Saturday, March 14, 2020

సరదాకేఃr ఇదో.. ఓ.. ఆదాయ మార్గం! -కర్లపాలెం హనుమంత రావు -సూర్య దిన పత్రిక



రకరకాల  ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా! ఓ మూలట్లా  మన్మోహన్ సింగులా
మూలుగుతూ కూర్చుంటే ఎట్లా? ఎంచక్కా  పోయి ఓ సారరి ఆ ముసలయ్యగారిని కలిసి

రారాదా!’ అని మా ఆవిడ  నస. వెళ్ళి కలిసాను ముసలయ్యగారిని. మనసులోని మాట
పెదాల మీదకు రానే లేదు,  పెద్దాయన చప్పట్లు కొట్టి పి.య్యేని పిలిచి
నన్నప్పగించేశాడు. ‘అయ్యగారికి ఇవాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ
ముఖ్యమైతే తప్ప  రిసీవరూ బైటికి తియ్యరు. ఏమిటీ విషయం?’ అనడిగాడా
పి.య్యే.
‘మా వార్దు నెంబరు పదమూడుకి నిలబడదామనీ! ముసలయ్యగారి పార్టీ సహకారం

కావాలి’ అన్నా టూకీగా. ‘మరైతే వట్టి చేతులతో వచ్చారేంటండీ బాబూ! మీ జాతక
చక్రం.. సూర్యమానం ప్రకారం వేసిందొకటి, చంద్రమానంతో కలిపిందొకటి తీసుకు
రావాలి. గ్రహాలు, రాశులు.. వాటిని బట్టే అయ్యగారి అనుగ్రహం!’ అన్నాడా
పి.య్యే.
‘తమిళనాడు దివంగత జయలలితమ్మాళ్ గారికీ ఇట్లాగే జ్యోతిష్కం,
సంఖ్యాశాస్త్రాలంటే తగని పిచ్చ. జాతక యోగం ఉచ్ఛస్థితిలో
ఉందనుకున్నవాళ్ళకు మాత్రమే టిక్కెట్లిచ్చారు ఒకసారి ఎన్నికల్లో.
ముఫ్ఫైతొమ్మిది స్థానాలగ్గాను ముష్టి తొమ్మిదంటే తొమ్మిది మంది మాత్రమే
గెలిచారంతా కలిపి. గెలుపుకీ గ్రహాల వలపుకీ లింకేంటండీ బాబూ?

ప్రజాస్వామ్యంలో ఘనవిజయానికి కావాల్సింది ప్రజల అభిమానం కాదుటండీ!’
అన్నాను కసిబట్టలేక.
‘టయానికి గుర్తు చేసారు!  ఆ జయమ్మగారి కన్నా మా ముసలయ్యగారు మరో
రెండాకులు ఎక్కువ.  ఇట్లాంటి పరాశాస్త్రాల పైన విపరీతమైన నమ్మకం. మీ

ఇంటికో సారి మా వాస్తుశాస్త్రులు వస్తారు. అన్నీ సవ్యంగా ఉంటేనే మీ మొర
మా పెద్దాయన ఆలకించడం! మొన్నీ మధ్యన ఇట్లాగే ఒక బొజ్జాయన ఇంటికి
ఈశాన్యంలో పూజామందిరం పెట్టుకుని  అవకాశం చేజేతులా జారవిడుచుకున్నాడు.’
 ‘ఇంటికి ఈశాన్యంలో మందిరముంటే దోషమా!’’

‘మందిరముంటే కాదు మహాప్రభో! అందులో వినాయకుడు, ఆంజనేయుడు లాంటి
బాహుబలులుంటేనే మోసం. ఈశాన్యంలో బరువులుంటేనే కదటండీ ఊహించని

ఉత్పాతాలొచ్చిపడేదీ! ఆ మాత్రం వాస్తుజ్ఞానం కూడా లేకుండానే వార్డు
మెంబర్లై పోదామనే!’ పి.య్యే మాటల్లో వెటకారం.
ఇండియాని ఈ కరోనా తరహా మాయదారి రోగాలు  ఎందుకిలా నలిపేస్తున్నాయో ఇప్పుడు
బుర్రకెక్కింది స్వామీ! ఈశాన్యం దాకా పాకిన అంత  లావు హిమాలయాలు.. వాటి
వెనకమాల్న చైనా కొరియా గట్రా దేశాలాయ! వాటి మాయ! అవి పట్టించుకోకుండా

కుంభకోణాలనీ, ద్రవ్యోల్బణాలనీ, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందికర
సంబంధాలనీ.. పాపం మనం మోదీ, షా మామయ్యలను హమేషా ఆడిపోసుకుంటున్నాం

నిష్కారణంగా'

నా ఆలోచనల్లో నేనుండగానే భుజం గోకి మరీ అడిగాడా  పి.య్యే ‘కొంపదీసి మీ
ఇంటిగ్గానీ సింహద్వారం దక్షిణం వారగా  ఉందా ఏంటీ? ముందే చెప్పండి బాబూ..
ఆనక నన్నెన్ని దెప్పీ నో యూజ్’

‘అమెరికా శ్వేత సౌధం తలవాకిలే దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది తమ్ముడూ!
మరా దేశం ఇన్నేళ్ళబట్టి అగ్రరాజ్యంగా  ఎట్లా నిప్పులు చెరుగుతుందో?’

‘వాదనలొద్దిక్కడ. ఆ ముచ్చట్లన్నీ టీవీ పెట్టెల్లో! ముసలయ్యగారు
పరాశాస్త్రాలన్నీ నమ్ముతారు. ఆయన ముక్కు చూసారా? దూలం భారీ. తిన్నగా కూడా
ఉండదు. అయ్యగారి ముక్కువాస్తు ముందే తెలుసుకుని వచ్చుండాల్సుందయ్యా
తమరు!’

బిక్క మొహమేయడం నా వంతయింది. పోయిన ఏడాదే మా అడ్డగాడిదకు ఎక్కడా ముడిపడే
యోగం కుదర్డంలేదని ఇట్లాగే ఏదో దిక్కుమాలిన శాస్త్రం  ఘోషిస్తోందంటూ నా

ఘోష లెక్కచెయ్యకుండా వీధి ముఖ ద్వారాలు రెండూ సగం మూయించేసింది మా
మహాతల్లి. ఇప్పుడీ ముసలయ్యగారి వాస్తు ఇంకేం మూయిస్తుందో.. ద్యావుడా!’

 ‘ముందొక  సారిట్లా వచ్చి ఈ నీళ్ళ తొట్లో మీ కిష్టమైన రంగు ముక్క ఏదన్నా
తగలేయండి బాబూ! మీ అసలు రంగేంటో బైట పడేందుగ్గాను ఇదో చిన్న స్లిప్
టెస్ట్ అన్నమాట!’ అంటో గారపళ్ళు చూపించాడా  పియ్యేగారు.
రంగులు మారుతున్న  నామొహం వంక చూసి ‘మీ సందేహం అర్థమైందిలేండి! ఈ తొట్లో
ఉన్నది  సీదా సాదా జలగ కాదండీ బాబూ! ఆఫ్రికా ఖండం యవుండే దేశం నుండి

తెప్పించిందండీ! ప్రపంచ ఫుట్ బాల్ పోటీలల్లో ఫలితాలు ముందే చెప్పిన
ఆక్టోపస్ 'పాల్' లేదూ.. దానితో క్రాస్ చేయించి పుట్టించిందండీ ఈ
బుజ్జిముండను! తండ్రి తాలూకు జోస్యం చెప్పే లక్షణాలు ఎక్కడకండీ పొయ్యేదీ?
ఒక్క పాలిటిక్సులోనే కాదు వంశపారంపర్యాలూ గట్రా! మోదీ వద్దని దులపరిస్తే
మాత్రం  మాయమై పోడానికి ఇదేమన్నా గుడిసెకు పట్టిన ఆర్డినరీ బూజా? వాస్తు
బూజు బాబూ.. వాస్తు మోజు’
 ‘ఆటల  మీద రంధి పెంచి బెట్టింగ్ సొమ్ము  రెట్టింపు గుంజేందుకు మాస్
మీడియాతో మాఫియా ఆడించిన నాటకాల్రా బాబూ ఆ ఆక్టోపస్సుల యాక్టింగులు!
యుద్ధ రంగంలోకి దిగే ముందే శత్రువర్గం మానసికంగా కుంగేటందుకు వాడుకునే
గూఢచర్యానికి నకలు.'
నా ఊహల్లో నేనుండగానే పెడబొబ్బలు పెట్టేసాడా పి.య్యేసామి. నా చేతులు
పట్టుకు తెగ ఊపేస్తూ ‘కంగ్రాట్సండీ కామాయ్ సారో! మీరీ పరీక్షలో కూడా
నెగ్గేశారోచ్! ఇహా కోయంబట్టూరు నాడీ జోస్యం కూడా తెప్పించేసుకుని రడీగా
ఉంచుకుంటే సరి.. మీ పని ఫినిషయిపోయినట్లే! ఆఁ.. అన్నట్లు.. ఈ లోపల్నే
నామనక్షత్రం ప్రకారం తమ పేరును ఎట్లా మారిస్తే దిగ్విజయం సిద్ధిస్తుందో
డాక్టర్ దైవజ్ఞానం  కూడా ఓ  నివేదిక తయారుచేసిస్తారు. ఓ.కే నా?’
‘పేరు మార్చుకుంటే అపజయలక్ష్మి ఆనవాలు పట్టకుండా వదిలేస్తుందనా?
దేవుళ్లను కూడా తప్పుదారి పట్టించే కొత్త  రకం గుంటనక్క ట్రిక్కా!’
‘మీరున్నారు చూసారూ.. భలే చిలిపి సార్! మనసులో ఏదున్నా అస్సలు దాచుకోరు!
ఐ ఎప్రిషియేట్! ఇది వరకో చిన్నారావును.. ఇట్లాగే 'చీ..అన్నా..రావు'గా
సాగదీసిం తరువాతనేనండీ అతగాడి జాతకం మొత్తం తిరగడ్డం మొదలెట్టిందీ!

దివ్యజ్ఞానం గారి విజ్ఞానాన్ని సందేహించకండి! అరవై ఏళ్ళ అనుభవసారం.
వాజిపేయి, సోనియాజీ, కరుణానిధీ, నెల్సన్ మండేలా, జార్జ్ బుష్, ఒబామా,

సద్దాం హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద జాతీయ, అంతర్జాతీయ శాల్తీల నాడులే
పట్టి మరీ జోస్యం రాబట్టిన ఘనాపాటి ఇతగాడు! మీ డౌట్లన్నీ తీరిపోతాయ్..
ముందీ బౌండు బుక్కు  చదవండి’ కవిలకట్టొకటి నా మొహాన ఠకీమని  కొట్టి
లోపలికి తారుకున్నాడా పియ్యే.

బౌండా అది? వందలాది ఏళ్ళ కిందటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెప్పే నాడీ
జోస్యంట ఆ దిండు! నోస్ట్రస్ డేమ్ జోస్యం కన్నా డేమ్ ష్యూర్ గా డాక్టర్
దివ్యజ్ఞానం జోస్యముంటుందని డబ్బాలు! ఇరాక్ యుద్ధం, ఇందిరమ్మ మరణం, రజనీ
బాషా హిట్టూ..బాబా ఫట్టూ, బందిపోటు వీరప్పన్ చావు, వెస్ట్ బెంగాల్
లెఫ్టిస్టుల ఫేటు, దక్షిణాది సునామీలు, ఆమ్ ఆద్మీ కేజ్రీవాలు  రైజు,
పెద్దనోట్ల రద్దు, ముంబై దాడులు.. ఆఖరికి  ఆర్జీవీ మూడ్స్ తో సహా హిస్టరీ

దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అనింపార్టెంట్ స్టోరీస్ ఆల్మోస్ట్
అన్నీ నేటివ్ టు ఇంటర్నేషనల్ లెవెల్లోవి సర్వం .. అవి   జరక్కముందే..
విఘడియల వివరాల్తో సహా పర్ఫెక్టుగా లెక్కగట్టి మరీ తేల్చినట్టి

రిజల్ట్సని కోతలు! ఆ దస్త్రాలన్నీ చదవడం సంగతట్లా పక్కనుంచి..
మొయ్యడానికే ముందు కోడి రామ్మూర్తిగారి  కండబలం కావాలి!
కరుణానిధిగారు శుద్ధ చార్వాకవాది. హస్తసాముద్రికాలు.. నాడీ జోస్యాల వంటి
అపరశాస్త్రాలు ఆయన వంటికి పడవు. అంత పెద్దల వ్యక్తిగత జీవితాల లోతుల్లో
కెట్లా చొచ్చుకెళ్ళగలిగాడబ్బా ఈ డాక్టర్ దైవజ్ఞానం! ఈ లెక్కన చూసుకుంటే..
కొరియా- ట్రంపుల ఒప్పందం, ఇరాన్ సులేమానీ మరణం లాంటి వాటిని గురించి
చెప్పుకునేవీ  డబ్బాలేగా!


ఇంకాస్సేపు గానీ ఇక్కడే పడుంటే.. ఈ ముసలయ్యగారి నస పి.య్యే బల్లిశాస్త్ర
పరీక్ష కూడా బలవంతంగా  చేయిస్తాడు. గ్రహణం బాలేదు. వచ్చింది గ్రహణం పూట
కాబట్టి  నైటు దాకా వెయిటింగులో పెట్టి తలవాకిట్లో పళ్ళె పెట్టి రోకలిబండ

నిలబెట్టమనే టెస్టూ తలపెట్టచ్చు.

ఎన్నికలల్లో ఎదుటి పక్షం అభ్యర్థి  నామినేషనెయ్యడానికే కురుక్షేత్ర
యుద్ధంలో తలబడ్డంత  ఘోరంగా ఉందే ఇప్పటి పరిస్థితి! గెలుపు మాట ఆనక, ముందు

మన వేలైనా ఓటు మిషను  మీట మీద పడనిస్తుందో లేదో.. పాడు రాజకీయం!
ప్రచారాలు మాత్రం?  ఓటెయ్యమని అడిగేందుకు పంచ ముందు కెళ్లడం ఆలస్యం.

పింఛన్లు పెంచు, కోకలు పంచు, పంచెలు ఇప్పించంటూ ఒహటే దంచుళ్లు! ఓటర్లతో
ఓ మంచీ చెడూ చెప్పుకోడాలిప్పుడు మరీ ఓల్డ్ ఫ్యాషన్సయిపొయ్యాయ్! ఓట్ మేటర్

అంటే ఓన్లీ మనీ మేటర్!

అసలే కరోనా రోజులు కూడా! కనబడ్డ కుంకెవరైనా కరచాలనం వంకన కక్ష కొద్దీ ఏ
మాయదారి రోగమో  వంటికి అంటించిపోతే! నిలబడ్డం మాట అటుంచి ఓటేయడానికైనా
వచ్చే ఎన్నికల దాకా శాల్తీ మిగిలే ఛాన్సుంటుందో ఉండదో.. డౌటే! ఎన్నికల్లో

నిలబట్టానికి ఎన్ని తిప్పలురా ద్యావుడా?

ముందు ముందు జరగబోయేది ముందుగానే తెలిస్తే ‘యెస్’ బ్యాంకు తుస్సు
మంటుందని ముందే ఎందుకయ్యా ఏ జ్యోతిష్కుడూ  నోరు పెగిలింది కాదూ? సి.యం
పదవి హుళక్కేనని ముందే ఏ న్యూమరాలజిస్టయినా సింధియా చెవిన చేరేసుంటే
అంత లావున ఎం.పీ లో కాంగీల గుంపు  గెలుపుకని కిందా మీదా పడుండునా? నిజంగా
జరిగేది నిఖార్సుగా చెప్పేదుంటే నిర్భయ నిందితులందరికి ఉరిశిక్షలు

ఎప్పుడో  నిర్భయంగా ఇప్పుడైనా చెప్పమనండి.. చూతాం! గీత దాటిన శాసనసభ్యుల
పైన వేటు పడే సుముహూర్తం ఎప్పుడో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఆ గుట్టేదో
విప్పమనండి.. విందాం!


పండించిన పంటకు మంచి రేటు పలికేది ఎన్నడో ముందే తెలిస్తే కష్టపడైనా
సరుకును దాచుకుని నష్టపోడుగా పాపం రైతన్న! నైరుతీ రుతు పవనాల రాక ఇదీ అని

నిక్కచ్చిగా తేలితే ముందుగానే దుక్కి దున్ని విత్తులు జల్లి నెత్తికి
చేతులు తెచ్చుకునే దుస్థితి తప్పునుగా అన్నదాతకు! వాయుగుండాలు తీరం దాటే

తీరు అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాతావరణ
శాస్త్రవేత్తలు. సదరు నిపుణులందరికీ జ్యోతిషంలో గానీ  గట్టిగా
తర్ఫీదిప్పిస్తే  దేశాన్నీ, జనాన్నీ వరదల బెడద నుంచీ
తప్పించిన్నట్లవుతుంది కదా!  ఏ సర్కారీ చాకిరీ ముఖాన ఎప్పుడు రాసుందో
ముందే ముఖం మీది రాతలు చదివే పండిత ప్రకాండులెవరైనా  చదివి చెప్పగలిగితే

ఇన్నేసి సెట్లతో విద్యార్థులకు కుస్తీపట్లు తప్పును కదా! సూపర్ సక్సెస్
ఫార్ములా ముందే ఫిక్సైపోయుంటే చిన్న నిర్మాతలిలా తలలు తాకట్టు పెట్టుకుని
మరీ చెత్త చిత్రాలు పోగేసే రొష్టు తప్పును కదా? పసిడి ధర ఇదిగిదిగో

పడిపోయింది, గ్యాసు ధర అదిగదిగో అంతర్జాతీయంగా ఎక్కడికో ఎగిరిపోతోందంటో
పచ్చడి మెతుకుల కూటిక్కూడా తడుముకునే బడుగుజీవిని కంగారు
పెట్టేస్తున్నాయ్ బంగారం కొట్లు, బండి చవురు బంకులు! బంగారంలాంటి

జీవితాలు వాటి చుట్టూతా గిరిటీలు కొట్టకుండా కాపాడవచ్చు కదా కాలజ్ఞానం
పైన అంత అపారమైన అవగాహనవుండే నవీన బ్రహ్మంగారులు నోరు తెరిచి బోధించి! ఏ

అపరాల ధర ఎప్పుడు ఎంత వరకు పెరుగుతుందో.. స్టాకు బజార్లలో ఏ షేరు ధర ఏ
క్షణంలో ఎంత లోతుల్లోకెళ్లి పడిపోతుందో .. ముందే కనిపెట్టేసి ఓ ఉగాది

పంచాంగం లాంటిది రిలీజు చేసేస్తే.. కన్రెప్ప కొట్టే లోపలిట్లా లక్షలూ
కోట్లూ ఆవిరయిపోడాలు.. ఏడుపులు ఉండవు కదా! దాంతాడు తెగా.. ఒక్క నోస్టర్

డ్యామూ నోరూ అడ్వాన్సుగా పెగలదు! సరి కదా.. తీరా తాడు తెగి బక్కెట బావిలో
పడిం తరువాతనా.. ఇదిగిదిగో.. ఇలా జరుగుతుందనేగా మేం ముందే కనిపెట్టి

ఘోషెట్టింది!’ అంటూ టీవీల ముందు చిందులు!
లావు లావు ‘లా’ పుస్తకాలు.. అవీ ఇవీ.. చదివి ఐయ్యేయస్సులు ఐపీయెస్సులూ
ఐపొయ్యే సార్లు, దొరసాన్లు ఇంకాస్త మనసు పెట్టి ఆ కూస్త బల్లిశాస్త్రమో,

పాదసాముద్రికమో కూడా ఔపోసన పట్టేయరా నిఖార్సైన  ప్రభావమంటూ నిజంగా
పరాశాస్త్రలకే   ఉండుంటే!

వాస్తవేమిటంటే..
వాస్తు వసతి కోసమని ఎన్నడో ఏర్పాటైన ఓ  చిన్న నిర్మాణశాస్త్రం. గుహల
నుంచి కాంక్రీటు గృహాల దాకా ఎదిగిన మనం  ఇంకా ఆ ఆకు కుటీరం నాటి అవసరాలను
తీర్చిన పాత నియమ నిబంధల చూరులు పట్టుకు వేళ్లాడుతు ఉంటే మానవ వికాస
నిర్మాణం ముందు ముందు మరంత విస్తరించడం ఎప్పుడు?

వరాహ మిహిరుడి వాస్తు ప్రకారం  మహానగరాలల్లో కాని  నిర్మాణాలు సాగిస్తే
ఇరుగింటి మురుగు పారేది పొరుగు పడక గది కిందనే!  మయామాతా, మానసారా.. ఎవరి
వాస్తు ఘోష వాళ్లది. వాటిలో వాటికే ఏకీభావం లేని పరాశాస్త్రాలతో  నేటి
నాగరిక మానవుడు ఏకీభవించడం పరాచికం కాదా?

వీరేశలింగంపంతులుగారు అమావాస్యనాడు ఉద్యోగంలో చేరి మహోపాధ్యాయుడిగా
కీర్తి గడించారు. సురవరం సుధాకరరెడ్డిసారు  రెండువేల నాలుగు  నాటి
ఎన్నికల్లో రాహుకాలంలో నామినేషన్ వేసి  మరీ ఎం.పీగా గెలుపు సాధించారు!


నాడీ జ్యోతిషం వేదవిజ్ఞానం కాదు. నాలుగో శతాబ్దం దాకా వేదాలలో వాస్తు
ప్రస్తావనే లేదు. ఎన్ని వేద సంహితలలో భూతద్దం పెట్టి వెతికినా
సంఖ్యాశాస్త్రం కనిపించదు. మనిషి వస్త్రలాభం, వాహన యోగం గోడ మీద పాకే

బల్లా నిగ్గుతేల్చేది? సిల్లీ! కుళ్లు బుద్ధులతో మనం అనుక్షణం కొట్టుకు
చస్తూ ఆ కలహాలకి కారణాన్ని పురుగులేరుకు తినే  బల్లి మీదకా తోసెయ్యడమా..

దారుణం!

ఈ సారి ఇంకేదో మూడు కాళ్ళ కప్ప బొమ్మ పట్టుకుని నవ్వుతో బైటికొచ్చాడు
పి.య్యేసారు. చైనా వాస్తు ఫెంగ్-షూయి ప్రకారం మూడు కాళ్ల కప్ప గుమ్మం
ముందు కూర్చున్నట్లుంటేనే ఇంటి యజమానికి మనోసిద్ధి ప్రాప్తిరస్తట!
ఇట్లాగే ఇంకా ఏవేవో చాలా శాస్త్ర మర్మాలు విప్పచెప్పే ఉత్సాహంలో ఉన్నాడు
ముసలయ్యగారి పర్శనల్ సహాయకుడు! కానీ నా మానసికస్థితి అప్పటికే ఒక గట్టి

స్థితప్రజ్ఞతను సాధించింది.  మూడు కాళ్ల కప్పతో సహా గిరుక్కున వెనక్కి
తిరిగి వచ్చేసా.

‘అష్టమి, మంగళవారం, ఆ పైన గ్రహణం. బయల్దేరిందేమో రాహుకాలం. అదీ వర్జ్యం
వదలక ముందు! ఎదురుగా వచ్చిందేమో నల్ల పిల్లి! కాస్తంత సేపు ‘కూర్చుని
నెత్తి మీదిన్ని నీళ్ళు జల్లుకుని పోవయ్యా మగడా!’ అన్నా! వింటేనా?

పరగడుపున బల్లి భుజం  మీద పడ్డప్పుడే అనుకున్నాలే, ఇవాళేదో ముదనష్టం
ముహాన రాసిపెట్టుందని..’ ఇట్లా  సాగుతుంది ఇంట్లో మా ఆవిడ పురాణం. రక
రకాల శాస్త్రపరీక్షలకూ,  ఎన్నో రకాల నివేదికలకూ, ఇదిగో ఈ మూడుకాళ్ళ కప్ప

బాపతు  దిష్టిబొమ్మలు గట్రాలు మరికొన్నింటికి.. అంతా కలసి ముసలయ్యగారి
పి.య్యేమనిషి  నా మూతి పళ్లు రాలగొట్టి   రాల్చుకున్నవి   అక్షరాలా అర్థ

పదివేల నూటపదహార్లు! వాటి  గురించే ఆవిడ షష్ఠాష్టకాలు!
 ‘సొమ్ము పోతే పోయిందిలేవయ్యా! ఆ వార్డు మెంబరూ వద్దు.. పాడూ వద్దు! ఎవరం
ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇంచక్కా నువ్వూ ఆ చైనావాళ్ల వాస్తు
బొమ్మలు అమ్మే కొట్టు వెంటనే మొదలెట్టు’ అనేసింది ఆవిడే మర్నాడు

వాతావరణం చల్లబడి మెదడు మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాత!
నిజమేగా! ఎవరం ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇదీ ఓ ఆదాయ మార్గమేగా!
***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...