Saturday, September 5, 2020

స్వామి భక్త కాంగ్రెస్ -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక నా రాజకీయ విశ్లేషణ



కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కాదు; భారతీయ జనతా పార్టీ కాదు; కనీసం హిందూ మహాసభ అయినా కాదు. ఈ తరహా రాజకీయ పక్షాలకు కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు కద్దు. దేశాన్ని తమ భావజాలానికి అనుకూలంగా మలుచుకునే కొన్ని స్థిరమైన ప్రణాళికలు ఉంటాయి. పాలనా పగ్గాలు చేతికందితే ఏ తరహా సంక్షేమపాలనతో ముందుకు సాగాలో, ప్రతిపక్ష హోదాకు పరిమితమైతే ప్రజాపక్షంగా ఏ ఎత్తుగడలతో ప్రభుత్వాలని ఎండగట్టాలో.. అన్ని రకాల సమస్యలు చర్చించుకునేందుకు బ్లాక్ అండ్ వైట్ రూపంలో డ్రాఫ్టింగుల నిత్యం సిద్ధమవుతుంటాయి. పార్టీలలోకి సభ్యులను తీసుకునే ముందు అయా వ్యక్తుల ఆలోచనాధార, నడవడిక, గతచరిత్ర తాలూకు వివరాలు గట్రా గట్రా తమ తమ పార్టీల భావజాలానికి అనుకూలమైన పంథాలో ఉన్నాయో లేదో తైపార పట్టిచూడడం తప్పనిసరి అభ్యాసంగా ఉంటుంది క్రమశిక్షణకు గట్టి ప్రాముఖ్యతనిచ్చే పార్టీలకు. (నరేంద్ర మోదీ చేతికి చిక్కే దాకా భాజపా కార్యాచరణ సైతం చక్కని క్రమశిక్షణ కలిగి ఉండేదే). ప్రతీ రాజకీయపక్షానికి కచ్చితంగా నడుచుకొనే నియమ నిబంధనల చట్రం ఉన్న విధంగానే భారతీయ కాంగ్రెస్ పార్టీకీ విధి విధానాలు, నియమ నిబంధనలు లేకపోలేదు. కానీ అవి కాగితాలకు మాత్రమే పరిమితం అన్న భావన సర్వే సర్వత్రా అనాదిగా ఉంది. ఆచరణకు, అమలుకు మధ్య ఆమడదూరం ఉండడటమే ఈ దేశాన్ని ఎన్నో దశాబ్దాల పాటు ఏదో ఒక రూపంలో అవిచ్ఛన్నంగా పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ విలక్షణత.
దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆచరణీయ సూత్రం ఏకవ్యక్తి పాలన కింద చిత్తశుద్ధితో పనిచేయడం! అధినేత వ్యక్తిగత ఇష్టాఇష్టాలను అనుసరించి పార్టీ కార్యకలాపాలు కొనసాగడం, అందుకు అనువుగా సభ్యులు అత్యంత సులువుగా స్వీయాభిప్రాయాలను సైతం మార్చేసుకొనేందుకు కించిత్తైనా జంకకపోవడం కాంగ్రెస్ గంగలో మునిగి తేలే ప్రతీ భక్త శిఖామణీ నరనరానికి వంటబట్టించుకునే విశిష్ట లక్షణం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగెస్ పార్టీ ప్రధాన లక్షణం జర్మన్ పరిభాషలో నాయకుడి నియంతృత్వానికి ప్రతీకగా వాడే ఫ్యూరర్ ప్రిన్జిప్(Führerprinzip). అధినేత నోటిమాటే అన్ని నియమనిబంధనలను కొట్టవతల పారేసే ఆఖరి వేదవాక్కని ఈ పదానికి అర్థం. ’77- '79 ల మధ్య కాలంలో ఈ తరహా ఫ్యూరర్ ప్రిన్జిప్ అత్యున్నత దశను మనం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా చూడవచ్చు.
1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ ఘోరమైన ఓటమిని చవిచూసారు. పార్టీలోని పెద్దకాపులందరూ అందరూ ఆమె పని ఇక అయిపోయినట్లుగానే భ్రమపడ్డారు. ఇందిరమ్మకు సైతం కొంత కాలం కాంగ్రెస్(కె)..['కె' అక్షరం కాసు బ్రహ్మానందరెడ్డికి సంకేతం] ఛత్రం కిందనే స్తబ్దుగా ఉండపోవలసి దుస్థితి. సమయం బిగువును కొంత సడలనిచ్చి క్రమంగా ఇందిర పార్టీ పగ్గాలకై మళ్లీ పట్టుబట్టడం ప్రారంభించింది. కాసువారి తరహాలో ఖద్దరు అంగీ, గాంధీ టోపీలతో కనిపించే సీనియర్లు చాలామంది ఆరంభంలో ఆమె కోరికను ఆట్టే పట్టించుకోని మాట నిజమే. ‘77 డిసెంబర్ 31.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సందర్భం. సరిగ్గా ఆ ముహూర్తానికి ముందు అర్థ రాత్రి ఆమె సభాప్రాంగణం నుంచి హఠాత్తుగా నిష్కమించింది. వెళ్లే ముందు కలవదలచినవారికి తాను ‘గ్లాస్ హౌస్’ పాయింట్ వద్ద లభ్యమవుతానని ప్రకటించడం విశేషం. ‘గ్లాస్ హౌస్’ అప్పట్లో బెంగుళూరు మొత్తంలో ముఖ్యమైన ఫోకల్ పాయింట్లలో ఒకటి! కొద్ది సేపటికే యూ.పి కి చెందిన కమలాపతి త్రిపాఠి, వెస్ట్ బెంగాల్ ప్రముఖ నేత సుబ్రతోముఖర్జీ, మరొక ఇద్దరు ముఖ్యమైన సీనియర్ నేతలు వెళ్లి ‘మేడమ్ గాంధీ’ జట్టులో చేరిపోయారు. ఇందిరమ్మ నేతృత్వంలో వెంటనే కాంగ్రెస్ (ఐ) ఉనికిలోకి వచ్చినట్లు ప్రకటన జారీ అయింది. ఆనాటి రాజకీయ గందరగోళ వాతావరణంలో మళ్లీ చురుకుగా ముందుకు చొచ్చుకు వచ్చేందుకు ఇందిరాకాంగ్రెస్ కు ఆట్టే సమయం కూడా పట్టింది కాదు. 1980 ఎన్నికలకు చాలా ముందుగానే చాలామంది సీనియర్లు తిరిగి ఇందిరా గూటికి వచ్చేశారు. కాంగ్రెస్ (కె) అంతర్ధానమయి, దాని స్థానంలో కొత్తగా కాంగ్రెస్ (ఎస్) [ఎస్‌-సోషలిష్ట్ కు సంకేతం] పుట్టుకొచ్చినా దాని ప్రభావం నాస్తి. ఇంత తతంగం చూసింది కాబట్టే అప్పట్లో మాధ్యమాలు సైతం కాంగ్రెస్ పార్టీని 'నేతలున్న చోట ఉండే పార్టీలా కాకుండా, అధినేత కూర్చున్న చోట పడివుండే పార్టీగా' అభివర్ణించింది. అవే పరిస్థితులు ఈనాటికీ నెలకొనివున్నాయన్న మాట ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యమే కదా! 1974 లో ఇందిరాకాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా 'ఇందిరే ఇండియా! ఇండియానే ఇందిర' అనే నినాదం సృష్టించాడు. ఆ నినాదం అప్పటికప్పుడు ఎదురు తన్నినా, ‘80ల నాటి ఎన్నికల్లో మళ్లీ ఇందిరమ్మకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టింది కదా! అప్పటి నుంచి 1984 హత్యోదంతం వరకు ఇందిరా గాంధీ ప్రభకు తిరుగులేదన్నట్లుగా పార్టిలోనే కాదు, పార్టీ బైటా హవా సాగింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా కాంగ్రెస్ అంటేనే ఏకవ్యక్తి పాలనకు ఏకైక పర్యాయపదం! 1917 నాటి రష్యన్ల విప్లవం విజయవంతమయిన తరువాత బోల్షవిక్ పార్టీలో వ్లాడిమర్ లెనిన్ ఈ తరహా ఏకఛత్రాధిపత్యం కోసమే వెంపర్లాడింది. అక్కడ అది ఎంత వరకు సాధ్యమయిందో లెక్కకట్టే సమాచారం లేదుకానీ, ఇక్కడ ఇండియాలో మాత్రం కాంగ్రెస్(ఐ) పుణ్యమా అని సహజసిద్ధ ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్(ఐ)కి.. దేశానికి మధ్య భేదమే లేదన్నంత హేయమైన నియంతృత్వపాలన సాగిన మాటైతే వాస్తవం!
పూజ్య బాపూజీ జమానాకు వద్దాం. 1920 మొదలు మరణించిన 1946 చివరి క్షణం వరకు మేకపాలు తాగుతూనే ఉక్కు పిడికిలితో కాంగ్రెస్ ను శాసించిన మహాయోధుడు గాంధీజీ. బాపూజీ ప్రియశిష్యుడు పట్టాభి సీతారామయ్య. ఆయన మీద అఖండమైన మెజారిటీతో నేతాజీ గెలుపొందిన ఆలిండియా కాంగెస్ ఎన్నికలే బాపూ ఏకపక్ష ఆధిపత్య ధోరణికి తిరుగులేని ఉదాహరణ. గతంలో అధ్యక్షుడిగా నేతాజీ ప్రవర్తించిన తీరు బాపూజీకి బొత్తిగా మింగుడుపడింది కాదు. ఆ కారణంగా బోసు అధ్యక్ష హోదాలో సక్రమంగా కుదురుకునే వాతావరణం కల్పించనే లేదన్నది బాపుజీ మీద అభియోగం. 21 మంది సభ్యులతో కార్యనిర్వహణా సమితి ఆరంభించవలసిన సిడబ్ల్యుసి అసలు ఆకారమే ఏర్పరుచుకోవడం అసాధ్యమయ్యే రీతిలో గాంధీజీ ప్రవర్తించిన తీరును చూస్తే నిజమే అనిపిస్తుంది. మహాత్ముని విముఖత దృష్ట్యా ఒక్క సభ్యుడు కూడా నేతాజీ వత్తాసుకు వెళ్లే సాహసం చూపించలేదని, ఆ కారణం చేతనే విరక్తి చెందిన సుభాష్ చంద్రబోస్ ఏకంగా అధ్యక్షపదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పట్టు నుంచి విముక్తిపొందారన్న వాదన ఉంది.

గాంధీజీ మరో ప్రియతమ శిష్యుడు జవహర్ లాల్ నెహ్రూ గురించీ అదే కథ! ఆరంభంలో ఆయన బాపూజీకి పెట్ గా తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా లేడంటారు. క్విట్ ఇండియా ఉద్యమం చివర్రోజుల్లో జాతీయ నేతలు జైళ్ల నుంచి విడుదలయిన నాటి సంఘటన ఒకటి గుర్తుచేస్తారు. రాబోయే ఆరేళ్ల కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కాలానికి అందరూ డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఎన్నికవుతారని భావించారు. అతితొందరలోనే దేశానికి స్వాతంత్ర్యం ప్రకటింపబడే అవకాశం ఉన్నందున ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేతకు మాత్రమే స్వతంత్ర భారతానికి మొదటి ప్రధాని అయే అవకాశం. నాటి నియమనిబంధనల ప్రకారం జరిగిన సంస్థాగత ఎన్నికల్లో తేలిన ఫలితం.. 16 ప్రదేశ్ కాంగెస్ కమిటీలలో ఒక్కటి మినహా తతిమ్మావన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వైపు మొగ్గుచూపాయి. మిగిలిన ఆ ఒక్క ఓటు కూడా జవహర్లాలుకు కాక, ఆచార్య జె.బి.కృపలానీకి దక్కింది. ఏ ఒక్కరి విశ్వాసం సాధించకపోయినా, వల్లభాయ్ పటేల్ ని తొలగిపొమ్మని జవహర్ కే అవకాశం కల్పించారు బాపూజీ! అ విధంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేజిక్కించుకున్న తరువాత మౌంట్ బ్యాటెన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముస్లిం లీగ్ తో సమభాగ స్వామ్యం నెహ్రూజీకే దఖలయింది. సహజంగానే జూన్ 3, 1947 నాటి వైస్రాయిగారి ప్రకటనతో పంద్రాగష్టు’47 నుంచి స్వతంత్ర భారతావని తొలిప్రధానిగా పనిచేసే సదవకాశం జవహర్లాలు నెహ్రూ పరమయింది. క్రమశిక్షణ గల నేతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ బాపూజీ ఆదేశాల మేరకు ఉపప్రధాని హోదాలో నెహ్రూజీకి మనస్ఫూర్తిగా సహకరించారు. జవహర్ లాల్ నెహ్రూ భారతావని తొలిప్రధాని కావడమే కాదు, మరణించిన 1964 చివరి రోజు వరకు జయాపజయాలతో నిమిత్తం లేకుండా తిరుగులేని కాంగ్రెస్ నేతగా రికార్డు సృష్టించారు కూడా. చైనా పాలసీ వైఫల్యం కారణంగా జాతి ఆత్మాభిమానం దెబ్బతిన్నా, విలువైన దేశభూబాగం నవంబర్ 1962 నాటి ఒప్పందం వల్ల కోల్పోయినా, నెహ్రూజీ దేశానికి ప్రధానిగానే ఉండగలిగారు. కాంగ్రెస్ అధినేతగా అదే చెక్కుచెదరని స్థానంలో పదిలంగా స్థిరపడిపోయారు. కాంగ్రెస్ లోని వీరపూజ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఈ తరహా ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అధినేత మీద ఉండే గాఢాభిమానమే నెహ్రూజీని ఆనాడు కాంగ్రెస్ కు అధ్యక్షుణ్ణి చేసింది. అదే తిరుగులేని విశ్వాసం దోషాలతో నిమిత్తం లేకుండా దేశానికీ ప్రియమైన ‘చాచాజీ’గా మార్చివేసింది.
ఇక ఇందిర విషయం. ప్రారంభంలో ఇందిరా ప్రియదర్శిని ఏకైక అర్హత మాజీ ప్రధాని గారాల కూచి కావడమే! ప్రధానిగా ఆమె ఎన్నిక సైతం చనిపోయిన చాచాజీ పట్ల గల అత్యంత గౌరవాభిమానాలే! లాల్ బహదూర్ శాస్త్రిగారి మంత్రివర్గంలో సభ్యురాలు అయినప్పటికీ ఇందిర సీనియర్ కాంగ్రెస్ నేతల దృష్టిలో రాజకీయాల లోతుపాతులు తెలియని ఒకానొక లేత అమాయిక బాలిక మాత్రమే! నిజానికి సంత్ భింద్రేన్ వాలా, అకాల్ తఖ్త్, పంజాబ్ సమస్యల సందర్భంలో మరొకరికి, మరో పార్టీవారికయితే ఖాయంగా పదవీగండం పొంచి ఉండేదే! కానీ కాంగ్రెస్ కల్చర్ ఇందిర పట్ల కార్యకర్తకుండే అచంచల విశ్వాసాన్ని ఇసుమంతైనా కదల్చలేకపోయింది. ఆమెనే కాదు, మరణానంతరం ఆమె బిడ్డ రాజీవ్ గాంధీని సైతం తమ అధినేతగా నెత్తి మీద ఎక్కించుకునేందుకు సంసిద్ధమయింది కాంగ్రెస్ పార్టీ.
ఇందిర హత్య జరిగే సమయానికి రాజీవ్ వెస్ట్ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. రాజకీయాలంటే ఓనమాలైనా తెలియని ఆ యువకుడు తిరిగొచ్చి ‘ఫ్యూరర్’ పదవి చేపట్టే క్షణం వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంతో అసహనంతో ఎదురుచూసింది! దేశాధ్యక్షులు జ్ఞానీ జైల్ సింగ్ విదేశీపర్యటన అర్థాంతరంగా ముగించుకుని వచ్చి, విమానాశ్రయంలో దిగిన నిమిషాలలోనే ఇందిరా పుత్రుడి చేత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు! బి.బి.సి ప్రసారాల ప్రకారం తల్లి మరణానంతరం కేవలం ఆరుగంటల లోపే విశాల భారతావనికి ఆమె కన్నబిడ్డ ప్రధాని రూపంలో ప్రత్యక్షమయ్యాడు! దేశాధ్యక్షుడి దేహంలోని సుశిక్షితుడైన మాజీ కాంగ్రెస్ కార్యకర్త - దివంగత అధినేత బిడ్డయిన కారణాన, రాజీవ్ సందర్భంలో ఆరు నెలలోపు చట్టసభకు ఎన్నికవాలన్న నిబంధన విధాయకంగానైనా ప్రస్తావించలేదు! సిరిపెరంబదూరు దురదృష్ట సంఘటన(1991)కు ముందు ‘89 ఎన్నికలలో కాంగ్ర్రెస్ పరాజయం ఎదుర్కొన్నది. ఆ వైఫల్యానికి రాజీవ్ ను బాధ్యుణ్ణి చేయడం కాంగ్రెస్ కలలోనైనా ఊహించలేని దుస్సాహసం. అప్పటికి దుఃఖంలో ఉన్న గాంధీల కుటుంబం పి.వి ని దేశ ప్రధాని కానిచ్చింది.
ప్రభుత్వ స్థాపనకు 50 ఎం.పి సీట్లు తరుగుపడినప్పటికీ అధ్యక్షస్థానంలో ఉన్నందున పి.వి పట్ల ఎవరూ బహిరంగంగా అవిధేయత ప్రకటించలేదు! గాంధీ కుటుంబేతరుడైనా సరే, పి.వి ని ప్రధానిగా ఉండనీయడానికి కారణం, కాంగ్రెస్ కార్యకర్త నర నరాలలో ఇంకివున్న స్వామిభక్తిపరాయణత్వం. స్వామి ఎవరన్నది కాదు.. స్వామి స్థానం పట్ల విశ్వాసంగా ఉండటం ప్రధానం కాంగ్రెస్ పార్టీ వీరభక్తులకు. పి.వి ప్రధాని అయిన కొద్ది రోజులకే నెహ్రూ మార్క్ ‘50ల నాటి అవాడి సీజన్ సోషలిజమ్ తలకిందులయే ప్రమాదం పొడసూపింది. మరో రెండేళ్లకే రావుగారు సెక్యులరిజానికీ మంగళం పాడే పనిలో ఉన్నట్లు సూచనలు అందడం ఆరంభమయాయి. గాంధీ ప్రవచించిగా, నెహ్రూ ప్రోత్సహించిన సోషలిజమ్ సారం ఆ సెక్యులరిజమ్! బాబ్రీ మసీదు విధ్వంసంలో పాములపర్తివారి పరోక్ష హస్తముందని ముస్లిం మైనార్టీలు గట్టిగా విశ్వసించారు. అయినప్పటికీ ఆయన ప్రధాని పదవి 1996 వరకు ఏ ఢోకా లేకుండానే నడిచింది కదా! తిరిగి గాంధీ కుంటుంబంలోని నేత కోసమై కాంగ్రెస్ పార్టీ వెంపర్లాడుతున్న సమయంలో సోనియా గాంధీ తిరుగులేని మెజార్టీతో దివంగత జితేంద్ర ప్రసాద్ మీద ఆధిక్యత సాధించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆమను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, ఆపద్ధర్మ రూపంలోనో.. కాంగ్రెస్ తమ అధినేత స్థానంలో ఉంచుకుని కొలుచుకునేందుకు సమ్మతిస్తూ వస్తున్నది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న నాయకత్వ సంక్షోభానికీ.. కాంగ్రెస్ పార్టీ తరహా.. కార్యకర్తల్లోని స్వామిభక్తపరాయణత్వమే అంతిమంగా పరిష్కారం చూపించేది. అదే నిశ్చయం.

-కర్లపాలెం హనుమంతరావు

05 -09 -2020

(సూర్య దినపత్రిక సంపాదకీయపుట ప్రచురణ) 

***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...