రామాయణ మహాభారతాల్లో ఒక్కొక్క
పాత్రకు తమది మాత్రమే అయిన ఒక్కొక్క శైలి ఉంటుంది. అది ఆహారంలో కానీ, వ్యవహారంలో కానీ! కదనరంగంలో కానీ, మదన రంగంలో కానీ!
మహాభారతంలో భీముడిదో శైలి. ప్రత్యేకించి యుద్ధంలో. అది కూడా ఒక్కడితోనే పోరాడే
సమయంలో (ద్వంద్వ యుద్ధంలో). అదేంటంటే యుద్ధం చేసినంతసేపూ చేసి, ఇక ఆ తర్వాత ప్రత్యర్థితో ఆడుకోవడం మొదలుపెడతాడు. ఒక చెయ్యి మెడ మీద,
మరో చెయ్యి నడుమ్మీద వేసి పైకెత్తి గిరగిరా తిప్పడం- నేలకేసి
కొట్టడం... ఇలా అన్న మాట! హిడింబాసురుడు, బకాసురుడు, కిమ్మీరుడు, జీమూతమల్లుడు, కీచకుడు,
దుశ్శాసనుడు ఇలా అందర్నీ దాదాపు ఇదే శైలిలో చంపాడు.
ఇలాగే, వ్యవహారంలో శ్రీరామచంద్రుడిదో శైలి. వాల్మీకి మహర్షి దాని గురించి చెబుతూ
‘‘స్మిత పూర్వభాక్’’ అంటాడు. అంటే ఎవరైనా తనను కలవడానికి వస్తే రాముడే ముందుగా పలకరిస్తాడట,
అదీ చిరునవ్వుతో!
ఇక
లక్ష్మణస్వామి విషయానికి వస్తే, శిక్షించే విషయంలో
ప్రత్యేకించి దుష్ట స్వభావం కలిగిన స్త్రీలను శిక్షించే విషయంలో ఈయనది ప్రపంచంలో
ఎవరికీ లేని ఓ ప్రత్యేక శైలి. అదేంటంటే ఎదుటివాళ్ల ముక్కూచెవులు కోసెయ్యడం. ఈ
రకంగా శూర్పణఖకు తగినశాస్తి చేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ రామాయణం మొత్తంలో
లక్ష్మణుడు ఇలా ముగ్గురికి ముక్కూచెవులు కోశాడు. అది కూడా పన్నెండేళ్ల వయసులో
ప్రారంభించి ముప్పై ఎనిమిదేళ్ల వయసు వరకు. ఆ రకంగా లక్ష్మణ కర్ణనాసికాఖండన
ప్రస్థానం ప్రారంభమైంది తాటకతో. వివరాల్లోకి వెళ్తే...!
బాలకాండలో
విశ్వామిత్ర మహర్షి యాగసంరక్షణార్థం రామలక్ష్మణుల్ని తనతోపాటు తీసుకెళ్లాడు. యాగానికి
ఆటంకం కలిగిస్తున్న తాటకను చంపమని ఆ అన్నదమ్ముల్ని ఆదేశించాడు. కానీ స్త్రీని
చంపడానికి రామలక్ష్మణులు సందేహించారు. దుష్టస్వభావం కలిగిన వారు స్త్రీలైనా సరే
చంపడం ధర్మవిరుద్ధం కాదు, కాబట్టి చంపెయ్యమని విశ్వామిత్రమహర్షి మళ్లీ
చెప్పాడు. అప్పుడు రాముడు జాగ్రత్తగా తాటకను పరిశీలించి ‘‘సౌమిత్రిరకరో క్రోథాత్
హృత కర్ణాగ్రనా సికా’’ అని లక్ష్మణుడికి చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు తాటక
ముక్కూచెవులు కోసేశాడు. ఇక్కడో సందేహం రావచ్చు.. ముక్కూచెవులే ఎందుకు కోశాడని?
వాస్తవానికి ఈ సందర్భం రామలక్ష్మణుల, ప్రత్యేకించి
శ్రీరాముడి పరిశీలనా దృష్టికి, కారుణ్య భావనకు నిదర్శనం.
తాటకని
బాగా పరిశీలించాడు రాముడు. సహజంగా రాక్షస స్త్రీ కాకపోయినా, శాపకారణంగానే రాక్షసత్వాన్ని పొందినా తాటక చర్మం బాగా మొద్దుబారిపోయి
ఉంది. ఆ చర్మం మీద వెంట్రుకలు తుమ్మముళ్లలాగా నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఆ
చర్మానికి స్పర్శజ్ఞానం ఉన్నట్లు కనిపించలేదు. ఇక కళ్లు చూస్తే నిరంతరం మద్యాన్ని
తాగీ తాగీ బాగా ఎరుపెక్కిపోయి తను ఎటు చూస్తుందో, ఏం
చూస్తుందో తనకే తెలియని స్థితిలో ఉన్నాయి. అంతేకాక పలురకాలైన పచ్చిమాంసాన్ని
తినీతినీ నాలుక తాటిపట్టలా తయారైంది. ఈ విషయాలను గ్రహించాడు రాముడు.
పంచేంద్రియాల్లో చర్మం, కళ్లు, నాలుక ఈ మూడు తాటక అధీనంలో లేవు. ఇక
మిగిలింది రెండు. ‘‘నరవాసన నరవాసన’’ అంటూ ముక్కుతో వాసన పసిగడుతుంది. కళ్లు
మత్తెక్కి సరిగా కనిపించకపోయినా, వీరి మాటల శబ్దాన్ని బట్టి వీళ్ల
వైపు వచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎంతైనా స్త్రీ కదా! చంపటం ఎందుకని,
తాటకలో మిగిలి ఉన్న రెండు జ్ఞానేంద్రియాలైన ముక్కూ చెవుల్ని కోసెయ్యమన్నాడు
రాముడు. లక్ష్మణుడు అలాగే చేశాడు. అయినప్పటికీ తాటక తన ఆగడాలు మానకుండా గుడ్డిగా కర్మేంద్రియాల్ని
ఉపయోగిస్తూ యాగానికి ఆటంకం కలిగిస్తూ, యాగరక్షణ చేస్తున్న రామలక్ష్మణుల్ని
చంపే ప్రయత్నం చేసింది. తప్పని పరిస్థితుల్లో రామలక్ష్మణులు తాటకను సంహరించాల్సి వచ్చింది.
* * *
పితృవాక్య
పరిపాలన కోసం రాముడు, అతనితోపాటు సీతా, వీరిద్దరితో
పాటు లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నారు. పదమూడు సంవత్సరాల రెండు నెలలు హాయిగానే
గడచిపోయాయి. అప్పుడు జరిగింది వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పే ఘటన శూర్పణఖ రూపంలో.
ఆశ్రమ
ప్రాంతంలో సీతారామలక్ష్మణుల్ని చూసిన శూర్పణఖ, తన తొలిచూపులోనే
రామచంద్రుణ్ని మోహించింది. రాముణ్ని వివరాలడిగి తన వివరాలూ చెప్పింది. ఆ వెంటనే తన
ప్రేమను వ్యక్తం చేసింది. దానికి రాముడు తనకు వివాహమైందనీ, పక్కన
ఉన్న ఈ సీతే తన భార్య అనీ, కావాలంటే లక్ష్మణుడి వద్దకు
వెళ్లమని చెప్పాడు.
శూర్పణఖ
వెంటనే లక్ష్మణుడి దగ్గరకు వచ్చింది. తన మీద ప్రేమను వ్యక్తం చేస్తున్న శూర్పణఖతో లక్ష్మణుడు
‘సరే అలాగే! అరణ్యానికి వచ్చేటప్పుడు నా భార్యను వెంట తీసుకురాలేకపొయ్యానని
అప్పుడప్పుడు నాకూ చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజూ అడవిలో తిరిగి
అలసిపోయిన మా అన్నగారి పాదాల్ని ఒత్తుతూ సేవ చేస్తాన్నేను, అదే నా భార్య కూడా అరణ్యానికి వచ్చి ఉంటే మా వదినగారి పాదాలకు సేవచేసేది
కదా అని! నువ్వే నా సమస్యకు పరిష్కారం. అయితే, నేను మా
అన్నగారి దాసుణ్ని. నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నువ్వు కూడా దాసివవుతావు’’ (కథం
దాసస్య మే భ్రాతుః దాసీ భవతుమర్హసి) అన్నాడు. దాంతో వెంటనే లక్ష్మణస్వామిని
వదిలేసి మళ్లీ రాముడి దగ్గరకు వచ్చింది శూర్పణఖ. వచ్చీరాగానే సీతను చూస్తూ ‘‘ఈమె
ఉండటంతోనే కదా నన్ను తిరస్కరిస్తున్నావు! ఈమెను చంపి తినేస్తాను. అప్పుడు నన్ను
పెళ్లి చేసుకో!’’ అంటూ సీత మీదకు వెళ్లబోయింది.
ఇక్కడొక చిన్న సందేహాన్ని
తీర్చుకుని ముందుకు వెళ్దాలి! మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు శూర్పణఖ కోరికను
మన్నించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అలాకాకుండా లక్ష్మణస్వామి దగ్గరికి పంపడమేంటి?
అని. దీనికి సమాధానం ఇలా చెప్పుకోవచ్చు. రాముడు శూర్పణఖను
లక్ష్మణుడి దగ్గరకు వెళ్లమన్నప్పుడు ఆమె ‘‘లేదు! నేను నిన్నే ప్రేమించాను. నిన్నే
వివాహమాడతాను’’ అని అనుంటే రాముడు ఏం సమాధానం చెప్పేవాడో, ఎలా
అనుగ్రహించేవాడో వేరే విషయం. ఎందుకంటే పురుష మోహనరూపుడైన రాముణ్ని స్త్రీలే కాదు,
పురుషులూ మోహించారు. అలాంటి ఇలాంటి సాదాసీదా పురుషులు కాదు, సర్వసంగ పరిత్యాగులై జీవిత చరమాంకంలో ఉన్న శరభంగమహర్షి (అంటే మన్మథ
శరాల్ని భంగం చేసినవాడని అర్థం) లాంటి వారూ మోహించారు. రాముడు తనను మోహించిన
ఎందరినో కృష్ణావతారంలో అనుగ్రహించాడు.
ఇక ప్రస్తుత విషయానికి వద్దాం!
శూర్పణఖ రాముడు తనను లక్ష్మణుడి దగ్గరకు వెళ్లమనగానే వెళ్లిపోయింది. అలాగే,
లక్ష్మణుడు ‘‘నేను దాసుణ్ని, నన్ను చేసుకుంటే
నువ్వు కూడా దాసీదానివవుతావు’’ అనగానే మళ్లీ రాముడి దగ్గరకు వచ్చింది. అంటే
శూర్పణఖకు రామలక్ష్మణుల పట్ల ఉన్నది కాముక భావనే కానీ ప్రేమ కాదు. ఈ విషయం నిర్ధరించుకోడానికే
రాముడు శూర్పణఖను లక్ష్మణుడి దగ్గరకు పంపించాడు. ప్రేమ అంగీకారామే కానీ కాముకత
కాదు. రామలక్ష్మణులు ఇద్దరూ తనను కాదనేసరికి, తన రాక్షస
ప్రవృత్తిని బయటపెడుతూ సీతను మింగబోయింది శూర్పణఖ. అప్పుడు రాముడు ఇక ఈమెను
ఉపేక్షించకూడదని ‘‘లక్ష్మణా! ఊఁ!’’ అన్నాడు. అంతే! లక్ష్మణస్వామి అక్కడున్న కత్తి
తీసి శూర్పణఖ ముక్కూ చెవులు కోసేశాడు.
ఇక్కడ శూర్పణఖ ముక్కూచెవులు
కొయ్యడంలో ఆంతర్యం ఏంటి? అంటే ఆమె సీతారామలక్ష్మణుల దగ్గరికి
రాక్షసరూపంతో కాకుండా సుందరి వేషంలో వచ్చింది. అంటే తన సౌందర్యంతో ఎదుటివాళ్లను
వశపర్చుకోవాలని అనుకుందన్న మాట. అందువల్ల అలాంటి మోసం మరొకరి దగ్గర చెయ్యకుండా
సౌందర్యానికి మూలమైన ముఖంలోని ముక్కూచెవుల్ని కోసేశాడు లక్ష్మణుడు.
* * *
ఇదే అరణ్యకాండ చివర్లో ఇలాంటి
ఘటనే మరొకటి జరిగింది. కొన ఊపిరితో ఉన్న జటాయువు నుంచి ‘‘సీతను రావణుడు ఎత్తుకుపోయా’’డన్న
వార్త విన్నారు రామలక్ష్మణులు. దుఃఖమగ్నులై ఉండి కూడా అసువులు బాసిన జటాయువుకు కృతజ్ఞతతో
అంత్యక్రియలు జరిపించి క్రౌంచారణ్యంలో ప్రవేశించారు.
విపరీతమైన దుఃఖంతో తిరుగుతున్న
రామలక్ష్మణుల దగ్గరికి అయోముఖి అనే రాక్షసి వచ్చింది. లక్ష్మణుణ్ని చూసి మోహపరవశ
అయ్యింది. వికృతమైన చర్మం, ఎర్రనైన కళ్లు, వేలాడే పెద్ద పొట్టతో మోహాంధకారంతో నిండిన . అసలే బాధలో ఉన్న లక్ష్మణుడు
విపరీతమైన కోపంతో అయోముఖిని విదిలించుకుని, తన ఒరలో ఉన్న కత్తి
తీసి ముక్కూచెవులతో పాటు మరికొన్ని శరీర భాగాల్ని కోసేశాడు. ఆ బాధ భరించలేక అయోముఖి
కొండగుహల్లోకి పారిపోయింది.
ముక్కూచెవులు
కొయ్యాలన్న లక్ష్మణుడి ఆలోచన కార్యరూపం దాల్చింది పన్నెండేళ్ల వయసులోనే అయినా ఆలోచన
మాత్రం జన్మజాతం. యోగనిద్రలో, ధ్యానముద్రలో ఉండే నారాయణుడు
లోకసంరక్షణార్థం పరివారంతో సహా భూలోకంలో అవతరించాల్సి వచ్చింది. అధికారిక విధుల
మీద వచ్చిన ప్రభుత్వోద్యోగి తొందరగా పని ముగించుకొని ఇల్లు చేరాలనుకున్నట్లు
నారాయణ పరివారం కూడా పని ముగించుకుని వైకుంఠం చేరాలన్న తపనతో, పుట్టిననాటి నుంచే అవతార పరమార్థం అమలు చేసే పనిలో పడ్డారట! ఈ విషయాన్ని
కవిసమ్రాట్ విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షం’లో తనదైన శైలిలో చమత్కరించారు.
రామచంద్రుండు మూర్ధంబులొత్తిచూచు
పురుషులెవరేనియును
తన నెత్తికొనిన
సౌమిత్రియును
ముక్కు చెవులు నొత్తి చూచు
ఎవ్వరే
నంగనల్ తననెత్తికొనిన
చిన్నప్పుడు రాముణ్ని ఎవరైనా
స్త్రీలు ఎత్తుకుంటే బుద్ధిగా ఉండేవాడట! అదే పురుషులెత్తుకుంటే తల తడుముతూ
ఉండేవాడట! అలానే లక్ష్మణుడు పురుషులెత్తుకుంటే బుద్ధిగా ఉండేవాడట! అదే స్త్రీలు
ఎత్తుకుంటే మాత్రం ముక్కూచెవులు తడుముతూ ఉండేవాడట! ఎందుకంటే ఆ పదితలలవాడు దొరికితే
వచ్చిన పని ముగించుకొని వైకుంఠానికి పోదామని రాముడు, తనను ఎత్తుకుంది
శూర్పణఖ అయితే ముక్కూచెవులు కోసేసి అవతార పరమార్థాన్ని వేగవంతం చేద్దామని
లక్ష్మణుడు ప్రవర్తించేవారని విశ్వనాథ కల్పన. వాస్తవానికి అవి బాల్యచేష్టలే అయినా
చిన్నప్పటి నుంచే అవతార పరమార్థాన్ని గుర్తెరిగి ప్రవర్తించారు రామలక్ష్మణులు అని
చెప్పడం విశ్వనాథవారి అంతరార్థం.
ఇలా లక్ష్మణస్వామి వల్ల ముక్కూ
చెవులు పోగొట్టుకున్న ముగ్గురు రాక్షస స్త్రీల్లో మొదటిదైన తాటక, అంతటితో బుద్ధి తెచ్చుకోక తన ఆగడాల్ని కొనసాగిస్తూ ముందుకు వచ్చి తన
ప్రాణాల్ని కోల్పోయింది. లక్ష్మణుడి ఆవేశానికి భయపడ్డ అయోముఖి కొండగుహల్లోకి
పారిపోయింది. కామంతోపాటు ప్రతీకార వాంఛ కూడా కలిగిన శూర్పణఖ పారిపోయి తన వారిని
రెచ్చగొట్టి ఇంత రామాయణ కథకూ మూలమైంది.
-సేకరణ
By కర్లపాలెం హనుమంతరావు
(మూలం రాసుకోలేదు.. క్షమించాలి)
No comments:
Post a Comment