Showing posts with label prose poetry. Show all posts
Showing posts with label prose poetry. Show all posts

Thursday, December 16, 2021

లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ - కె. శ్రీనివాస్ 25-03-2005 ( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు


 




లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్

-  కె. శ్రీనివాస్ 

25-03-2005

( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


ఆశ అన్ని వేళలా అకస్మాత్తుగా భంగమై పోదు. దీపంలాగా కొద్ది కొద్దిగా కొడిగట్టిపోతుంది. వెలుతురు లాగా మెల్ల మెల్లగా మసకబారుతుంది. దిగులులాగా ముడుతలు ముడుతలుగా ముఖాన్ని కమ్ముకుంటుంది. ధైర్యంలాగా కొద్ది కొద్దిగా ఆవిరవుతుంది.


ముందే హెచ్చరించిన శకునపక్షి చివరికి అపహసిస్తుంది. పర్యవసానాల జ్ఞానం లేనందుకు బుద్ధి కించపడుతుంది. అనుభవం ఒక కవళికగా మారి పోతుంది. పలితకేశంగా ప్రకాశిస్తుంది.


ఉమ్మనీరూ చిమ్మచీకటీ వదిలి లోకంలోకి వచ్చి నప్పుడు- ఓపలేని వెలుగులో కళ్లు మూసుకుపోతాయి, స్వతంత్రత లోని విచ్ఛిత్తికి గుక్కపెట్టి శిశువు రోదిస్తుంది.ప్రపంచం పరిచయమవుతున్నప్పుడు సకలేంద్రియాలూ విప్పారతాయి. గుండె కొంచెం కొంచెంగా విచ్చుకుంటుంది. 'కావున లోకపు టన్యాయాలూ కాల్చే ఆకలి కూల్చే వేదన' తెలియక శైశవగీతం కేరింతలు కొడుతుంది. ముక్కు పచ్చలన్నీ ఆరిపోయి ముఖంలోకి ముగ్ధత్వం వస్తుంది.


పాలబుగ్గల నిగారింపు, లేత చెక్కిళ్ల మెరుపులు, ఆశ్చ ర్యంతో మెరిసిపోయే కళ్లు, అయాచితంగా కురిసే చిరునవ్వు, తారసపడిన ప్రతి ధ్వనినీ ఆలకించే మనసూ- కాలం చిరు

జలపాతంలాగా వర్తిస్తుంది. లేగలాగా గెంతులు వేస్తుంది. చదువై, పెంపకమై, సంస్కృతై విలువలై, ధర్మశాస్త్రమై- చిరుమోతాదు విషంలాగా సమాజం లోలోపలికి ప్రవేశిస్తున్న కొద్దీ బాల్యం లౌల్యం అన్నీ మృతకణాలుగా నిష్క్రమిస్తాయి. ఉడుకు నెత్తురు యవ్వనం గరళకంఠమై ప్రతిఘటిస్తుంది. సంపాదన, సంసారం, అధికారం సుడిగుండంలో దమ్ము చెదిరి కబడ్డీ కూత ఆగిపోతుంది. ఇన్నోసెన్స్ ఇంకిపోతుంది.


సెప్టెంబర్11తో అమెరికా తన ముగ్ధత్వాన్ని కోల్పోయిందని ఎవడో ఆత్మవంచకుడు మొదట అన్నాడు. తనమీదికి ఎవరూ దాడిచేయలేరన్న నమ్మకమే ఆ ముగ్ధత్వమట. అజ్ఞానం వేరు. అహంకారం వేరు, అమాయకత్వం వేరు. ఏదయితేనేం, తొలగవలసిన భ్రమలే తొలగినాయి. ముగ్ధ అమెరికాతోటే ముప్పుతిప్పలు పడ్డ ప్రపంచం నేటి ప్రౌఢత్వంతో పరమనరకాన్ని చవిచూడవలసి వస్తున్నది. నెత్తుటి వెల్లువ కట్టలుతెంచుకున్నప్పుడు, ముగ్ధత్వం కొట్టుకు పోయిందని, ఉత్తములు నిస్పృహలో కూరుకుపోయి అధములు ఉత్సాహంతో చెలరేగిపోతున్నారని-ఐరిష్ కవి యేట్స్ మొదటి ప్రపంచయుద్ధానంతర స్థితిని వర్ణించాడు. శిశువు నుంచి మనిషి పశువుగా పరిణమించేవరకూ కోల్పోయే మానవీయ ముగ్ధత్వం - మొత్తం మానవజాతి కూడా రకరకాల కాలాలలో రకరకాల దశలలో కోల్పోతూ వస్తున్నది. కొత్తరూపాలలో వచ్చే పాతద్రోహాలు, కొత్త ఆశలవరుసలో చొరబడిన భవిష్యత్ మోసాలు  అనునిత్యం ఆవిష్కృతమవుతూనే ఉన్నాయి. ప్రతి ఆశ చివరా 'యూ టూ బ్రూటస్' మూలుగు వినిపిస్తుంది. ప్రతి నమ్మకంలోనూ కోవర్ట్ పరిహాసం ధ్వనిస్తూనే ఉంటుంది.


అయినా మనిషి ముగ్ధుడవుతూనే ఉంటాడు. మెరిసే కన్నీళ్లను, చేసే ప్రతిజ్ఞలను చూపించే స్వర్గాలను తగిలించుకున్న విశేషణాలను యథాతథంగా స్వీకరిస్తూనే ఉంటాడు. ఆకాశాలను చేరువ చేసే ఆదర్శమంత్రోచ్చాటనలకు హృదయం అప్పగిస్తూనే ఉంటాడు. సినిక్ దర్శించే అంతిమ అనివార్యతలకు అంధుడవుతూనే ఉంటాడు. భగ్నహృదయాన్ని కొత్త ప్రేమలతో కుట్టుకుంటూనే ఉంటాడు. ఎన్నిసార్లు మాయ జయించినా సరే, అసంఖ్యాక అమాయకతలను అక్షయ తూణీరంలాగా సంధిస్తూనే ఉంటాడు. జీవితం చేసిన గాయాలతో ముఖమంతా ఎడారిగా మారినా సరే, లోలోపల ఒక ఒయాసిస్సును కడుపుతో ఉంటాడు.


చురుకు చూపులు, విషపు నవ్వులు, నొసటి వెక్కిరింతలు- వయసుతో పాటు ఓడిపోయిన ముగ్ధత్వం మీద మొలిచిన విజయస్తంభాలుగా కనిపిస్తాయి. మోహం మీద కామం, మందహాసం మీద వికటాట్టహాసం, ఆలోచన మీద వ్యూహం పైచేయి అయిపోయి బతుకు అరిషడ్వర్గాలతో లుకలుకలాడుతుంది. అయినా సరే, ఇంకా పసితనం సశేషంగానే ఉంటుంది. ఏ మూలలోనో శైశవం తొణికిసలాడుతూనే ఉంటుంది. నాగస్వరానికి ఉర్రూతలాగే లక్షణం మిగిలే ఉంటుంది. కొత్తగాలిలో కొట్టుకుపోవడానికి ఒక కిటికీ తెరిచే ఉంటుంది.


నమ్మాలి. అదుపుకోల్పోయి పరవశం కావాలి. ఆశల ఎంజైమ్ నిత్యం స్రవిస్తూ ఉండాలి. జ్ఞానుల ముందు, వివేకుల ముందు, సత్యం ముందు మాత్రమే కాదు- ఆషాడభూతుల ముందు, గిరీశాల ముందు, వాగ్దానాలు చేసే నేతల ముందు కూడా మంత్రముగ్ధం కావడానికి మనసు తెరిచే ఉంచుకోవాలి. మోసకారులకు భయపడి, మనసును మాయపరచుకోగూడదు. శకునికి భయపడి ఆటను మరువకూడదు. ఓటమిలో కుంగిపోతూ అంతిమ విజయాన్ని పలవరించాలి. అంధకారంలో ఒక సూర్యు ణ్ణి భ్రమించాలి. ప్రసూతి వైరాగ్యం వలె ఆశాభంగం మరునాటికే పిగిలిపోవాలి. బుద్బుదం పగిలినా మరో బుడగలోకి దూరిపోవాలి.


నెత్తుటి వెల్లువలో ముగ్ధత్వం కొట్టుకుపోయినా సరే, ఆ అమాయకతను కీర్తించాలి. ఎండమావి అని తెలిసేదాకా దాహం తీర్చిన ఆశను గుర్తించాలి. సంకెళ్ల మధ్య మందహాసాలను, ఉక్కుపాదాల కింద చెక్కుచెదరని చిరునవ్వును, మృత్యువు చెంత మనోధైర్యాన్ని నిలుపుకున్న ధీరులందరిలో నిలిచి వెలుగుతున్న అమాయకత్వాన్ని గౌరవించాలి.


- కె. శ్రీనివాస్ 

25-03-2005

( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  బోథెల్ ; యూఎస్

                  16 - 11-2021 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...