Sunday, July 26, 2015

అందమైన ఆనందం బాల్యం- వ్యాసం


గడచిన  ఏడాది శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బాలల చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్న వారిలో అధిక శాతం బాలలు కాదు. 35-65 వయసుల మధ్య వాళ్ళు! అదే ప్రాంతంలో అదే సమయంలో పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన చిత్రాలు ఆడి థియేటర్లలోని ప్రేక్షకుల్లో 55 శాతం 15 సంవత్సరాల లోపు బాలలే! బాలల పత్రికలను బాలలు చదవడం ఎప్పుడో మానేసారు! ఏడేళ్ళు దాటిన బాలలకు రెండు చక్రాల సైకిళ్ళు తొక్కటం  చిన్నతనంగా తయారైంది! 196 దేశాలలో అధ్యయనం చేస్తే 152 దేశాల్లో బాల్యం పది పన్నెండేళ్లకే  పరి సమాప్త మవుతున్న వికృత చేష్టలు ఇష్టారాజ్యంగా సాగుతున్నట్లు  నిర్ధారణ అయింది. అనారోగ్యకర  లైంగిక ప్రయోగాలు,   రెచ్చగొట్టే ఉద్రేక పూరితమైన చలన చిత్రాలు, చిత్రాలు, సాహిత్యం.. ఎలాంటి కట్లుబాట్లు లేకుండా యథేచ్చగా పసిపిల్లలకూ అందుబాటులోకి వస్తున్న దుస్థితి మన దేశంలోనూ ఉండటం విచారకరం. ఈ పాపంలో సింహభాగం అంతర్జాలనిదే- అని పలు  అధ్యయనాల సారాంశం.

పిల్లలు పిల్లల్లాగా ఉంటే బాగుంటుందని పెద్దల మొత్తుకోలు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. 'ప్రపంచమే నా ఇల్లు.. ప్రజలంతా నా వాళ్ళు' అన్నంత అమాయకంగా సాగాలి బాల్యం. 'పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం-/కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ ఏవీ ఎరుగని పూవులు' బాలలు అని గదా 'శైశవ గీతి'లో శ్రీశ్రీ  అన్నది! ‘మెరుపు మెరిస్తేవాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే .. అవి తమకే నని మురిసే అమాయకత్వం క్రమేపీ బాలల్లో తరిగి పోతున్నదని ఇటీవలి పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గతంలో మన  తెలుగులో పిల్లల కోసం  ప్రత్యేకంగా 'బాల భారతం' 'బాల రామాయణం' లాంటి చిత్రాలు వచ్చి బహుళాదరణ పొందాయి. సాధారణ చిత్రాల్లో సైతం పిల్లల వినోద విజ్ఞానాల కోసం వీలైనంత మేరా ఒకటో రెండో వినోద సన్నివేశాలు.. గీతాలు నీతి దాయకమైనవి  చొప్పిస్తుండేవాళ్ళు. చలన చిత్రం అంటే ఇంటిల్లి పాదీ కలిసి చేసే వైజ్ఞానిక వినోదని ఆ పెద్దల ఉద్దేశం అయివుండాలి. ఇప్పుడో? పెద్దలే సిగ్గుపడే అసభ్య చిత్రాలను పిల్లలు గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు! సెన్సార్ వారి 'యు' ధృవీకరణ పత్రం గల చిత్రాల్లోనూ పెద్దలకే అభ్యంతరకరమైన సన్నివేశాలుండి   పిల్లల అభిరుచులను భ్రష్టు పట్టిస్తున్నాయన్నది చేదు వాస్తవం.

ఆడపిల్లలు మగపిల్లలతో, మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం సాధించడంలో విఫలమైతే అసమర్థులుగా తిరస్కరణకు గురయ్యే హీన సంస్కృతి బాలల ప్రపంచంలో నేడు విపరీతంగా ప్రబలుతున్నది.  పాయసంవంటి బాల్యం  విషతుల్యంగా మారేందుకు ఇలాంటి వైపరీత్యాలు చాలానే ముఖ్య కారణం’ అంటున్నారు బాలల మనో విశ్లేషకులు . ఫేసు బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో అర్థరాత్రిళ్ళు దాటినా యథేఛ్చగా ఆపోజిట్ సెక్సుతో అశ్లీల విషయాల మీద చేసే చర్చలు, పిల్లలు మధ్య  బదిలీ అవుతున్న నీలి చిత్రాలు, వీడియోలు  బాలల సహజ  సున్నిత జీవన సౌందర్యానికి చెరుపు
చేన్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ. కుతూహలం కొరబడ్డ లైంగిక చర్యల్లో యాంత్రికంగా పాల్గొంటూ  ప్రమాదకరమైన అలవాట్లకు బానిసలై  బాలలు వివేక రహితంగా మొగ్గ దశలోనే జీవితాన్ని గందరగోళంలో పడేసుకుంటున్నట్లు   బాలల మానసిక శాస్త్ర వేత్త నీరజా సక్సేనా   ఇటీవల ముంబయి విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధనా పత్రంలో ఆందోళన వెలిబుచ్చడం గమనించదగ్గ అంశం.
'ఎదగటానికెందుకురా తొందరా.. ఎదర బతుకంతా చిందర వందర ' అని   పాత  చలన చిత్రంలో పాట. ఆ రోజుల్లోనే  భవితను గూర్చి అంతలా చింతన చేసేవారే! మరి ఇప్పటి పరిస్థితులకి ఇంకెంతగా ఆందోళన చెందాలి?
ఎనిమిదేళ్ళ ప్రాయానికే ఆడపిల్లల్లో అందాన్ని  పెంచుకోవాలన్న స్పృహ! మగ పిల్లలకు  ఆడపిల్లల  దృష్టిలో పడి తీరాలన్న యావ!  భావి జీవితానికి మేలు కలిగించే   అంశాల అధ్యయనం మీద ఏకాగ్రత  చెదరగొట్టే ఆలోచనలు కావూ ఇవన్నీ?! శరీరాకృతి, వేషభాషలను గురించి పట్టింపు పసితనం నుంచే ప్రాధాన్యతాంశాలైతే అందమైన బాల్యాన్ని ఇక అనుభవించే సమయం దొరకబుచ్చుకునేది ప్పుడు?! 'పీర్ల పండుగకు పీర్లు ఎత్తుకోని 'మాన్ కోట్.. బిస్కోట్' అని అరుసుకుంట గల్లీల పొంటి తిరుక్కుంట అలాయ్ గుండం సుట్టు ఎగిరి దుంకాలనుంది. దీపాళి పండక్కి రోలురోకలి దీసుకోని అండ్ల పొటాష్ బోసి రాతిగోడకేసి లగాంచి కొట్టాలనుంది. ఎండాకాలం దోవోజి బాయిల షెడ్డుమీది కెల్లి  డైగొట్టి దుంకాలనుంది.. కంపినోల్ల సేన్ల దొంగతనంగ అనపాయకాయలు.. కందికాయలు తెచ్చుకోని ఉడక బెట్టుకోని తినాలనుంది. మునగాలోల్ల సినీరయ్య తాత బోతాంటె ఎనకనించి గోసి ఊడ బీకాలనుంది. మా రామక్క తోని మాట్లాడాలనుంది' అంటూ  'పాతవాచకం' పేరున  ఓ కవి 'నా బాల్యాన్ని నాకు తెచ్చివ్వవూ' అంటో గోస పెట్టడం చూస్తుంటే  అందమైన బాల్యం మీద ఎంత ముచ్చటేస్తుంది! 'జబ్ బచ్ పన్ థా, తో జవానీ ఏక్ డ్రీమ్ థా/ జబ్ జవాన్  హుయె, తో బచ్ పన్ ఏక్ జమానా థా!' అని హిందీలో ఓ కహావత్. బాల్యానికి  యవ్వనం రంగుల కలవరింత. యవ్వనానికి  బాల్యం గడిచిపోయిన వింత! ఇందుకు విరుద్ధంగా  ఇప్పటి బాలలు చేసే ఆలోచనల వల్లే ఈ  చింత!

బాలల ప్రపంచంలో వస్తున్న ఈ మార్పులు దేనికి సంకేతం? గతంలో బడికి సెలవులు వస్తే చాలు.. బంధు మిత్రుల ఇళ్లకు  వెళ్లి ఉల్లాసంగా గడపడం ఉండేది. ఇప్పుడు పెద్దలతో కలవడానికి పిల్లలు బొత్తిగా ఇష్ట పడటం లేదు. సందు  దొరికితే స్నేహితులు. లేదంటే ఒంటిగా ఇంట్లో గదిలో ఇంటర్ నెట్ ముందు ఫీట్లు. బాలల్లో పఠనాసక్తి పూర్తిగా తరిగి పోతున్నదనే అద్యయనాలు తెలుపుతున్నాయి. సంగీతమైనా  చిత్రమైనా అయినా ఇంటిల్లిపాదీ కలసి  సరదాగా వినోదించే రోజులు  చెల్లిపోయా యనిపిస్తుంది. చెవిలో మెషిన్.. తనలో తాను. లేకుంటె తన లాంటి మరో అర్భక  జీవితో చాటుమాటు మాటా మంతీ! తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇంటి పెద్దలు, చదువులు చెప్పే గురువులు, సంఘంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విజేతలు.. వాళ్ళ అనుభవాలు, ఆలోచనలంటే ఆసక్తి లేదు. తనకు మించిన పరిపక్వత ప్రదర్శించలేని మిత్రబృందం సలహాలకే పిల్లలు పెద్దపీట వేస్తున్నారు. వ్యాపార దృష్టితో నడిచే పత్రికల్లో సైతం అవసరానికి మించి దొరికే అభ్యంతరకరమైన  సమాచారం బాలల అమాయకత్వానికి చేసే మేలుకన్నా కీడే ఎక్కువని   బాలల మనో శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్న ఆందోళన అర్థం చేసుకోదగిందే.  చిన్నపిల్లల ఆటబొమ్మల్లో సైతం ప్రాధాన్యత సంతరించుకుంటున్న లైంగిక కోణం గురించి  కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ మిన్హాస్ ఈ మధ్య ముంబయిలో  బైట పెట్టారు. ప్రతి పదిమంది బాలల్లో ఒకరు అసహజ  రీతి లైంగిక చేష్టల వలల్లో చిక్కుబడి పోతున్న మాట నిజమే.
భావోద్వేగాలనేవి శరీర  పరిపక్వతను అనుసరించి సహజ పద్ధతిలో వికాసం చెందవలసిన ప్రకృతి ధర్మాలు. అసహజమైన రీతిలో  అభివృద్ధిని సాధించే క్రమంలో జీవితంలో ఆయాచితంగా లభించే అందాలని, ఆనందాలని, అనుభవాలని శాశ్వతంగా కోల్పేయే ప్రమాదం పొంచి ఉందని  రాబర్ట్ మిన్హాస్ అభిప్రాయం. బాల్యం అనేది తాపీగా,  ప్రశాంతంగా, సహజంగా ముందుకు సాగసిన వికసన దశ. తద్విరుద్ధంగా జరిగితే అందమైన బాల్యం అందకపోవడమే కాదు.. ముందు ముందు అనుభవించాల్సిన ఆనందకర  జీవితాన్నీ చే జేతులా దుంప నాశనం చేసుకున్నట్లే లెక్క. బాలల మనస్తత్వ శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడ చెవిన బెడితే జగత్ జీత్ సింహ్ షాయిరీ  ' యే దౌలత్ భి లే లో/ యే షొహరత్ భి లే లో/ భలే ఛీన్ లో ముఝ్ సే మేరీ జవానీ/మగర ముఝ్ కో లౌటా దో బచ్ పన్ కా సావన’  అని పాడుకునేందుకైనా అందమైన బాల్యం అందుబాటులో లేకుండా పోవచ్చు.
బాలలే కాదు ..తల్లిదండ్రులూ అప్రమత్తమవాల్సిన తరుణం ముంచుకస్తోంది మరి.. తస్మాత్ జాగ్రత్త!
--కర్లపాలెం హనుమంతరావు
***
(బాలల దినోత్సవం సందర్భంగా నవంబరు 14, 2014 నాటి ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుటలో ప్రచురితం)













Friday, July 24, 2015

గడ్డం ఓ ప్రత్యేకం- ఓ సరదా గల్పిక

గడ్డం ఓ ప్రత్యేకం 
( వాకిలి - ప్రచురితం ) 
*

గడ్డం ఇంటి పేరున్న వాళ్లందరికీ గడ్డాలుండాలని రూలు లేదు. దేవుడి మొక్కులకు, పెళ్లాం ప్రసవానికి, తగ్గని జబ్బులకు, క్షౌర బద్ధకానికి, పంతానికి, దేశాంతరంనుంచి అప్పుడే దిగబడ్డ్డానికి, దిగులుకి, దీక్షకు, దీర్ఘ చింతనకు, యోగులకు, బైరాగులకు, క్షురశాల దాకా తీసుకెళ్లే ఆధారం లేని ముసలి వాళ్ళకు, ముసల్మాన్ సోదరులు కొంత మందికి- గడ్డం ఒక సంకేతం.

స్వాభావికంగా శారీరక సౌందర్యానికి ఆట్టే విలువ ఇవ్వని విరాగులూ బారెడు గడ్డం పెంచుకోవడం రివాజే. సాధారణంగా దేవుడు ప్రత్యక్షమయేంత వరకు రుషులు గడ్డాలు, మీసాలు పుట్టల్లా పెంచే వాళ్లని పురాణాలు ప్రమాణాలు చూపిస్తున్నాయి. 
బైబిలులో చాలా పాత్రలకు గడ్డాలు తప్పని సరి. 

నిప్పు రాజేయడానికి రాయిని రాయితో రుద్దడం తెలుసుకున్న మానవుడు గడ్డం గీయడానికి రాయిమీద కత్తిని సాన బెట్టడం ఎప్పటినుంచి మొదలు పెట్టాడో బైటపెట్టే ఆధారాలు ఇంతవరకు బైటపడ్డట్లు లేవు. గుహలమీది పాత చిత్రాల్లో సైతం ఆదిమానవులకు మరీ ఆట్టే పెరిగిన గడ్డాలు, మీసాలు ఉన్న దాఖలాలు లేవు.

మన కృష్ణుడి మీసాలు వివాదాంశమైనంతగ గడ్డాలు కాలేదు! రవివర్మ గీసిన చిత్రాలన్నింటిలో మగదేవుళ్ళు (ఒక్క శివుడు మినహా) అందరూ అప్పుడే నున్నగా గీసిన చెక్కిళ్లతో కనిపిస్తారు కదా.. ఆ కాలంలోనే క్షురకర్మ విధానం స్వర్గంలో అమల్లో ఉందనా అర్థం? గడ్డాలమీద ఎవరైనా గడ్డాలూ మీసాలు పెరిగిందాకా పరిశోధనలు చేస్తే గానీ తెమిలే అంశాలు కావివన్నీ!

తెల్లవాళ్ళకు ఈ గడ్డాలంటే ఆట్టే గిట్టవు. పాచిమొహంతోనే ఏ ఎలక్ట్రిక్ షేవరుకో పని  పట్టిస్తే గాని బాహాటంగా దర్శనమీయరు. ఒక్క ఫాదర్లు మాత్రం .. పాపం.. పెరిగిన గడ్డాలతో కనిపిస్తారు. 

అక్కడి మేధావులకూ ఇక్కడ మన మునులకు మల్లేనే బారెడు గడ్డాలు, మీసాలు సూచనలాగుంది. గడ్డం లేకుండా కార్ల్ మార్క్సుని గుర్తించలేం. అబ్రహాం లింకను అనగానే హక్కుల పోరాటంకన్న ముందు టక్కున గుర్తుకొచ్చేది ఆయనగారి బారెడు నెరసిన గడ్డం.

మహా మేధావులకే కాదు మాంత్రికులకూ గడ్డాలు సంకేతమే. మన పాతాళ భైరవి మార్కు ఎస్వీరంగారావు గడ్డం ఎంత ప్రసిద్ధమో అందరికీ తెలుసు. ఏదన్నా  దురాలోచన చేయాలంటే శకుని మామలాంటి దుర్మార్గులు ధూళిపాళలాగా మెడ ఓ వారకు వాల్చేసి గడ్డం దువ్వుకునే వాళ్ళేమో!

యోగా గురువు రాందేవ్ బాబా భృంగామల తైలంతో పెంచే గడ్డంతో కనిపిస్తారు. రవి శంకర్, జగ్గీ వాసుదేవ్, చిన జీ అయ్యరు, సుఖబోధానంద స్వామిలాంటి ఆధునిక అధ్యాత్మిక గురువులకూ ఎవరి తరహాలో వాళ్ళకు చిన్నవో పొన్నవో గడ్డాలు కద్దు . మొన్నటి  ఎన్నకల్లో మోదీగారిని అక్కడా, చంద్రబాబుగారిని ఇక్కడా విజయలక్ష్మి వరించడానికి ప్రధాన కారణం వాళ్ళ తెల్ల గడ్డాల్లో దాక్కొని ఉందేమోనని అనుమానం! రాహుల్ బాబా, మన జగనన్నలని  చూడండి! ఎప్పుడు చూసినా తాజ్ మహల్ పాలరాళ్ల తరహాలో నున్నగ  చెక్కిన  చెక్కిళ్ళతో తాజాగా కనిపిస్తారు. మరి ఎంత పోరితే మాత్రం విజయలక్ష్మి దరిదాపుల్లోకి ఎల్లా రావటం ?! 

దీర్ఘ కేశపాశాలతో ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా ఆట పట్టిస్తారో ఏ శృంగార కావ్యం చదివినా అర్థమవుతుంది. మగవాడు దానికి బదులు తీర్చుకునే ఆయుధాలే ఈ గడ్డాలు, మీసాలు. 

మీసాలమీద మోజు పడ్డంతగ గడ్డాలమీద ఆడవారు మోజు పడతారనుకొలే.ము . మాసిన గడ్డం కనిపిస్తే  ఈసడించుకుంటారు గదా! 

 మొన్నటి వరకు గడ్డాలు, మీసాలు ఓ  అలంకారం. నిన్నటికి అవి వికారం. మళ్ళీ  వాటిన మంచి రోజులు వచ్చేసాయి ! సినీ  హీరోలనుంచి చిల్లర తిరుబోతులదాకా ఎవరి ముఖాలు చూసినా  చిరుగడ్డాలే . మగతనానికి తిరుగులేని చిరునామా అయిపోయాయవి .

మగవాళ్లకి వద్దన్నా వచ్చేవి.. ఆడవారికి  కావాలన్నా రానివి ఈ గడ్డాలు, మీసాలే. ‘నువ్వసలు మొగాడివేనా?’ అని ఎవళ్లూ సవాళ్ళు విసరకుండా పిసరంతైనా గడ్డం, మీసం  పెంచేసు కోవడం తప్పనిసరి. ఆడవారి బారు జడలకు బదులు  గడ్డాలు, మీసాలే.

ఫ్రెంచి వాళ్ళను ప్రపంచ ప్రసిద్ధం చేసింది ఈ గడ్డమే. యోగికే  యోదుడికీ  గడ్డమే హాల్  మార్కు. తాతయ్యలకే గడ్డాలనే పాత రోజులు పోయాయి.

ఆ రుద్రుడు నుంచి ఆరుద్ర దాకా ఎవరి గడ్డం వాల్లాకు స్పెషల్. గడ్డం లేని శివాజీని ఊహించలేం.  గడ్డం ఆట్టే పెరగని లోటును బుట్ట జుట్టుతో పూడ్చేసారు  పుట్టపర్తి సాయి బాబా.

గాంభీర్యానికి, యోగ్యతకు, అనుభవానికి, ఆలోచనకి గడ్డం తిరుగులేని బాహ్య చిహ్నం. గ్రీసు దేశంలో వీరులనుంచి వేదాంతుల వరకు అందరికీ గడ్డాలే. ప్లేటో, సోఫాక్లీసు, హోమరులకు గడ్డాలు మీసాలే గ్లామరు. టాల్ స్టాయి గడ్డం రష్యాలో నవ శకానికి నాంది పలికింది. మన గురుదేవుని జ్ఞానసంపదంతా వారి  గుబురు గడ్డంలోనే దాగి ఉంది. నిరాండంబరం ఒక విధానంగా పెట్టుకోబట్టి గాని లేకుంటే మన మహాత్ముడూ గడ్డాలు మీసాలతో ప్రపంచాన్ని మరింత ప్రభావితం చేసుండేవాడు .

ఒక్క అలెగ్జాండరుకే గడ్డం అంటే ఎందుకో చెడ్డ కోపం. సైన్యం గడ్డాలు పెంచుకోరాదని ఆదేశించాడు. రణక్షేత్రంలో  శత్రువు నుంచి రక్షణ కోసం కాబోలా ఏర్పాటు! ప్రపంచాన్ని గడగడలాడించిన యోధుడిని  గడగడలాడించి ఘనత  మరి గడ్డానిది! నెపోలియను, సీజరు గడ్డాలకు వ్యతిరేకులు. పీటర్ కూడా  ప్రజల  నుంచి గడ్డం పన్నులు రాబడితే,  ఔరంగజేబు గడ్డం పెంచని  వాళ్ళ నుంచి నిర్దయగా  పన్నులు పీకించేవాడు .

వడ్డికాసులవాడి  హుండీ ఆదాయం కన్న  మగభక్తులు సమర్పించే గడ్డాలు  , మీసాల తాలూకు కేశాల మీదొచ్చే   రాబడి అంతకు పదింతలని ఒక అంచనా. క్షురకర్మ చేసేవారి  నుంచి కత్తెర సామాను తయారు చేసే వారివరకు  ఎందరో గడ్డాలు, మీసాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. 

గడ్డాలున్నంత వాళ్లంతా యోగులు, యోగ్యులు కాదు  . సీతాపహరణానికి  రావణాసురుడు బవిరి గడ్డాన్నే అడ్డు  పెట్టుకున్నాడు. ఆషాఢభూతులకు బారెడు గడ్డాలు. ఆశారాం బాపూలు, నిత్యానంద స్వాములూ ఆకర్షణీయమైన గడ్డాలతోనే అమాయక స్త్రీలను  మోసం చేసారు. 
రాజసం తొణికిసలాడే గడ్డానికి అగ్రరాజ్యంలో ఓ ప్రత్యేక దినంకద్దు (అక్టోబరు 18). 
***

Thursday, July 23, 2015

గురుదక్షిణ- ఆటా సావనీర్ కథ


ఆటా- ప్రత్యేక సంచిక 2012లో 'ధర్మస్య త్వరితాగతిః' పేరుతో ప్రచురితం






'దాత'వ్య మితి యద్దానం దీయతేzనుపకారిణే।
దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్త్వికం స్మృతమ్॥
మానవజన్మ ధరించినందుకుగాను మనకున్న దానిలో ఎంతో కొంత ఆపన్నులకుబాధా తప్తులకు         ప్రతిఫలాపేక్ష రహితంగా సాత్వికదానం చేసేవారిని భగవంతుడు అనుగ్రహిస్తాడు.

'భక్తి' టీవీలో స్వామి శివానందులవారు దానమహిమను గురించి ధర్మోపన్యాసం చేస్తున్నారు.
మహాదాత అయిన కర్ణుణ్ణి శ్రీకృష్ణపరమాత్ముడు  పరీక్షించాలని ఓ వేకువఝామున కర్ణుని ఇంటికి వెళ్ళాట్ట. కర్ణుడు ఆ సమయంలో వంటికి నూనె పట్టించుకొంటున్నాడు. అతనికి ఎడమవైపున్న వజ్రాల పాత్రను దానమడిగాడు కృష్ణుడు. మరో ఆలోచన లేకుండా ఎడంచేత్తో అమాంతం ఆ వజ్రాలపాత్రను కన్నయ్య దోసిట్లో వేశాట్ట కర్ణయ్య. 'పుర్ర చేత్తో దానమీయడం భావ్యమా?' అని కృష్ణుడు ఆక్షేపిస్తే
'క్షణం చిత్తం క్షణం విత్తం క్షణ జీవిత మావయోః।
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః॥
ఉత్తరక్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. లక్ష్మి చంచలమైనది. యముడు దయా రహితుడు. మనసు ఏ క్షణంలో ఎటు మళ్ళుతుందో తెలీదు. వస్తువు చెయిజారే లోపల ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో.. ఎవరి కెరుక?.. కాబట్టి ధర్మకార్యం అనుకొనేదాన్ని వెంటనే చేసెయ్యాలయ్యా!.. 'ధర్మస్య త్వరితా గతిః' అన్నారు గదా పెద్దలు! అన్నడుట కర్ణుడు.
అనుగ్రహ ప్రసంగం శ్రద్ధగా వింటున్న సుబ్బరాజుగారికి పొద్దున జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
ముప్పై ఏళ్ల కిందటి మాట. నాకు అప్పుడు ఇరవయ్యో.. ఇరవైయ్యొకటో! చెన్నైలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొంటూ బతుకు పోరాటం చేస్తుండేవాణ్ణి. పురాణం వెంకటరత్నం పంతులుగారు అనే పండితుడి దగ్గర వ్రాయసగాడుగా చేర్పించాడు ఒక మిత్రుడు.
పంతులుగారు అప్పట్లో వ్యాసభగవద్గీతకు తెలుగు వ్యాఖ్యానం రాసే పనిలో ఉన్నారు. పక్షవాతంచేత కుడిచెయ్యి సహకరించక రాసేందుకు నన్ను పెట్టుకొన్నారన్న మాట. నెలకు పాతిక రూపాయలు జీతం. పొద్దున పదినుంచి రెండింటిదాకా రాత పని. మధ్యలో ఒకసారి టీ. మధ్యాహనం ఆయన 'ప్రేమాలయం'లో భోజనం.
తిండితిప్పలకేంగాని.. పంతులుగారి సేవలో నా భాషా పరిజ్ఞానం బాగుపడింది. వ్యాఖ్యానం రాసేది గీతకే అయినా.. బైబిలు ఖురాన్ లాంటివాటినుంచి ప్రమాణాలు తీసుకొనేవారాయన. నేనొకసారి 'గురూ గారూ! మన భగవద్గీతక్కూడా వేరే మతాలనుంచీ సపోర్టు అవసరమా?' అని అడిగాను.
'గీతలో అన్ని మతాలకు, సాంప్రదాయాలకూ స్థానమున్నదనేరా నా మతం. ఈ కోణంనుంచి వ్యాఖ్యానం చెయ్యాలని నా సంకల్పం' అన్నారాయన.
పంతులుగారు వ్యాఖ్యానం చేసేటప్పుడు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, బైబిలు, ఖురానుకి ఆంగ్లానువాదంలాంటి ఆథ్యాత్మిక గ్రంథాలే కాకుండా.. హరిభక్తవిలాసం, శృంగారతిలకం లాంటి గ్రంథాలనుకూడా చుట్టూ తెరిచిపెట్టుకొని ఉండేవారు. వ్యాసగీతలోనుంచి ఒక్కో శ్లోకం పైకి చదువుకొని ,, దాన్నే మననం చేసుకొంటూ.. ఈ పుస్తకంలోనుంచీ ఒకటీ.. ఆ పుస్తకంలోనుంచీ అరా ఏరుకొంటూ సంతృప్తిచెందిన తరువాత 'ఇహ రాసుకోరా అబ్బాయ్!' అంటూ ఏకధారగా వ్యాఖ్యానం చెప్పుకుపోయేవారు. చెప్పింది చెప్పినట్లు కాగితంమీద పెట్టుకొంటూ పోవడమే నా పని.
ప్రారంభంలో నాకిదంతా ఒక పరమ దండగవ్యవహారంలాగా ఉండేది. పోను పోను స్వారస్యం గ్రహింపుకొచ్చి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. గురువుగారి దగ్గర పనిచేసిన ఆ అబుభవం తరువాత నాకు ఒక సినిమా కంపెనీలో దర్శకత్వశాఖలో పనిచేసేటప్పుడు ఉపయోగించింది. స్క్రిప్టు వర్కులో మెరుగులు సూచిస్తుండేవాణ్ని.  ఆ క్రమంలోనే నేనూ ఒక రచయితగా మారడం.. తదనంతరం సినిమాలు తీస్తూ కొంత గడించడం.. ఇదంతా పాతికేళ్లనాటి ఫ్లాష్ బ్యాకులోని ఫస్టుహాఫ్.
సెకండ్ హాఫ్ ఏమిటంటే..
ఐదేళ్ల కిందట నేను తీసిన రెండు సినిమాలూ అట్టర్ ఫ్లాప్ అవడమూ.. నా పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడమూ!
స్టేట్ స్ లో ఎంబీఏ చేసే మా పెద్దబ్బాయి సోమరాజుని ఉన్నఫళంగా వెనక్కి పిలిపించి బిజినెస్ మొత్తాన్నీ వాడికి అప్పగించేసింది నా ధర్మపత్ని. అప్పట్నుంచీ నా పాదాలు పండక్కీ పబ్బానికీ ఇంట్లోని పిల్లా పీచూ అభివందనాలు పెట్టుకోవడానికీ.. నా అనుభవాలు ఇలా నీ బోటివాళ్లదగ్గర ఉబుసుపోక చెప్పుకోవడానికీ మాత్రమే పనికివస్తున్నాయమ్మాయ్! అందుచేత నేను నీకేవిధంగానూ సాయం చేసే స్థితిలో లేనమ్మా!' అన్నారు సుబ్బరాజుగారు తాపీగా సినిమా ఫక్కీలో.
అప్పటిదాకా అంతా ఓపిగ్గా వింటూ కూర్చొన్న శారద లేచి 'సాయానిదేముందిలేండి ఆంకుల్! వీలుంటేనేగదా ఎవరైనా చేస్తారు! ఇది తాతయ్యగారి చివరి కోరిక. అందుకే ఎలాగైనా పూర్తి చేయాలని నా పట్టుదల. వస్తానండీ!' అంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి శారద. సుబ్బరాజుగారు ఆలోచనలో పడ్డారు మళ్లా!
పంతులుగారు ఆ రోజుల్లో వడపళనిలో  ఓ చిన్నసైజు అనాథ శరణాలయంలాంటిది  నడుపుతుండేవారు.  ప్రేమాలయం దాని పేరు. మద్రాసు హైకోర్టులో బెంచిగుమాస్తాగా చెస్తున్న ఉద్యోగాన్ని ఆ అనాథశరణాలయంకోసం వదిలేసుకొన్నారాయన. నెలనెలా వచ్చే పించను.. డిపాజిట్`స్ మీదవచ్చే వడ్డీ చాలక, పుస్తకాలమీదొచ్చే ఆదాయాన్నికూడా దీనిమీదే వెచ్చించేవారు. తిండికిలేని పేద ముసలివారినీ, ఆధారంలేని పసిపిల్లల్నీ చేరదీసేవారాయన.
కులమతాలకు అతీతంగా ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివుండేది ప్రేమాలయం ఆవరణ.   ఆశ్రమంలోని వాళ్లందరికీ ఉచితంగా విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని, పెద్ద గ్రంథాలయాన్ని ప్రేమాలయానికి అనుబంధంగా నడపాలని.. ఆరాటపడుతుండేవారు ఆయన. ఆయన ఆరోగ్యం పాడైపోయిన తరువాత అక్కడి కార్యక్రమాలు పలచబడిపోయాయి. ఆయనతోనే ఆ ప్రేమాలయం వైభవమూ కనుమరుగయిపోయింది.
పంతులుగారు నెల్లూరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒకసారి చూడటానికని వేళ్లాడు తను. ఓటికుండలోని నీటికిమల్లే శరీరంలోని జీవశక్తి క్రమేపీ క్షీణించుకుపోతున్న దశ అది.
'ఎలాగుంది గురువుగారూ!' అని అడిగాడు తను.
' తగ్గుతుందిరా.. కృష్ణమూర్తీ.. తగ్గుతోంది!' అన్నారు. మనుషుల్నికూడా సక్రమంగా గుర్తుపట్టలేని స్థితికి గురువుగారు చేరుకున్నారు! ఇహ తగ్గేదేంటి?' అన్నాడు తను పక్కనే ఉన్న ఎవరో మిత్రునితో.
విన్నట్లున్నారు..  నడుందాకా కప్పివున్న దుప్పటిని తొలిగించి 'తగ్గేది..కాలురా.. పైచ్చి సన్నాసీ' అని నవ్వి కన్నీళ్ళు పెట్టుకొన్నారు.  పాదాలదగ్గరనుంచి పైకి ఆపరేషన్లు చేసుకొంటూ పోతున్నారు వైద్యులు. చూడలేక తిరిగి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచి 'ఒక పని చేసిపెట్టాలిరా! నేను పూర్తిగా తగ్గిపోయిన తరువాత మన ప్రేమాలయం పనులు మీరే చూసుకోవాలి. అదే నా అఖరి కోరిక' అన్నారు. చూడటానికి వచ్చినవాళ్లందరితోనూ అలాగే చెప్పేవారుట!
ఇప్పుడు వచ్చిన శారద అప్పట్లో ప్రేమాలయం ఒడిలో ఎదిగిన బిడ్డ. పంతులుగారి చివరి కోరిక తీర్చాలని.. ప్రేమాలయాన్ని ఎలాగైనా తిరిగి తెరిపించాలని తంటాలుపడుతున్నది.. పాపం!
అడక్కుండానే సాయం పట్టాల్సిన బాధ్యత తనమీద ఉంది. నోరు తెరిచి అడిగినా పైసా విదల్చలేని దౌర్బాగ్యస్థితిలో ఉన్నాడు తనిప్పుడు. వట్టిచేతుల్తో తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో కనిపించిన నిరాశను మర్చిలేకపోతున్నాడు సుబ్బరాజుగారు.
సెల్ఫోన్ అదే పనిగా రింగవుతుంటే ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు సుబ్బరాజుగారు.  సుకుమార్ పర్సనల్ మేనేజర్ స్వామి. 'ఆడియో ఫంక్షను మొదలయిపోయింది సార్! సుకుమార్ సార్ రిమైండ్ చేయమంటున్నారు' అన్నాడు అవతలనుంచి.
'ఏదీ! ఒకసారి మీ సారుకి లైన్ కలుపు!' అని అడిగాడు సుబ్బరాజుగారు ఒక నిశ్చయానికి వచ్చినట్లు.
***
సుకుమార్ తాజా చిత్రం 'రౌడీ' రవీంద్రభారతిలో ఆర్భాటంగా జరుగుతోంది. సుబ్బరాజుగారు ఆడిటోరియం చేరేవేళకే వేదికంతా విఐపిలతో కిక్కిరిసి ఉంది. హాలు లోపలా.. బయటా.. సుకుమార్ అభిమానుల కోలాహలం! మీడియా హడావుడికయితే ఇహ అంతే లేదు.
ముఖ్య అతిథి సాంస్కృతిక శాఖామంత్రి చలమయ్యగారు. సుకుమార్ ను గురించి సుకుమార్ కే తెలియని సుగుణాలను సుమారు ఒక అరగంటపాటు ఏకరువు పెట్టి ఆఖర్లో 'మన హీరోగారు గొప్పకథానాయకులే కాదు.. రాజకీయనాయకులుకూడా కావాలని కోరుకొంటున్నాను. ఇలాంతి పులుకడిగిన ముత్యాలు దేశానికి.. మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఎంతో అవసరం'
హాలు లోపలా బైటా ఈలలతో, అరుపులతో దద్దరిల్లిపోయింది. ఇంకో ఇద్దరు ముగ్గురు ఈ కాలం దర్శకులు, నిర్మాతలు సుకుమార్ ని స్తోత్రాలతో ముంచెత్తిన తరువాతగానీ సుబ్బరాజుగారి వంతు రాలేదు. రెండే నిమిషాలు మాట్లాడాలని నిర్వాహకులు హెచ్చరించిపోయారు.
సుబ్బరాజుగారు సాధారణంగా సభల్లో ఎక్కువగా మాట్లాడరు. మైకుముందు ఆయనకు మాటలు పెకిలవు. ఈసారి మాత్రం అదో రకమైన ఊపులో ఉన్నారు. 'పెద్దలు, ప్రముఖులు హీరోగారిని గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. నాకూ అలాగె మాట్లాడాలని ఉందిగాని.. మాల వేసుకొని ఉన్నందున అబద్ధాలు మాట్లాడలేను. నా మాటలు నిష్టూరంగా ఉంటె మన్నించమని మనవి.'
సభలో పిన్ డ్రాప్ సైలెన్సు!
'సుకుమార్ నాకు పాతికేళ్ళబట్టీ తెలుసు. డబ్బుదగ్గర తను మహా గట్టి. ఐదేళ్ల కిందట నేను తనతో తీసిన 'దేవుడు' అట్టర్ ఫ్లాపయింది. అయినా తన పారితోషికం రూపాయి తగ్గకుండా తీసుకొన్నాడు. అదే.. అంతకుముందు అతనితో కలసి నేను తీసిన ' సూపర్ కుర్రోడు' గ్రాండ్ సక్సెసయిందని.. లాభాల్లో వాటా అడిగి పుచ్చుకొన్నాడు. లాభంలో వాటా అడిగినవాడు.. మరి నష్టంలోకూడా షేర్ చేసుకోవడం న్యాయమా? కాదా?'
సభలో చిన్న కలకలం.
సుబ్బరాజుగారి ధోరణి అలాగే సాగుతూ ఉంది. 'సుకుమార్ గొప్ప ప్రజాసేవకుడు అన్నారు. ఇన్ని కోట్లు సంపాదించాడు. ఇప్పటివరకు ఏమేం సోషల్ సర్వీసులు సొంతడబ్బుతో చేసాడో చెప్పాలి! ఇవాళ్టికీ షూటింగు సమయంలో ఆయన భోజనం ఖర్చు నిర్మాతలే భరిస్తున్నారు.అంత పిసినారి ఈ హీరో..!'
సభలో ఒక్కపెట్టున రభస. వేదికమీదలు కాగితం ఉండలు.. వాటర్ బాటిల్సు.. దూసుకొస్తున్నాయి. మైక్ కట్ చేసేసారెవరో! ఐనా రాజుగారు తగ్గడంలేదు. స్వరం పెంచి అరుస్తున్నారు. 'సుకుమార్ లాంటి డబ్బుమనిషి.. సెల్ఫిష్.. తాగుబోతు,, క్రూక్.. అన్నింటికీ మించి..'
అభిమానులు రెచ్చిపోయి వేదికమీదకు దూసుకొస్తుండేసరికి సెక్యూరిటీ రంగప్రవేశం చేసింది. సభ అర్థాంతరంగా ఆగిపోయింది.
ముందు సుకుమార్ ని ఓ కారులో సురక్షితంగా బైటికి పంపించేసారు. సుబ్బరాజుగారినికూడా అతిరహస్యంగా ఓ వాహనంలో బైటికి రరలించే ప్రయత్నంలో ఉండగా.. ఆయనే బైట వేచిఉన్న మీడియాను దగ్గరకు పిలిచి మిగతాభాగం పూర్తి చేసారు. 'గాయత్రి అనే ఓ కేరళ కథానాయిక ఈ హీరో వేధింపులకు తాళలేకే కొట్టాయంలో ఆత్మహత్యకు పాల్పడింది. వీళ్ళిద్దరుకు పుట్టిన బిడ్డకు ఇప్పుడు ఐదేళ్ళు. చెన్నైలోని ఓ హాస్టల్లో సీక్రెట్ గా ఉంచి పెంచుతున్నాడు సుకుమార్. ఇవిగో వివరాలు. విచారించుకోండి!' అంటూ ఓ కాగితం వాళ్ళమీదకు వెఇసిరేసాడు పోతూ పోతూ.
నిప్పులేకుండానే పొగ పుట్టించే నైపుణ్యం ఈ కాలం మీడియాది. ఈ మాత్రం సెగ తగిలితే ఊరుకొంటుందా! ఇరవై నాలుగ్గంటల న్యూస్ ఛానెళ్లలో స్క్రోలింగులు.. డిస్కషన్లు.. ఒపీనియన్ పోళ్ళు.. ఎస్ ఎమ్ ఎస్సుల ద్వారా అభిప్రాయ సేకరణలు!
ఒక ఛానలైతే ఏకంగా సుబ్బరాజుగారిని స్టూడియోలో కూర్చోబెట్టింది. 'సుకుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేనాటికి పైన చొక్కా.. కింద మాసిన ప్యాంటుతప్ప ఇంకేమీ లేవు. పాతికేళ్లలో రెండువేల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలి. ఎంత ఆదాయప్పన్ను కడుతున్నాడో ప్రకటించాలి. రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నాడుగా! ముందు అతని నీతి నిజాయితీల్ రుజువుకావాలి!' అని సుబ్బరాజుగారి డిమాండ్లు.
'మా నాన్నగారికి మతి స్థిమితంగా ఉండటం లేదు. ఆయన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.' అంటూ పబ్లిగ్గా స్టేటుమెంట్లు ఇచ్చాడు సోమరాజు. 'రౌడీ; చిత్రం ఇంకా ఒక షెడ్యూల్ పూర్తికావాల్సి ఉంది. ఈ వివాదం వల్ల అది ఆగిపోయినా.. ఆలస్యమయినా.. పెట్టిన కోట్లన్నీ ప్రశ్నార్థకంలో పడతాయి. అదీ సోమరాజు బెదురు.
'నేను పూర్తి ఆరోగ్యంతో ఉండే మాట్లాడుతున్నాను. కావాలంటే మెడికల్ చెకప్పులు చేయించుకోవచ్చు. చెన్నైలో సుకుమార్ కి బినామీ పేర్లతో లిక్కర్ వ్యాపారాలుకూడా ఉన్నాయి. ఈ విషయాలన్నింటిమీద సిట్టింగుజడ్జితో వెంటనే విచారణ చేయించాలి. చెన్నైపాపకు, సుకుమార్ కి డి ఎన్ యే పరీక్షలు జరిపించి నిజం నిగ్గు తేల్చాలి.' అంటూ రోజుకోరకంగా సుకుమార్ మీద దాడి తీవ్రతరం చేసుకొంటూ పోతున్నారు సుబ్బరాజుగారు.
సుకుమార్ కి అనుకూలంగా .. వ్యతిరేకంగా రాష్ట్రం రెండుగా చీలి మూడురోజులబట్టీ రచ్చ రచ్చవుతోంది. అబిమానుల అల్లరయితే లా అండ్ ఆర్డర్ లిమిట్ ఎప్పుడో దాటిపోయింది.
మొనంగా ఉంటే మొదటికే మోసం వస్తుందనుకొన్నాడేమో.. ఒక ప్రకటన విడుదల చేసాడు సుకుమార్. 'సుబ్బరాజుగారు నాకు సినీజన్మనిచ్చిన తండ్రి. ఆయనెందుకు ఇలా చేస్తున్నారో అర్థమవడం లేదు. నా నీతి నిజాయీతీలను నిరూపించుకొనేందుకు నేను సిద్ధం. నా ఆస్తిపాస్తులమీద విచారణకు నేను రడీ! చెన్నైలో నాకు ఎక్కడో ఓ కూతురుందని అంటున్నారుగా! ఏ ఎన్ యే పరీక్షక్కూడా ఒప్పుకొంటున్నాను. ఆఓపణల్లో ఒక్కటైనా నిజమని తేలితే సినిమారంగంనుంచి శాశ్వతంగా విరమించుకొంటాను. ఉన్న  ఆస్తి పాస్తులు రాష్ట్రప్రజలకు రాసిచ్చేస్తాను. అబద్ధమని తేలితే సుబ్బరాజుగారిమీద పదికోట్లకు పరువునష్టం దావా వేస్తాను. నివేదికలు వచ్చినదాకా 'రౌడీ' చిత్రంలో నటించను.' ఇదీ ప్రకటా సారాంశం.
సుకుమార్ ఈ ప్రకటన చేసేనాతికి సుబ్బరాజుగారు అందుబాటులో లేకుండాపోయారు. శబరిమలై యాత్రలో ఉన్నారు.
పదహారో రోజున ఆయన తిరిగొచ్చేనాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
సుకుమార్ సుగుణాలనుగురించి, సచ్చీలతను గురించి రోజుకో సినిమా విఐపినో, రాజకీయ ప్రముఖుడో  ఛానెళ్లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అతని ఆస్తిపాస్తులమీద విచారణకు పూనుకొన్న ఓ స్వచ్చంద సంస్థ వారంరోజులపాటు విచారించి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. సుబ్బరాజుగారు ఇచ్చిన చెన్నైపాప వివరాలు బోగస్ వని తేలాయి. సుకుమార్ సుబ్బరాజుగారిమీద పరువునష్టం దావా వేయకుండా ఉండేందుకూ.. 'రౌడీ' చితం పూర్తిచేసేందుకూ.. సోమరాజు ఇలాంటివే ఇంకా చాలా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అయినా సరే.. పెద్దాయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కండిషన్ పెట్టాడు సుకుమార్!
అయ్యప్పదీక్ష ముగిసింది కనక ఏం చెప్పటానికైనా సుబ్బరాజుగారిమి ఇప్పుడు అభ్యంతరం లేదు. ప్రెస్ మీట్లో సుకుమార్ ని పక్కన కూర్చోబెట్టుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడాయన. 'సుకుమార్ పులుకడిగిన ముత్యమని నాకు ముందే తెలుసు. తను రాజకీయాల్లోకొస్తే తమ ఉనికి దెబ్బతింటుందని భయపడిన కొన్ని శక్తులు నా చేత ఈ నాటకం ఆడించాయి.'
'ఎవరా శక్తులు?' అని అడిగాడో రిపోర్టర్.
'ఇంకా వివాదాల్లోకి పోవద్దు! జరిగిందానికి నేను విచారిస్తున్నాను. నా ఆరోపణలను వెనక్కి తీసుకొంటున్నాను. సుకుమార్ ని క్షమించమని కోరుతున్నాను. అగ్నిపరీక్ష జరిగిన తరువాతే సీతమ్మవారి సచ్చీలత లోకానికి రుజువయింది. మన హీరో సుకుమార్ విషయంలోనూ అంతే జరిగిందనుకోండి! ఇంతటి నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తి నేటి రాజకీయాలకు ఎంతో అవసరం. నేనీ పాడుపని చేయడానికి పుచ్చుకొన్న ముడుపుల మొత్తాన్నీ నా పాపపరిహారార్థం సుకుమార్ కి సమర్పించుకొంటున్నాను' ' అంటూ అప్పటిదాకా పక్కనే పెట్టుకొన్న సూట్ కేసునుంచి  చెక్కుబుక్కుతీసి  ఓ సంతకం గిలికిన చెక్కును సుకుమార్ కి అందించి షేక్ హ్యాండిచ్చారు సుబ్బరాజుగారు.
చెక్ అందుకొని మీడియా కెమేరాలకు చూపించి అన్నాడు సుకుమార్ చిరునవ్వుతో' సుబ్బరాజుగారు నా తండ్రిలాంటి వారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈ వివాదంతో ఏ మాత్రం సంబంధంలేని  నా ఒకప్పటి సహనటి గాయత్రిగారి పేరు నలుగురు నోళ్లలో నానడమే నాకు మనస్తాపం కలిగించింది. సుబ్బరాజుగారు ఇచ్చిన ఆ మొత్తాన్ని ఆ గాయత్రిగారి పేరుమీద ఏదైనా అనాథశరణాలయానికి విరాళంగా ఇవ్వడం ద్వారా మనం ఏసిన అపచారాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చన్నది నా ఆలోచన. పెద్దవారు. నాకు పితృసమానులు. సుబ్బరాజుగారే ఏదైనా ఆర్ఫనేజ్ పేరు సూచిస్తే సబబుగా ఉంటుంది.' అన్నాడు సుకుమార్.
సుబ్బరాజుగారు సుకుమార్ చెవిలో ఏదో ఊదారు. తలూపి అక్కడికక్కడే ప్రకటన చేసాడు సుకుమార్. 'చెన్నైలోని మహా మహోపాధ్యాయ కీ॥శే॥ పురాణం వెంకట రత్నం పంతులుగారి స్మారకార్థం పునరుద్దీకరింపబడుతున్న అనాథశరణాలయం 'ప్రేమాలయా'నికి  ఈ చిన్నిమొత్తాన్ని విరాళంగా ప్రకటించడానికి గర్వపడుతున్నాను.
మీడియా కెమేరాలవెలుగుల్లో  ప్రేమాలయం తరుఫున 'శారద' సుకుమార్ ఎండార్సు చేసిచ్చిన చెక్కు  అందుకొంది.
'విరాళం ఎంత సార్?' ఓ జాతీయ ఛానెల్ ప్రతినిధి విచారణ.
చిరునవ్వుతో చెక్కును కెమారాలకి చూపించింది శారద. రెండు వేళ్ళు గాలిలో ఆడించాడు నవ్వుతో సుకుమార్! ఆనందంతో తలూపుతూ కనిపించారు సుబ్బరాజుగారు.
***
ప్రేమాలయం ప్రారంభోత్సవ సభ.
పక్కనే కూర్చోనున్న సుకుమార్ చేయి అందుకొని   చిన్నగా అన్నారు సుబ్బరాజుగారు 'మా వెధవాయి దగ్గర్నుంచి నా కష్టార్జితంలోని ముష్టి రెండు కోట్లు రాబట్టుకోవడానికి ఇన్ని ముష్టియుద్ధాలు నటించాల్సి వచ్చింది. నా కోసం ఎన్నో మాటలు పడ్డావు. సారీరా!'
నవ్వుతూ  చేతిని  కళ్లకద్దుకొని అన్నాడు సుకుమార్ 'అన్నం పెట్టిన చెయ్యి గురూజీ మీది! మరంతమంది నాలాంటి అభాగ్యులకు అన్నం పెడతానంటే ఇంకిన్ని మాటలు పడటానికైనా నేను రడీనే! అదీగాక  నటనేమన్నా నాకు కొత్తా?.. నా వృత్తే అది. మీ తిట్ల నాటకం ముందే చెప్పకపోతే మాత్రం కచ్చితంగా అప్ సెట్టయుండేవాడినే!' అని భళ్ళుమని నవ్వేశాడు సుకుమార్. సుబ్బరాజుగారూ ఆ నవ్వులో పాలుపంచుకొన్నారు.
నాలుగు వరసల అవతలగా కూర్చోనున్న సోమరాజుకి నవ్వులు వినీ.. ఎందుకో అర్థం అదోలా మొహం పెట్టేసాడు!
***
-కర్లపాలెం హనుమంతరావు





మనసు మా ఊరి ఇంటిముంగిట వాలిపోతుంది- బెజ్జ రమాదేవి పూల ముచ్చట



మల్లెపూలు ముక్కుపుటాలకు తగలగానే మనసు ఇరవై ఐదేళ్ల వెనక్కి మళ్ళింది. ఇదీ అని చెప్పలేని ఓ మధురస్మృతి.  బాల్యం కళ్ళముందు కొచ్చి నిలబడింది.
మా ఇంటిముంగిట్లో మల్లెపందిరి, జాజిపందిరి పక్కపక్కనే ఉండేవి.  ఆ పందిరికింద నల్లరాయిమీద కూర్చుని అమ్మ వండిన గోరుచిక్కుడుకాయకూర అన్నంలో కలుపుకు తింటోంటే.. కొద్దిగా మసకబారిన సందమామల్లాంటి మల్లెపూలు ఆ అన్నంపళ్లెంలో రాలుతోంటే.. అవి ఏరుకోవడం ఓ ముచ్చట! ఆ ముచ్చట్లలో సదిగాడు పేడకళ్లెల్లో కాలేసి జర్రున జారిపడ్డ సంగతులన్నీ గుర్తుకొచ్చి కిలకిలా నవులొస్తయ్యి. ఆ నవ్వులకు గొంతు పట్టుకుంటే నీళ్ళు తాగుతూ అన్నాలు  తినేవాళ్ళం ప్రమీల(ప్రేమల?),  ప్రభ, నేనూ.
ఆదివారంనాడు అదో సంబరం మాకు.
మా మల్లెపందిరి అంటే నాకే కాదు.. సీతాకోకచిలుకలకు, తుమ్మెదలకు, గొంగళి పురుగులకు, బక్కతొండలకు, ఆవులమందలకూ చాలా ఇష్టమే. బడికెళ్ళి రాగానే పలకలు, సంచి అరుగుమీద పారేసి పందిట్లో చిన్న పీటేసుకుని  చెయ్యెత్తి దగ్గరగా  కనపించే మల్లెమొగ్గల్ని అందుకొని తెంపేవాళ్లం. మాకు పోగా మిగిలినవి పేపరుపొట్లాల్లో చుట్టి తెలిసిన దోస్తులకి ఇస్తుండేది మా అమ్మ.
ఆదివారం వస్తే చాలు.. మల్లె, జాజి పందిర్లమీదనుంచి పచ్చటి ఆకుతేళ్ళు, గొంగళిపురుగులు ఏరిపారేయడం,  చెత్తా చెదారం ఎత్తి పోయడం.. ఇదీ మా పని. ముదిరిన ఆకులు గిల్లిపోయాలి. చెట్లకు నీళ్ళు పోసేందుకు వంతులు వేసుకునే వాళ్ళం ఇంట్లో వాళ్లందరం. ఏడు గోళాల ఉప్పునీళ్ళ బావి మాది. చాదబొక్కెనకు కొబ్బరితాడు. ఎంత చేదినా పైకి వచ్చేదికాదు బక్కెటు. చేదక్కట్టిన కొబ్బరినార  ఒరిపిడికి చేతులు ఎర్రగా కందిపోయేవి.
పెద్దాళ్లు బైటికొచ్చి చూసి పెద్దబొక్కెట విప్పి చిన్నబొక్కెట కట్టేవాళ్ళు. చిన్న బక్కెటతో ఎంతసేపు చేదినా కుండ నిండేదికాదు. నేను చేది పొయ్యడం.. ఇద్దరు చెల్లెళ్ళు చెరోవేవు పట్టుకుని చెట్లకు నీళ్ళు పొయ్యడం. అలుగ్గోళెంలో నీళ్ళు పోసేవాళ్లం. ఆగకుండా ఉరకడం మూలాన ఏ పలుగు రాయో తగిలి కుండ వదిలేస్తే అది కాస్తా పదహారు వక్కలయ్యేది. వాకిలినిండా నీళ్ళ మడుగు.
'బంగారమంటి కాగు ముక్కలాయె' అంటూ మా అమ్మ నాలిక మడతబెట్టి కొట్టేటందుకు ఉరికొస్తుంటే మేం దొరుకుతామా? సందుల్లో బడి, బజార్లో బడి రామేశ్వరమ్మిట్ట నేనూ.. సువర్ణమిట్ట ప్రమీల, ప్రేమలత తాఉకొనేవాళ్ళం.  ఇదంతా మల్లెచెట్టుకు నీళ్ళు పోసేటందుకు  వచ్చిన తిప్పలు!
ఇక పూల సంగతులు! మా అప్పచెల్లెళ్ళు ముగ్గ్గురికి మూడుపాళ్ళు,  మా అమ్మకో పాలు. ఎవరి పూలు వాళ్ళం మాలకట్టుకుని తెల్లటి తడిగుడ్డలో బెట్టి వాకిట్లో తీగెకు తగిలించేవాళ్లం. తెల్లారేసరికి  మొగ్గలు విచ్చి కమ్మటి మల్లెల వాసన మరోలోకానికి మోసుకుపోయేది.
ఇప్పటికీ ఎండాకాలం వచ్చి మల్లెల వాసన ముక్కుకి తగిలిందంటే మా ఇల్లు గుర్తుకొస్తుంది. మా పల్లె పందిరి గుర్తుకొస్తుంది. అందమైన ఆ గోధూళి సాయంత్రం గుర్తుకొస్తుంది. నా దోస్తులు బుజ్జి, పుశ్మి(పుష్పలత) గుర్తుకొస్తారు. అందమైన మా అమ్మ, ఆమె నవ్వు, నవ్వితే తళుక్కున మెరిసే ఆమె ముక్కుపుల్ల గుర్తుకొస్తాయి. ఆ అరుగుమీద ఆడుకున్న గచ్చకాయలు గుర్తుకొస్తాయి.
ఒక మల్లెవాసనతో ఇన్ని గుర్తుకొచ్చి.. మా ఊరు గుర్తుకొచ్చి గుండె చిత్తడి చిత్తడి అయిపోతుంది. మల్లె మొగ్గలు చూస్తే చాలు.. గతించిన ఆ స్మృతులు మదిలో మెదిలి ప్రాణం అతలాకుతలమై పోతుంది.
యాంత్రికమైన బతుకులు.. ప్రకృతిని వికృతిగా మార్చే సంస్కృతి.. ఆత్మీయపరిమళాలు ఉండవు ఆ కాగితంపూలలాంటి జీవితాలకి. అద్దాల బతుకులు. అబద్ధాల జీవితాలు. వీటన్నిటి మధ్యా మల్లెపూలను చూస్తే మనసు ఊరట చెందుతుంది. ఆత్మీయుల్లా తోచే ఆ పువ్వుల నవ్వుల్తో  మళ్లా బతుకులకు జీవకళ వచ్చినట్లుంటుంది.
నేను ఎండాకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాను. మల్లెల సాంగత్యంలో మూడునెలలు మూడుగడియల్లా దొర్లిపోతాయి. పిల్లి నీచు వాసన పసిగట్టినట్లు.. ఎక్కణ్నుంచి మల్లెలవాసన ముక్కుపుటాలకి తగిలినా..  కళ్లు మూతలుపడతాయి. మనసు మా ఊరి ఇంటిముంగిట  వాలిపోతుంది.
ఎన్ని తెంపినా కొన్నింటిని ఇంకా తనలో దాచుకున్న మా మల్లెపందిరి గుర్తుకొస్తోంది.
తెల్లారగానే మబ్బుల్లో చుక్కల్లా కిలకిలా నవ్వే తెల్లటిమల్లెలు. గాలికి గర్వంగా తలలూపే మల్లెతీగ.. 'ఫోవే..భడవాయీ! నా పూలు నాకూ ఉన్నాయి!' అన్నటు అనిపిస్తుంది. నిండుపూలతో గాలికి ఊగే మల్లెపందిరి అందమైన  నిండుముత్తైదువంత కళగా ఉంటుంది. ఎంత వెతికి వెతికి తెంపినా .. మామూలే! తీగలమధ్య మబ్బుల్లో  చుక్కల్లా దోబూచులాడుతూ అక్కడక్కడా తళుక్కున మెరిసి.. నన్ను వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంటాయి. ఆ  పూల వేళాకోళమంటే నాకు ప్రాణం.
-బొజ్జ రమాదేవి


నా మాటః
'ఎండాకాలం యాదిల' మల్లెతల్లీ నీకు జోహార్లు! బతుకమ్మ ఆర్టికల్
'మురికికాల్వల మురికివాసనను మూడునెలలు మీ సువాసనలతో ప్రక్షాళనచేసే మల్లెమొగ్గలూ! మీకు కోటికోటి నమస్సులు!' అంటూ~బొజ్జ రమాదేవిగారు (వ్యాసకర్త హిందీ లెక్చరర్, హన్మకొండ, వరంగల్ జిల్లా) రాసిన ఒక చక్కని స్మతిగల్పికను కందుకూరి రమేష్ బాబుగారి ఫేస్ బుక్ అప్-టు-డేట్సులో చూడటం జరిగింది. మల్లెపూలంటే సహజంగానే ఆసక్తి కదా ఎవరికైనా!  ఆసాంతం చదివాను ఒకే ఊపులో.. అనడంకంటే చదివించింది అనడం సముచితం.  మల్లెల సువాసనలు    గుబాళించాయి రచనలో. రచయిత్రిగారిని అభినందించకుండా ఉండలేం. మంచి రచనవైపుకు మన దృష్టిని మళ్ళించిన రమేష్ బాబుగారినీ అభినందించాల్సిందే.
ఈ గల్పిక తెలంగాణా యాసలో రాసినదికొన్ని ప్రయోగాలు మూలతెలుగునాట అర్థమవవేమోనని నా అనుమానం.  అందుకే నాకున్న కొద్ది పరిజ్ఞానంతో  నా తృప్తికోసం దీనిని  శిష్ట భాషలోకి తిరిగిరాసింది. ఈ  ప్రయత్నం దోషరహితమన్న భ్రమ నాకు లేదు. తప్పులుంటే సరిదిద్దుకొనేందుకు సిద్ధం. మంచి అంశాన్ని మరింతమందికి పంచాలని తప్ప ఈ ప్రయత్నం వెనక మరే ఉద్దేశమూ ఊహించవద్దని మనవి.
కర్లపాలెం హనుమంతరావు


***                             

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...