Showing posts with label Society. Show all posts
Showing posts with label Society. Show all posts

Thursday, December 9, 2021

వయోవృద్ధుల ఊత కర్ర- సాంకేతిక పరిజ్ఞానం -కర్లపాలెం హనుమంతరావు

 వయోవృద్ధుల ఊత కర్ర- సాంకేతిక పరిజ్ఞానం

రచన: -కర్లపాలెం హనుమంతరావు

( సూర్య దినపత్రిక - కాలమ్ ) 

 

వినడానికి విడ్డూరంగానే ఉన్నా.. వయో వృద్ధుల జీవన ప్రమాణాలను పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానం  మెరుగుపరుస్తుందన్న మాట నిజం. ఆరంభంలో అలవాటు లేని అవుపాసనలా అనిపిస్తుంది; మాలిమి చేసుకున్న కొద్దీ వయసు వాటారే వృద్ధులకు  అదే ఊతకర్రకు మించి మంచి తోడు అవుతుంది.

గడచిన ఒకటిన్నర శతాబ్ద కాలంగా మానవ జీవనస్థితిగతుల్లో కనిపించే గణనీఉయమైన మెరుగుదల హర్షణీయం. అందుకు కారణం  పారిశుధ్యం పైన మునపటి కన్నా పెరిగిన శ్రద్ధ; అదనంగా నాణ్యమైన వైద్య సంరక్షణ.  మానవ  ఆయుర్దాయం  క్రమంగా పెరగడం ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలలో కూడా ప్రస్ఫుటంగా కనిస్తుందిప్పుడు

విశ్వవ్యాప్తంగా మనిషి సగటు జీవితకాలంలో  చెప్పుకోదగ్గ పెరుగుదల కొత్త శతాబ్దం నుండి ఆరంభయింది. 2016 మధ్య వరకు దొరుకుతున్న లెక్కల ప్రకారం ఈ పెరుగుదల ఐదు సంవత్సరాల ఐదు నెలలు. గత శతాబ్ది ’60 ల తరువాత నమోదైన  అత్యంత వేగవంతమైన పెరుగుదలలో ఇదే గరిష్టం. దేశ జాతీయ గణాంకాలు ఇంతకు మించి ఘనంగా మోతెక్కడం మరో విశేషం.  నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 రికార్డులు చూసుకుంటే, భారతదేశంలో ఆయుష్షు  ప్రమాణం ‘70-‘75లలో 49 సంవత్సరాల ఏడు నెలలుగా ఉంటే, అదే జీవితకాలం 2012-2016ల మధ్యలో  ఏకంగా 68.7 సంవత్సరాలకు ఎగబాకింది. ఇంత పెరుగుదల వల్ల  తేలిన పరిణామం ఏమిటంటే,    జాతీయ జనాభా మొత్తంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య గణనీయంగా పెరగడం! ఇవాళ దేశ జనాభాలో వయోవృద్ధుల వాటా ఒక బలమైన స్వతంత్ర వర్గంగా తయారయింది.  సమాజంలోని ముఖ్యాంగాలలో ఒకటిగా లెక్కించక తప్పని పరిస్థితి కల్పించింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానమూ  అనూహ్యమైన వేగంతో అభివృద్ధి పథంలో  దూసుకురావడం..  అదృష్టం. 

 

ఆధునిక సాంకేతిక జ్ఞానం సాయం లేకుండా  రోజువారీ దినచర్య క్షణం ముందుకు సాగని పరిస్థితులు ఇప్పడున్నవి. అంతర్జాల పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చేసే ఉపకరణలు(యాప్స్)  ఉనికిలో లేనట్లయితే ప్రపంచానికి ఏ గతి పట్టి ఉండేదో ఊహించడం కష్టమే! సాంకేతికత సాయం వినా  కోవిడ్- 19 వంటి  మహమ్మారులు ఇప్పుడు సృష్టించే  లాక్-డౌన్లు, ఐసొలేషన్  ఉపద్రవాలను  ఏ విధంగా తట్టుకోవడం? 

 

ఉత్పాతాలు ఒక్కటనే కాదు, మహమ్మారులు జడలు విదల్చని ముందు కాలంలో కూడా మనిషి జీవితంలో సాంకేతిక అనివార్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం ఆధారంగా మెరుగయ్యే  జీవనశైలి పైన మారుమూల పల్లెజీవి కూడా మోజుపడే తరుణం ఒకటుంది. అయినా సాంకేతిక రంగ సంబంధిత మార్కెట్  అన్ని రిస్కులు ఎందుకు ఎందుర్కొంటున్నట్లు? క్షణక్షణం మారే ఆ సాంకేతిక పరిజ్ఞానం సృష్టించే అనిశ్చిత వాతావరణమే అందుకు ప్రధాన కారణం.  రైడ్‌-ఆన్-కాల్  సౌకర్యం అందించే ఉపకరణలు ముమ్మరం అయిన తరువాత మధ్యతరగతివారి కార్ల కొనుగోళ్ల వాటా అథఃపాతాళానికి అణగిపోవడమే అందుకు ఉదాహరణ! వంటిఆరోగ్యం నుంచి ఇంటిపనుల వరకు అన్నింటా టెక్నాలజీ నీళ్లలో పాలలా కలగలసిపోయి ఉన్న నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం వయసు మళ్లినవాళ్లకు వాస్తవంగా ఒక గొప్ప వరం కావాలి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అందుకు విభిన్నంగా ఉన్నాయి. అదీ విచిత్రం! 

 

గడప దాటి  కాలు బైటపెట్టలేని వయోవృద్ధులకు  కుటుంబ సభ్యుల నిరంతర సేవలు ఎల్లవేళలా  లభ్యమయ్యే కాలం కాదు ఇప్పటిది.  ఇంటి పట్టున ఒంటిగా మిగిలుండే వృద్ధులకు అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ నిజానికి ఎంతో అండగా ఉండాలి.  కానీ,  పాతకాలపు ఆలోచనలు ఒక పట్టాన  వదలుకోలేని ముసలివాళ్ల సంశయాత్మక మానసిక బలహీనత సాంకేతిక పరిజ్ఞాన పరిపూర్ణ  వినియోగానికి అవరోధంగా మారుతున్నది.   మొబైల్ అంటే కేవలం టెక్స్టింగ్ మాత్రం చేసుకునే ఓ చేతిఫోన్ సౌకర్యం.. అనుకునే తాతా అవ్వలే జాస్తిగా కనిపిస్తున్న పరిస్థితి ఇప్పటికీ. యాప్ లంటే కుర్రకారు ఆడుకుందుకు తయారయ్యే ఏదో ఫోన్ సరదాలని గట్టిగా నమ్మినంత కాలం టెక్ ఆధారిత  వేదికలను నమ్మి ఆమ్మమ్మలు, తాతయ్యలు గాడ్గెట్లను నిత్యజీవితావసరాలకు ధీమాగా వాడటం  కల్ల. వయసు పైబడినవారిలో  టెక్నాలజీ మీద ఉండే అపనమ్మకం ఎట్లా తొలగించాలన్నదే ఈనాటి టెక్ మార్కెట్లను తొలిచేస్తున్న ప్రధాన సమస్య.  

 

కాలిఫోర్నియా శాన్డియాగో విశ్వవిద్యాలయం ల్యాబ్ డిజైనర్  షెంగ్జీ వాంగ్ ఇటీవల వయసు వాటారిన వాళ్ల మీద సాంకేతిక పరిజ్ఞానం చూపించే ప్రభావాన్ని గురించి ఓ పరిశోధన పత్రం వెలువరించాడు.  పదే పదే ఎదురయ్యే పలు సందేహాలకు సులభంగా సమాధానాలు రాబట్టే సౌలభ్యం తెలీకనే సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొత్త టెక్ అంటే చిరాకుపడతారన్నది  షెంగ్జీ వాంగ్  థియరీ. ఇటు ఉత్సుకత ఉన్న ముసలివాళ్లనైనా  ప్రోత్సహించనీయని చిక్కుముళ్లు అనేకం  పోగుపడటమే వృద్ధజనం ఆధునిక సాంకేతికత వాడకానికి ప్రధానమైన అడ్డంకి అని కూడా అతగాడు తేల్చేశాడు. 

 

తరచుగా మారిపోయే అప్ డేట్స్, తత్సంబంధమైన మార్పులు చేర్పులు పెద్దవయసువారికి ఒక పట్టాన అర్థం కావు.    ఉదాహరణకు,  ‘బటన్స్’ ఒక క్రమంలో నొక్కి కోరుకున్న సేవలు పొందటం అలవాటు పడ్డ తరువాత, అవే సేవల  కోసం ఆవిష్కరించిన మరో కొత్త ‘బటన్ లెస్’ విధానం మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవడం వృద్ధుల దృష్టిలో  విసుగు పుట్టించే వృథా ప్రయాస. ఒక వయసు దాటినవారి మానసిక ఏకాగ్రతలో వచ్చే సహజ మార్పులను పరిగణనలోకి తీసుకోని పక్షంలో అధునాతన  విజ్ఞానం ఎంత ఘనంగా పురులు విప్పి ఆడినా పెద్దలకు ఆ భంగిమల వల్ల ఒనగూడే లాభాలు ఒట్టిపోయిన గోవు పొదుగు పిండిన చందమే.  గొప్ప సాంకేతిక విజయంగా నేటి తరం భావిస్తున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పెద్దలను ఇప్పటికీ జయించలేని ఒక మాహా మాయామృగంగానే భయపెట్టేస్తోంది. కృష్ణారామా అనుకుంటూ ప్రశాంతంగా కాలం గడపే   వయసులో మొరటు మృగాలతో పోరాటాలంటే ఏ ముసలిమనిషికైనా ఉబలాటం  ఎందుకుంటుంది?!

 

పొద్దస్తమానం కొత్త కొత్త పాస్ వర్డ్స్ ఎన్నో పరిమితులకు లోబడి నిర్మిస్తేనే తప్ప  సేవలు అందించని యాప్ లు వయసు మళ్లినవాళ్ల దృష్టిలో ఉన్నా లేనట్లే లెక్క.  జ్ఞాపకశక్తి, నిర్మించే నైపుణ్యం సహజంగానే తరిగిపోయే ముసలివగ్గులకు ఈ తరహా పాస్ వర్డ్ ‘ఇంపోజిషన్స్’ శిక్ష దాటరాని ఆడ్డంకిగా తయారవుతున్నది. లాగిన్ కాకుండా ఏ సేవా లభించని నేపథ్యంలో అన్ని వెబ్ కాతాలకు ఒకే తరహా లాగిన్ ఉంటే  వృద్ధజనాలకు ఎక్కువ సౌలభ్యంగా ఉంటుంది. ఆ తరహా వెసులుబాటుకు గూగుల్ వంటి పోర్టల్సు ఒప్పుకుంటున్నా, సెక్యూరిటీ కారణాలు అవీ ఇవీ చెప్పి   చుక్కలు చూపించే అప్రమత్తత వాటిది. దిక్కులు చూస్తూ కూర్చునే దానికా    వేలు పోసి  స్మార్ట్ ఫోనులు పెద్దలు కొని ఒళ్లో పెట్టుకొనేదీ! ఎన్నో రకాల అంతర్జాల వేదికలు(ఇంటార్నెట్ ఫ్లాట్ ఫారమ్స్)! అంతకు వంద రెట్లు అయోమయ ఉపకరణలు(యాప్స్)! ఒక్కో  అంతర్జాల కాతా కు ఒక్కో తరహా నియమ నిబంధనలు! సాంకేతిక సంక్లిష్టత   కురుక్షేత్ర యుద్ధం నాటి అభిమన్యుడి సంకట స్థితి తెచ్చిపెడుతుంటే, తాజా టెక్నాలజీ వల్ల వృద్ధజనాలకు ఒనగూడే  ప్రయోజనం ఏమిటన్నది జవాబు దొరకని ప్రశ్నయింది.  

 

కొత్త టెక్నాలజీ హంగూ ఆర్భాటంగా రంగ ప్రవేశం చేసేది  ముసలితరంగాతమను  మరంత వంటరి చేసేందుకే అని పెద్దలు భావించడంమొదలయితే  నూతన సాంకేతిక పరిజ్ఞాన వికాసం మౌలిక లక్ష్యమేసమూలంగా దెబ్బతిన్నట్లు లెక్క కనీసం డబ్బు చింత లేని పెద్దవారికైనా.. ఆధునిక   సాధనాలతో   ఆ దివి  సదుపాయాలన్నీ భువి మీదకు  దింపుతామనే హామీ  అత్యాధునికమని చెప్పుకునే లేటెస్ట్ టెక్ నిలుపుకుంటుందా?  మనవళ్ల, మనవరాళ్ళ తరం మాదిరి యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే కదా ఏ ఆధునిక  పరిజ్ఞానం వాడకం వైపుకైనా అవ్వాతాతల ఆసక్తులు రవ్వంతైనా మళ్లేది!  అట్లాగని సైబర్ నేరాలతో  రాజీపడిపొమ్మని కాదూ.. అర్థం. 

 

తప్పేమన్నా జరిగిపోతుందేమోనన్న భయం  పెద్దవయస్కుల్లో  ఎక్కువ మందిని  స్మార్ట్ ఫోన్  రిస్క్ తీసుకోనివ్వడంలేదు. ఈ కాలంలో పసిపిల్లలుసైతం అతి సులువుగా  ఆడేస్తున్న  విసిఆర్ రిమోట్..  ముందు తరాన్ని విధంగానే మహా బెదరగొట్టిందివాస్తవానికి టచ్,  వాయిస్ వంటిసదుపాయాలతో సీనియర్ సిటిజన్లు అద్భుతమైన సేవలు అందుకునే సౌలభ్యం మెండు ‘హై- టెక్’ అద్భుత దీపంతో  పని చేయించుకునేసులువు సూత్రం ముందు ముసలితరం అల్లావుద్దీన్ తరహాలో స్వాధీనపరుచుకోవాలి.  మొబైళ్లూ, యాప్ ల నిర్మాతలే, టి.వి అమ్మకాల పద్ధతిలో డోర్ స్టెప్ డెమో సర్వీసులు అందించైనా అందుకు పాతతరాన్ని  సిద్ధం చేసుకోవాలి. ఒకే రకం సేవలకు పది రకాల పరికరాలతో ముసలి మనసులను మయసభలుగా మార్చకుండా సీనియర్లే  తమ  అవసరాలు, అభిరుచులకు  తగ్గట్లుగా ప్రత్యేక ఉపకరణాలు  స్వంతంగా ఎంచుకునే తీరులో ఈ శిక్షణా పరంపరలు కొనసాగాలి. పాతతరానికి  కొత్త నైపుణ్యాలు నేర్పించడంలోనే ఆధునిక టెక్నాలజీ విజయ రహస్యమంతా ఇమిడి వుందన్నముఖ్య సూత్రం మరుగున పడటం వల్లే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధుల విషయంలో పేరుకు మాత్రమే కాళ్లున్నా కదలలేని కుర్చీలా కేవలం అలంకారప్రాయంగా ఆర్భాటం చేస్తున్నది.

ఖర్చులకు రొక్కం కావాలన్నా కాళ్లు పీకేటట్లు బ్యాంకుల ముందు పడిగాపులు తప్పని కాలం ఒకప్పడిది. తపాలా కార్యాలయానికి వెళ్లి కార్డు ముక్క గిలకనిదే   అయినవాళ్ల సమాచారం అందే  పరిస్థితి లేదు అప్పట్లో! మరి ఈ తరహా  తిప్పలన్నిటినీ తప్పించేటందుకే  నెట్ బ్యాంకింగొచ్చిందన్నారు; ఈ మెయిలింగొచ్చి గొప్ప మార్పులు తెచ్చిందన్నారు!   ఇంటి  కిరాణా సరుకునుంచి బైటకు వెళ్ల దలిస్తే  కావలసిన రవాణా సౌకర్యం వరకు,  సమస్తసర్వీసులు దబాయించి నొక్కే బటన్ కిందనే దాగి ఉండే స్మార్ట్ ఫోన్ సీజన్లో లోకం ఊగిపోతుందంటున్నారు! ఏమేమి సేవలు వచ్చాయో, ఎవరిని మెప్పించే ఏ మహా గొప్ప మార్పులు తెచ్చి ఊపేస్తున్నాయో!?  చురుకుపాలు తగ్గిన పెద్దవాళ్ల అవసరాల గొంగడి మాత్రం ఎక్కడ వేసింది అక్కదే పడి ఉందన్న అపవాదు మాత్రం తాజా టెక్నాలజీ మూటకట్టుకుంటున్న మాట  నిజం. ‘అయ్యో! ఐ-ఫోనుతో పనా ?  అయ్యేదా పొయ్యేదా నాయనా?’ అన్నముసిలివాళ్ల పాత  నసుగుడే  సర్వత్రా ఇప్పటికీ వినవస్తున్నదంటే.. లోపం ఎక్కడుందో లోతుగా తరచిచూసుకొనే తరుణం తన్నుకొచ్చిందనే అర్థం!   

వయసు మీద పడే కొద్దీ పంచేద్రియాల పటుత్వం  తగ్గడం సహజం.సౌలభ్యం ఒక్కటే  కాదుపనిసులువూ పెద్దల దృష్టిలో అందుకే ప్రధానంగా ఉంటుందిరవాణాఆరోగ్య సంరక్షణల వంటి ముఖ్యమైన రోజువారీకార్యకలాపాలలో పెద్దవయస్కులకు మద్దతు ఇచ్చే తేలికపాటి డిజైన్ల పైనదృష్టి పెట్టాలిటచ్ బటన్ టెక్నాలజీలో గొప్ప సేవాభావం ఉంటే ఉండవచ్చుకానీముందుతరం అతి కష్టం మీద అలవాటు పడ్డ ‘బటన్’ సిస్టమ్  పూర్తిగా తొలగిస్తే ఎంత ‘స్మార్ట్’ అయివుండీ పెద్దలకు వనగూడే ప్రయోజనంమళ్లీ ప్రశ్నార్థకమే అవుతుంది కదా! విసిగించకుండాకంటినివంటిని అతిగా  శ్రమపెట్టకుండా సేవలు  అందించే ఉపకరణాలు  ఉపయోగంలోకి  తెచ్చినప్పుడే సీనియర్లకు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ మీద మోజు మొదలయేది. వాడకం  పెరిగేది. కోరకుండానే సాయానికి రావడంఆపరేషన్ పరంగా తప్పు జరిగినా ఆంతర్యం గ్రహించి సేవలు చేయడంవేళకు మందులుమాకులుతిండి తిప్పల వంటి విషయాలలో అప్రమత్తంగా ఉండిఆత్మీయంగా సేవలు అందించడం వంటి సామాజిక కార్యకర్తల బాధ్యతలన్నీకుటుంబ సభ్యులను మించి శ్రద్ధగా నిర్వహించే  సాంకేతిక పరిజ్ఞానంసాకారమయిన రోజే  సినియర్ సిటిజన్ల మార్కెట్టూ స్మార్ట్ టెక్నాలజీ రంగంబ్యాలెన్స్ షీటులో క్రెడిట్ సైడుకు వచ్చిపడేది.    వయసు వాటారిన వారి స్మార్ట్ టెక్నాలజీ వాటా  మార్కెట్లో మరంత పుంజుకున్నప్పుడే అటు సీనియర్ సిటిజన్ల సంక్షేమం, ఇటు ఆర్థిక రంగ పునరుజ్జీవం  సమాంతరంగా ముందుకుసాగేది.

వృద్ధాప్యానికి మద్దతు ఇచ్చే బాధ్యత సమాజం మొత్తానిదిమొబైల్కంపెనీలు ముసలివారి ప్రత్యేక అవసరాల కోసం ఉపకరణలు తయారుచేయడమే కాదుఅదనంగా ధరవరలలోనూ ప్రత్యేక రాయితీలు కల్పించాలిఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా  నిర్దిష్ట ప్రచారాలనుముమ్మరం చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి.  సరసమైన ధరకునాణ్యమైన వైఫై అంతరాయం లేకుండా అందుబాటులో ఉన్నప్పుడే  పెద్దవయసువారి అడుగులు ప్రధాన సాంకేతిక స్రవంతి వైపుకు నిమ్మళంగాపడే అవకాశం

ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు దాదాపు విచ్ఛిన్న దశకు చేరి దశాబ్ద కాలందాటిపోయిన మన దేశంలో పెద్దవయస్కుల  పట్ల పిన్నవారి ప్రేమానురాగాలప్రదర్శనల్లోనూ పెనుమార్పులు తప్పటంలేదుకాలం తెచ్చే మార్పులనుమనస్ఫూర్తిగా అంగీకరించడం మినహా మరో ఐచ్ఛికం లేని నేపథ్యంలో.. సమాజం తీరును   వేలెత్తి చూపే కన్నా    వేలు కింది బటన్ నొక్కడం ద్వారా  కుటుంబానికి మించి  సమాజం అందించే సేవా సౌకర్యాలుఅనుభవించడమే కుటుంబాలలోని పెద్దలకూ మేలువృత్తి వత్తిళ్ల మధ్యనే  వీలయినంత శ్రద్ధ తీసుకుని కన్నబిడ్డలుదగ్గరి బంధువులే ఇంటిపెద్దలనునవీన టెక్నాలజీకి దగ్గర చేయడం . 


రచన: -కర్లపాలెం హనుమంతరావు

( సూర్య దినపత్రిక - కాలమ్ ) 

 

 

Thursday, November 11, 2021

తేనీటి సంజీవని - ఈనాడు - సంపాదకీయం - కర్లపాలెం హనుమంతరావు

 ఈనాడు- ఆదివారం- సంపాదకీయం 

తేనీటి  సంజీవని 

-     కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయఁం - 26, జూన్, 2011) 

 

లోకంలో నీరు తరువాత తేనీరే అధికంగా వినియోగమయే ద్రవం. కప్పు కాఫీనో, తేనీరో పడకపోతే పడక దిగడానికి పెద్దలే పస్తాయిస్తున్న కాలం ప్రస్తుతం నడుస్తున్నది. ఓ ఆధునిక తేనీటి ప్రియుడువాపోయినట్లు 'కిటికీలోంవి వానా ఉరుములూ  వినిపిస్తున్నప్పుడు/ శవంలా ఒరిగున్న నీరసం/ నిప్పుల పులిలా లేచినుంచోవాలంటే' కావలసింది ఓ కప్పుడు చాయ్. ఒకప్పుడే కాదు ఇప్పుడూ ఆ కవి చాయాలపన  నూటికి నూరు శాతం వాస్తవమే! ఎంతలా వేధించకపోతే పోకూరి కాశీపతి వంటి ఉద్దండ పండితులు కూడా దండకాలు చదువుతూ ఈ కాఫీ టీల ముందు సాష్టాంగ ప్రణామాలకు పాల్పడివుంటారు! 'శ్రీ మన్మహాదేవీ! లోకేశ్వరీ! కాళికా సన్నిబాకరణీ! .. అంబా కాఫీ జగన్మోహినీ!' అంటూ ఏకరువు  పెట్టిన గుణగణాలన్నీ పేరుకే కాఫీకి కానీ తేనీటి వంటి అన్ని ఉత్సాహ ప్రసాద తీర్థాలన్నింటికీ అక్షరాలా వర్తించే స్తుతిమాలలే వాస్తవానికి!  'శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరి ఊతంబునే పారిజాతంబున్ దెచ్చియున్ నాతికిన్ బ్రీతిగ నిచ్చు కాలంబు నందా సుమంబునందునం గల్గు బీజంబు లుర్విస్థలిన్ రాలి' ఏ కాఫీ చెట్టుగానో, తేయాకు మొక్కగానో పుట్టుకొచ్చిందన్నంత దాకా ఆ అవధాని ముదిరిపోయిందంటే ఆ దోషం వారి పాండిత్యంలో లేదు. కాఫీ టీలకు కవులూ కళాకారులకూ మధ్య ఉన్న బంధం అంత బలమైందిగాఅర్థంచేసుకోవాలి. 'కాఫీ టీ లయినా సర/ దాకైనా మందొ కింత తాగరు సిగిరె/ ట్టూ కాల్చరు మరి వారె/ ట్లీ కవులైరొ తెలియనగునా!' అంటూ కోవెలవారు ఓ శతావధానంలో ఆదే పనిగాఆబ్బురపడిపోతారు! 'సరదాకే' అని కవిగారన్నా  కాఫీ టీ లు కేవలం కవుల సరదాకేనా?

'తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి' అనే నానుడి బహుశా వేడి వేడి కాఫీ టీలు వాడకంలోకి రాని కాలం నాటివై ఉందాలి. గారెలు తినగ తినగ చేదు. కాఫీ చాయిలకు ఆ దోషం లేదు. తెల్లవారగానే తేనీటికి వెంపర్లాడే బుద్ధి తెల్లవాడు వచ్చి మనకు మప్పినన కాలానికి  ముందు పుట్టబట్టే అల్లసానివారు సత్కృతులకుఅవసరమైన సరంజామాలో అల్లం టీ ని కలపలేదు. కాఫీ టీల యుగంలోనే గాని ఆ కవితాపితామహుడు ప్రభవించుండి ఉంటే 'రా! నడిచే నగరంలానో / నిద్రించే పల్లెలాలో వచ్చి/ నా ముఖం మీద దుప్పటి లాగిపారెయ్/ బోర్లించుకున్న రాత్రిళ్లూ/ పొర్లించుకున్న పాటలూ/ నిరామయప్రపంచాలూ చెరిసగం పంచుకుందాం ఇరానీ కప్పులో.. గోర్వెచ్చగా' వంటి ఈ నాటి కవితలకు దీటైన 'టీ కవితలు' టీకా తాత్పర్యాలతో సహా రాసుండేవారు. నాయుడుబావ ప్రేమ కోసం నండూరివారి వెంకి అట్లా గుత్తొంకాయ కూలుర, పూరీలు, పాయసాలు చేసి అంతలా హైరానాపడింది కానీ -చారెడు ఏలకులు గుండ కొట్టి కలిపిన తేనీటీని ఓ కంచు లోటాకు నిండుగా పోసిచ్చి ఉంతే జుర్రుకుంటూ తాగి వెర్రిత్తిపోయుండేవాడా ప్రియుడు. 'దిగిరానుదిగిరాను దివి నుండి భువికి' అంటో భావకవి కృష్ణశాస్త్రి అన్నేసి మారాములుచేయడానికి 'మసాలా చాయి' రుచి పరిచయం కాకపోవడమే కారణం కావచ్చును. 'క్షీరసాగర మధనంలో సాధించిన సుధ  జగన్మోహిని దేవ దానవులకు పంచే వేళ  ఒలికిపడ్డ ఓ రెండు మూడు  చుక్కలే  భూమ్మీద మొలకెత్తిన ఈ తేయాకు మొక్కలు' అన్నది గురజాడ గిరీశంగారికి అన్నలాంటి మేదావి తీసిన థియరీ! భగీరథుడు అంతలా పరిశ్రమ చేసి భూమ్మీదకు సురగంగను పారించింది ఎందుకైనా ..   లాబం అందుతున్నది మాత్రం ఈనాటి మన తరాలకే సుమా!గంగ పారే నేల సారం, గంగ వీచే గాలి తరంగం భారతీయుల  తేయాకుకు అందుకే అంతలా బంగారపు రంగు, సుగంధాల రుచి.. వెరసి విశ్వవిపణిలోవిపరీతమైన గిరాకీ!  చైనాకు చాయ్ ఒకఔషధమయితే, జపానుకు అదే 'ఛదో' అనే ఓ కళ.  భారతీయులకు మాత్రం అన్నివేళలా అవసరమయే ఓ నిత్యావసర పానీయం. పేటెంట్ హక్కుల కోసమై  తమిళనాట సుదీర్థకాలంగా సాగిన న్యాయ వ్యాజ్యమేతేయాకు మీద భారతీయులకున్న అవ్యాజప్రేమాభిమానాలకు నిదర్శనం.

నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రమండలం మీద పాదం మోపిన మరుక్షణమే 'హుర్రే! పరాయి గ్రహం మీద కాలుపెట్టిన మొదటిమొనగాడిని నేనే!' అని ఓ వెర్రికేక వేయబోతే..'అంతొద్దు! నీకు టీ.. కాఫీలుఅందించేందుకు ముందుగానే ఓ అయ్యర్ ను అక్కడ దింపి ఉంచాం' అంటూ భూ కేంద్ర నుంచి సందేశం అందిదని.. ఓ జోక్! కాఫీ.. చాయ్ లు దొరకని స్థలి భువన భాండవములో ఎక్కడా ఉండదు' అన్నదే ఈ ఛలోక్తి సారాంశం. మూడు వేల రకాల 'టీ'లను పదిహేను దేశాలవారు రోజుకుమూడు కప్పులకు తగ్గకుండా తాగుతున్నారంటే తేనీటి మహిమను ఏ నోటితో ఎంతని పొగడాలి? రుచికి ఆరోగ్యంతో పొసగదని కదా సామాన్య సూత్రం! కాకర చేదు. కరకరలాడే కారబ్బూంది గుండెకు ఇబ్బంది. మద్యంతో అందేది పెగ్గుల కొద్దీ అనారోగ్యమే! తేనీటిలోనూ చూపుకుదొరకని రోగకారకాలుంటాయని అనే వైద్యనిపుణులు కద్దు. ఆరోగ్యానికి అమరదయినా సరే  కాఫీ చాయిల వంటి అమృత పానీయాల పైన  మనిషి చాపల్యం అమరం.   'కడుపులోకి  ప్రవేశించాక/ కరెంటు లావాలా ఉరకలు వేస్తుంది/  ఆ వేడి నీటిపూల నీరు కాటుకు గుండె కంట్రోల్ టవర్ నుంచి / తల వెంట్రుకలు కూడా ఫిలమెంటులవుతాయం'టూ మానేపల్లివారు వినిపించిన గిటారు సంగీతం కఫీ గురించే కావచ్చునేమో కానీ.. నిజానికి ఇరాన్ నుంచి దక్కన్ దాకా ఏ రకం చాయ్ కప్పు చేతికి తీసుకున్నా అంతకు మించి మరపురాన్ని ఉత్తేజాన్నిస్తుంది. ఉత్త ఉత్తేజమే కాదు.. వాషింగ్ టన్ అంతర్జాతీయ ఆరోగ్యనిపుణుల తీర్మానం ప్రకారం తేనీరు ప్రాణాంతక వ్యాధులను నిరోధించే దివ్యౌషధం కూడా! ఒక కప్పు చాయ్ కిలో కాయగూరల సారాన్నిప్రసాదిస్తుందన్నది ఆరోగ్యశాస్ర నిర్ధారణ. చురుకుదనం, జ్ఞాపకశక్తి, రేడియేషన్ కువిరుగుడు, కంటికి చలువ- వంటి ప్రయోజనాలు ఎన్నో జనాలకు! అధిక రక్తపోటుకు, నరాల నిస్సత్తువకు, రక్తనాళాలలో అధికమయ్యే కొవ్వు పదార్థాలకు, పంటి చిగుళ్ల సమస్యలకు..తేనీరు ఓ సంజీవనీ ఔషధం. బ్లాక్ టీ లోని థియాఫ్లావిన్-2 కేన్సర్ కణాల సంహరణకే కాక ఆ ధర్మం నిర్వర్తించే జన్యుకణాల క్రియాశీలతకూ తిరుగులేని మందులా పనిచేస్తుందని అమెరికా విస్వవిద్యాలయ పరిశోధనల్లో తాజాగా తేలింది. కేన్సర్ వ్యాప్తికి కారణమైన సివో ఎక్స్ -2 నీ నిర్వీర్యం చేసే చాయ్ సంజీవని. చెయ్యెత్తి  ఆ తేనేటికి 'జై' కొట్టకుండా  ఎట్లా ఉండగలం?

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయఁం - 26, జూన్, 2011

Friday, August 27, 2021

సామాజిక మాధ్యమాలు-దుర్వినియోగం -వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 


ప్రపంచం మొత్తంలో  సామాజిక మాధ్యమాల  దుర్వినియోగంలో మనమే నెంబర్ ఒన్.  రోజువారీ సామాజిక మాధ్యమాల టపాలలో సింహభాగం.. అబద్ధం.. అసంబద్ధంపనికిరానివిప్రతికూలమైనవి.  అవమానకరమైతే వాటి లెక్కకు ఇహ అంతే లేదు. అసభ్యంగా ఉండిఅక్కరకు రాకుండా పక్కదారి పట్టించేవి కొన్నైతేఏకంగా  సామాజిక సామరస్యానికి ముప్పు తెచ్చేవి కొన్నిఏ ఒక పక్షం తరుఫునో పద్దాకా బుర్రలు తోమే పనిలో నిరంతరం మునిగుండేవి కొన్ని.  రత్నాల వంటి టపాలను పట్టుకోవడం ఉప్పు నీటి సామాజిక మాధ్యమ సముద్రంలో నిలువీత ఈదే వస్తాదులకైనా దుస్సాధ్యం అన్నట్లుంది ఇప్పటి దుస్థితి. 

 

అవసరముండీ ఓ పొల్లు మాట బైట అనేందుకే ఒకటికి రెండు సార్లు సంకోచించే సంస్కృతి మన గతానిది. ప్రస్తుతమో!  ఎంతటి పెద్దరికమున్నప్పటికీ  పది మంది నసాళాలకు అంటే ఏదో  కుంటి కూత డైలీ ఓటి ట్వీట్ గా పడందే పప్పు అనో.. తుప్పు అనో దెప్పిపొడుపులు వినక తప్పని దిక్కుమాలిన  సోషల్ వర్కింగ్ సీజన్లో చిక్కుకుపోయాం అందరం.   

 

సామాజిక మాధ్యమాలు వ్యక్తిగత జీవితం  విలువైన సమయాన్నే కాకుండాచెమటోడ్చి గడించిన సొమ్ములో అధికభాగాన్నీ దుర్వినియోగ పరుస్తున్నాయ్! స్పాములు.. ఫిల్టర్లు  ఎన్ని ఉన్నా బురద నీరులా వచ్చిపడే ఈ-మెయిళ్ల ప్రక్షాళనకే అధిక సమయం కేటాయించే దౌర్భాగ్య పరిస్థితికి అడ్డుకట్ట వేయడం కుదరని పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల మూలకంగా ఎంత మంది క్షోభిస్తున్నారో .. ఆ లెక్కలు తీసే టెక్నాలజీ ఇంకా రాలేదు! 

 

మాదక ద్రవ్యాల వినియోగం మాదిరిదే సామాజిక మాధ్యమాల దుర్వినియోగం కూడా. నిండా కూరుకున్న తరువాత గాని చుట్టుముట్టిన సుడిగుండం లోతు తెలిసే యోగం లేదు. చేజేతులా చేతులు కాల్చుకోడం.. ఆనక ఆకుల కోసం అల్లల్లాడడం! ఎంత మంది అమాయక జీవుల బతుకులు అల్లరిపాలవుతున్నాయో!  

భావి దివ్య జీవన హార్మ్యానికి సోపానాలు నిర్మించుకునే శక్తివంతమైనది మనిషికి యవ్వనకాలం. నైపుణ్యాలు దీక్షగా సాధన చేయవలసిన యవ్వనకాలంలో అధికభాగం నిరర్థక సామాజిక మాధ్యమాల గ్రహణం నోటపడితే ముందొచ్చే కాలమంతా మసకబారవలసిందే.  

వ్యక్తిగత విజయాలకు ఊతమిచ్చే వరకు సమస్యలేదు. అందుకు విరుద్ధంగా అభివృద్ధికి ఆటంకంగా మారినప్పుడే సామాజిక మాధ్యమాలు అభివృద్ధికి అడ్డంకులుగా మారడం! పరిశోధన తీరులో సాగవలసిన పని తీరు క్రమంగా  సామాజిక మాధ్యమాలకు  కట్టుబానిసలుగా మార్చేయడమే ప్రస్తుతం ఆందోళన కలిగించే పరిణామం.  వృద్ధులను మరంత ప్రతికూలంగా ప్రభావితం చేయడం  సోషల్ నెట్ వర్కింగ్ ప్రధాన బలహీనత. పఠనం, పర్యటనపరిశీలనదిశానిర్దేశంఅనుభవాల సారం పదిమందికి వ్యక్తిగతంగా పంచే తీరులో ఇంత వరకు సాగిన నిర్మాణాత్మక పాత్ర స్థానే  అసాంఘిక నైజం చొరబడ్డం ఆందోళన కలిగించే పరిణామం. 

యుఎస్ లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారంసోషల్ మీడియాటెలివిజన్వీడియో గేమ్‌లు వంటి  సామాజిక మాధ్యమాలలో   సగటు అమెరికన్ ఏడాదికి 400 గంటలు వృథా చేస్తున్నట్లు తేలింది. ఇండియాలో ఈ వ్యర్థ సమయం మోతాదు అందుకు రెట్టింపు. సమాజ శ్రేయస్సుకుకొత్త నైపుణ్యాల సాధనకు గతంలో వినియోగమైన సమయం ప్రస్తుతం నాలుగింట మూడు వంతులు సామాజికంగా వ్యర్థ వినియోగం దిశకు మళ్లడం మొత్తంగా దేశానికీ ప్రతికూలమైన అంశంగా పరిగణించక తప్పదు! 

విశ్వవ్యాప్తంగా విద్యావంతులూ సోషల్ నెట్‌వర్క్‌ కు చిక్కి రోజుకు సుమారు  2.5 గంటలు వృథా చేస్తున్నట్లు మరో అధ్యయనం నిర్ధారణ.  భారతదేశంలోసగటున ప్రజలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో 2.4 గంటలు గడుపుతున్నట్లుఎక్కువ సమయం నాసిరకంపాత జోకులను పంచుకునేందుకే దుర్వినియోగమవుతున్నట్లు పరిశోధన తేల్చింది. పరిశోధన ప్రకారం ఎవరికీ ఉపయోగపడని వ్యక్తిగత విషయాలుసొంత 



విషయాలను గురించి ప్రగల్భాలకై వినియోగించే సమయమూ తక్కువేమీ లేదు. ఒక జపానీయుడు సగటున 45 నిమిషాలు మించి గడిపేందుకు మొగ్గు చూపని కాలంలో జీవిస్తున్న మనం ఎందుకు ఆ నిగ్రహం పాటించలేకుండా ఉన్నాం! దేశం కోసం కాకపోయినా వ్యక్తిగత మానసిక ఆరోగ్యం దృష్ట్యా అయినా సామాజిక మాధ్యమాల వినియోగించే సమయం,నాణ్యతల పైన సమాజం పునరాలోచించే తరుణం దాటిపోతోంది. తస్మాత్ జాగ్రత్తని హెచ్చరించేందుకే ఈ చిన్న వ్యాసం. 

-కర్లపాలెం హనుమంతరావు

30 -04 -2021

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...