Thursday, July 23, 2015

మనసు మా ఊరి ఇంటిముంగిట వాలిపోతుంది- బెజ్జ రమాదేవి పూల ముచ్చట



మల్లెపూలు ముక్కుపుటాలకు తగలగానే మనసు ఇరవై ఐదేళ్ల వెనక్కి మళ్ళింది. ఇదీ అని చెప్పలేని ఓ మధురస్మృతి.  బాల్యం కళ్ళముందు కొచ్చి నిలబడింది.
మా ఇంటిముంగిట్లో మల్లెపందిరి, జాజిపందిరి పక్కపక్కనే ఉండేవి.  ఆ పందిరికింద నల్లరాయిమీద కూర్చుని అమ్మ వండిన గోరుచిక్కుడుకాయకూర అన్నంలో కలుపుకు తింటోంటే.. కొద్దిగా మసకబారిన సందమామల్లాంటి మల్లెపూలు ఆ అన్నంపళ్లెంలో రాలుతోంటే.. అవి ఏరుకోవడం ఓ ముచ్చట! ఆ ముచ్చట్లలో సదిగాడు పేడకళ్లెల్లో కాలేసి జర్రున జారిపడ్డ సంగతులన్నీ గుర్తుకొచ్చి కిలకిలా నవులొస్తయ్యి. ఆ నవ్వులకు గొంతు పట్టుకుంటే నీళ్ళు తాగుతూ అన్నాలు  తినేవాళ్ళం ప్రమీల(ప్రేమల?),  ప్రభ, నేనూ.
ఆదివారంనాడు అదో సంబరం మాకు.
మా మల్లెపందిరి అంటే నాకే కాదు.. సీతాకోకచిలుకలకు, తుమ్మెదలకు, గొంగళి పురుగులకు, బక్కతొండలకు, ఆవులమందలకూ చాలా ఇష్టమే. బడికెళ్ళి రాగానే పలకలు, సంచి అరుగుమీద పారేసి పందిట్లో చిన్న పీటేసుకుని  చెయ్యెత్తి దగ్గరగా  కనపించే మల్లెమొగ్గల్ని అందుకొని తెంపేవాళ్లం. మాకు పోగా మిగిలినవి పేపరుపొట్లాల్లో చుట్టి తెలిసిన దోస్తులకి ఇస్తుండేది మా అమ్మ.
ఆదివారం వస్తే చాలు.. మల్లె, జాజి పందిర్లమీదనుంచి పచ్చటి ఆకుతేళ్ళు, గొంగళిపురుగులు ఏరిపారేయడం,  చెత్తా చెదారం ఎత్తి పోయడం.. ఇదీ మా పని. ముదిరిన ఆకులు గిల్లిపోయాలి. చెట్లకు నీళ్ళు పోసేందుకు వంతులు వేసుకునే వాళ్ళం ఇంట్లో వాళ్లందరం. ఏడు గోళాల ఉప్పునీళ్ళ బావి మాది. చాదబొక్కెనకు కొబ్బరితాడు. ఎంత చేదినా పైకి వచ్చేదికాదు బక్కెటు. చేదక్కట్టిన కొబ్బరినార  ఒరిపిడికి చేతులు ఎర్రగా కందిపోయేవి.
పెద్దాళ్లు బైటికొచ్చి చూసి పెద్దబొక్కెట విప్పి చిన్నబొక్కెట కట్టేవాళ్ళు. చిన్న బక్కెటతో ఎంతసేపు చేదినా కుండ నిండేదికాదు. నేను చేది పొయ్యడం.. ఇద్దరు చెల్లెళ్ళు చెరోవేవు పట్టుకుని చెట్లకు నీళ్ళు పొయ్యడం. అలుగ్గోళెంలో నీళ్ళు పోసేవాళ్లం. ఆగకుండా ఉరకడం మూలాన ఏ పలుగు రాయో తగిలి కుండ వదిలేస్తే అది కాస్తా పదహారు వక్కలయ్యేది. వాకిలినిండా నీళ్ళ మడుగు.
'బంగారమంటి కాగు ముక్కలాయె' అంటూ మా అమ్మ నాలిక మడతబెట్టి కొట్టేటందుకు ఉరికొస్తుంటే మేం దొరుకుతామా? సందుల్లో బడి, బజార్లో బడి రామేశ్వరమ్మిట్ట నేనూ.. సువర్ణమిట్ట ప్రమీల, ప్రేమలత తాఉకొనేవాళ్ళం.  ఇదంతా మల్లెచెట్టుకు నీళ్ళు పోసేటందుకు  వచ్చిన తిప్పలు!
ఇక పూల సంగతులు! మా అప్పచెల్లెళ్ళు ముగ్గ్గురికి మూడుపాళ్ళు,  మా అమ్మకో పాలు. ఎవరి పూలు వాళ్ళం మాలకట్టుకుని తెల్లటి తడిగుడ్డలో బెట్టి వాకిట్లో తీగెకు తగిలించేవాళ్లం. తెల్లారేసరికి  మొగ్గలు విచ్చి కమ్మటి మల్లెల వాసన మరోలోకానికి మోసుకుపోయేది.
ఇప్పటికీ ఎండాకాలం వచ్చి మల్లెల వాసన ముక్కుకి తగిలిందంటే మా ఇల్లు గుర్తుకొస్తుంది. మా పల్లె పందిరి గుర్తుకొస్తుంది. అందమైన ఆ గోధూళి సాయంత్రం గుర్తుకొస్తుంది. నా దోస్తులు బుజ్జి, పుశ్మి(పుష్పలత) గుర్తుకొస్తారు. అందమైన మా అమ్మ, ఆమె నవ్వు, నవ్వితే తళుక్కున మెరిసే ఆమె ముక్కుపుల్ల గుర్తుకొస్తాయి. ఆ అరుగుమీద ఆడుకున్న గచ్చకాయలు గుర్తుకొస్తాయి.
ఒక మల్లెవాసనతో ఇన్ని గుర్తుకొచ్చి.. మా ఊరు గుర్తుకొచ్చి గుండె చిత్తడి చిత్తడి అయిపోతుంది. మల్లె మొగ్గలు చూస్తే చాలు.. గతించిన ఆ స్మృతులు మదిలో మెదిలి ప్రాణం అతలాకుతలమై పోతుంది.
యాంత్రికమైన బతుకులు.. ప్రకృతిని వికృతిగా మార్చే సంస్కృతి.. ఆత్మీయపరిమళాలు ఉండవు ఆ కాగితంపూలలాంటి జీవితాలకి. అద్దాల బతుకులు. అబద్ధాల జీవితాలు. వీటన్నిటి మధ్యా మల్లెపూలను చూస్తే మనసు ఊరట చెందుతుంది. ఆత్మీయుల్లా తోచే ఆ పువ్వుల నవ్వుల్తో  మళ్లా బతుకులకు జీవకళ వచ్చినట్లుంటుంది.
నేను ఎండాకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాను. మల్లెల సాంగత్యంలో మూడునెలలు మూడుగడియల్లా దొర్లిపోతాయి. పిల్లి నీచు వాసన పసిగట్టినట్లు.. ఎక్కణ్నుంచి మల్లెలవాసన ముక్కుపుటాలకి తగిలినా..  కళ్లు మూతలుపడతాయి. మనసు మా ఊరి ఇంటిముంగిట  వాలిపోతుంది.
ఎన్ని తెంపినా కొన్నింటిని ఇంకా తనలో దాచుకున్న మా మల్లెపందిరి గుర్తుకొస్తోంది.
తెల్లారగానే మబ్బుల్లో చుక్కల్లా కిలకిలా నవ్వే తెల్లటిమల్లెలు. గాలికి గర్వంగా తలలూపే మల్లెతీగ.. 'ఫోవే..భడవాయీ! నా పూలు నాకూ ఉన్నాయి!' అన్నటు అనిపిస్తుంది. నిండుపూలతో గాలికి ఊగే మల్లెపందిరి అందమైన  నిండుముత్తైదువంత కళగా ఉంటుంది. ఎంత వెతికి వెతికి తెంపినా .. మామూలే! తీగలమధ్య మబ్బుల్లో  చుక్కల్లా దోబూచులాడుతూ అక్కడక్కడా తళుక్కున మెరిసి.. నన్ను వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంటాయి. ఆ  పూల వేళాకోళమంటే నాకు ప్రాణం.
-బొజ్జ రమాదేవి


నా మాటః
'ఎండాకాలం యాదిల' మల్లెతల్లీ నీకు జోహార్లు! బతుకమ్మ ఆర్టికల్
'మురికికాల్వల మురికివాసనను మూడునెలలు మీ సువాసనలతో ప్రక్షాళనచేసే మల్లెమొగ్గలూ! మీకు కోటికోటి నమస్సులు!' అంటూ~బొజ్జ రమాదేవిగారు (వ్యాసకర్త హిందీ లెక్చరర్, హన్మకొండ, వరంగల్ జిల్లా) రాసిన ఒక చక్కని స్మతిగల్పికను కందుకూరి రమేష్ బాబుగారి ఫేస్ బుక్ అప్-టు-డేట్సులో చూడటం జరిగింది. మల్లెపూలంటే సహజంగానే ఆసక్తి కదా ఎవరికైనా!  ఆసాంతం చదివాను ఒకే ఊపులో.. అనడంకంటే చదివించింది అనడం సముచితం.  మల్లెల సువాసనలు    గుబాళించాయి రచనలో. రచయిత్రిగారిని అభినందించకుండా ఉండలేం. మంచి రచనవైపుకు మన దృష్టిని మళ్ళించిన రమేష్ బాబుగారినీ అభినందించాల్సిందే.
ఈ గల్పిక తెలంగాణా యాసలో రాసినదికొన్ని ప్రయోగాలు మూలతెలుగునాట అర్థమవవేమోనని నా అనుమానం.  అందుకే నాకున్న కొద్ది పరిజ్ఞానంతో  నా తృప్తికోసం దీనిని  శిష్ట భాషలోకి తిరిగిరాసింది. ఈ  ప్రయత్నం దోషరహితమన్న భ్రమ నాకు లేదు. తప్పులుంటే సరిదిద్దుకొనేందుకు సిద్ధం. మంచి అంశాన్ని మరింతమందికి పంచాలని తప్ప ఈ ప్రయత్నం వెనక మరే ఉద్దేశమూ ఊహించవద్దని మనవి.
కర్లపాలెం హనుమంతరావు


***                             

Wednesday, July 22, 2015

సినిమాప్రచారానికి కవిత్వం పాట



కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా కాదేదీ కవితకనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ అన్నాడని కాబోలు గతంలో శోభనాచల పిక్చర్సు వారు 'దక్షయజ్ఞము' చిత్రం విడుదలకుముందు ఏకంగా చిత్రసాంకేతికగణం వివరాలతో కూడిన చక్కని చతురస్ర గతి మాత్రాచందస్సులో ఒక పాట రాయించి మరీ ప్రచారం చేయించారు.
సరదాగా ఉంటుంది.. కొన్ని చరణాలు మీరూ వినండి!

దక్షయజ్ఞమండీ- అందరు తప్పక చూడండీ
దర్మయుద్ధమండీ- భక్తులు ధన్యులగుదురండీ

ఆంధ్రకళలతో- ఆంధ్ర దీప్తితో
ఆంధ్ర శోభనాచల స్టూడియోలో
ప్రభువు మీర్జపూర్- పరిరక్షణలో  దక్ష॥

అర్జాకృష్ణుని-ఆధ్వర్యములో
శిష్టదర్శకుల- శిష్యప్రాయుడు
సిద్ధహస్తుడు- చిత్రపువీరుడు
తయారుచేసిన- దక్షయజ్ఞము    దక్ష॥

నగ్నతత్వ- నారాయణాస్త్రము
వస్తున్నది మీ- పట్టణాలకే
తేదీ వివరం- తెలుసుకొనండీ     దక్ష॥

పురాణగాథల- తరాలు దాటిన
పరాకుకూతల- ప్రతికాదండి      దక్ష॥
కృష్ణవేణి నవ- కోకిల స్వరము
గగ్గయ్య భయం- కరధిక్కారము
రామకృష్ణుని- రమ్యగానము
కుంపట్ల మనోహర- పరిహాసము దక్ష॥

బి.టి.చార్యుల- భీకర పలుకులు
మోతీబాబు- పాటల కులుకులు
శాంతారాముని- చక్కని కుంచియ
చతురుడు వాల్కే- శబ్దగ్రహణము
విబుధుడు కిన్నీ- వేషధారణము
సొలుపగు చవాను- ఫోటోగ్రాఫీ
కుండలేశుని య- ఖండస్ఫురణము
బడసిన బంగరు- ప్రతిమారాజము
వస్తున్నది మీ- పట్టణములకే
తేదీ వివరము- తెలిసికొనండీ దక్ష॥

ఇలా సాగుతుంది పాటంతా. ఎక్కడా పొల్లుమాట లేకపోవడమూ,
చక్కనైన పదజాలం వాడటమూ.. సాంకేతిక వివరాలు సమగ్రంగా
ఉండటమూ.. మనమీ పాటలో ప్రశంసించదగ్గవిశేషాలు.
సినిమా మాధ్యమంమీదే కాకుండా కవితాప్రక్రియలమీదా లోతైన అవగాహన ఉంటేనే గాని ఇంతటి చక్కని వరసలతో పాట కుదరదు.
కనిపించిన ప్రతీ దానిమీదా కవితలల్లాలని ఉవ్విళ్ళూరే ఈనాటి యువరక్తపు కవికుమారులూ/కవితాకుమారీలంతా  సునిశితంగా అధ్యయనం చేయాల్సిన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.  కాబట్టే.. డెబ్బై ఏళ్ళకిందట రాసినా.. ఇప్పటికీ  తాజాగా అలరిస్తుంది. పాటకు ఇంకా 42చరణాలున్నా స్థలాభావంచేత పూర్తిపాఠం ఇవ్వడం లేదు.

శోభనాచల పిక్చర్స్ విశేషాలుః
శోభనాచల పిక్చర్స్ తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. ఇంతకముందు జయ ఫిలింస్ పతాకాన కొన్ని చిత్రాలు నిర్మించిన రాజా వారు 1941లో శోభనాచల సంస్థను స్థాపించారు. శోభనాచల సంస్థ నిర్మించిన తొలి చిత్రం దక్షయజ్ఞం (1941)గొల్లభామ (1947) చిత్రం శోభనాచల సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1947లో విడుదలైన చిత్రాలలో గొల్లభామనే ఆర్థికంగా పై చేయి సాధించింది. 1949లో వచ్చిన కీలుగుర్రంచిత్రానికి రాజా వారు దర్శకుడి మరియు నిర్మాత. కీలుగుర్రం రాజా వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. 1950లో విడుదలైన లక్ష్మమ్మ చిత్రాన్ని ప్రతిభా వారి శ్రీ లక్ష్మమ్మ కథతో పోటీ పడి నిర్మించారు. ఈ పోటీలో లక్ష్మమ్మదే పై చేయి అయ్యింది. 1940లలో గొప్ప పేరు తెచ్చుకున్న శోభనాచల సంస్థ కొన్ని కారణాల వలన 1950ల ప్రథమార్థంలో మూతపడింది. శోభనాచల సంస్థ యాజమాన్యంలో మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలోని శోభనాచల స్టూడియోలలో అనేక చిత్రాలు నిర్మితమయ్యాయి. 1949లో వాహినీ స్టూడియోస్ ప్రారంభంతో శోభనాచల స్టూడియోలలో చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది. 1955లో శోభనాచల స్టూడియోల యాజమాన్యం మారింది, స్టూడియో పేరు వీనస్ స్టూడియో గా మార్చబడింది. దశాబ్ద కాలం పైగా పని చేసిన వీనస్ స్టూడియో తర్వాత మూతపడింది.(సోర్సు- https://te.wikipedia.org/wiki/)
- కర్లపాలెం హనుమంత రావు


Tuesday, July 21, 2015

దిగులేస్తోంది!- కవిత


1
కాలం గాయం చేసినప్పుడు
ముల్లు విరిగిన కాలు నిప్పుకొండలా సలుపుతుంది
కాలం ఊహల ఉయ్యాలలూపుతున్నప్పుడు
నక్షత్రమండలాన్నైనా సబ్బుబుడగల్లా ఊదిపారేయచ్చనిపిసుంది
సమయం గడుసుది సుమా!
మంటలు చుట్టూ మండుతున్నా
మనసుకి మిణుగురుపురుగుల రెక్కలు తొడిగి
మల్లెపందిరి కింద బబ్బోపెడుతుంది
కాగితంపూలవాసనకే మత్తెక్కిపోయి మనీప్లాంట్ కి పర్యాయపదమే లేదని పలవరింతలు మొదలయ్యాయి నీకప్పుడు
కంటిముందరి స్వర్గమంతా తెరముందాడే నాటకంరా నాయనా!
పేరుతో ప్రేమగా పిలిచినట్లే ఉంటుంది
కాలం మెదడులో సర్వనామంగానైనా నువ్వు మిగిలి ఉన్నావా?

2
మనిషి గోరటి ఎంకన్నగొంతులో జీరయి కరిగిపోతున్నాడురా తండ్రీ!
అంతరించిపోతున్న లోకంలో మిగిలున్నఆ ఒక్క వ్యవహర్తా కూలిపోతున్నఆర్తనాదమవుతున్నా ఆ చప్పుడు నీకు వినిపించడం లేదా!
మూతబడే కంటిరెప్పల్లో కరిగిపోయే విశ్వం నీదేరా కొడకా!
ఒక నమ్మకం చెరిగిపోతే ఒక లోకం చిరిగినట్లే!
ప్రశ్నల్ని అడవులకి తరిమేసి చెప్పుల్ని చేత్తో మోసుకుంటో గమ్మత్తైన పోటీలో నువ్ బిజీ బిజీ ఉన్నావ్
చర్మం వల్చుకుపోతున్నా చమ్మగానే అనిపిస్తుందొరేయ్ నీకీ మత్తులో!

వాక్యంలా ప్రవహించడం మానేసి ఎంత కాలమయింది?
సుందరయ్యా!..సుందరాకాండా!
జెపీనా!…జైరామ్ రమేషా!
కనీసం ప్రశ్నల్నన్నా కనాలనిపిస్తున్నదా నీకు!
పోరు ఊరేగింపులో ఊగటం మానేసి పోలేరమ్మ జాతరలో తూలటం మొదలెట్టావు
నల్లమందు నినాదాలు మింగి రాజీజెండా భుజాన మోసుకుంటో
ఒక్క పూటైనా గట్టిగా నిలబడని ఏ వెలుక్కురా నువ్ దివిటీ పట్టుకుని చిందులేసేది!

4
రేపటి మీద ఆశతో పరుగులు పెట్టే నీ పసిపిల్లలకేం చెపుతావ్ ఇప్పుడు?
ఏ వీధి చివర చెట్టు మిగిలుంటుందని పచ్చనాకు కోసుకురమ్మంటావ్ రేపు?
ఆఖరి మెతుక్కూడా అయిపోయిందాకా చేతిలో ఉన్నది అక్షయ పాత్రేనని నమ్మిస్తావా నాయనా!
నువ్వు చదివిన మాట నువ్వు పాడిన పాట
నువ్వు నిప్పు రవ్వలు చల్లుకుంటూ నడిచి వచ్చిన బాట
అంతా వెండిమబ్బుల చందమేనా!
అధర్మ రథయాత్రలో ఆఖరికిలా ఆర్భాట భటుడుగా మిగిలిపోవడం ఎంత విషాదం!
కూలిపోయే మహావృక్షం చివరి చిగురువునువ్వే అవుతావని ఎన్ని కలలు కన్నాను!
రేపటి విషపుమొక్కకు మొదటి వేరుగా మొలిచే నిన్నిలా చూడటం…!

-కర్లపాలెం హనుమంత రావు 
01-09-2012

Monday, July 20, 2015

1950లో ఓ కచేరీకి ఓ ముఫ్ఫైఏళ్ళ మహిళని పాడమని పిలిచారు. ఆమె వర్ణంతో కచేరీ ప్రారంభించి గణేశ ప్రార్థన, ఆ తరువాత దేవగాంధారి రాగంలో ‘సీతా వర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’ పాడడం మొదలు పెట్టారు. ఇంతలో ఒక చిన్న భూకంపం రావడంతో ప్రేక్షకులు భయంతో ఆ హాలు విడిచి బయటకు పారిపోయారు. జనం వెళ్ళిపోవడం చూసి పక్క వాయిద్యకారులు కంగారు పడ్డారు కానీ అలాగే భయపడుతూ వాయించారు. పక్క వాయిద్యకారుల పరిస్థితి కానీ, జనం హాహాకారాలు చేయడం, భయంతో పరుగులు తీయడం ఇవేమీ కళ్ళు మూసుకుని పాడడంలో నిమగ్నమయిపోయిన ఆవిడకి తెలియవు. భూకంపం హడావిడి తగ్గాక ప్రేక్షకులు లోపలికి వచ్చారు. వారికి ఆశ్చర్యం కలిగించేలా ఆమె ఇంకా పాడుతూనే వుంది. పాట పూర్తయ్యాక కళ్ళు తెరిచి చూస్తే ప్రేక్షకులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేయడం కనిపించింది. ఆ తరువాత పక్క వాయిద్యం వాయిస్తున్న ఓ వ్యక్తి అసలు విషయం చెప్పారు. ఆ కచేరీ చేసిన మహిళ డి.కె.పట్టమ్మాళ్. భూకంపం సంగతి ఆమెతో తరువాత ప్రస్తావించినప్పుడు, “భూకంపం వచ్చి నా ప్రాణం పోవాలని రాసుంటే అదెలాగూ జరుగుతుంది. ప్రాణమ్మీద తీపితో కచేరీ చెయ్యకుండా ఇచ్చిన మాట తప్పిందన్న అప్రతిష్ట నాకు చావు లాంటిదే. నేను సంగీతానికీ కట్టుబడున్నాను. అదే నా ఊపిరి” అన్నారామె. ఈ సంఘటన చెప్పింది ఆమె భర్త ఈశ్వరన్. ఆనాటి కచేరీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ రావలసి ఉన్నా, ఎందుచేతనో రాలేకపోయారు. భూకంపం వచ్చినా కదలకుండా తన్మయత్వంతో ఆమె పాడడం గురించి తెలుసుకొని ఆ మర్నాడు ఆయనింట్లో మరో కచేరీ ఏర్పాటు చేయించుకున్నారు
సాయి బ్రహ్మానందం గొర్తి "ఈ మాట- 'కంచి పట్టు కచేరీ' నుంచి
-కర్లపాలెం హనుమంతరావు

విశ్వనాథగారి విశిష్ట జ్ఞాపకశక్తి- ఒక సేకరణ

విశ్వనాథ సత్యనారాయణ గారి అసాధారణ జ్ఞాపక శక్తి మనకు ఆశ్చర్యం కల్గించక మానదు

"రామాయణ కల్పవృక్షం", "వేయిపడగలు" వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపకశక్తి ని తెల్పే క్రింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు. విశ్వనాథ గారు చెప్తుంటే వారి కొడుకులు వ్రాసేవారు. ఒక రోజు చూసుకొంటే 32 వ కాగితం నుండి 72 వ కాగితం వరకు కనిపించలేదు. ఇల్లంతా వెదికారు. కానీ కనబడలేదు. వారికి తమ తండ్రి గారైన విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి. అందువలన ఈ విషయం చెప్పడానికి సాహసించలేదు. గ్రంథం వ్రాయడం పూర్తయింది. ఇక ముద్రణకు వెళ్ళాలి. ఇక తప్పదనుకొని విశ్వనాథ గారికి చెప్పారు.అందుకు విశ్వనాథ గారు " అందులో బాధపడాల్సింది ఏం లేదు" అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన 40 కాగితాలలో ఉన్నదంతా చెప్పేసారు.
తర్వాత ఇంట్లో ఇంతకుముందు కనబడకపోయిన 32 నుండి 72 వరకు 40 కాగితాలు దొరికాయి.అత్యంత ఆశ్చర్యకరం గా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలలోని విషయం క్రొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాలలో ఉంది. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,తప్పు లేదు.ఇంత అసాధారణ జ్ఞాపకశక్తి మనకు ఆశ్చర్యం కల్గించకమానదు
-కర్లపాలెం హనుమంతరావు
(నా నోట్ స్ నుంచి.. క్షమించండి సోర్సు రాసి పెట్టుకోలేదు)

ద!.. ద!.. ద!- ఒక చిన్నకథ

దేవుడు, మనిషి, దానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు.
దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి 'జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమ'ని ప్రార్థించాడు.
'మాట కాదు. ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు!’ అంటూ '' అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు. దేవుడికి పరమానందమయింది." '' అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం) లేదనేగా నీ ఫిర్యాదు! అది  అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!'అని వెళ్ళిపోయాడు దేవుడు
మనిషీ బ్రహ్మదేవుణ్ణి సమీపించి అదే విధంగా జీవితానికి పనికొచ్చే మంచి్ముక్క ఏదైనా  చెప్పమని ప్రార్థించాడు. 'దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!' అని యథాప్రకారం  సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహాసంతోషమయింది. '' అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా  దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటాను' అని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు.
ఈ సారి దానవుడి వంతు వచ్చింది. 'దానవా! నీ అన్నల్లాగా నువ్వూ '' శబ్దం భావం బాగా  గ్రహించి  ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!’' అని బోధించాడు బ్రహ్మదేవుడు. 'చిత్తం తండ్రీ!' మీఆజ్ఞ! '' శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాను' అని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు.
వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో  'ద.. ద.. ద' అంటూ  కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమ, దాన, దయా గుణాలనిగూర్చి  బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములు! ***
కర్లపాలెం హనుమంతరావు
(బృహదారణ్యకోపనిషత్తు సప్తమాధ్యాయం- ద్వితీయ బ్రాహ్మణం ఆధారంగా చెప్పిన పిట్టకథ)


Sunday, July 19, 2015

పాదుకాపట్టాభిషేకం- ఓ చిన్ని సరదా కథ

అందరికీ తెలిసిన విషయంలోనుంచి  ఓ కొత్త విశేషాన్ని.. వెలికి తీసి చూపిస్తే.. సహృదయులైన చదువరురులకు కాస్త గిలిగింతలు పెట్టినట్లుంటుందని హాస్య విశ్లేషకులు అంటుంటారు.

రాములవారితోసహా అడవులబాట పట్టిన ఆయన పాదుకల్లో వామపాదుక (అతివాది) స్వామివారిమీద విసుక్కున్నదిట. 'దేవుడు కదా అని సంబరపడితే.. ఇదేమిటీ..  ఈయనగారు మనల్ని ఇలా ముళ్ళ డొంకలవెంట తిప్పే పని పెట్టుకొన్నాడు!' .. ఆవటా అని.
ఆ మాట విన్న కుడిపాదరక్ష 'తొందర పడి బైటికి ఏదీ అనకు! స్వామిని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడరు' అని మందలించిందిట.
తదనంతరకాలంలో భరతుడు రామపాదుకలను నెత్తిమీద పెట్టుకుని అయోధ్య వీధుల గుండా ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళి నేరుగా సింహాసనంమీదే ప్రతిష్ఠించిన కథ మనందరికీ  తెలుసు.

అప్పుడు సంబరపడుతూ అందిట కుడి పాదంతో ఎడం పాదం 'నువ్వన్న మాట నిజమే సుమా! స్వామివారి మహిమ సామాన్యమైనది కాదు!  ఏ పాదరక్షలకూ పట్టని పట్టాభిషేకయోగం మనకు పట్టింది' అని!

-కర్లపాలెం హనుమంతరావు
***

Saturday, July 18, 2015

కొన్నిమొట్టు కవితలు-4


1
ప్రతి ఏడాదీ పోలింగ్ చుక్కలే
ఐనా పోలియో
మన ప్రజాసామ్యానికి!



2
బెల్టుబాంబుకు కొందరే!
బెల్టుషాపుకు
ఎందరో!


3
క్విడ్ ప్రో కో
పెద్దల
నగదు బదిలీ
పథకం




4
'గోవింద' రాజులకు
స్విస్ బ్యాంక్ లాకర్లే 
నేలమాళిగ ఆరోగది





5
యూరియా మెతుకు లేదు
యురేనియం సంపెంగ నూనె
                                 దేశం మీసాలకి!


6
చిన్న చినుక్కి ఎంత శక్తో!
చిటికెలో నగరం
హిందూమహాసాగరం




7
మీడియాలో మేధావులు
కిక్కిరిసిపోతున్నారు
తెనాలి రామలింగులూ
తెలారంగానే
జుత్తుకు తెల్లరంగుతో తయారు!


8
రాజులు డొక్కు బస్సుల్లో
బంట్లు బుగ్గ కార్లల్లో
భలే ప్రజాస్వామ్యం!









9
వేలు పట్టుకు నడిపించిన అమ్మా నాన్న
వేలు విడిచిన చుట్టాలయిపోయారా కన్నా!
వేలు సంపాదిస్తునావనా.. హన్నన్నా!







10
పిడుగు ముందూ
మెరుపు ఆనక..
ఆడపిల్ల చెంప దెబ్బ




11
ఆక్రోశాక్రోశ ఘోషంబై
వికట కఠోరాట్టహాసోద్భటంబై
వక్రభూవల్లరీ సంవలన భయదంబై
స్ఫారనిశ్వాస ధారా చక్రంబై..
                                కంగారొద్దు!
                                మా ఇంటి అటకమీది తాళపత్రాల
                                'తాటాకు చప్పుళ్ళ' గోల!
-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...