Showing posts with label mythology. Show all posts
Showing posts with label mythology. Show all posts

Thursday, November 11, 2021

శివ పురాణం

గల్పిక: 

శివపురాణం 

- కర్లపాలెం హనుమంతరావు 


( ఈనాడు దినపత్రిక - 18/04/04- నాటి సపాదక పుట గల్పిక) 


శివరాత్రి కదా! జాగారం చేద్దామని మా కాలనీలోని మొగాళ్లు నలుగురం  డాబా  మీద  కబుర్ల కచేరీ పెట్టాం . 


కింద ఆడవాళ్లు  టీవీలో సినిమాలేవో చూస్తున్నారు. దూరం నుంచి గుళ్లో భజనలు వినపడుతున్నాయి. 


ఉన్నట్టుండి ఊడిపడ్డ కమారావు- మన పురాణాల నిండా  బోలెడన్ని పాలిటిక్స్ . . భాయ్ అన్నాడు . 


ఎన్నికల సీజన్..ఆ వేడిమీద ఉన్నాడులే అనుకున్నాం. 


ఎవ్వరం పటించుకోకపోవటం చూసి వాడికి ఒళ్లు మండినట్టుంది. '  కావలిస్తే మీచేతే ఒప్పిస్తాను చూడండి' అంటూ మొదలుపెట్టాడు. 


'ఉదాహ రణకు... మన శివపురాణాన్నే తీసుకోండి! శివలింగమే నేటి పాలిటిక్సుకు పెద్ద సింబాలిజం' అనేశాడు.


' అదెలాగా? ' అనడిగాడు నా పక్కనున్న భాస్కర్రావు అమాయకంగా.  అంతే .. ఇంక కన కారావును ఆపటం ఎవరి తరమూ కాలేదు. 


' శివలింగానికి ఆదీ అంతూ  లేవుకదా. మన పాలిటిక్సూ  డిటో  డిటో .  త్రిమూర్తుల్లోని ద్విమూర్తులు .. విష్ణవు  ,   బ్రహ్మ శివలింగం   బిగినింగ్  అండ్ ఎండింగ్ . ఐ  మీన్ ఆదీ తుదీ  అంతు చూద్దామని పంచెలెగకట్టి మరీ పందెం  కాసుకున్నారు. ఏమైంది?.. 


పరువుకోసం బ్రహ్మగారు ఆవు చేతా , పూవూ చేతా  అబద్ధపు సాక్ష్యాలు  చెప్పించారు . అంటే ఏంటిట ? గెలుపుకోసం గాడ్ అయినా తప్పుడు చెయ్యడం  తప్పుకాదనేగా  దారి చూపించింది.  ఓటరుకు మల్లే సాధు  జంతువని మనం పుస్తకాల్లో చఅకే  ఆవు కూడా గడుసుదే సుమండీ!  బ్రహ్మతరపున వకాల్తా పుచ్చుకునే సందర్భంలో అవు తల్లి చల్లంగుండా ..  తలతో నిలువుగా తోకలో అడ్డంగా ఊపి  మన పొలిటీషియన్లకు  ప్రెస్ మీట్లలో ఎట్లా మసులుకోవాలో మార్గం చూపించింది. అవునా?   తవ్వినకొద్దీ ఇట్లాగే బోలెడు బొచ్చెడు  ట్రిక్కులు  బైటపడతాయి. ' అని ఓ అరక్షణం ఊపిరి కోసం ఆగాడు కనకారావు . 


మళ్ళీ అందుకుంటూ ' గణాధిపత్యం కోసం కుమారస్వామి వినాయకుల మధ్య పోటీ ఏర్పట్టం గుర్తుందా ? 


ముల్లోకాల్లోని తీర్ధాలలో  మునకలేసి  ముందొచ్చినవాడినే సమర్థుడిగా భావించాలని కదా మెయిన్ రూల్స్ బుక్కులా ముఖ్యమైన క్లాజు. ఆ ఒప్పందం మనం వినాయనుడి విషయంలో గంగలో కలిసింది.  పాపం, మురుగు స్వామిని అటు  చల్లంగా నెమలిమీద పోనిచ్చి..  వినాయక మహారాజా చేసిందేమిటి?  శ్రమలేకుండా అధిష్ఠానం చుట్టూతా  ప్రదక్షిణాలు చేసి  మరీ అధికారు సాధించాడు. అంటే ఏమిటిట? నియోజకవర్గాల్లో ఊరికే ఈ పండుగా , ఈ పండుగా  అంటూ తిరణాల డాగులా తిరగడం దండగరా అబ్బాయిలా! భాగ్యనగరం చుట్టూతా తిరిగో .. భాగమతీ నగరంలో తిష్ఠ వేసో ..    అధినాయకుల కరుణా కటాక్షాలు  రాబట్టిన జిడ్డుకే  ఆఖరికి అధికారం దక్కేది.  అదీ పురాణాలు మనకు నేర్పే పాఠాలు మిత్రులారా! 


మా కనకారావుది పండితవంశం లెండి.  వాడింట్లా తండ్రి  పురాణ పఠనం .. మా శుంఠ పక్క  విగకుండ  ఆ పాండిత్య శ్రవణం! 


మార్కండేయుడి కథ చెప్పుకొచ్చేడేసారి.   ఆ మునికుమారుడిది అర్థాయుష్షు గదా! డిటో ఏ క్షణంలో  పదవూడుతుందో   తెలీని  మంత్రిగారి పరిస్థితి.  యమదూతలొచ్చి పాశం వేసి లాక్కుపోతుంటే శివలింగాన్ని కావిటేసుకున్నాడు అచ్చంగా కుర్చీని వదల్లేని మొండి మంత్రుల్లా. ఆ ఉడుంపట్టుకు తన పునాదులే కదిలిపోతుంటే బెదిరిపోయిన అదిదేవుడు   మార్కండేయుణ్ణెలాగో పేరోల్ మీద  వదిలించుకున్నాడు. అట్లాంటి పట్టుంటే తప్ప పదవాట్టే రోజులు నిలవదనేదే మార్కెండేయుడి  మార్క్ సిద్ధాంతం . 


ఇంక   అంకిలుడి  కథ ఇంకా అన్యాయం .  ఉపిరున్నంత కాలం ఉచ్ఛనీచాలు మరిచిన నీచ్.. కమీనే! కానీ,  మనకు  పరమ పవిత్రమైన శివరాత్రి నాడే వాడి చరిత్ర మననం  చేసుకోక తప్పడంలేదు.  తెలిసో..  తెలీకో . . ఆ తెలివిమాలిన కుంక మాదిరి  జాగారం చేస్తేచాలు .. శివయ్య    గారి గుడ్  లుక్సులో పడ్డట్లే గురూ! అంకెలుడికి కైలాసం, మన అంకఛండాలులకు అమాత్య విలాసం! మన పాలిటిక్సు ఇంతర్ధ్వాన్నంగా ఉన్నాయని ఎంతేడిస్తే  ఏం లాభం.. కళ్లు వాయడం తప్ప. 


పదవున్నంత కాలం నువ్వెన్నైనా    పాడుపన్లు   చేసుకా!  ఎన్నికలప్పుడు మాత్రు అప్రమత్తంగా ఉంటే చాలు కేబినెట్లో సీటు ఖాయం. శివనామస్మరణకంటే  మినిమమ్   మన లోకంలో అయినా  కాస్తో, కూస్తో పుణ్యం.. పురుషార్థం. పాడుపాలిటిక్సు వల్లనే సైతానులకు సైతం సింహాసనాలు లభ్యం . 


శివరాత్రి నాడేంటీ. . ఈ యాంటీ  గాడ్ ప్రసంగాలు! కనకారావేమన్నా  కమ్యూనిస్టు ఫిలాసఫిష్టా? అంటూ డౌట్ రావచ్చు.  అతగాని ఆరోపణలన్నీ  మతంలోని లోసుగులపై కాదు. దేవుళ్ల  పేరు నడిపించే పాడు పాలిటిక్సు మీద. 

  

నిజానికి ఇప్పటి సంకటాలకే నాటి పురాణాలు పరిష్కారం చూపించాయి! క్రాంతదర్శకులని పట్టుకుని వంకర భాష్యాలు చెప్పటం కాదిది.  పిల్లనిచ్చిన అల్లుణ్ణి  పట్టించుకోనందుకే ప్రజాపతి పదవి పుసుక్కున పోయింది. పవరిచ్చిన ఓటర్ని పట్టించుకోని పక్షంలో ప్రజాపతినిధి   పదవికైనా అదే మూడుతుంది. చులకనగా చూసినందుకే ప్రజాపతికా పదవూడింది . పాలి టిక్స్ '  కుమార ' సంభావాల రచ్చ ఎంత చేసినా కంఠశోషే. కుమారుడినే  స్వామిగా ఎంచి  సాగిలపడ్డ గడుసుకే లాభం జాస్తి. విజయవిలాసం  చంద్రుడికి మల్లే  పైవాడి అనుగ్రహముంటే నెత్తినెక్కి కూర్చోడం..  వీరభద్రుడి అవతార మల్లే ఆగ్రగం చూపించినప్పుడు  కాళ్లు పట్టుకోడం .. పాలిటిక్సులో సైతం ప్రమోషనొచ్చే తంత్రం. పిల్లనిచ్చిన మామ ప్రజాపతి తలనడ్డంగా నరికి బ్రహ్మ కోరిక తీర్చడానికి  శివుడు మేక తలకు అతికించినట్లు శివపురాణం కథనం . కథనే కంచికైనా పంపించెయ్యచ్చు కానీ మేక తలలు  చూపించి అధికారం యాచించే పెద్దపులుల పట్లే ప్రజలప్రమత్తులవాలని అష్టాదశ  పురాణాల అంతిమ    ప్రబోధం' అన్న  కనకారావు ముక్తాయింపుతో అందరం ఏకీభవించాం.  


' అర్థమయింది సోదరా! నేటి నాయకుడు శివుడంతటి బోళాకాదు. పాలటిక్సు ఫీల్డు  శివపురాణానికి  మించి లోతు. .  ' అంటూండగానే శివాలయం నుంచి మహాదేవుడు మెచ్చికట్లు గంటలు గణ గణా  వినిపించాయి. 


జాగారం చేయించిన  ఫలం ఇలాగైనా దక్కించినందుకు  అందరం మా కనాకారావుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ  డాబా కిందికి దిగివచ్చేసాం. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు దినపత్రిక - 18/04/04- నాటి సపాదక పుట గల్పిక) 


Monday, February 8, 2021

రామాయణం- ఒకే కవి విరచితమేనా? -కర్లపాలెం హనుమంతరావు



యావత్ స్థాస్యంతి గిరయః- సరిత శ్చ మహీతలే/తావద్ రామాయణ కథా- లోకేషు ప్రచరిష్యతి (బాల కాండ 2.36)’. మహీతలంపై ఎంత వరకు గిరులు, సరులు ఉంటాయో అంత వరకు లోకాల్లో రామాయణగాథ ప్రచారం జరుగుతుంద’ని వాల్మీకి రామాయణాన్ని ఆశీర్వదిస్తూ బ్రహ్మ అన్న మాట.  బ్రహ్మవాక్కు అనలేము కానీ..  రామాయణం అంత గాఢంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యం మరొకటి లేదు.  ఎన్నో భాషల్లో, కళాప్రక్రియల్లో  తీర్చిదిద్దిన కథ ఆదికావ్యం రామాయణంలోనిది.  పండితులను.. పామరులను, ఆస్తికులను.. నాస్తికులను    ఆకర్షించే గుణం రామాయణంలో ఉంది.

వేలాదిమంది బలశాలులు ఆయాసపడుతూ నెట్టుకొచ్చిన శివధనుస్సును బాలరాముడు సునాయాసంగా  విరవడంలాంటి అతిమానుష  సన్నివేశాలు రామాయణం నిండా ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో అవి ఆశ్చర్యానందాలను కలిగిస్తే.. ఎదిగే కొద్దీ రామచంద్రుని  మర్యాద పాలన, లక్ష్మణస్వామి సోదరప్రేమ, భరతుని త్యాగబుద్ధి, ఆంజనేయుని దాసభక్తి, సీతమ్మతల్లి పతిభక్తి వంటి సద్గుణాలు ఆకర్షిస్తాయి. వివేచనకొద్దీ ఆలోచనలు రేకెత్తించే సామాజికాంశాలు    దండిగా ఉండబట్టే రామాయణం ఒక చారిత్రక పరిశోధనాపత్రం.. ఆధ్యాత్మిక పరిచయ పత్రికను మించి  చర్చనీయమయింది. 

 

శతాబ్దాల బట్టి లెక్కలేనంత మంది సృజనశీలులు   చెయిచేసుకున్న కథ  రామాయణం. ఆ కారణంగా  భిన్నరూపాలు అనేకం ఓ క్రమం లేకుండా మూలంలో నిక్షిప్తమవడం సహజ పరిణామం.

అయితే వాల్మీకం పేరుతో ప్రచారంలో గల కథ దేశమంతటా ఒకే విధంగా లేదు. వాల్మీకి  రామాయణంలోని అన్ని భాగాలూ ఒకే కవి (వాల్మీకి) విరచితాలని కూడా గట్టిగా చెప్పేందుకు లేదు. ఒక కవి పుట్టించిన కావ్యం మరో కవి గంటంలో పెరిగి తదనంతర కాలంలో మరంతమంది కవుల  ప్రక్షిప్తాల హంగుల్ని సంతరించుకున్నదన్న వాదన ఒకటి బలంగా ప్రచారంలో ఉంది.  

‘నారదస్య తు తద్వాక్యం/ శ్రుత్వా వాక్య విశారదః/ పూజయామాన ధర్మాత్మా/ సహశిష్యో మహామునిః’ అన్న  బాల కాండ (2.1) శ్లోకం మూలకంగానే ఈ అనుమానం. కవి ప్రథమ పురుషలో (తనను గురించి తాను)వాక్యవిశారద, పూజయామాన, ధర్మాత్మ, మహాముని’ వంటి విశేషణాలతో వర్ణించుకోవడం కొన్ని  సందేహాలకు తావిస్తుంది, తరువాతి శ్లోకాలలో కనిపించే   భగవాన్ (బాల 2.9), మహాప్రాజ్ఞ, మునిపుంగవః (బాల 2.17) వంటి స్వీయ ప్రశంసలతో ఈ సందేహం మరింత బలపడుతోంది. తనకు తాను నమస్కరించుకునేటంత తక్కువ స్థాయి సంస్కారం వాల్మీకి మహర్షి ప్రదర్శించడం ఏ వివేచనపరుడినైనా ఆలోచనలో పడవేస్తుంది కదా! 

క్రౌంచపక్షి హననంతో ఖిన్నుడైన వాల్మీకి ముఖతః అప్రయత్నంగా వెలువడ్డ ‘మా నిషాద’ శ్లోకం కాకతాళీయంగా అనుష్టుప్ ఛందస్సులో ఉండటం, తదనంతరం అదే ఛందస్సులో రామాయణం చివరి వరకు కథనం చేయాలని కవి సంకల్పించినట్లు చెబుతారు. కానీ వాల్మీకి రామాయణ శ్లోకాలలో అనుష్టుప్ ఛందస్సుకు భిన్నమైన ఛందస్సూ కనిపిస్తుంది! అనంతర కాలంలో వేరే మరి కొంతమంది కవులు  ప్రక్షిప్తపరిచిన శ్లోకాలగా వీటిని విశ్లేషించే సాహిత్య విమర్శకులూ కద్దు!    

నారదుడు వాల్మీకి మహర్షికి కథనం చేసిన సంక్షేప రామాయణంలో, మహాభారత అరణ్యపర్వంలోని రామోపాఖ్యానంలో బాలకాండకు సంబంధించిన కథ ఏమంత విస్తారంగా ఉండదు. ఆదికావ్యం పేరున ప్రాచుర్యంలో ఉన్న రామాయణ  బాలకాండలో  అప్రస్తుతం అనిపించే కథాభాగమంతా వాల్మీకేతరుల ప్రక్షిప్త నై’పుణ్యం’గా అనుమానించే విశ్లేషకులూ లేకపోలేదు. 

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు క్షత్రియుడు. దశరథ మహారాజు ఏనుగని  భ్రమించి వధించిన బాలకుడు ఒక శూద్ర తపస్వి కన్నకొడుకు. ఇంకా లోతుల్లోకి వెళ్లి తరచి చూస్తే ఇతిహాసాల నిండా వివిధ వర్ణాలవారు ఉగ్రతపస్సులు చేసిన ఉదాహరణలు  పుష్కలంగా కనిపిస్తాయి. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ ‘శంబూక వధ’ కథలో తపోదీక్షకు అర్హమైన వర్ణాల ప్రస్తక్తి వస్తుంది. కృతయుగంలో బ్రాహ్మణులు,  త్రేతాయుగంలో  అదనంగా క్షత్రియులు, ద్వాపరంలో ఆ ఇద్దరికీ అదనంగా వైశ్యులు,  కలియుగంలో నాలుగు వర్ణాలవారూ అర్హులయిన్నట్లుగా ఒక విశ్వాసం ప్రచారంలో ఉంది. అందుకు విరుద్ధంగా త్రేతాయుగంలోనే  దీక్షకు దిగినందున ‘శూద్ర’ శంబూకుడు వధ్యార్హుడయినట్లు ఒక  వాదన ఒక వర్గంవారు ముందుకు తెస్తున్నారిప్పుడు. పిట్టల మీద వడిసెలరాయి ఎక్కుపెట్టినందుకే కిరాతకుడి మీద కృద్ధుడైన రుషి  వాల్మీకి. అటువంటి సామాజిక తత్త్వవేత్త వర్ణార్హతల ఆధారంగా ఒక నిర్దోషి మానవుడి వధను సమర్థించే విధంగా కథ రచించాస్తాడంటే  నమ్మబుద్ధికాదు.  తదనంతర కాలంలోనే వాల్మీకేతర కవులెవరో తాము నమ్మిన విశ్వాసాలకు ప్రామాణికత ఆపాదించుకొనే నిమిత్తం అప్పటికే సామాజికామోదం పొందిన వాల్మీకి రామాయణంలో ఈ తరహా కథలను చొప్పించినట్లు అభ్యుదయవాదులు అభియోగిస్తున్నారు.  

మొదటి రామాయణ కర్త వాల్మీకి రామునికి సమకాలీనుడని  భావన! కథ జరగక ముందే ఉత్తరకాండను ఆ కవి ఊహించి రాసాడా?   హేతువుకు దూరంగా లేదా ఈ ఆలోచన? కావ్యారంభంలో వాల్మీకి తయారు చేసుకున్న కథాగమన ప్రణాళికలో ఉత్తరకాండ కూడా ఉంది కదా అని వాదించ వచ్చు. కానీ ఆ సర్గలో సైతం మార్పులకు అనుగుణంగా   చేర్పులు చేయడం ఏమంత కష్టం?

లంకాధిపతి విశిష్ట వేదపాండిత్యమున్న   పౌలస్త్య బ్రాహ్మణుడన్న వాదనా ప్రశ్నార్హమే. వేదవిధుల మీద విశ్వాసమున్న వ్యక్తి యజ్ఞాయాగాదులు భగ్నత కోరుకుంటాడా?! పోనీ పౌలస్త్య వంశజుడు రావణుడు రాక్షసుడు. అసురుడుగా జరిగిన ప్రచారం చరిత్ర దృష్ట్యా  దోషం’ అనుకుందాం. కానీ సుందరకాండలో దానికి విరుద్ధమైన భావం (సుందర 20. 5-6) పొడగడుతుందే! మనసు దిటవు పరుచుకొనేటందుకు వీలుగా   ఎత్తుకొచ్చిన స్త్రీకి ఒక సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని రాక్షసవివాహ నీతి. అప్పటికీ ఒల్లని ఆడదానిని భక్షించడం ఆదిమజాతుల్లో తప్పుకాదు. రాక్షసజాతికి చెందినవాడు కాబట్టే రావణుడు సీతను చంపి తింటానని బెదిరించాడు గానీ బలాత్కరిస్తానని ఎక్కడా అనినట్లు కనిపించదు! ‘కామం కామః శరీరే మే/యథా కామం ప్రవర్తతాం’ (మన్మథుడు నా శరీరంలో ఎంత యధేచ్చగానైనా ప్రవర్తించనీయి నా పై కామనలేని నిన్ను నేను తాకను) అంటాడు. ఒక ఉదాత్త ప్రేమికుడి  ఆదర్శనీయమైన భావన రాక్షసుడిలో! ప్రధానపాత్రలలోనే  ఇన్ని పరస్పర వైరుధ్యాలున్న నేపథ్యంలో రామాయణ రచన ఒకే కవి చేతి మీదుగా మాత్రమే సాగిందనుకోవడానికి మనసొప్పడంలేదు.  

ఆచారాలనుబట్టి, భాషలనుబట్టి రామాయణంలోని వానరలు సవర జాతివారు అయివుండవచ్చని గో. రామదాసుగారు (భారతి 1926 మార్చి, ఏప్రియల్ సంచికలు)  ఓ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. సవర భాషలో ‘ఆర్శి’ అంటే కోతి. ఆర్శిలలో మగవాళ్ళు లంగోటి కట్టే విధానం వెనక వేలాడే తోకను తలపిస్తుంది. రామాయణంలోని లంక, జన స్థానాలకి  ‘లంకాన్, జైతాన్’ అనే సవర పదాలు  మూలాలని రామదాసుగారు  ఊహిస్తున్నారు. ‘దండకా’ అన్న పదానికీ వ్యుత్పత్తి  చెప్పారాయన. సవర భాషలో ‘దాన్’ అంటే నీరు. ’డాక్’ అన్నా నీరే. ‘దాన్ డాక్’ అంటే నీరే నీరు. ‘దాన్డాక్’ మీద ‘ఆ’ అనే షష్టీ విభక్తి ప్రత్యయం చేరి ‘దన్డకా’.. (దండకా) అయిందని రామదాసు గారి ప్రతిపాదన. దండకారణ్యంలో  విశేషంగా నీరు ఉండబట్టే  అరణ్యకాండ (11. 40-41) లో ‘స్థాలీప్రాయే వనోద్దేశే పిప్పలీవన శోభితే/బహుపుష్పఫలే రమ్యే నానా శకుని నాదితే/పద్మిన్యో వివిధా స్తత్ర ప్రసన్న సలిలాశ్రితాః/హంసకారండవాకీర్ణా శ్చక్రవాకోశోభితాః’ అనే శ్లోకంలో చెప్పినట్లు అగస్త్యాశ్రమం పిప్పిలోవన శోభితమైన సమతలం మీద రకరకాల పుష్పాలు, ఫలాలు,  పక్షుల రవాలు,  హంసలు, సారసాలు, చక్రవాకాలతో శోభాయమానంగా ఉంద’నే వర్ణనకు  అతికినట్లు సరిపోతుంది.

చిన్నవాడు పెద్దవాడి భార్యను పెండ్లాడవచ్చు. పెద్దవాడు చిన్నవాడి భార్యను మాత్రం ముట్టుకోకూడదన్నది సవరల ఆచారం. రామాయణంలోని వాలిసుగ్రీవుల కథ తదనుగుణంగానే ఉంది కాబట్టి రామాయణంలోని వానరులు ఒకానొక సవర జాతివారేనని గో. రామదాసుగారి సిద్ధాంతం. తథాస్తు అందామనిపించినా తత్ సిద్ధాంతానికి తభావతు కలిగించే అంశాలు వాల్మీకంలోనే నిక్షిప్తమై ఉన్నాయి! 

చరిత్ర ప్రకారం వానరులు దక్షిణభారతంలో మహా బలవంతులు. ప్రముఖులు. బుద్ధిమంతులు. ఆర్యులకు స్నేహపాత్రులు. రామ లక్ష్మణులతో ప్రథమ పరిచయం వేళ హనుమంతుడు ధరించిన  భిక్షు రూపం, ప్రదర్శించిన భాషాపాటవం, సముద్ర లంఘనంలో లాఘవం, సందర్భశుద్ధితో  పెద్దలకు వందనాదులు చేసే సంస్కారం  వానరజాతి నాగరికలక్షణ విశేషాలు. అభివృద్ధిపరంగా  ఎంతో వెనకంజలో ఉండే సవర జాతిగా వారు  ఏ కారణం చేత ఎప్పుడు దిగజారిపోయినట్లు? నమ్మదగ్గ  అదారాలేమీ దొరకనంత వరకు రామదాసుగారి ‘సవర’ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా స్వీకరించలేమనుకోండి.  కిష్కింధగా చెప్పుకునే ఆ ప్రాంతంలో ఇప్పుడు సవర జాతివారూ దాదాపుగా  లేరు. కోతులు మాత్రం చాలా ఎక్కువ.  అదో  వింత!

రామాయణంలోని జటాయువూ ఒక ఆటవిక జాతి మనిషని సురవరం ప్రతాపరెడ్డిగారి సిద్ధాంతం. కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవశర్మ శాసనం ప్రస్తావించిన ‘గుద్దవాది’.. ఇప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకు రంపచోడవరమని మల్లంపల్లివారూ అభిప్రాయపడ్డారు. ఆ గుద్దవాదే పూర్వం గుద్రహారము. గృధ్ర శబ్దం సంస్కృతీకరించిన గుద్ర శబ్దంకాగా  కాలక్రమేణా అది గద్దగా  ‘పెంచిన రామాయాణం’లో రూపాంతరం చెందివుంటుందని  పెద్దల ఊహ. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతమ్మవారిని ఆకాశమార్గానే తీసుకు పోయినట్లుంది. జటాయువూ ఒక పక్షిమాత్రంగానే వర్ణితం. ఈ వైవిధ్యాలకీ ప్రక్షిప్తాలే కారణాలా? 

ముందా జాతిని గురించి ఒక వ్యాసం రాస్తూ శరశ్చంద్రరాయ్ గారు ‘ముందాలలోని  ఉరోవన్ అనే ఒక  శాఖ తాము రావణ సంతతికి చెందిన వారమని చెప్పుకుంటుంద’న్నారు. ఆయన సిధ్ధాంతం ప్రకారం కోరమండల్  తీరం ఖరమండలం అనే మూలపదం  నుంచి ఉద్భవించింది.  రామాయణంలో చెప్పిన ఖరమండలం ప్రాంతం ఇదే  కావచ్చన్న రాయ్ గారి  అభిప్రాయం సత్యానికి ఎంత సమీపంలో ఉందో చెప్పలేని పరిస్థితి. శాస్త్రబద్ధంగా పరిశోధనలేవీ సవ్యంగా సాగని నేపథ్యంలో రామాయణంలోని ప్రతి అంశమూ, ప్రాంతమూ ఇలాగే పలుప్రశ్నలకు గురవుతున్నవన్న మాట ఒక్కటే అంతిమ సత్యంగా మిగిలింది.

‘రామాయణంలోని లంక నేటి సింహళం. సముద్ర తీరానికి అది నూరు యోజనాల దూరం’ అన్నది బహుళ ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం. సురవరం ప్రతాపరెడ్డిగారి అభిప్రాయం మరో విధంగా ఉంది. చుట్టూ రెండు మూడు దిక్కుల నీరున్నా లంకలుగానే చలామణి అయ్యేవని.. గోదావరీ ప్రాంతంలోని ఒక లంక రామాయణంలోని లంకయి ఉండవచ్చని రెడ్డిగారి అంచనా.  ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసాడని రామాయణంలో స్పష్టంగా ఉన్నప్పుడు గోదావరీ ప్రాంతంలోని ఏదేని ఒక కాలవను మాత్రమే దాటాడని అనడం దుస్సాహసమే అవుతుంది!  రామాయణ కాలంనాటి నైసర్గిక స్థితిలో భారతదేశానికి లంకకు మధ్య నూరు యోజనాల దూరం ఉండేదా! నాటి లంక నైసర్గిక స్వరూపం నిర్ధారణ అయేదాకా సింహళంలోని లంకే రామాయణంలోని లంక అనుకోవడం మినహా మరో మార్గం ఏముంది?

ఆధార లవలేశాలపై చేసిన ఈ కేవల ఊహావిశేషాలూ  సందేహాతీతాలేమీ కావు కూడా. ప్రథమ రామాయణ కర్త రాముడికి సమకాలికుడు కాకపోయే అవకాశమూ కొట్టి పారేయలేం. నిజంగా సమకాలీనుడే అయితే ఎంత కావ్యమైనా  గోరంత వాస్తవికతకు  కొండంత అభూత కల్పనలు కల్పిస్తాడా? గతంలో జరిగిన కథేదో కాలమాళిగలో వూరి వూరి  ప్రథమ రామాయణ కర్తృత్వం జరిగే నాటికి కల్పనలు, కవితోక్తులతో  ఓ అందమైన కావ్యానికి సరిపడినంత  సరంజామాగా సమకూరిందనుకున్నా పేచీ లేదు. తదనంతర కాలంలో  ఆ కావ్యంలోకొచ్చి పడ్డ  ప్రక్షిప్తాల తంతు  సరే సరి! 

అనుష్టుప్ కి భిన్నమైన శ్లోకాలయితేనేమి? అందులోనూ ఎంతో ప్రతిభావంతమైన కవిత్వం  ఉంది. రెండో వాల్మీకీ(ఉండి ఉంటే) మొదటి వాల్మీకులవారికి ప్రతిభాపాటవాలలో తీసిపోని మహాకవే. కాబట్టే ప్రక్షిప్తాల పోలికల్లో ఇంత సంక్లిష్టత! 

రామాయణం భారతానికి సుమారు వెయ్యి సంవత్సరాల ముందైనా జరిగి వుంటుందని  ఒక అంచనా. నాటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక  పరిస్థితులకు అనుగుణంగా అల్లిన కథ రామాయణం. నేటి సమాజ విలువలతొ వాటిని బేరీజు వేయబూనడం సబబు కూడా కాదు.  

సాహిత్యంలో ప్రధానంగా ఎంచవలసింది నాటి విశ్వాసాలు.. ఆ విశ్వాసాలు ఆయా పాత్రలను నడిపించే తీరు.. అంతిమంగా మానవత్వం ప్రకటితమైన వైనం. ఆ దృష్టితో  చూస్తే రామాయణం నిశ్చయంగా అత్యుత్తమమైన  విలువలతో కూడిన మనోవికాస గ్రంథమే.

కర్తృత్వం సంగతి కాసేపు పక్కన ఉంచుదాం! ఆ ఆదికావ్యంలోని కవిత్వం, కథా నిర్వహణ, పాత్ర పోషణ అపూర్వం. వివాదాలన్నింటికీ అతీతం. పురుషోత్తముడైన రాముని కథ ఎవరైనా కానీయండి ఒక కవిశ్రేష్టుడు  మలిచిన తీరు అనితర సాధ్యం. శోకం, శృంగారం, శౌర్యం, వేదాంతం, నీతి.. మహాకవి పట్టుకున్న ప్రతీ రసం మన మానసాలని   తేనెపట్టులాగా పట్టుకుని ఒక పట్టాన వదలదు.  పురంనుంచి, వనంవరకు కవి కావ్యంలో చేసిన వర్ణనలో? అత్యద్భుతం. సహజ సుందరం.  కథ కల్పనల్లో విహరించినా.. వర్ణనలు వాస్తవికతకు అద్దం పడుతుంటాయి.  ప్రతి సన్నివేశం విస్పష్టం. విశిష్టం.  వెరసి రామాయణం వంటి కావ్యం న భూతో న భవిష్యతి. సీతారాముల దాంపత్య సరళిని వాల్మీకి మలిచిన తీరుకి విశ్వజనావళి మొత్తం నివాళులెత్తుతున్నది ఇవాళ్టికీ. 

మానవుడైన రాముణ్ణి వాల్మీకి తన లేఖినితో దేవుణ్ణి చేసాడు. భారతావనిలో ఇవాళ రాముడులేని ఊరులేదు. రామకథ వినబడని పుణ్యస్థలం లేదు. సీతారాముల్ని చిత్రించని  కళారూపం అసంపూర్ణం. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో స్పర్శిచని భారతీయ సాహిత్యం అసమగ్రం.   దేశదేశాలలో, పలు భాషలలో సైతం గుబాళిస్తుదా రామకథా సుగంధ సుమం. 

ఎక్కడో ఆకాశంలో విహరించకుండా.. మన మధ్య మసలుతూనే  మానవ విలువలను గురించి, మంచి పాలన గురించి, కుటుంబ నిష్ఠతను గురించి   ఉత్తమ మార్గమేదో స్వీయప్రవర్తన ద్వారా రుచి చూపించిన పురుషోత్తముడు రాముడు. కల్పనో.. వాస్తవమో.. రెండు చేతులా నిండు మనసుతో మనం చేసే సునమస్సులకు నూరు శాతం యోగ్యులు సీతారాములు. ఆ ఆదర్శ దంపతులను క్షుభిత జాతికి అందించిన కవియోగులు.. ప్రథములైనా..ద్వితీయులైనా.. అందరూ 

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ

09 -02 -2021 


సంప్రదించిన కొన్ని రచనలుః

వాల్మీకి రామాయణము- ఉప్పులూరి కామేశ్వరరావు

రామాయణ సమాలోచనము- కాళూరి హనుమంతరావు

రామాయణ విశేషములు- సురవరం ప్రతాపరెడ్డి

రామాయణమునందు వానరులు ఎవరు? - గో. రామదాసు

రామాయణము- బాలకాండము- కాళూరి వ్యాసమూర్తి

The Riddle of Ramayana- C.V. Vaidya


కర్లపాలెం హనుమంతరావు


Sunday, November 29, 2020

తాడికొండ శివరామశర్మ ' రహస్యం ' మంచి కథానిక - నా పరామర్శ

 తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం '  ప్రెన నా పరామర్శ 

కథను ఉత్కంఠతో చదివించే అనేక సుగుణాలలో ఒకటి -కథకుడి దృష్టి కోణం . అందరికీ తెలిసి అందరం ఒక విధంగా భావించే ఒకానొక ప్రముఖ సంఘటనను వస్తువుగా ఎంచుకొని .. దానిని విస్మయం కలిగించే మరో అనూహ్య కోణంలో ఆవిష్కరించడం ! ' ఆహా( ' అని అబ్బురపరచే ఆ కొత్త కోణం తర్కానికి అనువుగా సాగితే ఆ కథ నిస్సందేహంగా  గుర్తుంచుకోదగ్గ కథలలో చేరుతుంది. రచన  శాయి గారి కథావాహిని - 2005 లో కనిపించే తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం 'ఈ తరహా మరపురాని కథలలో ఒకటి.

భారతంలోని చిన్న కథ - ద్రోణాచార్యులవారు   ఉదరపోషణార్థమై రాచ కొలువులో ఉద్యోగం కోసరం అన్వేషించేనాటి కథ. హస్తిన రాచవీధులలో బాల కురుపాండవులు ఆడుకునే బంతిని బావిలో గిరాటేసుకుని  బైటికి తీసే సాధనాలు , ఉపాయాలు అందుబాటులో లేక బిక్కమొగాలతో  నిలబడి ఉన్నప్పుడు కాకతాళీయంగా అటుగా వచ్చిన ద్రోణాచార్యులు శర సంధానంతో సమస్యను పరిష్కరించడం- దరిమిలా ఆచార్యులవారికి  రాచ కొలువులో గురు పదవి  ఖాయం కావడం అందరికీ తెలిసిన కథ . నీటిలో పడిన బంతి శాస్త్రరీత్యా శరసంధానం ద్వారా బైటికి రావడం  అసాధ్యం. బంతి జడత్వాని కన్నా ఎక్కువ జడత్వం కలిగిన బాణం ఎంత చెక్క పదార్ధంతో చేసినదైనా నిట్టనిలువుగా నిలబడదు. బాణానికి బాణం సంధించి తాడులా పేని బంతిని బైటికి తీసినట్లు మా చిన్న తనంలో బాలల బొమ్మల భారతంలో బొమ్మ వేసి మరీ    చెప్పిన  కథను బాలలం కనక నమ్మాం. కానీ చిన్న పిల్లల మల్లే కాకుండా బుద్ధి వికాసం సాధించిన పెద్దలూ  అంత బలంగా  ఎలా నమ్ముతున్నారో !  

' కథకు కాళ్లుండవు ; ముంతకు  చెవులుండవు' అన్న సూత్రం అండ చూసుకొని మరీ చెవుల్లో    పూలుపెట్టే కాల్పనిక సాహిత్యం విశ్వవ్యాప్తంగా వినవస్తున్నదే !  కానీ ఆ తరహా కాల్పనికత బాలల్లో మాత్రమే మనోవికాస అభివృద్ధిని ఉద్దేశించినది.  పెద్దలకు కాదు . పురాణ,ఇతిహాసాలలో  పుట్టలు  పుట్టలుగా కనిపించే ఈ వింత కట్టు  కథానికల పరమార్ధ౦ మరేమైనప్పటికీ , ఆ తరహా అభూత కల్ప నను కథాంశంగా ఎంచుకొని దానికి ఓ శాస్త్రీయత ఆపాదించే తాడికొండ శివకుమార  శర్మ ప్రయత్నం నిశ్చయంగా తెలుగు కథ వరకు సరికొత్త ప్రయోగం ; సదా అభినందనీయం ! 

నూతిలోని నూలు బంతిని శర సంధానంతో కాకుండా పై మీది  అంగవస్త్రంలోని తేలికపాటి దారపు పోగులతో   తాడుగా పేని బాణానికె  కట్టి  సంధించడం ద్వారా బంతిని గురువులు బైటికి  తీసినట్లు కథకుడు చేసిన ఊహ శాస్త్రీయ పరిధులలో ఉంటూనే సమస్యకు  చక్కటి పరిష్కారంగా అనిపిస్తుంది! అంతకు మించిన లౌక్యం ప్రదర్శిస్తాడు ద్రోణాచార్యులు పాత్ర  ద్వారా .. అతగాని శిష్యుల శస్త్ర ప్రయోగ నైపుణ్యం పరీక్షకు పెట్టే సందర్భంలో !

చెట్టు మీద ముందే పెట్టించిన మట్టిపిట్ట కంటిని గురి చూసి కొట్టమన్నప్పుడు 105 మంది కురుపాండవులలో ఒక్క అర్జునుడు మినహాయించి  అందరూ వైఫల్యం చెందిన కథ మనకు సుపరిచితం.   శిక్షణ బాధ్యత నెత్తికెత్తుకున్న గురువుల సామర్ధ్యం  శిష్యుల పనితనాన్ని (performance) ను బట్టి బేరీజువేసే నేటి రివాజు భారత కథ నడిచిన రోజులకూ అన్వయించి రచయిత చేసిన కల్పన   తెలుగు కథకు   కొత్త ప్రయోగం! చెట్టుమీది పిట్ట కంటిని సూటిగా కొట్టడంలో విజయం సాధించింది 105 మంది శిష్యులలో ఒక్క అర్జునుడే! ఆ నిజం భీష్మాచార్యులవారి   దాకా చేరితే పరువుతో సహా ద్రోణాచార్యులవారి  కొలువుకూ ముప్పు ఖాయం. ఉదరపోషణ కోసం    మరో దారి వెతికే శ్రమ  తప్పించుకునే నిమిత్తం ఆచార్యులవారు ఆ పద్ధర్మంగా  ప్రదర్శించిన లౌక్యం నేటి కాలపు విద్యా రంగంలోని మాయా మర్మాలకు ఏ మాత్రం తీసిపోనిది! విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు  నలుగురికీ తెలిసే బహిరంగ విధానం కాకుండా in- door మెథడాలజీని ఆశ్రయిస్తాడు ద్రోణాచార్యులు. భోజనానంతరం శస్త్ర పరీక్షలకు ముందు   మరికొన్ని పరీక్షలు నిర్వహించిన మీదట రచయిత గురువుగారి  పాత్ర ద్వారా చమత్కారంగా చెప్పిన అసలు రహస్యం  ఏమిటంటే ఒక్క అర్జునుడికి మినహా మిగతా శిష్యులందరికీ దూరాన ఉండే వస్తువులు సృష్టంగా  కనిపించని కంటి దోషం! భారత కాలం నాటికి చికిత్స ప్రక్రియ ద్వారా కంటి దోషాలు సరిదిద్ద గలిగే వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందలేదు.. ఉన్న విషయం బైటపెట్టి కొలువు ఇచ్చిన పెద్దల ఆగ్రహానికి గురికాకుండా నేడు  ప్రభుత్వాంగాలలోని అధికారులు , ఉద్యోగులు ఏ విధంగా తిమ్మిని బెమ్మిని చేస్తారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ! అదే రహస్య పంథాని     అనుసరించిన ద్రోణాచార్యులు  కురుపాండవుల  కంటి సమస్యలను ధృతరాష్ట్ర , భీష్మాచార్యుల నుంచి  దాచిపెట్టి.  వేరే రాచ విద్యలు నేర్పించేందుకు  అనుమతి తీసుకుంటాడు. విలువిద్య అంటే గురి చూసి ప్రయోగించే యుద్ధ కళ. దుర్యోధన, భీమసేనుల వంటి వాళ్లకు వంటబట్టించిన గదాప్రహారం తరహా విద్యలకు గురితో పనిలేదు కదా ! విల్లు కాకుండా మరే ఇతర ఆయుధాలు ప్రయోగించినా కనీసం  కుడి వైపు వారి మీదో , ఎడమ వైపు వారి మీదో దెబ్బ పడటం ఖాయం' అంటూ గడుసుగా ముక్తాయించడం  కథాంతంలో రచయిత ప్రదర్శించిన  చక్కని చమత్కారం.    ' రహస్యం' కథానిక కలకాలం గుర్తుండి పోయేందుకు కారణం కథనం, శిల్పం కన్నా  రచయిత ఎంచుకున్న కథాంశం . . దానికి ఆపాదించిన శాస్త్రీయ దృక్పథం, కొత్త తరహా ప్రయోగశీలత; చమత్కారం అదనం. కథలన్నింటినీ బలాత్కారంగా ' సామాజిక స్పృహ ' బరిలోకి దించనవసరం లేదు. నవీన ప్రయోగం, సృజనాత్మక కాల్పనిక దృష్టి వంటివీ  కథానికకు పుష్టి చేకూర్చే దిట్టమైన సరుకులే! '

తాడికొండ శివకుమార శర్మగారికి మనసారా అభినందనలు! 

 - కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్.ఎ 

29 - 11 - 2019











మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...