Tuesday, April 16, 2019

రామా అన్నా బూతేనా!

 

రామా! అన్నా రావే.. అమ్మా..! లానే వివిపిస్తోన్నదీ మధ్య మరీను! సూత పురాణాలు ఎలాగున్నా.. బూతు పురాణాలతో పునీతమవుతున్నాయి తాజా రాజకీయాలు!  తిట్లు నోటికి పట్టకపోతే ఎన్ని కోట్లు  పోసినా నేతల నుదుటికి  నామాలులాగా మారింది వ్యవహారం!  బూత్ స్థాయి నుంచి ఎదిగొచ్చే నేతల కన్నా బూతుల సైడు నుంచి దూసుకునొచ్చే అప్ కమింగ్ లకే ఇప్పటి పాలిటిక్సులో హవా!  ఏ బేవార్స్ పార్టీ టిక్కెట్ కట్ కావాలన్నా.. సిఫార్సుల కన్నా ముందు నోటి దురుసు పోర్సెంతో నిరూపించాలి పెద్దల ముందు. నోటికి కుట్లేసుక్కూర్చుంటే పని అవ్వదు. ‘అవ్వ్హ!’ అంటూ బుగ్గలు నొక్కుకునే బుద్ధిమంతులకు ఎవ్వరూ కవరేజీలివ్వరు. . నాలుగు పూటల పాటైనా జనం నోళ్లల్లో నలగాలంటే పడతిట్టాలి..  పదంతలు తిట్టించుకోవాలి! పరువూ.. ప్ర్రతిష్టలంటూ రాజ్యాంగం బుక్కులు పట్టుక్కూర్చుంటే శని దేవుణ్ని సరాసరి తెచ్చి నెత్తి మీద ప్రతిష్ఠించుకున్నట్లే! పుట్టి బుద్ధెరిగినప్పటి బట్టి  పార్టీ సిధ్ధాంతాలకు మాత్రమే బద్ధులయే బుద్ధిమంతులు కొందరున్నారింకా.  మంద రాజకీయాలు ముందుకొచ్చినాక వాళ్లంతా మందబుద్ధుల జాబితాలో చేర్రిపోయారు! ‘ఛీఁ’ అన్నా చీదరింపేనని భావించే ఈ మాననీయులకు  చివరికి మిగిలే ఆస్తి ఓన్లీ స్వీయ  చింతలతో కూడుకున్న సొంత బ్లాగులు మాత్రమే సుమా! బ్లా,,, బ్లా.. బ్లా అంటూ మైకు వదలకుండా వాగేవాడిదే ఏ ఊరైనా.. వాడైనా! దుడ్డొక్కటే ఇప్పటి రాజకీయాలకు చాలదు. చలాకీగా దుడ్డుకర్రా చేతపట్టే ఆడిస్తేనే గొప్పనేత.  అమాయక ఓటర్లు గుండె దడతో అయినా జే.. జే..లనేది ఆ మాదిరి నాయకమ్మన్యులకే!    పదవి దొరసానమ్మ  వరువాలు సాంతం సొంతమవాలంటే అవిశ్రాంతంగా రాజకీయ విరాట పర్వంలో కీచకపాత్ర పోషించడమే కీలకం. కీలెరిగితేనే వాత పెట్టాలన్న స్కూల్ ఆఫ్ థాట్.. తాతల జమాలో చెల్లిందేమో గానీ.. తాజా రాజకీయాలల్లో ముందు వాత.. ఆ తరువాతే కీలు కోసం వెతుకులాట! శివ తాండవాలు.. వితండ వాదాలల్లో పండిపోయిన దుందుడుకు పిండాలకు వెనక వచ్చినా ముందు వరసలో సీటు! కొండను పిండి కొట్టి చూపిస్తామనే పిస్తా ఒకడైతే.. అదే పిండిని మళ్లీ కొండ కిందకు మార్చే మ్యాజిక్ చేసి చూపిస్తామని మరొకడు! కొట్టుకోడాలు, డబ్బాలు కొట్టుకోడాలల్లో కొట్టిన పిండిగా తయారైనవాడికే   నేటి  పాలిటిక్సులో నొంటికి నిండుగా తిండి! ఆ తిండి తిప్పల కోసమే నేతల వేషాలు .. రోషాలూ నేడిక్కడ ఎక్కడైనా చూడు! శేషమ్ కోపేన పూరయేత్ అన్న లోకోక్తిని రాజకీయాలే ఇప్పుడు మా బాగా రక్తి కట్టిస్తునన వినోదం.

 నిగ్రహం ప్రదర్సిస్తే ఏమోస్తుంది? మహా అయితే కర్నాటకంలో మాదిరి మైనర్ పార్టీల పట్ల కూడా ఔదార్యం ప్రకటించినట్లు మంచి పేరొస్తుంది.  అదే  మరి ఆగ్రహాలు ప్రదర్శిస్తేనో.. కుమార స్వామికి మల్లే మంఛి ముఖ్యమంత్రి పదవొస్తుంది. నిన్నటి ఎన్నికల్లో రైతన్నలు అంతలా అలిగి ఉమ్మడిగా అభ్యర్థిని నిలబెట్ట బట్టి కదా దేశమంతా ఓ సారి వారి వంక మోరెత్తి చూసిందీ!  ఎంతటి మహరాణుల భవంతుల్లో అయినా కోపగృహాలంటూ ప్రత్యేకంగా ఎందుకుంటాయ్? తాపాలకు మించి కోపాలకే ఎక్కువ పవరుంటుంది. కాబట్టే రాజకీయాలల్లోనూ అలకపాన్పుల సీనులు కంపల్సరీ!   

జాతికి నీతులు ప్పేదానికంటూ పుట్టిన   రామాయణమే వాల్మీకులవారి వ్యాకులం నుంచి పుట్టింది కదా! కిరాతకుడు, పొట్ట కూటి కోసం పిట్టల్ని కొట్టడం తప్పెట్లా అవుతుంది?! అయినా వాల్మీకి మహర్షులకు పూనకం వచ్చేసింది! ఆ వూపులోనే  ఐదు కాండల నీతికావ్యం   జాతికి దక్కింది! స్మితపారిజాతుడు శ్రీరామచంద్రుడు అన్నగా  పక్కనే ఉన్నా ఒక్క క్షణం తిన్నగా  మాట్లాడి ఎరుగడు   క్ష్మన్న! ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ  భార్య నోరు విడిచి అడిగిందాకా  గుర్తుకే రాలేదు  దశరథ మహారాజుకు. సాత్వికత గుణగణాలన్నింటికీ గురువు వంటిదన్న గౌరవంతో కైకమ్మ తల్లే కనుక గమ్మునుండుంటే ఎవరికీ పట్టని పాదుకలకు అంతలా  పట్టాభిషేకమనే అదృష్టం పట్టివుండేదా? మంచి మర్యాదలేవీ పట్టించుకోకుండా కట్టుకున్నవాడినే పొట్టన పెట్టేసుకుందని పాపం ఆ ఆడకూతురుని ఈ నాటికీ జాతి ఆడిపోసుకుంటున్నది! ఎంత వరకు సబబు?

కంస మహారాజంత కర్కోటకంగా తోడబుట్టిన దానితో వ్యవహర్రించ బట్టే కదా వసుదేవుడంతడి వాడి చేత ఓ  కోన్ కిస్కా గాడిద  కాళ్లలా పట్టించుకోగలిగింది. భవిష్యత్తరాల  ముందు తన శీలం  హననమవుతుందని తెలిసీ పాపం..  ఎంత సహనంతో అంతలా  తన అసహనం ప్రదర్శించి మరీ మురారికి అంతలా  దుష్ట శిక్షణోపహతుడన్న కీర్తి తెచ్చుంటాడు  శిశుపాలుడు? రావణాసురుడు, కార్తవీర్యుడి వంటి ఎందరో  నీచులు యధాశక్తి తమ కాముకత్వం,   వాచాలతత్వం వంటి దుష్టబుద్ధుల నెన్నింటినో  ధైర్యంగా  కార్యాచరణలో పెట్టబట్టే ఒక రాముడు, మరో కృష్ణుడు జాతికి ఆరాధ్యదైవాలుగా పూజనీయులయ్యారు!      

మంచి పేరు కోసం నాలుగు చల్లని కబుర్లు వల్లించడం మోకాళ్లు లేపలేని ఏ మూడు కాళ్ల ముసలైనా సులువుగా చేసేసే ఘనకార్యమే. దుర్మార్గుడన్న చెడ్డ పేరు వచ్చి పడుతుందని తెలిసీ   ఏ కొద్ది మందికో బుద్ధిమంతులన్న సత్కీర్తి సాధించిపెట్టేందుకు   హిరణ్యాక్షుణ్ని మించి  హింసాప్రవృత్తులను ప్రదరిండమే ప్రశంసనీయమైన దుస్సాహసం. రుక్మిణమ్మ పాత్రివ్రత్య మహిమను లోకానికి చాటించడం కోసమే  పిచ్చి సత్యభామ తల్లి తనను తానో కోపిష్టి భార్యగా చిత్రీకరించుకుంది!

ఆ లెక్కకొస్తే అలకలంటూ లేని మహితాత్ములెక్కడున్నారో నిర్మొహమాటంగా నోరిప్పి చెప్పండి! అలుగుటయే యెరుంగని  ధర్మరాజంతటి మహామహితాత్ముడే అలా అలవోకగా అలిగి అంత లావు కురుక్షేత్రం సృష్టించాడే!  ఉప్పూ కారాలు పప్పూ బెల్లాల్లా మెక్కే నోళ్లకు కళ్లెమేయాలని చూడ్డమంటేనే పెద్ద  కుట్రకు చాటుగా వ్యూహం నడుస్తున్నట్లు లెక్క! ఎన్నికల సీజన్! ఈసీల దృష్టికే గనక  ఈ ఘనకార్యమెళితేనా!  మేటరెంత సీరియస్ అవుతుందో ముందది తెలుసుకోడం మేలు!  ఎన్నికల కోడు ఏ క్షణంలో ఎవరి మాడుకు తగులుతుందో ! ఊహించుకోడం సాక్షాత్తూ ఆ దేవుడిక్కూడా తరం కాదు!

పేదల సంక్షేమ పథకాలు గట్రా పవరొస్తే  మరో టర్మ్ లోనైనా తీరిగ్గా చేసుకోవచ్చు. పెట్రేగే అధికార పక్షాలని ముందు కట్టడి చేయడం ముఖ్యం. దేవుడు ఇంత పెద్ద నోరిచ్చింది ఎందుకంట? బుద్ధిమంతులకు మల్లే స్వర్గానికి పోతే దేవుడి ముందు దేభ్యంలా నిలబడాలి..  బోడి ,మంచీ మర్యాదకోసమని బతుకునంతా ఇక్కడిట్లా ఏ తిట్లూ పాడూ వాడకుండా వృథాచేసుకుంటూ గడిపేసుకుపోతుంటే! దేవుడు పెట్టే దిక్కుమాలిన చివాట్లన్నీ  వింటూ దోషిలా  నిలబడే బడుద్ధాయిలకేం బాబూ.. ఎన్ని ధర్మపన్నాలైనా కుళ్లుబుద్ధితో వల్లించేస్తారు! పాపభీతితోనే నాయనా ప్రతిపక్షంలో కుములుతుండీ శాపనార్థాల శాస్త్రాన్ని వృథాచేయకుండా యధాశక్తి నోటి బలుపు కొద్దీ పాటుపడుతున్నదీ!  అధికారులన్న భీతైనా  లేకుండా పోలీసు బాసుల నుంచి పాలనాధికారుల దాకా  అందరి మీదా మాటలతో దాడి  చేసున్నందుకైనా  ముందు  ఆ దుందుడుకుతనాన్ని అభినందించాల్సుంది.

 భగవంతుణ్ణి చేరేందుకు భక్తి కన్నా వైరమే దగ్గరి దారని గదా జయవిజయులనే యక్షులిద్దరూ అంత వత్తిళ్లున్న  రాక్షస ప్రవృత్తులను ఎంచుకుమ్మదీ? మరా యక్ష పితామహుల అడుగుజాడల్లో నడిచినా ఆగడాలేనా?

కోపతాపాలు ఇవాళే ఏమన్నా కొత్తగా పుటుకొచ్చిన వికారాలా? కాలుడి మూడో కంటి పరమార్థమేంటో వేరే చెప్పాలా? కాలికి గుచ్చుకున్న ముల్లుకేమన్నా ప్రాణముందనా.. అంత కసిగా కాల్చి మరీ కోకోకోలా మాదిరి  చాణక్యుడలా కడుపులో పోసుకుందీ? బోజనాలకి  పిలవలేదని ఒహళ్ళూ, దండిగా సంభావనలు అందలేదని ఒహళ్ళు.. ఒళ్ళూ పై తెలీకుండా సిల్లీ కారణాలతో  పిల్లినో, పిచ్చుకనో అడ్డమేం వేసుకోడం లేదే!   కూసే అడ్డమైన   కూతలూ అందరికి అనుక్షణం కళ్లబడే ఏ ట్విట్టరు వంటి సామాజిక ఖాతాలల్లో ట్రోలుగా ఇస్తున్నప్పుడు ఇంకెక్కడుంది నీచత్వానికి ఆస్కారం? దుర్వాసులు, పరశు రాములు, కన్నబిడ్డలని కూడా కనికరించకుండా అడుక్కు తినమని తిట్టిపోసిన విశ్వామిత్రులు.. వీళ్ళనంతా మహర్షులు, రాజర్షులు, అవతారమూర్తులుగా హర్షామోదాలతో ఓ చెంపన కీర్తిస్తూనే.. దాం దుంప తెగ.. మరో చెంపన ఇప్పటి నేతలను ఆడిపోసుకోడంలో సమన్యాయమేమన్నా ఉందా?   అవసరార్థం ఏదో రాజకీయమే పరమార్థంగా ఏవో నాలుగు పిచ్చి కూతలు అటు మొదలవడం.. ఇటు కొనసాగడం.. వాస్తవంగా కళాహృదయం ఉన్నవాళ్లకి ఒక వినోదభరితమైన చిత్రంలా ఉండాలి!

గుడి కట్టి  మరీ రామచంద్రుడి మీది తన ప్రేమ భావనను చాటుకున్న గోపన్నంతటి గొప్ప దాసభక్తుడి నోటనే  విసుగు పుట్టిన్నప్పుడు వినరానన్ని తిట్లు వినిపించినప్పుడు ఇహ తిట్లన్నవి తప్పుడు కూతలన్న తీర్మానానికి రావడం ఎట్లా ఒప్పు?!  కీర్తి నిందల పాలవని దేవుళ్లే లేని తెలుగునాళ్లల్లో పాలకులకు మాత్రం ఆ  రాళ్లూ పూల దెబ్బల నుంచి మినహాయింపులెందుకు?! ఆ పరంధాముళ్లకు మల్లేనే గుళ్ళో రాళ్లల్లా గమ్మునుండటమే  రాజకీయాల సారం  ఆసాంతం వంటబట్టినవాళ్లంతా అనుసరించదగ్గ ఉత్తమ మార్గం. ఇవాళ తిట్టిపోసిన నోళ్లే రేపెంత ఆకాశానికి ఎత్తేస్తాయో! ఎంత బద్ధ శత్రువులైనా మళ్లీ కావలించుకునేటందుకు తెర చాటున అట్లా వెంపర్లాటలు సాగుతున్నప్పుడు .. దాం దుంప తెంప.. ఇహ ఏ కూతంటే కంపు! ఏ మాటంటే వినసొంపు!    

ఎండలకూ    చెమటలకూ ఓర్చి. తిండీ తిప్పలనన్నింటిని మరచి, చంటి బిడ్డలను ఇంటి వాకిళ్లకలా వదిలేసి. ముసిలీ ముతకా, ఆడా మగా, కుంటీ గుడ్డీ సైతం మంచి నేతల కోసమని అట్లా  గంటల తరబడి  ఏ ఈవియమ్ములు ఎంతగా  తంటాలు పెట్టినా   పట్టించుకోకూడదన్న పంతంతో మరీ అర్థరాత్రిళ్ల వరకూ నిద్రా నిప్పులు వదిలి వంటి కాలి మీద క్యూలల్లో నిలబడి మరీ ఓటేసిన దృశ్యాలు ఎన్నడూ ఎరగని రీతిలో మన నేతలు కూడా చూసుంటారు. చెడ్డ మాటలకేం ఎప్పుడైనా విసిరుకోవచ్చు. సొంతవారి మంచి కోసమూ చేసుకొనే సమయం చాలా ముందుంది, ఇహనైనా ఇంగితం తెచ్చుకొని ముందు జనం మంచీ చెడ్డను గురించి కొంచెమైనా ఆలోచిస్తారేమోనని ఆశించడంలో తప్పేముంది? ఆశలను నిరాశ చేస్తే తప్పేముంది? మళ్లీ  ఎన్నికలనేవి రావా! ఓట్లేసే జనాలకు మాత్రం తిట్లేం పాతవా? అందాకా రాకుండా గిలిచిన పార్టీలన్నీ  సుపరిపాలన అందిస్తాయని, ఈ సారైనా గెలవాలనుకొనే ప్రతిపక్షాలన్ని జనం మేలు కోసం పాలనకు సహకరిస్తారని ఆశిద్దాం.  అదే కదా అసలైన రామరాజ్య వ్యవస్థకు ఏ రామాయణ కావ్యమైనా ఇచ్చే   సిసలైన పరమార్థం మరి?

రామా అంటే బూతేనా అంటే  బూతే అవుతుంది కదా మరి! తప్పర్థం చేసుకొనద్దు!  పోలింగ్ బూత్ స్థాయి నుంచి మొదలయే ప్రజాసేవల సువ్యవస్థ అని మాత్రమే సవినయంగా నా మనవి!

-కర్లపాలెం హనుమంతరావు

(14, ఏప్రియల్, 2019 తేదీ నాటి సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...