Saturday, October 17, 2015

ఏవండీ!.. మారండీ!- ఓ సరదా గల్పిక


  • ఏవండీ! .. మారండీ! 
  • ( ఈనాడు - ప్రచురితం ) 
  • *

  • బ్రహ్మదేవుడు ఏ చిరాకులో ఉండి సృష్టించాడోగానీ.. ఆడదాని  బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలికింది ఎండుకొమ్మే!

  • కిందే కాదు.. పై  లోకాల్లో కూడా అతివకు అడుగడుగునా అవమానాలు.. అగ్నిపరీక్షలే!

  • బ్రహ్మయ్యకు రిమ్మ తెగులు. పరమేశ్వరుడైతే భార్యకు సగం శరీరం ఇచ్చినట్లే ఇచ్చి.. నెత్తిమీదికింకో గంగానమ్మను  తెచ్చి పెట్టుకున్నాడు! నిరంజనుడుది మరీ నిరంకుశత్వం . . కట్టుకొన్నదాన్ని కాళ్లదగ్గరే కట్టిపడేశాడు!

  • 'ఆడదానికి స్వాతంత్ర్యం అనవసర'మని ఆ మనువెవడో అన్నాడుట! ఆ ఒక్క ముక్కను మాత్రం మన మగాళ్లకు మా బాగా నచ్చింది  ఈ ఇరవై ఒకటో శతాబ్దిలో ! 

  • ఒక్క మగాడనేమిటి! గ్యాసుబండలు, యాసిడ్ బాటిళ్లు, సెల్ఫో న్లు,  కెమేరాలు, బూతు సినిమా డైలాగులు , కట్నం వేధింపులు, అత్తల సాధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు, అనారోగ్యాలు, భ్రూణ హత్యలు, పరువు హత్యలు, లైంగిక  వేధింపులు, తక్కువ జీతాలు,పనిభారాలు.. అబ్బో.. జల్లెళ్లోని చిల్లులకన్నా ఎక్కువ కదూ లోకంలో అక్క చెల్లెళ్లో కడగళ్లు! 

  • వేళకు వండి వడ్డించడానికి, పిల్లల్ని కని పెంచడానికి,  ఇంటిని కనిపెట్టి ఉండటానికి, బయట దర్జాలొలక బోయడానికి,  వేణ్ణీళ్ల సంపాదనలో చన్నీళ్ళలా తన  జీతం కలిపేసుకోడానికి , సినిమాహాలు క్యూలలో టిక్కెట్లు త్వరగా తీయించుకోడానికి, బస్సుల్లో ఆడాళ్ల సీట్లు అక్రమంగా ఆక్రమించేసుకోడానికి , బ్యాంకుల్లో దొంగకాతాలు తెరవడానికి, ఆదాయప్పన్ను లెక్కలు పక్కదారి పట్టించడానికి మాత్రమే భగవంతుడు ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడని మగాడి బడాయి !

  • బల్లిని చూసి భయపడేంత సున్నితమైన మనసు ఆడదానిది. అయినా  బిడ్డకోసం నెలల తరబడి శరీరాన్ని పోషిస్తుంది. కత్తికోతలకు  వెరవకుండా ప్రసవానం అనుభవిస్తుంది. గంట పనికి వందలు డిమాండు చేసే వ్యాపారపు లోకంలో పరగడుపున  నిద్రలేచింది మొదలు.. రాత్రి పడక  ఎక్కే దాకా సహస్రాధిక హస్తమయిగ స్త్రీ శక్తి అందించు సమర్థ శుశ్రూషలకు  విలువగట్టడం మొదలుపెడితే..  
  • పదిమంది అదానీల సంపదలైనా  ఒక వారానికి సరిపోతాయా? 

  • పక్షిగాలిలో ఎగిరినట్లు, చేప నీటిలో ఈదినట్లు , పులి నేల మీద కదిలినట్లు   ఆడది ఇంటి ప్రపంచంలో కలిదిరుగుతుంది .   అబలగా  ఆమె ఇంటి నాలుగు గోడల మధ్య ఇంతి   నడిచే దూరం ముందు  ఒలంపిక్సు పరుగులైనా  బలాదూర్! ఆమె అత్యవసర గృహ వైద్యురాలు. శిక్షణ లేని  బిడ్డల ఉపాద్యాయురాలు. అనుక్షణం  కంటికి రెప్పలా కన్న బిడ్డలను  సంరక్షించే వార్డెను. కష్టంలో ఓదార్చే కౌన్సిలర్ .  పెదవి మనసులోని మాటను ఇట్టే పసిగట్టే  టెలీపతీ తన  స్పెషాలిటీ. . సంసారం విమానమైతే అమ్మ  దానికి  పైలెట్.. హోస్టెస్సూ. కలికి కామాక్షిలా ఆమె ఒదిగి ఉంటూనే  ఏ సంసారమైనా పదిలం. 

  • ఆధారు కార్డైన  ఓ పట్టాన దొరకని నేడు  ఆధారపడదగ్గ సుదతి కారు చౌకగ దొరకడం  మొగవాడు చేసుకొన్న పుణ్యం.

  • మెడలో మూడు ముళ్ళు  .. భర్తతో ఏడడుగులు.. పడిన  మరుక్షణమే  ఇంటిపేరే కాదు.. వంటి తీరూ కట్టుకున్నవాడికి  మీదు కట్టే త్యాగి  తరుణి !

  • రాముడొచ్చే వరకూ రావణాసురుడినయిన  గడ్డిపోచగ  నిలవరించిన  ధీర వనిత నెలత ! కాలి  పారాణి ఆరకనే  భర్త  భాతృ సేవకని  దూరముయితే     కడలి దుఃఖం కడుపు  హద్దులు దాటనీయని నిగ్రహానికి నిలువుటద్దం స్త్రీ .  విగత జీవి పతికి   తిరిగి బతుకు దారి దొరుకు వరకు మృత్యు దేవత నొదిలి పెట్టని పంతం పడతి సొంతం.  
  • గుడ్డి భర్తకలేని  దృశ్యభాగ్యం తనకు వద్దను  త్యాగబుద్ధి ఎంత మందికి సాధ్యం౧ 

  • మగవాడి మేధకు  నాలుగింతలు , సాహసానికి  ఎనిమిదింతలు  ఎగువ నున్న మగువ  ఒదిగి ఒదిగి ఉంది కనకే  ఇల్లు  జీవనదిలా సాగటం. యుగయుగాలుగా చిక్కుబడిన పీటముడి విడిపోవటానికి   మగవాడికి కావలసినది అహము వీడి .. మగనాలితో కలసి నడిచే సహనం.

  • ఇంతికి ఇంటి మగనితోనే కాదు  తంటా! ఆడదంటే  అంగడిన దొరికే సుఖపు  సరుకని తలచే తులవలతోనూ బెంగ!  ఓ వంక పూజలు, మరో వంక బడితె పూజలు ! 

  • ఆత్మరక్షణ కోసమై ఆడపిల్లలు వాడుకొనే  మిరియాల పొడులు పార్లమెంటుల మధ్య వరకు పాకినా,  ఆమె రక్షణకు చట్టబద్ధము   కావలసివున్న బిల్లులకు మాత్రం కాలదోషం పట్టు వరకు మగప్రపంచం చేయు బెట్టుకు  ఏమని పేరు పెట్టి కచ్చ తీరే వరకు తిట్టి పోయాలి!

  • 'ఆడపుటక'ను మగసమాజం పానకపు  పుడకగా భావించడం మానుకోవాలి! మనోవికాసానికి తిరుగుడొక్కటే తిరుగు లేని మందు అయితే  మగువకూ  మగవాడి తీరున   తిరుగు స్వేచ్ఛ దొరుకు రోజునే ఏ మహిళల దినోత్సవానికైనా తగిన న్యాయం జరిగినట్లు ! 

  • ***



No comments:

Post a Comment

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...