Sunday, February 7, 2021

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' - సందేశం

 

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకంలో నేటి కాలానికీ వర్తించే మతసామరస్య సందేశం ఉంది.

 జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకం చదివారా?

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకం చదివారా? పోనీ విన్నారా దాన్ని గురించి?

కాశ్మీరు ప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగం అధికరణ 370 ని గురించి మళ్ళీ చర్చ రేగిన ఈ సందర్బంలో ఈ నాటకానికి ఎంతో 'రెలెవెన్సు' ఏర్పడింది అనిపిస్తుంది.

ఈ నాటకంలో ఏడ్చిన బొమ్మ ఎవరో కాదు. దానం, శీలం, క్షమ, వీరం,ధ్యానం, ప్రజ్ఞ- ఈ ఆరింటికి అధిదేవతగా బౌద్ధులు ఆరాధించుకునే షట్పారమితా దేవి .

గౌతమీ పుత్ర శాతకర్ణి వైదిక మతానుయాయి. రాజ్యంలో భిక్షాటనం చేసుకుంటూ ధర్మ ప్రబోధనలతో జీవనం సాగించే భిక్షుకుల మూలకంగా వైదిక కర్మకాండలమీద ప్రజల  విముఖత్వం ప్రబలుతోందని భావిస్తాడు. పాలన చాటున అకర్మలని, అవినీతిని పెంచి పోషించే ఒక వర్గంవారి దుర్బోధనలు చెవి కెక్కించుకుని భిక్షువులను చెరసాలల పాలు చేస్తాడు. రాజుగారి తల్లి గౌతమి, కోడలు వాసిష్టి భిక్షువులకు విముక్తి కలిగిస్తారు. 'నా రాజ్యంలో నా మతం మినహా మరేదీ ఉండేందుకు నేను సహించను' అని అహంకరించే పుత్రుడిని మందలించే సందర్భంలో తల్లి గౌతమి చెప్పిన మాటలు పాలకులంతా  గుర్తుంచుకో దగినవి. 'ఇంత సువిశాలమైన భూమి మీద ఒకటే మతం, ఒకటే జాతి, ఒకటే లక్ష్యం అంటే అసలు సాధ్యమవుతుందా?శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరమత అసహనం ఏ పాలకులకూ మేలు చేయదు' . ఇప్పటి మన సమాజానికీ..ప్రభుత్వాలకీ కూడా వర్తించే మంచి మాటలు ఇవి.

మతానికి సామాహిక స్పర్శ ఉన్నంత మేరా ప్రభుత్వాలు ప్రమేయం పెట్టుకున్నా ఇబ్బంది లేదు. అంతకుమించిన జోక్యం చేసుకుంటే మాత్రం  రాజ్యం సంక్షోభాల పాలయి.. శాంతిభద్రతలకు  విఘాతం కలిగి అవసరమైన అభివృద్ధి కుంటుబడుతుంద'న్న బాధతోనే బొమ్మ ఏడ్చించిందని రచయిత ప్రతీకాత్మకంగా(సింబాలిక్) సూచించాడనిపిస్తుంది.   హెచ్చరిక పెడచెవిన పెట్టేందుకు లేదు. 'అధికార విస్తరణ కాంక్షతో నిరపరాధుల్ని శిక్షించ బూనుకున్నా ధర్మం నశించి మనుషులకే కాదు.. రాతి బొమ్మలకూ రోగాలూ.. రొష్టులూ తప్పవ'ని రాజమాత గౌతమి చేత చెప్పించడం అతిశయోక్తి అనిపించినా.. చేదు వాస్తవం కఠినహృదయాలకు ఎక్కాలంటే ఈ మాత్రం సాహిత్య సాముగరిడీలు చేయక తప్పదు. తప్పు కాదు.హత్తుకునేటట్లు చెప్పడమే ముఖ్యం. ఒక సంభాషణ మధ్యలో ఆచార్య నాగార్జునుడి ద్వారా రచయిత చెప్పించిన సందేశం ఈ నాటకానికి ఇప్పటికీ ప్రాశస్త్యం ఉండేటట్లు చేసింది. 'ఆ బొమ్మ(ధర్మ దేవత)మనుషుల మనసుల్లో మెదిలినంత కాలం లోక కళ్యానికి లోటు రాదు' అనేదే ఆ సందేశం.

ఆర్టికల్ 370ని గూర్చి విస్తృతంగా చర్చ జరుగుతున్న నేటి సందర్బంలో ఆ బొమ్మ 'ఏడుపు' ఎవరూ విస్మరించరానిది.




డా॥ జి.వి.కృష్ణరావు (కృష్ణారావు కాదు)  హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గుంటూరు జిల్లా, కూచిపూడి (అమృతలూరు) గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. తెనాలి . వి. యస్. ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా, ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ డైరెక్టరుగా పని చేశాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశారు. కళాపూర్ణోదయం సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందారు.

చిల్లర పద్యాలు -పొట్టి కథ -కర్లపాలెం హనుమంతరావు

 



 

ఒక చాందస కవిగారు అష్టకష్టాలు  కోర్చి తారాశశాంకం మళ్ళీ పద్యాల్లో రాసాడు. మొత్తం కథనంతా ఏడొందల యాభై పద్యాల్లోకి కుదించాడు. పుస్తకంగా అచ్చేయించి అమ్మకాలకు బయలు దేరాడు. కళాబంధువు అని బిరుదున్న ఒక వ్యాపారిగారిని కలుసుకుని ఇలా విన్నవించుకున్నాడు" అయ్యా! అత్యంత ఆహ్లాదకరమైన శైలిలో తారాశశాంకుల శృంగార గాథను ఏడొందల పద్యాల్లో రచించాను. పుస్థకం వెల కేవలం పాతిక రూపాయలు మాత్రమే. అంటే పదిపైసలకు మూడేసి పద్యాలు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు తినే చాక్లెట్టు కూడా అర్థ రూపాయి పెడితే గాని రెండు రావడం లేదు. మీ బోటి కళాపోషకులు కనీసం ఒక డజను గ్రంథాలన్నా కొనాలండీ!"  అని విన్నవించుకున్నాడు గడుసుగా.

 

ఆ కళాపోషకుడుగారు అంతకన్నా గడుసుపిండం." అయ్యా కవిగారూ! పదిపైసలకు మూడు పద్యాలంటే కారు చవకేనండీ! కొనడం న్యాయమే. కాకపోతే మీరు కాస్త ఆలస్యంగా వచ్చారు. నిన్ననే రెండు రూపాయలు పోసి సుమతీ శతకం కొనుకున్నా! అందులో నూరు పద్యాలకు తోడు కొసరుగా మరో పదహారు పద్యాలున్నాయండీ! మీ లెక్కన పది పైసలకు ఐదేసి పద్యాలు. ముందు వాటిని నమిలి హరాయించుకోనీయండి. అప్పుడు మీ పద్యాల పని పడతా! వట్టి చేతులతో పండితులను పంపించడం శుభం కాదన్నారు పెద్దలు. కనక పోనీ.. ఈ అర్థ రూపాయితో ఓ పదిహేను పద్యాలు మీ చేత్తోనే మంచివి ఏరి ఇచ్చి పోండి. రుచి బాగుంటే ఈసారి వచ్చినప్పుడు టోకున తీసుకుంటా" అన్నాడు.

"ఇంకా పద్యాలను చిల్లరగా అమ్మడం లేదు లేండి" అని మెల్లగా జారుకున్నాడా

పండితులుం గారు.*

Saturday, February 6, 2021

కథానికః దానకర్ణుడు రచనః కర్లపాలెం హనుమంతరావు

 




స్థానికబాబు!

పేరు ఎంత చిత్రమో మనిషి అంతకన్నా విచిత్రం. ముఫ్ఫై ఏళ్ళకిందట తగిలిందీ క్యారెక్టరు నాకు.. నెల్లూరుజిల్లా ఓ మూరమూల పల్లె చెరువుపల్లెలో బ్యాంకు మేనేజరుగా ఉద్యోగం చేసే రోజుల్లో!

పొగాకు పండిస్తుంటారా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో.  పొగాకు బోర్డు, మా బ్యాంకు, పోలీస్ స్టేషను, ఓ ఉపతపాలా కార్యాలయం, చిన్నసైజు ప్రాథమిక పాఠశాల.. ఇవీ ఆ ఊళ్లోని  ప్రభుత్వ సంబంధ సంస్థలు. పోలీస్ స్టేషనులో కానిస్టేబులుగా పనిచేయడానికి వచ్చినవాడు స్థానిక బాబు తండ్రి.

బదిలీలు ఎక్కడికి వచ్చినా అతని కుటుంబం మాత్రం చెరువుపల్లెలోనే! మంచినీళ్ళుకూడా సరిగ్గా దొరకని ఆ మారుమూల పల్లెమీద ఆ పోలీసాయనకు ఎందుకంత ప్రేమంటే.. బూబమ్మ అని సమాధానం  చెప్పాల్సుంటుంది.

బూబమ్మ మొగుడు దుబాయ్ లో పనికని వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదు. వంటరి ఆడది. వయసులో ఉన్నది. ఎట్లా కుదిరిందో జత! పబ్లిగ్గా పగటిపూటే బూబమ్మ ఇంటికి వచ్చిపోతుండేవాడు పోలీసాయన. ఎన్ని ఫిర్యాదులు వెళితేనేమి.. బూబమ్మని మాత్రం వదిలింది లేదా పోలీసు బాబు. కట్టుకున్నదానిమీద మూడో రోజుకే మొహం మొత్తే  పురుషపుంగవులు దండిగా ఉన్న రోజుల్లో.. ఉంచుకున్న మనిషి మీద అంత ప్రేమ పెంచుకోవడం అంటే.. స్థానికబాబు ‘బాబు’ది విచిత్రమైన క్యారక్టరనేగా అర్థం! ఆ అబ్బ లక్షణాలే పుణికిపుచ్చుకున్నాడంటారు బిడ్డ కూడాను.

పోలీసాయనకు, బూబమ్మకు పుట్టిన బిడ్డ స్థానిక బాబన్నది బహిరంగ రహస్యమే! బూబమ్మ మొగుడు పనిమాలా దుబాయినుంచొచ్చి బూబమ్మను చంపడానికి కారణం ఈ స్థానిక బాబేనని ఊళ్ళో అనుమానం. తల్లి పోయినా బిడ్డ  పోలీసాయన పంచ పట్టుకుని వదలకపోవడంతో ఆ అనుమానం వట్టిది కాదని  తేలిపోయింది.  

పోలీసాయన బతికున్నంత కాలం స్థానిక బాబు దర్జా చూడాలి.  పాముకాటు తగిలి ఆయనగారు పోయిన తరువాత అతని కుటుంబమూ ఊరొదిలి వెళ్ళిపోయింది. స్థానిక బాబుని ఊరుకు వదిలిపోయింది. అప్పటికా యతిమతం బిడ్డకి పదిహేనేళ్ళు.  

ఏ తల్లయినా  జాలి దలచి ఇంత పెడితే తినడం.. బట్టలిస్తే కట్టుకోడం.. పోలీసాయన పోయిన పాడుబడ్డ క్వార్టర్సులో కాళ్ళు ముడుచుకు పడుకోడం.. ఇదీ స్థానిక బాబు దినచర్య. 

అమ్మా, అయ్యా లేని అనాథ పిల్లలందరి కథలాగే ఉంది కదా స్థానిక బాబు కథా! ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? అక్కడికే వస్తున్నది.

స్థానిక బాబు చేతిలో ఎవరైనా పాపమని ఓ రూపాయేస్తే.. అందులో ఓ పావలాకి బిళ్ళలు కొని బడికెళ్లే పిల్లలందరికీ పంచిపెడతాడు! పొగాకు చేలో  పని దొరికి నాలుగు రూకలు కంటబడటం పాపం.. అందులో సగం పాపల గాజులు, పూసలు, బొట్టు బిళ్ళల్లాంటి  అలంకరణలకు అర్పణం! నీళ్లబావి దగ్గరో.. చేలగట్ల మీదో  నిలబడి వచ్చే పోయే ఆడంగుల వెంటబడి మరీ పందేరాలు చేస్తాడు. ‘వద్దం’టే ఏడుస్తాడు. ఐనా మొండికేస్తే,  అమ్మలక్కల పేరుతో బూతులకి దిగుతాడు. కొట్టడానికి వస్తే తన్నులు తినటానికైనా సిద్దమేకానీ.. ఇచ్చిన సామాను ఎదుటివాళ్ళు తీసుకున్నదాకా పీకిపాకాన పెట్టడం మాత్రం ఖాయం.

అక్కడికీ ఎవరో పోలీసు స్టేషనులో కంప్లయింటుకూడా ఇచ్చారు. ఐనా ఏమని లోపలేయాలి  పోలీసులు? దొంగతనాలా? చేయడు. ఆడవాళ్ళని అల్లరి పెట్టడాలా? వేలేసి ముట్టను కూడా ముట్టడు సరికదా.. ఏడిపించేటప్పుడు కూడా ‘అక్కా! అక్కా!’ అని ఏడుస్తాడు! పోనీ.. ఎవరిమీదైనా  కాలుదువ్వే గుణమున్నదా? కోపమొచ్చినప్పుడు తన మీద తప్ప తన ప్రతాపం ఎదుటి మనిషిమీదెప్పుడూ చూపించి ఎరగడు!  కొట్లాటలంటే తగని భయం. శాంతిభద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నాడని కేసు బుక్ చేసి కొట్లో వేయాలి?! అక్కడికీ ఊరి జనాలని సంతృప్తి పరచాలని ఏదో స్యూసెన్సు కేసుకింద.. వూరికే బెదిరించడానికని..  రెండు రోజులు లాకప్పులో వేసేసారు స్టేషనాఫీసరు. చెరలో ఉన్నప్పుడు హోటల్నుంచి భోజనం తెప్పించి పెడితే.. అందులోని పప్పు, కూర.. ఎస్సైగారిని తినమని ఒకటే పోరు. ఆయన తిన్నట్లు నటించిం దాకా ఏడుపులు.. పెడబొబ్బలు! రెండు తగిలించినా వెనక్కి తగ్గలేదా మొండిఘటం! ఒకసారా..  రెండుసార్లా? భోజనం, చాయ్ వచ్చినప్పుడల్లా అదే రచ్చయితే పాపం ఎస్సైగారు మాత్రం  తట్టుకొనేదెట్లా?  తలనొప్పి పడలేక  విడుదల చేసేసారు చివరికి. అప్పట్నుంచీ ఎవరైనా స్థానిక బాబుమీద కంప్లయింటు ఇవ్వడానిగ్గాని వస్తే.. ఏదో సర్ది చెప్పి పంపించడమే! వేరే యాక్షన్లు.. సెక్షన్లు  లేవు పోలీసుల వైపునుంచి.

 

చెరుకుపల్లి బాంబే హైవేమీదుంటుంది. నెల్లూరునుంచి వెళ్ళే వాహనాలన్నీ ఆ ఊరుమీదనుంచే  వెళ్ళాలి. రోడ్లు ఎప్పుడూ రద్దీనే. బస్సులు స్టాండులో ఆగినప్పుడు కొబ్బరిపుల్లల చీపురుతో బస్సు కదిలిందాకా శుభ్రం చేసేవాడు స్థానిక బాబు. ప్రయాణీకులు జాలిపడి ఇచ్చిన డబ్బుల్తో జీళ్ళు, పళ్ళులాంటివి కొనేవాడు. తరువాత వచ్చిన బస్సులో ఎక్కి కనబడ్డవాళ్లకిచ్చి తినమని బలవంతం చేసేవాడు. ముక్కూమొగం తెలీని మనిషి. అందునా గలీజుగా ఉండే శాల్తీ ఇచ్చేవి  ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? తింటారు?  ఎవరు తీసుకోకపోయినా బండి దిగడే స్థానిక బాబు! ఊరికే తీసుకోడం చాలదు. దాచుకుంటే కుదరదు.  తన కళ్లెదుటే నోట్లో వేసుకోవాలి! పారేస్తే   తిరిగి ఏరుకుని వచ్చి మరీ తినమని బలవంతం చేస్తుంటే ఏం చేయాలి?

స్థానిక బాబు సంగతి తెలిసిన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు.. సాధ్యమైనంతవరకు అతను బండి ఎక్కకుండా చూసుకునేవారు. కన్నుగప్పి ఎక్కితే మాత్రం అతనిచ్చిన చెత్తను కళ్ళుమూసుకునైనా నోట్లో వేసుకోవాల్సిందే ప్రయాణికులు! లేకపోతే ఏమవుతుందో  ముందే హచ్చరించేవాళ్ళు బస్సు సిబ్బంది.

ఎలా వచ్చిందో .. స్థానిక బాబు విషయం  దినపత్రికల్లో వచ్చింది. జిల్లా ఎడిషన్లలో.. ఫొటోలతో సహా! విలేకర్లు చేసిన ఇంటర్వ్యూల్లో  ప్రయాణీకులనుంచి స్థానిక బాబును గురించి చాలా ఫిర్యాదులే వచ్చాయి. విషయం జిల్లా కలెక్టరుగారి దాకా వెళ్లడం.. స్థానిక బాబును నెల్లూరు  పిచ్చాసుపత్రికి తరలించడం జరిగాయి ఒకసారి.

నిజానికి స్థానిక బాబుకి ఏ పిచ్చీ లేదు.. ఆయాచిత దానాలతో జనాలని పూర్తి స్పృహలో ఉన్నప్పుడే వేపుకుతినడం తప్ప. పిచ్చిలేని వాళ్లను పిచ్చాసుపత్రివాళ్ళు  మాత్రం ఎంతకాలమని భరించగలరు?  పథ్యంగా ఇచ్చే మందుల్ని.. ఆహారాన్ని తోటి మానసిక రోగులకు బలవంతంగా తినబెట్టడం..  తినడానికి మొరాయిస్తే  తన్నడానిక్కూడా పస్తాయించకపోవడం! అక్కడికీ స్థానిక బాబు కాళ్లకి చేతులకి గొలుసులు వేసారు ఆసుపత్రివాళ్ళు. కానీ ఆహారం ఇవ్వడం తప్పనిసరికదా! తనకని ఇచ్చిన ప్లేటులో సగం  తెచ్చిన మనిషి తింటేనేగాని.. మిగతా సగం తను తినేవాడుకాదు స్థానిక బాబు. ఎన్నడూ లేని ఈ కొత్త అనుభవంతో బెంబేలెత్తి పోయింది ఆసుపత్రి సిబ్బంది మొత్తం. రోజూ ఈ బాధలు భరించేకన్నా అనధికారికంగా రోడ్డుమీద వదిలేసి.. తప్పించుకుని పారిపోయినట్లు రికార్డులో రాసుకోవడం మేలనుకున్నారు మెంటలాసుపత్రి అధికారులు. అదే చేసారు.

స్థానిక బాబు ఏరియా ఆఫ్ ఆపరేషన్ చెరువు పల్లే. ఎక్కడ  వదిలేసినా చెరువులో చేపలాగా చివరికి చెరువుపల్లిలోనే తేలడం అతనికి అలవాటు. స్థానికబాబు లేని రెండు నెలల్లో ఊళ్లో ఎన్నడూ లేనిది గుళ్ళో అగ్నిప్రమాదం జరగడం, ఊరు ఒక్క బావినీరూ ఉప్పులకు తిరగడం,  గుండ్రాయిలా  తిరిగే సర్పంచి చిలకలయ్య ఆరోగ్యం గుండాపరేషనుదాకా విషమించడంతో   యాంటీ- సెంటిమెంటొకటి బైలుదేరింది. పల్లెల్లో ఇది చాలా కామన్. స్థానిక బాబును  కదిలిస్తే ఊరుకు ఏదో మూడుతుందన్న భయం పెరిగి ఊడలు దిగింది జనం మనసుల్లో! మునుపటిలా  అతని జోలికెళ్ళడం పూర్తిగా తగ్గించేశారీ సారి జనం అందుకే.

ఊరి సెంటిమెంటుతో ఫ్లోటింగు పాప్యులేషనుకేం సంబంధం? బస్సులో నాలుగు రూకలు జమవగానే  స్థానిక బాబు జీళ్ళు, పళ్ళ ప్రహసనం మళ్లీ మొదలు! కథ ఇక్కడ ఉన్నప్పుడే నేను చెరువుపల్లికి బదిలీ మీద వెళ్ళింది. స్థానికబాబు సంగతులు అప్పటికి నాకూ పూర్తిగా తెలీవు.

ఆర్థిక సంవత్సరాంతం. బ్యాంకు పద్దుల్ని సమీక్షించే పనుల్లో ఉన్నాం. బ్యాంకు కాతాలను సరిచూడటమంటే ఒక్క రుణకాతాలను సమీక్షించడమే కాదు. డిపాజిట్ కాతాలనూ  సరిచూసుకోవాలి. గడువు ముగిసిన తరువాత కూడా మూడేళ్ళ వరకు ఎవరూ వచ్చి క్లెయిమ్ చేయని డిపాజిట్లని హెడ్డాఫీసు పద్దుకి బదిలీ చేయాలని అప్పట్లో రిజర్వు బ్యాంకు రూలు. కాతా ఒకసారి బదిలీ అయిన తరువాత హక్కుదారులు వచ్చి క్లెయిమ్ చేసినా .. వాటిని తిరిగి చెల్లించడానికి బోలెడంత తతంగం నడిపించాలి. కాతాలను పైకి పంపించే ముందు ఒకటికి రెండుసార్లు తరచి చూసుకునేది అందుకే.

ఆ పనిలో ఉన్నపుడే బైటపడిందా డిపాజిట్! చనిపోవడానికి మూడేళ్ళ ముందు పోలీసాయన చేసిన డిపాజిట్ అది. స్థానిక బాబు పేరున పాతిక వేలు. డిపాజిటరు మేజరయిన తరువాత వడ్డీతో సహా మొత్తం  నేరుగా అతనికే చెందే నిబంధనతో ఉందది. జత చేసిన స్కూలు సర్టిఫికేట్ ప్రకారం స్థానిక బాబుకి  ఏ ఎనిమిదేళ్లో ఉన్నప్పుడు చేసిన  పదేళ్ల  డిపాజిట్! మెచూరయి కూడా మూడేళ్ళు దాటిపోయి ఉంది. వడ్డీతో కలిసి గడువు తేదీనాటికే  దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉంటుంది.  ఈ మూడేళ్లకు అదనంగా మరో పాతిక వేలు!

రికార్డుల ప్రకారం స్థానిక బాబు   మూడేళ్లకిందట మేజరే.  అయినా  ఆ సొమ్ము ఎందుకు చెల్లించలేదో?! స్థానిక బాబుకి బహుశా ఈ డిపాజిట్ సంగతి తెలిసుండదు. తెలిసుంటే తీసుకుని  ఈ పాటికి ఎప్పుడో అవగొట్టేసుండేవాడే! అప్పటి బ్యాంకు మేనేజరుగారు ఎందుకు ఈ విషయంలో చొరవ చూపించనట్లు? బ్యాంకు ప్రారంభంనుంచి స్వీపరు పనిచేస్తున్న ఆంజనేయులద్వారా అసలు విషయం బైటపడింది.

డిపాజిట్ మొత్తాన్ని అప్పగించాలని అప్పటి మేనేజరుగారు భావించినా .. సర్పంచి చిలకలయ్యగారొచ్చి  సైంధవుడిలా అడ్డుపడ్డారుట. ' ఆ పిచ్చాడి చేతిలో ఇంత మొత్తం పడితే .. ఊరు మొత్తాన్ని ఉచిత దానధర్మాలతో గడగడలాడించేస్తాడు సార్! అ గోలను తట్టుకోవడం నా వల్లకాదు. నేను చెప్పేదాకా  డిపాజిట్ విషయం అలాగే గుట్టుగా ఉంచ’మని చిలకలయ్యగారు  వత్తిడి చేసారుట. గ్రామ సర్పంచిగారి మాట తీసేసే ధైర్యం అప్పటి మేనేజరుగారు చూపించలేదు కాబట్టే   ఇప్పుడు వ్యవహారం మొత్తం నా నెత్తిమీదకొచ్చి పడింది!

అక్కడ డిపాజిటరు చేతిలో చిల్లిగవ్వలేక బస్టాండులో అడుక్కుతింటూ.. పాడుబడ్డ కొంపలో కాలక్షేపం చేస్తుంటే.. ఇక్కడ అతగాడికి న్యాయంగా దక్కాల్సిన సొమ్ము తొక్కిపెట్టడం న్యామమేనా? బ్యాంకువాళ్ళకు  ఆ హక్కు ఎక్కడుంది?!

ఆ రాత్రంతా నాకదే మధన. పాతమేనేజరుగారి దారిలోనే పోయి ఆ డిపాజిట్ ను హెడ్డాఫీసుకి బదిలీ చెయ్యడమా? మానవత్వపు  కోణంలో.. బ్యాంకు వృత్తిధర్మంగా ..  స్థానిక బాబును పిలిచి సొమ్ము స్వాధీన పరచడమా? రెండోదే ఉత్తమ మార్గమని మనసు పోరుతోంది. పోనీ..  సర్పంచిగారిని పిలిచి సలహా అడిగితేనో? మొదటిదానికే ఆయన మొగ్గు చూపుతారని తెలుస్తూనే ఉంది. ఎలాగూ తను ఆ సలహా పాటించదలుచుకోనప్పుడు పిలిచి ఎందుకు అదనంగా కొరివితో తల గోక్కోవడం!

మర్నాడు స్థానిక బాబును పిలిపించి డిపాజిట్  స్వాధీనపరుస్తూ 'వృథాగా ఎందుకు డబ్బు తగలేయడం? బ్యాంకులోనే ఉంచుకో! అవసరానికి సరిపడా తీసుకుని వాడుకో! మంచి బట్టలు వేసుకో! కడుపునిండా తిను! నిశ్చింతగా ఉండు! ఊరి జనాలను వేధిస్తే నీకు వచ్చే ఆనందం ఏముంది?' అంటూ మందలింపులతో కూడిన సలహా ఒకటి ఇచ్చాను  నా ధర్మంగా.

'హిఁ.. హిఁ.. హిఁ' అని నవ్వాడు ఎప్పట్లాగానే. 'మొత్తం  కావాల్సిందే!' అన్నాడు చివరికి మొండిగా!

ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసి లక్షా చిల్లర అతని సేవింగ్స్ బ్యాంక్ కాతాలో వేసి పాసుబుక్ ఇవ్వడం మినహా ఇంక నేనుమాత్రం చేయగలిగేదేముంది? ఆ పనే చేసాను.

అప్పటికప్పుడు యాభై వేలు డ్రా చేసుకుని  మా స్టాఫు చేతుల్లో తలా ఓ వెయ్యి పెట్టాడు. 'తీసుకోక పోతే ఏడుస్తాడు. బ్యాంకునొదిలిపెట్టడు సార్!' అని   ఆంజనేయులు గొడవ పెడుతుంటే  తీసుకోక తప్పింది కాదు. ' 'హిఁ.. హిఁ.. హిఁ' అనుకుంటూ అతగాడటు  వెళ్ళగానే ఇటు మళ్ళా అందరం అతని కాతాలోకే ఆ సొమ్ము జమ చేసేశాం!

స్థానికబాబు చేతిలో డబ్బు పడ్డట్లు ఉప్పందింది ఊళ్లో. సర్పించిగారొచ్చి చాలా నిష్ఠురంగా మాట్లాడారు. 'చేతిలో చిల్లికాణి లేనప్పుడే ఊరును అల్లల్లాడించేసాడు వెధవ. ఇప్పుడింత డబ్బంటే వాణ్ని పట్టడం మా తరమవుతుందా? వాడి ప్రాణాలను గురించైనా ఆలోచించుండాల్సింది సార్ మీరు!అనంగానే నివ్వెర పోవడం నా వంతయింది. నా కా కోణం తట్టనందుకు బాధేసింది. భయమేసింది.  పోలీస్ స్టేషనాఫీసరుగారితో నాకు కొద్దిగా పరిచయం ఉంది. ఆయన దగ్గర ఈ విషయం కదిపితే నవ్వుతూ కొట్టిపారేసారు 'రాజుకన్నా మొండివాడు బలవంతుడంటారు. వాడంతట వాడు లొంగితే తప్ప మా తుపాకులు కూడా వాడినేం చెయ్యలేవులే సార్!' అని భరోసా ఇచ్చిన మీదట మనసు కాస్త కుదుట పడింది.

అంత డబ్బు చేతిలో పడ్డా స్థానిక బాబు వింత ప్రవర్తనలో  ఏ మార్పూ లేదు. చిరుగుల చొక్కా జేబులోనే డబ్బుకట్టలు కుక్కుకుని తిరగడం! ఇదివరకు స్కూలు పిల్లలకు ఇచ్చే పైసా బిళ్ళలకు బదులు పుల్లల ఐస్  క్రీములు కొనిస్తున్నాడిప్పుడు.  ఆడవాళ్ళను కూడా  వట్టి బొట్టుబిళ్ళలు, హెయిర్ బేండ్లతో సరిపెట్టకుండా రవిక గుడ్డలు, పౌడరు డబ్బీలతో  వెంటబడి తరుముతున్నాడు. కాకా హోటల్లో భోజనం చేసేటప్పుడు పక్క విస్తరిలో అనుపాకాలు వేసి తినమని బలవంతపెట్టడం ఇదివరకు మల్లేనే సాగుతున్నదికానీ.. ఇదివరకు మల్లే జనం చీదరించుకోవడం బాగా తగ్గించేసారు. సర్పంచిగారే చొరవ చేసి వాడు రాత్రిళ్లు పడుకునే పాడుబడ్డ పోలీసు క్వార్టర్సుని బాగు చేయించారు కూడాను.

మునపటంత ముదనష్టంగా లేదు ఇప్పుడు స్థానిక బాబు జీవితం. స్థానిక దర్జీ పుణ్యమా అని వంటి మీదకు నదురైన దుస్తులు అమిరేయి. స్థానిక బాబు జీవితంలో వచ్చిన ఈ మంచిమార్పుకు కొంతవరకు నేనూ కారణమే! ఆ ఊహ నా అహాన్ని కొంత సంతృప్తి పరిచిన మాటా నిజమే!

కొత్త ఎపిసోడ్ లో విచారించదగ్గ విషయం ఒక్కటే. స్థానిక బాబు చపలచిత్తం మాత్రం  చెక్కుచెదరకుండా అలాగే ఉండడం! రోజూ పొద్దున్నే బ్యాంకుకు రావడం.. ఓ రెండువేలు డ్రా చేసుకుపోవడం! ఆ డబ్బంతా ఏమవుతుందో! మళ్ళా మర్నాటికి వట్టి చేతులతో హాజరు! ఈ లెక్కన కాతా ఖాళీ అవడానికి ఇంకెన్నో రోజులు పట్టకపోవచ్చు!

సర్పంచిగారొక సారి బ్యాంకుకొచ్చినప్పుడు చెప్పిన విషయాలు వింటే షాక్ అవక తప్పదెవరికైనా!

'స్థానిక బాబు  దానగుణం ఇప్పుడు కొత్త ఏరియాలకు పాకింది సార్! సరిగతోటల్లోకి పోయి పేకాటరాయుళ్లకు డబ్బు పంచిపెడుతున్నాడు. సాయంకాలం అవడం పాపం..   సారాదుకాణం ముందు చేరి అడిగినాళ్లకి, అడగనాళ్లక్కూడా మందు పోయిస్తున్నాడు! ఊరు మళ్ళా పాతమంగలం అయేట్లుంది. అందుకే అన్నది.. మీరు మరీ అంత ముక్కుసూటిగా పోకుండా ఉండాల్సిందని అప్పట్లో!'

సర్పంచిగారి నిష్ఠురాలు చూస్తుంటే దీనికంతటికీ నేనే బాధ్యుణ్ణి అనేటట్లున్నారు. బ్యాంకు మేనేజరుగా నా ధర్మం నేను నిర్వర్తించడంకూడా తప్పేనా?! ఆ మాటే ఆయనతో అంటే కాస్త వెనక్కి తగ్గారు కానీ ఆయనగారి మనసులో ఇంకా ఏదో నలుగుతోంది. ఆ ముక్క చెప్పడానికే  పనిగట్టుకొని వచ్చినట్లుంది. 'సరే! అయిందేదో అయింది సార్! ఇప్పుడా పాత పంచాంగాలిప్పుకుంటూ కూర్చొంటే ఫలితమేముందికానీ..  ఇకముందైనా ఆ మిగతా సొమ్ము ఏదో వంకతో బిగబట్టేయండి సార్! వాడి తిండితప్పలు.. మంచిచెడ్డలు ఏదో విధంగా మనం చూసుకుందాంలేండి! రేపు వాడికేదన్నా నిజంగా ముంచుకొస్తే.. ఆదుకోడానికైనా అక్కరకొస్తుందా సొమ్ము. అసలా పొద్దు ఆ పోలీసాయన ఈ ఉద్దేశంతోనే వీడి పేరన ఈ డిపాజిట్టు చేసింది ' అని  వెళ్ళిపోయారు..

ఆయన అన్నమాటలోనూ  సబబుంది. కోట్లు కోట్లు దేశం సొమ్మును కొల్లగొట్టి పెద్దమనుషులుగా చెలాయిస్తున్నవాళ్ళను చూస్తున్నాం. ప్రజాహితం కోసం ఒక్క పైసా విదల్చని పరమ పీనాసి సన్నాసులు  సైతం ఆర్భాటపు వేడుకల్లో దానకర్ణులన్న పేరు కాపీనం కోసం ఒక్క పైసా ఇచ్చి వందరూపాయల కీర్తిలాభం కొట్టేయడమూ చూస్తున్నాం. అడక్కుండానే దానమిస్తానని వెంటబడి వేధించే చిత్రమైన దానకర్ణుణ్ణి మాత్రం ఈ చెరువుపల్లిలో తప్ప బహుశా ఇంకెక్కడా చూడబోమేమో! మూడేళ్ళుండి పోయే సర్కారు ఉద్యోగిని. నాకిదంతా అవసరమా? రేపు నిజంగానే ఈ స్థానిక బాబు ప్రాణానికేదైనా అయితే  జీవితాంతం ఆ అపరాధ భావనతో కుమిలి చావాల్సింది నేనే!  ఇంకీ కథ ఇక్కడితో ముగించడం మంచిదనిపించింది.

మర్నాడు డబ్బు డ్రా చేసుకోవడానికని వచ్చిన స్థానిక బాబుతో   'బ్యాకు వడ్డీలెక్కలో పొరపాటు జరిగి పెద్దమొత్తం నీ కాతాలో పడిందయ్యా! ఇప్పుడు సరిచేసాం.  ఇదే నీ చివరి మొత్తం. ఏం చేసుకుంటావో నీ ఇష్టం' అంటూ ఓ  రెండువేలు అతని చేతిలో పెట్టి పాస్ బుక్కు వెనక్కి తీసేసుకున్నాం. ఎప్పటిలాగానే 'హిఁ.. హిఁ ..హిఁ' అని నవ్వుకుంటూ డబ్బులు పుచ్చుకుని  వెళ్ళిపోయాడు. అప్పటికి నిజానికి అతగాడి కాతాలో ఇంకా యాభౖవేలకు పైగానే సొమ్ముంది.

స్థానిక బాబు తరుఫున ఏదైనా మానసిక వికలాంగుల సంస్థకు విరాళమిచ్చి అవసరమైనప్పుడు అతగాడిని ఆదుకునే బాధ్యత అప్పగించాలన్నది ఎప్పట్నుంచో సర్పంచిగారి ఆలోచన.

ఒక వారంరోజుల సెలవు మీద నేను మా ఊరుకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి వ్యవహారమంతా పూర్తిగా తలకిందులయిపోయి ఉంది!

బాంకు కాతాలోని సొమ్మంతా డ్రా అయిపోయింది! ఎంతసొమ్ము చూపెట్టుకుంటూ ఊళ్లో తిరిగాడో కానీ.. బస్టాండు వెనకాల  పొదల్లో సగం శవమై తేలాట్ట స్థానిక బాబు. పొద్దున పొద్దున్నే ఏవో మూలుగులు వినబడుతుంటే అనుమానం వచ్చి వెళ్ళి చూసారుట అటువైపుకి బయలుకి వెళ్లే ఆడంగులు.  కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థానిక బాబు కనిపించాట్ట! అతగానికేమైనా అయితే ఊరికే వినాశనమని గదా ఊళ్లో జనం భయం! పనులు మానుకుని మరీ  అందుకే నెల్లూరు పెద్దాసుపత్రిలో చేర్పించారుట అందరూ కలసి స్థానిక బాబుని. అన్నింటికన్నా విచిత్రం .. మొదట్నుంచి స్థానికబాబు మంచి చెడ్డలు చూసిన సర్పంచి చిలకలయ్యగారీ సందట్లో ఊళ్లోనే  లేకపోవడం!  మూడోసారి గుండెపోటొచ్చిందని చెన్నయ్ అపోలోలో చేరి అప్పటికి నాలుగో రోజు. 'ఎంత ఖర్చైనా సరే.. మళ్ళీ మనుషుల్లో పడేటట్లు చెయ్య'మని ఆయనగారి బంధుబలగమంతా పెద్దడాక్టర్లను పట్టుకుని ఒక పట్టాన వదల్లేదుట అక్కడ! 'డబ్బు పోస్తే పాడైపోయిన గుండెకాయలు  బాగవుతాయిటయ్యా?  పేషెంటుకి ఇప్పట్టున  కావాల్సింది కరెక్టుగా సెట్టయి ..  పనిచేసే గుండెకాయ. అదెక్కడుందో ముందు వెళ్ళి  పట్టుకు రండి.. పోండి' అని కూకలేసారట చికాకు తట్టుకోలేక డాక్టర్లు.

ఇన్ని వివరాలు  చెప్పిన క్యాషియర్ గుప్తా మరో అనుమానమూ అన్యాపదేశాలంకారంలో   నసుగుతూ వెళ్లగక్కాడు  ‘.. ఆ మర్నాడే స్థానిక బాబు బస్టాండు వెనకాల పొదల్లో సగం శవమై తేలడమూ!.. అదీ  సర్పంచిగారి భార్య చూడామణమ్మగారి  కంటనే పడడమూ!’

‘స్థానిక బాబుకి డబ్బిచ్చినందుకు మీతో అన్ని నిష్ఠురాలు పోయారు గదా  సర్పంచిగారు! వాళ్ళబ్బాయి  సాంబశివరావే దగ్గరుండి, మాతో దెబ్బలాడి మరీ డబ్బంతా ఆ దానకర్ణుడి చేత  డ్రా చేయించాడు సార్!’ అంటో ఇంకో స్టేటుమెంటుకూడా అంటించాడా గుప్తా!

‘అదంతా ఏమోగానీ.. స్థానికబాబు  బతకడం అసాధ్యమని  తేల్చేసిన నెల్లూరి ఆసుపత్రి డాక్టర్లకు  చెన్నయ్ లో సర్పంచిగారు ఎడ్మిటయిన ఆసుపత్రితో కూడా ఎప్పట్నుంచో లింకులున్నాయని ఊరంతా ఒకటే గుసగుసగా ఉంది సార్!’ అన్నాడీ పక్కనుండి క్లర్కు  ఏడుకొండలు మరంత రెచ్చిపోతూ.

‘ఊరికి అరిష్టం తప్పాలంటే ఎట్లాగైనా ఆ స్థానిక బాబుని ఊరి పొలిమేరలు దాటనీయద్దని కదా  ఊరిపెద్దల కట్టడి పంచాయితీలో! అందుకే.. స్థానికబాబు గుండెకాయని సర్పంచిగారికి మార్చాలని కూడా తీర్మానం చేస్తిరి!  ఇప్పుడిట్లా మళ్ళా తిరకాసుగా మాట్లాడితే  ఎట్లా?’ అంటూ కోపానికొచ్చాడు ఆంజనేయులు.

 ఆంజనేయులు మాటంటే ఊరి సెంటిమెంటుకు నిలువుటద్దమే! అదట్లా ఉండనీయండి!  బయోలాజికల్ గా స్థానికబాబు గుండెకాయ చిలకలయ్యగారికి సెట్టయింది ఎట్లాంటి ఇబ్బందుల్లేకుండానే! అదీ ఇక్కడి విశేషం!

‘ఇందులో విశేషమేముందిలే సార్! అంతా ఆ వీరభద్రస్వామి చలవ. ఊరికి మళ్ళా  చెడ్డరోజులు రావద్దని మా ఊరిదేవుడు  తలచాడు. అందుకే ఏ అడ్డంకులూ రాకుండా దయతలచాడు’ అంటో రెండు చెంపలు టపటపా వాయించుకున్నాడు తూర్పువైపున్న ఆ దేవుడి  గుడి వంక భక్తిగా  చూసుకుంటూ ఆంజనేయులు!

రోగి తాలూకు బంధువుల సమ్మతి అవసరమని ఆసుపత్రి వర్గాలు రూలు చెప్పినప్పుడు 'నా అన్న వాళ్లెవరూ లేని అనాథ సార్ వాడు! సర్పంచిగారే ఇంతకాలం వాడిని ‘తండ్రి’లా సాకింది!  స్థానికబాబే గనక స్పృహలో ఉంటే ' హిఁ.. హిఁ.. హిఁ' అని నవ్వుకుంటూ తన గుండెకాయ పీకి సర్పంచిగారికి పెట్టిందాకా  వేధించుండేవాడు. వాడు అపర దాన కర్ణుడు' అనేసిందిట  సర్పంచిగారి సహధర్మచారిణి!

ఇన్నేళ్లయినా నాకింకా  ఆ స్థానికబాబు క్యారెక్టరు మరపులో పడలేదంటే కారణం.. హృదయాన్ని కరిగించే అతగాడి  దానగుణం! దాన్నంటి పెట్టుకునుండే ‘హిఁ.. హిఁ.. హిఁ’ అనే హాసస్వరం!  

‘తండ్రి దగ్గర్నుంచి పుణికిపుచ్చుకున్నాడా రెండు గుణాలు!’ అంటాడాంజనేయులు.

‘నిజమో.. కాదో.. తెలియాలంటే ముందా తండ్రెవరో తేలాలిగా?’ అంటాడు క్లర్కు ఏడుకొండలు.

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


ఆవుల సాంబశివరావుగారి అభిమాన సాహిత్యం గురించి.. కొద్దిగా! - కర్లపాలెం హనుమంతరావు

 




 

పది సంవత్సరాల వయసులో బుద్ధుని చరిత్ర క్లాసు పుస్తకంలో కేవలం పాఠం లాగా మాత్రమే కనిపించినా ప్రముఖ హేతువాది ఆవుల సాంబశివరావుగారి జీవన శైలి మీద పుస్తక పఠనం ప్రభావం చూపించడానికి ఆ తరగతి పాఠమే నాందీ పలికింది. ఒకానొక పత్రికకు వ్యాసం రాస్తూ తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహామహులను ఆయన ఒక వరసలో తలుచుకున్నారు. వేమన, తెలుగుభాష తీపిదనం మరిగిన తరువాత వరస పెట్టి వదలకుండా చదివిన మంచి పుస్తకాలలో మరీ మంచివి అంటూ ..పోతన భాగవతం, భారతం, ఆముక్తమాల్యద, వసుచరిత్రలను అయనే స్వయంగా ఎంచి చూపించారు. అవ్యక్తమైన మానసిక స్వేచ్ఛ కోసమై తపించే కృష్టశాస్త్రి  కృష్ణపక్షం తన భావసరళిని తీవ్రం చేసిందని చెబుతూనే.. తనలో హేతువాద బీజాలను నాటిన  మహిమాన్వితుల పుస్తకాలను తలుచుకున్నారు. త్రిపురనేని రామస్వామిగారి కురుక్షేత్రం, సూతపురాణం, పలుకుబడి గలిగిన నమ్మకాలను ఎట్లా నిలదీస్తుందో అర్థం చెసుకున్నట్లు చెప్పుకొచ్చారు.  విషయం పురాతనమైనదైనా సరే స్వతంత్ర బుద్ధితో ఆలోచించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పే వీరేశలింగంగారి రచనలు యావత్తూ చదివినట్లు చెప్పుకొచ్చారు. దురాచారాలు మనుషులను మానసికంగా ఎంతలా బలహీనపరుస్తాయో తెలుసుకునేందుకు గాను గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం  దొహదం చేస్తుందన్న  విషయం విపులంగా  వివరించుకొచ్చారు. ఒక పక్క చలం, మరో పక్క శ్రీ శ్రీ .. ఒకరు స్త్రీని గురించి, మరొకరుఉ దేశాన్ని గురించి ఎంత నూతనంగా ఆలోచించవలసిన అగత్యం ఉన్నదో కొత్త కొత్త కోణాలలో వివరిస్తుంటే ఉత్తేజితమయిపోయేటంతగా వారి భావజాలంతో మమేకమయినట్లు సాంబశివరావుగారు వివరించారు. ఉన్నవ లక్ష్మీనారయణగారి మాలపల్లితో తన సాంఘిక దృష్టి కోణం దిశ మారిందని స్వయంగా ఒప్పుకున్నారు ఆ లోకాయుక్త. మార్క్స్  ఎంగెల్స్ తో కలసి రాసిన దాస్ కాపిటల్, కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో,  ముందే చదివేసి ఉడటం వల్ల

 హెగెల్స్, కాంటు రచనలు చదివి జీర్ణించుకోవడం సులభమైందన్నది సాంబశివరావుగారి భావన. కొత్తగా అబ్బిన బావుకత వల్ల పరిణతి చెందిన మనసుతో రష్యన్ విప్లవ పాఠాల సారాంశం సరైన మోతాదులోనే వంట పట్టినట్లు చెప్పుకొన్నారు . పదహారు, పదిహేడు శతాబ్దాలలో ఇంగ్లండులో జరిగిన పారిశ్రామిక విప్లవం ప్రజాస్వామిక విప్లవానికి ఎట్లా మార్గదర్శకం అయిందో అవగాహన చేసుకునే పాటి విశ్లేషణాత్మక బుద్ధి, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధం,   ప్రజల హక్కుల కోసం .. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం  ఫ్రెంచి విప్లవం, ఎట్లా సర్వం తెగించి పోరుకు దిగిందో తెలుసుకునే పాటి అవగాహన, థామస్ జఫర్ సన్, రూసో మొదలైన రచయితలు, భావుకులు ఆయా సంఘటనలలో ఎట్లా వైతాళిక పాత్ర పోషించారో ఆ వాతావరణం అంతా మనసుకు ఎక్కించుకునే పాటి బుర్రా బుద్ధీ పెరగడానికి ఎన్నో ఉద్గ్రంథాలు ఎట్లా ఉపకరిస్తూ వచ్చాయో..  ఒక చిరు వ్యాసంలో  స్మృతి రూపంలో వివరించారు. ఏ ఉద్యమంలోనూ ఆర్థిక సమానత్వం  ఎజండా కాకపోవడం ఆవులవారి సునిశిత దృష్టి నుంచి జారిపోకపోవడం  విశేషం.. ఆయన ఉద్దేశంలో ఆర్థిక సమానత్వం భవిష్యత్తులో రాబోయే ప్రగతిశీల ఉద్యమాలకు ఉత్ప్రేరకం మాత్రమే. ఇరవయ్యో శతాబ్ద్దంలో జరిగిన రష్యన్ విప్లవమే సాంఘిక వ్యవస్థను, అందులోని ఆర్థిక ప్రాతిపదికను సమూలంగా మార్చేందుకు ఉపయోగపడిన మొదటి ఉద్యమంగా సాంబశివరావుగారు భావిస్తారు. మార్క్స్ కు  లెనిన్ రాసిన భాష్యం ఈ క్రియానుగతమైన మానవోద్యమాలన్నిటికి  అద్దంపట్టినట్లు ఆవులవారి అభిప్రాయపడుతున్నారు. వీటిని మనసు పెట్టి చదివిన విజ్ఞుడు మానవ స్వేచ్ఛాప్రియత్వానికి, ఆ తరహా స్వేచ్ఛకు ఆర్థిక సౌలభ్యం ప్రధాన భావమవుతుందన్న మూల వాస్తవం తెలుసుకుంటాడన్నది లోకాయుక్త పదవి సమర్థవంతంగా నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆవుల సాంబశివరావుగారు ముక్తాయింపు.

 అప్పటి వరకు సంపన్నుల, సమాజంలో ఉన్నత తరగతుల వారి వ్యవహారంగా సాగుతూ వచ్చిన భారత స్వాతంత్రోద్యమం గాంధీజీ రాకతో ఒక్కసారి దేశప్రజలందరి ఉద్యమంగా స్వరూపం మార్చుకున్న విషయం ఆవులవారి దృష్టిని దాటిపోలేదు. సామాన్య ప్రజల హృదయాలలో కూడా స్వాతంత్ర్య పిపాసను బాపూజీ ఎట్లా రేకెత్తించగలిగారో వెలూరి శివరామ శాస్త్రిగారు బాపూజీ ఆత్మకథను అతిచక్కని సరళ శైలిలో చేసిన అనువాదం చదివి తాను అర్థం చేసుకున్నట్లు సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. గాంధీజీ నిర్మలమైన వ్యక్తిత్వం  సామాన్యుడికైనా అవగాహన అయే తీరులో రాసిన పుస్తకం అది అని ఆవులవారి ఆలోచన. మహాత్ముల జీవితాల పట్ల భక్తి విశ్వాసాలు ఉండే సామాన్య ప్రజకు బాపూజీని మాహాత్మునిగా మలిచి చూపించిన అనువాదం అని ఆవులవారి ఉద్దేశపడ్డారు. ఆసేతు హిమాచల పర్యంతం జన హృదయం మీద బాపూజీ ఎట్లా పీఠం వేసుకు కూర్చున్నారో ఆ పుస్తకం చదివితే తెల్సుస్తుందని ఆయనే ఒకానొక సందర్భంలో ప్రసంగవసాత్తూ చెప్పుకొచ్చిన మాట.. వేలూరివారి పత్రికా రచనలోని పదును పాఠకుల మనసుల్లోకి సూటిగావెళ్లే విధంగా ఉంటుందంటారు ఆవులవారు. స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోకుండా ఉండుంటే జవహర్ లాల్ నెహ్రూ  ఒక గొప్ప ప్రపంచ స్థాయి రచయిత అయివుండేవారని ఆవులవరి ఆలోచన. అంతగా ఆయన రాసిన 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ'ని సాంబశివరావుగారు మధించారన్నమాట!

చరిత్రకు , మానవ చరిత్రకు  నూతన దృక్పథాన్ని ఎత్తి చూపెట్టిన 'ఆర్నాల్డ్ టైన్స్' చరిత్ర అంటే కేవలం ఒక పెద్ద కథ కాదని, మానవ సమాజ గమన వివరంగా తెలియపరిచే సమాచార సాహిత్యమన్న  ఆవులవారి మాట ఆలోచించదగ్గది. చరిత్రను కొత్త కోణం నుంచి చూడటం తనకు నేర్పిన ఆ పుస్తకాన్ని గురించి ఆవులవారు సందర్భం వచ్చిన ప్రత్తీసారీ ప్రశంసించకుండా ఉండలేకపోయారు.  ఏ ఏ ఘట్టాలు మనిషిని ప్రభావితం చేస్తూ వచ్చాయో, సమాజ గమనాన్ని మలుపు తిప్పుతూ వచ్చాయో  ఆ పుస్తకం చదివిన తరువాత తాను మరింత పరిణత దృష్టితో చూడడానికి అలవాటు పడ్డారో సాంబశివరావుగారు చెప్పుకొచ్చిన తీరు ప్రశంసనీయం. నెహ్రూజీ ఆత్మకథకూ  ఆయన హృదయంలో గొప్ప స్థానమే ఉంది. అది కేవలం ఒక నాయకుడి జీవిత చిత్రణ మాత్రమే కాకుండా, ఒక మధుర కావ్యం కూడా ఆవులవారి  దృష్టిలో.

సంపదల మధ్య పుట్టినా సున్నితమైన హృదయం, సునిశిత మేధో సంపద, సత్యాన్ని తెలుసుకోవాలన్న జ్ఞానతృష్ణ, నమ్మిన సత్యాన్ని ధైర్యంగా నిర్భయంగా ప్రకటించే సత్యనిష్ఠ -మనిషిని ఎట్లా మహామనీషిగా మలిచెందుకు దోహదపడతాయో తెలుసుకోవాలంటే  నిరాద్ చౌదరిగారి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాన్ అన్నోన్ ఇండియన్', యం.సి. చాగ్లాగారి 'రోసెస్ ఇన్ డిసెంబర్', లాంటి పుస్తకాలు చదవాలంటారు  ఆవుల. నిరాద్ చౌదరిగారి కథ భారతదేశాన్ని, భారతీయ జీవితాన్ని గురించి తనలో పలు ఆలోచనలు రేకెత్తించిందని  ఆవులవారి ఉవాచ. చాగ్లాగారి ఆత్మకథయితే ఆనాటి దేశపరిస్థితులకు.. ముఖ్యంగా హిందూ ముస్లిముల మధ్య గల సహృదయతకు, న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు ఒక దర్పణం వంటిదని ఆయన అభిప్రాయం. చదివినవారిని ఎవరినైనా సరే తప్ప ఆలోచనల్లో పడవేయకుండా ఉండనీయని గొప్ప స్ఫూర్తిదాయకమైన సాహిత్యంగా  ఆయన కితాబిచ్చిన పుస్తకాలు ఇంగర్ సాల్, బెర్ట్రెండ్ రస్సెల్, వంటి తాత్వికుల పెద్ద రచనల జాబితా!  విశ్వరహస్యాలను, మానవ ప్రకృతిని మౌలికంగా పరిశీలించిన గ్రంథాలు, మనిషిని ప్రధాన వస్తువుగా స్వీకరించిన పుస్తకాలు, తన జీవితానికి తానే కర్త, భర్త అని వాదించే  రచనలు, మానవోన్నతికి భగవంతుని జోక్యం అవసరం లేదని , అసలు అడ్డుగా కూడా దైవభావనలు నిలబడకూడదని, మనిషి పురోగతికైనా, తిరోగతికైనా మనిషే పూర్తి బాధ్యుడని బోధించే రచనలు ఏవైనా సరే ఆవులవారు అమిత ఇష్టంగా చదివి వాటిలోని సారాన్ని వడగట్టి జీవితానికి అన్వయించుకుంటారని అర్థమవుతుంది. ఆ కారణం చేతనే ఆయనకు మానవేంద్ర నాధ్ రాయ్ రచనలు ప్రాణమయ్యాయి.  మౌలికమైన అంశాలనైనా విప్లవాత్మక కోణంలో భావుకత చెదరకుండా సాగిన సాహిత్య ఆవులవారి వ్యక్తిత్వం పై చూపించిన ప్రభావం ఏ కొలతలకూ అందనిది. 

ఆణిముత్యాల వంటి రచనలను జాతికి అందించిన మహామేధావి మానవేంద్రుడన్నది ఆవులవారి ఆలోచన. తాత్విక, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలన్నింటినీ మునుపెన్నడూ ఎరుగని కొత్త కోణంలో తాత్వికుడు ఎం.ఎన్. రాయ్ నిర్వచించిన పుస్తకాలత గాఢమైన పరిచయం ఏర్పడిన తరువాత ఆవులవారిలోని అసలు మానవతావాదికి నూతన రూపం ఏర్పడడం ఆరంభమయిందనేది ఒక సాధారణ భావన. మానవుడు సమాజంలోని అంతర్భాగమే అయినప్పటికి.. ఆ విశిష్ట జీవి స్వేచ్ఛను, శ్రేయస్సును  కాపాడని పక్షంలో సమాజ నిర్మాణం పరిపూర్ణం కాదన్న ఎమ్.ఎన్.రాయ్ నవ్య మానవవాదం ఆవులవారికి మనసుకు హత్తుకున్నది. అటు వ్యక్తి స్వేచ్ఛకు, ఇటు సాంఘిక శ్రేయస్సుకు సమన్వయం  చేకూర్చే  మానవేంద్ర నాధ రాయ్ బావ సరళితో ఆవులవారు పుర్తిగా మమేకమైనప్పటి బట్టి తెలుగువారికి ఒక లోకాయుక్త లౌకిక పరమైన ఆస్తి కింద సమకూరినట్లయింది.

 రాయ్ రచనలు తన మీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదని  సాంబశివరావుగారే  స్వయంగా అనేక సందర్భాలలో తన మనోభావాలను స్పష్టంగా బైటపెట్టిన తరువాత ఆ ఆధ్యాత్మిక  మార్గాన్ని గురించి మీమాంసలకు దిగడంలో అర్థం లేదు. తన లోని హేతువాదికి, బౌతికవాదికి  పురోగమన దృష్టిని కల్పించిందీ ఎమ్,ఎన్.రాయ్ తరహాలో 'సేన్ సొసైటీ' కర్త ఎరిక్ ఫ్రామ్ ది కూడా అని ఆవుల సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. ఎంచుకున్న అంశం ఏదైనా, స్వతంత్ర బుద్ధితో సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను సునిశితంగా పరిశీలించడం 'ఫ్రామ్' పుస్తకాల అధ్యయనం వల్ల కలిగిన లాభం అన్నది  ఆవులవారి అభిప్రాయం.

నోబెల్ పురస్కారం అందుకున్న ఆర్థిక శాస్త్రవేత్త మిరడాల్ ప్రసిద్ధ గ్రంథం 'ఏసియన్ డ్రామా' ఆసక్తితో చదివి ప్రాచ్యదేశాల లోతైన ఆలోచనలను అర్థం చేసుకున్నానన్న చెప్పిన ఆవుల సాంబశివరావు గారి అధ్యయన శైలి పరిశీలిస్తే .. ఆ మహామనవతావాది  పఠన పర్వం ప్రాచ్యుల వేదాల దగ్గరే ఆగిపోకుండా,  తాత్వికుల ఉపనిషత్తులు, అస్తిక షడ్దర్శనాల దాకా సాగినట్లు అర్థమవుతోంది.

 పురోగమనం, జీవం.. చేవ గలిగిన మనిషి  అచరించకుండా వదలించుకోకూడని సృజన వ్యాపారాలు- హేతువాదం, మానవతావాదం అన్నది ఆవుల వారి ధృఢాబిప్రాయంగా గుర్తిస్తే .. ఆ విధమైన మావవతావాదం ఆయనలో రగులకొల్పింది ఆరంభంలో వైవిధ్య భరితమైన వివిధ రంగాలకు చెందిన ప్రపంచ సాహిత్యం అన్న వాస్తవం మనకు అర్థమవుతుంది.  

- కర్లపాలెం హనుమంతరావు

21, నవంబర్, 2020.

(నవభావన -  జీవవాహిని శారద -  పుటలు 46 -  55 -ఆధారంగా)

తిట్టు!.. తిట్టించు! -సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 


వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే  ప్రజస్వాముల వాదం.  లక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.  

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!

తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చస్తార’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద ఆట్టే నమ్మకంలేదు.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకులెమ్మనే నాయకులంతా ఎన్నికల తుమ్ములు వదిలే వరకూ ‘ఓటర్లే దేవుళ్లు’ అంటూ అష్టోత్తరాలు, సహస్రనామాలు  అందుకునేది! నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయిని ఓ మెట్టు కిందికి దిగలాగడవేఁ!

కాసుల పురుషోత్తమం అని ఓ కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులిపేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులా! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మో అయితే, నువ్వే ఏదో  కామితార్థుడివన్నట్లు వీర పోజులా! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకుతో ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుకుంటివి కదా! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీకు ఎందుకయ్యా  పతితపావనుడుల్లాంటి   బిరుదులసలు? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ  దామోదరుడివవే(పనికిమాలినవాడివి) సుమా!’ అంటూంటే.. అది తిట్టో.. మెప్పో తెలీక  ఆ దేవుడు గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు!

దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు నుంచి భక్తుడికి ఠక్కున ఆఫరొచ్చే  జంపింగ్ జమానా ఇది మరి!

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో  మటుమాయం చేసుకోవచ్చు.  ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయలిప్పుడు మరీ పాతకాలం నాటి నాటురథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సాహపడే ఉత్సవ విగ్రహాలు కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా.. ఓటు మిషను మీట నొక్కే మనిషి కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పది, పదిహేనువేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే  పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ ‘స్టేటు’ దాకా ఎగదోసింది. మసిపూసి మారేడుకాయ చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమో గాని, కడుపు మండితే  ఓటరే ఉల్ఫాగా ఊరేగే నేతల ముఖాన కసి కొద్దీ బుడ్ల బుడ్ల సిరా పూసి సీన్లు ఖరాబు చేసే  రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడ పుట్ట బట్టే!  

పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్ బాగ్ చూసాం కదా! అన్నదాతల ఆగ్రహమూ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్టు?  తిట్టి పోసిన వర్గాల మీదనే ఏ అయోథ్య రామయ్యను మించిన వరాల జల్లులు! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు అధికార దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుంది కదా!  అయినా, తిట్లక్కూడాట్లు తెగే సత్యకాలమా.. మన  పిచ్చిగానీ?

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!’ అంటూ చెడ  తిట్టిపోసినా  దేవుళ్ళకూ చీమ కుట్టినట్లైనా నొప్పుండటంలేదిప్పుడు !  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరుతో నోరుజారారనో,  లైంగిక దృష్టితో చూసి వేధించారనో మనిషెంత మధనపడ్డాఅ.. యుద్ధకాండ సిద్ధపడ్డా .. నో బడీ కేర్స్!  కోర్టు బోనుల్లో నిలబడాల్సినవాళ్ళే కోర్టు జోన్ల తరలింపు మీద ప్రకటనలిచ్చేస్తున్నారు! ఎక్కడైనా శాపనార్థాలు వినపడుతున్నాయా? ‘దండుకునే సమయం’ దండగ కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా కూడా  ఉంటున్నదిప్పుడు!

దూర దూరంగా తగలడితే తూలనాడుకొనేటంత పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి మనం. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రావద్దంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్యనే గలాటా జరిగి మాటలు రువ్వుకుంటే.. వింటూ ఎంజాయ్ చేసిన మనం  ఈ నేలబారు నేతల కారుకూతలు  ఏమంత ఎబ్బెట్టనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!   

ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు మందలిస్తే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునూరుకున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట ఎదురు పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు గట్రా విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా మాత్ర్రం తిట్టు వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు మరికాస్త పదును నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనం సైతం తొక్కేసే మూడులో లేరిప్పుడు.  ఈ దుస్థితికి ఎవర్నని తిట్టుకోడం?!

 తిట్టే వాడి మీద వెగటు పుట్టటం మాట అటుంచి..తిట్టించుకొనేవాడి మానసిక పరిస్థితి మీద  వెకిలిగా తయారైన నకిలీ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయిప్పుడు!  వినే ఓటారే తిట్లు  వీనులకు విందనుకునే దశకు వచ్చేశాడు జుట్టూ జుట్టూ పట్టుకునే సీన్లుంటేనే చట్టసభలు సజావుగా సాగినట్లు లెక్క! సమయానికి   సభా ప్రసారాలు సడెన్ గా కట్ అయిపోతే సరదా కోసమా   జనం చిందులేసేదీ?! కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్ పబ్లిక్ బాధ!

కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ మాత్రమే చేసుకుని పరమపదిస్తే నరకంలో కూడా ఎవరూ కనీసం మడతమంచాలవీ వేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వాతలు అదనంగా  వడ్డిస్తారేమో కూడా.

అయినా బూతుపురాణాలన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగమహారాజులు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది! తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని కోట్లమందుంటారో  లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు మాత్రమే ప్రసాదంగా పెట్టించే  పై దేవుళ్ల మీద పెదవి విప్పకుండా    సాటి వాళ్లమనేగా మా మీదిన్ని సూటిపోటీ మాటలు?’ అని వాపోయే నేతలూ తక్కువేం లేరు మరి!

భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించే వేళ పశ్చిమం నుంచి బ్రహ్మముఖతః రౌద్రరసం ఉత్పన్నమయిందని శారదాతనయుడి 'భావప్రకాశం' వాదం. పోతనగారి ఆ ఆరభటీవృత్తి దక్షాధ్వర ఘట్ట ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే   కొత్త నేతల  హింస నచణ?  ఉత్తి పుణ్యానికే వేలెత్తి చూపటానికేనా పాపం ఓటుకు అన్నేసి వేలు దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిని మనసులో అడ్డగాడిదనుకుంటున్నా  ‘గాడ్..గాడ్” అంటూ కాళ్లట్టుకు వసుదేవుళ్లకు మించి  నేతలు వేళ్లాడేదీ?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?  

 

'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' న్నాడు .. 'కొత్త సిలబస్' అనే కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్ కవిత్వాలెప్పుడూ! కానీ  'కొత్త సిలబస్' ఈ కొత్త సెంచరీలో పాతబడిపోయింది.. ఇంకా పాతరేయద్దంటే ప్రగతి ఎట్లా?
బూతు ఉందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలమా? అని మనగలవమా? ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా బొంగరంలా గింగుర్లు కొట్టేదిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటేనే శనిగ్రహం  నిగ్రహం కోల్పోయేది!  స్వగృహం పడగ్గదిలోనయినా సరే చాటుగా ఓ నాలుగు మోటు మాటలు బై హార్ట్ చేసుకునే  బైటికి రావటం బుద్ధిమంతులకు  చాలా బెటర్  ఇప్పుడు! చక్రం తిప్పడమనే చాతుర్యం ఒక్క దాని  మీదే కసి పెంచుకుంటే చాలదీ అధికార కుతి కాలంలో! వక్రమార్గంలో అయినా సరే దానిని సంధించేందుకు ఒక్క క్షణం వెనుకంజ పడకూడదు. పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక పోతే పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితి లేదు ఏ స్థాయి నేతకైనా!.

 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో ''కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే అర్థాంతరంగా గండిపడిందంటారు.  నన్నెచోడుడూ కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపించ బట్టే  యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్నాడని మరో టాక్! తిట్టు వల్ల త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన తెగినట్లు లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా లేకుంటే మాత్రంకుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత పడేదీ కాలంలో. నీతుల నెలాగైనా వెనక్కు తీసుకోవచ్చు గానీ, బూతు కూతలకా వెసులుబాటు లేదీ కాలంలో. పెదవి దాటితే పృథివి దాటినట్లే! ఆ హెచ్చరిక గుర్తున్న ఉత్తర కుమారుడెప్పుడూ  ఉత్తుత్తి బీరాల జోలికి పోడు!  ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతల్లో ‘మాస్టర్స్’ చేస్తే తప్ప సింగిల్ సీటున్న ప్రజాసేనలో అయినా టిక్కెట్ దక్కే అవకాశం నిల్!  

అన్నది అన్నట్లు అరక్షణంలో ప్రపంచం చుట్టొచ్చేసే జెట్ యుగం రోజుల్లో జాతి పిత  బాపూజీ మూడు కోతుల నీతిబోధనలు నమ్ముక్కూర్చుంటే  మాజీ ప్రధాని మన్మోహన్ జీ కెరీరుకు మల్లే చాప్టర్ పూర్తిగా పర్మినెంటుగా క్లోజ్! బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనుకోడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనుకోడమంత అసంబద్ధం.

అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు.

ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని  సందిగ్ధమా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!

-కర్లపాలెం హనుమంతరావు

06 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

(సూర్యదినపత్రిక - ఆదివారం - వ్యంగం)

 

 

                           

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...