మన మాతృభాష తెలుగా? అబద్దం. మన మాతృదేవతలు పలికేది తెలుగేనా?!
అచ్చు తెలుగులో 'అమ్మా!' అంటే ఏ
తల్లయినా ఇస్తోందా బదులు? పుచ్చు ఆంగ్లంలో 'ఆంటీ!' అంటేనే ‘యాఁ’ అంటూ ఏ ముసలమ్మైనా కదులు! ‘అంకుల్’ అనకుంటే
ఎంతటి క్లోజ్ చిన్నానైనా నెత్తికి పోస్తాడు కుంకుడు పులుసు!
సజీవ భాష అనగా నేమి?
నట్టింట్లో పద్దాకా తెగ వాగే టీ.వీ, అనుక్షణం
చెవిలో మార్మోగే సెల్ జోరీగ, కంటిని ఝిగేల్మని మెరిపించే వెండితెర బొమ్మల.. బారిన
పడి ఏ భాష నలుగుచుండునో అదియే ‘సజీవ భాష’ నాబరగు. ఐతే ఆ లెక్కన అచ్చు తెలుగు ఏనాడో
చచ్చినట్లు లెక్కేనా? అమంగళము ప్రతిహతమగు గాక. మరి తెలుగు
మృతభాషయినచో అమృతభాష యేది గురువా? ఆంగ్లాంధ్రములు
కలిపి పిసికిన సంకర బంకరా శిష్యా! తలకట్టు
ఒక్క మన తెలుగుకి మాత్రమే సొంతమైనట్టు ఆ నిక్కులు, నీలుగులు చాలించరా ఇంక!
తెలుగుతల్లి తలకు 'కట్టు'మాత్రమే మిగిలిందని తెలుసుకుంటే మేలురా కుంకా!
పూజా పునస్కారం ఆంగ్లాంధ్రమునకు! బడితె పూజా, తుస్కారం
అగ్లీ ఆంధ్రమునకు! గుళ్లల్లో
సుప్రభాతానికి బదులుగా 'గుడ్ మాణింగ్' అంటేనేగా ఆ గాడ్
గారి ‘గుడ్ లుక్సు’లో భక్తుడు బుక్కయ్యేది సర్వదా!
వచ్చినా వచ్చకున్నా ఆంగ్లంలో
వాగితేనేనయా.. దండాలు.. దస్కాలు. సన్మానాలు.. సత్కారాలు! 'అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ..ఊ' లంటూ గుణుస్తూ కూర్చుంటే అర దండాలు.. కాళ్లూ చేతులకు అరదండాలు.. ‘ఛీఁ.. ఛీఁ’ అంటూ చీత్కారాలు!
తెలుగుపంతుళ్ళకే తెలుగులో సంతకాలంటే వాంతులయే వింతకాలంలో బాబూ ప్రస్తుతానికి మన తెలుగుతల్లి బతుకీడుస్తున్నది! ఉద్యోగం, ఉపాధి సంగతులు ఆనకరా ఢింబకా!
మనసు పడ్డ పాపను పడేసేందుకైనా నువ్ ప్రేమలేఖ ఆంగ్లమునే గిలకవలె మొలకా!
ఇంకేం చూసి తెలుగు మీద మోజు పడాలిరా
బళ్లకెళ్లే భడవాయలు అంతా? దొంగవెధవలకు మల్లే మెడల్లో పలకలు గంగడోళ్ళలా
వేలాడేసైనా
సరే బిడ్డలని లార్డు మెకాలే వారసులుగా మార్చేసెయ్యమనే కదా మన టెలుగు మా.డా(మామ్.. డాడీ)ల సొద! పులులు, పిచ్చుకలు, దున్నపోతులూ అంతరించిపోతున్నంత చింతైనా లేదంటారా తెలుగు
అంతర్ధానమైపోతున్న స్పీడుకు! దటీజ్ కాల్డ్ తెలుగు ‘దుందుడుకు’!
కాపాడే కంటి రెప్ప గొప్పతనం కన్ను
గుర్తుపడుతుందా? ఆదరించే అమ్మభాషకు అంతకు మించిన మహర్దశ సాధ్యపడుతుందా?
‘క్రియ’
తెలుగు వాక్యంలో చివరకు రావడమే అన్ని
లోకువలకు అసలు కారణం. అదే మరి ఆంగ్లములో అయితేనో? కర్తా కర్మల
మధ్యలోకైనా సరే వచ్చి కూర్చునే దొరతనం.. యూ నో! 'పని'
అంటే వెనక్కు నక్కే తెలుగు తోడుగా ఉంటే శనీ జోడవుతుందన్న
వెరీ బ్యాడ్ వెర్రి సెంటిమెంటబ్బా తెలుగబ్బికి! ఎంత పద, లిపి సంపద తెలుగు నాలుక చివర పలుకుతుంటేనేమి? ఆంగ్లంతో కలిపి కొట్టకపోతే ఉలిపికట్టెతో పోలికొస్తుందని
ఉలుకు తెలుగు బోడికి.
గురజాడవారి గిరీశానికి ఈనాటికీ తెలుగ్గడ్డ మీదింత గ్లామరుందంటే కారణం? పూనా ఢక్కన్
కాలేజీలో మూడు ఘంటల పాటు ఏక బిగిన బట్లరింగ్లీషులో బాదేయగల గట్టిపిండం కాబట్టే! 'చాట్'లతో ఫట్ ఫట్ లాడించే లేటెస్ట్ సెంచరీ కదా ఇది!
శ్రీనాథుడి చాటువులతో వేపుకు తిందామంటే చెవులకు చేటలు కట్టెస్తారయ్యా కనక లింగం! బమ్మెర పోతనగారే.. ఆ అతి కమ్మదనం
భ్రమల్లొ పడిపోయేసి అమ్మభాషలో భాగవతం రాసి భగవంతుడికి అన్యాయం చేసేసాడు! వెరీ సాడ్! అదే ఆ ఆంధ్ర మహాభాగవతాన్ని ఆంధ్రాంగ్లంలోనైనా
కుమ్ముంటే భాగవతం ఈపాటికి ఆ లాటిన్ బైబిల్ తో గిన్నీస్ కు పోటీకొచ్చుండేది!
వాడుక భాషంటే ఏమన్నా వేడుక భాషనా? వ్యవహార
భాష. ఇంద్రాసూయైనా సరే.. ఆంధ్రంలోనే యవ్వారం అని ఆనాడు
చంద్రబాబు గాని మొండికివేసుంటే అన్ని కోట్ల పెప్సీప్లాంట్ల కేసు పురిట్లోనే
సంధి కొట్టేసేది! కేసీఆర్ సార్ తెలంగాణా భాషలో ఎంత మీసాలు తిప్పగల మొనగాడవనీయి గాక ఒక్క తెలంగాణా యాసతోనే గావు గావు మంటే కెసి కెనాలు
పనులు ఆగిపోయేవా?
ఆదికవి నన్నయ ఆ సోది తెలుగుకు అంతలా అంకితమయిపోబట్టే ఒక్క రాజమండ్రి బోర్డర్ భాష వరకే ట్రెండయిపోయాడు. అరసున్నాలు, బండిరాలు, కాసిని సంధులు
వదిలేసాడు శ్రీరంగం శ్రీనివాసరావు. అందుకే
యుగకవిగా ఆయనకా గౌరవం .. సరే! కాసుల మాటేమిటి! ఆ గాసట బీసట తెలుగు
ఘోషలు నమ్ముకోకుండా.. గామా, బీటాల్లాంటి కామన్ మ్యాన్ బుర్రకు కు బొత్తిగా ఎక్కని ఏ
ల్యాటినాంగ్లంలోనో కూసుంటే! కాసులకసలు కరువుండేదా?
అక్షరాలు, హల్లులు, వత్తులు, సంధులని తేడా పాడా లేకుండా ఏక
మొత్తంగా వర్ణమాలను మొత్తం ఆంగ్లంతో కలిపి రుబ్బి ప్రేక్షకుల మొహాన పేడకళ్లులా కొట్టేసే మన టీవీ యాంకరమ్మలకు, రేడియో జాకీ కుంకలకు, సినిమా రైటర్ బంకలకు నిండు మనసుతో
గౌరవాభివందనములు! వైద్యం చేసే నారాయణులు, న్యాయం చెప్పే ధర్మ దేవతలు, బీదా బిక్కీలను సేవించుకునే సర్కారు
బంట్లకు గొప్ప గౌరవం ఇవ్వక తప్పదు! డిస్సెంటు
పత్రం సమర్పించిన గురజాడ అప్పారావుగారు గొప్పా? ఇన్డీసెంటుగా ఉంటుందని అసలు తెలుగు వర్ణమాలకే ఏక మొత్తంగా ఓ మూల గోడ కుర్చీ వేయించిన ప్రయివేటు బళ్ళు గొప్పా? బళ్ళ కెళ్ళే మన పిడుగుల తెలుగు తొక్కు పలుకుల ముందు.. గిడుగు రామ్మూర్తి పంతులుగారి ప్రజ్ఞాపాటవాలు లెందుకు?
నేటి బుడుగుల బడబడ ఇంగ్లీషు వాగుళ్ల వాగులో
పడితే ఎంతటి భాషాగజీతగాడు విశ్వనాథవారైనా బుడుంగుమని మునిగాల్సిందే!
కర్ణాటక సంగీతం ఆంగ్లంలో లేదు. కాబట్టే చెవి కంతల కంత కర్ణకఠోరం!
ఆంగ్లవాసన సోకనందుకే నాట ఓ శోకరసం! అన్నమయ్య సంకీర్తనలంటే
తెలుగు నా! బడేగులాం సాబ్ హీందీకి గులామైతే.. ఆంగ్లభాషకు మన తెలుగులందరం బడే బడే గులాములం.
ఫ్రెంచివాళ్ళు కనక బాలమురళి గానానికి ఫిదా అయి కనక గండపెండేరం కాలికి తొడిగారు!
ఈలపాటైనా సరే ఈ నేలమీద ఇంగ్లీషై ఉంటేనే తెలుగులో ఒన్సుమోర్లు మార్మోగేది!
తుమ్ము. దగ్గులదాకా ఎందుకు? ఆవలింతలైనా ఆంగ్లయాసలో ఉంటేనే
ఇంగ్లీషు డాక్టర్లు మందులు రాసేదిక్కడ.
ఆర్ద్రత, సరళత తెలుగుభాష సొంతమవడమే అసలు చిక్కంతా! కాటికెళ్లే శవాలు కూడా 'క్యాచ్ మీ ఇఫ్ యూ కేన్' అంటూ లేటెస్టు
ట్యూనులు కోరుకంటుంటే తెలుగు మృతభాషగానైనా
పనికివస్తుందా అన్నది పెద్ద ప్రశ్న!
పొట్టకోసినా తెలుగక్షరం ముక్క
ఒక్కటైనా కనపించనోడే తెలుగువాడికి
ఇవాళ తలమానికం! పచ్చడి లేకుండా
ఎన్నిడ్లీలైనా లాగించచ్చేమో గానీ ఆంగ్లం
లేకుండా తెలుగుముక్కంటే చచ్చే చావే
తెలుగువాడికి! తెలుగిది కేవలం ప్రాచీన
హాదానే. ఆంగ్లానిది అధునాతన హోదా!
ఒకే భాషవాళ్లంతా ఎన్ని దేశాల్లో
ఉన్నా.. సొంతపనులన్నీ తల్లిభాషలో సాగిస్తే చాలు.. అంతర్జాతీయస్థాయికి అదే మంచి
మందని క్లేర్ మోరనే స్పానిష్ పెద్దాయాన సిద్దాంతం. తెలుగువాడు తెలివిగలవాడు. అంత కష్టం కూడా పడడానికి ఇష్టపడడు. సొంతగడ్డమీద ఉంటూనే మాతృభాషని ఆంగ్లంలా
మాట్లాడేసి ఆటోమేటిగ్గా అంతర్జాతీయ
స్థాయికి ఎదిగిపోగలడు.. సొంత కలల్లో!
తెలుగు పుచ్చిపోయిందనో.. చచ్చిపోతుందనో కన్నీళ్ళు
పెట్టుకునే తిక్కన్న వారసులకు చివరగా ఒక మాట! తిట్లున్నంత కాలం తెలుగుంటుంది.
ప్రజాస్వామ్యమున్నంత కాలం తిట్లూ ఉంటాయి. తెలుగు చల్లగా పదికాలాలపాటీ తెలుగ్గడ్డల
మీద వర్ధిల్లాలని ప్రార్థిస్తామంటారా! సరే
మీ ఇష్టం! సదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకోండి. తెలుగూ దానితో పాటే దివ్యంగా
వెలుగుతూనే ఉంటుంది చట్టసభల్లో కనీసం తిట్ల రూపంలోనైనా!
-కర్లపాలెం హనుమంతరావు
25 -09 -2019
***
(సూర్య దినపత్రికలో ప్రచురితం)
No comments:
Post a Comment