Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Sunday, February 5, 2017

పెరటి మందు- చతుర కథ




నాలుగు రోజులుగా ఒంట్లో బాగుండటం లేదు. టెంపరేచర్ చూస్తే నార్మల్ గానే ఉంది. కానీ ఆకలి మందగించింది. దాంతోపాటే చురుకుదనమూ తగ్గింది బాగా. ఇదివరకు ఇలాగే సుస్తీ చేసినప్పుడు డాక్టర్ రామనాథంగారి దగ్గర కెళ్లాను. 'అన్నీ వితిన్ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం తొందర్లోనే మెజారిటీలో కలసిపోతారు' అన్నాడాయన.

'మెజారిటీ అంటే?'

'మన దేశంలో నలభై ఏళ్ళు దాటినోళ్ళందరికీ బి.పిలు, షుగర్లు తగులుకుంటున్నాయి. ఆ మెజారిటీ' అంటూ నవ్వి టానిక్కులూ అవీ రాసిచ్చి క్రమం తప్పకుండా వాడమన్నాడు. మళ్లా నెలరోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు.
డాక్టరుగారిచ్చిన మందులే కాదు, ఇంకా చాలా మందులు అదనంగా వాడుతున్నాను చాలా కాలం నుంచి. ఆ డాక్టర్నే కాదు.. ఇంతకుముందు ఇంకా చాలా మందిని కల్సిన కారణంగా.. తగ్గినట్లే తగ్గి మళ్లా సుస్తీ ఎందుకు తిరగ బెట్టేస్తుందో అర్థం కావడంలేదు. అందుకే ఈ అవస్తలన్నీ!

ఒంట్లో ఓపికుండంగానే వాలంటరీ రిటైర్మెంటు తీసుకొన్నాను. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలలో చేరిపోయారు. ఆవిడ ప్రభుత్వోద్యోగి. 'బ్యాంకు ఉద్యోగం. ఎంతొచ్చినా అవసరానికి మించేం చేసుకుంటాం. బదిలీల మీద ప్రదక్షిణాలు చేయడం  తప్ప' అన్న వేడాంతంతో పదేళ్లు ముందే చేసిన అస్త్రసన్యాసం అది. పనీపాటా లేకపోవడం మొదట్లో సర్దాగానే ఉన్నా.. రాన్రానూ.. సమయం గడవక మహా విసుగు మొదలయింది.
ఎంతసేపు టీవీ చూస్తే కాలక్షేపం అయ్యేను! ఎన్ని పత్రికలు తిరగేసే పొద్దు పోయేను!

ఈ మధ్య కంటి చెకప్పుకని వెళ్లినప్పుడు ఆ డాక్టరూ చావు కబురు చల్లంగా చెప్పేసారు 'మీ ఎడమ కంటికి గ్లాకోమా ఎఫెక్టయింది' అని.

'గ్లాకోమా అంటే?'

'కంటి నరాలకి సంబంధించిన వత్తిడండీ! వంటికి బి.పి లాంటిదే అనుకోండి. చూపులో మెల్లంగా తేడా వస్తుంది. అలిగి పుట్టింటికి పోయిన పెళ్లామయితే మనసు మార్చుకొని తిరిగొస్తుందేమో గానీ.. దీందుంప తెగ!  పోయిన చూపుకు ఆ మాత్రం కూడా దయ ఉండదు. ఎన్ని మందులు వాడినా  చస్తే తిరిగి  రాదు. మానవ సంబంధాలను సరిదిద్దేందుకు ఏమైనా మందులు కనిపెట్టారేమో తెలీదు కానీ.. గ్లాకోమా కారణంగా నష్టపోయిన దృష్టిని తిరిగి తెప్పించడంలో  మాత్రం ఇంత వరకు  ఎవరూ సఫలం కాలేదు.

'డాక్టరుగారి సెన్సాఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేసే స్థితిలో లేను నేను. 'మరిప్పుడెలా డాక్టర్ గారూ?' అనడిగాను ఆందోళనగా.

'డోంట్ వరీ టూ మచ్ మిష్టర్ రావ్! అందువల్ల ఒరిగేదేమీ కూడా లేదు. కొన్ని మందులు రాసిస్తాను. క్రమంగా తప్పకుండా వాడాలి. విజన్ లాస్ కట్టడి చేయడం కుదరక పోయినా.. ఆ స్పీడును కాస్త కంట్రోలు చేసుకోవచ్చు. కావాల్సింది పేషెంట్ లో మనో నిబ్బరం.. క్రమ శిక్షణ. భోజనం ఓ పూట మానేసినా సమస్య లేదు. కానీ ఈ మందులు మింగడం మాత్రం మానేయకూడదు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ!' అంటూ ప్రిస్కిప్షన్ రాసిచ్చి తగిన జాగ్రత్తలు చెప్పి పంపించాడా కళ్ల డాక్టర్.

కాస్త ఖరీదైన మందులే అయినా క్రమం తప్పకుండా వాడుతున్నాను. అయినా మధ్య మధ్యలో ఈ సుస్తీ పరామర్శలేవిఁటో! నా ఆందోళన చూసి మా పక్కింటి రమణమూర్తిచ్చిన సలహామీద ఇదిగో.. ఈ  పంజగుట్టలో ఉన్న డాక్టర్ సహాయ్ గారిని కలవడానికని వచ్చాను.

'రమణ మూర్తి చెప్పాడు' అంటూ ఆయన క్యాజువల్ గా పరీక్షించి  మళ్లా రెండు రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు. రెంద్రోజులయ్యాక వెళ్లినప్పుడు మళ్లా జస్ట్ క్యాజువల్ గా పరీక్షించి మరో మూడ్రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు! ఆయన చెప్పిన టైముకే వెళ్లాను మూద్రోజుల తర్వాత..  పడుతూ లేస్తూ! యధాలాపంగా  ఏదో చిన్న  పరీక్షలాంటిది  చేసి ..   ఇంకో వారం రోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు! వెళ్ళిన ప్రతీ సారీ ఇదే తంతు!  ఏదో చెక్ చేస్తాడు. బరువు చూస్తాడు. ఆకలిని గురించి అడుగుతాడు. ఆహారం అలవాట్లను గురించి అడిగిందే అడుగుతాడు. నాకు ఎందుకో కాస్త అసహజంగా అనిపిస్తుంది. అసహనంగా కూడా ఉంది.  కొంతమంది డాక్టర్లకు పేషెంట్లను ఇలా వూరికే తిప్పుకోడం సరదా అనుకుంటా. సాడిజమా?'డబ్బు కోసవాఁ ఈ తిప్పలన్నీ! అనుకోవడానికీ లేదు ఈయన కేసులో. మొదటిసారి వెళ్ళినప్పుడు ఛార్జ్ చేసిందే! తరువాత ఇన్ని సార్లు వెళ్లినా పైసా అడగడం లేదు. మరెందుకు ఇన్నేసి సార్లు తిప్పించుకుంటున్నట్లు?!

ఈ నెలరోజుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా ఏవీఁ లేవే?! ఎప్పటిలాగే ఈ డాక్టర్ను కూడా మార్చేయడం ఒక్కటే మంచి మందు.' అని నిశ్చయానికొచ్చేసాను. మార్చేసే ముందు కడుపులో ఉన్న ఆలోచనను  ఆయన ముందు పెట్టడం మంచిదనిపించింది. ఆయన చెప్పిన టైముకి వెళ్లి కలిసాను.

ఎప్పట్లానే బి.పి, బరువు, ఆకలిఆహారం అలవాట్లు.. అన్నీ అడిగాడు. అనుకున్నట్లుగానే మరో మూడు రోజులాగి రమ్మన్నాడు మందూ మాకూ ఏవీ ఇవ్వకుండానే! ఇహ ఉండబట్టలేక గట్టిగానే అడిగేశాను మనసులో ఇంతకాలం బట్టీ రొళ్లుతున్న ఆ  సందేహం!

ఆయన కోపం తెచ్చుకోలేదు. సరికదా.. నవ్వుతూ అన్నాడు 'చూడండి రావుగారూ! మీరు మోతీనగర్లో ఆంజనేయస్వామివారి టెంపుల్దగ్గర కదా ఉంటారు? మా ఇల్లూ ఆ టెంపుల్కి ఆ రెండో వైపే ఉంది. నేను రోజూ అయిదు గంటల ప్రాంతంలో ఆ గుడి పక్క పార్కులో జాగింగ్ చేస్తుంటాను. నేను మిమ్మల్ని అక్కడ చూస్తుంటాను.'

'నన్నా! పార్కులోనా! ఇంపాజిబుల్ సార్! నేనసలెప్పుడూ ఆ జాగింగులూ.. గట్రా కోసం పార్కులకు  రానేఁ!

''జాగింగుకి రారు. కానీ పాల ప్యాకెట్లు పికప్ చేసుకోడానికైతే వస్తుంటారు కదా? నిజానికి మీరా పాకెట్ల వంకతో అయినా మీ ఇంటి నుంచి  నడుచుకుంటూ రావాలి ఈ వయసులో! కానీ స్కూటీ మీద వస్తుంటారు. పార్కు గేటు ముందు స్కూటీ ఆపి పార్కు అడ్డ దారి గుండా అటువైపున్న డాబ్బా నుంచి పేకట్లు తీసుకుని మళ్లా స్కూటీ మీద వెళ్లి పోతుంటారు. నడక మీకు పడదని నాకప్పుడే అర్థమైపోయింది. మీ కేస్ షీట్ చూసాను. ఈ రెండేళ్ళల్లో నలుగురు డాక్టర్లని మార్చేసారు. ఇప్పుడు నన్ను కూడా మార్చేయబోతున్నారేమో! నిజానికి మీరు మార్చాల్సింది డాక్టర్లను కాదు రావుగారూ! మీ అలవాట్లను. లైఫ్ స్టైల్ ని. ఉద్యోగం మానేశారు. అది మీ పర్సనల్. కానీ ఆరోగ్యం కోసం ఆ స్థానంలో మరేదైనా చేయాలి కదా! ముఖ్యంగా శరీరానికి అలవాటైన శ్రమనుంచి వంట్లో ఓపికున్నప్పుట్నుంచే అనవసరంగా విరామమిచ్చేస్తే.. ఇదిగో పరిణామాలిలాగే ఉంటాయి.

నేనేదో సంజాయిషీలాంటిది ఇవ్వబోతుంటే వారించి ఆయనే కొనసాగించాడు 'మీ గురించి మీ నైబర్ రమణ మూర్తి అంతా చెప్పారు. కనీసం అపార్టుమెంటు వెల్ఫేర్  పనుల్లో అయినా బిజీగా గడపేయచ్చు మీ లాంటి ఎర్లీ రిటైరీస్! ఏదో ఓ రూపంలో బాడీకి ఎక్సర్సైజెస్ చాలా అవసరమండీ ఈ రోజుల్లో! సారీ! ఇలా అన్నానని ఏమీ అనుకోకండీ.. ఔట్ పుట్ లేకుండా.. ఒన్లీ ఇన్ పుట్ మీదే ధ్యాస పెట్టేస్తే ఇదిగో.. ఇలాంటి అనారోగ్య సమస్యలే దాడి చేస్తాయ్ శరీరంమీద.  బాడీ బరువెక్కడం.. ఆకలి మందగించడం..ఆసక్తి సన్నగిల్లడం.. ప్రతికూలమైన ఆలోచనలు పెరిగిపోవడం.. ఇవన్నీ సోమరితనం వల్లనే సంభవించేవని వందేళ్ల కిందటే పరిశోధనల్లో తేలాయి. మందులు.. చికిత్సల పేరుతో నేనూ ఇంతకు ముందు మీరు చూపించుకున్న డాక్టర్ల మాదిరిగానే ఎంతైనా గుంజుకోవచ్చు. మీక్కూడా ఏదో ట్రీట్ మెంటు జరుగుతోందన్న తృప్తీ ఉండేది. ప్రిస్కిప్షన్ పేపరి వంక మీరొక్క సారైనా చూసారా?'

'చూడ్డానికి మీరసలు మందులేవైనా రాసిస్తేగదా డాక్టర్!' ఛాన్సొచ్చిందని నిష్ఠురానికి దిగబోయాను.

'మందులు రాయడం లేదా?.. ఏదీ చూపించండి?' అని ఫైల్ తెరిచి ప్రిస్కిప్షన్ పేపరు నా ముందు పరిచారు.

'రోజూ  ఉదయం..  సాయంత్రం ఏదైనా కడుపులోకి తీసుకొన్న తరువాత.. కనీసం ఓ గంటపాటు నడవాలి' అని రాసుంది.. ఇంగ్లీషులో!

నేనా సలహా చూడకపోలేదు. నడవమని సలహా ఇవ్వడం మందులు రాసినట్లెట్లా అవుతుందని నా ఆలోచన. అందులోనూ నాకు మొదట్నుంచి నడకంటే మహా చిరాక్కూడా!

ప్రిస్కిష్పన్నలా వదిలేయండి రావుగారూ! మోరొచ్చిన ప్రతీసారీ నేను నడక ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూనే ఉన్నాను. నా దగ్గర 'ఊఁ' గొడుతూ పోయారే కానీ.. కనీసం మీ ఇంటి దగ్గర పాలడబ్బాకి వెళ్లేటప్పుడైనా పార్కు అడ్డదారిని ఎంచుకోడం మానేయలేకపోయారు! మీరు పార్కు చుట్టూ కాలినడకన వెళ్లి పని ముగించుకోడం మొదలు పెట్టేవరకైనా నేను ట్రీట్ మెంటు మొదలు పెట్టకూడదనుకున్నాను. మొదల పెట్టీ ప్రయోజనం ఉండదు. ఇదివరకటి డాక్టర్లకు మల్లే మీ చేత వందలొందలు ఖర్చు పెట్టించడం.. ఆనక చేతకాని డాక్టర్నని తిట్టించుకోడం తప్ప. పెరటి చెట్టును కదా.. అందుకు చులకనయానేమో మరి.. మీకే తెలియాలి' అని నవ్వుతూ లేచాడు డాక్టర్ సహాయ్!

అప్పుడర్థమయింది.. ఇంటిముందు బంగారంలాంటి పార్కు పెట్టుకొనీ.. జాగింగ్ చేసేందుకు బద్ధకించి రోగలు కొని తెచ్చుకొన్న  నా పొరపాటు. మందులకోసం వేలకు వేలు పోసాను. పదుల కొద్దీ డాక్టర్లను తెగ మార్చేసాను.. లోపం నాలో ఉంచుకొని.

మర్నాడు పాలపాకెట్టుకు బైటకు వెళ్లేటప్పుడు స్కూటీ తీయ లేదు. ఎప్పటి కన్నా ఓ గంట ముందే లేచి బైటకు వెళ్లే నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం నేను గమనించక పోలేదు.

పార్కులో జాగింగ్ చేస్తున్న డాక్టర్ సహాయ్ నన్ను చూసి గుర్తు పట్టి 'హాయ్' అంటూ చేతులూపాడు కూడా! నెక్స్ట్ విజిట్ కి వెళ్లినప్పుడు 'పార్కు చుట్టూతా అలా నెమ్మదిగా కాకుండా ఇంకాస్త వేగంగా పరిగెడితే.. నెనిప్పుడు రాసిస్తున్న మందులు మరీ ఎక్కువ కాలం వాడాల్సిన పనుండదు' అని భుజం తట్టాడు డాక్టరు సహాయ్ గారు!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్,యూఎస్ఎ

 

(చతుర- ఆగష్టు, 2012 నెల సంచిక ప్రచిరతం)

 

Friday, October 7, 2016

బుద్ధికి బుద్ధుండాలంటే..!

బుద్ధి కూడా శరీరంలో ఒక అవయవమే! చేతనాత్మకమైన మెదడుని బుద్ది అనుకోవచ్చు. వయసు.. ఆరోగ్యం.. పరిసరాలు.. సందర్భాలమీద ఈ బుద్ధిలోని చేతనాత్మకతలో హెచ్చు తగ్గులు సహజం.
కంప్యూటరుతో బుద్ధిని పోల్చలేం. బుద్ధి కంప్యూటరుకన్నా రెండాకులు ఎక్కువ తిన్న గడుసుపిండం. సూక్ష్మంలో మోక్షం అన్న సామెత మనకోటి ఉంది కదా! బుద్ధికి అతికినట్లు సరిపోతుందా సామెత. 
కంప్యూటరుకి మనం పనిగట్టుకొని ఆదేశా లివ్వాలి. రాంబంటులా  అది పని చేసుకుపోతుంది. బుద్ధి అంతకన్నా బుద్ధిమంతురాలది.  మనంగా  ఏ సమాచరమూ గట్రా ఇవ్వక పోయినా .. సొంత తెలివితేటలతో తనకై తాను  గ్రహించి..  భద్ర పరుచుకొని.. విశ్లేషించుకొని.. ఆనక  సమయ సందర్భాలనుబట్టి మన సాయానికొస్తుంది.. అచ్చంగా కట్టుకున్న ఇల్లాలిలాగా. 
మన శరీరం  ఎదగాలంటే ఆహారం, గాలి, నీరు, కాలం .. కావాలి! మేత ఆగితే కూత మందగిస్తుంది. కానీ మనం కాణీ ఖర్చుచెయ్యకుండానే  కొంతకాలం బుద్ధి తన మంచి చెడ్డలు చూసుకోగలదు. మరీ నిర్లక్ష్యం చేస్తే కనక.. పెళ్లాం అలిగి పుట్టింటికి పోయినట్లు.. సహకరించడం మానేస్తుంది. 
'మేథస్సు జీవితాంతం ఎదుగుతూనే ఉంటుంది'- అన్న  మిల్టన్ మహాకవి ఎందుకన్నారో కానీ ఆ  సూక్తి కొంత మేరకే నిజం. అలా  ఎదగాలంటే ఎదురుగాలి లేకుండా చూసుకోడం సదర మనిషి బాధ్యత.
మెదడుకూ ముదిమి తప్పదు. కానీ శ్రద్ధాసక్తుల కనపరుస్తే  దాని జవసత్వాలు  మనం   అధీనంలోనే పనిచేస్తాయి చివరి వరకూ దాదాపు.
మెదడుకు సంబంధించిన పదం మేథస్సు. మేథస్సు పరిరక్షణకోసం మెదడుకి మూడు రకాల ధర్మాలు నిర్దేశించబడ్డాయి. ధీ.. ధృతి.. స్మృతి.
'ధీ'-  విషయాలను గ్రహించుకొనే లక్షణం. ధృతి- విశ్లేషించుకొనే లక్షణం
స్మృతి- గుర్తుకు తెచ్చే లక్షణం.
ఈ మూడూ ఒకదానికొకటి అనుసందానంగా ఉండి పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉండటమే 'మేథస్సు'. 
మేథస్సంటే ఒక విధంగా  బుద్ధిబలం. వెన్నుపూసల నెత్తిమీద ముద్దలా ఉంటుందది.  చిక్కుముడుల రూపంలో కనిపించే నరాల సముదాయానికి సైంటిష్టులు  'బైన్' పేరు పెట్టుకున్నారు. వెన్నుపూసల నరాలనుంచి అందే   సంకేతాల ప్రకారం  ప్రవర్తించడం మెదడు ధర్మం.  జంతు దశలో జరిగే జీవక్రియ ఇది. జీవపరిణామంలో మనిషి మరింత వికాసం సాధించిన తరువాత కేవలం ఈ సంకేతాలకే పరిమితం కావడం కుదరలేదు. ఆలోచన.. స్వీయ రక్షణ.. జ్ఞాపక శక్తి మరింత అవసరమయ్యాయి.  మనిషి 'బుద్ధి' మరింత బలంగా .. ధృఢంగా.. తయారు కావాల్సిన  అవసరాలు పెరుగుతో వస్తున్నాయి. కాన్సెఫలాన్(consephelon) అనే మరింత శక్తివంతమైన నరాల వ్యవస్థ అందుకే ఏర్పాటయింది.
మెదడులో లేత పదార్థం (grey matter), తెల్ల పదార్థం ( White matter), రక్త నాళాలు.. కాసిన్ని మాంస ధాతువులు కలగలసి ఉంటాయి.
మెడుల్లా అబ్లాంగేటా(medulla Oblongata), వెనక తల (Hind Brain). మధ్య తల(Mid Brain), సెరిబ్రమ్ (Cerebrum) అని నాలుగు భాగాల కూడలి అని కూడా అనుకోవచ్చు మెదడుని.
'అన్నీ వేదాల్లో ఉన్నాయిష' అని విశ్వసించేవాళ్లకు   సంతోషం కలిగించే ఒక పోలిక ఇక్కడ దొరుకుతుంది. విశ్వసృష్టికర్తగా ఖ్యాతి గడించిన విధాతక్కూడా నాలుగు ముఖాలుంటాయంటారు కదా! బ్రహ్మగారికి  శక్తి వీణాధరి వాణి. ఆమె ధరించిన  వీణ తాలుకు  తంత్రులను పోలినవే మెదడు నరాలు. కేవలం జంతుమాత్రులకు సాధ్యం కాని 'ఊహ.. ఆలోచనలు' మనిషి చేయగలుగుతున్నాడంటే  ప్రేరణ  ఈ నరాల ప్రకంపనలే.
మెదడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మేథస్సుకు తిరుగు లేదు. ఆయాచితంగా దక్కిన  మేథస్సును అపురూపంగా, పదిలంగా, ఆరోగ్యంగా చూసుకొనే సూచనలు  వివిధ ఆరోగ్య శాస్త్రాలలో పదిలంగా  ఉన్నాయి.
భారతీయుల వైద్యశాస్త్రంగా పేరొందిన  ఆయుర్వేదం మెదడును గురించి చెప్పే జాగ్రత్తల ప్రస్తావనలతో ముగిద్దాం ఈ చిన్న వ్యాసాన్ని.  నిత్య జీవితంలో తేలిగ్గా ఆచరించగల వాటిన ఏరుకొని ఇక్కడ ఇస్తున్నది.
ఆహారం, నిద్ర, జీవనశైలి మీద క్రమం తప్పని శ్రద్ద మేథస్సుని జీవిత కాలమంతా ఆరోగ్యంగా ఉంచుతున్నదన్నది ఓ నమ్మిక.
1.    తినే ఆహారానికి చేతనత్వం, ప్రాణత్వం ఉండాలని గీతలో భగవంతుడుకూడా ఉవాచిస్తున్నాడు. సాత్వికాహారంలో ఇవి సమృధ్ధిగా లభిస్తాయి కూడా. వండకుండా  ఫ్రిడ్జుల్లో  భద్రపరిచిన ఆహారం, రసాయనాలు సాయంతో పండించిన పదార్థం జీవశక్తిని బలహీన పరుస్తాయి.
2.   నెయ్యి, పాలు, తేనె.. కేవలం మధుర పదార్థాలే కాదు.. జీవరసాయనాలు కూడా.
      నెయ్యి, వాము కలిపి  తల్లి తినిపించే గోరుముద్ధలు పసిపిల్లలకు మేథోరసాయనాలే.
     ఉన్నత పాఠశాల, కళాశాలలకు వెళ్లే వయసు పిల్లలకు ఆహారంలోని మొదటి ముద్ద
     పేరిన నెయ్యి, ఉసిరికాయతో కలిపినదయితే వారి తెలివి తేటలు వృద్ధి చెందుతాయి
    ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే పిల్లలలకు నెయ్యి, మినుము, బెల్లం కలిపిన ఉండలు మనసు
    శరీరాన్ని దార్ఢ్యంగా మారుస్తాయి. ఆడపిల్లల్లో అయితే హార్మీనుల సమతౌల్యాన్ని
    సాధిస్తాయి.
3.   తేలిగ్గా జీర్ణమై రసంగా మారి శరీరానికి, జీవకణాలకి శక్తిని అందించే ఆహారం ప్రాణాహారమని భావన. రాత్రి పడుకునే ముందు వేడిపాలల్లో .. పటిక బెల్లం కలిపి తీసుకుంటే ప్రాణాహార అవసరం చాలావరకు తీరినట్లే.  బాధం, జీడి పలుకులు రెండో మూడో పాలతో కలిపి తీసుకుంటే.. పెద్దవయసువారికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి నిద్రా వస్తుంది. మంచి నిద్ర బుద్ధి వికాసానికి దోహదం.
4.   మెదడులోని జీవకణాలు ఎప్పుడూ చాలా వత్తిడిమీదుంటాయి. వాటికి ఎక్కువ ప్రాణాహారం అవసరం. ప్రాణాయామం ఆ అవసరాన్ని తీర్చే సాధనం.
5.   మన శరీరానికి అందించే ఆహారంలో ముప్పై శాతం ఒక్క ఒక్క తలే తినేస్తుంది. నిద్రలో అయినా  మెదడుకి బద్ధకం పనికి రాదు. జాగృత, స్వప్న, సుషుప్త అనే మూడు దశల్లో సైతం  విధి నిర్వహణ తప్పనప్పుడు అందుకు తగ్గట్లు ప్రాణాహారం అవసరమే కదా! లేదంటే కోమాలోకి జారిపోయే ప్రమాదం పొంచుంటుంది. మరణకారణాలలో కోమా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మెదడుకు అవసరమైన ప్రాణాహారం  సరస్వతీ లేహ్యం, బ్రహ్మీ రసాయనం, అశ్వగంధి వంటి ఔషధాలలో దొరుకుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
6.   రాత్రి పెరుగు మానేయడం బుద్ధికి మనం చేసే మంచి మేలని వైద్యుల సలహా!

ఈ సూచనలేవీ పాటించలేనంత కష్టమైనవి కాదు కదా! సూక్ష్మ బుద్ధిశాలులుగా జీవిత పర్యంతం జీవిస్తే స్వంతానికే కాదు.. మనమీద ఆధార పడ్డ వారికి, ముదిమిలో మనం ఆధార పడ్డవారిక్కూడా తప్పించుకోదగ్గ కష్టాలనుంచి తప్పించినట్లే అవుతుంది.
***
(సూచనః ఈ వ్యాసంలోని ఆరోగ్య సూచనలు దాక్టర్ ఇవటూరి రామకృష్ణగారివి. సోర్సుః స్వాతి 31-03-2009 నాటి సంచిక. కేవలం పాఠకుల ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే ఈ టపా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
-కర్లపాలెం హనుమంతరావు







Thursday, September 15, 2016

మతి మర్..ర్ర్..ర్ర్ర..?! -కర్లపాలెం హనుమంతరావు


(సెప్టెంబరు 21 మతిమరుపు వ్యాధి నిరోధోత్సవం)
మీరి చెరువులో  ఈదులాడేటప్పుడు తృటిలో ప్రమాదం తప్పించుకునుండ వచ్చు. దారే పోయే లోడు లారీ హఠాత్తుగా మీదకు దూసుకొచ్చినప్పుడు ఆఖరి క్షణంలో మెరుపులా తప్పుకొని ప్రాణాలు కాపాడుకొని ఉండవచ్చు. అనుకోకుండా కమ్ముకొచ్చిన చికెన్ గున్యాతో ఆఖరి క్షణం దాకా పోరాడి విజయం సాధించి ఉండవచ్చు. ప్రాణాంతకమైన కేన్సర్  వచ్చే సూచనలు ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోడం ద్వారా ఆ గండనుండి బైట పడి ఉండవచ్చు. అలాగే గుండెపోటు కూడా నీ ఆత్మస్థైర్యం ముందు తలొంచుకొని ఉండవచ్చు. ఎన్ని యుద్దాలనైనా గెలువు  గాక! ఎంత అనుభవమైనా గడించుగాక. మతి మరుపు జబ్బు.. అదేనండీ అల్జీమర్స్ భూతం కోరల్లో చిక్కుకుంటే మాత్రం ఇహ బైట పడటం కల్ల. భయపెట్టడం కాదిది. ఆ పిశాచం మెదడు ఇంటిలో  జొరబడకుండా జాగ్రత్తగా ఉండమని చేసే హెచ్చరిక ఇది.
పెద్దా చిన్నా తేడా లేదు. ఆడా మగా భేదం చూడదు. కొండచిలువ మేకపిల్లను మింగే తీరులో మెల్లిగా మనిషి జీవితాన్ని చల్లంగా ఆరగించే బ్రహ్మరాక్షసి మతి మరుపు జబ్బు.
పెళ్ళినాటి ఏడడుగుల పంథాలో ఏడు దశల్లో మనిషిని పూర్తిగా మింగేసే దొంగ బుద్ధి మతిమరుపు వ్యాధిది.
ముసలితనం మొదటి సూచన అని మోసం చేయచ్చు. కానీ.. అది.. అది కాదు అని గుర్తించే సమయానికే అంతా అయిపోతుంది. కాపుకాసి సుఖసంతోషాలను రూపు మాపేస్తుంది. మతిమరుపు రాజ్యంలోకి ఒకసారి కాలు పెడితే తిరిగి సొంత గూటికి చేరుకోవడం దాదాపు అసాధ్యం.
స్థితప్రజ్ఞురాలన్న పేరున్న మేధావిని కూడా మరబొమ్మలా ఆడిస్తుంది. ఒకసారి నవ్విస్తుంది. ఒకసారి ఏడిపిస్తుంది. అకారణంగా అయిన వాళ్లందరినీ అనుమానించే బుద్ధిని అంటగడుతుంది. ఏళ్ల తరబడి నీడలాగా తనను అనుసరించిన జీవితభాగస్వామిని కూడా అప్పుడే ప్రయాణంలో పరిచయమైన కొత్త మనిషిలా దూరం పెట్టిస్తుంది. ఏకసంథాగ్రాహి. వేదపాఠాలన్నీ నాలిక చివరే చివురుటాకుల్లా చప్పుడు
చేస్తాయన్న గొప్ప పేరున్న పండితుణ్ణికూడా మతిమరుపు జబ్బు మతితప్పిన మనిషి మాదిరిగా మార్చేసి అయిన వారందరి అంతులేని దుఃఖానికి కారణమవుతుంది. ఏకపత్నీవ్రతుణ్ణి సైతం కాముకుడిగా మార్చేసే దుష్టశక్తి మతిమరుపు రుగ్మత.
ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టుకతో వచ్చిన విలువలు.. వయసుతో సంపాదించిన విజ్ఞానం.. అనుభవంతో సాధించిన సంస్కారం.. అన్నింటినీ రాహు.. కేతువులు చంద్రుణ్ణి మింగేసిన తీరులో మింగేసే రాకాసి మరిమరుపు వ్యాధి. గ్రహణంలో మాదిరి ఈ రక్కసి విషయంలో ఇక విడుపన్న మాటే ఉండదు.
వైద్యపరంగా చెప్పాలంటే మెదడు నాడీ కణాలను క్రమక్రమంగా అచేతనం చేస్తూ మొరాయించే న్యూరోట్రాన్స్ మీటర్ల సంఖ్యను పెంచుకోంటూ పోతూ మరణానికి దగ్గరిగా తీసుకుని వెళ్లే తీవ్రాతి తీవ్రమైన వ్యాధి అల్జీమర్స్.. అని ఆంగ్లంలో చెప్పుకొనే 'మతిమరుపు జబ్బు.
1.   జీవితమంతా కష్టించి పిల్లా పాపా అంతా ప్రయోజకులైన జీవితంలో స్థిరపడ్డాక ఇక ప్రశాంతంగా బతికేయచ్చన్న దశలో మెదడు తలుపు తట్టడంతో మొదలవుతుంది మతి మరుపు జబ్బు తొలి అడుగు.
2.  కొద్దిగా మతిమరుపు. తాళాల గుత్తి మర్చిపోవడం.. సెల్ ఫోన్ ఎక్కడ పెట్టారో వెతుక్కోవడం లాంటివి రెండో దశలో పడే అడుగులు. ముసలితనం వస్తుంది కదా.. మతి మరుపు సహజమేనని నవ్వుతూ సరి పెట్టుకోవడం పరిపాటి సాధారణంగా చాలామందికి.
3.  అదక్కడితో ఆగితే అద్రిష్టమే. కానీ ఆగదు. హఠాత్తుగా మాటలకోసం వెదుక్కోడం మొదలవుతుంది. పలుకులో తేదా వస్తుంది. చూపుల్లో కూడా ఏదో కొత్త మార్పు! బైటవాళ్లకి తెలీక పోవచ్చుగానీ.. ఇంట్లో వాళ్ళకు ఆ వెల్తి తెలిసిపోతుంటుంది. ఇది మూడో దశ అడుగు.

4.  రోజూ కనపడే పాలబ్బాయి.. పేపరు కుర్రాడు.. పనిమనిషులు కూడా అపరిచితులుగా అనిపించడం మొదలు పెడితే జబ్బు ముదిరి నాలుగో దశలోకి అడుగు పెట్టిందన్న మాటే!
5.  ఐదో దశలోకి వచ్చి పడ్డారంటే నరకానికి సగం దూరంలోకొచ్చి పడ్డట్ల్. ఈ దశలో తేదీలు.. వారాలు.. ఫోన్ నెంబర్లు.. పరిచితుల పేర్లు.. అన్నింటిలో గందరగోళమే.ఒకరి సాయం లేకుండా పని ముందుకు సాగే పరిస్థితి ఉండదు.
6.  పూర్వంనాటి వ్యక్తిత్వానికి పూర్తిగా విరుద్ధమైన స్వభాభం! రాముడు రావణాసురుడు.. బుద్ధుడు దూర్వాసుడు.. ఇలా! ఎంతోమంది మేధావుల్ని ఈ ఆరో దశలో చూసినప్పుడు అబ్బురం అనిపిస్తుంది. దగ్గరి వాళ్ల యాతన చూసి హృదయం క్షోభిస్తుంది.
7.  కండరాలు ఆసాంతం నియంత్రణ కోల్పోయిన దశ. దైహిక అవసరాలు కూడా స్వయంగా నియంత్రించుకోలేని అసహాయ స్థితి. తింటూ తింటూ ముద్ద మింగడం మర్చి పోతారు. నడుస్తూ నడుస్తూ దారి మర్చి ఆగిపోతారు. బైటి ప్రపంచానికి ఇక లేనట్లే. ఇంటి మనుషులకు గతం తాలుకు గుర్తు మాత్రమే!
ఇహలోక యాత్ర చాలించడమొకతే తరువాయ ఇహ.

నూట పదేళ్ల కిందట ఒక జర్మన్ వైద్యుడు ఒక మహిళలో ఈ అల్జీమర్స్ వ్యాధిని మొదటిసారి గుర్తించాడు. అతని పేరుమీదే ఈ వ్యాధి ప్రపంచానికి పరిచయమైంది.
మెదడుమీద అంతులేని విశ్వాసంతో ఉంటామా మనం. ఆ పెద్దరికాన్ని అది చివరి వరకు నిలబెట్టుకొంటే మంచిదే. అంతా ముగిసి పోయింతరువాత చేతులెత్తేసే గుణం దానికి . అప్పటి వరకు ఏమీ జరగనట్లే గుంబనగా ఉండటం వల్లే ప్రపంచంలో ఈ అల్జీమర్స్ వ్యాధి పీడితులు దిన దిన ప్రవర్ధమానమవుతున్నారు.
తొలిదశలోనే పసిగట్టే పరిజ్ఞానం ఇంకా అభివృద్ధి చెందలేదంటున్నది వైద్య పరిశోధనా రంగం!
అల్జీమర్స్ వ్యాధికి తొలి సూచకం మతి మరుపు అనుకుంటాం. అది పొరపాటు. వాస్తవానికి అది అంతానికి ఆరంభం. అంచనాలకు అందని కారణాల కారణంగా మెదడులోని చైతన్య కణాలు క్రమంగా నిర్జీవమయిపోతుండటం మాత్రం ఈ వ్యాధికి మూలం- అన్నంత వరకు మన వైద్య విజ్ఞానం అభివృద్ధి సాధించగలిగింది!
సెల్ ఫోన్ నెంబరు మర్చిపోతే అది మతిమరుపు. అసలు తనకో సెల్ ఫోన్ ఉందన్న సంగతే మర్చిపోతే అది అల్జీమర్స్!
చురుకు దనం లోపించడం.. మౌనాన్ని ఇష్ట పడటం.. నిర్ణయాలు తీసుకోడంలో తడబాటు.. మాటతీరులో కాస్త గందరగోళం.. లైంగిక వాంచల్లో మార్పు..శుభ్రత మీద ఆసక్తి తగ్గడం.. దైహిక అవసరాలకి సాయం అవసరం అనిపించడం.. ఇలా ..ఒక్కో వ్యక్తిలో.. ఒక్కో విధంగా.. కాస్త ఎక్కువగానో,.. తక్కువగానో.. కనిపించి.. కాలక్రమేణా తీవ్రత పెరుగుతూ పోతుంటే రాబోయే అల్జీమర్స్ పెను గండానికి ముందు సూచనగా భావించాలి.
ప్రతి ఇరవై మందిలో ఒకరు ఈ వ్యధికి ఆప్తులవుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. సంకోచించె దశను అధిగమించి వైద్యుణ్ని సంప్రదించే దశకు రోగి చేరుకునే వేళకే వ్యాధి ముదిరి పాకాన పడుతుండటం సాధారణంగా జరుగుతున్న పరిణామాలు. ఈ దశలో వైద్యులూ రుగ్మత తీవ్రతను తగ్గించే ప్రయత్నం తప్ప పూర్తిగా రూపుమాపేంత చికిత్స చేయలేరు. కారణం ఇంకా అటువంటి విధానం వెలుగులోకి రాకపోవడమే!స్వభావంలో వచ్చే మార్పులకి.. జ్ఞాపకశక్తికి.. నిద్రలేమి సమస్యకి సంబంధించిన చికిత్సలద్వారా అల్జీమర్స్ వ్యాధి తీవ్రత వేగాన్ని తగ్గించే పద్ధతి అవలంబిస్తున్నారు మెదడుకు సంబంధించిన స్కానింగ్.. కుటుంబ సభ్యుల స్పందాలను ఆధారం చేసుకొని అల్జీమర్స్ ను నిర్ధారించుకుంటున్నారు వైద్యులు.
'తన్మత్ర' అనే మళయాళీ చిత్రం ఈ అల్జీమర్శ్ సమస్యచుట్టూ అల్లిన చిత్రం. పరువంలో ఉన్న ప్రియురాలి ముద్దు పేరు.. భారతియార్ కవిత్వం కథానాయకుడు కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి తెస్తాయి. సినిమా కాబట్టి సుఖాంతం చేయక తప్పలేదు కానీ.. ముదిరిన మతిమరుపును అంత సులువుగా నయం చేయడం కుదిరే పని కాదు ప్రస్తుతం ఉన్న వైద్య పరిజ్ఞానం సాయంతో. 'మైనే గాంధీకో
నహీ మారా' అనే హిందీ చిత్రంలో కూడా అనుపమ్ ఖేర్ ఈ అల్జీమర్శ్ వ్యాధి బారిన పడి ఊహలకు వాస్తవానికి మధ్య తీవ్రమైన మానసిక ఘర్షణకు లోనవుతాడు. 'బ్లాక్' చిత్రంలో అమితాబ్ శూన్యధృక్కులను గుర్తుకు తెచ్చుకోవచ్చు.. అల్జీమర్శ్ లక్షణాల ప్రాథమిక దశ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి. తెలుగులోనే ఈ రుగ్మత కథాంశంగా శాస్త్రీయమైన అంశాలతో ఏ చిత్రమూ వచ్చినట్లు గుర్తుకు రావడం లేదు!
ఇంతా చెప్పి ఈ వ్యాధితో మానవ ప్రయత్నంగా మనం పోరాడవలసిన విధానాలు కూడా కొన్ని తెలుసుకోక పోతే అసంతృప్తిగా ఉంటుంది కదా!
వాటిలో కొన్ని ఇవిః
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంబందాల మధ్య బతికే వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం తక్కువని అమెరికన్ పరిశోధకుల భావన. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. చదరంగం వంటి మేధో క్రీడల్లో ప్రావీణ్యం.. పజిల్సు పూరించడం.. గుండెనూ, మెదడునూ సదా ఉత్సాహంగా ఉంచుకోవడం.. బుద్ధికి సంబంధించిన విద్యల్లో నిరంతరం చేసే ప్రయత్నాలు.. ఒక రకమైన జాగ్రత్తలైతే,, మధుపానం, ధూమపానం.. వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం.. అలవాట్లకు సంబంధించిన జాగ్రత్తలు.
మిగతా దేశాలతో పోలిస్తె మన దేశంలో ఈ మతిమరుపు మహమ్మారి విరవిహారం కాస్త తక్కువే. కారణం 'పసుపు' వాడకంమీద మనకుండే ప్రత్యేక శ్రద్ధ.కరివేపాకును కూడా ఉప్మాలో అయినా తిసి అవతల పెట్టకుండా చక్కంగా తినేయడం మంచి పద్దతి అంటున్నారు మన వైద్యులు.
పుస్తక పఠనం.. రచనా వ్యాసంగం అల్జీమర్స్ వ్యాధి నిరోధానికి సృజనాత్మకమైన చిట్కాలు. ప్రార్థన, ధ్యానం, తోటపని, సంగీతం కూడా మతిమరుపుకి వ్యతిరేక శక్తులే.
గంటల తరబడి టీ. వీ చూసే అలవాటు ఉంటే మాత్రం వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది- అని సలహా ఇస్తున్నారు ఇజ్రాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. కేజ్ వెస్టర్న్ విశ్వవద్యాలయాల పరిశోధకలు.

సూచనః నేను వైద్య రంగానికి సంబధించిన వ్యక్తిని కదు. కాని సాధారణ ఆరోగ్యంమీద గల శ్రద్ధ వల్ల ప్రసిద్ధులైన వైద్యులు రాసే వ్యాసాలు శ్రద్ధగా చదివే ఆసక్తి ఉన్నవాడిని. ఈ వ్యాసానికి మూలం -21,సెప్టెంబరు, 2008 నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలోని వ్యాసం. ఈనాడు యాజమాన్యానికి, ఆదివారం అనుబంధం సంపాదకులకు దన్యవాదాలు)




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...