Friday, August 14, 2020

రష్యా ‘కరోనా-దాని టీకా- తాత్పర్యం’ -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక ప్రచురణ




కరోనావైరస్ వ్యాక్సిన్‌ రష్యా ఆమోదం పొందినట్లు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రకటించారు.
తొలిదశల్లో జరిగిన పరీక్షల సమాచారం ఏమీ లేకుండానే పెద్దెత్తున చివరిది, కీలకమయినది అయిన మూడో దశను రెండో దశతో కలిపి వేసి మెక్సికో, సౌదీ, అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల సహకారంతో సుమారు 2000 మంది ఆరోగ్య వాలంటీర్ల మీద బుధవారం నుంచి  పరీక్షలు ప్రారంభించబోతున్నట్లూ, సమాంతరంగా వాక్సిన్ ‘స్ఫుత్నిక్ -వి’ ని సామాన్య ప్రజల ప్రయోజనార్థం వ్యాపార ఫక్కీలో ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అదే సమావేశంలో ఆరోగ్యశాఖ అమాత్యులు అధికారిక ప్రకటన సైతం చేసేసారు! యావత్ ప్రపంచం  నివ్వెరపోయే ఈ హఠాత్పరిమాణాన్ని ఏ  కోణంలో మనం పరిశీలించాలన్నదే ప్రస్తుతం ప్రపంచమంతటా నడుస్తున్న పెద్ద చర్చ!
నమ్మదగ్గ ఆధారాలేవీ ప్రపంచం ముందు  ప్రదర్శనకు పెట్టకుండా రష్యన్లు తీసుకునే ఈ  దుందుడుకు చర్యను దుస్సాహంగా గర్హిస్తున్న మేధావుల శాతమే ఎక్కుగా ఉంది ప్రస్తుతానికైతే.  జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాలూకు ఇన్స్టిట్యూట్ ఫర్ వ్యాక్సిన్ సేఫ్టీ డైరెక్టర్ డేనియల్ సాల్మన్ ఆందోళనే ఇందుకు ఉదాహరణ,  ఆయన వాదన ప్రకారం 3వ దశ ప్రయోగాలలోనే  టీకా ప్రయోగాలలోని  పని తీరు తేటతెల్లమయ్యేది. టీకా తీసుకున్న సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తికి ఏ రకమైన  హానీ కలగదని నికరంగా తేలేదీ ఈ తుది అంచలోనే.  మొదటి ఒకటి, రెండు అంచల ప్రయోగాల కన్నా భిన్నమైన పద్ధతిలో సాగే ఈ దశ ప్రయోగాలలో లక్షలాది మంద ఆరోగ్యవంతులు భాగస్వాములు అవుతారు.  ఈ టీకా కారణంగా దుష్ప్రభావాలు సాధారణ స్థాయికి మించకుండా వెల్లడయినట్లు తేలితే చాలు.. వాక్సిన్ భ్రద్రతా ప్రమాణల విషయమై  భరోసా దక్కినట్లే!  ఆ తరహా పరీక్షలు ఏవీ జరిపే అవకాశం లేని రష్యా ఇంత హఠాత్తుగా కరోనా వైరస్ పని పట్టే టీకాను ఏ విధంగా ఉత్పత్తి చేయబోతున్నట్లన్నదే ప్రస్తుతం పెద్ద మిస్టరీ!
టీకాల పరీక్షలకు  సంబంధించి గత శతాబ్దం నుంచే  పరిశోధకులు చాలా శక్తివంతమైన  మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.  కొత్త టీకా ప్రయోగించిన సందర్భంలో ఎదురయ్యే క్లిష్టమైన  పరిస్థితులను అధిగమించేందుకు సంబంధించిన నైపుణ్యాలెన్నో శాస్త్రీయ విధానంలో ఆవిష్కరించబడిన నేపథ్యంలో రోగ నిదాన విధానం మీద కన్నా, రోగ నిరోధ విధానలకే ప్రాధాన్యత పెరుగుతున్నది. అయితే  పరిశోధన, ప్రయోగం, ప్రయోజనాల విషయంగా టీకాల పట్ల ఔషధాలకు మించి ఎక్కువ అప్రమత్తత అవసరమన్నది వైద్యరంగం హెచ్చరిక.
అసంఖ్యాకంగా ప్రయోగాలకు గురయ్యే జనసందోహం మీద ఆయా టీకాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో నికరంగా తేల్చేందుకు నిర్దిష్ట కాలపరిమితి కుదరదు. కనుక ఉత్పత్తి చేసి ప్రయోగించే దశల్లోనే టీకా సామర్థ్యం కచ్చితంగా నిగ్గు తేల్చుకోవాలి. రష్యా గత్తరగా తయారు చేస్తున్న’ప్రస్తుత ‘స్ఫుత్నిక్ -వి‘ వాక్సిన్ విషయమై ఈ అప్రమత్తత ఏ మేరకు పాటింపబడిందో సమాచారం లేదు! 

ఎలుకలు, కోతులు వంటి జంతువుల పై చేసే ప్రయోగాలు ఫలించాలి ముందు. ఆ  తరువాతే మొదటి దశ ప్రయోగంగా మనుషల మీద ఆయా టీకాల ప్రభావం పరిశీలించాలి. రోగి శరీరంలో వచ్చే క్రమాగతమైన మార్పుల సూక్ష్మాతి సూక్ష్మ పరిశీలనకు కొన్ని రోజులు, వారాలు, చాలా సందర్భాలలో నెలల వ్యవధానం కూడా అవసరమయే నేపథ్యంలో రష్యా వైద్యపరిశోధకులు ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు సత్ఫలితాలు రాబట్టినట్లో? ఆ సమాచారం పంపకాలలో అంత గుప్తత ఎందుకన్నదే మరో సందేహం! కాలక్రమేణా వాటంతటవే సర్దుకునే  మామూలు రుగ్మతలకు మించి మరే పెద్ద ఇబ్బందులు కలగలేదని నిగ్గుతేలేందుకైనా పరిశోధకుల దగ్గర తగిన సమయం ఉండాలి కదా! రెండు, మూడు దశల ప్రయోగాలు రష్యన్లు ఇప్పుడు జమిలిగా నిర్వహిస్తామంటున్నారు! ప్రయోగాల శాస్త్రబద్ధత ప్రశ్నార్థకం కాకుండా ఉంటుందా? 
కరోనా వైరస్ వాక్సినేషన్ వరకు రష్యన్ల ప్రయోగాల టైమ్ -లైన్ పసిపిల్లవాడి పరిశీలనకు ఇచ్చినా సందేహించక మానడు. ప్రపంచ వ్యాప్తంగా చూసినా కరోనా వైరస్ నిరోధం కోసంగానూ ప్రత్యేక ఔషధాల అగత్యం మార్చి నెలలో గాని ప్రపంచానికి తట్టింది కాదు.   ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ప్రయోగాలు సుమారు 29 వరకు అంటున్నా అందులో రష్యన్ల ఊసు ఎక్కడా కనిపించదు.  మరి కొన్ని తొందర్లో ప్రారంభించే అవకాశముందంటున్నారు. కానీ .. రష్యా వైద్య రంగం అప్పుడే అన్నీ ముగించుకుని ఉత్పత్తి రంగం  వైపూ దృష్టిసారించేసింది!   ఆస్ట్రాజెనెక్స్, మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనా సంస్థలు ఆశాజనకమైన ఫలితాలను ప్రకటిస్తున్న రోజుల్లో  కూడా రష్యన్లు ప్రయోగాల విషయమై ఎక్కడా చర్చల్లో కనిపించనే లేదు! పెద్ద సంస్థల ప్రయోగాలలో పెద్దగా ఆందోళన  పడే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేకపోయినా, వాలంటీర్లలో కొందరు యాంటీ బాడీస్ ఉత్పత్తి చేయడం, మరి కొంత మంది రోగులు రుగ్మతల నుంచి పూర్తిగా బైటపడ్డం జరిగినా మూడో దశ తాలూకు విజయాన్ని గురించి  ఆ సంస్థలేవీ ఇంకా భరోసా ఇవ్వడం లేదు!  రష్యా ప్రభుత్వం మాత్రం
 వాక్సినేషన్  ప్రయోగానికి, ప్రజాబాహుళ్య ప్రయోజనానికి  తామన్నీ  సిద్ధం చేసేసినట్లు అధికారికంగా కూడా ప్రకటించేసింది!   అందుకే ఫ్లోరిడా విశ్వవిద్యాలయం బయోస్టాటిస్టిషియన్,  అంటువ్యాధి నిపుణులూ అయిన నటాలీ డీన్ ‘ రష్యన్ల టైమింగ్ పైన అనుమానం వ్వక్తంచేస్తున్నది. ఆ మేధావి దారిలోనే ప్రపంచంలోని మరెంతో మంది వైద్య నిపుణులూ ‘స్ఫుత్నిక్ -వి’ టీకా సామర్థ్యం గురించి సందేహాలు వెలిబుచ్చుతున్నదీ!
 'తొందరపడి జనం మీద నిర్దయగా ప్రయోగాలు చెయ్యొద్ద'ని రష్యాను హెచ్చరించే వైద్య రంగం పెద్దలు ఎందరో   నటాలీ డీన్ తరహాలో కనిపిస్తున్నారు. రెండు దశల ఫలితాలు అనుకూలంగా ఉన్నటికీ మూడో దశ ప్రయోగాలు ఘోరంగా విఫలమయిన  సందర్భాలు ఎన్నో కద్దు- అన్నది ఆ పరిశోధకుల ముందస్తు హెచ్చరిక.
ఇప్పటికే కరోనా వైరస్  నియంత్రణ విధానంలో భాగంగా భారీ ఎత్తున ప్లేసిబో  టీకా ప్రయోగాలు జరిగివున్నాయ్!   'ఉంటారో.. ఊడతారో! రోగం నుంచి బైట పడతారో.. మరంత రోగాల పాలవుతారో జనం? ఫలితాల కోసం వేచిచూడొచ్చు కదా! ‘ఒళ్లో పెట్టా.. దళ్లో పెట్టా’ అన్నట్లు ఇప్పుడెందుకు ఇంత గత్తర?' అనేదే సందేహం ప్రఖ్యాత టీకా నిపుణుడు  డాక్టర్ స్టీవెన్ బ్లాక్ తరహాలో.
.
‘జూన్ మాసం లో, రష్యన్ ఫెడరేషన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాలూకు  'గమలేయ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ'  'గామ్-కోవిడ్-వాక్ లియో' అనే టీకాపై ఒకటి, రెండు దశలు రెండింటిని కలిపి జమిలిగా పరిశోధనలు చేపట్టినట్లు  చెప్పుకొచ్చింది.  అదీ కేవలం 38 మంది వాలంటీర్ల మీద మాత్రమే  ఈ పరీక్షలు చెయ్యడానికి సిద్ధపడినట్లు అప్పట్లో బైటికొచ్చిన సమాచారం! అందుతున్న సమాచారాన్ని బట్టి రష్యా సక్రమమైన పద్ధతుల్లో క్లినికల్ ట్రయల్సుకు ఎంత వరకు వెళ్లిందో అనుమానమే!'  అని మూతి విరువిరుపులు మొదలయ్యాయి అప్పుడే ప్రపంచ ప్రముఖ వైద్య సంస్థలు చాలా వాటి నుంచి.
 టీకా అడెనోవైరస్ అనే   హానిచేయని ఒక రకమైన కోల్డ్ వైరస్ నుండి తయారయినదని రష్యా చెబుతున్న మాట.    ఈ కోల్డ్ వైరస్ కరోనా వైరస్ జన్యువునే కలిగి ఉంటుందని. ఆస్ట్రాజెనెకా.. జాన్సన్ & జాన్సన్ కంపెనీలూ తమ వ్యాక్సిన్లలో ఇవే ధాతువులను వాడుతున్నట్లు రష్యా వాదన. తాము చేపట్టింది ఓ కొత్త రకమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన టీకా అని, ఏ రకమైన వ్యాధికైనా వాడే అడెనోవైరస్  మొదటి సారి జూన్ లో ఎబోలాకు  వాడినట్లు  రష్యా చెప్పుకొచ్చే మాట.  ఆ ధాతువు ఊతంతోనే  ఇప్పుడు తాము  కరోనా వైరస్ కూ మందు కనుక్కునే పనిలో ఉన్నట్లు రష్యా  చెప్పుకొస్తోంది.
ఏదేమైనా పుతిన్ సమక్షంలో రష్యా ఆరోగ్య శాఖా మంత్రి మైఖేల్ మురాష్కో 'వాలంటీర్స్ అందరూ అత్యధిక స్థాయి యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేయడంతో పాటు, ఒక్క వ్యక్తిలో కూడా ఇమ్యునైజేషన్ కు సంబంధించిన పెద్ద ఆరోగ్య సమస్యలేవీ పొడసూపలేదని చెప్పడం ముఖ్యం.  ‘సాధారణంగా  మొదటి దశలో అందరూ ఆశించే ఫలితాలు ఇవే కదా! ఏ టీకా కూడా ఎప్పుడూ ఫలానా జబ్బు పూర్తిగా నయమయిపోయిందని ఘంటాఫథంగా అక్కడికక్కడే నిర్ధారణగా చెప్పదు.. చెప్పలేదు కూడా' అని ఆయన చురకలు అంటించడం గమనిస్తే ఏమనిపిస్తుంది?
ఎప్పటి నుంచో రష్యన్ వైద్య  పరిశోధకులు చేస్తూ వస్తున్న ఈ తరహా వాదనలు ఈ  మంగళవారం దేశాధ్యక్షుడు పుతిన్ సమక్షంలో మంత్రి స్థాయిలో మైఖేల్ మురాష్కో  కూడా చెయ్యడంతో రష్యా కరోనా వైరస్ కు టీకా తయారు చేయబోయే మొదటి దేశంగా ప్రపంచం ఇప్పుడు పరిగణించవలసిన పరిస్థితి  కచ్చితంగా వచ్చిపడింది. 
న్యూయార్క్ నగరం వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీ వైరాలజిస్ట్ జాన్ మూర్ తరహాలో  ‘మూర్ఖత్వం.. మహా మూర్ఖత్వం’ అని మొత్తుకున్నా సరే.. 'పుతిన్ దగ్గర ఉన్నది టీకానో, కేవలం సామ్రాజ్యవాదుల మార్కెట్ పెత్తనాన్ని ధిక్కరించే రాజకీయ వ్యూహమో' తెలిసేందుకు  కొంత సమయం అవసరం.
కొత్త టీకా సత్తా కాలం గడిచిన మీదట గాని తేటతెల్లంకాదన్నది  అసలు తాత్పర్యం.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)
*** 






No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...