Showing posts with label Culture. Show all posts
Showing posts with label Culture. Show all posts

Friday, February 12, 2021

ఆచార్యదేవోభవ! కర్లపాలెం హనుమంతరావు -ఈనాడు ప్రచుర్తితం

 



'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు,

గాయత్రి ఉపదేశించినవాడు,

వేదాధ్యయనం చేయించినవాడు,

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,

పురోగతి కోరేవాడు,

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,

మోక్షమార్గాన్ని చూపించేవాడు

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)

(ఈనాడు, o5-o9-2009)

బాలల ఆటపాటలు - కర్లపాలెం హనుమంతరావు

              


బాల్యం అంటే అభివృద్ధి ఆగిపోయిన వృద్ధాప్యం కాదు. నిత్యోత్సాహానికి అది నిలువుటద్దం. పసిమనసు ఎంత సున్నితమో.. అంత సునిశితం. చూపు ఎంత విశాలమో.. తృష్ణ అంత ఉత్కృష్టం. ఎదిగిన మనుషులకుండే రసవికారాలకు బాలల మనసు బహుదూరం. స్వేఛ్ఛ బాలల శక్తి. ఆసక్తి వారి తరగని ఆస్తి. అనుకరణ వారి మాధ్యమం. పరిశీలన పాఠ్యప్రణాళిక. చిన్నవయస్సులో వంటబట్టిన జ్ఞానం.. ఆట పాటలతో తీర్చిదిద్దిన నడత కడదాకా తోడొచ్చే మంచి మిత్రులు.

పిల్లల దృష్టి చదువు నుంచి పక్కకు చెదురుతుందన్న బెదురుతో వారిని పెద్దలు ఆట పాటలకు ఆమడ దూరంలో ఉంచుతున్నారు. అది సరి కాదు. పశ్చిమదేశాల్లో రూసో కాలంనుంచి చదువు సంధ్యల్లో ఆటపాటల పాత్ర పెరిగే దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయి.  కుసుమ కోమలంగా ఉండే పసిమనసును కఠిన పరీక్షలకు గురిచేయడం మానుషం అనిపించుకోదు. మనోగత అభిప్రాయాలని సానబెట్టే ఐచ్ఛిక విద్యావిధానం మాత్రమే పసివారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది.

విద్య పరమావధి మనోవికాసమే అన్న సిద్ధాంతం ఇప్పుడు సర్వే సర్వత్రా అందరం  సమ్మతిస్తున్న వాదం. సంపూర్ణ వ్యక్తిత్వం సాధించడానికి విద్య ఒక ముఖ్యమైన సోపానంగా భావించి సమర్థిస్తున్నాం. ఆటపాటల ద్వారా అత్యంత సహజంగా బాలబాలికలకు విద్యాబోధన చేయవచ్చ'ని గాఢంగా విశ్వసించిన విద్యావేత్త ఫ్రీబెల్(Free Bell). ప్లే సాంగ్స్ఆటవస్తువుల ద్వారా చదువుసాములు సాగించే 'కిండర్ గార్టన్'(Kinder Garten) విధానం ఫ్రీబెల్ రూపొందించిందే!

మన ఆచారవ్యవహారాలైన నోములువ్రతాలు వంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలు తరచి చూసినా అడుగడునా కంటబడేదీ అంతర్లీనంగా సాగే విద్యావిధానమే! ఫ్రీబెల్ ఆటపాటల్ని (ప్లే సాంగ్సు) ఏడాది నుంచి పదేళ్ళ   వయసున్న బాలలకోసం  రాసారు. బిడ్డల్ని సరైన దిశలోకి మలిపే  ప్రాథమిక దిశ ఇదే కావచ్చన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. సరిగ్గా ఆ అభిప్రాయంతోనే మన ప్రాచీనులు  సైతం పసిమనసులకు సులభంగా పట్టుబడే బాలగీతాలను ఆటలతో మేళవించి మప్పే ప్రయత్నం చేసారు.

ఉదాహరణకు 'చందమామపాటనే తీసుకుందాం!

'చందమామ రావే! జాబిల్లి రావే! కొండెక్కి రావే! గోగుపూలు తేవే!

భమిడిగిన్నెలో పాలు పోసుకొని.. వెండిగిన్నెలో పెరుగు పోసుకొని

ఒలిచిన పండు ఒళ్ళో వేసుకుని.. ఒలవని పండు చేత్తో పట్టుకొని

అట్లా వచ్చి అట్లా వచ్చి అమ్మాయి నోట్లో వేయవే!'

అని పాడుతూ తల్లి బిడ్డకి బువ్వ తినిపిస్తుంది. ఈ పాట మూలకంగా బిడ్డ దృష్టి సౌందర్యంమీదకు మళ్ళుతుంది. ఊహాశక్తి ఊపందుకుంటుంది. ఆకాశజీవులమీద ఆసక్తి పెరుగుతుంది. ఫ్రీ బెల్ ఉద్దేశంకూడా సరిగ్గా ఇదే కదా!

బిడ్డకు రెండేళ్ళు వచ్చి కూర్చోవడం వచ్చిన దశలో 'కాళ్ళా గజ్జాఆట ఆడిస్తారు మన తల్లులు.

'కాళ్ళా గజ్జా కంకాళమ్మా! వేగు చుక్కా వెలగా మొగ్గా!

మొగ్గా కాదు మోతీ నీరు/ నీరూ కాదు- నిమ్మల వాయ/

వాయా కాదు- వావిలి కూర/ కూరా కాదు- గుమ్మడి మీసం/

ఇలాగా సాగి.. సాగి చివరకు

'శెట్టీ కాదు- శ్యామల మన్ను/ మన్నూ కాదు- మంచిగంధం చెక్కఅని ముగుస్తుంది పాట.

ఒక్కో మాటకు  ఒక్కోకాలు తడుతూ 'మంచిగంధంవంతు వచ్చిన కాలును పండినట్లు ముడిచి  పక్కన పెట్టడం పాటలోని ఆట. బిడ్డకు పద పరిజ్ఞానం పెంచడం వైజ్ఞానిక ప్రయోజనమైతే.. కాళ్లు ముడవడం.. తెరవడం వంటి మంచివ్యాయామం అందించడం దైహిక ప్రయోజనం. వైద్య రహస్యాలు కూడా ఈ పాటలో ఇమిడి ఉన్నాయి మరింత సునిశితంగా గమనించగలిగితే!

'కొండమీదవెండిగిన్నె/ కొక్కిరాయి- కాలు విరిగె/ విరిగి విరిగి మూడాయె/ దానికేమి మందు?'  అని అడిగి 'వేపాకు చేదు/వెల్లుల్లి గడ్డ/నూనెమ్మ బొటు/ నూటొక్క ధారఅని గోసాయి చిట్కాలు నేర్పించే పాట ఇంకోటి.

ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టే ' నీ చేతులేమైనాయి?/ పిల్లెత్తుకు పోయింది/ పిల్లేమి చేసింది?/ కుమ్మరివాడికిచ్చిందిలాంటి పాటలింకో రకం.

'ఆడపిల్లలు ఆడుకునే 'చింతపిక్కలుఆటలో గణిత విజ్ఞానం దాగుంది. 'ఒక్క ఓలియ/ రెండు జోకళ్ళు/ మూడు ముచ్చిలక/ నాలుగు నందన/ ఐదు బేడీలు/ ఆరు చిట్టి గొలుసులాంటివి అలవోకగా బాలలకు ఒంట్లు వంటబట్టే పాటలు.  ఐదారుగురు గుప్పిళ్ళు ముడిచి ఆడుతూ పాడుకునే 'గుడు గుడు గుంచంపాట పసివాళ్ళకు పరిమాణ స్వరూపాన్ని పరిచయం చేసే పాట. 'కత్తి పదును.. బద్ద పదునువేన్నీళ్ళ వేడిచన్నీళ్ళ చలితెలియచేసే పాట. 'పప్పూ పెట్టి/ కూర వేసి/పిండివంటలు వేసి/ అత్తారింటికి దారేదంటే/ ఇట్లా.. ఇట్లా..అంటూ తల్లి చేతివేళ్ళతో బిడ్డకి చక్కలిగింతలు పెట్టి  మరీ నవ్వించడం.. కేవలం నవ్వులతోనే కాలక్షేపం చేయడానికి కాదు. ఆచారవ్యవహారాలమీద బాలలకు ఒక ఆనందకరమైన అనుభూతిని అలవాటు చేయడానికే! ఇలా ఎన్నైనా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోవచ్చు.

బాలసాహిత్యం ఏనాటిదో చెప్పలేం. ఈ పాటలు ఎవరు కట్టినవో  కనుక్కోవడం కష్టం. బిడ్డల మనసెరిగిన ఏ తల్లి తలలో మెదిలిన భావ తరంగాలో  వాత్సల్య రూపంలో వెలికి వచ్చుండవచ్చు. 'బాలవాజ్ఞ్మయానికి తల్లి మనసే ధర్మకర్తృత్వం వహించేదిఅంటారు చింతా దీక్షితులు.

ఆదికావ్యానికి నాంది విషాదం ఐతే.. బాలసాహిత్యానికి నాంది తల్లి ప్రేమ. ప్రపంచంలో ఏ దేశ వాజ్ఞ్మయాన్ని పరిశీలించినా ఇలాంటి బాలసాహిత్యమే చిట్టి చిట్టి సెలయేళ్లలా సందడి చేస్తూ కనిపించేది.బిడ్డల ఆలనా పాలనా ఆట పాటలతో మిళాయించడం వట్టి పాశ్చాత్య విద్యావేత్తల బుర్రల్లో    మాత్రమే పుట్టి పెరిగిన ఆలోచన కాదు. మన  ఆచార వ్యవహారాలలో       ఏనాటినుంచో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న విద్యావిధానం అని చెప్పడమే ఈ చిరు వ్యాసం ఉద్దేశం.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

***

 

 

Wednesday, February 10, 2021

 



నమస్తేలోనే ఉంది సమస్తం

 

-కర్లపాలెం హనుమంతరావు

10 -02 -2021

 

నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.

న ‘మస్తే’ అంటే తల లేని వ్యవహారంగా కొద్దిమందికి వెటకారం. జోడించే వడుపు కుదరక  చేతులను  ఆడిపోసుకోవడమే అదంతా! 

తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవ్వంత కార్యలాభం కలిగింది కాదు.   ఆలస్యంగా వచ్చినా  నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన పాండవ మధ్యముడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహ లాభం. నిండు సభామధ్యంలో ఇట్లాంటివే ఏవో  దండకాలు.. స్తోత్రాలు చదివినందు వల్లనే   ఆ గాండీవుడి అర్థాంగికీ  రుక్మిణీవల్లభుడి సహోదరత్వం అండలా లభించింది. అందుకే,  ‘ఆఁ! దండాలూ దస్కాలా!’ అంటూ వెక్కిరింపుకలొద్దు! ఆ మస్కా జాతి  ట్రిక్కే ఎంత కోన్ కిస్కా గొట్టాన్నైనా ఇట్టే గుప్పెట్లో పట్టేసుకునే పట్టు!

రామాయణమే ప్రణయాంజలి ప్రభావాలకు పరమ  ప్రమాణం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అట్లా నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకు మించిన అపూర్వ గౌరవం ఆంజనీ పుత్రుడు కొట్టేసింది. ఉన్న ఒక్క తొండంతోనే  చేతనైనంత వరకూ సాగిలపడబట్టే కదా  ఆపదల మడుగు నుంచి గట్టెక్కగలిగింది    కరిరాజు గజేంద్రమోక్షంలో!

అదే చాయలో పోబట్టే అప్పట్లో మన పక్క రాష్ట్రం పన్నీరు సెల్వంసారూ.. అమ్మవారి అనుగ్రహం అమాంతం కొట్టేసారు. జయామ్మాళ్ ఆ రోజుల్లో  సర్కారువారి సత్కార గృహ(జైలు) యాత్రకెళ్ళినప్పుడల్లా  పన్నీరువారు ముఖ్యమంత్రి పీఠానికి ముఖ్యమైన  కాపలాదారు! ఆ తరహా ఎక్స్ట్రా లాభాలకు ఎల్ల వేళలా నమస్కార బాణాలే బ్యాగ్రౌండు నుంచి బాగా వర్కవుటయ్యేది కూడా.. బయటికి కనిపించవు కానీ!

స్వామివారు కంట బడ్డప్పుడు స్వాభిమానలవీ  పెట్టుకోడం కూడదు. 'నమో నమః' అంటూ సాష్టాంగ ప్రమాణాలు  ఆచరించకుంటే ఆ తరువాత జరిగే చేదు అనుభవాలకు ఎవరికి వారే బాధ్యులు.. యడ్యూరప్పే అందుకు గొప్ప  ఎగ్జాంపుల్!

పది తలలున్నాయి.. ఏం లాభం? ఉన్న రెండు చేతుల్నీ వేళకి సద్వినియోగం చేసుకునే  విద్య అలవడకే  అంత లావు రావణుడూ   రాముడి ముందు పిట్టలా రాలిపోయింది. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళ జాతి పతనానికి  ముఖ్య కారణం  ఈ దాసోహ  దాసోహం రాజకీయాలకు దాసోహం అనకపోవడమే!  రాక్షసులకు  తెలియని చమత్కారం మన రాజకీయ పక్షులకు మా  బాగా తెలుసు.  లేకుంటే మన ప్రజాస్వామ్యం  మరీ ఆర్ట్ మూవీకి మల్లే బోర్ కొట్టదూ!

కడుపులో ఎంత కంటయినా ఉండుగాక.. ఓ యాత్ర కంటూ బైలుదేరాక   దేవుడిచ్చిన రెండు చేతులూ  గోజుతో కరిపించినట్లు గాలిలో అట్లా ఊపుతూనే ఉండాలి.  జైలుకు వెళుతూ వస్తూ కూడా మన నేతాశ్రీలు పళ్ళికిస్తూ గాల్లోకి అలా వణక్కాలు గట్రా  వదలడం చూస్తున్నా .. ఇంకా వందనాల విలువను గూర్చి సందేహాలేనా! మీ కో నమస్కారం!

ప్రణామాలకు, వాగ్దానాల మాదిరి  కాలపరిమితి బెడద లేదు! నగదు బదిలీ.. రుణమాఫీలకు మల్లే   ఈ ప్రజాకర్షక పథకానికి పైసల్తోనూ బొత్తిగా నిమిత్తం లేదు.  ఏ ఎన్నికల సంఘం  అదుపూ.. అజమాయిషీ లేకుండానే రెక్కల్లో ఓపిక ఉన్నంత కాలం వాడుకుని ఆనక వదిలేసే  సౌకర్యం ఒక్క చేతుల జోడింపులోనే కద్దు. చెప్పిందేదీ చెయ్యకుండా  చెయ్యిచ్చే నేతలు సైతం ఈ  చేవిప్పులు(నమస్కారాలు) కెప్పుడూ చెయ్యివ్వని కారణం ‘చేవిప్పు’ మీద ‘విప్’ జారీ చేసే అధికారం ఏ పార్టీ ‘వివ్’  లకూ  లేకపోవడం!

ఎన్నికలు ఎప్పుడొచ్చినా  నరేంద్ర మోదీకి కలిసొచ్చే  అంశాల్లో  ప్రధానమైనది కుదించి పలికే ఆయనగారి పొట్టి పేరు ‘నమో’ ! ఓ వంక దెప్పుతూనే మరోవంక 'నమో.. నమో' అనక తప్పని  తలనొప్పులే  ప్రతిపక్షాల కెప్పుడూ.. పాపం పిటీ! 

పబ్లిగ్గా ఎంత పడతిట్టిపోసుకున్నా శాల్తీ కంటబడ్డప్పుడు ఏ సంకోచం లేకుండా కల్తీ లేని ‘నమస్తే’ ముద్రొకటి అభినయిస్తే చాలు.. సగం అభిప్రాయభేదాలు సాల్వ్ డ్! ప్రధాని మోదీ ఓం ప్రథమంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిప్పుడు సార్క్ దేశాధిపతులంతా మూకుమ్మడిగా  కలసి సాధించిందీ అదే!  ఎవరి బాణీలో వాళ్ళు  నమస్కార బాణాలు సంధించుకుంటూ సరికొత్త విదేశీ సంబంధాలకు బోణీ కొట్టడం!

జపాను పోనీ.. చైనా పోనీ.. అమెరికాతో సహా ఏ గడ్డ మీద  కాలు పడ్డా.. మన ప్రధాని మోదీని ఆదుకున్నవీ మొదట్నుంచీ చేతులే! తంపులమారి ట్రంపయినా   తప్పించుకోలేని అట్రాక్షన్ ప్రణామంలో ఉంది. 

'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అంటూ ఆ త్యాగరాజయ్యరువారంతటి వైతాళికులు ఊగిపోయారు. ఆరోగ్యాన్నిచ్చి, బంధుకృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడు అనే గదా ఆ పై నెక్కడో ఉండే  సూర్యుణ్ణి కూడా భగవానుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో రెండు పూటలా అలా పడీ పడీ సూర్యనమస్కారాలు చేసుకోడం!  

అర్హతలతో నిమిత్తం లేకుండా అందలం ఎక్కించి పదిమందిలో గుర్తింపు తెచ్చిపెట్టే  లోకబాంధవి నమస్కారం.  నిజానికి పడమటి ‘హాయ్.. హలో’ లకు మించి  ఇవ్వాలి ఈ నమస్కారానికి మనం గౌరవం. అందుకు విరుద్ధంగా లోకువ కట్టేస్తున్నాం.. అదీ విడ్డూరం! 

ఏ అరబ్బుల దేశంలోనో  పుట్టుంటే తెలిసుండేది మన  వందనాల విలువ.  ఖర్మ కాలి ఏ ఒసామానో  కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకు చావాల్సొచ్చేదక్కడ.  రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా.. ఎన్నేసి రకాల నామధేయాలండీ నమస్కారాలకు  మన పుణ్యభూమిలో!  'నమస్తే' అంటే 'వంగటం' అన్న ఒక్క  పిచ్చర్థం  మాత్రమే తీసుకుని పెడమొహం పెట్టేస్తే ఎట్లా?  పూరా నష్టపోతాం కదరా ఉన్న ఒక్క  ప్రపంచ స్థాయి గుర్తింపు  పిచ్చిగా వద్దనుకుంటే  సోదరా!

 అమెరికా అధ్యక్షులు ఎవరు ఇండియా వచ్చినా,  వెళ్ళిన  ప్రతి చోటా అదే పనిగా 'నమస్తే'లు కుమ్మేస్తారు. బిలియన్ డాలర్లు విలువ చేసే  బిజినెస్సులతో దేశీయ మార్కెట్లను  కమ్మేస్తారు.  

మనలను ఏలి పోయిన తెల్లవాడిదే తెలివంటే. మన నమస్కారమే మన పైన గడుసుగా సంధించేసి మన రాజుల్ని, నవాబుల్ని బుట్టలో వేసేశాడు! ఇంగ్లీషు వాడి  నమస్తేకి  పదిహేను వందలేళ్ల  గ్రంథం ఉంది. అదంతా మొదలు పెడితే ముందు మీరు నాకు నమస్కారం పెట్టేస్తారు!

తూర్పు పడమర్లు, ఉత్తర దక్షిణాలనే తేడా ఏముందిలే కాని

నమస్కారాన్ని కనిపెట్టిన మహానుభావుడికో నమస్కారమైతే.. దాన్నో ఆయుధంలా వడుపుగా వాడేసుకునే తాజా రాజకీయాలకు  వందలొందల నమస్కారాలు!


నమస్కారాన్ని నమ్ముకున్న వాడెన్నటికీ చెడే ఆస్కారం లేదు. 'దండమయా విశ్వంభర.. దండమయా పుండరీక దళనేత్ర హరీ..  దండమయా ఎపుడు నీకు.. దండము కృష్ణా!' అంటో దండక శతం ఆపకుండా గడగడ చదవ గలిగే గడుసు పిండానికి ఏ గండాలు రావు.  వచ్చినా రామచంద్రుడి ముందు   సముద్రుడంతటి వాడొచ్చి సంధించిన  బాణంలా అవి తీరం దాటి ప్రళయం సృష్టించబోవు.

గూగుల్ నుంచి ట్వట్టర్ దాకా  ‘నమస్కారం'   సృష్టిస్తోన్న  ప్రభంజనం  ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా ప్రణామ మాహాత్మ్యాల మీద సవాలక్ష సందేహాలంటే.. బాబూ .. తమకో నమస్కారం!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...