Tuesday, August 30, 2016

అనగనగా మరో గాడిద-( ఇల్లాలి వేదన ) సరదా గల్పిక


'ఏవిఁటండీ ఇంతాలస్యం?'
'మరేఁ! వానలు వేళకి రాక.. సాగు సరిగ్గా సాగక.. అన్నింటి ధరలూ ఆకాశాన్నంటుకుంటున్నాయ్ కదా! జనం అల్లాడి పోతున్నారు .. పిల్లికి సీమంతం చేస్తే వాతావరణం చల్లబడుతుందని.. ఢిల్లీనుంచి ఆదేశాలొస్తే.. ఆ పన్లో పడి ఆలస్యమయిందిలేవేఁ! ఆకలి దంచేస్తోంది. ముందన్నం వడ్డించు! అన్నట్లు భోజనంలోకి ఏం చేసేవేఁ?'
'పంచ భక్ష్య పరమాన్నాలు'
'అబ్బో! అంటే కూర.. పప్పు.. పచ్చడి.. చారు.. పెరుగేగా! వడ్డించొడ్డించు ఒక్కొక్కటే! అన్నట్లు చిన్నాడేడీ?'
'బడికెళ్ళాడండీ! మధ్యాహ్న భోజనమన్నా బళ్లో మింగబెడతారనీ! పొట్టలోకి   ఒక్కక్షరం ముక్కన్నా కుక్కక పోయినా.. సాంబార్లో నాలుగు ముక్కలన్నా  కడుపుకెక్కించుకుంటాడనీ! ముందు మీరు అన్నం కలుపుకోండి! కూర వడ్డించేస్తాను! అన్నట్లు మీ పిల్లి సీమంతం కన్నా వింత కథ నేనొకటి చెప్పనా! వింటూ తిందురు గానీ!'
'చెప్పు .. చెప్పు! కథలు వింటే చాలు నాకు కడుపు నిండిపోతుంది'
''వెనకటికి మీలాంటాయనే ఒకాయన రోడ్డు పక్కన తన మానాన తాను చెత్తా చెదారం తినే గాడిదనొకదాన్ని చూసి జాలి పడ్డాడంట. 'దేవుడి పాలనలో కూడా నీకీ దరిద్రమేంటే? దర్జాగా మహారాజుగారి గుర్రాలశాలకు పోరాదాకమ్మంగా గుగిళ్లూ అవీ వండిపెడుతుంటారక్కడ!' అని సలహా పారేశాట్ట!'
'సలహా బాగానే ఉందిగానీ.. ముందు నువ్వు కూర వెయ్యవే!'
'అయ్యో రాతా! అన్నం తెచ్చేలోపలే వట్టి కూరముక్కలు మెక్కేసారా!నేనిప్పుడేం చేతునురా దేవుడా! మీ తిండి యావ తెలుసుండీ ఇంకాస్త వండనన్నా వండకపోతిని.. పాపిష్టిదాన్ని!'
'సరే! .. సరే! ఏడవకు! తినాల్సినవి ఇంకా ఉన్నాయిగా! ఆ పప్పు వెయ్యి! ఏం పప్పూ? దోసకాయా.. ఆనపకాయా.. బీరకాయా.. వట్టి ముద్దపప్పా?'
'అబ్బ! ఎంత ముద్దుగా అడిగారండీ! వేస్తాగానీ ముందు కథను కాస్త ముందుకు కదలనీయండి! వింటూ కూడా తినొచ్చు! ఆ గాడిదకు గుగ్గిళ్లమీద ఆశ పుట్టింది. అనుమానమూ పుట్టింది. గుర్రాలశాల వంటవాళ్ళు చూస్తే వళ్ళు హూనమవుతుంది కదా అని దాని ధర్మసందేహం'
'వంట చేసేవాళ్లకు ఇదంతా పట్టదే పిచ్చి గాడిదా! వండి వార్చడమే వాళ్ల డ్యూటీ! 'ముందు నువు బయలుదేరు' అంటూ గార్దభాన్ని ముందుకు తోసాడా ఇందాకటి పెద్దమనిషి.. అయ్యొ ఖర్మా! పప్పుకూడా వట్టిదే మెక్కేసారా! ఏమయిందండీ మీకివాళా?'
'వటి పప్పే మెక్కేసానా?! అంతా మాయగా ఉందే! సరే.. ఆ పచ్చడన్నా ఇలా తగలడు! ముందా కథలో గాడిదేమందో చెప్పి తగలడు!'
'వంటవాళ్ళ వరకూ సరేనయ్యా! మరి వళ్ళు రుద్దేవాళ్లూ.. పళ్ళు తోమే వాళ్లూ వూరుకుంటారా? వచ్చింది గాడిదని గుర్తుపడితే చెమ్డాల్చెక్కేయరా?'అంటూ మళ్లా సందేహ పడిపోయింది గాడిద'
'వళ్ళు రుద్దేవాళ్ళకూ.. పళ్ళు తోమేవాళ్లకూ గాడిదైతే ఏంటీ? గుర్రమైతే ఏంటీ? వాళ్ళ జీతాలు వాళ్ళకు వేళకొస్తుంటే చాలు. నువ్వేంకేమీ పిచ్చి పిచ్చి అనుమానాఅలు పెట్టుకోకుండా కుడికాలు ముందు పెట్టి పదా!' అంటూ పెద్దాఅయన్ది ఒహటే తొందర. అయ్యోరామా! మీ తొందర దొంగలు తోలా! మళ్లీ వటి పచ్చడే నాకేసారేంటి బాబూ? కారమని కూడా తోచలేదా మీ నోటికి?! అందుకేనా ఆ ఎక్కిళ్లూ.. కన్నీళ్లూ?'
'ఇవి ఎక్కిళ్ళు కావే! డొక్కలో పేగుల గోల! అందుకే ఈ కన్నీళ్లు. సరే! ఆ చారు నీళ్ళన్నా పొయ్!'
'చేసింది మీకు పొయ్యటానికేగా? ముందు కథ కావాలో.. వద్దో  తేల్చుకోండి!'
నాకూ ఈ మధ్య మతిమరుపు కాస్త ఎక్కువవుతోంది. ఆనక మర్చిపోతే మాత్రం నన్ను సాధించబోకండి! ఆఁ! '
]ఎక్కడిదాకొచ్చిందా దిక్కుమాలిన కథా..?
'అదేనే! గుర్రాలకి వళ్లూ.. పళ్లూ తోమేవాళ్ళ జీత భత్యాల దగ్గరికి. అవునూ! నాకు తెలీక అడుగుతానూ! ఆ వళ్లు కడగేవాళ్ళు పట్టించుకోకపోతే మాత్రం.. వాళ్ళ పై వాళ్లు పట్టించుకోకుండా ఉంటారా.. గాడిదేదో.. ఫుర్రమేదో..?'
'ఆ గాడిదకూ మీ లాగే సందేహమొచ్చింది స్వామీ!  పై వాళ్ళకు మాత్రం వళ్ళంతా తడిమి చూసే ఓపికుండి చచ్చిందా? లెక్కకోసం ఎప్పుడో   అమావాస్యకీ ..పున్నమికీ  తడిమేది. అదీ వళ్లంతానా! ఒక్క పళ్లూ.. తోకా! పళ్ళికిలించి.. తోకాడించేస్తే సరి..గాడిదల్నూ గుర్రాలకిందే లెక్క రాసుకు పోతుంటారు. ఇంక రాజావారి ఊరిగింపు గుంపులోక్కానీ ఎన్నికయ్యావనుకో.. నీ పంట పండిందే అనుకో! ఒక్కసారిగా వి.ఐ. పి హోదా వచ్చి పడుతుంది. 'వై; కేటగిరీ వైభోగమంటే మాటలా మరి? కాళ్లకి వెండి పట్టాల దగ్గర్నుంచి.. మూపుకి పట్టు పీతాంబరాలదాకా..' అని వూరించేసాడు పెద్దమనిషి.'
' ఆ పెద్దాయనకసలు బుద్ధుందా! రాజుగారు గుర్తు పడితే గాడిద పని గోవిందో గోవిందా!'
'ఆ పోదురూ బడాయి! రాజులైనవాళ్లంతా సొంతంగా గాడిదలెవరో.. గుర్రాలెవరో గుర్తు పడుతూ కూర్చుంటారా.. విడ్డూరం కాకపోతే! మీ రాజుగారిని చూడ్డంలా! చూట్టానికి.. వింటానిక్కూడా సొంత బుర్రల్నసలు వాడరు.. అరిగి పోతాయని! ప్రద్దానికీ అందుకే అన్నేసి లక్షలు పోసి ప్రత్యేక సలహాదారుల్ని ఏర్పాటు చేసుకొనేది. ముందు మీరు పెరుగు వడ్డించుకోండి'
'అప్పుడే పెరుగేందే.. నీ మతిమరుపు మండా!  నువ్వింకా చారే పోయలేదు.. నేను తాగిందే లేదు!  ఏంటి కతా! నీ కంటికి నేనూ ఆ గాడిదలాగా కనిపిస్తున్నానా? రాజుగారు చూడకపోతే నా లాంటి కార్యకర్తలన్నా చూడరా? గుర్రానికీ.. గాడిదకీ తేడా ఆ మాత్రమన్నా చూసుకోకుండా తిరుగుతున్నామనా మా మీదా వెటకారాలు?!'
'అయ్యయ్యో! కట్టుకున్న దేవుణ్ని అంతలేసి మాటలంటె కళ్ళు పోతాయండీ మా ఆడంగులకి! మీకు తేడా తెలుస్తూనే ఉంటుంది కానీ.. బైటికి తేలరు. పైపెచ్చు మా రాజావారు వెరైటీగా గాడిదమీదెంత మోజు పెంచుకున్నారో!' అంటూ మెహర్భానీలకోసం దండకాలందుకుంటారు. మీ మీడియాలో భజనలూ మొదలు పెడతారు. అయ్యయ్యో! అలా .. తినే తినే కంచం ముందునుంచి లేచి వెళ్లి పోతారేమండీ!?'
'నీ కథతో కడుపు నిండిపోయిందే! నువ్వసలీ పూట అన్నమే వండింది లేదు. అందుకే చంటాడినా మద్యాహ్న భోజనం కోసం బడికి పంపించావు. నన్ను మాత్రం గాడిదకథల మాటున గాడిదను చేయాలని చూసావు!.. ఛీఁ!' అంటూ విసురుగా బైటికెళ్ళి పోయిన మొగుడి వంక చూసి బావురుమంది పాపం.. ఆ  ఇల్లాలు.!
'కందిపప్పు రెండొందలు దాటింది. సన బియ్యం వంద వరకూ వెళ్లింది, దుడ్డు బియ్యం మీ గొంతు దిగదు. ఏ వంట పదార్థాన్నంటుకున్నా చెయ్యి చురుక్కుమని కాలిపోతోంది. పసోడు కనక వాడిని మధ్యాహ్నం భోజనం పెడతారని బడికి పంపించానుకానీ మిమ్మల్నే ధర్మసత్రానికి తరమగలను కట్టుకున్నదాన్నయి వుండీ?! అందుకే ఈ కట్టుకథలల్లాల్సొచ్చింది. దేవుడా! తప్పు నాది కాదు. శక్తి ఉంటే ధరలు కిందికి దించు! వల్ల కాదంటే నా మొగుడి కడుపు నింపేందుకు మరిన్ని కట్టుకథలల్లే శక్తిని ప్రసాదించు' అంటూ బావురుమంది ఆ ఇంటి ఇల్లాలు!***
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం. ఈనాడు యాజమాన్యానికి.. సంపాదక బృందానికి.. కార్టూనిస్టు శ్రీధర్ సార్ కి ధన్యవాదాలతో)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...