Showing posts with label rachana. Show all posts
Showing posts with label rachana. Show all posts

Wednesday, December 8, 2021

గోపాలం బావి - కర్లపాలెం హనుమంతరావు ( రచన మాసపత్రిక - సెప్టెంబర్, 2012 - కథాపీఠం పురస్కారం )









కథానిక: 


గోపాలం బావి 

- కర్లపాలెం హనుమంతరావు

( రచన మాసపత్రిక - సెప్టెంబర్, 2012 - కథాపీఠం పురస్కారం ) 



మౌళి సికిందరాబాద్ రైల్వేస్టేషను ముందు ఆటో దిగేవేళకు కృష్ణా ఎక్స్ప్రెస్ బైల్దేరడానికి సిద్ధంగా ఉంది. 


z






ఆటో వాడి చేతిలో వంద నోటు పెట్టి చిల్లర కూడా తీసుకోకుండానే ఆదరాబాదరాగా ఫ్లాట్ ఫాం  మీదకు పరుగెత్తివెళ్లి కదిలే బండి నెక్కేసాడు.. ఎలాగైతేనేం!



బండి క్రమంగా ఊపందుకుంది. 


ఖాళీగా ఉన్న ఓ కార్నర్ సీట్లో కూలబడి బైటకు చూసాడు. 


బస్సులూ... బైకులూ. . బళ్ళూ... పనిపాటలకు పోయే జనాలూ!... బండెడు బరువు స్కూలు బ్యాగులను భుజాల మీద మోస్తున్నా  ... బండిలోని వాళ్లు  తమకేదో బంధువులన్నంత  హుషారుగా ‘టాటా’లు చెబుతోన చిన్నారువా ! 


ఇంకీ హైదరాబాదును చూడటం ఇదే ఆఖరు. 


లోకానికీ తనకూ రుణం తీరిపోయినట్లేనని డిసైడయిపోయి కూడా ఇవాల్టికి రెండు రోజులు. ఇది మూడో రోజు పగలు . 


ఈ రాత్రే తన చివరి రాత్రి. తెల్లారి అమ్మనీ.... అమ్మనబ్రోలునూ  ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా చూడకూడదని నిశ్చయించుకొన్న  తరువాతనేగా తను  ఇంటికి ఆ ఉత్తరం రాసి పోస్టు చేసింది! 


రేపు ఆ ఉత్తరం అమ్మ చదివించుకునే వేళకి తనీ లోకంలో ఉండడు . ఉండకూడదు.


ఉత్తరంలోని సంగతులు గుర్తుకొచ్చాయి.


"...అమ్మా! నేనిక్కడేమీ దొరబాబులాగా బతకడం లేదు.  ఒక కెమేరామేన్ దగ్గర క్రేన్ ఆపరేటర్ పని. రోజుకు రెండొంద లొస్తే గొప్ప. అదీ పనిలేనప్పుడు పస్తే. పెద్ద సినిమా హీరో నవుదామని నిద్దర్లో కూడా కలవరించేవాడినని నువ్వెప్పుడూ తిట్టి పోస్తుండేదానివి. ఉడుకుడుకు నీళ్ళు మీద కుమ్మరించే దానివి. అప్పుడైనా బుద్ధి రాలేదు. ఊరొదిలి పారిపోయినప్పుడు నిన్నెంత బాధపెట్టానో తెలుసుకోలేదు. ఇప్పుడు తెలిసినా బాధ పెట్టక తప్పడం లేదమ్మా! ఈ లోకం నుంచీ వెళ్లిపోవాలనే నిర్ణ యించుకున్నాను. పోయేముందు నీ చేతి ముద్దలు రెండు తినా లనీ, రజనీ చేతిగాజులు తిరిగిచ్చేయాలనీ... నా చావుకు ఎవరూ బాధ్యులు కాదని పోలీసులకు తెలియాలనీ నీకీ ఉత్తరం రాసి పోస్టు చేస్తున్నాను....”


టీసీ వచ్చి టిక్కెట్టు అడగటంతో ఆలోచనల చైన్ తెగి పోయింది. 


బండి బైలుదేరుతుందన్న హడావుడిలో టిక్కెట్టు తీసుకోకుండానే ట్రైనెక్కే శాడు తను . 


ఒంగోలు దాకా పెనాల్టీతో సహా టిక్కెట్టు తీసుకుని సీటు మీద నిస్త్రాణగా పడుకుండిపోయాడు. 


' ఆడపిల్ల గాజులు కాజేసినందుకు యమలోకంలో ఏం శిక్ష పడుతుందో ? తల్లినే కాదు... నమ్ముకున్న అమ్మాయిని కూడా అన్యాయం చేశాడు గదా తను...'


దుర్గ గుర్తుకొచ్చింది.


‘అభిమానం గల పిల్ల. ఎవర్నీ హద్దుమీరి దగ్గరకు రానిచ్చేది కాదు. ఆపరేటర్ పాపారావుగాడి కన్ను దానిమీద పడటం తన ఖర్మ. తనకూ దానికీ ఉన్న చనువు తెలిసి వెయ్యి నోటు పారేసి గెస్టుహౌసుకి తోలుకు రమ్మన్నప్పుడే దుర్గను తను ఎలర్ట్ చేసుం డాల్సింది. తను మందుకొట్టి గమ్మున రూంలో పడుండబట్టేగదా దాని బతుకు అన్యాయమైపోయింది! ఆ గొడవల్లో తన పేరూ బైటకు రావడంతో. . పోలీసోళ్ళ కళ్ళు గప్పి శేఠ్ దగ్గర కుదువ పెట్టిన రజని గాజులు విడిపించుకుని బండి ఎక్కటానికి బ్రహ్మ ప్రళయమైపోయింది' 


“మీల్స్.... మీల్స్......” అనే కేకలతో ఈ లోకంలో కొచ్చి పడ్డాడు మౌళి. 


బండి చినగంజాం స్టేషనులో ఆగి ఉంది. 


ఒంటి చేతి మీద అన్నం ప్లేట్లు దొంతర్లుగా పెట్టుకుని కంపార్ట్ మెంటంతా  చురుగ్గా కలియతిరుతున్నాడొక కుర్రాడు. 


కుడి చేయి సగం దాకా లేదు!


అన్నం ప్లేటు చూడగానే ఆకలి రెట్టింపయింది . కానీ ఆర్డరీయ బుద్ధి కాలేదు. 


ఇంకో గంటాగితే ఇంటికే పోయి అమ్మ చేతి ముద్దలు కమ్మగా తినచ్చు. కాలే కడుపుతో ఇన్ని నీళ్ళు పట్టిద్దామని బండి దిగి పంపు దగ్గరికెళ్ళాడు మౌళి.


“సార్! ఈ వాటర్ తాగితే నేరుగా పైకే; అమృతం లాంటి నీళ్ళు. ప్యూర్ వాటర్. గ్లాసు ఓన్లీ టూ రూపీస్ సార్! " అంటూ అడక్కుండానే ఐసు ముక్కలేసున్న నీళ్ల గ్లాసునందించాడు అక్కడే ఉన్న ఒక గడుగ్గాయి. 


నిండా పదేళ్ళు కూడా ఉన్నట్లు లేదు. వాడి నవ్వులాగే వాడి నీళ్ళూ తీయగా, చల్లగా ఉన్నాయి. 


ఇంకో రెండు గ్లాసులు పట్టించి వాడి చేతిలో పది నోటు పెట్టి కదిలే బండెక్కేశాడు మౌళి. 


చిల్లరివ్వడానికి కాబోలు వాడు కాస్సేపు బండి వెంట పడ్డాడు. కానీ కుదర్లేదు. 


బండి అమ్మనబోలు ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. పావు గంటయినా క్లియరెన్సు రాలేదు.


ఓపిక నశించి బండి దిగి పొలాల కడ్డం పడ్డాడు మౌళి. 


పైరుమీద నుంచొచ్చేగాలి పరిమళానికి వళ్ళు పులకరించింది. అదోరకమైన జన్మభూమి ఉద్వేగం! 


ఏడేళ్ళు దాటిపోయాయి ఈ హాయి అనుభవించి. 

ఈ ఏడేళ్ళలోనే ఊరు ఎంత మారి పోయింది! జట్కాలకు బదులు ఆటోలు! కంకర రోడ్డు స్థానంలో తారు రోడ్డు! రోడ్డుకి రెండు పక్కలా ఉన్న నేరేడు చెట్లు మాత్రం చిన్ననాటి స్నేహితుడిని గుర్తుపట్టి అప్పటిలాగానే నవ్వుతూ ఊగు తున్నట్లున్నాయి. 


ఆ చెట్ల మానులకు చిక్కుల ముడిలాగా వేలాడు తున్న సెట్ బాక్సు వైర్లూ... కేబుల్ వైర్లూ! 


'ఊరు బాగానే బలి ! ' అనుకున్నాడానందంగా మౌళి.


ఊరు బైటుండి... ఊర్లోకొచ్చే వాళ్ళందర్నీ... నీటి గలగల లతో ఆప్యాయంగా ఆహ్వానించే అప్పటి చెరువు మాత్రం, పాపం బాగా చిక్కిపోయింది. 


చెరువు చుట్టూ పరిచున్న కంచె చిక్కి శల్యమయిన తల్లి కట్టుకున్న చిరుగుల చీరలాగా చూపులకే గుబులు పుట్టించేటట్లు న్నది. 


చెరువు మధ్య ఏదో భారీ నిర్మాణమే జరుగుతోంది. తల్లి పొట్టమీది రాచపుండులాగా చూట్టానికే చాలా వికారంగా ఉందా దృశ్యం.


చెరువు గట్టుమీది 'గోపాలం బావి' మాత్రం ఎప్పటిలాగా సందడిగా ఉంది. ఊరి జనాలని అక్కడ అలా చూసేసరికి చాలా ఆనందంగా అనిపించింది మౌళికి.


అప్పట్లో ఊరు మొత్తానికి అదొక్కటే మంచినీళ్ళ బావి. 


చెరువు ఎండిపోయినా ఆ బావిలో నీళ్ళు మాత్రం మూడు కాలాలలోనూ నిండుగా ఉండేవి.


‘ఈ జలం తాగితే ఎంత మొండి రోగమైనా చేత్తో తీసేసినట్లు ఇట్టే మాయమైపోతుంది. అంతా మీ నాయన చేతిచలవరా మౌళీ!' అంటుండే వారు వెంకట్రావు మేష్టారు.


అరవై తొమ్మిదిలో వచ్చిన ఉప్పెనకు చెరువు నీరు చప్పబడి పోతే... గట్టుమీద ఈ బావిని తవ్వించాడుట నాయన. నాయన పేరు మీదే అందరూ దాన్ని 'గోపాలం బావి' అంటుండేవారు. 


' ఇంకా నయం ! చెరువుతోపాటు ఈ బావిని కూడా పూడ్చి

పారేయ లేదు. ఆ మహానుభావులెవరో!' అనుకున్నాడు మౌళి.


శివాలయం వెనక గుండా అడ్డదారిన బడి పోస్టాఫీసు ముందున్న రోడ్డెక్కాడు మౌళి. 


కిటికీగుండా ఉత్తరాలు సార్టు చేస్తున్న ఆడమనిషెవరో కనిపించింది. 


రజని అయితే గుర్తుపట్టి గోల చేస్తుంది. ఏ గోలా లేకుండా ప్రశాంతంగా పోవాలనేగా తను ఇంత దూరం పడుతూ లేస్తూ వచ్చింది. 


తలొంచుకుని గబగబా రెండగల్లో తూర్పు వీధిలోని తనింటి

ముందు కొచ్చిపడ్డాడు.


కంపగేటు  తీస్తుంటే తల్లి కోసం కాబోలు అంగలారుస్తున్నట్లు అంబా అని అరుస్తా ఉంది లేగ దూడ.


తడిక తలుపు బైటికి గడియపెట్టి వుండటంతో ఇంట్లో ఎవరూ లేరని తెలిసిపోతోంది. 


అరుగు మీదున్న కుక్కిమంచంలో అలాగే కూలబడిపోయాడు. 


నీరసంగా   మౌళి కళ్ళు మూతలు పడి పోతున్నాయి నిస్త్రాణవల్ల.


గబగబ మాటలు వినబడుతుంటే గభాలున మెలుకువ వచ్చింది మౌళికి. 


అది అమ్మ గొంతే! ఆ గొంతులో ఏ మార్పూ లేదు. 


మనిషే బాగా నలిగిపోయినట్లు కనిపిస్తోంది. మొగానికి పట్టిన చెమటను చీరె కొంగుతో తుడుచుకొంటూ వసారాలో కొచ్చిన తల్లిని చూసి అమాంతం లేచి నిలబడ్డాడు మౌళి.


చెట్టంత కొడుకు హఠాత్తుగా కట్టెదుట అలా నిలబడుండేసరికి నిర్ఘాంత పోయింది ఆదెమ్మ ముందు . 


'నువ్వా!' అందిగానీ... ఆ షాకులో నుంచీ తేరుకోగానే తన్నుకొచ్చిన ఉక్రోషాన్ని ఆపుకోలేక తడిక తలుపును తన్నుకుంటూ లోపలికి దూసుకుపోయిందామె. 


మౌళికి ఏం చేయాలో పాలుపోలేదు.


లోపల్నుంచీ తిట్ల దండకం ఆగకుండా వినిపిస్తోంది.


“చచ్చానో... బతికానో... చూట్టాని కొచ్చాడు కాబోలు! ఏం తక్కువచేసి చచ్చానీ చచ్చినాడికి. గాడిదలాగా కూకోబెట్టి మేపానే! తండ్రిలేని బిడ్డ గదా అని  గారాబం చేసినందుకు బాగానే బుద్ధి చెప్పాడు. ఊరి పిల్లకాయలకు మల్లే వీడి మెడలోనూ ఒక కాడి వేసి మడి చెక్క లోకి తోలేసుంటే తెలిసొచ్చేది. కొవ్వెక్కి పిల్లదాని గాజులు దొబ్బుకెళ తాడా! ఒంటాడముండని ఊరి దయాదాక్షిణ్యాల కొగ్గేసి ఏడనో పేద్ద ఊడబొడవడానికట  వెళ్ళాడండీ బాబూ! ఇప్పుడే మయిందంటా.! దేభ్యం  మొగమేసుకుని దిగబట్టానికీ..." 


ఇంక ఆ  పురాణం వినలేకపోయాడు మౌళి.


"ఇంకాపవే అమ్మా... నీ పుణ్యముంటుంది! మూడు రోజుల బట్టి ముద్ద తినలేదు. ముందేదైనా తినడానికి ఇంతుంటే పెట్టవే!” అంటూ లోపలికి దూరి గారాబంగా తల్లి వడిలోకి  చేరబోయాడు. 


కొడుకు అభిమానంగా పట్టుకున్న చేతిని  విదిలించి

కొట్టింది ఆదెమ్మ. 


" పోరా.. నన్ను తాకమాక. వళ్ళంతా మంటలు పెట్టినట్లుం డాది. నువ్వు చేసిపోయిన ఘనకార్యానికి నా గుండెలు ఇప్పటికీ అగ్గి గుండమయి మండిపోతానే ఉండాయి. ఊరంతటికీ న్యాయం చెప్పే మీ నాయనకు నువ్వెంత గొప్ప కీర్తి తెచ్చి పెట్టావో ఎరికంట్రా నీకు? నువ్వు చేసిపోయిన పనికి నలుగురూ నా మొహాన్ని పేడనీళ్ళు చల్లలేదంటే... అదంతా మీ నాయన మీదున్న భక్తి తోనే ! అట్లాంటి తండ్రికి ఇట్లాంటి కొడుకు! నిన్ను కాదురా అసలనాల్సింది... నిన్నిట్లా  పెంచానే, అందుకు... ముందు నాకు నేను కొర్రికాల్చి వాతలు పెట్టుకోవాల..." అంటూ అరచేయి మీద వాతలు పెట్టేసుకోవటం మొదలు పెట్టేసింది ఆదెమ్మ


మౌళి అనుకోని ఈ హఠాత్పరిణామానికి పాకయిపోయాడు. 


ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. 


మరుక్షణంలోనే తేరుకుని తల్లిని అమాంతం అలాగే మోసుకుంటూ వెళ్ళి బైటున్న నీళ్ళ తొట్టెలో పడేశాడు.


వేడివేడి బొబ్బల మీద చల్లటి నీళ్ళు పడంగానే ఆ నొప్పికి తాళలేక రంకెలు వేయడం మొదలు పెట్టింది ఆదెమ్మ.  


ఆ గోలకు నలుగురూ చేరటంతో మౌళి రాక అందరికీ తెలిసిపోయింది. 


ఆచారిగారొచ్చి చేతులకు చందనం  లాంటిదేదో పట్టించి.. నొప్పి తెలీకుండా అల్లోపతి మాత్రలు రెండు మింగించి మళ్ళా వచ్చి చూస్తానని వెళ్ళిపోయారు. 


...  ... ...


మునిమాపు చీకట్లు కమ్ముకున్నాయి. 


చలికాలం కావడంపల్ల ఊరు అప్పుడే నిద్రకు పడింది. 


ఆచారిగారిచ్చిన మందులవల్ల ఆదెమ్మ వంటి మీద స్పృహ లేకుండా అలా పడుండిపోయింది. 


బుడ్డి  దీపం ఎక్కడుందో కూడా తెలీక అట్లాగే చీకట్లో వసారా గోడకానుకుని కూర్చోనున్నాడు మౌళి. 


ఊళ్ళో వాళ్ళు మధ్యా హ్నం ఇంటి కొచ్చినప్పుడు అనుకున్న మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి.


'ఈడు లేనంతకాలం ఆదెమ్మ హాయిగా ఉండింది. వచ్చాడు. అప్పుడే మొదలయ్యాయా మహాతల్లికి కష్టాలు! 


తల్లిని చూడటానికొచ్చిన వెంకట్రావు మేష్టారుదీ అదే

మాట...! 


ముల్లులా పొడుస్తున్నాయా మాటలు. 


" మీ అమ్మ ఏడేళ్ళ కిందటి ఆదెమ్మ కాదురా ఇప్పుడు! నువ్వు పారిపోయినప్పుడు నెల రోజులు మంచం పట్టింది. అంతా పోతుందనుకున్నాం. తిప్పుకుందెట్లాగో! 


ఎందుకు తిప్పుకుందో తెలీదు కానీ.... అదే ఊరికిప్పుడు చాలా మేలయింది. 


ఊరు కోసం చాలా చేస్తున్నదిరా మీ అమ్మ ఇప్పుడు! అచ్చంగా మీ నాయనలాగే! 


నిన్ను మీ నాయనలాగా తీర్చి దిద్దాలనుకునేది. నువ్వు పారిపోతివి. 


నవ్వు లేని లోటును ఇట్లా పూడ్చుకుందామనుకుందో ఏమో! 


డ్వాక్రా అనీ, అదనీ.. ఇదనీ... ఎప్పుడూ ఏదో పని చేస్తుంటుంది. ఊరి ఆడవాళ్ళకు అప్పులిప్పించింది. సారాయి అంగడిని మూయించిందాకా నిద్ర పోలేదు. యానా దయ్యకు అదే గంటు ఇప్పుడు. 


చెరువు పూడ్చి పారేసి సినిమా హాలు కట్టిస్తున్నాడు. చూసావుగా! దాన్నెట్లాగైనా అడ్డుకోవాలని ఈ వయసులో ఒంగోలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది... అలుపు సొలుపు లేకుండా! 


ఎన్నికలొస్తున్నాయి . ఎట్లాగైనా పంచా యతీ బోర్డుని కైవసం చేసుకొని ఊరు మొత్తాన్ని మింగేయాలని చూస్తున్నాడు రాక్షసుడు. ఎదురు నిలబడి శతవిధాలా కొట్లాడు తుంది మీ అమ్మ. 


ఇంకో వారంలో ఎలక్షన్లు. ఇప్పుడు నువ్వొ చ్చావు....”


మేష్టారు అర్థాంతరంగా ఆపేసిన ఆ వాక్యం అంతరార్థం  అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు మౌళి. 


తను ఊరు వదిలి పారిపోయేరోజు ఈ సారు కూతురు రజని చేతి బంగారు గాజులేగా కాజేసుకెళ్ళింది! 


ఎప్పట్లా ఆడుకోవడానికి తనతో చెరువు గట్టుకొస్తే ఒంటరిగా చూసి ఆమె గాజులు గుంజుకు న్నాడు తను. 


ఆ పెనుగులాటలో రజని బావిలో పడినా పట్టిం చుకోకుండా పారిపోయి హైదరాబాద్ బండెక్కేశాడు.


రజని కేమయిందో అడిగే ధైర్యం రావడం లేదుఇప్పుడు! .


మేష్టారు కూడా ఆ ప్రస్తావనే లేకుండా అమ్మను గురించే అంతలా చెబుతున్నారంటే... అర్థం తెలుస్తూనే ఉంది.


"టీవీలు... సెల్ఫోన్లు ఇప్పుడంతటా ఉన్నాయిరా! అక్కడ హైదరాబాదులో ఏం జరిగిందో ఇక్కడ అందరికీ తెలుసు. ఊరు మారుండవచ్చేమోగాని... ఊరి జనాల తీరేం మారుతుంది!” అన్నారు సారు  శ్లేషగా.


నిజమే! జనాలు... చాటుగా ఏం ఖర్మ.... మొహం మీదనే ... అదోలా మొహం పెట్టి అంటున్న మాటలు వింటూనే ఉన్నాడు. 


మేష్టారేమీ జరిగనిది  చెప్పడం లేదు.


"గెలవడం కోసం యానాదయ్య వెయ్యని ఎత్తు లేదు. అందు లోనూ మీ అమ్మ చేతిలో ఓడటమంటే.... అవమానం . ఆ సంగతలా ఉంచు!  ముందు సినిమా హాలు పని ఆగిపోతుంది. ఈ దఫా ఎన్నికల్లో గెలిస్తే మిగతా చెరువు భాగంతో పాటు గోపాలం  బావిని కూడా పూడిపించి మళ్ళా ఏదో కల్లు దుకాణం తెరిచే

పెద్ద ప్లానులో ఉన్నాడు. 


అందుకే మీ అమ్మ అట్లా తెగించి పోరాడుతోంది.. 


.. ఇప్పుడు నువ్వొచ్చావు. అప్పుడే జనాల్లో నీ రాక 

మీద కలవరం పుట్టిస్తున్నాడు యానాదయ్య. 


ముందు ముందు ఏమవుతుందో ఏంటో? 


గెలవడం కోసం ఎంతకైనా దిగజారగల త్రాష్టుడు ఆయన. 


చాలా ఏళ్ళ బట్టీ  నువ్వీ వూళ్ళో లేవుకదా! అందుకే నీ కిక్కడి రాజకీయాలు అంతు పట్టటం లేదు”


ఆదెమ్మ నొప్పితో కదలటంతో సంభాషణ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు వెంకట్రావు మేష్టారు.


మంచం మీద మూలుగుతున్న తల్లి వంక చూసాడు మౌళి. 


ఆమె అలా మూలుగుతోంది. .  వట్టి నొప్పి వల్లే కాకపోవచ్చు. 


మేష్టారు చెప్పినట్లు తను ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమవడం వల్ల కూడా కావచ్చు. 


చెప్పాపెట్టకుండా పోయి ఆ రోజు అట్లా బాధపెట్టాడు. అడగా పెట్టకుండా వచ్చి ఇపుడు ఇట్లా హింస పెడుతు న్నట్లున్నాడు. 


లోకంలో దర్శనం చేత తల్లిని హింసపెట్టే కొడుకు బహుశా తానొక్కడేనేమో! 


అప్పుడు పసితనంలో చేసిన తప్పు! ఇప్పుడు చేతగానితనంతో చేస్తున్న తప్పు! 


తనవల్ల తల్లికి అప్పుడూ... ఇప్పుడూ దుఃఖమే! 


ఆమెను సంతోషపెట్టాలంటే తనేమి చేయాలి? తనేం చేస్తే అమ్మ ఊరందరి ముందు గర్వంగా తలెత్తుకుని తిరగగలుగు తుంది?


ఠక్కుమని తట్టింది మెరుపులాంటి ఆలోచన. 


ఒక నిర్ణయాని కొచ్చినట్లు గభాలున లేచాడు మౌళి.


అంత చీకట్లో కూడా ఓపిగ్గా తడుముకుంటూ పొయ్యి దగ్గరి దాకా వెళ్ళి ఓమూల ఉన్న అగ్గిపెట్టె నందుకుని బుడ్డిదీపం వెలి గించాడు.


ఆ మసక వెలుతురులోనే మధ్యాహ్నం తల్లి వండిపెట్టిన అన్నం కుండలో నుంచి ఇంత తీసుకుని కంచంలో పెట్టుకుని అక్కడే ఉన్న ఆధరువుతో కలుపుకుని గబగబా రెండు ముద్దలు మింగేశాడు. 


కుండలోని నీళ్ళు రెండు గ్లాసులు తాగేసరికి ఆత్మా రాముడు శాంతించాడు.


తల్లి తలగడ దగ్గర తాను తెచ్చిన రెండు బంగారు గాజులు పెట్టి... నిశ్శబ్దంగా బైట కొచ్చేశాడు. 

తనే తరువాత రజని కిచ్చు కుంటుంది అనుకున్నాడు.


చీకట్లో చూడక కాలు బర్రె డొక్కలో తగిలినట్లుంది. అది

'బా' అంటూ బాధతో విలవిలలాడింది. 


ఆ అలికిడికి తల్లి లేవకముందే గభాలున కంపగేటు లాగి ఒక్క ఉదుటున రోడ్డు మీద కొచ్చి పడ్డాడు మౌళి.


చల్లగాలికి వూరంతా డొక్కల్లో కాళ్ళు ముడుచుకుని నిశ్శబ్దంగా  పడుకోనున్న పాపాయిలా ఉంది.


బజారులో నరసంచారం లేకపోవటంతో మెయిన్ బజారు గుండానే శివాలయం వెనకున్న గోపాలం బావి గట్టు మీదకు చేరాడు మౌళి.


బావిలోకి తొంగి చూశాడు. 


చీకటి తప్ప ఏమీ కనిపించలేదు .. తన భవిష్యత్తులాగా . 


ఏడేళ్ళ క్రిందట ఇదే బావిలోనే రజని జారిపడి  పోతుండటం చివరిసారిగా చూసాడు తను. 


తనూ అలాగే జారి పడిపోతున్నాడిపుడు. 


అవును! ఎక్కడికో పోయి ఏ దిక్కుమాలిన చావో  చచ్చి... ఈ శవం ఎవరిదని ఎవరెవరిచేతనో  పంచాయితీ పెట్టించుకోవడంకన్నా.. జన్మభూమిలో... కన్నవారి కనుసన్న ల్లోనే జీవితం అంతం చేసుకుంటే... కనీసం ఆ సానుభూతైనా అమ్మను ఎన్నికల్లో గెలిపి స్తుందేమో! 


బ్రతికి సాధించలేనిది ...చచ్చి సాధించడమంటే ఇదేనా? ఏమో! 


 ఏమైనా  సరే.. తల్లి గెలవాలి.


ఈ విధంగా మేలు చేసే అవకాశం తనకు కలిగించడానికే కాబోలు... బహుశా దేవుడు తనను ఎక్కడి హైదరాబాదు నుంచో ఇక్కడికి తీసుకొచ్చింది!


కాలికి కట్టుకున్న చేంతాడు మరో కొసను  అక్కడే పడి వున్న  బండ రాయికి చుట్టాడు. 


బావి ఒరల మీదకు బండరాయిని చేరుస్తున్నంతసేపు చేతి గాయాలతో గగ్గోలు పెడుతున్న తల్లిని మధ్యాహ్నం... నీళ్ళతొట్టి దాకా మోసుకెళ్ళిన దృశ్యమే మనస్సులో మెదులుతూ వుంది.


గోపాలం బావి గట్టు మీదెక్కి నిలబడి ఒక్కసారి వెనక కనిపించే తాను  పుట్టిన ఊరి వంకా... మరోసారి  ముందు చిక్కి శల్యమై దీనంగా చూస్తున్న   చెరువు వంకా చూసి... శివాలయం వంకే చూసుకుంటూ

కాలితో బలంగా బండరాయిని బావిలోకి తన్నేసాడు మౌళి.. బండరాయితో పాటే... తనూ... ఆ చీకట్లోకి జారిపోతూ....!


...    ...    ... 


కళ్ళు తెరిపిడి పడేసరికి  ఎదురుగా మొహంలో మొహం పెట్టి ఆత్రంగా చూస్తున్న తల్లి కనిపించింది మౌళికి. 


చుట్టూ సినిమా చూస్తున్నట్టు పోగైన జనం!


తను బలవంతపు చావు నుంచి బైటపడ్డానని తెలియడానికి అట్టే సమయం పట్టలేదు మౌళికి. అర్ధమయింతరువాత చాలా సిగ్గనిపించింది.


“ఇప్పుడు సిగ్గు పడితే ఏం లాభం? ఆ బుద్ధి బావిలో దూక్క ముందుండాలి. ఊరోళ్ళకి మీ నాయన చేసి పోయిన మంచి పనుల్లో చివరికి మిగిలింది ఈ గోపాలం బావొక్కటే! దీన్ని కూడా జనాలకు దక్కకుండా చేసి పోవాలనా నీ దరిద్రపు ఆలో చన?” ఆదెమ్మ మాటల్లోకి మల్లా మధ్యాహ్నపు  పదును వచ్చి చేరింది!


“ఏమంటున్నావు ఆదెమ్మా! " అన్నారు వెంకట్రావు మేష్టారు అయోమయంగా.


“అవును సారు! ఇప్పుడీ బావి... చెరువు కోసమే కదా మనమంతా ఆ యానాదయ్యతో కొట్లాడతావుంది . వీడు ఇందులో పడి ఛస్తే నీళ్ళు మైలపడ్డాయని బావిని వెలేసే త్రాష్టులున్నారు సారూ ఊళ్లో! అయినా అక్కడ హయిదరాబాదులో ఏదో ఛండాలప్పని చేసి ఇక్కడికొచ్చి చావాలనుకోవడం ఏంటసలు?... ఆ చావేదో అక్కడే గుట్టుచప్పుడుగా చావచ్చుగా! తెలిసి ఒక్కేడుపు ఏడ్చి వూరుకునే దాన్ని”


"ఛ... మరీ అంత అన్యాయంగా మాట్లాడద్దత్తమ్మా! అక్కడ హయిదరాబాదులో జరిగిన దాంట్లో మన మౌళి తప్పేంలేదసలు. చెయ్యని నేరం మీద పడిందని నీ కొడుకెంత కుమిలిపోతున్నాడో నీకు తెలుసా!" అంది ఒక ఆడమనిషి.


అప్పుడు చూసాడు మౌళి రజని వంక! కళకళలాడే ఆమె మొహం తిలక సౌభాగ్యం లేక బోసిగా ఉండటం చూసి మనసు కలుక్కుమంది. 


రజని అంటోంది. " మౌళి రాసిన ఉత్తరం ఇదిగో. నిన్న సాయంత్రం టపాలో వచ్చింది. ఇది చదివే ఏదో జరగబోతుందని నేనొక కంట కన బెడుతూ ఉంది. నీళ్ళ కోసం ఎప్పటిలాగే తెల్లారగట్ట బావి దగ్గర కొచ్చాం నేనూ, చిన్నా. బావి లోపల్నుంచి మూలుగులు వినబడుతుంటే నేనే వీడిని దూకి చూడమన్నా!" తడిసిన బట్టలతో వణుకుతూ నిలబడ్డ చిన్నపిల్లవాడిని ముందుకు నెట్టింది రజని. 


వాడివీ రజని పోలికలే! చిన్నగంజాం స్టేషనులో మంచినీళ్ళమ్ముకునే కుర్రాడు వీడే !


మేష్టారు రజనికి తెచ్చిన కృష్ణ సంబంధం అంత మంచిది కాదు. తాగుడు ఎక్కువై పచ్చకామెర్లొచ్చి  భర్త పోయేనాటికి రజనికి ఈ పిల్లాడుట. తండ్రి సబ్ పోస్టాఫీసులోనే  కృష్ణ చేసే పోస్టుమేన్ పని తను చేస్తూ... పిల్లాడి చదువు ఖర్చుల కోసం శని ఆదివా రాలు అట్లా చినగంజాం రైలు స్టేషనులో నీళ్ళమ్మిస్తూ ఉంటుందిట రజని. తరువాత ఇంటి దగ్గర రజనే చెప్పిందీ విషయాలన్నీ మౌళికి. 


ఊళ్ళో కల్లు దుకాణాలు యానాదయ్యవి రెండు మూడున్నాయి . కాని... మంచినీళ్ళ బావి మాత్రం మీ నాయన తవ్వించింది ఒకటే! నీ వల్ల అది పాడయిపోతుందన్న ధర్మకోపంతో అత్తమ్మ

అలా అంది కాని..  నీ మీద కోపమెందుకుంటుంది మౌళీ? నా గాజులు మీ అమ్మ కిచ్చావుటగా! నాకు తెచ్చిచ్చింది. నేనేం చేసుకోను వీటినిప్పుడు? ' 


గిల్టీగా తలొంచుకున్నాడు మౌళి . 


" నీ చిన్ననాటి  ఫ్రెండుగా ఒక సలహా ఇస్తారా ; నచ్చితే చెయ్యి! మళ్ళా ఆ హైదరాబాదెందుకు? ఇక్కడే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకో! ఈ గాజులు పెట్టుబడిగా పెట్టుకో! చిన్నాని సాయానికి నీ దగ్గర పెట్టుకో! " అంది రజని.


" ముందు ఈ ఎన్నికలయిందాకా వూళ్ళోకి దొంగసారా రాకుండా కాపుకాయరా! రాత్రిళ్ళు గోపాలం బావిలో రాక్షసులు ఏ విషం పోయకుండా కాపలా కూడా కాయాలి” అంది ఆదెమ్మ.  కంచం నిండా అన్నం ముద్దలు కలుపుకొచ్చి మౌళి  నోటి కందిస్తూ . 


- - కర్లపాలెం హనుమంతరావు

( రచన మాసపత్రిక - సెప్టెంబర్, 2012 - కథాపీఠం పురస్కారం ) 





Friday, March 5, 2021

శేషారత్నం - కథానిక - -కర్లపాలెం హనుమంతరావు - కౌముది/రచన ప్రచురితం

 

కాంతయ్య పోయి మూణ్ణెలయింది. తండ్రి పోయిన ఏడాదిలోపే కూతురికి  పెళ్లి చేస్తే  కన్యాదాన ఫలం తండ్రికి దక్కుతుందన్న నమ్మకంతో అనంతమ్మ కూతురు పెళ్ళి పెట్టుకుందిప్పుడు,

అబ్బాయి చెన్నైలో ఫిలిప్స్ కంపెనీలో ఉద్యోగం . కావలివాళ్ళు. కాస్త కలిగిన వాళ్ళు. కాంతయ్యకు మా టీచర్స్ సర్కిల్ లో మంచివాడన్న పేరుంది. ఆయన కూతురు గాయత్రిని చేసుకుంటామని మా ఆర్ జె డి మ్యాడం గారే ముందు చొరవ చూపించడం వల్ల ఏ ఇబ్బందుల్లేకుండానే సంబంధం ముడిపడింది. ముహూర్తానికి ఇంకో నెల రోజులు టైముందనంగా  అనంతమ్మ దగ్గర్నుంచి 'కాస్త అర్జంటుగా వచ్చి పొమ్మ'ని కబురొస్తే గుంటూరొచ్చాను. 

పెళ్లి పనులు నిదానంగా నడుస్తున్నాయి. గాయత్రికి అప్పుడే పెళ్లికళ వచ్చేసింది కూడా. మా కాంతయ్య కనక ఉండుంటే ఎంత సంతోషించేవాడో అనిపించిందా క్షణంలో. అనంతమ్మే ఎందుకో కాస్త కళవళపడుతోంది. 

ఆ మధ్యాహ్నం నేను ప్రయాణపు బడలికలో పడుకుని ఉంటే గదిలోకొచ్చింది 'నిద్ర పోతున్నావా అన్నయ్యా!' అంటూ. 

'లేదులే! ఏవిఁటి విషయం? ఎందుకంత తొందరగా రమ్మని కబురుచేసావు?' అని ఆడిగా. 

బీరువాలో నుంచి ఏవో కొన్ని కాగితాలు తీసి నా ముందు పెట్టింది తను. 'ఇంటి పేపర్ల కోసం వెదుకుతుంటే ఇవి కనిపించాయన్నయ్యా! ఏంటో అంతు బట్టక నీకు కబురు పంపించా. గాయత్రికే ముందు చూపిద్దును కానీ, దాని పరీక్షల గొడవలో అదుందిప్పుడు. ఆయనా నువ్వూ అరమరికలు లేకుండా ఉండేవాళ్లుగా! నీ కేమైనా తెలుస్తాయని..'అంది. 

'నేను చూసి చెబుతాలే! నీవు పోయి పని చూసుకో!' అని అప్పటికామెను పంపించేశా.  

కాంతయ్య స్టేట్ బ్యాంకులో ఏదో లోను తీసుకున్నట్లున్నాడు. వాయిదాలు సక్రమంగా రావడం లేదని ఇచ్చిన నోటీసులు అవన్నీ. పాత బాకీ వడ్డీతో సహా  సుమారు లక్షన్నర. పదిహేను రోజుల్లోపు బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఇంటిని జప్తు చేసి సొమ్ము జమేసుకునే నిమిత్తం చర్యలు చేపడతామని ఇంగ్లీషులో  లాయరిచ్చిన నోటీసులు రెండున్నాయందులో. నోటీసులన్నీ ఏదో రామన్నపేట  అడ్రసు నుంచి రీడైరక్టు చేయబడ్డవి. 

కాంతయ్యా నేనూ ఒకే సారి ఉపాధ్యాయ వృత్తిలో చేరినవాళ్లం. వేటపాలెంలోని  ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరం ఒకేసారి కలసి పనిచేసాం మొదట్లో. మంచి స్నేహితులమయ్యాం. తరువాత  ఎన్ని స్కూళ్లు మారినా, ఎన్ని పొజిషన్లు మారినా ఇద్దరి మధ్యా స్నేహం బలపడుతూ వచ్చిందే కాని, చెదరలేదు. 


మా నాన్నగారి ఊరు పెదగంజాం. ఆ ఊరి శివాలయం పూజారి సాంబయ్యగారి అమ్మాయి ఈ అనంతలక్ష్మి. ఈ సంబంధానికి కాంతయ్యను సూచించింది నేనే. నా భరోసా మీదనే సాంబయ్యగారు కాంతయ్య దగ్గర ఆస్తిగా ఒక్క చిల్లుకాణీ లేకపోయినా గవర్నమెంటు ఉద్యోగం చూసి కూతుర్ని కట్టబెట్టారు. ఆయన పోయే ముందు ఊరి బయట ఉన్న రెండు గదుల పెంకుటింటిని కూతురు పేరున రాశారు. 


మా కాంతయ్య మాణిక్యం. గాయత్రి పుట్టినప్పుడు అనంతమ్మకు గర్భసంచీలో సమస్య వచ్చి మళ్లీ పిల్లలు పుట్టే ప్రయత్నంగాని చేస్తే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరిస్తే తనే ఆపరేషన్ చేయించుకున్న మంచిమనిషతను. అనంతమ్మయితే మొగుడే వైకుంఠం, కూతురే కైలాసంగా బతికే అమాయకురాలు. హాయిగా సాగిపోయే ఆ సంసార నౌకను చూసే విధి ఓర్వలేకపోయినట్లుంది..  కాంతయ్య ప్రాణానికే ప్రమాదం తెచ్చిపెట్టింది. 


మూడు నెలల కిందట విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఏదో కార్యక్రమం రికార్డు చెయ్యడానికని వచ్చి బైట రోడ్డు దాటే సమయంలో లబ్బీపేట వైపు నుంచొచ్చే సిటీ బస్సు ముందు చక్రాల కింద పడి నజ్జునజ్జయిపోయాడు మా కాంతయ్య! ఆ విషాదం నుంచి అనంతమ్మ ఇంత తొందరగా తేరుకుంటుందని నేనైతే అనుకోలేదు. తను డీలాపడితే కూతురు మరంత కుంగిపోతుందనుకుందో ఏమో, ధైర్యం కూడగట్టుకుని ముందా పిల్లను ఓ అయ్య చేతిలో పెట్టే పనిలో పడింది. కలిసొచ్చి మంచి సంబంధం కుదిరినందుకు అందరం ఆనందంగా ఉన్నాం. ఇప్పుడీ అనుకోని కుదుపు!


అప్పటికేదో అనంతమ్మకు సర్దిచెప్పాగానీ, అసలు విషయం తెలుసుకునేందుకు నా ప్రయాణం మరో రోజుకు వాయిదా వేసుకుని బ్యాంకుకెళ్లా నేను. మేనేజరుగారు కాంతయ్యకు పూర్వ పరిచయస్తుడవడంతో వివరాలు రాబట్టటం తేలికయింది. అనంతమ్మ పేరుతో ఉన్న ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మూడేళ్ల కిందట బ్యాంకు నుంచి రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు కాంతయ్య. ఇంత వరకు ఒక్క పైసా కూడా జమపడలేదు. కనక బ్యాంకు రూల్సు ప్రకారం జప్తుకు వెళ్లే చర్యలు చేపట్టడం ఖాయం అని చల్లగా చెప్పుకొచ్చారు మేనేజరుగారు. 


అనంతలక్ష్మి పేరున ఉన్న ఇల్లు అనంతలక్ష్మికి తెలీకుండా కుదువపెట్టడం ఎలా సాధ్యం? లోను అప్లికేషన్ తీయించి చూస్తే అందులో ఉన్నది అనంతలక్షి ఫొటో కాదు! ఎవరో ఆడమనిషిది. అడ్రసు మాత్రం అప్పట్లో కాంతయ్య పనిచేసిన రామన్నపేటదే! హామీ సంతకం సాక్షాత్తూ కాంతయ్యదే! మేనేజరుగారికి కాంతయ్య హఠాన్మరణం గురించీ, అతగాడి కూతురి పెళ్లి గురించీ వివరంగా చెప్పి.. పెన్షన్ బెనిఫిట్స్ నుంచి నేనే పూనుకుని ఎంతో కొంత జమచేయిస్తానని హామీ ఇచ్చి, లోన్ పేపర్లోని చిరునామా, ఫొటో జిరాక్సులు తీసుకుని వచ్చేశా.


కాంతయ్య ఇలాంటి పనిచేసేడంటే  నమ్మశక్యంగా లేదు. భార్య ఆస్తి మీద భార్యను కాకుండా వేరే ఎవరో ఆడమనిషిని ఆ స్థానంలో చూపించి అంత భారీ రుణం ఎందుకు తీసుకున్నట్లు? నాకు తెలిసి కాంతయ్యకు స్మోకింగూ, మంచితనం  తప్ప వేరే వ్యసనాలు లేవు. సీదాసాదా వ్యక్తిత్వం. మాటకు కట్టుబడే మనిషి. మరేమిటి ఈ మిస్టరీ? ఆ ఇంటిని చూసుకునే అనంతమ్మ పిల్లకు పెళ్లి పెట్టుకుంది.  ఇంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని ఆ అమాయకురాలికి తెలిసివుండకపోవచ్చు. తెలిస్తే ఇప్పుడు ఏం చేసుంది? ఒక వంక మొగుడు చాటుగా చేసిన నమ్మక ద్రోహం. మరో వంక పీకల మీద కూతురు పెళ్లి! కాంతయ్య పరువు మర్యాదలు చూసి వచ్చినవాళ్లు ఇప్పుడు ఆ సంబంధం చేసుకుంటరా? తనో రోల్ మోడల్ గా భావించుకున్న తండ్రి అసలు స్వరూపం తెలిసి గాయత్రి క్షమించగలదా? పీటల మీద వరకు వచ్చేసిన ఈ పెళ్లి ఇట్లా ప్రమాదంలో పడటం ఆ సున్నితమైన మనసు తట్టుకోగలదా? నిన్నటి వరకు అంతా సవ్యంగా సాగిపోతోందనుకున్న వ్యవహారం ఇట్లా సడన్ గా అడ్డం తిరిగే సరికి ఏం చెయ్యాలో  తెలీక రాత్రంతా ఆలోచిస్తూనే ఉండిపోయాను. తెల్లారుఝాముకో నిర్ణయానికొచ్చాను. 'ముందు ఆ ఆడమనిషెవరో తెలుసుకోవాలి. వీలైతే వెంటనే ఆ డబ్బును రాబట్టాలి. ఇంటి తనఖా రద్దైపోతే ప్రస్తుతానికి సమస్య ఉండకపోవచ్చు. ముందు, లోన్ పేపర్లలో ఉండే చిరునామాకు వెళ్లిరావాలి. అప్పటి వరకు అనంతమ్మకు ఏమీ చెప్పకూడదు.' అనుకున్నాను. నాకూ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా.. హైదరాబాద్ ప్రయాణం మరో రోజు వాయిదా వేసుకుని రామన్న పేట బైలుదేరాను.. లోను  జిరాక్సు పేపర్లూ, ఫోటో తీసుకుని. 

***

రామన్నపేట పెద్ద ఊరేమీ కాదు. చీరాల వేటపాలెం మధ్య దారిలొ రోడ్డుకు  ఎడంగా ఇసుక దిబ్బల మీద ఎత్తులో ఉంటుందా ఊరు. బస్సు దిగి ఊళ్లోకి వస్తూ విచారిస్తే 'అనంతలక్ష్మి' పేరు గలవాళ్లెవరూ లేరు పొమ్మన్నారు చాలామంది. ఫొటో చూపించి అడిగితే ఒక ముసలాయన 'ఈమె పేరు అనంత లచ్చమ్మ కాదు సారూ! అనసూయమ్మ. అట్లు పోసుకునే అనసూయమ్మ అంటే ఎవరైనా చెబుతారయ్యా! అట్లా శివాలయం దాకా పోయి ఎడం వేపు గొందిలోకి మళ్ళితే అక్కడుంటుంది' అన్నాడు అదో రకంగా నవ్వుతూ. 

నేను ఆ వివరాలు కనుక్కుంటూ వెళ్లేసరికి ఒక నలభై, నలభైఅయిదేళ్ల ఆవిడ ఒక తాటాకు పాక  పంచలో అట్లు పోస్తూ పెనం ముందు కూర్చుని కనిపించింది. ఫొటోలోని మనిషి ఆమే! కొంతమంది మగవాళ్ళు చెక్క బెంచీల మీద కూర్చుని ఆకుల్లో అట్లు వేయించుకుని తింటున్నారు. నన్ను చూసి 'శేషారత్నమా! సారుకు ఆ స్టూలు తెచ్చి ఎయ్యి' అని లోపలికి కేకేసిందామె. 


నేను అట్లు కోసం వచ్చాననుకున్నట్లుంది ఆమె. అదీ ఒకందుకు మంచిదే. వచ్చీ రాగానే వ్యవహారంలోకి దిగితే బెడిసిగొట్టే ప్రమాదముంది. బాదం ఆకుల్లో రెండు అట్లు వేయించుకు తిని 'కాఫీ ఉందా?' అనడిగాను. 'కాఫీలు ఈడ ఎవుళ్లూ తాగరు సార్! టీ కావాలంటే అట్లా పోతే మస్తాను బంకు కాడ దొరుకుద్ది' అంది. నేను తటపటాయిస్తుంటే చూసి 'పోనీ.. మా పిల్లకు రెండు రూపాయలు ఇయ్యండి సార్! తెచ్చిపెట్టుద్ది' అంది. ఆ అమ్మాయి పోయి తెచ్చిచ్చిన టీ తాగేసరికి కొట్టు ముందు జనం కాస్త పల్చబడ్డారు. 


సమయం చూసి అడిగాను 'ఇదివరకు ఈ ఊళ్లో కాంతారావుగారని ఒక పంతులు గారు పనిచేసిపోయారు. ఆయనిప్పుడు ఎక్కడున్నాడో ఏమన్నా తెలుసా?'

'మీరెవరూ?' అని అడిగిందావిడ చేస్తున్న పని ఆపేసి అనుమానంగా చూస్తూ. 

'స్టేట్ బ్యాంకు నుంచీ వస్తున్నానమ్మా! ఆయన తీసుకున్న లోను విషయం మాట్లాడదామనీ!' అన్నాను. 

అనుకున్నట్లే ఆమె ముఖకవళికల్లో మార్పు వచ్చింది. పొయ్యి మీద నుంచి పెనం ఇవతలకు లాగిపడేసి దాని మీదిన్ని నీళ్ళు చల్లి లేచి 'సారూ! ఒకసారిట్లా లోపలికి వస్తారా?' అని అడిగింది తను లోపలికి పోతూ. నేను ఆమెను అనుసరించాను. బైట నిలబడ్డ ఇద్దరు ముగ్గురు ఆరాగా లోపలికి తొంగిచూస్తున్నారు. పల్లెటూళ్లల్లో అందరికీ అన్నీ కావాలి. 

ఆమె ఒక నులక మంచం వాల్చి నన్ను కూర్చోబెట్టి 'పంతులుగారు ఇప్పుడేడ పనిచేస్తున్నారో నాకూ తెలవదయ్యా! ఆయన ఆ బ్యాంకులోను నా కోసమే తీసుకున్నారు సారూ!' అందామె ఆగి ఆగి ఆలోచిస్తున్నట్లుగా.

ఆ అప్పుకు ఒక్క పైసా జమకాలేదమ్మా! ఇట్లా చేస్తే బ్యాంకువాళ్లు చూస్తూ కూర్చుంటారా? పోలీసు కేసవుతుంది. ముందు నిన్నే అరెస్టు చేస్తారు' అన్నాను బెదిరిస్తున్నట్లు. 

'నన్నెందుకు చేస్తారూ!' అంది బెదిరిపోయి. 

'అప్పు పత్రాల మీద నీ ఫొటోనే కదా ఉందీ! నువ్వు పేరు మార్చి ఆయన భార్యనని మోసం చేస్తే బ్యాంకువాళ్లు చేతులు ముడుచుక్కూర్చుంటారా? బ్యాంకులో తనఖా పెట్టిన కాగితాలు నిజంగా నీవేనా?' అన్నాను స్వరం మరంత పెంచి. 

ఆమె తలవేలాడేసింది. అప్పటి దాకా చిత్రం చూస్తూ నిలబడ్డ శేషారత్నం బిత్తరపోయినట్లు నిలబడిపోయిందో మూల.

'నీ మూలకంగా పంతులుగారిక్కూడా శిక్ష పడుతుంది తెలుసా?' అనగానే అనసూయమ్మ చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ దుఃఖంలోనే ఒక్కో ముక్కా వదులుతోంది. 'పంతులుగారు దేవుడయ్యా! ఆయన్నేం చెయ్యద్దయ్యా! పాపిష్టిదాన్ని, నా వల్లే ఆయనకీ కష్టాలు' అంటూ మధ్య మధ్యలో ఎక్కిళ్లు. 

'అసలేం జరిగిందో వివరంగా చెప్పమ్మా! దాన్ని బట్టే మా బ్యాంకువాళ్లు తీసుకునే చర్య ఉంటుంది' అన్నాను. నాకూ ఇలాగా మరో మనిషిలాగా నటించడం ఇబ్బందిగానే ఉంది. మరేం చేయడం? అసలు విషయం రాబట్టుకునేందుకు మరో దారి తోచలేదు. 

'నువ్వు రంగయ్య కొట్టుకాడికెళ్లి ఇందాక నేను చెప్పిన సరుకులు పట్టించుకు రావే!' అంటూ కూతుర్ని  బైటికి పంపించేసి నిదానంగా చెప్పడం మొదలుపెట్టిందా అనసూయమ్మ.  'కాంతయ్య పంతులుగారు ఈడ స్కూల్లోనే పాఠాలు చెప్పడానికి వచ్చాడయ్యా! కుటుంబాన్ని తేలేదు. నా కాడే టిఫిన్లు.. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు! చాలా మంచాయన. మా కృష్ణానందం ఆయన కాడే చనువుగా తిరుగుతుండేవాడు'

'కృష్ణానందం ఎవరూ? నీ కొడుకా?'

'నాకు కొడుకులు లేరయ్యా! ఉన్నదంతా ఈ ఎతిమతం శేషారత్నమే! వాడు దీని మొగుడు. నా పెనిమిటి రాచపుండొచ్చి పోతా పోతా ఇంటికి మగదిక్కుగా ఉంటాడని ఏడనో ఉన్న ఆడిని తెచ్చి పిల్లదాని మెడకు చుట్టబెట్టాడయ్యా! నా అల్లుడికీ అందరికి మల్లేనే దుబాయ్ పోవాలని పురుగు కుట్టిందయ్యా! కాయితాలకనీ, ఇమానం కర్చులకనీ మొత్తం రెండు లచ్చలు దాకా అవుతాయి. ఇయ్యకపోతే నీ కూతురి మీద  గ్యాసు నూనె పోసి నిప్పంటిస్తా అంటూ రోజూ ఇంట్లో రభసే! ఆడి బాధకు తాళలేక ఇది నిజంగానే ఓ రోజు పుల్లకాలవలో దూకేసింది. మా పంతులుగారే టయానికి ఆడ ఉండబట్టి బైటికీడ్చుకొచ్చాడు. నా కతంతా ఇని ఒంగోలు దాకా తీసుకెళ్లి బ్యాంకులో ఏలుముద్రలు తీయించి రెండు లచ్చలు  ఇప్పించాడు సార్! ఆ డబ్బుతోనే నా అల్లుదు దుబాయ్ పోయింది. అక్కడ సాయబ్బులకాడ పనిచేస్తే బోలెడంత డబ్బొస్తుందంటగా! ఏడాది తిరిగే లోగా అప్పంతా తీర్చేస్తానని నా బిడ్డ మీద ప్రమాణం చేసి మరీ పొయ్యాడయ్యా! సారు బదిలీ మీదెళ్లిపోయాడని తెలిసి ఈడు ఠలాయించదం మొదలుపెట్టాడు. మెల్లంగా మాకు అయిపూ ఆజా లేకుండా ఎళ్లిపొయ్యాడయ్యా! ఎంత విచారణ చేయించినా ఏడ చచ్చాడో తెలీలా.. ఇప్పటి దాకా. పంతులుగారికి మొగం చూపించలేకనే ఇదిగో.. ఇట్లా మూల మూలన నక్కి ఏడవడం' అని రాగాలు మొదలుపెట్టింది. 

శేషారత్నం ఎప్పుడొచ్చిందో.. ఇదంతా వింటూ ఓ మూలన బిక్కుబిక్కుమంటూ గోడక్కరుచుకుని నిలబడివుంది! అప్పుడు చూశాను..  పిల్ల మెళ్లో పసుపు తాడు. నిండా పదిహేనేళ్లయినా నిండని బిడ్డ! మెడలో ఆ తాడు గుదిబండలా  వేలాడుతోంది!


అనసూయమ్మ ఏడుపుకు ఇద్దరు ముగ్గురు మగాళ్లులోపలికొచ్చేశారు. గొడవేమీ కాకముందే మర్యాదగా తప్పుకోడం మంచిదనిపించింది. వస్తూ వస్తూ అనసూయమ్మతో 'పంతులుగారు బస్సు ప్రమాదంలో పోయి మూడు నెల్లయింది.  ఆయనకూ నీకు మల్లేనే ఆస్తి పాస్తులేం లేవు. ఉన్నది ఆ ఉద్యోగం.. మంచివాడన్న పేరు. ఇదిగో నీ కీ పిల్లలాగా ఓ కూతురు, అన్నెం పున్నెం ఎరుగని  ఓ భార్య.. ఆమె తండ్రి ఆమెకిచ్చిన ఆ ఇల్లు. దాన్నే ఆయన నిన్నేదో ఆదుకోవాలని తప్పుడు మార్గంలో  బ్యాంకులో పెట్టినట్లుంది. అది బైట పడితే ఇంటి కన్నా ముందుపోయేది ఇంటి పరువు. ఇంకో నెలరోజుల్లో ఆయన కూతురు పెళ్లుంది. అది ఆగిపోతే ఆ ఉసురు నీకూ, నీ కూతురికే తగిలేది!' అంటూ చేతిలోని శుభలేఖను విసురుగా అక్కడ పారేసి బైటికివచ్చేశాను. 

ఆవేశంలో కాస్త ఎక్కువగానే మాట్లాడేమోననిపించింది తిరిగొచ్చేదారిలో. అప్పటికే నాకూ గుండెల్లో కాస్త నొప్పి నొప్పిగా అనిపించడంతో టాక్సీ చేసుకుని నేరుగా హైదరాబాదొచ్చేశా! అనంతమ్మను కలిసే అవకాశమే లేకపోయింది.


టాక్సీలోనే మూర్ఛరావడం.. డైవర్  సాయంతో ఇల్లుచేరడం! వచ్చీ రాగానే పెద్దాపరేషన్!  కనీసం ఓ నెల్లాళ్ల పాటైనా  మన లోకంలో లేనట్లే గడిచిపోయింది కాలం. 

గుంటూరు విషయాలను గురించి విచారించడానికి గుండె ధైర్యం లేకపోయింది. ఇంట్లో కూడా నా మీద  నిరంతర నిఘా!

***

రెండేళ్ల తరువాత.. 

మా ఆవిడ కీళ్లనొప్పుల ఆపరేషన్ కోసమని నిమ్స్ కి రిఫర్ చేస్తే వెళ్లినప్పుడు ఓ.పిలో రోగులను చూస్తూ కనిపించింది గాయిత్రి. ముందుగా నేను చూసింది ఆమె మెడలో మంగళ సూత్రాలు ఉన్నాయా లేవా అని. ఉన్నాయి. ఎంతో రిలీఫ్ అనిపించింది. 

నన్ను చూసి గుర్తుపట్టి నవ్వు మొగంతో దగ్గరికొచ్చి పలకరించిందా అమ్మాయి 'అంకుల్! బాగున్నారా!' అంటూ. విషయం విని తనే దగ్గరుండి మా ఆవిడ ఆపరేషన్ సజావుగా సాగేందుకు సహకరించింది. వారం తరువాత డిశ్చార్జ్ అవుతున్నప్పుడు 'థేంక్స్' చెప్పడానికి వెళితే 'ఓ సన్ డే ఓపిక చేసుకుని మా ఇంటికి ఆంటీతో సహా లంచ్ కి రావాలి అంకుల్!' అంటూ అడ్రసిచ్చింది. 


ఆ ఆదివారమే మధురానగర్ లోని వాళ్ల ఇంటికి వెళ్ళాం మొగుడూ పెళ్లాలం. ఆ అమ్మాయి భర్త అప్పుడు అనుకున్న ఆర్జెడి మ్యాడం గారబ్బాయే!  గాయత్రికి నిమ్స్ లో పిజి వచ్చిందని చెన్నయ్ లో తాను చేసే ఉద్యోగం రిజైన్ చేసి ఇక్కడే ఇంకేదో కంపెనీలో చేస్తున్నాడని తెలిసింది. ఆర్జెడిగారు రిటైరయి  సొంతూరిలో ఉంటున్నట్లు ఆ అబ్బాయే చెప్పుకొచ్చాడు. 

'అమ్మ బాగుందా తల్లీ!' అనడిగాను గాయత్రిని భోజనాల దగ్గర. 

'తను పోయి రెండేళ్లయిందిగా అంకుల్! మీ కింకా తెలుసేమో అనుకున్నా. పెళ్లింకో పది రోజుల్లో ఉందనంగా గుండెనొప్పొచ్చింది. అందుకే ఆ ముహూర్తం వాయిదాపడ్డం. తరువాత రెండు నెల్లకు మా పెళ్లయింది. అప్పుడున్న టెన్షన్లో మీ లాంటి ముఖ్యమైన నాన్న ఫ్రెండ్సందర్నీ మేం మిస్సయి పోయాం! మీ నెంబరు  కోసం ఎన్నో సార్లు ట్రై చేసినా కలవలేదు’ అంది గాయిత్రి గిల్టీగా. 

‘అంకుల్ బాగా కోలుకున్న దాకా బైటి కనెక్షన్లేవీ పెట్టుకోవద్దని డాక్టర్లు అదే పనిగా  హెచ్చరించారమ్మా! అందుకే నేను సెల్ నెంబర్ మార్పించి కొత్తది నా దగ్గరుంచుకుంది చాలాకాలం' అని ఇప్పుడు బాధపడింది మా శ్రీమతి. 

భోజనాలయి హాల్లో కూర్చున్నాం నేనూ, ఆ అబ్బాయీ! గాయిత్రి మా ఆవిడకు ఇల్లు తిప్పి చూపించడానికి తీసుకువెళ్లింది. ఆ అబ్బాయి అప్పుడన్నాడు 'అంకుల్! మీరు రామన్నపేట వెళ్ళార్ట కదా! మీరక్కడ వదిలేసొచ్చిన శుభలేఖ పట్టుకుని ఓ పదహేను పదాహారేళ్ల పాప మా అమ్మను వెదుక్కుంటూ వచ్చింది. మా మాంగారు వాళ్లమ్మ పేరుతో తీసుకున్న బ్యాంక్ లోను కథా కమామిషంతా చెప్పి బాగా ఏడ్చింది. పెళ్లి ఆపొద్దని కాళ్లావేళ్లా పడ్డంత పనిచేసిందంకుల్ పాపం! 'పంతులుగారు మా అమ్మను ‘చెల్లెమ్మా’ అని పిలిచేవాడని, తానైతే ఎప్పుడూ 'మామయ్యా!' అనే పిలిచేదాన్నని ఎన్ని సార్లు చెప్పుకునేడ్చిందో! చాలా బాధనిపించింది వింటానికి అమ్మకూ నాకూ’ 

కాంతయ్యకు ఒక సొంత చెల్లెలుండేది. మొగుడు కోత భరించలేక అ పిల్ల  తన రెండేళ్ళ పాపతో సహా క్రిష్ణకెనాల్లో దూకేసిందొకానొకప్పుడు. కాంతయ్య బహుశా అనసూయమ్మలో ఆ పోయిన చెల్లెలిని, పాపలో ఈ శేషారత్నాన్ని చూసుకొనుంటాడు!  లేకపోతే పరాయి ఆడమనిషి కష్టం తీర్చేందుకు మరీ అంత దారుణంగా బ్యాంకును, భార్యను మోసగించే  నీచ మనస్తత్వం చస్తే కాదు మా కాంతయ్యది. 


ఆ మాటే ఆ అబ్బాయితో అంటే 'మామగారి మంచితనం గురించి మాకు తెలీదా! అయినా గాయిత్రిని చేసుకుంది  ఆ మంచితనమొక్కటే చూసి  కాదంకుల్ ' అన్నాడు ముసి ముసిగా నవ్వుతూ. 

‘మరి!’

'మా అమ్మదీ పెదగంజామే! మా అత్తగారి పేరనున్న ఆ ఇల్లు గుడి పూజార్ల కోసమని మా ముత్తాతగారు ఏనాడో కట్టిచ్చిచ్చింది. గాయిత్రి ముత్తాత డబ్బు క్కక్కుర్తికి  దాన్నో గౌండ్లకు ధారాదత్తం చేశాడు. దాంట్లో చాలా ఏళ్ల బట్టి ఓ కల్లు దుకాణం  నడుస్తుందని విన్నప్పుడల్లా తాతగారి వ్యథ వర్ణనాతీతం. ఎట్లాగైనా తిరిగి ఆ ఇంటిని స్వాధీనపరుచుకుని మరేదైనా మంచి పనికి వినియోగించాలని మా అమ్మ పంతం. ఆ సమయంలోనే   గాయత్రి సంబంధం తటస్థించింది. అమ్మాయి మాకు వేరే అన్నిరకాలుగా నచ్చిందనుకున్న తరువాత ఏమైనా ఇక వెనక్కు వెళ్లకూడదనే అనుకున్నాం. ఆ అట్లుపోసుకునే మనిషెవరో నేరుగా మా దగ్గరికే వచ్చేసుంటే సమస్యుండేది కాదు. గుట్టుచప్పుడుగా లోను మేమే తీర్చేసి అత్తగారి దాకా  అసలా  విషయమే పోకుండా జాగ్రత్తపడేవాళ్లం. ఆ అట్లుపోసుకునే మనిషి నేరుగా తన దగ్గరికే వచ్చేయడంతో విషయం సరిగ్గా అర్థం కాకో.. ఏమో..  వత్తిడి తట్టుకోలేక   ప్రాణం  మీదకు తెచ్చుకున్నారు అత్తగారు. ముహూర్తం  వాయిదా పడింది ఆ దుర్ఘటన వల్లయితే.. అందుక్కారణం లేని  తన మొగుడు తీర్చని బాకీ  అనుకుంది    ఈ పిచ్చి పిల్ల. పేరేంటన్నారూ?' 

'శేషారత్నం..' వెంటనే అందించాను.  పేరే కాదు.. అమాయకపు చూపులతో ఆడుతూ పాడుతూ తిరిగాల్సిన వయస్సులో  పసుపుతాడు గుదిబండలా మోసే   ఆ పిచ్చి తల్లి రూపు  అప్పుడే మనస్సులో ఎందుకో గట్టిగా అచ్చుపడి ఉంది.  

'ఆఁ.. ఆ శేషారత్నం ఇంకెవరో పెద్దాయన్ను వెంటేసుకుని డబ్బు సంచీతో సహా వచ్చిందో పూట మా ఇంటికి మళ్లీ.. బ్యాంకు లోను వెంటనే తీర్చేసెయ్యమని.. అక్కతో పెళ్లి మాత్రం ఆపొద్దని ఒకటే ఏడుపు. అప్పటికే బ్యాంకు లోను గాయిత్రి చేత  కట్టించి ఇంటిని స్వాధీనం చేసుకునుంది మా అమ్మ. తనిప్పుడు అక్కడే ఉండటం! దిక్కూ మొక్కూ లేని ఆడపిల్లలకూ ఓ దారీ తెన్నూ దొరికే వరకూ దగ్గరుండి ఏదైనా ఓ ఉపాధి కల్పించే కళలో శిక్షణ ఇచ్చే సెంటర్ నడిపిస్తోంది!'  

'మా సిస్టర్  శేషారత్నం కూడా ఇప్పుడు అక్కడే శిక్షణ పొందడం' అంది అప్పుడే లోపలికొచ్చిన గాయత్రి చిన్నగా నవ్వుతూ. 

'శేషారత్నానికి తల్లి ఉంది కదా!' ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయాను. 

'ఆ అట్లుపోసే మనిషి అట్లుపోసి అమ్మినంత సులువుగా వంట్లోని కిడ్నీని కూడా అమ్మేసిందంకుల్! శేషారత్నం ఆ పూట పట్టుకొచ్చి ఇవ్వబోయిన సొమ్ము ఆ కిడ్నీ సొమ్ము తాలూకే! ఆ తరువాత ఇన్ఫెక్షనొచ్చి ఆమె చనిపోయింది. ఆ సంగత్తెలిసి గాయత్రి బలవంతంగా ఆ తల్లిలేని పిల్లను తెచ్చి అమ్మ నడిపే వెల్ఫేర్ సెంటర్లో  పడేసింది' అన్నాడు గాయిత్రి భర్త భార్యవైపు చూసి నవ్వుతూ చూసి.

***

-కర్లపాలెం హనుమంతరావు

(కౌముది/రచన - పత్రికల్లో ప్రచురితం)

 ***  

 

 

 

   

   


Monday, February 15, 2021

' ఛుక్‌ ఛుక్‌ రైలు ' - కథానిక - కర్లపాలెం హనుమంతరావు - కథానిక - రచన కథాపేఠం పురస్కారం


 

ఒక ప్రముఖ చినపిల్లల మాసపత్రికవాళ్ళు ఆ సంవత్సరం బాలల దిఓత్సవం సందర్భంగా గేయ కథల పోటీ నిర్వహిస్తున్నార్రు.సెలెక్షన్ కమిటీలో నేనూ ఒక మెంబర్ని.

దాదాపు మూడువందల ఎంట్రీలు వచ్చాయి. మొదటి వడపోతలో ఒక వందదాకా పోయినా.. ఇంకా రెండువందలవరకు మిగిలాయి.

పిల్లలకోసం ఇంతమంది రాసేవాళ్ళు ఉన్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపించినవాళ్ళలో లబ్దప్రతిష్ఠులూ ఉండటం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింతగొలిపే విషయమేమిటంటే కొత్తగా రాస్తున్నవాళ్లలో కొంతమంది ఎంతో చురుకుగా రాసారు! నిజానికి ప్రముఖుల రచనలకన్నా అవి ఎందులోనూ తీసిపోవు. కొన్నయితే మిగిలిన వాటికన్నా  బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమయింది. మొత్తంమీద అందరం కలసి కూర్చుని అన్ని కోణాల్లోనూ పరిశీలించి  ఫైనల్గా ఒక పది రచనలను ఎంపిక చేసాం. వాటిలో ఒకటి, రెండు, మూడు బహుమతుల ఎన్నికను సంపాదకులకే వదిలేసాం. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోవచ్చని సలహా ఇచ్చాం. అట్లాంటీ సాధారణ ప్రచురణకు ఎన్నికైనదే 'ఛుక్ ఛుక్ రైలు'. గేయ రచయిత సి. ఆంహనేయులు, దేశాయిపేట.

దేశాయిపేట మా ఊరికి దగ్గర్లోనే ఉంటంది. మా ఊర్లో హైస్కూలున్నా దేశాయిపేటలో చదువు బాగుంటుందని మా నాన్న ఎస్సెల్సీలో  నన్ను అక్కడ చేర్చాడు. నాకెప్పుడూ ఫస్టు ర్యాంకే వస్తుండేది. క్లాసులో కృష్ణగాడికి రెండో ర్యాంకు. వాడి అన్నయ్యే ఆంజనేయులు.

ఆంజనేయుల్ని చూస్తే మాకు ఎడ్మైరింగుగా ఉండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కొరుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. సోషల్ సబ్జెక్టులో సంవత్సరాలు, యుద్ధాలూ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అదే పనిగా బటీ పడుతుంటే.. అలా చేయడం తప్పనీ.. గుర్తు పెట్టుకోవడానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు 'రిటెన్షన్ ఆఫ్ మెమరీ పవర్' అనే 

టెక్నిక్కు ఆన్ లైన్లో కోచింగ్ తీసుకొంటున్నారు. అందులో చెప్పిన సూత్రాల్లో కొన్ని నలభై ఏళ్లకిందట ఆంజనేయులు చెప్పినవే! అతఏమీ కోర్సులు చదువుకోలేదు. వాళ్ల నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్లకంత స్తోమతూ లేదు.

కృష్ణగాడితో కంబన్డు స్టడీసుకని నేను వాళ్ళింటికి వెళుతుండేవాణ్ని. ఆంజనేయులుకి ఇంకా చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారుచేసెవాడు. రంగుపెన్సిళ్లతో బ్రహ్మాండంగా బొమ్మలేసేవాడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తపని చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. చేయడానికేమీ లేదనుకొన్న రోజున పేపరూ, పెన్నూ పటుకుని కూర్చునేవాడు. కథలు రాసేవాడు.కవితలల్లి వినిపించేవాడు. మా స్కూలు యానివర్సిరీకీ మా కోసం ఒక హాస్యనాటిక రాసి తనే డైరెక్టు చేసి మెప్పించాడు.గ్రీన్ రూంలో మాకు మేకప్ చేసిందికూడా ఆంజనేయులే. ఆ మేకప్ సామాను స్వయంగా తయారు చేసుకొన్నాడు. 

 మాఅన్నయ్య అమెరికాలో పుట్టివుంటే చాలా గొప్పవాడయివుండేవాడు' అంటుండేవాడు కృష్ణ ఎప్పుడూ.

అమెరికా సంగతేమోగాని.. ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తరువాత అతను చాలా మంచిపేరు తెచ్చుకొంటాడు అనుకొనేవాళ్లం. కానీ అతనికి చపలత్వం ఉండేది. ఏ పనీ స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో ఆడుకొనేవాడు. ఆటలాడుకోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండేవాడు. ఊళ్ళో వాళ్లెంత మెచ్చుకొంటున్నా ఇంట్లోవాళ్లచేత తిట్లు తింటుండేవాడందుకే. కృష్ణకున్న స్థిమితంలో పాతికోవంతు  ఆంజనేయులుకున్నా నిజంగా చాలా మంచిపేరు తెచ్చుకొనుండేవాడే.

నేను డిగ్రీ చదువులకని మా తాతగారి ఊరికెళ్ళిపోయిన తరువాత ఆంజనేయులు సంగతేమయిందో పట్టించుకోలేదు.

 

నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజుల్లో ఓ రోజు ఆంజనేయులు నన్ను వెదుక్కొంటూ వచ్చాడు. వయసు అతనిలో ఆట్టె మార్పు తీసుకురాలేదు. కూర్చున్న పదినిమిషాల్లో వంద విషయాలను గురించి మాట్లాడాడు. మనది వాస్తవంగా లౌకిక ప్రజాస్వామ్యమేనా? అన్న అంశంనుంచి.. పారలల్ సినిమా వరకు.. అన్ని అంశాలమీద అడక్కుండానే  సుబ్బారావు. చనువున్నవాళ్లు సుబ్బు అంటారు. ఆంజనేయులికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం.

అతను ఇచ్చిన కథ ఎడిటరుగారికి నచ్చింది. 

ప్రచురించబడిన తరువాత నేనే అతనికి స్వయంగా కబురు చేసాను. ముందు ముందు ఇంకా మంచి కథలు రాస్తుండమని సలహాకూడా ఇచ్చాను.

రెండు నెలల తరువాత ఒక నవల పంపించాడు. బాగుంది. కొద్దిమార్పులతో ప్రచురించడానికి అంగీకారమయింది. 

క్రమంగా ఆంజనేయులు రచయితగా మిగతా పత్రికల్లోకూడా కనిపించడం మొదలుపెట్టాడు.

రేడియోలో అతను రాసిన  నాటకాలూ రావడం మొదలుపెట్టాయి.

కవి సమ్మేళనాల్లో అక్కడక్కడా కనపడుతుండేవాడు. 

ఒక నాటకపరిషత్తులో పోటీ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 'రివ్యూ'కోసం పత్రిక తరుఫున నేనే హాజరవుతున్నాను. రెండో రోజున భుజాన వేళ్లాడే సంచీతో  ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేట నుంచి  నాటకం తయారు చేసుకొచ్చాట్ట! అక్కడికి దగ్గర్లోనే ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాటకం బాగా పండింది. ఆంజనేయులు మూగవాడిపాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం అతనిదే. రచన సంగతి  సరేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులికి దక్కింది. 'అందుకేనన్న మాట ఈ మధ్య పత్రికల్లో ఎక్కువగా కనిపించడం లేదు' అన్నాను అతన్ని అభినందిస్తూ. 

చిన్నగా నవ్వాడు ఆంజనేయులు 'సుబ్బూ! ఒకసారి నువ్వు మా ఊరు రావాలి!' అన్నాడు.

'ఏమిటీ విశేషం?'

'అఖిల భారత స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాం. నువ్వూ ఒక జడ్జిగా ఉంటే బాగుంటుంది'

'అమ్మో! పాటల గురించి  నాకు ఏబిసిడిలు కూడా తెలీవన్నా!'

మేమందరం ఆంజనేయుల్ని 'అన్నా' అనే పిల్చేవాళ్లం కృష్ణతోపాటే.

'అలాంటివాళ్ళే నిజమైన న్యాయనిర్ణేతలవుతారు. నీకెందుకు నువ్వు రా!' అంటూ అడ్రసూ డేటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. 

ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న ఊరే అయినా ఆంజనేయులు  టీచరుగా వెళ్ళిన తరువాత  ఊరు పరిస్థితుల్లో చాలా మంచి మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడి జనం. ముఖ్యంగా కుర్రకారులో అతనికి మంచి ఫాలోయింగుంది. పెద్దవాళ్లలో గౌరవమూ ఉంది. పిల్లకాయల పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు పెద్దవాళ్ళు. ఊరిపెద్దల సహకారం లేనిదే అంత పెద్ద కార్యక్రమం చెయ్యడం బైటివాళ్లకు సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ ఊళ్లో ఆంజనేయులు మరో అవతారం చూడగలిగాను. అప్పటి దాకా  చూడని అవతారం.. సోషల్ వర్కర్ అవతారం!

ఊళ్లో ఉచితవైద్యం చేస్తున్నాడు. అందుకోసం పుస్తకాలు తెప్పించుకొని చదువుతున్నాడు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేయడం నేరం కదా  అనడిగితే కలకత్తా బ్రాండ్ 'ఆర్ ఎం పి' సర్టిఫికేట్ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం సేవే. లాభార్జన కాదు. చిన్న చిన్న రోగాలకే వైద్యం చేస్తున్నది.. ఉచితంగా. 'కొద్దిగా కాంప్లికేటేడ్ గా ఉన్నా పట్నం పొమ్మంటా' అన్నాడు ఆంజనేయులు. 

ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయం కూడా  పెట్టించాడు. 

అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరిసమస్యలని పరిష్కరించే విధానం. బోరింగుల్లోకి నీరు రాకపోయినా, వీధిదీపాలు వెలక్కపోయినా, వినాయక చవితి, శ్రీరామనవమిలాంటి పండుగలకి ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నా, పంచాయితీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిగ్గా  అందరిముందు చర్చించుకొనే అలవాటు చేయించాడు. ఆంజనేయులు ఒక్క టీచరే కాదు.. ఊరి పెద్దల్లో ఒకడూ ముఖ్యుడూ అయికూర్చున్నాడు.

'ఇన్నిపనులు చెయ్యటానికి నీకు టైమెక్కడిదన్నా?' అనడిగాను ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు. 

'ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. నువ్వైనా చెప్పు బాబూ! ఆరోగ్యం సంగతి చూసుకోవద్దూ !' అంది ఆంజనేయులు భార్య,

ఆమె కంప్లయింటు సమంజసమైందే అనిపించింది. కానీ నేను ఆంజనేయులుకి చెప్పేటంతటివాడినా!

'ఇప్పుడంటే ఫరవాలేదు. ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చిన తరువాత  కూడా తిరుగుతానంటే ఎట్లా?' అందామె.

'అప్పటి సంగతి చూద్దాంలేవోయ్  !' అని నవ్వి ఊరుకొన్నాడు ఆంజనేయులు.

అప్పటికి ఆంజనేయులు భార్య గర్భంతో ఉంది. అదీ ఆవిడ భయం.

ఆంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామె 'నువ్వూ మా కృష్ణలాంటివాడివే బాబూ! నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి నేను? వినేందుకు ఎవరున్నారు గనక! నన్ను చేసుకొన్నారని ఆయన్ని వాళ్ల వాళ్లు వెలేసినంత పని చేసారు. ఎవరూ ఇటువైపు రారు. మా వాళ్లు మరీ మొరటువాళ్లు' అని కన్నీళ్లు పెట్టుకొందావిడ.

ఆంజనేయులు ఇంతకుముందు పనిచేసిన ఊళ్ళోనే ఈ పెళ్ళి చేసుకొన్నాడు. కులాంతర  వివాహం. ఎవరు వారించినా వినకుండా చేసుకొన్నాట్ట! ఆయన బ్రాహ్మడు. ఈవిడది షెడ్యూల్డ్ కులం. ఇరువైపుల పెద్దలకూ ఈ వివాహం ఇష్టంలేకపోయింది. ఆ ఊళ్లోవాళ్ల బాధపడలేకే ఇక్కడికి బదిలీ చేయించుకొన్నాడు ఆంజనేయులు.

ఆంజనేయులు కులాంతర వివాహాలను గురించి కొన్ని కథలు రాసాడు. తను రాసిందే   ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేట్! ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకొన్నాను ఆ క్షణంలో.

 తరువాత నేను ఉద్యోగం మారి ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే దాదాపు మూడు దశాబ్దాలు ఉండిపోయాను. పెల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్లయిపోయారు. మధ్య మధ్యలో ఆంధ్రా వస్తున్నప్పుడు ఆంజనేయుల్ని గురించి వాకబు చేస్తుండేవాణ్ణి. ఉద్యోగాల రీత్యా అతనెక్కడెక్కడో ఉంటుండేవాడు. ప్రతిసారి ఏదో కొత్త ఆడ్రసు చెప్పేవాళ్ళు.

ఒకసారతన్ని మాచర్లలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లలు. పెద్దది పాప. సెకండ్ క్లాసు. రెండో వాడు యూ.కె.జి. చాలా చురుకుగా ఉన్నారిద్ద్దరూ. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీషులో  రైమ్సు.. తెలుగులో పద్యాలు గడ గడ చదివేస్తున్నారు. పిల్లలిద్దర్నీ డ్యాన్సు స్కూల్లో చేర్పించారు. 

'మైత్రికి పెయింటింగ్ కాంపిటీషన్లో టౌన్ మొత్తానికీ ఫస్టొచ్చింది.  ఇదిగో ప్రైజ్. చిన్నాడుకూడా చిచ్చర పిడుగే. వీడికీ సీతారామరాజు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్లో ప్రయిజొచ్చింది. సంగీత్సం కూడా  నేర్పించాలని ఉంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే!' అన్నాడాంజనేయులు.  అక్కడున్నంత సేపూ మొగుడూ పెళ్ళాలు తమ పిల్లల్ని గురించే మాట్లాడారు. 

'నువ్వేమన్నా వేరే ఏక్టివిటీస్ చేస్తున్నావా అన్నా?' అనడిగాను.

లోపలికి వెళ్లి ఓక ఫోటో ఆల్బమ్, రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు. అల్బంనిండా వాళ్ళ పిల్లల ఫోటోలే, రకరకాల భంగిమల్లో.. రకరకాల చోట్ల తీసినవి.

'వీళ్ళకోసం ఫొటోగ్రఫీ నేర్చుకొంటున్నాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే!.. బాగున్నాయా?' అనడిగాడు.

నిజంగా ఫోటోలు బాగా వచ్చాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తీసిన స్థాయుకి ఏమాతం తగ్గవు అవి. ఆంజనెయులు చెయ్యి ఎందులో పడినా అంతే! బంగారం! అందులోనుంచి మచివి రెండు ఏరి ఇచ్చాడు. 'నీకు తెలిసిన పత్రికలు వీలుంటే వేయించు' అన్నాదు.

'పాటలు  రాశాను కొన్ని.  బాలల గేయాలు.. గేయ కథలు ఉన్నాయనుకో! మా పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి నోరు తిరిగే    రీతిలో బాణీలు కట్టి రాసినవి. మైత్రీ! ఒక పాట పాడమ్మా! 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాట అందుకొని దాదాపు ఐదారునిమిషాలు ఆపకుడా పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లవాడు అక్కకు తోడుగా గొంతు కలపడం..!

'వీళ్ళు పాడే పాటలన్నీ నేను రాసినవే. వీళ్లకోసమే రాసాను. వీటిని కేసెట్టుల్లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తయేమో చూడు!'  అంటూ కేసెట్టూ.. పుస్తకమూ అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న రెండుగంటలూ ఆంజనేయులు తన పిల్లల్నిగురించి తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్ లోకి వెళితే ఆయన భార్య   సవరించేది. వాళ్ల ప్రపంచమంతా ప్రస్తుతం ఆ ఇద్దరి పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే ఉంది. 

'తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు' అనిపించిందా  క్షణంలో. 

నాకు పరిచయమున్న పత్రికకు అతనిచ్చిన ఫొటోలు, గేయాలు పంపించాను. రెండు ప్రచురించారు. మంచి స్పందనా వచ్చిందని చెప్పారు. 

'పిల్లల శీర్షికలకన్నా రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేయమ'ని ఎంకరేజింగ్ గా సలహా ఇస్తూ ఆంజనేయులకి ఉత్తరం రాసాను.

కొన్నేళ్ళు ఆంజనేయులు రెగ్యులర్ గా రచనలు పంపించాడుట. 'మంచి క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ అండ్ ఒరిజినల్' అని మెచ్చుకొన్నారు ఎడిటరుగారు నేనొకసారి ఆయన్ని కలిసినప్పుడు. '.. కానీ ఈ మధ్య ఏవో కామిక్సు పంపిస్తున్నాడు. అవి అంత ఒరిజినల్ కాదు. అయినా ఫరవాలేదనుకొని కొన్ని ప్రచురిస్తున్నాం' అన్నాడాయన. అంటే ఆంజనేయల  పిల్లలు హైస్కూలు చదువులకు వచ్చారన్నమాట..' అనుకొన్నాను, 'ఇంకొద్దికాలంపోతె ఇవీ రాయడు చూడండి! సస్పెన్సు.. క్రయిం  థిల్లర్ టైపు నవలలొస్తాయి' అన్నాను ఆ ఎడిటరు మిత్రునితో.

మరో ఐదేళ్ళ తరువాగ్త ఆ మిత్రుడు ఓ పెళ్ళిఫంక్షనులో కలిసాడు. ఆ

 మాటా ఈ మాటా అయిన తరువాత టాపిక్ నవలలమీదకు మళ్ళింది. 

'అన్నట్లు.. మర్చిపోయా!.. మన ఆంజనేయులు ఈ మధ్య ఒక క్రైం థిల్లర్ పట్టుకొచ్చాడు. అగాథ క్రిస్టీకి నకలుగా ఉందది. అతని దగ్గర్నుంచి రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రిక్కూ, అతనిక్కూడా  ప్రేరు పోతుంది. చూస్తాలే.. అని పక్కన పెట్టేసాను' అన్నాడు. 

ఈ మలుపు నేనూహించిందే అయినా.. ప్రాణం ఉసూరుమంది. ఆంజనేయుల్లో ఎంత టేలెంటుంది! ఎంత వెర్సటాలిటీ ఉంది!  ఏమయిందా ప్రతిభంతా?!

తరువాత కొంతకాలానికి ఆంధ్రా వైపొచ్చానుగాని.. పని వత్తిడివల్ల అతన్ని కలుసుకోవడానికి కుదరలేదు.  

తరువాత ఎప్పుడో అనుకోకుండా ఓ పెళ్ళిలో కృష్ణ కలిసాడు. చాలా ఏళ్ల తరువాత కలుసుకొన్నాం. గంటలకొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగడం లేదు.

'ఇట్లా కాదు.. ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా!' అని బలవంతాన ఇంటికి తీసుకువచ్చాను మర్నాడు. రాత్రి భోజనాలయిన తరువాత ఇద్దరం డాబామీద  కూర్చొని కబుర్లలో పడ్డాం. టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయులుదగ్గరికొచ్చి ఆగింది. 

నేనే అన్నాను 'మీ అన్నయ్య నిజంగా ఎంత టేలెంటు ఉన్నవాడూ! సిన్సియర్! కులాంతర వివాహం చేసుకొన్నాడని మీరంతా ఆయన్ని దూరం పెట్టడం ఏం బాలేదురా! ఇంట్లో వాళ్లంతా వెలి వేస్తే   ఆ లోటు పూడ్చుకోడానికి ఆ రోజుల్లో అతను చేసిన సోషల్ సర్వీసు అపూర్వం.  అట్లాంటివాడు పిల్లలు పుట్టేసరికి అప్పటివరకూ తాను సేవించిన సొసైటీనికూడా పూర్తిగా మర్చిపోయి .. ఆ పిల్లలలోకంలోకి వెళ్ళిపోయాడు!..  ఎంత విచిత్రమైన మనిషో!

కృష్ణ అందుకొని మిగతా భాగం పూర్తిచేసాడు '.. అన్నయంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే ఉండేది. వేరే కులం పిల్లని చేసుకొన్నాడని ఇంత్లో వెలేయకపోతే చెల్లెళ్లకు పెళ్ళిళ్ళవడం కష్టమయేదిరా! ..పోనీ అక్కడన్నా స్థిరంగా ఉన్నాడా అంటే..  అదీ లేదు. నువ్వు చెప్పిందీ నిజమే ! పిల్లలే లోకంగా మసిలేవాడు. వాళ్లమీదే ఆశలన్నీ పెట్టుకొన్నాడు. వాళ్ళకోసమే తను ఇంతకాలంగా ప్రేమించి పెంచుకొన్న కెరియర్ని కాదని కాలదన్నుకొన్నాడు. కానీ.. చివరికేమైందీ!..'

'ఏమైందీ?!' నా మనసేదో కీడు శంకింస్తోంది.

'కూతురు  అమెరికా పోయి తనలాగే వేరే దేశంవాడిని పెళ్ళి చేసుకొంది. సంబంధాల్లేవు  . కొడుకిక్కడే ఉన్నాడుగానీ.. తండ్రిపొడ గిట్టదు. తాను కోరుకొన్న కోర్సులో  చేర్పించలేదని అలిగి ఇంట్లోనుంచి వెళ్ళిపోతే వెదికి తెచ్చుకొన్నాడా ఉద్ధారకుణ్ణి. ఉన్నదంతా వాడి చదువులకు సమర్పించుకొన్నాడు. చివర్రోజుల్లో బికారిగా మారాడు. వదిన చచ్చిపోయింది. కొడుకూ కోడలే ఆధారం ఇప్పుడు. వాళ్ళు చీదరించుకొంటున్నా పడుండక తప్పని దౌర్భాగ్యం'

'మరి ఈ మధ్య ఏదో గేయం చూసానే! ఏదో పోటీకి పంపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా. 

'పంపే ఉంటాడులే! కొడుకూ, కోడలూ ఉద్యోగాలకు వెళుతున్నారుగదా! పసిపిల్లల్ని వీడి మీద  పడేసి  పోతున్నారు. ఆ పసివాళ్లకోసం  పాటలూ.. గట్రా ఏవన్నా  కడుతున్నాడేమో మళ్ళీ! అదేగా వాడి బలం.. బలహీనతా!' అన్నాడు కృష్ణ   


'శాపవశాన తన శక్తి తనకు తెలీని హనుమంతునివంటి వాడు ఆంజనేయులు. జాంబవంతుడికా  శాపం తెలుసు. కనకనే రామాయణ ధర్మకార్యానికి అతన్ని యుక్తియుక్తంగా ఉపయోగించుకొన్నాడు. అసమాన ప్రతిభా సామర్థ్యాలున్న ఆంజనేయుల్లాంటి వాళ్లను సద్వినియోగించుకొనే జాంబవంతులు సమాజంలో, వ్యవస్థలో క్రమంగా  తరిగి పోతుండమే ప్రస్తుతం పెను విషాదం' అనిపించింది నాకు..


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్ఎ 


***

( ' అడుగో ఆంజనేయులు ! జాంబవంతుడెక్కడ ? ' పేరుతో రచన మాస పత్రిక  2003- ఫిబ్రవరి- 'కథాపీఠం' పురస్కారం; 

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము- తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వారు శీ తారణ ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన  'తెలుగు వెలుగు' 

లో ప్రచురితం)

 

 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...