Tuesday, February 2, 2016

గురక- మరీ చిన్నకథ- కౌముది


పద్మావతి అందం చూస్తుంటే  ప్రబంధకవులకు మాట పడిపోయుండేది. మహారాజులకైతే మతి తిరగబడుండేది. మామూలు మాచవరం నాగేశ్వర్రావు సంగతి ఇహ చెప్పాలా.. పెళ్ళిచూపులప్పుడే ఫ్లాటయిపోయాడని!
బి.కాం రెండుసార్లకు ముక్కి, అడ్డమైన దేవుళ్లకు అడ్డదిడ్డంగా మొక్కి.. సాధించిన బోడి ఏ.జీ ఆఫీసు ఎల్డీసిగాడు నాగేశ్వర్రావు. కాకి ముక్కుకు దొండపండులా దొరికిందని పెళ్ళికొచ్చి అక్షింతలు వేసినోళ్ళందరూ నోళ్ళు నొక్కుకొన్నారు. కుర్రకారైతే కుళ్ళుకొని చచ్చారు.
పద్మావతి నాయన బడిపంతులు కావడం.. మరో ముగ్గురు ఆడపిల్లలక్కూడా పెళ్లి పేరంటాలు చేయవలసిన తండ్రి కావడం.. నాగేశ్వర్రావుకి కలిసొచ్చింది. సరే.. ఇప్పటి మన కథ అది కాదు.
మొదటి రాత్రి మాటా మంచీ అయింతరువాత పుస్తకంలా పడి నిద్రపోతున్నప్పుడు నాగేశ్వర్రావు చెవిలో ఏదో నాగుపాము బుస వినిపించింది ఆగకుండా! చీమ చిటుక్కుమన్నా లేచిపోయే దౌర్భాగ్యం అతగాడిది. లేచి లైటు వేసీ వేయంగానే బుస ఆగి పోయింది! లైటు తీసిన రెండు నిమిషాలకే మళ్లీ మొదలయింది!రాత్రంతా ఇదే కథ!
మర్నాడా విచిత్రం కొత్తల్లుడు బైటకు చెప్పినా అత్తారింట్లో ఎవరూ కిక్కురుమననే లేదు. రెండో రాత్రి పద్మావతే మిస్టరీ విడదీసింది.  ‘చిన్నతనంనుంచి నాకు నిద్రలో గురక పెట్టే జబ్బు. ఎన్ని మందులు మింగినా లాభం లేకపోయింది. ఈ సంగతి  ముందే మీకు చెప్పమని మా వాళ్లతో శతపోరాను. చెప్పినట్లు లేరు' అని వెక్కి వెక్కి ఏడ్చింది.
కొత్తపెళ్లాం కొత్త బెల్లం. పద్మావతితోపాటు పద్మావతి గురకనూ మనస్ఫూర్తిగా జీవితంలోకి ఆహ్వానించేందుకే గుండెను రాయి చేసుకొన్నాడా క్షణంలోనే నాగేశ్వర్రావు.
కాలం గడిచి.. పుట్టుకొచ్చిన ఇద్దరు పిల్లలు పెరిగి.. పెద్దయి.. వేరే దేశాలకని ఎగిరి వెళ్ళిపోయినదాకా.. పద్మావతి గురక రహస్యం ఆ ఇంటి నాలుగ్గోడల మధ్య మాత్రమే మిగిలిపోయి గుట్టు. భారతీయులం కనక కుటుంబ బాంధవ్యాలు అంత బలంగా ఉంచుకొంటాంగానీ.. వేరే దేశంలోకి సీను మారంగానే  మన మనస్తత్వాలనూ అంతే వేగంగా  మార్చేసుకొంటాం.
కూతురు కాన్పుకోసమని ఆర్నెల్లకు అమెరికా వెళ్లిన పద్మావతి.. మూణ్నెల్లు తిరక్కుండానే  ఇండియా తిరిగొచ్చేసిందికొడుకు పిలిచాడని పడుతూ లేస్తూ వెళ్ళిన నాగేశ్వర్రావు దంపతులు.. మూడునెల్లు కూడా ఉండలేక మళ్లా అలాగే  తిరిగొచ్చేసారు.
కొడుకు కూతురులాగా.. అల్లుడు కోడలులాగా.. అత్తగారి గురకకు  అడ్జస్టవాలని లేదుగా!
గుట్టు చప్పుడు కాకుండా ఇండియా వచ్చి పడినా భగవంతుడి పరీక్షలు ఆగలేదు. ఉన్నట్ట్లుండి పద్మావతి గుండెనొప్పితో పెద్దాసుపత్రిలో చేరడం,, చూడ్డానికొచ్చిన బిడ్డలిద్దరి చేతుల్లో భర్తను పెట్టి కన్నుమూయడం! లఘుచిత్రం చూసేంత  సమయంకూడా పట్టలేదు కథ ముగింపుకి రావడానికి!
ఫ్లాప్ పిక్చర్ ఆడే డొక్కు థియేటరులాగా నిర్మానుష్యంగా ఉందిప్పుడు నాగేశ్వర్రావు కొంప. తమ దగ్గరికి పిలిపించుకోడానికి సమయం పట్టేట్లుందని మధ్యంతర ఏర్పాట్లంటూ ఓ కొత్త పద్ధతి కనిపెట్టి ఓల్డేజి హోముకు తండ్రి బాధ్యతలు అప్పగించిపోయారు బిడ్డలిద్దరు.
అంతా బాగానే ఉంది. వేళకు తిండి.. వ్యాయామం.. తనలాంటి ఇరుగుపొరుగుతో మాటా మంతీ! చీకటి బడటంతోనే  దిగులు మొదలవుతున్నది నాగేశ్వర్రావుకి. కంటినిండా నిద్ర పోయింది పద్మావతి పక్కలో పక్కనున్నరోజుల్లోనే.
ఎన్ని మందులు మింగించినా.. ఎన్ని కొత్త  వైద్యాలు ప్రయోగించినా నాగేశ్వర్రావుమీద ఫలితం చూపించలేక పోయేసరికి చేతులెత్తేసారు ఓల్డేజి నిర్వాహకులు.
సొంత వైద్యం ఆలోచన అప్పుడొచ్చింది నాగేశ్వర్రావుకి. భార్య ఫొటో పక్కనుంచుకొని.. ఆమె గురక రికార్డు ప్లేయర్లో ఆన్ చేసుకొంటే కంటిరెప్పలు కిందికి వాలుతున్నాయిప్పుడు!
పెళ్లయిన కొత్తల్లో పెళ్లాన్ని టపట్టించేందుకు దొంగచాటుగా రికార్డు చేసిన గురక కేసెట్ ది!

***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- ఫిబ్రవరి 2016 సంచిక 'మరీ చి.క' కాలమ్ ప్రచురితం)

Monday, February 1, 2016

సంక్రాంతి సంబరాల్లో.. శంకరం పెళ్లి- వాకిలి ‘లాఫింగ్ గ్యాస్’ కాలమ్ సరదా కథ

సంకురుమయ్య ఈ సంక్రంతికి ఏమెక్కి వచ్చాడంకుల్?' అని అడిగాడు శంకరం.
'విమానాలెక్కయితే రావట్లేదురా! ప్రధానితో పోటీ. తట్టుకోలేక పోయుంటాడు పాపం.. సంక్రాంతి పురుషుడు!' అంటూ పంచ్ ఒహటి విసిరేసారు.. మా వారు  పంచాంగం చూసుకొంటూ కూడా!
శంకరం అంటే మా ఆడపడుచుగారి  పెద్దబ్బాయి. పదహారణాల తెలుగు బాలుడు.   'ఒహ అణా తక్కువైనా ఫరవాలేదు.. వయినమయిన తెలుగు పిల్లే కావాల'న్న పీకులాట  పిల్లోడికి.. వాడి తల్లికి!
'పెద్ద పండుగయ్యే లోపల పిల్లనెతుక్కురమ్మ'ని పిల్లాడిని ఇండియామీదకు తోలింది ఆ అమెరికా తెలుగుతల్లి.
పిల్లోడి వరాన్వేషణలో ఓ మజిలీ మా ఇల్లు ఈ సారి పండక్కి!
'సంక్రాంతి అంటే నాకు మహా ఇష్టం ఆంటీ! భోగిమంటలు, భోగిపళ్ళు, రంగవల్లులు, రంగు రంగుల గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, గుళ్ళో చెక్కర పొంగలి, గాలిపటాలు, బొమ్మల కొలువులు, కోడిపందేలు.. ఓహో.. చిన్నప్పుడు అంకుల్ వాళ్ల ఊళ్లో మా మజాగా ఉండేందంటగా.. మామ్ చెబుతుంటుంది పద్దస్తమానం!.. అ లైక్ దట్ లైఫ్.. ఐ లవ్ దట్ తెలుగుదనమ్' అంటూ శంకరం ట్రాన్సులోకి వెళ్ళిపోయి ఊగిపోతుంటే 'పాపం పిల్లోడు!’ అనిపించింది ఆ  అమాయకత్వం చూసి!
తర్పణాల దగ్గర్నుంచీ అన్నీ చక్కంగా చెప్పుకొస్తున్నాడు! పండగంటే పిండివంటలు.. టీవీలో కొత్త సినిమాలు' అని తప్ప ఇంకేమీ తెలీని మా సజ్జుకన్నా వెయ్యి రెట్లు నయమేగానీ.. వీడి అమ్మ వీడిని మరీ ఇంతగా చెడగొట్టాలా! పిటీ! వీడి పిల్ల ఉబలాటం ఇహ ఈ జన్మకీడేరేనా!' అనిపించింది నాకు.
మూడు కర్రముగ్గులేద్దామంటేనే జానెడు జాగా దొరకదీ టిక్కీ అపార్టుమెంట్లలో! ఇహ గొబ్బెమ్మలంటే గోమయ మెక్కడినుండి దిగుమతవాలి!
'సెల్లార్లోని మనవంతు  నేలమీద స్టిక్కరుముగ్గు అతికించి ప్లాస్టిక్ గొబ్బెమ్మలన్నా పెడదామే పాపం బావ ముచ్చట తీర్చడానికి!' అని తగులుకున్నాడు మా సుపుత్రుడు సుందరం. వాడివన్నీ మన ఆంధ్రా సి.యం హైటెక్ బుద్ధులే!
ఆ మాట శంకరం చెవినబడింది. ఇహ ఊరుకుంటాడా!' మన తెలుగుముగ్గుల్లో బేసిగ్గా గ్రాఫిక్ ఎలిమెంట్సు బోలెడున్నాయత్తా!, ఈ మధ్యనే చదివానేదో పత్రికలో.. గొబ్బెమ్మల్లోని గోబర్ ఎలిమెంటు యాంటీ-వైరస్  పనిచేస్తుందంట  ఎన్విరాన్మెంటుమీద! సో.. నో స్టిక్కర్ ముగ్గులు.. నో ప్లాస్టిక్ గొబ్బెమ్మలు! ఒన్లీ రియల్ ఆవుపేడతో గొబ్బెమ్మలు.. బియ్యప్పిండితో ముగ్గులు!’
'సిటీలో దూధ్ పేడా దొరుకుతుందిగానీ.. ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది బావా.. నువ్ మరీనూ!’ అంటూ మా సుందరం  మొత్తుకోలు.
పంతానికని  బావమరిదిని వెంటేసుకొని కార్లో ఎర్లీఅవర్ సిటీటూరుకి బైలుదేరాడు అమెరికా తెలుగుబాలుడు శంకరం!
గోశాలయితే డిస్కరయిందికానీ.. 'పొంగల్ సీజన్ కదా! ఔటాఫ్ స్టాక్! ఆన్లైన్ ఆర్డర్సే   గండంగా ఉంది1  కౌంటర్ సేల్సుకూడానా.. పదండిహ!' అంటూ  బైటికి గెంటేశార్ట ఈ బాలకులిద్దర్నీ గోశాల పాలకులు! బికమొగాలేసుకు చక్కా వెనక్కొచ్చేశారు శూరులు!
'పోనీ! మనకు తెలిసిన మినిష్టరున్నాడు. ఆ సోర్సేమన్నా ట్రై చేయమంటావేంట్రా! ఒహ వంద డాలర్లు మనవి కాదనుకున్నాసరే..  తట్టెడు పేడతెచ్చి గుమ్మంలో పోసి పోతారు గ్రేటరుఉద్యోగులుఅంటూ మేనల్లుడి సాయానికి వెళ్లబోయారు మా శ్రీవారు. ఎంతయినా ముద్దుల చెల్లాయి ఒక్కగానొక్క కొడుక్కదా!
'బ్రైబింగా?.. లాబీయింగా? నో వే మావయ్యా!' అని తలడ్డంగా ఆడించేసాడు ఈ అమెరికా అల్లుడు.
మధ్యాహ్నం కాలేజీనుంచి కంగారుగా తిరిగొచ్చేసి 'కంగ్రాట్సు రా శంకరం బావా! సోమాజిగూడ సెంటర్లో బోలెడన్ని ఆవులున్నాయ్రోడ్డుకడ్డంగా పడుకొని పోస్టర్లు మేస్తున్నాయ్! ఆ ట్రాఫిక్ ఈదుకెళ్ళి ట్రై చేస్తే నీ కోరిక తప్పక తీరవచ్చురా! పోరా!' అని మా కిలాడి పిల్ల కబురందించంగానే చెరో తట్టా పట్టుకొని మారథాన్ మొదలు పెట్టేసారు.. పట్టువదలని భట్టి, విక్రమార్కుల్లా బావా, బావమరుదులిద్దరు!
పోస్టర్లుతినే పశువుకి మూడెప్పుడొస్తుందో భగవంతుడికే తెలియాలి! మూడు గంటలపాటు చలి చెమటలతో వాటి వెనకాలెనకాలే పిల్లజంట  వెయిటింగు! తీరా నిరీక్షణ ఫలించి తట్ట పట్టుకొనే టయానికి బస్తీదాదా ఎవడో ప్రత్యక్షమై 'తీయరా! రౌడీ సుంకం' అంటూ డిమాండుకు దిగేసాట్టవట్టి తట్టల్తో చిందులేసుకొంటూ తిరిగొచ్చి  'పోలీస్టేషనుకెళ్ళి  ఫిర్యాదిద్దా'మని పేచీక్కూర్చున్నాడు పిచ్చిశకరం, రెండువేలపదహారు!
'సుబ్బరంగా గొబ్బెమ్మలుకూడా పెట్టుకోలేని పండక్కి ఇక్కడెందుకు..  దండగ! గ్రాండ్ మాఁ గారూళ్లో గ్రాండుగా జరుపుకొంటార్రా! అంకుల్ ఫ్యామ్లీ మొత్తాన్నీ వెంటేసుకెళ్ళు!' అంటూ హ్యూస్టన్నుంచి వాడిమామ్ హుకుం!
అప్పటికప్పుడే అందర్నీ కార్లెక్కించేశాడు తిక్కశంకరం!'
'నిజమేరా! మా చీరాల్లో అయితే ఇంచక్కా  చక్కెర పొంగలి, దద్దోజనం దండిగా దొరుకుతుందిరా! మా రెండో చెల్లెలు రేవతి ఏటా పిల్లలచేత బొమ్మల కొలువుకూడా పెట్టిస్తుంటుది..' అంటూ దారిపోడుగూతా మా వారి దంపుడు పాటలు!
మాటి మాటికీ శంకరం ముక్కుపుటాలు ఎగరేస్తుంటే మామగారి మాటకి ఎంకరేజ్మెంటేమన్నా ఇస్తున్నాడేమో అనుకొన్నాను. పొరపాటు. ఆయనగారు ముక్కుపొడుం పీల్చేటప్పుడూ  ముక్కుపుటాలెగరేయడం మానలేదు ఈ అర్భకుడు!
'ఎక్కడో ఏదో దుర్వాసన! మీకెవరికీ ఏమీ అనిపించడం లేదా!' అని ఆ పిల్లాడు ఒహటే గుండెబాదుళ్ళు!
అమెరికన్ గాలి అలవాటయిన నాసిక్కి  ఇక్కడిగాలిట్లాగే కంపు కొట్టడం కామన్! పొల్యూషనుమీద లెక్చర్లు దంచుడేగాని.. ప్రాక్టికల్ కాలుష్యంఘాటు  బిడ్డకింకా అలవడ్డట్లు లేదు!
'పండగలు సంస్కృతికి సంకేతాలు. మొనాటనీనుంచి మనల్ని కాపాడే టానిక్కులు.' అంటూ పండగలమీదతగాడు థీరీ దంచుతుంటే.. పోనీలే.. ఆవిధంగానైనా ఆ బాబు  ద్యాస సంప్రదాయాలమీదకు మళ్ళడం మంచిదేననిపించింది. మౌనంగా ఆ రంపపుకోతకు తలొగ్గి ఉండిపోయాం ఫ్యామిలీ అందరం.. ఒక్క మా వారు మినహా!
రంపం రెండో కొస ఆయనగారు అందిపుచ్చుకొన్నారిహ 'అవున్రా అల్లుడూ! మా బాగా చెప్పావు కానీ పండగ పరమార్థమంతా ఇప్పుడు పూర్తిగా మారిపొయిందోయ్ శంకరం! గొబ్బెమ్మలంటే పేడముద్దలని.. గంగిరెద్దులంటే బక్క ఎద్దులని  మా పిల్లదానికి చీదర.. చులకన! హరిదాసుకీ ముష్టోడికీ తేడా తెలీని  తెలివితక్కువతనం మా పిల్లోడికి!..'
పిల్లల్ని కాపాడడం కన్నతల్లిగా నా కర్తవ్యం అనిపించింది. 'పండగలకి.. ప్రస్తుతానికి రెలవెన్సేంటో చెప్పరాదా.. తెలిస్తే! విని పిల్లలు నేర్చుకోమన్నారా  చెప్పాల్సొన రీతిలో చెబితే! అస్తమానం ఆ కంపుపొడి దోపుకొని ముక్కులు నులుముకోడమేగాని.. నోరు తెరిచి ఏనాడైనా ఓ మంచిముక్క చెవినేశారా!' ఆవటా అని నేనూ నోరు చేసుకొన్నానిహ వింటూ కూర్చునే ఓపిక సంపూర్ణంగా నశించి!
'రెలవెన్సా.. బోలెడంతుందోయ్ భామామణీ! ఉదాహరణకి ఇప్పుడీ సంక్రాంతినే తీసుకోండి! రకరకాల సోషల్ ఫోరమ్సునుంచి..  సైన్సు ఎగ్జిబిషన్లదాకా.. వేదిక ఏదైనా సరె .. మన  నేతలు వేసే చిందులు పండక్కి వచ్చే పగటివేషాలని మరిపిస్తున్నాయా లేవా! కోడిపుంజుల్లాగా సినిమాహీరోల అభిమానులు కొట్టుకొంటున్నారు. నీళ్లకోసం కొట్లాట.. రాబోయే ఎన్నికల్లో కాబోయే సి.యం పదవికోసం కాట్లాట! పొట్టేళ్ల ఢీఢిక్కులకన్నా ఎందులో తక్కువ మన యూనివర్శిటీల కుమ్ములాటలు! పిట్టలదొరల్లా మనల్ని మాటల్తో బోల్తాకొట్టించే నేతాగణం.. పథకాల పేరుతో అశ్సరభ శరభయ్యలను మించి కనికట్టు విద్యలను ప్రదర్శించే ప్రభుత్వం.. ఇవన్నీఈ పండుగ   రెలెవెన్సులేనే పిచ్చిదానా! కైట్ ఫ్లయింగని కామర్సులో ఓ తమాషా పదముంది. సరుకులేమీ లేకుండానే సొమ్ములటూ ఇటూ చేతులు మారుతుంటాయి. అదో రకం ఫోర్ట్వంటీ తతంగం. అధికారంలొ ఉన్న పెద్దలు అస్తమానం ఎగరేసేదీరకం పతంగుల్నే! ఇది రెలెవెన్సు కాదా లోలాక్షీ ! భిక్షాపాత్ర నెత్తిమీదెట్టుకొని చిడతలు కొట్టుకుంటూ 'రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా!' అంటూ గడప గడపా తడివే హరిదాసుల ప్రేరణే కదా  మన ముఖ్య మంత్రులిద్దరి పెటుబళ్లకోసం దేశదేశాలు
చక్కర్లు! ఫండ్సన్నీ కృష్ణార్పణమైపోతున్నాయని అప్పోజిషను వాళ్ళట్లా  ఆపసోపాలు పడిపోతున్నది..  గంగిరెద్దుల్లా హై కమాండు పాటలకు వంతలేస్తున్నదంతా సంక్రాంతి రెలెవెన్సు పద్దులోకే జమేసె తంతులేనే తల్లీ! అయ్యగారికో.. అమ్మగారికో దణ్నం పెట్టకపోతే పొద్దుగడవని దుస్థితి అన్ని పార్టీల్లోనూ ఉన్నది. ఇదీ పండగ రెలెవెన్సేనే పంకజాక్షీ! బొమ్మలకొలువుల్లో బారులు తీరి నిలబడ్డ బొమ్మల్లకు మల్లే..  ఎవరెవరో ఎన్నికల వేదికలమీద వరసల్లో నిలబడి చేతులూపేస్తున్నారు. ఇది పండగ రెలెవెన్సు కాదంటావా కాదంబరీ!’
మా వారి గోలలో పడి కారు ఊర్లోకి ఎప్పుడొచ్చిందో తెలీలేదుఏ ఇంట చూసినా ఏడుపులూ.. పెడబొబ్బలూ! పండగ పూటకూడా ఇంత విచారాలెందుకో!
'హాయ్! హ్యాపీ పొంగల్! హ్యాపీ బైశాఖీ.. హ్యాపీ గుడిపడ్వా!' అంటూ ఎదురొచ్చింది  మా తోడికోడలు చిన్నకూతురు మంగతాయారు. సిక్స్టీన్ డాలర్స్ సెక్స్తీడాల్లా వంకర్లు పోయే ఆ కుంకనుచూసి నాకే చచ్చే సిగ్గేసింది. ఇహ ఈ శంకరం కొంకర్లు వేరే చెప్పాలా?
'ఇంట్లో ఎవరూ లేరా.. ఏంటీ! ఊళ్లో కర్ఫ్యూనా? ఆ ఏడుపులేమిటి? పెడబొబ్బలెవరిమీద?' అని బిక్కు బిక్కుమంటూ లోపలికి చుట్టూ చూసాడు శంకరం.
'టీవీలో సీరియల్ నడుస్తోంది బ్రూ ఇన్ లా! 'కాపురం నాది.. కన్నీళ్లు నీవి!' కోటి పదకొండో ఎపిసోడు! ఆ ఏడుపులయితేగాని జనసంచారం  మళ్లీ మొదలవదు మా ఊళ్లో! ఈ బోరు భరించలేకే బాబూ.. బాబరుతో కలిసి టౌన్లో షికారుకెళ్లేది. వస్తా! క్యాబ్ వాడు ఒహటే రింగులిస్తున్నాడు' అంటూ కంగారుగా తుర్రుమందా  గడుసుపిండం!  
తోడికోడలొక్కతే నట్టింట్లో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకొంటోందిసీరియల్ సీరియస్గా చూసేస్తూ!
'అన్నయ్యగారేరీ?' అనడిగితే  'కోళ్లపందేల కెళ్లా'రంది.
'పిల్లాడేడీ?' అనడిగితే 'ఇంటర్నెట్ సెంటర్లో ఉన్నాడంది.  'అత్తయ్యగారన్నా కనపడాలి కదా! గుడికెళ్లారా?' అనడిగితే
'గుడా! గుడెసా! ఈ అమెరికా మనవడు అదేదో ఐ-పాడో.. పాడో కొనిపంపించాడుగా ఆ మధ్య! పెరట్లో కూర్చుని ఎవర్తోనో చాటింగు చేస్తోంటోంది పొద్దస్తమానంఅంది రేవతి.
ఒక్కక్కరే మెల్లిగా గూటికి చేరడం మొదలు పెట్టారు. సాయంచీకట్లు  చిక్కపడ్డాయి.
తెల్లారి బారెడు పొద్దెక్కినా ఇంట్లో పండగ కళేం కనిపించలేదు.  పొయ్యిలో పిల్లే కళ్లు తెరవలేదుమా సిటీ అపార్టుమెంటుల  కాపురమే బెటరు!
'బారెడు పొద్దెక్కింది. బైట పండగ ముగ్గేమీ వెయ్యలేదేంటి ఆంటీ! గొబ్బెమ్మలుకూడా కనిపించలేదే!' శంకరం ఒహటే గొణుకుడు!
'రాత్రి సినిమా చూస్తూ ఆలస్యంగా పడుకుండి పోయానయ్యా! మద్యాహ్నం పనిమనిషి వస్తుందిగా! ఆ ఆవుపేడేదో తెప్పించి దానిచేతే  తోచిన ముగ్గేదో గీయిస్తాలే!’ అంది బద్ధకంగా మళ్ళీ టీవీముందు చతికిలబడుతూ మా ఆడపడుచు.
'! పండక్కి అమెరికాలోనే ఉండుండాల్సింది. అక్కడైతే అట్లతద్దెకూడా అట్టహాసంగా చేసుకొంటాం అందరం కలసి. మా అమ్మ మాటలు నమ్మి ఇంత దూరమొచ్చాను చూడు.. నా చెప్పుజోడుతో నా దవడ నేనే దడదడా కొట్టుకోవాలి!' అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ పంచులోకెళ్ళి కూర్చున్నాడు శంకరం.
'గొబ్బెమ్మలేగా  సాబ్ మీకు కావాల్సింది.. ఇంద!' అంటూ కారు డిక్కీనుంచి ఇంత పేడకడి.. ప్లాస్టిక్ పొట్లాంలో చుట్టి ఉన్నది.. బైటికి తీసి గుమ్మంముందు పడేసాడు కారు డ్రైవరు.. సలీం!
ఆశ్చర్యంతో మాకెవరికీ నోట మాట రాలేదు.
శంకరం అయితే ఆనందోద్వేగభావాలతో కన్నీళ్ల పర్యంతమయిపోయాడు!  సలీంని గట్టిగా గుండెలకి  హత్తుకుంటూ  ఊపేసాడు 'ఇంత పేడ.. ఇంత కుప్ప.. ఈ పండగ సీజన్లో నీకెక్కడ దొరికింది.. మియా!'
'దార్లో ఇంజనుకి నీళ్ళకోసం దిగినప్పుడు దొరికింది సాబ్! కొత్త సినిమాలేవో రెండు రిలీజయినట్లున్నాయ్  ఆ పలెటూళ్ళో! గోడలనిండా  సినిమా పోస్టర్లు!  పోస్టర్లనిండా పేడకడులు!   మీరు కలవరిస్తున్నారుకదా అని కాస్త తీసి దాచుంచా!' అన్నాడు. మాకు మా పండగలెంత ముఖ్యమో.. మీకీ మీ పండగలంతే ముఖ్యం కదా!’ అన్నాడు సలీం వినయంగా!
శంకరం సెల్లో వాళ్ల మామ్ తో చెబుతున్నాడు  జరిగిందంతా  ఆ సాయంత్రం ఓ ఉద్వేగంతో '.. యెస్.. మమ్మీ! స్యూర్! అడుగుతా! లకీగా సలీంసాబ్ కి పెళ్లీడు కూతురుండాలే గానీ.. నా వరాన్వేషణకు.. ఇహ 'శుభం' కార్డు పడ్డట్లే..!'
***
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- లాఫింగ్ గ్యాస్- ఫిబ్రవరి 2016 సంచికలో ప్రచురితం)
'

'

Saturday, January 30, 2016

అంతర్జాతీయ వెనక్కి చూసే దినోత్సవం- జనవరి 31-

 

 

 

వెనక్కు తిరిగే రోజు

కౌముది - ప్రచురితం ) 

 

మార్నింగ్ గుడ్!

ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులూ  ముందుకే కదా జనం నడక ! కాబట్టే  వెనక్కు నడిచే దినంగా ఒక రోజును ప్రత్యేకంగా జరుపుకోడం ! జనవరి 31, అమెరికాలోవెనక్కి నడిచే రోజు!

 

మనకీ వెనక నడక కొత్త కాదు . అప్పులోడు ఎదురు పడితే అడుగు ముందుకు పడదు.

 

'వెనక చూసిన కార్యమేమోయి/మంచి గతమున కొంచెమేనోయి/మందగించక ముందుఅడుగేయి/వెనుకపడితే వెనకే నోయిఅంటూ  గురజాడ మరి అలా గత్తరెందుకు పెట్టినట్లో

 

మాజీ సి.యం చంద్రబాబుగామ  మరీ విడ్డూరంపద్దస్తమానం పెద్దానికీ  'అలాముందుకు పోదాంఅంటూ ఒహటే తొందర ఆయనది ! ముందుచూపుమీదే అందరిచూపైతే మరి  మన  వెనక తీసే గోతుల  సంగతోముందుకు రావడానికి ' వెనకబడినతరగతుల ' దారి ఉత్తమం

 

వైతాళికులు ముందు నడకకే తాళమేసినా  శ్రీమాన్ గిరీశంగారు మాత్రం 'అటునుంచినరుక్కు రమ్మనిదొడ్డిదారి చూపించారుకొంత నయం!

 

మాటవరసకే గానిమన నడక ఇప్పుడు వెనక్కికాక ముందుకుందావెనకటి తాతలుతాగిన నేతులే  కదా  మనమిప్పుడు  మూతుల మీద చూపించటం! ‘అచ్చేదిన్’ వచ్చేదింకా ఆట్టే  దూరంలో లేదంటూనే.. వెనకటి రామరాజ్యమే మళ్లీ కావాలని మనపి.యం మోదీజీ కలలు కనేది

 

 వెనకచూపు మీద  చిన్నచూపు తగదు ! ముందుకు సాగే ప్రగతి పథానికి వెనకటిఅనుభవం గట్టి పునాది .

 

'బ్యాక్ టు ఫ్యూచర్పెద్ద బ్లాక్ బస్టర్ !  'బ్యాక్ టు స్కూల్ ' అమెరిన్  స్కూళ్ళు తిరిగితెరిచే  సందర్భం

 

ఎన్నికల వేళ   ప్రజా ప్రతినిధులు వాడవాడలలో  చెడ తిరిగేదీ ..  ‘బ్యాక్ టునియోజకవర్గం’ పథకమే!  ‘పీఛే ముడ్!.. ఆగే బడ్!’ లలో ఏది ఎప్పటికి  శ్రేష్టమో అదేఅప్పటికి ఆచరించడం  ఉత్తమ రాజకీయవేత్త లక్షణంముందు చూపుతో నాలుగురాళ్లువెనకేసుకొనే  నేతలు  మనకిప్పుడు  జాస్తిరాజ్యంగబద్ధంగా  నడుచుకోని వాళ్లని  వెనక్కిపిలిపించే వెసులుబాటుంటే మంచిది.  అభిమాన నేతలకు పదవులు దక్కాలని  భక్తిమితిమీరిన కార్యకర్తలు అడపా దడపా తిరుపతి కొండమ వెనక నుంచి ఎక్కడమూ  కద్దు

 

నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’  అంగారకుడి  మీద వంద  మీటర్ల వెనక్కి నడిచి   అంతరిక్షపరిశోధకులకు  ఎంతానందం కలిగించిందో!

 

అరబ్బీ వెనక నుంచి చదివే లిపి . ‘చైనాజపాను వెనక నడకను  కళగా అభ్యసిస్తాయి

 

కలుపు మందుల పిచికారీకి వెనక్కు నడవడం కంపల్సరీ

 

ఢక్కా మొక్కీలు తిన్నవాళ్లే ఎక్కాలను వెనక నుంచి చెప్పగలిగేది . 

రాకెట్లను  అంతరిక్షంలోకి వదిలేముందు అంకెలు వెనకనుంచి లెక్కిస్తారు! వెనకనుంచి ముందుకు రాయడంలో  లియొనార్డో డావిన్సీ సుప్రసిద్ధుడు!

 

శతాబ్దాల వెనకటి  రామకృష్ణకవి  విలోమ కావ్యం ముందు నుంచి వెనక్కి  చదివితే రామాయణం! వెనక నుంచి చదువుకు వస్తే భారతం! 

 

‘చిరం విరంచి: న చిరం విరంచి:/సాకారతా సత్య సతారకా సా / సాకారతా సత్య సతారకా సా /చిరం విరంచి: న చిరం విరంచి:’  .. వెనక నుంచి చదివినా  .. ముందు నుంచి చదివినట్లే ! కాకతీయులు విలోమ పద్ధతుల్లో  వివాహాలు చేసుకునేవారు. 

 

తాజా సినిమా  చాలావరకు వెనకటి సినిమా   'రీసైకిళ్లే! టైమ్ జోన్ ను  బట్టి కాలం కూడా  నడవక తప్పదు కదా! 

 

వెనక్కి నడవడం వల్ల బోలెడన్ని లాభాలు! 

కవిసమ్మేళనాలప్పుడు  వెనక బెంచీల్లో ఉంటే   నిశ్శబ్దంగా జారుకోవడం సులువు. పీల్చిన గాలిని  వెనక్కి వదిలే   విలోమ యోగాసనం వంట్లోని మలినాలను బయటకు తరిమేయడం !

 

మనీ పర్శు వెనక జేబులో ఉంటే  సేఫ్టీ జాస్తి.  నీలవేణుల వెనకున్న వాల్జడలు చూసే  కవులు  చాలామంది మతులు పోగొట్టుకున్నది! 

 

ఈ 'వెనక పండుగ' రోజు కదా  చొక్కా తిరగేసి తోడుక్కోవద్దు! తొక్కతిని అరటి గుజ్జు విసిరేయద్దు ! కళ్ల జోడు  నెత్తికి పెట్టుకొని  నడవాలనుకోవద్దు !  ఛాటింగ్  'బై'తో  మొదలెట్టి 'హాయ్'తో ముగించద్దు! టీవీ  వెనక నుంచి చూడాలనుకోవద్దు ! లారీల వెనక నిలబడ వద్దు! ముఖ్యంగా ఆడపిల్లల వెనక, గాడిదల వెనక వాకింగులొద్దు! సూపర మేన్ టైప్ 'ప్యాంటు పైన అండర్ వేర్' ఐడియా సూపరే కావచ్చు గానీ  ‘వెనక్కి తిరిగే దినోత్సవం ' అని తెలియక ఊర కుక్కలు వెనకబడగలవు! ‘బేక్ వర్డ్ డే’ కదా అని  ఆక్ వర్డ్ చర్యలకు పూనుకోవద్దు .. భద్రం! 

 

'గో బ్యాక్!’ అన్న నినాదం అన్ని సందర్భాలకు అతకదన్నదే ఈ ' వెనక్కి నడిచే దినం ' ప్రధాన ఉద్దేశం.

 

ఇంత చెత్త రాసిన గాడిదను   మాత్రం  ' దడిగాడువానసిరా !  ' అనకండి మహా ప్రభో! మీకో దండం ! 

 

***

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...