Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Sunday, December 12, 2021

సమీక్ష: కొకుగారి 'అమాయకురాలు కథ చదివిన తరువాత కలిగిన నా స్పందన -కర్లపాలెం హనుమంతరావు







    • ముందు ‘అమాయకురాలు’ కథ ఏమిటో భోజనం విస్తట్లో రుచికి ఓ మూల వడ్డించే పదార్థం లాగా: 

    • వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద  అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?
    • భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. 'తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?' అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం. అలాగైతే అలాగని వెళ్ళి తండ్రిని అడిగేయచ్చు కానీ.. ఆ తండ్రిగారి మనస్తత్వం పూర్తిగా మరీ చాలా పాత కాలంనాటి ముక్కిపోయిన సరుకు. పిల్లలకేది కావాలో నిర్ణయించాల్సింది పెద్దలేనని అతని అభిప్రాయం. పిల్లలకు సంబంధించిన విషయాలేవీ పిల్లలతో చర్చించనక్కర్లేదని, ఒక వేళ వాళ్ళ ఇష్టాలేమన్నా చెవిలో పడితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడంలోనే పిల్లల క్షేమం దాగి ఉందని దృఢంగా నమ్మేవాడు. కనక వెంకటేశ్వర్లు తెగించి తండ్రితో ఏదీ చెప్పదలుచుకోలేదు. కానీ అతి కష్టంమీద.. చనువున్న అమ్మ దగ్గర మనసులోని మాట బైట పెట్టేడు. వెంకటేశ్వర్లుది, భ్రమరది ఒకే కులం. బ్రాహ్మలే ఐనా శాఖలూ ఒకటే అవడంతో చిక్కు వచ్చిపడింది. 'నోరు మూసుకోమని తల్లి మందలించేసరికి ఇక పెళ్లి ఆలోచన ముందుకు సాగదని తెలిసి మనసుతో ముసుగు యుద్ధం మొదలు పెట్టేడు. భ్రమర పెళ్ళికి వుండకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అడిగినా ఉండలేదు.. ఆఖరికి భ్రమరే వచ్చి అడిగినా మెట్టు దిగిరాలేదు.
    • భ్రమర పెళ్ళికి ఉండమని అడగడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఏదీ లేదనుకుంది కానీ.. ఏదో ఉందని కొద్దిగా మనసు మూలలో ఉందేమో..ఏమో.. మరీ పసిది.. ఎలా ఆలోచిస్తున్నదే అప్పటికి రచయిత బైటపెట్టలేదు మరి.
    • కాలక్రమంలో భ్రమర పెద్దమనిషి కావడమూ..కాపురానికి పుట్టింటికి వెళ్ళిపోవడమూ.. అందరు సంసార స్త్రీలకు మల్లేనే మెట్ట వేదాంతం వంటబట్టించుకోవడమూ అయింది. పుట్టింటికని వచ్చినప్పుడు వెంకటేశ్వర్లుతో ఒకసారి ఈ వేదాంత పైత్యం వెళ్లబెడుతుంది కూడా.'ఊహల్లోనే ఏ సుఖమైనా.. వాస్తవంలో అవేమీ ఉండనే ఉండవు' అని వెంకటేశ్వర్లు మనసులో మళ్లీ వికారం మొదలవడానికి కారకురాలవుతుంది.
    • భ్రమర కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటవుతుంది. భర్త క్షయ వ్యాధితో రెండేళ్ళన్నా గడవకుండానే బాల్చీ తన్నేయడంతో భ్రమర పుట్టింటికొచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతమేమీ లేకుండానే గుండూ చేయించుకుంటుంది. ఆమె వద్దంటే బలవంత పెట్టేవాళ్లెవరూ లేకపోయినా అలా ఎందుకు వికారంగా తయారవాలోనని వెంకటేశ్వర్లు చాలా చిరాకు పడిపోతాడు. ఎదురింట్లో ఉన్నా ఒక్కసారన్నా ఆమెను చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయడు. భ్రమరకు అది కష్టంగా అనిపిస్తుంది. సిగ్గు విడిచి వెంకటేశ్వర్లు తల్లి దగ్గర తన బాధ బైటపెట్టుకుంటుంది కూడా. వెంకటేశ్వర్లు తల్లి పాతకాలం మనిషి. నవీన భావాల లోతుపాతులు పట్టించుకునేపాటి తెలివితేటలు తక్కువనే అనుకోవాలి. అందుకే వెంకటేశ్వర్లు ముందు భ్రమర గోడు బైట పెడుతుంది. వెంకటేశ్వర్లు భ్రమర శిరోముండనం చేయించుకుని తనకు అన్యాయం చేసినట్లు కోపం పెంచుకోనున్న మనిషాయ. భ్రమరను కలవడానికి వెళ్లనే వెళ్ళడు. పైపెచ్చు తన మనసులోని కచ్చను కూడా తల్లి దగ్గర వెళ్లగక్కుతాడు. ఆ తల్లి యథాప్రకారం ఈ మాటలు భ్రమరకు అమాయకంగా చేరవేస్తుంది.
    • భ్రమరలో ఆలోచనలు మొదలవుతాయి. తన తప్పు కొద్ది కొద్దిగా తెలిసివస్తున్నట్లనిపిస్తుంది. వెంకటేశ్వర్లు  తన పెళ్ళికి ముందు పడ్డ చిరాకంతా నెమరు వేసుకుంటే తన దోషం తెలిసివస్తుంది.
    • ఏదైతేనేమి  భ్రమర మళ్లీ జుత్తు పెంచుకోవడం మొదలు పెడుతుంది. చీరలు జాకెట్లు  కూడా వాడుతుందని తెలుస్తుంది వెంకటేశ్వర్లుకి. 
    • అప్రెంటిస్ పూర్తయి ఒక లాయరు గారి దగ్గర అసిస్టెంటుగా కుదురుకున్న తరువాత వెంకటేశ్వర్లుకి సంబంధాలు రావడం మొదలవుతాయి. రెండు లంకలున్న మంచి జమీందారీ సంబంధం ఖాయమూ అవుతుంది.
    • పిన్నిగారి వూరికని వెళ్ళిన భ్రమరకు ఈ విషయం తెలిసి ముళ్ళమీదున్నట్లయి పోతుందక్కడ. నెల్లాళ్ళుందామని వచ్చిన పిల్ల తట్టా బుట్టా సర్దుకుని లేచిపోతుంటే ఆ పిన్నిగారు అవాక్కయిపోతుంది.
    • బండిని నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిముందే ఆపించి సామానుతో సహా లోపలికి పోతుంది భ్రమర. వెంకటేశ్వర్లు, భ్రమర చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురవుతారు. భ్రమరను చూసి వెంకటేశ్వర్లుకు మతి పోయినంత పనవుతుంది. ఆ క్షణంలో తను అప్పటిదాకా అనుకుంటూ వచ్చిన 'ఉచ్చిష్టం' ఊహ గుర్తుకే రాదు. పెదాలుకూడా సన్నగా వణుకుతాయి కాని మనసులోని మాటను ధైర్యంగా బైటపెట్టలేని పిరికితనం ఎప్పటిలా అలాగే  ఉంటుంది చెక్కుచెదరకుండా. అక్కడికీ భ్రమరే కాస్త సాహసం చేసి నర్మగర్భంగా మాట విడుస్తుంది కూడా.'వెంకటేశ్వర్లూ! నీ పెళ్ళి అని తెలిసి ఉండలేక వచ్చేశా' అంటూ. వెంకటేశ్వర్లులోని పిరికి మనిషి స్పందించడు. భ్రమర తెచ్చుకున్న పెట్టే బేడాతో తిరిగి సొంత ఇంటికే వెళ్ళి పోతుంది. వెంకటేశ్వర్లు తండ్రి దగ్గర ఏదో చెప్పాలనుకుంటాడు కానీ.. తీరా అతను చూసే అసహ్యపు చూపులు గుర్తుకొచ్చి నోరు పెగలదు. ఏదో సందర్భంలో భ్రమరను కలవాలని వచ్చిన వెంకటేశ్వర్లుకి ఆమె గదిలో ఏడుస్తూ కూర్చుని ఉండటం.. గదంతా అసహ్యంగా ఆమె కత్తిరించుకున్న జుత్తు వెంట్రుకలతో నిండి వుండటమూ చూసి వెనక్కి వచ్చేస్తాడు. 
    • వెంకటేశ్వర్లు పెళ్ళి అవుతుంది. భ్రమరను తలుచుకుందామని అనుకున్నప్పుడల్లా జుత్తులేని ఒక  ఒంటరి ఆడదాని ఏడుపు వికారపు మొహం గుర్తుకొచ్చి తలుచుకోవడమే మానేస్తాడు.
    •  
    • నా సమీక్ష :

    • ఇది నిజానికి ఒక ప్రేమ కథ. వెంకటేశ్వర్లు, భ్రమర ఒకరినొకరు ఇష్టపడ్డ మాట నిజం. మొదట్లో అది ఇష్టమని తెలీక కొంత.. తెలిసినాక ఏ రకమైన ఇష్టమో తేల్చుకోలేక అయోమయంలో పడి కొంత తంటాలు పడ్డారు ఇద్దరూ. భ్రమరకన్నా ఆ ఇబ్బంది ఎక్కువగా వెంకటేశ్వర్లే పడ్డాడు. ఏ దశలోనూ కాస్తంతన్నా సాహసం చూపించలేని పిరికివాడికి ప్రేమ దక్కేది ఎలా? భ్రమర తనను కాకుండా వేరే ఎవరినో ఎంచుకున్నదని ముందులో కొంత.. శాఖాంతరం కాకపోవడం మీద కొంత.. ఎలా ఎవరిమీదో.. వేటిమీదో కంటికి కనబడని వాళ్ళమీదా.. కారణాలమీదా పెట్టి మానసిక తృప్తి పొందాడే కాని.. మనసులో నిజంగా ఉన్నదేమిటో.. దాన్ని సాధించడానికి చేయాల్సినదేమిటో ఎప్పుడూ యోచన చేయని నిష్క్రియాపరుడైన ప్రేమికుడు వెంకటేశ్వర్లు. భ్రమర అతనికన్నా ఎన్నో రెట్లు మెరుగు. పసిదనం వదిలి ఊహ వచ్చిన దశలో భర్తతో కాపురానికి మెట్టవేదాంతంతో సర్దుకునే పరిపక్వత చూపించింది. వెంకటేశ్వర్లు మనసు అర్థమయి.. తన మనసు తనకు అర్థమవడం మొదలయిన తరువాత వీలైనంత సాహసం చేయడానికి కూడా వెనకాడ లేదు. పాపం.. ఆడదై పుట్టడం.. వెంకటేశ్వర్లు వంటి పిరికివాడు తటస్థపడడం వల్ల విఫల ప్రేమికురాలైంది భ్రమర.
    • ప్రేమించుకున్న జంటను విడదీయడానికి సంఘం తరుఫు నుంచి ఎప్పుడూ ఏవేవో అభ్యంతరాలు.. కుట్రలూ ఉంటూనే ఉంటాయి. వాటిని తోసిరాజని ప్రేమను పండించుకునే సాహసికులు కొందరైతే.. చాలామంది తమ మానసిక దౌర్బల్యంతో యుద్ధం చేయడం మాని సంఘాన్ని తప్పుపట్టేసి సెల్ఫ్ సింపతీతో సంతృప్తి పడే సర్దుబాటు చూపిస్తారు అని చెప్పదలుచుకున్నట్లుంది ఈ 'అమాయకురాలు' కథలో కొడవటిగంటి వారు.  నిత్యహరితమైన సమస్య!ఎంతో చెయ్యి తిరిగుంటే తప్ప ఇలాంటి కథను ఎన్నుకుని కడదేర్చడం కుదరదు.
    • ఎప్పటిలాగానే కుటుంబరావు గారు సంఘదురాచారాలని.. మానసిక డొల్లుతనాన్ని తనదైన నిశ్శబ్ద శైలిలో చాలా బలంగా ధ్వనించిన తీరుతో గొప్ప కథై కూర్చుంది అమాయకురాలు కథ. కథనం ఆయన మిగతా అన్ని కథల ధోరణిలోనే చాప కింద నీరులాగా ఆలోచనాపరుల మనసులను ముంచెత్తుతుంది.
    • ఎప్పుడో పంథొమ్మిది వందల ముప్పైతొమ్మిదో ఏట రాసిన కథ. వైధవ్యం..శిరోముండనం వంటి దురాచారాలు లేని ఈ కాలంలో కూడా  మానసిక కోణంనుంచి కొకుగారు కథను ఆవిష్కరించిన తీరు కథను ఎప్పటికీ పచ్చిగా.. తడిగానే ఉంచుతుంది.
    • కొకుగారు కథనంలో వాడే పలుకుబళ్ళు,  వాక్యాలలోని ముళ్ళు.. ఎప్పటిలాగానే ఆయన అభిమానులను కథ అంతటా అలరిస్తుంటాయి.
    • -కర్లపాలెం హనుమంతరావు
    • బోథెల్, యూఎస్ఎ

కొన్ని న్యాయాలు .. కొన్ని లో కోక్తులు - కర్లపాలెం హనుమంతరావు



ఊడుగుగింజ న్యాయం 

ఊడుగుగింజలకు విలక్షణమైన గుణం ఉంది. రాలి చెట్టుకింద పడినవి మట్టిలో కలసి మృగశిర కార్తెలో ఒక్క చినుకు రాలినా చాలు  ఆ గింజలు మళ్లీ చెట్టుకే అతుక్కుంటాయి! 

ఒక పార్టీలో  నుంచి బయటకు వచ్చిన వాడు అదను చూసుకుని మళ్లీ ఆ పార్టీ లోకే గెంతేస్తే  అట్లాంటి జంపింగ్ జిలానీని 'ఊడు గింజ' లాంటోడు అనడం అందుకే. 


అక్కే చేత్ మధు విందేత కిమర్థం పర్వతం వ్రజేత్ ? 


అక్కము సంస్కృత పదం. ఇంటిమూల అని అర్థం. 

ఇంట్లో ఓ మూల  తేనెతుట్ట కనపడుతుంటే దానిని పిండుకోవాలి.  ఆ పని చేయకుండా తేనె కోసం కొండకు వెళ్లడం తెలివి మాలిన చేష్ట . వెతికేది  మన దగ్గరే ఉన్నా ఎక్కడెక్కడో గాలించే   సందర్భంలో వాడే జాతీయం ఇది . 

విజయ డయరీల వంటివి  మన రాష్ట్రంలోనే  పెట్టుకుని ఎక్కడి గుజరాత్ అమూల్  పాల కోసమో  అంగలార్చే సందర్భానికి   ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. 


3

అంధ కూప న్యాయం : 

ఒక గుడ్డి వ్యక్తి బావిలో పడితే, ఆ కబోదిని  గుడ్డిగా అనుసరించే కళ్లున్న వాళ్లూ  ఆ  బావిలోనే పడతారని చెప్పడానికి ఈ లోకోక్తి .  కూపము అనే సంస్కృత పదానికి  బావి తెలుగు అర్థం . 


అర్థజరతీయ న్యాయం: 

జరతీయ అంటే వయసు మీరిన శాల్తీ  . అర్థ జరతీయ-  అంటే సగం ముసలితనం వచ్చిన మనిషి . ఒకటి రెండు వెంట్రుకలు   మాత్రమే నెత్తిమీదివి  చూసి వయసులో ఉన్న స్త్రీ అని భ్రమపడినట్లే, నడుం మీద మడతలు రెండు  కనపడగానే వయసు ఉడిగిన స్త్రీగా భ్రమించినప్పుడు  ఈ న్యాయం వాడతారు. అంటే వస్తువులోని  ఒక పక్షపు లక్షణాన్ని బట్టి వస్తువు మొత్తానికి ఆ లక్షణం ఆపాదించే  ఆపత్తుకు    అర్థజరతీయ న్యాయం అతికినట్లు సరిపోతుంది. . 

ఫలానా రాజకీయ పార్టీ మంచిదని కొంత మంది .. కాదని  కొంత మంది 

వాదించుకోవడం వింటుంటాం . అప్పుడు ఇరు పక్షాలదీ  అర్థజరతీయ న్యాయమే అనిపిస్తుంది! 


అర్థాతురో న గణయత్  అపకర్ష దోషమ్ 

అర్థం ( డబ్బు ) మీద అత్యాశ ఉండేవాడు అవమానాలు లెక్క చేయడు - అని అర్థం. డబ్బు పిచ్చికి సిగ్గెగ్గులు  ఉండవనే  లోకం తీరును అద్దంలో చూపెట్టే సామెత ఇది. 

జైళ్లపాలవుతామన్నప్పటికీ     సిగ్గయినా లేకుండా అమ్యామ్యాలకు తెగబడతారు చాలామంది  పొలిటీషియన్లు! వాళ్లని చూసినప్పుడు  ఈ లోకోక్తి గుర్తుకొస్తుంది . 


6

అసారే  ఖలు సంసారే సారం శ్వశురమందిరమ్ 

అత్తారింటి మీద తమాషా చతురి ఇది. ఈ లోకం సారవిహీనం అయినా ( మజాగా లేకపోయినా ) .. ( శ్వశురమదిరం )   అత్తగారి ఇల్లు మాత్రం సారవంతమైనదేనట! ( అని అల్లుడిగారి ఆలోచన.. కోడలుది కాదు ) 

పాలిటిక్స్ పాడువే   అయినా మంత్రి పదవి మాత్రం మహా మజా! అనుకునేవాళ్లకు ఈ న్యాయం నూటికి నూరుపాళ్లు సరిపోతుంది  .. కదా! 😊


7

అసిధారావ్రతం - అనే మాట చాలామంది వాడుతుంటారు. దాని సరయిన అర్థం తెలుసో .. లేదో మరి! 

అసిధార అంటే కత్తకి ఉండే పదునైన  అంచు .. దాని మీద చేసే సాము చేయడానికి చాలా వడుపు అవసరం . ఆ కష్టాన్ని సూచించే న్యాయం ఈ అసిధారావ్రతం . 


8

అహి నకుల న్యాయం : 

పాము ముంగిస సామెత .  కేవలం శత్రుత్వం కన్నా పుట్టుకతోనే శత్రుత్వం ( ఆగర్భ శత్రుత్వం )  ఉంటే ఈ న్యాయం   మరింత అతుకుంది .

కాంగ్రెస్, భాజపాల మధ్య ఉండే రగడను చూసినప్పుడు ఈ అహినకుల న్యాయం గుర్తుకొస్తుంది . 


9

ఆమ్రవణ న్యాయం: 

వేరే రకాల చెట్లు చాలా ఉన్నా ..  మామిడి చెట్టు వంటి పళ్లు కాసే చెట్టు  గాని ఉందంటే. . ఆ తోటను మామిడి తోట  అనడం సహజం  . మామిడి తోట అన్నంత మాత్రాన ఆ తోటలో ఉన్నవన్నీ మామిడి చెట్లే కావాలని లేదుగా! గుంపులో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గల  వ్యక్తి ఉన్న సందర్భంలో ఆ గొప్ప వ్యక్తి పేరుతోనే గుంపు మొత్తానికి  గుర్తింపు వస్తుంది. 

ఉదాహరణకు తెలంగాణా రాష్ట్ర సమితి , ఆమ్ ఆద్మీ  పార్టీలు వంటివి ఆ పేర్లతో కన్నా  కెసిఆర్ పార్టీ , కేజ్రీవాల్  పార్టీలుగానే  ప్రసిద్ధి.. అట్లాగని  కెసిఆర్ పార్టీలో కెసిఆర్, కేజ్రీవాల్  ఒక్కరే ఉండరుగా ! ఈ భావాన్ని సూచించే సందర్భం వచ్చినప్పుడే  ఆమ్రవణ న్యాయం అనే లోకోక్తిని వాడాలనిపించేది  . 


10 

ఆహారే వ్యవహారే చ వ్యక్తలజ్జ స్సుఖీభవేత్ !

ఆహారంలో గాని, వ్యవహారంలో గాని మొహమాటం లేని వాడు సుఖపడతాడు  - అని సామెత . 

ఈ సామెత సారం రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్లు బాగా వంటబట్టించుకున్నారు . కాబట్టే వాళ్లు ఆ స్థాయి దాకా ఎదిగి సుఖపడుతున్నారు. ఏమంటారు ? 

- కర్లపాలెం హమమంతరావు 

15 -09- 2021 

బోథెల్ ; యూ ఎస్ ఎ 

మాటలతో ఆటలు - కర్లపాలెం హనుమంతరావు (సరదాకే)

 


ఎవరో ఒకరు పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? అంటాడు మాయాబజారు సినిమాలో ఎస్వీఆర్ ఘటోత్కచుడి అవతారం ఎత్తేసి. భాష అంతస్సారం రాక్షసజాతికే వంటబట్టగా లేనిది, జీవకోటిలో ఉత్కృష్టమైందని గొప్పలు పోయే మనిషి బుర్రకు తట్టకుండా ఉంటుందా? ఇహ, ఆవుకు కూడా 'కొమ్ము' తగిలించే మన తెలుగుభాషలోని మాటల తమాషా సంగతిః.. కాస్సేపు.. బుర్రకు తట్టినవి.

అసల తట్ట అంటేనే వెదురును ముక్కలు ముక్కలుగా చేసి కళ ఉట్టిపడేటట్లు  అల్లే ఒక పదార్థం. తాటాకు చెట్టు నుంచి వస్తుంది కాబట్టి తట్ట అయిందేమో! విజ్ఞులొక పరి  మా జ్ఞానం పట్ల కూడా గౌరవముంచి ఆలోచించాలి! మింగే లక్షణం గలది కాబట్టే తిమింగలం అయిందన్నది మా మిత్రుడొకడి పరిశోధనలో తేలిన అంశం. కేస్ట్ కౌచింగ్ మీద  ఆ మధ్య పెద్ద దుమారమే రేగింది తెలుగు సినీపరిశ్రమలో  .. గుర్తుందిగదా! ఈ గొడవలు ఇట్లా ముందు ముందు తగలడతాయాన్న కాలజ్ఞానం మస్తుగా ఉండుండబట్టే దీపిక అనే బాలివుడ్ కథానాయికి తాను 'పడుకోని' దీపిక అని పుట్టీపుట్టంగనే ప్రకటించేసుకుంది.

చౌ ఎన్ లై కి చాయ్ తాగేటప్పుడైనా ఎనలైట్మమెంటు కింద 'లైస్' (అబద్ధాలు)పకుండా చెప్పే పని తెలీని  రాజకీయనేతగా ప్రసిద్ధి. ఎన్ టి రామారావును కాంగ్రెసోళ్లు పాలిటిక్సులోకి వచ్చిన  ఎమ్టీ (ఖాళీ) రావు’ అని ఎద్దేవా చేసేవాళ్లు. చివరకు పాపం కాంగిరేసువాళ్లకే ఆ పార్టీ తరుఫున నిలబడితే ఎన్నికల 'రేసు' లో కనీసం ధరావత్తులు కూడా 'రావు'  అనే దుస్థితి  వచ్చిపడింది. సోనియమ్మ గారాబాల బిడ్డ రాహుల్ గాంధీ. తరచూ ఊహించని క్షణాలలో తిరగబడ్డం ఆ బాబీ హాబీ! ఆందుకే ఆ గారాబాల   రాగా(రాహుల్ గాంధీ)బాల గా మాధ్యమాలకు ఎక్కింది. గీర్వాణం అంటే సంస్కృతభాష. ఆ వాణిలో నాలుగు ముక్కలు ముక్కున పట్టీ పట్టంగానే గీరపోయే పండితులే దండిగా ఉండటం సర్వసాధారణం. సో అ 'గీర వాణం' పేరు గీర్వాణానికి చక్కగా అతికిపోతుంది. బా అన్నా వా అన్న ఒకే శబ్దం బెంగాలీబాషలో. ‘పో అని ఆ శబ్దానికి అర్థం. ఇష్టం లేని అక్క మొగుడు ఎవడో ఒంటరిగా ఉండడం చూసి కమ్ముకొచ్చినప్పుడు 'పో.. పో' అంటూ  కసిరికొట్టి ఉంటుంది వయసులో ఉన్న మరదలు పిల్లో. ఆ మాటే చివరకు అక్క మొగ్గుళ్లందర్నీ 'బా.. వా' లుగా సుప్రసిద్ధం చేసేసింది మన తెలుగుభాషలో.

కాల్షియం సమృద్ధిగా ఉంటేనే మనిషిలో పెరుగుదల సక్రమంగా ఉండేదంటారు  ధన్వంతురులు. ఆ ధాతువు అధిక పాళ్లలో దొరికేది కాబట్టే ' పెరుగు' పెరుగు అయింది. ధన్వంతురుల అన్న మాట ఎలాగూ వచ్చింది  కాబట్టి ఒక చిన్న ముచ్చట.  ధనం మాత్రమే తన వంతన్న దీక్షగా  చికిత్స చేసే వైద్యనారాయణులు కొంతమంది కద్దు. ఆ మహానుభావులకు  ఆ పేరు చక్కగా సూటవుతుంది. ఆయుర్వేదం చేసే వైద్యుల కన్నా అల్లోపతి చేసే ఫిజీషియన్లకు ఆ పదం అద్దినట్లు సరిపోతుంది. అన్నట్లు  ఫీజు తీసుకుని వైద్యం చేసే ఫిజీషియన్ ని  ‘ఫీజీషియన్ ‘ అనడమే సబబు.

బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అస్తమానం కమ్మని కలలు కనేవాళ్లు తల్లిదండ్రులు. కనకే అమ్మానాన్నా 'కన్నవాళ్లు' గా ప్రసిద్ధమయారు.

కలసి ఆడే కర్రల ఆట కాబట్టి కోలాటం 'కో'లాటం అయింది. రైయ్యిమని దూసుకుపోతుంది కనక రైలుబండి అయినట్లు.  మని, అన్నా 'షి' అన్నా పడిచస్తాడు కనక  మనిషి 'మని-షి'గా తయారయ్యాడు. తతిమ్మా జంతుకోటితో కలవకుండా తానొక్కడే  మడి కట్టుకున్నట్లు విడిగా ఉంటాడు కాబట్టి 'మడి'సి కూడా అయ్యాడనుకోండి.

'కీ' ఉండని చిన్న టిక్కీ కాబట్టి  కిటికీ. 

రాసి రాసి గుర్తింపు లేక  నీరసం వచ్చేసిం తరువాత  కవులు కట్టే గ్రూపు-రసం. విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా  రాసే కవుల గుంపు వి-రసంఒక ముఠా కవులు మరో గ్రూపు కవుల మీద ముటముటలాడుతూ  విసుర్లు వేసుకునేవారు ముఠాలు కట్టిన ప్రారంభంలో.

ఆ రంభ వచ్చినా ఆరంభంలో మగవాడికి ఏం చెయ్యాలో తెలిసిరాలేదు. ఆడమన్నట్లా ఆడేది మొదట్లో ఆడది. అందుకే ఆమె ఆరంభంలో ఆడది అయింది. మగువను చూస్తే 'గాడు' (తీపరం)  పుట్టే జీవి కావడం మూలాన వయసు కొచ్చిన మగాడు మగాడు అవుతాడు. క్షీరధార రుచిని మరిపించే  కవిత్వం కురిపించే  కవులు ఉంటారు. ఆ కవులే  అసలు సాహిత్యంలోని  'కౌ'లు.  మెరికలు పోగయ్యే దేశం గనక అది అమెరికాగా ప్రసిద్ధిపొందింది. ఆయిల్ ఫ్రీ లీ అవైలబుల్ గనక ఆఫ్రికా అయిందేమో తెలీదు. అట్లాగని ఆస్ట్రేలియాలో అంతా స్ట్రే డాగ్సులా తిరుగుతారనుకోవద్దు. అట్లా చేస్తే స్టేలు కూడా దొరకని క్రిమినల్  కేసుల్లో బుక్కయిపోతారు. అట్లాగే అరబ్బు కంట్రీసు కూడా. పేరును చూసి 'ఐ రబ్ విత్ ఈచ్ అండ్ ఎవ్విరిబడీ' అంటూ మన బ్లడీ ఇండియన్ ఫిలాసఫీలో బలాదూరుగా  తిరిగితే.. సరాసరి పుచ్చెలే ఎగిరిపోవచ్చు. నేతిబీరకాయల్లోని నేతిని మన గొనసపూడి పూసల నేతితో  అన్నోయింగ్లీ కంపేరు చేసేసుకుని సెటైర్లకు దిగెయ్యడం మన దేశంలో కాలమిస్టులకు అదో అమాయక లక్షణం. న ప్లస్ ఇతి ఈజ్  క్వల్ టు   నేతిరా  నాయనల్లారా! ‘-ఇతి అంటే  'ఇది కాదు' తెలుగర్థం.  దాన్ని పట్టుకునొచ్చి నేతి బీరకాయలో అది లేదని ముక్కు చీదుకోడం చదువు మీరిన వాళ్ల చాదస్తం.

ఎలుక కు చిలుకకు ఒక్క పేరులో తప్ప పొంతన బొత్తిగా   ఉండదు.  టమోటోకి టయోటాకి మాటలో తప్ప రేటులో  పోలికే  తూగదు. పదాలున్నాయి కదా పదార్థాల కోసం దేవులాడితే వృథా ప్రయాసే! ‘ఎలాగూ’  లో ఏ లాగూ కోసం వెతికినా దొరకదు కాక దొరకదు. మైసూర్ బజ్జీలో మైసూరు కోసం వెదికి ఉసూరు మనకు!  అన్ని పదాలు కలుస్తాయని కాదు. కలవకూడదనీ కాదు.

ఇట్లా పనికిమాలిన పదాలను పట్టుకుని ఎన్ని ఆటలైనా అలుపూ  సొలుపూ  లేకుండా ఆడేయడానికి అసలు కారణం..నాకు ఏ పనీ పాటా లేకుండా తిని కూర్చునే లక్షణం పుష్కలంగా ఉండడం. దయచేసి  ఇక్కడ ఏ ‘లంగా’  కోసం వెతక్కండి మహాప్రభో! ఖాయంగా దొరకదు గాక దొరకదు దొరలూ .. దొరసానులూ!

-కర్లపాలెం హనుమంతరావు

26 -11 -2020

***

భావోద్వేగాలా? భాషాభివృద్ధా? -కర్లపాలెం హనుమంతరావు

 

భావోద్వేగాలా? భాషాభివృద్ధా?

-కర్లపాలెం హనుమంతరావు

ముందు ముందు రాబోయే సాంకేతిక అవసరాలకు అనుగుణంగా భాషను ఎప్పటికప్పుడు సరళతరం చేసుకుని సిద్ధంగా ఉండటం తక్షణమే ప్రారంభమవాల్సిన భాషా సంస్కరణ వాస్తవానికి! అవును!  మన తెలుగుకు  ప్రపంచభాషలలో లేని ప్రత్యేకతలు చాలా ఉన్న మాటా నిజమే! సంగీత స్వరాలలోని అన్ని సంగతులను అక్షరబద్ధం చేయగల సుస్పష్ట అజంత (అచ్చు వర్ణంతో ముగించే) సౌలభ్యం ఇటాలియన్ భాషకులా మళ్లీ మన తెలుగుకు  సొంతం అంటారు. తెలుగులో ఉన్న త్యాగరాజ సంకీర్తనలను తమిళ భాషలోకి తర్జుమా చేసుకొని ప్రచారం చేసుకొనే తమిళుల ప్రయత్నం విఫలమవడానికి కారణమూ తెలుగు వర్ణానికి ఉన్న సంగీజ్ఞత తమిళ భాషకు లేకపోవడమే! అయినా సరే..  ఈ వేగయుగంలో సాటి భాషలతో పోటీకి దిగి ముందంజగా  సాగాలంటే ఆలంకారికంగా ఉన్నా,  అందం మరంత పెంచే  అపురూప ఆభరణాల వంటి వర్ణమాలలోని కొన్ని ప్రత్యామ్నాయం ఉన్న అక్షరాలను పరిత్యజించక తప్పదు. మనసు బరువెక్కినా బరువైన అక్షరాలు కొన్నిటిని వదిలించుకొనక తప్పదు! చిన్నతనంలో మనం ఎంతో శ్రద్ధతో శ్రమించి మరీ నేర్చుకొన్న  56/53  వర్ణమాల సెట్  మీద గల మమకారం అంత తొందరగా చావదు. అయినా భాషాభివృద్ధికి పరిత్యాగం వినా మరో మార్గం లేదు. మనం ఇప్పటికే అవసరమైన  చోట కొన్నిటిని వదులుకున్నాం! బండి ర ('') కు బదులు తేలిక ర,  'ఋషి' పదంలోని '' అక్షరానికి ప్రత్యమ్నాయంగా 'రు' తరహావి.  అనునాసికాలయితే దాదపుగా  అన్నీ ఇప్పటి తరం వాళ్లు గుర్తుపట్టే స్థితిలో లేరు.

వర్ణమాల  సౌందర్యాన్ని చెరబట్టడానికి నేనూ విముఖుణ్ణే! కానీ మనోవేగంతో పోటీకి దిగి ముందుకు ఉరకలెత్తే సాంకేతిక రంగ అభివృద్ధిని దేశీయపరంగ అందుకోనేందుకు  జానపదుల నోటికి కూడా పట్టేందుకు వీలుగా పదజాలం సరళీకృతం కావాల్సివుంది. భాషాసంస్కరణలకు ప్రధాన అవరోధంగా ఉంటున్నదీ పామరజనానికి ఆమడ దూరంలో మసులుతున్న పాండిత్య పలుకుబడులే! పట్టణాలకే కాదు.. పల్లెపట్టులకూ రసపట్టుల్లా మారే పలుకుబడులు పెరిగే కొద్ది భాష వాడకం విస్తృతమవుతుంది.

గతంలో ఓల్డ్ ఇంగ్లీష్ స్థానే న్యూ ఇంగ్లీష్ వచ్చి ప్రపంచ భాషల్లోని అవసరమైన పదజాలాన్ని ఏ భేషజమేమీ లేకుండా సొంతం చేసుకునే సంస్కరణకు శ్రీకారం చుట్టింది.  ఆనాటి నుంచే  ఆంగ్లం  విశ్వభాషగా  రూపాంతరం చెందుతూ అన్ని సంస్కృతులను ప్రభావితం చేసేయడం! ఆ దిశలోమన తెలుగునూ సంస్కరించుకోకుండా భాష చచ్చిపోతున్నదో అని ఎంత భావోద్వేగాలు ప్రదర్శించీ ప్రయోజనం ఏముంది!

భావోద్వేగాలా.. భాషాభివృద్ధా? ఏది ప్రధానం అని ఆలోచించుకోవాల్సిన సంధి దశలో మనం ఇప్పుడు ఉన్నది. 

-కర్లపాలెం హనుమంతరావు

24 -06 -2021

 

తెలుగుకి ఢోకా లేదు! -కర్లపాలెం హనుమంతరావు -వ్యాసం- కర్లపాలెం హనుమంతరావు ( సూర్య - దినపత్రిక - 20 -10-2019 - ప్రచురితం )

 


సజీవ భాష అనగా నేమి? నట్టింట్లో పొద్దస్తమానం తెగ వాగే టీ.వీ, అనుక్షణం చెవిలో మోగే సెల్ జోరీగ, కంటి ముందు ఝిగేల్మని మెరిపించే వెండితెర బొమ్మ.. ఏ భాషలో సంభాషించునో  అదియే సజీవ భాష నాబరగు. ఐతే ఆ లెక్కన అచ్చు తెలుగు ఎప్పుడో చచ్చినట్లు లెక్క. అమంగళము ప్రతిహతమగు గాక.

మరి తెలుగు మృతభాషయినచో అమృతభాష యేది గురువా?

ఆంగ్లాంధ్రములు కలిపి పిసికిన  సంకర బంకరా శిష్యా!  

తలకట్టు  ఒక్క మన తెలుక్కి మాత్రమే సొంతమైనట్టు  ఆ నిక్కులు, నీలుగులు చాలించరా ఇంక!   తెలుగుతల్లి తలకు 'కట్టు'మాత్రమే మిగిలిందని తెలుసుకుంటే మేలురా కుంకా!  

బళ్లల్లో తెలుగుతల్లికి బడితెపూజలే కదా నాయనా  సదా! గుళ్లల్లో  సుప్రభాతానికి బదులుగా  'గుడ్ మాణింగ్' అంటేనే  ఆ గాడ్  ‘గుడ్ లుక్సు’లో భక్తుడు బుక్ సర్వదా! 

వచ్చినా వచ్చకున్నా ఆంగ్లంలో వాగితేనే భయ్యా.. దండాలు.. దస్కాలు.. సత్కారాలు! 'అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ..ఊ' లని మూలుగుతూ కూర్చుంటే  అర దండాలు.. అరదండాలు.. ‘చీ.. పో’ అంటూ  చీత్కారాలు! తెలుగుపంతుళ్ళకే తెలుగులో సంతకాలంటే వాంతులయే వింతకాలంలో బాబూ ప్రస్తుతం  తెలుగుతల్లి బతుకీడుస్తున్నది!  ఉద్యోగం, ఉపాధి సంగతులానకరా జనకా!  మనసుపడ్డ పాపను పడెయ్యడానికైనా ప్రేమలేఖ ఆంగ్లంలోనే గిలకాలిరా మొలకా!  ఇంకేం చూసి  తెలుగుమీద మోజు పడాలిరా బళ్లకెళ్లే భడవాయలంతా? మెడల్లో పలకలు గంగడోళ్ళలా  వేలాడేసినా సరే  బిడ్డల్ని లార్డు మెకాలేకి నకిలీలుగా మార్చేసెయ్యమనే కదా   మన తెలుగయ్యల అమ్మల వేడుకోలు! పులులు, పిచ్చుకలు అంతరించిపోతున్నాయన్నంత చింతైనా లేదంటారా తెలుగు అంతర్ధానమైపోతున్న స్పీడుకు! దటీజ్  తెలుగు దుందుడుకు!

కాపాడే కంటిరెప్ప గొప్పతనం కన్ను గుర్తుపడుతుందా? ఆదరించే అమ్మభాషకు  అంతకుమించిన దశ గిడుతుందా?

క్రియాపదం తెలుగువాక్యంలో చివరకు  రావడమే అన్ని లోకువలకు అసలు కారణం స్వామీ! అదే ఆంగ్లంలోనో? కర్తా కర్మల మధ్యలోకైనా సరే వచ్చి కూర్చునే దొరతనం.. యూ నో! 'పని'కి వెనకుండే తెలుగుకి తోడుంటే   శనికి జోడవుతామని జడుపు  తెలుగోడికి!  ఎంత పద, లిపి సంపద తెలుగు నాలికచివర  పలుకుతుంటేనేమయా.. ఆంగ్లంతో  కలిపి కొట్టకపోతే ఉలిపికట్టెతో పోలికొస్తుందని ఉలుకిపాటా  భయ్యా?

గురజాడగారి గిరీశానికీనాటికీ తెలుగ్గడ్డమీదెంత గ్లామరో తెలుసా? కారణం? పూనా ఢక్కన్ కాలేజీలో మూడు ఘంటలేకబిగిన బట్లరింగ్లీషులోనైనా సరే బాదేయగల  ఘటం కావడం! 'చాట్'లతో ఫట్ ఫట్ లాడించాల్సిన లేటెస్టు సెంచరీలోనూ శ్రీనాథుడి చాటువులే వేపుకు తిందామనుకుంటే  చెవులకు చేటలు కడతారయ్యా కామయ్యా! బమ్మెర పోతనగారా కమ్మదనం భ్రమలో పడి అమ్మభాషలో కాకుండా   ఆంగ్లంలో కుమ్మేసుంటే  భాగవతం ఈపాటికి లాటిన్లో బైబిలుకి పోటీకొచ్చుండేది సుబ్బయ్యా!  

వాడుకభాషంటే వేడుక భాషా? వ్యవహార భాషయ్యా బాషా!  ఇంద్రాసూయైనా సరే..   ఆంధ్రాలోనే వ్యవహారం అని చంద్రబాబేనాడన్నా    మొండికేసాడా? కేసుంటే   అన్ని కోట్ల పెప్సీప్లాంట్లకేసు  పురిట్లోనే  సంధి కొట్టేసేదే కాదా?  కేసీఆర్ ఎంతైనా  మొనగాడవనీ ఒక్క తెలంగాణా యాసతోనే కెసి కెనాలు పనులడ్డుకోగలడా జెసీ దివాకరం?

ఆదికవి నన్నయ ఆ సోది తెలుగుక్కలా అంకితమయిపోబట్టే ఒక్క రాజమండ్రికే బైండయిపోయాడన్నా! అరసున్నాలు, బండిరాలు, కాసిని సంధులు వదిలేసినందుకే  శ్రీరంగం శ్రీనివాసరావుకా  యుగకవిగా బిరుదులు..  గౌరవాలే! అక్షరాలు, హల్లులు, వత్తులు, సంధులని  తేడా పాడా లేకుండా ఏకమొత్తంగా వర్ణమాలనుమొత్తం గంగలో కలిపే మన  గంగా విత్ కెమేరామన్ రాంబాబు మార్కు టీ. వీ యాంకర్లకు, రేడియో జాకీలకు, సినిమా రైటర్లకు, డాక్టర్లకు,  కోర్టియర్లకు, సర్కారు సర్వెంట్లకు,    ప్రజాబంట్లకు ఇంకెంత గొప్ప గౌరవం దక్కాలప్పా? డిస్సెంటు పత్రం సమర్పించిన గురజాడ అప్పారావుజీ గొప్పా? ఇండీసెంటుగా ఉంటుందని అసలు తెలుగు మొత్తాన్నేఏకమొత్తంగా  చెత్తకుప్పలో వేసిన   ప్రయివేటు బళ్ళు గొప్పా? బళ్ళకెళ్ళే మన పిడుగుల తెలుగు మాటల ముందు గిడుగు రామ్మూర్తిగారి  ప్రజ్ఞాపాటవాలెందుకు?  బుడుంగుమని మునగాల్సిందే ఎంత పెద్ద విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రులుగారైనా  సరే!

కర్ణాటక సంగీతం ఆంగ్లంలో లేదు కాబట్టే తెలుగు చెవులకంత  కర్ణకఠోరం!  ఆంగ్లవాసన సోకనందుకే  అన్నమయ్య సంకీర్తనలకా  కాలదోషం! బడేగులాం సాబ్ హీందీకి గులామైతే..  ఆంగ్లభాషకు మన తెలుగులందరం బడే బడే గులాములం బాద్షా! ఫ్రెంచివాళ్ళు కనక బాలమురళి గానానికలా  ఫిదా అయిపోయి.. కనకగండపెండేరాలు గట్రా కాలికి తొడిగారు! ఈలపాటైనా సరే ఈ నేలమీద ఇంగ్లీషు ట్యూనుంటేనే తెలుగువాడి నోట్లో ఒన్సుమోర్లు మోగేది!

తుమ్ము, దగ్గులదాకా ఎందుకు? ఆవలింతలైనా  ఆంగ్లయాసలో ఉండాలమ్మా ఇంగ్లీషు డాక్టర్లు మందులు రాసేదివ్వడానికి.

ఆర్ద్రత, సరళత తెలుగుభాష సొంతమవడమే అసలు చిక్కంతా! కాటికెళ్లే శవాలు కూడా 'క్యాచ్ మీ ఇఫ్ యూ కేన్' అంటూ లేటెస్టు ట్యూనులు కోరుకంటుంటే తెలుగు మృతభాషగానైనా  బతికి బట్టకడుతుందా అన్నది లక్షడాలర్ల  ప్రశ్న!

పొట్టకోసినా తెలుగక్షరం ముక్కొక్కటైనా  కనపించనోడే తెలుగువాడికివాళ  తలమానికంరా సోదరా! పచ్చడి లేకుండా ఎన్నిడ్లీలైనా లాగించచ్చేమో గానీ ఆంగ్లం  లేకుండా  తెలుగుముక్కంటే చచ్చే చావే తెలుగోడికి!  తెలుగిది కేవలం ప్రాచీన హాదానే సుమా! ఆంగ్లానిది అధునాతన  హోదా!

ఒకే భాషవాళ్లంతా ఎన్ని దేశాల్లో ఉన్నా.. సొంతపనులన్నీ తల్లిభాషలో చేస్తే చాలంట.. అంతర్జాతీయస్థాయికి అదే మంచి చిట్కా అని క్లేర్ మోరనే స్పానిష్ పెద్దాయాన సిద్దాంతం. తెలుగువాడు తెలివిగలవాడబ్బా!  అంత కష్టంకూడా పడ్డానికి ఇష్టపడడు.  సొంతగడ్డమీద ఉంటూనే సొంతభాషని ఆంగ్లంలా చడమడా వాడేసి  ఆటోమేటిగ్గా  అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోగలడు.. సొంత కలల్లో!

తెలుగు  ‘పుచ్చిపోయిందోచ్! చచ్చిపోతుందోచ్!’ అంటూ పద్దస్తమానం కన్నీళ్ళు పెట్టుకునే



తిక్కన్న వారసులకూ శుభవార్త!  తిట్లున్నంత కాలం తెలుగుంటుంది. ప్రజాస్వామ్యమున్నంత కాలం తిట్లూ ఉంటాయి. తెలుగు చల్లగా పదికాలాలపాటీ తెలుగ్గడ్డలమీద వర్ధిల్లాలని  ప్రార్థించే పెద్దలారా!  సదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని మొక్కుకోండి చాలు! తెలుగూ దానితో పాటే దివ్యంగా వెలుగుతూనే ఉంటుంది చట్టసభల్లో.. కనీసం తిట్లరూపంలోనైనా!

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య - దినపత్రిక - 20 -10-2019 - ప్రచురితం ) 

Saturday, December 11, 2021

భాషా చరిత్ర: సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ ప్రయాస ఎందుకు విఫలమైందంటే! - కర్లపాలెం హనుమంతరావు

 భాషా చరిత్ర: 

సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ ప్రయాస ఎందుకు విఫలమైందంటే! 

- కర్లపాలెం హనుమంతరావు 


తెలుగులో ఉన్న అనేక నిఘంటువులలో సూర్యరాయాంధ్ర నిఘంటువూ  ఒకటి.  ఇది  సాకారమయే దిశగా  

ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు  పడిన శైశవ ప్రయాస  వరకు ఈ వ్యాసం పరిమితం. 


తెలుగు భాషలోని శబ్దజాలం యావత్తూ    రూప, అర్థ భేదాలతో  సహా  సర్వ సమగ్రంగా, సప్రమాణికంగా  ప్రదర్శించే   ఒక బృహన్నిఘంటువు  అవసరమయిన కాలం అది.    ఆ బాధ్యతను  ఆంధ్ర సాహిత్య  పరిషత్తు స్వచ్ఛందంగా స్వీకరించడం పరిశోధకులకు, భాషాభిమానులకు ఆనందం కలిగించింది.  1939 లో అజాది పదాల సంగ్రహంగా  మొదటి భాగం వెలువడినప్పుడు  లోపభూయిష్టమైన ఆ అరకొర ప్రయత్నం   ఆశాభంగమూ  కలిగించింది. 

 ప్రథమ ప్రయత్నమే  అభాసుపాలవడంతో  తదనంతర ప్రణాళిక యావత్తూ పరిషత్తువారి అటకెక్కడానికి కారణమైన లోపాలు కొన్ని పరిశీలిద్దాం. 

  

తత్సమ, దేశ్య, వికృతి పదాలతో కలగలసిపోయిన భాష  మన తెలుగు భాష.  దాని ఆద్యంతాల అంతు తేల్చడం అనుకున్నంత  సులువుగాదన్న సత్యం పరిషత్తుకు అనుభవం మీదగాని తలకెక్కింది కాదు.     

భాష  సమగ్రరూపం పైన అవగాహన - అంటే  ఏ పదం ఎక్కడ ఏ విధంగా పుట్టి ఎట్లా కాలానుగుణంగా  మార్పుచెందుతూ .. సాటి భాషాపదాలను  ఏ విధంగా ప్రభావితం చేసిందో  అర్థం చేసుకోవడం. 


ఎంతో మంది పండితులు ఎన్నో ఏళ్లుగా శ్రమించి  అపారమైన   ధనం వెచ్చించీ .. తగిన సాధన సామాగ్రి లభ్యత కొరత  వల్ల నిఘంటు నిర్మాణ ప్రక్రియను మధ్యంతరంగా విరమించుకొన్నట్లు  పరిషత్తువారే  స్వయంగా ప్రకటించుకున్న వైనం గమనించ దగ్గది.  నిఘంటువు  ప్రథమ ప్రయత్నం తరువాతా  భాషలోని మునపటి అసమగ్రతకు  వీసమెతైనా చేటు కలగలేదు.   ఈ మొదటి ప్రయత్నం ఏ స్థాయిలో  విఫలమయినట్లో  ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. 


లోపాయి  స్థాలీపులాక న్యాయంగా: 

 

నాటి కాలపు మహా పండితులుగా గుర్తింపు పొందిన కీ.శే  జయంతి రామయ్య పంతులుగారు అన్నట్లుగా  భారతంలో గల  వేలపదాలలో కనీసం వంద శాతం అయినా  ఈ నిఘంటువులో  చోటు చేసుకోలేదు.  మహాభారతంలో కనిపించే అంజలికము , అంపపెట్టు వంటి   సుమారు 500 పదాలు  అబ్బరాజా సోదరులు నిర్మించిన భారత నిఘంటువులోనివే  పరిషత్తువారి నిఘంటువులో  కనిపించకపోవడం ఇందుకు ఉదాహరణ. వీలును బట్టి కొత్త శబ్దాలను కూడా పరిణనలోకి తీసుకోవలసిన అగత్యాన్ని నిఘంటువు వాటిని విస్మరించింది.  పంతులుగారి  తరహాలోనే ఇతరులు  ఎత్తి చూపిన  లోపాలలోని  ఒకటి రెండు మాత్రమే ఇక్కడ ఉదాహృతాలు.  ఇంత రసాభాసా అజాది ప్రారంభ విభాగ ప్రయాసలోనే!  


పంతులుగారే   మరో చోట అన్నట్లుగా  ఉపసర్గ  శత్రంతాది పదాలు  సైతం  తృణీకరణకు గురి అయిన సందర్భంలో దీనిని నిఘంటువుగా గుర్తించడం కుదరని పని. 


భారతమనే కాదు; చాలినన్ని కావ్యాలకు ఈ అపరిగ్రహీత దోషం అంటగట్టిన ఘనం ఈ  నిఘంటువు ది. శాస్త్రార్థం ఒకటి రెండు: 


పాండురంగ మాహాత్మ్యం ప్రస్తావించే అథ: ప్రపంచము, భీమేశ్వర పురాణంలోని అట్టహాసము, కాశీ ఖండవలు  తాలూకు  అనాక ,  హరవిలాస పాస్తావిత  అనాదల , క్రీడాభిరామం ప్రవచించిన  ఇరుచంబడు.. ఇట్లా ఎన్ని పదాలనైనా  చెప్పుకుపోవచ్చు.  


దేశ్య పదాలకూ ఇదే దుర్గతి. ఆంధ్ర పండితులకు తెలుగు భాష పట్ల చులకన.  కండగల చిక్కని తెలుగు పదాలు కాలగర్భంలో కలసిపోవడానికి ఈ తరహా పండితుల మితిమీరిన సంస్కృత భాషా మమకారమే కారణం.  'తెలుగు వాళ్లకు 'దీపము ' తెలీదు; పాపపుణ్య వివేచన లేదు.  దేవుడును ఎరుగరు- అన్న నానుడి వూరికే రాలేదు. దీపం, పాపపుణ్యాలు , దేవుడు దేశ్య పదాలు ( తెలుగు పదాలు) కావడమే  కారణం. 


అచ్చు తెలుగు పదాలను జల్లెడ  పట్టాలంటే దేశ సంచారం అవసరం. సాధారణ జనంతో సంపర్కం వినా చక్కలి తెలుగు నిఘంటువు కూర్పు అసాధ్యం. నిఘంటువు నిర్మాతలు  తాము తయారుచేసుకున్న పట్టికలను జనసామాన్యం ముందుపెట్టి అందులో లేని పదాలను నిరపేక్షంగా స్వీకరించినప్పుడే  ఆశించిన సమగ్రతకు అర్థం చేకూరేది. 


తెలుగు భాషలో లేవని తాము  భ్రమించిన పదాలకు తత్సమాల పేరిట  సంస్కృతాది పరభాషల  నుంచి బలవంతంగా ఈడ్చుకువచ్చినందు  వల్లనే  నిఘంటువు తన సహజతను కొల్పోయింది.     


అబ్బరలు  అనే తెలుగు పదానికి ఇతరములు అనే పదం దాదాపు స్థిరపడిపోయిందిప్పుడు! అతకం అనే అచ్చుతెలుగు పదానికి ప్రాత: అనే సంస్కృత విశేషణంతో  చెప్పులు అనే ఉత్తరాది భాషాపదాన్ని సంధించి ప్రయోగించడం .. ఇందుకు ఉదాహరణలు.  ఎయిర్ హోస్టెస్ కు గగన సుందరి, యూనిఫాం అనే పదానికి ఏక వస్త్రం వంటి ( వి ) కృత పదాలు పుట్టుకు రావడానికి కారణం - తెలుగును ఉద్ధరిస్తున్నట్లు  భావించే    కొన్ని ప్రముఖ మాధ్యమ సంస్థలు     సైతం ఇదే ధోరణి ప్రదర్శించడం. 


 ఏక పదాలు, కొన్ని పదాల సంయోగంతో ఏర్పడే  కొత్త పదబంధంలోని ప్రతి పదానికి  వివరణ ఇవ్వడం నిఘంటువు బాధ్యత . 


ఏనాది, ఏడాది, దక్షిణాది తరహా ఆది' తో మొదలయే  పదాలకు; ఆరుగొండ, ఆరుగొలను, ఆరుంబాక వంటి ఆరు తో ఆరంభమయే పదాలకు; కోనేరు, కొల్లేరు, పాలేరు వంటి 'ఏరు' సహిత పదాలకు నిఘంటువు నుంచి   వివరణ  ఆనించడం సామాన్యం . 


బాలచంద్రుని తల్లి అయితాంబ.  ఈ పదంలోని ' అయిత'  కు ఉన్న అర్థం వివరించి .. ఆ విధమైన పదాలతో కూడినవి  మరేవైనా పదరూపాలు ఉన్నవేమో వివరించవలసింది  నిఘంటువే.  అయితానగరం, అయితవోలు, అయితా పట్నం వంటి పదాలకు మూలమైన అయిత ను గురించి మరీ బల్లగుద్దినట్లు  కాదుగానీ .. రేఖామాత్రంగా అయినా   ప్రస్తావించని పదాల కూర్పును  నిఘంటువుగా అంగీకరించడం ఎట్లా!


మాయాబజార్ చలన చిత్రంలో ఘటోత్కచుడు అన్నట్లుగా  ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? ప్రతి పదం   పుట్టుకకు ఏదో ఓ మూలం  తప్పనిసరి ప్రాతిపదికగా ఉంటుంది కదా! దాని  గుట్టుమట్లు ఆరాతీసి గ్రంథానికి ఎక్కించినప్పుడే  భాషాచరిత్ర కండపట్టేది. 


పదం అంచు వరకు చూడలేని పక్షంలో కనీసం పస్తావించి  వదిలినా  కొంత మెరుగే! తదుపరి నిఘంటు కర్తలకు  అది మరింత  లోతులకు   వెళ్లే  పరిశ్రమకు ఊతం.  ఆ తరహా  నాందీ ప్రస్తావనలకు అయినా   నడుం బిగించక పోగా  ఎంచుకున్న  పదాల లోతుపాతులు తవ్వి తీసే ప్రయాసపైనయినా   నిఘంటు కర్తలు దృష్టిపెట్టలేదు.    


'కొందఱయ్యలు కొనియాడ నేరరు' అనే ప్రయోగం శ్రీనాధుడి శృంగార నైషధం లో కనిపిస్తుంది. 'పిల్లను ఒక అయ్య చేతిలో పెడితే గుండెబరువు తీరుతుంది' అనే నానుడి జనాబాహుళ్యం వాడుకలో ఉంది.  'అయ్య'కు  శ్రీనాథ ప్రకటితమైన 'అయ్య' కు మధ్య ఉండే అర్థభేద వివరణ బాధ్యత నిఘంటుదే. ఆ అక్కర ఈ నిఘంటువుకు పట్టింది కాదు. 


అనుప్రాసము, ఆమ్రేడితము, అద్యాహారము వంటి పదాల వాడుక  శ్రీనాధుడి  తన కావ్యాలలో విస్తృతార్థంలో కనిపిస్తుంది. 'పుండరీకారణ్యమున ధ్యాహారంబు' అని భీమేశ్వర పురాణం లో కనిపించినదానికి' అధ్యాహారమో  కాని అమృతపతికి' అని 'కాశీ ఖండము' లో కనిపించే పదానికి  . . శాస్త్ర పరిభాషలో కాకుండా లక్ష్యార్థంలో వివరణ అవసరం.  ఈ మాదిరి అనేక పదాలను ఈ గ్రంథం దాటవేసింది.  


పురుషవాచకాలకూ  చివరన 'అమ్మ' శబ్దం  వ్యవహారంలో కనిపిస్తుంది. ఆలంకారిక దృష్టితో కవి వాడిన పక్షంలో  కేవలం అర్థంతో  సరిపెట్టి.. కవిసమయాన్ని వదిలేసిన పక్షంలో  కవిహృదయానికి అన్యాయం జరిగినట్లే .   కవుల పరిశ్రమ మూగ చెవిటి ముచ్చటలుగా వృథా అయిన సందర్భాలు ఈ నిఘంటువులో అనేకం! 

 

ఈ నిఘంటువుకు పూర్వమే  శబ్దరత్నాకరం పేరుతో ఒక నిఘంటువు పండితలోకంలో  తిరుగుతోంది . కేవలం అజాది పదాల విభాగపు  భారీతనం కొన్నిరెట్లు పెంచటమే ఈ ' బృహన్ ' నిర్మాణ అంతిమ లక్ష్యం అనుకొమ్మంటే పండితామోదం సంభవమేనా ? 


సంస్కృత వ్యాకరణ గ్రంథాలను ముందేసుకుని తెలుగు భాష సహజతాకు  ఒదగని తీరులో  ఎన్ని పుటలు వండి వార్చినా  వాపు అవుతుందే  గాని గ్రంథానికి పుష్టి అవబోదు . 


మన భాషలోకి వచ్చి చేరిన పరాయి  భాషా పదాల స్వభావం, మనదే పూర్వ సారస్వతంలోనివీ,  వర్తమాన వ్యవహారంలో వాడుకలో ఉన్నవి..  ఒక్క పదమైనా తప్పి పోకుండా పట్టుకుంటేనే అదీ ప్రామాణిక నిఘంటువు.  


తెలుగులో కలగలుపుకు మూలమైన దేశ్య,  వికృతి పదాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి .. ఏ విధంగా  మారుతూ అంతిమంగా తెలుగు పదాలుగా  పరిణమించాయో,  వేటి ప్రభావానికి అవి లోనయ్యయో ..  ఏ భాషా పదాలను ఏ మేరకు ప్రభావితం చేయగలిగాయో .. ఈ ప్రయత్నమంతా  దిగ్విజయంగా సాగని పక్షంలో  కేవలం పుటల పెంపు  వల్ల కలిగే ప్రయోజనం సున్నా. 


తెలుగునామవాచకాల వివరణ కోసమై    మూలధాతువుల పరిణామ క్రమం వివరించడం  అవసరం. అదనంగా ఊళ్ల పేర్ల వివరణ  సందర్భంలో వాటి   శబ్దస్వరూపాలలో జరిగినా  మార్పులతో పాటు చరిత్ర వివరాలు సైతం నిఘంటు కర్తాలకు  తెలిసుండాలి. 


ఒక్క ముక్కలో  చెప్పాలంటే  ప్రతి మాటకూ  సంబంధించిన సమగ్ర సమాచారం ఇచ్చినప్పుడే  అది నిఘంటువు అవుతుంది. ఈ మాదిరి బృహన్నిఘంటువు సాకారం సాధారణ విషయం కాదు. 


పరిషత్తు నిఘంటువు  కర్తల సామర్థ్యాన్ని ఎత్తి చూపే ఉద్దేశంతో రాసింది కాదీ వ్యాసం . తెలుగు భాషకు సంబంధించినంత వరకు ఈ ప్రయాసకు ముందు రాని ' సమగ్ర పద సామాగ్రి సేకరణ ' ఆలోచన  దాని కదే  విశిష్టమైనది. పండితమాన్యులు   ఎందరినో ఒక చోట సమకూర్చుకుని ఏళ్ల తరబడి ధన వ్యయ ప్రయాసలకోర్చి ఒక యజ్ఞంలా బృహన్నిఘంటువును నిర్మించ తలపెట్టిన ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆంధ్ర భాషా చరిత్ర ఉన్నంత కాలం స్మృతి ప్రాయంగా చిరంజీవులే !  ప్రశంసలకు అర్హులే! 


- కర్లపాలెం హనుమంతరావు 

24-10- 2021

బోధెల్ ; యూ. ఎస్ .ఎ 

( ఆధారం : సూర్యరాయాంధ్ర నిఘంటువు - శ్రీ వడ్లమూడి వెంకటరత్నము - భారతి - జ; 1940 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...