Wednesday, August 25, 2021

భూపాలరాగం - కర్లపాలెం హనుమంతరావు - కవిత

 పురుగుమందుకు మనుషులంటేనే ఎందుకో అంత ప్రేమ !

విషం మిథైల్ ఐసో సైనేట్ మారు వేషంలో

నగరం మీద విరుచుకుపడిన చీకటి క్షణాల ముందు

హిరోషిమా నాగసాకీ బాంబు దాడులే కాదు

'తొమ్మిదీ పదకొండు' ఉగ్ర దాడులు కూడా దిగదుడుపే !


టోపీల వాడి మాయాజాలమంటే అంతే మరి!

మనకి ఊపిరాడదని మన తలుపుకే కన్నం వేసే కంతిరితనం వాడిది.

అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చి మిరియంమొక్క అడిగినా

కంపెనీవాడొచ్చి మూడడుగుల నేలడిగినా

మన కళ్ళుకప్పి మాడుమీద వాడి జెండా దిగేయ్యటానికే!

మన కండలు పిసికి పండించిన  పంటను ఓడల కెత్తుకెళ్ళటానికే.

అదిప్పుడు పాత కథ.

కొత్త కథలో..

వామనుడు అడగక ముందే  నెత్తి చూపించే అమాయక బలి చక్రవర్తులం మనం

భూమిని చాపలా చుట్టి వాడి పాదాల ముందు పరచటానికి

పోటీలు పడే కలియుగ దానకర్ణులం.

మన రూపాయి ప్రాణవాయువును

వాడి డాలరు బతుకుతెరువు కోసం

తృణప్రాయంగా సమర్పించుకునే

పిచ్చి బేహారులం

వాడి విమానాలు క్షేమంగా దిగాలని

మన వూళ్ళు కూల్చుకుని

రహదారులు విశాలంగా చేసుకునే

విశాలహృదయులం

వాడి నాలిక మడత పడటం లేదని

మన మాటను సంకరం చేసుకునే టందుకయినా సంకోచపడం.

వాడి అణుదుకాణాల కోసం

మన అన్నపూర్ణ కడుపులో చిచ్చు పెట్టుకోటానికయినా మనం సిద్దం.

సార్వభౌమత్వమంటేనే ఒక చమత్కారం

ఆ డాబు దర్పాలకి మురిసి చప్పట్లు కొట్టటమే మనకు గొప్పతనం.

అణుఒప్పందం వల్ల భవిష్యత్తులో జరిగే భారతీయ చెర్నోబిల్ నాటకానికి

పాతికేళ్ళ క్రిందటే ప్రారంభమయింది

భూపాల రాగం… వింటున్నారా!

- కర్లపాలెం హనుమంతరావు 

( Published on 2010, October 5 in 'Poddu'(పొద్దు )- Internet Telugu Monthly Magazine)

About కర్లపాలెం హనుమంతరావు

రచన వ్యాసంగం లో కర్లపాలెం హనుమంతరావు గారిది పాతికేళ్ళ పైబడిన అనుభవం. వందకు పైగా చిన్న కథలు,వందన్నరకు పైగా వ్యంగ్య గల్పికలు (అన్నీ ప్రచురితాలే), డజనుకు పైగా నాటికలు, ఆకాశవాణికి రచనలు... వారి సాహిత్య రికార్డు. సినిమాలకు రచన చేసిన అనుభవం అదనం. "శైలజ కృష్ణమూర్తి-వాళ్ళకింకా పెళ్లి కాలేదు ", "ఫోటో" చిత్రాలకు రచన విభాగంలో పనిచేసారు. మరికొన్ని చిత్రాలకు రచనా సహకారం అందించారు. ఈనాడు ఆదివారం ఎడిటోరియల్ కు రచనలు అందిస్తుంటారు. "ఒక్క నవల మీద తప్ప అన్ని ప్రక్రియల మీద చెయ్యి చేసుకున్నపాపం నాది. స్థిరంగా వుండక కొంత, చేసిన బ్యాంక్ మేనేజర్ వృత్తి వుండనీయక కొంత. మొత్తంగా పెద్దగా సాధించినదేమీ లేదు. వారం వారం ఈనాడులో మాత్రం దాదాపు పుష్కర కాలం మించి  ఎవరినో ఒకరిని సాధిస్తూ ( వ్యంగ్యం ) కాలక్షేపం చేస్తున్నాను. మధ్యలో ఆంధ్రభూమి వెన్నెల సినిమా పేజీలో కొత్త సినిమాలను సాధిస్తూ కాలక్షేపం చేశాను. కవిత్వం అంటే మరీ ఎక్కువ ఇష్టం కాబట్టి దాన్ని చదువు కోవటం తప్ప సాధించింది తక్కువ .మరీ తప్పనప్పుడు, మనసు మరీ సాధిస్తున్నప్పుడు తప్ప కవితామతల్లి జోలికి పోయే సాహసం చేయను." అని అంటారాయన.

- పొద్దు కవి పరిచయం 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...