Monday, August 31, 2020

ఖర్చు తక్కువ వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు - ప్రకృతి -కర్లపాలెం హనుమంతరావు






ప్రకృతితో ఒక్కోరికి ఒక్కోరకమైన అక్కర. కవి, గాయకుడు ప్రకృతిని చూసి స్పందించే మంచి కవిత్వం, గానం ప్రసాదించేది.  ఆ మధ్య చైనీస్ యువకులు కొంత మంది ప్రకృతిలో దొరికే గుమ్మడి, బీర, దోస వంటి కూరగాయలను సంగీత పరికరాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఒక యూ ట్యూబ్ వీడియోలో చూపించి అందరిని అవాక్కయేటట్లు చేసారు. నిజానికి ప్రకృతిలో దొరికే కాయగూరలు, దుంపలు, పండ్లు ఫలాలు సౌందర్య పోషణకు ఉపయోగించుకునే తెలివితేటలు పెంచుకుంటున్న మహిళామణులు వాటి అవసరం ముందు తిండి తిప్పలకు, మందుమాకులకు ఎంత వరకు ముఖ్యమో తెలుసుకుంటున్నారా?
మందుల దుకాణాలలో  ఔషధాలకు కొదవ ఉండదు, నిజమే కాని, అన్ని రకాల మందులు అందరు వాడటం అంత క్షేమం కాదు. కొన్ని సార్లు వికటించే ప్రమాదం కద్దు. ఏవి హాని చెయ్యనివో తెలుసుకోవడానికి మళ్ళీ  ఏ అలోపతి వైద్యుడి దగ్గరకో పరుగులెత్తాలి. వేళకు అన్ని చోట్లా డాక్టర్లు అందుబాటులో ఉండే దేశమా మనది? భారతదేశం వరకు అందరికీ అందుబాటులో ఉండే వైద్యుడు ప్రకృతి నారాయణుడు. ఆ వైద్యనారాయణుడి థెరపీని నమ్ముకుంటేనే  మన ప్రాణాలకు తెరిపి.
ఉదాహరణకు, గోళ్ల కింద గాయమయిందనుకోండి. ఒక్కో సందర్భంలో కొనుక్కొచ్చుకున్న మందు గోరు చివుళ్ల సందున సరిగ్గా అమరదు. వాడినట్లే ఉంటుంది కాని, ఫలితం కనిపించదు. కనిపించినా దాని ప్రభావం నెమ్మది మీద గాని తెలిసే అవకాశం లేదు. అదే వంటింట్లోనే కూరగాయల బుట్టలో ఏ వేళకైనా దొరికే బంగాళా దుంపను ముక్కలుగా కోసి ఒక ముక్కతో ఆ గాయమయిన భాగం కవర్ అయే విధంగా కట్టుకట్టుకుంటే సరి. మూడు రోజులు వరసగా ఉదయాన్నే పాత ముక్క స్థానంలో కొత్త ముక్కను పెట్టి కట్టుకుంటే నాలుగో రోజున అక్కడ గాయమైన ఛాయలు కూడా కనిపించవు.  చర్మం పైన పొక్కులు, బొబ్బలు కనిపిస్తే బంగాళా దుంపల ముక్కలతో గట్టిగా రుద్దితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది.  అలాగే బంగాళా దుంపను ఉడకబెట్టిన నీరు షాంపూ కండిషనర్ కన్నా మంచి ప్రభావం చూపిస్తుంది. రెగ్యులర్ షాంపూతో తల శుభ్రం చేసుకున్న తరువాత ఆరబోసిన వెంట్రుకలను ఉడికిన బంగాళా దుంపల నీళ్లతో కడిగి ఆరబెట్టుకుంటే ఆ శిరోజాల మెరుపు సహజంగా ఉందటమే కాదు, జుత్తుకు భవిష్యత్తులో హాని కూడా కలగదు. బూడిద రంగుకు తిరుగుతున్న జుత్తును దారిలోకి తేవాలన్నా ఈ బంగాళాదుంపల ద్రవంతో కడిగే అలవాటు క్రమం తప్పకుండా చేస్తే సరిపోతుంది. కాణీ ఖర్చు లేని వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు ప్రకృతి.
బంగాళా దుంపలు కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి. తడిగా ఉన్న భాగం వేపుని కొద్దిసేపు కళ్ల కింద పెట్టుకుని, ఆ తరువాత రుద్దుకుంటే  ముడతలు బిగిసుకుంటాయి. క్రమం తప్పకుండా చేసేవారికి కళ్ల కింద ఉబ్బు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. మో చేతుల కింద అదే పనిగా వత్తిడి  ఉన్నవాళ్లకు ఆ ప్రదేశంలో నల్లటి మరకలు నిలబడిపోతాయి, వాటి మీద  క్రమ తప్పకుండా బంగాళాదుంప ముక్కలను రుద్దుతుంటే మరకలు తొలగిపోతాయి.
బంగాళాదుంపలకు చర్మానికి భలే లింకు. దుంపలు కడిగిన నీళ్లలో నిమ్మ రసం పిండుకుని దానితో మొహం శుభ్రం చేసుకోవడం అలవాటుగా ఉన్నవాళ్ల మొహంలో ఆ కళే వేరు. వదనం  సమ్మోహనంగా మారుతుందిఎండపొడికి చర్మం కమిలిన  చోట బంగాళా దుంపల తడి చెక్కలు ఉంచితే చర్మం అతి తొందరలో తిరిగి సహజ స్థితికి  వచ్చేస్తుంది. ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో వేళ్లతో ఎత్తిపెట్టిన పెరుగు రవ్వంత కలిపి ఆ పేస్టును మొహానికి పట్టించుకోవడం అలవాటు చేసుకుంటే మొగం ఎప్పుడూ మంచి  నిగారింపుతో కళకళలాడుతుంది. బంగాళా దుంపల పేస్టుకు దోసకాయ పేస్టు, సోడావుప్పు కలిపి ఆ పేస్టుతో  మొహం శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవారికి వయసు పైబడిన తరువాత  చర్మం మీద ఏర్పడే ముడతలు వెనకడుగు పడతాయి.
పిల్లలు తిరుగుతున్న ఇంటిలో గోడలకో, గడపలకో పెయింటింగు వేయించాల్సిన అవసరం వస్తుంటుంది ఒక్కోసారి. పెయింట్లలో వాడే పదార్థాలకు తోడు, వార్నిష్ నుంచి వచ్చె గాలి ఇంటి వాతావరణంలోఒక రకమైన ఘాటుతనం పెంచి, ఒక్కోసారి వాంతులు అయేంత వరకు పరిస్థితి వికటిస్తుంది. పసిపిల్లలను, ముసలివాళ్లను ఎక్కువగా బాధించే ఈ కాలుష్య సమస్యకు ఉపాయం, పెయింట్ చేసే స్థలంలో సగం తరిగిన ఉల్లి ముక్కలు ఉంచితే ఆ ఘాటుకు ఈ ఘాటు సరితూగి కాలుష్య ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఉల్లిపాయలో గంధకం ఉంటుంది. ఆ ధాతువు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. చెవికి సంబంధించిన వ్యాధులకు ఉల్లిపాయ బ్రహ్మౌషధం. చెవిపోటు వచ్చిన సందర్భాలలో చెవి దగ్గర ఉల్లిపాయ ముక్క ఉంచి కట్టు కట్టి రోజంతా వదిలేస్తే కర్ణభేరిలోని కాలుష్యకారకాలు నశించి బాధ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది.  
పాదాలపైన గాయాలు, వ్రణాలు అయినప్పుడు తేనెను మందులా ఉపయోగించాలి. గాయమైన చోట తేనె రాస్తూ ఉంటే కొత్త కణాలు తొందరగా పుట్టుకొచ్చి గాయం పూడే సమయం తగ్గిపోతుంది.  తేనెకు సూక్ష్మక్రిములను నాశనం చేసే గుణం ఉంది.
వంటి దురదలకు యవలు మంచి మందు. యవల జావను ఒక గుడ్డలో కట్టి  నీటిలో ముంచి ఆ తడి మూటను దురద పుట్టిన చోట రుద్దుతూ పోతే బాధ  క్రమంగా తగ్గిపోతుంది. మశూశికం పోసినప్పుడు చర్మం మీద పొక్కులు లేచి దురద పుట్టిస్తాయి. వాటిని గోకినందువల్ల చుట్టు పక్కలకు ఆ దురద క్రిములు మరంతగా విస్తరించే అవకాశమే ఎక్కువ. ఈ తరహా సందర్భాలలో యవల జావ వైద్యం అపకారం చేయనై ఉత్తమ ఉపశమనం.
తాజా నిమ్మరసం వాసనచూడడం వల్ల, మద్యం అతిగా తాగిన హాంగోవర్ బాధ నుంచి ఉపశమనం సాధ్యమే. నిమ్మ, ద్రాక్ష, నారింజ, తొక్కలను మూడు నాలుగు రోజుల పాటు ఎండకు పెట్టి ఆనక నిల్వచేసుకుంటే సబ్బులాగా వాటిని వాడుకోవచ్చు. బొప్పాయి తొక్కల గుజ్జును అరికాళ్ల కింద రాసుకుంటే అందులో ఉండే రసాయనాల ప్రభావం వల్ల అక్కడ ఉండే మృత చర్మకణాలన్నీ తొలగిపోయి పాదాలు పరిశుభంగా కనిపిస్తాయి. అరటి తొక్కల గుజ్జు భాగం వైపు పంధదార జల్లి స్నానం చేసే ముందు వంటికి పట్టిస్తే చర్మం మీద చేరిన మకిలంతా తొలగి స్నానానంతరం శరీరం నిగనిగలాడుతుంది
ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయనుకుంటా మన బేరీ పండ్లను పోలి ఉష్ణమండలాలలో పెరిగే ఒక రకమైన కాయ అవకాడో! దానితో ఎండలో తిరిగి వచ్చిన తరువాత ముఖం రుద్దుకుంటే మొహం చల్లగా హాయిగా ఉండి శరీర ఉష్టోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. పనసపండులోని రసాయనాలు మనిషి శరీరం మీది మృతకణాలను తొలగించడానికి బాగా ఉపయోగిస్తాయి
స్ట్రా బెర్రీ పళ్లు దంతాలను ధవళ కాంతితో  ధగధలాడించే ఇంద్ర్రజాలం ప్రదర్శిస్తాయి. వడదెబ్బకు పుచ్చకాయలు మంచి ఔషధం. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ పుచ్చకాయల పాత్ర అమోఘమైనది.
ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువుల నుంచి లాభం పొందే కళ అభివృద్ధి చేసుకోబట్టే మనిషి మిగతా జీవజాతులతో పరిణామదశ పోటీలో ముందున్నది.  ప్రాణమిచ్చి, ఆ ప్రాణం నిలబెట్టే ప్రకృతిని ప్రాణప్రదంగా చూసుకోవాలే తప్పించి, ప్రకృతి వైద్యుడి ఉనికికే చేటు తెచ్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కష్టనష్టాలు చివరికి మనుషులుగా మనకు మనమే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది!
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...