Wednesday, February 1, 2017

ఫొటో ఆల్బమ్- విపులలో నా కథ



ఆ రోజు వర్కింగ్ డే. ఇంట్లో ఎవరూ లేరు. ఆయనా, పిల్లాడూ డ్యూటీల కెళ్లారు. పనమ్మాయి పని ముగించుకొని వెళ్ళేసరికి పదకొండు గంటలు దాటింది. స్నానం చేసి రిలాక్సుడ్ గా టి.వి చూస్తూ కూర్చోనున్నాను. బైట గేటు తీసిన అలికిడి. ఒక పెద్దాయన.. సుమారు అరవై.. అరవై ఐదేళ్లుంటాయేమో.. గేటు తీసుకుని లోపలికి వచ్చి పద్ధతిగా చెప్పులు ఓ మూల విడిచి వరండాలో ఉన్న పేము కుర్చీలో కూలబడి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొంటున్నాడు.
ఎప్పుడూ చూసిన మొహంలా లేదు. 'ఎవరు కావాలండీ?' అనడిగాను బైటికొచ్చి.
'రామ్మోహనరావుగారు ఉన్నారామ్మా?' అనడిగాయన చేతిసంచీ ఓ పక్కకు పెట్టుకొంటూ. ఆ పేరుగల వాళ్లెవ్వరూ మా ఇంట్లోనే కాదు.. మా చుట్టుపక్కలకూడా  లేరు. ఆ మాటే చెప్పాను.
'అయ్యో! ఇది మోహనరావుగారిల్లన్నారే!' అని గొణుక్కుంటూ లేచి నిలబడ్డారాయన. 'పాపం' అనిపించింది. మా నాన్న వయసుంటుంది ఆయనకు.
చెప్పులు వేసుకుంటూ అడక్కుండానే చెప్పుకొచ్చాడాయన. 'రామ్మోహనరావంటే మా అల్లుడేనమ్మా! ఇక్కడే ఎక్కడో ఆంధ్రాబ్యాంకులో చేస్తున్నాడాయన. బ్రాంచి పేరు గుర్తుకు రావడం లేదు. ఎప్పుడూ ఒక్కడినే రాలేదు. ఎప్పుడు వచ్చినా అమ్మాయి పక్కనే ఉండేది. నారాయణాద్రికి వస్తున్నానని చెప్పానమ్మా! అల్లుడుగారిని పంపిస్తానంది. ఎందుకు రాలేదో?' అనుకుంటూ బైలుదేరాడాయన.
'పక్క బజారులో ఆంధ్రాబ్యాంకుంది బాబాయిగారూ! అదేమో చూడండి!' అన్నాను గేటుదాకా బైటికి వచ్చి దారి చూపిస్తూ. ఆయన వీధి మలుపు తిరిగిందాకా చూసి లోపలికొచ్చేసాను. పెము కుర్చీ పక్కన పెట్టిన చేతిసంచీ అలాగే ఉంది, 'అయ్యో' అనుకుంటూ సంచీ తీసుకొని మళ్లా వీధిలోకి పరుగెత్తాను. కానీ అప్పటికే పెద్దాయన వీధి దాటినట్లున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.
ఇక చేసేదేం లేక ఆ సంచీని లోపలికే తెచ్చి ఓ మూల పెట్టేసాను.. మళ్లా వస్తే ఇవ్వచ్చులే అని.
ఆ పూటకి ఎవరూ రాలేదు.
మావారు సంచీని చూసి అడిగితే వివరంగా అంతా చెప్పాను. 'ఎవర్ని బడితే వాళ్లని అలా లోపలికి రానిచ్చేయడవేఁనా? అసలే రోజులు బాగో లేవు. ముందా సంచీ తీసవతల పారేయ్!' అని కూకలేసారు. ప్రద్దానికీ క్లాసు పీకటం ఆయనకో అలవాటు.
మా అబ్బాయయితే ఒహటే ఆట పట్టించడం.. 'తాతగారిచ్చిన గిఫ్టులు చెరి సహం షేర్ చేసుకొందాం మమ్మీ!' అంటూ.
రెండో రోజూ బ్యాగుకోసం ఎవరూ రాకపోయేసరికి నాకూ అనుమానం మొదలయింది. 'ఇదంతా కావాలని ఎవరో చేస్తున్న అల్లరి కాదు గదా!' అనిపించింది. వీధి చివరిదాకా వెళ్లి ఆంధ్రాబ్యాంకులో అడుగుదామని వెళ్ళాను ఆ మర్నాడు. ఇదివరకు బ్యాంకు ఉండేచోట ఇప్పుడేదో కన్ స్ట్రక్షన్ నడుస్తోంది. 'బ్యాంకు క్రాస్ రోడ్డుమీదకు షిఫ్ట్ చేశారు కదమ్మా!' అన్నాడు అక్కడే ఉన్న మేస్త్రీ. ఇంటికొచ్చి అనుమాన నివృత్తికోసం అసలు బ్యాగులో ఏముందో చూద్దామని బైటికి తీసాను.
ముసలివాళ్ల బ్యాగుల్లో ఏవుంటాయి? రెండు పంచలు.. లాల్చీలు.. కళ్లజోడు.. మందుల డబ్బా.. ప్లాస్టిక్ రేపర్లో చుట్టున పేస్టూ.. బ్రష్షూ.. సోపు.  భగవద్గీత పుస్తకం. పుస్తకం మధ్యలో ఏదో పెళ్ళి ఫొటో. కొత్త దంపతులాల్గున్నారు, చూడముచ్చటగా ఉంది జంట. ముసలాయన కూతురు.. అల్లుడు కాబోలు!
స్కూలు పిల్లల సైన్సు రికార్డు సైజులో ఒక పెళ్లి ఫొటో ఆల్బమ్ కూడా ఉంది. పెళ్లి కూతురు ఫొటోలోని అమ్మాయే కానీ.. పెళ్లికొడుకు పొటోలోని అబ్బాయి కాదు!
న్యూస్ పేపర్తో చూట్టి రబ్బరు బ్యేండ్లేసిన ఇంకో కట్టకూడా కనిపించింది. ఎందుకులే మనకీ పాడు గోల అనిపించింది. ఎక్కడి వస్తువులు అక్కడ యథాతధంగా సర్దేసి బ్యాగును స్టోర్రూం అటకమీద పెట్టించేసాను.. ఎవరన్నా వచ్చి అడిగితే ఇవ్వచ్చులే అని ఆలోచన,
ఆ రోజు ఆదివారం, మా వారికి చికెన్ కంపల్సరీగా ఉండాల్సిందే. నిద్ర లేవంగానే మహా సంబరంగా బజారుకు బైలుదేరారు.
ఆయన చెప్పులేసుకుంటుంటే.. మటన్ షాప్ పక్కనే ఉన్న ఆంధ్రాబ్యాంకు గుర్తుకొచ్చింది. 'వీలయితే ముసలాయన్ను బేగు తీసుకు వెళ్లమని చెప్పి రండి' అని హెచ్చరించానీయన్ని.
ధుమధుమలాడుతూ వెళ్లిన మనిషి తీరిగ్గా తిరిగొచ్చి 'బ్యాంకు మూసుంది. నెంబర్ తెచ్చాను చూసుకో!' అంటూ సెల్లో స్టోర్ చేసుకొచ్చిన నెంబరొకటి నా మొహాన కొట్టారు. అదీ సెల్ నెంబరే!
మధ్యాహ్నం ఆ నెంబరుకి కాల్ చేస్తే 'హలో!' అంది ఓ మగ గొంతు. 'సార్! మీరు ఆంధ్రా బ్యాంకు రామ్మోహనరావుగారేనా?' అనడిగాను.
'యెస్! వ్హాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?'
'విషయం వివరించడానికి చాలా తంటాలు పడాల్సొచ్చింది. అంతా విని చివర్లో 'మీరేమంటున్నారో నాకర్థం కావడంలేదు మ్యాడమ్! మా మామగారు పోయి రెండేళ్లయిందే!' అన్నారు. లైన్ కట్ అయింది. మళ్లో కాల్ చేసినా రెస్పాన్ లేదెంత సేపటికీ. ఇంకీ విషయం ఇంతటితో 'ది ఎండ్' అయిందని అర్థమయి పోయింది నాకు.
మూడు రోజుల తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటల పాంతంలో లాండు లైనుకి ఓ ఆడమనిషి కాల్ చేసింది. 'ఆదివారం మధ్యాహ్నం మావారి సెల్ కి ఈ నెంబర్నించీ కాల్ వచ్చింది. ఎవరో తెలుసుకోవచ్చా?' వినయంగానే ఉందా గొంతు.
'ముందు మీరెవరో చెప్పండి!' అనడిగాను నేను.
'ఆంధ్రాబ్యాంక్ రామ్మోహనరావుగారి వైఫ్ నండీ! మీతో కాస్త మాట్లాడ వచ్చా మేడమ్?'
'మాట్లాడండీ!'
'ఇలా ఫోన్లో కాదు. మీకు అభ్యంతరం లేదంటే ఒకసారి మీ ఇంటికి వస్తాను'
'రండి!' అంటూ ఇంటి అడ్రసు చెప్పాను.
అరగంటలో ఆటోలో వచ్చింది. గేటు తీసుకొని లోపలికి వస్తుంటేనే గుర్తు పట్టాను.. ఆమె ఆ ఫొటోలోని అమ్మాయే! కాకపోతే కాస్త వయసు పెరిగి వళ్లు చేసింది. కూర్చోమన్నాను.
బిడియంగా కూర్చుంది. 'ఇంట్లో ఎవరూ లేరా?' అని అడిగింది చుట్టూ చూస్తూ.
'లేరు' అన్నాను.
రిలీఫ్ ఫీలయింది. స్తిమితంగా 'మీరు మావారితో మాట్లాడిందంతా విన్నాను మేడమ్! బ్యాగు ఇంకా ఇక్కడే ఉందా?' అనడిగింది.
'సంచీ తెచ్చిచ్చి 'అన్నీ  ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి!' అన్నాను. బ్యాగందుకుంది కానీ.. లోపలేమున్నాయో చూసుకోలేదు. 'చాలా థేంక్సండీ!' అంటూ బైలుదేరింది హడావుడిగా.
'మంచిదమ్మా! నాన్నగారు బాగున్నారు కదా?'అనడిగాను చెప్పులేసుకుంటున్న ఆమెను చూసి.
'ఆయన మా నాన్నగారు కాదు మ్యాడమ్. మా ఊరాయన. ఈ ఆల్బమూ, డబ్బూ ఇచ్చి వెళదామని వచ్చాడు. రావాలంటే మా ఇంటికే రావచ్చు. కావాలనే ఇవి మీ ఇంట్లో వదిలేసినట్లున్నాడు'
'అదేందీ?!'  అనరిచాను ఒక్కసారి షాకయినట్లు.  ఆ సంచీలో కేషున్నట్లు నాకిప్పటిదాకా తెలీనే తెలీదు!
వెళ్లే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వచ్చింది. 'ఇదంతా మీకు చెప్పకూడదో.. లేదో.. నాకు తెలీదు. మా అమ్మలాగా ఉన్నారు. చెప్పకబోతే బావుండదు. ఆయన మా ఊరి పెద్దబ్బాయిగారు. పెద్ద ఫొటో స్టూడియో ఉండేది వాళ్లకు. మా ఊళ్లో ఎక్కడ ఏ ఫంక్షను జరిగినా వీళ్లే ఫొటోలు.. వీడియోలు తీసేవాళ్లు. వీళ్లబ్బాయి ఇంటర్లో నా క్లాస్ మేట్. మంచివాడు కాదు. నా వెంటబడి వేధించేవాడు. ఒకసారి క్లాక్ టవర్ దగ్గర చెప్పుతో కొట్టాను కూడా. అది కడుపులో పెట్టుకున్నాడు. మా ఫ్రెండు పెళ్లికి వీళ్లే ఫొటోలు.. వీడియోలు తీసారు. దాని ప్లేసులో నా బొమ్మలు పెట్టి సి.డి.లు తయారు చేసాడు. రెండు లక్షలివ్వకపోతే బైటపెడతానని అల్లరి పెట్టేవాడు. మా నాన్నగారు మామూలు బడిపంతులు. నా పెళ్లికే నాలుగు లక్షలుదాకా ఖర్చయిందా రోజుల్లో. ఇంకో ఇద్దరు చెల్లెళ్లున్నారు. ఆ దిగులుతోనే హార్టెటాకొచ్చి పోయారు' అని ఎడుస్తోందా అమ్మాయి.
ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. పాపం.. ఎంతకాలంనుంచీ కడుపులో దాచుకుందో!
తనే తమాయించుకొని వెళ్లడానికి లేస్తూ అంది 'అప్పట్లో మా నాన్నగారి పెన్షష్ నుంచీ ఒక లక్ష ఇచ్చి సి.డి తీసుకున్నాం ఆంటీ! కానీ ఇలాంటిదే ఇంకో ఆల్బంకూడా తయారు చేసాడని తెలీదు. తరువాత ఆ అబ్బాయి ఇలాంటివే ఏవో గొడవల్లో ఇరుక్కుని చచ్చిపోయాడు. పాపం.. పెద్దబ్బాయిగారికి ఇతనొక్కడే కొడుకు. పెద్దాయన బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. స్టూడియో వేరే వాళ్లకి అమ్మేశాడు. కొన్నాయనకు స్టాకు అప్పగించే టైంలో ఈ ఆల్బం బైటపడిందట. కొడుకు చేసిన నిర్వాకం అప్పటిదాకా ఆయనకూ తెలీదు. తెలిసి చాలా బాధపడ్డాడుట. ఈ ఫోటోలు.. ఇవీ ఇంకెవరైనా చూస్తే ప్రమాదమని నేరుగా నాకే ఇచ్చేద్దామని వచ్చాడు. ఇంటికొస్తే రెండు మూడు సార్లు మావారే కనిపించారుట. ఆయనకివ్వలేక మీ ఇంట్లో వదిలేసి పోయాడీ సారి'
'మధ్యలో మా ఇల్లు పిక్చర్లోకెలా వచ్చిందీ?! మా ఇంట్లో ఇవ్వాలని ఎందుకనిపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా.
'అంకుల్ ఏవో కథలూ అవీ పత్రికలు రాస్తారుట కదా! పోయిన నెల్లో మీ ఇంటి అడ్రసు ఏదో పత్రికలో చూసారుట! మా ఇంటికి మీ ఇల్లు దగ్గరనే కావాలని ఈ బ్యేగు మీ ఇంట్లో వదిలేసి పోయాడాయన.'
'పెద్దబ్బాయిగారి భార్య నిన్న కాల్ చేసి  ఈ ఫొటోలు.. డబ్బూ ఇలా మీ ఇంట్లో ఉన్నాయి. తెచ్చుకొని ఫొటోలు కాల్చేయమ్మా!' అని చెప్పింది మేడమ్! ఈ లక్ష అప్పట్లో మేము వాళ్లబ్బాయికి ఇచ్చింది. మధ్యలో మీకు ట్రబులిచ్చాం. సారీ!' అని లేచిందామె.
'ఫర్వాలేదులేమ్మా! నా కూతురులాంటి దానివి. ఇందులో మేం చేసింది మాత్రం ఏముంది? పెద్దదాన్ని కనుక ఒక సలహా చెబుతాను. ఈ ఫొటోలను ఇక్కడే తగలేసి పోతే నీకు మంచిది' అన్నాను.
ఆ అల్బం మా ఇంట్లోనే బూడిద చేసి డబ్బుతీసుకొని పోయే ఆమెని ఇంకో ధర్మసందేహం అడిగాను. 'ఇంతకీ ఆ పెద్దాయన ఇప్పుడెలా ఉన్నాడో! ఆయన్ని చూస్తుంటే మా నాన్నగారే గుర్తుకొచ్చారు.. పాపం'
'ఇక్కడికొచ్చిన మర్నాడే ఆయన మంచం పట్టి మూడ్రోజుల కిందటే పోయాడు ఆంటీ! ఆల్రెడీ కేన్సర్ పేషెంట్. ఈ తిరుగుడికీ దానికీ జాండీస్ వచ్చిందన్నారు.' అని వెళ్లిపోయిందా అమ్మాయి. పెద్దాయన సంచీని మాత్రం ఇక్కడే వదిలేసింది.
ఆ బ్యేగుని పారెయబుద్ధి కాలేదు నాకు. అటకమీద పెట్టేసాను. ఆ సంచీని చూసినప్పుడల్లా ఫొటోలు.. డబ్బే కాదు.. ఒక మంచిమనిషి మనస్తత్వం గుర్తుకొస్తుంటాయి.

-కర్లపాలెం హనుమంతరావు

(విపుల- ఏప్రియల్- 2010 సంచికలో ప్రచురితం)






No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...