Monday, July 30, 2018

జానపద కతలలోని అసలు పరమార్థం


వేదకాలంలోనే  మానవ సమాజాన చాతుర్వర్ణ విభజన(నాలుగు కులాలుగా విడిపోవడం) జరిగినట్లు రుగ్వేదం పురుష సూక్తం బట్టి అర్థమవుతోంది.
బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌ బాహూ రాజన్యః కృతః
ఊరూ త న్య యద్వైశ్యః పద్బ్యాం శూద్రో అజాయత
రుగ్వేదం(10-90-12)
బ్రాహ్మణులు భగవంతుడి ముఖం నుంచి జన్మిస్తే భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు జీవం పోసుకొన్నారని.. కడజాతివాళ్ళు మాత్రం దేవుడి కాళ్ల నుంచి పుట్టుకొచ్చారని .. కళ్లతో చూసినట్లే అల్లిన కట్టుకథల ప్రచారం చాలా కట్టుదిట్టంగానే జరిగింది. ఆ తరహా ప్రచారాలకు పూనుకొన్నదీ సర్వోన్నత వర్గమే. దానికి కింది ఇద్దరు ఉన్నతవర్గాల మద్దతు! ఇందులో ఏదో మతలబుందని అప్పట్లో ఆలోచన రాకపోయింది కడజాతులకు. కాలంతో పాటు బుధ్ధి వికసిస్తున్నదిప్పుడు. కాబట్టే బోలెడన్ని అనుమానాలు పెద్దల బుధ్దుల మీద! తప్పేముంది?!
వర్ణవ్యవస్థ నిర్మాణం ఎప్పుడు సామాజికంగా స్థిరపడిందో.. అప్పటి నుంచే ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు.. ఉన్నవారు, లేనివారు- అంటూ  గుంపుల మధ్య గోడలు లేచాయి. వివాదాలూ మొదలయ్యాయి.  వేదాల్లోనే ఇందుకు రుజువులున్నాయి, అంతా కలసి మెలిసి అన్నదమ్ముల్లా సహృద్భావంతో జీవిస్తుంటే 'సంవనీ రుషి' నోటి నుంచి 'సమన్వయంతో జీవించండి!' లాంటి హితోక్తులు వెలువడాల్సిన అగత్యమేముంది? 
'కలసి ఉండండి! కలసి తినండి!  మనసులు కలుపుకొని  మాట్లాడుకోండి! పురాతన దేవతలకు మల్లే  కలసే ఉపాసనలు చేసుకోండి!’అంటూ బ్రహ్మాండ పురాణంలో సూక్తులు వినిపించే అవసరం కలగదు కదా!
వేదపన్నాలు నాగరికంగా, బుధ్దిపరంగా అభివృధ్ధి చెందిన మేధోవర్గాలకు మాత్రమే బుర్రకెక్కే వాఙ్మయం. ఆ దేవనాగరీక భాషాప్రవచనాలు, శిష్టోచ్చారణలు  సబ్బండజాతుల  మతులకు ఓ పట్టాన ఎక్కేవి కావు. అతి తక్కువ శ్రమతో  అపార,మైన ఉమ్మడి సామాజిక సంపదలు సొంతానికి  పోగేసుకు అనుభవించే సౌకర్యం వర్ణవ్యవస్థ ద్వారా ఉన్నత వర్గాలవారికి సంక్రమించింది. చెమటోడ్చి సమాజానికి ఇంత కూడూ గుడ్డా నీడా కల్పించే  నిజమైన  కింది శ్రామిక జీవుల నుంచి ప్రశ్నలు ఎదురైతే ఉత్పాతాలు తప్పవన్న స్పృహ ఉన్నత వర్గాలవారికి ఉంది. సమాజ రథాన్ని తమ శక్తికి మించి ఈడుస్తోన్న కింది వృత్తులవారిని ఎప్పుడూ చెప్పుచేతల్లో పెట్టుకొనేందుకు అందుకే ఒక ఉపాయం అవసరమయింది. ఆ అవసరంలో నుంచి పుట్టుకొచ్చినదే జానపద వాఙ్మయం. జానపదులకు బోధపడే సాహిత్య రూపంలో కట్టుదిట్టంగా కథలు, కబుర్లూ దిట్టంగా పుట్టించి ముమ్మరంగా  ప్రచారంలో పెట్టబట్టే  నిమ్నజాతులు తాము గీచిన గీటుకు కట్టుబడి ఉన్నాయి.
శిష్ట సమాజానికి వేదాలు ఎంత ప్రామాణికమో. పామరులకు ఈ జానపద వాఙ్మయం  అంతే ప్రామాణికం,   శిష్టులకు  పురాణాలకు మల్లే  కులపురాణాలు జానపదులకు శిరోధార్యాలు.
కులాల పుట్టుక, కుల మూలవిరాట్టుల జన్మవృత్తాంతాలు, కులవృత్తుల ఆవిర్భావం, వాటి స్వరూప స్వభావాలు అత్యంత సూక్ష్మంగా, శక్తివంతంగా,  నిజమైనవే అన్నంత పకడ్బందీగా అనేక గ్రామీణ కళా రూపాలలో దిగువ జాతుల వారి మెదడుల్లోకి చొప్పించబడ్డాయి. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ తరహా మందిసాహిత్యంలో కడజాతులవారు పాటించి తీరవలసిన  నియమ నిబంధనలు ఎన్నో ఉంటాయి. సమాజ సౌధ నిర్వహణ భారం మొత్తం తమ  తమ వృత్తిధర్మాల  నిబద్ధత పునాదుల మీదే నిలబడి ఉన్నదన్న భ్రమ    కడజాతులవారి నరనరాలలో కాలక్రమాన జీర్ణించుకుపోయింది. నాటుమనిషి ఎదురు ప్రశ్నలు అడిగినా, ఎదురుగా నిలబడి ఏ మాత్రం పొగరుగా తల ఎగరేసినా సమాజం మొత్తానికి  చేటు తప్పదన్న  భయం పామర లోకంలో యుగాల బట్టి చాలా బలంగా నాటుకుపోయింది.  పెను ఉత్పాతాలు తప్పించవలసిన విధి జానపద సాహిత్యం మాధ్యమంగా ఆ విధంగా   బడుగువర్గాల భుజస్కంధాల మీద మాత్రమే మోపి  తమ తమ భద్రజీవితాలకు ఎప్పటికీ ముప్పు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొన్నాయి చాతుర్వర్ణ వ్యవస్థలోని పై రెండు మూడు అంచెలు! అర్థం పర్థం లేనివి జానపదులు చెప్పుకొనే కథలు అనుకోవడం తప్పు. లోతుగా ఆలోచిస్తే అసలు పరమార్థం బైటపడుతుంది,
-కర్లపాలెం హనుమంతరావు
29 -07 -2018

Saturday, June 23, 2018

నన్నయగారి ననీన భాషావాదం



మహాభారతం కవిత్రయంలో నన్నయ మొదటివాడు. ఆయనకు 'వాగనుశాసనుడు' అని బిరుదు. 'వాక్' అంటే మాట. మాటను శాసించేవాడు వాగనుశాసనుడు. అంతలా నన్నయ భాషను ఏం శాసించాడు? ‘వాగనుశాసనుడు’ అన్న బిరుదుకు  ఆయన అసలు అర్హుడేనా? ఔను, కాదు.. అని ఏ నిర్ణయానికైనా వచ్చే ముందు ఈ చిన్ని వివరణ ఒకసారి చూస్తే మంచిది.
నన్నయకాలం క్రీ.శ 11వ శతాబ్దం. ఆ కాలం నాటికి తెలుగు మరీ అంత ముదరలేదు. పలుకుబడులన్నీ దేశీఛందస్సులోవే. అంటే జనం మాట్లాడుకునే భాషా యాసా కు సంబంధించినవన్న  మాట. ఆ యాసభాషల్లోనే  రాజులూ శాసనాలు వేయించేవాళ్లు.

నన్నయను పోషించిన చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుడికి ఈ దేశీయ పలుకుబడుల మీద  బాగా మోజు.  'మును మార్గకవిత లోకంబున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం/ గు నిలిపి రంధ్ర విషయమున జన చాళుక్యరాజు మొదలగు పల్వుర్' అని నన్నెచోడుడు తన కుమారసంభవం అవతారికలో ఆ  చాళుక్య ప్రభువుకు ధృవపత్రం కూడా ఇచ్చివున్నాడు.
రాజుగారికి జనంభాష పైన ఎంత ప్రేమున్నా అప్పటి వరకు తెలుగులో ఒక్క స్వతంత్రమైన, సవ్యమైన కావ్యం రాలేదన్న బెంగా ఉండేది. అప్పటి దాకా ఉన్నవన్నీ సంస్కృతానువాదాలే. కనీసం తన హయాములోనైనా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టించాలన్న ఉద్దేశంతో నన్నయని వ్యాస విరచిత సంసృత మహాభారతం తెలుగు చేయమని పురమాయించాడు. నన్నయనే ఎంచుకోవడానికి కారణం.. ఆ కవిగారికి సంస్కృతాంధ్రాల మీద ఉన్న అమోఘమైన పట్టు.
కానీ అప్పటికి ప్రచారంలో ఉన్న తెలుగు  పదజాలంతో కావ్యం రాయడం కుదరదు. అందునా రాసే కావ్యానికి పంచమవేదం మాతృక! అసలే సంస్కృత భాష అత్యంత గహ్యమైనది. ఆ భాషకు సరిపడా తెలుగు పదజాలం జనం నుంచి సేకరించడం నిజంగా పెద్ద సవాలే! అందునా ఇప్పటి మాదిరి సాంకేతిక సాధనాలేమన్నా అప్పట్లో అందుబాటులో ఉన్నాయా? అదనంగా అప్పటికి ఇంకా తెలుగులో వాక్యనిర్మాణమే పటిష్టంగా లేని స్థితి. తనకోసం గాను తాను ఒక వాక్యనిర్మాణ క్రమం.. అదీ తానే అంతకు ముందు నిబద్ధీకరించిన వ్యాకరణ  సూత్రాలకు లోబడి ఉండడం అవసరం.  ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటో సమర్థవంతంగా రచన ఆరంబించాడు నన్నయ!
వాక్యానికే కాదు అసలు అప్పటి తెలుగు పదానికి కూడా ఒక ప్రామాణిక  రూపం లేదు. ఒకే పదాన్ని ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు, ఎవరి ఇష్టం వచ్చిన రూపంలో వాళ్లు రాసేసుకునేవాళ్ళు. ఆ తరహా భాషే రాజులు వేయించిన శాసనాల మీద  కనిపించేది. ఇలాంటి పదాలు కొన్ని ఆచార్య గంటి సోమయాజిగారి 'ఆంధ్రభాషా చరిత్రము'లో, ఆచార్య ఖండవల్లి  నిరంజనంగారి  'ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము'లో కనిపిస్తాయి.
'దేవుడు' అనే పదానికి దేవడు అని ఒకళ్ళు, దేవండు అని ఒకళ్లు, దేవణ్డు అని ఒకళ్లు రాసేవాళ్లు. 'తూర్పు' అనే పదాన్ని 'తూఱ్పు' అని, 'తూఱ్గు' అని, 'తూఱ్వు' అనే రూపాలుగా రాయడం ఉంది. రెడ్ది కి ‘రట్టగుడి’, ఎనిమిది కి ‘ఎణం బొది’.. ఇట్లా ఒక స్థిరమైన రూపం అంటూ లేకుండా సాగే  పదాలకు  ఒక కుదురైన ఆకారం కల్పించడం నిజంగా పెద్ద సవాలే కదా! హ్రస్వాలుండే చోట దీర్ఘాలు, సాధురేఫాలు రాయాల్సినప్పుడు శకటరేఫాలు వాడేవాళ్లు. బిందువుకు బదులు వర్ణమాలలోని వర్గం చివరి అక్షరాలు ఙ్, ణ్ లాంటివి యధేఛ్చగా వాడేస్తూ గందరగోళం చేసిన తెలుగు మాటలకు ఒక స్థిరమైన రూపం కల్పించడం  మాటలా? ఆ సమస్యా అధిగమించాడు నన్నయ.
అప్పటికి తెలుగులో కొద్ది దేశీయ వృత్తాలు, అదనంగా చంపకమాల. ఉత్పలమాల మాత్రమే వాడుకలో ఉండేవి. అవసరానికి అనుగుణంగా వృత్తాల సంఖ్యను పెంచుకుంటూ అత్యంత గాఢమైన, గూఢమైన వ్యాసభారతం ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలో కొంత భాగం అపూర్వంగా పూర్తిచేసి మరీ రాజరాజనరేంద్రుడి చేత ‘శహ్ భాష్’ అనిపించుకొన్నాడు నన్నయ భట్టారకుడు. 'వాగనుశాసనుడు' అని ప్రశంసలు అందుకున్నాడు.
ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా అప్పటికి తెలుగులో ఇంకా చిక్కబడని కవితా ప్రక్రియకు అప్పటికే సంపూర్ణ వికాసం పొందిన కన్నడ కవితా స్వరూపాన్ని అద్దడం అద్భుతమైన విన్యాసం. అందుకే తోటి కవులు నోటితో సైతం ‘ఔను.. నన్నయ నిజంగా వాగనుశాసనుడే’ అని మెప్పించుకొన్నాడు ఆ మహాభరత ఆరంభ రచయిత.
ఆనాటికి ఉన్న పూర్వ భాషాప్రమాణాల ప్రకారం నన్నయ మహాభారతం మొదటి రెండున్నర పర్వాలలో  పోయిన భాషాపోకడలు అత్యంత నవీనం.. అపూర్వం. ఆ రకంగా చూసినా నన్నయ భట్టారకుడు వట్టి వాగనుశాసనుడే కాదు.. గట్టి నవీనభాషావాది కూడా!
-కర్లపాలెం హనుమంతరావు
24 -06 -2018



Thursday, June 21, 2018

సినిమా మాటలంటే 'మాటలు కాదు'!- సరదా వ్యాసం




'సావధానం బలదేవా.. సావధానం! ఇదిగో నా పాచికల మీద ఒట్టుపెట్టుకుని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. ఆలకించండి! మోసం చేసి కపట ద్యూతం చేసి పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్లు వనవాసానికి వెళ్లారు. అ దుర్వార్త విని నువ్వు మమ్ములను దండించడానికి వచ్చావు. నువ్వొక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానికి, అతిముఖస్తుతికి లోబడతావని నాకు తెలుసు. మా జాతివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసాననంతరం మళ్లీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముని సహాయం లేకుండా చేయడానికి. కానీ.. యతోధర్మ స్తతోజయః అన్నట్లు మాకు తగిన శాస్తే జరిగింది'
సినిమా ఇంకో పావుగంటలో అయిపోతుందనంగా శకుని వేషంలో సియస్ఆర్ పలికిన ఈ నిమిషం డైలాగు మాయాబజారు సినిమా మొత్తానికీ పెద్ద డైలాగ్. తెలుగులో సియస్ఆర్ సింగిల్ టేక్ లో ఓకే చేయిస్తే.. తమిళంలో నంబియార్ నాలుగైదు టేకులు తిని బావురుమన్నాడని.. గుమ్మడి వెంకటేశ్వర్రావుగారు తన 'తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు'లో రాసుకున్నారు. ఒక నిమిషం డైలాగులో సినిమా కథ సారాన్నంతా సరళమైన భాషలో పామరుడికి కూడా అర్థమయే పద్ధతిలో ఇలా రాయడానికి ఎంతో పాండిత్యంతో పాటు సినిమా ప్రక్రియ మీద అంతులేని అవగాహన ఉండితీరాలి. అవి పింగళివారికి పుష్కలంగా ఉన్నాయి. కనుకనే మాయాబజార్ సంభాషణా శైలికి అత్యుత్తమ  మైన తార్కాణంగా ఈనాటికి ఫిలిం స్కూళ్ళ నుండి సినిమా సభల వేదికల మీద వరకు అన్నింటా ఉధహరించుకుంటున్నాం మనం.
సినిమా సంభాషణ అంటే క్లుప్తంగా, సరళంగా, సహజంగా, పాత్రోచితంగా, స్పష్టంగా భావం పలికేలా, జీవం ఉట్టిపడేలా, జనంభాషలో అందంగా, కథాప్రయోజనానికి దోహదపదే విధంగా ఉండాలని సినీపండితుల నిశ్చితాభిప్రాయం.
పాత్రలకు బదులు రచయితలు మాట్లాడడం పాతపద్ధతి. అంటే అన్ని పాత్రలూ ఒకే మూసలో పలికే మొనోటోనీ విధానమన్న మాట.
ఫిలిం ప్రక్రియ ఖరీదైన వ్యవహారం. కనుక వృధా సంభాషణలకు ప్రోత్సాహముండదు. టీవీ ధారావాహికాలకి ఈ సాగతీత ఉంటుంది! అక్కడ 'డై'లాగ్ అంటే చచ్చిందాకా సాగదీయడమనే అర్థం సరిపోతుందేమో కానీ.. సినిమాలో ప్రతీ సెకనూ ఖరీదైన వ్యవహారమే. కాబట్టి అవసరమైనంత మేరకే పాత్ర పెదాలు కదిలించాలి. అదీ సినీ సంభాషణలకు సంబంధించినంత వరకు ప్రథమ ప్రధాన సూత్రం.
పాత సినిమాలలో పాత్రలు పూర్తిగా పుస్తకాల భాష మాట్లాడేవి. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక సందేశమో, పోలికో తెచ్చి చప్పట్లు కొట్టించుకొనేవి. రంగస్థలం వాసనలు పూర్తిగా తొలగిపోని తొలినాటి దశ అది. ఇప్పుడు సినిమాలకు సంభాషణలు రాసేవాళ్లకు నాటకాలతో ప్రత్యక్షంగా అనుబంధం లేదు. నేరుగా జీవితాలనుంచి సినిమాలలోకి దిగబడిన సరుకే ఎక్కువ.  సినీ సంభాషణలు పక్కింట్లో  నుంచి వినిపించే తరహాలో ఉండటానికి అదే కారణం. ఇది మంచి మార్పే! కానీ.. కత్తెర వేసేవాళ్ల చెవుల్లో డబ్బు చెట్లు మొలవడం వల్ల  పదిమంది ముందు వినడానికి ఇబ్బంది కలిగించే పదాలు కూడా విచ్చలవిడిగా వెండితెర మీద వినిస్తున్నాయి! కథానాయకులు సైతం ప్రతినాయకులను మించి బూతు పురాణాలు విప్పడం పసిపిల్లల మీదా, మాస్ మనస్తత్వం ఉన్నవాళ్ల మీదా విపరీతమైన చెడుప్రభావం చూపిస్తోంది.
పాత సినిమాలలో పాత్రలు సందర్భోచితంగా చక్కని తెలుగు  నుడికారంతో  మాట్లాడేవి. సంభాషణలు రాసేవాళ్లు సంస్కృతాంధ్రాలలో ఉద్దండులైనా, సినిమా ప్రక్రియ ప్రధానంగా పామరజనరంజకం అనే  భావన ఉంది కనుక సరళమైన, సజీవమైన భాషను ఎన్నుకొనేవాళ్లు. పౌరాణిక చిత్రమైనా మాయబజారులోని పాత్రలు నేలబారు ప్రేక్షకులకు అర్థమయే పదాలనే వాడాయి. ‘మోడర్నిజం’ మిషతో ఇప్పుడు వచ్చిపోయే మెజారిటీ చిత్రాలు కనీసం టైటిళ్లలో అయినా తెలుగుదనం ఉండకూడదని ఒట్టు పెట్టుకున్నట్లున్నాయి! వీలైనన్ని సన్నివేశాల్లో బట్లరింగ్లీష్ దంచేస్తున్నారు. రాసేవాడికీ, రాయించుకొనేవాడికీ కనీసం ఇంటర్మీడియేట్ స్థాయి ఇంగితమైనా లేని కారణంగా సినిమాల ద్వారా వీళ్లు వినిపిస్తున్న బూతుపదాలే జనసామాన్యంలో ఊతపదాలుగా స్థిరపడుతున్నాయి!
సినిమా ప్రధానంగా దృశ్యమాధ్యమంగా వినోదపరిచే కళ. దృశ్యపరంగా చెప్పలేని సందర్భాలప్పుడే మాటల ద్వారా భావప్రకటన జరగాలన్నది  మూలసూత్రం. 'మాతృదేవోభవ' చిత్రంలోని ఒక సన్నివేశం ఇప్పటికీ కళ్లముందు కనిపించి కంటతడి పెట్టిస్తుంటుంది. భర్త తాగుబోతు. భార్యకు కేన్సర్. పిల్లలు అనాధలైపోతారని ఆ తల్లి దిగులు. ఒక్కొక్కరినే దత్తత కిచ్చేస్తుంటుంది. కవల పిల్లల్లో ఒకడు దివ్యాంగుడు. ముందు వాడినే దత్తు తీసుకుందామని వచ్చిన డబ్బున్న దంపతుల ఆలోచన. కానీ వాడికి తోబుట్టువులను విడిచి వెళ్ళాలని ఉండదు. అయినా వెళ్లకుండా ఉండలేని పరిస్థితి.  చివరికి  దివ్యాంగుడికి బదులు మంచి బిడ్డను దత్తు తీసుకొని దంపతులు వెళ్ళిపోతున్నప్పుడు 'అవిటి కాలుతో పుట్టడమే నా అదృష్టం' అంటూ ఆ దివ్యాంగుడు సంబరపడుతుంటే ఆ సంభాషణ రాసిన రచయిత సత్యమూర్తికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించ బుధ్దేస్తుంది.
కామెడీ ఎన్టర్టైన్మెంట్ వంకతో ఇప్పుడొచ్చే సినిమాల్లో మూడొంతుల భాగాన్ని కథతో ఏమాత్రం సంబంధం లేని కుళ్ళు స్కిట్లతో నింపేస్తున్నారు. కాబట్టే జాతీయస్థాయిలో తెలుగు సినిమా రూపాయి విలువలా రోజు రోజుకూ దిగజారుతోంది.
మాయాబజారులో మాయాశశిరేఖ పెళ్లిసందడి సన్నివేశం  గుర్తుందా?  వధువు రూపంలో ఉన్న ఘటోత్కచుడు వరుడి పాదం మహారాక్షసంగా తొక్కేస్తాడు. లక్ష్మణకుమారుడు గగ్గోలు పెట్టేస్తుంటే శశిరేఖ నంగనాచిలా 'ఆర్యపుత్రులు నా కాలు తొక్కచ్చునేం?' అంటూ ఒక్క వాక్యంతో వగలాడితనమంతా ప్రదర్శిస్తుంది.   ఆ ఘట్టంలో రచయిత వాడిన ఆ చిన్న వాక్యంలోనే సావిత్రి ఎన్నో రకాల హావభావాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. చలనచిత్రం ప్రధానంగా పాత్రల హావభావాల ద్వారా నడిచే దృశ్యమాలికేగా!
సన్నివేశం పండేందుకు చాంతాడంత  సంభాషణలు దండగ. డైలాగ్ ఎంత చిన్నదైతే ప్రేక్షకుడి మెదడు అంత పదునుగా పనిచేస్తుంది. నాటి మిస్సమ్మ నుంచి నేటి 'అతడు' వరకు విజయవంతమైన చిత్రాలన్నింటిలో పదునైన స్వల్ప సంభాషణలే  ప్రధానపాత్ర పోషించాయి. సినిమా సంభాషణలు రాసే రచయితలు సూక్ష్మంగా గ్రహించాల్సింది  ఏ సన్నివేశానికి  ఏ మోతాదులో పాత్రల నోట సందర్భోచితమైన డైలాగులు సాధ్యమైనంత సంక్షిప్తంగా పలికించాలన్నది.
మాయాబజారు చిత్రం ఈనాటికీ మూవీ రచయితలకు మంచి గైడ్. సమర్థత  ఉంటే తల్పాలకు బదులు గిల్పాలు, కంబళ్లకు బదులు గింబళ్ళు కూడా సృష్టించేయచ్చు. ఆ చిత్రంలోనే పింగళివారు అన్నట్లు 'ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది?'
దుషట చతుషటయం, అసమదీయులు, తసమదీయులు వంటి సందర్భోచితమైన పదాలు ఎప్పుడు ప్రయోగించాలో వర్ధమాన రచయితలు ముందు అధ్యయనం చేయాలి.  'బోర్' అనే ఆంగ్లపదానికి 'సుత్తి' ని తిరుగులేని ప్రత్యామ్నాయంగా మార్చేసిన జంధ్యాల సామర్థ్యం ఒక్క రోజుల్లో అలవడే రసవిద్య కాదు. పట్టుదలగా పదాల మీద పట్టు సాధించాలి. ఒక తరంలో ముళ్లపూడి ప్రదర్శించిన విలక్షణ పూలశైలి, అనంతరం జంధ్యాల ప్రవేశపెట్టిన గిలిగింతల స్టైల్, సమాంతరంగా పరుచూరి సోదరులు  కదను తొక్కించిన జవనాశ్వపు వరవడి, నవరసాలను సైతం ఒకే లైనులో ప్రకటించే త్రివిక్రమ్ మాటల మంత్రం.. అబ్బో.. అలా.. చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి వాలం సైతం చిన్నదనిపించే జాబితా మన ఒకనాటి తెలుగు సినీ సంభాషణా రచయితలది. 'సినిమాకి మాటలు రాయడమంటే మాటలు కాదు'  అన్న మాట ముందు ప్రవర్థనమాన సినీరచయితలు మనసులో పెట్టుకుంటే చాలు.. శ్రధ్ద దానంతటే పుట్టుకొచ్చేస్తుంది.
పామర జనానికి ఈనాటికీ సినిమాలే పరమ ప్రామాణికం. శారదమ్మ తన మీద ప్రసరించిన అక్షర కటాక్షాన్ని ప్రజాహితానికి మాత్రమే వినియోగించడం ప్రతీ సినీరచయిత సామాజిక బాధ్యత. సినిమాకు వినోదం ప్రధానమే.. కానీ మనోవికాసాన్నీ అది తోడుతెచ్చుకోవాలి.   
-కర్లపాలెం హనుమంతరావు
20 -06 -2018
(ఆంధ్రభూమి దినపత్రిక -09, జూలై, 2009, వెన్నెల పుటలో ప్రచురితం)



Tuesday, June 19, 2018

ఆకాశరామన్న ఆంధ్రభూమి వార పత్రిక ప్రచురితం

ఆంధ్రభూమి వారపత్రిక ఫిబ్రవరి, 19, 2009 లో ప్రచురితం అయిన నా కథ
ఆకాశరామన్నః
చదివి స్పందించమని మనవి
మీ
కర్లపాలెం హనుమంతరావు
20 -06 -2018
ఇదీ లంకెః
ఆకాశరామన్న కథ - ఆంధ్రభూమి వారపత్రిక 19 -02 - 2009


ఆలస్యం .. అమృతం.. విషం -కథ

ఆలస్యం.. అమృతం.. విషం.. కథ గురించి కొద్దిగాః
ల్యాప్ టాప్ లో పాత దస్త్రాలు తిరగేస్తుంటే బైట పడిన కథ ఇదిః
సుమారు 7 ఏళ్ల కిందట రాసినట్లుంది ఈ కథ కింది తారీఖును బట్టి చూస్తే! ఏ పత్రికకూ పంపించినట్లు లేదు. ఆ విధంగా పంపిస్తే కింద తారీఖుతో సహా వివరాలు రాస్తుంటాను,, అది నా అలవాటు.
ఎందుకు  పంపించలేదు? అని సందేహం వచ్చే వాళ్లకు చెప్పేందుకు ఇప్పుడు నా దగ్గర సమాధానం ఉంది. కానీ ఒకటి రెండు రోజులు తాళి చెబుతాను. ముందు బ్లాగులో పెట్టిన ఈ కథ మీద పాఠకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఉంది.
కథ చదివి మీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పమని మనవి!
మీ
కర్లపాలెం హనుమంతరావు
19 -06 -2018

Monday, June 18, 2018

పనికిమాలినవాడు- ఆంధ్రప్రభలోని ఒకనాటి నా కథ



అనుకోకుండా ఆన్ లైన్లో దొరికిందీ నా కథ. పేరు 'పనికిరావివాడు'- ఆంధ్రప్రభ వారపత్రిక 03-07-1985 సంచికలో ప్రచురితం. అప్పట్లో రోజుకో కథ రాస్తుడేవాడిని.. ఎడా.. పెడా! కనపడిన పత్రికకు పంపించేవాడిని. తిరుగు స్టాంపులు గట్రాలు పెట్టడాలు ఉండేవి కావు. అచ్చేసే వాళ్లు వేసే వాళ్లు. పత్రిక కాంప్లమెంటరీ ఇంటికి వస్తేనో.. దయ తలచి ఎవరైనా పారితోషికం పంపిస్తేనో తప్ప కథ అచ్చయిన విషయం తెలిసేది కాదు. ఆట్టే పట్టించుకొనేవాడిని కాను. అదో చాదస్తం అప్పట్లో! 32 ఏళ్ల కిందట కదా! ఎక్కువ కథలు ఆంధ్రప్రభలోనె వచ్చినట్లు గుర్తు. అయితే అప్పట్లో ప్రాంప్టుగా పారితోషికం పంపే  మంచి పత్రికల్లో ఆంధ్రప్రభ ముందుండేది. అది ఆంధ్రప్రభ ఒక వెలుగు వెలిగిన రోజులు.  ఆంధ్రప్రభకు ఆంధ్రపత్రికకు మధ్య మంచి పోటీ ఉండేది. అందులో కథలు రాసే వాళ్లకు ఇందులో,, ఇందులో కథలు రాసే వాళ్లకి అందులో సాధారణంగా అవకాశం ఇచ్చేవాళ్లు కాదు. నా కథలు అధిక భాగం ఆంధ్రప్రభలోనో.. ఆంధ్రజ్యోతిలోనో వస్తుండేవి. ఆంధ్రజ్యోతికి వనితాజ్యోతి అని మరో మహిళా పత్రిక కూడా ఉంటుండేది. దానిలోనూ మా శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి పేరుతో చాలా కథలే ప్రచురితం అయేవి. ఏవీ కాపీలు తీసి పెట్టుకొనే అలవాటు లేనందు వల్ల ఏవేవి ఎక్కడ ఎందులో పడేవో.. ఏవి చెత్త బుట్టలో పడేవో.. అప్పుడే తెలీనప్పుడు ఇహ ఇప్పుడు ఏం తెలుస్తుంది? 'కొండయ్యగారి గుండు జాడీ' పేరుతో విజయవాడ ప్రయివేటు బస్సుల ఆగం మీద అప్పట్లో రాసిన హాస్యకథకు మంచి స్పందన వచ్చినట్లు గుర్తు. అలాగే హాలివుడ్ యాసలో  మాట్లాడే  ఇంగ్లీ షు సినిమాలకు  క్రమం తప్పకుండా వెళుతుండే వాళ్లం. బొమ్మల్ని బట్టి కథ ఫాలో అవడమే కాని.. సంభాషణలు అర్థమయేవి కావు... ఇంగ్లీషు చదవడం రాయడం వచ్చేదే కాని.. అమెరికన్ ఎక్సెంట్ ఫాలో అయేటంత పట్టు అప్పటికి ఇంకా ఏర్పడలేదు.  సినిమా ఎప్పుడు ఐ పోయిందో అర్థమవక ఒక్కో సారి ఇంటర్వెల్ బెల్లుకే బైటికి రావడమ్.. మరో సారి సినిమా ఐ పోయినా ఇంకా ఉందని కుర్చీలోనుంచి లేవకుండా కూర్చోడం. మేమే కాదు.. మాలాగాఎందరో ప్రేక్షకులు అప్పట్లో అలా! ఆ తరహా సన్నివేశాల మీద సిట్యుయేషనల్ కామెడీ దట్టించి రాసిన 'సినిమా.. సినిమా' అనే మరో కథకూ మంచి స్పందనే వచ్చింది. ఇలాగా ప్రత్యేక సంచికలకు కథలు పంపమని అడిగి రాయించుకున్న రోజులూ ఉన్నాయి. విజయ బాపినీడు విజయ అనే మాస పత్రిక కొత్త పంథాలో

 ఆకర్షణీయంగా నడుపుతుండేవారు మద్రాసు నుంచి. వాళ్ళు అడిగి మరీ ప్రచురించేవారు నా కథలు.. హాస్య వ్యాసాలు. చాలా వచ్చాయి వాటిలో. స్వాతి అప్పటికి మాస పత్రిక మాత్రమే. మా పక్క బజారులో చిన్న ఇంట్లో ఉండేది. రాసిన కథలు స్వయంగా వెళ్ళి చేత్తో ఇచ్చి వస్తుండే వాళ్లం. కొమ్మూరి వేణుగోపాలరావు గారి వీధిలో ఉండేవాళ్లం మేం. ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ రెండతస్తుల మేడను ఆనుకొన్న వాటాల్లోనే మా చిన్న కాపురం. వాళ్ల ఇంట్లోని టీవీని కిటికీ గుండా వింతగా చూస్తుండేవాళ్లం. అప్పటికి ఇంకా టి వి పెద్దవాళ్ల లక్జరీగానే ఉండేది. మా సంబంధాలన్నీ ఎక్కువగా ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రంతోనే. మూడు నెలలకు ఓ సారి కచ్చితంగా ఓ అరగంట హాస్య నాటిక నాది ప్రసారం అవుతుండేది. ప్రమోషన్ వచ్చి నాగపూర్ వెళ్లినదాకా ఇలా రచనా కార్యక్రమాలతో చాలా బిజీ బిజీగ్గా సరదాగా సాగింది మధ్య తరగతి జీవితం అప్పట్లో రాసినట్లున్నాను ఈ కథ! ఇవాళ ఉదయం ఏదో ఉబుసుపోకకు సర్ఫ్ చేస్తుంటే అప్పటి ఈ నా పాత కథ ఎవరి బ్లాగులోనో పి.డి.ఎఫ్ రూపంలో కనిపించింది. ఆ కాపీ డౌన్ లోడ్ చేసుకొని ఇలా షేర్ చేస్తున్నానన్న మాట. ఇదేమీ అంత గొప్ప కథ కాదు. ఒక చదువుకున్న చాదస్తుడు చేతి కొచ్చిన పాత నోటును ఎలా మార్చుకోవాలో తెలీక తలకిందులు అవుతుంటే..  చదువు సంధ్యలు లేని బడుద్ధాయ్ ఒకడు తనకు అబ్బిన లోకజ్ఞానంతో ఆ నోటును ఎంత చులాగ్గా చలామణి చేస్తాడో.. దాన్నుంచి లాభం ఎలా పొందుతాడో చెప్పే చిన్న కథ. అప్పట్లో ఇలాంటి కథలే ఎక్కువగా కమర్షియల్ పత్రికలు ప్రచురిస్తుండేవి. వాటికే పాఠకుల ఆదరణ కూడా! ఇప్పుడు చదువుతుంటే.. నాకే నవ్వొచ్చింది నేనేనా.. ఈ 'చిల్లర' కథ రాసిందీ అని! ఓపిక ఉంటే మిత్రులు కూడా ఒక సారి చదవవచ్చు. ఈ కథ మిషతో ఏదో పాత సంగతులు కొన్ని మళ్లీ నెమరు వేసుకోవడానికి కుదిరింది.
-కర్లపాలెం హనుమంతరావు
19 -06 -2018

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...