Tuesday, July 14, 2015

అమ్మభాషకు జేజేలు- వ్యాసం


మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఆదివారం అనుబంధ సంచిక కోసం శ్రీ. కర్లపాలెం హనుమంతరావు రాసిన ప్రత్యేక వ్యాసం ఇది. మన తల్లి భాష మీద చూపించవలసిన బాధ్యతను మరోసారి మనకు గుర్తుచేస్తోంది. చదవండి!


కనిపించుట లేదు పేరు: తెలుగు
వయసు: క్రీస్తుపూర్వం నాటిదని చెబుతారు.
ముద్దుపేర్లు: జాను తెలుగు, తేనె తెలుగు
 గుర్తులు: ముద్దుగా, బొద్దుగా ఉంటుంది. తలకట్టు’ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రాచినభాష హోదా’ అనే
 కొత్తగౌను తొడుక్కుంది.

చిట్టితల్లీ! నువ్వెక్కడున్నా సరే, మాతృభాషా దినోత్సవం నాటికి తిరిగొచ్చెయ్‌. ఇకనుంచి నిన్ను చులకనగా చూడం. ఐ నెవర్‌ స్పీక్‌ ఇన్‌ టెల్గు’ బోర్డు తగిలించి బాధపెట్టం. నీ రాతలే రాస్తాం. నీ మాటలే మాట్లాడతాం. నీ పాటలే పాడతాం. నిన్ను కాపాడుకునే పూచి మాది”
ఆచూకీ తెలపాల్సిన చిరునామా:
ఆదికవి నన్నయ విగ్రహం, ట్యాంక్‌బండ్‌, హైదరాబాద్‌.

బిడ్డ భూమ్మీద పడగానే ముందుగా కనిపించేది అమ్మ వెుహమే. ముందుగా వినిపించేది అమ్మ మాటే. ముందుగా పలికేది అమ్మ…’ అనే కమ్మని పలుకే. అందుకే అది అమ్మభాష అయింది. బిడ్డ ఎదుగుదలకు అమ్మపాలెంత అవసరవో, వికాసానికి అమ్మభాషంత ముఖ్యం! మానసిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన మాట ఇది.
ఏ భాష అయినా మాతృభాష తర్వాతే
ఏ మాట అయినా తెలుగుమాట తర్వాతే.

శతాబ్దాల నాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటికే శాతవాహన చక్రవర్తి హాలుడు తన గాథాసప్తశతి’లో తెలుగు పదాలు ప్రయోగించాడు. ప్రపంచ కథానికల్లో మొట్టమొదటిది, గుణాఢ్యుడు రాసిన తెలుగు కథే. తెలుగు భాషలో ప్రతి ఉఛ్చారణకి ఓ ప్రత్యేకాక్షరం ఉంది. పదం చివరలో అచ్చులు చేర్చుకునే సులువుండటం వల్ల ఏ భాషాపదాన్నయినా ఇట్టే సొంతం చేసుకోగల సత్తా ఉంది. అందుకే ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అని ఆకాశానికెత్తేశారు హాల్డెన్‌ దొరగారు. సుందర తెనుంగై’ అని తెగ మెచ్చుకున్నారు తమిళకవి సుబ్రహ్మణ్యభారతి. అప్పయ్యదీక్షితులైతే తెలుగువాడిగా పుట్టనందుకు జీవితాంతం చింతించారు. ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ… నాల్పస్య తపసఃఫలమ్‌’ అంటూ తనకుతాను సర్దిచెప్పుకున్నారు. నిజమే మరి, తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు.




నేనూ నా గోదాదేవీ శ్రీరంగంలో పెళ్లాడిన కథను నా తెలుగుభాషలో చక్కని ప్రబంధంగా రాయవయ్యా. నామట్టుకునాకు, అంతకు మించిన సంతోషకరమైన విషయం మరొకటుండదు’ అని రాయలవారిని పురమాయించాడట ఆంధ్రమహావిష్ణువు. తెలుగులోనే ఎందుకంటావా? ఇది తెలుగుదేశం. నేను తెలుగు వల్లభుడిని. తెలుగు తీపిలో కలకండ. నీ కొలువులోని సామంతులు పలురకాల భాషలు మాట్లాడుతుంటారు కదా! ఆ దేశభాషలన్నిట్లోకీ తెలుగు మాత్రమే లెస్స అన్న విషయం నీకూ అనుభవేకవేద్యమే అయుండాలి! అని ఆంధ్రవిష్ణువు కలలో కనిపించి తనకు చెప్పాడని ఆముక్తమాల్యద పీఠికలో రాయలవారు స్వయంగా రాసుకున్నారు.

ఆంధ్రమహావిష్ణువుకున్న మాతృభాషాభిమానం, ఆంధ్రుల్లో మాత్రం కొరవడుతోంది. ఓనమాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కిరావే…గోగుపూలు తేవే’ అంటూ చంకలోని చంటిపిల్లకు గోరుముద్దలు మింగిస్తూ తెలుగింటి అమ్మ కమ్మగా పాడే ఆ తెలుగు పాటలు కొండెక్కిపోయే రోజులు ఇంకెంతోదూరంలో లేవు. అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు…’ అంటూ ఆరుబయట వెన్నెల్లో పడుకుని నాన్న చిన్నాడికి చెప్పే తెలుగు కథలు నిజంగానే కంచికెళ్లిపోయే రోజులు దాపురించాయి. అమ్మ మమ్మీగా మారిపోయింది. నాన్న’ అనే తియ్యటి పిలుపు డాడీ ముందు అటకమీద జాడీలా వెురటుగా అనిపిస్తోంది. ఆంటీఅంకుల్‌ కల్చర్‌ తెలుగుతోటకూ అంటుకుంది. ఆ ఏబీసీడీల వేడికి తెలుగు పలుకుబడి మాడిమసయిపోయే ప్రమాదముంది. మేలుకోండి, మేలుకోండ’ని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం శతవిధాలా హెచ్చరిస్తోంది. దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. ఈ మెకాలే మానసపుత్రులకు తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే. ఒకటో తరగతి బుడతడి భుజం మీదున్న బండెడు పుస్తకాల్లో తెలుగు పుస్తకం ఒక్కటంటే ఒక్కటన్నా ఉంటుందా, చూడండి!
అరటిపండు…
పూలరథం…
ఏకదంతం…
అంటూ కమ్మని తెలుగు పదాలను పసిపిల్లలందరూ కలిసి బిగ్గరగా చదివే పాఠశాలలు ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా అరుదుగా తప్ప కనిపించటం లేదు. తెలుగుమాధ్యమంలో చదువుకునే విద్యార్థులు ద్వితీయ స్థాయి విద్యార్థుల కింద లెక్క. పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, చీలిన రెండు రాష్ట్రాలలోకూడా తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.
యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దదిగా మన్ననలందుకుంటున్నా, ఆ తెలుగు ముక్కలు మనకు పులుసులో ముక్కలకింద కూడా పనికిరావడం లేదిప్పుడు! కూరగాయల అంగళ్ల నుంచి స్కూలు పిల్లల పుస్తకాలమ్మే దుకాణాల దాకా అన్నీ ఇంగ్లీషు బోర్డులాయెు. తాటికాయంత ఆంగ్లాక్షరాల కింద చిమతలకాయంత తెలుగు ముక్కలు గిలుకుతున్నారాయ! తెలుగు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్లో కూడా తెలుగు సంతకాలు చేసే అలవాటు లేదాయ!

తెలుగు సినిమాలూ, తెలుగు ఛానళ్ల సంగతి చెప్పేదేముంది? ప్రతి రాష్ట్రానికీ ఆ రాష్ట్ర భాషే అధికార భాషగా ఉండాలి. పరిపాలనా వ్యవహారాలన్నీ ప్రజల భాషలోనే జరగాలి. దేశం వెుత్తానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ రాష్ట్రంగా ఉండాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభిలషించారు. కానీ ఆ మాట నిజమయ్యే పరిస్థితులు దరిదాపుల్లో లేవు.

రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. మరో మూడేళ్ల తర్వాత కానీ తెలుగు అకాడమీని (మధ్యలో ఈ అకాడమీ’ ఎందుకో. హాయిగా ఏ 'తెలుగు విద్యాపీఠం' అని పిలుచుకోవచ్చుగా) స్థాపించుకోలేకపోయాం. రాష్ట్ర రాజధాని నడిబొడ్డునున్న తెలుగుతల్లి విగ్రహం మీద తెలుగక్షరాలు చెక్కించుకోడానికి ఉద్యమం చేయాలా? దేశం వెుత్తంమీద హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష మన తెలుగే!

అరణ్యవాసంలో కందమూలాలు తవ్వుతున్న శ్రీరాముడికి ఓ కప్ప ఏడుస్తూ కనిపించిందట. నీ దుఃఖానికి కారణం ఏమిటి? అనడిగాడు రాముడు. దుంపల కోసం గుంతలు తవ్వుకునే ఓ మనిషి నా గుడ్లను అమానుషంగా చిదిమిపారేశాడు స్వామీ! అని చెప్పింది కప్ప. అయ్యో! రామా!' అని పిలిస్తే, నేనొచ్చి కాపాడేవాడిని కదా’ అని అనునయించబోయాడు రాముడు. ఆపద వచ్చింది ఆ రాముడివల్లే స్వామీ. ఇక నన్ను కాపాడేవారెవరుంటారు? అందిట కప్ప. మన పాలకుల తీరూ చట్టసభల పరిస్థితీ అచ్చంగా అలానే ఉంది. ఇరుగుపొరుగు రాష్ట్రాలే కాస్త నయం. సినిమాలకు తమిళ పేర్లు పెట్టుకున్నా, పిల్లలకు అచ్చు తమిళ నామధేయాలు ఖరారుచేసినా తమిళనాడు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎంత దూసుకుపోతున్నా ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషలోనే విద్యాబోధన సాగించాలని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తోంది కన్నడ ప్రభుత్వం. అక్కడ ఏటా జరిగే కన్నడ సాహిత్యపరిషత్‌ ఉత్సవాలకు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు తప్పకుండా హాజరవుతాడు. మహారాష్ట్రలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్న భాషాదురభిమానాన్ని ఎవరూ హర్షించరుకానీ, సొంత భాషని మరీ చింతతొక్కు కింద తీసిపారేసే మన వింత మనస్తత్వాన్ని కూడా ఎవరూ సమర్థించరు. ఇంగ్లీషు లేకపోతే, ప్రపంచదేశాల ముందు మనం తలదించుకోవాల్సి వస్తుందని మెకాలే వారసులు చేస్తున్న దుష్ప్రచారం కూడా సరైంది కాదు. చైనా, జపాన్‌వంటి దేశాల అభివృద్ధే దానికి దీటైన సమాధానం. మన కుర్రాళ్లు కేవలం మార్కుల కోసమే ఇంటర్‌లో తెలుగుభాషను వదిలించుకుని సంస్కృతాన్ని వల్లెవేయడం ఇరుగుపొరుగు రాష్ట్రాలవారికి నవ్వుతెప్పించే విషయం. ఓసారి హోసూరు శాసనసభ్యుడు తమిళ శాసనసభలో తెలుగులో అడిగిన ప్రశ్నకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులోనే జవాబు చెబుతూ…’తమిళదేశంలో తెలుగును రెండోభాషగా గుర్తించడానికి ముందు, ఆంధ్రప్రదేశ్‌లో కనీసం తెలుగువారైనా తెలుగు చదివేలా చర్యలు తీసుకుంటే బావుంటుంది’ అన్నారు. తొడపాశంలాంటి సమాధానం.

బళ్లో అయ్యవారు ఎంత వెుత్తుకున్నా, ఇంట్లో నాన్నారు ఎంత గొంతుచించుకున్నా బుర్రకెక్కని పాఠాలు…అమ్మ ఒళ్లో కూర్చుని చదువుకుంటే ఠక్కున అర్థమైపోతాయి. అదీ అమ్మ గొప్పతనం, అమ్మ భాష గొప్పతనం! అందుకే, ఎదిగేపిల్లల్ని తల్లిభాష నుంచి దూరంచేయడం తగదని మనస్తత్వవేత్తలు మొత్తుకునేది. ఏ దేశమేగినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా అవన్నీ మాతృభాషకు ప్రత్యామ్నాయం కానే కావు. ఎంత చికాగో విశ్వవిద్యాలయంలో చదువుకున్నా
చిలక్కొట్టుడికి సరైన ఇంగ్లీషు పదం దొరుకుతుందా! అదివో అల్లదివో శ్రీహరివాసమూ’ అంటూ ఆ పదకవితాపితామహుడు అంత తన్మయత్వంతో ఆలపించిన గీతాన్ని అంతే ఆర్తిగా ఏ ఇంగ్లీషు భాషలోకో తర్జుమాచేయడం సాధ్యమేనా? ఎందరో మహానుభావులు…’ అంటూ త్యాగయ్య రామయ్యకర్పించిన ఘనరాగపంచరత్నాలను మక్కీకి మక్కీ అనువదించవచ్చేమోగానీ, ఆ మధుర భక్తిభావాన్ని యథాతథంగా పదాల్లోకి దించటం ఎవరి తరమవుతుంది? చెల్లియో చెల్లకో’ లాంటి పాండవోద్యోగ విజయం పద్యాలు, ఎంకిపాటలు, వెంగిలి వెంగిలీయని వేకాము చేసేవు… లోకమంతెవరెంగిలీ ఓ రమణా’ అంటూ బైరాగులు పాడుకునే తత్వాలు, జోలపాటలు, పండగలు  పబ్బాలప్పుడు నలుగురు మహిళలుచేరి పాడుకునే ఎత్తిపొడుపు హాస్యపుపాటలు, యక్షగానాలు, పిల్లల చెమ్మాచెక్కా పాటలు, చెక్కభజనలు… ఓహ్‌ చెప్పుకుంటూపోతే తెలుగుభాష సొగసుల చిట్టా హనుమంతులవారి తోకలాగా అలా సాగుతూనే ఉంటుంది. చెప్పొచ్చేదేమిటంటే, చివరికి చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, కంటిలోని నలుసు కాలిముల్లు’ లాంటి వేమన పద్యాన్నయినా భావగాంభీర్యం చెడకుండా మరో భాషలోకి అనుసృజన చేయడం అసాధ్యం. భాషంటే వట్టి అక్షరాల పోగు కాదు. తల్లిపేగు నుంచి గర్భస్థశిశువుకి ప్రాణధార ఎలా ప్రవహిస్తుందో, తల్లిభాష నుంచి మనిషికి జ్ఞానధార అలానే సంక్రమిస్తుంది. మాతృభాషను కాదనుకుంటే, కొండంత అనుభూతిని కోల్పోతున్నట్లే!

కన్యాశుల్కం’లో తమ ఇంటికొచ్చిన గిరీశాన్ని మా అబ్బాయీ మీరూ ఒక్క పర్యాయం యింగిలీషులో మాట్లాడండి బాబూ! అనడుగుతుంది శిష్యుడు వెంకటేశం తల్లి వెంకమ్మ. గురుశిష్యులిద్దరూ కలిసి నోటికొచ్చిన రైమ్సూ ఇంగ్లీషు పాఠాల్లోని లైన్సూ లెక్కల ఫార్ములాలూ వ్యాకరణ సూత్రాలూ దంచేస్తారు. మేనమామ కరటకశాస్త్రులు తెలుగుపద్యం చదవమంటే మాత్రం అర్థంతెలీని 'నలదమయంతుల' పద్యం గడగడ చదివేసి ఇంటికప్పుకేసి చూస్తూ నిలబడతాడు వెంకటేశం. తెల్లవాళ్ల బళ్లలో తెలుగుపద్యాల మీద ఖాతరీ లేదండీ! యంతసేపూ జాగర్ఫీ గీగర్ఫీ అర్థిమెటిక్‌ ఆల్జీబ్రా మేథమెటిక్స్‌ యివన్నీ హడలేసి చెప్తారండి! అంటూ గిరీశం అప్పుడు కవర్‌ చేయాలని చూశాడు గానీ… నిజానికి ఇవాళ మన పాఠశాలల్లో నూటికి తొంభై చోట్ల జరుగుతున్నదీ ఇదే తంతు. చదువంటే అష్ట్లాగే ఉండాలండీ! అంటూ అప్పుడు అగ్నిహోత్రావధాన్లు దీర్ఘాలు తీసినట్లే.. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులూ భావిస్తున్నారు. చింతించాల్సిన విషయమిది.

'
మా తెలుగు తల్లికి మల్లెపూదండఅని పాడమంటే, ఏకంగా తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం. ఇదేమంత మంచి లక్షణం కాదని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరిస్తోంది. మాతృభాష కన్నయితే, ఇంగ్లీషు కళ్లజోడులాంటిదని ఎవరన్నారోకానీ, ఆ మాట నూటికినూరుపాళ్లు నిజం! అసలు కన్నంటూ ఉంటేగా కళ్లజోడుతో పనిపడేది! చిక్కని పాలపై మిసిమి  చెందిన మీగడ పంచదారతో తింటే ఎంత మధురంగా ఉంటుందో,. ఆ తేటతేట తెలుగులో చదవడం వెుదలుపెడితేనేకదా అనుభవంలోకి వచ్చేది! చదువులు గుమస్తా ఉద్యోగాల కోసం కాదు. కాల్‌సెంటర్‌ కొలువుల కోసం అసలే కాదు. మనోవికాసానికి ఉపకరించాలి. మనల్ని మనం నిరూపించుకోవడానికి సహకరించాలి. అంతర్జాలం పుణ్యమా అని బోలెడంత సమాచారం అందుబాటులోకి వచ్చింది. మనకిప్పుడు కావలసింది, మనముందున్న సమాచారాన్ని సమన్వయపరుచుకోగల సామర్థ్యం. అమ్మభాషకన్నా గొప్పగా ఆ సమస్యను పరిష్కరించే సత్తా పరాయిభాషకు ఉంటుందా!
ఇది కొత్త ఆలోచనల యుగం. సృజనాత్మకతకే గండపెండేరం. సృజనకూ సొంతభాషకూ దగ్గరి చుట్టరికం ఉంది. సొంతభాషలో ఆలోచించినప్పుడు సృజన పురులు విచ్చుకొంటుంది. మాతృభాషలో వచ్చిన గొప్పగొప్ప రచనల్ని చదివినప్పుడు పదసంపద పరిపుష్ఠం అవుతుంది. పదాలు ఆలోచనలకు ప్రాణాలు. ఆలోచనలు సృజనకు ఆధారాలు. పోటీయుగంలో మన మనుగడను నిర్ణయించేది సృజనే. అదే  విజయాల్ని నిర్దేశించే ప్రధాన దినుసు. మాతృభాష మీద ప్రేమ ఉన్నా, లేకున్నా, కనీసం మనకోసమైనా మనం తెలుగు నేర్చుకోవాలి. తెలుగు పుస్తకాలు చదవాలి. తెలుగులో ఆలోచించాలి.

కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఓ పిల్లల ఆసుపత్రి ఉంది. లోపలికి కాలుపెట్టగానే, మిగతా ఆసుపత్రుల్లా మందుల వాసన గుప్పుమనదు. తెలుగు పరిమళం గుబాళిస్తుంది. ఏ గోడ మీద చూసినా తెలుగు పద్యాలే, తెలుగు గేయాలే, పొడుపు కథలే. మందుచిటీల మీద కూడా…ఏ వేమన పద్యవో, సుమతీ శతకం నీతివాక్యవో కనిపిస్తుంది. లేదంటే చేటంత చెవులు… చింతాకు కళ్లు… కొండంత ఒళ్లు… స్తంభాల్లాంటి కాళ్లు… కనుక్కోండి పిల్లలూ! తరహా పొడుపు కథలు ఉంటాయి. డాక్టరుగారుకూడా హాయిగా తెలుగులోనే మాట్లాడతారు. జ్వరవో, దగ్గో వచ్చిందని ఏడుపు వెుహంపెట్టుకుని ఆసుపత్రికెళ్లే పిల్లలు, తిరిగొస్తున్నప్పుడు ఏ వేమన పద్యాన్నో నెమరేసుకుంటూ హుషారుగా తిరిగొస్తారు. కందేపి ప్రసాదరావు అనే డాక్టరుగారి తెలుగు’ వైద్యమిది! ఆ చొరవ పదికోట్లమందికీ విస్తరించాలి. తెలుగు వెలుగే మన మనోజగతిన అలుముకోవాలి.
తెలుగు తల్లికి జేజే
తెలుగు భాషకు జేజే!
'దేశభాషలందు తెలుగు లేస్స; ఎందుకో తెలుసా ?!
పరుగుపందెంలో భావాల వేగాన్ని అందుకోగల భాషల మీద నలభై ఏళ్ల కిందటే పరిశోధనలు వెుదలయ్యాయి. భావాల బట్వాడాలో ఏ భాషకి ఎంత సౌలభ్యం ఉంది? ఏ భాషాపదం ఎంత వేగంగా మనిషి ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వగలుగుతుంది? ఇలాంటి సందేహాలకు జవాబులు రాబట్టడానికి చాలా ప్రయోగాలు చేశారు అప్పట్లోనే. గణాంకాల ఆధారంగా,  సమీకరణల సాయంతో ఫలితాలు రాబట్టారు. ఈ మహత్కార్యానికి పూనుకున్న వ్యక్తి పేరు ప్రొఫెసర్‌ బి.ఎస్‌.రామకృష్ణ. మన తెలుగువారే. సైన్స్‌ టుడే’ 1973, నవంబరు  సంచికలో ఆయన భాషల శక్తిసామర్థ్యాలు’ అనే శీర్షికతో ఓ వ్యాసాన్ని వెలువరించారు. ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ భాషలతోసహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింటిలోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. ఒక లిపిని మనిషి ఎంత వేగంగా రాయగలడో ఆ వేగమే ఆ లిపి ప్రాధాన్యతకి నిదర్శనం. అయితే అందరూ ఒకే వేగంతో రాయలేరు కాబట్టి, రెండు వేర్వేరు లిపులు రాయడానికి పట్టే అసలుకాలాన్ని గణాంకశాస్త్రం సాయంతో లెక్కగట్టి నిజం నిగ్గుతేల్చవచ్చని ప్రయోగాల ద్వారా నిర్ధారించారు.
భాషంటే ఒక సాంకేతిక సంజ్ఞ… కోడ్‌. ఈ సంజ్ఞలే సామూహికంగా భావాలకు ప్రతీకలుగా మారతాయి. ఒక్కో అక్షరానికి అవసరమైన బిట్స్‌’ సమాచార కొలమానం అవుతుంది. తక్కువ సంజ్ఞలతో ఎక్కువ సమాచారాన్ని అందించే బిట్స్‌’ అధికంగా ఉన్న భాష మాత్రమే పోటీలో నిలుస్తుంది. ఇంగ్లీషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకు ఉంది. అదే ఈ వేగానికి కారణం.
ఐటీలోనూ లేదుసాటి! కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు…చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. తెలుగువారిలాగే తెలుగు భాషకూ చొరవ ఎక్కువే. ఇట్టే బంధుత్వం కలిపేసుకుంటుంది. కంప్యూటరీకరణలోకూడా తెలుగు లిపి అతికినట్టు సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష… భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.

మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు సుమారు ఆరువేలు. ప్రపంచీకరణ పుణ్యమా అని వీటిలో సగానికిసగం ప్రమాదంలో పడ్డాయి. భాషాశాస్త్రవేత్తల అంచనా ప్రకారం…గత మూడువందల సంవత్సరాల్లో ఒక్క అమెరికా, ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలు అంతర్థానమైపోయాయి. వివిధ తెగల భాషలు కనుమరుగైపోయాయి. ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగానే యునెస్కో మాతృభాషల పరిరక్షణ'  ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం’ అని నిర్ధారించింది. 
కనీసం ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే’ 
అంటూ హెచ్చరించింది. ఆ లెక్కన తెలుగు భాషకూ ప్రమాదం పొంచి ఉన్నట్టే!

1947లో…భారత్‌ విభజన సమయంలో బెంగాల్‌ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోని తూర్పుప్రాంతం పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్‌ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింత తీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీనికూడా మరోఅధికార భాషగా గుర్తించింది. ఆ తరువాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. మాతృభాష కోసం నలుగురు యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది.
(ఆ సందర్భాన్ని పురస్కరించుకొని  ఈనాడు ఆదివారం అనుబంధం 21 ఫిబ్రవరి 2010 నాటి సంచికలో 'కవరు స్టోరీ' ప్రధాన వ్యాసంగా ప్రచురింపబడింది ఈ వ్యాసం)

-కర్లపాలెం హనుమంతరావు

Monday, July 13, 2015

ఏడుపుగొట్టు కవితలు ఏడు



1
పాండవులు కనిపించరు
పాత 'మాయాబజారు'
కౌరవులూ కనిపించరు
కొత్త మాయ 'బజారు'
తస్మాత్ జాగ్రత్త!

2
నరికితే చచ్చేందుకు
చెట్టు
మనిషి కాదు
-చివురు

3
ఆలూమగలు
పాలు- నీరు
ఎవరి పాలు ఎంతో
తేలకే
పోరు

4
తెలుగుగంగ సరే
తెలుగూ
గంగలో
కలుస్తున్నదే!

5
అగ్నిసాక్షిగా అయింది పెళ్ళి
అగ్గే బుగ్గిచేసింది మళ్ళీ
అగ్గీ! నువ్వు అత్తారికి
అంత దగ్గరి చుట్టమా!

6
అశోకవనంలో అందరి మధ్యున్నా
సీతమ్మకు అగ్నిశిక్ష!
అంతఃపురాన ఒంటరిగా పడుకున్నా
రామయ్యకు లేదే పరీక్ష!
ఏం కలికాలంరా బాబూ!
త్రేతాయుగం!

7
మన చట్టసభల మెడలో
వేలాడదీయాలనుంది
'ఐ నెవ్వర్ స్పీక్ ఇంగిలిపింగిలీస్'
 పలక!

-కర్లపాలెం హనుమతరావు

Saturday, July 11, 2015

శ్వాస విశ్వరూపం- ఓ దృశ్యకావ్యం




శ్వాస- జీవించడానికి మాత్రమే సంకేతం కాదు. ఇది ఒక జీవన సౌందర్యం కూడా. నవ్వుకు మల్లే, హావభావాలకు మల్లే శ్వాసా ఒక ప్రాపంచిక భాష. ఒక్క ముక్క నోటిద్వారా బైటపెట్టడకుండానే అంతరంగ భావావేశాలను అత్యంత నిర్దుష్టంగా,  స్పష్టంగా  వెలిబుచ్చే అద్భుతమైన సమాచార ప్రతీక శ్వాసప్రక్రియ.
శ్వాసకు ఉన్న విస్తృత పరిధి ఆశ్చర్యం కలిగిస్తుంది.  కుల మత ప్రాంత దేశ వర్ణ లింగ జీవ వయో భేదాలకు అతీతంగా శ్వాస శాసించే అంతరంగ, బాహ్య ప్రపంచాన్ని తిలకిస్తే విస్తుబోక తప్పదు.

డేనియల్, కెటీనా భార్యా భర్తలే కాదు.. చిత్ర నిర్మాతలు కూడా. కేలిఫోర్నియాలో ఉండే ఈ దంపతులు మానవశ్వాస బహుముఖాలమీద తీసిన ఈ షార్టు ఫిల్ముని చూడండి. నిడివి మూడు నిమిషాలే అయినా.. మనిషి అన్నిరకాల మూడ్సుని సెల్యూలాయిడ్ మీద కేచ్ చేయడానికి చక్కగా ప్రయత్నించారు ఈ దంపతులు. అప్పుడే పుట్టిన పసిగుడ్డు కేరింతల మొదలు విశ్రాంతి తీసుకునేముందు  మనిషి వదిలే దీర్ఘ నిశ్వాసం వరకు శ్వాస విశ్వరూపాన్ని చక్కగా తెరకెక్కించిన జంటను మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే!

Friday, July 10, 2015

కొన్ని చిట్టి కవితలు- 2

1
పువ్వుతో పాటు
పొద్దూ తిరుగుతోంది
బిడ్డచుట్టూ తల్లిలా!

2
నాన్న రాయని
వీలునామా
అమ్మ

3
కొన్ని దృశ్యాలు అలుక్కుపొతాయి
కొన్ని దృశ్యాలు అడుక్కుపోతాయి
కొన్ని దృశ్యాలు అతుక్కుపోతాయి
మనసొక వరం- మానస సరోవరం

4
సముద్రం
కన్నీటిముందు
పిల్లకాల్వ!

5
రూపాయి
వట్టి నోటు
పాపాయి
ప్రేమప్రాంసరీ నోటు

                      
                              




6
వేదానికైనా వేదనే మూలం
రామాయణమే 
అందుకు ప్రమాణం


7
గింజ
గాదెలో ధాన్యం
భూమిలో జీవం
                                   8

స్వర్గం టూ నరకం
వయా భూలోకం బస్
-ఫుల్!



9
రెడ్డొచ్చె
మొదలాడు!
జీవితం                         
                                                10       

రాత్రి ఎప్పుడు పెట్టిందో
మందారమయింది 
నాన్న ముఖారవింధం
'అమ్మ ప్రేమ' 
గోరింటాకు మహిమ!




                                  11
సందులు ఇరుకైనా
ఇళ్ళు విశాలం అప్ప్టట్లో
ఇళ్ళు విశాలమేకానీ

గుండెలిప్పుడు గుప్పెట్లో!


-కర్లపాలెం హనుమంతరావు

లక్షల్లో ఒకడు- కథ

కామేశ్వర్రావంకుల్ ఈ సారి అమెరికానుంచి తిరిగొచ్చిన తరువాత కార్లో ఊరేగడం మానేసి సైకిల్ పట్టుకొని తిరగడం మొదలుపెట్టాడు. ిరికే తిరిగితే ఫరవాలేదు.. ఏవేవో కాగితాలూ అవీ పంచడం.. ఉపన్యాసాలు దంచడం ఎక్కువయిందిప్పుడు! ఆయన నీడ కనబడినా.. సైకిల్ బెల్ వినబడినా పక్క సందులోకి తప్పుకోవడం తప్పనిసరయిపోయింది కాలనీ జనాలకి.
మా సర్వసుఖీకాలనీ ఫౌండర్ మెంబర్ ఆయన. పాతికేళ్లకిందట ఏజీ ఆఫీసులో పనిచేసే రోజుల్లో సొసైటీ పెట్టి మా మామగారిలాంటివాళ్లచేత బలవంతంగా సైట్లు కొనిపించాడు. కోర్టుల చుట్టూతా తనే తిరిగి లిటిగేషన్లీ సెటిల్ చేయించి ఆనక అందరి వెంటాబడి ఇళ్ళు కట్టించాడు. అప్పుట్లో దమ్మిడీ విలువ చెయ్యని స్థలాలు . ఇప్పుడు గజం పాతికవేలు పెట్టి కొంటామన్నా అమ్మేవాడు లేడు. 'మనవివాళ ఇలాంటి స్థితిలో ఉన్నామంటే కామేశ్వర్రావంకులే కారణం' అంటుంటారు మావారు. కాలనీజనాలందరికీ ఆయనమీద అదే గౌరవం.
అంకుల్ గారబ్బాయి అమెరికాలో పెద్ద పేరున్న డాక్టరు. అప్పుడప్పుడు ఈయనే వెళ్ళివస్తుంటాడు అక్కడికి. 'అక్కడే ఉండిపోవచ్చుగదా అంకుల్?' అని ఎవరైనా అడిగితే ' కాలనీకూడా నాకు కొడుకుతో సమానమే. వాడంటే అక్కడ డెవలప్పయిపోయాడు. ఇక్కడ కాలనీ డెవలప్ మెంటుని ఎవరు చూస్తారర్రా? ఇదీ నా బాధ్యతే కదూ!' అనే ఆయన అంకితభావాన్ని చూస్తే ఎవరికి మాత్రం గౌరవభావం కలగదూ.. చెప్పండి!
ఊళ్ళోకే కొత్తవైద్యం వచ్చినా దాన్ని నెత్తిమీదేసుకొని కాలనీలో ఊరేగందే తోచదాయనకు. అడిగినవాళ్లకీ అడగనివాళ్లక్కూడా ఆరోగ్య సూత్రాలు వినిపించడం ఆయన హాబీ. కాదు.. కాదు.. హేబిట్!
మూడురోజుల కిందట మా వారు కారు సర్వీసింగుకిచ్చి నడిచి వస్తుంటే.. రాయి తగిలి చెప్పు తెగిందట. కుంటూ కుంటూ నడుస్తూ కామేశ్వర్రావంకుల్ కళ్లల్లో పడ్డారు.. పాపం. తప్పుకొనేందుకు దారిలేదు. చెప్పు తెగిందాయ! 'కాలికేమయిందీ? కుంటుతున్నావూ?' అంటూ ఇంటిదాకా వెంటబడి వచ్చాడు అంకుల్. చెప్పు తెగిందని చెప్పనిస్తేనా? 'కారణం లేకుండా కాలికి నొప్పొస్తే కిడ్నీ ప్రాబ్లం కావచ్చు. షుగరున్నా అలాగే అవుతుంది. మీ నాయనకు షుగర్ లేదే! మీ అమ్మగారికుందేమో! వంశపారంపర్యంగా వచ్చే చాస్ను ఎక్కువ నాయనా! అందుకే నీకంత పెద్ద కళ్లజోడు. అశ్రద్ధ చేస్తే గుడ్డివాడివైపోతావ్! చెప్పులుకూడా లేకుండా తిరుగుతున్నావే! షూస్ వేసుకో! సాక్సు వదులుగా ఉండాలి. పాదాలు మురిగ్గా ఉండకూడదు! ఒకసారి నేను క్లీన్ చేసి చూపిస్తానుండు!' అంటూ గభాలున మావారి పాదాలను పట్టేసుకొని వెంటవున్న బ్రష్ తో తోమడం మొదలుపెట్టాడు! గజేంద్రమోక్షంలోని ఏనుగుటైపులో గిజగిజలాడుతున్నారు మావారు. 'పెద్దవారు! మీరు నా కాళ్ళు పట్టుకోవడమేంటి అంకుల్?' అని వారించబోతే 'ఫర్లేదులేవయ్యా! వసుదేవుడంతటివాడు గాడిదకాళ్ళు పట్టుకోలేదూ! విద్యంచేసేవాడికి రోగే నారాయణుడు' అంటూ చేతుల్తో కాళ్లనూ, మాటల్తో మెదడునూ తోమేస్తున్న ఆయన్నుచూసి నాకు మోహినీ అవతారం ఎత్తక తప్పింది కాదు!
వేడి వేడి కాఫీ కలిపి తెచ్చి అంకుల్ ముందుంచాను. మావారి పాదపద్మాలను పక్కన పారేసి కాఫీరసాస్వాదనలో మునిగిపోయాడాయన. శ్రీవారు బతికి బైటపడిపోయారు. తన గదిలోకి దూరి తలుపులు బిడాయించేసుకొన్నారుకూడా.
'అబ్బాయికి మొహమాటం కాస్త ఎక్కువ లాగుందమ్మాయ్! కాలికి దెబ్బేమైనా తగిలిందేమో చూడు! షుగరుంటే ఓ పట్టాన తగ్గదు. చిన్నదైనా పెద్దదైనా దెబ్బను నిర్లక్ష్యం చేయద్దు! జ్వరం కాసినా, నొప్పిపెరిగినా వెంటనే మాత్రలు వేసుకోవాలి. అన్నీ నేను పంపిస్తా! షుగర్ పేషెంట్ ఎప్పుడూ మందులు దగ్గరుంచుకోవాలి. రేప్పొద్దున మళ్లీ ఒకసారి వచ్చిచూస్తాలే! ఈలోగా రియాక్షన్ గానీ, ఎలర్జీగానీ వస్తే ఎవిల్ మాత్రలు వేయ్! జ్వరమొస్తే క్రోసిన్, దగ్గయితే లోమోఫిన్.. వాంతులయితే పెరినారమ్' అంటూ బైలుదేరిన మనిషి మళ్లీ వెనక్కి వచ్చి 'కాఫీ అమృతంలాగుంది అమ్మడూ! అబ్బాయికి మాత్రం చెక్కెర తక్కువ కాఫీ ఇస్తూండు!' అన్నాడు.
కొడుకు మెడిసన్ చదివే రోజుల్లో ఆ అబ్బాయి క్లాసు పుస్తకాలు కాలక్షేపంకోసం ఈయనా చదివేవాడుట. వైద్యాన్ని అశాస్త్రీయంగా చదివినంత ఉపద్రవం మరోటి లేదు. విన్నవి, కన్నవి అన్నీ తమకో తమ చుట్టుపక్కలవారికో ఉన్నవనిపించే ప్రమాదం జాస్తి. దానికి సజీవ తార్కాణమే కామేశ్వర్రావంకుల్ పురాణం.
కొడుకును చూట్టానికి వెళ్ళొచ్చిన ప్రతిసారీ ఓ కొత్తజబ్బు పేరు పట్టుకొని వచ్చి ప్రాణాలుతీయడం ఆయనకు పరిపాటే. ఆ మధ్య ఒకసారిలాగే 'ఆంత్రాక్స్.. ఆంత్రాక్స్' అంటూ కాలనీ అంతా  హడలుగొట్టేసాడు. మూడేళ్లకిందట పోయొచ్చినప్పుడు 'ఎబోలా.. ఎబోలా' అని లబోదిబోమన్నాడు. 'ఎల్లోఫీవరు'  పేరు చెప్పి వణికిస్తున్నప్పుడు 'ఇక్కడి వాతావరణానికి అలాంటి జబ్బులు రావయ్యా మగడా!' అని ఎవరెంత మొత్తుకొన్నా వింటేనా! ఇదిగో ఈసారి కొద్దిగా నయం. ఇండియాకు మ్యాచయ్యే జబ్బును పట్టుకొచ్చాడు.  దాని పేరు 'డయాబెటిస్ మిల్లిటస్'. అందరం మామూలుగా అనుకొనే షుగర్ కంప్లయింట్. 'ఇందులోనూ రెండు రకాలున్నాయండోయ్! మొదటి రకం మామూలుదే. నూటికి నలభైమందికొచ్చేదే. నలభై దాటిన వాళ్లకు  వచ్చే చాన్సు ఎక్కువ. రెండో రకం కొద్దిగా డేంజర్. షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోతే కళ్లకి, కిడ్నీలకి, నరాలకి, రక్తనాళాలకి కూడా ప్రమాదమే. ఒకసారి వస్తే వదిలే జబ్బు కాదిది. దిగులుపడుతూ కూర్చుంటే తరిగేదీ కాదు. పైపెచ్చు పెరుగుతుంది కూడా. కంట్రోల్లో ఉంచుకోవడ మొక్కటే  మన చేతుల్లో ఉండేది.' అంటో ఉపన్యాసాలు దంచుతున్నాడీ మధ్య మరీ.
ఒకసారి ఆయన వచ్చే వేళకి మావారు మసాలా వడలు లాగిస్తున్నారు ఇష్టంగా. పక్కనే పాయసం గ్లాసు. ఇటువైపు ఫ్రూట్ జ్యూసు. మా మ్యారేజ్ డే సందర్భంగా నేనే తయారుచేసాను ఇవన్నీ ప్రత్యేకంగా. 'మీ ఆయనకు షుగరుందని అన్నావు కదమ్మా!' అన్నాడాయన ప్లేటువంక.. నా వంక మిర్రిమిర్రి చూస్తూ.
షుగరూ లేదు.. వగరూ లేదు. చూడ చక్కని ఫిగరు నిజానికి మావారిది. అసలా ఫిగర్ని చూసే కదా వలచి వరించి నేను చేసుకొందీ! ఒకవేళ ఏదైనా ఉంటే వెళ్లి వెళ్లి ఎవరైనా ఈ అంకుల్తో  చెప్పుకొంటారా? చెబితే మాత్రం సవ్యంగా అర్థం చేసుకొంటాడా? తన ధోరణే తనదయిపాయ!
'ఆయనకలాంటి జబ్బేమీ లేదు లేండి!' అన్నాను అక్కడికీ ఉండబట్టలేక.
'ఇవాళ లేకపోతే రేపు రాదని గ్యారంటీ ఏంటీ? ప్రివెన్శన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగ నివారణకన్నా రోగ నిదానం ప్రధానం కదమ్మా!ఈ స్వీట్లేమిటీ?! ఈ జ్ఉసులేమిటీ?! ఇవన్నీ మానెయ్యాలమ్మాయ్! నేను చెప్పినట్లు చెయ్! పొద్దున్నే ఆరు ఏడూ మధ్య ఒక లోటాడు నిమ్మరసం..' మావారు అదేపనిగా పళ్ళు నూరుకొంటుంటే చూడలేక వంటింట్లోకి పరుగెత్తా. అక్కడిక్కూడా వినబడుతున్నాయ్ అంకుల్ మాటలు!

కాలింగ్ బెల్ మోగింది. మళ్లా హాల్లోకొద్దును గదా.. పాపం మావారు మంచినీళ్ళు తాగుతూ కనిపించారు. అంకుల్ మాత్రం ఒక్కో ప్లేటే ఖాళీచేస్తూ కనిపించాడు మధ్య మధ్యలో మా వారికి  సలహాలిస్తూ. ' ఆ షుగరేదో ఈయనగారికే రాకూడదా భగవంతుడా!' అని పళ్ళు నూరుకొంటూ వెళ్ళి తలుపు తీసాను.
ఎదురుగా రంజిత.. రమణ!
రంజిత చేతిలోని పాపను అందుకొంటూ లోపలికి నడిచాను.  పరిచయాలయ్యాయి అంకుల్తో.
రంజిత మా చెల్లెలు క్లాస్ మేట్. రమణ బ్యాంకాఫీసరు.  ఈ మధ్యనే చెన్నైనుంచి ట్రాన్స్ఫరై ఇక్కడికొచ్చారు. క్వార్టర్సు దొరికేవరకు అకామిడేషన్ కావాలంటే మావారిని ఒప్పించి పై పోర్షను ఇప్పించాను.
ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషను కెళితే ఫస్టు ప్రైజ్ గ్యారంటీ.  పదినెలల పాప ఉంది వాళ్ళకి.
అంకుల్ కి పిల్లల్ని చూస్తే వల్లమాలిన ప్రేమ. పాపను ఒళ్లో కూర్చోబెట్టుకొని పరీక్షగా చూస్తున్నాడు. పసిదానిక్కూడా ఎక్కడ షుగర్ అంటగడతాడోనని హఠాతుగా కరెంటు పోయింది. కేండిల్ వెలిగించేలోపున కాళ్లకి చెప్పులేసేసుకున్నాడు ఆయన. చీకట్లో ఒక్క క్షణం బైట ఉండలేడు అంకుల్.

'ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్లుందమ్మాయ్!' అన్నాడో రోజున రమణ ప్రసక్తి వచ్చినప్పుడు.
రమణావాళ్ళు ఈ ఊరొచ్చి నెలకూడా కాలేదు. ఎక్కడ చూసుంటాడు.. చాదస్తం కాకపోతే!
రంజిత వాళ్లు క్వార్టర్సు దొరికి వెళ్లిపోయారు. ఇప్పుడు అప్పుడప్పుడప్పుడు ఫోన్లలో పలకరించుకోవడమే!
ఈ మధ్య ఫోన్లో కలిసికూడా చాలా రోజులయింది. పాపను చూడాలనిపించి నేనే వెళ్లానో రోజు
రంజిత చాలా ముభావంగా ఉంది. ముపటి చురుకుతనం లేదు! తరిచి తరిచి అడిగితే బావురమని ఏడ్చేసింది. 'ఈ మధ్య ఆయన చాలా మారిపోయారక్కా! ఇల్లుకూడా పట్టకుండా తిరుగుతున్నారు. హైదరాబాదసలు రాకుండా ఉండాల్సింది' అంటో వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది.
వివరంగా చెప్పమన్నా.
'ఇది చదువు నీకే తెలుస్తుంది' అంటూ ఒక డైరీ అందించింది. అది రమణ పర్శనల్ డైరీ. పరాయివాళ్ళ డైరీలు చూడడం తప్పు. అయినా చెల్లెలులాంటి రంజిత సంసారంకోసం చూడక తప్పింది కాదు.
రమణ దస్తూరీ చక్కగా ఉంది.. అతనిలాగే.
'డియర్ మధూ! నా అణువణువూ నువ్వెప్పుడే స్వాధీనం చేసుకొన్నావు. ప్రాణానికన్నా ప్రేమించే రంజితనుంచి నన్ను దూరం చేయడం నీకు భావ్యమా? ఎంత వద్దనుకున్నా వదలడంలేదే నీ ఊహలు! ఈ విషయం నా భార్యకు తెలిస్తే తట్టుకోగలదా? నాకు కంటిమీద కునుకే లేకుండా చేసావు. ఎందుకు నామీద నీకింత మధురకక్ష? ఈ వయసులో నా పాలబడ్డావే! నా రక్తంలో కలగలసిపోయి నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు.. 'ఇలాగే  సాగింది అంతా!
'ఎవరీ మధు?'
తెలీదన్నట్లు తలూపింది.
'ఇప్పుడేం చేద్దామనుకొంటున్నావ్?'
రంజిత మాట్లాడకుండా పాపకేసి చూస్తూ కూర్చుంది. ఉబికి వస్తోన్న కన్నీటికి అడ్డుకట్ట వేయాలని వృథా ప్రయత్నం చేస్తుందా పిల్ల!
'నువ్వు ధైర్యంగా ఉండాలి. తొందరపడద్దు! నేను కనుకుంటాగా! అన్నీ చక్కబడతాయి!' అని తోచినమాటలు నాలుగు చెప్పి వచ్చేసానక్కణ్ణుంచి.
మావారిని సలహా అడిగాను. 'కామేశ్వర్రావంకుల్ కౌన్సిలింగు తీసుకోమను!' అన్నారు. దటీజ్ నాటే బ్యాడ్ ఐడియా!
కాలనీకి పెద్దాయన. అందరికీ కావాల్సిన వాడు. అదీగాక ఆయనకు పెద్ద సర్కిలుంది. తలుచుకోంటే ఈ వ్యవహారాన్ని ఇట్టే తేల్చేయగలడు.
రంజితను ఒప్పించి ఆ డైరీ చూపించాను ఆయనకు. చదివి 'రమణతో మాట్లాడాలి ముందు' అన్నాడు.
రెండు రోజులతరువాత రంజిత ఫోన్ చేసింది. హుషారుగా ఉందా గొంతు. 'అక్కా! అంకుల్ ఇక్కడే ఉన్నారు. వీలయితే ఒకసారి వస్తావా?' అనడిగింది.
నేను వెళ్ళిన సమయానికి రమణ ఇంట్లో లేడు. కామేశ్వర్రావంకుల్ పాపను ఒళ్లో కూర్చోబెట్టుకొని వేడివేడి కాఫీ ఊదుకుంటూ తాగుతున్నాడు. ఎదురుగా ఆయన ఖాళీ చేసిన ప్లేట్లు! పెద్ద ట్రీటే ఇచ్చినట్లుంది రంజిత.
'ఏమిటి విశేషం?' అనడిగాను కుతూహలంగా.
'మధుమోహం' అనాడాయన విచిత్రంగా నవ్వుతూ. అర్థం కాలేదు. వివరంగా ఆయనే చెప్పుకొచ్చాడు. 'కడుపులో మంటగా ఉంటే అల్సర్ అంటాం మనం. వీళ్లాయన ఉన్నాడు చూసావూ! 'హృదయబాధ' అంటాడు. కవి గదా!
ఒక్క ముక్క అర్థమయితె ఒట్టు. అయినా చేయగలిగిందేమీ లేదు. అంకుల్ చెప్పేది వింటూ 'ఊఁ' కొట్టడం మినహా.
'వీళ్లాయనకు డయాబెటిస్'
హతోస్మి! మళ్లీ టాపిక్కుని రోగాల పట్టాలమీదకు ఎక్కించేసాడు. ఆ బండి ఇంకెక్కడాగుతుందో దెవుడికే తెలియాలి.
'.. యూరిన్ ఎక్కువగా పోతోందని..విపరీతమైన ఆకలని.. నీరసంగా ఉంటోందని.. ఇలాగే ఇంకా ఏవేవో సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టరుగారి సలహామీద షుగర్ టెస్టులు చేయించుకొన్నాట్ట. పాజిటివ్ అని తేలింది. అప్ సెట్టాయ్యాడు.  పెళ్లానికి చెబితే ఎక్కడ బెంబేలు పడుతుందోనని తనలోనే దాచుకొన్నాడు. అయినా దిగులు దిగులే కదా! చెక్కరవ్యాధికి 'మధు' అని ఒక చక్కని ట్యాగ్ తగిలించి ఆ ఊహాప్రేయసికి ప్రేమలేఖలా డైరీలో రాసుకొన్నాడు. ఎంతైనా కవికదా! ఈ అమ్మాయికి ఆ కవిహృదయంలేక కంగారుపడింది. ఇదిగో రమణ మెడికల్ సర్టిఫికేట్' అంటూ ఒక  రిపోర్టు చూపించాడు. అందులో రమణకు 'డయాబెటిస్ మిల్లిటస్ పాజిటివ్' అని స్పష్టంగా ఉంది.
'రోగాలను కవితారాగాలతో జతచేస్తే ఇలాగే కత అపార్థాలకు..  ఆనక అనర్థాలకు దారి తీస్తుంది.ఇహనైనా అపోహలేవీ పెట్టుకోకుండా మీ ఆయన్ని చక్కగా చూసుకో అమ్మా! తీపి తిననీయద్దు. ఆహారం ఎంత చేదుగా ఉంటే మీ సంసారం అంత తీయగా ఉంటుంది. మీ అయన రాసిన కవితకి ఇదే తగిన శిక్ష. ఇలాగే తీర్చుకోవాలి నీ కక్ష. వగరే మీ కాపురానికి శ్రీరామ రక్ష' అని నవ్వుతూ వెళ్ళిపోయాడు కామేశ్వర్రావంకుల్.

మూడునెలలు కాకుండానే రమణకు ట్రాన్స్ఫరొచ్చింది!
రంజితావాళ్లను బండెక్కించి వచ్చిన రోజు రాత్రి అంకుల్ మా ఇంటికి భోజనానికి వచ్చాడు.
'కాఫీ ఇవ్వమ్మా! షుగరొద్దు!' అన్నాడు.
'నాక్కూడా!' అన్నారు మావారు.
'నీకేమోయ్.. భేషుగ్గా ఉన్నావుగా!'
'మీరు షుగర్ అంటారని ముందే వద్దనేసానంకుల్!' అన్నారీయన బుద్ధిగా.
'ఈ వయస్సులో నీకు షుగరేమిటోయ్?' అనేసాడు అంకుల్. బిత్తరపోవడం మా వంతయింది.
'రమణకు రాలేదూ! అలాగే!' అన్నారీయన తెగించి.
'రమణకు మాత్రం షుగరుందని ఎవరన్నారూ?'
అవాక్కయిపోయాం నేనూ.. ఈయనా!
ఈయన నాలిక్కి నరంలేదా?
'మరి ఆ మెడికల్ రిపోర్టు?!'
'మావాడి ఫ్రెండ్ లెటర్ హెడ్ మీద నేనే టైప్ చేసి తెచ్చా!' అన్నాడు కాఫీ చప్పరిస్తూ తాపీగా.
'మరి మధు.. వగైరా వగైరా?!' అనడిగాను ఉండబట్టలేక.
'ఆ మధు ఎవరో కాదు. నా మేనకోడలు కూతురు. రమణ ఆఫీసులోనే పనిచేస్తోంది. దానికి వీడు వల విసిరాడు. ఆ డైరీలో వాడు రాసుకొంది నిజంగా మధును గురించే. నువ్వు నాకు చూపించి మంచిపని చేసావు. రంజిత ఏడుస్తుందని 'మధుమోహం' కథ అల్లా. మీ వాడికి మూణ్ణెల్లలోనే బదిలీ ఎలా వచ్చిందనుకొన్నావ్? బ్యాంకు ఎమ్.డీకి చెప్పి నేనే చేయించా.  ఈ ముక్క చెప్పిపోదామనే ఇంతరాత్రివేళ పడుతూ లేస్తూ వచ్చింది.  తెల్లారి ఫ్లైటుకే నేను మా వాడిదగ్గరకు పోతున్నా. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో.. ఏమో అని..'
కామేశ్వర్రావంకుల్ ఎంత మంచిపని చేసాడు. అందుకే ఆయనంటే మాకందరికీ అంత గౌరవం.

మళ్ళీ కొంతకాలం మా సర్వసుఖీకాలనీ నిశ్శబ్దంగా ఉంటుంది కాబోలు! ఈ సారొచ్చినప్పుడు ఇంకేం కొత్త ఉపద్రవం తెస్తారో చూడాలి!
రెండువారాలకనుకొంటా.. తెల్లవారు ఝామున పాలపాకెట్లకని బైటికి వెళ్ళిన మావారు కళ్లనీళ్ళు పెట్టుకొంటూ తిరిగొచ్చారు. 'కామేశ్వర్రావంకుల్ కోమాలోకి పోయాట్ట!'
'ఆయనకీ షుగరుంది. అదీ రెండో టైప్. మహా డేంజర్. పోయినసారి కొడుకుదగ్గరికి వెళ్లినప్పుడే కన్ఫాం అయిందట. పోవడం ఖాయమని ఆయనకీ తెలుసు. అయినా కాలనీ అంతా ఎంత సందడిగా తిరిగేవాడు!

'లక్షల్లో ఒకడుంటాడు అలాంటి వాడు' అన్నారు మావారు దుఃఖం దిగుమింగుకొంటూ.
నిజమే! అందుకే లక్షలో  ఒకరికొచ్చే జబ్బు ఆయనకొచ్చింది. తను పోతానని తెలిసీ అందరూ ఆనందంగా ఉండాలని ఎంతలా ఏడిపించుకు తిన్నాడూ!
తలుచుకొంటుంటే నాకూ ఏడుపు ఆగడం లేదు!
***
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు 'ఆదివారం అనుబంధం' 22 సెప్టెంబరు 2002 నాటి సంచికలో
                                                                                పేరుతో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...