Sunday, February 7, 2021

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' - సందేశం

 

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకంలో నేటి కాలానికీ వర్తించే మతసామరస్య సందేశం ఉంది.

 జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకం చదివారా?

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకం చదివారా? పోనీ విన్నారా దాన్ని గురించి?

కాశ్మీరు ప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగం అధికరణ 370 ని గురించి మళ్ళీ చర్చ రేగిన ఈ సందర్బంలో ఈ నాటకానికి ఎంతో 'రెలెవెన్సు' ఏర్పడింది అనిపిస్తుంది.

ఈ నాటకంలో ఏడ్చిన బొమ్మ ఎవరో కాదు. దానం, శీలం, క్షమ, వీరం,ధ్యానం, ప్రజ్ఞ- ఈ ఆరింటికి అధిదేవతగా బౌద్ధులు ఆరాధించుకునే షట్పారమితా దేవి .

గౌతమీ పుత్ర శాతకర్ణి వైదిక మతానుయాయి. రాజ్యంలో భిక్షాటనం చేసుకుంటూ ధర్మ ప్రబోధనలతో జీవనం సాగించే భిక్షుకుల మూలకంగా వైదిక కర్మకాండలమీద ప్రజల  విముఖత్వం ప్రబలుతోందని భావిస్తాడు. పాలన చాటున అకర్మలని, అవినీతిని పెంచి పోషించే ఒక వర్గంవారి దుర్బోధనలు చెవి కెక్కించుకుని భిక్షువులను చెరసాలల పాలు చేస్తాడు. రాజుగారి తల్లి గౌతమి, కోడలు వాసిష్టి భిక్షువులకు విముక్తి కలిగిస్తారు. 'నా రాజ్యంలో నా మతం మినహా మరేదీ ఉండేందుకు నేను సహించను' అని అహంకరించే పుత్రుడిని మందలించే సందర్భంలో తల్లి గౌతమి చెప్పిన మాటలు పాలకులంతా  గుర్తుంచుకో దగినవి. 'ఇంత సువిశాలమైన భూమి మీద ఒకటే మతం, ఒకటే జాతి, ఒకటే లక్ష్యం అంటే అసలు సాధ్యమవుతుందా?శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరమత అసహనం ఏ పాలకులకూ మేలు చేయదు' . ఇప్పటి మన సమాజానికీ..ప్రభుత్వాలకీ కూడా వర్తించే మంచి మాటలు ఇవి.

మతానికి సామాహిక స్పర్శ ఉన్నంత మేరా ప్రభుత్వాలు ప్రమేయం పెట్టుకున్నా ఇబ్బంది లేదు. అంతకుమించిన జోక్యం చేసుకుంటే మాత్రం  రాజ్యం సంక్షోభాల పాలయి.. శాంతిభద్రతలకు  విఘాతం కలిగి అవసరమైన అభివృద్ధి కుంటుబడుతుంద'న్న బాధతోనే బొమ్మ ఏడ్చించిందని రచయిత ప్రతీకాత్మకంగా(సింబాలిక్) సూచించాడనిపిస్తుంది.   హెచ్చరిక పెడచెవిన పెట్టేందుకు లేదు. 'అధికార విస్తరణ కాంక్షతో నిరపరాధుల్ని శిక్షించ బూనుకున్నా ధర్మం నశించి మనుషులకే కాదు.. రాతి బొమ్మలకూ రోగాలూ.. రొష్టులూ తప్పవ'ని రాజమాత గౌతమి చేత చెప్పించడం అతిశయోక్తి అనిపించినా.. చేదు వాస్తవం కఠినహృదయాలకు ఎక్కాలంటే ఈ మాత్రం సాహిత్య సాముగరిడీలు చేయక తప్పదు. తప్పు కాదు.హత్తుకునేటట్లు చెప్పడమే ముఖ్యం. ఒక సంభాషణ మధ్యలో ఆచార్య నాగార్జునుడి ద్వారా రచయిత చెప్పించిన సందేశం ఈ నాటకానికి ఇప్పటికీ ప్రాశస్త్యం ఉండేటట్లు చేసింది. 'ఆ బొమ్మ(ధర్మ దేవత)మనుషుల మనసుల్లో మెదిలినంత కాలం లోక కళ్యానికి లోటు రాదు' అనేదే ఆ సందేశం.

ఆర్టికల్ 370ని గూర్చి విస్తృతంగా చర్చ జరుగుతున్న నేటి సందర్బంలో ఆ బొమ్మ 'ఏడుపు' ఎవరూ విస్మరించరానిది.




డా॥ జి.వి.కృష్ణరావు (కృష్ణారావు కాదు)  హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గుంటూరు జిల్లా, కూచిపూడి (అమృతలూరు) గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. తెనాలి . వి. యస్. ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా, ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ డైరెక్టరుగా పని చేశాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశారు. కళాపూర్ణోదయం సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందారు.

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...