Tuesday, February 8, 2022

ఈనాడు- సంపాదకీయం కృషీవలుని విలాపం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- సంక్రాంతి పథం పేరుతో - ప్రచురితం - 18 -01 - 2015 )

 ఈనాడు- సంపాదకీయం 

 కృషీవలుని విలాపం 

 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- సంక్రాంతి పథం పేరుతో  - ప్రచురితం - 18 -01 - 2015 ) 

 

'తిండి  లేకుండా జీవించే మానవ వంగడాన్ని ఎవరూ సృష్టించ లేరు' అంటారు ప్రఖ్యాత చారిత్రక తత్వవేత్త డి.డి. కోశాంబి. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచి మా/ గాణములన్‌  సృజించి, ఎము/ కల్ నుసిజేసి పొలాలు దున్ని' ఇంత అన్నం పెడుతున్నది రైతే.  ఏ జాతికైనా అతడే వెన్నెముక. వరదల అనంతరం పేరుకుపోయిన బురద ఒండ్రుమట్టిలో విత్తులు చల్లి ధాన్యం పండించిన తొలి అనుభవం మొదలు ప్రపం చవ్యాప్తంగా కాలానుగుణంగా వస్తున్న మార్పులకు దీటుగా నిలదొ క్కుకునే నేటి యోచనలదాకా రైతుకథ ఒక మహాభారతమంత. తొలిదశ కథలను, జాతక కథలను చెబితే... జానపదుల గాథలు ప్రతీ అడుగును తడుముతుంటాయి. 'ఏరువాకమ్మకు ఏం కావాలి?' అని అడిగి 'ఎర్రెర్రని పూలమాలలు, ఎరుపు తెలుపులు మబ్బుటెండలు, పొలంగట్టున టెంకాయ వడపప్పులు' అంటూ ఆరుబైటి హారతి పరిమళాలుగా పల్లెపట్టులు సాగుసంబంధాలను కొనసాగించడం ఒక్క భరత ఖండానికే చెల్లుతుందేమో! సప్తసముద్ర ముద్రితమైన భూమండలాన్ని పరశురాముడు సంతర్పణ చేసే. సందర్భంలో యాచించి బతకడం తలవంపుగా ఉంది.. చిన్న మడిచెక్కనైనా దానం పట్టమని ఆదిభిక్షువు చెవిలో పోరుపెడుతుందట పార్వతీదేవి. మిత్రుడు కుబేరుడిని అడిగి  విత్తులు, బలరాముడినడిగి నాగలి, యమధర్మరాజునుంచి దున్నలు తెచ్చి త్రిహలం సాయంతో వ్యవసాయం చేసి గౌరవంగా బతుకుదామని ఆ గౌరమ్మతల్లి ఆశ. 'అడిగిన జీతంబివ్వని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటే/ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుక బ్రతక వచ్చు' అన్నది మహిలోని సుమతుల భావన. 'ఉండి తిన్నను లేక పస్తున్న  గాని/ యాస చేయవు పరుల కష్టార్జితంబు' అని కదా కృషీవలుడి గురించి దువ్వూరివారి ప్రస్తుతి.

 

కళ్ళంలో పైరు నూర్చి ఏడాదంతా నమ్ముకుని పనిచేసిన సాటి పనివాళ్లందరికి నియమానుసారం పొల్లుపోకుండా పాళ్లు పంచిన పదప మాత్రమే  మిగులు ధాన్యాన్ని బళ్లకెత్తించి ఇళ్లకు మళ్ళించే రైతన్నను మించిన  ప్రజాపోషకుడు జగాన ఎంత గాలించినా ఏ యుగానా కనిపించడు. 'దొరలు ఇచ్చిన పాలు కంటే ధరణి పుత్రుడిచ్చిన పాలు మేలు' అన్న నానుడి ఊరకే పుట్టిందా! కానీ, 'కొర్రు గుచ్చిన దేశమందు కరవులుంటాయా? దుక్కి దున్నిన దేశమందు దుఃఖ ముంటుందా? కావు నడచిన భూమి మీద ఏపు తగ్గిందా?'  అన్న పాట మోట నాగలి దున్నుకుంటూ పాటలేవో పాడుకుంటూ పాటుపడే రైతుకు ఊరట ఇచ్చే రోజులు వెళ్ళిపోయాయేమో! సమకాలీన మాయాజాలంలో రైతు చిక్కిన దుస్థితిని ఒక ఆధునిక కవి వ్యంగ్య వైభవంగా వెలిబుచ్చిన వైనమే ఈ పరిస్థితికి అద్దంపడుతుంది. గొప్ప నాయకులు కొద్దిమంది కుప్పగా  వచ్చి 'ఎద్దుల జత మాకు జమ్ము సుమ్మి/ నిన్ను ఉద్ధరించి మిన్నగా జేతుము' అని హామీ ఇచ్చి పశువులను తోలుకెళ్ళారట. 'నీదు కొడవలిమ్ము లేదు అనకు/ నీకు సేవ చేయ నేలపై పుట్టినాము' అని మాట  ఇచ్చి  కొడవలితో మాయమయిందట మరో మాయదారి గుంపు. 'అవుదూడల నిమ్ము అన్ని విధముల నీకు/ సేవ చేయగలము' అని గోపు సాక్షిగా మాయచేసిన మూక మరొకటి. బక్కరైతును అప్పుడైనా వదిలారా! 'నిన్ను చేరదీయ   వచ్చినాము సుమ్మి భగవాను సాక్షిగా/ వేగ తెమ్ము నీదు నాగలి 'కొని' ' అని తీపిమాటలు చెప్పి అదీ తీసుకుని పోతే- చివరికేమీ లేక రైతు దీనుడైన వైనం ఇప్పటి రైతన్న దైన్యాన్ని   అద్దంలో చూపించే చేదు విషాదమే! 

 

సామాజికంగా వ్యవసాయదారుడు  ఎన్నో వ్యవస్థల పీడితుడు. పన్నులు, జరిమానాలు, హింసలు, దౌర్జన్యాలు రాజుల కాలంనుంచే రైతును సలుపుతున్న పీడలు. ఫ్యూడల్ వ్యవస్థ నాటి  భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, గ్రామాధికారులు బహుముఖాలతో సతాయించిన సైతానులు. కరవులు, వరదలు- ప్రకృతిపరమైన శాపాలు నిరక్షరాస్యత, నిరుపేదరికం- విజ్ఞానాన్ని, అభివృద్ధిని మింగేస్తున్న భూతాలు. రైతు జీవితంలో మెరుగుదల ఉంటేనే అధిక ఆహారో త్పత్తి... మరేదైనా' అంటుంది ఆరు దశాబ్దాల కిందటి 'గ్రోమోర్ ఫుడ్ కమిటీ.  ప్రపంచీకరణం ప్రతికూల ప్రభావంలో, ఆధునిక విలాస ఇంద్రజాలంలో చిక్కింది యువ రైతాంగం. వలసలు, మానవ వనరుల కరవు, అరకొర నీటి సదుపాయం, సేంద్రియ విధానాలకు దూరం, మితిమీరిన ఎరువుల వాడకం, నాణ్యతలో నాసిరకం, తడిసి మోపెడవుతున్న వ్యయభారం, ఎడాపెడా వాయించే రుణాల రణగొణ ధ్వనులు. అందని మద్దతుధర, దళారుల మాయాబజారులో చిక్కి చేతికందిన పంటకు నిప్పు పెట్టుకోవడమో చేయి కాలిందని చివరికి 'పురుగు మందు' తాగడమో... ఇదీ నడుస్తున్న రైతుకథలోని ప్రస్తుత విషాదాంకం. 'బురదమళ్లను సుధా- వరదల ఉంది/ వరద వెన్నుల వీజె సరిగల్మీటి/ నాగేటి చాలులో- రాగరసాలు/ పారకచ్చులలోన సారస్వతంబు' సృష్టించిన సైరికుడికా ఈ  విలాపం? 'కృషితో నాస్తి దుర్భిక్షం' సూత్రం నేతిబీర చందంగా  మారడానికి  కారణాలు అనేకం. దాశరథి అన్నట్లు 'ఈ ధరా భూమి మధురాధరాన/ అమృతమొలికిస్తున్న హాలికుడికి ఇదమిత్థంగా  దక్కుతున్నదేమిటి? రామపాదం లాంటి రైతుపాదం తాకిన భీళ్లన్నీ శాపవిమోచనం పొందుతున్నా అన్నదాత ఇంట కరవు ఛాయలుండటమేమిటి? తెలుగు గడ్డమీద రైతు శిరసెత్తుకు నిలిచి నడిచిన నాడే  కదా అసలు సిసలు సంక్రాంతి!

 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈ నాడు - ప్రచురితం - 18 -01 - 2015 ) 

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...