Friday, October 1, 2021

పచ్చ నాకుల రాణి వాసపు కవిత కృష్ణశాస్త్రిది - కర్లపాలెం హనుమంతరావు



కృష్ణశాస్త్రి కవిత్వం పై శ్రీ శ్రీ స్పందన - 'ఆస్వాదానికి ఆహ్వనం' శీర్షికతో ' అమృత వీణ'  ముందుపుటల్లో కనిపిస్తుంది.

సముద్రం ఎక్కడ ఉందో తెలీదు. కాని కృష్ణశాస్త్రి సృజించిన ఇక్షురస సముద్రం మాత్రం పురాణాల్లో వర్ణితమయిన క్షీరసాగరానికి వెదుకులాడే అగత్యాన్ని తప్పించింది- అంటాడు అందులో శ్రీ శ్రీ . నిజమా? చూద్దాం!

'వేయ బోవని తలుపు తీయమని పిలుపు /

రాధ కెందుకొ నవ్వు గొలుపు /

నీలోన నాలోన నిదురపోయే వలపు /

మేలుకుంటే లేదు  తలుపు'

 ఇది కృష్ణశాస్త్రి 'కృష్ణాష్టమి' కవితా ఖండికలోని కొన్ని  పంక్తులు. ఖండిక మొత్తం చదివితే శ్రీ శ్రీ ఒలకపోసిన అతిశయోలంకారంలో అతిశయం ఆవగింజంతయినా లేదనే అనిపిస్తుంది. 

 కృష్ణశాస్త్రి కవిత్వంలో  కనిపించే రసం మధురంగా ఉంటుందనేది  సర్వే సర్వత్రా వెల్లడయ్యే భావనే. కాని శ్రీ శ్రీ మరో మెట్టు పైకెళ్లి   మాధుర్యం అంటేనే  అసలు  నిర్వచనం  అనిర్వచనీయమైన   కృష్ణశాస్త్రి కవిత్వం'  అనే భావన వెల్లడిస్తాడు.

'అంతరాంతము నీ అమృత వీణే యైన /

మాట కీర్తన మౌను! /

ఈ అనంత పథాన  /

ఏ చోటి కా చోటు నీ ఆలయ్యమ్మగును, నీ ఓలగ మ్మౌను '

 'అమృత వీణ' ఆలపించే ఈ పంచమరాగం కర్ణపుటాలకంత కమ్మని  విందు చేస్తుంటే అవకాశం లభించినప్పుడు  ఎవరిమైనా శ్రీ శ్రీ మాటకు  వంత పాడక ఉండగలమా! 

'తినగ తినగ వేము తియ్యగ నుండు'. కాని, ఇక్షురసానికి ఆ స్వాదు గుణం లేదు. అదే పనిగా సేవించడానికి పూనుకుంటే రెండు లోటాల పరిమితి దాటితే చెరుకు రసపు తీపైనా వెగటనిపిస్తుంది. కృష్ణశాస్త్రి తన ఇక్షురస కవిత్వానికి ఆ అతిపాన దోషం అంటకూడదు అనుకున్నాడేమో! మిరియాల పొడివంటి ఘాటు ప్రయోగాలు, కరక్కాయల కటువు  తలపించే భాషా ప్రయోగాలు అక్కడా ఇక్కడా చేసి మరీ మహాకవి మాట నిలబెట్టాడు.

'పూజ కంటే వస్తిని, ఏ/

మోజు లేని 'చిన్నవిరిని' /

ప్రభువు కొలువున దాసిని శ్రీ/

పదములకు 'తివాసిని'

'పూల జాతర' అనే కృష్ణశాస్త్రి మధుర పాతరలో  ఇక్కడ కోట్స్ రూపంలో కనిపించే పదప్రయోగాలు, భాషలో .. భావంలో  ఘాటుగానో, కటువుగానో  ఉండటం గమనించాలి. కాకపోతే శాస్త్రిగారి  కలం, గళం నుండి ఎన్నడో గాని ఈ మాదిరి వగరు కాయల వరుసలు కురిసింది లేదు. అదృష్టం. చందమామకైనా చిన్న మచ్చ ఉంటేనే కదా అందం చందం! 

శ్రీ శ్రీ మరో చోట అంటాడూ .. 19వ శతాబ్ది తొలి దశాబ్ది వరకు జిమీందారీ వ్యవస్థకు మాత్రమే ' గొడ్డు'  చాకిరీ   చేసిన  తెలుగు కవిత, కృష్ణశాస్త్రి  పూర్వీకులు రాయప్రోలు, అబ్బూరి వంటి అభ్యుదయ కవుల రాకతో  బంధ విముక్త అయింది. అనంతరం కృష్ణశాస్త్రి తరం నుంచి భావకవిత్వం పేరు మీద యువతరాన్ని ఉర్రూతలూగించిందని. ఏ రసపట్టు కనికట్టు లేకపోతే ఎంత నూత్నమైనదైనా అటు బళ్లారి  నుంచి ఇటు బరంపురం వరకు భావకవిత ఊరికే ఊరేగగలుగుతుందా ?

'ఎడబాసి పోకోయి /

 నీ దాసి నీ రేయి /

ఈ ఎదకు నిముసమే/

నెడబాటు విసమే ' అంటూ ఆ 'జులపాల జుట్టు కట్టుతో సహా భావికవికి ఓ ఆహార్యమంటూ గళసీమకు వేళాడు హార్మోనియంతో తన కంటూ  'ట్రెండు' నొకటి సృష్టించుకోగలడు కృష్ణశాస్త్రి! భావకవిగా కవిలోకాన్ని ప్రభావితం చేసిన  అతగాని ప్రతిభా పాటవాలకు జతకాని  మధుర స్వారస్య సారస్వత వచనాలు   మచ్చుకకు మాత్రమే ఎక్కడో ఒకటీ.. అరా .. అక్కడా.. ఇక్కడా!ఈనాటికీ చెక్కుచెదరని  కృష్ణపక్షం  ఒక్కటి  చాలు భావకవి వైతాళికునిగా కృష్ణశాస్త్రి సాధించిన అర్హతలన్నిటి పైనా ఆమోదా ఆముద్ర ప్రమోదపూర్వకంగా పడేటందుకు.

కాకపోతే ప్రతిభావంతులైన ఏ వైతాళికగణ విజయ యాత్రలకయినా ఆదిలో హంసపాదులా ఆరంభంలో ఆటంకాలు తప్పవు. ఆ రివాజు తప్పకూడదని కాబోలు, ఆ కాలం నాటి మహాపండితుడొకాయన  అక్కిరాజు ఉమాకాన్తమ్ కేవలం కృష్ణశాస్త్రిని వెక్కిరించటానికేనా అన్నట్లు 'నేటి కాలపు కవిత్వం' పేరున ఓ దిక్కుమాలిన గ్రంథం వెలువరించింది.   తెలుగు ఉమాకాంతాన్ని సంస్కృత ఉమాకాన్తంగా చెప్పుకునే ఆ పండితుడికి సంస్కృతంలో తప్పించి  మరెక్కడా కవిత్వం కనిపించని హ్రస్వదృష్టి కద్దు. నన్నయను సైతం కవుల పద్దు నుంచి కొట్టిపారవేయగల సమర్థుల  వక్రదృష్టికి సమకాలీన కవికోకిల కాకిలా అనిపించక మానుతుందా? 

'పలుక లేను పలుక లేను /

భయము సిగ్గు వొడము దేవ ! /

అలయని దయ నా యందే నిలిపి వదలవోయి దేవ! /

మలిన  మలిన బ్రతు కిది; పలుక లేను నీ నామము' వంటి చిలుక స్వరాలతో రాసి పాడినా నాటి  బ్రహ్మసమాజ ఉద్యమానికి ఊతమిచ్చే వందలాది రసగుళిక పద్యాలు ఎంత హృద్యమయితేనేమి, మడి కట్టుకున్న బధిరాంధ పండితుల చెవులకు దిబ్బెళ్లు  అనిపించవా? 

యువ కవి లోకమంతా ఉత్తమమైనదంటూ సంభావించిన వృక్షరాజపు కొత్త శాఖ భావకవిత. ఆ కొమ్మ నుంచి మొలకెత్తిన మరో కొత్త చివురు చూసి మండిపడే నైజముండే ఏ పండితలోకమైన చిర్రుబుర్రులాడక తప్పదు.వేదుల సత్యనారాయణ వంటి ఎన్నో కవి కోకిలలకు ఆశ్రయమిచ్చిన ఆ నూతన తరుశాఖ మీదనే మొగ్గ పూవైన చందంగా  భావకవి కృష్ణశాస్త్రి అందాల భావలోకం కనులు విప్పార్చింది .  కాబట్టే  'పచ్చ నాకుల రాణి  వాసపు /

పడతినే, సంపెంగనే / 

సరసులను, సామంతులను /

నా స్వాదు  వాసనా పిలుచునే '( పూల జాతర) అని  ఎలుగెత్తి పాడినా  చెల్లించుకోగలిగింది. రస పిపాసువుల హృదయాలకు  అదే కొత్త రాగాల  విందయింది.

'నేటి కాలపు కవిత్వ౦' పుస్తకానికి  కొనసాగింపుగా అనంతపంతుల రంగస్వామి  అనే మరో వెకిలి కవీ 'కృష్ణపక్షం'  పూర్వపక్షంగా 'శుక్లపక్షం' అనే మరో వెక్కిరింత పద్యకావ్యం వెలయించాడు. ఆ రోజుల్లోనే వేదుల  వంటి ఉద్దండ భావకవులు 'సారస్వతారిష్టం అనే శుక్ల నష్టం' గా ఛీత్కరించిన 'శుక్లపక్షం' ఉమాకాన్తమ్ గారి కావ్యం పక్కనే బూజుగూటిలో మగ్గిపోయింది.

'నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?/

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?/

కలవిహంగమ పక్షముల దేలియాడి/

తారకా మణులలో తారనై మెరసి/ 

మాయ మయ్యెదను నా మధురగానమున!' అన్న కృష్ణశాస్త్రి మాటే  అతని భావకవిత సాధికారతను  అచ్చంగా నిజం చేసింది.   

నాటికే కాదు నేటికీ శాస్త్రిగారి భావకవిత్వపు బాణి తెలుగు సాహితీ రాణి పాదాల పారాణి అనడంలో  అందుకే అతిశయోక్తి రవ్వంతైనా లేదు అనేది!

-కర్లపాలెం హనుమంతరావు

01 - 10-2021

బోథెల్ ; యూ ఎస్.ఎ

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...