Sunday, August 30, 2015

నల్ల ధనం ఓ సరదా గల్పిక--శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి

"నల్ల మందు తెలుసు. నల్ల ధనం ఏమిటండీ? ఎక్కడుంటుందండీ?
రాజ్యాంగంలోని 21 వ అధికరణ కింద పౌరులకు లభించిన గోప్యతా హక్కు ఎవరి కొంపైనా ఎలా ముంచుతుందండీ? రాజ్యాంగంలోని 32(1) అధికరణ ప్రకారం ఎలాంటి సమాచారం ప్రకటించలేమని  సర్కారు చేతులు ఎందుకు కట్టేసుకుందండీ? ఎన్డియే మొన్న మే మాసంలో సుప్రీం రిటైర్డు జస్టిస్ ఎం బి షా సారథ్యంలో ప్రత్యేక బృందాన్నిఏ తమాషా కోసం నియమించిందండీ? తొందరపడి ఎవరి  పేర్లనూ బైట వద్దని అసోచామ్ ఎందుకు అడుగుతుందండీ? ద్వంద్వ పన్నుల విధానం అంటే ఏమిటీ? అది దెబ్బతింటే దేశ ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు ఏ విధంగా విఘాతం కలుగుతుందండీ? ఏ  ఆరోపణలు నిరాధారమైనవని తేలితే ఏ వ్యక్తులకు  అప్రతిష్ఠ ? నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థాగత సంస్కరణలా.. అవేమిటండీ?"

పొద్దస్తమానం అలా  వార్తా పత్రికలు ముందేసుకుని  జోగుతుంటారు గదా  శ్రీవారూ..   చిక్కు ముళ్ళేమన్నా కాస్త విప్పుతారేమోనని దగ్గరికి వెళ్ళడిగా  బుద్ధి లేక పొద్దున్నే! ముడి అనుకున్నారో ఏమో పాడు.. హుషారుగా లేచి నిలబడి ఆనక  విషయం విని చారునీళ్ళల్లో అప్పడంలా చప్పడిపోయారు "ప్చ్.. అంతంత పెద్ద విషయాలు నీ కొద్ది బుర్రలో పట్టవులే  గానీ.. మీ ఆడాళ్ల కవసరమైన ముఖ్య సమాచారం  మాత్రం చెప్తా విను" అని మాట దాటేశారు.  'ఇక్కడ సంపాదించిన సొమ్మును ఇక్కడి లెక్కల ప్రకారం పన్నులూ పాడూ కట్టకుండా..  ఇక్కడే ఖర్చు పెట్టకుండా ఇంకెక్కడో దేశంలో పూడ్చి పెడితే దాన్ని  విదేశీ నల్ల ధనం అంటారని.. అధికారంలో కొచ్చిన వంద రోజుల్లో దేశాల్లో ఉన్న నల్లధనాన్నంతా తవ్వి తెచ్చి తలా ఒక పదిహేను లక్షలు దాకా  మోదీజీ పంచబోతున్నారనీ' మా వారు చెప్పిందాన్ని బట్టి నాకు అర్థమైన సమాచార సారాంశం. డబ్బు  పంచడం వరకూ సంతోషమే  కానీండి.. ఎక్కడ దాచుకోవాలో.. ఎక్కడ పూడ్చుకోవాలో.. సంపాదించుకునే వాడి ఇష్ట ప్రకారం కాదా ఉండేదీ!  ఇదేందీ.. ఇందులో   ఏదో మతలబు ఉంది.. ఎక్కడో తంతా ఉంది!
నాలుగు రాళ్ళు ఎక్కువొచ్చే చోట.. ఇచ్చిన సొమ్ముకు కాళ్ళు రావన్న గట్టి నమ్మకం ఏర్పడ్డ చోట చూసి మరీ చక్రవడ్డీకి  అప్పులిచ్చేది మా ఊళ్ళో వెంకాయమ్మ గారు. మా పేట ఆడాళ్ళందరికీ ఆమే ఆడ చంద్రబాబు. గవర్నమెంటుకు చెప్పనంత మాత్రాన ఆమె దగ్గరున్న  చీటీపాటల డబ్బంతా   నల్లసొమ్మై పోతుందా.. విడ్డూరం కాక పొతే! ఆ మాటే మా ఇంటాయనతో అంటే ఆయన గారేమో  తల గోడకేసి మోదుకున్నారు. "నన్ను చంపక..  పోయి కప్పు కాఫీ పట్రా! అసలే ఇక్కడ నే టెన్షన్తో   చస్తూంటే మధ్యలో నీ టీవీ చర్చలు!" అని విసుగూ! వివరంగా చెప్పే విషయం కరువైనప్పుడల్లా ఇలా కరవ రావడం మా వారికి  జగన్ బాబుకు మల్లే మామూలే లేండి! సరే!.. మా సంబడాలకేం గానీ.. ముందీ నల్లధనం సంగతే ఏందో తేల్చాలి. 

ఈయన గారొచ్చి వివరించక పోతే మహా  మనకిహ లోకంలో తెలిసే మార్గాలే కరువా! ఇంట్లో ఆయన  చూసే  టీవీనే నేనూ చూసేది అంతకన్నా ఎక్కువ సేపు. ఆయన గారు చదివవతల పారేసే 'ఈనాడే' నేనూ ఆనక తిరగేసేది. కాక పోతే ఎప్పుడూ చూసే సీరియళ్లూ.. సినిమా కబుర్లూ కాస్త పక్కన పెట్టి ఈ నల్లదనం  మీదా సారి దృష్టి పెడితే సరి.. సర్వం మనకే అరటి పండు వలిచినంత సులువుగా  అవగతమయి పోతుంది.

అవగతమయింది కూడాను. ఓస్! ఇంతోటి భాగ్యానికే ఇన్ని రోజుల బట్టీ దీని మీదిన్ని  కుస్తీ పట్లా! వ్యవహారం సుద్దపిక్కతో ముగ్గేసినంత సుబ్బరంగా కనిపిస్తుంటేనూ! ఓపిక .. సావకాశం ఉన్నవాళ్లేవేవో.. నానా అగచాట్లు పడి.. నాలుగు డబ్బులు గడించారే అనుకోండి.. పోనీ  అది డబ్బు కాదబ్బా.. గడ్డే అనుకుందాం.. ఎవరు మాత్రం  తినడం లేదీరోజుల్లో గడ్డీ గాదంపన్నులు కట్టనంత మాత్రాన పచ్చ నోటు ఎలా నల్లబడుతుందో నా బుర్రకింకా ఎక్కటం లేదమ్మా!

ఏనుగు బరువేయబోతే  చీమైనా ఏం చేస్తుంది? పుట్టల్లోనే నక్కుంటుంది. వేలు పెడితే ఠక్కుమని కుట్టేస్తుంది కూడానుకాల్చినా కాల్చకున్నా మనం పాత బకాయిల్తో సహా కరెంటు బిల్లులు  చచినట్లు కడుతున్నామంటే తప్పించుకునే మరో దారి లేకే గదా!  దారేదో  ఓటి ఉంది కాబట్టే   సంపన్నులంతా తమ సంపాదన్ని  దేశం దాటించేస్తున్నారు! దారి నెందుకు మూసేయడం లేదన్నదే నా పాయింటు. ఎప్పటికప్పుడు ఏవో లోపాయికారీ వ్యవహారాలు అవీ పెట్టేసుకుని.. చూసీ చూడనట్లు పోనిచ్చి..  ఓట్లేసే బికార్ల మెప్పుకోసం విదేశీ నిధులంటూ.. అక్రమాస్తులంటూ అల్లరి పెడతారా!  నెలరోజుల బట్టీ చూస్తున్నా.. విచిత్రం! ఒక లెక్కా పత్రం ఏదీ  లేనట్లుంది ఈ నల్లధనలక్ష్మి ఆకార వికారాలకి!   ఒకడు లక్ష కోట్లంటాడు. ఒకడు అర లక్ష ఖాతా లంటాడు. ఒకడు అర్థ శతాబ్దంబట్టీ సాగే లోపాయికారీ వ్యవహార మంటాడు. పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీని.. పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీని తప్పులు పడుతున్నారు. అసలు నల్ల ధనంలో ఉన్నతప్పేమిటో  ముందు తేల్చమని నాకైతే సుప్రీం కోర్టు కెళ్ళాలన్నంత కచ్చగా ఉంది.

'గట్టిగా వాగబోకే పిచ్చి మొహమా! ముందే కోర్టుల్లో నలుగుతున్న వ్యవహారాలివన్నీ! ఎతిమతంగా ఏదన్నా వాగితే నిన్నూ మూసేస్తారు" అని మా వారి రుసరుసలిక్కడ. నేనెప్పుడు  జైలుకెళ్లి చిప్పకూడు తింటానా అని ఈయనగారికీ  తహతహ లాగుంది చూస్తుంటే!

రోజులు బొత్తిగా బాలేవని నాకు మాత్రం తెలీదా? ఎప్పుడో వాడేసిన సర్కారు సొమ్ముకు ఇప్పుడు లెక్కలడిగి  బెంగుళూర్లో చిప్పకూడు తినిపించారా జయలలితమ్మ చేత.   తుఫాను మీదెవడో పిల్లాడు తెలిసీ తెలీక అవాకులూ చెవాకులూ వాగాడని  లోపల వేసేసారు! నేనేమంత మరీ యతిమతం దాన్ని కాదు. అయ్యొరామా! ఇంట్లో నాలుగ్గోడల మద్యా  మనసులోని ముచ్చట్లను కూడా  బైటపెట్టుకునే రాత లేకపోతే ఇహ ఈ సంసారమెందుకంట? టింగురంగా అంటూ బైట తిప్పుకుంటూ తిరుగుళ్లెందుకంట?

అహ.. మాట వరసకే అనుకుందాం. మా వారు మహనల్లగా ఉంటారు. అయినా మరీ ఏమంత దుర్మార్గులు కారే! నలుపంటే నాకూ ఏమంత పడి చచ్చే మోజు లేదు కానీ.. పన్ను కట్టని సొమ్ముకి  నల్ల ధనమని పేరెట్టి ఇలా అల్లరి పెట్టడడమే  ఏం బావోలేదని నా ఉద్దేశం.

నల్ల సముద్రం.. మన గుంటూరు నల్లచెరువుల్నేమన్నా మనం అపవిత్రమను కుంటున్నామా? బొగ్గంటే నల్లబంగారం అంటారు మా వారు. నలుపు నారాయణ స్వరూపం. రాముడు నీలమేఘ శ్యాముడు. కృష్ణుడు నల్లనయ్య. మన కంటిగుడ్డు నలుపు. కాటుక నలుపు. నల్లద్రాక్ష యమ  తీపి. మా చెల్లాయి  జడ నాగుబాములా నల్లగా నిగనిగలాడుతుండ బట్టే కదా మరిదిగారు కాణీ కట్నం లేకుండా చేసుకున్నదీ! దిష్టి తగలకుండా పసిబిడ్డ బుగ్గకి పెట్టే చాదు బొట్టు నలుపే కదండీ! శివరాత్రి అవావాస్యనాడొస్తుంది. దీపావళిదీ అదే తంతు. 'నల్ల' అంటే అరవంలో బహు బాగని అర్థంట. మా పక్కింటి ఆండాళమ్మగారు మా పిల్లను  పట్టుకుని పద్దస్తమానం 'నల్ల పొన్ను.. నల్ల పొన్ను' అని తెగ మెటికలిరిచుకుంటుంది.   పచ్చ నోటును పట్టుకుని నల్లడబ్బనడమే.. అన్యాయంగా ఉంది!

'తెలుపో..నలుపో.. జాన్తానై.. తేడా లిక్కడ లేనే లేవ్' అని సినిమాల్లో ఎన్ టీ ఆర్ చిందు లేసినప్పుడు చప్పట్లుకొట్టి.. ఇప్పుడేమో  నల్ల డబ్బునుగురించి .. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడ్డం తగదన్నది  నా పాయింటు!

'ఇప్పుడీ  మహాతల్లి నల్ల ధనాన్నిలా వెనకేసుకొస్తుందేందిరా కామెడీగా!' అని మీరు విస్తుపోతున్నారని తెలుసుఉన్న మాట అనుకుంటే కామెడీగానే ఉంటుంది మరి! దార్నే పోతుంటే   రూపాయి బిళ్లే మీ కంట బడ్డదనుకోండి. ఎవరూ చూడకుంటే మీరు మాత్రం లటుక్కని తీసి  పర్సులో వేసుకోరూ! అసలుమనిషి  వచ్చి అడిగినా తిరిగిచ్చెయ్యడానికి ప్రాణం ఉసూరుమంటుందే! మరి అన్నేసి లక్షలు.. కోట్లు ! ఎట్లా సంపాదించారన్నది ఆనక.. సారి 'మనదీ' అనుకున్నాక  సొమ్మూ సమ్మంధమూ లేకుండా  మధ్యలో సర్కారోడొచ్చి  పన్నులూ పాడూ  కట్టమంటే.. ఎవరికైనా  మనసుక్కంష్టంగానే  ఉంటుంది కదండీ!

ఇవాళ ఆ జైపూరియానో, లోధీనో, టింబ్లోనో.. పేర్లే సరిగ్గా మన నోటికొచ్చి చావవు .. ఐనా  నోటికొచ్చినట్లు తిట్టి పోస్తున్నాం! న్యాయమా! రేపు మన ఊరి పెద్ద మనిషే.. మన పక్కింటి రామనాథమే.. మన పొరుగూరి పుల్లమ్మక్కే ఈ జాబితాలో దర్శనమీయచ్చు. కోర్టువారి దగ్గర ఆంజనేయుడి తోకంత జాబితా ఉందంటున్నారు మావారువిడతల వారీగా విఛారణ లుంటాయంట. ఏ రోజు పేపర్లో ఎవరి పేరొస్తుందో.. ఏ పూట ఎవడి పుట్ట ఠపాల్మని పేలిపోతుందో.. ఏ క్షణంలో ఎవరి చరిత్ర అందరం చదివే  పుస్తకం తంతవుతుందో.. ఎవరికి తెలుసు?
ఎన్నో విచిత్రాలు నిత్యం జరిగే ఈ పుణ్యభూమిలో  టీలమ్ముకునే పిల్లాడు ప్రధాని మంత్రవలా?   మునుపటి ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన పెద్దమనిషి   తాడుతెగి  సంపాదనంతా నల్ల ధనమని తేలి  చివరికి సర్వం కోలుపోయి టీ నీళ్లక్కూడా దేబిరించ వచ్చు.   రాష్ట్రం సరిహద్దులు దాటే పప్పు ధాన్యాల లారీని పట్టుకోలేక పోవచ్చు గానీ.. సర్కారు తలుచుకుంటే పాకిస్తాన్లో దాక్కున్నా దావూద్ ఇబ్రహీం  గడ్డం పట్టుకు లాక్కురాగల్దు. స్విర్జర్లాండులో పుట్టక పోవడమే డబ్బున్న వాళ్ళ  తప్పంటే ఇహ చేసేదేమీ లేదు.

ఉన్నవాడికే కదా పన్నుల  బాధేంటో బోధ పడేది. చెల్లని పావలా కూడా మిగల్చుకోలేని   మా ఎదురింటి  కుచేల్రావూ నల్లకుబేరులని తూలనాడే వాడే!
దొంగసారా వ్యాపారం చేసి కోట్లకు పడగ లెత్తాడు మా అంకయ్య మామ. సాని పాపల్నితార్చి శరణాలయంపైన అంతస్థుల్లేపాడు మా  బల్లిశాస్త్రి బాబాయి. ఇసుకలో దుమ్మే కలిపాడో.. దుమ్ములో ఇసకే పోసాడో.. ధర రెట్టింపయిందాక దాచి కొత్త రాజధాని వస్తుందని ఆశల్లేవంగానే   బంగారం రేటుకు అమ్మేసాడు మా వీధి పచారీ కొట్టు సుబ్బయ్య శెట్టి. ఎవరూ బొట్టెట్టి  పిలవక పోయినా..లోకుల  వ్యవహారాల్లో బలవంతంగా దూరి సెటిల్మెంట్ల వంకతో సింహభాగం కొట్టేసే కోటిరెడ్డి కోట్లకు పడగలెత్తిన కథ మా వాడంతా రామాయణంలా పారాయణం చేస్తుంటాం అందరం. వాళ్లంతా  తలా రాజకీయ పార్టీలో దూరి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు  ఓట్లడుక్కోడానికని  వస్తే  అంతటా 'ఓహో.. ఆహోఅన్న నోళ్ళే కానీ.. నొసళ్ళూ ఒహళ్ళూ చిట్లించిన పాపాన పోలేదు! ఐన కాడికి నాలుగు రాళ్లు వెనకేసుకునే సదవకాశం ఇదేనని .. ఇంట్లోనూ  ఈయనగారు  లక్షా తొంభైసార్లు తహ తహ లాడారు. మళ్లా పొద్దున్నేపత్రిక  రాగానే నల్లకుబేరుల జాబితాలో కొత్త పేర్లేవీ బైటపడటం లేదని పెదవి విరుపులు! ఎవరికీ చట్టమంటే పట్టడం లేదని.. కారాలు..మిరియాలు!!

అహ.. నాకు తెలీక అడుగుతున్నా గానీ    పేర్లు బైట పెడితే ఏమవుతుందంట? రాత్రికి రాత్రే ఆ కొచ్చారియాలు, జైపురియాలు.. సెలబ్రటీలై పోడానికా! గ్లోబల్ యుగమో ..  పాడో..  వార్తొచ్చిన ఉత్తర క్షణంలోనే ఉత్తరమెరికా నుంచి దక్షిణాఫ్రికా అడవుల దాకా పేర్లు పాకిపోతున్నాయీ మధ్య మరీ! పుట్టిన అప్పలపాలెంలోనే మొహాలు సరిగ్గా తెలీని డిప్పకాయలంతా ఇట్లాంటి లప్పనమేదో తగిలి గొప్పోళ్లై పోవడమే తప్ప ..    వాళ్ల  ముల్లేమన్నా మన చిల్లుజోలెల్లో వచ్చి  పడబోతుందా? నల్లధనంమీద నడిపించే 'బ్లాక్ మెయిల్' కాదూ ఇదంతా!

డబ్బున్న పెద్దమనుషులతో వ్యవహారాలు! ఎన్ని చూసుకోవాలిఎంత గడ్డి కరిస్తే కూడిందో ఈ ముదనష్టం! ఎన్నాళ్లని మురగ బెట్టిందో.. ఎందరెందరి  కొంపలు కూల్చి పేర్చిందో.. ఎక్కడెక్కడి గనులు తవ్వినవో.. ఎన్ని వ్యాపారాలకు, కంట్రాక్టులకు   తెగిస్తే అంత సొమ్ము  పోగయుంటుందీ!  అడగంగానే చూపించేసెయ్యడానికి ఇదేమన్నా పెళ్ళి ఆల్బం ఫొటోలా?
నాలుగు డబ్బులు బ్యాంకులో పోగయితే చాలు  అదేదో సుమతీ శతకంలో చెప్పినట్లు బెల్లం చూట్టూ ఈగల్లా మూగి పోతారు బంధు మిత్రులు. కాదంటే కారాలు.. లేదంటే మిరియాలు! చే బదుళ్లు ఇచ్చుకుంటూ కూర్చోడానికా ఇన్నిన్ని చేదనుభవాలతో   ఆర్జించిందీ! ఊరూ పేరూ కూడా తెలీని దేశాలదాకా  పోయి డబ్బలా  వూరికే పూడ్చి పెడతారా ఎవరైనా?

'ఎలుక తోక నలుపు. ఎందాక ఉదికినా తెలుపుకి తిరగేది కాదద'ని మన యోగి వేమనగారు ముందే చెప్పారు. చెవిన బెట్టే నాథుడేడీ?

ఆటల్లో మనమెలగూ పోటీకి పోలేము. పరిశోధనల్లో సైతం మన ప్రోగ్రెసు అంతంత మాత్రంగా ఉంది. అందాల పోటీల్లో గడపదగ్గరే  తూలుడు. వ్యాపారాల్లోనైతే  చైనా జపాన్లదే  ముందడుగు. ఒక్క ఈ నల్లకుబేరుల జాబితాలోనే  మనది ముందు వరసలో స్థానం. దానికీ ముప్పం తెచ్చుకునే  పనులు ముమ్మర మవుతున్నాయి. అదే బాధ

అత్తగార్లకు సంఘాలునాయి. అడుక్కునే వాళ్లకు సంఘాలున్నాయి. ఆఖరికి తాగుబోతు దేవదాసులు సైతం సంఘటితమై మత్తు హక్కులకోసం పోరాడుతున్న దేశమిది. సంఘమూ పెట్టుకోడానికి ఆస్కారం లేదనేగా నల్లకుబేరుల మీదింత విలయ తాండవాలు!

నల్లఖాతాలెవరో ఖాతాదారులకు తెలుసు. డబ్బు దాచుకున్న బ్యాంకులకూ  తెలుసు. గతపాలకుల కాలంలోనే జాబితా వచ్చింది కాబట్టి నాటి ప్రముఖులందరికీ  నల్లపేర్లన్నీ కంఠతా వచ్చుండచ్చు. నాటి జాబితానే నేటి ప్రభువుల చేతిలోనూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నేతలందరికీ లోపాయికారీగా పాపులెవరో తెలిసుండచ్చు. కోర్టు సమర్పణలూ ముగిసాయి  కాబట్టి అక్కడి  యావత్ సిబ్బందికీ ఆ పేర్లన్నీ  కంఠోపాఠంగా నాలికమీదే ఆడుతుండవచ్చు. విచారణకని దిగిన సిట్టో.. స్టాండో .. వాళ్ల కార్యాలయాల్లో మాత్రం జాబితాలోని ప్రతి వివరమూ  చక్కర్లు కొట్టకుండా ఉంటాయా? ఇక తెలియని దెవరికమ్మా? యావత్ వ్యవహారంతో ఏనాడూ   సంబంధమూ  లేని.. సాధారణ పాటకజనానికి.. మీకూ.. నాకూ!
కోర్టుల్లో కేసులు రుజువై శిక్షలు ఖాయమైన పురచ్చి తలైవి ఫొటోలే చట్టసభల గోడల మీదనుంచి ఇంకా   కిందకు దిగలేదు. ఓటర్లకి తెలీకుండా ఎన్నెన్ని వ్యవహారలిక్కడ గుట్టు చప్పుడుగా చక్కబడటం లేదూ! శతకోటి బోడిలింగాల్లో నల్లధనం  ప్రహసనం ఒహటీ!

'చిట్టచివరి  చిట్టాలో ఆరొందల పై చిలుకు పేర్లున్నాయోచ్!  కోర్టు గడపల దాకా వచ్చాసాయోచ్!'  అని గంతులేస్తునారీ మధ్య మా ఇంటి హనుమంతులవారు. సరే.. మన సోమ్మేం పోయింది మధ్యలో!   సీల్డు కవర్లు.. సిట్టులు.. స్టాండప్పులు.. అన్నీ తట్టుకుని.. ఆ నల్లమొత్తాలు మొత్తానికి మన దేశంలోకి  తరలివస్తే అదీ మరో అద్బుతమే!
మోదీగారు తలా ఓ ఐదులక్షలిస్తానన్నారు గాబట్టి.. మా వారి  వాటాతో ఇంచక్కా వడ్రాణం చేయించుకోవచ్చు! నా వంతంటారా! అది స్త్రీ ధనం. నల్లధనంతో మల్లే ఆడుకుంటానంటే మాడి మసై పోతారు ఎంతటి వారైనా!*
-శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి
(సారంగ- అంతర్జాల పత్రికలో ప్రచురితం)










Saturday, August 29, 2015

మనమూ-మన తెలుగూ -శ్రీ తోట భావనారాయణ

               ఆగష్టు 29- తెలుగు భాషాదినోత్సవం- సందర్భంగా 
సమాజం వాడుతున్న భాషను ప్రజామాధ్యమాలు ప్రతిబింబించాలి. కానీ ఆచరణలో అది ఎంతవరకు నిజమవుతున్నదన్నదే ప్రశ్న. గ్రాంధికం నుంచి వ్యావహారిక భాషలోకి పత్రికలను నడిపించిన వారి కృషి ఒక దశలో ఆగిపోయింది. తొలినాళ్ళలో కనిపించిన స్ఫూర్తి ఆ తరువాత సన్నగిల్లింది. వేగంగా సృష్టించే సాహిత్యం’అని అభివర్ణించుకుంటూ పత్రికా రచయితలు ఆ వేగంలో ఇంగ్లీషు యథాతథంగా  ఉపయోగించటమో, సంస్కృత పదబంధాలతో సరిపెట్టడమో కొనసాగించారు. అదే సంప్రదాయాన్ని టీవీ మరింత ముందుకు నడిపించింది. కాకపోతే సంస్కృతం స్థానంలో ఇంగ్లీషు వచ్చి పడింది. సరికొత్త యాసతో టీవీ తనవంతు సేవగా భాషను కొత్తదారి పట్టించింది.  మరో వైపు సినీ రచయితలు  చేసే  నీ యెంకమ్మా ,  బాక్సు బద్దలయింది , ఇరగదీశాడు’ లాంటి ప్రయోగాలే తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్నాయని ఆనందించాల్సిన దయనీయ పరిస్థితి వచ్చిపడింది.  తెలుగు సినిమా ఒకసారి వాడిపడేస్తే వాటికి మరింత ప్రచారం చేయడానికి టీవీలు ఉబలాటపడుతున్నాయి. ఈ గందరగోళం మధ్య తెలుగుభాషాపరిరక్షకుల ఆవేదన ఎవరికీ వినపడటం లేదు.

తొలి తెలుగు భాషా దార్శనికుడు గిడుగు రామమూర్తి, ఆ తరువాత తాపీ ధర్మారావు నాయుడు వేసిన తొలి అడుగులలో నడక ఎంతో వేగంగా, అంకితభావంతో ముందుకు సాగింది.  కానీ ఆ వేగం ఎక్కువకాలం కొనసాగలేదు. సంపూర్ణవ్యావహారికం వైపు నడవకుండా ఇంగ్లీషు పదాలను అనువదించాల్సిన ప్రతిసందర్భంలోనూ సంస్కృతాన్ని ఆశ్రయించటంతో అసలు సమస్య వచ్చిపడింది. తెలుగు అందవిహీనంగానూ, సంస్కృతం అందంగానూ కనిపించేలా చేశారు. నగలు అని రాయటం నామోషీ అయింది. ఆభరణాలు అందంగా కనిపించాయి. దొంగతనం’ కంటే చౌర్యం’ బాగా ఆకట్టుకుంది. చనిపోవటం’ కంటే మృతి చెందటం’  గౌరవప్రదంగా కనిపించింది.  బడి లాంటి తెలుగు పదం  వదిలేసి స్కూలు పరిచయం చేశాక ఇప్పుడు ఇంగ్లీషు వద్దంటూ పాఠశాల వాడవలసిందిగా  ఉచిత సలహా ఇస్తున్నారు. కృతకమైన భాషను ఇంతకాలంగా జనం మీద రుద్దిన పత్రికలే ఇప్పుడు తెలుగు భాష పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాయి. తెలుగు భాషను రక్షించటమంటే సంస్కృతాన్ని బలవంతంగా నేర్పటమా ? డ్రిప్ ఇరిగేషన్ ను తెలుగు చేశామంటూ చెప్పుకుంటున్న బిందు సేద్యం లో తెలుగెంత ? పశ్చిమ గోదావరి కి ఆనాడే పడమటి గోదావరి అని పేరు పెట్టి ఉంటే ఎంత హాయిగా ఉండేది ! ఇప్పుడు పచ్చిమ గోదావరి అని ఉచ్చరించే పరిస్థితి వచ్చేది కాదు కదా ?  చీడపీడలు సోకినట్టు చెప్పాలంటే చీడపీడలు ఆశించాయి అని రాస్తాం, రేడియోల్లో చెబుతాం. వడుగు అనే తెలుగు పదం కంటే ఉపనయనం’ మనకు అందంగా, ఆకట్టుకునేలా ఉంటుంది.
నిరుడు లాంటి తెలుగు పదం ఉండగా గత సంవత్సరం అనే పదమే వాడుతున్నాం. కొంతమంది గతేడాది లాంటి తప్పుడు ప్రయోగాలు చేస్తున్నా పత్రికలు అలాగే ప్రచురిస్తున్నాయి. భాషమీద జరిగిన ఒక సదస్సులో నేను నిరుడు’ గురించి  ప్రస్తావిస్తే ఒక పెద్దమనిషి సరికొత్త వాదన లేవనెత్తారు. జర్నలిస్టులకోసం పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు వేసే ఆయనగారి వాదన ఏంటంటే, నిరుడు అనటానికి బదులు పొరపాటున నీరడి అనే ప్రమాదం ఉందనీ, తెలంగాణ ప్రాంతంలో అది ఒక కుల వృత్తిని ఎత్తి చూపినట్లవుతుందనీ అందువలన నిరుడు వాడకపోవటమే మంచిదని. సంస్కృత పదబంధాలతో సమాసభూయిష్టంగా ఉండేదే అసలైన తెలుగు అని ప్రవచించే పండితమ్మన్యులైన వైతండికులకు ఎవరైనా ఏం చెప్పగలరు ?  తామే శిష్టులమనీ, ఆర్యులమనీ చెప్పుకునే వారే శిష్ట వ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు, ఆర్యుల దోషంబు గ్రాహ్యంబు అని పదే పదే గుర్తుచేస్తూ భాష భూమార్గం పట్టకూడదని పనిగట్టుకుని ప్రచారం చేస్తుంటే అచ్చ తెలుగు  బతికి బట్టకట్టగలుగుతుందా ?  తెలుగు భాషాపరిరక్షణకు నడుం బిగించిన వారు ఎంతమంది ఎంత మేరకు తెలుగు వాడుతున్నారో (సమానమైన తెలుగు పదాలు ఉన్నప్పుడు) ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయమిది.
కొత్త పదాలకు… ముఖ్యంగా  ఇంగ్లీషు పదాలకు సమానమైన తెలుగు పదాలను సృష్టించటం గురించి ఎప్పుడు చర్చ జరిగినా తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని పదే పదే చెబుతుంటారు. తమిళుల భాషాభిమానాన్ని గుర్తుచేసుకుంటారు. తెలుగు భాషాదినోత్సవాలు జరుపుకునే ఇలాంటి సందర్భాలలో ఇది మరీ ఎక్కువ. అయితే వాళ్ళకున్న చిత్త శుద్ధి మనకుందా ? అంతకంటే ముఖ్యంగా, వాళ్ళకున్నంత ధైర్యం మనకుందా ? విప్ ను కొరడా అని అనువదించుకోగలిగిన చొరవ మనకుందా ?  ఇంగ్లీషు పదాలే కాదు, హిందీ, సంస్కృత పదాలు సైతం దరిజేరనివ్వకుండా  ఎప్పటికప్పుడు కొత్త పదాలకు తమిళ పదాలు తయారుచేసుకోవడం వాళ్ళ అలవాటు. మనకు భేషజాలు ఎక్కువ. స్వైన్ ఫ్లూ’  ను యథాతథంగా వాడుకోగలిగేంత విశాలహృదయం మనది. వాళ్ళు నిర్మొహమాటంగా పన్రి కాయ్‌చ్చల్ ( పంది జ్వరం ) అని మార్చుకున్నారు. బర్డ్ ఫ్లూ ను పరవై కాయ్‍చ్చల్ ( పక్షి జ్వరం ) చేసుకున్నారు. వింటేనే మనకు నవ్వొస్తుంది. మనవాళ్ళు అలాంటి అనువాదం చేస్తే ఎంతమంది ఎగతాళి (క్షమించాలి… మన పత్రికల భాషలో అపహాస్యం’ అని వాడి తీరాల్సిందే !) చేస్తారో తెలియని విషయమేమీ కాదు. మనం హంగ్ అసెంబ్లీ’ అని రాస్తూ ఒక్క క్షణమైనా తెలుగులో ఆలోచించే ప్రయత్నం చేయం. తమిళంలో తొంగు శట్టసబై’ ( వేలాడే చట్టసభ ) అని అనువదించుకున్నారు. ఎప్పుడో నార్ల వెంకటేశ్వర రావు గారు డ్రెడ్జర్ అనే పదాన్ని అక్కడి జాలర్ల భాషలో తవ్వోడ గా అనువదించారని ఇప్పటికీ వల్లె వేసుకోవటం మినహా మనం నిర్మించుకున్న పదాలు ఎన్ని ? అనువదించుకున్నవెన్ని ?

కొత్త మాటలూ, అనువాదాల ప్రస్తావన కాసేపు పక్కనబెడితే, భాష వాడుక మీద ఎలాంటి పట్టింపులూ లేకపోవటం బాగా పెరిగిపోతోంది. రాసే పద్ధతి మీదా, మాట్లాడే పద్ధతి మీదా పట్టు కోల్పోతున్నాం. పైగా,  ప్రవాహం లాంటి భాషకు కట్టుబాట్లు ఉండాలనుకోవటం మంచిది కాదనేది కొందరి వాదన. అంతమాత్రాన గతేడాది లాంటి ప్రయోగాలు యధేచ్చగా చేస్తుంటే చూసీ చూడనట్లు వదిలేయటమే మంచిదా ? మొత్తానికి తెలుగు అక్షరాలే రాస్తున్నందుకు సంతోషించటమే మంచిదంటారా ? ఆశావహం అనే పదం నుంచి ఆశావహులు అనే అపప్రయోగాన్ని పత్రికలు వాడుకలోకి తెచ్చినప్పుడు పత్రికా సంపాదకులు దిద్దవలసిన అవసరం లేదా ?  తెలుగు సంపాదకులు కొత్త పదాలమీద కలిసి చర్చించిన సందర్భాలు  దాదాపు లేనట్టె. ఫ్లై ఓవర్ ను పైదారి అనవచ్చునని సూచించటమే తప్ప ఎవరైనా వాడుతున్నారా ?
టీవీ వచ్చిన తరువాత రాసే భాషతో బాటు మాట్లాడే భాషను కూడా కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది. టీవీకోసం రాసేవాళ్ళు మనం అలాగే మాట్లాడతామా అనే విషయం ఒక్క క్షణం ఆలోచించినా చక్కటి రచన తయారవుతుంది. సుబ్బారావుపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు లాంటి వాక్యాలు చాలా సహజంగా టీవీలలో వినిపిస్తుంటాయి. నిజానికి పత్రికలవాళ్ళు ఇలాగే రాస్తారు. కానీ టీవీకోసం  సుబ్బారావు మీద ఎస్పీ కోప్పడ్డారు అని రాయవచ్చు. ఈ రెండు వాక్యాలు గమనిస్తే ఏది మాట్లాడే భాషకు దగ్గరగా ఉందో, ఏది వినడానికి సులభంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఎన్ని ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే అంత గొప్ప. ఎంత ఇంగ్లీషు యాస వుంటే అంత బాగా ఆకట్టుకోగలమని నమ్మకం. రేటింగ్స్ ద్వారా లాభం పొందాలనుకునే టీవీలు ఇంగ్లీషు ఎక్కువగా వాడుతున్నాయి. పైగా జనం భాషలో ఎక్కువగా ఇంగ్లీషు పదాలు దొర్లుతున్నప్పుడు ఇంగ్లీషు వాడకం గురించి టీవీలను విమర్శించడం కంటే వాక్య నిర్మాణంలో లోపాలను ప్రస్తావించడం మంచిది. వాడుక భాష ఎంత సరళంగా ఉండాలో టీవీలకు నేర్పాలి. వాడుక మీద పట్టు కోల్పోతే భాషకు మనుగడ ఉండదనే వాస్తవాన్ని ముందుగా గుర్తించాలి.

ఇదంతా ఒక వంతయితే ఇప్పుడు జనం మాట్లాడే భాష అంతా పత్రికలు నేర్పిన భాషే ! జనం భాషను తీసుకొని అదే భాషలో వార్తలు అందించాల్సిన పత్రికలు అందుకు విరుద్ధంగా వాటి భాషను జనానికి నేర్పుతున్నాయి. గ్రామీణ ప్రజలు కూడా స్వచ్చమైన తెలుగు నుడికారం స్థానంలో కృతకమైన పత్రికాభాష మాట్లాడుతున్నారు. టీవీల వాళ్ళు మైకు పెడితే నాయకులు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో గమనిస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. భాష మీద ఏమాత్రం ప్రేమ లేకుండా నడుస్తున్న ప్రజామాధ్యమాలు ఆత్మ పరిశీలనతో ధోరణి మార్చుకుంటే తప్ప మంచి తెలుగు ను రక్షించుకోవటం సాధ్యం కాదు***
***
                              శ్రీ తోట భావనారాయణ 

శ్రీ తోట భావనారాయణ గారిని పరిచయం చేసేటంత ఘనుడిని కాదు గానీ విధాయకం గనుక నాకు వారితో కలిగిన చిరు పరిచయాన్ని గురించి ఒక్క ముక్క చెబుతాను.ఈ బ్లాగు ప్రపంచం లోకి నేను అడుగు పెట్టిన మొదటి రోజుల్లో అనుకోకుండా ఒకసారి నా అదృష్టం  కొద్ది  http://bhavanarayana.co.tv/ బ్లాగు చూడటం జరిగింది. అప్పటినుంచి నేను వారికి వీరాభిమానిగా మారిపోయిన నిజం నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్నాను. వీరి బ్లాగ్ లోని ఒక్కక్క టపా ఒక సీమటపాకాయ...చిచ్చుబుడ్డి... మతాబు ... వెరసి తోట వారి  బ్లాగు మొత్తం ఒక నిప్పుల పొట్లం. ఈ దీపావళి సరుకు నుంచి ఒక్క తెలుగు మతాబు తీసుకుని నా బ్లాగునీ వెలిగించుకుంటానంటే వెంటనే వప్పుకున్నందుకు తోట భావనారాయణ గారికి శత కోటి వందనాలు.నేటి మన తెలుగు భాష తీరు మీద ఇంత చక్కటి వ్యాసం రాసినందుకు అభినందనలు .కృతజ్ఞతలు.మీకూ నాకు లాగా ఈ వ్యాసం నచ్చితే వారికే నేరుగా మీ స్పందన నందించినా ఆనందమే.మరొక సారి వారి బ్లాగు చిరునామా http://bhavanarayana.co.tv/
                          -శ్రీ తోట భావనారాయణగారికి 
కృతజ్ఞతలతో
-కర్లపాలెం హనుమంతరావు

Friday, August 28, 2015

అమ్మ- నాన్న

మనం భూమ్మీద పడకముందే భగవంతుడు మనకోసం రెండు అవతారాలు ఎత్తి సిద్ధంగా ఉంటాడుట! ఒక అవతారం అమ్మ అయితే.. రెండో అవతారం నాన్న.
అమ్మ జోలపాట. నాన్న నీతికథ. వెరసి ఇద్దరూ కలసి ఓ పెద్దబాలశిక్ష. కన్నవారి ప్రేమ ఊటబావిలోని నీటిచెలమట. బిడ్డ బతుకును ఎప్పుడూ అది పొడారిపోకుండా కాపాడుతుందని ఒక అరబ్బీ కవి ఎంత ఆర్ద్రంగా చెప్పాడో! తల్లిదండ్రుల ప్రేమలోని మాధుర్యానికి ద్రాక్ష అవమానంతో నలబడిందని, కలకండ అసూయతో గట్టిబడిందని, అమృతం చిన్నబోయి స్వర్గానికి పారిపోయిందని మరో సంస్కృత కవి చమత్కారం.
భూమ్మీద పడ్డ ఓంప్రధంలోనే బిడ్డ కంటబడేది తల్లి రూపం. ఓనామాలకన్నా ముందు పలికేది 'అమ్మ' పదం. ఆ అమ్మ చూపించే నాన్నే బిడ్డకు అన్నీ అవుతాడు. 'నాన్నా' అన్న పిలుపులోనే రెండు 'నా'లు దాగున్నాయి కదా!
అమ్మ ఒడి గుడి అయితే.. నాన్న ఒడి చదువుల బడి. బిడ్డ ఎదగడానికి ముందుగా కొలమానంగా భావించేది కంటిముందున్న అమ్మానాన్నల వ్యక్తిత్వాలనే!
సంతాన సౌభాగ్యంకోసం యవ్వనకాలాన్నంతా సంతోషంగా కారాగారంలో వృథాచేసుకొన్న దేవకీ వసుదేవుల కథ మనకు తెలుసు. కాకిపిల్ల కాకికి ముద్దు. గాంధారీ ధృతరాష్ట్రుల్లా బిడ్డల్ని గుడ్డిగా ప్రేమించడమే  కన్నవారికి తెలిసిన వాత్సల్య విద్య. బొజ్జగణపయ్యను చూసి నవ్వాపుకోలేనందుకేగదా చందమామమీద పార్వతమ్మంత లావు చిందులేసింది! పుత్రవియోగం తట్టుకోలేకేగదా దశరథ మహారాజంత దయనీయంగా ప్రాణాలు విడిచింది! బిడ్డకోసం ఆ బిడ్డనే మూపునేసుకొని కదనరంగానికి తరలివెళ్ళింది ఝాన్సీమాత. లోకం, కాలం ఏదైనా సరే తల్లిదండ్రుల లోకంమాత్రం బిడ్డచుట్టూతానే ప్రదక్షిణాలు చేస్తంటుంది. ఈ ప్రేమాకర్షణసూత్రం ఏ విజ్ఞానశాస్త్రానికి అంతుచిక్కని   విచిత్రం.
కన్నవారంటే అంతే మరి! తము కన్నవారు తమకన్నా గొప్పవారు కావాలని పగలుకూడా కలలు కనేవారు! స్వీయప్రాణాలను సైతం సొంతబిడ్డలకోసం తృణప్రాయంగా సమర్పించేందుకు సదా సర్వసిద్ధంగా ఉండే పరమత్యాగుల వరసలో ముందుండే వారు. పిల్లకాయలంటే తల్లిదండ్రులకు కంటిముందు తిరిగే గుండెకాయలు కదూ! బిడ్డలకోసం గాలిమేడలు కట్టడమే కాదు! క్రమం తప్పకుండా వాటి దుమ్మూ ధూళీకూడా దులిపే పనిలో ఉంటారు తల్లిదండ్రులు.మనమూ అమ్మానాన్నలమైతేగాని మన అమ్మానాన్నల మనసఏమిటో మనకు అర్థం కాదు.
ఎన్ని తరాలైనా మారనీ.. ఎంత ప్రగతిపథాన అయినా సాగనీ,, '' అంటే 'అమ్మ' అనే అర్థం మారరాదని.. 'నా' కన్నా ముందు 'నాన్నే' గుర్తుకు రావాలని అందుకే పెద్దలు సుద్దులు చెప్పేది.
అమ్మ దీవెన లేనిదే ఏ పని జయప్రదం కానేకాదని, నాన్న చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని నడిచినప్పటి చిన్ని పాదాలే ..ఎదిగిన పిదపా..  నాన్న అడుగుజాడలకు ఎడంగా జరగి పోరాదని తెలుసుకొంటే చాలు బిడ్డ బతుకంతా భద్రం.. బంగారం!
అమ్మ పేగు ఇస్తే నాన్న పేరు ఇస్తాడు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ మంచిపేరు తెస్తాడని ఆశించడంలో  అత్యాశ ఏముంటుంది?! అడిగినా  అన్నీ సమకూరని ఈ వ్యాపారప్రపంచంలో అడక్కుండానే అన్నీ అమర్చిపెట్టే అమ్మనాన్నలను మించిన పిచ్చివాళ్ళు ఎవరుంటారు!  నిజమే! బిడ్డమీది పిచ్చిప్రేమే వాళ్లనలా ప్రేమపిచ్చివాళ్లను చేసిందని తెలుసుకోవడంలోనే ఉంది వాత్సల్య రహస్యం.
మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు, డబ్బులు లేనప్పుడు బంధువులు, శక్తి తగ్గినప్పుడు సంతానం చులకన చేయవచ్చేమోగాని.. ఉన్నప్పుడూ లేనప్పుడూ ఒక్కలాగే ఉండేవాళ్లు మాత్రం జన్మనిచ్చిన తల్లిదండ్రులే! హిమాలయాలు దేశానికి ఉత్తరానే ఉన్నాయి. వాటినిమించిన ఉన్నత ప్రేమాలయాలు ప్రతీ ఇంటా అమ్మానాన్నల రూపంలో ఉంటాయి. అమ్మానాన్నల అనురాగం అరేబియా సముద్రంకన్నా వెడల్పైనది. బంగాళాఖాతంకన్నా లోతైనది. హిందూమహాసముద్రం వారి ప్రేమసింధువుముందు పిల్లకాలువ!
ఈ గజిబిజి జీవితంనుంచి ఎప్పుడైనా విరామం దొరకబుచ్చుకొని జన్మనిచ్చిన ఊరికి వెళ్ళినప్పుడు కోతికొమ్మచ్చులు, దాగుడుమూతలు ఆడుకొన్న ఆ ఇంటిముందు ఆరుబయలు వంటరిగా ఓ మంచంమీద పడుకొని ఆకాశంవంక తేరిపారజూడు! అమ్మ చిన్నతనంలో గోరుముద్దలు తినిపిస్తూ నిన్ను మురిపించేందుకు 'రా రమ్మ'ని పిలిచిన చందమామ దోస్తునొకసారి పలకరించు! మీ అమ్మ నీకోసం ఎన్ని కమ్మని కథలు కల్పించి చెబుతుండేదో గుర్తుచేస్తాడు! ఆ వెన్నెల్లో మీ నాన్న నిన్ను తన మోకాలి గుర్రంమీద సవారీ చేయిస్తూ ఎన్నెన్ని సరదా కబుర్లు చెప్పేవాడో నెమరు వేయిస్తాడు. అయినదానికీ కానిదానికీ మీ అమ్మ నీకు తీసే దిష్టి, కానిదానికీ అయినదానికీ మీ నాన్న నీకోసం పడే హడావుడి..  మళ్లా గుర్తుకొస్తే నీ కళ్లు చెమర్చకుండా ఉండవు!
అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు బుడిబుడి అడుగులు వేసే  ఓ పాపాయి. ఆ పాపాయి బుడిబుడి నడకలతో బైటికి పోకుండా తన కొంగు చివరకి ముడి వేసుకొని పనిపాటలు చూసుకొనేది అమ్మ.
పాపాయి ఎదుగుతున్నాడు. కిటికీగుండా బైట కనిపించే కొండా కోనా, చెటూ పుట్టా.. పాపాయిని రారమ్మని బులిపిస్తున్నాయి! పాపాయికేమో.. పాపం..  తల్లికొంగు బంధమాయ!
ఆ రోజు బ్రహ్మాండంగా వాన కురిసి వెలిసింది. ఆకాశంలో ఏడురంగుల ఇంద్రధనుసు విరిసింది. పాపాయిని అదే పనిగా అందుకొమ్మని.. ఆడుకొందాం రమ్మని.. ఆగకుండా ఆహ్వానిస్తున్నది. తల్లి గాఢనిద్రలో ఉంది.  అదను చూసి చాకుతో చీరకొంగు కోసి.. గడప దాటి..  గబగబా కొండకొమ్ముకేసి ఎగబాకుడు మొదలుపెట్టాడు బుడతడు. ఇంద్రచాపం ఎక్కి   జారుడుబండాటాడాలని  బుడతడి కంగారు. ఆ తొందరలో పాచిబండమీద కాలు జారాడు.  భయంతో 'అమ్మా! అమ్మా!' అని అరుపు. లోయలోకి జారిపడే చివరి క్షణంలో ఠకాలుమని ఆడ్డుపడి ఆపేసింది.. రెండుబండలమధ్య ఇరుక్కున్న అమ్మకట్టిన లావాటి కొంగుముడి! దూరంనుంచి పరుగెత్తుకొస్తున్న అమ్మను చూసి 'హమ్మయ్య' అనుకొన్నాడు బుడతడు!
నాన్నతో ఆరుబయలు పడుకొని ఉన్నాడు అదే బుడతడు మరికాస్త ఎదిగిన తరువాత. 'నాన్నా! మనం పేదవాళ్లమా?' అనడిగాదు హఠాత్తుగా!
'కాదు కన్నా! అందరికన్నా ధవవంతులం! ఆకాశంలో కనిపిస్తోందే.. ఆ చందమామ మనదే! అందులోని నిధినిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు నాన్న. 'వాటిని తెచ్చుకోవచ్చుగా!  నాకు సైకిలు కొనివ్వచ్చుగా!  రోజూ పనికి పోవడమెందుకు?' చిన్నా ప్రశ్న. 'నువ్వింకా పెద్దాడివైన తరువాత నీకు రైలుబండి కొనివ్వాలని ఉంది. ఇప్పుడే తెచ్చుకొని సైకిలు కొనేస్తే రేపు రైలుబండికి తరుగుపడవా? నీకు రైలు కావాలా? సైకిలు కావాలా?' అని నాన్న ఎదురు ప్రశ్న. 'రైలే కావాలి. ఐతే రేపూ నేనూ నీతో పాటు పనికి వస్తా! డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు చిన్నా. 'పనికి చదువు కావాలి. అలాగే వద్దువుగాని.. ముందు బుద్ధిగా చదువుకోవాలి మరి!' అన్నాడు నాన్న.
చిన్నా బుద్ధిగా చదువుకొని తండ్రిలాగానే ఓ ఆఫీసులో పనికి వెళుతున్నాడు ఇప్పుడు. పెళ్లయి.. ఓ బాబుకి తండ్రికూడా అయాడు. ఓ రోజు డాబామీద ఆరుబయలు పడుకొని ఉన్నప్పుడు ఆ బాబు అడిగాడు'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా?'
ఆకాశంలోని చందమామలో తండ్రిముఖం కనిపించింది ఆ బాబు తండ్రికి ఇప్పుడు. కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా నాన్నలకు నిండుమనసుతో రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు ఆ క్షణంలో. ఒక చేత్తో అమ్మకు.. మరో చేత్తో నాన్నకు!
'పేరెంట్స్ నీడ్ అవర్ ప్రెజన్స్.. నాట్ అవర్ ప్రెజెంట్స్!' అన్నాడు ఆంగ్లంలో ఓ కవి. ప్రపంచంమొత్తం ఏడాదిలో ఓ రోజు( జులై నెల నాలుగో ఆదివారం) తల్లిదండ్రులను తలుచుకొంటుంది.  ఏడాదిమొత్తం పన్నెండు నెలలూ రోజూ ఇరవైనాలుగ్గంటలపాటు గడియ గడియకు జన్మదాతలను..
బతికుంటే బాగా చూసుకోవడం.. పైనవుంటే ప్రేమగా స్మరించుకోవడం  భారతీయుల కుటుంబ సంస్కృతి. తరాలు మారినా ఆ సంస్కారంలో తరుగుదల రాకుంటేనే ప్రతి చిరంజీవికి శుభం.. లాభం!
***
-కర్లపాలెం హనుమంతరావు
(జులై 26, 2009 నాటి ఈనాడు సంపాదక పుటలో ప్రచురితం)



Wednesday, August 26, 2015

'ఛీర్' కొడదామా? 'ఛీఁ!' కొడదామా? ఓ సరదా గల్పిక



 'ఛీ!' కొడదామా? 'చీర్' కొడదామా? 
( ఈనాడు - ప్రచురితం ) 
*

గెలీలియో నిజంగా మహానుభావుడు. మందుబాబులకన్నా ముందే భూమి గుండ్రంగా తిరుగుతున్నదని  కనుగొన్నాడు .

కథలు చెప్పేవాళ్లందరూ తాగుబోతులని  చెప్పలేం.కానీ.. తాగుబోతులుమాత్రం మంచి కథకులై ఉంటారు. కొంపకు ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఇంటి ఇల్లాలుకి కొత్తకథ అల్లి చెప్పాలంటే అల్లాటప్పా వ్యవహారం కాదు! తప్పతాగితే తప్ప అంత సృజనాత్మకత సాధ్యం కాదు.

మందేమీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందీ  కాదు. రామాయణకాలంలో- సీతమ్మవారి అన్వేషణలో   ఆంజనేయుడు లంకలో ముందుగా చూసింది  ఆరగా ఆరగా ద్రాక్షారసాలు సేవించే రాక్షసులనే ! 

భారతం మార్క్  కీచకుడుకి మగువల మీద కన్న మధ్యపానం మీద మక్కువ ఎక్కువ . 

ఉజ్జయినీ కాళీమాతకు మద్యమే నైవేద్యం. శిప్రానదీ తీరాన కొలువైన భైరవుడు నాటుసారా తప్ప మరొకటి ముట్టడు. దేవదానవులు దెబ్బలాట దేనికోసం? ఆ సురేకదా నేటి సారాయి!

మందులో ఏముందనీ  గాలిబ్ అంత గమ్మత్తైన గజల్సు చెప్పగలిగిందీ?  అజంతా హరప్పా శిథిలాలు తవ్వినప్పుడూ ముందుగా బైటపడ్డవి అప్పటి తాగుబోతులు తప్ప తాగి పారేసిన చట్లూ పిడతలేని వినికిడి. 

నిప్పు కనిపెట్టక ముందు ఆదిమానవుడు ఎండావానలకు, చలిగాడ్పులకుఎల్లా  తట్టుకొని నిలబడ్డాడంటారూ? అంతా యిప్పసారా మహత్తు. యుద్దసమయాల్లో ఏనుగులకీ  బాగా మద్యం పట్టించి శత్రుసైన్యం మీదకు ఉసిగొల్పేవారని  'ఇండికా'లో మెగస్తనీస్ అంతటి మహానుభావుడే రాసినప్పుడు..  'రా' పనికిరాదంటే కుదురే పనేనా!

కామానికీ సూత్రాలు రాసిపెట్టిన మునీశ్వరులు  మధుపానానికి శాస్త్రాలు రాయలేదంటే నమ్మలేం! తంజావూరు తాళపత్ర గ్రంథాలయంలో మరికాస్త మందుకొట్టి వెదికితే ఒకటో రెండో పెగ్గుకావ్యాలు బైటపడక మానవు. 

మౌర్యులకాలంలోనే మనవాళ్ళు 'అంగుళం' కనిపెట్టారట! ఎందుకట ? లోటాలో మందు కొలతలు చూసుకొనేందుకుగాక మరి దేనికట ! 

‘చంద్రయాన్’ మిషన్ ఇంజన్లో ఇంధనానికి బదులు ఏ కల్లో సారానో  కొట్టించి వదిలుంటే.. సముద్రంలో పడే బదులు ఇంచక్కా చందమామ చూట్టూ చక్కర్లు కొట్టొచ్చుండేది.

దేవుడుకూడా ఆదాము అవ్వల్ని ఆపిల్ ముట్టద్దన్నాడుగాని.. మందు జోలికి వెళ్లద్దని హద్దులు పెట్టలేదు కదా! మరెందుకు అందరూ ఈ మందును ఆడిపోసుకొందురు? 

 ఒత్తిడినుంచి ఉపశమనం పొందే గమ్మత్తు ఉపాయం ఈ మత్తిచ్చే మందు. శతాబ్దాల కిందట మనోళ్లు  మేధస్సును మధించి మరీ  సాధించిందీ  మధిర. అష్టాంగమార్గాల్లో ఆఖరి మెట్టు  'సమాధి' అంటే ఫుల్లుగా ‘రా’ కొట్టి చల్లంగా పడుంటమే! మందుగుండు కనుక్కొన్నది చైనానే కావచ్చుకానీ.. 'మందు' కనుక్కొంది  మాత్రం ఖచ్చితంగా  మన హిందూ దేశమే!
‘సారే జహాఁసే అచ్ఛా !.. సారా భారత్ మహాన్!’
***
మనోడికి మరీ మందెక్కువైంది . పీకెల్దాకా తాగినోడు మరి..  కన్యాశుల్కం బైరాగికే   క్లాసు పీకేస్తాడు చూడు ! చీపులిక్కరుకు అలవాటుపడ్డ నాలిక్కదా! అందుకే  అక్కరకురాని ‘మద్యా’క్కరలు ఏకరువు పెట్టేస్తోంది . ముందు ముందు దగ్గుక్కూడా పెగ్గే మంచి మందని ఎంత స్సిగ్గుగా వాదిస్తాడో .. ఓపికుంటే ఓ చుక్కేసి వినచ్చు మరి !

‘నూటికి ఇరవై ప్రమాదాలు తాగుబోతులవల్లే’ అని లెక్కలు చెబుతుంటే 'మిగతా ఎనభయ్యీ తాక్కపోవడం వల్లే భయ్యా  ! అని అడ్డంగా  వాదించే తాగుబోతుని ఏమనాలి! భూమ్మీదపడ్డ బిడ్డ గుక్కపెట్టేది  ఆ గుక్కెడు ‘చుక్క’కోసమే అని కూసే ఇల్లాంటి  తాగుబోతుల వాగుళ్ల వల్లే  ఇల్లూ వళ్లూ గుల్లయేది అని  ఇల్లాళ్లు ఘొల్లుమనేది.

దేశాన్నిలాగే మందుకు వదిలేస్తే పదమూడేళ్ల పిల్లాడుకూడా 'పద! మూడు బాగా లేదు! ఏదైనా బారుకెళదాం!' అనే రోజు రేపే వస్తుంది . బారుకి ఏజ్ బారు ఎత్తేసే మంచిరోజులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేది. 

మందుల షాపులకు మించి  మందుషాపుల పెంచితే  ఎంత ప్రమాదం ? ! ఇండియానాలో చాటుగా పొగతాగినా కఠినదండన తప్పదు. ఇండియాలో బాహాటంగా తప్ప  తాగినా తప్పట్టేవాడు లేడు. 

ఏడాదికి ఈ   ముందు మీదయ్యే దుబారా  సొమ్ముతో నలభై లక్షల మందికి సలక్షణమైన డబుల్ బెడ్ రూములు కట్టించియ్యచ్చని ఒక అంచనా!

సర్కార్లే రాష్ట్రాలను 'రా' కొట్టేవాళ్లకు రాసిచ్చేస్తుంటే మందు వ్యాపారానికి మాద్యం ఎందుకుంటుంది  .. చెప్పండి! 
గుడీ  . . బడీ అన్న తేడా కూడా లేదు. ఎడ పెడా  ఊరుకో బారు! పేటకో బెల్టు! 

ఆంధ్రా.. నైడెడ్.. నిజాం.. రాజకీయాల వరకే ! 'రా' రాజకీయాలకి  ప్రాంతం.. కులం.. మతం.. అడ్డంకులు కావు !  రెండు  తెలుగు రాష్ట్రాలను మందుపాతర్లగా మార్చేందుకు   పోటీ  ఎంత రసవత్తరంగా సాగుతోందో చూస్తూ ఉంటే  'చీర్' లీడర్లకి 'చీర్'   .. కాదు ...   'ఛీ!' కొట్టేద్దామనిపించదా  మరి ?! 

( 21-06-2010 నాటి 'ఈనాడు' సంపాదకీయ పుటలో ప్రచురితం)

Monday, August 24, 2015

ఒంటరులం కాలేం!- కవిత



1
అనుకుంటాం కానీ
ఎవరమూ
ఎన్నటికీ  ఒంటరులం కాము

2
పూల మీద నడుస్తున్నా
పాదం కందకుండా కింద
అమ్మ అరచేయి అడ్డు పెడుతుంది.

ఉట్టికెగిరేటప్పుడు
రెక్క తెగి-  నేలబడకుండా
నాన్న నీడ పహరా కాస్తుంది.

4
తోబుట్టువులనే తోటి చేపలతో
బతుకు తొట్టి
ఈత కొలనులా
ఎప్పటికీ సందడే!


5
నీ రాలి పడే నవ్వులకు
ఒడిపట్టి
వెంటబడే లోకమో!

6
కన్నీరైనా  ఒంటరిగా వదలుతుందా
చెక్కిలి తడపకుండా!
తుడెచే చెలిమిహస్తం
చెంత ఉండనే ఉంది

7
చీకటిలో.. చింతలలో
వేకువలో.. వేడుకలో
అర్థభాగం
అద్దంముక్కలా
పక్కలోనో.. పక్కనో!

8
అమావాస్య నాటి
వెన్నెల ఊహలా
కన్నపిల్లల గోల!

9
చావుతో అంతా ఐపొయిందనుకోడం
శుభం కార్డు పడితే
మరో ఆట లేదనుకోడం
భ్రమ!

10
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎన్నటికీ  ఒంటరులం కాము
కాలేం మిత్రమా!
***

-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...