Wednesday, October 14, 2015

టెలుగూసా.. మజాకానా!- ఓ సరదా గల్పిక

ఆంగ్లంమీద ఆంగ్లేయుడికైనా ఇంతలావు ప్రేమ కారిపోతుందో లేదో సందేహమే!మారుమూల పల్లెల్లో కూడా పిల్లకాయలకు ఏబీసీడీలు నేర్పించందే బళ్లల్లో చేర్పించేది లేదని అప్పలమ్మల దగ్గర్నుంచి.. తిప్పలయ్యలదాకా తెగేసి చేప్పేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో!
'తెలుగోళ్లందరం తెలుగులోనే మాట్లాడుకొందాం. చచ్చిపోతున్న మన తల్లిభాషను మళ్లీ బతికించుకుందాం!' అంటూ చాదస్తంకొద్దీ ఎవరన్నా నోరుజారాడా .. చచ్చాడన్న మాటే! తెలుగ్గడ్డమీద పుట్టిన ఖర్మానికి ఎట్లాగూ 'టెలుగూస్' అని పిలిపించుకోక తప్పడం లేదు  గదా! ఇంకా నోటితో కూడా మాట్లాడుతూ చెల్లని  నోటుకింద 'చీ' కొట్ట్తించుకోవాలనేనా!' అని గయిమనేవాళ్ల నోళ్ళు  ఎవర్ మూయించగలరు .. చెప్పండి!

తెలుగులో చదువులు  వెలగబెడితే పోనీ సర్కారు నౌఖరీ అయినా దఖలుబడే సౌకర్యమేమన్నా తగలబడిందా! తెలుగు పంతుళ్ల పోస్టులకైనా తెలుగులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటైనా  లేదు గదా! ఇహ వత్తులెక్కడ పెట్టాలో, దీర్ఘాలెక్కడ తియ్యాలో తెలుసుకొని చేసే ఘనకార్యం మాత్రం ఏముంటుంది?
గతంలో కనీసం తెలుగు సినిమా పాటలైనా వినడానికి పనికి వచ్చేది తెలుగు పరిజ్ఞానం. ఇప్పుడు వాటిలోనూ ఒక్క తెలుగక్షరం వినపించి చావనప్పుడు రొప్పుకుంటూ రోజుకుంటూ ఈ తెలుగు నేర్చుకొనే తిప్పలెందుకు చెప్పమ'ని నిలదీసే పిలగాళ్లకేమని చెప్పి ఒప్పించగలం చెప్పడీ!
పుట్టుకతో వచ్చిన కులాన్నెలాగూ మార్చుకోలేంఆంధ్రదేశంలో పుట్టిన పాపానికి టెలుగూస్ అన్న నిందెలాగూ భరించక తప్పడం లేదు. మతం మాదిరి మార్చుకొనే స్వేచ్చ రాజ్యాంగంగాని  మనకు ప్రసాదించి కనక ఉండుంటే.. ఆంధ్రప్రదేశుని ఏనాడో ఆంగ్లప్రదేశుగా, తెలంగాణాని ఆంగ్లణాగా  మార్చేసుకొనుండేవాళ్లం కదా!
ఆటగాళ్ళకిచ్చే ప్రత్యేక రాయితీల మాదిరి తెలుగు మాటగాళ్లక్కూడా ఏవైనా ప్రత్యేక కోటాలు గట్రాల్లేకపోతే.. తెలుగు మాట్లాడేవాళ్ళిక కోటికొక్కడన్నా మిగలుతాడా! సందేహమే
పిల్లకాయలు దర్జాగా దొరలభాష నేర్చేసుకొని.. దొరబాబులాగానో.. దొరసానిలాగానో.. ఒబామా లెవెల్లో డాబూ దర్పం చూపించాలనీ.. బిల్గేట్సు మోడల్లో డాలర్ల గుట్టలు కూడబెట్టాలని ఏ కన్నవారికి కలలుండవు చెప్పండి! 'ఇంగ్లీషులో తప్ప మాట్లాడటం తప్ప'ని ఆంక్షలు పెడితే అదేమనా అంత పెద్ద తప్పా!
దేశంలో మొదటగా  భాషాప్రయుక్తరాష్ట్రంగా  ఏర్పాటైన ఘనత  మొన్నటిదాకా కలిసున్న మన ఉభయ తెలుగురాష్ట్రాలదే గదా! సరే స్వామీ!,,  మరి తెలుగు అకాడమీలో ఆ తెలుగు  సగం మాత్రమే ఉందేమి?' అనెవరన్నా ఉరుమురిమి అడిగితే ఉలిక్కిపడడమే తప్ప బదులు పలికే సావకాశమేమన్నా ఉందా! ఇక్కడి మన భాషాదౌర్భాగ్యంపట్ల ఎక్కడో ఉన్న ఐకాసావాళ్ళు ఆందోళన చెందుతున్నారు!   'అతితొందర్లోనే మీ 'అత్యంత తీయని చక్కర తెలుగు ముక్కలు' కరిగి పోబోతున్నాయి మహాప్రభో!' అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అయినా మనకేమైనా  చీమైనా కుట్టినట్లనిపించిందా!! దటీజ్.. తెలుగోడు!
పది పదాల తెలుగు కథను పదో తరగతి పిల్లగాడైనా తడబడకుండా.. తప్పుల్లేకుండా  చదవలేని పరిస్థితి. ప్రాచీనహోదా కోసం అహోరాత్రాలు అలా అలమటిస్తే సరిపోతుందా!ఇక్కడ అధునాతన తరం 'ఓ న మా లు' దిద్దమంటే '! మై గాడ్.. నో వే' అని కొట్టిపారేస్తున్నది!
కనుమరుగైతే అవనీయండయ్యా! అన్నింటికీ అలా కన్నీళ్ళు పెట్టేసుకొంటే ఎలా? రుబ్బురోళ్ళూ, అవుదం దీపాలూ, పాంకోళ్లూ, భోషాణం పెట్టెలూ.. ఇప్పుడున్నాయా? పాతకాలంనాడు మా తాతలు తాటాకు మట్టలు వంటికి చుట్టుకొన్నారు. కనక ఇప్పుడు అవే మొలకు చుట్టుకొని షికార్లు కొట్టమన్నట్లుంది.. గోల! అణాలూ.. కానీలూ కనుమరుగై పోలా! అలాగే అణాకానీక్కూడా కొరగాని మన తెలుగు కనుమరుగయి పోతోంది. పోనీక ఈ పొలికేకలేల బాబూ పొద్దస్తమానం!
దేశంలో హిందీ తరువాత అన్నిటికన్నా ఎక్కువ మాట్లాడే భాష మందేనంటారా! మందేసుకొంటేగాని నాలిక మడతలకింద వినబడదు ఈ పాము మెలికల తికమక భాష.
'మాతృభాష చచ్చిపోతోందో!' అని పొద్దస్తమానం ఈ శోకన్నాలేమిటో.. చిరాకు! మాతృమూర్తులకే సరిగ్గా ఆదరణ దొరకని గడ్డమీద ఇహ ఈ మాతృభాషకు మాత్రం ఘనసత్కారాలు జరుగుతాయా చెప్పండి మరీ అత్యాశ కాకపోతే!
'తెలుగు రాష్ట్రంలో ఉన్నాంగదా!'  అని ఇక్కడి పశువులేమన్నా తెలుగులో కూస్తున్నాయా! ఇరవైనాలుగ్గంటలూ 'ఇరుగూ పొరుగును చూసి బుద్ధి తెచ్చుకోమని ఇలా పోరుపెట్టడమేమనా బాగుందా! 'పక్క మహారాష్ట్రలో  పక్కామరాఠీకోసం ఎలా లాఠీలు పట్టుకొని తిరుగుతున్నారో.. చూసి నేర్చుకోండి! ఢిల్లీ చట్టాసభల్లో సైతం సొంతభాషలోనే విరుచుకుపడే తమిళుల్ని చూసి తెలివి తెచ్చుకోండి!'  అంటూ ఇరవైనాలుగ్గంటలూ ఇరుగు పొరుగుతో  పోల్చి చిన్నబుచ్చడం తగదండీ! మన టెలుగూస్ ప్రత్యేకతలు మనవి! అర్థం చేసుకొని ఆదరించమని మనవి.
''ఐ  వెవ్వర్ స్పీక్ ఇన్ టెలుగు' అని రాసిన పలకలను పసిపిల్లల మెళ్లకు గంగడోళ్లకు మల్లే   వేలాడేసే  మెకాలేల నోటనైనా తెలుగు తన్నుకొచ్చే ట్రిక్కు ఒక్కటే ఒక్కటుందంటారా! గూబమీద గట్టిగా ఒకటిస్తే సరి! ఎంత పెద్ద ఆక్స్ ఫర్డు వర్డ్సువర్తు పండితుడైనా గానీ.. ' అబ్బా! అమ్మా!' అంటూ  అచ్చుతెలుగులో హల్లులన్నీ చేర్చి ఘొల్లుమంటాడంటారా!
నో..వే! తల్లిభాష గొప్పతనం తెలుగువాడి   తలకెక్కించాలంటే మీ తలమీదున్న  అన్నివెంట్రుకలూ నేల రాలాస్లిందే మాస్టారూటెలుగూసా.. మజాకానా!
-కర్లపాలెం హనుమంతరావు

(22-01-2010 నాటి ఈనాడు- సంపాదకీయం పుట లో ప్రచురితం)

Tuesday, October 13, 2015

ఉషోదయమంటే!-కవిత


తపోభంగమైన మునిపుంగవునిలా
కల
ఎప్పుడు నిద్ర లేచిందో మసీదు
మీనార్ మీదనుంచీ ఆర్తిగా పిలుస్తోంది
బాట పొత్తిళ్ళలో  పాలప్యాకెట్ పాపాయిల సందడి
ప్రపంచాన్ని పేపర్లో చుట్టేసి మెదడు కారిడార్లలోకి
గురిచూసి విసిరే పసిబైసికిళ్ళు
రాత్రిచీకటి
రోడ్డువార విసిరేసి రహస్యాలని
సైడుతూముల్లోకి వూడ్చేసే ఝాడూకర్రలు
నైడ్డ్యూటీదిగి దాలిగుంటల్లోకి
సర్దుకుంటున్న వీధిసింహాల విరామాలు
దారిపక్క తాళపత్రాసనంలో
వచ్చేపోయే దృశ్యమాలికలను
అర్థనిమీలిత త్రాలతో అవలోకిస్తూ చెట్లు
నింగిచూరుకు దిగాలుగా వేలాడే
బెంగమొగం  ముసలి చంద్రుడు!
వెలుగు రాకను
దండోరాలేసే పులుగు రెక్కలు
సాక్షినారాయణుడి దివ్యదర్శనార్థం
అభ్యంగస్నానాలాచరించి
ముగ్గుదుస్తుల్లో ముస్తాబయే ముత్తైదువుముంగిళ్ళు
భక్తజనసందోహం సుప్రభాతసేవార్థం
డిబట్టల్లో నిలబడ్డ గుడి మెట్లు
చదివిన పాఠాలే!
అయినా
పునశ్చరణ చేసుకునే
ఉదయ వ్యాహ్యాళులు

గతించిన శూన్యసమయాన
అందాల బంధ గంధాల అరగతీతలో
ఏ  గంధర్వలోకా
న్ని పుష్పమాలికలకు
వికాసభూమికలు ర్పడ్డాయో!
మౌనంవ్రతం ముగించుకుని
తూర్పువాకిలి తలుపు తెరిచుకుని
వీధిమొగదలకు కదిలి వస్తోంది
ఉదయరాగసంధ్య
సూర్యనమస్కారాలకోసం సిద్దమవుతోంది లోకం
రాత్రి ఏకాంతంలో
తెల్లహృదయం మీ
ఏ రంగుభావాలని పొదిగి
సొమ్మసిల్లిందో కవిసమయం!
తొలికిరణం  కరచాలనంతో గానీ
రంగూ.. రుచీ.. వాసనా తేలదు
ఉషోదయం అంటే
రాత్రిబావిలోపడ్డ లోకంబంతిని
మెల్లగా బైటకు తీయటమేనా!
మరో ముప్పూ   సమావేశాల కోసం
సమాయాత్తమయ్యే
భువనభవనపు అంతరంగానికి వేసే
మొదటి వైట్-వాష్ కోటింగు కూడా కదా!

***
కర్లపాలెం హనుమంతరావు

Sunday, October 11, 2015

చురకలు- చిన్ని కవితలు

నాయకులు దర్జాగా దేశాన్ని
తెగనమ్ముతున్నారు
ఐనా గొర్రెల్లా జనం ఆ కసాయిల్నే
తెగ నమ్ముతున్నారు!


ఏరుకుని తీసుకోడానికి
తల్లి పొట్ట
రేక్కాయల బుట్టా!
రేతస్సు జనిత తేజస్సే కదా
మగాడి లాగా ఆడబిడ్డా!






                                    వెయ్యి కిలోలబరువైనా
అవలీలగ మోస్తాట్ట వస్తాదు
బడిపిల్లడి బ్యాగు మాత్రం
మోయలేక  పడి చస్తాడు



పదవి నీది- నొప్పులు నావి
-ముఖ్యమంత్రిపెదాల బాధ
అదీలేదు మరి
నా తిప్పలు చూడరాదా!
అప్పోజిషన్నేత పాదాల  రొద



 ఏసిబి.. సిబిఐ.. కాగూ
ఈడీ.. కోర్టులు
అక్రమార్కులను కొత్తగా
ఆవహించిన పంచ ‘భూతాలు’ !




లక్షల కోట్లల్లో
కుంభకోణాలు
న భూతో
నా దేశానికి
న భవిష్య్తత్!





తెలుగుతల్లి కొప్పుకు
కొత్తటీవీ
యాంకరమ్మల
సంకర కూ’తలనొప్పులు’!
-కర్లపాలెం హనుమంతరావు









Friday, October 9, 2015

గుత్తి వంకాయ కూరోయ్ బావా!- ఆపాత మధురాలు





http://www.maganti.org/lalitasangitam/audios/guttivankay.html
ఇక్కడ నొక్కండి...వేరే పేజీ తెరుచుకుంటుంది.

(మాగంటి వారి వెబ్ సైట్ చూస్తున్నప్పుడు నాకీ ఆణిముత్యం దొరికింది.బసవరాజు అప్పారావు గారి ఈ వెర్రి పిల్ల పాట  ఆ  రోజులలో చాలా ప్రసిద్ధం. బందా కనకలింగేశ్వర రావు గారి విలక్షణమయిన గళం లోనుంచి జాలువారిన ఈ పాట తెలుగు వారి అందరికి గుత్తి వంకాయ కూర ఎంత ఇష్టమో అంత ఇష్టం ఈ తరానికి కూడా ఒక సారి ఆ రుచి చూపించాలనే సదుద్దేశంతోనే ఈ పాటను ఇక్కడ పెట్టటం జరిగింది.నాకు సాంకేతికమయిన అంశాలలో అంతగా అనుభవం లేని కారణం గా పై లంకెను నొక్కగానే వేరే పేజి తెరుచుకునే విధంగా ఏర్పాటు చేశాను .పాటను విని ఆనందించిన తరువాత తిరిగి ఈ పేజీ లోకి వచ్చి మీ స్పందన తెలియచేస్తే నా కృషి ఫలించినదనుకుంటాను.మీ మిత్రులకు ఈ బ్లాగ్ సంగతి చెబితే మరింత సంతోషిస్తాను,
మాగంటి వెబ్ సైట్ వారికి సేకరించిన  సేకరించిన డాక్టర్  కారంచేడు గోపాలం గారికి కృతజ్ఞతలు.)

గుత్తి వంకాయ కూరోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!
కూర లోపలా నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా!
              కోరికతో తినవోయ్ బావా!
తియ్యని పాయసమోయ్ బావా!
తీరుగా ఒండానోయ్ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా!
                బాగని మెచ్చాలోయ్ బావా!
కమ్మని పూరీలోయ్ బావా!
కర కర వేచానోయ్ బావా!
కర కర వేగిన పూరీ లతో నా
నా కాంక్ష వేపినానోయ్ బావా!
                కనికరించి తినవోయ్ బావా!
వెన్నెల ఇదిగోనోయ్ బావా!
కన్నుల కింపౌనోయ్ బావా!
వెన్నెలలో నా కన్నె వలపనే
వెన్న కలిపినానోయ్ బావా!
                 వేగముగా రావోయ్ బావా !
పువ్వుల సెజ్జిదిగో  మల్లే
పువ్వులు బరిచిందోయ్ బావా !
పువ్వులలో నా యవ్వనమంతా
పొదివి పెట్టినానోయ్ బావా!
పదవోయ్ పవళింతాం బావా!
-బసవ రాజు అప్పారావు గారు

Thursday, October 8, 2015

కొన్ని 'చిత్రా'లు- కవితలు



1
 అమ్మ కాబూలీ!
 అప్పు వసూలుకు
 బిడ్డై తిష్టేసింది గుండె నట్టింట్లో!

2
 శిశిరం బోసిచేసిపోతేనేమి
 వసంతం వచ్చి పచ్చిసంతకం చేస్తుంది
 చెట్టంత ఆశతో.. నువ్వుండాలిగానీ!

3
 వేర్లు పాతాళంలోకి
 కొమ్మలు ఆకాశంలోకి
 పువ్వులు  హృదయంలోకి!

4
 రైలు ఊయలుకు
 ప్రయాణీకులంతా
 బుజ్జి పాపాయిలే!

5
 రాయీ వెన్నముద్దే
 విత్తు
 కత్తయితే!

6
 తెడ్డు.. తెరచాప.. లంగరు
 పడవకైనా.. బతుక్కైనా
 మూడు ముక్కల్లోనే కతంతా!

7
 దాయని
 దుఃఖదాయని
 -ప్రేమవాహిని!

8
 ఘటన క్షణికం
 స్మరణ పురాణం
 మనసు వ్యాసపీఠం

9
 కన్నీరు ఉప్పన!
 హృదయం
 సముద్రం కదా!

10
 పూలకోసం  పాపాయి- కింద
 పాపాయికోసం పూలు- పైన
 గాలివంతెన వంతే ఇంక మిగిలింది!
-కర్లపాలెం హనుమంతరావు


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...