస్తూ నిలబడ్డ శేషారత్నం బిత్తరపోయినట్లు నిలబడిపోయిందో మూల.

'నీ మూలకంగా పంతులుగారిక్కూడా శిక్ష పడుతుంది తెలుసా?' అనగానే అనసూయమ్మ చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ దుఃఖంలోనే ఒక్కో ముక్కా వదులుతోంది. 'పంతులుగారు దేవుడయ్యా! ఆయన్నేం చెయ్యద్దయ్యా! పాపిష్టిదాన్ని, నా వల్లే ఆయనకీ కష్టాలు' అంటూ మధ్య మధ్యలో ఎక్కిళ్లు. 

'అసలేం జరిగిందో వివరంగా చెప్పమ్మా! దాన్ని బట్టే మా బ్యాంకువాళ్లు తీసుకునే చర్య ఉంటుంది' అన్నాను. నాకూ ఇలాగా మరో మనిషిలాగా నటించడం ఇబ్బందిగానే ఉంది. మరేం చేయడం? అసలు విషయం రాబట్టుకునేందుకు మరో దారి తోచలేదు. 

'నువ్వు రంగయ్య కొట్టుకాడికెళ్లి ఇందాక నేను చెప్పిన సరుకులు పట్టించుకు రావే!' అంటూ కూతుర్ని  బైటికి పంపించేసి నిదానంగా చెప్పడం మొదలుపెట్టిందా అనసూయమ్మ.  'కాంతయ్య పంతులుగారు ఈడ స్కూల్లోనే పాఠాలు చెప్పడానికి వచ్చాడయ్యా! కుటుంబాన్ని తేలేదు. నా కాడే టిఫిన్లు.. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు! చాలా మంచాయన. మా కృష్ణానందం ఆయన కాడే చనువుగా తిరుగుతుండేవాడు'

'కృష్ణానందం ఎవరూ? నీ కొడుకా?'

'నాకు కొడుకులు లేరయ్యా! ఉన్నదంతా ఈ ఎతిమతం శేషారత్నమే! వాడు దీని మొగుడు. నా పెనిమిటి రాచపుండొచ్చి పోతా పోతా ఇంటికి మగదిక్కుగా ఉంటాడని ఏడనో ఉన్న ఆడిని తెచ్చి పిల్లదాని మెడకు చుట్టబెట్టాడయ్యా! నా అల్లుడికీ అందరికి మల్లేనే దుబాయ్ పోవాలని పురుగు కుట్టిందయ్యా! కాయితాలకనీ, ఇమానం కర్చులకనీ మొత్తం రెండు లచ్చలు దాకా అవుతాయి. ఇయ్యకపోతే నీ కూతురి మీద  గ్యాసు నూనె పోసి నిప్పంటిస్తా అంటూ రోజూ ఇంట్లో రభసే! ఆడి బాధకు తాళలేక ఇది నిజంగానే ఓ రోజు పుల్లకాలవలో దూకేసింది. మా పంతులుగారే టయానికి ఆడ ఉండబట్టి బైటికీడ్చుకొచ్చాడు. నా కతంతా ఇని ఒంగోలు దాకా తీసుకెళ్లి బ్యాంకులో ఏలుముద్రలు తీయించి రెండు లచ్చలు  ఇప్పించాడు సార్! ఆ డబ్బుతోనే నా అల్లుదు దుబాయ్ పోయింది. అక్కడ సాయబ్బులకాడ పనిచేస్తే బోలెడంత డబ్బొస్తుందంటగా! ఏడాది తిరిగే లోగా అప్పంతా తీర్చేస్తానని నా బిడ్డ మీద ప్రమాణం చేసి మరీ పొయ్యాడయ్యా! సారు బదిలీ మీదెళ్లిపోయాడని తెలిసి ఈడు ఠలాయించదం మొదలుపెట్టాడు. మెల్లంగా మాకు అయిపూ ఆజా లేకుండా ఎళ్లిపొయ్యాడయ్యా! ఎంత విచారణ చేయించినా ఏడ చచ్చాడో తెలీలా.. ఇప్పటి దాకా. పంతులుగారికి మొగం చూపించలేకనే ఇదిగో.. ఇట్లా మూల మూలన నక్కి ఏడవడం' అని రాగాలు మొదలుపెట్టింది. 

శేషారత్నం ఎప్పుడొచ్చిందో.. ఇదంతా వింటూ ఓ మూలన బిక్కుబిక్కుమంటూ గోడక్కరుచుకుని నిలబడివుంది! అప్పుడు చూశాను..  పిల్ల మెళ్లో పసుపు తాడు. నిండా పదిహేనేళ్లయినా నిండని బిడ్డ! మెడలో ఆ తాడు గుదిబండలా  వేలాడుతోంది!


అనసూయమ్మ ఏడుపుకు ఇద్దరు ముగ్గురు మగాళ్లులోపలికొచ్చేశారు. గొడవేమీ కాకముందే మర్యాదగా తప్పుకోడం మంచిదనిపించింది. వస్తూ వస్తూ అనసూయమ్మతో 'పంతులుగారు బస్సు ప్రమాదంలో పోయి మూడు నెల్లయింది.  ఆయనకూ నీకు మల్లేనే ఆస్తి పాస్తులేం లేవు. ఉన్నది ఆ ఉద్యోగం.. మంచివాడన్న పేరు. ఇదిగో నీ కీ పిల్లలాగా ఓ కూతురు, అన్నెం పున్నెం ఎరుగని  ఓ భార్య.. ఆమె తండ్రి ఆమెకిచ్చిన ఆ ఇల్లు. దాన్నే ఆయన నిన్నేదో ఆదుకోవాలని తప్పుడు మార్గంలో  బ్యాంకులో పెట్టినట్లుంది. అది బైట పడితే ఇంటి కన్నా ముందుపోయేది ఇంటి పరువు. ఇంకో నెలరోజుల్లో ఆయన కూతురు పెళ్లుంది. అది ఆగిపోతే ఆ ఉసురు నీకూ, నీ కూతురికే తగిలేది!' అంటూ చేతిలోని శుభలేఖను విసురుగా అక్కడ పారేసి బైటికివచ్చేశాను. 

ఆవేశంలో కాస్త ఎక్కువగానే మాట్లాడేమోననిపించింది తిరిగొచ్చేదారిలో. అప్పటికే నాకూ గుండెల్లో కాస్త నొప్పి నొప్పిగా అనిపించడంతో టాక్సీ చేసుకుని నేరుగా హైదరాబాదొచ్చేశా! అనంతమ్మను కలిసే అవకాశమే లేకపోయింది.


టాక్సీలోనే మూర్ఛరావడం.. డైవర్  సాయంతో ఇల్లుచేరడం! వచ్చీ రాగానే పెద్దాపరేషన్!  కనీసం ఓ నెల్లాళ్ల పాటైనా  మన లోకంలో లేనట్లే గడిచిపోయింది కాలం. 

గుంటూరు విషయాలను గురించి విచారించడానికి గుండె ధైర్యం లేకపోయింది. ఇంట్లో కూడా నా మీద  నిరంతర నిఘా!

***

రెండేళ్ల తరువాత.. 

మా ఆవిడ కీళ్లనొప్పుల ఆపరేషన్ కోసమని నిమ్స్ కి రిఫర్ చేస్తే వెళ్లినప్పుడు ఓ.పిలో రోగులను చూస్తూ కనిపించింది గాయిత్రి. ముందుగా నేను చూసింది ఆమె మెడలో మంగళ సూత్రాలు ఉన్నాయా లేవా అని. ఉన్నాయి. ఎంతో రిలీఫ్ అనిపించింది. 

నన్ను చూసి గుర్తుపట్టి నవ్వు మొగంతో దగ్గరికొచ్చి పలకరించిందా అమ్మాయి 'అంకుల్! బాగున్నారా!' అంటూ. విషయం విని తనే దగ్గరుండి మా ఆవిడ ఆపరేషన్ సజావుగా సాగేందుకు సహకరించింది. వారం తరువాత డిశ్చార్జ్ అవుతున్నప్పుడు 'థేంక్స్' చెప్పడానికి వెళితే 'ఓ సన్ డే ఓపిక చేసుకుని మా ఇంటికి ఆంటీతో సహా లంచ్ కి రావాలి అంకుల్!' అంటూ అడ్రసిచ్చింది. 


ఆ ఆదివారమే మధురానగర్ లోని వాళ్ల ఇంటికి వెళ్ళాం మొగుడూ పెళ్లాలం. ఆ అమ్మాయి భర్త అప్పుడు అనుకున్న ఆర్జెడి మ్యాడం గారబ్బాయే!  గాయత్రికి నిమ్స్ లో పిజి వచ్చిందని చెన్నయ్ లో తాను చేసే ఉద్యోగం రిజైన్ చేసి ఇక్కడే ఇంకేదో కంపెనీలో చేస్తున్నాడని తెలిసింది. ఆర్జెడిగారు రిటైరయి  సొంతూరిలో ఉంటున్నట్లు ఆ అబ్బాయే చెప్పుకొచ్చాడు. 

'అమ్మ బాగుందా తల్లీ!' అనడిగాను గాయత్రిని భోజనాల దగ్గర. 

'తను పోయి రెండేళ్లయిందిగా అంకుల్! మీ కింకా తెలుసేమో అనుకున్నా. పెళ్లింకో పది రోజుల్లో ఉందనంగా గుండెనొప్పొచ్చింది. అందుకే ఆ ముహూర్తం వాయిదాపడ్డం. తరువాత రెండు నెల్లకు మా పెళ్లయింది. అప్పుడున్న టెన్షన్లో మీ లాంటి ముఖ్యమైన నాన్న ఫ్రెండ్సందర్నీ మేం మిస్సయి పోయాం! మీ నెంబరు  కోసం ఎన్నో సార్లు ట్రై చేసినా కలవలేదు’ అంది గాయిత్రి గిల్టీగా. 

‘అంకుల్ బాగా కోలుకున్న దాకా బైటి కనెక్షన్లేవీ పెట్టుకోవద్దని డాక్టర్లు అదే పనిగా  హెచ్చరించారమ్మా! అందుకే నేను సెల్ నెంబర్ మార్పించి కొత్తది నా దగ్గరుంచుకుంది చాలాకాలం' అని ఇప్పుడు బాధపడింది మా శ్రీమతి. 

భోజనాలయి హాల్లో కూర్చున్నాం నేనూ, ఆ అబ్బాయీ! గాయిత్రి మా ఆవిడకు ఇల్లు తిప్పి చూపించడానికి తీసుకువెళ్లింది. ఆ అబ్బాయి అప్పుడన్నాడు 'అంకుల్! మీరు రామన్నపేట వెళ్ళార్ట కదా! మీరక్కడ వదిలేసొచ్చిన శుభలేఖ పట్టుకుని ఓ పదహేను పదాహారేళ్ల పాప మా అమ్మను వెదుక్కుంటూ వచ్చింది. మా మాంగారు వాళ్లమ్మ పేరుతో తీసుకున్న బ్యాంక్ లోను కథా కమామిషంతా చెప్పి బాగా ఏడ్చింది. పెళ్లి ఆపొద్దని కాళ్లావేళ్లా పడ్డంత పనిచేసిందంకుల్ పాపం! 'పంతులుగారు మా అమ్మను ‘చెల్లెమ్మా’ అని పిలిచేవాడని, తానైతే ఎప్పుడూ 'మామయ్యా!' అనే పిలిచేదాన్నని ఎన్ని సార్లు చెప్పుకునేడ్చిందో! చాలా బాధనిపించింది వింటానికి అమ్మకూ నాకూ’ 

కాంతయ్యకు ఒక సొంత చెల్లెలుండేది. మొగుడు కోత భరించలేక అ పిల్ల  తన రెండేళ్ళ పాపతో సహా క్రిష్ణకెనాల్లో దూకేసిందొకానొకప్పుడు. కాంతయ్య బహుశా అనసూయమ్మలో ఆ పోయిన చెల్లెలిని, పాపలో ఈ శేషారత్నాన్ని చూసుకొనుంటాడు!  లేకపోతే పరాయి ఆడమనిషి కష్టం తీర్చేందుకు మరీ అంత దారుణంగా బ్యాంకును, భార్యను మోసగించే  నీచ మనస్తత్వం చస్తే కాదు మా కాంతయ్యది. 


ఆ మాటే ఆ అబ్బాయితో అంటే 'మామగారి మంచితనం గురించి మాకు తెలీదా! అయినా గాయిత్రిని చేసుకుంది  ఆ మంచితనమొక్కటే చూసి  కాదంకుల్ ' అన్నాడు ముసి ముసిగా నవ్వుతూ. 

‘మరి!’

'మా అమ్మదీ పెదగంజామే! మా అత్తగారి పేరనున్న ఆ ఇల్లు గుడి పూజార్ల కోసమని మా ముత్తాతగారు ఏనాడో కట్టిచ్చిచ్చింది. గాయిత్రి ముత్తాత డబ్బు క్కక్కుర్తికి  దాన్నో గౌండ్లకు ధారాదత్తం చేశాడు. దాంట్లో చాలా ఏళ్ల బట్టి ఓ కల్లు దుకాణం  నడుస్తుందని విన్నప్పుడల్లా తాతగారి వ్యథ వర్ణనాతీతం. ఎట్లాగైనా తిరిగి ఆ ఇంటిని స్వాధీనపరుచుకుని మరేదైనా మంచి పనికి వినియోగించాలని మా అమ్మ పంతం. ఆ సమయంలోనే   గాయత్రి సంబంధం తటస్థించింది. అమ్మాయి మాకు వేరే అన్నిరకాలుగా నచ్చిందనుకున్న తరువాత ఏమైనా ఇక వెనక్కు వెళ్లకూడదనే అనుకున్నాం. ఆ అట్లుపోసుకునే మనిషెవరో నేరుగా మా దగ్గరికే వచ్చేసుంటే సమస్యుండేది కాదు. గుట్టుచప్పుడుగా లోను మేమే తీర్చేసి అత్తగారి దాకా  అసలా  విషయమే పోకుండా జాగ్రత్తపడేవాళ్లం. ఆ అట్లుపోసుకునే మనిషి నేరుగా తన దగ్గరికే వచ్చేయడంతో విషయం సరిగ్గా అర్థం కాకో.. ఏమో..  వత్తిడి తట్టుకోలేక   ప్రాణం  మీదకు తెచ్చుకున్నారు అత్తగారు. ముహూర్తం  వాయిదా పడింది ఆ దుర్ఘటన వల్లయితే.. అందుక్కారణం లేని  తన మొగుడు తీర్చని బాకీ  అనుకుంది    ఈ పిచ్చి పిల్ల. పేరేంటన్నారూ?' 

'శేషారత్నం..' వెంటనే అందించాను.  పేరే కాదు.. అమాయకపు చూపులతో ఆడుతూ పాడుతూ తిరిగాల్సిన వయస్సులో  పసుపుతాడు గుదిబండలా మోసే   ఆ పిచ్చి తల్లి రూపు  అప్పుడే మనస్సులో ఎందుకో గట్టిగా అచ్చుపడి ఉంది.  

'ఆఁ.. ఆ శేషారత్నం ఇంకెవరో పెద్దాయన్ను వెంటేసుకుని డబ్బు సంచీతో సహా వచ్చిందో పూట మా ఇంటికి మళ్లీ.. బ్యాంకు లోను వెంటనే తీర్చేసెయ్యమని.. అక్కతో పెళ్లి మాత్రం ఆపొద్దని ఒకటే ఏడుపు. అప్పటికే బ్యాంకు లోను గాయిత్రి చేత  కట్టించి ఇంటిని స్వాధీనం చేసుకునుంది మా అమ్మ. తనిప్పుడు అక్కడే ఉండటం! దిక్కూ మొక్కూ లేని ఆడపిల్లలకూ ఓ దారీ తెన్నూ దొరికే వరకూ దగ్గరుండి ఏదైనా ఓ ఉపాధి కల్పించే కళలో శిక్షణ ఇచ్చే సెంటర్ నడిపిస్తోంది!'  

'మా సిస్టర్  శేషారత్నం కూడా ఇప్పుడు అక్కడే శిక్షణ పొందడం' అంది అప్పుడే లోపలికొచ్చిన గాయత్రి చిన్నగా నవ్వుతూ. 

'శేషారత్నానికి తల్లి ఉంది కదా!' ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయాను. 

'ఆ అట్లుపోసే మనిషి అట్లుపోసి అమ్మినంత సులువుగా వంట్లోని కిడ్నీని కూడా అమ్మేసిందంకుల్! శేషారత్నం ఆ పూట పట్టుకొచ్చి ఇవ్వబోయిన సొమ్ము ఆ కిడ్నీ సొమ్ము తాలూకే! ఆ తరువాత ఇన్ఫెక్షనొచ్చి ఆమె చనిపోయింది. ఆ సంగత్తెలిసి గాయత్రి బలవంతంగా ఆ తల్లిలేని పిల్లను తెచ్చి అమ్మ నడిపే వెల్ఫేర్ సెంటర్లో  పడేసింది' అన్నాడు గాయిత్రి భర్త భార్యవైపు చూసి నవ్వుతూ చూసి.

***

-కర్లపాలెం హనుమంతరావు

(కౌముది/రచన - పత్రికల్లో ప్రచురితం)

 ***  

 

 

 

   

   


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...