Sunday, August 2, 2026

మనీ పర్సు


 కథ 

మనీ పర్సు 

-కర్లపాలెం హనుమంతరావు 

టాక్సీని ఇంటిముందు ఆపుతుండగా వెనకసీట్లో ఉబ్బెత్తు  మనీపర్సు  కనిపించింది. నిజం చెప్పద్దూ..  సంతో కన్నా ముందు కలిగింది భయమే. 

ఇప్పుడేం చెయ్మటం? టాక్సీ ఎక్కిన ఏ ప్రయాణికుడిదో  అయివుండాలి ఈ పర్సు. పొద్దుట్నుంచీ టౌన్లో కనీసం పది రౌండ్లన్నా  వేసుంటా. వందమందికి తక్కువ ఎక్కుండరు టాక్సీలో.   ఎవరిదై వుంటుందీ పర్సు? కనిపెట్టేదెట్లా? అప్పటికే చీకటి పడింది. 

డబ్బంటే ఎవరి కుండదు కనక ఆశ ? అందునా నా లాంటి బక్క జీవులకు.   కాకపోతే గతంలో ఎదురైన  చేదు అనుభవం  ఇప్పుడు జంకేలా చేస్తోంది. 

ఒకసారి ఎవరో లేడీ పేసింజర్ టాక్సీలో వదిలేసి పోయిన  బట్టల సంచీకి కక్కుర్తి పడ్డా. నాజూకుగా ఉందని  అందులోని ఓ చీరె మీద మోజుపడింది సావిత్రి. రెండు రోజులు కట్టుకు ఊరేగింది. మూడోనాటికల్లా  వళ్ళంతా ఒహటే దద్దుర్లు. అదేపనిగా గోకుతుంటే చూడ్డానికి వికారంగా  అనిపించింది . వంటా వార్పూ .. ఇంటిపని గట్రా చక్కబెట్టుకోవలసిన  మనిషి. ఎందుకైనామంచిదని  ఆసుపత్రికి  తీసుకెళ్ళా.  వెయ్యినోటు  వదిలిందాకా ఆమె వంటి మీద చీడ వదిలింది కాదు. 

ఆ అనుభవం తరువాత కొన్నాళ్ళ పాటు  టాక్సీ ఎక్కిన వాళ్ళ వివరాలు  అడిగేవాణ్ణి ఎందుకైనా మంచిదని.  టాక్సీలో వస్తువు మర్చిపోతే అసలు ఓనరుకు   అది చేరాలని    నా ఉద్దేశం.  కాని  ప్రయాణికులు   చాలమంది వివరాలు అడిగితే   దెబ్బలాటకు  దిగేవాళ్ళు. నాకెందుకులే  ఈ లేనిపోని తద్దినం అనిపించి చివరికి విచారించటాలూ అవీ  చాలించేశా.  

టాక్సీలోని మనీపర్సును చేతిలోకి తీసుకున్నప్పుడు నా చిన్ననాట జరిగిన ఒక సంఘటన మనసులో మెదిలింది. తొమ్మిదో తరగతి వేసంగి  సెలవుల్లో మా మామయ్య గారి ఊరుకెళ్ళినప్పుడు ఎదురైన అనుభవం అది. మ్యాట్నీకని శేష్ మహల్ థియేటరుకు బంగారం కొట్ల  సందుకుండా పోతుంటే  దారిపక్కన తూము కాలువ దగ్గర  రంగు కాగితాల చుట్ట  ఒకటి  కనిపించింది. అందులో బంగారమేమన్నా  ఉంటుందనిపించి ఎవరి కంటా పడకుండా ఆ కాగితం చుట్టను  జేబులో కుక్కుకొని  ఒక్క ఉదుటున ఇంటికొచ్చి పడ్డా . తీరా పొట్లం విప్పిచూస్తే అందులో కనిపించింది  ఎవరో త్రాష్టుడు  వాడి పారేసిన  కండోమ్స్ ! నా దురాశకు నాకే  చచ్చే సిగ్గేసింది. పరాయి సొమ్ముకు పాకులాడితే ఇట్లాగే చెడేదో  జరుగుతుందని అప్పట్నుంచీ నాకో గుడ్డి నమ్మకం. 

ఇన్నాళ్ళకు మళ్ళీ అప్పటిలాంటి సంఘటనే  ఎదురయింది. పాడు పర్సును ఉన్న చోటే వదిలేస్తే?

నాకన్నా బేవకూఫ్ ఇంకోడుండడు అనిపించింది .    రేప్పొద్దున్న కారు కడిగేటప్పుడన్నా పర్సు  బైటికి తియ్యాలి కదా?  పర్సులోని డబ్బు ఎవడి కంట పడ్డా అంతకు మించిన డేంజరు మరోటుండదు. అదీగాక  రేపీ టేక్సీ ఎక్కే  ప్రయాణికుడెవరి చూపూ దీని మీద  పడదని గ్యారంటీ ఏంటీ! 

తెలిసి తెలిసి   ఒకరి సొత్తు మరొకరి పాలవుతుంటే చూస్తూ గమ్మునుండటం నా వల్లయ్యే పని కాదు. 

 ఏ సంగతీ తరువాత తేల్చుకోవచ్చని  పర్సు తీసుకొనే ఇంట్లోకడుగు పెట్టా.  లోపలికొచ్చీ రాగానే  నా వంకా   పర్సు వంకా మార్చి మార్చి చూసింది సావిత్రి. రోజువారీ  సంపాదన జేబులో వేసుకు రావటం మామూలుగా నాకలవాటు .   అందుకు భిన్నంగా నా చేతిలో పర్సుండటం   చూసి ఆమె కళ్ళింత చేసుకొని చూసింది. అమాంతం మీద పడి పర్సు గుంజేసుకొంది. 

ఆత్రంగా తెరిచి దాన్నిండా కరెన్సీ నోట్లుండటం చూసి ఏం జరిగిందో ఇట్టే పట్టేసింది. 

'పాపం, ఏ పుణ్యాత్ముడు ఇవాళ  పాపం చేసుకొన్నా డో? ' అంది బైటికి తీసిన నోట్లు  లెక్క పెడుతూ. 

ఆమె ఏమాలోచిస్తుందో నాకు తెలుసు . 

'సావిత్రీ! పరాయి సొమ్ము పాముతో సమానం. ఎవరి కష్టార్జితమో అది.   మన సుఖాలకు వాడుకోవటం అన్యాయం' అన్నా ఆమె నైజం తెలిసి కూడా. 

'బావుంది. నా సంబడాలకేమన్నా వాడుతున్నానా? అప్పులోళ్ళు రోజూ ఇంటి మీద కొచ్చి పడి ఎంతలా   యాగీ చేస్తున్నారో నీకేమన్నా తెలుసా? తెల్లారంగానే టింగు రంగా అంటూ బైటికెళ్ళి ఊరేగే   పెద్దమనిషివి.. నీకేం తెలుస్తాయీ ఇంట్లో ఆడోళ్ళు  పడే అగచాట్లూ ?'  అని అందుకొంది మహాతల్లి. 

'నా మాట ఎట్లాగూ నీ బుర్ర కెక్కదని    తెలసనుకో ! అయినా చెబుతున్నా .. ఇదంతా మనం నీతిగా  సపాదించిన   సొమ్ము కాదు. . ' 

‘అబ్బో! అక్కడికీ  లోకంలో అంతా నీతిమంతంగానే  సంపాదించి నిజాయితీగా బతికేస్తున్నట్లూ! నువ్వింత దద్దమ్మవు  కాబట్టే ఈ కొంపిట్లా పశువుల కొష్టంలా  తగలడింది. చంటాడి  సంగతి నీకసలేనాడైనా పట్టిందా?  నడ్డి మీద  చడ్డీ లేకుండా బజార్లెంట పడి తిరుగుతున్నాడు ఛండాలంగా!  నా మాయదారి   జబ్బు  ఎట్లాగో చావనీయి..  ముందు  .  నీ అవతారమన్నా అద్దంలో  చూసుకోరాదా ఓసారి. ఎండిపోయి రోజు రోజుకూ బెండు ముక్కలా గయిపోతున్నావ్' 

‘అర్థమనక కాదు ఆమె కడుపులో ఎంత బడబాగ్ని రగులుతుందో ? అయినా మనది కాని సొమ్ము సొంతానికి  ఎట్లా వాడుకోవటం!'

ఆమాటే అన్నాను.. కాస్త మొండిగానే . 

'మనది కాదా? మరి ఇదేవున్నా మనం దోచుకొచ్చిన సొమ్మా? ఎవడో బలిసినోడు టాక్సీలో వదిలేసాడు. అట్లాగని మనం  కూడా దొరికింది పరాయి సొమ్మని  పారేసుకుంటామా?' 

'చాల్లే గోల'విసుగనిపించింది  ఆమె ధోరణికి. 

గయ్యిమని లేచింది ఇంతెత్తున. 'నాదా  గోలా? నీ బుర్రే బాగా పుచ్చి పోయింది. అదే నీకర్థమవటంలా' 

'అయితే ఏమంటావ్?' గుడ్లురిమి అరిచా. 

'ఖర్మకాలి ఎవడో పోగొట్టుకున్నాడు. అదృష్టం కొద్దీ మనకు దొరికింది. ఇంటి ఖర్చులకు వాడుకొందామంటా'  

'మనది కాని సొమ్ము  వాడుకోవటానికి నేను ముమ్మాటికీ వప్పుకోను' 

'ఆహాఁ! అయితే ఈ ధనరాసులతో దొరగారేం చేస్తారో? ' 

'ఓనరు కనపడితే తిరిగిచ్చేస్తా. లేదంటే బాలాజీ గుడి హుండీలో వదిలేసొస్తా' 

'నాకు బదులు గుళ్ళో పూజారి వాడుకొంటానికా  నీ నీతి డబ్బు? ' 

'గుడి మెట్ల మీద పడి అడుక్కోనే బీదా బిక్కీ కిచ్చేస్తానే.. లేకపోతే' 

'మనకు  మించిన బీద చచ్చినోళ్ళున్నారా ఈ  లోకంలో ?! ' 

'ఏదేమైనా సరే! చచ్చినా నిన్నీ  డబ్బు  వాడనివ్వను కాక వాడనివ్వను' 

'వాడితే?' 

ఆ పెడసరానికి నా సహనం చచ్చిపోయింది. నిజం చెప్పద్దూ .. చెయ్యెత్తి  చెంప మీద ఒక్కటిచ్చుకొన్నా. 

దాంతో తను మరింత రెచ్చిపోయింది. గొంతు రెండింతలు  పెంచి తిట్లకు  లంకించుకొంది నన్నింకా  రెచ్చగొట్టటానికి . 

అప్పటికే ఇరుగూ పొరుగూ ఒకటికి రెండు సార్లు లోపలికి తొంగి చూసిపోతున్నారు . 

ఇహ నేనేం చేస్తున్నా నో నాకే తెలీలేదు. ఎన్నడూ లేంది..  తన  కొప్పు పట్టుకొని  ఓ మూలకి ఈడ్చేశాను. ఇంకొక్క క్షణం అక్కడ నిలబడ బుద్ధికాలేదు. 

ఇన్నేళ్ళ కాపురంలో ఎప్పుడూ నేనంత  ఘోరంగా ప్రవర్తించింది లేదు. విసురుగా నా గదిలోకి దూరి   తలుపేసుకొన్నా. 

ఈ గోలకి ఏడేళ్ళ చింటూ  లేచినట్లున్నాడు . తల్లి అట్లా కుళ్ళి కుళ్ళి ఏడవటం పాపం.. ఆ పసివాడు  ఎన్నడూ చూసి ఎరగడు. 

'ఎందుకమ్మా ఏడుస్తున్నావూ?   నాన్న నిన్ను కొట్టాడా? ' అని అడిగాడు అమాయకంగా. 

సావిత్రి నుంచి సమాధానం రాలేదో నిమిషం పాటు. తర్వాత వినపడ్డాయి  చిన్నగా చంటికి తను చెప్పే మాటలు. ఆ మాటల్లో మునుపటి  ఏడుపు జీర లేదిప్పుడు . 

పిల్లవాడిని    చిన్న గొంతుతో అడుగుతున్నది, 'చంటీ! నువ్వెప్పుడైనా  పెద్ద  పెద్ద రూపాయి నోట్లు  చూశావా ? ' 

'లేదమ్మా.. ఎప్పుడూ చూడలేదు' అంటున్నాడు చంటి. 

'అయితే.. ఇవిగో చూడు! ఇది ఐదు వేల రూపాయల నోటు. ఈ రెండేమో  రెండువేల రూపాయల నోట్లు. ఇవన్నీ . . ఈ బొత్తి అంతా..  అయిదు వందల రూపాయల నోట్లేరా కన్నా!' 

సావిత్రి గొంతులోని  వణుకు స్పష్టంగా వినిపిస్తోంది. 

'అమ్మయ్యో ! ఎన్ని రూపాయలో! ఇవన్నీ నావేనా  అమ్మా  ? ' 

‘కాదురా  నాన్నా' 

'మరి నీవా?' 

'కాదురా!' 

'నాన్నవా?' 

'కాదు. ఇవన్నీ దేవుడివిరా చంటీ! రేపు నాన్న దేవుడికిచ్చేస్తాడు. అందుకే నిన్నింత మొద్దు  నిద్దర్లో కూడా  లేపి  చూపించటం. పెద్దయింతరువాత నువ్వూ ఇట్లాంటి నోట్లు బోలెడన్ని సంపాదించాలి.  సరేనా! ఇహ బబ్బో!' అంది వాడి తల్లి. 

సావిత్రి గొంతులో రాత్రి గయ్యాళితనం లేదు. 

తెల్లారి లేచి డ్యూటీ కెళ్ళే ముందు కొక్కేనికి వెళ్ళాడే ఖాకీ చొక్కా వేసుకొంటుంటే జేబు ఉబ్బెత్తుగా కనిపించింది. చేత్తో తడిమి చూస్తే.. నిన్న ఇంట్లో అంత కల్లోలం రేపిన మనీ పర్సు .. చల్లంగా చేతికి తగిలింది.

***

03-08-2026




మనీ పర్సు

 కథ  మనీ పర్సు  -కర్లపాలెం హనుమంతరావు  టాక్సీని ఇంటిముందు ఆపుతుండగా వెనకసీట్లో ఉబ్బెత్తు  మనీపర్సు  కనిపించింది. నిజం చెప్పద్దూ..  సంతో కన్న...