Wednesday, March 3, 2021

పరిష్కారం - కథానిక- ఈనాడు ఆదివారం అనుబంధం -కర్లపాలెం హనుమంతరావు

 


బ్యాంక్ ఇన్ స్పెక్షన్ పని మీద బాపట్ల వచ్చా. బయలుదేరినప్పటి నుంచి ఒకటే ముసురు. మధ్యలో వచ్చిన ఆదివారం చీరాల బయలుదేరా. అక్కడ మా మా మరదలు జయలక్ష్మి భర్త సాల్మన్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ అనుకుంటా అతని పేరు.

జయ ఇంటి అడ్రస్ పట్టుకునే వేళకు చీకటి చిక్కబడింది. వర్షానికి బట్టలు బాగా తడిశాయి. నన్ను చూడగానే జయ మొహం చాటంతయింది.

ప్రసాద్ ఊళ్లో లేడు. చెల్లెలి కొడుక్కి బారసాలని అద్దంకి వెళ్లాట్ట. 'రాత్రి కొస్తాడులే బావా! రాక రాక వచ్చావు. ఈ పూటకు ఉండిపో!' అంటూ మహా బలవంతం దానిది. ప్రసాదుకి ఫోన్ చేసి 'మనల్ని చూడ్డానికి మా ప్రసాదు బావ వచ్చాడండీ! ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు బైలుదేరిరావాల్సిందే' అని ఫోన్ లోనే ఆర్డరేసింది. అవతల అతనే మన్నాడో గాని సెల్ నా చేతికందింస్తే 'సారీ బ్రదర్! సమయానికి ఇంట్లో లేకుండా పోయా. ఇక్కడా బ్రహ్మాండమైన వర్షం. లాస్ట్ బస్ డౌటే! మాగ్జిమమ్ ట్రయ్ చేస్తా! మీరయితే ఉండి పోండి.. రేపు మాట్లాడుకుందాం' అన్నాడు. ‘గాలికి, వానకు ఈపూరుపాలెం దగ్గర కాలువ పొంగి రోడ్డు మీదకు నీళ్ళు పారుతున్నాయ్! బస్సులూ రైళ్ళూ ఎక్కడివక్కడ బంద్!' అని చెప్పిపోయాడు  పాలు పోసెళ్ళే అబ్బాయ్. ఇహ చేసేదేముంది? జయ వాళ్లాయన పొడి బట్టల్లోకి మారి టి.వి చూస్తూ కూర్చున్నా.

 

జయలక్ష్మి మా మేనమామ కూతురు. చిన్నప్పుడు దీన్నంతా నా పెళ్లామంటూ ఆటపట్టించేవాళ్లు. నేను వైజాగ్ లో ఎమ్మెస్సీ చేసే రోజుల్లో తను ఇంటర్. కోచింగ్ సెంటర్ మాష్టారెవరో వెంట బడితే ..పిచ్చిది.. నమ్మింది. ఇద్దరూ కలసి ఓ రోజు మాయం. మామయ్యెంత వెదికించినా ఆచూకీ దొరకలేదు. అత్తయ్య మంచం పట్టింది. మూణ్ణెల్ల తరువాత తనొక్కతే ఏడుస్తూ తిరిగొచ్చిందని విన్నా. నాకు చేసుకోన్నాడు మామయ్య. అమ్మ పడనీయలే. ఆ తరువాతే ఈ యానాం సంబంధానికి ఇచ్చి చేసింది.  పెళ్ళికి ఎవరికీ పిలుపుల్లేవు. మామయ్య పోయిం తరువాత అత్తయ్య చాలాకాలం కూతురు దగ్గరే గడిపింది. ప్రసాద్ మొన్నీ మధ్య దాకా దుబాయ్ లో ఉండొచ్చాడు. అల్లుడు తిరిగి రాగానే అత్తయ్య తన తమ్ముడు పంచన చేరింది ఎందుకో! జయలక్ష్మికి ఇప్పుడు ఏడాదిన్నర పాప.

జయలో మునుపటి కళ లేదు. 'చూసి చాలా కాలమయింది కదా! అందుకే అలా అనిపిస్తిందేమోలే!' అనుకున్నా. ఆ చీకట్లోనే విందుభోజనంలోలా చాలా చేసింది. తనింత బాగా చేస్తుందనుకోలేదు. శ్రద్ధగా అసలు చేస్తుందనుకోలేదు.

పాప అప్పటికే నిద్రకు పడింది. వంటిల్లు సర్దుకుంటూ 'తనింక రాడు కానీ, నువ్వెళ్లి మా బెడ్ రూంలో పడుకో బావా! నేనొస్తున్నా' అంది.

అటు వైపు తొంగి చూస్తే అక్కడ ఒకటే సింగిల్ కాట్! నేను షాక్!

షాకివ్వడం జయకు ఇది మొదటిసారి కాదు.

నా డిగ్రీ  రోజుల్లో ఓ సారి ఇంతకన్నా పెద్ద షాకే ఇచ్చింది మహా తల్లి. ఆ సారి వేసవి సెలవులకని  మామయ్యావాళ్ళ ఊరు వెళ్లాం మేం. ఆ ఊరికి సముద్రం దగ్గర. అందరం స్నానాలకని బైలుదేరాం. పెద్దాళ్లు సరుగుతోటల్లో భోజనాలు సిద్ధం చేస్తున్నారు. జయను మంచి నీళ్లు తెమ్మంటే బిందె తీసుకుని బైలుదేరింది. వెనకాలే చేదతో తోకలా నేను. ఇదా రోజుల్లో దోరమామిడి పండులా ఉండి కుర్రాళ్లను బాగా ఇబ్బందిపెట్టేది. బిందెను చంకలోకి ఎత్తే టైములో తట్టుకోలేక నేనూ చటుక్కుమని ఓ చెంప మిద ముద్దెట్టేశా.  అది షాకయింది. వెంటనే తేరుకొని 'ఒకసారి బిందె దించు బావా!' అంది తాపీగా. ఇంకో ముద్దు కోసమేమోనని నేను సంబర పడ్దంత సేపు పట్టలే. చేతులు ఖాళీ అవగానే నా రెండు చెంపలు రెండు సార్లు టపటపా వాయించేసింది. 'ఒక ముద్దేగా ఇచ్చింది. రెండు సార్లెందుకే కొట్టావ్ రాక్షసీ?'అనడిగితే

'ఒకటి ఇప్పుడు చేసిన పిచ్చి పనికి. ఇంకోటి ఇక ముందెప్పుడూ చెయ్యకుండా ఉండటానికీ! నా బుగ్గల్ని టచ్ చేసే హక్కు ఒక్క నాగరాజు సార్ కే ఉంది.. మైండిట్' అంది.

'వాడెవడే?' అనడిగా నా మైండ్ ఖారాబయి.

'నాక్కోయే మొగుడండీ బావగారూ!' అంది.

అదీ నా మొదటి షాక్! తేరుకుని 'ఇంట్లో తెలుసా?' అని అడిగితే.

'చెప్పలేదు. నువ్వూ చెప్పద్దు! చెప్పావో నేను చచ్చినంత ఒట్టే' అని బిందె మీదికి తీసుకుంది.

ఇది నిజంగా ఎక్కడ చస్తుందో అన్న భయంతో నేనూ ఇంట్లోవాళ్లవరికీ చెప్పలేదప్పట్లో.

***

పాప ఏడుపుతో ఈ లోకంలోకొచ్చి పడ్డా. కేండిల్ ఆరిపోయివుంది. చీకటికి భయపడనుకుంటా ఆ ఏడుపు. కొవ్వొత్తి వెలిగించి పెట్టి పాపను జోకొట్టి నిద్రపుచ్చి ఇంకో వెలిగించిన కేండిల్తో ఈ గదిలో కొచ్చింది. గాలికి కొవ్వెత్తి ఆరిపోకుండా కిటికీ తలుపులు మూస్తూ 'నువ్వొచ్చినప్పట్నుంచి చూస్తున్నా. ఏంటి బావగారూ ఊరికే తెగ ఆలోచించేస్తున్నారూ?' అని అడిగింది జయ.

ఏమని చెప్పాలి దీనికి?

'నాకంతా తెలుసులే! అసలిక్కడేం జరుగుతుందో కూపీ తీసి రమ్మని పంపించింది కదూ అత్తయ్య? మా అమ్మేదో అత్తయ్యకు చెప్పుకుని ఏడ్చుంటుంది. అవునా?' అని సూటిగా అడిగేసిందీసారి ఓ కుర్చీ నా బెద్ పక్కకే లాక్కుని కూర్చుని.

'జయ ఈ మధ్య మాటి మాటికి అత్తయ్యకు ఫోన్ చేసి ఇంటి కొచ్చేస్తానని ఏడుస్తోందిట్రా! ఏం జరుగుతుందో.. ఏంటో కాస్త కనుక్కో వీలయితే!' అని అమ్మ నేనిక్కడకొచ్చే ముందు హెచ్చరించిన మాట నిజమే.

'ఒక రకంగా అమ్మావాళ్లే నా బతుకును నరకం చేశారు బావా! వద్దన్నా నాన్న నాకీ పెళ్లిచేశాడు' అంది నిష్ఠురంగా. ఎప్పుడో పోయిన మామయ్యను ఇప్పుడిది తప్పుపడుతోంది  అన్యాయంగా.. చేసిందంతా తను చేసుకుని.

'ప్రసాదు మంచివాడు కాదా?' అనడిగాను హఠాత్తుగా. వచ్చినప్పట్నుంచి అడగాలనుకుంటున్న సందేహం అది.

'నువ్వు మంచాడివా కాదా?!' ఎదురడిగింది జయ.

‘ఆ సంగతి నువ్వు కదే చెప్పాలి!’ అన్నా ఈ సంగతి ఎటు తిరిగి ఎటు మళ్లుతుందోనని కొద్దిగా బంగతో.

'నన్నడిగితే నువ్వూ అంత మంచోడివేం కాదులే బావా?'

'మధ్యలో నేనేం చేశానే దయ్యం?' బిత్తరపోతూ అడిగాను.

'నిజంగా నువ్వు మంచోడివే అయ్యుంటే ఆ రోజు నేను నాగరాజుగాడిని గురించి చెప్పినప్పుడు నా రెండు చెంపలూ వాయించుండేవాడివి. లేదా ఆ నాగరాజు ఎలాంటి నిక్రిష్టుడో విచారణ చేసుండేవాడివి. కనీసం మా ఇంట్లోనైనా హెచ్చరించుండేవాడివి'

'చెబితే చస్తానని బెదిరిస్తివి గదే?'

'చిన్నపిల్లవాడేదో తెలీక నిప్పు ముట్టుకుంటామని మారాం చేస్తే ముట్టుకోస్తామా? నిప్పునన్నా ఆర్పేస్తాం. లేదా పిల్లవాడినైనా దూరంగా తీసుకెళతాం. ఏదీ చెయ్యలేదు కదా  నువ్వు!' అంటూ లేచెళ్లిపోయింది.

జయలక్ష్మి అభియోగానికి విస్తుబోయాను. మొత్తానికి ఇదెందుకో బాగా బాధపడుతోంది. సమస్యేమిటో తెలిస్తేనే గదా పరిష్కారం వెదకడానికి!

***

ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. ఎక్కడి నుంచో సన్నగా ఏడుపు వినిపిస్తుంటే ఆ మూలుక్కి ఉలిక్కిపడి లేచా. కేండిలెప్పుడో ఆరిపోయినట్లుంది. అంతా చిమ్మచీకటి.

పక్కగదిలో  నుంచే ఆ మూలుగులు. పాప పక్కన పడుకునున్న జయలక్ష్మి నిద్రలోనే ఉండి ఉండి ఏడుస్తూ కలవరిస్తోంది. కలవరిస్తో ఏడుస్తోంది. తట్టి లేపే ప్రయత్నం చేస్తే సగం నిద్రా, సగం మెలుకువలో ఉన్నట్లుంది ఇంకా ఏదేదో వాగుతోంది అస్పష్టంగా. 'ప్రసాదు మంచివాడే బావా! పాపనూ, నన్నూ బానే చూసుకుంటాడు. ఏదడిగినా కాదనడు పాపం. అయినా ఆడది అన్నీ అడగుతుందా? అదే ఉప్పూ కారం కదా మగాళ్లు మీరూ తినేది? సంసారం వద్దనుకుంటే ఈ పెళ్లెందు కసలు చేసుకోవాలి పురుషపుంగవా?' ఏడుపు మధ్యలో ఇట్లాంటివే ఏవేవో కలవరింతలు. బలవంతాన నిద్రలేపే నా ప్రయత్నంలో రెండు మట్టిగాజులు కూడా చిట్టినట్లున్నాయి.

కరెంటు రావడంతో జయకు పూర్తిగా మెలుకువొచ్చేసింది. కొంత నయం.  జరిగింది తనర్థం చేసుకునే లోపే తలుపు టకటక చప్పుడయింది!

జయే వెళ్లి తలుపుతీసింది

'రెండు దాటింది. ఇంకా పడుకోలేదా?' అంటూ మగమనిషి ఒకతను లోపలికొచ్చాడు చొరవగా!  అతనే ప్రసాదని ఇట్టే అర్థమయింది 'మీరు పొద్దున్నే వెళ్లిపోతారుట గదా! ఎట్లాగైనా రావాలని మా మహరాణిగారి ఆజ్ఞ. లారీ పట్టుకునొచ్చేసే సరికి ఈ వేళయింది.'అంటూ అతను  గలగలా మాట్లాడే తీరులోనే మనిషెంత బోళానో అర్థమయిపొయింది. ఈ మనిషి మీదనా జయకన్ని కంప్లయింట్స్! నమ్మబుద్ధికాలే!

 బెడ్ రూంలోకి తొంగి చూసి 'మీరు పడుకోండి బ్రదర్! తెల్లారి అన్నీ మాట్లాడుకుందాం!' అంటూ పాప మంచం పక్కనే  ఓ చాప పరుచుకుని క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు ప్రసాద్ పసిపిల్లాడికి మల్లె! జయ కొద్దిగా ఎడంగా పడుకుండిపోయింది.

'మొగుడూ పెళ్లాల మధ్య ఏం జరిగుంటుందీ? తను మూడో మనిషి. కలగజేసుకోడం ఎంత వరకు భావ్యం? ఇలాంటి ఆలోచనలతోనే నాకు  ఆ మిగతా రాత్రంతా సరిగ్గా నిద్రే పట్టలేదు.

తెల్లారి ఇన్ స్పెక్షన్ చివర్రోజు. పని ఎక్కువగా ఉంటుంది సహజంగా. ప్రసాద్ నిద్రలో ఉండగానే బట్టలు మార్చుకుని జయ ఇచ్చిన కాఫీ తాగి   బాపట్ల వచ్చేశా. సాయంత్రానికల్లా రిపోర్ట్ సబ్మిట్ చేసి లాడ్జ్ రూమ్ ఖాళీచేసే పనిలో ఉండగా ప్రసాద్ ఫోన్ చేశాడు 'సారీ! బ్రదర్! తీరిగ్గా మాట్లాడుకోవడమే కుదిరింది కాదు. మీరే ట్రెయిన్ కండీ వెళ్లేదీ?'

'చార్మీనార్! రాత్రి పదిన్నరకండీ డిపార్చర్' చెప్పాను.

'స్టేషన్లో ఆటో దిగుతుంటే నవ్వుతో ఎదురొచ్చాడు ప్రసాద్.. ఓ ప్యాకెట్ అందిస్తో. 'ఏంటిదీ?' అనడిగితే 'యేఁ అందర్ కి బాత్ హైఁ' అన్నాడు చిలిపిగా కన్నుగీటుతూ. విప్పి చూస్తే నా అండర్ వేర్. తెల్లారి సగం చీకట్లో నాదనుకొని అక్కడే పడున్న ప్రసాద్ డ్రావర్ వేసుకొచ్చిన సంగరి లాడ్జ్ కి రాగానే తెలిసింది.  కానీ, అలాంటివి తిరిగెలా ఇవ్వడం? బావోదని లాడ్జ్ రూమ్ లోననేవదిలేసి వచ్చా. చిన్నపిల్లవాడి తత్వం కాబట్టి ప్రసాద్ భద్రంగా ప్యాక్ చేసి మరీ పట్టుకునిచ్చాడు! సాటి వ్యక్తులపై అతని 'కన్ సర్న్' నన్ను బాగా ఇంప్రెస్ చేసిన మాట్ నిజం.

ఇంత మంచి వ్యక్తి ముందు జయ చేసిన అభియోగాన్ని చర్చకు పెట్టడం ఎలాగా? అన్న నా ఆలోచనలో నేనుండగానే తనే అన్నాడు 'రాత్రి జరిగిందానికి జయ తరుఫున నేను సారీ చెబుతున్నా బ్రదర్! గాజు ముక్కల విషయం నేనడక్క పోయినా తనే చెప్పిందంతా. తనెందుకో కొంత కాలంగా రోజూ అలాగే బిహేవ్ చేస్తోంది'

'జయ ఇంతప్పట్నుంచీ నాకు తెలుసు ప్రసాద్ గారూ! బైటికి అట్లా రూడ్ గా అనిపిస్తుంది కానీ, షి ఈజ్ వెరీ సెన్సిటివ్! ఎందుకో బాగా అప్సెట్టయిన మూడ్ లో ఉన్నట్లనిపిస్తోంది నాకు. సమస్యేంటో భర్తగా మీరే కనుక్కోవలసింది!' అన్నాను నిష్టురంగా!

'మీరేమనుకుంటున్నారో నాకు అర్థమవుతూనే ఉంది సుందరంగారూ! అందుకే నేనింత దూరం వచ్చింది. అన్ని సంగతులూ ఫోన్లలోనో, త్రూ ఈ-మెయిల్సో చెప్పడం కుదరదు కదా! బండికింకా అరగంట టైముంది. కూర్చుందాం రండి!' అన్నాడు ప్రసాద్.

అక్కడే ఉన్న సిమెంట్ బెంచీ మీద చతికిలబడ్డాం ఇద్దరం. తను చెప్పడం మొదలుపెట్టాడు.

'పెళ్లికి ముందే నాకు నాగరాజును గురించి మామయ్యగారు వివరంగా చెప్పేరు. పెళ్లి నాటికి జయ మూడు నెలల గర్భవతి. రహస్యంగా అబార్షన్ చేయించాలని యానాం తీసుకువచ్చారు. అప్పటికే పిండం గట్టిపడివుంది. ఆ దశలో అబార్షన్ అంటే పెద్దప్రాణానికి రిస్క్ చాలా ఎక్కువని డాక్టర్లు చెబుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా చిన్నచెల్లాయికి చాలా రోజుల నుంచి బాలేకపోతే  అదే ఆసుపత్రిలో వైద్యం నడుస్తోంది. మా నాన్నగారు అక్కదే చనిపోయారు ఎయిడ్స్ తో.. ఆ గొడవల్లో చదువు సరిగ్గా సాగక డిగ్రీలో ఫెయిలయివున్నా నేను  అప్పట్లో. ఉద్యోగం లేదు. చిన్నచెల్లి జబ్బు. పెద్దచెల్లికి ముదిరిపోయే పెళ్ళి వయసు.  నా ఇంటి సమస్యలను తీరుస్తానంటే జయలక్ష్మిని పెళ్లాడతానని నేనే బేరం పెట్టాను మామయ్యగారితో. చెల్లెలి పెళ్లి, నా కాంపౌండర్ ఉద్యోగం మామయ్యగారి చలవే.'

'మరి అన్నీ తెలిసుండి చేసుకుని మా జయను ఎందుకండీ ఇంకా బాధపెట్టడం! సారీ! ఇలా అడిగానని మరోలా అనుకోవద్దు! జయ నాకు కేవలం మరదలే కాదు.. చిన్ననాటి నుంచి గాఢస్నేహితురాలు కూడా!'

'అవన్నీ తెలుసు. జయ ఎప్పుడూ మీ గురించి చెబుతుంటుంది. అందుకే నేనింత దూరం వచ్చి వివరణ ఇచ్చుకోడం! జయంటే నాకూ ప్రాణమే సార్! అందుకే కష్టమైనా నేను తనకు దూరంగా ఉంటున్నది. పెళ్లయిన వెంటనే దుబాయ్ వంకతో దూరంగా వెళ్ళిపోయిందీ అందుకే!'

ప్రసాద్ గొంతు వణుకుతోంది సన్నగా. అతనేదో చెప్పాడు. ట్రైన్ ఎరైవల్ ఎనౌన్స్ మెంట్ గోలలో సరిగ్గా వినబడలేదు. బండి ఫ్లాట్ ఫారం మీదకు ధనాధనా దూసుకురావడం, ప్యాసింజర్ల హడావుడీ హఠాత్తుగా మొదలవడంతో.. నేనూ అలర్టయ్.. లగేజీతో సహా నా రిజర్వుడ్ కంపార్డ్ మెంట్ వైపుకు పరుగెత్తాను.

సీటులో సెటిలయే వేళకి డిపార్చర్ ఎనౌన్స్ మెంటు స్టార్టయింది. ఎప్పుడు కొనుక్కొచ్చాడో ఓ డజన్ ఏపిల్సూ, డజన్ ఆరెంజెస్.. వాటర్ బాటిల్ .. విండో గుండా అందించాడు ప్రసాద్.

'థేంక్యూ ఫర్ యువర్ కన్సర్మ్ మిత్రమా! ఇందకా మీరేదో అన్నారు గాని, ట్రైన్స్ అనౌన్స్మెంట్స్  గోలలో సరిగ్గా వినిపించలా! మళ్లీ చెప్పండి ప్లీజ్!'

గార్డ్ విజిల్ వేశాడు 'ఆ గజిబిజిలోనే ప్రసాద్ పెద్దగా అన్నాడు 'నా పెళ్లయిన వారానికల్లా నా చిన్నచెల్లెల్లూ చనిపోయింది సార్.. అదే ఎయిడ్స్ ప్రాబ్లమే! అనుమానం వచ్చి నేనూ టెస్టులు చేయించుకున్నా తరువాత! హెచ్చైవి పాజిటివ్ అని వచ్చింది. ఏడెనిమిదేళ్లకు మించి లైఫు ఉండదన్నారు.. పూర్తి ఆరోగ్యం ఇంక అసాధ్యమని కూడా చెప్పారు. పాపకు తండ్రిని నేనెలాగూ ఉండను. తల్లిని కూడా లేకుండా చెయ్యడం నా వల్లయ్యే పని కాదు సార్! ఈ సంగతులేవీ జయకు తెలీవు. చెబితే తట్టుకోలేదు. అందుకే రోజూ రాత్రి.. ఆ దెబ్బలాటలు.. ఏడుపులు'

బండి క్రమంగా స్పీడందుకుంటున్నప్పుడు 'పిన్నిగారినీ, డాక్టర్ గారినీ అడిగానని చెప్పండి!' అని చేతులూపుతూ ఫ్లాట్ ఫామ్ మీద నవ్వుతూ నిలబడిపోయిన ప్రసాద్ వంక అలా చూస్తూ షాకయిపోయాను.

***

డాక్టర్ గారు అంటే నా భార్య శ్యామల. ప్రసాదు చెప్పిందంతా తనకూ చెప్పి జయకు అడుగడుగునా ఇలా అన్యాయం  ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉంది?' అని బాధపడ్డాను.

'నా అనుమానం నిజమైతే ప్రసాదుకలా హెచ్చైవి పాజిటివ్ అయ్యే అవకాశం లేదు సుందరం!' అనేసింది శ్యామల.

'ఎలా?!'

'ప్రసాద్ గారి పెద్దచెల్లెలు చక్కగా కాపురం చేసుకుంటుదన్నారుగా! ఆయన తండ్రికి హెచ్ ఐ వి అఫెక్టయ్యే నాటికే మొదటి ఇద్దరు పిల్లలూ పుట్టేసున్నారు. ఆయన పాజిటివ్ అయిన తరువాతనే చివరి అమ్మాయి పుట్టినట్లుంది. సరైన టైములో తెలుసుకుని మంచి ట్రీట్ మెంటు ఇచ్చి ఉంటే ఆ పిల్ల కూడా భేషుగ్గా బతికుండేది. ఇవాళ హెచ్చైవి అసలు  ఫాటల్ డిసీజెస్ జాబితాలోనే లేదు. మెడిసన్ లైన్లో ఉండీ మీ ప్రసాదు ఇంత  మూర్ఖంగా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది' అంది శ్యామల.

***

మా కొత్తింటి గృహప్రవేశం వంకతో జయలక్ష్మి దంపతులను హైదరాబాద్ రప్పించాను. అదను చూసుకుని ప్రసాదుకి పరీక్షలు జరిపిస్తే శ్యామల చెప్పిందే నూటికి నూరు పాళ్లు నిజమయింది.

'మరి మా యానాం డాక్టర్లు అలా ఎలా చెప్పారు మేడం?' అని ఆశ్చర్యపోయాడు ప్రసాద్.

'మీరు ఖర్చుకు జంకి ఎవరో నకిలీ డాక్టరును ఆశ్రయించారు. మీ దురదృష్టం కొద్దీ వాడెవరో డబ్బు గుంజటానికి రోగుల జీవితాలతో ఆడుకొనే ధనపిశాచి అయిపోయాడు! ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు వేరే వేరే మంచి డాక్టర్లకు చూపించుకుని గాని ఒక నిర్ధారణకు రకూడదనేది అందుకే!' ఆన్నది శ్యామల.

'మా జయను నిష్కారణంగా క్షోభకు గురిచేసినందుకు  మీకు పనిష్ మెంటు తప్పక వేయాల్సిందే బ్రదర్! ఇన్ స్టాంట్ హనీమూనుకు ఓ వారం వెళ్లిరండి ఇద్దరూ! పాపను గురించి బెంగ వద్దు! మీ అత్తగారు అట్లాంటి  డ్యూటీలకే  ఎదురుచూస్తోంద’ అన్నా పరిష్కరించమని నాకో సమస్యను చుట్టబెట్టిన మా అత్తయ్య వంక చూసి నవ్వుతూ.

 

ఏడాది తరువాత  జయలక్ష్మి కొడుక్కి బారసాలంటే వెళ్లాం నేనూ శ్యామలా. 'పేరేం పెడుతున్నావే?' అని జయనడిగితే, ఎప్పట్లానే తల బిరుసుగా 'నీ డొక్కు పేరు ఒక్కటే కాదులే బావా! అక్క పేరు కూడా కలుపుకుంటాం’ అంది బుజ్జి శ్యామసుందరాన్ని నా ఒళ్లో పడుకోబెడుతూ!

********


-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివార అనుబంధం ప్రచురితం)

03 -03 -2021 










Tuesday, March 2, 2021

ఆటలు- సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 

తాటికాయలకు పుల్లగుచ్చి దర్జాగా దొర్లించుకుంటూ వెళ్లే రెండు చక్రాల బండి, ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని క్షణాల్లో సృష్టించే పొగలేని రైలుబండి, ఒకటి నుంచి వంద ఒంట్లు లెక్కబెట్టిన బుజ్జి దొంగ కళ్లు తెరిచి చేసే భీకర వెతుకులాట, ఝుమ్మని తిరిగే బొంగరం, కూత ఆపకుండా గోదాలో నిలిచే ఆటగాడి పనితనం, పెచ్చులుగా పగిలే గోళీలు, పెరటి కొమ్మలకు ఊగే ఊయలలు, వరండాల్లో అష్టాచెమ్మా, వీ«థుల్లోన కుందుడుగుమ్మా... మన ఆటలు నిజంగా బంగారం. మన పిల్లల కోసం సంప్రదాయం సృష్టించిన తెలుగుదనపు సింగారం.

బొద్దుగా ముద్దుగా ఉండే కుమారరత్నం పొద్దున లేస్తే టీవీకి అతుక్కుపోతాడు. నోరు తెరిస్తే పవర్‌ రేంజర్స్, పొకెమాన్‌ మాట్లాడతాడు. అవసరమైతే బేబ్లేడ్‌లు అడుగుతాడు. కాదంటే చాక్లెట్‌ ఫ్యాక్టరీ చదువుతానంటాడు. అమ్మాయికి ఎస్‌ఎంఎస్‌ల పిచ్చి. చాటింగ్‌లో తప్ప క్లోజ్‌ ఫ్రెండ్‌ ఎదురుగా నిల్చున్నా మాట్లాడదు. టైముంటే ట్వంటీ ట్వంటీ, నో అంటే టామ్‌ అండ్‌ జెర్రీ.

వీళ్ల ఇష్టాలు వీళ్లవే. వీళ్ల కోసం పిజ్జాలు బర్గర్‌లు కాదనక్కర్లేదు... కాకపోతే అప్పుడప్పుడన్నా మన సద్దిబువ్వ సంగతి తెలియాలి. వాటర్‌ పార్కులు, హారర్‌ హౌస్‌లు ఎంజాయ్‌ చేయాల్సిందే... కానీ ఏడాదికోమారన్నా వరిచేల మీద నుంచి వీచే చల్ల గాలి వీళ్ల ఒంటికి తగలాలి. అమ్మమ్మ కలిపే ఆవకాయ ముద్ద నోటికి అందాలి. మట్టివాసన తెలియని వాళ్లకి మరే పరిమళం అంటదంటారు. మన సంస్కృతి తెలియనివారికి మరే సంస్కృతైనా అర్థం అవుతుందా? తెలుగు భాష తీయదనం పిల్లల నాలుకకు తగలాలని ఉద్యమిస్తున్నట్టే తెలుగు ఆటల రుచి వారికి చేరువ కావాలని ఎందుకు ఉద్యమించకూడదు?

ప్రతిదీ ఒక ముచ్చట...

పిల్లలంతా గోలగా మూగుతారు. జట్లు జట్లుగా పంటలు వేస్తారు. ఒక్కొక్కరూ ‘పండు’గా మారి చివరకు ఒకరిని దొంగ చేస్తారు. ఆ దొంగతో దాగుడుమూతలు ఆడతారు. ఆ దొంగతో కోతి కొమ్మచ్చి ఆడుతారు. ఆ దొంగను కుంటుకుంటూ వచ్చి కుందుడుగుమ్మలో అందరినీ పట్టుకోమంటారు. ఆ దొంగ మెడలు వంచి ‘ఒంగుళ్లూ దూకుళ్లూ’ వినోదిస్తారు. ప్రతిదీ ఒక ముచ్చట. జీవితంలో గెలుపోటములను నేర్పే కళ. అందని వాటిని అందుకోవడం, దొరకనివాటిని వెతుకులాడటం, అనువుకాని చోట తలను వంచడం, అడ్డంకులు ఉన్న చోట ఒంటికాలితోనైనా సరే గమ్యాన్ని చేరుకోవడం... మన ఆటల్లో నిగూడార్థాలు... నిబ్బరాన్ని నింపే రహస్య సూచనలు.

ఖర్చు లేని వినోదం...

ఒక క్రికెట్‌ కిట్‌ కొనాలంటే ఎంతవుతుంది? ఒక టెన్నిస్‌ రాకెట్‌కు ఎంత వెచ్చించాలి. ఒక సాయంత్రానికి షటిల్‌కాక్‌లు ఎన్ని సమర్పించాలి? వీడియో గేమ్స్‌ వెల ఎంత? కానీ మన ఆటల్లో ఎంత ఖర్చవుతుంది? చింతపిక్కలు, ఇటుక ముక్కలు, వెదురుకర్రలు, రూపాయికి ఇన్నేసి వచ్చే గోళీలు... అందుబాటులో వున్న వస్తువులనే క్రీడాసామాగ్రిగా చేసుకొని ఖర్చులేకుండా వినోదించడం మన గ్రామీణులు నేర్చిన విద్య. బాదం ఆకులు కుట్టుకోవడం తెలిసినవాడు పేపర్‌ప్లేటు వచ్చేదాకా తలగీరుకుంటూ నిలుచోడు. గమనించి చూడండి... మన ఆటలన్నీ ఇలాంటి నేటివ్‌ ఇంటెలిజెన్స్‌ను పెంచేవేన్మళ్లీ చిగురించాలి...

సమిష్టి తత్వాన్ని, సామూహిక జీవితాన్ని, అనుబంధాలను, పరస్పర ప్రేమానురాగాలను పెంచేవే గ్రామీణ క్రీడలు. నేడు గంటల తరబడి టీవిల ముందు కూర్చొని సీరియల్స్ చూడడం, ఆట ఆడడం కన్నా ప్రేక్షకుల్లా, శరీరం కదలకుండా చూడడమే మనకు ఆటపాట అవుతుంది. ఇది చాలదన్నట్లు యువత వీడియోగేమ్స్ రూపంలో తీరిక లేకుండా ఉంది. గత కాలంతో పోల్చిచూస్తే గ్రామీణ క్రీడలకు ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ క్రీడల్లో చాలావరకు మాయమై ఒకటి, రెండు మాత్రమే మిగిలాయి. వస్తువులు మాయమైనట్లే, మనుషులతోపాటు మమతలు దూరమైనట్లే ఆటలు కూడా వాటిని అనుసరించాయి. గ్రామీణ క్రీడలు మన శరీరానికి, మానసిక వికాసానికే కాక వినోదానికి కూడా ప్రాధాన్యత ఇస్తాయి. తార్కిక బుద్దికి ఎత్తుకు పైఎత్తులు ‘పుంజీతం’ నేర్పితే, ముందువాడిని వెనక్కునెట్టి రాజు కావడం ఎలానో ‘పచ్చీసు’ వివరిస్తుంది. ఇటువంటి ఆటలు గ్రామీణ క్రీడలుగా చెబుతున్నప్పటికీ ప్రతి ఆటలోని మనవాళ్లు ఐక్యతకు పెద్ద పీట వేశారు. ఈ క్రీడలు ఆటకైనా, బ్రతుకు ఆటకైనా నిబంధనలుంటాయని తెలుపుతాయి. సృజన వ్యక్తిగత ప్రతిభ నుండి పుట్టి సమాజగతమవుతుందని ఈ క్రీడలు నిరూపిస్తాయి. చిన్నారులు ఆడే గోలీల ఆటతో వారిలో చక్కని స్నేహబంధాన్ని చూడవచ్చు. మనిషి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న తరుణంలో పిల్లలు గోళీల ఆట ఆడి అధికంగా గోళీలు సంపాదిస్తే వారు పొందిన ఆనందానికి అవధులుండవు. ఐదువేళ్లు కలిపి ఆడే అచ్చనగిల్ల చేతివేళ్లకు వ్యాయమంతోపాటు బాలికలలో దాగి ఉండే సృజనాత్మక శక్తిని వెలికి తీసేదిలా ఉంటుంది. శరీర వ్యాయామానికి తొక్కుడుబిళ్ల ఆట దోహదపడుతుంది. గతంతో తీరిక సమయాల్లో గ్రామాల్లోని కూడలి వద్ద అష్టచమ్మ, దాడి, వామనగుంటలు లాంటి ఆటలు గ్రామస్తులు అధికంగా ఆడేవారు. చిన్నచిన్న పందాలు కాస్తూ ఆటకు రక్తికట్టించేలా వారు క్రీడల్లో పాల్గొనేవారు. గ్రామీణ క్రీడలు ఎటువంటి ఘర్షణ వాతావరణానికి తావివ్వకుండా ఐక్యత వాతావారణంలో కొనసాగేవి. ఇంతేకాకుండా గోడిబిళ్ల, చెడుగుడు, కబడ్డీ క్రీడలు దేహధారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా మనిషిలోని సహజస్థితి, కలసికట్టు తనానికి నిదర్శనంగా ఉంటాయి. ప్రస్తుత సెల్‌యుగంలో ఈ గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్నాయి. గ్రామాల్లో ఐక్యత వాతావరణం దెబ్బతిని కక్షపూరిత వాతావరణం పెరుగుతుంది. ప్రశాంతతకు భంగం వాటిల్లిన పల్లెలు సౌభాగ్యాన్ని పూర్తిగా కోల్పోతున్నాయి. కబడ్డీ మోటయింది. గోలీలు మూలనపడ్డాయి. దాగుడుమూతలు దగాకోరు ఆటగా ఎదిగింది. గ్రామీణ క్రీడల స్థానంలో క్రొత్త క్రీడలు వచ్చాయి. క్రికెట్, టేబుల్‌టెన్నిస్, గోల్ఫ్, స్నూకర్ తదితర పాశ్చాత్య ఆటలను ప్రస్తుతం అనుకరిస్తున్నారు. ప్రశాంత గ్రామీణ వాతావరణంలో ఆడాల్సిన క్రీడలను మరచిపోయి పాశ్చాత్య ఆటలను కొనసాగిస్తున్న గ్రామీణ ప్రజలు ఒకరినొకరి మధ్య ఎటువంటి ఐక్యత లేకుండా గడపాల్సిన దుస్థితి రోజురోజుకీ పెరుగుతుంది. ప్రభుత్వం గ్రామీణ క్రీడలు ప్రోత్సహించేందుకు గ్రామాల్లో క్రీడలు నిర్వహిస్తున్నప్పటీకి వాటికి గురించి ప్రజలను చైతన్య పరచడంలో విఫలమవుతుంది. ప్రతి పాఠశాలలో గ్రామీణ క్రీడలు విద్యార్ధులకు నేర్పించే విధంగా చర్యలు తీసుకొని, ఐకత్య వాతావారణం చోటు చేసుకునేలా ప్రయత్నించాలని క్రీడకారులు కోరుతున్నారు.

కోటీశ్వరుడైనా మంచి ఆరోగ్యం లేకపోతే గరీబే అన్నది నానుడి. ఆరోగ్యంతోనే జీవితం ముడిపడి ఉంది. చిన్ననాటి నుంచి క్రీడలు, వ్యాయామం, యోగా వంటివి అనుసరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేటి రాకెట్‌ యుగంలో విద్యార్థులకు చదువులో పోటీ పడుతూ ఆరోగ్యాన్ని పెంచే ఆటలను విస్మరిస్తున్నారు. తరాలు మారాయి, అంతరాలు పెరిగాయి.. పల్లెటూళ్లు పట్నం వైపు పరుగులు ఆగడం లేదు.. ఆధునికతను సంతరించుకోవాడానికి చేస్తున్న ప్రయత్నంలో కంప్యూటర్లు, ఇంటర్‌నెట్లు, ముఖ పుస్తకం (ఫేస్‌బుక్‌), వాట్సాప్‌, టీవీలు చిన్నారుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాయి. తాతయ్య, నానమ్మలు చెప్పిన నీతి కథలు, అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకున్న సంప్రదాయ ఆటలు క్రమంగా దూరమయ్యే పరిస్థితులు వచ్చాయి. మేధస్సును పెంచుతూ సత్ప్రవర్తనను పెంచే అలవాట్లను వదిలి సాంకేతిక సామగ్రితో కుస్తీ పడుతూ తెలియని ఒత్తిడికి గురవుతోంది నేటి బాల్యం.

**చరవాణుల్లో ఆటలు, రోజంతా పుస్తకాలతో కుస్తీ పడుతూ చిన్నారులు సృజనకు దూరమవుతున్నారు. అయితే ఇవన్నీ ఒకవైపు మాత్రమే. నాటి సంప్రదాయాలకు పల్లెలూ, పట్టణాల్లో కొంత ఆదరణ కనబడుతోంది. పల్లె నుంచి పట్నం వెళ్లి ఆధునికతకు అలవాటు పడినా సంస్కృతిని ప్రతిబింబించే ఆటలపై ఆసక్తి పెరుగుతోంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో ప్రతి వీధిలో క్రికెట్‌ బంతికి బదులు కర్రా బిళ్లా కనిపిస్తుంది. చెట్ల కిందకు చేరి కోతి కొమ్మచ్చి, ఇంట్లోనే కూర్చుని బొమ్మలతో ఆడే అష్టాచమ్మా, మేధస్సును పెంచే చదరంగం, గోళీలాట, దుకుడు, బాలికలు ఆడే తొక్కుడు బిళ్ల వంటి ఆటలు నేటికీ దర్శనమిస్తున్నాయి. పాఠశాలల్లో ఆరోగ్య విద్యను నేర్చుకున్న చిన్నారులు వేసవి, విశ్రాంతి సమయాల్లో ఆటలు ఆడటం వల్ల నాయకత్వ లక్షణాలు పెంచుకుంటున్నారు.

**‘దూకుడు’ ఆట

ఒకరిని ఒంగొని ఉంటే పరిగెత్తుకుని వచ్చి పైనుంచి దూకే ఆట ఇది. కోతి కొమ్మచ్చి-పల్లెల్లో ఈ ఆటను కాలు కింద కర్ర అని  పిలుస్తుంటారు. చెట్టు నీడన దీనిని ఆడటంతో పిల్లలు త్వరగా అలసిపోకుండా ఉంటారు. భళారే గోళీకాయలు

పల్లెల్లో నేటికీ ఎక్కువగా చిన్నారులు ఆడే ఆట గోళీలాట. పిల్లల నుంచి యువకుల వరకు ఈ ఆట అంటే ఇష్టపడతారు. గోళీని విసిరి గురి చూసి కొట్టి మరలా జాన దూరంలో గోళిని వేయాలి. లక్ష్యం మేరకు గురి చూసి కొట్టి విజేతగా నిలవడం ఈ ఆటలో ప్రత్యేకత. ఆనందాల అష్టాచెమ్మా..

ఇది 25 అడుగుల చతురస్రాకారపు  నలుగురు వ్యక్తులు  నాలుగు కాయలు పెట్టుకుంటారు. చింతగింజలు, గవ్వలతో గాని పందేలు వేస్తారు. ఒకటి నుంచి ఎనిమిది వరకు లెక్కిస్తారు. అష్ట పడితే 8, చెమ్మ పడితే నాలుగుగా గుర్తించి ఆడతారు. పడిన పందెం ప్రకారం కాయలను తామున్న గడి నుంచి ముందుకు కదుపుతారు. ఎవరి కాయలు ముందుగా మధ్య గడిలోకి చేరితే వారు గెలిచినట్లు. గిల్లీ దండా (గూటీబిళ్ల) ఓడిపోతే దండనే..

పాశ్చాత్య క్రీడ అయిన క్రికెట్‌ రాకముందే అనాదిగా గిల్లీ దండా (గూటీబిళ్ల) అందరికీ సుపరిచితమే. క్రికెట్‌ మాదిరిగా ఉండే ఈ ఆటలో కూడా పలు రకాలున్నాయి. ఎంతమందైనా ఆడే అవకాశం ఉంటుంది. ఒక జట్టు వారు కర్రను గోతిలో పెట్టి కొడతారు. కర్రను అలా కొడుతూ ప్రత్యర్థులను దొరక్కుండా కొనసాగిస్తారు. ఎక్కడైతే బిళ్లను కొట్టలేకపోతారో అపుడు వారు ఓడిపోయినట్లు గుర్తిస్తారు. అపుడు అవకాశం రెండో జట్టుకు వస్తుంది. మేధస్సును పెంచే చదరంగం

ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మన సృజనాత్మకతను పెంపొందించే ఆట చదరంగం. కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మేధస్సుతో ఆడే ఈ ఆట అంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారు. చదరంగా బాగా ఆడేవాళ్లు చదువులోనూ ముందుంటారని పలువురు నిరూపిస్తున్నారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం ఇందులో ప్రధానంగా ఉంటుంది. ఏనుగు, గుర్రం, శకుని, మంత్రి, రాజు, భటులు ఉంటారు. పావులు కదుపుతూ రాజుకు చెక్‌ చెప్పకుండా ఆడటమే ప్రధానం.

- సేకరణ ; కర్లపాలెం హనుమంతరావు

Monday, March 1, 2021

రుణానుబంధాలు - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

కథానిక : 

రుణానుబంధాలు 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)


పెరట్లో గిలక బావి దగ్గర స్నానం  చేస్తున్నాను. . శారదమ్మ తత్తరపడుతూ పరుగెత్తుకొచ్చింది 'రాధాకృష్ణయ్యగారు పోయార్టండీ!' అంటూ.


గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చినట్లయింది. 'ఛ! ,, ఊరుకో!' అని కసిరాను. 


'నిజమేనండీ! రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నార్ట. శాస్తుర్లుగారు వాళ్ళింటి కెళ్ళి ముహూర్తాలు కూడా విచారించుకుని వెళ్లార్ట! ఇంతలోనే ఏం ముంచుకొచ్చిందో ఏమో.. ఇట్లాగయింది'


ఆ ఇంటి వైపు పరుగులు తీయబోతున్న శారదమ్మను ఆపి 'నీ కెవరు చెప్పారివన్నీ? ఏట్లా విన్నావో .. ఏమో?' 


'బజారంతా వాళ్లింట్లోనే ఉంది. ఎంత ఎతిమతం దాన్నైతే మాత్రం ఇట్లాంటి విషయాల్లో పొరపాటు పడతానా! నే పోతున్నా.. మీరు తాళం వేసుకు రండి!' అంటూ మళ్లీ మాట కందకుండా మాయమయిపోయింది మా శారదమ్మ.


స్నానం ఎట్లాగో అయిందనిపించి, బట్టలు మార్చుకుని మళ్లీ వాకిట్లోకొచ్చాను. 


చాలా మంది అటే పోతున్నారు. ఇంటికి తాళం వేస్తుంటే ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. ఇక కదల్లేక అక్కడే గుమ్మం ముందున్న అరుగు మీద కూలబడిపోయాను. వారం రోజుల కిందట జరిగిన విషయం వద్దనుకున్నా కళ్ల ముందు కదులుతోంది.


రాధాకృష్ణయ్యా నేనూ బాల్య స్నేహితులం. వాడు జడ్.పి లో టీచర్ గా చేసి రిటైరయ్యాడు. నేనో బ్యాంకులో పనిచేస్తూ రిటైరవడానికి సిద్ధంగా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య వయసులో నా కన్నా మూడేళ్లు పెద్ద. సర్వీసులో ఉండగానే ఎట్లాగో పెద్దపిల్లకు పెళ్లిచేశాడు. రెండో పిల్ల పెళ్లే వాడికి పెద్ద సమస్యయి కూర్చుంది. 


పిల్లా ఆట్టే చదువుకోలేదు. మరీ సంసారపక్షంగా పెంచింది వాళ్లమ్మ. అన్నిహంగులూ ఉన్నవాళ్ళకే పెళ్లిళ్ళు అవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రెండు మూడు లక్షలన్నా పెట్టలేని వీడికి మంచి సంబంధాలు రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. 


ఎట్లాగయితేనేం పెళ్లి సంబంధం ఒకటి ఖాయమయిందని వాడొచ్చి చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇట్లా అయిందేమిటి?


పెన్షన్ డబ్బులు పూర్తిగా అందలేదు. పెళ్లికని దాచిన డబ్బులో కొంత తీసి కొడుక్కి పంచాయితీ బోర్డులో ఉద్యోగం వేయించాడు. ఇప్పుడు అర్జంటుగా ఓ లక్ష సర్దమని వచ్చి కూర్చున్నాడో రోజు. 


సమయానికి నా దగ్గరా అంత డబ్బు లేకపోయింది. డాబా మీద పోర్షన్ వేయడం వల్ల చేతిలో డబ్బాడటం లేదు. 


' పోనీ.. తెల్సినవాళ్లెవరి దగ్గర నుంచైనా ఇప్పించరా! పెన్షన్ డబ్బు అందగానే సర్దేద్దాం' అని బతిమాలుతుంటే బాధేసింది. 


'ఛఁ! చిన్ననాటి స్నేహితుడి అవసరానికి ఓ లక్ష రూపాయలు సర్దలేకపోతున్నానే!' అని మనసు పీకింది.


ఆ సమయంలోనే తటస్థపడ్డాడు శివయ్య. 


శివయ్య రైల్వే గార్డుగా చేసి రిటైరయ్యడు. అతనికి పెన్షన్ మా బ్యాంక్ ద్వారానే వస్తుంది. మొదట్లో కమ్యూటేషన్, గ్రాట్యుటీ అంతా వచ్చింది కరెక్టేనా కాదా అని లెక్కలు కట్టి చూపించింది నేనే. 


మూడు లక్షలు దాకా వస్తే కొంత ఫిక్సడ్ డిపాజిట్ చేయించాను మా బ్యాంకులోనే. 


నెల నెలా బ్యాంకుకు వచ్చిపోయే మనిషవడం వల్ల పరిచయం కాస్త ఎక్కువే అన్నట్లుండేది పరిస్థితి. 


ఎందుకో, అతనికి నా మీద అదో రకమైన గురి కూడా. డిపాజిట్లు రిన్యూవల్ చేయించుకోడానికి వచ్చినప్పుడెల్లా ఎక్కడెక్కడ ఎంత వడ్డీలు ఇస్తున్నారో విచారించుకుని పోతుండేవాడు. 


ఎప్పటిలా ఆ రోజూ శివయ్య నా దగ్గరికొచ్చి కూర్చున్నాడు. 


'పంతులుగారూ! డిపాజిట్లలో వడ్డీ మరీ తక్కువ వస్తున్నది సార్! ఇంకా మంచిది ఏమైనా ఉంటే చెప్పండి సార్!' అని అడిగాడతను.


అప్పుడు మెదిలింది మనసులో ఆ ఆలోచన. శివయ్య ఏమనుకుంటాడో అన్న తటాయింపు ఉన్నా స్నేహితుడికి సాయం చెయ్యాలన్న తపన నన్నట్లా అడగనిచ్చింది. 


'శివయ్యా! నా కర్జంటుగా ఒక లక్ష కావాల్సొచ్చింది. బ్యాంకు వడ్డీ కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాలే! నెల నెలా ఇస్తాను. రెండు నెలల్లో తీర్చేస్తాను. వీలయితే ఈ లోపే ఇస్తాలే!' అన్నాను.


శివయ్య కాదనలేదు, 'బ్యాంకు వడ్డీ ఇవ్వండిలే సార్! చాలు!' అంటూ ఆ రోజే లక్ష రుపాయలూ డ్రా చేసి ఇచ్చాడు. 


'నోటు రాసిస్తాను' అన్నాను. 'మీ నోటి మాట కన్నా విలువైనదా నోటు? వద్దు' అంటూ కొట్టిపారేశాడు శివయ్య. 


ఒక కాగితం ముక్క మీద మాత్రం రాయించుకున్నాడు. 


'శివయ్య నా మీదుంచుకున్న నమ్మకాన్ని వమ్ము చెయకూడదు' అనుకున్నానా రోజు. అదే మాట రాధాకృష్ణయ్యతోనూ అన్నాను డబ్బిస్తూ. 


'పెన్షన్ రాగానే ముందు ఈ బాకీనే తీరుద్దాం. నీ పరువోటీ,, నా పరువోటీనా? అందాకా నోటు రాసిస్తాను తీసుకో!' అన్నాడు  రాధాకృష్ణయ్య. 


'మిత్రుల మధ్య పత్రాలేమిటి?' అంటూ నేనూ ఆ రోజు కొట్టిపారేశాను. 


ఇప్పుడు విధి రాధాకృష్ణయ్యను కొట్టిపారేసింది. 


ఎంత వద్దనుకున్నా లక్ష రూపాయల విషయం మర్చిపోలేకుండా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య ఇంట్లో ఈ బాకీ సంగతి చెప్పాడో లేదో? చెబితే మాత్రం నోటులేని బాకీని చెల్లుబెట్టాలని రూలేముంది? తన స్నేహం రాధాకృష్ణయ్యతోనే కానీ, వాడి కొడుకుతో కాదుగా!


శాస్త్ర్రులగారబ్బాయి వచ్చి అరుగు మీద కూర్చునున్న నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. 


'ఇంకా మీరిక్కడే కూర్చుని ఉన్నారేంటంకుల్? అవతల వాళ్లంతా మీ కోసం ఎదురుచూస్తుంటేనూ? పదండి పోదాం' అంటూ నన్ను లేవదీసి వాళ్ళింటి వేపుకు తీసుకెళ్లిపోయాడు.


వరండాలో చాపేసి దాని మీద పడుకోబెట్టున్నారు రాధాకృష్ణయ్యను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది వాడి ముఖం. 


'నా బాకీ సంగతేం చేశావురా?' అని ఆడగాలనిపించింది అంత దు:ఖంలోనూ. 


ఆడవాళ్ళు కొందరు ఏడుస్తున్నారు లో గొంతుకతో. 

అప్పటికే బంధువులంతా పోగయివున్నారు. 


రాధాకృష్ణయ్య కొడుకు దుఃఖాన్ని దిగమింగుకొని ఏర్పాట్లు చూస్తున్నాడు. 


నన్ను చూడగానే దగ్గరికొచ్చి కంట తడిపెట్టుకున్నాడు. ఓదార్పుగా వాడి భుజం మీద చెయ్యేసి తట్టేనే గాని నా కళ్లలో మాత్రం నీరు ఊరవా! వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను. 


'ఎట్లా జరిగిందిరా ఈ ఘారం?' 


'రాత్రి వరకు బాగానే ఉన్నారంకుల్! మధ్య రాత్రి  నిద్రలో లేచి అమ్మతో 'గుండెలు బరువుగా ఉన్నాయ'న్నారుట. 


చెల్లెలి పెళ్లి గురించే అలోచించడం వల్లనుకున్నాం. 'అంతా సజావుగా సాగుతుందిలే నాన్నా!' అన్నా ఏదో గుండె ధైర్యం చెప్పడానికి. 


'అంతేనంటావా!' అని మళ్లీ పడుకుండిపోయారు. మళ్లీ ఇక లేవలేదు. తెల్లవారుఝామున గుండెల్లో నొప్పితే మెలికలు  తిరిగిపోతుంటే అర్థమయింది రాత్రొచ్చింది గుండె పోటు ముందు సూచన అని. 


అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఉంటే..' మాట పూర్తవక ముందే గొంతు పూడుకుపోయింది ఆ పిల్లాడికి. 


'పోయే ముందు నీ కేమీ చెప్పలేదుట్రా?' అని అడిగాను ఆశగా. 

తల అడ్డంగా ఊపేడు. 'ఆ అవకాశమే లేకుండా పోయిందంకుల్. అదే బాధ..'


ప్రసాద్ నుంచి వచ్చిన ఆ జవాబుతో ఉన్న ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది.


ఇక్కడ చేరినవాళ్లలో కొంత మంది కూతురు పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోతుందన్న విచారం వ్యక్తపరిచారు. 


విచిత్రంగా నా బాధ మాత్రం వేరేగా ఉంది. నా సొమ్ము సంగతి ఏమిటి? అనేదే నా ఆలోచన. 


వాడూ నేనూ ఇంతప్పటి నుంచి ఒకటిగా తిరిగాం. కాలేజీలు వేరు వేరు అయినా సెలవులకు ఇళ్లకు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఒకళ్లను ఒకళ్లం వదలకుండా లవకుశలకు మల్లే కలిసే తిరిగాం.  ఉద్యోగాల మూలకంగా విడిపోయినా ఇద్దరి మధ్య ఎన్నడూ  ఎడం పెరగలేదు. 


రిటైరయిన వాడు సొంత ఊళ్లో ఉంటే, రిటైర్ మెంటుకు దగ్గరగా ఉన్నందున నేనూ సొంత ఊళ్లోనే పనిచేస్తున్నా. 


ఇప్పుడు విధి మాత్రం మమ్మల్నిద్దర్నీ ఈ విధంగా విడదీసింది. 


పాడె మీద పార్థివ  దేహాన్నుంచి అంత్యక్రియలు ఆరంభించారు. 


ఇంకో పది నిముషాలలో నా ప్రాణస్నేహితుడి రూపం కూడా కంటి కందనంత దూరంగా కనుమరుగయిపోతుంది. 


పచ్చనోట్ల వ్యవహారాన్ని ఎట్లాగైనా మర్చిపోవాలి. 


అందుకు ఒక్కటే మార్గం. వాడిని భుజం మీద మోసుకుంటూ అంతిమస్థలి దాకా అందరితో కలసి నడవడమే! 


వాడు చితిలో కరిగిపోయే దృశ్యం కళ్లారా  కనిపించినప్పుడు కానీ చేదు వాస్తవం మనసు పూర్తిగా జీర్ణించుకోలేదు. 


పై చొక్కా విప్పేసి, కండువా భుజం మీద వేసుకుని తయారవుతున్న నన్ను చూసి శారదమ్మ దగ్గరకొచ్చింది. 'మీ కసలే బాగుండటం లేదు. అంత దూరం మోయగలరా?'


'వాడు నా మీద మోపిన రుణభారం కన్నా ఇది గొప్పదా?' అని అందామనుకున్నా కానీ, అతికష్టం మీద తమాయించుకున్నా.


కట్టుకున్నదానికైనా చెప్పుకోలేని గడ్డు నిజం. శారదమ్మకు ఈ అప్పుగొడవలేమీ అప్పట్లో తెలియనివ్వలేదు. 


అంతిమ యాత్రలో అందరితో కలిసి నడుస్తున్నా ఆగడమే లేదీ పాడాలోచనలు. 


నేనే వృథాగా వర్రీ అవుతున్నానేమో! అంత పెద్ద మొత్తం! తన దగ్గర రుణంగా తీసుకున్న విషయ రాధాకృష్ణయ్య కొడుక్కు చెప్పకుండా ఉంటాడా? పెన్షన్ డబ్బు అందగానే ప్రసాద్ తన బాకీ తీరుస్తాడేమో! 


అట్లా తీర్చని పక్షంలో తానేం చెయ్యాలి? ఒకటా రెండా! వడ్డీతో కూడా కలుపుకుంటే పెద్ద మొత్తమే అవుతుంది. తీర్చాలని ఉన్నా అంతా తీర్చలేడేమో! వాడు అసలు నేనెందుకు తీర్చాలని  అడ్డానికి తిరిగితేనో? 


మిత్రుడి కొడుకు మీద కోర్టుకెళ్లే ఆలోచనే జుగుప్సా అనిపించింది నాకు. 


ఆస్తులు పంచుకున్నట్లే, అప్పులూ పంచుకోవడం కన్నబిడ్డల్లా కొడుకుల బాధ్యత.ప్రసాద్ కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకునే రకం కాదు.. ఇట్లా సాగుతున్నాయి దారిపొడుగూతా నా ఆలోచనలు . 


కర్మకాండల తతంగం ముగిసి బంధుమిత్రులు వెళ్లిపోయి ఇల్లంతా మెల్లిగా  ఆ విషాదానికి సర్దుకునే సమయంలొ .. అదను చూసి అడిగాను ప్రసాదును అక్కడికీ ఆశ చావక 'ప్రసాదు! నాన్న ఇంటి సంగరులెప్పుడూ నీతో చెప్పలేదా?' అని.


'మాట్లాడుతూనే ఉంటారంకుల్! ఇదిగో.. ఈ పెళ్లి తలపెట్టినప్పటి నుంచే మూడీగా మారిపోయారు. సొమ్ము సమకూరదనేమన్నా దిగులేమో! చేసిన అప్పులు తీర్చడ మెట్లాగన్న ఆలోచనా నాన్నగారిని బాగా కుంగదీసింది. సగం ఆ దిగులుతోనే కన్నుముశారేమోనని నా అనుమానం' అన్నాడు ప్రసాద్.


నాకు కొద్దిగా ఉత్సాహం వచ్చింది 'తాను చేసే అప్పుల గురించి ఎప్పుడైనా నీతో చర్చించేవాడా?' అనడిగాను ఆశగా. 


'నోటితో చెప్పలేదు కానీ.. ఇదిగో ఈ డైరీలో రాసి పెట్టుకున్నారు. కొద్ది మందికి అప్పుపత్రాలు రాసినట్లున్నారు. అంతా కలసి ఒక అయిదారు లక్షలు అయినట్లుంది' 


'మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావ్?'


'ముందు చెల్లెలి పెళ్లి పూర్తి చెయ్యాలి. అప్పుడే నాన్నగారికి కన్యాదాన ఫలం దక్కేది. ఆ తరువాత కూడా పెన్షన్ డబ్బులేమన్నా మిగిలుంటే  వీలయినంత వరకు పత్రాలకు సర్దుదామనుకుంటున్నా. మీరేమంటారంకుల్?' 


'మంచి ఆలోచనరా! బాకీలు తీర్చి తండ్రిని రుణవిముక్టుణ్ణి చెయ్యడం కొడుకుగా నీ బాధ్యత కూడానూ! అందరూ  నోట్లే రాసివ్వలేదేమో! చే బదుళ్లూ..'


'మధ్యలోనే తుంచేశాడు ప్రసాద్ 'నోట్లు విడిపించుకోవడమే తలకు మించిన పని. నోటి మాట  బదుళ్లూఎలా తీర్చగలం? అందులోనూ అందమా  నిజమే చెబుతారని గ్యారంటీ ఏంటంకుల్?చనిపోయినవాళ్ల పేరు చెప్పుకుని డబ్బులు దండుకునేవాళ్ళు కోకొల్లలు ఈ కాలంలో! అవన్నీ తీర్చడమంటే నా వల్లయ్యే పనేనా?..


'ప్రసాద్ సమాధానంతో నా నవనాడులూ కుంగిపోయాయి. 


'పోనీ.. ఆ డైరీలోనే నా పేరేమైనా రాసేడేమో! డైరీ చూపించమని ఓ సారి అడిగితే!' నా ఆలోచన నాకే సిగ్గనిపించింది. కానీ, లోపలి మధనను ఆపుకోలేని బలహీనత. 


ప్రసాద్ స్నానాల గదికి వెళ్లిన సందు చూసి అక్కడే టేబుల్ మీదున్న డైరీ తీసి ఆత్రుతగా తిరగేశా. 


ఊహూఁ! ఏ పేజీలోనూ నా పేరే కనిపించ లేదు! 


నాకుగా  నేను  ఆ చేబదులు ఊసెత్తితే ప్రసాద్ నన్ను ఏ కేటగిరీలో చేరుస్తాడో తెలుసు! పరువే ప్రధానంగా గడిపే మధ్య తరగతి జీవిని నేను. 


'లక్ష రూపాయలకు నీళ్లొదులుకోక తప్పదు' అని ఆ క్షణంలోనే ఒక నిశ్చయానికి వచ్చేశాను. 


రాధాకృష్ణయ్య నన్ను తప్పింకుని పోగలిగాడు కానీ, శివయ్య నుంచి నేనెలా తప్పించుకోగలను!


అప్పటికీ సాధ్యమైనంత వరకు శివయ్య కంటబడకుండా ఉండేందుకు ప్రయత్నించాను. 


ప్రసాద్ తండ్రి పింఛన్ సొమ్ము అందుకున్నాడు.  కిందా మీదా పడి చెల్లెలి పెళ్లి అయిందనిపించాడు. పెళ్ళిలో నా భార్య బాగా పూసుకు తిరిగింది. నేనే, మనసు పెట్టి మిత్రుడి కూతురి కళ్యాణ శుభవేళంతా కలవరంతో గడిపేసింది! 


రాధాకృష్ణయ్య పేరు చెవిన పడగానే ముందు లక్ష రుపాయల రుణం కళ్ల ముందు కదలడం నా దురదృష్టం. 


ఆబ్దికాలకు హాజరయి వచ్చిన తరువాత .. వీలయినంత వరకు వాడిని ఊహల్లోకి రానీయకపోవడమే మిత్రుడిగా నేను వాడికి చేయదగ్గ న్యాయం అనిపించింది.


శివయ్య పెట్టిన గడువు రానే వచ్చింది. ఆ రోజు అతను బ్యాంకుకు వచ్చాడు కూడా. కానీ, బాకీ సంగతి హెచ్చరించలేదు! నేనూ నాకై నేను ఆ ఊసు జోలికి పొదలుచుకోలేదు. కానీ, ఎంత కాలమని ఇట్లా?!


నా మీద నమ్మకంతో ఏ నోటూ లేకుండానే  అతి తక్కువ వడ్డీతో అంత పెద్ద మొత్తం అప్పుగా ఇచ్చిన పెద్దమనిషి నుంచి మొహం చాటేసే దౌర్భాగ్య పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నానే! 


'మిత్రుడయితే ఏంటి? అంత పెద్ద మొత్తం అప్పుగా ఇస్తున్నప్పుడు రాధాకృష్ణయ్య దగ్గర నోటు రాయించుకుని ఉండాల్సింది. నా పొరపాటే నా నేటి దౌర్భాగ్య పరిస్థితికి నూటికి నూరు పాళ్లు కారణం' అని అనుకోని క్షణం ఉండటంలేదు ఈ మధ్య కాలంలో!


బ్యాంకు కొచ్చిన మూడో సారి కూడా తన బాకీ  ఊసెత్తని నన్ను అదోలా చూశాడు శివయ్య. 'సారీ శివయ్యా! అనుకున్న టైముకు డబ్బందలేదు. వడ్డీ ఇస్తాను. అసలుకు నోటు రాసిస్తాను.. కాదనకుండా తీసుకో!' అన్నాను.


వడ్డీ పైకం తీసుకుని నోటు తయారుచేయించి తెచ్చాడు. సంతకం చేసి ఇచ్చేటప్పుడు 'వచ్చేనెలలో నా బిడ్డ పెళ్లి  పెట్టుకున్నాను సార్! ఎట్లాగైనా సొమ్ము సర్దాలి' అంటున్నప్పుదు శివయ్య ముఖం చూడలేక నేను  సిగ్గుతో చచ్చిపోయిన మాట నిజం.


శివయ్య ఇప్పుడు బ్యాంకుకొచ్చినా నన్ను కలవడం లేదు. నేను పలకరించినా ముభావమే సమాధానం.


ఓ శుక్రవారం  బ్యాంకు కొచ్చి ఉన్న డబ్బంతా విత్ డ్రా చేసుకున్నాడు శివయ్య. 


నా దగ్గరికొచ్చి 'సోమవారం నోటు తీసుకువస్తాను. ఎట్లాగైనా సొమ్ము చెల్లించాలి. వడ్డీ అక్కర్లేదు. అసలు ఇస్తే అదే పదిలక్షలు!' అని తాఖీదు  ఇచ్చిపోయాడు. 


శివయ్య దృష్టిలో నేను అంతలా పడిపోవడానికి కారణమెవరు? 


రాధాకృష్ణయ్యా? రాబోయే మరణాన్ని వాడేమైనా కలగనలడా? ఆ మృత్యుదేవత రాధాను కాకుండా తననైనా ఎంచుకుని ఉండొచ్చుగా! అప్పుడీ శివయ్య ఏం చేసివుండేవాడు? 


శివయ్యను మాత్రం తప్పెలా పట్టగలను?అంత పెద్ద మొత్తాన్ని స్వల్ప వడ్డీకి ఏ ఆధారం లేకుండా తనకు ధారపోసిన గొప్పవ్యక్తిని ఎట్లా తప్పుపట్టడం? 


ఏ వత్తిడుల కారణంగానో తానిప్పుడు వైఖరి మార్చుకున్నాడో? 


సమయానికి తాను చెసిన సాయాన్ని గురించి సమాచారం లేనందువల్లనే కదా మిత్రుడి కొడుకు ప్రసాదైనా తన చే బదులును లెక్కలోకి తీసుకోనిది? ఇన్ని పాత రుణాలను చెల్లిస్తోన్న అతని మంచి గుణం కేవలం నోటు లేదనే ఒకే ఒక సాకుతో ఎగవేసేందుకు  ఒప్పుకుంటుందా? 


పరిమితికి మించిన నమ్మకాలు, సమాచార లోపాలు.. విధి ఆడించిన నాటకాల కారణంగానే  వ్యక్తిత్వాలు ఇక్కడ ప్రశ్నార్థకాలు అయ్యాయే తప్పించి.. ఆర్థిక బంధాలు మానవీయ సంబంధాలకు మించిన బలమైనవిగా భావించడం సరయిన దిశలో సాగే అవగాహన కాదేమో!  


ఏదేమైనా శివయ్య బాకీ తీరిస్తే గాని, నా మనశ్శాంతి నాకు తిరిగి రాదు. 


ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీతభత్యాల ఎరియర్స్  తాలూకు మధ్యంతర చెల్లింపులకు ఆదేశాలు ఆ శనివారమే వెలువడ్డంతో ఆదివారం అంతా బ్యాంకులో కూర్చుని సిబ్బంది మొత్తం ఉత్సాహంగా ఆ పని చూసుకున్నాం. 


సొమవారం ఉదయానికల్లా అందరి ఖాతాలలో సొమ్ము జమ. 


ఈ సారి ఎరియర్స్ సొమ్ముతో వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకోవాలని శారదమ్మ ఎంతో కాలంగా ఆశతో ఎదురుచూస్తోంది. 


సోమవారం శివయ్య బ్యాంకు వైపుకు వస్తాడనుకున్నాను. రాలేదు! 


మరో రెండు రోజులు చూసి నేనే సొమ్ముతో సహా శివయ్య చిరునామా వెతుక్కుంటూ వెళ్లాను. 


ఇల్లు కనుక్కోవడం చాలా కష్టమయింది. అది  ఒక మురికిపేటలో ఉంది. శివయ్య ఇల్లు చాలా అధ్వాన్నంగా ఉంది. 


తలుపు కొట్టాను. ఒక నడివయసు ఆడమనిషి గడియ తీసింది. 

నన్ను ఎగాదిగా చుసి 'ఎవురు కావాల?' అంది. 


చెప్పాను. 


నిర్లక్ష్యంగా పక్కగది చూపించి వెళ్లిపోయింది.


శివయ్య మంచం మీదున్నాడు. మంచం చాలా మురికిగా ఉంది. 


శివయ్య మొహంలో కళ లేదు. నెలరోజులు లంఖణాలు చేసిన రోగిష్టిమారిలా కనిపించాడు. 


నా పలకరింపులు అయినంత సేపూ డోర్ కర్టెన్ వెనక ఏవో కదలికలు. 


డబ్బు ఇవ్వడానికి బేగులో చెయ్యి పెట్టాను. 


అతను బలహీనమైన చేతితో ఆ పని ఆపుచేయించాడు 'మీ ఫ్రెండు గారి అబ్బాయే వచ్చి ఇచ్చి వెళ్లాడు. నోటు మీకు ఇద్దామనుకునే లోపలే అడ్దంపడ్డాను.' అంటూ పరుపు కింది  దాచుకున్న పత్రాలలో నుంచి ఒక పత్రం ఏరి తీసిచ్చి 'ఇక మీరు వెళ్లవచ్చు' దండం పెట్టేశాడు. 


 ఏదో అడగబోయేటంతలో ఇందాకటి ఆడమనిషి లోపలి కొచ్చింది అనుమానంగా చూస్తూ. 


శివయ్య అటు తిరిగి పడుకుండిపోయాడు. 


అంటే ఇక నేను 'బైటికి దయచేయచ్చు'  అని అర్హ్తమనుకుంటా. 


సవాలక్ష అనుమానాలతో నేను తిరిగివచ్చేశాను. 


ప్రసాదుకు ఈ బాకీ సంగతి తెలుసన్నమాట! 


రాధాకృష్ణయ్య చూచాయగా కూడా చెప్పినటట్లు  లేదే! 


ప్రసాదుతో మాట్లాడితే గాని విషయాలు తేలవు. 


చికాకు కారణంగా నేను ఆ దిక్కుకు పోవడమే మానేశాను. 


పాడు డబ్బు పితలాటకం మూలకంగా ప్రాణస్నేహితుడి కుటుంబానిక్కూడా దూరమయిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. 


వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో  నేను ఆ కుటుంబానికి రాధాకృష్ణయ్యలాంటి వాడిని. ప్రసాద్ ఎన్నో సార్లు సలహా కోసరంగాను తన దగ్గరి కొస్తుండేవాడు. 


తన ముభావం  కారణంగా రాకలు తగ్గించేశాడు. 


నేను ప్రసాద్ ను కలవడానికి బైలుదేరుతుంటే శారదమ్మ అన్నది నిష్ఠురంగా 'ఆ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ లేడుగా! కొత్త బావగారు తనకు దుబాయ్ లో కొలువిప్పించాడు. ఆ సంగతి చెప్పడానికని ఎన్ని సార్లు వచ్చినా మీరు  మొహం చాటేశారు.. మహగొప్పగా!'  


నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. 


అయిందేదో అయింది. ముందీ డబ్బు మిస్టరీ తేలాలి. 


శారదమ్మ ద్వారా ప్రసాద్ దుబాయ్ చిరునామా సేకరించి ఇంత పెద్ద ఈ మెయిల్ పంపించాను. 


ఫోనులో నేరుగా మాట్లాడవచ్చు. కానీ, అత్మాభిమానం.. అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడనీయదు: 


చే బదులు విషయంలో ముందు  నుంచి జరిగిందీ.. తరువాత నా ప్రవర్తనా..  అందుకు కారణాలు గట్రా అంతా ఓ సోదిలా వివరించి.. చివరగా శివయ్య బాకీ తీర్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియచేశా. 


తెల్లారే సరికల్లా ప్రసాద్ నుంచి తిరిగు మెయిల్! 


'ఆ శివయ్య ఎవరో నాకు తెలీదు  అంకుల్! నేను అతనికి డబ్బిచ్చిందేమీ లేదు! నాన్నగారు అలా మీ ద్వారా అతని దగ్గర్నుంచి అప్పు తీసుకున్నట్లు నాకు ఎప్పుడూ చెప్పను కూడా చెప్పలేదు. ఆ సంగతి ఇదిగో ఇప్పుడు మీ ఉత్తరం అందిన తర్వాతనే తలిసింది. అందరి అప్పులూ తీర్చేశాను. ఈ ఒక్కటి మాత్రం ఎందుకు? ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. తండ్రిని రుణశేషుణ్ణిగా మిగల్చడం కన్నబిడ్డకు భావ్యం కాదని మీరే అంటారుగా! అమౌంట్ పంపుతున్నా! దయచేసి అతని బాకీ అణా పైసల్తో సహా తీర్చేయండి!'


ప్రసాద్ పంపిన డబ్బు అందిన తరువాత బలవంతంగానైనా శివయ్యకు ఆ డబ్బిచ్చెయ్యాల్సిందేనని వెళితే .. అంతకు మూడు రోజుల కిందటే పోయినట్లు తెలిసింది. 


కొడుకు జులాయిట. ఎక్కడి డబ్బు పేకాటకు పోస్తుంటే .. అడ్డొస్తున్నందుకు దుడ్డు కర్రతో బుర్ర రాంకీర్తన పాడించాడుట! 


అప్పటికి తిరిగొచ్చినా శివయ్య సొమ్ము నా దగ్గరుంచుకో బుద్ధేయలేదు. 

అతని కష్టార్జితాన్ని సద్వినియోగం చేయడమెట్లాగా అని మధన పడుతుంటే.. మాటల సందర్భంలో బాకీ అడిగిన రోజు శివయ్య చేసిన పెద్దల వెల్ ఫేర్ సెంటర్ల ప్రస్తావన గుర్తుకొచ్చింది.


నాకు తెలిసిన ఓల్డేజ్ హోమ్   కు శివయ్య పేరున ఆ పెద్ద మొత్తం శాశ్వత విరాళం కింద ఇచ్చిన తరువాత గాని మనసుకు శాంతి లభించింది కాదు. 

***

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)







'








 

 

 

'

 

 

'

Sunday, February 28, 2021

జీవితం విలువ – పెద్ద కథ -రచనః కర్లపాలెం హనుమంతరావు


కథ 

జీవితం విలువ 

రచన: కర్లపాలెం హనుమంతరావు 


'క్లిక్' మంటూ ఇన్ కమింగ్ కాల్ సౌండొచ్చింది . తీసి చూశాడు సుందరం. 'ఇంకో గంటలో నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోబోతున్నాను. నా చావుకు అనితే బాధ్యురాలు- సురేష్ ' అని మెసేజ్ . 


సుందరం షాక్!


'ఎవరీ సురేశ్? ఫ్రెండ్సులో  ఎవరూ లేరే!’


ఆఫీసు చేరి సీట్లో సర్దుకోక ముందే  బాస్ నుంచి పిలుపు! తిరిగి  సీట్లో కొచ్చి పడే వేళకు గోడ మీది గడియారం పదకొండు గంటలు  బాదింది.


మళ్లీ సెల్ బైటికి తీశాడు సుందరం. మెసేజ్ వచ్చి మూడు గంటలు దాటింది. ఈ పాటికి ఆ సురేష్ అనే అభాగ్యుడెవడో ..! 


' ఇప్పుడేం చేసీ లాభంలేదు.. జరగాల్సిందేదో జరిగిపోయుంటుంది ' .  మెసేజ్ డిలెట్ చేసి.. పనిలో  పడిపోయాడు సుందరం.

***


నర్మదా నర్శింగ్ హోం.


సెకండ్ ఫ్లోర్ లేబర్ రూము నుంచి మూలుగులు. లోపల సర్జరీ జరుగుతోంది కూతురికి .  ఆ టెన్షన్లో ఉన్న పురుషోత్తమరావుగారి . 

సెల్ కి మెసేజ్ వచ్చింది.


'ఇంకో గంటలో నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోబోతున్నాను. నా చావుకు అనితే బాధ్యురాలు- సురేష్ '.. అని  మెసేజ్!


పెద్దాయన గుండె గతుక్కుమంది. ' ఎవడీ సురేష్? అనిత అంటే వాడి పెళ్లామా? ఇప్పుడేం చెయ్యడం?' అన్న ఆలోచనలో ఉండగానే 

' మగబిడ్డ! తల్లీ.. బిడ్డా సేఫ్' అని కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోయింది డాక్టర్ .


'అంటే.. మనింట్లో ఇంకో సురేష్ పుట్టాడన్న మాటే' అంటూ  సంబరపడిపోతున్న భార్య వంక ఉలిక్కిపడి చూశారు పురుషోత్తమరావుగారు. అల్లుడుగారు చనిపోయిన తన తండ్రిగారి పేరు మీద పెట్టుకోవాలని ముచ్చట పడిన పేరూ కాకతాళీయంగా ' సురేష్ ' . 


సెల్  వంక చూసి 'సురేషా ? వద్దొద్దు! ఆ పేరొద్దు!'అంటూ వచ్చిన మెసేజ్ ని డిలెట్ చేసారాయన ..సెంటిమెంటల్ గా  .   

***


బైట బైక్ స్టార్టయిన చప్పుడు. పిల్లలిద్దర్నీ బళ్లలో డ్రాప్ చేసేందుకని  వెళ్లే భర్త గంగరాజు వంక  మురిపెంగా చూసి స్నానాల గదిలోకి దూరింది సుమతి. 


గంగరాజుది పోలీస్ డిపార్ట్ మెంట్. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ . పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాన్ని  తరలించాడు కాదు .     గంగరాజే వీలున్నప్పుడల్లా ఇటు వైపు వచ్చిపోవడం.

భర్త వచ్చిన  ప్రతిసారీ ఏదో కొత్త అనుభవమే సుమతికి !


స్నానం కానించి గదిలో బట్టలు మార్చుకునే టైములో సుమతి  సెల్ ఫోన్ 'క్లిక్' మంది. చూస్తే అదే సందేశం! 'ఇంకో గంటలో నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోబోతున్నాను. నా చావుకు అనితే బాధ్యురాలు- సురేష్'! 


' ఎవరీ సురేష్ ? తనకెందుకీ మెసేజ్ వచ్చినట్లు ?! ' 

సుమతి కళ్లు  గిర్రున తిరగాయి. తూలిపడబోయి తమాయించుకుంది.


బైట బైక్ ఆగిన చప్పుడు! డోర్ తీసుకుని ఎప్పుడు గదిలో కొచ్చాడో.. అమాంతం వెనక నుంచి సుమతిని  గాఢంగా కౌగలించుకున్నాడు గంగరాజు. భార్య మూడీగా ఉండటం చూసి అనుమానంగా అడిగాడు ' ఎనీ ప్రాబ్లమ్ ? ' 


'ఏం  లేదండీ!' అని మాత్రం అనగలిగింది సుమతి అతి కష్టం మీద. 


గోడ మీది గడియారం పన్నెండు గంటలు బాదిందాకా గంగరాజు హుషారును తట్టుకోడంతోనే సరిపోయింది  సుమతికి . భర్తతో ప్రేమగా  గడపడం  ఓ వంక ఆనందంగానే  ఉన్నా.. మరో వంక ఆ మెసేజ్ వల్ల గిల్టీగా కూడా ఉందామెకు.


గోడ మీది గడయారంలోని పెండ్యులంలా అమె మనసూ అటూ ఇటూ ఊగిసలాడులోంది  అదే పనిగా..

***


సుమతి , పురుషోత్తమరావుగారు, సుందరం .. వీళ్లెవ్వరూ ఎరగని ఆ సురేష్.. వయసు ఇరవై రెండు. చదువు బి.కాం.. సెకండ్ క్లాస్. ప్రస్తుతం వోడాఫోన్  సేల్స్ మార్కెటింగ్ లో పని. ఊరు కోదాడ. పుట్టి పెరిగిన ఊళ్లను వదిలి బతుకుతెరువు కోసం భాగ్యనగరం రోడ్లను పట్టుకు వేలాడే వేలాది మంది యువకుల్లో అతగాడూ ఒకానొకడు.


'మంచి రోజులసలొస్తాయా ?' అనుకుంటో కృష్ణానగర్ సందుల్లో పందుల కొష్టాల్లాంటి టెన్ బై ట్వల్వ్ రూములు పదింటి  మధ్య తనూ  ఓ దానిలో పడి ఏడుస్తో పాడు రోజుల్నీడ్చే రోజుల్లో.. 


ఓ రోజు ఆదివారం సాయంత్రం .... కృష్ణకాంత్ పార్క్ బైట మెట్ల మీద చేరి దారే పోయే అమ్మాయిల వంక అరాధనగా చూసుకుంటూ సౌందర్యోపాసనచేసే  వేళ..


దడ.. దడ.. దడ.. మేఘాలకు పిచ్చ మూడ్ వచ్చినట్లు ధారాపాతంగా ఒకటే కుండపోత!


వాన వెలిసింది మరో పది నిముషాలల్లో!


పార్క్ గేటు ముందు వర్షానికి తడిసిన స్కూటీ  ఎంతకూ  స్టార్టవక తంటాలు పడుతున్న ఓ అమ్మాయి .. సాయం కోసం చుట్టూతా చూసి చేయెత్తి దగ్గరకు రమ్మంటూ పిలిచింది సురేష్ ని!  గాలిలో తేలుకుంటూ వెళ్లాడు.. సురేష్!


‘సైలెన్సర్లో నీళ్ళు నిండాయి. అందుకే  బండి ఒక పట్టాన స్టార్టవడంలేదం’టూ.. చెక్ పోస్ట్ దాకా నెట్టుకుంటూ తీసుకు వెళ్ళాడామె బండిని సురేష్  ఆమె ఎంత  ‘వద్దు.. వద్ద’ని మొత్తుకుంటున్నా. 


ఈ దారిలోనే మాటలు కలిశాయి ఇద్దరికీ . 


ఆమె పేరు అనిత  . తను ప్రతీ సండే అలాగే పార్కుల్లో తిరుగుతూ . . ప్లాస్టిక్ బ్యాగుల వల్ల ఎంత ప్రమాదమో జనాలకు  వివరంగా చెప్పి వాటికి బదులుగా వాడమని పేపర్ బ్యాగులు ఉచితంగా పంచిపెట్టే టైపు  ప్రజాసేవ గట్రా చేస్తుంటానని తనే చెప్పకొచ్చింది .. ఏమీ అడక్కుండానే. 


'ఎందుకిదంతా?' అయోమయంగా అడిగాడు సురేష్.


'ప్లాస్టిక్ వస్తువులలో ఎన్నటికీ నశించిపోని ఒక రకమైన దుర్గుణం ఉంది. ఆ పదార్థాల తయారీని మనం అలాగే పెంచుకుంటూ పోతే భూమ్మీదొక నిర్జీవమైన పొర ఏర్పడి జీవులన్నీ క్రమంగా నశించిపోడం ఖాయం' అందామె.


'ఎన్నాళ్లకూ?'


'దాదాపు ఇంకో రెండు మూడు వందల ఏళ్లకు'


నవ్వొచ్చింది సురేష్ కు. 'ఓహ్! అప్పటి దాకా మనం బతిగుండం కదా? ఆ భయంతోనా మీరిప్పుడు ఇట్లా వానలో స్టార్ట్ కాని బండిని తిప్పుకుంటూ తిప్పలు పడుతున్నదీ?' అన్నాడు జాలిగా.


'ఒన్ మినిట్ ప్లీజ్! యాక్చువల్ గా వానలో పూర్తిగా తడిసింది మీరు. బండిని నెట్టుకుంటూ తిప్పలు పడుతున్నది కూడా మీరే!' అని గలగలా తిరిగి నవ్విందా అమ్మాయి.


ఐనా వెంటనే సీరియస్ అయిపోయి క్లాస్ పీకింది 'మన మంచి కోసం మాత్రమే మనం చేసుకోవాలని రూలెక్కడైనా రాసుందా చెప్పండి ?మీ లెక్కన .. ఇదిగో ఈ కొబ్బరి చెట్టు ఉంది కదా ఇక్కడ! దీని మట్టల్ని మాత్రమే మీరు బట్టల మాదిరి చుట్టుకుని తిరుగుతుండేవాళ్లు ఇప్పటిక్కూడా. టెర్లిన్సు, జీన్సు, గుడ్డూ గూసూ అంటూ కొత్త కొత్త గూడ్సు  కనిపెట్టుకు ఎంజాయ్ చెయ్యడమెందుకు? మన జీవితం మరింత సౌకర్యవంతంగా ఉండాలన్న యావతోనే కదా! ఎప్పటికప్పుడు ఏవేవో కొత్తవి  కనిపెట్టాలని కోరికే లేకపోతే కోతులకూ మనకూ తేడా ఏముంది?' అంది మళ్లీ గలగలా నవ్వుముత్యాలు  నడిరోడ్డు మీదనే  వెదజల్లేస్తూ! ఆ నవ్వులు  ఆ కోదాడ కుర్రాడికి భలే నచ్చాయి. ఆమె  మాటల్లోని అంతరార్థం కన్నా ఆమె తనతో అంత చొరవగా మాట్లాడడం మరీ నచ్చింది. 


ఇద్దరి మధ్యా అట్లా మొదలయిన  పరిచయం క్రమంగా స్నేహంగా ముదిరి పాకాన పడింది. 


 అనిత ఎక్కడుంటే అక్కడే సురేష్ ఇప్పుడు  ! అనితకు నచ్చదని సిగిరెట్లు తాగడం మానేశాడు. సెకండ్ షోలకని, క్రికెట్ మ్యాచ్ ల కని సమయాన్ని వృథా చెయ్యడం తగ్గించి, బ్యాంకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం శ్రద్ధగా ప్రిపేరవుతున్నాడు. కోదాడలో కామర్స్ టీచరు కొట్టి కొరతేసినా  చెయ్యనిది, సెలవులకని ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి తల బాదుకున్నా  లొంగనిది , ఇప్పుడు అనిత నోటితో చెప్పకపోయినా చేసేస్తున్నాడు. 


రెండు బ్యాంకు పరీక్షలు ఇప్పటికే ఇచ్చేశాడు. ఒకటి ఇంటర్వ్యూ దాకా వచ్చి..  పోయింది. ఇంకోటి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. రిజల్ట్స్ కోసం వెయిటింగ్!


మంచి జాబ్ చేతిలో ఉంటే 'మనం పెళ్లి చేసుకుందాం' అని అనితను ధైర్యంగా అడగవచ్చన్నది సురేష్ ధీమా. 


 'అంతకన్నా ముందు అసలు ఆమె నిన్ను ఇష్ట పడుతుందో లేదో తెలుసుకోరా! అదీ  ముఖ్యం!' అని  సలహా ఇచ్చాడు రమేష్.


రమేష్ సురేష్ కు వరసకు మేనబావ. అనిత జీవితంలోకి రాక మునుపు అనిత కన్నా ఎక్కువ క్లోజ్.


రెండు రోజుల తంటాలతో  తయారుచేసిన    తన లవ్ లెటర్స్ రెండు మూడు అందుకున్న తరువాత ఆమె నుంచి వచ్చిన రెస్పాన్స్ చచ్చే ఆశ్చర్యం కలిగించింది   సురేష్ కి. 


లేత వయసులో ఏ ఆడపిల్లయినా మరీ ఇంత పచ్చిగా మాట్లాడేస్తుందా! ‘ఈ లవ్ లెటర్లు.. రక్తాలతో రాయడాలు ఇవన్నీ..  ఐ డోంట్ లైక్ సురేష్! ఏదైనా మనసులో ఉంటే ఒకళ్లతో ఒకళ్లం పంచుకోడానికి సంకోచమెందుకు! ఇదేమైనా ఇంకా సెన్సారు కాని బ్లూ ఫిలిం తాలుకు రీలు ముక్కా? చాటు మాటుగా ఇట్లా పేపర్ల మీద రాసుకోడాలేంటీ? ఇవాళ మన ఈడు అబ్బాయిలు, అమ్మాయిలు  ప్రేమ పేరుతో ఖరాబు చేసే కాగితాలను గాని సక్రమంగా వినియోగిస్తే, వనరులు లేక మధ్యలో చదువులు ఆపేసిన  వెనకబడి ఉండే ప్రాంతాల్లోని పిల్లలు  ఎంతో మందికి ఉచితంగా టెక్శ్ట్ బుక్కులు, నోట్ బుక్కులూ తయారవుతాయి ..  తెలుసా' అనేసింది. అవాక్కయిపోవడం సురేష్ వంతయింది.


సామాజిక పరంగా   ఆలోచించడం    సమంజసమే కావచ్చు  కానీ మరీ పీల్చే గాలికీ దాన్ని   ఆపాదించటం   వెర్రితనం అనిపించుకుంటుంది.  సురేష్  మనసులో అలా ఈసడించుకొన్న క్షణాలు లేకపోలేదు .


 'ఆఁ! అదంతా వయసు వేడిలో పడే  ఆవేశమే కాని,   పెళ్లయి ఓ సంసారమంటూ ఏర్పడ్డ తరువాత  మొగుడూ పిల్లలే లోకంగా తయారవుతారీ   ఆడపిల్లలంతా! ముందా బ్యాంక్ ఉద్యోగమేదో ఖాయం కానీ, నేరుగా పెద్దాళ్ల చేతనే వాళ్ల పెద్దాళ్లతో మాట్లాడిస్తా!’ అని సర్దిచెప్పుకొంటాడప్పుడు సురేష్ . 


ఉద్యోగం రావడమూ అయింది; తన  దూరపు చుట్టాన్నెవర్నో వెంటబెట్టుకొనెళ్లి అనిత నాన్నగారిని అడగటమూ  అయింది.


'పిల్లదాని ఇష్టం ముఖ్యం . అమ్మాయిని అడిగి చెప్తా .. ఓపిక పట్టండి' అని అడ్రస్ తీసుకున్నాడా పెద్దాయన.


ఆవెంటనే  కథ క్లైమాక్సుకి వచ్చేసింది. సురేష్ ఉండే గదికి భద్రకాళిలా వచ్చిపడింది   అనిత. 


ఆటైంలో  టీ.వీలో ట్వంటీ ట్వంటీ  మ్యాచ్ నడుస్తోంది. వంటరిగా ఉన్న సురేష్ ను తగులుకుంది అనిత 'నన్నే పెళ్లి చేసుకోవాలని  ఎందుకురా అంత కుతి? నీతో క్లోజ్ గా మూవయ్యాననా? ఆ లెక్కన నాకు రోజుకో పెళ్లవాలిరా బేవకూఫ్! అసలు మన మధ్య మాటి మటికీ ఈ పెళ్లి ప్రస్తావనలు ఎందుకొస్తున్నాయో.. ఐ కేంట్ జస్ట్ అండర్ స్టాండ్! మన ఫ్రెండ్షిప్పులోనే ఏదో లోపమున్నట్లుంది  . నిన్నెప్పుడైనా నేనా విధంగా రెచ్చగొట్టానా? నెవ్వర్ !  మరి నువ్వట్లా  పిచ్చిగా ఎందుకు ఊహించుకొన్నావ్ ?  .. సారీ! నీతో మ్యారేజ్ పేరుతో  నాకింత పెద్ద నరకం చూపించాలనుకోవద్దు! ప్లీజ్!'


'పెళ్లి.. నరకమా?!'


'మల్లె తీగను ముళ్ల డొంకలో పొర్లిస్తే బతుకుతుందనేనా! నీకూ నాకూ  మ్యారేజంటే అట్లాగే ఉంటుంది లైఫ్. నీకెందుకర్థం కావడం లేదో నాకర్థం కావడంలేదు'


'ఎందుకట్లా  అనుకుంటున్నావు అనితా?'


'అడిగావు కాబట్టి చెబుతాన్రా! విని అర్థం చేసుకో జ్ఞానముంటే ! మన నారాయణగూడ చెరువు పక్కనే  పదేళ్ల నాటి మామిడి చెట్టొకటుంది  నీకు తెలుసో లేదో.. మీ వోడాఫోనాఫీసు  పై నుంచి చూసినా క్లియర్ గా కనిపిస్తుంది. ఎలక్ట్రిసిటీ  డిపార్టువాళ్ళిప్పుడు దాన్ని  కుదుళ్లతో సహా పడకొట్టాలనే ఆలోచనలో ఉన్నారు  ..   వాళ్ల వైర్లకు  అడ్డమొస్తుందని. పచ్చని చెట్టు! ఏ జీవమైనా  నిస్సహాయంగా  చావడానికి లేదనే కదా మా పోరాటం! కోర్టు కేసైంది. చెట్టును  అక్కణ్ణుంచి తరలించే కండిషన్ మీద కోర్టు రెండు వారాలకు  స్టే ఇచ్చింది.'   


'అంత పెద్ద చెట్టును అట్లా కూకటి వేళ్లతో  సహా పెకిలించెయ్యడం ఎలా సాధ్యం? కష్టపడి ఆ పని చేసినా చెట్టు మళ్లా బతుకుతుందా ?' 


సురేష్ ఆ ఆలోచనలో ఉండగానే 'నువ్వే మాలోచిస్తున్నావో నాకు తెలుసు ! నీ లాంటి మనిషికి అంతకు మించి గొప్ప ఆలోచనలేమొ స్తాయ్  గాని,  ముందు.. విను! భూమి నుంచి విడిపోయిన గంట లోపలే  వేరుకు మరో అనువైన నేల పొర దొరికితే చెట్టు బతికే అవకాశముందని ,  సైంటిఫిక్ గా ఎప్పుడో ప్రూఫ్ అయింది. ఆ  భారీ కార్యక్రమానికి  ముంబయ్ నుంచి ఎక్స్ పర్ట్స్ ఎలాగూ వస్తున్నారు . అయినా .. వాలంటీర్ల  సాయం అవసరం. టైమాట్టే లేక.. అంత మంది వాలంటీర్లను   ఇంత షార్ట్ పీరియడ్లో   మొబిలైజ్ చేసుకొనే టెన్షన్ లో మేముంటే ..  ఆ ట్రైంలో తమరేం చేస్తున్నారు ..  మై డియర్ ది బెస్ట్ ఫ్రెండ్ సురేష్ గారూ?'


సురేష్ షాక్! తేరుకొని 'ఇదంతా నాకు తెలీదు అనితా!' 

అతగాని సంజాయిషీ ఇవ్వబోతే పడనిచ్చింది కాదామె. 


 'కానీ నాకంతా తెలుసులేరా  నీ గురించి. ఎగ్జాట్లీ అదే రోజు  తమరిదే గదిలో  నా కోసం రక్తంతో లవ్ లెటర్స్ ప్రాక్టీస్  చేస్తోన్నారు. తమరి  కోసం పంపించిన మనుషులు ఇంకా చాలా చాలా చెప్పారు నీ  తింగరి వేషాల గురించి!' 


గతంలో రమేష్ రాసి పడేసిన లవ్ లెటర్స్ బొత్తి పర్శు నుంచి తీసి అతని మొహాన కొట్టింది అనిత. 


సురేష్ మొహం ఎర్రబారింది. 'నిన్నుప్రేమించి నీ కోసం లవ్ లెటర్స్ రాయడం కూడా నేరమే? నాకు తెలిస్తే నేనూ నీ ఫ్రెండ్స్ లా వెంట రానా?' 


'వస్తావులే. నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి నువ్వేమైనా చేసేందుకు రడీ !  నాక్కావల్సింది అదా మిస్టర్? 'చీఁ! నీకు ప్రాణం విలువేంటో  తెలీదు. వేరే జీవి దాకా ఎందుకు..అసలు నీ జీవితం విలువే  నీకు తెలీదు.   ఆ బ్లడీ  లెటర్స్ అందిన  రోజునే గట్టిగా చెప్పాలనుకున్నా   ఈమాట! మీ అమ్మ సంగతి తెలిసి.. నీ చెల్లెలి జబ్బు సంగతి తెలిసి.. సైలెంటయిపోయా! ఓ నోరు లేని చెట్టునే ఎవరో  కొట్టేసుకుని పోతుంటే విలవిలలాడే మెంటాలిటీ నాది. సొంత చెల్లెలు చావు బతుకుల మధ్యుండే రోగంతో  ఏళ్ల తరబడి తీసుకుంటున్నా  సంపాదించే స్తోమతుండీ  తల్లి కన్నీళ్లనైనా పట్టించుకోని   పచ్చి  స్వార్థం నీది. నీ కుటుంబం కథంతా ముందే తెలుసు కాబట్టి  ఇంత కాలం నువ్వెంత  వెకిలివేషా లేసినా పళ్ల బిగువున భరించా! పోనీలే .. నా మూలకంగా అయినా ఒక కుటుంబం నిలబడుతుందేమోనన్న ఆశతోనే నిన్నా బ్యాంక్ టెస్టులు రాయమని ప్రోత్సహించింది . ఇంత చేసినా నువ్విప్పుడేం  చేస్తున్నావ్? గట్టి సంపాదన వచ్చే సూచన కనిపించగానే  మీ పెద్దాళ్ల ద్వారా నన్ను మళ్లీ నీతో పెళ్లి ఊబిలోకి దింపాలని  చూస్తున్నావ్! నువ్వు నాకు ఓ మామూలు ఫ్రెండువి  మాత్రమే అనుకున్నానిప్పటి దాకా! ఆ గౌరవం కూడా పోగొట్టుకునేలా బిహేవ్ చేస్తున్నావ్!..' 


'నువ్వు లేకుండా నేను బతకలేను అనితా!' బావురుమన్నాడు సురేష్.


'షటప్! ఈ బతకడాలు, చావడాలు, బెదిరించడాలు, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడాలు.. జస్ట్ ఐ హేట్ దెమ్ టోటల్లీ! నేను లేకపోతే నువ్వు బతకలేవా? హౌ సిల్లీ ఇట్ సౌండ్స్?! ఇదిగో.. ఇప్పుడు నువ్వు చూస్తున్నావే ఈ డొక్కు మ్యాచ్.. ఇదీ  ఇంకో రెండు గంటల్లో ఫినిషైపోతుంది. ఇప్పుడు నువ్వు పడే టెన్షన్ .. ఐ మీన్ .. మీ కుర్రాళ్ల భాషల్లో థ్రిల్లంటారు  కాబోలు.. అంతటితో  ఫేడవుటయిపోతుందిరా. నువ్వు లవ్వు  అనుకుంటున్నావే .. అదీ ఇలాంటిదే ! డోంట్ వేస్ట్ యువర్ ప్రిషియస్ టైం ఇన్ దీజ్ సిల్లీ రబిష్ థింగ్స్!' అని విసురుగా లేచింది అనిత.


'ఇదే నీ ఆఖరి మాటా?' తనూ రోషంగా లేచి నిలబడ్డాడు సురేష్. అతగాడి కళ్ల నిండా నీళ్లు.


షూస్ వేసుకుని బైటికి వెళ్లబోయే ఆమె దారికి అడ్డంగా నిలబడి బిగ్గరగా అరిచాడు పిచ్చెత్తినట్లు. 'ఈ మ్యాచ్ అయ్యేలోపు నువ్వు తిరిగొచ్చి నాకు సారీ చెప్పాలి. 'ఐ విల్ మేరీ యూ!' అని చెప్పాలి. అదర్ వైజ్.. అదర్వైజ్ .. నేను సూయిసైడ్ చేసుకోడం ఖాయం'


'బెదిరింపా? అదీ చూద్దాం. రోజూ మీడియాలో ఎన్ని ఆత్మహత్యలు చూడ్డంలే! ఉద్యోగం ఊడిందనో, పరీక్ష పోయిందనో, మంచి ర్యాంక్ మిస్సయిందనో, మొగుడి మీద అలిగో, పెళ్లాం మీద డౌటుతోనో..   సిల్లీగా ఎంతెంత మంది గొంతులకు ఉరేసుకోడంలా! వంటి మీద గ్యాసు నూనె పోసుకుని అంటించేసుకుంటే ఏమవుతుందంట? మరో వార్త దొరికిందాకా సంచలనం కింద వాడుకోడానికి మీడియాకు పనికొస్తుంది.. దట్సాల్! నీకు నేనిచ్చే లాస్ట్ అడ్వైజ్  ఇదొక్కటే యాజ్ ఏన్ ఓల్డ్  వెల్ విషర్ గా .. డోంట్ థింక్ సచ్ నేస్టీ థింగ్స్ ! గుడ్ బై ఫరెవర్.. ఎవర్ అండ్  ఎవర్!' విసురుగా వెళ్లిపోయింది అనిత.


ఎప్పుడొచ్చాడో రమేష్.. ఓ మూల రాతి బొమ్మలా నిలబడి ఉన్నాడు.


మ్యాచ్ అయిపోయింది. యువీ డబుల్ సెంచరీ బాదినా అనుకున్న టీం గెలవలేకపోయింది.  


అనిత తిరిగి  రాలేదు.

---


సాయంత్రమనగా బైటికి వెళ్లినవాడు అర్థరాత్రి గానీ రూముకు  రాలేదు  సురేష్ . వస్తూ వస్తూ రెండు ఫుల్  మందు బాటిల్స్, ఇంకేదో ప్యాకెట్ వెంట తెచ్చుకున్నాడు. 


రమేశ్ రాత్రంతా ఎంత సముదాయించినా ఆ  మనిషి వినే మూడ్ లో లేడు.

---


తెల్లారి ఎనిమిది దాటింది. అయినా సురేష్ పక్క మీద నుంచి లేవనేలేదు. 


రమేష్ ఒక్క నిమిషం ఆలోచించాడు. సురేష్ సెల్ అందుకుని టక టకా మెసేజ్ టైప్ చేశాడు 'ఇంకో గంటలో నేను ఈ లోకం నుంచి  శాశ్వతంగా సెలవు తీసుకోబోతున్నాను. నా చావుకు అనితే బాధ్యురాలు- సురేష్ 'అంటూ ఇంగ్లీషు లిపిలో! 'ఎల్లో పేజెస్'   సైట్ లోకి వెళ్లి రేండమ్ గా  కొన్ని నెంబర్లు  టిక్ పెట్టి 'సెండ్' బటన్ నొక్కాడు. అన్నిటికీ 'మెసేజ్ సెంట్' అని వచ్చిందాకా వెయిట్ చేసి బైక్  బైటకు తీసి డ్యూటీకని  వెళ్లిపోయాడు రమేష్  .


టైమ్ అప్పటికి ఉదయం  ఎనిమిది ముప్పావు!

---

 

సురేష్ సూయిసైడ్ సమాచారం  పోలీసులకు అందించి వాడిని   ప్రాణగండం నుంచి కాపాడొచ్చు . జీవితం విలువ అర్థం కాని ఎవరినైనా ఎన్ని సార్లని ఎవరు దగ్గరుండి రక్షించగలరు? పోలీసుల నిర్దాక్షిణ్య  విచారణ, మీడియా అత్యుత్సాహపు  ' రేటింగుల పోటీల' కారణంగా  అన్యాయంగా  అనిత పేరు అల్లరిపాలవడం  తనకు బొత్తిగా ఇష్టం లేదు. సమాజానికి సేవలు ఎప్పుడెప్పుడు అందిద్దామా అని అనుక్షణం అవకాశాలకై పరితపించే మంచి వ్యక్తులు క్రమేపీ తరిగిపోతోన్న ప్రస్తుత సంక్షోభ తరుణంలో అనిత వంటి అరుదైన వ్యక్తుల జీవితాల విలువ  తనకు తెలుసు. 


సాటి వ్యక్తి నిండు ప్రాణం తీసుకునే సమాచారం ముందుగా అందినా  సమాజంలోని సాధారణ పౌరులు సామాన్యంగా  స్పందించరు. ఎవరి  బతుకు పోరాటంలో వారుంటారు . ఆ సంగతి తనకు తెలుసు . సురేష్ వంటి దుందుడుకు యువతకే  తెలీటం లేదు. అట్లాంటి వాళ్లకి తెలియాల్సుంది . అప్పుడే వారి దృక్పథం జీవితం పట్ల సానుకూలంగా మారే అవకాశం. 


ఆ సదుద్దేశంతోనే తను చివరి అవకాశంగా సురేష్  సెల్నుంచి ఆ  'సూయిసైడ్ ప్రయత్నాన్ని '  సూచిస్తూ  అంతమందికి మెసేజ్ పెట్టింది. ' అనుకున్నాడు బైక్ మీద పోయే రమేష్! 


***


రమేష్ అనుకున్నట్లే  సుందరం, పురుషోత్తమరావుగారు వంటి ఇంకెందరో  తమతమ  కారణాల వల్ల సమయానికి స్పందించనే లేదు. 


కానీ, ఒక్కోసారి అసాధ్యమనుకొనే సంఘటనలే తెలియని ఏ కారణాల వల్లనో సుసాధ్యమవుతాయి. ప్రస్తుతం  అట్లాంటి అద్భుతమే జరిగింది. కాబట్టే సురేష్ జీవితం   విషాదంతో ముగిసి పోకుండా అనూహ్యమైన మలుపు తిరిగింది  . 


తన  లోపల నుంచి తన్నుకొచ్చే అపరాధ భావనకి  ఎదురు నిలబడలేక పోయింది సుమతి.  తన సెల్ కు వచ్చిన సురేష్ సూయిసైట్ మెసేజి విషయం భర్త గంగరాజుకు  తెగించి చెప్పేసింది . సమయానికి అందిన ఆ సమాచారంతో  స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని ఎలర్ట్ చేశాడు వృత్తి  బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించే ఎస్సై గంగరాజు . అందుకే .. మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినా .. ఆసుపత్రిలో అవన్నీ కక్కేసేయడంతో   ప్రాణాలతో బైటపడ్డాడు సురేష్ .  


సురేష్ ఇప్పటికైనా జీవితానికి సరిపడా పాఠం నేర్చుకున్నాడా? ఇప్పటికిప్పుడు  సమాధానం చెప్పడం కష్టం. కాలం నిగ్గుతేల్చాల్సిన మానసిక పరిణామం అది .


కొసమెరుపు ఏమిటంటే - సాటి జీవుల జీవితాల పై తనకు మల్లేనే  'కన్ సర్న్' చూపించే  రమేష్ పట్ల గౌరవం కలిగింది  అనితకు. ఆ గౌరవం ప్రేమగా మారడంతో  రమేష్   జీవితంలోకి  ఆమె అర్థాంగిగా  అడుగుపెట్టింది . 

*****


 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...