Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

Sunday, December 12, 2021

దేవుడి కథ -కర్లపాలెం హనుమంతరావు

 దేవుడి కథ

 -కర్లపాలెం హనుమంతరావు

నీతిమార్గాన్ని మాత్రమే నమ్ముకుని జీవించే ధర్మపరుల పోరాటానికి ఆయుధాలు అందించడం, అంతిమంగా దుర్మార్గంపై సత్యవంతులు మాత్రమే  విజేతలుగ నిలిచేలా చూసే బాధ్యత భగవంతుడికి అప్పగించడం  మనిషి చేసిన పనే! తనను తాను ప్రకాశవంతం, ఆనందమయంగా మలుచుకుంటూనే పరిసరాలనూ తదనుగుణంగా ప్రభావితంచేయడం  దేవుడి విశిష్ట లక్షణాలుగా భావన చేసిందీ మానవుడే. ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని, శాశ్వత విశ్రాంతి కోసం  ప్రళయాన్ని సృష్టించడం భగవంతుడి ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యపడే కార్యమని నమ్మాడు మనిషి.   భగవంతుడిని సకల సద్గుణ సంపదల  రాశిగా   భావన చేసి ఆ సమ్మోహన  విశ్వంభర రూపాన్నే ఊహ మేరకు ‘దైవం’గా కల్పన చేసుకుని  భజించి తరించమంటూ  'క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' అన్న ధాతువులను కలగలిపి  ‘దైవం’ అనే పదాన్ని రాబట్టడంతో దేవుడి కథ మొదలయినట్లయింది. 

ఆయుర్వేదమంత్రం(14 -20) ప్రకారం అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ  దేవుళ్లుగానే భావించుకోమని బోధించిందది. సంస్కృత వాజ్ఞ్మయాన్ని ఓ పట్టు పట్టిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మాత్రమే భగవంతుణ్ని అత్యంత   సులువైన శైలిలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని రెండు ముక్కల్లో తేల్చేసింది. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా మసలే    శ్రీసాయణాచార్యుడు ‘స్వర్గం’ అనే ఓ లోకాన్ని ఊహించి దాని సింహద్వారం తాళాల గుత్తి ‘దేవుడి’ చేతికి అప్పగించాడు. దేవుడే యజమాని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడమే మనిషిగా పుట్టినందుకు మనం చేయదగ్గ పని’ అన్న భావన సాయణాచార్యుడి జమానా నుంచే బలపడుతూవచ్చిందని  ప్రాచీన వాజ్ఞ్మయ పరిశోధకుల అభిప్రాయం. 

ప్రకృతి శక్తులు, వాటిలోని అంతర్భాగం సూర్య చంద్రులు వంటి గ్రహాల చలవ వల్లనే మనిషి మనుగడ సాధ్యమయింది. ప్రాణి ఉనికి కొనసాగడానికి  తోడ్పడే నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి- వంటి పంచభూతాలనూ స్థూలంగా దేవుళ్లుగా భావించుకోమంటే హేతువాదికైనా ఏ అభ్యంతరం ఉండబోదు. చెట్టూ చేమా, పుట్టా గుట్టా సైతం  దైవసమానమేనని డాక్టర్ దాశరథి రంగచార్యులు పలు సందర్భాలలో బల్లగుద్ది మరీ వాదించేవారు.  మానవజన్మకు మేలు చేకూర్చే ఏ పదార్థంలోనయినా నిస్సందేహంగా  దైవత్వం  ఉన్నట్లే లెక్క! సందిగ్ధమెందుకు?

దేవుని పుట్టుక ఎప్పటిదని ప్రశ్నిస్తే  మనిషి దగ్గర  చెప్పేందుకు సబబైన సమాధానం లేదు.  వేదకాలంలో అతగాడు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం లేక భయం పుట్టించే శక్తులను దేవుళ్లుగా భావించి పూజాదికాలతో ఉపశమింపచేసే ప్రయత్నాలేవో  తనకు తోచినవి చేసివుండవచ్చు. పురాణకాలం నాటికి ఆ అదృశ్య శక్తుల స్థానంలో అటూ ఇటూగా మనవాకారాలను  బోలే దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనలు  ప్రారంభమవడం.. అదో విచిత్ర గాథ. దేవుళ్లకూ మన  మానవులకు మల్లేనే భావోద్వేగాలు,  సంసార లంపటాలు తగులుకున్నాయి భక్తజనుల భావనల పుణ్యమా అని! ఎంత నిరాకారుడైనా ఒక చట్రంలో ఇమడాలంటే  సృష్టించే మానవ మేధస్సు పరిమితులకు లోబడే  ఆ రూపం ఏర్పడాలి! దైవలోకాల సృష్టి కథలోనూ అదే తమాషా!  ఊహకు హద్దులు అక్కర్లేదు. కనక మానవమాత్రుడిగా తన చేతలకు సాధ్యంకాని అద్భుతాలేవైనా సరే అవలీలగా  సాధించే దివ్యశక్తులు  తాను సృష్టించిన దేవుడికి ప్రసాదించాడు మానవుడు.  రూపం, గుణం, శక్తి ఏదైతేనేమి.. ప్రేరణనిచ్చి సన్మార్గదర్శనం చేయించి మనిషిని మంచి దారికి మళ్లించే ఒక చమత్కారం.. మేలుచేసేదయితే సదా ఆహ్వానించదగ్గదే కదా! ఆ మేరకు హాని కలగనంత  వరకు దేవుడి ఉనికి పట్ల ఎవరికీ ఏ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేనే లేదు! 

భూమ్మీద దేవతలు మన కళ్లకు ఎలాగూ కనబడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిలో దైవసమానులు. ఆపదలు దాపురించిన వేళ ఆదుకున్నవాళ్లనూ  దేవుళ్లుగా భావించడం భారతీయుల సత్సంప్రదాయం. కరోనా కాలంలో వలస కూలీల కడగండ్లకు కరగి చేతనయినంతలో  ఆర్తులకు సాయమందిస్తున్న మంచిమనుషులు ఎందరినో చూస్తున్నాం.  ఎక్కడో ముంబయ్ బాలీవుడ్ సినిమా నటుడు ఆంధ్రాకు ఈ మూలనున్న  చిత్తూరు ఇలాకా పేద రైతుకు ఓ చిన్న ట్రాక్టర్ కొని ఇస్తేనే ‘దేవుడు’ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం మనమివాళ అన్ని  సామాజిక మాధ్యమాలలో ఎడతెరిపి లేకుండా మనిషికి, మానవ సంఘానికి మేలు చేకూర్చే శక్తినైనా, వ్యక్తినైనా దేవుడిగా భావించడం మానవ ప్రవృత్తిలోనే అంతర్గతంగా ఇమిడివున్న సానుకూల దృక్పథం. అది ఆపితే ఆగేది కాదు. మొహమాట పెట్టినా  పొంగి పోటెత్తి పారేదీ కాదు.  ఎంత లౌకికలోక వ్యవహారమైనా దైవభావానికీ ఓ లెక్కంటూ ఉన్నట్లు వివరంగా చెప్పడమే భారతీయ తత్త్వశాస్త్రాలలోని  విశిష్ఠత.

స్వాతంత్ర్య  సమరం ఉధృతమయిన సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నందు వల్లనే గదా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భరతజాతి మొత్తానికి, ముందు బాపూజీ ఆనక మహాత్మా ఇప్పుడు విగ్రహ రూపంలో దైవంగా మారింది! డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేల లాగా  దళిత జాతుల ఉద్ధరణకై  జీవితాంతం పాటుబడ్డ  మహనీయులను దేవతామూర్తులుగా భావించడం సర్వసాధారణం ఈ  కర్మభూమిలో. పూజ్యభావంతో ప్రతిష్ఠించిన సుప్రసిద్ధుల విగ్రహాలను గుళ్లలోని దేవుళ్లకు మల్లే పూజించడాన్ని తార్కిక దృష్టితో చూసి కొందరు  తప్పుపడుతుంటారు. భక్తిభావనకు, తర్కానికి ఎప్పుడూ చుక్కెదురే. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అన్నది పెద్దలు అన్న వట్టిమాట కాదు. అనుభవం మీద రాబట్టిన సూక్తులవన్నీ! భక్తి అనే హార్మ్యానికి విశ్వాసమే పునాది. కాబట్టి  ఎట్టి పరిస్థితులలోనూ తర్కంతో ఆ దివ్య  భవనాల మీదకెక్కి ఆవలి పార్వ్యం చూడడం అసంభవం. 

దేవుళ్ల రూపాలు మారడం గమనిస్తున్నాం. దైవారాధనలూ కాలానికి తగ్గట్లు ఆర్భాటంగా మారడం చూస్తున్నాం. మనిషి పిచ్చి గానీ,  ఏ హడావుడీ  దైవిక శక్తుల మౌలిక స్వభావాలలో మార్పు తేలేవు. అగ్నిని దేవతే అనుకో! ఏ రూపంలో అయినా పూజించుకో! అయినా చెయ్యి పెడితే చుర్రుమని కాల్చి తీరుతుంది భావనలో దైవాలకు తరతమ భేదాలు లేకపోవచ్చును గానీ,  భౌతికరూపంలో  పారే గంగమ్మ తల్లికి ఎన్ని విధాల మొక్కినా  ముక్కుల్దాకా  మునిగితే  ప్రాణాలు గుటుక్కున పోవడం ఖాయం. దైవభావనలలో పొడగట్టే  ఏ మార్పయినా  మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతమనేది మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ  ఇంగితం లేకనే.. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతుల పేరున, దేశాల వంకన, సంస్కృతుల మిషన ఎన్ని తరాలు గడచినా ఆగకుండా ఆధ్యాత్మిక ఘర్షణలు విశ్వమంతటా ప్రస్తుతం నిష్కారణంగా చెలరేగుతున్నాయి.  

కవులూ తమ కావ్యాలకు అవతారికలు  రాసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థనల వంకన దేవుళ్ల మధ్యన ప్రదర్శించే వలపక్షం విచిత్రం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ  దేవజాతులను సైతం కవులు మనుషులకు  మల్లేనే వివిధ తరగతుల కింద విభజించి చూడడం, ఇష్టులైన దేవుళ్లంటూ  మళ్లా  కొన్ని అవతారాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం! మనిషి మానసికంగా ఎదిగాడని టముకేసుకోవడమే  తప్పించి.. ఎంత ఎదిగినా వేపను వదలని చేదులా ఎంతో కొంత  వెర్రితనం  తప్పదా!

'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుడు, ప్రజాపతి– వెరసి ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. జగత్తు నివాసయోగ్యత వీటి చలవే కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి వసుదేవతలయారు. దేహానికి ఆత్మ స్వస్తి చెప్పే వేళ ప్రాణులను పీడిస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జీవాత్మ  రుద్రదేవతలుగా దూషింపబడుతున్నారు. ఏడాది మొత్తం చైత్రాది పన్నెండు మాసాల ద్వారా ఆయుష్షును హరించే సూర్యుడు, వరుణుడు, పూర్ణ, తృష్ణల వంటి పన్నెండు మంది ఆదిత్య దేవతల కోవలో చేరారు. లెక్కకే ముప్పై ముగ్గురు. భూఇ మీది  నిప్పు, మబ్బులోని గాలి.. మెరుపు, ఆకాశంలోని సూర్యుడు మనిషికి ముఖ్యమైన దేవతలని మళ్లీ యాస్కుడే లెక్క కుదించాడు!

రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళే’ అగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రుడికి ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వర్షాలు కురిపించగల సత్తా  వజ్రాయుధపాణి ఇంద్రుడొక్కడి దగ్గరే ఉందని నమ్మకం. వేదపరంగా ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. పురాణాల దృష్టిలో స్వర్గాధిపతి. వైదికుల భావనలో  దేహంలోని జీవుడు. దేవతల రాజుగా, రాక్షసుల వైరిగా, తాపసుల అడ్డంకిగా ఇంద్రుడివి బహుముఖపాత్రలు. ఆకాశదేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖుడు. సౌర మండలం తాలూకు సమస్త శక్తులకూ ఉత్పత్తి కేంద్రమైన సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులతో దర్శనమిచ్చే దివ్యజన్ముడిగా, సకల లోకాలను క్రమబద్ధంగా ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుషకార్యాలన్నిటిని యాజ్ఞిక రూపంలో స్వీకరించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతించాయి. సూర్యుడొక్కడే నరుడికి నిత్యం ప్రత్యక్షమయే నారాయణుడు. సోముడు నుంచి వరుణుడు వరకు దేవతలు  ఇంకెందరో వేదాలలో తమ తమ యోగ్యతలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.

వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేదకాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాధనలు   అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించుకుని ఆరాధించడం సామాన్యుడికి సులువైన ముక్తిమార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తిమార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో ప్రధాన ఆకర్షణీయ భాగాలయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజాపునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దైవరూపాలు ఉనికిలోనికి రావడం సరికొత్త పరిణామం. 

జైనుడైన అమరసింహుడు తన అమరకోశం స్వర్గవర్గంలో దేవుళ్లకు ఉండే 'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః'  వంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరామరణాలు లేనివాళ్లని, ఎప్పుడూ మూడుపదుల వయసులో కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని.. ఇట్లా ప్రతి పదం వ్యుత్పత్తి అర్థం ఆ నామలింగానుశాసనమ్  వివరిస్తుంటే  ఎన్నడూ కనిపించని దేవుడి శక్తియుక్తుల మాటకు మించి ముందు కంటి ముందు తిరిగే మనిషి బుద్ధి నైశిత్యాన్ని  వేనోళ్ల పొగడబుద్ధవుతుంది.  హద్దులెరుగని కల్పన చేయగల మేధోసామర్థ్యం  సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సాధ్యమన్న  వాదన తిరుగులేనిదనడానికి దేవతల పుట్టుకను గురించి అతగాడు చేసిన కల్పనే  ఓ గొప్ప ఉదాహరణ. 

వాల్మీకి రామాయణం 14వ సర్గలోనూ దేవతల పుట్టుకను గురించిన ప్రస్తావన ఉంది. జటాయువు తన జన్మరహస్యం రామచండ్రుడికి వివరించే సందర్భంలో సృష్టి, దాని క్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావనలు వస్తాయి. ఆఖరి ప్రజాపతి కశ్యపుడికి అదితి వల్ల కలిగిన ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి వివరంగా చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి ఈ పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం. 

జానపద దేవతలు ఉనికిలోనికి వచ్చినప్పటి బట్టి సమాజంలోని ఒక ప్రధానవర్గం చేసే పూజావిధానాలలో మౌలికమైన మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖితసాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖితసాహిత్యం ద్వారా నీరాజనాలు అందడం సర్వసాధారణమయిపోయింది. అమ్మవారు, పోతురాజుల వంటి గ్రామదేవతల ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లను ఏ దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం. వ్యవసాయసంబంధమైన కేటగిరీలో స్త్రీ దేవతలకే అధిక ప్రాధాన్యం. జానపద దేవతలలో  ప్రధానంగా రెండు విభాగాలు.  పార్వతీదేవి తరహా శక్తిమూర్తులకు ప్రతినిధులుగా  గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి అమ్మవార్లు ఒక తరగతి; ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఊరి ఆడపడుచులు రెండో తరగతి గ్రామదేవతలు.  వీరులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా  ఉన్నట్లే, భరతఖండంలోనూ ముందు నుంచి ముమ్మరంగానే ఉంది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శివాజీ.. వంటి సాహసవంతులెందరో దేవతల  స్థాయికి ఎదిగి పూజలందుకోవడం ఇందుకు ఉదాహరణ. ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల  దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు. 

మతాలను  గురించి ఈ కలికాలంలో మనలో మనమే ఏవేవో కారణాలు కల్పించుకుని  సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథాప్రయాసలేవీ లేని చక్కని స్పష్టత ఉండేది. 'ఇన్ద్రమ్  మిత్రమ్ ‘  అనే  శ్లోకార్థాన్ని  బట్టి బుద్ధిబలం అధికమై ఆకారమే లేని పరమేశ్వరుడిని ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని భిన్నరూపాలలో భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక్కటే రూపం. ‘ఏకం సత్’ అన్న రుగ్వేద సూత్రం అంతరార్థం అంతుబడితేనే తప్ప ప్రస్తుతం మతం పేరుతో   పెచ్చుమీరే విద్వేషభావనలు శాశ్వతంగా మాసిపోయే  శాంతి మార్గం  మనిషి కంటబడదు. 

కంటికి కనిపించని దేవుళ్ల లెక్క  కన్నా.. కంటి ముందు కదిలే  మనుషులే మనుషులకు దేవుళ్లనే భావన బలపడితే అసలు గొడవే ఉండదు.

- కర్లపాలెం హనుమంతరావు 

- బోథెల్; యూ.ఎస్.ఎ

30 - 08-2021

***

 

 


అశోకుని యర్రగుడి శాసనాలు -సేకరణః కర్లపాలెం హనుమంతరావు


 అశోకుని యర్రగుడి శాసనాలు
-సేకరణః కర్లపాలెం హనుమంతరావు



గుత్తి-ఆదోని రోడ్డు ఒక రాష్ట్ర రహదారి. గుత్తి నుంచి  గమ్యస్థానం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది యర్రగుడి. అక్కడి నుంచి అశోకుని శాసనాలున్న చోటు మరో  1 కి.మీ దూరం. స్థలాన్ని కనుక్కోవడం సులభంగానే ఉంటుంది.
అశోకుని రాతి నిర్మాణం రాష్ట్ర రహదారికి కిలోమీటరు దూరంలో కాంక్రీట్ రోడ్డుతో కలుపబడి ఉంది. సైట్ నిర్వహణ మెచ్చుకోతీరులో ఉంటుంది. బాధ్యుల చిత్రశుద్ధి, అంకితభావం క్షేత్రంలో  పుష్కలంగా ఆరోగ్యంగా పెరిగే చెట్లు, పూలమొక్కలు చెబుతున్నాయి.  
రోడ్డును వదిలి ఒక కాలి బాట  కొండ వెళుతుంది. ద్వారం వద్ద ఎఎస్ ఐ కర్నూలు సబ్ సర్కిల్ వారు ఏర్పాటు చేసిన గ్రానైట్ పలకల జత మీద  ఉన్న ఆంగ్ల పాఠాన్ని తెలుగులో అనువదించుకుంటే ఈ విధంగా ఉండవచ్చు.  
క్రీ.పూ 3వ శతాబ్దంలో ఈ ప్రదేశంలో గొప్ప మౌర్య చక్రవర్తి అశోకుడు శిలాఫలకాన్నిచెక్కించాడు. ఈ రాతి శాసనం బ్రహ్మీ లిపిలోను, ప్రకిత్ భాషలోను చెక్కబడింది. శాసనం ధర్మానికి సంబంధించింది: దేవతల ప్రియుడు ఈ విధంగా అన్నారు: దేవతల ప్రియుని ద్వారా మీరు ఆదేశించిన విధంగా ప్రవర్తించాలి. రజకులను వారి వంతుగా గ్రామప్రజలు, స్థానిక అధికారులను ఈ క్రింది మాటలలో ఆదేశించవలెను. "అమ్మా, నాన్న, పెద్దలను ప్రేమించాలి, జీవుని దయతో చూడాలి. నిజం మాట్లాడాలి".
హిందూ పత్రిక కర్నూలు ఎడిషన్ లో 2013 మే 31 న అశోకరాతి ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి డి.శ్రీనివాసులు ఆసక్తి కలిగించే  సమాచారం వ్యాస రూపంలో ఇచ్చారు.
కళింగ దండయాత్ర తరువాత అశోక చక్రవర్తి చేసిన పర్యటనల సమయంలో రాయబడిన బ్రాహ్మీ లిపి, ప్రాకృత భాష శాసనాలు కూడా ఈ విధంగా ఉన్నట్లు పరిశోధకులు భావ. 256 రోజుల పాటు జరిగిన ఈ పర్యటన కార్యక్రమంలో చక్రవర్తి  చాలా చోట్ల క్యాంపు లు నిర్వహించినట్లు తెలుస్తుంది. స్థానిక చరిత్రకారుల కథనం ప్రకారం, మౌర్యుల కాలంలో స్వర్ణగిరిగా పిలిచిన జొన్నగిరి ని ఆ రాజ్యానికి దక్షిణ భారత రాజధానిగా వ్యవహరించినట్లు అనుకోవాలి.
శాసనంలోని అంశం ఇతర అశోకుని అ తరహా  శాసనాలతో సంబంధం లేనట్లుగా కనిపిసుంది. అక్కడ రాజును ప్రియదాసి, దేవతల ప్రియునిగా ప్రస్తావించడం  జరిగింది. తొమ్మిది శిలలపై 28 భాగాలున్న యర్రగుడి శాసనాలు, తల్లితండ్రులకు విధేయంగా ఉండాలని, అలాగే పెద్దల పట్ల విధేయత ఉండాలని, ప్రాణులపట్ల దయ ఉండాలి, సత్యం మాట్లాడాలి, ధర్మం యొక్క లక్షణాలను ప్రచారం చేయాలి, బలికోసం ఏ ప్రాణిని వధించరాదు. రోడ్ల పక్కన చెట్లు నాటడానికి, జంతువులు, మనుషుల ఆనందం కోసం బావులు తవ్వారు అని ఆ రాతి బండల మీదుంటాయి. ధర్మానికి సంబంధించిన ఈ శాసనాలు నా (అశోకుడు) ద్వారా వ్రాయబడినవి. నా కుమారులు, మనుమలు అందరి క్షేమం కోసం కృషి చేయాలని శాసనం పేర్కొన్నట్లు సమాచారం.
శిలా శాసనం  ప్రపంచంలోని అన్ని వన్యప్రాణుల సంక్షేమం కోసం చేసిన మొదటి చట్టంగా పరిగణించవచ్చని ఎస్.జె. కాలేజీ ప్రిన్సిపాల్, చరిత్రకారుడు డాక్టర్ అబ్దుల్ ఖాదర్ అభిప్రాయం. నిజానికి అవి మౌర్యన్  రాజ్య విధానం నాటి నిర్దేశక సూత్రాలు. ఆ స్థల విశేషాన్ని వివరిస్తూ, భద్రపరచవలసిన ఆవశ్యకతను ఉద్బోధించే వ్యాసాలు గణనియంగానే వచ్చినట్లు సమాచారం.  
ఈ ప్రదేశంలో ఇంకా  8 శిలాశాసనాలు కనిపించాయి. అక్షరాల పరిమాణంలో పరిణామం సుస్పష్టం. బండరాయిలోకి తొలవడం వల్ల లోతుల్లో వచ్చిన తేడా వల్ల ఈ తారతమ్యం సంభవించివుండచ్చన్నది పరిశోధకుల భావన. కొన్ని అక్షరాలు సుద్దముక్కతో రాసినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో మూడు శాసనాలు ఉన్నాయి. ఒకటి దిగువ భాగంలో, త్రిభుజాకారంలో ఉన్న రాయి, వెనుక భాగంలో పెద్ద బండరాయి. ఇక్కడ కనిపించే ఈ శిలలన్నీ తూర్పు ముఖంగా ఉండగా, మిగిలిన శిలాశాసనాలు ఉత్తర-ముఖంగా ఉన్నాయి.
శాసనాలను నిశితంగా గమనించండి. ఉపరితలం అందంగా ముతకగా ఉంటుంది..
ఈ ఉపరితలం మృదువుగా ఉంటుంది.

ఇక్కడ శాసనాలు కేవలం ఉపరితలంపై ఉన్నాయి, ఎచ్చింగ్స్ లో లోతు లేదు, ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి.
కర్ణాటకలోని శాసనాలతో పోలిస్తే అక్షర పరిమాణాలు చాలా చిన్నవి. కర్ణాటక క్షేత్రాలల్లో గరిష్టంగా 3అంగుళాల నుంచి 5 అంగుళాల వరకు ఉండగ, ఇక్కడ గరిష్టంగా 3 అంగుళాల లోతు అక్షరాలను మాత్రమే చూడగలం. లభ్యమయే సందేశం  పొడవు, వెడల్పులను మీద ఈ లోతులు ఆధారపడివుండవచ్చని పరిశోధకుల అభిప్రాయం.  .
ఉపరితలం పోక్ మార్క్ చేయబడింది  చెక్కేవాని(ఇన్ స్క్రైబర్ )గొప్ప పనితనానికి ఈ శాసనం ఒక  మంచి ఉదాహరణ.
ఈ మెట్లకు పైన, ఎడమల వైపున్న  రాళ్ళ జత మీద శాసనాలను కనిపిస్తున్నాయి. ఇవి ఉత్తరాభిముఖంగా కనిపిస్తాయి.
 రాయి అంచుకు దగ్గరగా ఉంటుంది,  మెటల్ రెయిలింగ్ కూడా స్థిరంగా, బలంగా ఉండటం నిర్వహణలోని శ్రద్ధను సూచిస్తోంది.  ఉత్తరముఖంగా ఉన్న మరొక శాసనం. ఈ మార్గం రాతి నిర్మాణం యొక్క పశ్చిమ కొనకు దారితీస్తుంది.

ఈ సౌకర్యవంతమైన చోటు సందేశ రీడర్ల ద్వారా ఆక్రమించబడినట్లుగా కనిపిస్తుంది.  చల్లగా ఉండే ఈ చోటు నుంచి కింద పరుచుకున్న  మైదానాల అందాన్ని ఆస్వాదించవచ్చు.
చిన్న వీడియో చూడండి,
ద్వారం వద్ద ఒక చిన్న గుండ్రని రాయి నిఉంచారు. వచనం తెలుగు. యర్రగుడి గ్రామంలో ఈ శాసనం కనుగొనబడి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోయింది.

చివరగాః
మౌర్యుని కాలంలో జొన్నగిరి స్వర్ణగిరిగా ప్రసిద్ధి చెందినదని చరిత్రకారులు చెబుతారు. దే  నిజం అయితే,  ఇప్పటి దాకా  భావిస్తూ వస్తున్నట్లు కర్ణాటకలోని కనకగిరి సువర్ణగిరి కాకూడదు మరి
.
Source: with Thanks to
karnatakatravel.blogspot.com/2015/05
major-and-minor-rock-edicts-of-ashoka.html......

Saturday, December 11, 2021

విదేశీయాత్రిక చరిత్ర ; కుటుంబసమేతంగా వచ్చిన నికోలో కోంటీ

విదేశీయాత్రిక చరిత్ర ; 

కుటుంబసమేతంగా వచ్చిన నికోలో కోంటీ


15వ శతాబ్దంలో ఇండియాలో పర్యటించిన పాశ్చాత్యులందరిలో నికోలోకోంటి ప్రముఖుడు. ఆనాటి ఇండియా గురించి ముఖ్యమైన సమాచారం విస్తారంగా  గ్రంథస్తం చేసిన విదేశీయాత్రికుడు నికోలో  కోంటీ. 


కొంటీ ఇటలీకి చెందిన వెనీస్ నగరపు ధనిక వ్యాపారి. వెనీస్ నగరం ఆనాటికే  గొప్ప వర్తక కేంద్రం. సముద్ర వ్యాపారాల కేంద్ర స్థానం కూడా. సముద్రాంతర యాత్రలకు ప్రొత్సాహం కలిపించింది ఈ కేంద్రమే.  


నికోలోకోంటి సాహసయాత్ర సకుటుంబంగా సాగింది. తన భార్యా పిల్లలతో కలిసి 1419న  యాత్ర ప్రారంభించాడు. డెమోస్కస్ నుండి తూర్పు దిక్కుకు ప్రయాణం. 600 మంది వర్తకులతో  కలసి అరేబియన్  యడారుల గుండా  ప్రయాణించిన సాహసికుడు నికోలో కోంటీ. 


బాగ్దాద్ చేరిన తరువాత తూర్పు దిక్కుకు ప్రయాణించి  అరబ్బుల ఓడరేవు ఓర్ముజ్ను చేరి  కొంత కాలం పర్షియన్ భాష నేర్చుకునే నిమిత్తం అక్కడే ఉండిపోయాడు.  


అక్కడి నుంచి అరేబియా సముద్రంలో నౌకాయానం ద్యారా ఇండియా పశ్చిమ తీరంలో ఉన్న  కాంబేనగరంలో అడుగుపెట్టాడు.


అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేసి 300 మైళ్ల దూరంలో ఉన్న  విజయనగరం సందర్శించాడు.  విజయనగర రాజ్యం గురించి పాశ్చాత్యులకు సమాచారం అందించిన మొదటి విదేశీయాత్రికుడు నికోలో కోంటీ.


తరువాత ఇంకా దక్షిణానికి - మలియాపూర్ వెళ్ళి సెయింట్ థామస్ సమాధిని చూశాడు. తరువాత శ్రీలంకను, సుమత్రాను, బెంగాల్ను చూసి మరలా తూర్పుగా బయలుదేరి ఆరకాన్, ఇర్రావదీ, ఆద, పెగూ, జావా, సుంచావాలు వరకు వెళ్లి తిరుగు పయనం చేసి మరల సిలోన్ మీదుగా ఇండియా పశ్చిమ తీరానికి వచ్చి క్విలన్, కొచ్చిన్, కాలికట్లను దర్శించాడు.


కాంబే ప్రాంతంలో సతీసహగమనం ప్రబలంగా వుందనీ, కాలికట్ ప్రాంతంలో బహుభర్రుత్వం వుందనీ గమనించాడు.


కాంబే నుండి తిరుగు పయనం చేసి ఈజిప్టు గుండా వెళ్లాడు. కానీ వారి స్వదేశానికి దగ్గరలో వుండగానే అతని భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. కోంటి 1444లో తన వూరు వెనిస్ చేరాడు.


అప్పటి వరకూ తన పర్యటనను గురించి ఏమీ వ్రాసుకోలేదు. సముద్రయాత్రలో వుండగా ఒకసారి తన భార్యాబిడ్డల్ని రక్షించుకోవడానికి క్రిస్టియన్ మతాన్ని విడనాడాల్సి


చ్చిందట. ఆ తప్పదం అతన్ని వెంటాడుతూనే వుంది. ఆ పాపం నుండి బయటపడాలని ఈనాటి పోప్ యుజిని వద్దకు వెళ్లి వివరం అంతా చెప్పి పశ్చాత్తాపబడి తనకు పాపవిముక్తి చేయమని విన్నవించుకున్నా.


ఆ సందర్భంగా ఈయన యాత్ర విశేషాలు విన్న పోప్ గారు తన సెక్రటరీ సాయో బ్రాచ్చిమోలిని"ని వ్రాతకుడుగా నియమించి కోంటి చెప్పే విశేషాలన్నింటినీ _వ్రాయమన్నాడట. వారిద్దరి కృషి ఫలితంగా ఆ యాత్రా విశేషాలన్నీ గ్రంథస్తం అయ్యాయి. చరిత్రకొక మేలు జరిగింది. కోంటి నిశిత పరిశీలనా, పొగ్గియో మేలయిన రచనా శైలీ కలిపి లాటిన్ భాషలో “డి వెరైటేటి ఫార్చ్యునే” అనే గ్రంథం రూపొందింది.


కొండల మధ్యలో వున్న విజయనగరం చుట్టుకొలత 60 మైళ్లుంటుందని అందులో నివశిస్తున్న సైనికులే 90 వేల మంది వుంటారనీ వ్రాశాడు. ఇది ఎప్పుడు సంగతి? శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన నాటి కంటే వంద సంవత్సరాల పూర్వం సంగతి. అప్పటికే ఆ నగరం వందేళ్లయింది. క్రీ.శ 1336లో విజయనగరం ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. వందేళ్లలోనే ఆ నగరం అంత అభివృద్ధి చెందిందన్నమాట!


ఆయన ఆనాటి (1420) బెంగాల్ గురించి యేమీ రాయలేదు గానీ గంగానదీ గట్టమీద అందమైన తోటలతో నగరాలున్నాయని వ్రాశాడు. గంగానదిపై ప్రయాణం చేసి సంపదలతో తులతూగుతున్న 'మారజియా' అనబడే నగరాన్ని చేరాడట.


పేపర్ మనీ వాడుకలో వుందనీ కుతూహలమైన విషయాన్ని కోంటి వ్రాశాడు. వెనీస్ నగరపు బంగారు నాణాలైన డుకౌంటులు కూడా చలామణి అవుతున్నాయట. అవిగాక ఇనుప నాణాలు కూడా వాడుకలో వున్నాయట.


ఇక్కడ హిందువులు పరిపాలిస్తున్న రాజ్యాలలో నేరవిచారణ తతంగాలలో ప్రమాణాలు వాడుకలో వుండటం చూసి విస్తుబోయాడు.


"ఇండియాలో చనిపోయినవారిని దహనం చేస్తారు. బ్రతికి వున్న అతని భార్యల్ని కూడా ఆ మంటలోనే దహనం చేస్తారు. అది చాలా గౌరవంగా భావిస్తారు...” అంటూ ఆ సతీసహగమన తతంగం ఎలా జరుగుతుందో అంతా వర్ణించాడు.


హిందూవులలో ఆత్మార్పణం చేసుకునే భక్తులు కూడా వుంటారనీ విజయ నగరంలో అలాంటి ఆచారం వాడుకలో వుందనీ వివరించాడు కోంటి. ఆ భక్తులు


తమకు తామే తమ శిరసుల్ని నరుక్కుంటారని వర్ణించాడు. దేవుడి రధ చక్రాల క్రిందపడి కూడా చనిపోతుంటారనీ వ్రాశాడు.


మలబారు తీరంలో కాలికట్లో కొంతమంది ప్రజల్లో బహు భర్రుత్వం అమలులో


వుందని వ్రాశాడు.


విజయనగర సామ్రాజ్యం గురించి మరికొంత వివరిస్తూ ఇక్కడి మగవారు ఎంతమంది భార్యలనైనా చేసుకుంటారనీ, వీరి రాజుకు 12 వేల మంది భార్యలున్నారనీ, రాజుగారు ఎక్కడికి వెళ్లినా అతనితో పాటు 4000 మంది భార్యలు కదిలి వెళ్తారనీ, వాళ్లుగాక వంటపనులకూ, సాయుధులైన అశ్వికులు గానూ అనేకమంది మహిళలున్నారని వ్రాశాడు.


విజయనగర సామ్రాజ్యంలోని పండుగల్ని కూడా వర్ణించాడు. అన్ని వయస్సుల జలూ నదులలో స్నానం చేసి, మంచి మంచి దుస్తులు ధరించి మూడురోజులపాటు త్యాలతోనూ, ఆట పాటలతోను గడుపుతారనీ, దేవాలయాల్ని దర్శిస్తారనీ, మరో డుగలో ఇళ్ళన్నీ దీపాల వరుసలతో అలంకరిస్తారనీ, ఇంకో పండుగ రోజున ందంగా రంగులు జల్లుకుంటారనీ వ్రాశాడు.


విజయనగరానికి ఉత్తరంగా 15 రోజుల నడక దూరంలో వజ్రాలు లభించే డ వుందనీ వ్రాశాడు. ఈ గోల్కొండ వజ్రాల గనుల గురించీ, కృష్ణానదీ వుత్తర లో వజ్రాలు లభిస్తాయనీ చాలామంది యాత్రీకులు వ్రాసినదే ఆయన కూడా శాడు.


గుజరాతుకు చెందిన కాంబే నగరం వారు మాత్రమే కాగితాన్ని వుపయోగిస్తున్నారనీ, మిగిలిన వారంతా వ్రాతకు చెట్ల ఆకుల్ని (తాటి ఆకులు) వుపయోగిస్తున్నారని వ్రాశాడు.


ఈదేశాలలో ప్రజలు ఎక్కువనీ, సైన్యాలు కూడా లక్షల సంఖ్యలో వుంటాయనీ వ్రాశాడు. నికోలో కోంటి దక్షిణ ఇండియాలో 1420-21లలో పర్యటించాడని చరిత్రకారులంటారు.


15వ శతాబ్దంలో అనేకమంది విదేశీయులు పర్యటనలు చేశారు. వారంతా మగవాళ్లే ఇండియాకు వచ్చిపోయారు. కుటుంబంతో సహా వచ్చిన సాహసి ఈయనే. కానీ ఆయన కుటుంబానికి ఇండియాలో హిందువుల వలనగానీ, ముస్లింలవలన గానీ ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదని ఆయన రచన వలన తెలుస్తున్నది. అలాంటి శాంతి భద్రతలు, నీతి నియమాలూ ఇండియాలో ఆ రోజులలోనే అమలులో వున్నాయనేది నికోలో కోంటీ యాత్ర వలన మనకు అవగతమవుతోంది.

సేకరణ : కర్లపాలిం హనుమంతరావు 

( విదేశీయాత్రికులు అందించిన మనదేశ చరిత్ర - డి.వెంకట్రావ్ ) 

Tuesday, December 7, 2021

ఆంధ్రుల ప్రాచీనత - కర్లపాలెం హనుమంతరావు

 ఆంధ్రుల ప్రాచీనత 

-  కర్లపాలెం హనుమంతరావు 


భారతదేశంలోని పురాతన జాతులలో ఆంధ్రజాతి ఒకటి..


భారత రామాయణాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో జాతక కథలలో ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. 


కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరువుల తరుఫున్ పోరాడారని ఒక విశ్వాసం. 


శ్రీకృష్ణుడు మధురానగరం వచ్చినపుడు అతని పై యుద్ధానికి కంసుడు  ఉసిగొల్పినా చాణూరుడు ఆంధ్రజాతి వాడేనని కూడా మరో నమ్మిక . 


మరో కథలో విశ్వామిత్రుడు ఒకానొక నరమేధ యాగంలో  బలిపశువు శునశ్శేపుని విడిపించి తన  దత్తపుత్రునిగా  స్వీకరిస్తాడు. దానితో విభేదించిన  విశ్వామిత్రుని బిడ్డలు ఉత్తర భాగం నుంచి తూర్పు , దక్షిణ దిశలుగా వలస వచ్చేస్తారు. వారు ఆంధ్రులు అనే భావనా ఉంది. 


కురుక్షేత్ర  యుద్ధం కారణంగా కురు పాండవుల పక్షాన పోరాడిన అనేక తెగలునాశనమయ్యాయి. గంగా,యమునా తీరాలు పీనుగుల పెంటగా మారిన ఫలితంగా మిడతల దండుల దాడి అధికమయినట్లు, ఆ బాధనుండి విముక్తికై వివిధ దిక్కులకు తరలిపోయిన జాతులలో ఆంధ్రులలోని ఒక భాగం  దక్షిణాపథానికి  వచ్చి స్థిరపడ్డట్లు ఛాందోగ్యోపనిషత్  తెలియచేస్తుంది. 


పుండ్ర పుళింద, శబర మూతిలులతో కలిసి వింధ్యకు దక్షిణాన ఆంధ్రులు నివసించినట్లు ఐతరేయ బ్రాహ్మణం చెబుతోంది . 


ఆంధ్రులంతా మూకుమ్మడిగా ఒకేసారి తరలిపోలేదు. ఇది శతాబ్దాలపాటు తెగలు తెగలుగా జరిగిన  మహాప్రస్థానం. ఉన్న చోటును ఒక పట్టాన వదలలేని మనస్తత్వంతో ఆంధ్రులలోని కొంత భాగం క్రీ.పూ 700 నాటికి కూడా యమునా నదీ  తీరాన గల  సాళ్వీదేశంలోనే అవస్తలు పడుతూనే ఉండిపోయారని  ఆపస్తంబ  రుషిగాధ తెలియచేస్తున్నది. 


ఆంధ్రులలోని బ్రాహ్మణులు నేటికీ పాటిస్తున్న  వివాహ పద్ధతులు.. గృహ్య సిద్ధాంతాలు ఈ ఆపస్తంబ  రుషి నిర్దేశించినవే! 


ఒక్కో గణానికి నిర్దేశకుడుగా ఒక్కో రుపి ఉండేవాడు. సాళ్వీదేశంలో ఉన్నప్పుడే ఆపస్తంబుడు రచించిన గృహ్య సూత్రాలు ఆంధ్రులతో పాటే వింధ్య దక్షిణానికీ తరలివచ్చి ఇక్కడి తెగలలో కలగలసిపోయాయి. 


వింధ్య దక్షిణానికి కొన్ని ఆంధ్ర తెగలు వలస వస్తే ( నేటి హైదరాబాద్ .. పరిసర ప్రాంతాలు) , మరికొన్ని ఆంధ్ర తెగలు తూరు కనుమల గుండా ఒరిస్సా వైపు నుండి కిందకి దిగి కళింగదేశంలో స్థిరబడ్డాయి . 


సెరివణిజ జాతక కథ ఆంధ్రులు తేల్ నదీ తీరాన   అంధకవురం నిర్మించుకున్నట్లు వర్ణిస్తుంది.  జాతక కథల కాలం క్రీ.పూ 200-250 . 


తేల్ మహానదికి  ఉపనది తెలివాహ . మహానది ఉన్నది ఒరిస్సాలో.  కాబట్టే ఆంధ్రులలోని ఒక తెగ ఒరిస్సా మీద నుంచి వచ్చినట్లు  భావిస్తున్నది. 


ఒరిస్సా  పురాతనకాలంలో కళింగదేశం .. ఆ దేశవాసులు కాళింగులుగా సుప్రసిద్ధం. బహుశా ఈ కారణం చేత కూడా ఆంధ్రులలోని  ఆ వైపు తెగకు కాళింగులు అన్న పేరు స్థిరపడిఉండవచ్చు .  నేటికీ కాళింగులు అనే పదం  . . ఆంధ్రులు  అనే పదానికి పవ్యాయపదంగా వాడటం గమనీయం . 


- కర్లపాలెం హనుమంతరావు 

26-11-2021 

( ఆధారం: ఏటుకూరి బలరామమూర్తి గారి ' ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - ఆంధ్రుల ప్రాచీనత ' ) 


Friday, October 1, 2021

ఆంధ్ర శిల్ప కళ - కర్లపాలెం హనుమంతరావు

 


రాళ్ళలో చెక్కినవి, రంగులతో పూసినవి రూపకళ కిందకొస్తాయి,

ఆంధ్రుల రూపకళ ప్రపంచ వ్యాపితం; విశ్వరూపకళతో ప్రభావితమైన భారతీయ రూపకళ ద్వారా  ప్రకటితమవుతుంది కనుక.


మనషి రూపాలను కల్పన చేసే గుహకళకు సుమారు 30 వేల సంవత్సరాల చరిత్ర ఉంటుందంటారు! మధ్యప్రదేశ్ హోషంహాబాద్ గుహకళ ఈ ఊహకు కారణం. అక్కడి రూపకళ స్పెయిన్ దేశపు గుహచిత్రాల ప్రభావితం.


చూసే దానికి నకలు తయారుచేసే తపన మనిషికుండే  స్వాభావిక లక్షణం. ఆ లక్షణం నుంచి పుట్టుకొచ్చిందే రూపకళ. 


ఆదిమానవుడుకి జంతువుల కొవ్వు, రక్తం గోడరాతలకు ఊతంగా ఉపయోగించాయి. ఒక జంతువు రూపం కల్పించి దానిలో బల్లెం గుచ్చినట్లు చిత్రిస్తే అడవిలోని ఆ తరహా జంతువు సులభంగా చస్తుందనే సంకేతం ఇచ్చినట్లన్నమాట.


ఒక ప్రయోజనం కోసం ప్రారంభమైన చిత్రకళ క్రమంగా సౌందర్యకళగా మారిన క్రమం అర్థమయితే అబ్బురమనిపిస్తుంది. కాని, మొహంజొదారో నాగరికతకు ముందున్న ఈ చిత్రకళ క్రమపరిణామానికి చెందిన చారిత్రక ఆధారాలేవీ ఇప్పటి దాకా లభ్యమయ్యాయి కాదు. 


ఆర్యులకు సభ్యత మినహా మరేమీ తెలియని మొహంజొదారో నాగరికత ముందు కాలానికే ద్రవిడులలోని సభ్యత చాల ఉన్నత స్థితి అందుకున్నట్లు చరిత్ర చెబుతున్నది. కాకపోతే ఆంధ్రులు ఆర్యులా, ద్రవిడులా అన్నది ఒక ప్రశ్న. రెండు తెగల సమ్మిశ్రితం అన్న వాదనలోనే నిజం పాలు ఎక్కువ.


ఆంధ్రులుగా భావింపబడిన శాతవాహనులు క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాల నుండి క్రీ.శ ఒకటి రెండు శతాబ్దాల దాకా భారతదేశాన్ని పరిపాలించారు. వారి పాలన కేవలం ఆంధ్రభూమి వరకే పరిమితం కాదు. మగధ వరకు విస్తరించి ఉంది.


అజంతా గుహలలోని మొట్టమొదటి గుహ ఆంధ్రుల సృష్టే. అట్లాగే సాంచీ స్తూప ప్రాకార నిర్మాణం కూడా. అక్కడి ఆ గుహకళ ఒక దృశ్య సంగీతం. తెలుగు శిల్పుల పోగారింపుపని ప్రతిభ విమర్శకుల వేనోళ్ల పొగడ్తలకు పాత్రమయింది.


శిల్పికి చిత్రకళ ప్రావీణ్యం అవసరం. చిత్రకళకు నాట్యకళ నేర్పరితనం, నాట్యకళకు సంగీత జ్ఞాన నిష్ణాణత, సంగీత జ్ఞానానికి సాహిత్య మర్మం అవసరం. వెరసి శిల్పి కాదల్చుకున్న వ్యక్తి బహుముఖ ప్రజ్ఞ అలవరుచుకోవలసి ఉంది.

 

ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వెలసింది. ఆ కొండ నిర్మాణంలో ఆంధ్ర శిల్పులదే సింహభాగం. కొందరు అనుకున్నట్లు నాగార్జునుడు ఆంధ్రుడు కాదు. ఇక్కడి విశ్వవిద్యాలయంలో ఆచార్యకత్వం నిర్వహించేందుకు విచ్చేసిన బీరారు ప్రాంతీయుడు.


ఇక్ష్వాకులకు అసలు చిత్రకళ ప్రవేశమే లేదు. వీరి తదనంతరం వచ్చిన పల్లవుల చలవే రూపకళ వికాస దర్శనం. ఆంధ్ర శిల్పుల కళ్లు ఒక్క ప్రాంతానికి పరిమితం కాదనడానికి పల్లవులు నిర్మించిన మహాబలిపురమే ఒక ఉత్కృష్ట ఉదాహరణ. తమ పరిసరాలను, పశుపక్ష్యాదులను శిలలపై చిత్రించిన ఆంధ్రుల శిల్పకళ అపూర్వం.


తదనంతరం వృద్ధిలోకి వచ్చిన ఆదర్శవాదం కాకుండా మహాబలిపుర శిల్పకళలో వాస్తవిక వాదం చోటుచేసుకోవడం విశేషం. ఆంధ్ర శిల్పుల వాస్తవిక వాద చిత్రకళ ఒక్క అజంతా కుడ్య చిత్రాల మీదనే కాకుండా పుదుక్కోట సంస్థాన పితన్న దేవాలయం గోడల మీది బొమ్మలు మీదా కనిపిస్తుంది. కాకపోతే ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది మాత్రం అజంతా కుడ్య చిత్రకళ.


స్నాయుపుష్టి(శరీర ఆంతరంగిక నిర్మాణం), దేహయష్టి రెండూ పుష్కలంగా ఉండే గ్రీకో-గాంధార కళ కొట్టొచ్చినట్లు కనిపించే ఈ గుహకళ వాస్తవానికి ఆంధ్రులది కాదు. గ్రీక్ దేశం వెళ్లి మనవాళ్లే నేర్చుకున్నారో, మనవాళ్ల దగ్గరకొచ్చి గ్రీకులే నేర్పారో.. ఆధారాలు దొరకలేదు ఇప్పటి వరకు.

 

కళింగగాంగుల కాలంలో స్థూపకళ విస్తృతంగ వర్ధిల్లింది. వీరి జమానాలో నిర్మితమయిన కోణార్క దేవాలయంలో కూడా ఆంధ్ర శిల్పుల ఉలి చప్పుళ్లే ఎక్కువ. పల్నాడులో కనిపించే గోలిశిల్పం నాగార్జునకొండ, అమరావతి శిల్పాలకు తోబుట్టువు. ఈ విలువైన శిల్పాలన్ని ఇప్పుడు విదేశీయుల అధీనంలో ఉన్నాయి. స్వాతంత్ర్య సంపాదన కాలంలో బ్రిటిష్ దొరలతో   విస్తృతమైన ఒడంబడికలు జరిగాయి. కాని వేటిలోనూ విలువైన మన శిల్పాలు తిరిగి ఇచ్చే విషయం ప్రస్తావనకైనా రాలేదు.  విచారకరం.

 

భారతీయ చిత్రకళకు జహంగీర్, షాజహాన్ పాలనా కాలం స్వర్ణయుగం. షాజహాన్ ప్రత్యేకంగా శిల్పులను రావించి పరిసరాలలోని వస్తువులను  చిత్రించే వాస్తవిక వాదాన్ని ప్రోత్సహించాడు.


చిత్రించే క్రమంలో కన్ను వస్తువును చూపే క్రమాన్ని యథాతథంగా చిత్రించడమే వాస్తవిక వాదం. పెద్ద కొండ అయినా దూరం నుంచి చిన్నదిగాను, చిన్న పూలమొక్క అయినా దగ్గర నుంచి పెద్దదిగాను కనిపిస్తుంది. మన చిత్రకారులు ఈ దృష్టి క్రమాన్ని పట్టించుకోకుండా పెద్ద కొండను ఎప్పుడూ పెద్ద పరిణామంలోనూ, చిన్ని మొక్కనూ అట్లాగే చిన్ని పరిణామంలోనూ చిత్రించే కళకు ప్రాధాన్యమిస్తారు. కాబట్టి, భారతీయ చిత్రకారులకు దృష్టి క్రమం (పెర్ స్పెక్టివ్) తెలియదనే వాదు ఒకటి ఉంది. ఇది పడమటి దేశాలలో అనుసరించే యథార్థవాదానికి విభిన్నమైన ఆథ్యాత్మిక వాదం. పునరుజ్జీవ యుగానికి ముందు పశ్చిమ దేశాలలో కూడా తమ చిత్రాలలో మూడ తలాలు కాకుండా ఒకే తలం చూపించేవారు.


మన దేశంలో కొంతకాలం చిత్రకళ్ల పూర్తిగా స్థంభించిపోయింది. ఆంధ్రుల కళా అందుకు మినహాయింపు కాదు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు చిత్రకళలో కూడా ఒక ఉద్యమం అలలాగా ఎగిసిపడటంతో తిరిగి ఆంధ్రుల కళకు జీవమొచ్చింది. 


ఆంధ్రదేశంలో మూడు ప్రధాన శాఖలున్నాయి; రెండు బెంగాలీ శాఖలు, ఒకటి బొంబాయి శాఖ. అడవి బాపిరాజు వంటివారిది ఒక శాఖ, శ్రీ దేవీ ప్రసాదరాయ్ వంటివారిది రెండో శాఖ. ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు వద్ద విద్య నభ్యసించిన శిష్యపరంపర ప్రవేశపెట్టిన  బొంబాయ్ శాఖ మూడవ రకానిది.


చిత్రకళకు ఏ కొద్దిగానో ప్రోత్సహమున్నది. కాని, మూర్తికళను పట్టించుకునే నాథుడు ఆంధ్రదేశంలో నాడూ లేడు, నేడూ లేడు. గుంటూరు జిల్లాలోని పురుషత్ గ్రామంలో ఈ మూర్తికళ మీద ఆధారపడి జీవించే ముస్లిం కుటుంబాలున్నా.. అదే ఆదరువుగా జీవితం గడిపే పరిస్థితులు  లేవు. కుడ్య చిత్రకళ  కనుమరుగవుతున్న  అమూల్య సంపదల జాబితాలోకి క్రమంగా జారిపోతోన్నది అనేదే ఆఖరి చేదు సత్యం.


(సంజీవ దేవ్ వ్యాసాలు- ఆంధ్ర శిల్పుల రూపకల్పన ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

02 -10 -2021

బోథెల్;  యూ.ఎస్.ఎ

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...